అలనాడు త్రేతాయుగంలో ఓ మడేలు మోపిన నింద కారణంగా సీతమ్మ ని అడవులకి పంపాడు శ్రీరాముడు. ఇలనాడు ఈ కలియుగంలో, కొన్ని దశాబ్దాల క్రితం, రాముడంతటి మంచి బాలుడినైన నా మీద నింద మోపింది ఓ మడేలమ్మ. ఫలితంగా ఏం జరిగిందో తెలియాలంటే, జరిగిన కథలోకి వెళ్ళాలి.
సృష్టి కర్త బహు చమత్కారి.. ఆయన సృష్టించిన జంటలు చాలు, ఆయన లీలా వినోదాలు ఎంతటివో తెలుసుకోడానికి. మచ్చుకి కొన్ని జంటలు.. అతను కప్ప అయితే ఆమె పాము.. అతను మేక అయితే ఆమె పులి.. అతను మీరయ్య అయితే ఆమె గుర్రమ్మ.. మీరయ్య మా ఊరంతటికీ ఏకైక మడేలు. 'గాడిద పని గాడిద, కుక్క పని కుక్క చెయ్యాలి' అనే నీతి కథలో మడేలుకి ఉన్నట్టుగా మా మీరయ్య కి గాడిద, కుక్క లేవు.
మీరయ్య కి ఎవరి మాటకీ ఎదురు చెప్పడం తెలీదు. వినయంగా తలొంచుకుని తన పని తాను చేసుకుపోతాడు. చివరికి తను చేయ దల్చుకున్నది మాత్రమే చేస్తాడు. అతని ఇల్లాలు గుర్రమ్మ. ఆమె కి పెద్దా చిన్నా అన్న భేదాలేవీ లేవు.. ఫెడీల్మని సమాధానాలు చెబుతుంది. 'కొరకంచు' అని ఆమెకి ముద్దుపేరు మా ఊళ్ళో. అసలు ఆమె పుట్టినప్పుడు వాళ్ళ ఊరి పంతులు గారు పంచాంగం చూసి 'గ' అనే అక్షరంతో పేరు రావాలని చెప్పి, 'గృహలక్ష్మి' అని ఆయనే పేరు నిర్ణయించాడట. జనం నోళ్ళలో ఆ పేరు గుర్రమ్మ గా రూపాంతరం చెందింది.
మామూలప్పుడు మనిషే కానీ, కోపం వచ్చినప్పుడు మాత్రం గుర్రమ్మ అస్సలు మనిషి కాదు. 'మన సత్యానికి సెల్లెలిగా పుట్టాల్సిన మడిసి' అని మా ఊరివాళ్ళు అనుకోడమూ కద్దు. అయితే ఆ కోపం ఎప్పుడు వస్తుందన్నది నర మానవుడికి తెలీదు. మా ఇంట్లో బట్టలు ఉతకడానికి వేసే అలవాటు లేక పోయినా తాతయ్యవి, నాన్నవి పంచలు, ఫేంట్లు, చొక్కాలు పొడిస్త్రీ (పొడి + ఇస్త్రీ) కి ఇచ్చే వాళ్ళు. మీరయ్య పిలవగానే వచ్చి పట్టుకెళ్ళి, ఓ ఐదారు కబుర్లు పెట్టాక తనకి వీలు కుదిరినప్పుడు పట్టుకొచ్చేవాడు. పిల్లల బట్టలకి ఇస్త్రీ అనే సమస్యే ఉండేది కాదు.
నేను ఐదో తరగతిలో ఉండగా ఒక రోజు బళ్ళో హెడ్మాస్టారు గారు వచ్చే వారం బడికి ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారనీ, ఆ రోజు పిల్లలందరూ స్నానం చేసి, ఉతికి, ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని రావాలనీ చెప్పారు. మా బళ్ళో పిల్లలందరూ ఉతికిన బట్టలు వేసుకుని వస్తే అది ఎనిమిదో వింత.. ఇంక ఇస్త్రీ అంటే అది కల్లో మాట. నేను ఇంటికి రాగానే ఈ వార్త అమ్మ చెవిన వేశాను.. అమ్మేమో ఆ వచ్చేది ఏ ప్రధాన మంత్రో, ముఖ్యమంత్రో అయినట్టు హడావిడి చేసి, నా బట్టల్లోనుంచి మూడు జతలు మంచివి తీసి సాయంత్రం మీరయ్యకి ఇస్త్రీ కి ఇచ్చేసింది.
అప్పుడు మొదలయ్యాయి నా కష్టాలు.. మీరయ్య ఎక్కడ కనిపించినా గుర్తు చెయ్యడం.. అతనేమో 'ఆయ్.. అట్టుకొచ్చేత్తానండి.. నానేం సేసుకుంటానండి మీ బట్లు.." అని నవ్వుతూ వెళ్ళిపోయేవాడు. ఈ "నానేం సేసుకుంటానండి" లో కూసింత వ్యంగ్యం లేకపోలేదు. ఎందుకంటే, పొడిస్త్రీ కి ఇచ్చిన చొక్కాలు (తాతయ్యవీ, నాన్నవీ) మీరయ్య వేసుకుని తిరుగుతాడనీ, తర్వాతెప్పుడో ఉతికి తెస్తాడనీ బామ్మకి బలమైన అనుమానం. మీరయ్య ఎప్పుడు కనిపించినా అనుమానాస్పదంగా చూసేది.. ఈ విషయం మీరయ్యకీ తెలుసు. హెడ్మాస్టారు రోజూ ఇస్త్రీ బట్టల విషయం గుర్తు చేస్తున్నారు.. నేను మీరయ్యకి కబుర్ల మీద కబుర్లు పెడుతూనే ఉన్నాను.
బళ్ళో ఇనస్పెక్షన్ రెండు రోజులకి వచ్చేసిందనగా నాకు టెన్షన్ మొదలయ్యింది. ఇస్త్రీ అట్టే పోయే ఉన్న వాటిల్లో మంచి బట్టలన్నీ మీరయ్య దగ్గరే ఉండిపోయాయి. పోనీ ఇస్త్రీ చెయ్యకుండా అయినా తెచ్చేయమని అడిగాను.. 'అయబాబోయ్.. అదేం మాటండీ.. మావింక ఊల్లో ఉండొద్దేతండీ.." అని బోల్డంత ఫీలయిపోయాడు, ఉదయాన్నే. నేను పొద్దున్న బడి నుంచి భోజనానికి ఇంటికి వచ్చి అమ్మని కనుక్కున్నా, బట్టలు వచ్చాయేమోనని.. రాలేదని చెప్పింది. సరిగ్గా అప్పుడే గుర్రమ్మ మా వీధిలో వెళ్తోంది. నాకు చాలా కోపం వచ్చినా బోల్డంత సహనంగా నా బట్టల గురించి అడిగాను.
"నాకు తెల్దండి.. మీ మీరయ్య గోర్ని అడగండి." అని కొంచం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందామె. "అదేంటీ.. మీరిద్దరూ ఓ ఇంట్లోనే ఉంటారు కదా" నేను చాలా అమాయకంగానే అడిగాను కానీ, గుర్రమ్మకి కోపం నషాళానికి అంటింది. బుజాన ఉన్న మూట రోడ్డు మీద పడేసి, చేతులు బారజాపి అరవడం మొదలు పెట్టింది.. "ఏటండీ.. ఏటి మాటాడుతున్నారు? నేను మీరయ్య పెళ్ళాన్ని కాదంటారా? ఇదిగొండీ.. ఆడు కట్టిన తాడు" అంటూ దూసుకొచ్చింది.. నేనేదో చెప్పబోతున్నా కానీ ఆమె వినిపించుకోడం లేదు..
ఆవిడ గొంతు విని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా ఆగారు.. "అబ్బాయిగోరు అడూతన్నారూ.. నువ్వు మీరయ్య కి కట్టుకున్న పెల్లానివేనా.. లేక పోతే X Xకున్న దానివా.. అంతన్నారండీ.." అనేసరికి నాకు కాళ్ళలో వణుకు మొదలయ్యింది.. బుర్ర మొద్దు బారింది. అసలే నాన్న భోజనానికి వచ్చే టైము.. ఇదెక్కడ గొడవరా దేవుడా అనుకుంటున్నా.. పాపం.. నన్ను రక్షించడానికి అమ్మ రంగంలోకి దిగింది.. "ఇదిగో గుర్రమ్మా.. మా వాడు అలా అనలేదు.. మీ ఇద్దరి మాటలూ నేను చెవులారా విన్నాను" అంది కొంచం ధాటీగా.. గుర్రమ్మఅదే స్వరంలో అడిగిన వాళ్ళకీ, అడగని వాళ్ళకీ చెప్పేస్తోంది..
నాన్నొచ్చేలోగా ఈ గొడవ చల్లబడాలని నేను దేవుళ్ళందరికీ మొక్కడం మొదలెట్టాను. ఇంతలో గొడవ చూస్తున్న కొందరు ఉత్సాహవంతులైన మహిళలు తీర్పు చెప్పడానికి ముందుకొచ్చారు.. "ఆ బాబు అలాంటి మాటలు ఆడరు గుర్రమ్మో.. మాకు తెల్సు ఆయన సంగతీ.. నీ సంగతీ.." అనేసరికి, నా కళ్ళకి వాళ్ళు దేవతల్లా కనబడ్డారు.. కాసేపు అరిచి అరిచి అలిసిపోయిన గుర్రమ్మ, అమ్మ ఇచ్చిన మజ్జిగ తేట తాగి, ఊరగాయ పొట్లం పట్టుకుని, మూట భుజాన్నేసుకుని బయలుదేరింది.. మరి కాసేపటికి నాన్నొచ్చారు.
ఆ మర్నాడు సాయంత్రం మీరయ్య నా బట్టలు తెచ్చాడు.. "ఏటండీ.. గుర్రమ్మతో తగువేసుకున్నారంట" అని నవ్వుతూ అడిగి.. "మడిసి మంచిదేనండీ.. పాపం.. కూసింత కోపమెక్కువ.. మద్దినేల రేవు కాడినుంచి వొచ్చి అదే మీ బట్లు ఇస్త్రీ సేసింది.." అంటున్న మీరయ్య కేసి గుడ్లప్పగించి చూశాన్నేను. నేను తగువేసుకున్నానా? ఆమెకి 'కూసింత' కోపమా? .. నాన్న గానీ కొంచం ముందు వచ్చి ఉంటే ఏం జరిగేదో తల్చుకోడానికే భయమేసింది..
పాపం అమ్మాయకంగా అడిగినా, ఆ తరువాత మీరు అయోమయంగా పెట్టిన మీ ముఖం తలుచుకుంటే..:):)
రిప్లయితొలగించండిఅసలు మీరేమి ఆనలేదంటే నమ్మలేను ,మీరడిగిన తీరు లో ఏదో అనుమానం :):)
రిప్లయితొలగించండి;)
రిప్లయితొలగించండినాదో వూసు కలపనా?
మా చిన్నప్పుడు ఓ రోజు అమ్మ ఇంట్లో ఇడ్లీలు తిన్నాక [అప్పుడే కామెర్లు వచ్చి తగ్గాయి అన్నయ్యకి], ఆడుకోవటానికి వెళ్తుంటే ఇంకెక్కడా ఏమీ తినకండి అని చెప్పారు. అదే మాట మాకు మళ్ళీ ఇడ్లీలే పెట్టబోయిన ఓ బంధువలావిడతో అంటే "ఆ నేనేమన్నా విషం పెట్టేస్తానా. నా ఇంటి తిండి అంటరానిదా?" అంటూ రయ్యిరయ్యిన అమ్మ మీదకి వచ్చారు[ట!]. అమ్మ చెప్పారు కాస్త పెద్దయాక మా వూరి "గౌరమ్మ" అదే మా "చిట్టెమ్మ" గారి గురించి. ఆవిడ అసలు పేరు నాకు తెలియదు.
ఇంటికి, అయినవాళ్ళకి, పుస్తకాలకీ దూరంగా గడిపే ఈ నా మేడిపండు లాంటి జీవితానికి మీ blog లోని post లు గొప్ప ఊరట....your posts are a great sigh of relief........They revoke the sweet memories of my childhood...
రిప్లయితొలగించండిఇంటికి, అయినవాళ్ళకి, పుస్తకాలకీ దూరంగా గడిపే ఈ నా మేడిపండు లాంటి NRI జీవితానికి మీ blog లోని post lu గొప్ప ఊరట....
రిప్లయితొలగించండి"పొడిస్త్రీ కి ఇచ్చిన చొక్కాలు మీరయ్య వేసుకుని తిరుగుతాడనీ, తర్వాతెప్పుడో ఉతికి తెస్తాడనీ బామ్మకి బలమైన అనుమానం."
రిప్లయితొలగించండిమా అత్తగారికి ఇప్పటికీ ఇస్త్రీవాళ్ళ మీద ఈ అనుమానమే..!! బాగుందండి జ్ఞాపకం..
హహహ! నేనింకా అమాయకంగా ఇరుక్కుపోయి దెబ్బలు తిన్నారేమో అని ఉత్కంఠగా చదివాను. బాగుంది.
రిప్లయితొలగించండిహా..హా..అమాయకంగా బిత్తరచూపులు చూస్తున్న బాల మురళీని ఊహించుకుంటే నాకు భలే నవ్వొచ్చిందండీ..
రిప్లయితొలగించండిఅలా బుక్కయ్యారన్నమాట...
చాలా బావుంది సార్
రిప్లయితొలగించండిపడి...పడి నవ్వానండి . ఇప్పుడు,మీగుర్రమ్మ ఎలా ఉంది ?మా స్కూల్ లోకూడా ఇన్స్పెక్స్షన్ అంటే పెద్ద హడావిడి ,చార్ట్స్ ,క్లాసు రూం దేకారేషన్ , ఇస్త్రి చేసిన స్కూల్ డ్రెస్ ,నోటి మీద వేలు వేసుకుని సైలెంట్ గ కూర్చోవటం ,ఇన్స్పెక్టర్ ప్రశ్నలు ఎమన్నా అడుగుతారేమోనని టెన్షన్ ...తీర చూస్తే ఏదో ఒక క్లాసు చూసి ,బయటనుంచే పాస్ అయిపోయేవాళ్ళు ,మా కష్టమంతా వృదా అయిపోయేది .
రిప్లయితొలగించండిమురళి గారు, భలే బాగుందండి మీ ఇస్త్రీ బట్టల కథ. మీ అమాయకత్వం, తరువాత పడ్డ భయం...మీకేమో గాని నాకు మాత్రం బహు పసందుగా ఉంది. మీకు ఇట్లాంటివే ఇంకా చాలా, చాలా అనుభవాలు ఉండుగాకా! మాకోసం అవన్ని రాయుగాకా! అన్నది నా గాఢమైన కోరిక...
రిప్లయితొలగించండిహ హ హ.
రిప్లయితొలగించండిమా యింటి దగ్గర ఉయ్యూరు అనుండేవాడు. మేకప్పు లేకుండా విశ్వామిత్రుడి పాత్ర వేసెయ్య గలడు!
"పొడిస్త్రీ కి ఇచ్చిన చొక్కాలు మీరయ్య వేసుకుని తిరుగుతాడనీ, తర్వాతెప్పుడో ఉతికి తెస్తాడనీ బామ్మకి బలమైన అనుమానం."
రిప్లయితొలగించండిఈవిషయంలో మాఅమ్మమ్మది సేంటుసేం.
వాళ్లవీథిలోని మిగతావాళ్ల దగ్గర కూపీలాగేది.
అప్పుడప్పుడు అతనిభార్య మాత్రం "అవను. వాడుకుంటాం. ఐతేఏమి? అది మాహక్కు." ఇలా వాదానికి దిగేది. ఆసీన్ చూసేందుకే భలేగా ఉండేదిలెండి.
హ హ్హ హ్హ, భలేగుంది మీ ఇస్త్రీ బట్టల ఫార్సు
రిప్లయితొలగించండిమొన్న టైం లేక పూర్తి వ్యాఖ్య రాయలేకపోయానండీ.
రిప్లయితొలగించండిఅబ్బ...ఎన్నాళ్ళకి ఒక తప్పు పట్టాను...
"మంచి" బాలుడు..సరిచేయండి.
అయినా మీకు మీరే అలా డిక్లేర్ చేసేస్కుంటే ఎలాగండీ?
"........ మంచి బాలుడు" అని చెప్పాల్సింది చదివే మేము కదా...?!?
హ హ్హ హ్హా ....ఐతే మురళి గారికీ తప్పలేదన్నమాట నీలాపనిందలు ! ఆపద్భాన్ధవులడ్డుపడి గట్టేక్కించారన్నమాట !ఆ తర్వాతైనా అమ్మ నాన్నగారికి చెప్పనేలేదా :) :)
రిప్లయితొలగించండి@పద్మార్పిత: తల్చుకుంటే ఇప్పటికీ నాకే నవ్వాగదండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@చిన్ని: యెంత మాట! మరీ అంత అనుమానమైతే ఎలాగండీ :):) ..ధన్యవాదాలు.
@ఉష: బాగుందండీ ఈ ఊసు.. ఒక్కోసారి అంతే.. మన ప్రమేయం లేకుండా గొడవలు జరిగిపోతూ ఉంటాయి.. ధన్యవాదాలు.
@sru: చాలా పెద్ద ప్రశంశ అండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@తృష్ణ: వావ్.. ఇప్పటికీ ఇంకా అలా అనుమాన పడేవాళ్ళు ఉన్నారన్న మాట !! 'మంచి బాలుడు' ని కాకపొతే మా వీధి వాళ్ళు అంతం ధైర్యం చేసి గుర్రమ్మతో పోట్లాడతారా చెప్పండి..? అదే సాక్ష్యం.. ధన్యవాదాలు.
@సునీత: హమ్మయ్య.. నేను తప్పించుకునేసరికి మీరు డిసప్పాయింట్ అవలేదు కదా :):) ..ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: అవునండీ.. అలా బుక్కయ్యాను.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@chris: ధన్యవాదాలండీ..
@అనఘ: ఇన్స్పెక్షన్ గురించి రాస్తే మరో టపా అవుతుందండీ.. గుర్రమ్మ మనవరాలి పెళ్లి చేయడం తెలుసండీ.. (వాళ్ళమ్మాయి నా క్లాస్మేట్) తరువాతి సంగతులు తెలియవు.. అన్నట్టు మీ 'గోదావరి' లో కామెంటే అవకాశం కల్పించరూ.. ధన్యవాదాలు.
@జయ: అన్యాయం.. అక్రమం.. మరీ అలా కోరుకుంటారా?.. ఇదొక్కటే కాదు లెండి.. మరికొన్ని ఉన్నాయి.. రాస్తాను.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@కొత్తపాళీ: విశ్వామిత్రుడి పాత్ర అయితే మా సత్యానికి కళ్ళు మూసుకుని ఇచ్చేయొచ్చండీ.. ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: వీలు చూసుకుని ఒక టపా రాసెయ్యండి.. ధన్యవాదాలు.
@లక్ష్మి: :-) :-) ..ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@పరిమళం: అమ్మ చెప్పి ఉండకపోవచ్చండీ.. నామీద ఏమైనా కంప్లైంట్ వచ్చిందంటే కచ్చితంగా తప్పు నాదే అయి ఉంటుందని నాన్నకి బలమైన నమ్మకం మరి :) :) ..ధన్యవాదాలు.
"కాసేపు అరిచి అరిచి అలిసిపోయిన గుర్రమ్మ, అమ్మ ఇచ్చిన మజ్జిగ తేట తాగి, ఊరగాయ పొట్లం పట్టుకుని, మూట భుజాన్నేసుకుని బయలుదేరింది.." ఇది హైలైట్. పోనిలెండి పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. చూడండి టైము కి బట్టలు వచ్చాయి కదా గుర్రమ్మే చేసి మరి ఇచ్చింది కదా. జాగ్రత్తండోయ్... ;-)
రిప్లయితొలగించండి@భావన: చావు తప్పి కన్ను లొట్టపోయిన తర్వాత జాగ్రత్త దానంతట అదే వచ్చేస్తుందండీ :-) :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిహ హ బాగుంది, చిన్నపుడు ఒక సారి అమ్మ ఏదో ఇంట్లో వస్తువు గురించి పనిమనిషిని నిలదీస్తుంటే నేను పక్కన ఊరికే ఉండక పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నందుకు ఆవిడ అమ్మని వదిలేసి నా మీద విరుచుకుపడిన సంధర్భం గుర్తొచ్చింది :-)
రిప్లయితొలగించండిఈ టపా ఎందుకోగానీ, మిస్ అయ్యాను. చాలా బాగున్నాయి మీ జ్ఞాపకాలూ. మొత్తానికి మీరు రాముడు మంచి బాలుడు టైపు అన్నమాట (:-?
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: మీరూ బాధితులే అన్నమాట.. అప్పుడైతే మీకు నా బాధ మరింత బాగా అర్ధమవుతుంది... ఇప్పుడు నవ్వొస్తోంది కానీ, అప్పుడు తెగ టెన్షన్ పడ్డానండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@వీరుభొట్ల వెంకట గణేష్: మా వీధిలో వాళ్ళు చెప్పే వరకూ నాకూ తెలీదండీ, నేను మంచి బాలుడినని :-) :-) ..ధన్యవాదాలు.