శనివారం, మే 21, 2011

రంగం

చాలా రోజుల తర్వాత ఓ తెలుగు సినిమాని ఊపిరి బిగపట్టి చూశాను. సినిమాలో ఎంతగా లీనమైనా ఎమోషన్స్ కి లోనుకాని నేను చాలా సార్లు బిగించిన పిడికిలితో హ్యాండ్ రెస్ట్ ని మోదాను. సినిమా పూర్తవ్వగానే నా నోటివెంట అప్రయత్నంగా వచ్చిన మాట 'ఎక్స్ ట్రార్డినరీ.' సినిమా పేరు 'రంగం.' తమిళం నుంచి తెలుగుకి అనువాదమై గతవారం థియేటర్లలో రిలీజయ్యింది. ఓ మిత్రుడు తప్పక చూడమని చెప్పడంతో చూశానీ సినిమాని. ముందుగా తనకి ధన్యవాదాలు.

మీడియా-యువత-రాజకీయాలు ...తెలుగు సినిమాలకి సంబంధించి ఇవింకా డ్రై సబ్జెక్టులే. సమకాలీన సంఘటనల ఆధారంగా, ఈ మూడింటినీ నేపధ్యంగా తీసుకుని చక్కని చిక్కని కథని రాసుకుని దానిని ఏమాత్రం బిగి సడలని విధంగా తెరకెక్కించాడు దర్శకుడు కే.వి. ఆనంద్. ఇది యువ ఫోటో జర్నలిస్ట్ అశ్వద్ధామ (జీవా), రాజకీయాల్లో ప్రవేశించాలనుకునే గ్రాడ్యుయేట్ వసంత్ (అజ్మల్ అమీర్) ల కథ. నగరంలోని ఓ బ్యాంకుని దోచుకుని వెళ్తున్న ముఠాని అనుకోకుండా గమనించిన అశ్వద్ధామ వాళ్ళని అత్యంత సాహసోపేతంగా తన కెమెరాలో బంధించడం ద్వారా పోలీసులకి పట్టివ్వడం సినిమాలో ప్రారంభ సన్నివేశం.

ఈ ఫోటోల కారణంగా అశ్వత్ కే కాక, అతను పని చేసే 'నేటి వార్త' పత్రిక కి కూడా మంచి పేరొస్తుంది. దోపిడీకి పాల్పడ్డది టెర్రరిస్టులని తెలుస్తుంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో, "నేరస్తులు ఎంతటి వాళ్లైనా పట్టుకుని కఠినంగా శిక్షిస్తా"మని ప్రకటిస్తాడు ముఖ్యమంత్రి (ప్రకాష్ రాజ్). మరోపక్క, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నేత కొండల్రాయుడు (కోట శ్రీనివాస రావు) జ్యోతిష్యుల సలహా మేరకు గ్రహ బలం కోసం ఓ పదమూడేళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడన్న 'ఎక్స్ క్లూజివ్' స్టోరీ పట్టుకొస్తుంది ఆ పత్రిక జర్నలిస్టు రేణు (కార్తీక నాయర్/అలనాటి రాధ కూతురు).

సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా జనంలో పేరు తెచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉంటాడు వసంత్. రాజకీయాల్లోనుంచి అవినీతిని పారద్రోలాలని, సామాజిక న్యాయం కోసం పనిచేయాలన్నది అతని లక్ష్యం. అతను చేసే పనులకి విస్తృతమైన కవరేజీ ఇవ్వడం ద్వారా అతని ఇమేజ్ పెరగడానికి పరోక్షంగా సహకరిస్తూ ఉంటుంది 'నేటి వార్త.' ఇటు ముఖ్య మంత్రికీ, అటు ప్రతిపక్ష నేతకీ వ్యతిరేకంగా ఆ పత్రికలో వచ్చే కథనాలు వసంత్ పట్ల జనాభిమానం పెరగడానికి దోహదం చేస్తూ ఉంటాయి.

అశ్వత్-రేణు-సరస్ ('నేటి వార్త' లో పనిచేసే మరో జర్నలిస్ట్) ల మధ్య ముక్కోణపు ప్రేమ కథ, సినిమా మరీ సీరియస్గా సాగకుండా ఉండడానికి సహకరించడంతో పాటు, కథలో ఓ కీలకమైన మలుపుకీ కారణం అయ్యింది. పత్రికా కార్యాలయం రోజువారీ వ్యవహారాలని హాస్య భరితంగా చూపించడం ద్వారా, హాస్యాన్ని కథలో జత చేశాడు దర్శకుడు. 'నేటి వార్త' పత్రిక కార్యాలయం మీద ప్రతిపక్ష నేత దాడి వంటివి గతంలో తమిళనాట జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలని గుర్తు చేస్తాయి.

వసంత్ క్రమేపీ బలం పుంజుకోవడం అటు ముఖ్యమంత్రికీ, ఇటు ప్రతిపక్ష నేతకీ కన్నెర్ర అవుతుంది. ఇక్కడి నుంచి ఎత్తులూ, పై ఎత్తులూ. ఎన్నికలు పూర్తవ్వడంతో సినిమా పూర్తవుతుందన్న ఊహకి విరుద్ధంగా, అప్పుడే కథ మరో కీలకమైన మలుపు తిరిగింది. చకచకా ముందుకి సాగింది. అస్సలు ఊహించని ముగింపుకి వచ్చింది. మీడియా-యువత-రాజకీయాలు అన్న పాయింట్ ని కథకి సంబంధించిన ఏ కీలక మలుపులోనూ మర్చిపోలేదు కథకుడూ, దర్శకుడూ అయిన ఆనంద్. పూర్వాశ్రమం లో జర్నలిస్ట్ గా పనిచేయడం ఆనంద్ కి బాగా కలిసొచ్చింది, కథని రాసుకోవడంలోనూ, తెరకెక్కించడం లోనూ. మీడియా రంగం పట్ల కొంత సానుకూల దృక్పధం కనిపించింది.

కథనంలో బిగి వల్ల పాటలు పంటికింద రాళ్ళలా అనిపించాయి. పైగా, హ్యారిస్ జైరాజ్ సంగీతంలో ఒక్క పాటా గుర్తు పెట్టుకునేలా లేదు. చిత్రీకరణ మాత్రం బాగుంది. నటన విషయానికి వస్తే జీవా, అజ్మల్ అమీర్ ఇద్దరూ పోటీ పడి నటించారు. కొన్ని ఫ్రేముల్లో అమీర్ మన తెలుగు నటుడు సాయి కిరణ్ ని గుర్తు చేశాడు. కార్తీక కి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికింది. బాగానే చేసింది. అలాగే సరస్ గా చేసిన పియా కూడా. ప్రకాష్ రాజ్, కోట ల నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది? బాధించిన మరో అంశం నేటివిటీ. తమిళం తో తీసి, తెలుగులోకి డబ్ చేయడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఏది ఏమైనప్పటికీ ఇది దర్శకుడి సినిమా. 'గమ్యం' 'బాణం' 'ప్రస్థానం' వరుసలో మరో సినిమా. వైవిద్యభరితమైన సినిమాని ఇష్టపడే వారంతా తప్పక చూడాల్సిన సినిమా.

8 కామెంట్‌లు:

  1. Thanks for the review, Now I decided to watch the movie. I did not read the review yet, I will read it after watching the movie.

    http://creative-oracle.blogspot.com/

    రిప్లయితొలగించండి
  2. @Creative Oracle: తప్పక చూడండి.. చూశాక వీలయితే టపా మరోసారి చదవండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. I watched the movie.
    chala bagundi.
    especially jeeva and vasanth character baga nachayi.

    రిప్లయితొలగించండి
  4. మీ ఈ టపా చదివి ఉండక పోతే ఈ సినిమా నేను చూసేవాడ్ని కాదు మురళి గారు. ఇప్పుడే సెకండ్ షో చూసి ఉంటికి వచ్చాను.. ఇంకా ఆ హ్యాంగోవర్ నుండి తేరుకోలేదు... అత్యధ్బుతం.. ఇంతగా ఈ మధ్య కాలంలో మరే సినిమా నచ్చలేదు... Thanks a lot for recommending this movie.

    రిప్లయితొలగించండి
  5. పాటలు బాగా నచ్చాయండీ నాకు. సినిమా బాగుందని విన్నాను నేను కూడా.. సినిమా చూశాక చదువుతా మీ రివ్యూ.. ;)

    రిప్లయితొలగించండి
  6. @శ్రావ్య: ధన్యవాదాలండీ..
    @వేణు శ్రీకాంత్: నా టపా చదివి సినిమా చూసినందుకు చాలా ధన్యవాదాలండీ.. కొంచం భయ పడుతూ రాశాను ఇది.. ఏం రాస్తే, ఏ మలుపు చెప్పేస్తానో అని :))

    రిప్లయితొలగించండి
  7. @రాజ్ కుమార్: పాటలకన్నా సినిమా ఇంకా చాలా బాగుంటుందండీ.. మిస్సవ్వద్దు.. ధన్యవాదాలు.
    @హరేకృష్ణ : ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి