గురువారం, జూన్ 30, 2011

180

ఒక్క క్షణం.. కేవలం ఓకే ఒక్క క్షణం.. ఒక్క మాట.. ఒకే ఒక్క మాట.. ఒక్క క్షణంలో విన్న ఒక చిన్న మాట ఒక జీవితాన్నే మార్చేయగలదు. విషాదంలో కూరుకు పోయిన ఓ మనిషిని ఎంతో ఆనందంగా జీవించేలా, జీవించే ప్రతి క్షణాన్నీ ఆస్వాదించేలా చేయగలదు. డాక్టర్ అజయ్ కుమార్ జీవితమే అందుకు ఉదాహరణ. లోకం తెలియని ఓ పసివాడిని గురించి అతని తాతగారు పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలో గంగానది ఒడ్డున ఉన్న స్నాన ఘాట్లో చెప్పిన ఓ మాట, అజయ్ పేరునే కాదు, అతని జీవన గమనాన్నీ పూర్తిగా మార్చేసింది.

"ఈ సినిమాని ఒక పదేళ్ళ క్రితం నాకు ఆఫర్ చేస్తే నేను చేసి ఉండేవాడిని కాదు," తన కొత్త సినిమా, తెలుగు తమిళ ద్విభాషా చిత్రం '180' ప్రమోషన్లో భాగంగా హీరో సిద్ధార్ద్ ఓ ఇంటర్యూలో ఈ మాటలు చెప్పినప్పుడు "ఇప్పుడు చేతిలో సినిమాలు లేవు కాబట్టి చేసి ఉంటాడు" అని నవ్వుకున్నాను. కానీ, సినిమా ప్రోమోలు నాకు చాలా నచ్చాయి. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, నేపధ్య సంగీతం. టాక్ తో నిమిత్తం లేకుండా సినిమా చూడాలని అనుకున్నాను. దానికి తోడు థియేటర్ దగ్గర కనిపిస్తున్న 'హౌస్ ఫుల్' బోర్డు నా ఆసక్తిని మరింత పెంచింది. ఈ సినిమా నన్ను ఏమాత్రమూ నిరాశ పరచలేదు.

కాశీలో గంగా నదిఒడ్డున ప్రారంభ సన్నివేశం. కాలుతున్న శవాలు, గంగ ఒడ్డున పిండ ప్రదానాలు.. ఓ గంభీర వాతావరణం. మృత్యువు నేపధ్యంగా వచ్చే సాహిత్యం అన్నా, సినిమాలన్నా నాకున్న ప్రత్యేకమైన ఆసక్తి కారణంగా కావొచ్చు, సినిమాలో లీనమైపోయాను. తాతగారి ఆధ్వర్యంలో తన తండ్రికి పిండ ప్రదానం చేస్తున్న ఓ ఐదేళ్ళ పిల్లాడితో పరిచయం అయ్యాక, అప్పటివరకూ గంబీరంగా ఉన్న హీరో సిద్ధార్ద్ ముఖం మీద చిరునవ్వు మొలిచింది. ఆ కుర్రాడు తన పేరు 'మనో' అని చెప్పగానే, "నేనుకూడా మనో కావొచ్చా?" అని అతని నుంచి అనుమతి తీసుకుని హైదరాబాద్ బయలుదేరతాడు.

హైదరాబాద్లో రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి మూర్తి దంపతుల ఇంట్లో ఓ వాటాని, మూర్తి గారి బైకునీ ఆరు నెలల పాటు అద్దెకి తీసుకుంటాడు మనో. మిసెస్ మూర్తి (గీత) సంగీతం పాఠాలు చెబుతూ ఉంటుంది. పిల్లలకి 'రాధే రాధే' కీర్తన నేర్పిస్తూ ఉండగా, మనో ఆగమనం. అతను చేసే పనులన్నీ వైవిధ్యంగానే ఉంటాయి. కూరగాయలమ్ముకునే ముసలమ్మకి తన బైక్ మీద లిఫ్ట్ ఇవ్వడం, పార్క్ లో శనగలు అమ్ముకునే కుర్రాడిని ఆటలకి పంపి, వాడి బదులు తను శనగలు అమ్మడం, పేపర్లు పంచే కుర్రాళ్ళతో కలిసి ఆడిపాడడం.. ఇలా.. ఈ క్రమంలోనే ఫోటో జర్నలిస్ట్ విద్య ('అలా మొదలైంది' ఫేం నిత్యామీనన్) కెమెరాలోనూ, కళ్ళలోనూ పడతాడు. అతని ఫోటోలు తను పనిచేసే 'భారత మిత్ర' పత్రికలో ప్రచురిస్తుంది విద్య. ('రంగం' హీరో గుర్తొచ్చాడు నాకు).

విద్య తనంత తానుగా మనో ని పరిచయం చేసుకుని స్నేహం చేస్తుంది. చూస్తుండగానే అందరికీ చేరువ అయిపోతాడు మనో. ఉన్నట్టుండి ఆలోచనల్లోకి వెళ్లిపోవడం మినహా ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్త్తూ ఉండే మనో ని విద్య ప్రేమిస్తుంది. ప్రకటిస్తుంది కూడా. అతని నుంచి స్పందన ఉండదు. ఇంతలో ఆరునెలలు పూర్తవ్వడంతో ఇల్లు ఖాళీ చేసి బయలుదేరతాడు. అనూహ్యంగా విద్యని తీసుకుని అమెరికా వెళ్ళాల్సి వస్తుంది మనోకి. అది కూడా గతంలో తను పని చేసిన ఆస్పత్రికి. పాత మిత్రుడు కనిపించడంతో అప్పటివరకూ అప్పుడప్పుడూ మాత్రమే గుర్తొచ్చిన గతం, భయ పెట్టిన మృత్యువు ఇక అనుక్షణం వెంటాడడం మొదలు పెడతాయి. విద్య ప్రేమ-స్నేహితుడి నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో మనోగా మారిన అజయ్ కుమార్ ఎటువైపు మొగ్గాడన్నది ముగింపు.

ఇది అనుభూతి ప్రధానమైన సినిమా. ప్రధమార్ధంలో హీరో చాలా ఎక్కువ సరదాగా ఉండడాన్ని బట్టే ఏదో బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని ఊహించాను. ఇక, నాకు ప్రోమోల్లో నచ్చిన ఫోటోగ్రఫీ (కేటీ బాల సుబ్రమణియం), సంగీతం నన్ను ఏమాత్రం నిరాశ పరచలేదు. ఫొటోగ్రఫీలో చాలా సన్నివేశాలు గ్రీటింగ్ కార్డులని తలపించాయి. లొకేషన్లు చాలా చక్కగా కుదిరాయి. అజయ్-రేణూ (ప్రియా ఆనంద్) ల మధ్య రొమాన్స్ ని చాలా చక్కగా చిత్రీకరించారు. శరత్ సంగీతం వినగానే, ఇతను ఇంతకు ముందే తెలుసు అనిపించింది. 'కలవరమాయే మదిలో' కి సంగీతం అందించిన శరత్ వాసుదేవన్ అని తర్వాత తెలిసింది.

క్లాసికల్ టచ్ తో సాగిన సంగీతం. పాటలన్నీ ఆకట్టుకున్నా, బాగా నచ్చింది శరత్ పాడిన 'మూన్నాళ్ళే నీకీ లోకంలో..' చెవితో పాటు కంటికీ ఇంపుగా అనిపించిన పాటలు 'నిన్న లేని..' ...'నీ మాటలో..' దర్శకుడు జయేంద్ర కి ఇది తొలి సినిమా. మొదటి సగంతో పోల్చినప్పుడు రెండో సగాన్ని కొంచం సాగదీసినట్టుగా అనిపించింది. చిత్రీకరణలో వైవిధ్యం చూపడానికి ప్రయత్నించడం అభినందించాల్సిన విషయం. క్లైమాక్స్ కి ముందు సన్నివేశంలో మణిరత్నం 'గీతాంజలి' ని గుర్తు చేశాడు. నటనపరంగా, సిద్ధార్ద్ కి దొరికింది మంచి పాత్ర, గత సినిమాలతో పోల్చినప్పుడు బాగా చేశాడు కూడా. నాయిక లిద్దరిలోనూ విద్యగా చేసిన నిత్యమీనన్ ని కొంచం ఎక్కువ మార్కులు పడతాయి. ప్రియా ఆనంద్ ఎందుకోగానీ సిద్ధార్ద్ కన్నా పెద్దదానిలాగా అనిపించింది, చాలాచోట్ల.

డబ్బింగ్ సినిమా కావడం కొంచం ఇబ్బంది పెట్టిన విషయం. చెన్నైని హైదరాబాద్ అనుకోవాల్సి రావడం లాంటివి కొంచం సరిపెట్టుకోవాలి. సత్యం సినిమా, అఘల్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. పత్రికా సంపాదకుడిగా ఎమ్మెస్ నారాయణ, రేణు తండ్రిగా తనికెళ్ళ భరణిలవి పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు. కేవలం తెలుగు నేటివిటీ చూపించడంకోసం తీసుకున్నట్టున్నారు. వనమాలి పాటలూ, ఉమర్జీ అనురాధ సంభాషణలూ బాగున్నాయి, కథకి తగ్గట్టుగా. పబ్లిసిటీలో పోస్టర్ల మీద 'ఈ వయసిక రాదు' అని సబ్ టైటిల్ వేస్తున్నారు కానీ, థియేటర్లో ఇది కనిపించలేదు. సినిమా కథకి అంతగా అతకలేదు కూడా. ఈమధ్య కాలంలో థియేటర్లో వరుసగా చూసిన మూడో డబ్బింగ్ సినిమా ఇది. టైటిల్ కి అర్ధం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను.

బుధవారం, జూన్ 29, 2011

పాలూ-నీళ్ళూ

పాలనీ నీళ్ళనీ వేరు చేయడం ఒక్క హంసకి తప్ప ఇంకెవ్వరికీ సాధ్యంకాదు. కానీ ఇక్కడ రెండు చిక్కులున్నాయి. హంస, చక్కగా నీళ్ళు తాగేసి పాలు మనకి మిగల్చదు. సుబ్బరంగా పాలన్నీ తను తాగేసి, నీళ్ళు మన మొహాన కొడుతుంది. రెండోది, హంస తన స్థాయికి తగ్గట్టు రాజభవంతుల్లోనో, ధగద్ధగాయమానమైన ప్యాలస్లలోనో ఉంటుంది కానీ, జనసామాన్యం నివసించే చోట తిరుగాడదు. సదరు రాజభవంతుల్లో వాడే పాలల్లో నీళ్ళు కలిపే మగదూర్ ఎలాగూ ఎవరికీ ఉండదు. దీనివల్ల బోధ పడేది ఏమిటీ అంటే, మనబోటి నీళ్ళ పాల బాధితులకి సదరు హంస చేయబోయే సాయం అంటూ ఏమీ ఉండదు.

మన పెద్దవాళ్ళు ప్రచారంలోకి తెచ్చిన కొన్ని సామెతలు అసలు ఏ ఉద్దేశ్యంతో పుట్టించారో ఎంత ఆలోచించినా అర్ధం కాదు. ఉదాహరణకి భార్యాభర్తలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటే 'చక్కగా చిలకా గోరింకల్లా ఉన్నారం'టారు. ఏ చిలకా గోరింకనీ, వైస్ వెర్సా గానూ కూడా పెళ్లాడవు కదా. అలాగే అత్తా కోడలూ కనక కలివిడిగా ఉంటేనో, ఉన్నట్టు కనిపిస్తేనో 'చక్కగా పాలూ నీళ్ళలా కలిసిపోయారు' అంటారు. ఇద్దర్లో పాలెవరు, నీళ్లెవరు? అని ఏ మగ ప్రాణికైనా సందేహం వచ్చినా దానిని బయట పెట్టకపోవడం కుటుంబ క్షేమం మరియు మనశ్శాంతి దృష్ట్యా అత్యవసరం.

పాలూ నీళ్ళూ ఓసారి కలిసిపోయాక, వాటిని కనిపెట్టడం కుంచం కష్టమైన పని. ఇంక విడదియ్యడం అయితే అసాధ్యమే. ఈ సూక్ష్మాన్ని బాగా అర్ధం చేసుకున్నవాళ్ళు పాలవ్యాపారులు. దీనిని వ్యాపార సూత్రం చేసేసి అంత బాగానూ అమలు చేసేస్తున్నారు. మా చిన్నప్పుడు పాలు కొనే అవసరం ఉండేది కాదు. పెరట్లో పాడి ఉండేది కాబట్టి పాలల్లో నీళ్ళు కలపడం అంటే ఏమిటో, ఎందుకో తెలియలేదు. తర్వాత కొన్నాళ్ళకి ఇంటి పాడికి ఇబ్బంది రావడం వల్ల బయట పాలు కొనే వాళ్ళు. "నీళ్ళు కలిపేస్తున్నావ్" అని పాలు తెచ్చే కుర్రాణ్ణి రోజూ సాధించేది బామ్మ. "చంటి పిల్లాడు తాగే పాలు" అని కూడా అనేది, నన్ను చూపిస్తూ. అప్పటికి నేను నాలుగో ఐదో చదివేవాణ్ణి.

"మనం ఏమరుపాటుగా ఉన్నామంటే, బంగారంలో రాగీ పాలల్లో నీళ్ళూ ఇట్టే కలిపేస్తారు" అంటూ ఉండేది కూడా. ఆవిడకి బంగారం అంటే భలే ఇష్టం. నాకేమో కొన్న పాలు, మా ఇంట్లో పాలలాగే అనిపించేవి. నీళ్ళు కలిపినట్టు బామ్మకి ఎలా తెలుసా అని ఆశ్చర్యంగా ఉండేది. అప్పుడు బామ్మ వల్ల తెలిసింది ఏమిటంటే, నీళ్ళు కలిపిన పాలతో కాఫీ బాగా రాదనీ, పెరుగు చిక్కగా తోడుకోదనీ, మీగడ రాదనీ, వీటన్నింటినీ బట్టి నీళ్ళు కలిపిన విషయం తెలుసుకోవచ్చనీను. "మన పెరట్లో పాలైతే చిక్కగా బొట్టెట్టుకునేలా ఉంటాయి. నీళ్ళు కలిపిన పాలని రంగు చూసి కనిపెట్టేయొచ్చు," అన్న రహస్యం కూడా చెప్పేసింది.

నా అంతట నేనుగా పాలు కొనడం మొదలెట్టాక అనుభవంలోకి వచ్చాయి కష్టాలన్నీ. అసలు ఈ గొడవ లేకుండా పేకెట్ పాలు కొనుక్కోవచ్చు కదా అనిపిస్తుంది నాకు. కానీ, ఒక్కళ్ళ ఇష్టం చెల్లే కాలమా ఇది? ఇంట్లో మా పాలబ్బాయి గురించి తరచూ కంప్లైంట్లు వినాల్సి వస్తోంది. నేను గట్టిగా అడిగితే చిక్కగా పోస్తాడని ఓ పిచ్చి నమ్మకం. సరే కొన్ని నమ్మకాలని అలా ఉండనివ్వడం మంచిదిలే అని, నేను కూడా బిల్లిచ్చేటప్పుడల్లా పాల చిక్కదనాన్ని గురించి హెచ్చరిస్తూ ఉంటాను. "ఎంతమాట! పితికినవి పితికినట్టే పోసేత్తాను మీకు," అన్నది అతని రొటీన్ డైలాగ్. కానీ షరా మామూలే.

పాలల్లో నీటి శాతం కనిపెట్టే ఓ పరికరం గురించి మొదటిసారి విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. అందరికీ ఉపయోగ పడే పరికరం కదా అనిపించింది. పెద్ద మొత్తంలో పాలు కొనే వాళ్ళు ఆ పరికరాన్ని ఉపయోగిస్తూ ఉంటారుట. కానైతే, నీళ్ళ పాలలో పాలపొడి కలిపేసి చేసే కల్తీలని ఈ పరికరం కనిపెట్టలేదని వినికిడి. ఓ పదేళ్ళ క్రితం అనుకుంటా, మహానగరాల్లో సింధటిక్ పాలు అమ్ముతున్నారన్న వార్త వెలుగులోకి వచ్చి, పెద్ద దుమారం రేపింది. తర్వాత అలాంటిది ఏమీ జరగడం లేదని ప్రభుత్వం ప్రకటన కూడా ఇచ్చేసింది.

మా బంధువొకాయన పాల చిక్కదనం విషయంలో అస్సలు రాజీ పడలేడు. అందువల్ల ఆయన దినచర్య తెల్లవారు ఝాము నాలుగున్నరకి పాల గిన్నె పట్టుకుని పక్క కాలనీ లో ఉండే పాలతని పాకకి వెళ్ళడంతో మొదలవుతుంది. అక్కడికక్కడ తన ఎదురుగానే చిక్కని పాలు పితికించుకుని తెచ్చుకుంటాడు. అదో తృప్తి. అలా చిక్కగా పోసేసినందుకు పాలతను మామూలుకన్నా ఎక్కువ డబ్బు తీసుకుంటాడనీ, అయినా తను లెక్క చెయ్యననీ ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళందరికీ మర్చిపోకుండా చెబుతూ ఉంటాడు కూడా. 'పాలకోసం నల్లరాయి మొయ్యా' లన్న సామెత అయితే ఉంది కానీ, పాలకోసం బంగారం లాంటి నిద్ర పాడుచేసుకోమని ఎక్కడా లేదు కదా..

మంగళవారం, జూన్ 28, 2011

తీరిన దాహం

"ప్రపంచమొక పద్మవ్యూహం.. కవిత్వమొక తీరని దాహం.." అన్న మహాకవికి తొలి వందనం. ప్రతి ఒక్కరిలోనూ కళాకారులు ఉంటారు. అంటే ఒక రచయిత, కవి, చిత్రకారుడూ, నటుడూ, గాయకుడూ...ఇలాగన్నమాట. అన్నీ కలిసొచ్చిన వాళ్ళకి వాళ్ళలో ఉన్న కళ బహిర్గతమై, బోల్డంత పేరొస్తుంది. మిగిలిన వాళ్ళని విధి ఏదో ఒక రూపంలో అడ్డుకుంటుంది. ఇంత బరువైన డైలాగులు ఎందుకూ అంటే... మనం అలా అలా కాళ్ళు నొప్పులు పుట్టేంత వరకూ నడుచుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి.

అవి నేను అప్పుడే నిక్కర్లు వేసుకోవడం నేర్చుకుని బడికి వెళ్ళడం మొదలు పెట్టిన రోజులు. అప్పట్లో మా ఇంట్లో ఉన్న ఏకైక వినోద సాధనం రేడియో. నాకే కాదు, మా ఇంటిళ్ళపాదికీ రేడియో అంటే ఒక్కొక్కరికీ ఒక్కోందుకు ఇష్టం. ఈ కారణానికి ఉదయం సిగ్నేచర్ ట్యూన్ తో రేడియో స్టేషన్ మొదలయ్యింది మొదలు, కార్యక్రమాలు పూర్తయ్యి 'కూ..ఊ..ఊ..' అనేంత వరకూ సదరు బుల్లిపెట్టి మోగుతూ ఉండాల్సిందే. రేడియో నాటకాల పుణ్యమా అని మూడో తరగతి చదివే రోజుల్లోనే నాలో రచయిత మేల్కొని నాచేత ఒక నాటిక రాయించేశాడు.

ఐదారు తరగతుల్లోకి వచ్చేసరికి నన్ను అమితంగా ఆకట్టుకున్న రేడియో కార్యక్రమం కవి సమ్మేళనం. నాకు పెద్దగా అర్ధమవ్వక పోయినా సరే, ఆ కవితలన్నీ శ్రద్ధగా వినేవాడిని. కవులంతా తమ తమ కవితలని గానం చేసే విధానం, ముఖ్యంగా ఒక్కో లైనూ రెండేసి సార్లు చదవడం భలేగా నచ్చేసింది నాకు. ఆరో తరగతిలో ఉమామహేశ్వర రావు గారు మాకు తెలుగు చెప్పేవారు. ఆయనది శ్రావ్యమైన కంఠం. ఆయన పద్యాలు చదువుతూ ఉంటే అలా వింటూ ఉండిపోవాలని అనిపించేది.

ఒకరోజు ఆయన క్లాసులో పాఠం చెబుతూ, రవీంద్రనాథ్ టాగోర్ చాలా చిన్నప్పటినుంచే కవితలు రాయడం మొదలు పెట్టాడని చెప్పారు. అది నాకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. "టాగోర్ ఎక్కువేమిటి? నా తక్కువేమిటి?" అన్న ఆలోచన మొదలై, మర్నాటికల్లా న చేత ఒక పద్యం (???) రాయించేసింది. ప్రధమ పాఠకుడు - పాపం మా తెలుగు మేష్టారే. 'పుష్పము లోని తేనియనంతయు గ్రోలుచు..' అన్నది మొదటి లైన్ అని జ్ఞాపకం. మా క్లాస్ రూం పక్కనే ఉన్న తోటలో తుమ్మెదలని చూస్తూ వాటిమీద రాసిన పద్యం అది. "పద్యాలు రాయాలంటే చందస్సూ అవీ రావాలి. కొంచం పెద్దయ్యాక ప్రయత్నిద్దువుగానిలే" అన్నారాయన బలహీనంగా.

నేనస్సలు నిరుత్సాహ పడలేదు. పద్యాలకైతే ఆగాలి కానీ, కవితలకి ఆగక్కర్లేదు కదా అని నిశ్చయించేసుకుని కనిపించిన ప్రతి వ్యక్తి, వస్తువు మీదా ఆశువుగా కవితలల్లడం మొదలు పెట్టాను. ఇది ఎలా మొదలయ్యిందంటే, ఒక రోజు నేను వీధిలో కూర్చుని చదువుకుంటూ ఉండగా మీరయ్య రోడ్డున వెళ్తూ కనిపించాడు. "మడేలు" అని నా నోటంట అప్రయత్నంగా వచ్చి, ఆ వెంటనే "మడేలు మడేలు మడేలు" అని రాగయుక్తంగా మారింది. అది కవితావేశం అని అర్ధమైపోయింది నాకు. పెద్దగా ఆలోచించక్కర్లేకుండానే "ఫిడేలు ఫిడేలు ఫిడేలు" అన్నది రెండో పంక్తిగా దొరికేసింది.

కవితక్కూడా కనీసం నాలుగు పంక్తులుండాలన్నఅప్పటి నా చాదస్తం కారణంగా మిగిలిన రెండు పంక్తుల కోసం తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టాను, చదువుతున్న పుస్తకం పక్కన పెట్టేసి. నిజానికి మా మీరయ్యకి ఫిడేలంటే ఏమిటో కూడా తెలీదు. అయినప్పటికీ నా కవితలో మూడో పంక్తి "మడేలు వాయిస్తాడు ఫిడేలు" అయ్యింది. ఇక చివరి పంక్తి కోసం అస్సలు తడుముకోలేదు.. "ఫిడేలు వాయించేది మడేలు.." అంతే! కవిత అయిపోయింది. చివర్లో రాగం కోసం మళ్ళీ "మడేలు మడేలు మడేలు... ఫిడేలు ఫిడేలు ఫిడేలు..." జత చేశాను.

కవిత్వంలో ఉన్న సమస్య ఏమిటంటే, వెంటనే ఎవరితోనన్నా పంచుకోవాలని అనిపిస్తుంది. నాకు ఎదురుగా అమ్మ కనిపించింది. అంతే, వెంటనే నా కవిత వినిపించేశాను. తల్లి ఋణం తీర్చుకోలేనిది అని ఎందుకంటారు అని ఎవరన్నా అడిగితే, ఇదిగో ఈ సందర్భాన్ని కూడా ఉదహరించొచ్చు. అమ్మ అస్సలు తిట్టకపోగా, బాగుందని మెచ్చుకుంది. నేనింక నా కవితని రేడియోలో చదివేయొచ్చు అనుకున్నాను. ఇంతలో నా స్ఫూర్తి ప్రదాత మీరయ్య వాళ్ళింటికి తిరిగి వెళ్తూ కనిపించాడు. ఆపి, నాకవితని వినిపించాను. "పిడేలంటే ఏటి బాబయ్యా" అని సిగ్గుపడుతూ అడిగాడు. అమ్మ తనకి ఓ గ్లాసుడు మజ్జిగ ఇచ్చింది, ఎందుకో నాకప్పుడు అర్ధం కాలేదు.

అది మొదలు నాలో కవితా ఝరి ఉప్పెనై ఎగసి పడడం మొదలు పెట్టింది. ఎన్ని కవితలని గుర్తు పెట్టుకుంటాం. అందుకే ఓ చిన్న నోటు పుస్తకం రహస్యంగా సంపాదించి నా ఆశు కవితలన్నీ అందులో రాయడం మొదలు పెట్టాను, రవీంద్రుడి 'గీతాంజలి' లాగా ఓ సంపుటం తేవాలన్న ఆలోచనతో. (నేనప్పటికి 'గీతాంజలి' చదవలేదు. కానీ అది చాలా గొప్ప పుస్తకమని మా తెలుగు మేష్టారు చెప్పడం వల్ల, ఆ రికార్డు బద్దలు కొట్టాలని నా ప్రయత్నం - అమంగళం ప్రతిహతమగు గాక!) అమ్మ నా కవితల్ని మెచ్చుకుంటూ వింటోంది. చూస్తుండగానే నా కవితల పుస్తకంలో తెల్ల పేజీల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

అప్పట్లో నా దృష్టిలో ఆరోజు తెలుగు కవిత్వానికి దుర్దినం. ఆవేళ బడికి సెలవు. నాన్న ఇంట్లోనే ఉన్నారు. సెలవు రోజుల్లో పాఠాలు అప్పచెప్పించుకోవడం, పుస్తకాలకి అట్టలూ అవీ వేసి పెట్టడం లాంటివి చేసేవాళ్ళు అప్పుడప్పుడూ. ఆవేళ కూడా అలాగే నా బ్యాగ్ లో ఉన్న పుస్తకాలు తీస్తూ, నా కవితల పుస్తకం చూసేశారు. నాన్ననెందుకూ అనుకోవడం, నేనే కొంచం అజాగ్రత్తగా ఉండి దాచడం మర్చిపోయాను. సీన్ కట్ చేస్తే, నాకు మళ్ళీ ఎప్పుడూ కవిత్వం రాయాలని అనిపించలేదు. బ్లాగ్మిత్రులు 'పరిమళం ' గారిలాంటి వాళ్ళు అప్పుడప్పుడూ కవిత్వం ప్రయత్నించ మని సూచిస్తున్నప్పుడల్లా నాకీ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తూ ఉంటుంది.

సోమవారం, జూన్ 27, 2011

నిరంతరత్రయం

కొన్ని కథలు చదివిన వెంటనే ఆలోచనలో పడేస్తాయి. కొంతకాలం పాటు వెంటాడతాయి. మరి కొన్ని కథలు అలా కాదు, చదివిన వెంటనే ఏమీ అనిపించక పోయినా తర్వాత అప్పుడప్పుడూ ఉన్నట్టుండి గుర్తొస్తూ ఉంటాయి. గుర్తొచ్చినప్పుడల్లా కొన్నాళ్ళు విడవకుండా వెంటాడతాయి. మళ్ళీ కొంత విరామం. మళ్ళీ ఎప్పుడో గుర్తుకు రావడం. ఈ రెండో కోవకి చెందిన కథ బుచ్చిబాబు రాసిన 'నిరంతరత్రయం.' గత వారం భరాగో కథా సంపుటం 'ఇట్లు, మీ విధేయుడు' చదువుతూ, 'త్రివర్ణ చిత్రం' కథ దగ్గరికి రాగానే గుర్తొచ్చిందీ కథ.

'నిరంతరత్రయం' కథలో ప్రధాన పాత్రలు మూడు. కామేశం, అతని భార్య సుగుణ, కామేశం స్నేహితుడు కరుణాకరం. కామేశం, కరుణాకరం ఇద్దరికీ స్నేహితుడైన కథకుడు మొత్తం కథని చెబుతాడు. బుచ్చిబాబు చాలా కథల్లాగానే, ఈ కథా ఉపన్యాస ధోరణిలో మొదలవుతుంది - కథకుడు తను కథ రాయాలనుకోడాన్ని గురించి. ఇతని స్నేహ బృందంలో కామేశం బాగా డబ్బున్న వాడు. కరుణాకరం పేదవాడు. కామేశం, కరుణాకరం ఖర్చులని ఆనందంగా భరిస్తూ ఉంటాడు. ఇందుకుగాను, కరుణాకరం కృతజ్ఞు డుగానే ఉన్నా, మానసిక బానిసత్వాన్ని మాత్రం ప్రదర్శించే వాడు కాదు.

చదువు పూర్తయిన చాలా ఏళ్ళ తర్వాత కథకుడు కామేశాన్ని కలుసుకుంటాడు. కామేశం భార్య సుగుణ జబ్బు పడింది. అనారోగ్యం ఏమిటో డాక్టర్లకే ఇదమిద్దంగా తెలీదు. ఆమెకి విశ్రాంతి కావాలి అని మాత్రం చెబుతారు. చాన్నాళ్ళ తర్వాత కలిసిన స్నేహితుడిలో ఒక లోతైన మనిషిని చూస్తాడు కథకుడు. అలాగే సుగుణ ని గురించి కూడా కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఏర్పరుచుకుంటాడు. ఆమె కథకుడి కథలు కొన్ని చదివింది. వాటిని గురించి ఆమె మాట్లాడిన తీరు, ఆమె ప్రవర్తనని బట్టి సుగుణ బహిరంగంగా పదిమందిలోనూ ఉన్నప్పుడు తప్ప తీక్షంగా జీవించ లేదనీ, ఏకాంతం ఆమెకి తగదనీ అనిపిస్తుంది కథకుడికి.

అక్కడే కరుణాకరం ప్రస్తావన వస్తుంది. అతనో పత్రికలో పని చేస్తున్నాడనీ, అవసరానికి అప్పుడప్పుడూ తాను సహాయం చేస్తున్నాననీ చెబుతాడు కామేశం. ఆ తర్వాత కథకుడు చాలా రోజుల పాటు కామేశాన్ని కలుసుకోడు. ఒకరోజు అనుకోకుండా కరుణాకరాన్ని కలుస్తాడు. అతని ద్వారా తెలిసింది ఏమిటంటే, కామేశానికి క్షయ వ్యాధి సోకిందనీ, శానిటోరియంలో ఉన్నాడనీను. చూడడానికి వెళ్తాడు కథకుడు. చిక్కి శల్యమైన కామేశంలో ఉత్సాహం తగ్గదు. తనకి నయమయ్యాక ఎక్కడెక్కడికి వెళ్ళాలో ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. అంతకు మించి సుగుణ ప్రవర్తన కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది కథకుడికి. ఆమె చాలా ఉత్సాహంగానూ, అంతకు మించి కరుణాకరంతో చాలా చనువుగానూ ఉంటుంది.

కథకుడికి తన కథ చెబుతాడు కరుణాకరం. శానిటోరియంలో చేరగానే కామేశం జాబు రాశాడనీ, తన బాధ్యతగా వెంటనే వచ్చేశాననీ చెబుతూనే, సుగుణ సంగతి - కథకుడు ఊహించిందే - చెబుతాడు. ఆమె కరుణాకరాన్ని ప్రేమిస్తోంది, కోరుకుంటోంది. కానీ, కరుణాకరం అందుకు అంగీకరించడం లేదు, ఆమె మీద ప్రేమ లేక కాదు, ఆమెకి అవునని చెబితే కామేశానికి తీరని ద్రోహం చేసినట్టు అవుతుందని. కామేశానికి తగ్గిపోతుంది అనుకునేటంతలోనే క్షయ తిరగబెడుతుంది. "మీ బ్రతుకు మీరు, నా బ్రతుకు నేను - ఎవళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకాలి - జీవితం ఎవరి కోసం నిలిచిపోదు - పొండి," అంటాడతడు, భార్యా మిత్రులతో. తనతో సన్నిహితంగా ఉండవద్దని సుగుణ నుంచి మాట తీసుకుంటాడు కరుణాకరం.

మరికొన్నాళ్ళ తర్వాత, కథకుడు కామేశాన్ని కలుసుకునేసరికి తెలుస్తుంది - కరుణాకరానికి క్షయ వ్యాధి అనీ, శానిటోరియంలో ఉన్నాడనీ. సుగుణ అదేమీ పట్టించుకోకుండా విహార యాత్ర వెళ్లాలని బలవంత పెడుతోందని కథకుడితో చెప్పి బాధ పడతాడు కామేశం. తనకి అంత సేవ చేసిన కరుణాకరం మీద కనీస కృతజ్ఞత కూడా ఆమె చూపడం లేదని కామేశం ఫిర్యాదు. "నాకు హృదయం ఉంది. కరుణాకరం జబ్బుతో ఉన్నంతకాలం నేను సంతోషంగా ఉండలేను," అంటాడు కామేశం. కరుణాకరం కథ ఏమయ్యిందన్నది ఆలోచనల్లో పడేసే ముగింపు. ఈ కథని కామేశం, సుగుణ, కరుణాకరం - ఒక్కొక్కరి వైపు నుంచి చదివినప్పుడల్లా ఒక్కో కొత్త విషయం బోధ పడుతున్నట్టుగా అనిపిస్తుంది.

"నిరంతరత్రయం అన్న కథలో ప్రధాన వ్యక్తి క్షయ వ్యాధికి గురవుతుంది. బి.సి.జి. ఉద్యమం కొనసాగుతున్న రోజులవి. క్షయ వ్యాధిని గురించి చదివాను. డాక్టర్లతో ముచ్చటించాను. ఈ రకం వైజ్ఞానిక విషయాల సమీకరణ, పాండిత్యం నవలకి అవసరం కాని, కథానికకి అక్కర్లేదు - ఈయన హడావిడి చేస్తున్నాడు - అనుకోవచ్చు కొందరు. అక్కర్లేదు, నిజమే. నేను తెలుసుకున్న వాటిలో ఒకటి రెండు తప్ప ఈ కథలో వాడనేలేదు. ఏమీ తెలుసుకోకుండా వ్యాధితో బాధ పడిన వారిని చూస్తే సరిపోవచ్చు. కానీ నాకట్లాగనిపించదు. ఆ వ్యాధి భోగట్టా అంతా తెలుసుకున్నాక మనస్సులో వస్తువుకి అనువైన మానసిక స్థితి ఏర్పడుతుంది. ఒక వాతావరణం ప్రబలడానికి సరిహద్దులేర్పడతాయి," అన్నారు బుచ్చిబాబు తన 'బుచ్చిబాబు కథలు' సంపుటానికి రాసిన ముందుమాటలో. 'ఎల్లోరాలో ఏకాంతసేవ' కథ కూడా ఈ సంపుటంలోదే.

ఆదివారం, జూన్ 26, 2011

మమత

నిన్నమొన్నటి వరకూ తన ప్రీమియర్ షోలకి నిర్మాత మరియు కథానాయక బాధ్యతలకి మాత్రమే పరిమితమైన సుమన్ బాబు మెల్ల మెల్లగా తన బాధ్యతలని పెంచుకుంటున్నాడు. తన సొంత నిర్మాణ సంస్థ సుమన్ ప్రొడక్షన్స్ సగర్వంగా సమర్పిస్తున్న ప్రీమియర్ షోల పరంపరలో నాలుగోదైన 'మమత' కి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలని తనే సమకూర్చుకోడంతో పాటుగా, యధావిధిగా ప్రధాన పాత్రని శక్తి మేరకి ధరించాడు. ఏ ఇతర పాత్రా తను పోషించిన పాత్ర దరిదాపులకి ఏ విధంగానూ రాని విధంగా శ్రద్ధ తీసుకున్నాడు కూడా.

టైటిల్స్ పూర్తవ్వగానే ఓ కాలేజీ. అక్కడ ఏం చెబుతారన్నది రహస్యంగానే ఉంచారు. ఆ క్యాంపస్ లో ఓ మెల్లకన్ను అమ్మాయి 'మమతా.. మమతా..' అని అరుచుకుంటూ రావడం ప్రారంభ దృశ్యం. ఎంత లాజిక్ పక్కన పెట్టి చూడాలి అని ముందుగానే నిర్ణయించుకున్నా, "ఇప్పటి అమ్మాయిలు సెల్ ఫోన్ లో మెసేజో, మిస్డ్ కాలో ఇచ్చి ఫ్రెండ్స్ ని పిలుస్తున్నారు తప్ప, ఇలా కోర్ట్ అమీనా లాగా అరవడం లేదు కదా" అని డౌట్ వచ్చేసింది. అయితే, ఈ షో మొత్తం మీద ఎక్కడా, ఎవరి దగ్గరా సెల్ ఫోన్ అన్నది కనిపించలేదు, బహుశా బడ్జెట్ ఒప్పుకుని ఉండకపోవచ్చు.

నాలుగే నాలుగు క్లోజప్ షాట్లలో మమత ప్రత్యక్షం. ఈ అమ్మాయికి కూడా మెల్ల కన్ను. 'సిరి మెల్ల' అంటారు పెద్ద వాళ్ళు. అందుకే కాబోలు, ప్రతిష్టాత్మకమైన సుమన్ ప్రొడక్షన్స్ లో టైటిల్ పాత్ర పోషించే అవకాశం వచ్చింది. సినిమాకి వెళ్దామన్న స్నేహితురాలిని, మెత్తగా కోప్పడి, తను తెలుగు ట్యూషన్ కి వెళ్ళాలి కాబట్టి రావడం కుదరదని చెప్పేస్తుంది మమత. ఈ అమ్మాయికి అన్ని సబ్జక్ట్ లలోనూ టాప్ మార్కులు వస్తున్నాయిట , తెలుగులో తప్ప. వాళ్ళ నాన్నగారికి తెలుగంటే ఇష్టంట. తెలుగు లో తక్కువ మార్కులు రావడం గురించి వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారో స్నేహితురాలికి చెప్పి చెప్పి ట్యూషన్ కి బయలుదేరుతుంది.


భారతి మేడం (కృష్ణశ్రీ) దగ్గర తెలుగు ట్యూషన్ పూర్తి చేసుకుని, అప్పటిక్కూడా తనకోసం వెయిట్ చేస్తున్న ఫ్రెండ్ కి (మమతకి కారుంది, వెయిట్ చేస్తే ఆటో ఖర్చులు కలిసొస్తాయి కదా) దొరికిందే చాన్సుగా తన తండ్రి డాక్టర్ శరత్ చంద్ర గొప్పదనాన్ని కథలు కథలుగా చెప్పడం మొదలు పెడుతుంది మమత. మంచి వాడు, సున్నిత హృదయుడు, ఎవరి కష్టాన్నీ చూడలేని వాడూ... మొత్తంమీద సారాంశం ఏమిటంటే, మదర్ తెరెసా మగజన్మ ఎత్తితే అచ్చం డాక్టర్ శరత్ చంద్రలాగే ఉంటుందని. శరత్ చంద్ర ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ నెక్స్ట్ సీన్లో ముక్కలు ముక్కలు గా కనిపించేశాడు, కళ్ళు చెదిరే డిజైన్ ని పరీక్షగా చూస్తూ. 'ఐలవ్యూ డాడీ' లో వాడిన విగ్గే అయినప్పటికీ, పక్కన పేర్రాశారు.

ఓ పేషెంటు, పక్కన అతని తండ్రి (హేమచందర్) శరత్ చంద్ర మంచితనాన్ని ప్రేక్షకులకి విసుగొచ్చేలా పొగుడుతుంటే (అప్పటికే మమత నోటెంట వినడం అయిపోయింది కదా) చిరునవ్వులు చిందిస్తూ, తగుమాత్రంగా సిగ్గు పడుతూ వింటున్నాడు సుమనుడు. తర్వాతి దృశ్యంలో మ్యూజియం లాంటి పెద్ద బంగ్లాలో తండ్రీకూతురూ కలుసుకోవడం. తల్లి లేని మమతని అన్నీ తనే అయి పెంచిన తండ్రి శరత్ చంద్ర కూతురి కోసం కాఫీ తయారు చేసి తీసుకు రావడం, కూతురంటే తనకెంత ప్రేమో ఓ రెండు పేజీల డైలాగుల సాయంతో చెప్పడం పూర్తయ్యింది.

వాళ్ళింట్లో సింహాసనం లాంటి ఓ కుషన్ చైర్ ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే శరత్ చంద్రకి మనసు బాగోనప్పుడల్లా (పాపం, ఎప్పుడూ ఎందుకో అందుకు బాగోదు.. వెంటాడే (ప్రేక్షకులని వేటాడే) గతం ఉంది మరి) అందులో కూర్చుని దుఃఖ పడుతూ ఉంటాడు. (శ్రీనివాస్ పప్పు గారి లాంటి అభిమానులు కోప్పడమంటే ఓ మాట, నాకు 'జస్టిస్ చౌదరి' లో ఎన్టీఆర్ కి ఆవేశం వచ్చినప్పుడల్లా రివాల్వింగ్ చైర్లో కూర్చుని పైప్ పీల్చడం పదేపదే గుర్తొచ్చింది). మమత పెళ్లై అత్తారింటికి వెళ్లిపోయినట్టుగా పీడకల (???) రావడంతో ఉదయాన్నే ఆ కుర్చీలో కూర్చుని శక్తివంచన లేకుండా బాధ పడుతున్న శరత్ చంద్రని, తను పెళ్ళే చేసుకోనని చెప్పి ఓదారుస్తుంది మమత.

వృత్తిరీత్యా సైకియాట్రిస్ట్ అయిన శరత్ చంద్ర మానసిక సమస్యలతో బాధ పడుతున్నాడేమో అనిపించక మానదు, ప్రతి సంవత్సరం నవంబరు ఆరో తేదీన అతనా కుర్చీలో కూర్చుని దుఃఖ పడడం చూస్తే. ఆరోజు ప్రత్యేకత ఏమిటంటే, కొన్నేళ్ళ క్రితం అదే రోజున అతని భార్య, మూడేళ్ళ కూతురు మమతని అతని దగ్గర వదిలేసి మరో వ్యక్తితో వెళ్ళిపోయి అతన్ని పెళ్లి చేసేసుకుంది. అప్పటినుంచీ మమతకి తల్లిలేని లోటు లేకుండా పెంచుతూ, భార్యని విపరీతంగా ద్వేషిస్తూ ఉంటాడు శరత్ చంద్ర. భార్య ఫోటో ఒక్కటి కూడా ఇంట్లో ఉంచడు. ఈ కథ తెలిసిన మమత, అత్యంత ఆవేశంగా తన గదికి పరిగెత్తి, అచ్చం సుమన్ బాబు గీసినట్టుగా ఓ స్త్రీ బొమ్మ గీసి, కింద 'నా తల్లి రాక్షసి' లాంటిదేదో రాసి, తాపీగా, కోపంగా ఆ బొమ్మని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. (ఐలవ్యూ డాడీ లో కుర్రాడు చేసినట్టుగా).

నేపధ్య సంగీతం బ్రహ్మాండం బద్దలు కొట్టేస్తుండగా, ఆ చింపిన ముక్కలన్నీ జాగ్రత్తగా ఇంటి బయటకి తెచ్చి, ఓకే ఒక్క అగ్గిపుల్లతో తగల పెట్టడం ద్వారా అతి తక్కువ బడ్జెట్లో తల్లి మీద పగ తీర్చేసుకుంటుంది. ఇదిలా ఉండగా, తనకంటూ ఎవరూ లేని భారతీ మేడం అంటే మమతకీ, అలాగే మమత అంటే భారతీ మేడం కీ ఎంతో అభిమానం పుట్టి పెరుగుతూ ఉంటుంది. మమత తెలుగులో హయ్యెస్ట్ స్కోర్ సాధించడంతో ఆ అభిమానం అవధులు దాటుతుంది. ఫలితం, ఓ గిఫ్ట్ పట్టుకుని మేడం ఇంటికి వెళ్ళడం, అక్కడ ఓ గొప్ప రహస్యం తెలుసుకోవడం జరిగిపోతుంది.

బీద పేషెంట్ల దగ్గర ఫీజే తీసుకోని, అవసరమైతే పేషెంట్లని ఇంట్లో పెట్టుకుని వైద్యం చేసే శరత్ చంద్ర, సుధాకర్ అనే కుర్రాడిని వీల్ చైర్లో ఇంటికి తీసుకొస్తాడో రోజు. మమత అతడిని సొంత తమ్ముడిలా చూసుకోవడం మొదలు పెడుతుంది. త్వరలోనే, శరత్ చంద్రకి అతనంటే అభిమానం మొదలవుతుంది. ఎంతగా అంటే, అతను వైద్యం పూర్తయ్యి వెళ్లిపోతుంటే బుళుకూ బుళుకూ ఏడ్చేసేటంతగా. చివరాఖరికి అతగాడు భారతి మేడం కొడుకని తెలియడంతో పాటుగా, ఆ కుటుంబానికి సంబంధించిన ఓ ముఖ్యమైన రహస్యం బయట పడడం, పాతకాలపు నాటకాల్లోలా ముఖం మీద ఎర్ర లైటు ఆర్పి వెలిగించే టెక్నిక్ ద్వారా శరత్ చంద్ర కోపాన్ని ఓ ఐదారు నిమిషాలు చూపించాక, సమస్యకి మమత తనదైన పరిష్కారాన్ని సూచించేయడం ముగింపు.

టైటిల్స్ లో సుమన్ ప్రొడక్షన్స్ సమర్పించు 'మమత' అని వెయ్యగానే, వెరీ నెక్స్ట్ టైటిల్ 'మేకప్ వై. హరి' ..మేకప్ కి ఎంత ప్రాధాన్యత ఇచ్చారన్నది దీనిని బట్టి తెలుస్తోంది కదా. ఎప్పటిలాగే సుమన్ బాబు అత్యంత అందంగా కనిపించడానికి ప్రయత్నించాడు. మార్చిన చొక్కా మార్చకుండా మార్చేశాడు. పెద్దగా బడ్జెట్ లేకపోవడం వల్ల అనుకుంటా మిగిలిన వాళ్ళ మేకప్, కాస్ట్యూమ్స్ మీద అంత శ్రద్ధ పెట్టలేకపోయారు. సుదీర్ఘమైన సంభాషణలు, వాటిలో మితిమీరిన ఇంగ్లిష్ పదాలు (అదేంటో కానీ తెలుగు లెక్చరర్ కూడా ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడుతుంది) డైలాగ్స్ డిపార్టుమెంటు ప్రత్యేకత. నిడివి కేవలం రెండు గంటలే అవడం వల్లనేమో పాటలూ అవీ లేవు. ఎలాగో 'ట్విస్ట్' ప్రకటన వచ్చేసింది కాబట్టీ, దానిక్కూడా తనే దర్శకుడు కాబట్టీ అనుకుంటా ఇంద్రనాగ్ ఈసారి కూడా పాదనమస్కారం చేయలేదు.

శనివారం, జూన్ 25, 2011

ఓటమే గురువు

నాకు వ్యంగ్యం రాసేవాళ్ళంటే భలే ఇష్టం. నేను పతంజలి రచనలని ఇష్టపడడానికి ఉన్న అనేకానేక కారణాలలో ఆయన వ్యంగ్యాన్ని అలవోకగా రాసేయడమూ ఒకటి. దినపత్రికలలో, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ మీద వచ్చే వ్యంగ్య రచనల్లో ఎక్కడో తప్ప క్వాలిటీ కనిపించదన్నది నా అభిప్రాయం. బహుశా, ఆయా రచయితలకి రాయడానికి ఎక్కువ సమయం ఉండకపోవడం వల్ల కావొచ్చు. అయితే ఒకానొక రచయిత రాసిన కాలమ్ ని మాత్రం వారం వారం ఎదురుచూసి మరీ చదివాను.

అవి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు పాలిస్తున్న రోజులు. దాదాపుగా పత్రికలన్నీ చంద్రబాబు లో ఉన్న 'పాలనా దక్షుణ్ణి' ని మాత్రమే చూస్తూ, పాఠకులని కూడా అలామాత్రమే చూడమన్న కాలం. చంద్రబాబు నిర్ణయాలనీ, ఆయన పాలనా శైలినీ విమర్శిస్తూ వచ్చే కథనాలు చాలా తక్కువగా ఉండేవి. అలాంటి సమయంలో నాకంట పడ్డ కాలమ్ 'జనాంతికం.' ఆంధ్రభూమి దినపత్రిక మూడో పేజీలో వారం వారం వచ్చే 'జనాంతికం' లో చంద్రబాబు పనితీరుని సున్నితమైన హాస్య, వ్యంగ్య ధోరణుల్లో విమర్శనాత్మకంగా సమీక్షించే వారు బుద్దా మురళి. నేను 'జనాంతికం' మురళి అని గుర్తు పెట్టుకున్నాను ఈయనని.

శీర్షిక కి సంబంధం లేని విషయం రాస్తున్నానని సందేహం కదూ.. అస్సలు కాదు. ఓ ఆరేళ్ళ క్రితం, ఎప్పటిలాగే పుస్తకాల షాపుకి వెళ్లాను, కొనుక్కోవలసిన పుస్తకాల జాబితాతో. మేనేజర్ నాకు మిత్రులే. ఆయన నాతో కబుర్లు చెబుతుండగా, నేను సేల్స్ కుర్రాళ్ళకి నాక్కావాల్సిన పుస్తకాలు చెప్పేశాను. "వాటితో పాటు 'ఓటమే గురువు' కూడా తెండిరా, సార్ కి," అన్నారాయన. పేరు వినగానే వ్యక్తిత్వ వికాసం అనిపించింది నాకు. "వద్దండీ, నేను పర్సనాలిటీ డవలప్మెంట్ పుస్తకాలు పెద్దగా చదవనని తెలుసు కదా మీకు" అన్నాను. ఆయన వినలేదు. "ఇది మీరు చదవాల్సిన పుస్తకం. మీరు కొనద్దు, నా గిఫ్ట్" అన్నారు.

మా కబుర్లు అవుతుండగానే పుస్తకాలు వచ్చేశాయి. అప్పుడు చూశాను 'ఓటమే గురువు' ని. రచయిత బుద్దా మురళి. "ఈయన ఆంధ్రభూమి లో రాస్తారు కదూ?" అని అడిగాను కించిత్ ఎక్స్సైటింగ్ గా. "ఆయనే, పుస్తకం చాలా బాగుంది. రాత్రే చదివాను," అన్నారు మేనేజర్. నేను బిల్ చెల్లిస్తానన్నా వినకుండా, నాకు కానుకగా ఇచ్చారీ పుస్తకాన్ని. మిగిలినవన్నీ పక్కన పెట్టి ఈ పుస్తకాన్నే మొదట చదివానని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.

'పరాజయం నుంచి విజయానికి' అన్నది ఉపశీర్షిక. ఇంగ్లిష్ నుంచి చెప్పో, చెప్పకుండానో 'స్ఫూర్తి పొంది' పేజీలు నింపేసే వ్యక్తిత్వ వికాస రచనలకి పూర్తి భిన్నంగా ఉందీ రచన. భారతీయ తాత్విక సంపద అయిన వేదోపనిషత్తుల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల జీవన శైలుల నుంచీ తీసుకున్న ఉదాహరణలు ఇది 'మన పుస్తకం' అనే భావనని కలిగించాయి. సిని, రాజకీయ రంగాల వారి వైఫల్యాలని, వాటిని వారు ఎదుర్కొన్న తీరునీ మధ్య మధ్యలో ప్రస్తావించారు మురళి.

'ఓటమికి ఏ ఒక్కరూ అతీతులు కార'న్న ప్రారంభ వాక్యాలు మొదలుకుని వైఫల్యాలని ఏ స్థాయిలో వారు ఎలా ఎదుర్కొంటారో వివరిస్తూ సాగిన ఈ రచన కేవలం ఓటమితో కుంగి పోయే వారిలో ధైర్యాన్నినింపడమే కాక, ఫెయిల్యూర్ ని ఒక అవకాశంగా ఎలా మలుచుకోవాలో చెబుతుంది. గుజరాత్ లో కొన్ని వ్యాపార కుటుంబాల వారు, తమ పిల్లలు చదువు పూర్తి చేశాక దేశం తిరిగి రమ్మని పంపుతారనీ, వ్యాపారంలో మొదట నష్టం వస్తే దానిని అనుభవం కోసం పెట్టిన పెట్టుబడిగా పరిగణిస్తారనీ చెబుతూ, ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన వారు కూడా ఒకప్పుడు నష్టాలు ఎదుర్కొన్న వైనాన్ని వివరించారు మురళి.

అప్పటివరకూ ఈ రచయిత రాసిన వ్యంగ్యాన్ని మాత్రమే చదివిన నాకు, ఆయనలో ఉన్న ఓ కొత్త కోణం కనిపించింది, పుస్తకం పూర్తి చేయగానే. చంద్రబాబుని ఈ పుస్తకంలోనూ విడిచిపెట్టలేదు రచయిత. కాకపొతే వ్యంగ్యంగా కాక, సీరియస్గా రాశారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఎందరి మెప్పో పొందిన చంద్రబాబుకీ వైఫల్యం తప్పలేదని చెబుతూనే, వైఫల్యాన్ని విజయానికి మెట్టుగా ఉపయోగించుకోడానికి ఆయన ఏమేం చేస్తున్నారో రాశారు. ఆద్యంతమూ విడిచిపెట్టకుండా చదివించే శైలి ఈ పుస్తకం సొంతం.

సంస్కృతి ప్రచురణలు ప్రచురించిన ఈ నూట ఇరవై పేజీల పుస్తకం వెల రూ. 60. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఏవీకెఎఫ్ లోనూ లభిస్తోంది. కేవలం వైఫల్యం ఎదురైనప్పుడు మాత్రమే కాదు, దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్ళని అధిగమించడానికీ ఈ పుస్తకాన్ని ఆశ్రయించవచ్చు. బుద్దా మురళి గారి బ్లాగుని కనుగొన్న ఆనందంలో, పుస్తకాన్ని ఓసారి తిరగేశాను. తర్వాతేం రాయబోతున్నారు మురళిగారూ?

శుక్రవారం, జూన్ 24, 2011

పెళ్లిపుస్తకం

"అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో.. తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో.. ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని.. మసకేయని పున్నమిలా మనికి నింపుకో..." రెండున్నర గంటల సినిమా సారాంశాన్ని నాలుగులైన్లలో చెప్పేశారు ఆరుద్ర. బాపు గా పిలవబడే సత్తిరాజు లక్ష్మీనారాయణ, రమణ గా పిలవబడ్డ ముళ్ళపూడి వెంకటరమణ ద్వయం అందించిన అచ్చ తెలుగు సినిమాల జాబితాలో మొదటివరుసలో ఉండే సినిమా 'పెళ్లిపుస్తకం.' పెళ్లికి అర్ధాన్నీ, పరమార్దాన్నీ ఇంత సున్నితంగా, హృద్యంగా, అందంగా, రొమాంటిగ్గా అన్నింటినీ మించి హాస్య భరితంగా చెప్పిన తెలుగు సినిమా మరొకటి లేదనడం అతిశయోక్తి కాదేమో.

రావి కొండలరావు అందించిన అందించిన మూలకథని విస్తరించి స్క్రీన్ ప్లే, సంభాషణలు రాయడంతో పాటు నిర్మాణ బాధ్యతనీ వహించారు రమణ, తమ శ్రీ సీతారామా ఫిలిమ్స్ బ్యానర్ ద్వారా. ఇరవై ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 'ఉత్తమ చిత్రం' గా నంది బహుమతి అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా 'ఫిలిం ఫేర్' అందుకున్నారు బాపు. నిజానికి ఈ సినిమాని అలనాటి ఆణిముత్యం 'మిస్సమ్మ' కి రిమేక్ గా చెప్పొచ్చు. ఇదే విషయాన్ని ఓ సన్నివేశంలో నాయిక చేత పలికించేశారు కూడా.

కథానాయకుడు కే. కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్) - అందరూ కెకె అని పిలుస్తూ ఉంటారు - బాంబేలో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి కొచ్చిన్ (కొచ్చి) లో టైపిస్ట్ గా పనిచేస్తున్న భామ గా పిలవబడే సత్యభామ (దివ్యవాణి) తో పెళ్లి నిశ్చయం కావడం సినిమాలో ప్రారంభ దృశ్యం. ఇద్దరికీ బాధ్యతలు ఉన్నాయి. ఆమెకి తన అక్క పెళ్లిబాకీ తీర్చడం, అతనికేమో చెల్లెలికి పెళ్లి చేయడం. పెళ్ళయ్యాక ఉద్యోగానికి అతను బాంబే, ఆమె కొచ్చి. వాళ్ళ కోసమే అన్నట్టుగా హైదరాబాద్ కి చెందిన మంగళ టెక్స్టైల్స్ ఆర్ట్ డైరెక్టర్, టైపిస్ట్ పోస్టులకి ప్రకటన ఇస్తుంది. కంపెనీ యజమాని శ్రీధర రావు (గుమ్మడి) ఒక కుటుంబానికి ఒకటే ఉద్యోగం అని కండిషన్ పెడతాడు.

కేవలం ఉద్యోగాల కోసం, బాధ్యతలు తీర్చుకోవడం కోసం, ఒకే చోట కలిసి ఉండడం కోసం కెకె తను అవివాహితుడిననీ, భామేమో జబ్బు పడ్డ తన భర్తకి కేరళలో వైద్యం చేయిస్తూ అతని కుటుంబాన్ని పోషిస్తున్నాననీ అబద్ధాలు చెప్పి ఉద్యోగాలలో చేరతారు. ఇక మొదలవుతాయి ఇబ్బందులు. ఓకే చోట అపరిచితుల్లా పనిచేయడం. బాస్ కూతురు వసుంధర కెకె వెంట పడుతున్నా, బాస్ బావమరిది గిరి భామని ఇబ్బంది పెడుతున్నా ఇద్దరూ కూడా చూస్తూ ఊరుకోలేకా, బయట పడలేకా పడే అవస్థ వర్ణనాతీతం. ఇది చాలదన్నట్టుగా భామకేమో వసుంధరకి డేన్స్ నేర్పాల్సిన బాధ్యత, కెకె కేమో ఆమెకి ఆర్ట్ నేర్పాల్సిన బాధ్యతా వచ్చి మీద పడతాయి.

వాళ్ళు కోరుకున్న డబ్బొస్తున్నా, భార్యా భర్తలిద్దరికీ కలిసి ఉండే సమయం దొరకడం లేదు. భర్త మీద భామకి చిన్నగా మొదలైన అనుమానం, ఇద్దరి మధ్యా అపార్ధాలని పెంచి, పెళ్ళైన ఆరు నెలలకే విడిపోవాలనే నిర్ణయం తీసుకునే దగ్గరికి వస్తుంది. ఇంతలోనే జరిగే బాస్ షష్టిపూర్తి వేడుకలో కెకె, భామలిద్దరూ వివాహ బంధానికి అసలైన అర్ధం ఏమిటో తెలుసుకోడంతో పాటు, ఒకరినొకరు క్షమించుకుని తమని క్షమించాల్సిందిగా బాసుని కోరడం సినిమా ముగింపు. మధ్య తరగతి నేపధ్యాన్ని ఎక్కడ మిస్ చేయకుండా, ఏ పాత్రా కూడా నేల విడిచి సాము చేయని విధంగా సినిమాని తీర్చి దిద్దారు బాపూ రమణలు.

రాజేంద్రప్రసాద్-దివ్యవాణి పోటీపడి నటించారు. అసలు దివ్యవాణి ఈ సినిమాలో కనిపించినంత అందంగా అసలే సినిమాలోనూ కనిపించలేదు. నేనీ సినిమా పదే పదే చూడడానికి ముఖ్య కారణాలలో ఒకటి దివ్యవాణి. పెద్దగా మేకప్ ఏమీ లేకుండానే, మామూలు వాయిల్, నేత చీరల్లోనే ఎంతో అందంగా అచ్చమైన బాపు బొమ్మలా కనిపిస్తుంది. సహాయ పాత్రలు వేసిన వాళ్ళలో శ్రీధర రావుగా గుమ్మడి, వసుంధరగా సింధూజ, గిరి గా శుభలేక సుధాకర్ గుర్తుండిపోయే నటన ప్రదర్శించారు. ఒకటి రెండు సన్నివేశాల్లో నాటకీయత కొంచం శృతి మించినట్టుగా అనిపించినా, మొత్తం మీద చూసినప్పుడు సినిమా అంతా నేల మీదే నడిచింది.

మిగిలిన సినిమాల కన్నా ముళ్ళపూడి ఈ సినిమాకి రాసిన సంభాషణల్లో నాటకీయత తక్కువగా ఉంది, సహజత్వం ఎక్కువగా ఉందనిపిస్తుంది. "పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం.." "నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు. ఏడుపొచ్చినప్పుడు నవ్వే వాడే హీరో.." "అసూయ అసలైన ప్రేమకి ధర్మా మీటరు.." "నమ్మకం లేని చోట నారాయణా అన్నా బూతులాగే వినిపిస్తుంది..." లాంటి జీవిత సత్యాలు ఎన్నో. నవ్విస్తూనే ఆలోచింపజేసే సంభాషణలు. గుమ్మడి 'నేనూ..' అంటూ తాపీగా డైలాగు మొదలు పెట్టడం, దివ్యవాణి ముద్దుగా ముద్దుగా సంభాషణలు పలకడం ఇలా ప్రతి పాత్రకీ ఒక మేనరిజం ఉంటుంది. బాబాయ్ వేషం వేసిన రావి కొండల రావు, గుమ్మడి మాట్లాడినప్పుడల్లా బధిరుల వార్తల్లా వెనకనుంచి సైగలు చేయడం మంచి కామెడీ.


పాటల విషయానికి వస్తే, ఆరుద్ర సాహిత్యానికి మహదేవన్ సంగీతం. "శ్రీరస్తూ... శుభమస్తూ.." పాట ఇవాల్టికీ పెళ్లి వీడియోల్లో వినిపిస్తూనే ఉంటుంది. శైలజ పాడిన నారాయణ తీర్ధ తరంగం 'కృష్ణం కలయసఖి సుందరం' పాట, చిత్రీకరణ కూడా నాకు ప్రత్యేకమైన ఇష్టం. ఇక, 'సరికొత్త చీర ఊహించినాను' పాట వింటుంటే 'చుట్టూ చెంగావి చీర..' గుర్తు రాక మానదు. సుశీల సోలో 'హాయి హాయి శ్రీరంగ శాయి..' లాలిపాట బాణీలో సాగగా, 'అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ.. ' 'పపపప పప పప్పు దప్పళం' సరదాగా వినిపిస్తాయి. చిత్రీకరణ మరీ హడావిడి గా కాకుండా కంటికింపుగా ఉంటుది.

ఇద్దరు రచయితలు - బి.వి.ఎస్. రామారావు, శ్రీరమణ -- ఈ సినిమాకి తెర వెనుక పనిచేశారు. ఆర్కే రాజు ఫొటోగ్రఫి, అనిల్ మల్నాడ్ ఎడిటింగ్ లని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాకి ఎంతవరకూ అవసరమో, అంతవరకూ తూకం వేసినట్టుగా సరిగ్గా చేశారు ఇద్దరూ. ఎక్కడా ఒక్క అనవసర దృశ్యం కానీ, ఏ ఒక్క దృశ్యమూ నిడివి పెరిగినట్టుగాకానీ అనిపించవు. బడ్జెట్ కంట్రోల్ ఎలా చేశారో బాపూ రాసింది చదివినప్పుడు భలే ఆశ్చర్యం వేసింది. మొత్తం మీద, ఎన్నిసార్లు చూసినా ఏమాత్రమూ బోర్ కొత్తని సినిమా ఈ 'పెళ్లిపుస్తకం.'

గురువారం, జూన్ 23, 2011

ఓ ప్రేమకథ

"అమ్మనీ మర్చిపోలేను.. అంబికనీ మర్చిపోలేను.. అదంకుల్ నా పరిస్థితి," అన్నాడతను ఏదో ఒకటి చెప్పమన్నట్టుగా. అంబిక అంటే అగరుబత్తి కాదు, అతగాడు ప్రేమించిన అమ్మాయి. ఎలాగూ ఇలాంటి విషయాలు రాసేటప్పుడు పేర్లు మారుస్తాం కదా, సమయానికి అగరుబత్తి ప్రకటన గుర్తు రావడంతో ఆ పేరు వాడేశాను. అప్పటికి రెండు గంటలనుంచీ సుదీర్ఘంగా తన ప్రేమ కథని చెబుతున్నాడతను. నేను 'ఊ' కొడుతూ వింటున్నాను. ఎందుకంటే, అంతకన్నా చేయడానికి ఏమీ లేని పరిస్థితి.

బస్ లో నా పక్క సీట్ లో ప్రయాణం చేస్తున్నాడా కుర్రాడు. పేరు ప్రేమ్ కుమార్ అనుకుందాం. పక్క రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. స్వస్థలం మా గోదావరే. సెలవులకి ఇంటికి వెళ్తున్నాడు. నేను కూడా అనుకోకుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. అందుకని బస్ పట్టుకున్నాను. ఇది జరిగింది సుమారు రెండేళ్ళ క్రితం. మన పక్క సీట్లో ప్రయాణించే వాళ్ళని మనం నిర్ణయించుకోలేం కదా. అర్ధ రాత్రి కావడంతో బస్ లో అందరూ మాంచి నిద్రలో ఉన్నారు. నేను నిద్రపోక పోడాన్ని గమనించి కబుర్లు మొదలు పెట్టాడు ప్రేమ్. నేను కేవలం శ్రోతని.

అతని ప్రకారం, వాళ్ళిద్దరూ ఇంటర్ వేరు వేరు కాలేజీల్లో చదివారు. పరిచయం ఎక్కడ జరిగిందంటే, వాళ్ళ కేస్ట్ స్టూడెంట్స్ అందరూ వన భోజనాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు. ప్రేమ్ వాళ్ళింట్లో కేస్ట్ ఫీలింగ్ ఎక్కువ. ఇతనికేమో లవ్ మేరేజ్ చేసుకోవాలని కోరిక. వన భోజనాల దగ్గర అంబికని చూసి పరిచయం చేసుకున్నాడు. ఆ అమ్మాయి హాబీస్ అన్నీ నచ్చాయి మనవాడికి, ఆమె అభిమాన హీరో తప్ప. కేస్ట్ లో అంతమంది హీరోలుండగా, వేరే కేస్ట్ హీరోని అభిమానించడం మాత్రం అస్సలు నచ్చలేదు. ఫోన్ నెంబర్లు మార్చుకుని ఫ్రెండ్షిప్ మొదలు పెట్టారు.

ప్రేమ్ వాళ్ళింట్లో మనవాడే చివరివాడు. మమ్మీకి, డాడీకి ఇతనంటే ప్రాణం. కొత్త కార్ కొంటే మొదట ఇతను డ్రైవ్ చేయాల్సిందే. అంబిక ఇంట్లో కూడా పరిస్థితి సేం. రెండు ఫ్యామిలీల ఫైనాన్షియల్ పొజిషన్ దాదాపు ఒకటే. ఇంటర్ పూర్తయ్యేసరికి ప్రేమ్ కష్టపడి కష్టపడి ఆమె అభిమాన హీరోని మార్చగలిగాడు. ఇద్దరూ ఎంసెట్ రాశారు. మనవాడు పోరుగురాష్ట్రాల సెట్లు కూడా రాశాడు. అంబికకి మెరిట్లో సీట్ వచ్చింది. అది కూడా దగ్గర కాలేజీలో.హీరోకేమో పొరుగు రాష్ట్రంలో డొనేషన్ సీట్.

ఇద్దరిదీ ఒకటే గ్రూప్ కావడంతో, అంబిక ఫోన్ చేసినప్పుడల్లా సబ్జక్ట్ విషయాలే ఎక్కువ మాట్లాడుతోంది. ప్రేమ్ డైవర్ట్ చేస్తున్నాడు. సెం (సెమిస్టర్) ఎగ్జామ్స్ లో ప్రేమ్ కన్నా తనకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. అసలు ప్రాబ్లం ఏమిటంటే, ప్రేమ్ చదువుకుందామని పుస్తకం తీసేసరికే అంబిక ఫోన్ చేస్తోంది. చాలాసేపు మాట్లాడుకోవడం నేచురల్ కదా.. అలా మాట్లాడి మాట్లాడి తర్వాత ప్రేమ్ నిద్ర పోతున్నాడు. అంబికేమో ఎప్పుడు చదివేస్తోందో, చదివేస్తోంది. ప్రేమ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ వాళ్ళ గాళ్ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి.

ఓ టూ యియర్స్ లో ఇద్దరి స్టడీస్ అయిపోతాయ్. ఇద్దరికీ కేంపస్ వస్తుంది. ప్రేమ్ కి ఫారిన్ వెళ్ళడం ఇష్టం. గ్రీన్ కార్డ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. కానీ, అంబిక కి ఫారిన్ వెళ్ళడం ఇష్టం లేదు. ఇక్కడే ఉందాం అంటుంది. తనని కన్విన్స్ చేయగలనని ప్రేమ్ కి కాన్ఫిడెన్స్ ఉంది. కానైతే ఓ ప్రాబ్లెం వచ్చింది. ప్రేమ్ వాళ్ళ మమ్మీ ఇతనికి మామయ్య కూతురుతో పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తోంది. డాడీకి కూడా అభ్యంతరం ఏమీ లేదు. ఆ అమ్మాయి బాగుంటుంది కానీ, ఇంజనీరింగ్ చదవడం లేదు. పైగా విలేజ్ లో ఉంటారు వాళ్ళు. ...ఇదీ ప్రేమ్ సమస్య.

నేను తను చెప్పేది ఊ కొడుతూ, ఇంగ్లిష్ లో పదాలు, వాక్యాలు తప్పులు మాట్లాడుతున్నప్పుడల్లా నిర్మొహమాటంగా సరి చేస్తూ, మొత్తం స్టోరీ పూర్తి చేయనిచ్చాను. రెండేళ్ళ నుంచి పొరుగు రాష్ట్రంలో ఉంటున్నా మాటల్లో గోదారి యాస పూర్తిగా పోలేదు. చెప్పొద్దూ, ఆ కుర్రోడి కాన్ఫిడెన్స్ చూసి భలే ముచ్చటేసింది. సదరు అంబిక ఇతగాడితో ఎందుకు స్నేహం చేస్తోందో (తను ఏమేం గిఫ్ట్స్ ఇచ్చిందో కూడా చెప్పేశాడు) నాకు అర్ధం కాలేదు.

మరి నాకంత పెద్ద మనిషి హోదా ఇచ్చినందుకు నేను ఏదో ఒకటి చెప్పాలి కదా. అందుకని, "లెట్స్ సీ, ఇప్పుడే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా.. ఇంకో టూ యియర్స్ లో ఏమన్నా జరగొచ్చు," అన్నాను, ఏమీ తేల్చకుండా. నిజానికి నాకు అంతకన్నా ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాలేదు. "సమస్య లేదు. నేను చెప్తే ఎవరైనా కన్విన్స్ కావాల్సిందే" అన్నాడు ధీమాగా. మొదట్లో తరచుగానూ, తర్వాత అప్పుడప్పుడూ ఆ కుర్రాడు గుర్తొచ్చే వాడు. చాన్నాళ్ళ తర్వాత ఇవాళెందుకో మళ్ళీ గుర్తొచ్చాడు. రెండేళ్ళు అయ్యింది కదా. అతని కథ ఏమై ఉంటుందా అని ఆలోచన...

బుధవారం, జూన్ 22, 2011

గురజాడ కథానికలు

'తొలి' అనడంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత కూడా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని తొలి అడుగులని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా తర్వాతి ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించ వచ్చు. ఆ ప్రయాణం ఓ వ్యక్తిది కావొచ్చు, సంస్థది కావొచ్చు లేదా ఓ సాహిత్య ప్రక్రియది కావొచ్చు. తెలుగునాట వ్యవహారిక భాషలో కథానికా రచనకి శ్రీకారం చుట్టిన గురజాడ అప్పారావు తన జీవిత కాలంలో వెలువరించిన నాలుగు కథానికలు, ఓ నవల తాలూకు స్కెచ్ తో విశాలాంధ్ర వెలువరించిన చిరు పుస్తకం 'గురజాడ రచనలు-కథానికలు .'

తెలుగులో తొలి ఆధునిక కథ లేదా వ్యవహారిక భాషలో తొలి తెలుగు కథానిక 'దిద్దుబాటు.' ఇది 'ఆంధ్ర భారతి' పత్రిక 1910, ఫిబ్రవరి సంచికలో ప్రచురితమయ్యింది. 'కన్యాశుల్కం' నాటకం తర్వాత, గురజాడ చేపట్టిన అనేక సాహితీ ప్రక్రియలలో ఈ కథానికా రచన ఒకటి. 'కన్యాశుల్కం' మాదిరే, ఈ కథానికల అంతిమ లక్ష్యమూ సంఘ సంస్కారమే. సంఘంలో పేరుకున్న చెడుని ఎత్తి చూపడం ద్వారా, విద్యావంతులని సన్మార్గంలోకి తేవాలన్న గురజాడ ప్రయత్నం కథానికల్లోనూ కనిపిస్తుంది.

వేశ్యా వృత్తిని నేపధ్యంగా తీసుకుని రాసిన ఈ కథానికలో ప్రధాన పాత్ర 'కమలిని.' చెడు మార్గం పట్టిన తన భర్త గోపాలరావుని ఆమె ఎలా 'దిద్దుబాటు' చేయగలిగిందన్నది కథ. ఇక్కడ చదవొచ్చు. అయితే ఈ 'దిద్దుబాటు' కి తనే దిద్దుబాటు చేసి సవరించిన కథానికను 'కమలిని' పేరిట విడుదల చేశారు గురజాడ. ఈ రెంటినీ చదవడం ద్వారా వ్యావహారిక భాషని ఉపయోగించే విషయంలో రచయిత శ్రద్ధని గమనించ వచ్చు. కథని మరికొంచం విస్తరించడంతో పాటు, సంస్కృత సమాసాలని పరిహరించి, మొత్తం కథకి వ్యావహారికాన్నే ఉపయోగించడం ఈ సవరించిన కథానిక ప్రత్యేకత.


పడుపు వృత్తినే నేపధ్యంగా తీసుకుని రాసిన మరో కథానిక 'సంస్కర్త హృదయం.' తమని తాము సంస్కర్తలు గా చెప్పుకునే వారి బోలుతనాన్నీ, వారి వ్యక్తిత్వ లోపాలనీ సున్నితంగా ఎత్తి చూపారు గురజాడ. కథానాయిక సరళ నగరంలో పేరు మోసిన వేశ్య. చదువు సంస్కారం ఉన్న అమ్మాయి, 'కన్యాశుల్కం' నాయిక మధురవాణి లాగా. కాలేజీ ప్రొఫెసర్ రంగనాధయ్యరు 'యాంటీ నాచ్' ఉద్యమం లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు. నగరంలో 'ప్రోనాచ్' 'యాంటీ నాచ్' ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటూ ఉంటుంది. ఒకానొక ప్రోనాచ్ విద్యార్ధి, భూస్వామి కొడుకూ అయిన చందర్ సరళ ని రంగనాధయ్యరు మీద ప్రయోగించడమే కథాంశం.

శైవం-వైష్ణవాల మధ్య తారా స్థాయిలో ఉన్న విభేదాలని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథానిక 'మీ పేరేమిటి?' నాంచారమ్మ అనే విద్యావంతురాలైన శ్రీవైష్ణవ గృహిణిది బలమైన పాత్ర ఇందులో. "ఈ దేశంలో పాండవులు ఉండని గుహలూ, సీతమ్మవారు స్నానమాడని గుంటలూ లేవు" అంటారు రచయిత, కథా స్థలాన్ని పరిచయం చేస్తూ. శివ మతానికి మొనగాడు జంగం శరభయ్య తనని తాను నందికేశ్వరుడి అవతారంగా ప్రచారం చేసుకుంటే, వైష్ణవ ప్రచారకుడు సాతాని మనవాళ్ళయ్య తాను గరుడాళ్వారి అంశగా చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు. బుద్ధుడిని శ్రీమహావిష్ణువు పదో అవతారం అన్న వాళ్లకి, యేసు క్రీస్తుని పదకొండో అవతారంగా చెయ్యడానికి సాధ్యం కాలేదంటారు గురజాడ.

మతం ఇతివృత్తంగా రాసిన మరో కథానిక 'మతము: విమతము" నిడివిలో చాలా చిన్నదే అయినా, చాలాసేపు ఆలోచింపజేసేది. ముఖ్యంగా ముగింపు వాక్యం. గురజాడ కలలు కన్న మరో సంఘ సంస్కారం భార్య భర్తల మధ్యన వయోభేదం ఎక్కువ ఉండకుండా ఉండడం. 'మెటిల్డా' కథానిక ఈ అంశాన్ని గురించే. ముసలి భర్త అనుమానం జబ్బు కారణంగా ఇబ్బందులు పడే పడుచు మెటిల్డా కథ ఇది. అసంపూర్తిగా అనిపించిన స్కెచ్ 'సౌదామిని.' గురజాడ దీనిని పూర్తి చేసి ఉంటే తెలుగు నాట మరో మంచి నవల అయి ఉండేది అనిపించింది, ఆయన సిద్ధ పరచిన పూర్వరంగాన్ని చదివాక.

ఈ కథానికల తో పాటుగా గురజాడ జీవిత విశేషాలనీ, అరుదైన ఛాయా చిత్రాల్నీ, సెట్టి ఈశ్వరరావు రాసిన రెండు వ్యాసాలనీ జత పరిచారు ప్రచురణ కర్తలు. 'ఆధునిక భాషా సాహిత్యాల యుగకర్త' అనే వ్యాసంలో, తెలుగు సాహిత్యం పురుడు పోసుకున్నది మొదలు, గురజాడ శకం వరకూ పరిణామ క్రమాన్ని విశదంగా రాశారు ఈశ్వర రావు. ఇక రెండో వ్యాసం 'మొట్టమొదటి ఆధునిక కథలు' సంకలనం లోని కథానికల పరిచయం. ఇది క్లుప్తంగా సాగింది. కథా సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం. (పేజీలు 88, వెల రూ.40, విశాలాంధ్ర అన్ని శాఖలూ).

మంగళవారం, జూన్ 21, 2011

నాతో నేను 'వేణూ శ్రీకాంత్' గురించి...

ఇప్పుడంటే 'విరామం' ఇచ్చేశారు కానీ, అబ్బో నిన్న మొన్నటివరకూ ఎన్నెన్ని కబుర్లు చెప్పే వారో వేణూ శ్రీకాంత్. ఆ చెప్పడం కూడా, ఏదో చెప్పేశాంలే అన్నట్టుగా కాకుండా, చక్కగా, వివరంగా, అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా చెప్పడం మన 'నాతో నేను నా గురించి...' బ్లాగర్ వేణూ శ్రీకాంత్ గారి ప్రత్యేకత. ఎలాంటి క్లిష్టమైన విషయాన్నైనా ఈయన రాశారంటే మనకింక అర్ధం కాకపోవడం అనే సమస్య ఉండదు.

చేసిన పాపం చెబితే పోతుంది అంటారు కదా.. అందుకని చెప్పేస్తాను. నేనీ బ్లాగుని కొంచం ఆలస్యంగా కనుగొన్నాను. ఉహు, ఇంకోలా చెప్పాలంటే, ఈ బ్లాగుని నేను మొదటగా అంతర్జాలంలో కాక 'ఆంధ్రజ్యోతి' లో చూశాను. అప్పుడే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. బ్లాగులో మొదట చదివిన టపా అయితే 'పాట్ లక్.' మన బంగాళా దుంపలు లేవూ, అవేనండీ పొటాటోస్, వాటిని నేతిలో వేయించేసి, కొత్త డిష్ గా తెల్లోళ్ళకి పరిచయం చేసి లొట్టలేయించేసిన తెలివి తేటలు చూసి, సాటి తెలుగు వాడిగా భలే గర్వపడిపోయాను.

నేను చేసిన పాపం ఒకటే అనుకుంటున్నారు కదూ? అబ్బే అస్సలు కాదు. ఎలాగూ కన్ఫెషన్ మొదలెట్టేశాను కాబట్టి ఇంకో విషయం కూడా చెప్పేస్తాను. "అసలు వేణూ శ్రీకాంత్ అనే పేరు ఉంటుందేమిటి? ఈయనెవరో, మంచి కలం పేరే సెలక్ట్ చేసుకున్నారు" అనుకున్నాను మొదట్లో. (అన్నట్టు నా నిజ్జం పేరు కూడా మురళినే, గమనించ ప్రార్ధన.. ఎవరో అక్కడ గుమ్మడికాయల్ని గుర్తు చేసుకుంటున్నారు, నాకు తెలిసిపోతోంది). కానైతే, ఈయన బ్లాగులో అలా అలా వెనక్కి వెళ్లి, వెళ్లి మొదటి టపా దగ్గర ఆగితే తెలిసింది, నేనెంత పొరపాటుగా ఆలోచించానో. కొన్ని పాపాలకి నిష్కృతులు ఉంటాయో, ఉండవో మరి.

"ఇది పూర్తిగా నా స్వ-గతం, నాతోనేను నాగురించి చెప్పుకునే కబుర్లు. నేను మరచిపోక ముందే ఎక్కడైనా భద్రపరచుకోవాలనీ చిన్ని ప్రయత్నం.... "బాల్యం నీ తోడుగా ఉంటే వృద్ధాప్యం నీ దరిచేరదు" అంటారు కదా!!" ..ఇది వేణూ శ్రీకాంత్ గారి బ్లాగు టాగ్ లైన్. వయో వృద్దులనీ, పుట్టుకతో వృద్దులనీ కూడా ఏకకాలంలో బాల్యంలోకి తీసుకెళ్ళి పోగల శక్తి ఈయన బాల్య జ్ఞాపకాలకి ఉంది. స్కూలు కబుర్ల మొదలు, బ్రిటానియా బిస్కట్లు, పుల్లైసుల వరకూ ఎన్నెన్ని కబుర్లో.

ఇక, నూనూగు మీసాల నూత్న యవ్వనమున చేసిన సాహసాలకి లోటే లేదు. విజయవాడ హాస్టల్ కానివ్వండి, విశాఖపట్నం ఆంధ్ర విశ్వకళా పరిషత్తు విద్యార్ధి వసతి గృహం కానివ్వండి.. మగ పురుషులైతే వాళ్ళని వాళ్ళు అద్దం లో చూసుకున్నట్టుగా ఆ టపాల్లో చూసేసుకుంటారు అంతే. తాను దేవదాసు కాబోయిన వైనాన్ని వర్ణిస్తూనే, బాధ్యతాయుతంగా ఒక డిస్క్లైమర్ పెట్టడం చూడగానే వెతుక్కుంటూ వెళ్లి కరచాలనం చేసి రావాలని అనిపించింది.. కానీ బెంగుళూరు ప్రయాణం అంటే మాటలా?

"ఆశావాదం, కాస్త భావుకత ?(ఈ మధ్య కొన్ని తెలుగు బ్లాగులు చదివాక నా భావుకత నాకే ప్రశ్నార్ధకం గా కనిపిస్తుంది), కాసిన్ని పగటికలలు, దేవుడి పై నమ్మకం, తెలుగు పై అపారమైన మక్కువ కలగలిసిన ఒక సగటు మనిషిని," అంటూ తన గురించి చెప్పుకున్నారు వేణూ శ్రీకాంత్. కానైతే, ఈ బ్లాగు చూసిన వాళ్లకి వాళ్ళ వాళ్ళ భావుకత ప్రశ్నార్ధకం కావడం మాత్రం ఖాయం. 'సంగీతం, సాహిత్యం, సినిమాలు' ఇవి కేవలం తన ఒక్కరి అభిరుచులే కాదు, నావి కూడాను. అందుకేనేమో, కొన్ని కొన్ని సార్లు తన టపాలు చదువుతుంటే "అచ్చం నాలాగే ఆలోచించారే!" అని ఆశ్చర్య పడుతూ ఉంటాను.

కాఫీ మొదలు కథల వరకూ కొన్ని విషయాల్లో మా ఆలోచనలు ఒకటే. కాకపొతే తనకి కాఫీ చేయడం వచ్చు, నాకు అంత బాగా రాదు. మొదట్లో నచ్చిన పాటల గురించి ఈ బ్లాగులోనే రాసేవారు కానీ, తర్వాత కేవలం పాటల కోసమే ఓ కొత్త బ్లాగు మొదలు పెట్టేశారు. చిన్నని, సన్నని దరహాసాలతో వేణూ శ్రీకాంత్ గారి టపాలు చదవడానికి అలవాటు పడ్డ నేను రెండు టపాలు చదివి అప్రయత్నంగానే కంట తడి పెట్టుకున్నాను. 'నేనున్నాను' అని చెప్పలేని పరిస్థితి. చెప్పినా సరిపోదు కూడా. అన్నట్టు ఈ గుంటూరు జిల్లా వాస్తవ్యుడికి కారంపూడి ఊరన్నా, తీయగా పాడే/మాట్లాడే సునీత అన్నా ప్రత్యేకమైన ఇష్టం.

మరి, ఇలాంటి బ్లాగు నుంచి టపాలు ఆగిపోతే చూస్తూ ఊరుకోలేం కదా? అందుకని అడగ గలిగిన విధంగా అడిగేశాను. "నాగురించి చెప్పుకోవాల్సిన కబుర్లు ప్రస్తుతానికి ఏం గుర్తురావడం లేదండీ.. వచ్చిన మరుక్షణం మళ్ళీ వచ్చేస్తాను.." అన్నది ఆయన సమాధానం. ప్రస్తుతం మాత్రం బజ్ లో వీర విహారం చేసేస్తున్నారు. "బ్లాగు తల్లి లాంటిది.. బజ్జు ప్రియురాలు లాంటిది" అన్నది నేను కొత్తగా కనిపెట్టిన సామెత. (ఎలా ఉంది?) ...కాబట్టి వేణూ శ్రీకాంత్ గారు తొందర్లోనే మళ్ళీ బ్లాగులోకి వచ్చేస్తారని నా ఆశ, కోరిక, నమ్మకం, అన్నీను.

సోమవారం, జూన్ 20, 2011

ఇట్లు, మీ విధేయుడు

పుస్తకాల షాపుకి వెళ్ళినప్పుడు ఊరికే పైపైన డిస్ప్లే లో ఉన్న పుస్తకాలు చూసేసి ఊరుకోకుండా, రాకుల్లో సద్దేసిన పుస్తకాలని కూడా తీరికగా, ఓపిగ్గా చూస్తూ ఉండాలి.. ఏమో, ఎవరికి తెలుసు. "అగాధమౌ జలనిధి లోన ఆణిముత్యమున్నటులే.." అట్టడుగు రాకుల్లో మనం ఎన్నాళ్ళుగానో వెతుకుతున్న పుస్తకం దొరకవచ్చు. ఆమధ్యన నాకలాగే దొరికింది, భమిడిపాటి రామగోపాలం రాసిన 'ఇట్లు, మీ విధేయుడు' పుస్తకం. ఇప్పటికి సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గెలుచుకున్న కథా సంపుటం.

భరాగోగా తెలుగు పాఠకులకి చిరపరిచితుడైన భమిడిపాటి రామగోపాలం చాలా సీరియస్ కథలు రాసినప్పటికీ, ఆయనకి హాస్య రచయితగానే ఎక్కువ గుర్తింపు వచ్చింది. హాస్యానికి ఉన్న ఆకర్షణ అలాంటిది మరి. 1990 లో యాభై రెండు కథలతో వచ్చిన ఈ సంకలనం 2001 నాటికి ముప్ఫై తొమ్మిది కథలకి చిక్కిపోయింది. అయితేనేం, సంకలనానికి బయట ఉన్న కథలు చాలా వరకు చదివేసినవే కావడం కొంత ఊరట.

సంకలనం లో మొదటి కథ 'వెన్నెల నీడ.' ముళ్ళపూడి వెంకట రమణకి ఇష్టమైన కథ, ఆయన ఎప్పటికైనా సినిమా తీయాలనుకున్న కథ. ఇప్పుడు రాసినాయనా, సినిమా తీయాలనుకున్నాయనా కూడా మన మధ్యన లేరు. కథానాయిక శ్యామలకి పెళ్లై ఏడేళ్ళయ్యింది. ఇద్దరు పిల్లలు. భర్త కలెక్టరాఫీసులో గుమస్తా. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు శ్యామలనీ, పిల్లలనీ. భర్తా, పిల్లలతో పుట్టింటికి వెళ్లి తిరిగి వస్తుండగా రైల్లో కనిపించిన ఒకతన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది శ్యామలకి.

అతను కొంచం మొహమాట పడుతుంటే తనే మాట కలిపి, ఎక్కడ కలిశామని అడుగుతుంది. పూర్వాశ్రమంలో ఆమెని పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చిన పెళ్ళికొడుకు అతను. ఆస్తి పరులు కాదని అ సంబంధం వద్దనుకున్నారు శ్యామల పెద్దవాళ్ళు. అతను ప్రస్తుతం "ఒంగోల్లో సబ్-కలెక్టర్ గా" ఉంటున్నాడు, త్వరలో కలెక్టరూ అవుతాడు. తర్వాత ఏం జరిగిందన్నదే అసలు కథ. అన్నట్టు ఇది 'వంశీకి నచ్చిన కథ' కూడా. సంకలనం ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క కథా చాలేమో.



మెజారిటీ కథల్లో ఇతివృత్తం మధ్యతరగతి జీవితమే. 1960 లో మొదలు పెట్టి, తర్వాతి ముప్ఫై ఏళ్ళ కాలంలో సమాజంలో వచ్చిన మార్పులని మధ్య తరగతి దృక్కోణం నుంచి రికార్డు చేశారు భరాగో ఈ కథల ద్వారా. కథా నాయకులు గవర్నమెంట్ ఆఫీసులో గుమాస్తాలు, కింది స్థాయి అధికారులు, తప్పితే కలెక్టర్లు. నిజానికి కలెక్టర్ల కథల కన్నా, గుమాస్తాల కథలే బాగా చెప్పారని అనిపించింది. ఈ చట్రానికి బయట ఉన్న కథలూ ఉన్నాయి.

భరాగో పేరు చెప్పగానే గుర్తొచ్చే కథల్లో మొదటి వరుసలో ఉండేది 'వంటొచ్చిన మొగాడు' లో కథానాయకుడు రామనాధం తనకి వంట వచ్చిన ఏకైక కారణంగా ఎదుర్కొన్న చిన్న చూపుని సరదా సరదాగా చెప్పారు. గంభీరంగా సాగే కథ 'త్రివర్ణ చిత్రం.' ఓ భార్య, భర్త, వాళ్ళకో స్నేహితుడు. అతనెవరో కాదు, ఆమెని ప్రేమించి కులం ఒకటి కాని కారణంగా పెళ్లి చేసుకోలేక పోయిన వాడు. అయినప్పటికీ వాళ్ళు ముగ్గురూ స్నేహితులే. కానీ ఆ ముగ్గురిలో ప్రతి ఒక్కరికీ మిగిలిన ఇద్దరిమీదా ఒక లాంటి అనుమానం. బుచ్చిబాబు 'నిరంతరత్రయం' కథని గుర్తు చేసే కథ ఇది.

చదివాక చాలా కాలం పాటు వెంటాడే కథల్లో మొదట ఉండేది 'మనోధర్మం.' శ్రీపాద వారి 'కలుపు మొక్కలు' తో కేవలం రేఖామాత్రంగా పోలిక ఉన్న కథ ఇది. సరస్వతి పాత్రని మర్చిపోవడం అంత సులువు కాదు. ఓ హెన్రీ తరహా మెరుపు ముగింపు 'వై డోంట్యూ మేరీ మీ' 'పడమటి గాలి' 'చక్రం' లాంటి కథల్లో కనిపిస్తుంది. 'గతి తప్పిన కరుణ' కథ చదువుతుంటే వడ్డెర చండీదాస్ రాసిన ఒకానొక కథ గుర్తొచ్చింది, పేరు గుర్తు రావడం లేదు. అయితే భరాగో ఈ కథని నడిపిన తీరు చాలా బాగుంది.

భరాగో కథ చెప్పే పధ్ధతి చాలా నిదానంగా, సాఫీగా ఉంటుంది. అలా అని బోర్ కొట్టదు. ఒకసారి చదవడం మొదలు పెడితే, అలా చదువుకుంటూ పోవడమే. చిన్న చిన్న వాక్యాల్లో జీవిత సత్యాలని మెరిపిస్తారు. "అబద్ధం అని తెలిసిపోయినంత మాత్రాన అందం నశించి పోయేటట్లయితే కావ్యాలు కాయితప్పడవలూ, ప్రబంధాలు పకోడీ పొట్లాలూ ఎప్పుడో అయిపోయి ఉండేవి.." పుస్తకం బరువుగానే ఉన్నప్పటికీ పేజీలు (415) తేలికగా, వేగంగా కదిలిపోతాయి. అలా అని ఇవేవీ కేవలం కాలక్షేపం కథలు కావు కూడా. చినవీరభద్రుడు, మధురాంతకం రాజారాం, చందు సుబ్బారావుల సమీక్షలనీ పొందు పరిచారు ఈ సంకలనంలో. రచయితే ప్రచురించుకున్న ఈ సంకలనం అని పుస్తకాల షాపులతో పాటు, ఏవీకెఎఫ్ లోనూ దొరుకుతోంది. వెల రూ. 160.

ఆదివారం, జూన్ 19, 2011

మనమేంచేద్దాం?

ప్రస్తుతం భారతదేశంలో ఔషధ పరిశ్రమ టర్నోవరు ఏడాదికి అక్షరాలా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు. ఏ ఇతర పరిశ్రమల అభివృద్ధి గ్రాఫ్ లోనన్నా ఎగుడు దిగుళ్ళు ఉంటున్నాయేమో కానీ, ఈ పరిశ్రమ మాత్రం ఏటా ఇరవై శాతం వృద్ధి రేటుని నమోదు చేసుకుంటూ పైపైకి పోతోంది. అవును మరి, జనాభా పెరుగుతోంది, అనారోగ్యాలూ పెరుగుతున్నాయి. కొత్త కొత్తరోగాలకి కొత్త కొత్త మందులు కనిపెడుతూ ఈ పరిశ్రమ వెలిగిపోతోంది. ఫార్మసీ విద్య ఊపందుకుంది. భారతీయ ఫార్మసీ విద్యార్ధులకి ప్రపంచ దేశాల్లో డిమాండ్ పెరుగుతోంది.

ప్రపంచీకరణ పుణ్యమా అని అభివృద్ధి చెందిన దేశాలు తమ పరిశ్రమలని -- ముఖ్యంగా ఔషధ పరిశ్రమలని - భారత దేశంలో స్థాపించడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశాలు ఇక్కడ ఉండడమే మనమీద చూపిస్తున్న ప్రేమకి కారణం. ఔషధ పరిశ్రమల స్థాపన విషయంలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతూ ఉండడం మనకెంతో గర్వకారణం. అవును, ఈ పరిశ్రమలకి కావాల్సిన ముడిసరుకంతా ఇక్కడ చౌకగా దొరుకుతుంది, ప్రయోగాలు చేసే మెదళ్ళు కలిగిన నిపుణులతో పాటు ప్రయోగాలూ చేయించుకునే శరీరాలున్న అభాగ్యుల వరకూ.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ కి చెందిన కొందరు నిరక్షరాస్యుల శరీరాల మీద హైదరాబాద్ కి చెందిన ఒక ఔషధ పరిశ్రమ చేసిన ప్రయోగాలు ఈమధ్యనే వెలుగులోకి వచ్చాయి. పేపర్లు, టీవీలు వరుస కథనాల ద్వారా ప్రభుత్వంలో కొంత మేరకి చలనం రప్పించాయి. మంచిదే. కానీ, ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇలా జరగడం ఇదే మొదటి సారి కాదు. ఇంకా చెప్పాలంటే, గడిచిన పదేళ్ళ కాలంలో కేవలం మన రాష్ట్రంలోనే ఏడాదికి ఒకటి రెండు ఉదంతాలకి తక్కువ కాకుండా వెలుగు చూస్తూనే ఉన్నాయి.

మెజారిటీ కేసుల్లో, పరిశోధనల కోసం ఉపయోగ పడుతున్న వారికి తమ శరీరాలపై జరిగే ప్రయోగాలను గురించి కనీస అవగాహన లేదు. ఇందుకు కారణం వాళ్ళ అజ్ఞానం, నిరక్షరాస్యత. వాళ్ళనీ పనికి పురిగొల్పుతున్నవి ఆకలి, పేదరికం. స్వాతంత్రం వచ్చిన అరవైనాలుగేళ్ళ తర్వాత కూడా అపరిష్కృతంగా ఉండిపోయిన రెండు సమస్యలు. మనమిప్పుడు మన ఔషధ పరిశ్రమలు సాధిస్తున్న వృద్ధి రేటుని చూసి గర్వ పడాలా? లేక, తమ శరీరాలు ప్రయోగ శాలలుగా మారుతున్న విషయం కూడా తెలియకుండా, కేవలం ఆకలితో పోరాటం కోసం గినీ పిగ్స్ గా మారుతున్న మనవాళ్ళని చూసి సిగ్గు పడాలా?

ఇదొక్కటేనా? వ్యవసాయంలోనూ మన వృద్ధి రేటు బాగుంది. రైతుల కష్టానికి ప్రకృతి సహకారం తోడవ్వడంతో మంచి దిగుబడి వచ్చింది. రెండువేల పదో సంవత్సరంలో భారత దేశంలో ఉత్పత్తైన మొత్తం ఆహారధాన్యాలు రెండువందల ముప్ఫై ఐదు మిలియన్ టన్నులు. వ్యవసాయానికి సంబంధించి ఇది కొత్త రికార్డు. వ్యవసాయ ప్రధానమైన మన రాష్ట్రానికీ ఈ రికార్డులో భాగం ఉంది. మరి ప్రస్తుతానికి వస్తే? పత్తి రైతులకి విత్తనాలు దొరకడంలేదు. వరి పండించే రైతులు గిట్టుబాటు ధర లేక 'క్రాప్ హాలిడే' కి సిద్ధ పడుతున్నారు. గత దిగుబడిని చూసుకుని గర్వ పడాలా? భవిష్యత్తుని గురించి ఆందోళన చెందాలా?

ప్రతిష్టాత్మకమైన జాతీయ సాంకేతిక విద్యాలయాల్లో సీట్లు సంపాదిస్తున్న తెలుగు విద్యార్ధుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. జాతీయ స్థాయిలో ఏ పోటీ పరీక్ష జరిగినా విజేతల జాబితాలో మనవాళ్ళకి చోటుంటోంది. మరో పక్క, పదేళ్ళ క్రితం నమోదైన జననాల జాబితాకీ, ఇప్పుడు బళ్ళో ఉన్న పదేళ్ళ వయసు పిల్లల జాబితాకీ పొంతన కుదరడం లేదు. బళ్ళో లేని పిల్లలందరూ బాలకార్మికులే అన్న ప్రభుత్వ ఉవాచ ప్రకారం చూస్తే, బాలకార్మిక వ్యవస్థని పెంచి పోషించడంలో మనది రికార్డు. మరో పక్క విద్యార్ధుల ఆత్మహత్యలూ పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయ్. మనవాళ్ళ విజయాల్ని చూసి కాలరెత్తు కోవాలా? ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలని చూసి ఆవేదన చెందాలా?

హిందీ చిత్ర పరిశ్రమ తర్వాత, దేశంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఏటా పెద్ద సంఖ్యలో సినిమాలు నిర్మిస్తున్నది మన తెలుగు సినిమా పరిశ్రమే. ఏడాదికి కనీసం ఒకటి రెండన్నా రికార్డు స్థాయిలో వసూళ్లు తెచ్చే సినిమాలని అందిస్తూ, వేలాది మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి చూపిస్తోంది. కథానాయకుడు మినహా, మిగిలిన పాత్రలకి దేశంలో ఏ మూల ఉన్న కళాకారుల్నైనా తీసుకోగల, అంగీకరించగల ఔదార్యం కూడా మనసొంతం. అలాగే ఎన్ని కొత్త టీవీ చానళ్ళు వచ్చినా వద్దనకుండా ఆదరిస్తాం మనం. కానీ, సమాజంలో పెరుగుతున్న హింసకీ, ఆడపిల్లలపై పెరుగుతున్న దాడులకీ పరోక్ష కారణం కూడా ఈ సినిమాలు, చానళ్ళేనన్నది కాదనలేని నిజం. ...మళ్ళీ అదే ప్రశ్న, గర్వ పడాలా? సిగ్గు పడాలా?

శనివారం, జూన్ 18, 2011

ఉద్వేగాలు

పాతికేళ్ళ క్రితం మాట. ఒక వేసవి మధ్యాహ్నం ఇల్లు సద్దుతూ ఉండగా యువో, జ్యోతో గుర్తు లేదు కానీ అప్పటికే పాతబడ్డ పుస్తకం కనిపిస్తే పేజీలు తిప్పడం మొదలు పెట్టాను. 'ఉద్వేగాలు' అన్న పేరు చూసి ఆగాను. కథకి బాపూ గీసిన బొమ్మ ఇంకా జ్ఞాపకం ఉంది. 'పాప' అన్న పేరు చూసి ఎవరో రచయిత్రి అనుకున్నాను. కథ మాత్రం చాలా బాగా గుర్తుండి పోయింది. నలుగురి ఎదుటా కన్నీళ్లు పెట్టుకోడాన్ని చిన్నతనంగా భావించే ఓ అన్నగారూ, అందుకు ఏ మాత్రం సంశయించని ఓ చెల్లెలి కథ ఇది.

అదేదో టీవీ ప్రోగ్రాం లోలాగా 'కట్ చేస్తే..' ..రెండేళ్ళ క్రితం పుస్తకాల షాపులో 'పాలగుమ్మి పద్మరాజు రచనలు మొదటి సంపుటం' కనిపిస్తే ఆసరికే 'గాలివాన,' 'పడవ ప్రయాణం' లాంటి కొన్ని కథలు చదివి ఉండడంతో రెండో ఆలోచన లేకుండా పుస్తకం తీసేసుకున్నాను. ఇంటికొచ్చి వరుసగా ఒక్కో కథా చదువుతూ మూడో రోజుకి ఏడో కథకి వచ్చాను. పద్మరాజు కథల్ని వరస పెట్టి గబగబా చదివేయడం అసంభవం అన్నది ఆయన కథలు చదివిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే.

ఇంతకీ సదరు ఏడో కథ మరేదో కాదు, 'ఉద్వేగాలు.' టైటిల్ మొదలు, కథ ఆసాంతమూ, చదువుతున్నంత సేపూ ఆ పాత కథే గుర్తొచ్చింది. కొంచం ఆలోచించాక లైటు వెలిగింది, 'పాప' అన్నది పాలగుమ్మి పద్మరాజు సంక్షిప్త నామమని. ఇన్నాళ్ళ పాటు గుర్తుండి పోయిన ఈ కథ అంత పెద్దదేమీ కాదు కేవలం ఆరు పేజీలు. ఎందుకు గుర్తుండి పోయిందో ఇదమిద్దంగా చెప్పడం కష్టం కాబట్టి కథేమిటో క్లుప్తంగా చెబుతాను.

రాజిగాడికి తొమ్మిదేళ్ళ వయసప్పుడు, వాడి చెల్లెలు శేషి కి ఐదేళ్ళు. ఉద్వేగాలని ప్రదర్శించే వాళ్ళంటే రాజిగాడికి చిరాకు. వాడికీ కన్నీళ్లు వస్తాయి కానీ వాటిని బయటికి ప్రదర్శించడు. పిల్లలిద్దరికీ అమ్మమ్మ ఇల్లు అలవాటే కాబట్టి, వాళ్లనక్కడ వదిలేసి, రాజిగాడి తల్లీ తండ్రీ తీర్ధ యాత్రలకి వెళ్తారు. శేషిని ముద్దు చేస్తూ వాళ్ళత్త "అలంకరించుకోవే కోడలా అత్తవారింటికి వెళ్ళాలి" అనే పాట నేర్పుతుంది. ఆపాట పాడుకుంటూ ఆడుకుంటున్న శేషి, వారం రోజులు గడిచేసరికి అమ్మ కోసం బెంగ పెట్టుకుంటుంది. ఓదార్చడు రాజిగాడు.

శేషికి జ్వరం రావడంతో తంతి ఇచ్చి తల్లిదండ్రులని రప్పిస్తారు. శేషిని చూసి బావురుమంటుంది వాళ్ళమ్మ. "శేషి అంటే చిన్న పిల్ల. అమ్మ ఎందుకు ఏడవాలి?" అంటూ తల్లిమీద కోపగించుకుంటాడు రాజుగాడు. కాలక్రమంలో శేషి 'శేషు' అవుతుంది. వాళ్ళాయన అలాగే పిలుస్తాడు మరి. అతగాడు బారిస్టర్ పరీక్షకి ఇంగ్లండ్ బయలుదేరతాడు. కన్నీళ్ళని దాచుకోవడం చేతకాదు శేషుకి. వెళ్ళిపోతున్న రైలును చూస్తూ బావురుమంటుంది. అన్నగారిది ప్రేక్షక పాత్ర.

కాలం పరిగెత్తి పరిగెత్తి శేషుని కాస్తా శేషప్పని చేసేస్తుంది. అంతా బాగా జరుగుతుండగా, ఓ ఆడపిల్ల కలిగాక అకాల వైధవ్యం ప్రాప్తిస్తుంది ఆమెకి. అన్నగారింట చేరుతుంది. భర్త తాలూకు ఆస్తులు ఉండడంతో ఆర్ధిక ఇబ్బందులేవీ లేవు. కూతుర్ని పెంచి పెద్ద చేసి, ఓ యోగ్యుడికిచ్చిపెళ్లి చేస్తుంది. బీయే ప్యాసయిన ఆ కుర్రాడు బి.ఎల్. చదివే ఉద్దేశంతో మద్రాసులో కాపురం పెట్టదలచుకున్నాడు. కూతురిని విడిచిపెట్టి ఉండలేక, వాళ్ళతో పాటు తనూ మద్రాసు వెళ్తే బాగుండునని ఉంటుంది ఆవిడకి.

అత్తగారి ఉద్దేశం అల్లుడు గ్రహించినా, పైకి తేలడు. అల్లుడిని అలా అడగడం పధ్ధతి కాదని శేషప్ప అన్నగారి అభిప్రాయం. కూతురూ అల్లుడూ మద్రాసు బయలుదేరే వేళకి అల్లుడు ఎదురుగా ఉన్నాడన్న సంగతి కూడా మరచిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది శేషప్ప గారు. వాళ్లెక్కిన బండి వెళ్ళిపోయినా ఆవిడ ఏడుపు మాత్రం మానలేదు. అన్నగారిది ఎప్పటిలాగే ప్రేక్షక పాత్ర. "మనసులో ఉన్న విచారన్నంతా పైకి వదిలేయడం తప్పా?" అన్న ప్రశ్న మొదలవుతుంది ఆయనలో. (మొత్తం అరవై ఆరు కథలున్న ఈ సంకలనాన్ని విశాలాంధ్ర ప్రచురించింది. పేజీలు 499, వెల రూ. 250, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శుక్రవారం, జూన్ 17, 2011

సంసారం ఒక చదరంగం

కొన్ని సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు "అబ్బా.. సెంటిమెంట్" అనుకుంటాం. కానీ చూడడం మొదలు పెట్టగానే, మనకి తెలియకుండానే సినిమాలో పూర్తిగా లీనమైపోతాం. నేనలా లీనమైపోయే కుటుంబ కథా చిత్రాల్లో పాతికేళ్ళ క్రితం ఏవీఎం వారు నిర్మించిన 'సంసారం ఒక చదరంగం' ఒకటి. ఇదో మధ్య తరగతి మందహాసం. మన చేతికున్న ఐదువేళ్ళూ ఒక్కలా ఉండనట్టే ఏ కుటుంబంలోనూ సభ్యులందరూ ఒకేలా ఉండరు. విశాఖపట్నంలో కాపురం ఉండే స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అప్పలనరసయ్య కుటుంబ సభ్యుల మధ్యన వచ్చిన అభిప్రాయ భేదాలని, వాళ్ళు ఎలా పరిష్కరించుకున్నారన్నదే ఈ సినిమా.

నిర్మాణ విలువలకి పెట్టింది పేరైన ఏవీఎం సంస్థ నిర్మించిన ఈ సినిమాకి బలం కథ, కథనం, సమర్ధులైన నటీనటుల నటన. అక్కడక్కడా కనిపించే కూసింత నాటకీయతని మినహాయిస్తే, ఆద్యంతమూ సాఫీగా సాగిపోయే -- సినిమాని కాక మన ఇంటినో పక్కింటినో తెర మీద చూసుకుంటున్నామేమో అని ప్రేక్షకులకి సందేహం కలిగే -- విధంగా చిత్రించిన ఘనత ఎస్పీ ముత్తురామన్ ది. ముప్ఫయ్యేళ్ళ క్రితం కుటుంబ కథలకి పెట్టింది పేరైన దర్శక రచయిత విసు అందించిన కథకి అచ్చ తెలుగు సంభాషణలు అందించారు గణేష్ పాత్రో.

స్టీల్ ప్లాంట్లో రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న క్లర్క్ అప్పల నరసయ్య (గొల్లపూడి మారుతిరావు ) గోదావరి (అన్నపూర్ణ) దంపతులకి నలుగురు పిల్లలు. పెద్దబ్బాయి ప్రకాష్ (శరత్ బాబు) ఇండియన్ ఆయిల్ లో అకౌంటెంట్. ఆఫీసులోనే కాదు, ఇంట్లోనూ ప్రతి ఖర్చూ లెక్కగా జరగాలంటాడు. ఇంట్లో అందరికన్నా పెద్ద జీతగాడే అయినా వృధాఖర్చు నచ్చదు. అతని భార్య ఉమ (సుహాసిని) కల్మషం లేని మనిషి. నాఇల్లు, నావాళ్ళు అనుకునే తత్వం.

రెండో కొడుకు రాఘవ (రాజేంద్రప్రసాద్) ఓ ఫ్యాక్టరీలో చిరుద్యోగి. కూతురు సరోజ (కల్పన) డిగ్రీ చదివి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. చివరివాడు కాళిదాసు పదో తరగతి పరిక్షలు రాస్తూ, తప్పుతూ రాస్తూ ఉంటాడు. వీళ్ళతో పాటు నలభై ఏళ్ళుగా అ ఇంట్లో పని చేస్తూ ఇంటిమనిషి కన్నా ఎక్కువైన పనిమనిషి చిలకమ్మ (షావుకారు జానకి).సరోజని చూడ్డానికి ఓ పెళ్ళికొడుకు తన తండ్రి, చెల్లెలు వసంత (ముచ్చెర్ల అరుణ) లతో అప్పలనరసయ్య ఇంటికి రావడం సినిమాలో ప్రారంభ దృశ్యం. ఈ ఒక్క సన్నివేశం ద్వారా పాత్రల పరిచయంతో పాటు వారి వారి గుణగణాలనీ వాళ్ళ మధ్య అనుబంధాన్నీ కళ్ళకి కట్టేస్తాడు దర్శకుడు.

అప్పలనరసయ్య ఇంట్లో ఆనవాయితీగా పాడే పెళ్ళిచూపుల పాట 'జానకిరాముల కల్యాణానికి' పాడేస్తుంది సరోజ, తన ఆఫీసులో పని చేస్తున్నవాడూ, తన కన్నా ఓ అంగుళం పొట్టి వాడూ మరియూ అప్పటికే తను ప్రేమిస్తున్నవాడూ అయిన పీటర్ శామ్యూల్ ని ఊహించుకుంటూ. ప్రకాష్-ఉమ, అప్పలనరసయ్య-గోదావరిలు కూడా వాళ్ళ వాళ్ళ పెళ్లి చూపులు జ్ఞాపకం చేసేసుకుంటారు, పనిలో పనిగా. పెళ్ళికొడుకు తనకి నచ్చలేదని సరోజ తెగేసి చెప్పేయడంతో పెళ్ళివారు వెళ్ళిపోతారు.

వాళ్ళింటికి వెళ్లి క్షమాపణలు కోరిన అప్పలనరసయ్య, రాఘవ-వసంతల పెళ్లి నిశ్చయం చేసుకుని వస్తాడు. పీటర్-సరోజల పెళ్లి కాగానే రాఘవ-వసంతల పెళ్ళవుతుంది. గర్భవతి అయిన ఉమ పురిటికి పుట్టింటికి వెళ్ళడం, పీటర్-సరోజ, రాఘవ-వసంతల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఇటు సరోజ అటు వసంత పుట్టిళ్ళకి చేరడం, కాళిదాసు మళ్ళీ పరీక్ష తప్పడం ఒకేసారి జరుగుతాయి. రాఘవ వెళ్లి వసంతని కాపురానికి తీసుకు వస్తాడు. అలాగే పీటర్ వచ్చి తనని తీసుకు వెళ్తాడని పుట్టింట్లోనే ఉండిపోతుంది సరోజ.

ఇంటి ఖర్చు విషయంలో అప్పలనరసయ్య-ప్రకాష్ ల మధ్య వచ్చిన మాట పట్టింపు, ప్రకాష్ ఓ వాటాలోకి వెళ్లి పోడానికీ, ఇంటి మధ్యలో లక్ష్మణ రేఖ లాంటి ఓ రేఖ మొలవడానికీ కారణమవుతుంది. బిడ్డనెత్తుకుని వచ్చిన ఉమ, చిలకమ్మ సాయంతో సరోజ సమస్యని పరిష్కరించడం తో పాటుగా, కాళిదాసు చదువు కారణంగా రాఘవ-వసంతల మధ్య పెరుగుతున్న దూరాన్ని గమనించి దానిని తగ్గించడానికీ తెర వెనుక ప్రయత్నాలు చేసి విజయం సాధిస్తుంది.

తండ్రి-కొడుకుల మధ్యన అపార్ధాలు తొలగిపోయినప్పుడు మాత్రం, మళ్ళీ ఉమ్మడి కాపురానికి ససేమిరా అని, "కలిసి ఉండి రోజూ విడిపోవడం కన్నా విడిపోయి వారానికోసారి కలుద్దాం" అని ప్రతిపాదించి, వేరు కాపురానికి వెళ్ళడం సినిమా ముగింపు. గొల్లపూడి-సుహాసిని-శరత్ బాబు -రాజేంద్ర ప్రసాద్ లు ఈ సినిమాకి నాలుగు స్థంభాలు. వీళ్ళతో పాటుగా షావుకారు జానకి, పీటర్ తండ్రి ఎడ్మండ్ శ్యామ్యూల్ గా నటించిన నూతన్ ప్రసాద్ గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎక్కడా కూడా వీళ్ళెవరూ నటిస్తున్నారు అన్న భావన కలగని విధంగా చాలా సహజంగా కనిపించారు తెరమీద.

ఉమ, రాఘవలవి ఆదర్శ పాత్రలు. ప్రతి పాత్రకీ తనదైన ఐడెంటిటీ సినిమా మొదటి నుంచి చివరి వరకూ కొనసాగడం దర్శకుడి కృషే. అలాగే కథలో వచ్చే మలుపులకి సంబంధించి ఏ పాత్రనీ తప్పు పట్టలేం. ఏ పాత్ర దృష్టి కోణం నుంచి చూసినప్పుడు వాళ్ళు చేసిందే కరెక్ట్. ఇక మనసుని తాకే సన్నివేశాలు బోలెడు. ఉమ పురిటికి వెళ్ళే సన్నివేశం, రాఘవ-వసంతల హనీమూన్, భర్త గీసిన గీతని దాటిన గోదావరి అతనికి దొరికిపోవడం లాంటికి ఎన్నో. అలాగని హాస్యానికీ కొదవలేదు. ప్రారంభంలో వచ్చే పెళ్ళిచూపుల సన్నివేశం మొదలు, ఎడ్మండ్ శ్యామ్యూల్-చిలకమ్మల మధ్య వచ్చే సన్నివేశం, కాళిదాసు లేత ప్రేమకి భాష అడ్డంకిగా మారడం ఇవన్నీ అలవోకగా నవ్వించేవే.

సంభాషణల ద్వారా నేటివిటీని అద్దారు గణేష్ పాత్రో. వదినతో గొడవ పడ్డ సరోజ "వదినా నువ్వు వీరఘట్టం నేను విశాఖపట్నం. నువ్వు టెన్త్ క్లాసు నేను బీఎస్సీ" అంటుంది పొగరుగా. ఏ సంభాషణా కూడా మధ్య తరగతిని దాటి వెళ్ళదు. అలాగే చిలకమ్మ సంభాషణల్లో అచ్చమైన శ్రీకాకుళం మాండలీకం వినిపిస్తుంది. వాటిని చాలా సొగసుగా పలికిన షావుకారు జానకి కి 'ఉత్తమ సహాయ నటి' గా నంది అవార్డు లభించింది. చక్రవర్తి సంగీతంలో 'జానకి రాముల కల్యాణానికి' తో పాటు 'సంసారం ఒక చదరంగం' అనే నేపధ్య గీతం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

పాతికేళ్ళ క్రితానికే చివరి దశలో ఉన్న ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు అరుదుగా కూడా కనిపించడం లేదు. అంతే కాదు, అలా దశాబ్దాల పాటు ఓకే ఇంటిని అంటిపెట్టుకుని పనిచేసే పనిమనుషులూ ఇప్పుడు లేరు. అయినప్పటికీ ఈనాటికీ ఇది సమకాలీన సినిమానే. ఎందుకంటే మనుషుల మనస్తత్వాలలోనూ, ఆలోచనా విధానంలోనూ ఏమంత మార్పు రాలేదు కాబట్టి. ఉమ్మడి కుటుంబం అంటే ఏమాత్రం తెలియని వాళ్లకి ఓ మధ్యతరగతి ఉమ్మడి కుటుంబం ఎలా ఉండేదో చూపించడానికి బహుచక్కని ఉదాహరణ ఈ 'సంసారం ఒక చదరంగం.'

గురువారం, జూన్ 16, 2011

చే గువేరా మోటార్ సైకిల్ డైరీ

చే గువేరా.. హై సొసైటీ యువకుల టీషర్టుల మీది ఒకానొక డిజైన్ గా ఇప్పుడు చాలామందికి పరిచయం. వైద్యుడిగా, క్యూబా విముక్తి కోసం పోరాడిన వ్యక్తిగా, వివిధ హోదాల్లో క్యూబా అభివృద్ధి కోసం పనిచేసిన వాడిగా, అన్నింటికీ మించి అలుపెరుగని యాత్రీకుడిగా చే గువేరా ను గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువే. ముఖ్యంగా వైద్య విద్యార్ధిగా ఉన్న కాలంలో తన ఇరవైనాలుగో ఏట మిత్రుడు అల్బెర్టో తో కలిసి ఓ మోటర్ సైకిల్ పై చిలీ, పెరు, కొలంబియా, వెనిజులాల్లో ఏడు నెలల పాటు చేసిన యాత్ర సాహసోపేతమైనది.

ఎర్నెస్ట్ గువేరా ఆలోచనల్లో మార్పు తెచ్చి అతని జీవిత గతిలో మార్పు తెచ్చిన ఈ యాత్రా కాలంలో 'చే' రాసుకున్న నోట్సులూ, రాసిన లేఖల ఆధారంగా వెలువరించిన సంకలనానికి తెలుగు అనువాదం 'చే గువేరా మోటర్ సైకిల్ డైరీ.' నిజానికీ యాత్రకి పునాది గువేరా కన్న ఒక పగటి కల. "మనం ఉత్తరమెరికా ఎందుకు వెళ్ళకూడదు?" అన్న ప్రశ్న మొదలవ్వడం మొదలు, తన మోటర్ సైకిల్ 'లా రొడెరోసా' మీద ప్రయాణం ప్రారంభం అయ్యేంతవరకూ పేజీలు చక చకా తిరిగి పోతాయి.

సరదాగా మొదలైన ప్రయాణం మెల్లమెల్లగా గంబీరంగా మారుతుంది. ఈ యాత్రికులిద్దరికీ కొన్ని చోట్ల స్థానికుల నుంచి ఘన స్వాగతం లభిస్తే, మరి కొన్ని చోట్ల పట్టించుకునే వాళ్ళే ఉండరు. ఇక మోటర్ సైకిల్ పెట్టే ఇబ్బందులకైతే లెక్కే లేదు. పెద్దగా డబ్బు వెంట తీసుకెళ్లకుండా, దారిలో ఆగుతూ జనానికి వైద్యం చేయడం ద్వారా కొద్దో గొప్పో సంపాదిస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు చే గువేరా, అల్బెర్టోలు. ట్రక్ డ్రైవర్ మొదలు, పోలీసులు, సైనికాధికారుల వరకూ ఎందరో సహాయపడ్డారీ మిత్రులకి, యాత్రని పూర్తి చేయడంలో.


అనారోగ్యం, ప్రకృతి సహకరించక పోవడం లాంటి సమస్యలెన్నో ఎదురయ్యాయి. ఇక స్థానిక సమస్యలు సరేసరి. భాష, సంస్కృతికి మారిపోతూ ఉండడం, కొన్ని చోట్ల కొత్త వారిని అనుమానంగా చూసే స్థానికులు, సవాలక్ష ప్రశ్నలతో వేధించే రక్షణ అధికారులు.. వీటన్నింటినీ అధిగమిస్తూ ప్రజల సమస్యలని అధ్యయనం చేస్తూ సాగిన యాత్రలో వినోదానికీ కొదవ లేదు. ప్రారంభంలో కొంత దూరం వెంటాడిన కుక్క పిల్ల మొదలు, చివర్లో ఓడ కెప్టెన్ తో సాగే బేరసారాల వరకూ చిన్న చిన్న సంఘటనలని హాస్యస్పోరకంగా వివరించిన తీరు బాగుంది.

ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురించిన ఈ పుస్తకం చదవడాన్ని పూర్తి చేయడానికి నాకు అక్షరాలా రెండు సంవత్సరాలు పట్టింది. అలాగని ఇదేమీ పెద్ద పుస్తకం కాదు. కేవలం నూట అరవై పేజీలు అంతే! చాలా చోట్ల కృతకంగా అనిపించిన అనువాద శైలి, కనీసం పేజీకి ఒకటికి తక్కువ కాకుండా కనిపించిన ముద్రా రాక్షసాలు, ఎప్పటికప్పుడు పుస్తకం చదవాలన్న ఆసక్తిని తగ్గించేశాయి. ఫలితంగా, చదవడం మొదలు పెట్టడం, ఓ నాలుగైదు పేజీలు చదివి పక్కన పెట్టడం. ఎలాగైనా పూర్తి చేయాలన్న సంకల్పం ఒకటైతే, యాత్ర ఎలా ముగిసిందో తెలుసుకోవాలన్న కుతూహలం మరికొంత కలిసి ఈ పుస్తకాన్ని పూర్తి చేయించాయి.

అనువాదకుడు (కె. వీరయ్య) వాడిన భాష బాగుండక పోగా, అపార్ధాలకి తావిచ్చేవిధంగా ఉంది. ఉదాహరణకి ఒక చోట, చే గువేరా, అల్బెర్టోలకి ఎక్కడా భోజనం దొరకదు. వాళ్ళు పస్తు ఉంటే, ఒక పోలీసు తనకోసం తెచ్చుకున్న భోజనంలో వీళ్ళకీ భాగం పంచుతాడు. ఆ భోజనాన్ని చే 'దరిద్రపు భోజనం' గా భావించినట్టుగా రాయడం అయోమయానికి గురిచేసింది. ఆ పరిస్థితిలో దొరికిందే పరమాన్నం అనుకుంటారు ఎవరైనా. బహుశా 'రుచి లేని భోజనం' అనడానికి బదులు ఇలా రాశారేమో అనుకున్నాను. ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

పదాల వాడుక చాలా చోట్ల అర్ధాన్ని మార్చేసేదిగా ఉంది. దానికి తోడు అచ్చు తప్పులు. మొత్తం మీద పుస్తకం పూర్తి చేయడం అన్నది సహన పరీక్షగా మారింది. కాకపొతే, పుస్తకం ఇంగ్లిష్ వెర్షన్ చదవాలన్న కుతూహలం కలిగింది. ముఖ్యంగా ప్రదేశాలని మాత్రమే వర్ణించి ఊరుకోకుండా, అక్కడి భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, ప్రజల స్థితిగతులు వంటి అంశాలని స్పృశించడం నచ్చింది. చే గువేరా తో పాటుగా అల్బెర్టో కూడా వెంటాడతాడు పాఠకులని. (ప్రజాశక్తి పుస్తక కేంద్రాలన్నీ, వెల రూ. 75). అన్నట్టు 'గమ్యం' సినిమా కి స్ఫూర్తి ఈ రచన ఆధారంగా తీసిన విదేశీ సినిమానే.

బుధవారం, జూన్ 15, 2011

కరణంగారిల్లు

అమ్మమ్మ వాళ్ళింటికి నాలుగిళ్ళ అవతలే కరణంగారిల్లు. ఒకప్పుడు వాళ్ళు తగుమాత్రం జమిందార్లు అవడం వల్లనూ, ఆ వాసనలు ఇంకా పోకపోవడం వల్లనూ వాళ్ళింట్లో వాళ్ళు పెద్దగా ఎవరితోనూ కలిసేవాళ్ళు కాదు. కాకపొతే కరణంగారి భార్యకి ఎలా కుదిరిందో కానీ అమ్మమ్మతో స్నేహం కుదిరింది. ఒకరిళ్ళకి ఒకరు రాకపోకలు తక్కువే అయినా, రెండిళ్ళలోనూ ఎవరికే అవసరం వచ్చినా పిల్లలు అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాళ్ళు. కరణంగారి పిల్లలు గొప్పవాళ్ళు కదా, అందుకని బయటికి వచ్చే వాళ్ళు కాదు. దాంతో, ఏ ఇంట్లో పనున్నా అమ్మా వాళ్ళకీ తప్పేది కాదు.

కరణంగారి పిల్లలు, అమ్మ వాళ్ళు ఓకే ఈడువాళ్ళు. అందువల్ల, వీళ్ళు అత్యంత సహజంగా ఆవిడని 'అత్తయ్యగారూ' అని పిలవబోయారు. కానీ ఆవిడ అస్సలు ఊరుకోలేదు. "అదేంటర్రా! నేను ఏమంత పెద్దదాన్ని? వదినగారూ అని పిలవండి?" అని ఆర్డరేశారు లాలనగా. వీళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళ పిల్లలతో వరసల గోల లేదు. ఒకళ్ళనొకళ్ళు పేరు పెట్టుకునే పిలుచుకునే వాళ్ళు. పిల్లల సంభాషణలన్నీ వదినగారి పరోక్షంలోనే జరిగేవి.

కరణంగారిది కోట లాంటి ఇల్లు. నాకు ఊహ తెలిసేనాటికి శిధిలావస్థకి వచ్చి, పాడుబడ్డ కోటని తలపించినా, ఒకప్పటి వైభవం బాగానే అర్ధమయ్యేది. ఇంటి ఎదురుగా రోడ్డు అవతల చెరువు. ఆ చెరువు గట్టున కాడ మల్లె చెట్లు. ఇంటి పెత్తనమంతా వదినగారిదే. కరణం గారు చాలా బిజీగా ఉండేవారు. పేకాటతో పాటు ఇతరత్రా వ్యవహారాలూ చాలానే ఉండేవిట. ఈ కారణం వల్ల ఆయన ఇంట్లో ఉండేవారు కాదు పెద్దగా. ఆయన ఉన్నప్పుడు పిల్లలెవరూ వాళ్ళింటికి వెళ్ళేవారు కాదు.

వాళ్ళింటి నౌకరు వస్తే కానీ, కరణం గారింట్లో వాళ్ళెవరి దినచర్యా ప్రారంభం అయ్యేది కాదు. నౌకరు వస్తూనే కొట్టుమీదకి వెళ్లి ఆవేల్టికి సరిపడా కాఫీ పొడి, పంచదార పట్టుకురావాలి. వెళ్ళిన వాడు ఓ పట్టాన వచ్చేవాడు కాదు. అతని కోసం మరో నౌకరుని పంపడం, ఇలా సాగి సాగి ఏ తొమ్మి దింటికో కాఫీలు అయ్యేవి. వంట కూడా అదే పధ్ధతి. ఒక్కో సరుక్కీ ఒక్కో నౌకర్ని కొట్టుమీదకి పంపడం, అతనికోసం మరొకర్నీ ఇలా పంపుతూ పోవడం. అన్ని సరుకులూ ఒక్కసారి తెప్పించుకునే అలవాటు ఉండేది కాదు. దీనివల్ల పాపం నౌకర్లకి చేతినిండా పని.

కిరాణా కొట్టు ఒక్కటేనా? చాకలింటి చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిందీ నౌకర్లే. ఇంటిళ్ళపాదీ చాకలి బట్టలు తెచ్చేవరకూ మాసినవే మళ్ళీ మళ్ళీ కట్టుకునే వారు కానీ, పొరపాటున కూడా ఉతుక్కునే వారు కాదు. "మామూలింట్లో పుట్టాం కాబట్టి, మాబట్టలు మేం ఉతుక్కున్నా శుభ్రమైనవి కట్టుకునే వాళ్ళం," అనేది అమ్మ సరదాగా. అమ్మ వాళ్ళు సినిమా ప్రయాణం అయ్యారంటే వదినగారింట్లో చెప్పి తీరాలి. వాళ్ళెవరూ రాకపోయినా, చెప్పకుండా వెళ్లిపోయారని నిష్టూరం వేస్తారు మరి.

ఇంటికెవరైనా వెళ్ళడం పాపం. ఇంటిళ్ళపాదీ వచ్చిన వాళ్ళని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళ గత వైభవ గాధలు వినిపించే వాళ్ళు, కనీసం కాఫీ నీళ్ళన్నా పోయకుండా. జమీ కరిగిపోయినా జమిందారీ వ్యవహార శైలి మాత్రం వాళ్ళ పిల్లలందరికీ బాగానే అలవాటైపోయింది, వదినగారి పెంపకం పుణ్యమా అని. అయితే, రోజులు ఒకేలా ఉండవు కదా. పిల్లలు కొంచం పెద్దయ్యాక కళ్ళు తెరిచారు. కానీ పెద్దవాళ్ళని మాత్రం చివరి వరకూ అదే భ్రమలో ఉండనిచ్చారు.

అమ్మ వాళ్ళ అక్కచెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేసరికి కరణం గారి కుటుంబం ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటికే వాళ్ళ ఆస్తులన్నీ హరించుకు పోయాయి. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. మగ పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాలలో కుదురుకున్నారు. నా చిన్నప్పుడు తాతగారింటికి వెళ్లినప్పుడల్లా తాళం వేసి ఉన్న కరణం గారింటి వీధిలో ఆడుకునే వాడిని. పెద్ద పెద్ద స్తంభాలున్న వీధరుగు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతోంది. చివరిసారి నేనా ఊరికి వెళ్లేసరికి ఆ భవంతి కూలగొట్టి, కొబ్బరితోట చేసేశారు.

మంగళవారం, జూన్ 14, 2011

బ్రేక్ గురించి...

నిన్, నున్, లన్, కూర్చి, గురించి ల సంగతి తెలుసు కానీ కొత్తగా ఈ బ్రేక్ గురించి ఏమిటనే కదా సందేహం? వస్తున్నా.. వస్తున్నా.. కొంచం శ్రద్ధగా టీవీ చూసి చాలా రోజులయ్యిందని గుర్తు రావడంతో సాయంత్రం రిమోట్ ధారినై టీవీ ముందు సెటిలయ్యాను. ఇంకా చానళ్ళు తిప్పడం మొదలుపెట్టనే లేదు, ఈటీవీలో 'ప్రేమతో మీలక్ష్మీ' ప్రోగ్రాం. గెస్ట్ అలీ, తన సినీ ప్రస్థానాన్ని గురించి చెప్పడానికి ప్రయత్నాలు చేస్తుండగా, హోస్టు అడ్డుకుంటూ మోహన్ బాబుతో అనుబంధాన్ని గురించి చెప్పమని బలవంతం చేస్తోంది.

అలీ తన ఓటమిని అంగీకరించి సదరు వసూల్రాజుతో తన పరిచయాన్ని చెప్పడం మొదలు పెట్టాక, అతన్ని వాక్యం పూర్తి చేయనీయకుండా బ్రేక్ ఇచ్చేసింది పరిచయకర్త. మనం మన సబ్జక్ట్ లోకి వచ్చేశాం. నేనప్పుడు అమందానంద కందళిత హృదయారవిందుడనై బ్రేక్ ని ఆస్వాదించడం మొదలుపెట్టాను. నాకీ అలవాటు కొత్తగా వచ్చింది కాదు, దూరదర్శన్ రోజులనుంచీ వచ్చిందే. కొత్త టీవీ అవ్వడంతో దూరదర్శన్ వాళ్ళు ఏం ప్రసారం చేసినా రెప్ప వాల్చకుండా చూసేవాళ్ళం అప్పట్లో.

నిజం చెప్పాలంటే వాళ్ళు ప్రసారం చేసే కొన్ని కార్యక్రమాల కన్నా, మధ్యలో వచ్చే ప్రకటనల విరామాలూ, అంతరాయాలూ భలేగా ఉండేవి. కార్యక్రమాలు మరీ విసుగ్గా ఉంటే విరామమో అంతరాయమో వస్తే బాగుండునని కోరుకునే వాళ్ళం. చూడ్డం మానేయోచ్చు కదా అంటే, కొత్త టీవీ చూడకపోతే ఎలా? "సూర్యుడు అస్తమించని గ్రామం.." అంటూ వచ్చే ఇరిడా వాళ్ళ ప్రకటన అప్పట్లో నా ఫేవరేట్. అది కనుక వస్తుంటే, నేనెక్కడున్నా ఇంట్లోవాళ్ళు మర్చిపోకుండా నన్ను పిలిచే వాళ్ళు.

అప్పుడు మొదలైన ప్రకటనల సరదా అలా అలా కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికీ ఏదన్నా ప్రకటన బాగుంది అనిపిస్తే మళ్ళీ మళ్ళీ చూడడం కోసం ఎదురు చూస్తాను నేను. యూట్యూబ్ వీడియోలో చూసే అవకాశం ఉన్నా, టీవీలో చూడడమే బాగుంటుంది నాకు. ఒకమ్మాయి ముఖం నిండా దోమ కాట్లతో క్లాస్ లో కూర్చుని ఉంటే, టీచర్ అత్యంత ఆందోళనగా "ఏం జరిగింది శ్రద్ధా?" అంటే "దోమ కుట్టింది టీచర్" అని ఆ అమ్మాయి చాలా గర్వంగా చెప్పే మస్కిటో రిపల్లెంట్ ప్రకటన ఈ మధ్య కాలంలో నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ ముచ్చటగా ఉంటుంది.

ఇప్పుడెందుకో రావడం లేదు కానీ, మొన్నామధ్య వరకూ ఓ పౌష్టిక పానీయం ప్రకటన వచ్చేది. "మామిడికాయలు చేతికి అందడం లేదు.. నాకూ వయసొస్తోంది.. అయినా.." అంటూ ఓ బుడతడు తెగ బాధ పడిపోయేవాడు. నాకేమో ఒకటే నవ్వు. వాడంత ఉండగా నాకూ మామిడికాయలు అందేవి కావు, రాయి పెట్టి కొట్టేవాడినే కానీ, ఇలా బాధ పడేవాడిని కాదు. అసలలా బాధ పడాలని కూడా తెలీదు నాకు. అలాగే 'మరక మంచిదే' ప్రకటనలో టీచర్ ని చూడగానే పిల్లల ముఖంలో మారే హావభావాలు, డిటర్జెంట్ పౌడర్ ప్రకటనలో దిష్టి బొమ్మ వేషం వేసుకున్న మనవడిని చూడగానే బామ్మ కళ్ళలో వెలుగూ.. ఇవన్నీ నచ్చుతాయి.

అమితాబ్-జయబాధురీల జ్యూయలరీ ప్రకటన చూశారా ఎవరైనా? బాగుంటుంది కానీ, అది వస్తున్నంత సేపూ నాకు గుండెలు బితుకు బితుకుమంటూ ఉంటాయి, ఎలాంటి ఉపద్రవం వస్తుందో అని. తాతా, మనవడూ ఫోన్లో చదరంగం ఆడుకునే మొబైల్ ఫోన్ ప్రకటన ఇప్పుడు మార్చేశారు కానీ అప్పట్లో భలేగా ఉండేది. 'లడ్డూ తింటావా నాయనా' ప్రకటన పిల్లలనే కాదు, పెద్దవాళ్ళనీ టెంప్ట్ చేసేస్తుంది. సబ్బులు, షాంపూలు, సౌందర్య క్రీముల ప్రకటనలేవీ ఈమధ్యన అంతగా గుర్తు పెట్టుకోదగ్గవి రాలేదు.

బాగా చిరాకొచ్చే ప్రకటనలకీ లోటు లేదు. "లేచి పోయి పెళ్లి చేసుకుందాం.. అందరికీ రిసెప్షన్ ఇద్దాం" ప్రకటన చూస్తుంటే టీవీ పగలగొట్టాలనిపిస్తుంది. అంత బాధ్యత లేకుండా ఎలా తీస్తారో? సినిమాల ప్రకటనల్లో ఒకప్పుడు "చూసిందే చూడబుద్దేస్తోంది" పెద్ద హిట్. తర్వాత అంతగా క్లిక్కైన యాడ్ మరొకటి లేదు. "కత్తి, కేక.." అని ప్రేక్షకుల (?) చేత చెప్పించినా ఉపయోగం ఉండడం లేదనేమో, ఈమధ్యన ఆ తరహా ప్రకటనలు తగ్గించారు. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారి డబ్బింగ్ సినిమా తాలూకు ప్రకటన వచ్చినపుడు టీవీ సౌండ్ తగ్గించుకోవాలి.

మళ్ళీ ఈటీవీ దగ్గరికి వద్దాం. ఒకానొక బ్రేక్ లో 'మమత' ప్రీమియర్ షో ప్రకటన వచ్చింది. జూన్ ఇరవై ఆరు మధ్యాహ్నం మూడూ నలభై ఐదుకి ప్రసారం. అదేమిటో కానీ ప్రకటనలో కనిపించిన వారంతా (సుమన్ బాబుతో సహా) రకరకాల యాంగిల్స్ లో దుఃఖపడుతూనే కనిపించారు. అసలు 'కన్నీటికి వరదొచ్చింది' అనే టైటిల్ అయితే సరిగ్గా సరిపోయేదేమో అనిపించింది. షో చూస్తే కానీ టైటిల్ కి అర్ధం బోధ పడక పోవచ్చు. పర్లేదు, అందులో కూడా బ్రేకులు ఎక్కువగానే ఉంటాయి.

సోమవారం, జూన్ 13, 2011

రెండేళ్ళ పద్నాలుగు

"ఇల్లు కట్టేటోనికి ఇల్లుంటదా?" అని అడుగుతాడు 'వేదం' సినిమాలో రాములు తాత. ఈ ప్రశ్న చాలా సార్లే గుర్తొస్తుంది, మధురాంతకం నరేంద్ర తాజా కథల సంపుటి 'రెండేళ్ళ పద్నాలుగు' చదువుతుంటే. మొత్తం పదమూడు కథల్లోనూ పది కథల్లో ప్రధాన పాత్రలు గృహ నిర్మాణంలో అప్రధాన పాత్రలు పోషించే వాచ్మెన్, తాపీమేస్త్రీ, వడ్రంగి, మట్టి పని చేసేవాళ్ళూ దినసరి కూలీలూ. కథా స్థలం కృష్ణానగర్, తిరుపతి పట్టణ శివార్లలో కొత్తగా వెలుస్తున్నకాలనీ.

మధురాంతకం పేరు వినగానే తెలుగు కథకి కొత్త వెలుగులద్దిన దామల్ చెరువు అయ్యోరు మధురాంతకం రాజారాం గుర్తు రావడం అత్యంత సహజం. ఆయన వారసుడు నరేంద్రది కథా రచనలో ఓ భిన్నమైన శైలి. సమాజంలో వేగంగా చొచ్చుకుని వస్తున్న మార్పుని నేపధ్యంగా తీసుకుని రాసిన ఈ కథలన్నింటిలోనూ, ఆ మార్పు కారణంగా ఒకప్పుడు కుల వృత్తులని నమ్ముకుని జీవించిన పేద జనం ఎలాంటి సంఘర్షణని అనుభవిస్తున్నారన్నది కళ్ళముందుంచుతారు రచయిత.

బతుకు తెరువు కోసం పట్నం వచ్చి మేస్త్రీలుగా అవతారమెత్తినా కులాహంకారాన్ని తమతోనే తెచ్చుకున్న వీరమ రెడ్డి, విశ్వనాథ నాయుడుతో పాటు అందరినీ పొగిడి తన అవసరాలు గడుపుకునే దేవరాజునీ చూడొచ్చు తొలికథ 'ప్రత్యర్ధి' లో. ఎవరు ఎవరికి ప్రత్యర్ధి అన్నది కథ ముగింపు. చదువుకున్న కొడుకుని ఉద్యోగస్తుడిగా చూడాలని కలలు కనే మట్టి పని గంగయ్య కథ 'నమ్మకం'. అంతిమ యాత్ర నేపధ్యంగా సాగే ఈ కథలో ఆసాంతమూ చదివించింది కథనం.

బతకడం కోసం, గుండె దిటవు చేసుకోవడం కోసం వాచ్మన్ గా మారిన యానాది బత్తయ్య దంపతులు దేనిని ఆసరాగా చేసుకున్నారో 'ప్రహేళిక' కథ చెబుతుంది. హేతువాదానికి అందని ముగింపు ఈ కథ ప్రత్యేకత. ఎలక్ట్రీషియన్-ప్లంబర్ల కథ 'అబద్ధం' కాగా, కార్పెంటర్ పరమేశాచారి కథ 'నిషా,' వంశీ 'మా పసలపూడి కథలు' లో 'జక్కం వీర్రాజు' ని జ్ఞాపకం చేస్తుంది. వివాహ వ్యవస్థలో ఓ కొత్త కోణాన్ని చూపించే కథ 'మూల కారణం' ఓహెన్రీ తరహా ముగింపుతో ఆకట్టుకునే కథ.

'హరేరామ హరేకృష్ణ రోడ్డు' కథ పట్టణాలకి వలస వచ్చి రోడ్డు పక్కన గుడిసెల్లో ఉండేవారి బతుకుల్ని చిత్రిస్తూనే, వేగంగా చదివించే ఈ కథలో ఇంద్రాణి పాత్ర వెంటాడుతుంది. 'హింస రచన' ఇద్దరు కాలేజీ లెక్చరర్ల బతుకు భయాన్ని చిత్రించిన కథ. ముగింపు ఊహకందదు. వ్యంగ్యం ప్రధానంగా సాగే 'ప్రార్ధన' కథ చదువుతుంటే శ్రీపాద వారి 'శుభికే! శిర ఆరోహ' కథ గుర్తొచ్చింది అప్రయత్నంగా. 'దొంగతనం' 'మేరె గావ్ కో జానా' కథలు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీల కథలు.

'న్యాయం' కథ భార్య పొరు పడలేక పట్టణానికి వలస వచ్చి వాచ్మన్ గా స్థిరపడ్డ ఓ రజకుడి కథ. అతని భార్య పంచరత్నని కూడా అంత త్వరగా మర్చిపోలేం. ఒక నాటికగా మలుచుకుని స్టేజి మీద ప్రదర్శన ఇవ్వడానికి వంద శాతం సరిపోయే కథ సంపుటిలో చివరిదైన 'చిత్రలేఖ.' అపార్ట్మెంట్ నేపధ్యంగా సాగే ఈకథ చదువుతుంటే ఒక హాస్య, వ్యంగ్య నాటికని చదువుతున్న అనుభూతి కలిగింది. ఈ కథలని గురించి బి. తిరుపతిరావు రాసిన సమీక్షని చివర్లో చేర్చారు.

కేవలం యాత్రికులుగా తిరుపతి వెళ్లి వచ్చిన వారికి మాత్రమే కాదు, అక్కడే ఉన్నవాళ్ళకీ, అక్కడ కొంత కాలం ఉన్న వాళ్ళకీ కూడా తిరుపతిని ఓ కొత్త కోణంలో చూపించాయి కథలన్నీ. సూక్ష్మమైన వివరాలని సైతం విడిచిపెట్టకుండా చిన్న చిన్న వాక్యాలలో వర్ణించడం ద్వారా పాఠకులకి కథలు తమ కళ్ళ ఎదుట జరుగుతున్న అనుభూతిని కలిగించారు నరేంద్ర. కథా సంపుటికి ఏదో ఒక కథ పేరు పెట్టడం సహజం. అందుకు భిన్నంగా ఈ సంకలనానికి 'రెండేళ్ళ పద్నాలుగు' అనే పేరు ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు. అయినా, పేరులో ఏముంది? (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 170, వెల రూ.75, ఎవీకేఫ్ లోనూలభ్యం).

ఆదివారం, జూన్ 12, 2011

ఇంజినొచ్చింది

పొద్దున్న పొద్దున్నే లేవగానే ఒక్కోరోజు భలే విసుగ్గా ఉంటుంది. బడున్నా, లేకపోయినా ఏంటో ఏ పనీ చెయ్యాలనిపించదు. ఆవేళ కూడా నేనలా విసుగ్గా, చిరాగ్గా ఉండగా బామ్మ అదేమీ పట్టించుకోకుండా నన్ను పిలిచి "ఆ ఇంజిను కుర్రాళ్ళకి కూడా వంట చెయ్యాలేమో మీ తాతగారిని ఓమాటు కనుక్కురా బాబూ" అని పురమాయించేసింది. ఇంకేమన్నా అయితే నాకు చాలా బోల్డంత కోపం వచ్చేసి ఉండేది కానీ, బామ్మ చెప్పింది వినగానే నా విసుగంతా ఎగిరిపోయింది.

అవును మరి, ఇంజిను రావడం అంటే ఆషామాషీ విషయం ఏమిటీ? అందరిళ్ళకీ రాదు ఇంజిను. కొబ్బరి తోట ఉన్న వాళ్ళ ఇంటికే, అదికూడా ఏడాదికి ఒక్కసారే వస్తుంది. వచ్చిందంటే పూటో, పూటన్నరో ఉంటుంది. ఇంక చేతినిండా పని. తాతయ్య దగ్గరికి గంతులేసుకుంటూ వెళ్ళానా? "వాళ్ళు సాయంత్రం వస్తార్రా? అప్పుడు కనుక్కుని రాత్రి వంట చేయిద్దాం" అనేశారు. హాయ్..హాయ్.. సాయంత్రం అయితే ఇంకా మంచిది. చక్కగా బడికెళ్ళి వచ్చేయొచ్చు, ఏదో ఒక వంక పెట్టి మానక్కర్లేకుండా.

బళ్ళోకెళ్లగానే ఫ్రెండ్సులందరికీ చెప్పేశాను, సాయంత్రం తోటకి ఇంజిన్ పెడుతున్నారని. అదిమొదలు, వాళ్ళందరూ నాతో చాలా మంచిగా ఉండడం మొదలు పెట్టారు. నేనేం చెబితే అదే రైటన్న మాట. లేకపొతే నేను వాళ్ళని ఇంజిన్ చూడ్డానికి తీసుకెళ్ళను సరి కదా, బొంగరాలకి మట్టికూడా తీసుకోనివ్వను. అందుకే నాకు ఇంజిన్ అంటే ఇష్టం. అంటే, ఇదొక్కటే కారణం కాదనుకో, అయినా ఫ్రెండ్సులు మనం చెప్పిందానికి కాదనకపోతే ఎంత బాగుంటుందో కదా.

సాయంత్రం అవ్వనే అయ్యింది. బళ్ళో నుంచి వచ్చే సరికి, అప్పుడే రెండెడ్ల బండికి బిగించిన ఇంజిన్ ని ఇంటి ముందు చెరువు గట్టు మీద ఆపి, ఎడ్లని తోలుకుపోయారు. ఇద్దరు కుర్రాళ్ళు నీళ్ళ గొట్టాలు, లావాటి రబ్బరు చూపులు (ట్యూబులు) గబగబా బిగించేస్తున్నారు. డ్రైవరేమో ఇంజిన్లో ఇంజనాయిలు పోస్తుంటే, ఇంజన్ గలాయన డ్రైవర్ మాయచేసి అందులో కిరసనాయిలు కలిపెయ్యకుండా చూస్తున్నాడు. నేను ఇంట్లోకెళ్ళి పాలు తాగేసి వచ్చేశా.

చెర్లోనుంచి నీళ్ళు లాక్కునే చూపూ, ఇంజిన్లో నుంచి తోటలోకి నీళ్ళు పంపే లావు పాటి చూపూ బిగించేశారా? ఈ లావు పాటి చూపు మీద సైకిళ్ళూ అవీ ఎక్కినా పాడవ్వకుండా, అటూ ఇటూ తాటిపేళ్లూ, కమ్మలూ సదిరేశారు. ఓ రెంచితో ఇంజిన్ గాట్టిగా తిప్పేస్తోంటే బడ్ బడ్ బడ్ మని చప్పుడు చేస్తూ ఇంజిన్ పనిచేయడం మొదలెట్టేసింది. గుప్పు గుప్పుమంటూ నల్లటి పొగలు. చూస్తుండగానే లావుపాటి చూపు కొంచం కొంచంగా ఉబ్బుతూ పెద్ద పాము పాకుతున్నట్టుగా తోటవరకూ ఉబ్బింది. చూస్తే ఏముందీ, తోటలోకి బోల్డు బోల్డు నీళ్ళు.

తోట దుక్కి దున్నడం, చుట్టూ గట్లు కట్టడం అప్పటికే అయిపోయింది కదా. నీళ్ళు ఒక్కో కొబ్బరిచెట్టు దగ్గరికీ వెళ్తున్నాయి. తడి తగలగానే మెట్ట తాబేళ్ళూ, తేళ్ళూ, జెర్రిలూ, చిన్న చిన్న పాములూ అవీ ఖంగారు ఖంగారుగా తిరగడం మొదలెట్టాయి తోటలో. అన్నట్టు మొగలి పొద పక్కన పాంపుట్ట ఉంది కదా, అక్కడికి నీళ్ళు వెళ్ళకుండా గట్టు కట్టేశారు. అవన్నీ ఎక్కడివక్కడికి సర్దుకునే వరకూ మనం తోటలోకి వెళ్ళకూడదన్న మాట. అందుకని మళ్ళీ ఇంజిన్ దగ్గరికి వెళ్తే, అక్కడ పొగలు కొంచం తగ్గాయి. సైకిళ్ళ వాళ్ళని, సైకిల్ దిగి పెద్ద చూపు దాటమని చెప్పాను కాసేపు.

తోటలో ఇద్దరు మనుషులు గట్లు కాస్తున్నారు. ఇది ఎందుకంటే, మనం ఇంజిన్ వాళ్లకి కాఫీలూ, టీలూ, భోజనాలే కాకుండా డబ్బులు కూడా ఇచ్చి ఇంజిన్ పెట్టించుకుంటున్నామా? మనం చూడకుండా చూడకుండా పక్క తోట వాళ్ళు గట్టు కొంచం తెగ్గొట్టేశారంటే చాలు మన నీళ్లన్నీ వాళ్ళ తోటలోకి వెళ్ళిపోతాయి. సాయంత్రం అవుతుండగా నా ఫ్రెండ్సులు వచ్చారు. మామూలుగా అయితే ఇంజిన్ కుర్రాళ్ళు చిన్న పిల్లల్ని ఇంజిన్ దగ్గరికి రానివ్వరు. కానీ నేను కూడాఉండి తీసుకెళ్ళాను కదా, అందుకని వాళ్ళు ఏమీ అనలేదు.

నీళ్ళల్లో కాసేపు పడవలేసుకుని, బొంగరాలకి ఎక్కడి మట్టి బాగుంటుందో గుర్తులు పెట్టేసుకున్నాం. ఇంజిన్ వెళ్ళిపోయాక, తోట కొంచం ఆరాక ఆ మట్టి తీసుకుంటామన్న మాట. కాసేపు కాళ్ళు కడుక్కునే ఆటా, చేతులు కడుక్కునే ఆటా ఆడుకున్నాం. అంటే ఏమీ లేదు, కాళ్ళకి మట్టి చేసుకుని కడుక్కుంటే కాళ్ళు కడుక్కునే ఆటన్న మాట. "చీకటడిపోతోంది.. పురుగూపుట్రా చేరుతుంది..ఇళ్ళకెళ్ల" మని నాన్న కేకలేసే వరకూ అక్కడే ఆడాం.

వాళ్ళంటే ఇళ్ళకెళ్ళి పోయారు కానీ, నేనెందుకు వెళ్తాను? ఇంజిన్ దగ్గర కూర్చుని కుర్రాళ్ళతో కబుర్లు మొదలెట్టాను. ఇంకా ఎవరెవరి తోటలకి నీళ్ళు పెడుతున్నారో కనుక్కోవద్దూ? రాత్రి ఆ కుర్రాళ్ళకి అన్నం అమ్మ పెట్టింది కానీ, ఆకుల్లో కూరా పచ్చడీ అవీ నేనే వడ్డించా. నీళ్ళూ టీలూ నేనే అందించా. ఇంజిన్ చప్పుడు వింటూ ఎప్పటికో నిద్రపోయానా? పొద్దున్న లేచి చూసేసరికి తోటంతా నీళ్ళు నీళ్ళు. పెద్ద వర్షం వచ్చిందంటే నమ్మేయొచ్చు. వీధిలో చూస్తే ఇంజిన్ లేదు, వెళ్ళిపోయింది. నాకు కాళ్ళు ఒకటే లాగడం. బళ్లోకి వెళ్లాలని కూడా లేదు. కానీ ఇంట్లో చెబితే ఇంకేమన్నా ఉందా? మళ్ళీ ఇంజిన్ ఎప్పుడొస్తుందో..