బుధవారం, ఫిబ్రవరి 16, 2011

మొదటి సినిమాయాత్ర

ఊరిపక్కన టౌన్లో కొత్తగా టూరింగ్ టాకీస్ కట్టారనీ, రోజూ రెండు సినిమాలు వేస్తారనీ, అందరూ వచ్చి చూడాల్సిందిగా కోరుతూ ఊళ్లోకి ప్రచారం రిక్షా రావడంతో అమ్మమ్మ వాళ్ళింట్లో హడావిడి మొదలయ్యింది. సినిమా అలా ఉంచి, అప్పటివరకూ ఊరి పొలిమేర దాటి బయటకి అడుగుపెట్టని అమ్మావాళ్ళ సందడికైతే కొదవ లేదు. అమ్మతో పాటుగా వాళ్ళక్క, ఆఖరి చెల్లి, తమ్ముడు సినిమా చూపించాల్సిందేనంటూ అమ్మమ్మని పట్టుపట్టారు.

పిల్లలకేనేంటి, అమ్మమ్మకి కూడా సినిమా అంటే సరదానే. ఆవిడా అప్పటివరకూ ఆనోటా ఆనోటా వినడమే తప్ప సినిమా అంతే ఎలా ఉంటుందో చూడలేదు మరి. మొత్తం తొమ్మండుగురు పిల్లల్లోనూ పాటు పడుతున్న నలుగుఋ పిల్లలనీ తీసుకెళ్ళి సినిమా చూపించడానికి అనుమతులూ అవీ సంపాదించుకుంది ఆవిడ. పొరుగూరు సినిమాకి వెళ్ళడం అంతే, ఇరుగు పోరుగులతో చెప్పకుండా ప్రయాణం అయిపోవడం కుదరదు కదా. అలా చెప్పడంలో అమ్మ వాళ్ళ మేనత్త, నాలుగిళ్ళ అవతల ఉండే ముసుగు బామ్మగారు కూడా వీళ్ళతో పాటు సినిమాకి ప్రయాణమయ్యారు.

అమ్మకప్పుడు పదేళ్ళు. వాళ్ళ అక్కకి పన్నెండు. తమ్ముడికీ, చెల్లికీ ఏడేళ్ళు, ఐదేళ్ళు వరుసగా. ఈ నలుగురు పిల్లలు, ముగ్గురు పెద్దవాళ్ళు సినిమాకి వెళ్ళే రోజు రానే వచ్చింది. టూరింగ్ టాకీస్ వాడు కేవలం మొదటి ఆట, రెండో ఆట మాత్రమే వేస్తాడు. పిల్లలు మాత్రం ఉదయం నుంచీ ప్రయాణ సన్నాహాలు మొదలు పెట్టేశారు. అటు మేనత్త ఇంటికీ, ఇటు ముసుగు బామ్మగారింటికీ వంతులవారీగా వెళ్లి వస్తూ, వాళ్ళని కూడా హడావిడి పెడుతున్నారు. ఎట్టకేలకి మధ్యాహ్నం భోజనాలు, కాఫీలు అయ్యాక అందరూ పొరుగూరికి కాలినడకన బయలుదేరారు.

ఇంట్లో దీపాలన్నింటినీ శుభ్రంగా తుడిచి, కిరసనాయిలు పోసిన ముసుగు బామ్మగారు, ఒక లాంతరుని వెలిగించి తెచ్చుకున్నారు, అప్పటికింకా ఫెళఫెళ్ళాడుతూ ఎండ కాస్తున్నప్పటికీ. అంత సందడిలోనూ, చలువ చేసిన మల్లు పంచ కట్టుకోవడం మర్చిపోలేదు ఆవిడ. మట్టిరోడ్డు దాటి, తార్రోడ్డు ఎక్కగానే నలుగురు పిల్లల ఆనందానికీ అంతు లేదు. నల్లటి రోడ్డుని చూడడం వాళ్ళకదే ప్రధమం మరి. రోడ్డు పక్కన షాపుల్ని, రోడ్డుమీద వెళ్తున్న వాహనాలనీ వింతగా చూసుకుంటూ సినిమా హాల్ చేరారా, అక్కడ ఒక్క పిట్ట లేదు. వీళ్ళని చూసి దూరంగా చుట్ట కాల్చుకుంటున్న వాచ్మన్ పరుగున వచ్చి, గేటు తెరిచి, వీళ్ళు కూర్చోడానికి బెంచీ చూపించాడు.

పిల్లలు ఆటల్లోనూ, ఆడవాళ్ళు కబుర్లలోనూ పడ్డారు. కూర్చునీ, కూర్చునీ వీళ్ళకి విసుగొచ్చాక, జనం ఒక్కొక్కరే రావడం మొదలు పెట్టారు. మరికాసేపటికి టిక్కెట్లు అమ్మడం మొదలయ్యింది. ఉన్నవి మూడు క్లాసులు. కుర్చీ, బెంచీ, నేల. ఆడవాళ్ళు కుర్చీకి వెళ్ళకూడదు కదా (ఎందుకు వెళ్ళకూడదో ఎవరికీ తెలీదు, వెళ్ళకూడదు అంతే) అందుకని బెంచీకి టిక్కెట్లు కొనుక్కున్నారు. అమ్మ వాళ్లక్కకి మినహా, మిగిలిన ముగ్గురు పిల్లలకీ ఫ్రీ టిక్కట్లే, కొత్తగా కట్టిన హాలు కదా మరి.

సినిమా మొదలయ్యింది. అందరూ సినిమాలో లీనమైపోయారు,ముసుగు బామ్మగారు మినహా. ఆవిడకి కొంచం గూని అవ్వడ వల్ల, బెంచీ మీద కూర్చుని చూడడం కష్టంగా ఉంది. ఈమాట ఆవిడ అమ్మమ్మ చెవిన వేసింది, నేల క్లాసులో కూర్చుని చూద్దామన్న ప్రతిపాదన కూడా. ఇప్పుడు నేల క్లాసంటే మళ్ళీ టిక్కెట్టు తీసుకోవాలేమో అని సందేహం అమ్మమ్మకి. పిల్లల్ని వెళ్లి గేటు కుర్రాడిని కనుక్కుని రమ్మని బతిమాలింది. అతను ఎంత మంచివాడంటే మళ్ళీ టిక్కెట్ అడక్కుండా వీళ్ళందరినీ నేల క్లాసులో కూర్చోబెట్టేశాడు.

మెత్తని ఇసుకలో కూర్చుని హాయిగా సినిమా చూస్తున్నారు అందరూ. ఉన్నట్టుండి సినిమాలో విశ్రాంతి రావడంతో హాల్లో లైట్లు వెలిగాయి. ఇంటిదగ్గర నుంచి తెచ్చిన అప్పచ్చులు అందరికీ పంచింది అమ్మమ్మ. వాటిని తింటూ అప్పుడు చూశారు పిల్లలు ఇసుకని పరీక్షగా. లైట్ల వెలుగులో మిలమిలా మెరిసిపోతూ గోదారిసక. ఇసకని చూడగానే, అమ్మ వాళ్లక్కతో కలిసి దూదుంపుడక ఆట మొదలు పెట్టేసింది. వాళ్ళ తమ్ముడూ, చెల్లీ అయితే ఇసుక ఒకళ్ళ నెత్తిమీద మరొకరు ఎత్తిపోసుకునే ఆట. ఇసకలో ఏ మేకులన్నా ఉంటాయేమోనన్న అమ్మమ్మ ఖంగారుని అస్సలు పట్టించుకోలేదు వాళ్ళు.

నేల క్లాసుకదా. అప్పుడే ఈనిన కుక్క ఒకటి తన నాలుగు పిల్లలతోనూ అక్కడికి ప్రవేశించింది. చిన్న పిల్లలిద్దరూ, ఆ పిల్లలని తీసుకెళ్ళి పెంచుకోవాల్సిందే అని పేచీలు మొదలు పెట్టారు. వద్దని వాళ్ళని ఒప్పించేసరికి మిగిలిన వాళ్ళ తల ప్రాణాలు తోకకి వచ్చాయి. అంత సందట్లోనూ ఇసుకలో దొరికిన శంఖులు, రంగు రాళ్ళతో మావయ్య జేబులు నింపేసుకున్నాడు. ఈ సరంభాలన్నింటి మధ్యా ఇంటర్వల్ పూర్తయ్యి సినిమా మళ్ళీ మొదలైంది.

విషాద సన్నివేశాలు వచ్చినప్పుడల్లా ముక్కులు ఎగబీల్చీ, కొంగులతో కళ్ళు వత్తుకునీ, వాళ్ళు పడ్డ కష్టాలని తల్చుకునీ మహిళలు ముగ్గురూ సినిమాని జయప్రదం చేసేశారు. ఇంట్లో ఉంటే ఆపాటికి బోయినం చేసేసి గాఢ నిద్రలో ఉండే పిల్లలు, ఆవేళ ఆకలీ, నిద్రా మర్చిపోయారు. సినిమా అవ్వడంతోనే తిరుగు ప్రయాణం. తార్రోడ్డు మీద నడక పూర్తయ్యింది, మట్టిరోడ్డులోకి మళ్ళాలి. పిల్లలు నలుగురూ ఆ రోడ్డులోకి రామంటేరామనేశారు. కావాలంటే తార్రోడ్డు మీద ఎంతదూరమైనా నడవడానికి సిద్ధం అంటారు వాళ్ళు. అలా ఎంత నడిచినా ఇల్లు రాదంటారు పెద్దాళ్ళు.

పెద్దాళ్ళు ముగ్గురూ కలిసి కృత్యదవస్థ మీద పిల్లల్ని మట్టి రోడ్డులోకి మళ్ళించారు. లాంతరు పట్టుకుని ముసుగు బామ్మగారు ముందు నడుస్తుండగా, వెనుకాల వరుసగా పిల్లలు, ఆ వెనుక పెద్దలు. అర్ధరాత్రి వేళకి ఇల్లు చేరారు అందరూ. "ఆ సినిమా కథ గుర్తు లేదు కానీ, ప్రయాణాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను" అంటూ గుర్తు చేసుకుంటుంది అమ్మ.

15 వ్యాఖ్యలు:

మధురవాణి చెప్పారు...

అబ్బా.. ఎంతందమైన జ్ఞాపకం కదా.. మీ అమ్మగారిది! :)
మురళీ గారూ, మీ జ్ఞాపకాల పుస్తకం కోసం ఎదురుచూపులు ఇంకా ఎన్ని రోజులట? తొందరగా అచ్చేయించే పని చూద్దురూ!

పానీపూరి123 చెప్పారు...

> నేల క్లాసులో కూర్చుని చూద్దామన్న ప్రతిపాదన
> మెత్తని ఇసుకలో కూర్చుని
ఒకసారి మేము ఇలాగే నేల క్లాసుకి వెళ్ళాము, ఒక పెద్దాయన తెల్లని పంచతో నేల క్లాసులో కూర్చున్నాడు, మధ్యలో లెగిచేసరికి తెల్లపంచ వెనక పెద్ద అచ్చులు, ఎవరో/జంతువో సినిమా మిస్ అవ్వడం ఇష్టం లేక , అక్కడే పని కానించినట్లున్నారు. :-(

'Padmarpita' చెప్పారు...

ఎంత మధురమైన జ్ఞాపకం.....ఈతరం వారి ఊహకి కూడా అందవుకదా!

ప్రణీత స్వాతి చెప్పారు...

ఆపాతమధురంగా వుంది మీ అమ్మగారి చిన్ననాటి జ్ఞాపకం.

"ఇప్పుడు నేల క్లాసంటే మళ్ళీ టిక్కెట్టు తీసుకోవాలేమో అని సందేహం అమ్మమ్మకి. గేటు కుర్రాడు ఎంత మంచివాడంటే మళ్ళీ టిక్కెట్ అడక్కుండా వీళ్ళందరినీ నేల క్లాసులో కూర్చోబెట్టేశాడు"...

ఇది హైలైట్.

జయ చెప్పారు...

నేనుకూడా మా మామయ్య పెళ్ళికి ఓ పల్లెటూరికెళ్ళినప్పుడు ఓ టూరింగ్ హాల్లో సినిమా చూసాను. కాకపోతే అందరూ కుర్చీలు ఇష్టమొచ్చినట్లు జరిపేసుకున్నారు. అదేదో పాత సినిమా. రీల్ మార్చుకుంటూ చాలా బ్రేక్ లే ఇచ్చారు. ఆ ఊరేదోగాని గోదారొడ్డునే ఉంది. ఏదీ సరిగ్గా గుర్తులేదుగాని, గోదారొడ్డున వెన్నెల్లో ఆ ఇసుకలో నడిచిన జ్ఞాపకం మాత్రం ఉంది. మరి, మీరెప్పుడైనా అలా చూసారా?

శిశిర చెప్పారు...

చాలా బాగుందండి. అమ్మకి కూడా ఇలాంటి జ్ఞాపకాలున్నాయండి. వాళ్ళ చిన్నప్పుడు హాల్‌కి గోడలేమీ ఉండేవి కాదట. హాల్ బయట కుర్చీలేసుకుని సినిమా చూసేవారట. ఒక్కొక్కసారైతే ఒకే టికెట్‌తో ముందు ఆట సెకండ్‌హాఫ్ చూసి, తరువాతి ఆట ఫస్ట్ హాఫ్ చూసి సినిమా మొత్తం చూడడం పూర్తిచేసేవారట. :)

పరిమళం చెప్పారు...

నాచిన్నప్పుడు అమ్మమ్మగారి ఊరినుండి పక్కూరికి సినిమాకి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం నేనూ పిన్నీ. ఎక్కువమంది ఐతే ఎడ్లబండి.అవన్నీ గుర్తుకోచ్చాయండీ మీ అమ్మగారి సినిమా ప్రయాణం చదువుతుంటే :)

మురళి చెప్పారు...

@మధురవాణి: అవునండీ.. నాకూ అబ్బురంగానే అనిపిస్తాయి అమ్మ బాల్యపు విశేషాలు.. ధన్యవాదాలు.
@పానీపూరీ: బాగుందండీ అనుభవం.. సినిమా అయ్యాక జరిగే గొడవలు (ఇలాంటి విషయాల గురించి) భలేగా ఉంటాయి.. ధన్యవాదాలు.
@పద్మార్పిత: నిజమేనండీ.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@ప్రణీత స్వాతి: పాపం అమ్మమ్మ దగ్గర మళ్ళీ టిక్కెట్టు కి డబ్బులు కూడా సరిపడా లేవుటండీ.. అందుకే అంత కృతజ్ఞత :-).. ధన్యవాదాలు.
@జయ; బాగుంది మీ జ్ఞాపకం. నా అనుభవాలు.... రాస్తానండీ.. చాలా ఉన్నాయి మరి.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@శిశిర: ముందు రెండో సగం, తర్వాత మొదటి సగం.. అలా నేను కూడా చూశానండీ.. ధన్యవాదాలు.
@పరిమళం: మేమూ నడిచే వెళ్ళేవాళ్ళం అండీ.. అప్పుడప్పుడూ ఎడ్లబండి.. ధన్యవాదాలు.

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

వారసుడొచ్చాడు, విక్కీదాదా, రావుగారిల్లు, కొండవీటిదొంగ, ఇంద్రభవనం, సింహాసనం, శిలాశాసనం, అంకుశం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, స్టేట్‌రౌడీ, బొబ్బిలిరాజా, నిప్పురవ్వ, లారీడ్రైవర్...ఎన్నో ఎన్నెన్నో జురాసిక్ పార్క్, గాడ్జిల్లా, అనకొండ, జంతుప్రపంచం.
సినిమాల్లో నటించి ఈమద్యన ఈటీవీలో సెటిలయ్యాడే చిన్న అని వాడిది మాఊరే. మూర్లో ఉన్న సినిమాహాలు వాళ్ళదే. మొత్తానికి ఓఇరవయ్యేళ్ళు ఫ్లాష్‌బాకులోకి తీసుకెళ్ళి వదిలేశారు. మళ్ళీ ఈకాలానికి ఎప్పటికి తిరిగొస్తానో ఏమో

మురళి చెప్పారు...

@సుబ్రహ్మణ్య చైతన్య: అబ్బో..అబ్బో.. చాలా పెద్ద లిస్టే అండీ.. ఇవన్నీ ఇంట్లో తెలిసేనా, తెలియకుండానా? ఏం లేదు లెండి.. నాకు మాఇంట్లో పర్మిషన్ చాలా అరుదుగా దొరికేది, చిన్నప్పడు.. ...ధన్యవాదాలు.

kallurisailabala చెప్పారు...

లైట్ల వెలుగులో మిలమిలా మెరిసిపోతూ గోదారిసక. ఇసకని చూడగానే, అమ్మ వాళ్లక్కతో కలిసి దూదుంపుడక ఆట మొదలు పెట్టేసింది. వాళ్ళ తమ్ముడూ, చెల్లీ అయితే ఇసుక ఒకళ్ళ నెత్తిమీద మరొకరు ఎత్తిపోసుకునే ఆట. ఇసకలో ఏ మేకులన్నా ఉంటాయేమోనన్న అమ్మమ్మ ఖంగారుని అస్సలు పట్టించుకోలేదు వాళ్ళు.

నేల క్లాసుకదా. అప్పుడే ఈనిన కుక్క ఒకటి తన నాలుగు పిల్లలతోనూ అక్కడికి ప్రవేశించింది. చిన్న పిల్లలిద్దరూ, ఆ పిల్లలని తీసుకెళ్ళి పెంచుకోవాల్సిందే అని పేచీలు మొదలు పెట్టారు. వద్దని వాళ్ళని ఒప్పించేసరికి మిగిలిన వాళ్ళ తల ప్రాణాలు తోకకి వచ్చాయి. అంత సందట్లోనూ ఇసుకలో దొరికిన శంఖులు, రంగు రాళ్ళతో మావయ్య జేబులు నింపేసుకున్నాడు.

ఇవి ఎంత నచ్చాయి అంటే ఎంత చక్కటి జ్ఞాపకాలు. మేము చిన్నప్పుడు సినిమా చూసే వాళ్ళం కాదు వినేవాళ్ళం.దీని గురించి నా బ్లాగ్ లో త్వరలో ఒక పోస్ట్ రాస్తాను. చక్కటి పోస్ట్ చదివాను. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@కల్లూరి శైల బాల: తప్పకుండా రాయండి.. ధన్యవాదాలు.

Sridhar Pulluri చెప్పారు...

మీరు చెప్పిన అమ్మగారి జ్ఞాపకం నా కన్నుల ముందు మెడులుతున్నట్లు ఉంది....

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి