మంగళవారం, జూన్ 14, 2011

బ్రేక్ గురించి...

నిన్, నున్, లన్, కూర్చి, గురించి ల సంగతి తెలుసు కానీ కొత్తగా ఈ బ్రేక్ గురించి ఏమిటనే కదా సందేహం? వస్తున్నా.. వస్తున్నా.. కొంచం శ్రద్ధగా టీవీ చూసి చాలా రోజులయ్యిందని గుర్తు రావడంతో సాయంత్రం రిమోట్ ధారినై టీవీ ముందు సెటిలయ్యాను. ఇంకా చానళ్ళు తిప్పడం మొదలుపెట్టనే లేదు, ఈటీవీలో 'ప్రేమతో మీలక్ష్మీ' ప్రోగ్రాం. గెస్ట్ అలీ, తన సినీ ప్రస్థానాన్ని గురించి చెప్పడానికి ప్రయత్నాలు చేస్తుండగా, హోస్టు అడ్డుకుంటూ మోహన్ బాబుతో అనుబంధాన్ని గురించి చెప్పమని బలవంతం చేస్తోంది.

అలీ తన ఓటమిని అంగీకరించి సదరు వసూల్రాజుతో తన పరిచయాన్ని చెప్పడం మొదలు పెట్టాక, అతన్ని వాక్యం పూర్తి చేయనీయకుండా బ్రేక్ ఇచ్చేసింది పరిచయకర్త. మనం మన సబ్జక్ట్ లోకి వచ్చేశాం. నేనప్పుడు అమందానంద కందళిత హృదయారవిందుడనై బ్రేక్ ని ఆస్వాదించడం మొదలుపెట్టాను. నాకీ అలవాటు కొత్తగా వచ్చింది కాదు, దూరదర్శన్ రోజులనుంచీ వచ్చిందే. కొత్త టీవీ అవ్వడంతో దూరదర్శన్ వాళ్ళు ఏం ప్రసారం చేసినా రెప్ప వాల్చకుండా చూసేవాళ్ళం అప్పట్లో.

నిజం చెప్పాలంటే వాళ్ళు ప్రసారం చేసే కొన్ని కార్యక్రమాల కన్నా, మధ్యలో వచ్చే ప్రకటనల విరామాలూ, అంతరాయాలూ భలేగా ఉండేవి. కార్యక్రమాలు మరీ విసుగ్గా ఉంటే విరామమో అంతరాయమో వస్తే బాగుండునని కోరుకునే వాళ్ళం. చూడ్డం మానేయోచ్చు కదా అంటే, కొత్త టీవీ చూడకపోతే ఎలా? "సూర్యుడు అస్తమించని గ్రామం.." అంటూ వచ్చే ఇరిడా వాళ్ళ ప్రకటన అప్పట్లో నా ఫేవరేట్. అది కనుక వస్తుంటే, నేనెక్కడున్నా ఇంట్లోవాళ్ళు మర్చిపోకుండా నన్ను పిలిచే వాళ్ళు.

అప్పుడు మొదలైన ప్రకటనల సరదా అలా అలా కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికీ ఏదన్నా ప్రకటన బాగుంది అనిపిస్తే మళ్ళీ మళ్ళీ చూడడం కోసం ఎదురు చూస్తాను నేను. యూట్యూబ్ వీడియోలో చూసే అవకాశం ఉన్నా, టీవీలో చూడడమే బాగుంటుంది నాకు. ఒకమ్మాయి ముఖం నిండా దోమ కాట్లతో క్లాస్ లో కూర్చుని ఉంటే, టీచర్ అత్యంత ఆందోళనగా "ఏం జరిగింది శ్రద్ధా?" అంటే "దోమ కుట్టింది టీచర్" అని ఆ అమ్మాయి చాలా గర్వంగా చెప్పే మస్కిటో రిపల్లెంట్ ప్రకటన ఈ మధ్య కాలంలో నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ ముచ్చటగా ఉంటుంది.

ఇప్పుడెందుకో రావడం లేదు కానీ, మొన్నామధ్య వరకూ ఓ పౌష్టిక పానీయం ప్రకటన వచ్చేది. "మామిడికాయలు చేతికి అందడం లేదు.. నాకూ వయసొస్తోంది.. అయినా.." అంటూ ఓ బుడతడు తెగ బాధ పడిపోయేవాడు. నాకేమో ఒకటే నవ్వు. వాడంత ఉండగా నాకూ మామిడికాయలు అందేవి కావు, రాయి పెట్టి కొట్టేవాడినే కానీ, ఇలా బాధ పడేవాడిని కాదు. అసలలా బాధ పడాలని కూడా తెలీదు నాకు. అలాగే 'మరక మంచిదే' ప్రకటనలో టీచర్ ని చూడగానే పిల్లల ముఖంలో మారే హావభావాలు, డిటర్జెంట్ పౌడర్ ప్రకటనలో దిష్టి బొమ్మ వేషం వేసుకున్న మనవడిని చూడగానే బామ్మ కళ్ళలో వెలుగూ.. ఇవన్నీ నచ్చుతాయి.

అమితాబ్-జయబాధురీల జ్యూయలరీ ప్రకటన చూశారా ఎవరైనా? బాగుంటుంది కానీ, అది వస్తున్నంత సేపూ నాకు గుండెలు బితుకు బితుకుమంటూ ఉంటాయి, ఎలాంటి ఉపద్రవం వస్తుందో అని. తాతా, మనవడూ ఫోన్లో చదరంగం ఆడుకునే మొబైల్ ఫోన్ ప్రకటన ఇప్పుడు మార్చేశారు కానీ అప్పట్లో భలేగా ఉండేది. 'లడ్డూ తింటావా నాయనా' ప్రకటన పిల్లలనే కాదు, పెద్దవాళ్ళనీ టెంప్ట్ చేసేస్తుంది. సబ్బులు, షాంపూలు, సౌందర్య క్రీముల ప్రకటనలేవీ ఈమధ్యన అంతగా గుర్తు పెట్టుకోదగ్గవి రాలేదు.

బాగా చిరాకొచ్చే ప్రకటనలకీ లోటు లేదు. "లేచి పోయి పెళ్లి చేసుకుందాం.. అందరికీ రిసెప్షన్ ఇద్దాం" ప్రకటన చూస్తుంటే టీవీ పగలగొట్టాలనిపిస్తుంది. అంత బాధ్యత లేకుండా ఎలా తీస్తారో? సినిమాల ప్రకటనల్లో ఒకప్పుడు "చూసిందే చూడబుద్దేస్తోంది" పెద్ద హిట్. తర్వాత అంతగా క్లిక్కైన యాడ్ మరొకటి లేదు. "కత్తి, కేక.." అని ప్రేక్షకుల (?) చేత చెప్పించినా ఉపయోగం ఉండడం లేదనేమో, ఈమధ్యన ఆ తరహా ప్రకటనలు తగ్గించారు. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారి డబ్బింగ్ సినిమా తాలూకు ప్రకటన వచ్చినపుడు టీవీ సౌండ్ తగ్గించుకోవాలి.

మళ్ళీ ఈటీవీ దగ్గరికి వద్దాం. ఒకానొక బ్రేక్ లో 'మమత' ప్రీమియర్ షో ప్రకటన వచ్చింది. జూన్ ఇరవై ఆరు మధ్యాహ్నం మూడూ నలభై ఐదుకి ప్రసారం. అదేమిటో కానీ ప్రకటనలో కనిపించిన వారంతా (సుమన్ బాబుతో సహా) రకరకాల యాంగిల్స్ లో దుఃఖపడుతూనే కనిపించారు. అసలు 'కన్నీటికి వరదొచ్చింది' అనే టైటిల్ అయితే సరిగ్గా సరిపోయేదేమో అనిపించింది. షో చూస్తే కానీ టైటిల్ కి అర్ధం బోధ పడక పోవచ్చు. పర్లేదు, అందులో కూడా బ్రేకులు ఎక్కువగానే ఉంటాయి.

30 కామెంట్‌లు:

  1. :)) బాగుంది. నాకూ అలాగే అనిపిస్తుంది మీరు చెప్పిన.. రిసెప్షన్ వచ్చాక ఇద్దాం.. జంట ని చూస్తే...

    రిప్లయితొలగించండి
  2. మురళిగారు, మీరు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం...ఎప్పటిలాగే గుండె దిటవు చేసుకొని చూసి రివ్యూ రాయండే...

    రిప్లయితొలగించండి
  3. "....లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారి డబ్బింగ్ సినిమా తాలూకు ప్రకటన వచ్చినపుడు టీవీ సౌండ్ తగ్గించుకోవాలి...."

    నిజం!.... నిజం!..... (ఆకాశవాణి కాదు నేనే అంటున్నాను) ఆ చెప్పే ఆవిడెవరో కాని దాదాపు రెండు దశాబ్దాల నుండి తెలుగు వాళ్ళను పీడిస్తున్నది. అందరూ చందాలేసుకుని ఆవిడకి ఇప్పుడు వస్తున్నసంవత్సరాదాయం వడ్డీ కింద వచ్చేంత డబ్బు పోగుచేసి బాంకులో వేసే బృహత్ కార్యక్రమ ఎవరన్న మొదలు పెడితే నా వంతు చందా నేను ఇవ్వటానికి సిద్ధం. ఒక్కటే షరతు, ఈ డబ్బు తీసుకుని మళ్ళి ఎక్కడా ఆవిడ గొంతు వినపడకుండా ఆవిడే జాగ్రత్త పడాలి. ఆవిడ చెప్పే పద్ధతి అంత నీచంగా ఉంది అసహ్యం వెగటు కలిగిస్తుంది. అందుకే కాబోలు పరమ చెత్త ప్రకటనలన్నీ ఆవిడ గొంతులోనే వస్తుంటాయి.

    రిప్లయితొలగించండి
  4. ఎంత మమకారం మరియు మమత మీకు సుమన్ బాబు మీద? మీరు ఎలాగోలా ఈసారి మళ్ళీ ఈ మనసు-మమత చూసేసి మకు మాంఛి రివ్యు రాసేయాలని కోరుకుంటున్నామండీ :))))

    మీలాగే నాకు ప్రకటనలంటే భలే ఇష్టం :) నాకు బాగా నచ్చేది ఇదివరకు డైరీ మిల్క్ చాక్లెట్ ఆడ్! చేతులకు గోరింటాకు పెట్టుకున్న ఆ అమ్మాయ్ డైరీమిల్క్ తినడానికి పడే కష్టం..ఎంత బాగుంటుందో...అలాగే సంఫ్లవర్ ఆయిల్ ఆడ్..అందులో పిల్లాడు పూరిలు మీదకి దొర్లి...దోసలోనించి జారి...ఇలా ఉంటుంది కదా! అది భలె ఇష్టం :) ఇలా ఎన్ని ఆడ్లో! నాకు టీవీలో అన్నిటికంటే నచ్చేది ఈ ప్రకటనలే! ఇక పాండ్స్ డ్రీంఫ్లవర్ ఆడ్,అదేదో టాయిలెట్ క్లీనర్ ఆడ్... సంస్కారవంతమైన సోప్ అనే ఇంకో ఆడ్ చూస్తే డోకొస్తుంది!

    రిప్లయితొలగించండి
  5. బాగుంది మురళి గారు, కాకపోతే ఈసారి మీ pattern మారిందేమో అనిపించింది కొంచెం.

    "నేనప్పుడు అమందానంద కందళిత హృదయారవిందుడనై బ్రేక్ ని ఆస్వాదించడం మొదలుపెట్టాను"
    కేక డైలాగు , ఎక్కడినుంచి తెచ్చారో అర్ధం కాలేదు :-)
    మీరు చెప్పిన వాటిలో చాల ఆడ్స్ అంటే నాకు కూడా చాల ఇష్టం. ఆడ్స్ ని కూడా ఇష్టంగా చూసే నా లాంటి వాళ్ళు చాల తక్కువ మంది వుంటారేమో అనుకునేదాన్ని.
    మాకు టీవీ చూసే అదృష్టం చాల తక్కువగా వుంటుంది కానీ ఈ మద్య చూసినప్పుడు jr .NTR చేసిన jewellery ad నాకు చాల బాగా నచ్చింది. అందులో act చేసిన అమ్మాయి expressions చాల బాగుంటాయి.
    ఐతే మీరు ఇంకో సుమన్ బాబు programme కోసం ఎదురు చుస్తున్నరన్నమాట. మేము కూడా మీ reviews కోసం ఎదురు చూస్తుంటాము :-)

    రిప్లయితొలగించండి
  6. లక్ష్మీ గణపతి ఫిలింస్ సంగతి తెలియదు కానీ ఒక భయంకరమైన గొంతు ఎనభై-తొంభైల్లో వివిధ భారతి లో అందర్నీ పీడించేది. 'బ్లా-బ్లా-బ్లా- వారి ఖైదీ నంబ సెవెన్ ఎయిట్ సిక్స్" అంటూ. ఆవిడకి మా బంధు వర్గంలో "గొంతమ్మ" అని పేరు కూడా పెట్టాం.

    మురళి గారూ, సుమన్ సినిమా కోసం నేను బాగా ఎదురు చూస్తున్నానండీ! ఎందుకో తెలుసనుకుంటాను. సినిమా రాగానే రివ్యూ రాసేయండి. దానితో పాటుగా సుమన్ బాబువి ఒక రెండు ఫుటోలు కూడా. మరి ప్రవాసాంధ్రులం, మా ఆశలెలా తీర్తాయి చెప్పండి?

    శారద

    రిప్లయితొలగించండి
  7. naku abishek idea ads anni nachutayi
    movies lo antha baga act cheyadu enduko mari:)
    anniti kante perfume ads chuste,ee ladies ni chusi aa vedava alanti ads chesada anipistundi.
    mari perfume smell ke ala behave chestaru ani cupinchadam vundi chusaru,vadini emi chesina papam ledu.

    రిప్లయితొలగించండి
  8. అది వస్తున్నంత సేపూ నాకు గుండెలు బితుకు బిగుకుమంటూ ఉంటాయి, ఎలాంటి ఉపద్రవం .......
    :)).
    క్రికెట్ గ్రవుండ్ లో అమ్మాయి డ్యాన్స్ చేసే క్యాడ్బరీ యాడ్ కూడా నచ్చేది నాకు.
    >>వసూల్రాజా
    :))
    .నేనూ మీ సుమన్ బాబు సినెమా రివ్యూ కోసరం ఎదురు చూసింగ్ మరి.

    రిప్లయితొలగించండి
  9. మురళిగారు, మార్పుకు ముగింపు పాడేసాను...మీరొకసారి చూస్తారని ఆశిస్తూ..

    http://pootarekulu.blogspot.com/2011/06/blog-post_14.html

    http://pootarekulu.blogspot.com/2011/06/2.html

    http://pootarekulu.blogspot.com/2011/06/blog-post_15.html

    రిప్లయితొలగించండి
  10. అలీ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ నేనుకూడా కొంత చూసానండి. హోస్టుగారు ఆలీని "అంకుల్" అని అన్నారేంటో అస్సలు అర్ధం కాలేదు? హోస్టుగారు వయసు అంచనా వెయ్యలేకపోతున్నాను :-)

    రిప్లయితొలగించండి
  11. బాగుందండి.. అన్నట్టు అలీ కూడా అంకులేనట.. హేమిటో!

    రిప్లయితొలగించండి
  12. మురళి గారూ, సుమన్ బాబు గురించి మీరు ఇంకొంత మంది రాయగా చదివి ఆనందపడటమే తప్ప, చూసి తరించే అదృష్టదురదృష్టం ఇంకా పట్టలేదు. కాబట్టి, మీరు సుమన్ సినిమా చూసి రాసే రివ్యూ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తాను.

    రిప్లయితొలగించండి
  13. కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాలో నరేష్ కృష్ణ డూపుగా డ్యాన్స్ బాగా చేస్తే ఆ ఊళ్లో కొందరు కృష్ణ అభిమానులు స్టేజి మీదకొచ్చి మెడలో కరెన్సీ దండ వేసి"గురూ మా బాసులా చాలా బాగా చేసారు.మా బాసుమీద అభిమానంతో ఈ దండ వేశాం.ఈ ఊరు దాటే దాక దండ తీయొద్దం"టాడు దాంతో హీరో తర్వాతి రోజు స్నానానికెళ్లబోయినా దండ తీయనివ్వరు. దండతీస్తే బ్యాచంతా "హలో" అంటూ వచ్చేస్తారు.
    వేరేదో జంధ్యాల సినిమాలో సుత్తి వీరభద్రరావు కవిత్వంతో చావగొడుతుంటే ఆయనకి సన్మానం గజారోహణం చేయించి ఏనుగునే బహుమతిగా ఇస్తారు. ఏనుగుని పోషించలేక కవిగారు పీనుగై పోతారు.
    అలా ఏదైనా ప్లాన్ చేయాలండీ మన సుమన్ బాబుకి. ఐనా బాబే వాళ్ల డాడీకి ఒక ఏనుగు అలాంటి బాబునే భరాయిస్తున్నారంటే ఏనుగుల్లాంటివి ఓ లెక్కకాదు. ఇంక అభిమానంతో దండేస్తే బాబు స్నాం మానేసినా మానేస్తాడు గానీ దండ తియ్యడు. మరేం చేద్దావంటారూ?
    --సూరంపూడి పవన్ సంతోష్.

    రిప్లయితొలగించండి
  14. నాక్కూడా ప్రకటనలంటే చాలా ఇష్టం. నేనైతే వాటిని 'మజా లు' అంటాను. నాకైతే ఈ మజాల లిస్ట్ చాలా పెద్దదే ఉంది. భలే రాసారు.

    రిప్లయితొలగించండి
  15. @కృష్ణప్రియ: ఈమధ్య కాలంలో అంతగా నచ్చని ప్రకటన మరొకటి లేదండీ.. ధన్యవాదాలు.
    @శ్రీ: తప్పకుండానండీ.. చూడ్డానికి వీలవ్వాలే కానీ, రాయడం యెంత పనీ?? :)) ..ధన్యవాదాలు.
    @శివరామప్రసాద్ కప్పగంతు: నిజంగానే చాలా ఇరిటేటింగ్ వాయిస్ అండీ.. ఈ మధ్యన కార్పోరేట్ కాలీజీల ర్యాంకుల ప్రకటనలక్కూడా ఆవిడ గొంతే అనుకుంటా వినిపిస్తోంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @ఇందు: మనసు-మమత కాదండీ.. 'మమత' మాత్రమే!! అన్నట్టు ఆ డైరీ మిల్క్ యాడ్ నాక్కూడా నచ్చుతుంది.. ధన్యవాదాలు.
    @కరుణ: కేక డైలాగుని (:-)) చాన్నాళ్ళ క్రితం ఎక్కడో చదివానండీ.. అలా గుర్తుండిపోయి, ఇది రాస్తుండగా మళ్ళీ ఎందుకో గుర్తొచ్చింది.. ధన్యవాదాలు.
    @శారద: ఆ గొంతమ్మే ఈ గొంతమ్మ అని నా సందేహం అండీ.. అవునూ, ప్రవాసాంధ్రులకి ఈటీవీ ప్రసారాలు రావడం లేదా? సుమన్ బాబుకో ఉత్తరం రాయండి అయితే :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @శ్రావ్య: నిజమేనండీ, అభిషేక్ ఆ మధ్యన ఐడియా యాడ్స్ లో బాగా చేశాడు.. పెర్ఫ్యూమ్స్, మాట్లాడడం వేస్టేమో కదండీ... ధన్యవాదాలు.

    @రిషి: మొత్తం మీద చాక్లెట్ల ప్రకటనలు మిగిలిన వాటికన్నా బాగుంటున్నాయండీ.. వీలు కుదిరినప్పుడు ఓ చిన్నపాటి పరిశోధన చెయ్యాలి :)) ..ధన్యవాదాలు.

    @శ్రీ: అవునండీ, 'అంకుల్' అని మొదటిసారి అన్నప్పుడు అలీ ఎక్స్ ప్రెషన్ చూశారా? చూడకపోతే చాలా మిస్సైపోయినట్టు.. తప్పండీ, ఆడపిల్లల వయసు అందునా సినిమా వాళ్ళది అసలు ఊహించకూడదు :)) ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @శిశిర: ఒక్క యువ హీరోలు మినహాయించి, మిగిలిన సిని, రాజకీయ జీవులంతా అంకుల్సే అనుకుంటానండీ.. వాళ్లకి లేని అభ్యంతరం మనకి మాత్రం ఎందుకు చెప్పండి? :)) ..ధన్యవాదాలు.

    @పద్మవల్లి: అవునా?!! మీరేదేశంలో ఉన్నారో ఆ వివరాలతో సుమన్ బాబుకి ఓ ఉత్తరం రాయండి, 'మమత' వచ్చే నాటికి మీ ఇంట్లో ఈ టీవీ మోగకపోతే నన్నడగండి.. వీలు కుదిరి చూడాలేకానీ, తప్పక రాస్తానండీ.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  19. @పక్కింటబ్బాయి: భలే సినిమా గుర్తు చేశారు.. నాకిప్పుడా డిస్కు చూస్తే కానీ నిద్ర పట్టదు. అన్నట్టు, ఏం చెయ్యాలో బాబునే అడిగేద్దామా? :)) ..ధన్యవాదాలు.

    @జయ: 'మజాలు' ..మాంచి పేరు పెట్టారండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. మురళి గారు, ఇప్పుడు ETV వస్తుంది మాక్కూడా, కాని ఎప్పుడూ చూడను. అందుకే ఆ అదృష్టం కలగేలేదు. ఈసారి ఆఫీసు కేలెండర్లో రిమైండర్ పెట్టుకుని మరీ చూసి తరించాలి. :-))

    రిప్లయితొలగించండి
  21. @పద్మవల్లి: తప్పకుండా చూడండి.. యెంత చదివినా చూసినదానికి సాటిరాదు మరి :))

    రిప్లయితొలగించండి
  22. ఆరోగ్యం జాగ్రత్త మాష్టారు, ఈ వారం మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోండి, బులుసుగారు చేతులెత్తేసారు, ఇక మిగిలింది మీరే, సుమన్ బాబు ఏకైక ప్రేక్షకులు, మీరు మమత చూసి ఒక మాంచి రివ్యూ రాస్తే, మేము కుడా కన్నీళ్ళు తుడుచుకుంటూ మీ రివ్యూ చదివి, మీ త్యాగానికి గుర్తింపుగా 4 కామెంట్లు రాసి పోతాము.

    రిప్లయితొలగించండి
  23. మురళిగారు,
    మీరు చెప్పిన ప్రకటనల్లో ఒక లడ్డూకావాలా అని దొంగోడి యాడ్ వస్తుంది కదా. అది భలే ఉంటుంది. మనకూ అలా దొరికితే ఎంత బావుండు అని ఆశ కూడా కలుగుతుంది..ప్చ్..

    జరుగుతున్న సినీరాజకీయ పరిణామాలకు విరక్తి కలిగి ఈసారి సుమన్ బాబు సినిమా చూసి తరించి నిలదొక్కుకుని టపా కట్టాలని ఉంది. (పైకి కాదండి బాబు. బ్లాగులో ). మీలా, బులుసుగారిలా ధైర్యంగా ఉండగలుగుతానో లేదో. కాస్త మీరంతా నా పేరుమీద అర్చనలు,హారతులు జరిపించేయండి. గుడికొద్దులెండి. అనవసరంగా ఖర్చు దండగ. మనసులో చెప్పేసుకోండి.. ఉంటా మరి. 26 తర్వాత కలుద్దాం..

    రిప్లయితొలగించండి
  24. నా అగ్నానాన్ని మన్నించి యీ సుమన్ బాబు అనగా అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి పాత్ర ధారియేనా చెప్పగలరు...నేను యీ పేరు చదివినప్పుడల్లా..తెగ కన్ 'ఫ్యూసు" అయిపోతున్నా..

    రిప్లయితొలగించండి
  25. @తార: ఆరోగ్యానికి హాస్యాన్ని మించిన ఔషధం ఏముంది చెప్పండి? అదెలాగూ సేవించే అవకాశం ఉంది కదా! కామెంటుదేముంది కానీ, మీరు కూడా చూసే ప్రయత్నం చేయకూడదూ? :)) ...ధన్యవాదాలు.
    @జ్యోతి: మీరు మరీ భయపడుతున్నారు.. నిజానికి చాలా కామెడీ గా ఉంటుందండీ.. నవ్వే ఓపిక ఉండాలంతే :)) ..ధన్యవాదాలు.
    @ఎన్నెల: హన్నా! యెంత సందేహం? జూన్ ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం మూడూ నలభై ఐదుకి తీరిక ఉండేలా జాగ్రత్త పడి, ఆ టైం కి ఈటీవీ తిప్పండి. సుమన్ కీ -సుమన్ బాబు కీ తేడాని మీరు మళ్ళీ జీవితంలో మర్చిపోతే నన్నడగండి :)) ... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. మీ బ్రేక్ గురించిన వివరాలు బాగున్నాయండీ.. నాకు కూడా చిన్నప్పటినుండీ ప్రకటనలపై ప్రత్యేకమైన ఆసక్తి. సూర్యదేవర రామ్మోహనరావుది అనుకుంటా ఒక పత్రికలో సీరియల్ వచ్చేది చాన్నాళ్ళక్రితం ఎడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీను బేస్ చేసుకుని. అందులో ఈ ప్రకటనల గురించిన ట్రివియా చాలా బాగుండేది ఆసక్తికరమైన సమాచారాన్ని ఇచ్చేవాడు. నాకు అప్పటినుండే ఆసక్తి పెరిగింది. ఇప్పటికీ ఎపుడైనా తీరిక దొరికితే యూట్యూబ్ లో ఈ ప్రకటనలకు సంభందించిన కొత్త వీడియోలు చూస్తుంటా..
    మీరు చెప్పినప్రకటనల్లో నాకూ చాలా వరకూ ఇష్టం. ఏదేమైనా కానీ నిన్న సుమన్ బాబు మమత సినిమా చూస్తున్నప్పుడు వచ్చిన బ్రేక్ టైంని ఎంజాయ్ చేసినంతగా ఇంతవరకూ ఎప్పుడూ ఎంజాయ్ చేసి ఎరుగను.

    రిప్లయితొలగించండి
  27. @వేణూ శ్రీకాంత్: హ..హ... ఇలాంటప్పుడే బ్రేక్ విలువ ఏమిటో తెలుస్తుందండీ.. మీరు చదివిన సూర్యదేవర నవల 'అక్షర యజ్ఞం.' మౌనిక, మాధుర్ హీరో హీరోయిన్లు. అంత గొప్ప హీరోయినూ ఫ్లాపైన కార్ మోడల్ ని ప్రమోట్ చేయడం కోసం హీరో దగ్గర ఉద్యోగానికి రావడం, పకోడీ అంటే ఏమిటో తెలియక (ఆవిడ కోటీశ్వరురాలు మరి!) ఇబ్బంది పడడం.. 'ది మోస్ట్ స్పేషియస్ కార్ ఆన్ ది రోడ్' క్యాంపెయిన్.. అబ్బో.. చాలా సంగతులే ఉన్నాయండీ.. 'స్వాతి' లో అనుకుంటా సీరియల్ గా వచ్చింది. తర్వాత నవల కూడా వచ్చింది. మా కాసిన్ ఒకరు ఈ నవల ప్రభావంతో వాళ్లమ్మాయికి మౌనిక అని పేరు పెడదామనుకున్నారు కూడా!! చాలా జ్ఞాపకాల్ని కదిలించారు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. 'అక్షర యజ్ఞం.' మౌనిక, మాధుర్ హీరో హీరోయిన్లు.

    హ్మ్ పేరు ఇంకా గుర్తు రావడం లేదండీ కానీ ప్లాట్ ఇదే అనుకుంటా.. ముందు ఈ పుస్తకం సంపాదించి చదువుతాను లెండి.

    రిప్లయితొలగించండి
  29. @వేణూ శ్రీకాంత్: హీరో బీదవాడు మరియు క్రియేటివ్. హీరోయిన్ బాగా రిచ్చి. వాళ్ళు ఒక కారు మార్కెట్లో రిలీజ్ చేస్తే ఆ మోడల్ ఫెయిల్ అవుతుంది. దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నాల్లో ఉంటుంది. హీరో పెట్టిన యాడ్ ఏజెన్సీ లో ఉద్యోగం లో చేరి, అతని ఐడియా సాయంతో తన కార్ ని మార్కెట్లో ప్రమోట్ చేసి సక్సెస్ చేసి, తర్వాత అతనితో ప్రేమలో పడిపోతుంది. రకరకాల పబ్లిసిటీ కాంపైన్స్ గురించి విశదంగా రాశారు. ఇలాగే చల్లా సుబ్రహ్మణ్యం మోడలింగ్ నేపధ్యంగా ఓ నవల రాశారు. పేరు 'మోడల్' అనుకుంటా.. 'అక్షర యజ్ఞం' నవల మొదట్లో రెండు భాగాలుగా విడుదల చేశారండీ. నేను చదివింది అదే. తర్వాత ఒకే నవలగా వచ్చిందేమో మరి.. ప్రయత్నించండి.. ఆల్ ది బెస్ట్..

    రిప్లయితొలగించండి
  30. అవును మురళి గారు చల్లా సుబ్రహ్మణ్యం గారి "మోడల్" అనుకుంటా.. ఏదో దినపత్రికలో వచ్చేది సీరియల్ గా.. కానీ అక్షర యఙ్ఞం ప్లాట్ కూడా తెలిసినట్లే అనిపిస్తుంది బహుశా రెండూ చదివి ఉంటాను :) మళ్ళీ సంపాదించడానికి ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి