ఆదివారం, జూన్ 12, 2011

ఇంజినొచ్చింది

పొద్దున్న పొద్దున్నే లేవగానే ఒక్కోరోజు భలే విసుగ్గా ఉంటుంది. బడున్నా, లేకపోయినా ఏంటో ఏ పనీ చెయ్యాలనిపించదు. ఆవేళ కూడా నేనలా విసుగ్గా, చిరాగ్గా ఉండగా బామ్మ అదేమీ పట్టించుకోకుండా నన్ను పిలిచి "ఆ ఇంజిను కుర్రాళ్ళకి కూడా వంట చెయ్యాలేమో మీ తాతగారిని ఓమాటు కనుక్కురా బాబూ" అని పురమాయించేసింది. ఇంకేమన్నా అయితే నాకు చాలా బోల్డంత కోపం వచ్చేసి ఉండేది కానీ, బామ్మ చెప్పింది వినగానే నా విసుగంతా ఎగిరిపోయింది.

అవును మరి, ఇంజిను రావడం అంటే ఆషామాషీ విషయం ఏమిటీ? అందరిళ్ళకీ రాదు ఇంజిను. కొబ్బరి తోట ఉన్న వాళ్ళ ఇంటికే, అదికూడా ఏడాదికి ఒక్కసారే వస్తుంది. వచ్చిందంటే పూటో, పూటన్నరో ఉంటుంది. ఇంక చేతినిండా పని. తాతయ్య దగ్గరికి గంతులేసుకుంటూ వెళ్ళానా? "వాళ్ళు సాయంత్రం వస్తార్రా? అప్పుడు కనుక్కుని రాత్రి వంట చేయిద్దాం" అనేశారు. హాయ్..హాయ్.. సాయంత్రం అయితే ఇంకా మంచిది. చక్కగా బడికెళ్ళి వచ్చేయొచ్చు, ఏదో ఒక వంక పెట్టి మానక్కర్లేకుండా.

బళ్ళోకెళ్లగానే ఫ్రెండ్సులందరికీ చెప్పేశాను, సాయంత్రం తోటకి ఇంజిన్ పెడుతున్నారని. అదిమొదలు, వాళ్ళందరూ నాతో చాలా మంచిగా ఉండడం మొదలు పెట్టారు. నేనేం చెబితే అదే రైటన్న మాట. లేకపొతే నేను వాళ్ళని ఇంజిన్ చూడ్డానికి తీసుకెళ్ళను సరి కదా, బొంగరాలకి మట్టికూడా తీసుకోనివ్వను. అందుకే నాకు ఇంజిన్ అంటే ఇష్టం. అంటే, ఇదొక్కటే కారణం కాదనుకో, అయినా ఫ్రెండ్సులు మనం చెప్పిందానికి కాదనకపోతే ఎంత బాగుంటుందో కదా.

సాయంత్రం అవ్వనే అయ్యింది. బళ్ళో నుంచి వచ్చే సరికి, అప్పుడే రెండెడ్ల బండికి బిగించిన ఇంజిన్ ని ఇంటి ముందు చెరువు గట్టు మీద ఆపి, ఎడ్లని తోలుకుపోయారు. ఇద్దరు కుర్రాళ్ళు నీళ్ళ గొట్టాలు, లావాటి రబ్బరు చూపులు (ట్యూబులు) గబగబా బిగించేస్తున్నారు. డ్రైవరేమో ఇంజిన్లో ఇంజనాయిలు పోస్తుంటే, ఇంజన్ గలాయన డ్రైవర్ మాయచేసి అందులో కిరసనాయిలు కలిపెయ్యకుండా చూస్తున్నాడు. నేను ఇంట్లోకెళ్ళి పాలు తాగేసి వచ్చేశా.

చెర్లోనుంచి నీళ్ళు లాక్కునే చూపూ, ఇంజిన్లో నుంచి తోటలోకి నీళ్ళు పంపే లావు పాటి చూపూ బిగించేశారా? ఈ లావు పాటి చూపు మీద సైకిళ్ళూ అవీ ఎక్కినా పాడవ్వకుండా, అటూ ఇటూ తాటిపేళ్లూ, కమ్మలూ సదిరేశారు. ఓ రెంచితో ఇంజిన్ గాట్టిగా తిప్పేస్తోంటే బడ్ బడ్ బడ్ మని చప్పుడు చేస్తూ ఇంజిన్ పనిచేయడం మొదలెట్టేసింది. గుప్పు గుప్పుమంటూ నల్లటి పొగలు. చూస్తుండగానే లావుపాటి చూపు కొంచం కొంచంగా ఉబ్బుతూ పెద్ద పాము పాకుతున్నట్టుగా తోటవరకూ ఉబ్బింది. చూస్తే ఏముందీ, తోటలోకి బోల్డు బోల్డు నీళ్ళు.

తోట దుక్కి దున్నడం, చుట్టూ గట్లు కట్టడం అప్పటికే అయిపోయింది కదా. నీళ్ళు ఒక్కో కొబ్బరిచెట్టు దగ్గరికీ వెళ్తున్నాయి. తడి తగలగానే మెట్ట తాబేళ్ళూ, తేళ్ళూ, జెర్రిలూ, చిన్న చిన్న పాములూ అవీ ఖంగారు ఖంగారుగా తిరగడం మొదలెట్టాయి తోటలో. అన్నట్టు మొగలి పొద పక్కన పాంపుట్ట ఉంది కదా, అక్కడికి నీళ్ళు వెళ్ళకుండా గట్టు కట్టేశారు. అవన్నీ ఎక్కడివక్కడికి సర్దుకునే వరకూ మనం తోటలోకి వెళ్ళకూడదన్న మాట. అందుకని మళ్ళీ ఇంజిన్ దగ్గరికి వెళ్తే, అక్కడ పొగలు కొంచం తగ్గాయి. సైకిళ్ళ వాళ్ళని, సైకిల్ దిగి పెద్ద చూపు దాటమని చెప్పాను కాసేపు.

తోటలో ఇద్దరు మనుషులు గట్లు కాస్తున్నారు. ఇది ఎందుకంటే, మనం ఇంజిన్ వాళ్లకి కాఫీలూ, టీలూ, భోజనాలే కాకుండా డబ్బులు కూడా ఇచ్చి ఇంజిన్ పెట్టించుకుంటున్నామా? మనం చూడకుండా చూడకుండా పక్క తోట వాళ్ళు గట్టు కొంచం తెగ్గొట్టేశారంటే చాలు మన నీళ్లన్నీ వాళ్ళ తోటలోకి వెళ్ళిపోతాయి. సాయంత్రం అవుతుండగా నా ఫ్రెండ్సులు వచ్చారు. మామూలుగా అయితే ఇంజిన్ కుర్రాళ్ళు చిన్న పిల్లల్ని ఇంజిన్ దగ్గరికి రానివ్వరు. కానీ నేను కూడాఉండి తీసుకెళ్ళాను కదా, అందుకని వాళ్ళు ఏమీ అనలేదు.

నీళ్ళల్లో కాసేపు పడవలేసుకుని, బొంగరాలకి ఎక్కడి మట్టి బాగుంటుందో గుర్తులు పెట్టేసుకున్నాం. ఇంజిన్ వెళ్ళిపోయాక, తోట కొంచం ఆరాక ఆ మట్టి తీసుకుంటామన్న మాట. కాసేపు కాళ్ళు కడుక్కునే ఆటా, చేతులు కడుక్కునే ఆటా ఆడుకున్నాం. అంటే ఏమీ లేదు, కాళ్ళకి మట్టి చేసుకుని కడుక్కుంటే కాళ్ళు కడుక్కునే ఆటన్న మాట. "చీకటడిపోతోంది.. పురుగూపుట్రా చేరుతుంది..ఇళ్ళకెళ్ల" మని నాన్న కేకలేసే వరకూ అక్కడే ఆడాం.

వాళ్ళంటే ఇళ్ళకెళ్ళి పోయారు కానీ, నేనెందుకు వెళ్తాను? ఇంజిన్ దగ్గర కూర్చుని కుర్రాళ్ళతో కబుర్లు మొదలెట్టాను. ఇంకా ఎవరెవరి తోటలకి నీళ్ళు పెడుతున్నారో కనుక్కోవద్దూ? రాత్రి ఆ కుర్రాళ్ళకి అన్నం అమ్మ పెట్టింది కానీ, ఆకుల్లో కూరా పచ్చడీ అవీ నేనే వడ్డించా. నీళ్ళూ టీలూ నేనే అందించా. ఇంజిన్ చప్పుడు వింటూ ఎప్పటికో నిద్రపోయానా? పొద్దున్న లేచి చూసేసరికి తోటంతా నీళ్ళు నీళ్ళు. పెద్ద వర్షం వచ్చిందంటే నమ్మేయొచ్చు. వీధిలో చూస్తే ఇంజిన్ లేదు, వెళ్ళిపోయింది. నాకు కాళ్ళు ఒకటే లాగడం. బళ్లోకి వెళ్లాలని కూడా లేదు. కానీ ఇంట్లో చెబితే ఇంకేమన్నా ఉందా? మళ్ళీ ఇంజిన్ ఎప్పుడొస్తుందో..

12 కామెంట్‌లు:

  1. అయ్యో అప్పుడే అయిపోయిందా? అనిపించింది. రమణ గారి బుడుగు చదివిన ఫీల్ వచ్చింది.

    రిప్లయితొలగించండి
  2. అచ్చం గా బుడుగు కథ లా ఉంది. చాలా హాయిగా చదివించారు.

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుందండీ.. చదువుతుంటే చిన్నప్పడు చూసిన ఇలాంటి కొన్ని సంగతులు గుర్తొచ్చాయ్. బుడుగు చెప్పినట్టొ భలేచెప్పారు. ;)

    రిప్లయితొలగించండి
  4. నిజ్జంగా జూనియర్ బుడుగు పుట్టినట్లనిపించింది, కొబ్బరి తోటలో ఇంజన్ దగ్గర..;) చాలా చాలా బాగుంది..:)

    రిప్లయితొలగించండి
  5. మీ బాల్య జ్ఞాపకాలని చదువుతున్నకొద్దీ మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తుంది.. నన్ను కూడా బాల్యం లోకి తీసుకెళ్లిపోతారు.. మా ఊరి మట్టివాసన హృదయాన్ని తాకుతుంది.

    రిప్లయితొలగించండి
  6. ఇప్పుడు ఈ టపా గురించి నా వ్యాఖ్యః
    జ్ఞాపకాల టపాలలో మీ రచనా శైలి అద్భుతం అన్నమాట కూడా చిన్నదే. కానీ అంతకంటే పెద్ద మాటేమిటో నాకు తెలీదు.

    మీరు ఇవ్వబోయే జవాబుః
    @శిశిర: ప్రత్యేకత అంటూ ఏమన్నా ఉంటే అది బాల్యానిదేనండీ.. ఆపై మీ అభిమానం, అంతే.. ధన్యవాదాలు.

    మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లయినా నేనదే అంటాను. మీరు అలాగే అంటారు. అందుకే :)))

    రిప్లయితొలగించండి
  7. మీ బ్లాగులో నాకు అమితంగా ఇష్టమైన వర్గం మీ బాల్య స్మృతులే మురళిగారు.. చిన్నారి మురళి వెంట ఆ ప్రదేశాలన్నీ తిరుగుతూ.. తను చెప్పే కబుర్లు వినడమ్ నాకు చెప్పలేనంత ఇష్టం :) ఇక ఈ టపా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది..

    రిప్లయితొలగించండి
  8. హ హ హ! నాకు కూడా 'బుడుగు గుర్తొచ్చాడు

    రిప్లయితొలగించండి
  9. @బీకే: ధన్యవాదాలండీ..

    @కృష్ణప్రియ: ధన్యవాదాలండీ..

    @రాజ్ కుమార్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  10. @శ్రీ: ధన్యవాదాలండీ..

    @మనసు పలికే: :)) :)) ధన్యవాదాలండీ..

    @మురారి: నిజంగా?!! ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  11. @శిశిర: హ..హా..హా.. కళ్ళంట నీరొచ్చేలా నవ్వానండీ. చాలా రోజులయ్యింది ఇంతగా నవ్వి.. భలేగా గుర్తు పెట్టుకున్నారు, నా జవాబు. ధన్యవాదాలు.

    @వేణూ శ్రీకాంత్: గుర్తు చేసుకోడాన్నీ, రాయడాన్నీ నేనూ అంతగా ఇష్టపడుతున్నానండీ.. ధన్యవాదాలు.

    @హరిచందన: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి