మంగళవారం, జూన్ 21, 2011

నాతో నేను 'వేణూ శ్రీకాంత్' గురించి...

ఇప్పుడంటే 'విరామం' ఇచ్చేశారు కానీ, అబ్బో నిన్న మొన్నటివరకూ ఎన్నెన్ని కబుర్లు చెప్పే వారో వేణూ శ్రీకాంత్. ఆ చెప్పడం కూడా, ఏదో చెప్పేశాంలే అన్నట్టుగా కాకుండా, చక్కగా, వివరంగా, అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా చెప్పడం మన 'నాతో నేను నా గురించి...' బ్లాగర్ వేణూ శ్రీకాంత్ గారి ప్రత్యేకత. ఎలాంటి క్లిష్టమైన విషయాన్నైనా ఈయన రాశారంటే మనకింక అర్ధం కాకపోవడం అనే సమస్య ఉండదు.

చేసిన పాపం చెబితే పోతుంది అంటారు కదా.. అందుకని చెప్పేస్తాను. నేనీ బ్లాగుని కొంచం ఆలస్యంగా కనుగొన్నాను. ఉహు, ఇంకోలా చెప్పాలంటే, ఈ బ్లాగుని నేను మొదటగా అంతర్జాలంలో కాక 'ఆంధ్రజ్యోతి' లో చూశాను. అప్పుడే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. బ్లాగులో మొదట చదివిన టపా అయితే 'పాట్ లక్.' మన బంగాళా దుంపలు లేవూ, అవేనండీ పొటాటోస్, వాటిని నేతిలో వేయించేసి, కొత్త డిష్ గా తెల్లోళ్ళకి పరిచయం చేసి లొట్టలేయించేసిన తెలివి తేటలు చూసి, సాటి తెలుగు వాడిగా భలే గర్వపడిపోయాను.

నేను చేసిన పాపం ఒకటే అనుకుంటున్నారు కదూ? అబ్బే అస్సలు కాదు. ఎలాగూ కన్ఫెషన్ మొదలెట్టేశాను కాబట్టి ఇంకో విషయం కూడా చెప్పేస్తాను. "అసలు వేణూ శ్రీకాంత్ అనే పేరు ఉంటుందేమిటి? ఈయనెవరో, మంచి కలం పేరే సెలక్ట్ చేసుకున్నారు" అనుకున్నాను మొదట్లో. (అన్నట్టు నా నిజ్జం పేరు కూడా మురళినే, గమనించ ప్రార్ధన.. ఎవరో అక్కడ గుమ్మడికాయల్ని గుర్తు చేసుకుంటున్నారు, నాకు తెలిసిపోతోంది). కానైతే, ఈయన బ్లాగులో అలా అలా వెనక్కి వెళ్లి, వెళ్లి మొదటి టపా దగ్గర ఆగితే తెలిసింది, నేనెంత పొరపాటుగా ఆలోచించానో. కొన్ని పాపాలకి నిష్కృతులు ఉంటాయో, ఉండవో మరి.

"ఇది పూర్తిగా నా స్వ-గతం, నాతోనేను నాగురించి చెప్పుకునే కబుర్లు. నేను మరచిపోక ముందే ఎక్కడైనా భద్రపరచుకోవాలనీ చిన్ని ప్రయత్నం.... "బాల్యం నీ తోడుగా ఉంటే వృద్ధాప్యం నీ దరిచేరదు" అంటారు కదా!!" ..ఇది వేణూ శ్రీకాంత్ గారి బ్లాగు టాగ్ లైన్. వయో వృద్దులనీ, పుట్టుకతో వృద్దులనీ కూడా ఏకకాలంలో బాల్యంలోకి తీసుకెళ్ళి పోగల శక్తి ఈయన బాల్య జ్ఞాపకాలకి ఉంది. స్కూలు కబుర్ల మొదలు, బ్రిటానియా బిస్కట్లు, పుల్లైసుల వరకూ ఎన్నెన్ని కబుర్లో.

ఇక, నూనూగు మీసాల నూత్న యవ్వనమున చేసిన సాహసాలకి లోటే లేదు. విజయవాడ హాస్టల్ కానివ్వండి, విశాఖపట్నం ఆంధ్ర విశ్వకళా పరిషత్తు విద్యార్ధి వసతి గృహం కానివ్వండి.. మగ పురుషులైతే వాళ్ళని వాళ్ళు అద్దం లో చూసుకున్నట్టుగా ఆ టపాల్లో చూసేసుకుంటారు అంతే. తాను దేవదాసు కాబోయిన వైనాన్ని వర్ణిస్తూనే, బాధ్యతాయుతంగా ఒక డిస్క్లైమర్ పెట్టడం చూడగానే వెతుక్కుంటూ వెళ్లి కరచాలనం చేసి రావాలని అనిపించింది.. కానీ బెంగుళూరు ప్రయాణం అంటే మాటలా?

"ఆశావాదం, కాస్త భావుకత ?(ఈ మధ్య కొన్ని తెలుగు బ్లాగులు చదివాక నా భావుకత నాకే ప్రశ్నార్ధకం గా కనిపిస్తుంది), కాసిన్ని పగటికలలు, దేవుడి పై నమ్మకం, తెలుగు పై అపారమైన మక్కువ కలగలిసిన ఒక సగటు మనిషిని," అంటూ తన గురించి చెప్పుకున్నారు వేణూ శ్రీకాంత్. కానైతే, ఈ బ్లాగు చూసిన వాళ్లకి వాళ్ళ వాళ్ళ భావుకత ప్రశ్నార్ధకం కావడం మాత్రం ఖాయం. 'సంగీతం, సాహిత్యం, సినిమాలు' ఇవి కేవలం తన ఒక్కరి అభిరుచులే కాదు, నావి కూడాను. అందుకేనేమో, కొన్ని కొన్ని సార్లు తన టపాలు చదువుతుంటే "అచ్చం నాలాగే ఆలోచించారే!" అని ఆశ్చర్య పడుతూ ఉంటాను.

కాఫీ మొదలు కథల వరకూ కొన్ని విషయాల్లో మా ఆలోచనలు ఒకటే. కాకపొతే తనకి కాఫీ చేయడం వచ్చు, నాకు అంత బాగా రాదు. మొదట్లో నచ్చిన పాటల గురించి ఈ బ్లాగులోనే రాసేవారు కానీ, తర్వాత కేవలం పాటల కోసమే ఓ కొత్త బ్లాగు మొదలు పెట్టేశారు. చిన్నని, సన్నని దరహాసాలతో వేణూ శ్రీకాంత్ గారి టపాలు చదవడానికి అలవాటు పడ్డ నేను రెండు టపాలు చదివి అప్రయత్నంగానే కంట తడి పెట్టుకున్నాను. 'నేనున్నాను' అని చెప్పలేని పరిస్థితి. చెప్పినా సరిపోదు కూడా. అన్నట్టు ఈ గుంటూరు జిల్లా వాస్తవ్యుడికి కారంపూడి ఊరన్నా, తీయగా పాడే/మాట్లాడే సునీత అన్నా ప్రత్యేకమైన ఇష్టం.

మరి, ఇలాంటి బ్లాగు నుంచి టపాలు ఆగిపోతే చూస్తూ ఊరుకోలేం కదా? అందుకని అడగ గలిగిన విధంగా అడిగేశాను. "నాగురించి చెప్పుకోవాల్సిన కబుర్లు ప్రస్తుతానికి ఏం గుర్తురావడం లేదండీ.. వచ్చిన మరుక్షణం మళ్ళీ వచ్చేస్తాను.." అన్నది ఆయన సమాధానం. ప్రస్తుతం మాత్రం బజ్ లో వీర విహారం చేసేస్తున్నారు. "బ్లాగు తల్లి లాంటిది.. బజ్జు ప్రియురాలు లాంటిది" అన్నది నేను కొత్తగా కనిపెట్టిన సామెత. (ఎలా ఉంది?) ...కాబట్టి వేణూ శ్రీకాంత్ గారు తొందర్లోనే మళ్ళీ బ్లాగులోకి వచ్చేస్తారని నా ఆశ, కోరిక, నమ్మకం, అన్నీను.

46 కామెంట్‌లు:

  1. మురళీ గారూ,
    ఒక ముచ్చటైన బ్లాగుని అంతే ముచ్చటగా పరిచయం చేసారు. నాక్కూడా వేణూ గారి బ్లాగంటే చాలా ఇష్టం! :)
    తన పాటల బ్లాగులో కూడా చాలా మంచి పాటల కలక్షన్ ఉంటుంది..
    వేణూ గారూ.. అభినందనలు! మురళీ గారితో పాటు నేనూ అడుగుతున్నాను.. విరామం నుంచి ఎప్పుడు విరమిస్తున్నారండీ! :)

    రిప్లయితొలగించండి
  2. వావ్ వావ్ నాకు ఇష్టమైన ఒక బ్లాగు గురించి ఇంకొక ఇష్టమైన బ్లాగులో బావుంది . అవును వేణు గారు మళ్ళీ బ్లాగు రాయాల్సిందే మీతో పాటు నా కోరిక కోరిక .

    నాకెందుకో మీఇద్దరి మధ్య ఒక సారూప్యత కనపడుతుంది అండి అది ముఖ్యం గా ఎదుటివాళ్ళని అసలు నొప్పించకుండా ఉండాలి అనే మీ ఇద్దరి దోరణి నుంచి అనిపిస్తుందేమో నా అనుమానం , ఇంతకూ ముందు వేరే దగ్గర అడిగారు మీ ఇద్దరు అన్నదమ్ములాగా అనిపిస్తున్నారు అంటె ఎవరు అన్న ఎవరు తమ్ముడు చెప్పమని ఇక్కడ చెప్పేస్తున్నా మీరే అన్న ఎందుకంటే వేణు గారు ఇంకా మీలాగా వేరే విషయాల గురించి అంత పదును గా రాయటం నేను చూడలేదు అందుకు :)

    రిప్లయితొలగించండి
  3. ఓ మంచి బ్లాగు గురించి మీ అందమయిన పరిచయం బాగుంది. ఆయన టపాలు కొన్ని చదువుతుంటే మనకు తెలియకుండానే మన కళ్లు వర్షించటం మొదలెడతాయి. ముఖ్యంగా ఆయన వ్రాసిన "అమ్మకు అశృనివాళి" టపాలో ఆయన వ్రాసిన కొన్ని వ్యాక్యాలు ఇప్పటికీ నాకు కన్నీళ్లు తెప్పిస్తాయి.

    వేణు గారు తిరిగి త్వరగా వ్రాయటం మొదలుపెట్టాలని ఆయన బ్లాగులో అందరం కలిసి ఓ వంటా-వార్పూ కార్యక్రమం పెట్టేస్తే సరి!

    రిప్లయితొలగించండి
  4. మీరు కొత్త గా కనిపెట్టిన సామెత బాగుంది. వేణూ శ్రీకాంత్ బ్లాగ్ లో పాతవి నేను చదవలేదు వెళ్లి చూసి రావాలి...

    బాగా పరిచయం చేసారు..

    రిప్లయితొలగించండి
  5. మీదైన శైలిలో మంచి బ్లాగులని పరిచయం చేస్తున్నారు. నిజానికి మిమ్మల్ని చూసి నేను ఎంతో సిగ్గు పడాలి. అప్పుడప్పుడూ రెగ్యులర్ గానే బ్లాగులు చదువుతూనే వున్నాను, కొన్నిటిని "నా అభిమాన బ్లాగులు" అని బుక్ మార్కూ చేసుకున్నాను. అయినా ఏ బ్లాగులో ఏం చదివానో మాత్రం నాకు గుర్తు ఉండదు. అంత సూపర్ ఫిష్యల్ గా చదువుతున్నానన్న మాట. అందుకే మీ ఎనాలిసిస్ చూస్తే నాకు admiration తో కూడిన ఆశ్చర్యం!
    శారద

    రిప్లయితొలగించండి
  6. బ్లాగు తల్లి వంటిది. బజ్జు ప్రియురాలిలాంటిది.
    మీ సామెత అక్షర సత్యం. :)

    వేణు శ్రీకాంత్ గారు మనతో చెప్పుకోవలసిన కబుర్లు పుట్టాలని కోరుకుందాం. మంచి బ్లాగు గురించి ఇంకా మంచి టపా.

    రిప్లయితొలగించండి
  7. మురళి గారూ,

    మీరు వేణూ గారి గురించి చాల చక్కగా, చాల అందంగా రాసారు. ఆయన బ్లాగ్ గురించి, టపాల గురించి బహుశా చాలా మందికి, నాతొ కూడా కలిపి, ఇదే అభిప్రాయం ఉంటుంది అనటంలో వేరే ఆలోచన అఖర్లేదు. మీరు మళ్లీ ఇంకోసారి పరిచయం చేసి, తనకి మళ్లీ బ్లాగులు రాయటం మొదలెట్టమని ఇచ్చిన రహస్య సూచన చాల బాగుంది. వేణూని అజాత శత్రువు అన్న ఆపడం గుర్తొస్తుంది ఎప్పుడూ. నొప్పించక, తానొవ్వక అన్నట్టు ఉంటారు.

    మీ అనుమతి లేకుండానే మీ టపాని నా బజ్లో షేర్ చేశాను. మీకేమి అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయితే దయచేసి తెలియచెయ్యండి.

    https://profiles.google.com/100468445984176526991/posts/R1Cw6e2e9Hn

    రిప్లయితొలగించండి
  8. నాకు నచ్చిన, తరచుగా చూసే బ్లాగుల్లో వేణు శ్రీకాంత్ గారిదీ ఒకటి. మంచి బ్లాగుని మనోహరంగా పరిచయం చేశారు.

    శ్రీకాంత్ గారి బ్లాగు గురించి తెలియని వారుంటే మీరిచ్చిన లింక్‌లలోకి ప్రయాణించిగానీ బయటకి రారు.

    నేను రెగ్యులర్‌గా చదువుతానుగానీ ఎందుచేతనో బ్లాగుల్లో ఎక్కువగా కామెంట్ చెయ్యలేను. ఎప్పట్నుంచో అనుకుంటున్నా మీ బ్లాగు గురించి ఓ విషయం చెపుదామని... రెగ్యులర్‌‌గా పోస్ట్‌లు వ్రాసే అతి కొద్ది "మంచి" బ్లాగుల్లో మీదీ ఒకటి.

    మీరిలాగే మంచి మంచి కథల్ని, బ్లాగుల్ని, భావోద్వేగాల్నీ,... విరామం లేకుండా మాతో పంచుకోవాలని కోరుకుంటూ మీకు హృదయపూర్వక అభినందనలు.

    గీతిక బి

    రిప్లయితొలగించండి
  9. మీరు వ్రాసిన టపాల్లో నాకు బాగా నచ్చిన వాటిల్లో ఇది ఒకటి. త్వరలోనే వేణుగానం వింటామని ఆశిద్దాం.

    రిప్లయితొలగించండి
  10. బావుంది మురళీ గారూ....మంచి బ్లాగుని మీదైన శైలిలో పరిచయం చేసారు. తను బ్లాగు బాగా రాస్తాడు అంతే బాగా బజ్జులో అల్లరి చేస్తాడు. అవును తను అలా కబుర్లు ఆపేస్తే మనకెందుకు ఊరుకోవాలి? ఊరుకోము. వేణూజీ త్వరగా వచ్చి బ్లాగు మొదలెట్టండి మళ్ళీ. బజ్జులో మన అల్లరి అలాగే కంటిన్యూ అవుతుందిలెండి కంగారు పదకండి.

    ఇది వేణు కి:
    వేణూ బజ్జులో మీతో పాటు ఆడిన ఆట, పాట, అల్లరి నాకు ఎప్పటికీ గుర్తుంటాయి.

    రిప్లయితొలగించండి
  11. మురళి గారు భలే భలే బ్లాగులని పరిచయం చేస్తారు మీరు:).. నాకు కూడా వేణు గారి రాతలు భలే నచ్చుతాయి:))

    మామూలుగా పరిచయం కాకుండా ఆయా బ్లాగులోని టపాలన్నీ చదివి విశ్లేషించి రాసే మీ తీరు అద్భుతం:) మీ శ్రమకి బోలెడు ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  12. వావ్..:)))
    ఎలాంటి క్లిష్టమైన విషయాన్నైనా ఈయన రాశారంటే మనకింక అర్ధం కాకపోవడం అనే సమస్య ఉండదు.
    very well said

    బ్లాగు తల్లి లాంటిది.. బజ్జు ప్రియురాలు లాంటిదిహ హ్హ సూపర్ :))

    రిప్లయితొలగించండి
  13. అరె....సరిగ్గా సమయానికొచ్చానన్నమాట. అదేనండీ, నెమలికన్ను తో మీరు మా ( సోరీ మన) వేణూ గారికి వింజామరలు విసురుతున్నారుగా........
    మీ ఇద్దరి విషయంలో శ్రావ్య వట్టికూటి గారి అభిప్రాయమే నాదీను . మనం అంటే గోదారోళ్ళం అనుకోండి. కానీ కారంపూడి వారు కూడా ఇంత సౌమ్యంగా వుండటం విడ్డూరమే మరి ( గుంటూరు మిరపకాయల ఘాటు బ్లాగుల్లోకొచ్చాకే తెలిసందండీ బాబూ...) బజ్ లో వేణూ గారిని పలకరిస్తూనే వున్నాం కాబట్టి మాకంత బెంగలేదు . అయినా సరే వారు మళ్ళీ కాస్త ఇంటి పట్టునుండి బ్లాగు బాధ్యత భుజానికెత్తుకుంటే బావుంటుందని నా కోరిక

    రిప్లయితొలగించండి
  14. >>>>వావ్ వావ్ నాకు ఇష్టమైన ఒక బ్లాగు గురించి ఇంకొక ఇష్టమైన బ్లాగులో బావుంది . అవును వేణు గారు మళ్ళీ బ్లాగు రాయాల్సిందే మీతో పాటు నా కోరిక కోరిక .

    అచ్చంగా ఇదే ఇదే రాయాలనుకున్నాను ....శ్రావ్య రాసేసింది..

    మంచి బ్లాగ్ అనే కాదు అందరి చేతా మంచిబ్లాగర్ గా పేరు తెచ్చుకున్న వేణుగారికి అభినందనలు

    రిప్లయితొలగించండి
  15. బ్లాగు మొదలు పెట్టినప్పటినుండీ ఇన్నాళ్ళలోనూ తన బ్లాగులోగానీ, ఇతరబ్లాగుల్లో కామెంటినప్పుడు కానీ, నొప్పింపక తానొవ్వక అన్నట్టు మార్దవానికి మారు పేరు వేణూ శ్రీకాంత్. మీ సమీక్షా పరిచయం బాగుంది

    రిప్లయితొలగించండి
  16. మురళి గారు, ఇంక మీరే తప్పకుండా వేణూశ్రీకాంత్ గారితో మళ్ళీ రాయించాలండి. ఆ బాధ్యత మీ భుజాలమీదే ఉంది. ఎంత చక్కగా పరిచయం చేసారో...చాలా ముచ్చటగా ఉంది. .
    వేణూశ్రీకాంత్ గారు...బ్లాగ్ తలుపులు తెరవాలి....
    వేణూశ్రీకాంత్ గారు ...బ్లాగ్ తలుపులు తెరవాలి....
    వేణూశ్రీకాంత్ గారూ... బ్లాగ్ తలుపులు తెరవాలి....(స్ట్రైక్ అన్నమాట)...

    రిప్లయితొలగించండి
  17. జయగారి స్ట్రైక్‌కి బేషరతుగా నా మద్దత్తు. వేణూశ్రీకాంత్ గారు తల్లిలాంటి బ్లాగ్ దగ్గరకు రావాల్సిందే. :)

    రిప్లయితొలగించండి
  18. మీ పరిచయం వేణూ శ్రీకాంత్‌గారి బ్లాగు అంత బాగుందండి, మురళిగారు!

    రిప్లయితొలగించండి
  19. మీ పరిచయము బాగుందండి . మీ సామెత కూడా బాగుంది . వేణూశ్రీకాంత బ్లాగ్ నేనూ రెగ్యులర్గా చదివే దానిని .

    రిప్లయితొలగించండి
  20. మన బంగాళా దుంపలు లేవూ, అవేనండీ పొటాటోస్,
    ఎవరో అక్కడ గుమ్మడికాయల్ని గుర్తు చేసుకుంటున్నారు, నాకు తెలిసిపోతోంది
    వయో వృద్దులనీ, పుట్టుకతో వృద్దులనీ కూడా
    "బ్లాగు తల్లి లాంటిది.. బజ్జు ప్రియురాలు లాంటిది"
    :-) :-) nice review

    రిప్లయితొలగించండి
  21. @మధురవాణి: అవునండీ.. పాటల పర్వాపరాలని వీలైనంత వరకూ వివరంగా ఇవ్వడమూ బాగుంటుంది.. నాతొ గొంతు కలిపినందుకు ధన్యవాదాలండీ..
    @శ్రావ్య వట్టికూటి: మామూలుగా ఐతే నేనే అన్నో, అంకులో అవుతాననుకోండి.. కానీ ఆయన సీనియర్ బ్లాగర్ కదా.. అందుకని అడిగాను మిమ్మల్ని :)) ..ధన్యవాదాలు.
    @సిరిసిరిమువ్వ: చాన్నాళ్ళ తర్వాత!! అవునండీ, మీరు చెప్పిన టపానీ ప్రస్తావించాను.. అన్నట్టు, వంటా-వార్పూ ఆలోచన బాగుంది.. మనకి వచ్చినవే వండుదామా? కొత్తవేమన్నా నేర్చుకుందామా? :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. @కృష్ణ ప్రియ: తప్పక చదవండి.. మొదలు పెడితే విడిచి పెట్టరు.. ధన్యవాదాలు.
    @శారద: మొదట్లో నాక్కూడా బ్లాగులు గుర్తుండేవి కాదండీ.. చెబితే నమ్మరు కానీ, వెనుక డిజైన్లని బట్టి గుర్తు పెట్టుకున్నా మరీ ప్రారంభంలో :)) ఇలాంటి టపాలు రాసేటప్పుడు మళ్ళీ ఓసారి ఆయా బ్లాగుల్ని పలకరించి వస్తూ ఉంటానండీ.. అదీ రహస్యం!! ..ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: మీరు మరీనండీ.. వేణు గారు తలచుకుంటే కబుర్లకి కొదవా?? :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. @భరద్వాజ్ వెలమకన్ని: ధన్యవాదాలండీ..
    @పద్మవల్లి: అయ్యో.. అభ్యంతరం ఎందుకండీ.. మీ బజ్ చూడడం ద్వారా బజ్జుల గురించి మరికొంచం తెలుసుకోగలిగాను.. నేనే మీకు బోల్డన్ని థాంకులు చెప్పాలి.. బజ్జుల్లో అందరికీ ఈ టపాని గురించి చెప్పినందుకు.. ధన్యవాదాలు.
    @గీతిక: వావ్.. చక్కని ప్రశంశ.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  24. @Sujata: చీర్స్ అండీ.. ఈ సందర్భంగా టీ తాగుదామా? :)) ..ధన్యవాదాలు.
    @బులుసు సుబ్రహ్మణ్యం: నాది కూడా అదే ఆశ అండీ.. ధన్యవాదాలు.
    @ఆ.సౌమ్య: హమ్మయ్య.. మీరు బజ్జుల గురించి ఆ ధైర్యం ఇచ్చారు కదా.. ఇంక వేణూ గారు వచ్చేస్తారు!! ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  25. @మనసు పలికే: ఇలాంటి బ్లాగులు చదవడం అస్సలు శ్రమ అనిపించదండీ.. క్రెడిట్ అంటూ ఉంటే అది వేణూ గారి రాతలకే.. ధన్యవాదాలు.
    @హరే కృష్ణ: ధన్యవాదాలండీ..
    @లలిత: అవునండీ వింఝా..మరలు.. (మాయాబజార్) :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. @నేస్తం: వావ్..నిజంగా?!! ..ధన్యవాదాలండీ..
    @కొత్తపాళీ: అవునండీ.. మీ అభిప్రాయమే నాదీను.. ధన్యవాదాలు.
    @జయ: హమ్మయ్య!! మీరు మొదలు పెట్టారు కదా.. మేము జాయిన్ అవుతాం.. పెద్ద క్యాంపెయిన్ చేద్దాం.. తలుపులు తెరిపిద్దాం.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  27. @శిశిర: సెంటిమెంట్ తో కొట్టారన్న మాట!! చూద్దాం, చూద్దాం.. ఎన్నాళ్ళు రాకుండా అలా నిద్రలో ఉంటారో :)) ..ధన్యవాదాలు.
    @జేబీ: పెద్ద ప్రశంశ!! ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  28. @మాలాకుమార్: అవునండీ.. రాస్తే మళ్ళీ మనందరం చదవొచ్చు కదా.. ధన్యవాదాలండీ..

    @హరిచందన: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  29. నీ ఫేవరేట్ బ్లాగ్స్ ఏంటీ అని అడిగితే నేను చెప్పే లిస్ట్ లో వేణూశ్రీకాంత్ గారి బ్లాగ్ రెండవది. నాకు చాలా చాలా ఇష్టం. ప్రతీపోస్ట్ కీ అనుకునేవాడిని ఈయన అచ్చంగా నాలాగే ఆలోచిస్తారూ అని. ఇప్పుడే తెలిసిందీ అందరూ అలాగే అనుకుంటారూ అని.;);) చదివే ప్రతీలైనూ ఎంజాయ్ చేస్తాను. ఆయన హాస్టల్ సిరీస్ మొదలు పెట్టినప్పుడు చూసాను మొట్టమొదటి సారి ఆ బ్లాగ్ని. అంతే ఫాన్ అయిపోయాను. ఆయనపేరు లోనూ, నా పేరు లోనూ "వేణు" ఉందని తెగ ఆనందపడీపోయేవాడిని. ఇప్పటీకి కూడా అనుకోండీ.. ;) ;)

    మురళిగారూ సూపరు పోస్ట్ అండీ..
    వేణూజీ ఇక నిద్ర చాలించీ.. మళ్ళీ మొదలుపెట్టండీ..;)

    రాజ్ కుమార్

    రిప్లయితొలగించండి
  30. మంచి పరిచయం (విశ్లేషణ )అని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు అనుకుంటాను .ముఖ్యంగా రెండు టపా లు "అమ్మ "గురించి రాసుకున్నవి అప్పుడప్పుడు గుర్తొస్తు వుంటాయి.ఈ మద్య బాగా రాసే బ్లాగులేవి కనబడటం లేదు .తిట్టకండి మీది తప్పించి అని చదువుకోండి :-)

    రిప్లయితొలగించండి
  31. మీరిద్దరూ నాకు రెండు కళ్ళు అనిపిస్తుంది నాకు ఎతంతారు?

    రిప్లయితొలగించండి
  32. మురళి గారు కొన్ని అనుభూతులను ఆస్వాదించగలమే కానీ అక్షరబద్ధం చేయలేం. గత మూడు రోజులనుండి నాది అదే పరిస్థితి... అసలు నా కాళ్ళు నేలమీద లేవు :-) ఎవరిదో బ్లాగ్ గురించి చదువుతున్నట్లుగా మీ పరిచయాన్ని చదువుకోడం.. మీరు ఇచ్చిన లింక్స్ ద్వారా నా పాత టపాలను కామెంట్స్ తో సహా మళ్ళీ చదువుకుంటూ.. అన్ని టపాలు చదివి అంత శ్రమ తీసుకుని విపులంగా రాసిన మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో, ఏమని కామెంట్ రాయాలో తెలియక నిశ్శబ్దంగా వెళ్ళిపోడం.
    మళ్ళీ వచ్చి వచ్చిన ప్రతి కామెంట్ ని పదిసార్లు చదువుకుంటూ.. మీ అందరి ఆప్యాయతాభిమానాలను గుండెలనిండా నింపుకుంటూ అక్కడక్కడా అది పొంగి పొర్లి ఆనందభాష్పాలుగామారి కళ్ళు మసకబారితే.. ఏమీ రాయలేక వెళ్ళిపోతూ.. మూడు రోజులుగా ఇదే జరుగుతుంది.. ఒక అతి సాథారణమైన బ్లాగుకి (కొందరి దృష్టిలో కాలక్షేపం కబుర్ల బోరింగ్ బ్లాగుకి) ఇంత చక్కని పరిచయం రాసిన మీకు.. ఇక్కడ స్పందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతకన్నా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలియడంలేదు.
    నా బ్లాగ్ గురించి ఇప్పటికి మూడుసార్లు వార్తా పత్రికలలో పడినపుడు కూడా నాకు ఇంత సంతోషమనిపించలేదు. మీరు పరిచయం చేయడం ఏదో అత్యున్నత పురస్కారం లభించినంత ఆనందంగా ఉంది. నేను బ్లాగ్ మొదలు పెట్టినపుడు అసలు ఇందరు చదువుతారని గానీ ఇందరిని ఆకట్టుకుంటుందని కానీ అస్సలు ఊహించలేదు. నేను రాసింది మరొకరు ఆసక్తిగా చదువుతారు అన్న నమ్మకాన్ని మొదటిసారిగా కలిగించి నేను బ్లాగ్ మొదలుపెట్టడానికి కారణమైన ఓ నేస్తానికి ఈ సంధర్బంగా బ్లాగ్ముఖతా ధన్యవాదాలు చెప్తున్నాను.
    అన్నట్లు నా బ్లాగ్ కు నేను ప్రకటించినది విరామం మాత్రమేనండీ వీడ్కోలు కాదు.. కనుక మళ్ళీ వ్రాయను అనే అనుమానం మీకు అస్సలు అక్కరలేదు ఎందుకంటే ఒకసారి అలవాటయ్యాక ఏదో ఒకటి వ్రాయకుండా ఉండటం నాకు కూడా కష్టమే :-) కనుక ఇంకొంత కాలం ఆ బుజ్జి పాండాని అలాగే నిద్ర పోనిచ్చి ఆ తర్వాత బోల్డన్ని కబుర్లు చెప్పేసుకుందాం. నా బ్లాగును నాకే సరికొత్తగా పరిచయం చేసిన మీకు, మీ ఈ రివ్యూ గురించి అందంగా బజ్ చేసిన పద్మగారికి, ఇక్కడ స్పందించిన ప్రతిఒక్కరికీ మరోమారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  33. @వేణూరాం: గొంతు కలిపినందుకు ధన్యవాదాలండీ..
    @చిన్ని: చాన్నాళ్ళ తర్వాత!! బజ్జుల్లోకి వెళ్ళిపోయారా మీరుకూడా?? అన్నట్టు నాది తప్పించక పోయినా పర్లేదండీ :)) సేం ఫీలింగ్ నాక్కూడా.. ..ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు.... మీరలా అనేశాక ఇంకేం అనగలను చెప్పండి? 'I am honoured' అంతే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. @వేణూ శ్రీకాంత్: అవునండీ.. మీ మొదటి వాక్యంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.. మీ టపాలు చదివినప్పటి అనుభూతిని అతికొద్దిగా మాత్రమే అక్షర బద్ధం చేయగలగడం నా తాజా అనుభవం మరి.
    "ఒక అతి సాథారణమైన బ్లాగుకి (కొందరి దృష్టిలో కాలక్షేపం కబుర్ల బోరింగ్ బ్లాగుకి) ఇంత చక్కని పరిచయం రాసిన మీకు.."
    ..కొందరిని అస్సలు పట్టించుకోనవసరం లేదండీ.. మనం బ్లాగు రాసుకునేది మనకోసం.. మనలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళకి నచ్చుతుంది, అది సహజం. ఇక 'చక్కని పరిచయం' అన్నది మీ అభిమానం.. నేను చేసిందల్లా మీ బ్లాగుని అద్దంలో చూపించే ప్రయత్నం అంతే..
    "మీరు పరిచయం చేయడం ఏదో అత్యున్నత పురస్కారం లభించినంత ఆనందంగా ఉంది."
    ఇప్పుడు నాకు మాటలు లేవండీ.. చెప్పగలిగిందల్లా 'I am honoured' అని మాత్రమే..
    "అన్నట్లు నా బ్లాగ్ కు నేను ప్రకటించినది విరామం మాత్రమేనండీ వీడ్కోలు కాదు.."
    హమ్మయ్య.. కన్ఫర్మ్ చేశారు కదా.. 'విరామం అయితే మరీ ఇన్నాళ్ళా?' అని మొదలైన సందేహం అలా అలా పెద్దదవుతున్న సమయంలో, నిజంగానే ఇది చాలా మంచి కబురు.. నాకు మాత్రమే కాదు, మీ బ్లాగు పాఠకులు అందరికీ.. ఈ కబురు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  35. ఇందాక చెప్పడం మరిచాను మురళి గారు.. మన ఇద్దరివీ ఒకే భావాలని మనకి అనిపించడం వేరు మూడో వ్యక్తి నుండి వినడం వేరు.. శ్రావ్యగారు,పద్మగారు,పప్పుగార్ల కామెంట్స్ చూసినపుడు నిజంగా చాలా సంతోషమేసింది :-) కానీ విషయాల ఎంపికలోగానీ పదునుగా రాయడంలో కానీ మీతో పోల్చుకునే సాహసం నేను చేయలేను.. మీరు చాలాబాగారాస్తారు బొత్తిగా నాకు అందనంత ఎత్తులో ఉన్నారు :-) మామూలుగా ఐతే అన్న అయి ఉంటారని అనుకుంటున్నాను. అంకులంత దూరం లేదని నా ఉద్దేశ్యం :-)

    రిప్లయితొలగించండి
  36. @వేణూ శ్రీకాంత్: మీరు చెప్పిన వ్యాఖ్యల విషయంలో నాదీ అదే ఫీలింగ్ అండీ.. ఇకపోతే, మామూలు దూరం ఎలా ఉన్నా (:))) రాతల విషయంలో మీరు ఊహించుకుంటున్నంత దూరం అస్సలు లేదని నా అభిప్రాయం.. ముందు మీరు విరామానికి విరామం ఇవ్వండి, మిత్రులంతా కూడా ఇదే మాట అనకపోతే అడగండి!!

    రిప్లయితొలగించండి
  37. క్షమించాలి, చిన్ని గారి వ్యాఖ్య డిలీట్ అయ్యింది.
    @చిన్ని చెప్పారు... హ్మం.. బజ్జా! అదేమిటబ్బా... మనకి అలాంటివి తెలియవు. బ్లాగులైనా మీలాంటి పుణ్యాత్ములు పరిచయం చేశారు.

    రిప్లయితొలగించండి
  38. మా అన్నయ్య బ్లాగ్ గురించి చాలా బాగా పరిచయం చేసారు మురళి గారు........... బ్లాగ్లలో ఒక మంచి ఆహ్లాదమైన బ్లాగ్ నాకు చాలా చాలా నచ్చే బ్లాగ్ ........... మా అన్నయ్య పోస్ట్ లు ఆ *వేణు* గానాన్ని సైతం తలపించేలా మనోహరం గా ఉంటాయి అంటే అతిశయోక్తి కాదేమో ....... ఇంతకీ అన్నయ్య కొత్త పోస్ట్ ఒక నెలలోపు రాయకపోతే నీ పోస్ట్ కోసం మేమంతా పెన్ డౌన్ లా బ్లాగ్ డౌన్ చేయాల్సి వస్తుంది

    రిప్లయితొలగించండి
  39. @చిన్ని: :-) :-)
    @శివరంజని: 'బ్లాగ్ డౌన్' ఆలోచన బాగుందండీ :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  40. niojame manchi blogula sneham maruvaraanidi.viraamani thattukolemu.
    chooddam pupa lo ye sithaakoka chiluka rooponduthundo

    రిప్లయితొలగించండి
  41. ఈ పోస్ట్ కాస్తంత ఆలస్యం గా ( కాస్తంత కాదేమోలెండి ) చదువుతున్నాను.వేణు గారి బ్లాగ్ గురించి చక్కగా రాసారు.ఇకనయిన వేణు గారు విరామంకి సెలవు ఇచ్చి రాయడం ఆరంభిస్తే బావుంటుంది అని అభిప్రాయ పడేవారిలో నేను కూడా ఉన్నాను.

    రిప్లయితొలగించండి
  42. "బ్లాగు తల్లి లాంటిది.. బజ్జు ప్రియురాలు లాంటిది" bhalegaa undi..anduke nenu bajjula joliki vellanu....hahhaha

    రిప్లయితొలగించండి
  43. వేణూ శ్రీకాంత్ గారి గురించి మీరు రాసినదంతా నిజ్జంగా నిజ్జం.

    మంచి బ్లాగులు రాసే వేణూ శ్రీకాంత్ గారికీ, ఆ మంచి బ్లాగుల పరిచయం రాసిన మీకూ - బోల్డన్ని థాంక్స్!


    ~ లలిత

    రిప్లయితొలగించండి
  44. @లలిత టీఎస్: ప్రోత్సహిస్తున్న మీక్కూడా బోల్డన్ని ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి