సోమవారం, జులై 20, 2009

కలవరమాయే మదిలో

"టూబీ ఆర్ నాట్ టూబీ.." షేక్స్పియర్ సృష్టించిన పాత్రకి కలిగిన సందిగ్ధమే కలిగింది నాకు. 'కలవరమాయే మదిలో..' సినిమా చూడ్డం కన్నా ఏదైనా గుళ్ళో హరికథా కాలక్షేపానికి వెళ్ళడం బెటరని ఒక స్నేహితుడి ఉవాచ. 'సినిమా మిస్సవ్వద్దు..యూ విల్ ఎంజాయ్ ఇట్..' అని సినిమా చూస్తూ ఇంటర్వల్లో మరో మిత్రుడి ఫోన్. అసలే 'గోపి గోపిక గోదావరి' షాక్ లో ఉన్నానేమో, కొంచం ఆలోచనలో పడ్డాను. సినిమా పేరు వినగానే 'పాతాళ భైరవి' ఆ వెంటే 'సాహసం సేయరా డింభకా..' గుర్తొచ్చాయి. సాహసం చేసేశాను.

శ్రేయ ('కలర్స్ స్వాతి) ఓ గాయని. శాస్త్రీయ సంగీతం రాదు, ఓ హోటల్లో పాటలు పాడుతూ ఉంటుంది. మరో పక్క చార్టెడ్ అకౌంటేన్సి చదువుతూ ఉంటుంది. తండ్రి లేని శ్రేయ కి తల్లే (ఢిల్లీ రాజేశ్వరి) అన్నీ.. ఆ తల్లికి సంగీతం అంటే కిట్టదు. ఎప్పటికైనా రెహ్మాన్ దగ్గర పాడాలన్నది శ్రేయ కల. (హమ్మయ్య.. హీరోయిన్ కీ ఓ లక్ష్యం ఉంది) లండన్ లో ఉండే శ్రీను (కమల్ కామరాజు, ఆవకాయ్-బిర్యాని ఫేం) ఓ ఆరు నెల్ల ప్రాజెక్టు కోసం హైదరాబాదు వచ్చి హోటల్లో శ్రేయ ని చూస్తాడు. తొలిచూపులోనే శ్రీను తో ప్రేమలో పడిపోతుంది శ్రేయ. పాపం, అతనికి ఇవేవీ తెలియవు, ఫారిన్ రిటర్న్డ్ కదా..

ఇలా చకచకా కథ సాగిపోతుండగా రావు గారు (విక్రం గోఖలే) అనే సంగీత విద్వాంసుడు ఓ రోజు హోటల్లో శ్రేయ సంగీతాన్ని అవమానిస్తాడు, దారుణంగా. శ్రీనూ కూడా శ్రేయ నేర్చుకోవాల్సింది చాలా ఉందనీ, రావుగారైతేనే సరైన గురువు అనీ చెబుతాడు. అసిస్టెంట్ శాస్త్రి (తనికెళ్ళ భరణి) మినహా తనకంటూ ఎవరూ లేని రావుగారు ముక్కోపి. కృత్యదవస్థ మీద ఆయన్నితనకి పాఠాలు చెప్పడానికి ఒప్పిస్తుంది శ్రేయ. శ్రేయ తల్లికి సంగీతం అంటే ఎందుకంత అలెర్జీ? రావుగారి గతం ఏమిటి? శ్రేయ తన లక్ష్యం సాధించిందా? శ్రీనూ కి తన ప్రేమని ప్రకటించిందా? ఇవన్నీ సినిమా రెండో సగం.

'హోప్' సినిమా తో దర్శకుడిగా పరిచయమైన సతీష్ కాసెట్టి కి దర్శకుడిగా ఇది రెండో సినిమా. తనే స్వయంగా సమకూర్చుకున్న కథమీద కె. విశ్వనాధ్, శేఖర్ కమ్ముల ప్రభావం బాగాకనిపించింది. సినిమా చూస్తున్నంత సేపూ 'శంకరాభరణం' 'సాగరసంగమం' 'స్వర్ణకమలం' 'ఆనంద్' 'గోదావరి' సినిమాలు గుర్తొస్తూనే ఉంటాయి. కథకి విశ్వనాధ్ సినిమాల నుంచీ, కేరెక్టరైజేషన్కి, కథనానికి శేఖర్ కమ్ముల సినిమాల నుంచీ స్ఫూర్తి పొందాడేమో అనిపించింది. హింస, ద్వందార్ధాలు లేకుండాక్లీన్ సినిమా తీసినందుకు మాత్రం దర్శకుడిని అభినందించాలి.

ఇది సంగీత ప్రధాన చిత్రం. శరత్ వాసుదేవన్ సంగీతం బాగుంది, ఎక్కడా సాహిత్యాన్ని (వనమాలి, సింగిల్ కార్డ్) మింగెయ్యకుండా. చాలా రోజుల తర్వాత చిత్ర గొంతు వినిపించింది. పాటల చిత్రీకరణ పట్ల మరింత శ్రద్ధ చూపితే బాగుండేది. విక్రం గోఖలే కి ఎస్పీ బాలు డబ్బింగ్ చక్కగా కుదిరింది, ఒకరకంగా రావు గారు పాత్రకి తన డబ్బింగ్ తో ప్రాణం పోశారు బాలు. శాస్త్రిగా తనికెళ్ళ నటన పాత్రోచితంగా ఉంది, రెండో సగంలో అక్కడక్కడా కాస్త శృతి మించినప్పటికీ. 'కలర్స్' స్వాతి ది కీలక పాత్ర. మరీ పేపర్లలో రాసినట్టు సావిత్రి ని మరపించలేదు కానీ, మునుపటి చిత్రాలకన్నా బాగా చేసింది.

కమల్ కామరాజు కండల ప్రదర్శన ఓకే. నటన, వాచకం, ఆహార్యం విషయాల్లో చాలా శ్రద్ధ చూపాలి. కీలక సన్నివేశాల్లో అతని నటన, వాచకం తేలిపోయాయి. ఆ ముదురు రంగు లిప్ స్టిక్ వాడకపోతే ఇంకా బాగుంటాడేమో. మొదటి సగం చాలా చక్కగా తీసిన దర్శకుడు రెండో సగం మీద మరికొంచెం శ్రద్ధ పెడితే బాగుండేది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ చెప్పే పధ్ధతి. రెండో సగం లో సినిమా నిడివి ని కొంచం తగ్గించొచ్చు, ఎడిటింగ్ ద్వారా. అనవసర సన్నివేశాలు లేవు కానీ, కొన్ని సన్నివేశాల నిడివి బాగా పెరిగింది. నేనైతే నా మిత్రులకి చూడమని చెప్పాను, 'మెంటల్ కృష్ణ' నిర్మాతల నుంచి వచ్చిన సినిమా అని భయపడొద్దని కూడా...

6 కామెంట్‌లు:

  1. సినిమా విడుదల రోజే చూశాను. జనాలక్కోపం వస్తుందేమో కానీ కొన్ని పాత సినిమాల్లో సావిత్రిది కూడా ఓవరాక్షనేగా! అందుకే స్వాతి సావిత్రిని మరిపించిది అన్నారేమో అనుకున్నాను. కానీ స్వాతి బాగా చేసింది నిజంగా! "అమ్మ చంపేస్తది" "బోరు కొడతది"వంటి కాజువల్ మాటలు కూడా ఎబ్బెట్టుగా అనిపించక బాగున్నాయి స్వాతి పాత్రకి! అష్టా చెమ్మా సినిమాలో బబ్లీ గర్ల్ పేరుతో చేసిన అతి నుంచి బయట పడింది. చెట్టు కింద ఏడ్చే సీన్లో నిజంగా కదిలించింది. రావు గారు పాత్రకి విక్రమ్ గోఖలే దాకా వెళ్ళక్కర్లేదు గానీ కాస్త వెరైటీగా ఉంటుందని తెచ్చుకున్నారేమో ముంబై నుంచి! ఆ పాత్రని చూడగానే "బాలు డబ్బింగ్"అనేసుకున్నాను ఇంకా ఒక్క డైలాగైనా రాకముందే!

    హీరో ఉన్నా లేకపోయినా ఓకే!

    ఆ ముదురు రంగు లిప్ స్టిక్ వాడకపోతే ....:-)

    రివ్యూ నిష్పాక్షికంగా ఉంది మురళీ ! నాకూ మీలాగే అనిపించింది.

    రిప్లయితొలగించండి
  2. hmmm......అయితే "గొ గో గో " దెబ్బ నుంచి త్వరగానే కొలుకున్నారన్నమాట.good.

    రిప్లయితొలగించండి
  3. హమ్మయ్య..చూడొచ్చన్నమాట. మొదటి లైన్ చదివాక ఇది కూడా నిరాశపరిచిందా!! అని ఓ నిటూర్పు.
    'హోప్' సినిమా మరీ అంత గొప్పగా ఏమీ ఉండదు. నాకైతే నార్మల్ గా కూడా లేదనిపించింది. మొత్తానికి ఈ సినిమాతో చాలా రోజులకు ధియేటర్ కి వెళ్ళే భాగ్యం కలగబోతుంది. అవును ఈ రోజు ఏమి చెప్పి ఆఫీస్ ఎగ్గొట్టారు?

    రిప్లయితొలగించండి
  4. ఐతే ధైర్యం చేయొచ్చంటారు ...
    నాక్కూడా మీ రివ్యూ చదివితే స్వర్ణకమలం గుర్తచ్చింది .
    ముదురు రంగు లిప్ స్టిక్? :) :)

    రిప్లయితొలగించండి
  5. @సుజాత: 'సావిత్రి' అనగానే సహజంగానే మనకి ఆవిడ 'మెచ్యుర్డ్' గా చేసిన పాత్రలే గుర్తొస్తాయి కదండీ. చెట్టు కింద ఏడ్చే సీన్ నాకూడా బాగా నచ్చింది.. 'వాడు సెకండ్ హాండ్ కాదే..' అని చెప్పే సీన్లో ముచ్చటగా అనిపించింది. మీరు మరీనండీ.. హీరో లేకపొతే డ్యూయట్లు ఎలా? హీరోయిన్ కి లక్ష్యం గురించీ, అమ్మ గొప్ప తనం గురించీ చిన్న చిన్న లెక్చర్లు కూడా ఇచ్చాడు కదా.. విక్రం గోఖలే బాగా చేశాడండి.. మనవాళ్ళు ఎవరైనా చేసే 'ప్రిడిక్టబుల్' అయ్యేదేమో.. ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. @తృష్ణ: అవునండీ.. ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: ఇంతకీ చూశారా? చూశాక చెప్పండి, మర్చిపోకుండా.. ధన్యవాదాలు.
    @పరిమళం: ఇప్పుడున్న వాటిల్లో బెటర్ అండి.. పర్లేదు ధైర్యం చెయ్యొచ్చు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి