ఆదివారం, జూన్ 19, 2011

మనమేంచేద్దాం?

ప్రస్తుతం భారతదేశంలో ఔషధ పరిశ్రమ టర్నోవరు ఏడాదికి అక్షరాలా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు. ఏ ఇతర పరిశ్రమల అభివృద్ధి గ్రాఫ్ లోనన్నా ఎగుడు దిగుళ్ళు ఉంటున్నాయేమో కానీ, ఈ పరిశ్రమ మాత్రం ఏటా ఇరవై శాతం వృద్ధి రేటుని నమోదు చేసుకుంటూ పైపైకి పోతోంది. అవును మరి, జనాభా పెరుగుతోంది, అనారోగ్యాలూ పెరుగుతున్నాయి. కొత్త కొత్తరోగాలకి కొత్త కొత్త మందులు కనిపెడుతూ ఈ పరిశ్రమ వెలిగిపోతోంది. ఫార్మసీ విద్య ఊపందుకుంది. భారతీయ ఫార్మసీ విద్యార్ధులకి ప్రపంచ దేశాల్లో డిమాండ్ పెరుగుతోంది.

ప్రపంచీకరణ పుణ్యమా అని అభివృద్ధి చెందిన దేశాలు తమ పరిశ్రమలని -- ముఖ్యంగా ఔషధ పరిశ్రమలని - భారత దేశంలో స్థాపించడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశాలు ఇక్కడ ఉండడమే మనమీద చూపిస్తున్న ప్రేమకి కారణం. ఔషధ పరిశ్రమల స్థాపన విషయంలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతూ ఉండడం మనకెంతో గర్వకారణం. అవును, ఈ పరిశ్రమలకి కావాల్సిన ముడిసరుకంతా ఇక్కడ చౌకగా దొరుకుతుంది, ప్రయోగాలు చేసే మెదళ్ళు కలిగిన నిపుణులతో పాటు ప్రయోగాలూ చేయించుకునే శరీరాలున్న అభాగ్యుల వరకూ.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ కి చెందిన కొందరు నిరక్షరాస్యుల శరీరాల మీద హైదరాబాద్ కి చెందిన ఒక ఔషధ పరిశ్రమ చేసిన ప్రయోగాలు ఈమధ్యనే వెలుగులోకి వచ్చాయి. పేపర్లు, టీవీలు వరుస కథనాల ద్వారా ప్రభుత్వంలో కొంత మేరకి చలనం రప్పించాయి. మంచిదే. కానీ, ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇలా జరగడం ఇదే మొదటి సారి కాదు. ఇంకా చెప్పాలంటే, గడిచిన పదేళ్ళ కాలంలో కేవలం మన రాష్ట్రంలోనే ఏడాదికి ఒకటి రెండు ఉదంతాలకి తక్కువ కాకుండా వెలుగు చూస్తూనే ఉన్నాయి.

మెజారిటీ కేసుల్లో, పరిశోధనల కోసం ఉపయోగ పడుతున్న వారికి తమ శరీరాలపై జరిగే ప్రయోగాలను గురించి కనీస అవగాహన లేదు. ఇందుకు కారణం వాళ్ళ అజ్ఞానం, నిరక్షరాస్యత. వాళ్ళనీ పనికి పురిగొల్పుతున్నవి ఆకలి, పేదరికం. స్వాతంత్రం వచ్చిన అరవైనాలుగేళ్ళ తర్వాత కూడా అపరిష్కృతంగా ఉండిపోయిన రెండు సమస్యలు. మనమిప్పుడు మన ఔషధ పరిశ్రమలు సాధిస్తున్న వృద్ధి రేటుని చూసి గర్వ పడాలా? లేక, తమ శరీరాలు ప్రయోగ శాలలుగా మారుతున్న విషయం కూడా తెలియకుండా, కేవలం ఆకలితో పోరాటం కోసం గినీ పిగ్స్ గా మారుతున్న మనవాళ్ళని చూసి సిగ్గు పడాలా?

ఇదొక్కటేనా? వ్యవసాయంలోనూ మన వృద్ధి రేటు బాగుంది. రైతుల కష్టానికి ప్రకృతి సహకారం తోడవ్వడంతో మంచి దిగుబడి వచ్చింది. రెండువేల పదో సంవత్సరంలో భారత దేశంలో ఉత్పత్తైన మొత్తం ఆహారధాన్యాలు రెండువందల ముప్ఫై ఐదు మిలియన్ టన్నులు. వ్యవసాయానికి సంబంధించి ఇది కొత్త రికార్డు. వ్యవసాయ ప్రధానమైన మన రాష్ట్రానికీ ఈ రికార్డులో భాగం ఉంది. మరి ప్రస్తుతానికి వస్తే? పత్తి రైతులకి విత్తనాలు దొరకడంలేదు. వరి పండించే రైతులు గిట్టుబాటు ధర లేక 'క్రాప్ హాలిడే' కి సిద్ధ పడుతున్నారు. గత దిగుబడిని చూసుకుని గర్వ పడాలా? భవిష్యత్తుని గురించి ఆందోళన చెందాలా?

ప్రతిష్టాత్మకమైన జాతీయ సాంకేతిక విద్యాలయాల్లో సీట్లు సంపాదిస్తున్న తెలుగు విద్యార్ధుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. జాతీయ స్థాయిలో ఏ పోటీ పరీక్ష జరిగినా విజేతల జాబితాలో మనవాళ్ళకి చోటుంటోంది. మరో పక్క, పదేళ్ళ క్రితం నమోదైన జననాల జాబితాకీ, ఇప్పుడు బళ్ళో ఉన్న పదేళ్ళ వయసు పిల్లల జాబితాకీ పొంతన కుదరడం లేదు. బళ్ళో లేని పిల్లలందరూ బాలకార్మికులే అన్న ప్రభుత్వ ఉవాచ ప్రకారం చూస్తే, బాలకార్మిక వ్యవస్థని పెంచి పోషించడంలో మనది రికార్డు. మరో పక్క విద్యార్ధుల ఆత్మహత్యలూ పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయ్. మనవాళ్ళ విజయాల్ని చూసి కాలరెత్తు కోవాలా? ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలని చూసి ఆవేదన చెందాలా?

హిందీ చిత్ర పరిశ్రమ తర్వాత, దేశంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఏటా పెద్ద సంఖ్యలో సినిమాలు నిర్మిస్తున్నది మన తెలుగు సినిమా పరిశ్రమే. ఏడాదికి కనీసం ఒకటి రెండన్నా రికార్డు స్థాయిలో వసూళ్లు తెచ్చే సినిమాలని అందిస్తూ, వేలాది మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి చూపిస్తోంది. కథానాయకుడు మినహా, మిగిలిన పాత్రలకి దేశంలో ఏ మూల ఉన్న కళాకారుల్నైనా తీసుకోగల, అంగీకరించగల ఔదార్యం కూడా మనసొంతం. అలాగే ఎన్ని కొత్త టీవీ చానళ్ళు వచ్చినా వద్దనకుండా ఆదరిస్తాం మనం. కానీ, సమాజంలో పెరుగుతున్న హింసకీ, ఆడపిల్లలపై పెరుగుతున్న దాడులకీ పరోక్ష కారణం కూడా ఈ సినిమాలు, చానళ్ళేనన్నది కాదనలేని నిజం. ...మళ్ళీ అదే ప్రశ్న, గర్వ పడాలా? సిగ్గు పడాలా?

11 కామెంట్‌లు:

  1. ఈ పరిశ్రమలకి కావాల్సిన ముడిసరుకంతా ఇక్కడ చౌకగా దొరుకుతుంది, ప్రయోగాలు చేసే మెదళ్ళు కలిగిన నిపుణులతో పాటు ప్రయోగాలూ చేయించుకునే శరీరాలున్న అభాగ్యుల వరకూ.
    -----------------------
    ఇది అంత కరెక్టు కాదేమో నండి. నిజం గా మనిషి ప్రాణాలకు విలువ లేదు అది మనకు చీప్ గా దొరికే ముడిసరుకే అన్న అభిప్రాయం చాల కంపనీలకి ఉన్న కూడా ఇలాంటి ప్రయోగాలకి ప్రభుత్వ అనుమతి అవసరం లేదా ? ఆ అనుమతి రావటానికి మన వాళ్ళు అడ్డదారులు తొక్కే మాట నిజమే కాని న్యూస్ లో రాస్తున్నట్లు , ఎలుకల మీద లేదా ఇతర జీవాల మీద ప్రయోగించాల్సినవి మనుషుల మీద వాడుతున్నారు అనేది మాత్రం నేను నమ్మను , మన దగ్గర ఈ రకమైన టెక్నికల్ న్యూస్ మామూలు న్యూస్ రాసే వాళ్ళే రాయటం వలన నిజం గా ఏమి జరుగుతుంది అనేది పక్కన పెట్టి అసలు విషయానికి ఈ emotions జోడించి రాయటం వలన కొంచెం సరైన విషయం మనకు తెలియటం లేదేమో అని నా అనుమానం . ఏది కేవలం నా అభిప్రాయం మాత్రమే, ఒకవేళ ఇది తప్పు కూడా కావచ్చు .

    హ్మ్ ! ఇక మిగిలిన విషయాల్లో ఏమి చేద్దాం ? నిజం గానే ఏమి చెయ్యలేని పరిస్తితి కాని ఈ పరిస్తితి కారణం మాత్రం నాకు ఎప్పుడు ఒకటే అనిపిస్తుంది ఏదైనా ఒకటి విజయవంతమైతే దాని వెనకే గొర్రల మందల లాగా పరిగెత్తే విపరీత దోరణి మనకు మహా ఎక్కువ, ofcourse ఈ దోరణి కి బోలెడు కారణాలు .
    అలాగే నిజాయితీ కి గౌరవం ఇవ్వటం మనకు చేతకాని పని , దీనితో నిజం గా కొద్దో గొప్పో నిజాయితీ గా ఉండాలి అనుకున్నవాళ్ళు కూడా దిగజారిపోతారు . వీటికి మాత్రం నిజంగానే సిగ్గుపడాలి , మన అభివృద్ధి అనేది బులుపు కాదు కేవలం వాపు .

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు, ఏంటో చాలా విషయాలు కవర్ చేసారు కాబట్టి, దేని గురించి కామెంటాలో అర్ధంకావట్లేదు. కొన్ని విషయాల్లో నాకు అంత అవగాహన కూడా లేదు. కాని, మొన్నామధ్య సత్యవతి గారి బ్లాగులో కూడా చూసిన విషయం, చదువురాని పల్లెటూరి వాళ్ళను ఔషధ కంపెనీలు ప్రయోగాల కోసం వాడుకోవటం మాత్రం చాలా ఘోరం. ఇందులో నా సొంత అనుభవం...
    నేను గత సంవత్సరం మా వూరు(అనకాపల్లి) డెలివరీ కి వెళ్ళాను. మా అక్క డెలివరీలు చేసిన డాక్టర్ గారు వేరే కారణాలవల్ల కేసులు తీసుకోవటం లేదు అని తెలిసింది. సరే అని తెలిసిన వాళ్ళను అడిగితే ఇద్దరు కొత్త దాక్టర్ల పేర్లు చెప్పారు. ఒకావిడ చాలా బిజీ అని రెండో డాక్టర్ని కలిసాము. ఆవిడ చాలా బాగుంది హాస్పిటల్ కుడా బానే ఉంది అనిపించి, చెకప్ కి వెళ్ళాను. అంతా బాగుందమ్మా అని ఏదొ ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చింది. ఈ టాబ్లెట్స్ రోజు రెండు వేసుకో అని. నాకు తొమ్మిదో నెల వచ్చేవరకూ నేను హైదరాబాదులోనే చెకప్ కి వెళ్ళాను, ఎప్పుడూ ఒక్క ఇబ్బంది కూడా రాలేదు. చక్కగా ఆఫీసుకి నేనే కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళి వచ్చేదాన్ని. మరి ఈ టాబ్లెట్స్ ఎందుకబ్బా అని అనిపించింది. ఎందుకో మా అప్పారావ్ కి టాబ్లెట్ పేరు చెప్పి నెట్లో చూడమన్నాను. తను అవి ఏవో స్టెరాయిడ్ తైప్ అని, అసలు ప్రెగ్నెన్సీ కి సంబంధం ఏమీ లేదని చెప్పారు. నా కు చాలా షాకింగ్ అనిపించింది. ఎందుకైనా మంచిదని మా తమ్ముడికి చెప్పాను ఈ విషయం కనుక్కోరా అని (వాడి క్లినికల్ రీసెర్చిలో పని చేస్తున్నాడు). వాడు కూడా ఈ టాబ్లెట్స్ కీ ప్రెగ్నెన్సీ కి ఏమీ సంబంధం లేదని అసలు ఆ డ్రగ్ మీద ఇంకా పూర్తి స్థాయిలో రీసెర్చి జరగలేదనీ, ఇకా అసలు విషయం, ఈ డ్రగ్ అసలు ప్రెగ్నంట్ వుమన్ వాడడం అడ్వైసబుల్ కాదనీ చెప్పాడు. నాకు నిజం గా కాళ్ళు వణికిపోయాయి. కానీ దేవుడి దయ వలన ఒక ఫామిలీ ఫ్రెండ్ ఇంకో సీనియర్ డాక్టర్ దగ్గరకి దగ్గరుండి తీసుకు వెళ్ళారు. తర్వాత అంతా బాగానే జరిగింది. నాకు ఒక్క టాబ్లెట్ కూడా అవసరం లేకుండా నార్మల్ డెలివరీలో ఆరోగ్యకరమైన పాప పుట్టింది.
    కాని, నేను ఈ టాబ్లెట్స్ విషయం ఏం చెయ్యాలో నాకు అస్సలు అర్ధం కాలేదు. అప్పుడు కొంతమందితో మాట్లాడడం వల్ల తెలిసినదేంటంటే, ఆ డాక్టరు కొత్తగా అంటె ఓ రెండు మూడేళ్ళ కితం ప్రాక్టీస్ స్టార్ట్ చేసారు, RTC complex దగ్గరగా ఉండటం వల్ల, ఆ క్లినిక్ కి చుట్టుపక్క వూళ్ళ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు, ఇంకా ఆవిడ మిగతా డాక్టర్లతో పోలిస్తే తక్కువ డబ్బులు తీసుకుంటారు. మొదట్లో ఈ విషయం గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తుంటే ఇంట్లో వాళ్ళు తిట్టరు, ఎక్కువ ఆలోచించవద్దని (నాకు బాగా నెలలు కదా). డెలివరీ అయ్యాక అస్సలు ఏ విషయం ఆలోచించే అవకాశం రాలేదు.
    అందుకే, మీ టపా టైటిల్ నాకు బాగా తగిలింది? మనమేంచేద్దాం? లేదా....నేనేం చెయ్యాలి ???

    రిప్లయితొలగించండి
  3. శ్రావ్య గారు,

    " ఇది అంత కరెక్టు కాదేమో నండి. నిజం గా మనిషి ప్రాణాలకు విలువ లేదు అది మనకు చీప్ గా దొరికే ముడిసరుకే అన్న అభిప్రాయం చాల కంపనీలకి ఉన్న కూడా ఇలాంటి ప్రయోగాలకి ప్రభుత్వ అనుమతి అవసరం లేదా ? ఆ అనుమతి రావటానికి మన వాళ్ళు అడ్డదారులు తొక్కే మాట నిజమే కాని న్యూస్ లో రాస్తున్నట్లు , ఎలుకల మీద లేదా ఇతర జీవాల మీద ప్రయోగించాల్సినవి మనుషుల మీద వాడుతున్నారు అనేది మాత్రం నేను నమ్మను "
    నిజమే మీరన్నట్టు, ఎలుకలమీద జరపవలసిన ప్రయోగాలు మనుషుల మీద జరగకపోవచ్చు. కాని, ఒక డ్రగ్ యొక్క పూర్తి పర్యవశానాలు తెలుసుకోకుండా, వాటి ప్రయోగాత్మక దశలో మనుషులకు ఇవ్వడం సరైనదేనా? అంటె నా అనుభవంలో జరిగినది తీసుకుంటే, ఆ డ్రగ్ వలన ఏమీఈ చెడు జరగకపోవచ్చు... అలానే చెడు జరగొచ్చుకూడా... మరి అలానిటి నెలలు నిండిన వాళ్ళకుఇస్తే, పుట్టే పిల్లలకి ఏమైనా ఐతే? అసలు ఇంకా ప్రయోగాలు జరుగుతున్న డ్రగ్స్ ఎలా రాసేస్తారు? ఇది మీరనుకుంటున్న చిన్న విషయం మాత్రం కాదని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అనకాపల్లిలోనే పరిస్తితి ఇలా ఉంటే మొన్నా మధ్య వెలుగులోకి వచ్చిన గిరిజన తండాల్లోని పిల్లల సంగతి ఏంటి?

    రిప్లయితొలగించండి
  4. రూత్ గారు నేను నా పై వాక్య లో చెప్పినట్లు నా అభిప్రాయం తప్పు కావచ్చు అండి . మీ పర్సనల్ experience మాత్రం మరీ బాధాకరం , నిజమే ఇలాంటివి చాలా చూస్తున్నాం అనవసరం గా మందులు , operations ఒకటి కాదు .
    నా వాక్య లో నేను చెప్పదలుచుకున్నది , కొన్ని విషయాలు మరీ అతి ఎత్తి చూపే మీడియా సరైన వివరాలు కాకుండా , emotions మీద ఆడుకోనేట్లు , లేదా కొన్ని రోజులు TRP ratings పెంచుకునేట్లు ఉండే వార్తల గురించి . ఇక నిజమే జనాల ఆరోగ్యం తో ఆడుకునే పనులు బోలెడు . ఉదాహరణకి ఫారిన్ కంట్రీస్ drug export చేసే అన్ని కంపెనీలు చేసే పని ఒకసారి ఆ వేరే దేశం కనక ఏదన్న తేడా వచ్చి ఆ మందులని reject చేస్తే , మళ్ళీ
    టాబ్లెటింగ్ లేదా కొన్ని సార్లు ఉత్త ప్యాకింగ్ మర్చి లోకల్ మార్కెట్ లో కి వదలటం , ఇంకా export చేసే డ్రగ్ డస్ట్ ని టాబ్లెట్ గా మర్చి మన మార్కెట్ లోకి వదలటం ఇలా ఒకటి కాదు . వీటన్నిటిని దారిలో పెట్టాలి అంటే స్ట్రిక్ట్ రూల్స్ impose చేయాలి , ఒకవేళ ప్రభుత్వం అదే పని చేస్తే మీడియా ఎంత వరకు వల్ల నాలిక మార్చదో నాకు అనుమానమే !
    ఇక మీరు అంటున్న ఖమ్మం గిరిజన యువతుల గురించి నేను చదివానండి , కాని దాని మీద సందేహాలు ఉన్నాయి , అది టెస్టింగ్ లో injection కాదు , పైగా విదేశాలలో వాడిన వాళ్లకి ఏ complications లేవు అని న్యూస్ దాని వల్ల మరి tropical conditions తో ఏమన్నా తేడా ఉంటుందేమో నాకు తెలియదు .

    రిప్లయితొలగించండి
  5. @శ్రావ్య వట్టికూటి: ఎందుకో ఈ టపా పోస్ట్ చేసేటప్పుడే మీ నుంచి స్పందన ఉంటుందని అనుకున్నానండీ.. మీడియా ఎగ్జాగరేషన్ విషయంలో మీతో ఏకీభవిస్తానండీ.. సెన్సేషనలైజ్ చేయడం ఇపుడు మీడియాకి అలవాటుగా మారిందన్నది బహిరంగ రహస్యమే. కాకపొతే, ఈ సమస్య కేవలం ఇప్పుడు వచ్చింది కాదు. కంపెనీలన్నీ కూడా కేవలం పేద, నిరక్షరాస్యులని మాత్రమే ప్రయోగాలకి ఎంచుకుంటున్నాయి. చేయబోయే ప్రయోగాలు ఏమిటన్నది వాళ్లకి కేవలం మాట మాత్రంగా కూడా చెప్పడం లేదు. ఇది మాత్రం చాలా రోజులుగా జరుగుతున్నదే. ఇది క్షమించరాని నేరమే అన్నది నా అభిప్రాయం. కనీసం చేయబోయే ప్రయోగాలు ఇవీ అని చెప్పి చేయడం ఒక పధ్ధతి. దానిని కూడా ఫాలో కాకపోవడం దారుణం అని నేను అనుకుంటున్నానండీ.. ఎలకల మీద వాడేవి కాదు, మనుషుల మీద వాదేవే అని అనుకుందాం, కానీ అదైనా చెప్పి చేయాలి కదా అన్నది నా పాయింట్. స్పందనని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. @రూత్: ముందుగా మీకు అభినందనలు.. పాపాయికి శుభాకాంక్షలు.. ఇక మీరు చెప్పిన విషయం.. ఒక డాక్టర్ అలా చేయడం, నిజంగా జీర్ణించుకోలేని విషయం.. విషయం తెలియగానే మీకు ఏమనిపించిందో ఊహించగలను.. డ్రగ్ కంట్రోల్ వాళ్ళు అప్పుడప్పుడూ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉంటారు కానీ, చేయాల్సింది చాలానే ఉంది.. పైగా ఈ మందుల కంపెనీల మధ్య అనారోగ్యకర పోటీ.. మిత్రులొకరు చాలా కాలంగా మెడికల్ రిప్ గా ఉన్నారు.. డాక్టర్ల గురించీ, కంపెనీలు వాళ్ళని పెట్టే ప్రలోభాల గురించీ ఆయన చెప్పే విషయాలు వింటుంటే ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది.. ఇదొక వలయం.. ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్తోంది.. ఇదే కాకుండా, మందుల్లో కల్తీ మరో సమస్య... దీనికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం మాత్రం ఉందండీ.. ఎందుకంటె ఇది మనందరి ఆరోగ్యానికి సంబంధించిన సమస్య.. ఏ చిన్న తేడా వచ్చినా పరిణామాలు దారుణంగా ఉంటాయి.. ...మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. ఈ టపా పోస్ట్ చేసేటప్పుడే మీ నుంచి స్పందన ఉంటుందని అనుకున్నానండీ..
    --------------------------
    హ్మ్ ! మురళి గారు ఎందుకలా :)

    రిప్లయితొలగించండి
  8. @శ్రావ్య వట్టికూటి: మరేమీ లేదండీ.. కరెంట్ అఫైర్స్ ని మీరు కొంచం ఎక్కువ శ్రద్ధగా పట్టించుకుంటారని నా చిన్న పరిశీలన. నిజం కావొచ్చు, కాకపోవచ్చు మరి :-))

    రిప్లయితొలగించండి
  9. హ హ అలా అంటారా , కొంచెం నిజమే అనుకుంటానండి :))

    నిజానికి ఇప్పుడు కొంచెం తగ్గింది కాని రెండు సంవత్సరాల క్రితం వరకు బాగా గ్రిప్ ఉండేది కరెంట్ అఫ్ఫైర్స్ పైన :)

    రిప్లయితొలగించండి
  10. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మాయమై పోతున్న అనాధ శవాల సంగతి ఏమిటి. ఏదో చికిత్సకు వెళితే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ కిడ్నీ ల దొంగ తనం ఏనాటికీ ఆగటం లేదు. పేదవారు ఎదుర్కొంటున్న సమస్యలకు టి.వి. చానళ్ళు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు. కాని అలా జరగటం లేదు.
    వర్షాలు లేవు కాబట్టి పంటలు లేవు...విత్తనాలు కూడా లేవు అంటున్న ప్రభుత్వం వరదనీటి నిలువ ఎందుకు చేయలేకపోతోంది. కోట్లు ఖర్చుపెడుతున్నాం అంటున్న ప్రభుత్వం సరి అయిన ఫలితం చూపించలేక పోవటానికి కారణమెవరు. లోపమెక్కడుంది. చట్టాలు సరిగ్గా లేవా...న్యాయం సరిగ్గాలేదా? చైనా లో సిగరెట్లు దిగుమతి చేస్తేనే ఉరి శిక్ష విధిస్తారు.
    ప్రభుత్వమే లంచగొండి అయినప్పుడు ఎన్ని నేరాలను వెలుగులోకి తెచ్చినా తొందరగానే మరుగునపడిపోతాయి. మన దృష్టిలోకి వచ్చిన నేరం గురించి ధైర్యం గా పోరాడగలిగే అవకాశం లేనప్పుడు ఎవరైనా ఏం చేయగలరు? స్వార్ధం తో కూడిన ఎన్నో సేవా సంఘాలు ఈ విషయాల జోలికి మాత్రం పోవు. అమాయకులు ఎన్నో విధాల నష్టపోతున్నారు. నేరస్తుడు తప్పించుకున్నా ఫర్వాలేదు ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అన్నది ఎంత వరకు సమంజసం. తప్పించుకున్న ఆ నేరస్తుడు ఇంకా ఎంతో మంది అమాయకులను తన నేరాలకు బలి చేయటం లేదా?
    విదేశాలకు వలసలు విపరీతంగా పెరగటానికి అసలైన కారణం ఏమిటీ?
    విద్యా స్థాయి పెరిగినా గ్రామీణ అభివృద్ధి లేదు. కాని బాల కార్మికులు తగ్గారనే అనిపిస్తోంది. వారిలో చదువు పట్ల, భవిష్యత్తు పట్ల ఒక అవగాహన పెరుగుతూనే ఉంది. ముందు ముందు మనకి పనిమనుషులు దొరక్క పోవచ్చు.
    పెరిగిన సాంకేతికాభివృద్ధి ఫలితం సైబర్ నేరాలా?
    యువతకు సరి అయిన ప్రోత్సాహం ఏది? ఎంతమంది స్వయంగా పరిశ్రమలు ఏర్పరుచుకో గలుగుతున్నారు. విపరీతమైన ఋణ భారాన్ని తట్టుకోగలుగుతున్నారు. గ్రామాభివృద్ధి సక్రమంగా ఎందుకు జరగటం లేదు? ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ సక్రమంగా చేస్తే చాలా మటుకు ఆర్ధిక సమస్య తీరుతుంది. యువత లో నిరాశ తగ్గి అభివృద్ధి కార్యక్రమాలకు ఉత్సాహం చూపిస్తారు. గ్రామాలలో స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు లేక పోవటం, వైద్యులు పోవటానికి ఇష్టపడక పోవటం లాంటివి తగ్గుతాయి.
    ఆర్ధిక సమస్యలే అనేక నేరాలకి కారణం. చేతికింద సహాయం చేసే వారు లేకపోతే పెద్ద నేరాలు కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉంది.
    సారీ అండీ ఇంకా చాలానే రాయాలని ఉంది. నా ఆవేశం కొంచెం తగ్గించుకుంటే మంచిది:)
    మీరు చాలా విషయాలే తట్టి లేపారు:)

    రిప్లయితొలగించండి
  11. @జయ: ఆలోచనలో పెట్టిందన్న మాట నా టపా! మీరన్నట్టుగా, మీడియాకీ, సేవా సంస్థలకీ వాళ్ళ ఎజెండాలు వాళ్లకి ఉన్నాయి. వాటికి తగ్గ విషయాలని మాత్రం హైలైట్ చేస్తూ ఉంటారు. మీడియా గుత్తాధిపత్యం కొంచం తగ్గింది కాబట్టి గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి కొంచం -- కేవలం కొంచం మాత్రమె -- నయం. వరద నీటినే కాదు, పండించిన పంటనీ నిలవ చేసే సౌకర్యాలు లేవు. నిజానికి పొరుగు రాష్ట్రాలకి తరలించి నిల్వ చేయొచ్చు. మనసుంటే మార్గాలకి కొదవ లేదు. కానీ సమస్య అక్కడే ఉంది. ఇక, బాల కార్మికులు తగ్గాల్సినంత వేగంగా తగ్గడం లేదండీ.. అలాగే మిగిలిన సమస్యలు.. ఆవేశం కన్నా, అప్పుడప్పుడూ అన్నా ఇలా ఆలోచనలు పంచుకోవడం వల్ల దీర్ఘ కాలంలో ఏదన్నా చిన్న ప్రయోజనం ఉండకపోదన్న ఓ ఆశ.. అంతేనండీ.. ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి