బుధవారం, జనవరి 05, 2011

మధురవాణి - ఊహాత్మక ఆత్మకథ

'ఊహాత్మక ఆత్మకథ' అన్నది తెలుగు సాహిత్యం లో ఓ కొత్త ప్రక్రియ అని చెప్పాలి. ఈ ప్రక్రియ మొదలయ్యింది ఆంధ్రుల అభిమాన నాయిక గురజాడ అప్పారావుగారి సృష్టీ అయిన నాయిక 'మధురవాణి' తో కావడం 'కన్యాశుల్కం' నాటకాన్ని ఇష్టపడే వాళ్ళందరికీ సంతోషం కలిగించే విషయం. గురజాడ రచనలపట్ల అవ్యాజమైన  అభిమానం ఉన్న పెన్నేపల్లి గోపాలకృష్ణ 'మధురవాణి' ఊహాత్మక ఆత్మకతకి మూడేళ్ళ క్రితం అక్షర రూపం ఇచ్చారు.

"ఏడంకాల 'కన్యాశుల్కం' నాటకంలోని మొత్తం 33 దృశ్యాలలో మధురవాణి కనిపించేది కేవలం ఏడెనిమిది దృశ్యాలలో మాత్రమే. నాటకానికి ఆమె అవసరం ఎంతవరకూ ఉందో అంతవరకూ మాత్రమే ఉంది" అంటూ ముందుమాటలో రాసిన రచయిత, మధురవాణి ఆత్మకథని రాయడం కోసం గురజాడ రచనలనీ, ఉత్తరాలనీ క్షుణ్ణంగా చదివారు. "మధురవాణిని సజీవరూపంగా ఊహించుకుని, ఆవాహన చేసుకుని, నన్ను నేనే ఆమెగా భావించుకుని" ఆత్మకథ రాశానన్నారు.

'ఊరు-పేరు' తో మొదలు పెట్టిన తొలి అధ్యాయంలో తన గురించి చెప్పుకున్న మధురవాణి, తర్వాతి అధ్యాయాలలో తన తల్లి గురించీ, వేశ్యా వృత్తిని గురించీ, తన జీవన విధానాన్ని గురించీ, 'కన్యాశుల్కం' లో ప్రధాన పాత్రలన్నింటి గురించీ సవివరంగా, విశ్లేషణాత్మకంగా వివరించడం కనిపిస్తుంది. గిరీశం మొదలు, సౌజన్యరావు పంతులు వరకూ ప్రతి ఒక్కరినీ సునిశితంగా పరికించి విమర్శిస్తుంది మధురవాణి. అలాగే పూటకూళ్ళమ్మ, బుచ్చమ్మ, మీనాక్షిల పట్ల అభిమానాన్నీ, వాత్సల్యాన్నీ ప్రదర్శించింది.

కరటక శాస్త్రులు, మహేశం, అగ్నిహోత్రావధాన్లు, లుబ్దావధాన్లు, వెంకటేశం లాంటి నిడివి ఉన్న పాత్రల మొదలు, మాయగుంట, కనిష్టీబు, బైరాగి, అసిరి లాంటి చిన్న పాత్రల వరకూ ప్రతి పాత్రనీ మధురవాణి దృష్టికోణం నుంచి పరిశీలించి, ఆయా పాత్రలని ఓ కొత్త కోణంలో చూసేలా చేయడంలో రచయిత కృతకృత్యులయ్యారనే చెప్పాలి. నూట పదిహేనేళ్ళనాటి (కన్యాశుల్కం రచనాకాలం) విజయనగరం సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులని అర్ధం చేసుకోడానికీ ఈ రచన ఉపకరిస్తుంది.

"అనాదీ వేశ్యకి జీవనాధారం సంగీతం, నాట్యమే కానీ ఇతరం కాదు. కాలగతిలో సంగీతం, నాట్యం అదృశ్యమై, అగ్రకులాల వశమై, మాకు దేహం మటుక్కు మిగిలింది జీవనానికి!" లాంటి నిష్టుర సత్యాలూ, "వేశ్యా వృత్తి భ్రష్టు పడి లోకుల దృష్టిలో చులకన కావడానికి ప్రధాన హేతువు వేశ్య మాతే సుమా!" లాంటి చారిత్రిక సత్యాలూ, "భార్యాభర్తల మధ్య ప్రేమలేని దాంపత్యాలెన్ని లేవు? అట్టి భార్యల స్థితి కంటే వేశ్య మేలు కాదు?" లాంటి సూటి ప్రశ్నలూ చాలానే కనిపిస్తాయి ఈ పుస్తకం నిండా.

మధురవాణి స్వాభావిక లక్షణాలని ఏమాత్రం విస్మరించకుండా, గురజాడ రచనా శైలిని విడిచిపెట్టకుండా రాసిన ఈ ఆత్మకథ ఆసాంతమూ చదివిస్తుంది. బాపు రూపుదిద్దిన కవర్ పేజీ ఎంత ఆకర్షణీయంగా ఉందో, మోహన్ గీసిన లోపలి చిత్రాలు అంత సొగసుగానూ ఉన్నాయి. ముఖ్యంగా లుబ్దావధాన్లు, అగ్నిహోత్రావధాన్లు బొమ్మలు చూడాల్సిందే. నాచ్ కల్చర్ కి సంబంధించిన కొన్ని అరుదైన ఛాయా చిత్రాలూ ఉన్నాయి ఇందులో.

ఆత్మకథని పూర్తి చేశాక మధురవాణి అనే స్త్రీ హృదయానికి బదులుగా పురుష హృదయం కనిపించింది. మధురవాణిని సృష్టించిన గురజాడ, ఆత్మకథ రాసిన పెన్నేపల్లి పురుషులే కావడం ఇందుకు కారణం కావచ్చేమో బహుశా. ఏదేమైనా మధురవాణి పాత్రకి దక్కిన మరో గౌరవం ఈ ఆత్మకథ. సుమారు రెండు దశాబ్దాల క్రితం 'మిసిమి' పత్రికలో ప్రచురితమైన 'మధురవాణి ఇంటర్వ్యూలు' కూడా పుస్తక రూపంలో వస్తే బాగుండును. (మధురవాణి ఊహాత్మక ఆత్మకథ - విసు కమ్యూనికేషన్స్ ప్రచురణ, పేజీలు 202, వెల రూ. 125, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

9 కామెంట్‌లు:

 1. నాటకం నేను చదవలేదు కానీ.. సినిమాలో మాత్రం మధురవాణి పాత్ర అందులో సావిత్రి గారు నాకు చాలా నచ్చేశారు. పరిచయం బాగుందండి.

  రిప్లయితొలగించు
 2. మధురవాణి ఊహాత్మక ఆత్మకథ ని పరిచయంచేసినందుకు ధన్యవాదాలు. త్వరగా ఆ పుస్తకం చదవాలని ఉంది.
  మీరు చెప్పిన మధురవాణి ఇంటర్వ్యూలు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి రచన 1997లోనే పుస్తకంగా వెలువడింది.గురజాడ,వీరేశలింగం, అడవిబాపిరాజు, చలం,శ్రీశ్రీ ,రావిశాస్త్రి వంటి ఎందరో ప్రముఖులు మధురవాణి ఎదురైతే ఎలా సంభాషిస్తారో అని ఊహించి ఎంతో చమత్కారంగా రాసిన పుస్తకం ఇది. దీని ముఖచిత్రం కూడా బాపుగారే. ఎంత అందంగా ఉంటుందో ఆ బొమ్మలో మధురవాణి!!

  రిప్లయితొలగించు
 3. oohaatmaka aatma kadha.. sarikotta prayogam, Kanyasulkam lo Madhuravaani paatra ante chaala ishtam gowram kaligaayi, ee book ventane chadavaali..

  రిప్లయితొలగించు
 4. hammayyaa..nemali kannuni pattesaanandee...konni nelala kritam yedo vaarta patrikalo (eenaadu anukuntaa)mee blog peru choosi kaasepu chadivesi...busylo marchipoyaanu..mallee monnane..telugu bloglu ani vetukute..mana venu sreekaanth gaari chakkani blog dorikindi...ettakelaku..mee blog pattesaa...venu gaaru..gurtundaa meeku cheppaanu kadoo...
  so happy...

  రిప్లయితొలగించు
 5. @వేణూ శ్రీకాంత్: అయ్యో.. నాటక చదవలేదా :( ..చక్కని వ్యవహారికంలో ఉంటుందండీ.. సినిమా కన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా చదవండి.. ధన్యవాదాలు.
  @సుధ: మధురవాణి ఇంటర్యూలు పుస్తకం మిస్సయ్యానండీ.. 'మిసిమి' లో కొన్ని భాగాలు మాత్రమే చదివాను.. పుస్తకం కోసం వేట మొదలుపెట్టాలి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 6. @msk: తప్పక చదవండి.. ధన్యవాదాలు.
  @Ennela: హమ్మయ్య! పట్టుకున్నారన్న మాట.. బ్లాగుల్లోకి వచ్చిన కొత్తలో నాకూ ఇదే సమస్య వచ్చిందండీ.. నెమ్మదిగా అలవాటయ్యింది.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 7. చక్కని పరిచయం బాగుంది. బుక్ వెంబడే చదవాలనిపించింది.

  రిప్లయితొలగించు
 8. @భాను: తప్పకుండా చదవండి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 9. ఆల్రెడీ సినిమా చూసిన (నాలాంటి) వారికి పుస్తకం చదివినా సినిమానే బాగుందని పిస్తుందండీ.

  రిప్లయితొలగించు