నాకు వ్యంగ్యం రాసేవాళ్ళంటే భలే ఇష్టం. నేను పతంజలి రచనలని ఇష్టపడడానికి ఉన్న అనేకానేక కారణాలలో ఆయన వ్యంగ్యాన్ని అలవోకగా రాసేయడమూ ఒకటి. దినపత్రికలలో, ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ మీద వచ్చే వ్యంగ్య రచనల్లో ఎక్కడో తప్ప క్వాలిటీ కనిపించదన్నది నా అభిప్రాయం. బహుశా, ఆయా రచయితలకి రాయడానికి ఎక్కువ సమయం ఉండకపోవడం వల్ల కావొచ్చు. అయితే ఒకానొక రచయిత రాసిన కాలమ్ ని మాత్రం వారం వారం ఎదురుచూసి మరీ చదివాను.
అవి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు పాలిస్తున్న రోజులు. దాదాపుగా పత్రికలన్నీ చంద్రబాబు లో ఉన్న 'పాలనా దక్షుణ్ణి' ని మాత్రమే చూస్తూ, పాఠకులని కూడా అలామాత్రమే చూడమన్న కాలం. చంద్రబాబు నిర్ణయాలనీ, ఆయన పాలనా శైలినీ విమర్శిస్తూ వచ్చే కథనాలు చాలా తక్కువగా ఉండేవి. అలాంటి సమయంలో నాకంట పడ్డ కాలమ్ 'జనాంతికం.' ఆంధ్రభూమి దినపత్రిక మూడో పేజీలో వారం వారం వచ్చే 'జనాంతికం' లో చంద్రబాబు పనితీరుని సున్నితమైన హాస్య, వ్యంగ్య ధోరణుల్లో విమర్శనాత్మకంగా సమీక్షించే వారు బుద్దా మురళి. నేను 'జనాంతికం' మురళి అని గుర్తు పెట్టుకున్నాను ఈయనని.
శీర్షిక కి సంబంధం లేని విషయం రాస్తున్నానని సందేహం కదూ.. అస్సలు కాదు. ఓ ఆరేళ్ళ క్రితం, ఎప్పటిలాగే పుస్తకాల షాపుకి వెళ్లాను, కొనుక్కోవలసిన పుస్తకాల జాబితాతో. మేనేజర్ నాకు మిత్రులే. ఆయన నాతో కబుర్లు చెబుతుండగా, నేను సేల్స్ కుర్రాళ్ళకి నాక్కావాల్సిన పుస్తకాలు చెప్పేశాను. "వాటితో పాటు 'ఓటమే గురువు' కూడా తెండిరా, సార్ కి," అన్నారాయన. పేరు వినగానే వ్యక్తిత్వ వికాసం అనిపించింది నాకు. "వద్దండీ, నేను పర్సనాలిటీ డవలప్మెంట్ పుస్తకాలు పెద్దగా చదవనని తెలుసు కదా మీకు" అన్నాను. ఆయన వినలేదు. "ఇది మీరు చదవాల్సిన పుస్తకం. మీరు కొనద్దు, నా గిఫ్ట్" అన్నారు.
మా కబుర్లు అవుతుండగానే పుస్తకాలు వచ్చేశాయి. అప్పుడు చూశాను 'ఓటమే గురువు' ని. రచయిత బుద్దా మురళి. "ఈయన ఆంధ్రభూమి లో రాస్తారు కదూ?" అని అడిగాను కించిత్ ఎక్స్సైటింగ్ గా. "ఆయనే, పుస్తకం చాలా బాగుంది. రాత్రే చదివాను," అన్నారు మేనేజర్. నేను బిల్ చెల్లిస్తానన్నా వినకుండా, నాకు కానుకగా ఇచ్చారీ పుస్తకాన్ని. మిగిలినవన్నీ పక్కన పెట్టి ఈ పుస్తకాన్నే మొదట చదివానని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.
'పరాజయం నుంచి విజయానికి' అన్నది ఉపశీర్షిక. ఇంగ్లిష్ నుంచి చెప్పో, చెప్పకుండానో 'స్ఫూర్తి పొంది' పేజీలు నింపేసే వ్యక్తిత్వ వికాస రచనలకి పూర్తి భిన్నంగా ఉందీ రచన. భారతీయ తాత్విక సంపద అయిన వేదోపనిషత్తుల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల జీవన శైలుల నుంచీ తీసుకున్న ఉదాహరణలు ఇది 'మన పుస్తకం' అనే భావనని కలిగించాయి. సిని, రాజకీయ రంగాల వారి వైఫల్యాలని, వాటిని వారు ఎదుర్కొన్న తీరునీ మధ్య మధ్యలో ప్రస్తావించారు మురళి.
'ఓటమికి ఏ ఒక్కరూ అతీతులు కార'న్న ప్రారంభ వాక్యాలు మొదలుకుని వైఫల్యాలని ఏ స్థాయిలో వారు ఎలా ఎదుర్కొంటారో వివరిస్తూ సాగిన ఈ రచన కేవలం ఓటమితో కుంగి పోయే వారిలో ధైర్యాన్నినింపడమే కాక, ఫెయిల్యూర్ ని ఒక అవకాశంగా ఎలా మలుచుకోవాలో చెబుతుంది. గుజరాత్ లో కొన్ని వ్యాపార కుటుంబాల వారు, తమ పిల్లలు చదువు పూర్తి చేశాక దేశం తిరిగి రమ్మని పంపుతారనీ, వ్యాపారంలో మొదట నష్టం వస్తే దానిని అనుభవం కోసం పెట్టిన పెట్టుబడిగా పరిగణిస్తారనీ చెబుతూ, ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన వారు కూడా ఒకప్పుడు నష్టాలు ఎదుర్కొన్న వైనాన్ని వివరించారు మురళి.
అప్పటివరకూ ఈ రచయిత రాసిన వ్యంగ్యాన్ని మాత్రమే చదివిన నాకు, ఆయనలో ఉన్న ఓ కొత్త కోణం కనిపించింది, పుస్తకం పూర్తి చేయగానే. చంద్రబాబుని ఈ పుస్తకంలోనూ విడిచిపెట్టలేదు రచయిత. కాకపొతే వ్యంగ్యంగా కాక, సీరియస్గా రాశారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఎందరి మెప్పో పొందిన చంద్రబాబుకీ వైఫల్యం తప్పలేదని చెబుతూనే, వైఫల్యాన్ని విజయానికి మెట్టుగా ఉపయోగించుకోడానికి ఆయన ఏమేం చేస్తున్నారో రాశారు. ఆద్యంతమూ విడిచిపెట్టకుండా చదివించే శైలి ఈ పుస్తకం సొంతం.
సంస్కృతి ప్రచురణలు ప్రచురించిన ఈ నూట ఇరవై పేజీల పుస్తకం వెల రూ. 60. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఏవీకెఎఫ్ లోనూ లభిస్తోంది. కేవలం వైఫల్యం ఎదురైనప్పుడు మాత్రమే కాదు, దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్ళని అధిగమించడానికీ ఈ పుస్తకాన్ని ఆశ్రయించవచ్చు. బుద్దా మురళి గారి బ్లాగుని కనుగొన్న ఆనందంలో, పుస్తకాన్ని ఓసారి తిరగేశాను. తర్వాతేం రాయబోతున్నారు మురళిగారూ?
నేను ట్రై చేస్తానండి ఈ బుక్ కోసం. ఆన్లైన్ లో దొరుకుతుందా?
రిప్లయితొలగించండిమురళి గారు ఈ మురళి నుంచి థాంక్స్ అందుకోండి . ఇప్పుడే ఆఫీసుకు రాగానే ఓ సారి బ్లాగ్స్ పై ఓ లుక్కేసి పని మొదలుపెడదామని హారం లోకి వెళ్ళాను . ఓటమే గురువు అని కనిపించి. అరే నాకు నచ్చిన టైటిలే అని మీ పేరు చూశాను. లోనికి వెళ్ళాను. నా బుక్ గురించే చదివాక చాలా సంతోషం వేసింది. ౨౦౦౪ లో ఆ పుస్తకం వచ్చింది. ప్రచురణలో సహకరించిన మిత్రుడు విశ్వేశ్వర్ రావు మంచి బుక్ సరిగా మార్కెటింగ్ చేయక నిర్లక్షం చేశామండి అని చాలా సార్లు చెప్పాడు. నేను బాగా అభిమానించే స్నేహితులు పరాజయాన్ని తట్టుకోలేకుండా ఉన్నప్పుడు నేనేమైనా ఉపయోగ పడగాలనేమో అని రాశాను. ఉపయోగ పడింది కూడా . అదే సమయంలో ఇల్లు కట్టుకోవడం వల్ల బుక్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆ మేనేజర్ బుక్ బాగుందని చెప్పి తన తరపున ఇచ్చాడని మీరు రాసింది చదివి సంతోషం వేసింది. ఇప్పుడు సమస్యలు ఎమీ లేవు వీలును బట్టి ఆ పుస్తకం, లేదా మరోటి అలా రాయడానికి ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండినిజమేనండి అప్పుడు అన్ని పత్రికలు బాబును ఆకాశానికి ఎత్హాయి . అప్పుడు ఇప్పుడు అతనిపై నా అభిప్రాయం ఒకటే. మరో సారి థాంక్స్
మురళిగారు,
రిప్లయితొలగించండినెమలికన్ను మురళిగారు జనాతికం మురళిగారిని పరిచయం చేయడం చాలా బావుంది. జనాంతికం మురళిగారిగానే కాక ఓటమే గురువు పుస్తక రచయితగా వ్యక్తిత్వవికాసం గురించి, జీవితంలో చాలా సహజంగా ప్రతిదశలోను మనిషికి ఎదురయ్యే ఓటమిని విజయానికి పునాదిగా ఎలా మార్చుకోవాలో చెప్పిన ఓ మంచి పుస్తకం కాసిన రచయితగా కూడా బ్లాగర్లకు పరిచయం చేయడం బావుంది. బుద్ధామురళిగారు అమృతమథనం బ్లాగులో జనాంతికం(ఆంధ్రభూమి లో) లో రాసిన వ్యాసాల అప్ డేట్ లతో పాటు, సికిందరాబాద్ కథలు పేరుతో అప్పటి ముచ్చట్లను మనతో పంచుకుంటున్నారు. తన రచనల ద్వారా సమాజహితం కలిగించే సాహితీ ప్రయోజనం సాధించడంతో పాటు, జనాదరణ పొందుతున్న ప్రక్రియలలో ఏదో జనాంతికంగా చెప్తున్నట్టు గా చెప్తూనే, జనామోదం పొందేలా రాయడంలో కూడా మురళి(బుద్దా) విజయం సాధించారు.
@హరిచందన: మొత్తం బుక్ ఆన్లైన్ లో లేదండీ.. ఏవీకెఎఫ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@బుద్దా మురళి: చాలా చాలా సంతోషంగా ఉందండీ, మిమ్మల్నిక్కడ ఇలా కలుసుకోవడం.. బ్లాగ్ కి మెనీ మెనీ థాంక్స్ చెప్పాలి నేను. తర్వాతెప్పుడో మీ పేరు చూసి బుక్ తీసుకునే వాడినేమో కానీ, మేనేజర్ మిత్రులు ఇవ్వక పోయి ఉంటే వెంటనే చదివే వాడిని కాదండీ మీ పుస్తకం. చాలా మంది మిత్రులకి రికమెండ్ చేశాను అప్పట్లో. బుక్ పేరు విని, నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం రికమెండ్ చేయడం ఏమిటని ఆశ్చర్య పోయిన వాళ్ళున్నారు :-) ఫ్రెండ్ మోసం రాశారా మీరు?!! రియల్లీ గ్రేట్.. పునః ప్రచురణ మీద దృష్టి పెట్టండి.. చాలా మంచి సేల్ ఉంటుంది.. ఇంకా చాలానే రాయాలని ఉంది నాకు.... మీ అభిప్రాయాన్ని ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@సుధ: 'అమృత మధనం' కొంచం ఆలస్యంగా నా దృష్టిలో పడిందండీ. నేనీమధ్య బ్లాగు రాయడం మీద చూపిస్తున్న శ్రద్ధ చదవడం మీద చూపించడం లేదనుకుంటా :-) మురళి గారి గురించి మీరు చెప్పిన వాటితో పూర్తిగా ఏకీభవిస్తాను.. రెండో మాట లేనే లేదు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపరిచయం బాగుంది మురళి గారు. బుద్దామురళి గారు ఫ్రెండ్ కోసం రాశాననడం నన్ను ఇంకా అబ్బుర పరచింది. ఈ పుస్తకం సంపాదించడానికి ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: డిస్ప్లే లో ఉండదు కానీ, గుంటూరు వెళ్ళినప్పుడు విశాలాంధ్ర లో ప్రయత్నిస్తే తప్పక దొరుకుతుందండీ.. అప్పుడప్పుడూ తిరగేయాల్సిన పుస్తకం.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినేను బుద్ధా మురళి గారి బ్లాగులో వ్యాఖ్య రాసినా, వారు నా బ్లాగులో వ్యాఖ్య రాసినా ఒక తోటి బ్లాగరుగా మాత్రమే. మీ ఈ పరిచయం వారి గురించిన మరిన్ని వివరాలను తెలిపింది. Thanks for the post.
రిప్లయితొలగించండి@శిశిర: వారి బ్లాగుని కనుగొన్న ఆనందంలో రాసిన టపా అండీ ఇది.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఈ పుస్తకం పరిచయం చేసినందుకు మీకు నెనర్లు.
రిప్లయితొలగించండిఅమృతమథనం తరచు చదువుతుంటాను. ఆయన శైలి, ఎంచుకునే విషయాలు కూడా ఆసకతికరంగా ఉన్నాయి.
@కొత్తపాళీ: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి