సోమవారం, జూన్ 27, 2022

ఒక ఎంపిక

"సంతాలీ వారి వృత్తి వేట, ఆయుధం బాణం. అందుకే వారి గౌరవార్ధం చిత్తరంజన్ లోకో వర్క్స్ లోగోలో బాణం గుర్తుని కూడా చేర్చారు. చాలామంది సంతాలీలకి ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ ఇంటిపేర్లు భిన్నంగా ఉంటాయి. టుడ్డు, ముర్ము, ఎక్కా.. అలా ఉంటాయి. చిత్తరంజన్ లో విశ్వకర్మ పూజకి చాలా ప్రాధాన్యత ఉంది. సెప్టెంబర్ నెలలో వచ్చే ఆ పూజని చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సెక్షన్ లోనూ విశ్వకర్మ విగ్రహం పెట్టి పూజ చేస్తారు. వర్క్ షాప్ కి ఆవేళ బయట వాళ్ళని కూడా అనుమతిస్తారు. వేలమంది వస్తారు. మాలాంటి వాళ్ళు ఒంటరిగా వెళ్లినా సంతాలీలు మాత్రం పసిపిల్ల బాలాదీ వస్తారు. ఆడవారి కట్టు వేరుగా ఉంటుంది. జాకెట్టు వేసుకోరు. ఉన్నంతలో మంచి చీరె కట్టుకుని, తల నున్నగా దువ్వుకుని, పువ్వులు పెట్టుకుని, వెండి నగలు వేసుకుని వచ్చారు.

ఒక ఏడు చూస్తే చాలదా, ప్రతి ఏడూ ఎందుకు కాళ్ళీడ్చుకుంటూ రావడం అని సందేహం కలిగింది. 'ఈ పూజ కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు. తప్పకుండా వస్తారు' అని చెప్పారు మా శ్రీవారు. వచ్చిన వాళ్ళు ఊరికే చూసి పోటం లేదు, వాళ్ళ వాళ్ళు పని చేసే దగ్గర ఆగి, అక్కడ పెట్టిన విశ్వకర్మ విగ్రహానికి, అమిత భక్తితో ఒకటికి పదిసార్లు దండాలు పెట్టడం చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. ఏడాది పొడుగునా తమ మనిషి అక్కడే పనిచేస్తాడు, అతనికి ఎటువంటి ప్రమాదమూ జరగ కూడదని ప్రార్ధిస్తారుట. మరి వాళ్ళ ప్రార్ధనల ఫలితమేనేమో, అంత పెద్ద కర్మాగారంలో ఏనాడూ ప్రమాదం జరగదు. సంతాలీలను చూశాక, రోజూ పొద్దున్న దీపం పెట్టి, ఫ్యాక్టరీ చల్లగా ఉండాలని దణ్ణం పెట్టుకోటం అలవాటు అయింది.." సీనియర్ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి రాసిన 'జ్ఞాపకాల జావళి' లో 'కర్మాగారం' అనే అధ్యాయంలో కొంత భాగం ఇది. 

ఒక్క చిత్తరంజన్ మాత్రమే కాదు, భారతదేశంలో నిర్మాణం జరిగిన అనేక భారీ ప్రాజెక్టుల వెనుక ఈ సంతాలీల శ్రమ ఉంది. వారు చిందించిన చెమట ఉంది. దేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్ల తర్వాత, మొట్టమొదటిసారిగా ఈ 'సంతాలీ' తెగకి చెందిన మహిళని అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించింది కేంద్రంలోని అధికార పార్టీ. ఆమె ఎన్నిక లాంఛనమా, కష్టసాధ్యమా అనే చర్చని పక్కన పెడితే అత్యున్నత పదవికి నామినేషన్ వరకూ ప్రయాణం చేయడానికి అత్యంత వెనుకబడ్డ సంతాలీ గిరిజనులకు డెబ్బై ఐదేళ్లు పట్టింది! ఒడిశాకి చెందిన ద్రౌపది ముర్ము నామినేషన్ ఘట్టాన్ని టీవీలో చూస్తుంటే వచ్చిన చాలా ఆలోచనల మధ్యలో పొత్తూరి విజయలక్ష్మి గారి రచనా గుర్తొచ్చింది. తెలుగు సాహిత్యంలో సంతాలీల ప్రస్తావన ఇంకెక్కడా వచ్చినట్టు లేదు. 

అదే టీవీలో కొన్ని ఛానళ్లలో 'మన వాడికి' రాష్ట్రపతి అవకాశం ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం కనిపించింది. దేశం ముక్కలవుతుందన్న బెదిరింపూ వినిపించింది. 'ముక్కలవ్వడం మరీ అంత సులభమా?' అనిపించేసింది చూస్తుంటే. మనవాళ్ళకి ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చాయి, ఒక్క అవకాశమూ రాని వర్గాలు ఇంకా చాలానే మిగిలి ఉన్నాయన్న స్పృహ వారికి ఎందుకు కలగలేదన్న ఆశ్చర్యం వెంటాడింది. 'రాష్ట్రపతి-రబ్బరు స్టాంపు' తరహా చర్చలూ జరిగాయి. ఇప్పటివరకూ పనిచేసిన పద్నాలుగు మందిలోనూ పదవిని అలంకరించుకున్న వాళ్లతో పాటు, పదవికి అలంకారంగా మారిన వాళ్ళూ ఉన్నారు. లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు గాక, మన వ్యవస్థ బలమైనది. ప్రతి పదవికీ ప్రయోజనం ఉంటుంది. సమయం, సందర్భం కలిసిరావాలి. ఆ సమయంలో, ఆ పదవిలో ఉన్న వ్యక్తి బలమైన నిర్ణయాలు తీసుకోగలిగే వారై ఉండాలి. 

ఇదే 'జ్ఞాపకాల జావళి' లో 'అర్చన' అధ్యాయంలో కొంత భాగం: "అర్చనా వాళ్ళు సంతాలీల్లో ఒక తెగకు చెందిన వాళ్ళు. వాళ్ళ బంధువులు కాస్త దూరంలో బాఘా అనే చిన్న జనావాసంలో ఉంటారు. అక్కడ ఒక అమ్మాయికి ఏడాది కిందట పెళ్లి అయింది. భర్త తిన్ననైన వాడు కాదు. తాగటం, పెళ్ళాన్ని కొట్టటం. రెండు నెలలకే పుట్టింటికి వచ్చేసింది. వాళ్లొచ్చి నచ్చచెప్పి తీసుకెళ్లారు. అలా నాలుగైదు సార్లు జరిగింది. వీళ్ళు విసిగిపోయి దండువా పెట్టారు. దండువా అంటే పిల్లవైపు బంధువులు పిల్లాడింటికి వెళ్తారు. మగవాళ్ళు ఖాళీ చేతులతో వెళ్తారు. ఆడవాళ్ళూ వెళ్తూ చీపురు, అప్పడాల కర్ర, విసిన కర్ర వంటి ఆయుధాలు తీసుకెళ్తారు. పిల్లాడిని కూచోబెట్టి చుట్టూ తిరుగుతూ తలోటీ తగిలిస్తారు. మళ్ళీ అందులోనూ పద్ధతులున్నాయి. పిల్ల తల్లి, వదిన మాత్రం కొట్టరు, తిట్టి ఊరుకుంటారుట. 

'దండువా అయ్యాక ఛాటా చేశారు' అంది అర్చన. ఛాటా అంటే తెగతెంపులు. 'ఇక మీకూ మాకూ రామ్ రామ్' అని అందరిముందూ ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళిచ్చిన బంగారం, వెండి వాళ్ళకి ఇచ్చేశారు. వీళ్ళు ఇచ్చినవి చెవులు మెలేసి తీసుకున్నారు. వాళ్ళు కారం బూందీ, తీపి బూందీ పెట్టి చాయ్ ఇచ్చారుట. 'తన్నడానికి పోతే విందు కూడానా?' అంటే, 'అవును మరి, మేము ఊరికే పోయామా? మా పిల్లని బాగా చూసుకుంటే వాళ్ళ గడప తొక్కే పనేముంది మాకు? తప్పు వాళ్లదే కాబట్టి మర్యాద చెయ్యాలి. అదే మా పధ్ధతి. పిల్లని పుట్టింటి వాళ్ళు తీసుకు వచ్చేశారు. దానిష్టం అయితే మారు మనువుకి వెళ్తుంది. లేదా ఏదో కాయకష్టం చేసుకుంటూ ఉంటుంది' అని వివరంగా చెప్పి 'పనుంది' అని వెళ్ళిపోయింది. చెయ్యెత్తి దణ్ణంపెట్ట బుద్ధి వేసింది నాకు. ఏం చదివారు వీళ్ళు? ఎంత తెలివి? ఎంత బాధ్యత? ఎంత ఐకమత్యం? అన్నింటినీ మించి ఎంత ధైర్యం? మనమూ ఉన్నాం ఎందుకూ? చుట్టుపక్కల ఏం అన్యాయం జరిగినా బాపూ గారి కార్టూన్ లో చెప్పినట్టు చూసీ చూడనట్లు ఊరుకుంటాం." 

బుధవారం, జూన్ 22, 2022

యుద్ధ బీభత్సం

యుద్ధం కొనసాగుతోంది. బలమైన రష్యా, చిన్న దేశమైన ఉక్రెయిన్ మీద విజయం సాధించడం పెద్ద విషయమేమీ కాదనుకున్న వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. రెండు దేశాల బలాబలాలు, వాటి వెనుక ఉన్న శక్తులు, యుద్ధభూమిలో జరగబోయే పరిణామాలు.. వీటన్నింటినీ కాసేపు పక్కన పెట్టి, యుద్ధ బీభత్సాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన సమయమిది. మృతులు, క్షతగాత్రులు, కాలిన, కూలిన భవనాలు, ధ్వంసమైన ఆస్తులు.. ఇవన్నీ కనిపించే బీభత్సాలు. చాపకింద నీరులా ప్రపంచాన్ని, మరీ ముఖ్యంగా బీదవైన మూడో ప్రపంచ దేశాలని, చుట్టుముడుతోన్న బీభత్సం ఆకలి. కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో ఆకలి కేకలు మొదలయ్యాయి. మరికొన్ని దేశాలకీ ఇవి విస్తరించబోతున్నాయి. అంత తీవ్రంగా కాకపోయినా మిగిలిన అన్ని దేశాల్లోనూ ఎంతో కొంత ప్రకంపనలు వినిపించని తప్పని పరిస్థితే కనిపిస్తోంది. 

నెలల తరబడీ జరుగుతున్న యుద్ధం కారణంగా, సరిహద్దుల మూసివేత ఫలితంగా, అటు రష్యా నుంచీ, ఇటు ఉక్రెయిన్ నుంచీ మిగిలిన దేశాలకి ఆహారధాన్యాల సరఫరా ఆగిపోయింది. సోమాలియా, సూడాన్, లిబియా లాంటి చిన్న దేశాలు గోధుమలు, వంట నూనెల కోసం ఈ రెండు దేశాల మీదే ఆధార పడ్డాయి. అంతే కాదు, వ్యవసాయం చేయడానికి అవసరమయ్యే రసాయన ఎరువుల తయారీకి రష్యా ప్రధాన కేంద్రం. ఎరువుల సరఫరా కూడా ఆగిపోయింది. కరువు మొదలయ్యింది. గడ్డి మొలవని పరిస్థితుల్లో పాడి పశువులు మరణిస్తున్నాయి. పాలకీ కొరత మొదలయ్యింది. ఉన్న ఆహార నిల్వలు అడుగంటున్నాయి. కొత్త సరఫరాలకి దారులు తెరుచుకోలేదు. దూర దేశాల నుంచి తెప్పించుకోవడం ఖరీదైన వ్యవహారం మాత్రమే కాదు, చాలా సమయం పట్టే ప్రక్రియ కూడా. 

ఇది ఆఫ్రికా దేశాలకి మాత్రమే పరిమితమైన సమస్య కాదు, ఆహారధాన్యాల దిగుమతుల మీదే పూర్తిగా ఆధార పడ్డ ఈజిప్టుది కూడా. కానైతే, ఆఫ్రికన్ దేశాల పేదరికం వాటిని త్వరగా కరువులోకి నెట్టేసింది. యుద్ధకాలంలోనే ప్రకృతి కూడా పగబట్టింది. ధరలు రెట్టింపయ్యాయి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. ఫలితంగా, ఆకలి కేకలు మొదలయ్యాయి. నిజానికి ధరల పెరుగుదల యుద్ధానికన్నా ముందే మొదలయ్యింది. కరోనా కారణంగా ధరల పెరుగుదల ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. అయితే, అటు ఈజిప్టు, ఇటు ఆఫ్రికన్ దేశాల్లో మాత్రం యుద్ధం కారణంగా పరిస్థితి పుండుమీద కారం జల్లినట్టైంది. ఇప్పుడు ప్రపంచమంతా 'గ్లోబల్ విలేజ్' కాబట్టి ఈ సమస్య మిగిలిన దేశాలకి విస్తరించడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. 

సముద్ర మార్గాలు మూసుకుపోవడం, భూమార్గాల ద్వారా సరుకు రవాణా ఖరీదైన వ్యవహారం కావడం, అన్నింటినీ మించి ఆహారధాన్యాలు యుద్ధంలో ఉన్న రెండు దేశాల సరిహద్దులు దాటి బయటికి వచ్చే మార్గాలు రోజురోజుకీ మూసుకుపోవడంతో కొద్ది నెలల్లోనే ఆహార ధాన్యాల కొరత తీవ్రమయ్యింది.  ఆహార ధాన్యాలు పండించే మిగిలిన దేశాలేవీ ఎగుమతి చేయగలిగే పరిస్థితుల్లో లేవు. స్థానిక అవసరాల మొదలు, రాజకీయ సమస్యల వరకూ కారణాలు అనేకం. ఉదాహరణగా భారత దేశాన్నే తీసుకుంటే, గోధుమలు ఎగుమతి చేస్తామని ప్రకటించి వెనువెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కారణం, దిగుబడి తగ్గడం, పండిన పంట స్థానిక అవసరాలకి ఎంతవరకూ సరిపోతుందన్న సందేహం రావడం. మార్చి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ ఏడు గోధుమ దిగుబడి దారుణంగా పడిపోయింది. 

కరువు అనేది ఓ భయంకరమైన విషయం. గోదావరి ఆనకట్ట కట్టక మునుపు సంభవించిన 'డొక్కల కరువు' గురించి చిన్నప్పుడు కథలు కథలుగా విన్నాం. క్షుద్భాధకి తాళలేక మట్టిలో నీళ్లు కలుపుకు తిన్నవాళ్ళు, ఎవరైనా చనిపోగానే వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి తిండికోసమూ మిగిలిన వాళ్ళు ప్రాణాలకి తెగించి కొట్టుకోడం లాంటివి విన్నప్పుడు ఒళ్ళు జలదరించేది. అవన్నీ సాంకేతికత అభివృద్ధి చెందని నాటి పరిస్థితులు. గడిచిన ముప్ఫయ్యేళ్లలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగింది. ఎన్నెన్నో సమస్యల్ని కంప్యూటర్లు చిటికెలో పరిష్కరించేస్తున్నాయి. వాతావరణం ఎలా ఉండబోతోందో ముందుగా తెలుస్తోంది. వరదలు, తుపానుల గురించి ముందస్తు అంచనా ఎన్నో ప్రాణాలనీ, పంటల్నీ కాపాడుతోంది. ఇప్పుడు చుట్టుముడుతున్న కరువుని ఎదిరించాలంటే యుద్ధం ఆగాలి. ఆపని చేయగలిగేది టెక్నాలజీ కాదు, దాన్ని వాడే మనుషులే.

సోమవారం, జూన్ 20, 2022

'క్లాసిక్స్' తో పేచీ ...

విజయ-వాహినీ వారి 'గుండమ్మ కథ' సినిమాకి అరవై ఏళ్ళు నిండాయని గత వారమంతా హడావిడి జరిగింది. పత్రికల్లో ప్రత్యేక కథనాలు, టీవీల్లో ప్రత్యేక కార్యక్రమాలు, యూట్యూబ్ ఛానళ్లలో వాళ్ళకి తోచిన విశేషాలు.. ఇలా ఒక్కసారిగా ఆ సినిమా వార్తల్లోకి మళ్ళీ వచ్చింది. భారీ తారాగణం, వీనుల విందైన సంగీతం, గుర్తుండిపోయే పాటలు,  ఆరోగ్యకరమైన హాస్యం.. ఇలా విడివిడిగా చూసినప్పుడు ఒక్కొక్కటీ బాగుంటాయి కానీ మొత్తం సినిమాగా నేను 'క్లాసిక్స్' జాబితాలో వేసుకోలేను. నా పేచీ అంతా కథలోని ఓ  ముఖ్య భాగంతోనే. ఏళ్ళ తరబడి మిత్రులతో చర్చించి, చాలాసార్లు ఏకాభిప్రాయం కుదరక వదిలేసిన విషయమే కానీ, ఈ 'వజ్రోత్సవ' సందర్భంలో మళ్ళీ గుర్తొచ్చింది.  

చనిపోయిన తన స్నేహితుడి కుటుంబాన్ని బాగుచేయాలన్న ఎస్వీ రంగారావు తాపత్రయమే ఈ సినిమా కథ. ఆ స్నేహితుడికి భార్య వల్ల సావిత్రి, ఆ భార్య చనిపోయాక రెండో పెళ్లి చేసుకున్న సూర్యకాంతం వల్ల జమునా కలుగుతారు. సవితి తల్లి సూర్యకాంతం తనని నానా బాధలూ పెడుతున్నా, సాత్వికురాలైన సావిత్రి అవన్నీ భరిస్తూ అందరిపట్లా ఆదరం కనబరుస్తూ మంచి పిల్ల అనిపించుకుంటూ ఉంటుంది. తన పెద్ద కొడుకు ఎంటీఆర్కి సావిత్రినిచ్చి పెళ్లిచేసి, సవితి తల్లి బారినుంచి కాపాడి కొత్త జీవితం ఇవ్వాలనుకుంటాడు ఎస్వీఆర్. ఇక్కడి వరకూ పేచీలేదు. కానైతే, గారాబంగా పెరిగిన జమునని తన చిన్నకొడుకు నాగేశ్వర్రావుకి చేసుకుని ఆమెని 'సంస్కరించాలి' అని కూడా అనుకుంటాడు - ఇదే పేచీ. 

గారంగా పెరగడం జమున తప్పు కాదు. తల్లికలా సాగింది కాబట్టి, పనిపాటలకి సావిత్రి ఉంది కాబట్టీ, సతివి కూతురికి, సొంతకూతురికి మధ్య తల్లి భేదం చూపించాలి కాబట్టీ అలా అల్లారుముద్దుగానే పెరిగింది.  పనిపాటలు చేతకావు, ఆధునికంగా అలంకరించుకుని సినిమాలకి వెళ్లడం లాంటి సరదాలు మెండు. ఇలా ఉన్నవాళ్లు అన్ని కాలాల్లోనూ ఉన్నారు. ('సుమంగళి' 'చరణదాసి' లాంటి సినిమాలని ఇప్పటి పరిస్థితుల్లో చూసి పోల్చి తీర్పులివ్వడం కాదు అని గమనించాలి). చిన్ననాటి స్నేహితుడి ఇద్దరు కూతుళ్ళని తన కోడళ్ళుగా చేసుకోవాలనే అభిలాష తీర్చుకునే క్రమంలో జమునని యధాతధంగా అంగీకరించకుండా, ఆమెని ఓ కొత్త మూసలో ప్రవేశపెట్టి, హింసపడేలా చేసి (డొమెస్టికేట్ చేసి?) చివరాఖరి రీల్లో ఆమెలో 'మార్పు' తేవడం అనే ప్రాసెస్ అంతా ఎన్నిసార్లు ఆ సినిమా చూసినా నాకు అంగీకారం అవ్వడం లేదు. 

జమున, జమునలా ఉండిపోకుండా సావిత్రి లాగా ఎందుకు మారిపోవాలి? అలా మారిపోయాక మాత్రమే ఆమెకి మిగిలిన పాత్రల, ప్రేక్షకుల అంగీకారం ఎందుకు దొరకాలి? మారిపోవడం అంత సులభమా?? మామూలుగా అయితే ఇంత ఆలోచన అవసరం లేదేమో కానీ, 'క్లాసిక్' స్టేటస్ ఉన్న సినిమా కదా. అసలు సూర్యకాంతం గయ్యాళిగా వేసిన మెజారిటీ సినిమాల్లో చివరి రీల్లో భర్త పాత్రధారి ఎస్వీఆరో, గుమ్మడో ఓ చెంపదెబ్బ కొట్టగానే ఆమెలో పశ్చాత్తాపం వచ్చేయడం కూడా 'ఏదోలా సినిమాని ముగించాలి కాబట్టి' అనే అనిపిస్తుంది  తప్ప వాస్తవికంగా కనిపించదు. 'ఆ దెబ్బేదో మొదటి రీల్లోనే కొట్టేసి ఉంటే ఇంత గొడవ ఉండేది కాదు కదా' అనిపించిన సందర్భాలూ కోకొల్లలు. ఈ నేపథ్యంలో 'గుండమ్మ కథ' లో జమున పాత్ర తాను చేయని తప్పుకి శిక్ష అనుభవించిందనే అనిపిస్తుంది. మారిన జమునకీ, 'మార్చుకున్న' నాగేశ్వరరావుకీ ప్రేక్షకుల అభినందనలు నాకు కొరుకుడు పడవు. 

'Google' images

ఇలాంటి పేచీయే ఉన్న మరో 'క్లాసిక్' స్టేటస్ సినిమా కె. విశ్వనాథ్ 'స్వర్ణకమలం'. ఇందులో కూడా మంచి నటీనటులున్నారు, ఇళయరాజా సంగీతం, సంస్కృత పదబంధ సమ్మిళితమైన సిరివెన్నెల సాహిత్యం, అరుదుగా వినిపించే ఇళయరాజా-సుశీల కాంబినేషన్, కొన్ని హాస్య సన్నివేశాలు, మరికొన్ని సెంటిమెంట్ సీన్లు.. ఇవన్నీ బాగుంటాయి. కానీ, భానుప్రియ లో 'పరివర్తన' తెచ్చి, ఆమె నాట్యాన్ని ప్రేమించేలా చేయడానికి వెంకటేష్ పడే తాపత్రయం, తనకి నచ్చిన కెరీర్ ఎంచుకున్న ఆమెని రకరకాల ప్రయత్నాలతో నాట్యంలోకి వెనక్కి తీసుకురావడం.. ఇవన్నీ చూస్తుంటే 'ఆమె పాటికి ఆమెని వదిలేయచ్చు కదా.. వాళ్ళ నాన్నకున్న చాలామంది శిష్యుల్లో ఎవరో ఒకరు నాట్యాన్ని ముందుకు తీసుకెళ్తారు కదా' అనిపిస్తూ ఉంటుంది. 

'గుండమ్మ కథ' తో పోల్చినప్పుడు 'స్వర్ణకమలం' విషయంలో రిలీఫ్ ఏమిటంటే, భానుప్రియ నాట్యంలో మమేకమైన తర్వాత అందులో ఆత్మానందాన్ని సంపాదించుకోవడం. తనకి ఇష్టమైన హౌస్ కీపింగ్ ఉద్యోగంలో ఆమెకిది దొరికేది కాదా? అంటే, సందేహమే మళ్ళీ. సినిమా మొదటినుంచి, చివరివరకూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాట్యం గొప్పదనాన్ని గురించి ఆమెకి ఏదో ఒక విధంగా చెప్పి చూసేవాళ్ళే. ఇష్టపడక పోడానికి ఆమె కారణాలు ఆమెకి ఉన్నాయి. అవీ సబబైనవే. కానైతే, హీరో కంకణం కట్టేసుకుని మరీ ఆమెలో మార్పు తెచ్చేయడం, తండ్రి ఆత్మార్పణ లాంటి బలమైన సంఘటనల తర్వాత ఆమెలో ఆ మార్పు వచ్చేయడం.. ఇదంతా కాస్త హైరానాగానే అనిపిస్తుంది. అందరికీ అన్నీ నచ్చాలని లేదుకదా..

శనివారం, మే 28, 2022

ఎన్టీఆర్

"కవిరాజు కంఠంబు కౌగిలించెనుగదా పురవీధి నెదురెండ బొగడదండ..." శ్రీనాథ కవిసార్వభౌముడి ఈ చాటువుతో పాటు చటుక్కున గుర్తొచ్చే పేరు, రూపం కీర్తిశేషులు నందమూరి తారక రామారావుది. ఇవాళ ఎన్టీఆర్ శతజయంతి.  శ్రీనాథుడి మిగిలిన రచనలు ఏవి తలుచుకున్నా మొదట గుర్తొచ్చేది సినీ గేయ రచయిత వేటూరి. కానీ, ఈ ఒక్క చాటువు మాత్రం నందమూరినే గుర్తుచేస్తుంది. వ్యక్తిత్వం మొదలు, ఆహార విహారాదుల వరకూ ఆ కవిసార్వభౌముడికీ, ఈ నట సార్వభౌముడికీ చాలా పోలికలుండడం ఇందుకు ఒక కారణం అయి ఉంటుంది. వందేళ్ల క్రితం ఓ మారుమూల పల్లెటూళ్ళో, సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఓ మనిషి స్వయంకృషితో ఎదిగి తానే ఒక చరిత్ర కావడం వెనుక ఉన్న శ్రమని, ఒడిదుడుకుల్ని ఎవరికి వారు ఊహించుకోవలసిందే. 

కాలేజీ రోజుల్లో నాటకాలాడడంతో నటన మీద మొదలైన ఆసక్తి, ఎన్టీఆర్ ని మదరాసు మహానగరం వైపు నడిపించింది. తన ప్రాంతానికి, తన కులానికే చెందిన అక్కినేని నాగేశ్వర రావు అప్పటికే సినిమాల్లో నిలదొక్కుకున్నారు. మొదట్లో పడ్డ ఇబ్బందులు మినహా, ఒకసారి కథానాయక పాత్రలు రావడం మొదలయ్యాక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. ఆ నాగేశ్వరరావుకే గట్టి పోటీ ఇవ్వడం, ఒక్క నటనతోనే ఆగిపోకుండా సినిమా రంగానికి సంబంధించిన చాలా రంగాల్లో ప్రవేశించి ఔననిపించుకోవడం ఎన్టీఆర్ ప్రత్యేకత. అప్పటివరకూ బ్రాహ్మణ కులస్తుల ఆధిపత్యంలో ఉన్న సినిమా పరిశ్రమని కమ్మ కులస్తులు తమ చేతుల్లోకి తీసుకుంటున్న దశలో సినిమా రంగంలోకి అడుగు పెట్టడం ఎన్టీఆర్ కి కలిసొచ్చిన విషయాల్లో ఒకటి. 

నలభైనాలుగేళ్ల సినిమా కెరీర్ లో మూడొందల సినిమాల్లో నటించడం అన్నది ఇప్పటి రోజులతో పోలిస్తే పెద్ద రికార్డే. రేయింబవళ్లు శ్రమించడం, నిర్మాత శ్రేయస్సు కోరడం అనే లక్షణాలు ఈ రికార్డుకి దోహదం చేశాయి. సినిమా నటులు తమని తాము దైవాంశ సంభూతులుగా భావించుకోవడం అనేది ఎన్టీఆర్ తోనే మొదలయ్యింది బహుశా. ఈ భావన బాగా వంటబట్టాక అడపాదడపా నిర్మాతల్ని ఇబ్బంది పెట్టిన సంఘటనలున్నప్పటికీ (ముళ్ళపూడి, ఎమ్మెస్ రెడ్డిలు తమ ఆత్మకథల్లో ప్రస్తావించిన విషయాలు) మొదటి నుంచీ ఇదే ధోరణిలో ఉండి ఉంటే పెద్ద ఎత్తున సినిమాలు చేసే అవకాశం ఉండేది కాదు. ఎన్టీఆర్ సెంటిమెంట్ సీన్లలో చేసే అభినయం మీద తమిళ నటుడు శివాజీ గణేశన్ ప్రభావం కనిపిస్తుంది. అదే రాజకీయాలకి వచ్చేసరికి, ఎన్టీఆర్ నిర్ణయాలపై ఎంజీ రామచంద్రన్ మార్గాన్ని తనది చేసుకున్నారనిపిస్తుంది. 

Google Image

ప్రాయంలో ఉండగానే 'భీష్మ' లాంటి వృద్ధ వేషాలు, 'బృహన్నల' వంటి సాహసోపేతమైన వేషాలూ వేసిన ఎన్టీఆర్, తన వయసు అరవైకి సమీపిస్తున్నప్పుడు మాత్రం కేవలం హీరోగా మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నారు. 'స్టార్డం' పతాక స్థాయికి చేరిన సమయమది. 'కూతురు వయసు పిల్లలతో తైతక్కలాడడం' లాంటి విమర్శల్ని ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇక, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం ఒక సంచలనం. రాష్ట్ర రాజకీయాలన్నీ రెడ్డి కులస్తుల చుట్టూనే తిరుగుతున్నాయన్న అసంతృప్తి ఆర్ధికంగా బలపడిన కమ్మ కులస్తుల్లో మొదలైన సమయం కావడంతో నేరుగా ముఖ్యమంత్రి పదవి పొందడానికి మార్గం సుగమమైంది. కాంగ్రెస్ వ్యతిరేకత, తెలుగు ఆత్మగౌరవం పేరిట నాటి ప్రముఖ పత్రికలు ఒక నేపధ్యాన్ని సిద్ధం చేసి ఉండడంతో పాటు, అన్నివిధాలా సహకరించడంతో సొంతంగా పార్టీ పెట్టి,  అతితక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టి రికార్డు సాధించగలిగారు. ఇందుకోసం ఎన్టీఆర్ పడిన శ్రమని తక్కువ చేయలేం. 

ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలన్నింటికీ తాతలాంటిది అప్పట్లో ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన రెండురూపాయలకే కేజీ బియ్యం పథకం. తర్వాతి కాలంలో ఇదే పథకం రాష్ట్ర ఖజానా పాలిట తెల్ల ఏనుగుగా మారడం, లోటు బడ్జెట్టు, తత్ఫలితంగా రాష్ట్రానికి-కేంద్రానికి మధ్య సంబంధాలు దెబ్బతినడం వరకూ వెళ్లి, అటు నుంచి కేంద్రంలో తృతీయ కూటమి ఏర్పాటు వరకూ సాగింది. పేదలకి బియ్యం పథకం ఎన్నో ఇళ్లలో పొయ్యిలు వెలిగిస్తే, ఒక్క సంతకంతో ఉద్యోగాల రద్దు నిర్ణయం వేలాది కుటుంబాలని రాత్రికి రాత్రే రోడ్డున పడేసింది.  ముఖ్యమంత్రి అయినట్టే, ఎన్టీఆర్ చులాగ్గా ప్రధాని కూడా అయిపోతారని అప్పట్లో చాలామంది బలంగా నమ్మారు. కానీ, కాలం కలిసి రాలేదు. ప్రధాని పదవి రాకపోగా, తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న ముఖ్యమంత్రి కుర్చీ నుంచి అత్యంత అవమానకర పరిస్థితుల్లో దిగిపోవాల్సి వచ్చింది. 

సినిమాల్లో స్టార్డం వచ్చాక దైవత్వం ఆవహించినట్టే, రాజకీయాల్లో అవుననిపించుకోగానే అధికారం ఆవహించింది ఎన్టీఆర్ ని. ఫలితమే, "ఎన్నికల్లో నా కాలి చెప్పుని నిలబెట్టినా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు" లాంటి ప్రకటనలు. తాను నిలబెట్టిన ఎమ్మెల్యేలని అలా కాలి చెప్పులతో పోల్చారు ఎన్టీఆర్. అదే ఎమ్మెల్యేలు, అదే ఎన్టీఆర్ మీద చెప్పులు విసిరే పరిస్థితి రావడమే విధి విచిత్రం. చివరి రోజులు బాగుండాలి అనేది ప్రతి ఒక్కరూ కోరుకునే కోరిక. వయసులో ఉన్నప్పుడు ఎన్ని కష్ఠాలు ఎదురైనా, వృద్ధాప్యంలో ప్రశాంత జీవితాన్నీ, అనాయాస మరణాన్నీ కోరుకోని వారు ఉండరు. అప్పటివరకూ వైభవాన్ని చూసిన ఎన్టీఆర్ కి చివరి రోజుల్లో మిగిలినవి వెన్నుపోటు, అవమానాలు, ఆక్రోశాలు. రాజులా బతికిన శ్రీనాథుడు చివరి రోజుల్లో కష్టాలు అనుభవించడానికి స్వీయ తప్పిదాల కన్నా, మారిన పరిస్థితులే ఎక్కువ కారణం అంటుంది చరిత్ర. మరి, ఎన్టీఆర్ విషయంలో?? చరిత్ర ఎలాంటి జవాబు చెబుతుందో వేచి చూడాలి. 

సోమవారం, మే 16, 2022

మండుటెండలు

ఎండలు మండిపోతున్నాయనుకోవడం ప్రతి వేసవిలోనూ మనకి మామూలే కానీ ఈసారి మామూలుగా కాక 'రికార్డు' స్థాయిలో మండుతున్నాయి. గత నెలలో (ఏప్రిల్) భారతదేశంలో నమోదైన ఉష్ణోగ్రతలు గడిచిన నూట ఇరవై రెండు సంవత్సరాల్లోనే అత్యధికంట! మనమే కాదు, పొరుగున ఉన్న పాకిస్తాన్, శ్రీలంక దేశాలు కూడా మండుతున్నాయి, కేవలం రాజకీయ వేడి మాత్రమే కాదు అక్కడి వాతావరణమూ అసహజమైన ఎండలతో అట్టుడుకుతోంది. బంగ్లాదేశ్ దీ అదే పరిస్థితి. ఈ బీద దేశాలన్నింటిమీదా సూర్యుడు ఎందుకిలా పగబట్టాడన్నది బొత్తిగా అంతుబట్టడంలేదు. ఎండల నుంచి రక్షింపబడడానికి జనాలకున్న ఒకే ఒక్క అవకాశం ఫ్యాన్ కిందో, ఏసీలోనో సేదదీరడం. అవి నడిచేది కరెంటు మీద. ఆ కరెంటుకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి సరఫరాలో ప్రతిరోజూ కోత పడుతోంది. ఇది చాలదన్నట్టు చార్జీలు రోజురోజుకీ పెరుగుతున్నాయి కూడా. 

ఉష్ణోగ్రతలు పెరగడానికి సైన్సు చెప్పే రెండు కారణాలు కాలుష్యం పెరగడం, పచ్చదనం తగ్గిపోవడం. ఏళ్ళ తరబడి ఇవే కారణాలు వినిపిస్తున్నా పరిష్కారం ఏమీ దొరక్కపోగా, ఎండలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ రెండు కారణాలు మనొక్క చోటే కాదు, మొత్తం ప్రపంచం అంతా ఉన్నవే కదా. మరి మనల్ని మాత్రమే ఈ ఎండలు ఎందుకు బాధిస్తున్నాయి. నాకు అర్ధమైనంత వరకూ ప్రతి సమస్యకీ ఉన్నట్టే ఈ ఎండల సమస్యకీ రెండు పరిష్కారాలు ఉన్నాయి -  ఒకటి తాత్కాలికమైనది, రెండోది శాశ్వతమైనది. మిగిలిన ప్రపంచం, మరీ ముఖ్యంగా ధనిక దేశాలు తాత్కాలిక పరిష్కారం దోవ పట్టాయి. వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్ ని ముందుగానే ఊహించి పంపిణీకి ఆటంకం లేకుండా చూడడం, అవసరమైతే వీళ్లకీ వాళ్ళకీ (ఓ దేశానికీ, మరోదేశానికీ) జుట్లు ముడిపెట్టి ఇంధన సరఫరా వరకూ వాళ్ళ పబ్బం గడుపుకోవడం. దీనివల్ల 'ఎండలు బాబోయ్' అన్న మాట అక్కడ వినిపించడం లేదు. 

Google Image

ఇప్పుడు ఉష్ణోగ్రతలో రికార్డులు బద్దలు కొడుతున్న దేశాల్లో ఎండలు పెరిగేందుకు భౌగోళిక కారణాలు కొంత కారణం అయితే, తగ్గించుకునేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకునే వీలు కూడా కనిపించకపోవడం మరో సమస్య. ఓ పదేళ్ల క్రితంతో పోలిస్తే ఏసీల మార్కెట్ విపరీతంగా పెరిగిన మాట వాస్తవమే అయినా, మొత్తం జనాభా-ఏసీల నిష్పత్తితో పోల్చి చూసినప్పుడు వినియోగంలో ఉన్న ఎయిర్ కండిషనర్ల సంఖ్య తక్కువనే చెప్పాలి. పైగా జనం దగ్గర ఉన్న ఏసీలన్నీ వినియోగంలో ఉన్నాయనీ చెప్పలేం. కరెంటు కోత, బిల్లుల మోత కారణంగా ఇంట్లో ఏసీ ఉన్నా రోజంతా వాడే వాళ్ళు తక్కువే. కూలర్లు, ఫ్యాన్లదీ ఇదే కథ. ప్రజల్లో ఖర్చుపెట్టే శక్తి తక్కువగా ఉండడం, ఖర్చు పెట్టే అవకాశం లేకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి. భారీ ఎత్తున చెట్ల నరికివేత, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కూడా గాలాడని ఉక్కపోతకి బాగానే దోహదం చేస్తున్నాయి. అయితే, వీటిలో ఏదీ ఆపగలిగేది కాదు. 

ఆశ్చర్యం ఏమిటంటే, ఏ ఏసీ అయితే ఎండ వేడిమి నుంచి ఉపశమనం ఇస్తుందో, అదే ఏసీ భవిష్యత్తులో ఉష్ణోగ్రత మరికొన్ని డిగ్రీలు పెరగడానికి కారణం అవుతోంది. పెరిగిపోతున్న వాతావరణం కాలుష్యానికి ప్రధానంగా తోడ్పడుతున్న వాటిలో ఏసీలో ఉన్నాయి. వీటితో పాటు క్రమేపీ పెరుగుతున్న విమానయానం, ఇప్పటికే బాగా పెరిగిన భవన నిర్మాణాలూ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పుడు కాలుష్యం అంటే ప్రధానంగా పారిశ్రామిక వ్యర్ధాల కారణంగా సంభవించేదే అయివుండేది. ఇప్పుడు కాలుష్య కారకాలు అనూహ్యంగా రూపం మార్చుకున్నాయి. ఉదాహరణకి పేకేజింగ్ మెటీరియల్స్. ఈకామర్స్ వినియోగం పెరిగిన తర్వాత, మరీ ముఖ్యంగా కరోనా మొదలైనప్పటినుంచి షాపుల్లో కన్నా, ఆన్లైన్ కొనుగోళ్లు బాగా పెరిగాయి. దుస్తులు, వస్తువులే కాదు, ఆహార పదార్ధాలు కూడా క్రమం తప్పకుండా కొనేవారు ఎక్కువయ్యారు. ఇదో అనివార్యతగా మారింది. పేకేజింగ్ కోసం వాడుతున్న ప్లాస్టిక్ గురించి ఎవరైనా డేటా సేకరిస్తే కళ్ళు తిరిగే విషయాలు బయట పడొచ్చు.  

తాత్కాలిక ఉపశమనాలను దాటి, శాశ్వత పరిష్కారాల వైపు దృష్టి సారించినప్పుడు ప్రభుత్వాల స్పందన ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గుతోంది. మెరుగైన అర్బన్ ప్లానింగ్, గ్రీన్ బెల్ట్ ని పెంచే ఏర్పాట్లు, నీటి వనరుల సద్వినియోగం, భూగర్భ జలాలని పెంచే ఏర్పాట్లు.. ఇలాంటివన్నీ కాగితాలని దాటి క్రియలో కనిపించడం లేదు. జల, వాయు కాలుష్యాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ప్రజల వైపు నుంచి ఆచరణ బొత్తిగా లేదనలేం కానీ, ఉండాల్సిన స్థాయిలో అయితే లేదు. తెలంగాణలో 'హరిత హారం' కార్యక్రమంలో సెలబ్రిటీలు మొక్కలు నాటుతూ క్రమం తప్పకుండా ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు. ఆంధ్రలో ప్రతి వర్షాకాలంలోనూ నెల్లాళ్ళ పాటు మొక్కలు నాటే కార్యక్రమం కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతోంది, ఇవి కాకుండా స్వచ్చంద సంస్థలు ఆన్లైన్ లో డోనర్ల నుంచి డబ్బు తీసుకుని వాళ్ళ తరపున మొక్కలు నాటుతున్నాయి.. వీటిలో సగం మొక్కలు చెట్లైనా ఈపాటికి ఎండల సమస్య కొంచమైనా తగ్గాలి. ఇప్పటికైతే దాఖలా కనిపించడం లేదు. ఎండల్ని తిట్టుకుని ఊరుకోడమా, తగ్గించేందుకు (లేదా, మరింత పెరగకుండా ఉండేందుకు) ఏమన్నా చేయడమా అన్నది మన చేతుల్లోనే ఉంది.

శుక్రవారం, మే 13, 2022

ఇచ్చట అప్పులు ఇవ్వబడును ...

అప్పు తీసుకోవడం నామర్దాగా భావించే రోజుల్నించి, అప్పులేకుండా బతకలేని రోజుల్లోకి మనకి తెలియకుండానే వచ్చేశాం. ఇది ఎంతవరకూ వచ్చిందంటే, అప్పిస్తాం తీసుకోమంటూ రోజూ వెంట పడేవాళ్ల నుంచి తప్పించుకోడానికి దారులు వెతికే దాకా. బ్యాంకుల మొదలు, ఫైనాన్సు కంపెనీల వరకూ మన ఫోన్ నెంబరు దొరకని వాళ్ళది పాపం, మీకు ఇంత మొత్తం ఋణం తీసుకునేందుకు అర్హత ఉంది (ఈ అర్హతని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారో తెలీదు, ఒకరు చెప్పే మొత్తానికీ, మరొకరు ఇస్తామని ఊరించే అప్పుకీ పొంతన ఉండదు మరి), పెద్దగా డాక్యుమెంటేషన్ కూడా అక్కర్లేదు, మీరు ఊ అనండి చాలు, అప్పు మీ బ్యాంకు అకౌంట్లో పడుతుంది అంటూ ఊదరగొట్టేస్తారు. "అబ్బే, దేవుడి దయవల్ల రోజులు బానే గడిచిపోతున్నాయి.. ఇప్పుడు అప్పులూ గట్రా అవసరం లేదు," అని చెబుతామా, "రేపెప్పుడన్నా అవసరం రావొచ్చు, ఈ నెంబరు సేవ్ చేసుకోండి.. అవసరం వచ్చిన వెంటనే ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు" అన్నది రొటీన్ సమాధానం. రోజూ ఎన్ని నెంబర్లని సేవ్ చేసుకోవాలి? 

మొదట్లో నేను చాలా ఆశ్చర్యపడిపోతూ ఉండే వాడిని, ఫోన్లు చేసి ఇంతలేసి అప్పులు ఎలా ఇచ్చేస్తారు? తీరుస్తామన్న వీళ్ళ ధైర్యం ఏమిటీ? అని. అయితే, ఒకానొక అనుభవం తర్వాత తత్త్వం బోధపడింది. అప్పులు ఇచ్చే బ్యాచీ వేరు, వసూలు చేసుకునే బ్యాచీ వేరు. ఎవరి పద్ధతులు, మర్యాదలు వారివి. నాకు పరిచయం ఉన్న ఒకాయన ఓ ప్రయివేటు ఫైనాన్సులో అప్పు తీసుకున్నాడు. అప్పుడు, వాళ్ళకి నన్ను తన స్నేహితుడిగా పరిచయం చేసి నా ఫోన్ నెంబరు ఇచ్చేశాడు. వాళ్ళు అప్పు ఇచ్చేశారు. ఇవేవీ నాకు తెలీదు. గడువు తీరినా బాకీ తీరక పోవడంతో, అతగాడి ఫోన్ స్విచ్చాఫ్ ఉండడంతో వాళ్ళు నాకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. మొదట్లో మర్యాదగానే మాట్లాడినా, రాన్రానూ వాళ్ళ స్వరం మారడం తెలుస్తోంది. ఇతగాడు ఫోనుకి దొరకడు. ఇలా దొరికిపోయానేవిటా అని నేను చింతిస్తూ ఉండగా, ఫైనాన్సు వాళ్ళు బెదిరింపు ధోరణిలోకి దిగారు. 

ఓ రోజు నేను మహా చిరాగ్గా ఉండగా వాళ్ళ ఫోన్ వచ్చింది. ఎప్పటిలాగే తీయగా మొదలెట్టి, కటువుగా మారుతుండగా నాకు చిర్రెత్తుకొచ్చింది. "మీరు అతనికి అప్పు ఇచ్చే ముందు నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు?" అని అడిగా. వాళ్ళ దగ్గర జవాబు లేదు. నాకు దారి దొరికింది. "అప్పిచ్చే ముందు నాకు ఫోన్ చేసి ఇలా చేస్తున్నాం అంటే నేను ఇవ్వమనో, వద్దనో చెప్పేవాడిని. ఇవ్వమని పూచీ పడితే ఇప్పుడు నాకు బాధ్యత ఉండి ఉండేది. అప్పుడు నా నెంబరు తీసుకుని ఊరుకుని ఇప్పుడు ఫోన్లు చేస్తే నాకేం సంబంధం?" అని గట్టిగా అడిగా. అవతలి వాళ్ళు వాళ్ళ మేనేజర్ని లైన్లోకి తెచ్చారు. ఆ అప్పుతో నాకు ఎలాంటి సంబంధం లేదనీ, ఇంకెప్పుడూ ఫోన్లు చేయద్దనీ, చేస్తే మర్యాదగా ఉండదనీ గట్టిగా చెప్పా. అలా ఆ పీడ విరగడయ్యింది. అప్పుల వసూళ్లు ఏ పద్ధతిలో జరుగుతాయో తగుమాత్రం అర్ధమయింది నాకు. 

ఇది జరిగిన కొన్నాళ్లకే 'వాట్సాప్ అప్పులు' అంటూ వార్తలు రావడం మొదలైంది. ప్రయివేటు ఫైనాన్సు కంపెనీల వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి, ఎలాంటి హామీలూ లేకుండా అప్పులిచ్చేశారు. ఒకే ఒక్క మెలిక ఏమిటంటే, అప్పు తీసుకునే వాళ్ళు వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ సదరు సంస్థ వాళ్ళకి సమర్పించాలి. వాళ్ళు, సదరు కాంటాక్ట్స్ అందరినీ పీడించి బాకీ వసూలు చేసుకుంటారన్నమాట. అప్పు తీసుకుని తీర్చలేకపోయిన ఒకరిద్దరు సున్నిత మనస్కులు ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడంతో, పోలీసులు రంగంలోకి దిగి సదరు సంస్థల్ని మూసేయించారు. ఇంతలేసి మంది అప్పులివ్వడానికి ఎందుకు పోటీ పడుతున్నారో అంటే, తాకట్టో వాకట్టో పెట్టుకుని ఇచ్చే అప్పుల మీద కన్నా ఇలాంటి హామీ లేని రుణాల మీద రెండింతలు వడ్డీ వసూలు చేయచ్చు. రిస్కు ఉన్నప్పటికీ లాభం ఎక్కువ. 

ఇక అప్పు తీసుకునే వాళ్లలో నూటికి పది మందికి నిజమైన అవసరం అయితే, మిగిలిన వాళ్ళు అప్పు దొరుకుంటోంది కదా తీసేసుకున్న బాపతు. వీళ్ళకి వడ్డీ గురించి ఆలోచన కానీ, ఎలా తీర్చాలో అన్న చింత కానీ లేవు. వాట్సాప్ అప్పులు తీసుకుని, హెడ్సెట్ వగయిరా గాడ్జెట్లు కొనుక్కున్న కుర్రాళ్ళున్నారు. అప్పుల వాళ్ళు ఇళ్ల మీదకి వస్తే, పెద్దవాళ్ళు ఏడ్చుకుంటూ బాకీలు తీర్చారు. అయితే, ఈ పరిస్థితి ఇండియాలో మాత్రమే కాదనీ, ప్రపంచానికి అప్పులిచ్చే అమెరికాలో కూడా ఇంతేననీ ఈ మధ్యనే తెలిసింది. 'ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి' అనే ఆన్లైన్ స్కీంలో అప్పులు తీసుకున్న వాళ్ళు ఏకంగా నాలుగు రెట్ల మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నారట. వీళ్ళలో మెజారిటీ యువతే. అప్పు చేసి వాళ్ళు కొంటున్నవి ఫ్యాషన్ దుస్తులు, మేకప్ సామాగ్రి, గాడ్జెట్లు వగయిరాలు తప్ప ప్రాణం మీదకి వస్తే చేసిన అప్పులు కావు. 

కొనుగోలు చేసే వస్తువు వెలని నాలుగు నుంచి ఐదు సమ భాగాలు చేసి, మొదటి భాగం చెల్లించగానే వస్తువు డెలివరీ చేస్తున్నారు. మిగిలిన మొత్తం నాలుగుకు మించని వాయిదాల్లో చెల్లించాలి. నాలుగే ఎందుకు? ఐదు వాయిదాల నుంచీ మొదలయ్యే రుణాలన్నీ వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ విషయం అప్పు ఇచ్చే వాళ్ళకి తెలుసు, తీసుకునే వాళ్ళకి తెలీదు. వాళ్ళకింకా చాలా విషయాలే తెలీదు. అప్పు చేసి కొనే ఫ్యాషన్ దుస్తులు, ఆ అప్పు తీరే లోగానే అవుటాఫ్ ఫాషన్ అయిపోతున్నాయి. మళ్ళీ కొత్త ఫ్యాషన్, కొత్త అప్పు.. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. పైగా అప్పులు చేయించడం కోసం టిక్ టాక్ ఇంఫ్లుయెన్షర్లు, వాళ్ళకి కంపెనీల నుంచి ఉచిత బహుమతులూ.. ఇదో పెద్ద వలయం. ఇందులో చిక్కుకున్న వాళ్ళు చివరికి గాస్ (పెట్రోల్) కొనడానికి కూడా ఈ నాలుగు వాయిదాల అప్పు చేయాల్సిన పరిస్థితి. ఈ అప్పులు ఇంకా ఎన్నేసి రూపాలు మార్చుకుంటాయో చూడాలి.

బుధవారం, మే 11, 2022

యమహా నగరి కలకత్తా పురి ...

"రోజంతా సూర్యుడి కింద
రాత్రంతా రజనీ గంధ సాగనీ..." 

బెంగాలీ కవులు వందేమాతరాన్నీ, జనగణమననీ జాతికి కానుకగా ఇచ్చారు. వారి ఋణం తీర్చుకోవడం కోసం కాబోలు, మన తెలుగు సినీ కవి వేటూరి బెంగాలీలు రాష్ట్రగీతంగా పాడుకోదగ్గ పాటని తెలుగులో రాశారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'చూడాలని వుంది' (1998)లో కథానాయకుడు చిరంజీవి మీద చిత్రీకరించిన ఈ పాటని ఓ బెంగాలీ ఫ్రెండ్ కి వినిపించినప్పుడు అర్ధం చెప్పాల్సిన అవసరం లేకపోయింది. దణ్ణం పెట్టేశారు కవికి. మనకి భాష కూడా వచ్చు కాబట్టి వేటూరి ఉపయోగించిన శ్లేషల్ని, చమక్కుల్ని కూడా ఆస్వాదించ గలుగుతాం. 


యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది...

ఏదన్నా 'గొప్పగా ఉంది' అనడానికి 'యమాగా ఉంది' అనడం అప్పటికే వాడుకలోకి వచ్చేసింది. ఇదే వేటూరి, ఇదే చిరంజీవి కోసం 'యమహా నీ యమా యమా అందం' అనే పల్లవితో పాట రాసి ఉన్నారు అప్పటికే. ఆ దృష్టితో చూసినప్పుడు కలకత్తా గొప్ప నగరం అంటున్నారు. కానైతే, ఈ కలకత్తా పురి బెంగాల్ కి రాజధాని. ఆ బెంగాల్ కరువులకి పుట్టిల్లు. దేశానికి స్వతంత్రం రాకపూర్వం సాక్షాత్తూ యమపురే. కలకత్తాలో ప్రవహించే హుగ్లీ నదికి, ప్రసిద్ధ హౌరా బ్రిడ్జీ కి నమస్సులు చెబుతున్నాడు - ఎవరు? - 'చిరు' త్యాగరాజు. శాస్త్రీయ బాణీలో పాడుతున్న వర్ధమాన గాయకుడు అని మాత్రమే కాదు, 'చిరు' అనే ముద్దుపేరున్న చిరంజీవి అని కూడా. 

నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో
ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకుతో వెయ్యి పందెం
కడకు చేరాలి గమ్యం కదిలిపోరా
ఒకరితొ ఒకరికి ముఖ పరిచయములు
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజిబిజి ఉరుకుల పరుగులలో... 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టింది బెంగాలీ సీమలోనే. 'గీతాంజలి పూసిన చోట' అని ఎవరనగలరు, వేటూరి తప్ప? రామకృష్ణ పరమహంస హంసగీతం (చివరి సందేశం) ఆనందుడు (వివేకానందుడు) చూపిన బాట అయ్యింది. ఆ బాటలో సాగుతానంటున్నాడు కథానాయకుడు. పదుగురూ పరుగు తీసే పట్నాలన్నీ దాదాపు ఒకలాగే ఉంటాయి కాబట్టి, ఈ వర్ణనంతా ఏ మహానగరానికైనా సరిపోతుంది. 

బెంగాలీ  కోకిల బాల
తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజిని
రోజంతా సూర్యుడి కింద
రాత్రంతా రజనీ గంధ సాగనీ
పద గురు ప్రేమలే లేని లోకం
దేవాదా మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కథలకు నెలవట కళలకు కొలువట
తిథులకు సెలవట అతిధుల గొడవట
కలకట నగరపు కిటకిటలో... 

'భారత కోకిల' బిరుదాంకిత సరోజిని (నాయుడు) హైదరాబాద్ కోడలు. ఆవిడ మెట్టిల్లు 'గోల్డెన్ త్రెషోల్డ్' ని ఇప్పటికీ చూడొచ్చు నాంపల్లిలో. బెంగాల్ వాతావరణంలోనే ఓ అతి ఉంది. అక్కడ అన్నీ ఎక్కువే, ఎండలు కూడా. అలా రోజంతా సూర్యుడి ఎండలో పని చేసినా, రాత్రయ్యేసరికి రజనీగంధ పూలు చక్కని సువాసనతో సేద తీరుస్తాయి. అక్కడ ఇంకా చాలా పూలే పూస్తాయి కానీ, ప్రత్యేకించి రాజనీగంధ అనడానికి కారణాలు - ఇది దాదాపు అన్ని కాలాల్లోనూ పూచే పువ్వు అవడం ఒకటైతే, 'రజనీగంధ' అనే అందమైన సినిమా తీసిన బెంగాలీ బాబు బసు ఛటర్జీని ఈ వంకన తల్చుకోడం మరొకటి. ప్రేమరాహిత్యం అనగానే గుర్తొచ్చే దేవదాసు బెంగాలీ వాడే.. 'దేవదాసు' నవల ఒక మైకమైతే, కథానాయకుడి చేతిలో పాపులరైన సీసా మరో మైకం. ఈ 'దేవదాసు' శరత్ చంద్ర చటోపాధ్యాయ పాఠకులకి చేసిన నవలాభిషేకం అంటే కాదనగలమా? కథలకు నెలవు, కళలకు కొలువు సరే. తిథులకి సెలవేమిటి అంటే, 'ప్రోగ్రెసివ్' బెంగాలీలకి తిథి వార నక్షత్రాలతో పెద్దగా పనుండదు అని. నగరాలకి అతిధుల గొడవ తప్పదు, ఈ కథానాయకుడూ అతిధిగా వెళ్లిన వాడే కదా మరి. 

వందేమాతరమే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీదిరా
విను గురు సత్యజిత్ రే సితార
ఎస్ డి బర్మన్ కీ ధారా
థెరిస్సా కి కుమారా కదలి రారా
జనగణమనముల స్వరపద వనముల
హృదయపు లయలను శృతి పరిచిన
ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో... 

ముందే చెప్పుకున్నట్టుగా వందేమాతరం, జనగణమన పుట్టిన నేల అది. మాతంగి కాళికాలయం, చౌరంగీ చూసి తీరాల్సిన ప్రదేశాలు. సత్యజిత్ రే సినిమాలు, ఆర్డీ బర్మన్ సంగీతం, మదర్ థెరెసా సేవలు.. ఇవన్నీ కలకత్తా అనగానే గుర్తొచ్చే విషయాలు. పైగా, అప్పట్లోనే చిరంజీవి "మదర్ థెరెసా స్పూర్తితో" సేవా కార్యక్రమాలు నిర్వహించడం మొదలైంది కూడా. 

పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ విరచిత 'రఘువంశ సుధాంబుధి' బాణీలోనే ఈ పాటని స్వరపరిచారు సంగీత దర్శకుడు మణిశర్మ. పల్లవి చరణాల బాణీల్లో మార్పులేవీ చేయకుండా, ఇంటర్లూడ్స్ లో మాత్రం సినిమా పాటకి కావాల్సిన 'జోష్' ని అందించారు. చిరంజీవి ఈ పాటకి ఒప్పుకోవడం అప్పుడే కాదు, ఇప్పటికీ ఆశ్చర్యమే. మెగాస్టార్ అయిపోయాక తన పాటల్లో ఇలాంటి సాహిత్యం అరుదు. ఈ పాటని హరిహరన్ చేత పాడించడం అప్పట్లో నచ్చలేదు కానీ (గొంతుకి వంక పెట్టలేం, కాకపోతే ఉచ్చారణ...) వినగా వినగా అలవాటైపోయింది. ఓ పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాలో ఇలాంటి అభిరుచిగల పాట పెట్టిన నిర్మాత అశ్వనీదత్ నీ అభినందించాల్సిందే. 

సోమవారం, మే 09, 2022

వేయిపడగలు నేడు చదివితే

'కవిసమ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ అశువుగా చెబుతుండగా సోదరుడు వెంకటేశ్వర్లు 28 రోజుల్లో 999  అరఠావుల మీద  రాయడం పూర్తి చేసిన నవల 'వేయిపడగలు'. అచ్చులో కూడా ఈ పుస్తకం బరువు సుమారు వెయ్యి పేజీలకి దగ్గరగా ఉంటుంది. అయితే గడిచిన ఎనభై ఏళ్లలో ఈ నవల మీద వచ్చిన విమర్శని లెక్కిస్తే వేయి పేజీలు ఎప్పుడో దాటేసి ఉండొచ్చు. ఇప్పటికీ ఈ నవలని గురించి ఏదో ఒక రూపంలో చర్చ జరుగుతూ ఉండడమే 'వేయిపడగలు' ప్రత్యేకత. ఈ నవలపై కల్లూరి భాస్కరం తాజాగా వెలువరించిన విమర్శ వ్యాసాలకి పుస్తక రూపం 'వేయిపడగలు నేడు చదివితే'. సుప్రసిద్ధ సాహితీ విమర్శకుడు ఆర్.ఎస్. సుదర్శనం 'వేయిపడగలు' మీద రాసిన విమర్శని విశ్లేషిస్తూ భాస్కరం రాసిన వ్యాసాలు, ఈ నవలని ప్రఖ్యాత ఆంగ్ల నవల 'గాన్ విత్ ది విండ్' తో పోలుస్తూ రాసిన వ్యాసాల పరంపరని కలిపి పుస్తకంగా తీసుకొచ్చారు 'అస్త్ర బుక్స్' వారు. 

మొత్తం పదహారు వ్యాసాలున్న ఈ పుస్తకంలో తొలి ఏడు వ్యాసాలూ ఆర్.ఎస్. సుదర్శనం విమర్శని ఆధారంగా చేసుకుని రాసినవి. తొలి వ్యాసం 'బాహ్యమిత్రుని వెతుకులాట' లో సుదర్శనానికి విశ్వనాథ పట్ల ఉన్న కుతూహలాన్ని గురించి వివరిస్తూనే, ఆయన బ్రాహ్మణేతరుడైనందువల్ల విశ్వనాథని, వేయిపడగలునీ పైనుంచి మాత్రమే పరిశీలించారని, తాను (భాస్కరం) లోతుగా చూడగలిగాననీ ధ్వనించారు. వంటని రుచిచూసి చెప్పడానికి వంటవాడే అయి ఉండాలా? అనే ప్రశ్న ఇక్కడ సందర్భమూ, అసందర్భమూ కూడా. సుదర్శనం పరిశీలనల నుంచి భాస్కరం చేసిన గమనింపులూ, వాటికి చేసిన వ్యాఖ్యానాలూ మిగిలిన వ్యాసాల మీద ఆసక్తిని పెంచాయి. 'రవీంద్రుడు ఎన్నిమెట్లు ఎక్కారో విశ్వనాథ అన్నిమెట్లు దిగారు' అన్నది రెండో వ్యాసం శీర్షిక. ఇది సుదర్శనం చేసిన వ్యాఖ్యే. ఈ వ్యాఖ్యతో భాస్కరానికి పేచీ లేదు, ఆమోదమే. 'మాలపల్లి' తో సుదర్శనం తెచ్చిన పోలిక ఆసక్తిగా అనిపించింది. 

'వేయి ప్రశ్నల పడగలు' అనే మూడో వ్యాసంలో  'వేయిపడగలు' నవల కథానాయకుడు ధర్మారావు జీవిత చరిత్ర అని తేల్చారు, సుదర్శనం విమర్శ వ్యాసాల ఆధారంగానే. 'ధర్మారావు గెలిచాడు' అన్న నాలుగో వ్యాసాన్ని "ఇప్పుడు గనుక ధర్మారావు చరిత్రని తిరగరాస్తే అది ఒక విజేత చరిత్ర అవుతుంది" అన్న ఆశ్చర్యకరమైన ప్రతిపాదనతో ముగించారు. ఐదో వ్యాసం 'అతనిలో ఒక అపరిచితుడు' లో ధర్మారావు పాత్రని లోతుగా, విమర్శనాత్మకంగా విశ్లేషించారు. దీనికి కొనసాగింపుగా  'అతని ఊహా వైపరీత్యం', 'జ్ఞానానికి అడ్డుగోడ', 'భయపెట్టే నిర్లిప్తత' అనే మూడు వ్యాసాలు రాశారు. చివరి వ్యాసం 'విశ్వనాథ-గోపీచంద్' లో ధర్మారావుని, గోపీచంద్ 'అసమర్ధుని జీవయాత్ర' కథానాయకుడు సీతారామారావుతో పోల్చి గుణ(?)దోషాలు ఎంచారు. 

ఎవరైనా విమర్శకులు ఓ రెండు పుస్తకాల్ని పోలుస్తూ విమర్శకు పూనుకున్నప్పుడు, వారికి ఆ రెండు రచనలమీదా సమభావం ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి 'వేయిపడగలు-గాన్ విత్ ద విండ్ పోలికలు-తేడాలు' అధ్యాయంలో రాసిన ఏడు వ్యాసాలూ. ప్రపంచ ప్రఖ్యాత నవలల్లో ఒకటైన 'గాన్ విత్ ద విండ్' భాస్కరానికి బాగా నచ్చడంతో ఆశ్చర్యం లేదు. అయితే, ఆ రచనని 'పెద్దగీత' గా చూపేందుకు 'వేయిపడగలు' ని ఎంచుకోవడమే ఆశ్చర్యం. 'వేయిపడగలు' లో చర్చించిన ప్రధాన విషయం చాతుర్వర్ణ వ్యవస్థ. 'గాన్ విత్ ద విండ్' కథంతా 'ప్లాంటర్స్' వర్గం చుట్టూ తిరుగుతుంది. ఒక కులాన్ని, వర్గంతో పోల్చడం, అలా పోల్చి  'గాన్ విత్ ద విండ్' గొప్ప నవల, విశ్వనాథ కన్నా మిచెల్ మార్గరెట్ గొప్ప రచయిత్రి అని నిరూపించడం కోసం ఏకంగా ఏడు వ్యాసాలు రాశారు. 

ఈ వ్యాసాలు రాయడం వెనుక ఉన్న కృషి, చేసిన పరిశీలన అభినందనీయమే. అయితే, మందారాన్నీ, గులాబీని పోల్చి చూసి, గులాబీ గొప్ప పుష్పం అని చెప్పడంలా అనిపించింది చదవడం పూర్తిచేశాక. ఇంతకీ ఇప్పుడు ఈ పుస్తకం ఎందుకు రాసినట్టు? జవాబు ముందుమాటలో దొరికింది: "భారతీయ సమాజ, రాజకీయ, సాంస్కృతిక చక్రం మరోసారి బయలుదేరిన చోటికి వచ్చిన దశ ఒకటి ఇప్పుడు నడుస్తోంది. ముస్లింలు, ఆంగ్లేయుల పాలన కాలం నుంచీ, మరీ ముఖ్యంగా గత వందేళ్ల కాలం నుంచి తన వైభవ ప్రభావాలను కోల్పోయాననుకుని దుఃఖానికి, నిరాశా, నిస్పృహలకూ లోనవుతూ వచ్చిన భారతీయ సమాజంలోని ఒక ప్రాబల్య వర్గం - ఇప్పుడు వాటి నుంచి బయటపడి కొత్త ఊపిరిని, ఉత్సాహాన్ని పుంజుకోవడం చూస్తున్నాం. ఈ వర్గం ఇప్పుడున్నంత సంబరంగా, సంతోషంగా, గెలుపు గర్వంతో - ప్రత్యేకించి గత నూరేళ్ళలోనూ ఎప్పుడూ లేదు"

పాలకులుగా స్వదేశీయులున్నా, విదేశీయులున్నా, బాగుపడింది, బాగుపడుతూ వస్తున్నదీ ఈ ప్రాబల్య వర్గమే అనే బలమైన విమర్శ ఈ విమర్శకుడి చెవిన పడలేదా? ఈ వర్గానికి గత వందేళ్లలో ఒరగనిది, ఇప్పుడు కొత్తగా ఒరుగుతున్నదీ ఏమిటో వివరంగా చెప్పి ఉంటే బాగుండేది. "విశ్వనాథ సత్యనారాయణ గారి 'వేయిపడగలు' - దుఃఖం, నిరాశ, నిస్పృహ నిండిన ఈ వర్గపు కృష్ణపక్ష దశకు అద్దం పట్టింది. ఇప్పుడు నడుస్తున్న తన శుక్లపక్ష దశలో ఈ బృహన్నవల చదివితే ఏమనిపిస్తుంది? లౌకికంగా నిష్క్రియునిగా, నిర్లిప్తునిగా కనిపించే ధర్మారావు ముఖంలోని నైరాశ్యపు చీకట్ల స్థానంలో నేటి విజయ దరహాసపు వెన్నెల వెలుగులు దర్శించడం ఎలా ఉంటుంది? ఆ దిశగా ఆలోచనలను నడిపించడానికి ఈ వ్యాసాలలో ప్రయత్నించాను". ఇదే రచయిత "కనుక ధర్మారావు తను లక్షించిన ఆ వ్యవస్థకు ప్రతినిధి తానొక్కడే తప్ప సాటి బ్రాహ్మణ్యం తోడు కూడా అతనికి లేదు" (పేజీ 52) అని ప్రతిపాదించారు!

"ధర్మారావుల నేటి విజయ గాధను పొందుపరుస్తూ వారి శుక్లపక్ష దశను ప్రతిబింబిస్తూ వేయిపడగలకు సీక్వెల్ రాయవలసిన సందర్భం వచ్చిందని కూడా నేను అనుకుంటున్నాను.." ధర్మారావు ఇప్పుడు పుట్టి ఉంటే బహుశా బీఏ బదులు బీటెక్ చదివి ఉండేవాడు. సుబ్బన్నపేట నుంచి కదలడానికి ఇష్టపడడు కాబట్టి ఏదన్నా 'వర్క్ ఫ్రం హోమ్' ఉద్యోగం దొరికి ఉంటే చేసి ఉండేవాడు.  కానీ, అతను కలగన్నట్టుగా సుబ్బన్నపేటకి దివాను అయ్యే పరిస్థితి ఇప్పుడు కూడా కనిపించడం లేదు. అలా ముందుమాట లోనూ కొంచం అస్పష్టత కనిపించింది. ('అస్త్ర' ప్రచురణ, పేజీలు 181, వెల రూ. 225, అన్ని పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్లోనూ కొనుక్కోవచ్చు). 

బుధవారం, మే 04, 2022

రాసుకోడానికో చోటు

స్థానిక రాజకీయ మరియు సినిమా వార్తల పట్ల విరక్తి చెంది, ప్రపంచం ఎటుపోతోందో చూసొద్దాం అనుకుంటూ అంతర్జాతీయ వార్తలు బ్రౌజ్ చేస్తూంటే కనిపించిన 'రాయిటర్స్' వార్త ఆకర్షించడమే కాదు, వెంటనే చదివేసి ఆతర్వాత ఆగి కాసేపు ఆలోచించేలా చేసింది. అది జపాన్ రాజధాని టోక్యో నగరంలో నడుస్తున్న ఓ కెఫె గురించి. 'మాన్యుస్క్రిప్ట్ రైటింగ్ కెఫె' పేరుతో ఈ కాఫీషాపుని నడుపుతున్నది తకువా కవాయ్ అనే రచయిత. ఇక్కడ పది సీట్లు రచయిత(త్రి)ల కోసం రిజర్వు చేయబడ్డాయి. వాళ్ళ రచన ఏదైనా సరే, ఈ కెఫె లో కూర్చుని రాసుకోవచ్చు. మధ్య మధ్యలో కావాల్సినన్ని టీ కాఫీలు సేవించవచ్చు.  ఇది చదువుతూ ఉంటే సాహిత్య ప్రపంచంలో ఓ సంచలనాన్ని నమోదు చేసిన 'హ్యారీ పోటర్' సిరీస్ లో మొదటి పుస్తకాన్ని అప్పట్లో పేదరాలైన జేకే రౌలింగ్ ఓ కాఫీ షాపులో కూర్చుని రాసిన విషయం గుర్తొచ్చింది. 

జపాన్ కెఫె దగ్గరికి వస్తే, కాఫీ టీ లతో పాటు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సర్వీసునీ అందిస్తోంది రచయితలు, ఎడిటర్ల కోసం. రచయితలు చేయాల్సిందల్లా తమ పేరుతో పాటు, ఏం రాయాలనుకుంటున్నారో ఆ వివరం, ఉజ్జాయింపున ఎన్ని గంటల్లో రాయడం పూర్తి చేద్దామనుకుంటున్నారో రిజిస్టర్లో నమోదు చేయాలి. రాత పనిని సకాలంలో పూర్తి చేయడానికి అక్కడ అందుబాటులో ఉన్న మూడు రకాల సేవల్లో ఒకదానిని ఎంచుకోవాలి. మొదటిది 'మైల్డ్', రెండోది 'నార్మల్', మూడోదేమో 'హార్డ్'. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ రకమైన సేవలు లేకపోబట్టి కదా అల్లసాని వారు నిరుపహతి స్థలము, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడెము వగయిరాలు కోరుకున్నారు తన కావ్య సృష్టికీ అనిపించేసింది. అయినా, ఈ సేవలేవీ రాక పూర్వమే ఆధునిక జపాన్ నుంచి 'మురకామి' లాంటి గొప్ప రచయిత ఉద్భవించలేదూ? 

'మైల్డ్' సేవలు ఎంచుకున్న రచయితలు చెప్పిన గడువు లోపల రచన పూర్తి చేశారా లేదా అన్నది మాత్రమే చెక్ చేస్తారు కెఫె వారు. 'నార్మల్' కనుక ఎంచుకుంటే, గంటకోసారి వచ్చి, పలకరించి, ప్రోగ్రెస్ చెక్ చేస్తూ ఉంటారు. ఇక 'హార్డ్' వారి పరిస్థితి చదువుతుంటేనే గుండె గుభేల్ మంది. కెఫె స్టాఫు తరచూ వచ్చి వీరి వెనుక నిలబడుతూ ఉంటారట, మన రామయ్య మెస్సు, సుబ్బయ్య హోటలు లాంటి చోట ఓ బంతి వాళ్ళ భోజనాలు అవుతూ ఉండగానే, టోకెన్లు కొనుక్కున్న తర్వాతి బ్యాచి వాళ్ళు వచ్చి కుర్చీల వెనకాల అసహనంగా నిలబడ్డట్టు. ఇదంతా రచయితల్లో బద్ధకం వదిలించి, రాయాలనే వాళ్ళ లక్ష్యం పూర్తి చేయించడానికే అంటున్నాడు కవాయ్ మహాశయుడు. అయితే, ఈ సేవలు ఉచితం కాదు, తగుమాత్రం ఫీజు వసూలు చేస్తున్నాడు రచయితల దగ్గరనుంచి. నేనేమో 'హార్డ్' వాళ్లకి తక్కువ ఫీజు, 'మైల్డ్' వాళ్ళకి ఎక్కువా ఉంటుందేమో అనుకున్నా కానీ, కాదు. 

'మాన్యుస్క్రిప్ట్ రైటింగ్ కెఫె' లో కూర్చుని రాసుకోడానికి మొదటి అరగంటకి 1.01 అమెరికన్ డాలర్ (ర్లు), తర్వాత ప్రతి గంటకీ 2.34 డాలర్లూ చెల్లించాలి. జపాన్ కరెన్సీలో మొదటి అరగంటకి 130 యెన్ లు, తర్వాత ప్రతి గంటకీ 300 యెన్ లూ అన్నమాట. టేబులు, కుర్చీతో పాటు టీ, కాఫీలు, ఇంటర్నెట్టూ, త్వరగా రాసేందుకు దోహదం చేసే సిబ్బంది సేవలూ (?) ఉచితమే. ఈ సోషల్ మీడియా యుగంలో ఇలాంటి కొత్త వింతలు క్షణాల్లో 'వైరల్' అవ్వకపోతే కదా ఆశ్చర్య పోవాలి. యుగ ధర్మాన్ని అనుసరించి ఈ కెఫె వార్త టోక్యోని చుట్టేసింది. రచయితలు క్యూ కట్టేశారు. "మా సేవల వల్ల చాలామంది ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న రచనల్ని కొన్ని గంటల్లో పూర్తి చేసేస్తున్నారు" అనడమే కాదు, అలా పూర్తి చేసిన వాళ్ళ జాబితానూ ప్రదర్శిస్తున్నాడు కవాయ్. 

ఎమికో ససాకి అనే బ్లాగర్ ఈ కెఫె సేవల్ని ఉపయోగించుకుని మూడే గంటల్లో ఏకంగా మూడు బ్లాగు పోస్టులు రాసేసిందట. దృష్టిని మరల్చే ఇతరత్రా ఆటంకాలేవీ లేవు కాబట్టి రాయడం మీద గురి కుదుర్చుకో గలిగిందట. ఈవిడ 'హార్డ్' కేటగిరీ సేవల్ని ఎంచుకుని ఉంటుందని నాకెందుకో బలమైన సందేహం కలిగింది. రెండేళ్ల క్రితం వరకూ లైవ్ స్ట్రీమింగ్ వ్యాపారం చేసిన కవాయ్, కోవిడ్ రెండేళ్ళూ ఖాళీగానే గడిపి (రచయిత కదా, ఏవో రచనలు చేసే ఉంటాడు), ప్రపంచం కాస్త కుదుట పడ్డాక ఇదిగో ఈ వ్యాపారం మొదలు పెట్టాడు. "ఇక్కడి నుంచి ఎలాంటి రచనలు రాబోతున్నాయో నాకు తెలీదు. కానీ, అందరూ చదివే రచనలకి నావంతు మద్దతు పలకడం గర్వంగా ఉంది" అని జాపనీస్ లో సంతోషపడ్డాడు కవాయ్. కెఫె కి వచ్చే రచయితలు అక్కడి సేవల్ని మెచ్చుకుంటూ, మామూలుగా ఒక రోజు పట్టే రచనని మూడు గంటల్లో పూర్తి చేసేయగలుగుతున్నామనీ, మూడు గంటలు పట్టే రచన గంటలోనే పూర్తైపోతోందనీ చెబుతున్నారట. 

సహజంగానే నాకు ఇండియాలో ఇలాంటి కెఫె ఎవరైనా మొదలు పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన మొదలైంది. మన దగ్గర రాసే వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ, దాన్నో పూర్తి స్థాయి వ్యాపకంగా చేసుకున్న వాళ్ళు బహు తక్కువ. రచనల ద్వారా బాగా ఆర్జించే సినిమా వాళ్ళు వగయిరాలది అంతా భారీ వ్యవహారమే. స్టార్ హోటళ్లు, రిసార్టులు కావాలి కానీ, ఇలాంటి చిన్న ఏర్పాట్లు కాదు. చిన్న, సన్నకారు రచయితలకి ఇప్పటికే స్వీయ ప్రచురణ ఖర్చులు తలకి మోపెడు, ఇంకా ఈ 'రాత' ఖర్చు కూడానా? ఎడిటింగ్ అనే (ప్ర)వృత్తి దాదాపు అంతరించిపోతోంది, కాబట్టి వాళ్ళకీ అవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య కార్పొరేషన్ వారి దృష్టికి తీసుకెళ్తే, వారేమన్నా ఓ బిజినెస్ మోడల్ గా స్వీకరించే వీలుందా? దగ్గర ఆగాయి నా ఆలోచనలు ప్రస్తుతం. (నా ఉటంకింపులు లేకుండా వార్తని వార్తగా ఇక్కడ చదవొచ్చు). 

సోమవారం, ఏప్రిల్ 25, 2022

థాయిస్

"నా 'చిత్రలేఖ' కు అనతోల్ ఫ్రాంసు 'థాయీ' కి నడుమ నాకు, అనతోల్ ఫ్రాంసుకి ఉన్నంత అంతరం ఉన్నది. చిత్రలేఖలో ఒక సమస్య ఉన్నది; మానవ జీవనాన్ని, అందులోని మంచి చెడుగుల్ని పరిశీలించడంలో నా దృష్టి కోణము, నా ఆత్మాలాపము నావి" నవలా రచయిత భగవతీ చరణ్ వర్మ తన 'చిత్రలేఖ' నవలకి రాసిన ఈ ముందుమాట 'థాయిస్' మీద ఆసక్తి పెంచింది. అంతే కాదు, విశ్వనాథ 'వేయి పడగలు' లో కనిపించే అనేకానేక చర్చల్లో ఈ 'థాయిస్' ను గురించిన చర్చ కూడా ఉంది.  ఆసక్తి మరింత పెరిగి వెతుకులాట మొదలు పెడితే, రెంటాల గోపాలకృష్ణ చేసిన తెలుగు అనువాదం కనిపించింది. ఫ్రెంచ్ భాషలో 1890లో తొలుత ప్రచురితమైన ఈ నవల అనేక ప్రపంచ భాషల్లోకి అనువదింపబడింది. నాటకాలుగానూ, సినిమాలుగానూ మలచబడింది. రచయిత అనతోల్ ఫ్రాంస్ ఫ్రెంచ్ సాహిత్యంలో ఉద్ధండుడు. నోబెల్ బహుమతి గ్రహీత. ఒక ఓపెరా ఆధారంగా ఈ నవలని రాశాడు. 

ఈజిప్షియన్ ఎడారిలో ఓ మఠాధిపతి అయిన క్రైస్తవ సన్యాసి పప్నూటియస్ కి కొంత శిష్యగణం ఉంది. సాటివారిలో మంచిపేరూ ఉంది. క్రీస్తుని చేరేందుకు తాను చేస్తున్న సాధన సరిపోతుందా అన్న ప్రశ్న వేధిస్తూ ఉన్నప్పటికీ, జీవితం పట్ల సంతృప్తిగానే ఉంటాడు ఆ సన్యాసి. నిజానికి అతను అలెగ్జాండ్రియాలో ఓ ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. యవ్వనంలో విలాసవంతమైన జీవితం గడిపాడు. ఉన్నట్టుండి ఒకరోజు ఐహిక సుఖాల మీద విరక్తి బయలుదేరి సన్యాసిగా మారాలని నిర్ణయించుకుంటాడు. సంపదల్ని త్యజిస్తాడు. బంధుమిత్రుల్ని వదిలిపెడతాడు. ఆశ్రమ జీవితానికి అలవాటు పడతాడు. పీఠాధిపతి స్థాయికి ఎదుగుతాడు. పుట్టి పెరిగిన నగరానికి దూరంగా ఆశ్రమవాసం, అతి సాధారణ జీవితం, తనలాగే సుఖాలని త్యజించిన ఆశ్రమ వాసుల సావాసం.. ఈ జీవితం చాలా నచ్చుతుంది కూడా. రోజులు గడుస్తుండగా ఉన్నట్టుండి ఒకరోజున ఆ సన్యాసికి 'థాయిస్' గుర్తు రావడంతో కథ మలుపు తిరుగుతుంది. 

అలెగ్జాండ్రియా నగరంలో ప్రముఖ నటి, నర్తకి, వేశ్య థాయిస్. ఆమె అపురూప సౌందర్యవతి, అంతకు మించిన నటి, నర్తకి. ధనవంతులందరూ తమ సమస్త సంపదల్నీ ఆమె పాదాల చెంత ధారపోసి మరీ ఆమె పొందుకు పాకులాడతారు. తన అందచందాలతో అనతి కాలంలోనే విశేషమైన పేరునీ, ధనాన్నీ ఆర్జిస్తుంది థాయిస్. ఇప్పుడు ఆమె మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. పప్నూటియస్ కూడా తన పూర్వ జీవితంలో థాయిస్ ని పొందిన వాడే. ఆమె మీద విశేషంగా ధనాన్ని వెచ్చించిన వాడే. సన్యాసిగా మారిన పప్నూటియస్ కి థాయిస్ ని సంస్కరించాలనే అభిలాష కలుగుతుంది. ఆమెని పాపకూపం నుంచి బయటకు తెచ్చి, యేసు ప్రభువుని చేరే మార్గం బోధించాలన్న తపన చిన్నగా మొదలై, త్వరత్వరగా పెరిగి పెద్దదై అలెగ్జాండ్రియా ప్రయాణం అయ్యేలా చేస్తుంది. సాటి మఠాథిపతి వారించే ప్రయత్నం చేసినా వినకుండా థాయిస్ ని సంస్కరించడమే ధ్యేయంగా నిశ్చయించుకుంటాడు. 

తన అందంతో, ప్రతిభతో అపారమైన సంపద ఆర్జించిన థాయిస్ తన బాల్యాన్ని కడు పేదరికంలో గడిపింది. ఆకలితో పాటు తల్లిదండ్రుల నిరాదరణ కూడా ఆమెని బాధించింది. ఆమెని కూతురిగా భావించిన వ్యక్తికి క్రైస్తవం పట్ల గాఢమయిన అభిమానం. ఒక రాత్రి ఆమెని రహస్యంగా ఓ చర్చికి తీసుకువెళ్లి బాప్టిజం ఇప్పిస్తాడు. కాలక్రమంలో  జీవితం ఎన్ని మలుపులు తిరిగినా ఈ సంఘటనని మర్చిపోదు థాయిస్. మత పెద్దలని, సన్యాసులని ఇతోధికంగా గౌరవిస్తూ ఉంటుంది. ఈ కారణానికే, తన ఇంటికి వచ్చిన పప్నూటియస్ ని ఆదరించి గౌరవిస్తుంది. అంతేకాదు, సన్యాసం స్వీకరించి పాపపు జీవితం నుంచి బయటపడమని అతడు ఇచ్చిన సలహాని పెద్దగా తటపటాయింపు లేకుండానే అంగీకరిస్తుంది. సమస్త సంపదలనీ త్యజించి అతని వెంట ఎడారికి బయలుదేరుతుంది. ఆమె నిర్ణయం విని అలెగ్జాండ్రియా నగరం అట్టుడుకుతుంది. ఆమె ఆరాధకుల నుంచీ, ఆమె మీద ఆధారపడ్డ వారి నుంచీ తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కానీ, ఆమె పట్టించుకోదు. సన్యాసినుల ఆశ్రమంలో ఆమెని చేర్చి, తన ఆశ్రమానికి బయలుదేరతాడు పప్నూటియస్. అటు తర్వాత కథ అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. 

నవల చదవడం పూర్తి చేశాక, భగవతీ చరణ్ వర్మకి అనతోల్ ఫ్రాంసుకి మరీ ఎక్కువ అంతరం ఉన్నట్టు అనిపించలేదు. చిత్రలేఖకి, థాయిస్ కి బొత్తిగా పోలిక లేకపోలేదు. మక్కికి మక్కి ఎంత మాత్రమూ కాదు. అలాగని, ఒకవేళ థాయిస్ లేకపోతే చిత్రలేఖ ఉండేదా అంటే సందేహమే. ఈ రెండు పాత్రల మధ్యా పోలిక, 'మృచ్ఛకటికమ్' వసంతసేన కి 'కన్యాశుల్కం' మధురవాణి కి ఉన్న పోలిక లాంటిది. అనువాదం మరికొంచం సరళంగా ఉండొచ్చు. ఏకబిగిన చదివించదు కానీ, మధ్యలో వదలాలనీ అనిపించని కథనం. ఇంగ్లీష్ వెర్షన్ చదవాలన్న కుతూహలాన్ని కలిగించింది. థాయిస్ ఇంట విందు సందర్భంగా జరిగే వేదాంత చర్చ మరీ సుదీర్ఘంగా అనిపించింది. 'థాయిస్' తెలుగు అనువాదం క్లాసిక్ బుక్స్ ద్వారా అందుబాటులో ఉంది. 184 పేజీల ఈ పుస్తకం వెల రూ. 150. ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు. 

బుధవారం, ఏప్రిల్ 13, 2022

వెన్నెలవే వెన్నెలవే ...

"భూలోకం దాదాపు కన్ను మూయు వేళ... 
పాడేను కుసుమాలు పచ్చగడ్డి మీన...  
యే పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ..."

సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్ కి పాట రాయడం ఒకరమైన కష్టం అయితే, డబ్బింగ్ సినిమాకి పాట రాయడం ఇంకోరకం కష్టం. మొదటి దాంట్లో ట్యూన్ పరిధి మేరకు పదాలని కుదించుకుని, భావం చెడకుండా రాసే వీలుంటుంది. కానీ రెండో దాంట్లో అప్పటికే వేరే భాషలో వచ్చిన సాహిత్యాన్ని తెనిగించాలి. అలాగని అది మక్కి కి మక్కి అనువాదం కారాదు. తెలుగు నుడికారం వినిపించాలి, అదే సమయంలో మూలానికి దగ్గరగా ఉండాలి. తేలిపోకూడదు, మూలాన్ని మించిపోనూ కూడదు. తెలుగు సినిమా కవులు ఎవరి  పరిధిలో వారు ఈ అసిధారా వ్రతాన్ని నిర్వహించారు. కొందరు కేవలం అనువాద చిత్రాలకి మాత్రమే పాటలు రాశారు. 

అర్జునుడు రెండు చేతుల్తోనూ బాణాలు సంధించినట్టుగా కుడి చేత్తో ఓ పాట, ఎడమ చేత్తో మరో పాట ఏకకాలంలో రాయగలిగిన వేటూరి చాలా డబ్బింగ్ పాటల్నీ తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా ఏ. ఆర్. రహమాన్ సంగీత సారధ్యంలో వచ్చిన తమిళ పాటల్ని తెనిగించడానికి మొదటి పిలుపు వేటూరికే వచ్చేది. అలా పాతికేళ్ల నాడు ఈ కాంబినేషన్ లో వచ్చిన 'మెరుపు కలలు' సినిమాలో 'వెన్నెలవే.. వెన్నెలవే' యుగళగీతం కాల పరీక్షకి నిలబడింది. ఇవాళ్టికీ వినిపిస్తోంది. ఇప్పుడైతే 'పాన్ ఇండియా సినిమా' అనే బ్రాండింగ్ హడావిడి చేసేవాళ్ళేమో కానీ, అప్పట్లో డబ్బింగ్ సినిమా అనే అన్నారు రాజీవ్ మీనన్ దర్శకత్వంలో ఏవీఎం నుంచి వచ్చిన ఈ తమిళ, తెలుగు, హిందీ రిలీజ్ ని. 

అసలు 'మెరుపు కలలు' కథే చిత్రం అనుకుంటే, ఈ పాట సందర్భం మరీ విచిత్రం. సన్యాసినిగా మారి యేసుక్రీస్తు సేవకి అంకితమైపోవాలని నిర్ణయించుకున్న కథానాయికలో (కాజోల్) ప్రేమ భావనలు పుట్టించాలి. అలాగని ఆమెని తను (ప్రభుదేవా) ప్రేమించకూడదు. ఆమె దృష్టి ఐహికం మీదకి మళ్ళాక అసలు కథానాయకుడు (అరవింద్ స్వామి) రంగంలోకి దిగుతాడు. ఇక్కడ అంతస్థుల భేదం కూడా ఉంది. కాజోల్, అరవింద స్వామి ఇద్దరూ డబ్బున్న వాళ్ళ బిడ్డలు, చిన్ననాటి స్నేహితులూను. ప్రభుదేవా పేదవాడు. అనాధ పిల్లలతో కలిసి తిరిగేవాడూను. ప్రపంచం నిద్రపోయిన ఓ అర్ధరాత్రి వేళ ఆమె కోసం పాట అందుకున్నాడు.. ఇక్కడ వెన్నెల అంటే ఆకాశంలో చందమామ మాత్రమే కాదు, కథానాయిక కూడా.. 


వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా 
విరహాన జోడీ నీవే... హే... 
నీకు భూలోకుల కన్ను సోకేముందే 
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…  

ఆకాశాన్ని దాటి ఒక్కసారి కిందకి వచ్చావంటే, భూమ్మీద ఎవరి కన్నూ నీ మీద పడక మునుపే నిన్ను వెనక్కి పంపేస్తా అంటూ వెన్నెలని పిలుస్తున్నాడు. ఇది పల్లవి. ఇక చరణాల్లోకి వస్తే.. 

ఇది సరసాల తొలి పరువాల 
జత సాయంత్రం సైఅన్న మందారం 
చెలి అందాల చెలి ముద్దాడే 
చిరు మొగ్గల్లొ సిగ్గేసె పున్నాగం   
పిల్లా ... పిల్లా... 
భూలోకం దాదాపు కన్నుమూయు వేళ .. 
పాడేను కుసుమాలు పచ్చగడ్డి మీన 
యే పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ

'కన్నుమూయడం' అంటే వాడుకలో అర్ధం తనువు చాలించడం. ఇక్కడ కవి ప్రయోగం 'నిద్రపోవడం' అని. మందారం, పున్నాగం మాత్రమే కాదు,  'అందాలు అందాలి' అనడం భలేగా కుదిరింది. 

అతగాడు పల్లవి, చరణం పడ్డాక అప్పుడు ఆమె అందుకుంది: 

ఎత్తైన గగనంలో నిలిపేవారెవరంట
కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంట 
ఎద గిల్లీ గిల్లీ వసంతాన్నే ఆడించే 
హృదయంలో వెన్నెలలే రగిలించే వారెవరు 
పిల్లా ... పిల్లా ... 
పూదోట నిదరొమ్మని పూలే వరించు వేళ 
పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళ 
ఆ వయసే రసాల విందైతే .. ప్రేమల్లే ప్రేమించు 

ఆమె హృదయంలో ప్రేమ భావన అంకురించింది. పూదోటని పూలు వరించడం, పూతీగ తేనెని గ్రహించడం, ప్రేమల్లె ప్రేమించు అనడం.. ఇవన్నీ గుర్తుండిపోయే ప్రయోగాలు. తమిళ 'మిన్సార కణవు' కి వైరముత్తు రాసిన సాహిత్యాన్ని తెలుగు చేశారు వేటూరి. హరిహరన్, సాధనా సర్గం ఆలపించారు. సింపుల్ సెట్లో ప్రభుదేవా, కాజోల్, చిన్నపిల్లల మీద చిత్రీకరించారు ఈ పాటని. వింటున్నంత సేపూ హాయిగా ఉండడమే కాదు, విన్నాక ఓ పట్టాన వదిలిపెట్టని పాట ఇది. 

సోమవారం, ఏప్రిల్ 11, 2022

'ఆర్కే రోజా అనే నేను ...'

ఆమె పేరు శ్రీలత. చిత్తూరు జిల్లా భాకరాపేట ఆమె స్వస్థలం. కుటుంబానికి ఉన్న సినీ పరిచయాల  కారణంగా కాలేజీలో చదివే రోజుల్లోనే సినిమా అవకాశాలు వచ్చాయి. దాదాపు ఒకేసారి ఓ తమిళ సినిమా, మరో తెలుగు సినిమా. సినిమా కెరీర్ ని ఆమె ఎంత సీరియస్ గా తీసుకుని ఉండేదో తెలియదు, తెలుగు సినిమా షూటింగ్ లో ఓ సహనటుడు ఆమెని ఇబ్బంది పెట్టి ఉండకపోతే. అతడి ప్రవర్తన ఆమెలో పట్టుదలని పెంచింది. తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో కొన్నేళ్ల పాటు టాప్ హీరోయిన్ 'రోజా' గా వెలుగొందేందుకు దోహదం చేసింది. ఏ నటుడైతే తొలినాళ్లలో ఆమెని ఇబ్బంది పెట్టాడో, అతడే స్టూడియోల్లో ఆమె వచ్చేవరకూ మేకప్ వేసుకుని ఎదురు చూశాడు. కెమెరా సాక్షిగా ఆమె చేత చెంపదెబ్బలూ తిన్నాడు. తనతో సినిమాలు తీసిన తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకుని సంసార జీవితంలో స్థిరపడింది. ఇక్కడితో ఆగిపోతే, ఓ సినిమా నటిగా తప్ప ఆమెని గురించి చెప్పుకోడానికి ఇంకేమీ ఉండకపోను. ఆమె ఆగలేదు, రాజకీయాల్లో అడుగుపెట్టింది. 

నిజానికి సినీనటిగా రోజాని నేను గమనించింది తక్కువ. అప్పట్లో నేను చూసిన కొన్ని సినిమాల్లో ఆమె కథానాయిక, అంతే.  అయితే ఆమె రాజకీయాల్లోకి వచ్చాక మాటల్నీ, చేతల్నీ తెలియకుండానే గమనిస్తూ వచ్చాను. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారి చిలక పలుకులు వినడానికి సరదాగా ఉంటాయి. పెద్దగా సబ్జక్ట్ నాలెడ్జి లేకుండా నాయకుడిని పొగడ్తల్లో ముంచే ప్రసంగాలు చేసి నెట్టుకొచ్చేస్తూ ఉంటారు. అయితే, రోజా ఇందుకు భిన్నం. తెలుగు దేశం పార్టీలో ఉన్న రోజుల్లో కూడా ఆమెకి తనేం మాట్లాడుతోందో స్పష్టత ఉండేది. స్వతహాగా ఉన్న వాగ్ధాటి, సినిమా ఇమేజి, తక్కువ కాలంలోనే ఆమెకి పేరు తెచ్చిపెట్టాయి. అప్పట్లో కాంగ్రెస్ నాయకులపై ఆమె విసిరే పంచ్ డైలాగులు వింటుంటే ఆమె ఎవరిదో డైలాగ్ రైటర్ సాయం తీసుకుంటోందన్న సందేహం కలిగేది. అయితే, ఆమెకి 'స్పాంటేనిటీ' ఉందన్నది తర్వాత రోజుల్లో అర్ధమైన విషయం. రాజకీయాలని ఆమె ఎంత సీరియస్ గా తీసుకుని ఉండేది అన్నది మళ్ళీ సందేహమే -- తెలుగు దేశం పార్టీలో ఆమె దారుణమైన అవమానాలు ఎదుర్కొని ఉండకపోతే. పదేళ్ల పాటు పార్టీ కోసం పని చేస్తే, సొంత పార్టీ నాయకులే ఆమెని పోటీ చేసిన చోట ఓడించారు రెండు సార్లు. ఈ పరిస్థితుల్లో పార్టీ వీడింది. 

తెలుగు దేశం పార్టీని అవమానకర పరిస్థితుల్లో వీడిన మొదటి నటి రోజా కాదు. అప్పటికే జయప్రదకి ఆ అనుభవం వుంది. అయితే, జయప్రద నాటి పార్టీ పరిస్థితులు, లెక్కలు ఆమెని రాజ్యసభకు నామినేట్ చేసేలా చేశాయి. రోజాకి దక్కింది కేవలం 'తెలుగు మహిళ' అధ్యక్ష పదవి మాత్రమే. పార్టీని వీడిన జయప్రద  రాజకీయంగా ఉత్తరాదికి మరలిపోవడంతో ఆమెకి తెలుగు దేశం పార్టీని ఎదుర్కోవలసిన, ఆ పార్టీని గురించి మాట్లాడవలసిన అవసరం కలగలేదు. కానీ, రోజా పరిస్థితి అది కాదు. తొలుత కాంగ్రెస్ లో చేరి, ఆవిర్భావం నాటినుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న రోజా పార్టీకి ప్రధాన శత్రువు తెలుగు దేశం పార్టీనే. ఆ పార్టీ నుంచి పొందిన అవమానాల బ్యాగేజీని ఆమె మోస్తూనే ఉంది.  రాజకీయాల్లోకి వచ్చిన పదిహేనేళ్ళకి 2014లో నగరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికవడం రాజకీయాల్లో ఆమె తొలివిజయం. ఆ ఎన్నికల్లో ఆమె పార్టీ గెలుపొందలేదు. అధికార పార్టీతో ఆమె అసెంబ్లీలోనూ, బయటా తీవ్రంగా పోరాడింది. ఆమె ఏదైనా మాట్లాడితే, తెలుగు దేశం పార్టీ మహిళా నేతలందరూ కలివిడిగానూ, విడివిడిగానూ ఎదురుదాడి చేసేవాళ్ళు. 

ఒకానొక సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 'లైవ్' లో ఉండడానికి రోజా కారణమైంది అనడం అతిశయోక్తి కాదు. తెలుగు దేశం పార్టీ చేసిన అనేక తప్పులు అధికారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పళ్లెంలో పెట్టి అందించినా, వాటిలో ముఖ్యమైనది రోజా అసెంబ్లీ బహిష్కరణ. ఏ పరిస్థితులు ఆమె బహిష్కరణకి దారితీశాయన్నది ఇవాళ్టికీ స్పష్టంగా తెలియదు. కానీ, ఆ బహిష్కరణని సవాల్ చేస్తూ ఆమె చేసిన పోరాటం మాత్రం గుర్తుండిపోయింది. ఒక సెక్షన్ వోటర్లని ఆమె పార్టీకి దగ్గర చేసింది. మూడేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో ఆమె రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. పార్టీ విజయ దుందుభి మోగించి అధికారంలోకి వచ్చింది. ఆమెకి మంత్రి పదవి తధ్యం అనుకున్నారందరూ. 'హోమ్' శాఖని కేటాయించనున్నారని రూమర్లూ షికారు చేశాయి. రోజాకి మంత్రి పదవి రాకపోవడం ఆమె కన్నా ఎక్కువగా రాజకీయాలని గమనిస్తున్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది. మరో మూడేళ్ళ తర్వాత, అనేక నాటకీయ పరిణామాల అనంతరం మాత్రమే ఆమెకి మంత్రి పదవి దక్కింది. 

రోజా మీద వినిపించే ప్రధానమైన విమర్శ రాజకీయాల్లో హుందాతనం పాటించదనీ, ఎమ్మెల్యేగా ఉంటూ ద్వందార్ధపు టీవీ కామెడీ షోలలో కనిపిస్తుందనీను. 'ఇదే విషయాన్ని ఈమె మరికొంచం హుందాగా చెప్పి ఉండొచ్చు' అనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానైతే, ఆమె ఒక్కర్తీ హుందాగా ఉంటే సరిపోతుందా, లేక మొత్తం రాజకీయాల నుంచి ఏనాడో మాయమైపోయిన హుందాతనం మళ్ళీ తిరిగి రావడం బాగుంటుందా? అదీకాకుండా, తన ప్రత్యర్థులకు అర్ధమయ్యే భాష అదేనని ఆమె భావిస్తోందా? ఎడతెగని ప్రశ్నలు. ఇక టీవీ షోల విషయానికి వస్తే, ఎమ్మెల్యేగా ఉంటూ ద్వందార్ధపు మాటలు, పాటలున్న సినిమాల్లో హీరోగా నటిస్తూ, తెరనిండా నెత్తురు పారిస్తున్న వారి విషయంలో ఈ అభ్యంతరం ఎందుకు వినిపించదు? ఆమె మహిళ కావడం వల్ల ఆమె నుంచి కొంచం ఎక్కువగా ఆశిస్తున్నారా? పురుషుడై ఉంటే షోల విషయంలో అభ్యంతరాలు ఉండేవి కాదా? ఇవీ ఎడతెగని ప్రశ్నలే. "టీవీ షోలు మానేస్తున్నా" అంటూ ఆమె చేసిన తాజా ప్రకటనతో ఈ రెండో విమర్శకి ఇకపై తావుండక పోవచ్చు. 

ఇంతకీ, మంత్రిగా రోజా ఏం చేయబోతోంది? ఒక ప్రాంతీయ పార్టీలో (ఆ మాటకొస్తే ఏ పార్టీలో అయినా) మంత్రిగా ఉన్నవాళ్ళు చేయగలిగేది ఏం ఉంటుంది? ఏదన్నా మంచి జరిగితే దాన్ని ముఖ్యమంత్రి ఖాతాలో వేయడం, చెడు జరిగితే, తప్పని పరిస్థితులు ఎదురైతే, బాధ్యత వహించడం. ఇప్పటి వరకూ చూస్తూ వస్తున్నది ఇదే కదా. వారసత్వం పుణ్యమా అని చులాగ్గా మంత్రులైపోయి, బోల్డంత స్వేచ్ఛని అనుభవించిన వాళ్ళే ఏ ముద్రా వేయలేకపోయిన పరిస్థితుల్లో, అనేక పరిమితుల మధ్య స్వల్పకాలం పదవిలో ఉండే ఈమె నుంచి అద్భుతాలు ఆశించగలమా? పోనీ గడిచిన మూడేళ్ళనే తీసుకున్నా, 'ఇది ఫలానా మంత్రి చేపట్టిన కార్యక్రమం' అని చెప్పుకోడానికి ఏముంది? చెక్కులిచ్చే ఫోటోల్లో ముఖ్యమంత్రి  వెనుక నిలబడ్డం మినహా ఎవరూ చేసిందేమీ ప్రస్ఫుటంగా కనిపించడం లేదు. కాబట్టి, మంత్రిగా రోజా ఏదో చేసేయబోతుందనే భ్రమలేవీ లేవు. ఓ దెబ్బ తిన్నప్పుడో, అవమానం ఎదురైనప్పుడో అక్కడే ఆగిపోకుండా, పట్టు వదలకుండా, ఓర్పుగా పోరాడితే  విజయం సాధించవచ్చు అనే సత్యాన్ని మరోమారు చెబుతుంది ఆమె కథ. 

బుధవారం, ఏప్రిల్ 06, 2022

కాఫీ, టీ కబుర్లు

అమెరికా కాఫీ చైన్ 'స్టార్ బక్స్' ఒడిదుడుకుల్లో ఉందన్న వార్త చూడగానే నాకు మన 'కేఫ్ కాఫీ డే' గుర్తొచ్చింది. ఈ రెండు కాఫీ చైన్లకీ పోలికలు పెరిగిపోతున్నాయి రోజురోజుకీ. 'కాఫీ డే' ని తన ఇంటిపేరుగా మార్చేసుకున్న దివంగత వీజీ సిద్ధార్థ ఒకానొక టైం లో ఈ 'స్టార్ బక్స్' కి పోటీ ఇవ్వాలనుకున్నాడు, దేశీయంగా మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో. బెంగళూరు నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఊపందుకుంటున్న తొలినాళ్లలో సిద్ధార్థ్ చేసిన 'కేఫ్ కాఫీ డే' ప్రయోగం ఊహించనంతగా విస్తరించింది, అది కూడా తక్కువ కాలంలోనే. సిద్ధార్థ్ వ్యాపార సామ్రాజ్యం కూడా కాఫీ నుంచి అనేక ఇతర రంగాలకి విస్తరించింది. అతడి అకాల, అనూహ్య మరణం తర్వాత 'ఇక కాఫీ డే పని అయిపోయినట్టే' అనుకున్నారు అందరూ. ఆ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపధ్యం మంచినీ, చెడునీ కూడా చేసిందన్నారు. ఊహించని విధంగా సిద్ధార్థ భార్య మాళవిక తెరమీదకి వచ్చింది. కాఫీ డే పగ్గాలు చేపట్టడమే కాదు, అప్పులన్నీ తీర్చి సంస్థని గాడిన పెడతానని నమ్మకం కలిగించింది ఉద్యోగులు అందరిలోనూ. ఆమె కృషి కొనసాగుతోంది. 

అటు 'స్టార్ బక్స్' కూడా చిన్నగా మొదలై తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకుని వేగంగా విస్తరించిన సంస్థ. అప్పటివరకూ ఇల్లు, పని ప్రదేశం తప్ప మరో చోటు తెలీని వారికి 'థర్డ్ ప్లేస్' ని పరిచయం చేసింది. రకరకాల కాఫీ ఫ్లేవర్లని అన్ని రకాల ధరల్లోనూ అందుబాటులో ఉంచడం, కస్టమర్లు కోరిన కొత్త ఫ్లేవర్లని, కాంబినేషన్లని అప్పటికప్పుడు చేసి ఇవ్వడం లాంటివి 'స్టార్ బక్స్'ని సగటు అమెరికన్లకి దగ్గర చేశాయి. అదే సమయంలో ఓ సంస్థగానూ మిగిలిన సంస్థలకి భిన్నంగా వ్యవహరించింది 'స్టార్ బక్స్'. పూర్తి కాలపు ఉద్యోగులకే కాదు, కాంట్రాక్టర్లకీ షేర్లు ఇవ్వడం, సామాజిక బాధ్యత తలకెత్తుకుని, అవసరమైన సమయాల్లో అవసరమైన విషయాల మీద జనంలో కదలిక తెచ్చే ప్రయత్నం చేయడం (రేస్ సమస్య లాంటివి), చిన్నచిన్న అమ్మకం దారులని ప్రోత్సహించడం, విద్యార్ధులకి స్కాలర్షిప్పులు.. ఇలా సామాజిక బాధ్యతని నెరవేర్చడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అలాంటి 'స్టార్ బక్స్' లో అంతర్గత సంక్షోభం ముదురుతోందంటోంది అమెరికన్ మీడియా. 

Google Image

అమెజాన్ తో కలిసి 'స్టార్ బక్స్' ప్రారంభించిన నో టచ్ కాఫీ షాపులు వివాదం మొదలవడానికి కారణమట. బరిస్టా (కాఫీ కలిపి ఇచ్చే ఉద్యోగి) అవసరం లేకుండా, యాప్ ద్వారా కాఫీ ఆర్డర్ ఇచ్చి, పే చేసి, మెషీన్ నుంచి కప్పు అందుకుని తాగే ఈ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో ఉద్యోగాల కోత ఏర్పడుతుందని భయం మొదలైందట ఉద్యోగుల్లో. ఈ కొత్త ఏర్పాటుకి ప్రజలింకా పూర్తిగా అలవాటు పడలేదు. కాఫీ షాపులోకి వెళ్ళడానికి ఫింగర్ ప్రింట్స్ ఎందుకివ్వాలో అర్ధం కాని వాళ్ళే ఎక్కువ ఉన్నారు ప్రస్తుతానికి. ఒకప్పుడు ఘనంగా అనిపించిన 'స్టార్ బక్స్' వాళ్ళ పే చెక్కులు, కోవిడ్ తర్వాత సవరింపబడిన మార్కెట్ వేతనాలతో పోలిస్తే వెలవెలపోతూ ఉండడం, షిఫ్టుల విషయంలో స్పష్టత లేకపోవడం వంటివన్నీ ఉద్యోగులు రోడ్డెక్కేలా చేశాయి. ఫలితంగా, 'స్టార్ బక్స్' షేరు పతనమవుతోంది. ఓ పక్క మూతపడిపోతోందనుకున్న 'కేఫ్ కాఫీ డే' పునరుత్తానం వైపు అడుగులు వేస్తుండగా, 'స్టార్ బక్స్'  భవిష్యత్తుని గురించి సందిగ్ధత ఏర్పడడం ఓ చిత్రమైన పరిణామం.  

ఇంతకీ, 'కేఫ్ కాఫీ డే' ని పునర్నిర్మించడం మాళవికకి నల్లేరు మీద బండి నడక అవుతుందా? సిద్ధార్థ్ కాఫీ డే ప్రారంభించే నాటికీ, ఇవాళ్టికీ మార్కెట్లో చాలా మార్పులు వచ్చాయి. నాడు ప్రజలకి వేరే ఛాయిస్ లేదు. ఇప్పుడు ఎంచుకునేందుకు ఛాయిస్ లు అనేకం. సాఫ్ట్వేర్ రంగంలో మొదలయిన 'స్టార్ట్ అప్' ల ట్రెండు కాఫీ వ్యాపారానికీ విస్తరించింది. కొత్తగా వస్తున్నవాళ్ళు కూడా వ్యాపారాన్ని ఆషామాషీగా తీసుకోడం లేదు. నేరుగా కాఫీ ఎస్టేట్లకి వెళ్లి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ సరుకుని కొనుక్కు తెచ్చి, గింజల్ని స్వయంగా పొడికొట్టి, కాఫీ చేసి అమ్ముతున్నారు. కాఫీ నాణ్యత విషయంలో రాజీ పడక పోవడం, కొత్త రుచుల్ని పరిచయం చేయడానికి సర్వదా సిద్ధంగా ఉండడంతో ఆదరణ బాగుంటోంది. వీటికి లేనిదీ, 'కాఫీ డే' కి ఉన్నదీ బ్రాండ్ ఇమేజి. ఈ కారణంగానే వీటి విస్తరణ ఆలస్యమవుతోంది. ఈ కొత్త సంస్థలు నిలదొక్కుకునే లోగానే 'కాఫీ డే' బండిని పూర్తిగా పట్టాలెక్కించడం మాళవిక ముందున్న పెద్ద సవాలు. మరి దేశీయ 'స్టార్ బక్స్' కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

కాఫీ గురించి మాట్లాడుకుని, టీ గురించి చెప్పుకోకపొతే ఎలాగ? సిద్ధార్ధ్ చూపించిన మార్గాన్ని టీ వ్యాపారులూ ఉపయోగించుకున్నారు. 'కాఫీ డే' స్థాయిలో కాకపోయినా, అనేక 'టీ' చైన్లూ మార్కెట్లోకి వచ్చాయి. పోటీ ఎక్కువగా ఉండడం, విస్తరణ వేగంగా కాక మందకొడిగా సాగుతూ ఉండడం ఈ రంగాన్ని పీడిస్తున్న సమస్య. నగరాల్లో ఉండే పోటీకి దూరంగా, చిన్న పట్టణాల మీద దృష్టి పెట్టి 'టీ టైం' చైన్ ని విస్తరించిన గోదావరి కుర్రోడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కథ స్ఫూర్తివంతంగా అనిపించింది. ఇంజనీరింగ్ చదివి, పదేళ్ల పాటు సాఫ్ట్వేర్ రంగంలో పని చేసిన ఈ కడియం కుర్రాడు, ఉద్యోగాన్ని వదిలి టీ వ్యాపారంలోకి దిగడం, అది కూడా కార్పొరేట్ స్థాయిలో కాకుండా, గ్రామీణ స్థాయి నుంచి మొదలు పెట్టడం అతని కుటుంబాన్నే కాదు, అందరినీ ఆశ్చర్య పరిచింది. పెద్ద గ్రామాలు, చిన్న పట్టణాల్లో టీ వ్యాపారానికి కొదవ లేదని, కోట్లలో ఆదాయం సంపాదించే వీలుందని నిరూపించింది 'టీ టైం'. రకరకాల పేర్లతో స్థానిక షాపుల వాళ్ళు ఇమిటేషన్ బ్రాండింగ్ చేసేసుకున్నా, ఆ పోటీని తట్టుకుని తన బ్రాండ్ నేమ్ ని నిర్మించుకుని, నిలబెట్టుకున్నాడు శ్రీనివాస్. ఇవీ కాఫీ, టీ లని గురించి కాసిన్ని కబుర్లు. 

సోమవారం, ఏప్రిల్ 04, 2022

కొత్త జిల్లాలు

మా చిన్నప్పుడు కోనసీమ నుంచి కాకినాడ వెళ్లాలంటే ఓ రోజు పని. అమలాపురం మీదుగా బస్సులో ఎదుర్లంక వెళ్లి, అక్కడ రేవు దాటి, యానాం వెళ్లి, అక్కడినుంచి మళ్ళీ బస్సు పట్టుకుని కాకినాడ వెళ్లడం దగ్గర దారి. కాకపొతే అంచె బస్సులు, పడవ వరసగా దొరికెయ్యాలి. ఎక్కడ ఆలస్యం అయినా మొత్తం ప్రయాణ సమయం పెరుగుతూ పోతుంది. లేదూ అంటే రావులపాలెం వెళ్లి, అక్కడి నుంచి అప్పుడప్పుడూ ఉండే కాకినాడ ప్యాసింజర్ బస్సు పట్టుకుంటే పడుతూ లేస్తూ నాలుగైదు గంటల్లో కాకినాడ చేరేవాళ్ళం. కలక్టరేట్లోనో ఇంకేదైనా ఆఫీసు లోనో  పనంటే వెళ్లినవాళ్ళు పనిపూర్తి చేసుకుని అదే రోజు తిరిగి రావడం కల్ల. అక్కడ ఉండిపోవడం అంటే, బంధుమిత్రులెవరన్నా ఉంటే పర్లేదు కానీ, లేకపోలే తిండి, లాడ్జీ ఖర్చులు తడిసిమోపెడు. ధ్రువీకరణ పత్రంలో (కులం/ఆదాయం/నివాసం) తప్పులు సవరింపజేసుకోడానికో, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ లో పేరు నమోదుకో, అప్డేటుకో మిత్రులు తరచూ ప్రయాణం అవుతూ ఉండేవారు, శ్రమనీ, ఖర్చునీ తట్టుకుని నిట్టూరుస్తూ. 

ఇప్పుడూ దూరం తగ్గలేదు కానీ, ప్రయాణ వేగం కాస్త పెరిగింది. ఎదుర్లంక-యానాం ల మధ్య వృద్ధ గౌతమి మీద బ్రిడ్జీ రావడం తో నేరుగా అమలాపురం-కాకినాడ బస్సులు తిరుగుతున్నాయి. రావులపాలెం వరకూ రోడ్డు అని భ్రమించే లాంటిది ఒకటి ఉంటుంది కానీ, అక్కడి నుంచీ పర్లేదు. అయినప్పటికీ మొత్తం ప్రయాణం మూడు నాలుగు గంటలు పైగా పడుతోంది.పాలనలో ఆన్లైన్ విప్లవం వచ్చేసినప్పటికీ ప్రత్యక్షంగా హాజరైతే తప్ప పూర్తికాని పనులు ఇప్పుడూ ఎక్కువే. ఏదో ఒక పని నిమిత్తం ప్రయాణం తప్పదు. జిల్లాలోకెల్లా ఉన్న పెద్ద ధర్మాసుపత్రిలో వైద్యం కోసం చేరేవాళ్ళు, వాళ్ళకి తోడుగానో, చూడ్డానికో వెళ్లేవాళ్ల సంఖ్యా ఎక్కువే. ప్రయాణం మరీ సుఖంగా ఏమీ ఉండదు. కాకపోతే, వెళ్లిన పని పూర్తయితే అర్ధరాత్రైనా అదే రోజు ఇంటికి తిరిగి రావొచ్చనే భరోసా ఉంది. చేతిలో మోటార్ సైకిల్ ఉంటే ప్రయాణం మరికొంచం సులువు. కారున్న వాళ్ళకి ఎటూ ఎక్కడైనా దూరాలు భారాలు కాదు కదా. 

దాదాపు పది పన్నెండేళ్ల క్రితం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ పుట్టకమునుపు, బ్యూరోక్రసీలో ఉన్న ఓ మిత్రుడి ఉవాచ: "మీ జిల్లాని మూడు జిల్లాలుగా చెయ్యచ్చు. ఉత్తరాదిలో ఎక్కడా ఇంత పెద్ద పెద్ద జిల్లాలు లేవు. జిల్లా చిన్నదైతే ప్రజలకే కాదు, అధికారులకి కూడా సుఖం. పనిమీద కొంచం ఎక్కువ శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుంది". ఆ మాట నేను కాదనలేదు కానీ, మరీ 'మూడు జిల్లాలు' అవసరం లేదేమో అనిపించింది. అప్పటికే 'కోనసీమ ప్రత్యేక జిల్లా' అనే నినాదం ఉండుండీ వినిపిస్తూ ఉండేది. అసలు జీఎంసీ బాలయోగి అకాల మరణం పాలయ్యి ఉండకపోతే, తన అధికారాలు ఉపయోగించి ఎప్పుడో కోనసీమని ప్రత్యేక జిల్లా చేసేసి ఉండేవారని నమ్మే వాళ్ళు ఎందరో ఉన్నారు మా ప్రాంతంలో. "రెండు జిల్లాలు చాలేమో" అన్నాను. "జనసాంద్రత, విస్తీర్ణం దృష్ట్యా మాత్రమే కాదు, ఇక్కడున్న వనరుల్ని దృష్టిలో పెట్టుకున్నా మూడు జిల్లాలైతేనే ఏవన్నా అభివృద్ధికి అవకాశం ఉంటుంది" అన్నప్పుడు, ఇంకేమీ జవాబు చెప్పకుండా వినేసి ఊరుకున్నా, "జరిగే పని కాదులే" అనుకుంటూ. 

Google Image

అప్పుడే కాదు, మొన్నామధ్య రాష్ట్ర ప్రభుత్వం 'జిల్లాల పునర్వ్యవస్తీకరణ-కొత్త జిల్లాల ఏర్పాటు' ప్రకటించినప్పుడు కూడా "బోల్డన్ని చిక్కులొస్తాయి, అయినప్పుడు కదా" అనే అనుకున్నాను. కానీ, అత్యంత ఆశ్చర్యకరంగా అనుకున్న సమయానికే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోయింది. పదమూడల్లా ఇరవయ్యారు జిల్లాలయ్యాయి.  మా కోనసీమకి ప్రత్యేక జిల్లా హోదా వచ్చేయడమే కాదు, నాటి నా మిత్రుడి మాటని నిజం చేస్తూ తూర్పుగోదావరి మూడు జిల్లాలుగా పునర్వ్యవస్తీకరింపబడింది. ప్రభుత్వ విభాగాలతో బొత్తిగా అవసరం పడని వాళ్ళకో, 'అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతాయి' అనుకునే వాళ్ళకో ఇదేమీ పెద్ద విషయం కాదు కానీ, కలెక్టరేట్ల చుట్టూ నిత్యం చెప్పులరిగేలా తిరిగే వేలాది మందికి ఇది తీపి కబురు. జిల్లా కలెక్టరే మేజిస్ట్రేట్ కూడా అవ్వడం, భూ తగాదాలు లాంటివి ప్రత్యక్ష హాజరుతో తప్ప పరిష్కారం కానివి కావడం వల్ల గ్రామాల్లో ఉండే వాళ్ళకి, వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరక్క తప్పదు, ఎందుకో అందుకు. సదరు కార్యాలయం అక్కడెక్కడో కాక, దగ్గర ఉండడం అన్నది చాలా పెద్ద ఊరట. 

గతంతో పోల్చినప్పుడు రెండూ బై మూడో వంతు పని భారం తగ్గింది కాబట్టి కొత్త జిల్లాల కలెక్టర్లకి అభివృద్ధి మీద దృష్టి పెట్టే సమయమూ, వీలూ చిక్కొచ్చుననే ఆశ ఒకటి ఉంది. ఇక్కడ అభివృద్ధి అంటే ఫ్లై వోవరూ, హైటెక్ సిటీ నిర్మాణాలు కాదు, చేయగలిగే వాళ్ళకి యేటి పొడవునా చేతినిండా పని, కడుపు నిండా తిండీ దొరికేలా చేయడం. వనరులన్నీ ఉండి కూడా, ఈ విషయంలో వెనకపడ్డానికి కారణం రాజకీయ నాయకులకి చిత్తశుద్ధి కొరవడడం ఓ కారణం అయితే, శ్రద్ధ పెట్టాల్సిన ఉన్నతాధికారులకి తగినంత సమయం చేతిలో లేకపోవడం ఇంకో కారణం. వనరుల సద్వినియోగం మీద దృష్టి పెట్టగలిగే అధికారులు కలెక్టర్లుగా వస్తే, జీవనోపాధి సమస్య కొంతవరకైనా పరిష్కారం అవ్వకపోదనిపిస్తోంది. వ్యవస్థలో ఉన్న సమస్త లోపాలూ ఈ ఒక్క నిర్ణయంతో సరిద్దిబడిపోతాయన్న అత్యాశ అయితే లేదు. కొందరు ప్రచారం చేస్తున్నట్టుగా ఈ కొత్త జిల్లాల ఏర్పాటు సర్వరోగ నివారిణి కాదు. అదే సమయంలో మరికొందరు చెబుతున్నట్టుగా ఎందుకూ పనికిరాని నిర్ణయమూ కాదు. 

జిల్లా కేంద్రం అంటే కలెక్టరాఫీసు, ఎస్పీ ఆఫీసు, ముఖ్యమైన ఆధికారుల కార్యాలయాలతో పాటుగా జిల్లా ఆస్పత్రి కూడా ఉంటుంది. సాధారణంగా ఈ ఆస్పత్రిలో అన్ని వైద్య విభాగాలూ, అన్ని రకాల అనారోగ్యాలకీ వైద్యసేవలు అందించేవిగా ఉండాలి. ప్రస్తుతం ప్రకటించిన కొత్త జిల్లా కేంద్రాలలో చాలాచోట్ల ఏరియా ఆస్పత్రులున్నాయి. అయితే, వాటిలో సేవలు, సౌకర్యాలు పరిమితం. వీటిని జిల్లా ఆసుపత్రులుగా అప్ గ్రేడ్ చేసి, అవసరమైన వైద్యుల్ని, పరికరాల్ని సిద్ధం చేయాలి. ప్రయివేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా విస్తరించినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది రోగులు ఇప్పటికీ ధర్మాసుపత్రుల మీదే ఆధారపడ్డారు. ప్రయివేటు ఆస్పత్రులో దొరికే వైద్యం ఖరీదైనది కావడం ఇందుకు ముఖ్య కారణం. పాలనా కార్యాలయాల ఏర్పాటుతో పాటుగా దృష్టి పెట్టాల్సిన అంశం ఇది. లెక్కపెడితే, ఇప్పటికీ జిల్లా కేంద్రాలకి ఇతరత్రా పనుల నిమిత్తం వెళ్లే వారి సంఖ్యతో సరిసమంగా ప్రభుత్వ వైద్యం కోసం వెళ్లేవారి సంఖ్యా ఉంటోంది. ఈ ఏర్పాటు చేసినప్పుడే కొత్త జిల్లాల ఏర్పాటు పరిపూర్ణమవుతుంది. 

శుక్రవారం, ఏప్రిల్ 01, 2022

వేపపువ్వు

'ఉగాది పచ్చడి' అనే చక్కని పేరున్నా 'వేపపువ్వు పచ్చడి' అన్న పేరే స్థిరపరిచేశారెందుకో. 'చేదు పచ్చడి' అనడం కూడా కద్దు. చెరుకు ముక్కలు, మామిడి పిందెల ముక్కలు, అరటి పండు, కొబ్బరి, బెల్లం, పచ్చి మిరప, చింతపండు పులుసు, ఉప్పు, ఇంకా ఎవరి అభిరుచిని, అందుబాటునీ బట్టి వాళ్ళు అనేక దినుసులు చేర్చేసినా ఏమీ అనుకోని పండగ ప్రత్యేక వంటకం ఇది. పచ్చడి కదా అని కర్వేపాకు తగిలించి నేతితో ఇంగువ పోపు వేసేవాళ్ళూ ఉన్నారు. ఎన్ని వేసినప్పటికీ మోడర్న్ వంటల్ని కొత్తిమీరతో 'గార్నిష్' చేసినట్టుగా, ఉగాది పచ్చడికి చివర్లో వేపపువ్వు అలా పడాల్సిందే. ఎవరి చేతిలోనన్నా శాస్త్రోక్తంగా పచ్చడి వేయాలంటే, ముందుగా వేపపువ్వు వేసి, తిననిచ్చి, అప్పుడు మిగిలిన మిశ్రమాన్ని వడ్డించాలి. తలంటులో కుంకుడు పులుసు పడి కళ్ళు మండితే మిగిలిన రోజుల్లో ఉప్పుకల్లు అద్దిన చింతపండు తినే సౌలభ్యం ఉండేది కానీ, ఉగాది రోజున మాత్రం మొదటగా తినాల్సింది వేపపువ్వు పచ్చడినే. 

మార్చి మూడోవారం మొదలు ఏప్రిల్ మొదటి వారం లోగా ఎప్పుడైనా వచ్చే పండుగ ఉగాది. వేసవి మొదలైపోతుంది. ఉక్కపోత, చెమట సరేసరి. వేపచెట్లు పూతకొస్తాయి. పండుగ కాస్త ముందుగా వచ్చేస్తే వేపపువ్వుకి బదులుగా మొగ్గలు పడతాయి పచ్చడిలో. కాస్త ఆలస్యం అయి, పిందెలు మొదలైపోయినా పువ్వైతే దొరుకుతుంది. వినాయక చవితి పండక్కి పత్రి కోసుకోడానికి బోల్డన్ని నిబంధనలుండేవి. కొన్ని చెట్లనుంచి కోసీ కోయనట్టు ఒకట్రెండు ఆకులు మాత్రమే తుంపాలి, మరికొన్ని మొక్కలు, చెట్ల జోలికి వెళ్లనే కూడదు ఇలా అన్నమాట. అయితే, వేపపువ్వు విషయంలో ఈ నియమాలేవీ ఉండేవి కాదు. ఎంత పువ్వు కోసుకున్నా ఎవరూ ఏమీ అనేవాళ్ళు కాదు. కానైతే, కొయ్యడానికే మనసొప్పేది కాదు. పువ్వు వృధా పోకూడదని అంతా పచ్చట్లో వేసేస్తే తినాల్సింది మనమే అన్న జ్ఞానం కాస్త తొందరగానే కలిగింది. ఇలాంటి జ్ఞానాన్ని పత్రీ, ఇతరత్రా పువ్వులూ కలిగించలేక పోయాయి. 

Google Image

రాములవారి గుడి గోడని ఆనుకుని పెద్ద వేపచెట్టు ఉండేది. మొదలు గుడి లోపల ఉంటే, కొమ్మలు గోడ మీంచి వాలి ఉండేవి. చెట్టు మొదట్లో కండ చీమలు పుట్టలు పెట్టుకుని ఉండడమూ, ప్రహరీ గోడ నెరజలు తీసి ఉండడంతో పిల్ల మేళానికి చెట్టెక్కే సాహసం ఉండేది కాదు. గోడ బయట రాతి సోఫా మీద నిలబడి, పొడవాటి కర్రతో వేప కొమ్మల్ని వంచుకుంటే పువ్వు కోసుకోవచ్చు. అయినా, ఎంత పువ్వు కావాలి కనుక? చిక్కేవిటంటే, వేపపువ్వు ఎప్పుడు పడితే అప్పుడు కోయడానికి లేదు. ఉదయమో, సాయంత్రమో మాత్రమే కొయ్యాలి. సాయంత్రం వేళ ఆ ప్రాంతంలో ఓ గోధుమవన్నె ముసలి తాచుపాము వ్యాహ్యాళికి తిరిగేది. ఆ పాము ఎవరినీ ఏమీ చేసేది కాదు, ఆ పామునీ ఎవరూ ఏమీ చేసేవారు కాదు. పిల్లలు తెలిసో తెలియకో రాయి విసురుతారని పెద్దవాళ్ళ భయం. అందుకని, ఆ వ్యాహ్యాళి వేళల్లో కూడా అటువైపు వెళ్లడం నిషిద్ధం. అలా వేపపువ్వు కోసం పంచాంగం చూసి ముహూర్తం పెట్టినంత హడావిడి జరుగుతూ ఉండేది. అన్నట్టు, ఆ చెట్టు వేప పుల్లలకి ఎంత డిమాండ్ అంటే, లెక్కేస్తే దాదాపు  ఊళ్ళో సగం దంతధావనాలకి ఆ ఒక్క చెట్టే దోహదం చేసి ఉంటుంది, కొన్ని దశాబ్దాల పాటు.  

గణాచారి చేతిలో వేపమండల్లాంటి, పువ్వులున్న వేపకొమ్మలు ఇంటికి తేవడంతోనే పనైపోయినట్టు కాదు. తెచ్చిన వేపపువ్వు నుంచి మొగ్గల్నీ, పసిరి మొగ్గల్నీ వేరు చేసే పని కూడా పిల్లలదే. పసిరి మొగ్గల్ని ఎప్పుడూ ఉండనిచ్చే వాళ్ళం కాదు కానీ, మొగ్గల్ని ఒక్కోసారి ఉంచేయాల్సి వచ్చేది. ఉగాది ముందే వచ్చేసి, చెట్టు పూర్తిగా పూత అందుకోక పొతే మొగ్గలోనే పూలని చూసుకోవాలి కదా మరి. పూలు కోసేశాక, ఆ మిగిలిన పుల్లల్ని పడేయకూడదు. వేలెడేసి చొప్పున విరిచి, చిన్న పురికొస ముక్క ముడేసి, ఏ గూట్లోనో గుర్తుగా దాస్తే, గబుక్కున వచ్చే చుట్టాలకి పొద్దున్నే పళ్ళు తోముకోడానికి ఇవ్వొచ్చు. ఈ జ్ఞానమూ ఊరికే వచ్చింది కాదు. ఓ పండగెళ్ళిన పాతనాడు వచ్చిన చుట్టానికి పొద్దుపొద్దున్నే వేపపుల్ల సమకూర్చాల్సి వచ్చి, అష్టకష్టాలూ పడినప్పుడు కలిగింది. తాటాకు ముక్కదేం వుంది, పెరట్లో ఉన్న పాక పైకప్పు నుంచి లాక్కోవచ్చు, వేపపుల్ల అలా కాదు కదా? ఇంతకీ, అలా వేరు చేసిన వేపపువ్వుని చిన్న గిన్నె లోకో, ఖాళీ కొబ్బరి చిప్పలోకో తీసి పెట్టేస్తే అప్పటికి పనైపోయినట్టే. 

పండుగనాడు పొద్దున్నే పచ్చడి నోట్లోవేసుకోగానే కలిగే మొదటి కోరిక 'తియ్యగా ఉంటే బాగుండును'. ఉండే అవకాశం ఎంతమాత్రమూ లేదు. ఎందుకంటే, మొదట వేపపువ్వు చప్పరించాకే మిగిలిన పచ్చడి చేతిలో పడుతుంది. శ్రేష్టమైన వేపచెట్టు కొమ్మన పూసిన పువ్వు తియ్యగా ఎలా ఉంటుంది? పైగా, ప్రకృతి ఇష్టారాజ్యంగా కాకుండా ఓ పద్ధతిగా నడిచిన రోజుల్లో? అయితే, ఉగాది మరీ అంత చేదుగా ఏమీ మొదలయ్యేది కాదు. అప్పటికే పచ్చడిలో నాని ఉండడం వల్ల వేపపూలకి కాస్త పులుపు, తీపి అంటి ఉండేవి. పైగా, చేదు తిన్నందుకు గాను, పచ్చట్లో చెరుకు ముక్కని ఎంచి చేతిలో వేసేవాళ్ళు. ఈసారి వేపపూత అంటుకున్న చెరుకు ముక్క. ఏ ఒక్క రుచో దొరకదు. అన్ని రుచులూ కలగలిసే నాలిక్కి తగులుగూ ఉండేవి. నిజానికి అదో ప్రత్యేకమైన రుచి. ఇదీ అని ప్రత్యేకంగా చెప్పలేం. కావాలనుకోలేం, వద్దనీ అనుకోలేం. మళ్ళీ రుచి చూడాలనిపిస్తుందా అంటే, సందేహమే. ఆ రుచి పేరు 'జీవితం' అని అర్ధమవ్వడానికి కొన్నేళ్లు పట్టింది. మిత్రులందరికీ శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు!!

బుధవారం, మార్చి 30, 2022

భారతీయ సీయీవో

కేరళ మూలాలున్న ప్రవాస భారతీయుడు రాజ్ సుబ్రమణియం 'ఫెడెక్స్' సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా  ఎంపిక కావడంతో భారతీయుల నాయకత్వ లక్షణాలపై మరోసారి చర్చ మొదలైంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ మొదలుకుని ట్విట్టర్ వరకూ దాదాపు ఇరవై భారీ మల్టి-నేషనల్ కంపెనీల్లో కీలక స్థానాల్లో భారతీయులు రాణిస్తుండడంతో రాజ్ నియామకం మరీ పెద్ద వార్త కాలేదు. కొంచం స్పష్టంగా చెప్పాలంటే 'భారతీయ సీయీవో'  అనేది ప్రపంచానికి అలవాటైపోయినట్టుగా అనిపిస్తోంది. నావరకు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ ల ఎంపిక జరిగినప్పటి హడావిడి గుర్తొచ్చింది. గడిచిన ఏడెనిమిదేళ్లలో ఏడాదికి రెండు మూడు కంపెనీలన్నట్టుగా భారతీయుల్ని కీలక స్థానాల్లో కూర్చోబెడుతున్నాయి. సదరు వ్యక్తులు కూడా పదవుల్ని అలంకారంగా భావించకుండా, తమ శక్తి సామర్ధ్యాలని కంపెనీల అభివృద్ధికి వెచ్చిస్తూ అహరహం శ్రమిస్తున్నారు. వాళ్ళ విజయాలు కూడా తాజా ఎంపికలో ఎంతోకొంత పాత్ర పోషిస్తూ ఉండొచ్చు, మిగిలిన వాటితో పాటుగా. 

పెద్దపెద్ద అమెరికన్ కంపెనీలు కీలక స్థానాల్లో భారతీయుల్ని ఎందుకు కూర్చోబెడుతున్నాయి? అన్న ప్రశ్నకి అనేక జవాబులు తడుతున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది సంఖ్యాబలం. అమెరికా వలసదారుల్లో, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు చేసే వాళ్లలో అధిక సంఖ్యాకులు భారతీయులే. నాలుగున్నర దశాబ్దాల క్రితం వలసలకి అమెరికా తలుపులు తెరిచినప్పుడు, ముప్ఫయ్ ఏళ్ళ క్రితం నిబంధనల్ని మరింత సరళతరం చేసినప్పుడూ, మరీ ముఖ్యంగా అగ్ర రాజ్యాన్ని వణికించిన 'వైటూకే' సందర్భంలోనూ పెద్ద ఎత్తున ఆ దేశంలో అడుగు పెట్టిన వాళ్ళు భారతీయులే.  జనాభా ఎక్కువ, అవకాశాలు తక్కువా ఉన్న దేశం కనుక సహజంగానే పెద్ద ఎత్తున నిపుణుల్ని సరఫరా చేయగలిగింది. (వలసల సంఖ్యలో భారత్ కి దరిదాపుల్లో ఉన్నది అత్యధిక జనాభా ఉన్న మరోదేశం చైనా కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం.) తత్ఫలితంగా  అమెరికాలోని కీలక ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ భారతీయలు బాగా కుదురుకోగలిగారు. 
Google Image

సంఖ్యాబలం ఉన్నంత మాత్రాన ఉన్నతోద్యాగాలు వెతుక్కుంటూ వచ్చేస్తాయా? కీలకమైన పోస్టులకి ఎంపిక చేసేస్తారా? ఇవి కూడా చాలా సహజమైన ప్రశ్నలే. ఉద్యోగం వెతుక్కుంటూ ఇప్పుడు ఆ దేశానికి బయల్దేరే వాళ్ళకన్నా, ముందు నుంచీ అక్కడ ఉంటున్న/ఆ దేశానికి అలవాటు పడ్డవాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నది కాదనలేని నిజం. హైదరాబాదులో ఉద్యోగానికి, హైదరాబాదు నుంచి ఒకరూ, ఆముదాలవలస నుంచి ఒకరూ అప్లై చేసినప్పుడు, ఎంత సమానావకాశాలు ఇచ్చే వాళ్ళైనా హైదరాబాద్ అభ్యర్థికే తొలి ఓటు వేస్తారు. రెండు మూడు తరాలకి ముందు మొదలైన భారతీయుల అమెరికా విస్తరణ, ఇప్పటి తరానికి వినియోగానికి వస్తోంది. ఈ భారతీయ సీయీవోల్లో కొందరు అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళైతే, మరికొందరు ఉన్నత విద్య కోసం వెళ్లి అక్కడే ఉద్యోగంలోనూ, జీవితంలోనూ స్థిరపడిపోయిన వాళ్ళు. వీళ్ళలో మెజారిటీ భారతీయులం అని చెప్పుకుంటారు తప్ప, భారత్ కి తిరిగి వెళ్లడం అనే ఆలోచన పెట్టుకోరు, పెట్టుకోలేరు కూడా. 

ఇంతకీ నాయకత్వ లక్షణాలు అనగా ఏవి? విజేతల చరిత్రలు తిరగేసినప్పుడు వాళ్ళందరూ చాలా క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడుపుతారని, సమయపాలనకి విలువ ఇస్తారని, చాలా సహనంగానూ, దయతోనూ ఉంటారనీ, స్థితప్రజ్ఞత వారి సొత్తనీ, ఒక పని పూర్తి చేసేందుకు వంద మార్గాలని ఆలోచించి పెట్టుకుంటారనీ, పోరాట పటిమ కలిగి ఉంటారనీ... ఇలా ఓ పెద్ద జాబితా కనిపిస్తుంది. సూక్ష్మంగా పరిశీలిస్తే కెరీర్ లో పైకెదగాలనే తపన ఉన్న భారతీయులందరికీ వీటిలో చాలా లక్షణాలు సహజాతాలు. వీళ్లంతా ఎంసెట్ ర్యాంక్ కోసం ఎల్కేజీ నాటి నుంచీ కష్టపడి చదివిన వాళ్ళే. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అడుగు పెట్టనివ్వని పరీక్షలు రాసి రేంకులు తెచ్చుకున్న వాళ్ళే. 'స్కూలు బస్సు రాకపోతే బడిమానేద్దాం' అనే ఆలోచన లేకపోగా, ప్రేయరుకి ముందే బళ్ళో ఉండడానికి మార్గాలు అన్వేషిస్తూ పెరిగిన వాళ్ళే. చిన్నప్పటి నుంచీ వీళ్ళు నెగ్గుకొచ్చేది అల్లాటప్పా పోటీలో కాదు, కట్ త్రోట్ కాంపిటీషన్లో. 

ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే, ఈ భారతీయ సీయీవోల్లో మెజారిటీ మధ్యతరగతి నేపధ్యం నుంచి వచ్చిన వాళ్ళే. 'బతకడానికి నీకున్న ఒకేఒక్క దారి చదువు మాత్రమే' అన్న బోధలు నిత్యం వింటూ పెరిగిన వాళ్లే. ఇంట్లో చదువుకునే వాతావరణం ఉండడం, అదే సమయంలో పరిమితమైన వనరులు, అపరిమితమైన పోటీ వీళ్ళని యుద్ధానికి సిద్ధపడేలా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించి ఉంటాయి. ఎదగాలనే తపనని ఉగ్గుపాలతో రంగరించి మరీ నింపి ఉంటారు వీళ్ళ పెద్దలు. ప్రతిభని మెరుగు పరుచుకోడం, ఆపైన తమకి తగిన అవకాశాలని వెతుక్కుంటూ ఎంతదూరమైనా వెళ్ళడానికి మానసికంగా సిధ్దపడడం వాళ్లకి తెలియకుండానే రక్తంలో ఇంకి ఉంటుంది. సర్దుకు పోవడం, సర్దుబాటు చేసుకోవడం లాంటి లక్షణాలు కూడా వృత్తిలో ఎదగడానికి దోహదం చేసే ఉంటాయి. బహుశా అందుకే తమ భారతీయ మూలాలని కొంచం తరచుగా గుర్తు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. 'సీయీవో' అనే చక్కెర పూత వెనుక ఉన్న చేదు వాళ్లకన్నా బాగా ఇంకెవరికి తెలుసు?

సోమవారం, మార్చి 28, 2022

పండు పండు పండు ...

ఉగాది కన్నా ముందే ఎండలు మండిపోతున్నాయి. డీహైడ్రేషన్, వడదెబ్బ నుంచి ఎవరిని వారు రక్షించుకోవాల్సిన తరుణం వచ్చేసింది. కనబడ్డ ఓ జ్యూస్ షాపు లోకి అదాటున వెళ్లి, మెనూ చూడకముందే ఆర్డర్ ఇచ్చేసి, తాపీగా కూర్చుని మెనూ తిరగేస్తుండగా పక్క టేబుల్ నుంచి ఆర్డర్ వినిపించింది 'బటర్ ఫ్రూట్ జ్యూస్'. మెనూలో స్పెషల్ ఐటమ్స్ కేటగిరీలో కనిపించింది 'అవొకాడో' బొమ్మతో. ఆహా! ఏ దేశపు ఫలాన్నైనా ఆపళంగా తినేయడం ఒక్కటే కాదు, జ్యూస్ పిండుకుని తాగేయగలుగుతున్నాం కూడా కదా అని ఆశ్చర్యం కలిగింది. ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోవడం అంటే ఏమిటో మరోమారు అనుభవానికి వచ్చింది. నోరు తిరగని పేర్లున్న రకరకాల ఫలాలని, స్థలకాలాదులతో నిమిత్తం లేకుండా ఆరగించగలగడాన్ని ఒకప్పుడు ఎవరూ ఊహించలేదు. 

ఇప్పుడిప్పుడు పెద్ద పెద్ద మాల్స్ లో మాత్రమే కాదు, వీధి చివర సూపర్ బజార్ల లోనూ ఇప్పుడు అవొకాడోలూ, ఫిగ్సూ, కివీ పళ్ళూ ఇంకా అనేకానేక విదేశవాళీ ఫలాలూ ప్రత్యేక ప్యాకింగుల్లో నోరూరిస్తున్నాయి.ధరవరల గురించి మాట్లాడ్డం ఓల్డ్ ఫ్యాషన్ కాబట్టి ఆ జోలికి వెళ్లొద్దు కానీ, ఇలా చప్పన్నారు దేశాలకీ పళ్ళని ఎగుమతి చేయడం వల్ల ఆయా రైతులు ఏమాత్రం ఆర్జిస్తున్నారు? మన రైతులు వాళ్ళ పంటల్ని ఇలాగే ఎగుమతి చేయగలుగుతున్నారా? ఆయా విదేశీ పంటల్ని మన దగ్గర పండించేందుకు చేసే ప్రయత్నాల వల్ల లాభనష్టాలేంటి? లాంటి ప్రశ్నలతో బుర్ర మరికొంచం వేడెక్కింది. షాపులో రద్దీ చూస్తే ఆర్డర్ నా నోటిదగ్గరకి రాడానికి బాగానే సమయం పడుతుందని అర్ధమై, ప్రశ్నల మీదే దృష్టి పెట్టాను. 

Google Image

'వెన్న ఫలం' గా తెనిగించ గలిగే అవొకాడో జన్మస్థలం మెక్సికో. అల్లప్పడు డోనాల్డ్ ట్రంపు సరిహద్దు గోడ కట్టేస్తానని బెదిరించిన అమెరికా పొరుగు దేశం. ఈ అవొకాడోలు తొలుత అమెరికాకీ, అక్కడినుంచి గ్లోబులో ఉన్న చాలా దేశాలకీ మొదట పరిచయమై, అటు పైని వదల్లేని అలవాటయ్యాక మెక్సికో రైతులకి అక్షరాలా పంట పండింది. మిగిలిన అన్నిదేశాల్లోలాగే అక్కడా మధ్య దళారులు బాగా డబ్బు చేసుకున్నా, వెన్న పళ్ళు పండించిన రైతులు కూడా చెప్పుకోదగ్గ లాభాలనే ఆర్జిస్తున్నారు. మెక్సికోలో ఉన్న నీళ్లన్నీ అవొకాడోలు పండించదానికే చాలడంలేదంటూ మీడియా కోడై కూయడం మొదలుపెట్టింది. మనకి 'ఈనాడు' 'సాక్షి' ఉన్నట్టే అన్ని స్థాయిల్లోనూ పరస్పర విరుద్ధ పత్రికలు ఉంటాయి కదా. ఆ రెండో వర్గమేమో చికెనూ, మటనూ కోసం కోళ్ళనీ, మేకల్నీ పెంచడానికయ్యే నీళ్ల ఖర్చు కన్నా, అవొకాడోలు పండించడానికి వ్యయమయ్యే నీళ్లు బహుతక్కువనే లెక్కలతో వచ్చింది. 

అన్నట్టామధ్య మన మీడియా 'డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సీమలో సిరుల పంట' అంటూ హోరెత్తింది గుర్తుందా? సదరు డ్రాగన్ ఫ్రూట్ కూడా విదేశీ ఫలమే. స్పష్టంగా చెప్పాలంటే అమెరికన్ మూలాలున్న పండు. దిగుమతుల ఖర్చు తగ్గించుకోడానికీ, వీలయితే ఎగుమతులు చేసి డాలర్లు ఆర్జించడానికీ ప్రభుత్వం వారు రైతుల్ని డ్రాగన్ ఫ్రూట్ సాగుకి విపరీతంగా ప్రోత్సహిస్తున్నారని చెప్పింది మన మీడియా. 'అరకు లో యాపిల్ సాగు' అంటూ ఇంకో రకం వార్తలు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి చదివినప్పుడు నాకేమనిపిస్తుందంటే మన నేలలో విదేశీ పంటలు పండించడం వల్ల, మనవైన పంటలు పండించుకునే చోటుని నష్టపోతున్నాం కదా అని. దీనికి జవాబు బ్రెయిన్ డ్రైన్ అనబడే మేధోవలసలకు జవాబంత పెద్దదని కూడా తెలుసు కాబట్టి, ఎవరితోనూ చర్చ పెట్టలేదు.

జిహ్వకో రుచి ఉండడంలో ఆశ్చర్యం లేదు కానీ, అన్ని జిహ్వలకీ అమెరికా/విదేశీ పళ్లే ఎందుకు రుచి అవుతున్నాయి అన్నది ఆశ్చర్య పరిచే విషయం. మనవైన తాటి ముంజలు, రేగు, ఈత, నేరేడు పళ్ళ లాంటివి ఇంతే విస్తృతంగా మార్కెట్లో ఎందుకు కనిపించడం లేదన్నది బొత్తిగా అర్ధంకాని విషయం. ఈ విదేశీ పళ్ళన్నీ అందమైన పేకింగుల్లో, సూపర్ అద్దాల పెట్టెల వెనుక నుంచి షోగ్గా రారమ్మని పిలుస్తుంటే, మనవైన పళ్ళు మాత్రం ఇంకా సైకిలు వెనుక బుట్టలకీ, చెట్టు కింది గోనె పట్టాలకీ మాత్రమే పరిమితమై పోవడం బొత్తిగా అర్ధం కాని విషయం. పోనీ, విదేశాల్లో ఏవన్నా ఇవి మహారాణీ భోగం అనుభవిస్తున్నాయా అంటే అదీ లేదు. మావిడి మినహా మిగతా ఏ పళ్ళకీ ఆ భాగ్యం దక్కినట్టు లేదు. మనం మాత్రం మనవైన పళ్ళని బలిపెట్టి మరీ విదేశీ ఫలాలని నెత్తిన పెట్టుకుంటున్నాం అని గుర్తొచ్చి చివుక్కుమనిపించింది. మెనూని మరింత జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టాను, మళ్ళీసారి వచ్చినప్పుడు అప్పటికి కొత్తగా వచ్చిచేరిన జ్యూసులని పసిగట్టడంకోసం... 

గురువారం, మార్చి 24, 2022

శ్రీబాలాజీ టాకీస్ 

'ప్రేమ ప్రబంధం' అనేది ఈ నవలకి రచయిత ఇచ్చిన ఉపశీర్షిక. ఇది చూడగానే పాతికేళ్ల క్రితం చిన్నగా మొదలై హవాగా మారిన 'యూత్' సినిమాలు గుర్తొచ్చాయి. వాటికి టైటిల్ తో పాటు, టాగ్ లైన్ తప్పనిసరిగా ఉండేది, ఓ సెంటిమెంట్ లాగా. కేవలం శీర్షిక చూస్తేనే కాదు, నవల చదువుతున్నంతసేపూ కూడా యూత్ సినిమా చూస్తున్న అనుభూతే కలిగింది. మణిరత్నం 'ఘర్షణ' సినిమా రిలీజవ్వడం మొదలు, 'గీతాంజలి' సినిమా రికార్డులు బద్దలు కొట్టడం వరకూ జరిగిన మధ్య కాలంలో చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ లోని కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఓ అబ్బాయీ, అమ్మాయీ ప్రేమలో పడి, ఆ ప్రేమని గెలిపించుకోడం కోసం చేసిన పోరాటమే ఈ నవల. అబ్బాయి పేరు జీకే నాయుడు, అమ్మాయి పేరు స్నేహలతా రెడ్డి. 

కథలోకి వెళ్లేముందు, రచయిత గురించి చెప్పుకోవాలి. 'బారతం బొమ్మలు' 'కానగపూల వాన' లాంటి నిరూపమానమైన కథల్ని రాసిన 'కథా మాంత్రికుడు' గోపిని కరుణాకర్ రాసిన తొలి నవల ఇది. నవల సబ్జెక్టుకి అనుగుణంగా కాబోలు, తన పేరుని 'కరణ్ గోపిని' గా మార్చుకున్నారు. కథ చెప్పడంలో గోపినిది ఓ విలక్షణమైన శైలి. తన కథలన్నీ పల్లెటూరి మట్టివాసనల్ని చిమ్ముతూ, జానపద బాణీలో సాగుతాయి. కథాంశాన్ని తాను పూర్తిగా జీర్ణించుకుని, పూర్తిగా తనదైన పద్ధతిలో ప్రతీకాత్మకంగానూ, కొంత మార్మికంగానూ చెప్పడం గోపిని శైలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ నవల దగ్గరికి వచ్చేసరికి ఆ శైలిని పూర్తిగా విడిచిపెట్టేశారు. కథనంలో బిగి, ప్రకృతిని కథలో భాగం చేయడం లాంటి వాటిని మాత్రం ఎక్కడా విడిచిపెట్టలేదు. 

పీలేరు గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ చదివే జీకే నాయుడికి తన ఖర్చులు తానే సంపాదించుకోవాల్సిన పరిస్థితి. చిన్న చిన్న పనులెన్నో చేసి, చివరికి శ్రీ బాలాజీ టాకీస్ లో బుకింగ్ క్లర్కు గా కుదురుకుంటాడు. రోజూ ఉదయాన్నే కాలేజీ, మధ్యాహ్నం నుంచీ థియేటర్ పని చేస్తూ ఉంటాడు. అదే కాలేజీలో, అతనితోపాటు చదివే అమ్మాయి స్నేహలతా రెడ్డి, పీలేరు టౌన్ లోనే రాజకీయ పలుకుబడి ఉన్న కాంట్రాక్టరు కూతురు. తాపీగా సాగే కథనంలో నాటకీయమైన మలుపుల మధ్య వాళ్ళిద్దరి మధ్యా ప్రేమ పుడుతుంది. క్రమేణా అది పెరిగి పెద్దదవుతుంది. మెజారిటీ ప్రేమకథల్లో లాగే ఇక్కడా వాళ్ళ ప్రేమకి కులమూ, డబ్బూ అడ్డు పడతాయి. వాళ్ళ ప్రేమ చిగిర్చినది మొదలు ఫలించే వరకూ చుట్టూ ఉండే మిత్రులతో పాటు ప్రధానమైన పాత్ర పోషించింది శ్రీ బాలాజీ థియేటర్. 

ఈ ప్రేమకథకి నేపధ్యంగా కాలేజీ, సినిమా థియేటర్ తో పాటుగా సాహిత్యాన్నీ వాడుకున్నారు రచయిత. లైబ్రరీలో నాయకుడు నాయికను చూసినప్పుడు అతని రెండు చేతుల్లోనూ చెరో పుస్తకం ఉంటాయి. వాటి మధ్య నుంచి ఆమెని చూస్తాడు. ఒకటి చలం 'మైదానం' రెండోది విశ్వనాథ 'చెలియలికట్ట'. ఆమెతో ఇంకా ప్రేమలో పడక మునుపే "తప్పక చదువు" అని చెప్పి యద్దనపూడి సులోచనారాణి 'ప్రేమలేఖలు' నవల ఇస్తాడు - ఓ మోసగాడికి ప్రేమలేఖలు రాసి చిక్కుల్లో పడ్డ అమ్మాయి కథ. భిన్న జాతులకి చెందిన వారైన కారణంగా ప్రేమలో ఓడిపోయిన రోమియో-జూలియట్ ల కథ క్లాస్ రూమ్ పాఠంగా వస్తుంది (నవల్లో నాయికా నాయకులిద్దరివీ వేర్వేరు కులాలు). ఇలాంటివన్నీ ఓ పక్క కథని ముందుకు తీసుకెళ్తూనే, పాఠకుల్ని నాస్టాల్జియా లోకి తీసుకెళ్తాయి. సందర్భానికి తగినట్టుగా పుస్తకాలని భలే ఎంచుకున్నారు. 

పుస్తకాల తర్వాత అంత విరివిగా ప్రస్తావించింది సినిమా పాటల్ని. సినిమా థియేటర్ కూడా ఒక పాత్రగా నడిచే కథలో సినిమా పాటల ప్రస్తావన సహజమే కానీ, చాలాచోట్ల పాటల సాహిత్యాన్ని తప్పుగా రాయడమూ, కొన్ని చోట్ల గాయనీ గాయకుల పేర్లు తప్పు పడడమూ (వాణీ జయరాం పాడిన 'మిన్నేటి సూరీడు' ని జానకి ఖాతాలో వేయడం లాంటివి) జరిగాయి. సినిమాలనీ, పాటల్నీ ఇష్టపడే వాళ్ళకి ఇవి పంటికింద రాళ్లు. పీలేరు పరిసర ప్రాంతాలన్నింటినీ కథలో భాగం చేసేయడం బాగుంది కానీ, ఈ క్రమంలో దొర్లిన పునరుక్తుల్ని పరిహరించుకుంటే బాగుండేది. నాయికా నాయకుల ఫ్రెండ్స్, వాళ్ళ లెక్చరరూ అచ్చం యూత్ సినిమాల్లో పాత్రల్లాగే ప్రవర్తిస్తారు. నాయిక కుటుంబాన్ని పరిచయం చేశారు తప్ప, నాయకుడి కుటుంబాన్ని ఎక్కడా ప్రత్యక్షంగా చూపలేదు - తమ్ముడికి, చెల్లికీ ఫీజు కట్టాలి అనే పరోక్ష ప్రస్తావన తప్ప. 

ఇది కేవలం నాయికానాయకుల చుట్టూ తిరిగే కథ కాదు. బలమైన సహాయ పాత్రలున్నాయి. వాటిలో ముఖ్యమైన పాత్ర రసూల్. అతని ప్రేమకథ, చిన్న స్థాయి నుంచి ఎదిగిన వైనం ఇవన్నీ బాగా గుర్తుండిపోతాయి. నాకైతే రసూల్ కథని మెయిన్ ప్లాట్ గానూ, నాయుడి కథ సబ్-ప్లాట్ గానూ నవల రాసి ఉంటే బాగుండేది అనిపించింది. నవల నడక మొత్తం సినిమాలాగే సాగింది. కొన్ని మలుపులు ఊహించగలిగేవి, మరికొన్ని కొత్తగా ఉండి ఆశ్చర్యపరిచేవి. అక్కడక్కడా కొంచం  నాటకీయత, హీరో ని ఎలివేట్ చేసే సన్నివేశాలు. సగానికొచ్చేసరికి నవల కాక, సినిమా స్క్రిప్ట్ చదువుతున్న భావన కలిగింది. ఫిక్షన్ ఇష్టపడే వాళ్ళకి నచ్చేసే నవల ఈ 'శ్రీ బాలాజీ టాకీస్'. పాలపిట్ట ప్రచురించిన ఈ 344 పేజీల పుస్తకం వెల రూ. 250, పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు. 

మంగళవారం, మార్చి 22, 2022

కన్నీటిచుక్క

శానిటైజర్లో నానిన చేతుల్ని లిక్విడ్ సోపుతో కడుక్కుని, డిస్పెన్సర్ నుంచి అలవాటుగా పేపర్ నాప్కిన్ అందుకుంటూండగా గుర్తొచ్చింది నీటిచుక్క ఆకారంలో ఉండే శ్రీలంక. కాగితం కొరత కారణంగా విద్యార్ధులకి జరగాల్సిన అన్ని పరీక్షలనీ నిరవధికంగా వాయిదా వేసింది గతవారం. బిల్లులు ప్రింటు చేయడానికి కాగితం లేక అక్కడి విద్యుత్ సంస్థలు బిల్లులు పంపిణీ చేయలేదు. ఆ చిన్నదేశాన్ని చుట్టుముట్టిన ఆర్ధికసంక్షోభపు వికృత రూపాన్ని ప్రపంచానికి సులువుగా అర్ధమయ్యేలా చెప్పే ఉదాహరణ ఇది. ఇంతేనా? చమురు, సహజవాయువు ధరలు చుక్కలంటాయి. నిత్యావసరాలని అత్యధిక ధరలు చెల్లించి కొనడానికి జనం సిద్ధపడ్డా తగినంత సరుకు లేదు మార్కెట్లో. ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉండగా, ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య సంస్థలతో చర్చలు ప్రారంభించింది. ఈ చర్చలు ముగిసేదెప్పుడు? జనం ఆకలి కేకలు ఆగేదెప్పుడు? 

సరిగ్గా ఐదేళ్ల క్రితం శ్రీలంకని గురించి ఘనమైన వార్తా కథనాలు వచ్చాయి -  మనదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా. అప్పుడు, అంటే 2017 సంవత్సరానికి గాను శ్రీలంక జీడీపీ భారత జీడీపీని మించింది. పరిణామంలో భారత్ లో యాభయ్యో వంతు, కేవలం రెండు కోట్ల పైచిలుకు జనాభాతో - భారత్ తో పోల్చినప్పుడు ఆరొందలో వంతు - ఉన్న చిన్న దేశం, ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో ఓ రాష్ట్రం పాటి చేయని దేశం వృద్ధిలో భారత్ ని మించిపోవడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రత్యేక తమిళ దేశంకోసం సుదీర్ఘమైన ఉద్యమం చేసిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీయీ) ని సమర్ధవంతంగా అణచి వేయడం ద్వారా శ్రీలంక ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతల్ని పెంపొందించిందనీ, అందువల్లనే అభివృద్ధి సాధ్యపడిందనే విశ్లేషణలు జోరుగా సాగాయి. అయితే ఈ మురిపెం ఎన్నాళ్ళో సాగలేదు. 

సరిగ్గా రెండేళ్ల తర్వాత, 2019 లో ఈస్టర్ పండుగ నాడు ఆ దేశంలో జరిగిన బాంబు పేలుళ్లతో శ్రీలంక మాత్రమే కాదు, మొత్తం ప్రపంచమే ఉలికిపడింది. మొత్తం మూడు చర్చిలు, మూడు హోటళ్ల మీద వరుసగా జరిగిన బాంబు దాడుల్లో ఏకంగా 270 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటివరకూ దేశానికి ప్రధాన వనరుగా ఉన్న పర్యాటకరంగ ప్రగతి మసకబారడం మొదలయ్యింది. నిజానికి ఈస్టర్ బాంబు పేలుళ్ల వల్ల కన్నా తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గోటబాయ రాజపక్స గెలవడం వల్లనే ఎక్కువ నష్టం జరిగిందన్న వాదన ఉంది. ఎన్నికల్లో తన గెలుపు కోసమే బాంబు దాడులు జరిపించారన్న ఆరోపణలనీ గోటబాయ ఎదుర్కొంటున్నారు. రాజపక్స అన్నదమ్ములు నలుగురూ, వాళ్ళ పిల్లలూ శ్రీలంక పాలనలో కీలకమైన పదవుల్లో ఉన్నారు. మొత్తం దేశం బడ్జెట్లో డెబ్బై శాతం నిధులు ఈ కుటుంబం ఆధ్వర్యంలో నడిచే మంత్రిత్వ శాఖల్లోనే ఖర్చవుతాయి!

Google Image

ఈస్టర్ పేలుళ్ల కారణంగా తగ్గడం మొదలైన టూరిజం ఆదాయం, కోవిడ్ వ్యాప్తితో మరింతగా తగ్గి, తాజాగా ఉక్రెయిన్ మీద రష్యా ప్రకటించిన యుద్ధం కారణంగా పూర్తిగా క్షీణించిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం నిజానికి ఉక్రెయిన్ తో సమంగా శ్రీలంకకీ నష్టం చేస్తోంది. శ్రీలంకకి వచ్చే పర్యాటకుల్లో అత్యధికులు రష్యా, ఉక్రెయిన్ల నుంచే వస్తారు. శ్రీలంకలో ప్రధానమైన తేయాకు పంటకి అతిపెద్ద మార్కెట్ కూడా ఈ రెండు దేశాలే. అటు పర్యాటకుల్నీ, ఇటు తేయాకు మార్కెట్నీ కోల్పోయింది శ్రీలంక. వీటికి తోడు పాలనా పరమైన లోపాలు సరేసరి. గతేడాది ఉన్నట్టుండి కృత్రిమ ఎరువుల వాడకాన్ని నిషేధించింది శ్రీలంక ప్రభుత్వం. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మంచిదే అయినా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలకి తలొగ్గి కొంచం ఆలస్యంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పంటల దిగుబడి తగ్గి ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. 

ఆదాయం పడిపోవడం ఓపక్క, ఆహార ధాన్యాల కొరత మరోపక్క చుట్టుముట్టినా ప్రభుత్వం వేగంగా స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పొరుగు దేశాలు  సహాయం అందించేందుకు సిద్ధపడినా శ్రీలంక ప్రభుత్వం అందుకోడానికి తిరస్కరించడం, ద్రవ్యలోటుకి సంబంధించిన కీలక నిర్ణయాలని వాయిదా వేస్తూ రావడం లాంటి తప్పిదాలు కూడా నేటి శ్రీలంక సంక్షోభానికి కారణాలని చెప్పాలి. నిజానికి అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఏదో ఒక సమయంలో ఇలాంటి సంక్షోభాలని ఎదుర్కొన్నవే. నూతన ఆర్ధిక సంస్కరణలని ఆహ్వానించడానికి ముందు భారతదేశ పరిస్థితి కూడా ఇదే. బంగారు నిల్వలు మొత్తం విదేశీ బ్యాంకుల తాకట్టులో ఉండి, ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితుల్లో దిగుమతులన్నీ క్లియరెన్స్ లు దొరక్క పోర్టుల్లో పేరుకుపోయిన పరిస్థితిని ఈ దేశమూ అనుభవించింది. పైగా అప్పుడు రాజకీయ అస్థిరత పతాక స్థాయిలో ఉంది కూడా. 

అంతటి సంక్షోభపు అంచుల నుంచి దేశాన్ని బయట పడేసిన నాటి ప్రధాని పీవీ నరసింహారావు ని మళ్ళీ ఓసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ శ్రీలంక ఐఎంఎఫ్ చేతుల్లోకి వెళ్లిపోతుందేమోనని ప్రపంచం సందేహిస్తున్న వేళ, నాటి సంక్షోభం నుంచి భారత్ గట్టెక్కిన వైనాన్ని గుర్తు చేసుకోవాలి. అంతర్జాతీయ షరతుల్ని గుడ్డిగా ఆమోదించకుండా, పరిమితుల మేరకి మాత్రమే ప్రయివేటు పెట్టుబడుల్ని ఆహ్వానించి దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టిన నాయకుడిని స్మరించుకోవడం తప్పు కాదు. ప్రస్తుతం శ్రీలంకకి కొరవడింది ఇలాంటి నాయకత్వమే.  కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మారినట్టుగా ఆహార ధాన్యాల కొరతతో మొదలైన సమస్య, రికార్డు స్థాయి ఆహార, ఆర్ధిక సంక్షోభం వరకూ పెరిగిపోయినా పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న గట్టి దాఖలా ఏదీ కనిపించడం లేదు. సంక్షోభం పెరిగే కొద్దీ బేరమాడే శక్తి (బార్గెయినింగ్ పవర్) తగ్గిపోతుందనీ, ద్రవ్య సంస్థలు పెట్టే షరతులన్నింటికీ అంగీకరించాల్సిన పరిస్థితిలోకి వెళ్లిపోతామనీ ఆ దేశపు నేతలకి తట్టకపోవడం దురదృష్టకరం. నీటి చుక్క దేశపు కన్నీరు ఎప్పటికి ఆగేనో...