బుధవారం, జూన్ 01, 2011

శుభసంకల్పం

కొన్ని కొన్ని అనుబంధాలు మాటలకందవు, మనసుని పట్టుకుని వదలవు. రాఘవ రాయుడు గారికీ, దాసుకీ ఉన్న అనుబంధం అలాంటిదే. నిజానికి వాళ్ళిద్దరూ ఎవరికి ఎవరూ ఏమీ కారు. కానీ ఒకరికొకరు అన్నీను. దాసు తెచ్చే చేపలపులుసు లేనిదే రాయుడుగారి భోజనం పూర్తవ్వదు. రాయుడు గారు వచ్చి నిలబడందే దాసు గుమ్మానికి మావిడి తోరణం వేలాడదు. అలాంటి రాయుడు గారికి కలిగిన ఒకానొక సంకల్పాన్ని దాసు 'శుభసంకల్పం' గా నెరవేర్చిన కధాక్రమమే పదహారేళ్ళ క్రితం కళాతపస్వి కే. విశ్వనాథ్ అందించిన 'శుభసంకల్పం.'

ఆస్కార్ కి నామినేట్ కాబడ్డ తెలుగు సినిమా 'స్వాతిముత్యం' అనంతరం విశ్వనాథ్-కమలహాసన్ కలిసి పనిచేయడానికి పదేళ్ళు ఆగాల్సి వచ్చింది. ఇందుకు పూనిక గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానిది. తనే నిర్మాతగా మారి తన గురువు కోదండపాణి పేరుమీద ఏర్పాటు చేసిన శ్రీ కోదండపాణి ఫిలిం సర్క్యూట్స్ పతాకం పై నిర్మించిన ఈ సినిమా ద్వారానే విశ్వనాథ్ నటుడిగా తన ఇన్నింగ్స్ ప్రారంభించారు. అంతేకాదు, 'సిరిసిరిమువ్వ' తో మొదలైన 'విశ్వనాథ్ మార్కు' సినిమాలా ఒరవడిలో ప్రస్తుతానికి దీనిని చివరి సినిమాగా చెప్పొచ్చు.

సముద్రం ఒడ్డున ఉన్న ఊళ్ళో ఓ ధనవంతుడు రాఘవ రాయుడు (కే. విశ్వనాథ్). కొడుకుల్లేని ఆయన 'దత్తుడి' ని దత్తతకి తీసుకున్నారు. ఈ దత్తుడు వ్యసనాలకి బానిస. అదే ఊళ్ళో ఉండే జాలరి కుర్రాడు దాసు (కమల్ హాసన్) అంటే రాయుడికి చాలా చాలా అభిమానం. అక్షరాలు రావన్న మాటే కానీ దాసు జ్ఞాపకశక్తి అమోఘం. ఓసారి విన్న ఏ అకౌంట్ లెక్కనీ మర్చిపోడు దాసు. ఇక దాసుకి రాయుడంటే భయభక్తులు. రాయుడి మాట అచ్చంగా వేదవాక్కే. రాయుడి అంతరంగికుడు చెన్నకేశవ (గొల్లపూడి మారుతిరావు), వంటవాడు భీమరాజు (రాళ్ళపల్లి)..వీళ్లెవరికీ రాయుడితో లేని చనువు దాసుకి ఉంది.

మణిపాల్ లో ఉండి మెడిసిన్ చదువుతున్న రాయుడి అమెరికా మనవరాలు సంధ్య (ప్రియా రామన్) కి తాత అంటే చెప్పలేనంత ఇష్టం. కేవలం తాతకి దగ్గరగా ఉండడం కోసమే తల్లీ తండ్రీ అమెరికాలో స్థిరపడినా తను ఇండియా వచ్చి మెడిసిన్ లో చేరింది. దాసుకి తనకంటూ ఉన్నది నాయనమ్మ లక్ష్మమ్మ (నిర్మలమ్మ) ఒక్కర్తే. దాసుకో సంబంధం చూసి పెళ్లి చేయాలన్నది ఆవిడ ఏకైక ఆశయం. అందగాడైన దాసుకి ఎన్నో సంబంధాలు వస్తూ ఉంటాయి కానీ, అతనికి ఎవరూ నచ్చరు. వడ్రంగం పని చేసుకునే గంగామహాలక్ష్మి (ఆమని) తో ప్రేమలో పడతాడు దాసు.

ఈ ప్రేమకథని సంధ్య ద్వారా తెలుసుకున్న రాయుడు దాసు-గంగల పెళ్లి జరిపించడంతో పాటు, వాళ్ళని హనీమూన్ కి పంపుతాడు కూడా. తన ఖర్చులకి డబ్బివ్వని తండ్రి, దాసుకోసం ఇంత ఖర్చు చేయడం కంటగింపవుతుంది దత్తుడికి. తన జల్సాలకోసం కళ్యాణం (కోట శ్రీనివాసరావు) దగ్గర అప్పులు చేస్తూ ఉంటాడతడు. డబ్బుకోసం దత్తుడి ఆగడాలు శ్రుతిమించడంతో, తన డబ్బుని దాసు దగ్గర ఉంచి, దానితో జాలర్ల కోసం పక్కా ఇళ్ళు, ఆస్పత్రి కట్టించడం, వాళ్లకి పడవలు కొనివ్వడం లాంటి కార్యక్రమాలు చేయాలని నిర్ణయిస్తాడు రాయుడు.

ఓ పసి బిడ్డకి తల్లైన గంగ, తన ప్రాణాలని పణంగా పెట్టి ఆ డబ్బుని కాపాడుతుంది. మరోపక్క, రాయుడి ప్రాణాలు కాపాడడం కోసం గంగ జీవించి లేదన్న సత్యాన్ని దాస్తారు దాసు, సంధ్య. ఈ నిజం రాయుడికి తెలియడం, రాయుడి సంకల్పాన్ని దాసు నెరవేర్చడం ఈ సినిమాకి ముగింపు. నటన గురించి చెప్పాల్సి వస్తే కమల్ హాసన్-ఆమని-విశ్వనాథ్-ప్రియారామన్ ఈ నలుగురూ నాలుగు స్థంభాలుగా నిలబడ్డారు. దాసుని ప్రేమించే అమాయకపు అమ్మాయిగా, రాయుడి ఆశయ సాధన కోసం తపించే ఇల్లాలుగా గంగ పాత్రని సమర్ధంగా పోషించిన ఆమని రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకుంది.

దాసు మీద సముద్రమంత ప్రేమని గుండెలోనే దాచుకునే పరిణతిగల అమ్మాయి సంధ్య పాత్రని ప్రియా రామన్ పోషించిన తీరుని తక్కువ చెయ్యలేం. నిజానికి తన తొలి సినిమా 'విజయ' తర్వాత ('వళ్ళి' అనే తమిళ సినిమాకి తెలుగు డబ్బింగ్) ప్రియారామన్ కి దొరికిన మరో చక్కని పాత్ర ఇది. ఇక కమల్-విశ్వనాథ్ లు నటనలో అక్షరాలా పోటీ పడ్డారు. అప్పటివరకూ నటుడిగా విశ్వనాథ్ మీద ఎలాంటి అంచనాలూ లేకపోవడం వల్ల అనుకుంటా, మొదటిసారి చూసినప్పుడు దాసు కన్నా రాయుడి నటనే బాగుందనిపించింది. గంగ చనిపోయిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో, దాసుగా కమల్ నటనని మరో నటుడి నుంచి ఆశించలేం.

చెన్నకేశవగా గొల్లపూడిది చక్కని పాజిటివ్ పాత్ర. చిన్నవే అయినా నిర్మలమ్మ, రాళ్ళపల్లి, సాక్షి రంగారావు, వైష్ణవి లకి చక్కని పాత్రలు దొరికాయి. ఈ సినిమాలో నాకు అర్ధం కానిది ఏమన్నా ఉందంటే అది కోట పోషించిన కళ్యాణం పాత్ర. ఆ సన్నాయి మేళం ఏమిటో, పసుపు నీళ్ళు ఏమిటో..అసలదంతా ఎందుకో అర్ధం కాదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ మేనరిజాన్ని కోట బాగానే అభినయించినప్పటికీ చూడ్డానికి విసుగొచ్చింది. అన్నట్టు ఈ సినిమాలో ఓ రెండు ఫైట్స్ కూడా ఉన్నాయి. ఇది విశ్వనాథ్ సినిమాల నుంచి అస్సలు ఊహించని ప్రేక్షకులకి, కళాతపస్వి ఇచ్చిన షాక్ అన్నమాట.

నిర్మాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వయానా సంగీత దర్శకుడు కూడా అయినప్పటికీ ఈ సినిమాకి కీరవాణి చేత సంగీతం చేయించుకోడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మహదేవన్, ఇళయరాజాలని కాదని విశ్వనాథ్, కీరవాణి వైపు మొగ్గు చూపడం విశేషమే. కీరవాణి మాత్రం దొరికిన అవకాశాన్ని బహు చక్కగా ఉపయోగించుకున్నారు. ఇప్పటికీ కీరవాణి టాప్ టెన్ సినిమాల జాబితా వేస్తే అందులో ఈ సినిమాకి తప్పక చోటుంటుంది. ముఖ్యంగా సినిమా ఆసాంతమూ ఆమనికి సంబంధించిన సన్నివేశాలు వచ్చేటప్పుడు నేపధ్యంలో వచ్చే ఒక ఆలాపన వెంటాడుతుంది ప్రేక్షకులని.

పాటల్లో ఏ పాట గురించి ముందుగా చెప్పాలి? అసలు 'శుభ సంకల్పం' పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చే పాట 'సీతమ్మ అందాలూ..' అయితే, సాహిత్య పరంగానూ, చిత్రీకరణ పరంగానూ నాకు బాగా నచ్చే పాట 'నరుడి బ్రతుకు నటన..' గంగ చనిపోయిన విషయాన్ని దాసు, రాయుడి నుంచి దాచే సందర్భంలో వచ్చే పాట ఇది. 'సాగర సంగమం' కోసం తను రాసిన 'తకిట తధిమి' పాటకి మరో వెర్షన్ రాసి తానేమిటో మరోమారు నిరూపించుకున్నారు వేటూరి. ముఖ్యంగా "ఆదివిష్ణు పాదమంటి ఆకాశాన ముగ్గుపెట్టి...జంగమయ్య జంటకట్టి...కాశిలోన కాలుపెట్టి...కడలి గుడికి కదిలిపోయే గంగా..." అనే లైన్స్ అనితర సాధ్యాలు.

బాగా నచ్చే ఇంకో పాట "ఎవరు ఇచ్చారమ్మ ఇన్నక్షరాలు..." ఇందులో "గుడిలేని దేవత.. నడిచిపోతా ఉంటే.. అడుగడుగూ దండాలు పాదాలకి.. పసుపు పాదాలకి.. పసుపు వేదాలకి..." లైన్స్ మళ్ళీ మళ్ళీ వింటాను నేను. తర్వాత చెప్పుకోవాల్సింది "హరిపాదాన పుట్టావంటే గంగమ్మా.." ఇందులో చివర్లో వచ్చే "నీలాల కన్నుల్లో సంద్రమే..నింగి నీలమంతా సంద్రమే.." వినాలంతే.. ఈ పాట చిత్రీకరణ మాత్రం పూర్తిగా విశ్వనాథ్ మార్కు స్నానదృశ్యం. దీని తర్వాత "చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి..." చిత్రీకరణ కంటతడి పెట్టిస్తుంది. ముఖ్యంగా "గుండెలోనే ఉంది గుట్టుగా గంగ...నీ గంగ.." లైన్స్. "మూడు ముళ్ళు ఏసినాక..." మాంచి రొమాంటిక్ గా ఉంటే, "హైలేసో.. హైలేసో.." కేరళ టూరిజాన్ని ప్రమోట్ చేసే పాట. ఒక్క "శ్రీశైలంలో మల్లన్న.." పాట మాత్రం రాయుడి పాత్ర ఎలివేషన్ కోసం ఇరికించినట్టుగా ఉంటుంది.

కథని ఎంచుకోవడం మొదలు, తెరకెక్కించడం వరకూ ఇది విశ్వనాథ్ మాత్రమే చేయగలిగే ప్రాజెక్ట్ అనిపించే సినిమా ఇది. సున్నితమైన భావోద్వేగాలని, తనదైన శైలిలో చిత్రించారు విశ్వనాథ్. హాస్యం కోసం ఇరికించిన ఒకటి రెండు సన్నివేశాలు, విలనీ మినహాయిస్తే ఎక్కడా విసుగు రాని విధంగా సాగుతుంది సినిమా. పీసీ శ్రీరాం చాయాగ్రహణం, గొల్లపూడి సంభాషణలు... ఇవన్నీ కథ మూడ్ దెబ్బ తినని విధంగా సమకూరాయి. ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో సాగే కథనంతో, దాసు-గంగ ల కొడుకుని తీసుకుని సంధ్య అమెరికా నుంచి ఇండియా రావడంతో సినిమా మొదలవుతుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి, ఆమె దాసు మీద తన ప్రేమని తాతయ్యకి చెబుతుంది. రాయుడి ద్వారా దాసుకి తెలుస్తుంది. ఊహించని ముగింపు వల్ల ఓ మంచి చూసిన అనుభూతి మిగులుతుంది ప్రేక్షకులకి.

15 కామెంట్‌లు:

  1. ఒక గొప్ప ఆర్ట్ మూవీని మీ పోస్ట్ ద్వారా మరోసారి తలచుకున్నామండి!

    రిప్లయితొలగించండి
  2. ఎప్పటిలానే ఒక మంచి సినిమా గురించి చాలా బాగా రాశారు మురళి గారు. ఈ రోజు ఉదయం నుండి ఎందుకో “నీలాల కన్నుల్లో సంద్రమే..నింగి నీలమంతా సంద్రమే..” లైన్ చాలా సార్లు గుర్తుచేసుకున్నాను ఇపుడు మీ రివ్యూ చూసి చాలా సంతోషించాను. ఈ సినిమాలో నాకు పంటి కింద రాయిలా తగిలేది కళ్యాణం పాత్రే, దాని నిడివి తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. సముద్రంలో చిక్కుకున్న బెస్తవాడిగా కమల్ మూకాభినయం కూడా చాలా బాగుంటుంది దాని గురించి చెప్పడం మరిచినట్లున్నారు :-)

    అలానే బామ్మ మనవళ్ళ అనుబంధం వారిద్దరికీ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు కూడా నాకు భలే ఇష్టం అన్నీ అలా గుర్తుండిపోయాయి. ముగింపు వలన ఈ సినిమా మీద ఇష్టం/గౌరవం పదింతలు పెరిగుతుంది.
    ఈ సినిమాకి సంగీతం కీరవాణి అని నాకు చాలా రోజుల వరకూ తెలీదు. ఎందుకో పాటలతో నేను అంతగా కనెక్ట్ అవ్వలేకపొయాను. అక్కడక్కడా బాగుంటాయ్ కానీ ఒక థీంతో సాగకుండా పాటలన్ని అక్కడక్కడ తెచ్చి అతుకులు వేసినట్లుగా అనిపిస్తుంది. సినిమా చూసేటప్పుడు మాత్రమే నేపధ్యసంగీతాన్ని పాటలను ఎంజాయ్ చేశాను. ఆల్బంగా మాత్రం నన్ను ఆకట్టుకోలేకపోయింది.

    రిప్లయితొలగించండి
  3. "శుభసంకల్పం" నిజంగా ఇది నాకు నచ్చిన సినిమాలో ఒకటి. కమల్ హాసన్, విశ్వనాథ్, ఆమని, ప్రియారామన్ నటన చాల బాగుంటుంది. సీతమ్మ అందాలూ పాట చాల బాగుంటుంది. విశ్వనాథ్ గారి నుండి మల్లి ఇలాంటి ఆణిముత్యాలు లాంటి సినిమాలు వస్తాయి అని నమ్మకం పోయింది. కానీ ఇలాంటి సిమాలు కోసం వెయిట్ చూడటం తప్ప మనము చేసేది ఏమి లేదు.
    మోహన్

    రిప్లయితొలగించండి
  4. విశ్వనాథ్ మార్కు సినిమాలలో చివరిదీ శుభసంకల్పం అనడం ఒప్పుకుతీరాల్సిన నిజం. ఏం చేస్తాం. తోడేకొద్దీ కొబ్బరినీళ్ళంటి నీళ్లిచ్చే ఊటబావి కారెందుకు ఇలాంటి మహానుభావులు?

    రిప్లయితొలగించండి
  5. శుభసంకల్పం లో విశ్వనాథ, నటన నటన పోటీపడిచేస్తారు...నిజమే. కానీ నాకీ సినిమాలో కొత్త కమల్ ని చూసినట్టుంటుంది...అతనిలాంటి నటుడు మరి ఇంకెవ్వరూ లేదేమో అనిపిస్తుంది. అది అతనికే సాధ్యమైన నటన.
    మీరన్నట్టు ఆ రెండో కొడుకు, కోటా విలనీ శుద్ధ దండగ...పంటికింద రాయిలా తగులుతుంటుంది.

    నాకు బాగా నచ్చిన పాటలు: చినుకులైపోయె చిత్రకావేరి, ఎవరు ఇచ్చారమ్మ ఇన్నక్షరాలు, హరిపాదాన పుట్టావంటే గంగమ్మ...ఈ మూడు ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు.

    ముఖ్యంగా "ఊరు: మమతలూరు, తాలూకా: ఊహాపురంజిల్లా; అనంతగిరి"....."అడుగడుగున దండాలు పాదాలకి, పసుపువేదాలకి", "నడిసంద్రంలోనీగడపేదమ్మా గనగమమ"....ఈ ముక్కలు వేటూరివారు మాత్రమే రాయగలరు.

    రిప్లయితొలగించండి
  6. mee visleshana chalaa baagundhi..chinnabbayi chitram laa..fighting..movies unnayi.. meerannattu viswanath gari mark chitralu.. ika choodalemu yemo!!.

    రిప్లయితొలగించండి
  7. అవునండి, ఈ సినిమా చాలా బాగుంటుంది. ఆ ఊహించని మలుపేంటో నాకూ తెలుసు:)

    రిప్లయితొలగించండి
  8. @పద్మార్పిత; ధన్యవాదాలండీ..
    @వేణూ శ్రీకాంత్: అసలు కీరవాణి ఎంపికే చాలా ఆశ్చర్య పరిచిందండీ నన్ను.. నిజమే మామ్మా-మనవళ్ళ అనుబంధం బాగా తీశారు.. జాలరి నృత్యం నాకెందుకో మరీ గొప్పగా అనిపించలేదండీ.. ధన్యవాదాలు.
    @అమ్మాయి కళలు: కొత్తవి వచ్చే వరకూ పాత సినిమాలు మళ్ళీ మళ్ళీ చూసుకోడమేనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. @కొత్తావకాయ: ప్చ్.. నిజమేనండీ.. తలచుకుంటే బాధగానే అనిపిస్తోంది కానీ ఏం చేస్తాం?? ..ధన్యవాదాలు.
    @రాజ్ కుమార్: ధన్యవాదాలండీ..
    @ఆ.సౌమ్య: పాటలు రచన, సంగీతం, చిత్రీకరణా.. అన్నీ చక్కగా కుదిరాయండీ. అప్పట్లో టేపు తెగిపోయింది మా ఇంట్లో !! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @వనజ వనమాలి: 'శుభ సంకల్పం' తర్వాతే 'చిన్నబ్బాయి' తీశారండీ.. ఆ సినిమా గురించి మాట్లాడక పోవడమే మంచిదేమో.. ధన్యవాదాలండీ..
    @జయ: చూశారన్న మాట అయితే... ఏమాటకామాట.. భలే ఊహించని మలుపు కదండీ :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. స్వయంగా సున్నితంగా ఉండే వేటూరికి తరచూ మంచివాళ్ళతో తగువులవుతూ ఉండేవేమో అనిపిస్తూ ఉంటుంది. జంధ్యాలతో కొన్నాళ్ళు ఆయనకు మాటల్లేవని (కానీ, పాటలు మాత్రం వ్రాసిపెట్టేవారని) ఒక వ్యాసంలో చదివాను. విశ్వనాథ్ తో తగువు వలనే సిరివెన్నెల మనందరికీ పరిచయం అయ్యారు. మహానుభావులు కొట్టుకున్నా అది మనకు మంచిదే అయ్యింది.

    బాలు బ్రతిమలాడి మళ్ళీ వేటూరిని, విశ్వనాథ్ ని ఈ చిత్రంతో కలిపారు అని వినికిడి. వెనక్కు రావడమేమిటి వేటూరి కలం విదిలించి ముత్యాల వాన కురిపించారు. అద్భుతమైన పాటలు, అద్భుతమైన సంగీతం.

    రిప్లయితొలగించండి
  12. @సందీప్: విశ్వనాధ్ తో పొరపొచ్చాలు రాకుండా ఉండి ఉంటే వేటూరి ఇంకెన్ని మంచి పాటలు రాసి ఉండేవారో కదా అనిపిస్తూ ఉంటుందండీ అప్పుడప్పుడూ.. కానీ అపుడు మనం బహుశా 'సిరివెన్నెల' ని మిస్సయ్యి ఉండే వాళ్ళమేమో అనిపిస్తూ ఉంటుంది కూడా :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. ఈ సినిమా వచ్చేటప్పటకి ఇళయరాజా గారి పాటల్లో మాధుర్యం తగ్గిపోయింది..ఇక వున్న సంగీతదర్శకుల్లో కీరవాణి గారు మాత్రమే live instruments తో సంగీతం చేయగలరు..అప్పటికే విశ్వనాథ్ కీరవాణి గార్ల కాంబినేషన్ లో వచ్చిన ఆపాద్భాందవుడు మంచి సంగీతభరిత చిత్రం..కీరవాణి గారు ఎలాంటి సినిమా అయినా చేయగలరు అని చెప్పటానికి ఇది ఒక నిదర్శనం...చినికులన్నీ కలిసి చిత్ర కావేరి అనే పాట ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది...

    రిప్లయితొలగించండి
  14. @విఘ్నేశ్, రఘు : నిజం చెప్పాలంటే, ఆపద్భాందవుడు పాటల కన్నా ఈ సినిమాలో పాటలు బాగున్నాయనిపిస్తుంది నాకు. ..ధన్యవాదాలు.
    రఘుగారూ, మీ బ్లాగు రాయడం లేదేమండీ?

    రిప్లయితొలగించండి