నిజాం రాజ్యంలోని ఓ జాగీరది. జాగీర్దారుకి వినోదాలకీ, విలాసాలకీ ఎంత సమయమూ సరిపోదు. ఇక, పరిపాలన చూసేది ఎప్పుడు? అందుకే పెత్తనమంతా తాసీల్దారుదే అయ్యింది. అక్కడ తాసీల్దారు మహమ్మద్ అన్వర్ బేగ్ చెప్పింది శాసనం, వేసింది పన్ను. అతని మాటకి ఎదురు చెప్పేవాడు ప్రాణాలతో ఉండడు. పోలిస్ అమీను, గిర్దావరు కులశేఖర రావు (రెవిన్యూ ఇన్స్పెక్టర్), వ్యాపారి వెంకయ్య...వీళ్ళంతా తాసిల్దారుకి నమ్మిన బంట్లు.
ఆ జాగీరులో ఒకనాటి ఉదయం రైలు దిగాడు రఘు. స్టేషన్లో ఉన్నవాళ్ళంతా తెల్లబోయి చూశారతన్ని. అందుకు కారణం, అతని చేతిలో పత్రిక ఉంది. పైగా అది ఆంగ్ల పత్రిక. వాళ్ళ కళ్ళకి అతనో అసామాన్యుడిగా కనిపించాడు. జాగీరు లో పత్రికలు చదవడం నిషిద్దం. ఆమాటే చెప్పారు టిక్కెట్టు కలెక్టరూ, కరోడ్గిరీ (చెక్ పోస్ట్) జవానూ. వాళ్ళ మాట వినలేదు రఘు. ఫలితం, ఊళ్లోకి అడుగు పెట్టగానే పోలీస్ అమీన్ అతని చేతిలో పత్రిక లాక్కుని ముక్కలు ముక్కలు చేయడమే కాక, రఘుని ఈడ్చి చెంపమీద కొట్టాడు.
రఘు మామూలు వాడేమీ కాదు. ఆ ఊరి మోతుబరి వీరయ్య కి మేనల్లుడు, కాబోయే అల్లుడూను. జరిగిందేమిటో వీరయ్యకి అర్ధమయ్యేలోగానే అతనికి తాసిల్దారు నుంచి కబురొచ్చింది. రఘు ఊళ్ళో ఉండడానికి వీల్లేదన్నాడు తాసిల్దారు. వీరయ్య అలా కుదరదని చెప్పాక, పత్రిక చదవకూదడనే షరతు మీద ఊళ్ళో ఉండడానికి అంగీకరించాడు. ఊరి వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారో, వాళ్ళ అజ్ఞానాన్ని తాసిల్దారు, అతని మనుషులూ ఎంతగా ఉపయోగించుకుంటున్నారో అర్ధమయ్యింది అతనికి.
నిజానికి తాసిల్దారుకి చదువు రాదు. సంతకం చేయడం మాత్రమే వచ్చు. గిర్దావరు సాయంతో కాగితాలు ఒకటికి పదిసార్లు చదివించుకుని జాగ్రత్తగా సంతకాలు చేస్తూ ఉంటాడు. పత్రికంటే భయం అతనికి. అందులో ఏముంటుందో తెలియనప్పటికీ, ఊళ్లోకి పత్రిక వస్తే తన అధికారం తగ్గిపోతుందన్న బెదురు ఉంది లోపల. అందుకే నిషేధం పెట్టాడు పత్రిక రావడం మీదా, ఊళ్ళో వాళ్ళో చదవడం మీదాను. నగేష్ లాంటి యువకులు పోరుగూళ్ళకి వెళ్లి రహస్యంగా పత్రిక చదివి వస్తున్నారు.
పరిస్థితి అర్ధం కాగానే సంస్కరణ మొదలు పెట్టాలనుకున్నాడు రఘు. అది తన ఇంటినుంచే మొదలు కావాలని భావించాడు. వీరయ్యకీ, మరదలు జానకికీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతోందో, విప్లవాల ఫలితాలు ఏవిధంగా ఉంటున్నాయో వివరంగా చెబుతాడు. ఊళ్ళో వాళ్లకి ప్రపంచ జ్ఞానం లేని కారణంగానే తాసిల్దారు ఆటలు సాగుతున్నాయని చెబుతాడు. నెమ్మదిగానే అయినా విషయం అర్ధమవుతుంది వాళ్ళకి. ఆవేశ పరుడైన నగేష్ రఘుతో జత కలుస్తాడు. జానకి సైతం ముందుకి వస్తుంది.
మేజిస్ట్రేట్ సాయంతో ఊళ్లోకి పత్రిక తీసుకువస్తాడు రఘు. ఆ రోజు ఊరి వాళ్లకి పండుగ. తాసిల్దారుకి మాత్రం తన కంచు కోటకి బీటలు పడుతున్న భావన. మేజిస్ట్రేట్ వెంట రాగా, ఊళ్ళో చదవడం వచ్చిన అందరికీ పత్రిక పంచుతాడు రఘు. వాడల్లో రాత్రి బళ్ళు మొదలవుతాయి. జనం చదువుకోడానికి ముందుకొస్తారు. పత్రికతో ఆపకుండా, ఒక గ్రంధాలయం కూడా ప్రారంభిస్తాడు రఘు. వీరయ్య ఆర్ధిక సహాయం చేస్తాడు. ఇంతలోనే మేజిస్ట్రేట్ హత్యకి గురవుతాడు. రఘు మీద హత్యానేరం మోపబడుతుంది. ప్రజా ఉద్యమం మొదలవుతుంది. పోలీసు ఉన్నతాధికారి స్వయంగా కలుగ జేసుకోవడంతో రఘు నిర్దోషిగా బయటకి వస్తాడు.
ఊరు కరువు బారిన పడుతుంది. పత్రిక, గ్రంధాలయమే కారణమని ప్రచారం చేస్తాడు తాసిల్దారు. జనం నమ్మరు. వర్షాలు పడ్డాక, కలరా వ్యాపించి పెద్ద సంఖ్యలో జనం మృత్యువాత పడతారు. ఇందుకు కూడా పత్రిక, గ్రంధాలయమే కారణమంటారు తాసిల్దారు, అతని అనుచరులు. జనంలో రెండో ఆలోచన మొదలవుతుంది. గ్రంధాలయం బూడిద అవుతుంది. నగేష్ ఊరి నుంచి మాయమవుతాడు. ఊరికి దూరంగా ఉన్న కోయ గూడెం చేరతాడు. అమాయకులైన కోయలు కూడా తాసిల్దారు బాధితులే. వాళ్ళతో కలిసి ఆయుధం పడతాడు నగేష్. రఘు హింసా మార్గాన్ని తొలుత వ్యతిరేకిస్తాడు, తర్వాత సమర్ధిస్తాడు.
"మోదుగులు పూసినపుడు ఎర్ర జెండాలవుతాయి. విప్లవం ఎరుపు-మోదుగుపూలు ఎరుపు. మోదుగులు గ్రామాల లో ఉండవు, అడివిలో ఉంటాయి. విప్లవాలు అడవులలో వికసిస్తాయి. మోదుగుపూవు రంగు బట్ట చిరిగినా వదలదు - ఒకసారి విప్లవ పధం పట్టినవాడు చచ్చినా దానిని వదలలేడు" అంటారు 'అక్షరవాచస్పతి' డాక్టర్ దాశరథి రంగాచార్య. 'చిల్లర దేవుళ్ళు' తో నవలా వ్యాసంగం ప్రారంభించిన రంగాచార్య రెండో నవల ఈ 'మోదుగుపూలు.' తెలంగాణా సాయుధ పోరాటానికి దారితీసిన పరిస్థితులని ఇతివృత్తంగా తీసుకుని, నలభయ్యేళ్ళ క్రితం రాశారీ నవలని.
తొలి నవలతో పోల్చినప్పుడు ఈ నవలలో రచయిత పరిణతి స్పష్టంగా కనిపిస్తుంది. నాటకీయత తగ్గించడంతో పాటుగా, కథనం వేగవంతంగా సాగే విధంగా సన్నివేశాలని అల్లుకున్నారు. అడివిని గురించి రాసిన వర్ణనలు, గిరిజనుల జీవిత విధానం, వారి ఆచారాలు, కట్టుబాట్లు, పండుగ పబ్బాలు, విందు వినోదాలు.. ఇవన్నీ చదవాల్సిందే. ఆద్యంతం సీరియస్ గా సాగే ఈ నవలలో సునిశితమైన హాస్యానికీ లోటు లేదు. పాఠకులని రెచ్చగొట్టే రచన కాదు ఇది, ఆలోచింపజేసేది. (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 159, వెల రూ.75, ఏవీకెఎఫ్ లోనూ లభ్యం).
నలభై సంవత్సరాల క్రితం రాసిన పుస్తకమే అయినా ఇప్పటికీ దీని అవసరం ఉన్న గ్రామాలెన్నో ఉన్నాయనిపిస్తుంది. మురళి గారు మీ విశ్లేషణ ఎంతో బాగుంది. ఈ మోదుగుపూలు గురించి ఎక్కువగా శరత్ పుస్తకాల్లో చదివాను.
రిప్లయితొలగించండినేను 'చిల్లర దేవుళ్ళు' చదివా. ఇది కొత్తగా వచ్చిందా?
రిప్లయితొలగించండి@జయ: నవలలో మోదుగుపూల ప్రస్తావన కేవలం గూడేన్ని గురించి రాసినప్పుడు మాత్రమె వస్తుంది, గమనించారా? ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@హరిచందన: లేదండీ, ఈ పుస్తకం వచ్చి చాలా రోజులే అయ్యింది.. ఈమధ్యనే కొత్త ప్రింట్ వచ్చింది.. ధన్యవాదాలు.