శనివారం, ఏప్రిల్ 20, 2019

జెర్సీ

విజయం సాధించేవారు నూటికొక్కరైతే, ఆ విజయంకోసం శ్రమించేవారు మిగిలిన తొంభైతొమ్మిది మంది. ఈ మెజారిటీకి ప్రతినిధి క్రికెటర్ అర్జున్. అతని కథే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార  ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన 'జెర్సీ' సినిమా. క్రికెట్ ని జీవితంలో ఒక భాగంగా కాక, పూర్తిజీవితంగా చేసుకున్న అర్జున్ సాధించిన విజయాలు, ఎదుర్కొన్న పరాజయాలు, మళ్ళీ విజయం సాధించడం కోసం చేసిన తీవ్రమైన ప్రయత్నాలే ఈ సినిమా. కేవలం క్రికెట్ ని అభిమానించే వారికి మాత్రమే కాదు, జీవితంలో ఏదో ఒక దశలో వైఫల్యాలని ఎదురుకొన్న వారికి, విజయం కోసం శ్రమిస్తున్న వారికీ నచ్చేసే సినిమా.

క్రికెట్ ప్లేయర్ గా రాణిస్తూ నేషనల్స్ కి సెలక్ట్ అవడాన్ని లక్ష్యంగా చేసుకున్న అర్జున్ (నాని), తన అభిమాని సారా (శ్రద్ధా శ్రీనాధ్) ని ప్రేమ వివాహం చేసుకుంటాడు. వాళ్ళకో కొడుకు నాని (మాస్టర్ రోనిత్). ఊహించని విధంగా  సెలక్షన్ మిస్ అవ్వడంతో, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగంలో చేరతాడు అర్జున్. ఊహించని విధంగా  ఉద్యోగంలో సస్పెన్షన్ రావడంతో, ఉదయాన్నే నానీని క్రికెట్ కోచింగ్ కి తీసుకెళ్లడం, రోజంతా టీవీలో క్రికెట్ చూడడమే జీవితం అయిపోతుంది అర్జున్ కి.  అతన్ని అమితంగా ప్రేమించే సారా, ఇల్లు గడపడం కోసం తాను ఉద్యోగంలో చేరుతుంది.

ఎప్పుడూ తండ్రిని ఏదీ కావాలని అడగని నానీ, తన ఏడో  పుట్టినరోజున  క్రికెటర్లు ధరించే 'జెర్సీ' కొనిమ్మని కోరతాడు తండ్రిని. దాని ఖరీదు ఐదువందలు. ఆ ఐదు వందల కోసం చేసే ప్రయత్నాలలో అర్జున్ కి ఎన్నో అవమానాలు. తనని ఎంతో అభిమానించే కోచ్ మూర్తి (సత్యరాజ్) ద్వారా ఓ ఛారిటీ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చినప్పుడు కూడా, అర్జున్ ఆలోచన ఆ వచ్చే  డబ్బులతో నానీకి ఒక జెర్సీ కొనివ్వచ్చని మాత్రమే. పన్నెండేళ్ల విరామం తర్వాత ఆడిన ఆ మ్యాచ్ ఫలితంగా అర్జున్ జీవితం ఏ మలుపు తిరిగింది? అంతగా ప్రేమించిన భార్య కూడా కుటుంబం లేదా క్రికెట్లో ఏదో ఒకటే ఎంచుకోమని ఎందుకు షరతు విధించింది? ఇంతకీ అర్జున్ నానీకి జెర్సీ కొనిచ్చాడా, లేదా అన్నది మిగిలిన కథ. 

సినిమా నిడివి రెండు గంటల నలభై నిమిషాలన్నా, అందులో నలభై నిముషాలు కేవలం క్రికెట్ మ్యాచ్లు మాత్రమే ఉన్నా ఎక్కడా విసుగురాని విధంగా తీర్చిదిద్దిన క్రెడిట్లో దర్శకుడితో పాటు ఎడిటర్ నవీన్ నూలి కి కూడా ఇవ్వాలి. నటన విషయానికి వస్తే నాని, శ్రద్దా శ్రీనాథ్ లు పోటాపోటీగా నటించారు. సత్యరాజ్ ది పూర్తి నిడివి పాత్ర. మూర్తిగా మరొకర్ని ఊహించలేని విధంగా చేశాడు. ప్రేమకథ, తండ్రీకొడుకుల అనుబంధం, క్రికెట్, డ్రెస్సింగ్ రూమ్ అసూయలు, బోర్డు రాజకీయాలు.. ఇలా అనేక విషయాల చుట్టూ రాసుకున్న కథ అయినప్పటికీ, ఏం చెప్పాలి అనే దానితో పాటు ఎలా చెప్పాలి అన్న విషయంలో దర్శకుడికి స్పష్టత ఉండడం వల్ల ఎక్కడా అయోమయానికి అవకాశం లేకుండా సాగింది సినిమా.

తన తొలిసినిమా 'మళ్ళీరావా' లాగానే కథని ఇంటర్కట్స్ లో చెప్పాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. న్యూయార్క్ లో చదువుకుంటున్న నాని తన తండ్రి జీవితకథ 'జెర్సీ' ని పుస్తకాల షాపులో కొనడంతో మొదలయ్యే సినిమా, ఇండియాలో జరిగే ఆ పుస్తకం ప్రమోషన్ మీట్ లో తన తండ్రిని గురించి అప్పటివరకూ తెలియని ఓ విషయాన్ని తెలుసుకోవడంతో ముగుస్తుంది.. హీరో స్నేహితులతో సహా ప్రతి పాత్రకీ ఒక ఐడెంటిటినీ ఇవ్వడంతో పాటు, పాత్రలన్నింటినీ కథలో భాగం చేశాడు దర్శకుడు. అర్జున్ విజయాల్లో ఉన్నప్పుడు, వైఫల్యాలతో కూరుకుపోయినప్పుడూ అతని చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తనల్లో తేడాని చిత్రించిన తీరు ముచ్చటగొలిపింది.

కొంచం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండును అనిపించిన ఒకే ఒక్క విషయం సంగీతం. పాటలు, నేపధ్య సంగీతం కథకి తగినట్టుగా లేవనిపించింది. సినిమా మొదలైన గంటా ఇరవై నిమిషాలకి ఇంటర్వల్ వస్తే, "అప్పుడే సగం సినిమా అయిపోయిందా?" అన్న కామెంట్స్ వినిపించాయి థియేటర్లో. క్లైమాక్స్ లో అయితే కొందరు ప్రేక్షకుల నుంచి క్లాప్స్ పడ్డాయి. విజయం సాధించడం అంటే మెట్లో, నిచ్చెనలో ఎక్కినంత సులువు కాదనీ, నిరంతర శ్రమ, పట్టుదలతో పాటు కొన్ని త్యాగాలూ అవసరమవుతాయనీ చెప్పిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి అభినందనలు. ఈ దర్శకుడి తర్వాతి సినిమా ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన్నేను.

బుధవారం, ఏప్రిల్ 03, 2019

కీలుబొమ్మలు

తప్పక చదవాల్సిన తెలుగు నవలల జాబితాని ఎవరు ప్రకటించినా అందులో తప్పకుండా ఉండే పేరు  జి.వి. కృష్ణారావు రాసిన 'కీలుబొమ్మలు.' గుంటూరు జిల్లా కూచిపూడి (అమృతలూరు) కి చెందిన గవిని వెంకట కృష్ణారావు 1951 లో రాసిన ఈ నవల మానవ మనస్తత్వ విశ్లేషణకి, విలువల చిత్రణకీ పెద్దపీట వేసింది. మార్క్సిస్టు నుంచి మానవవాది (ఎమ్మెన్ రాయ్) గా మారిన కృష్ణారావు, ఈ రెండు రాజకీయ సిద్ధాంతాలనీ నవలలో ముఖ్యమైన మలుపుల దగ్గర ప్రస్తావించారు.

కోస్తా ప్రాంతంలోని ఓ పల్లెటూరు 'కీలుబొమ్మలు' నవలలో కథాస్థలం. ప్రధాన పాత్ర పుల్లయ్య ఆ ఊళ్ళో మోతుబరి రైతు. పెద్దకొడుకు అకాల మరణం మినహా అతడి జీవితంలో లోటేమీ లేదు. కోడల్ని, మనవడిని తన దగ్గరే పెట్టుకున్నాడు. ఉన్న ఒక్క కూతుర్ని, చిన్న కొడుకుని బస్తీలో పెట్టి చదివిస్తున్నాడు. ఇంటి పెత్తనం అంతా భార్య లక్ష్మమ్మదే. ఊరికి పెద్దమనిషే అయినా, ఇంట్లో పుల్లయ్య కూడా ఆవిడ మాటకి సరే అనాల్సిందే. భార్యతో చెప్పకుండా ఏపనీ చేయని పుల్లయ్య, గ్రామస్తుడు చంద్రశేఖరం మార్వాడీ దగ్గర చేసిన ఐదువేల రూపాయల అప్పుకి మాత్రం హామీ పడతాడు.

చంద్రశేఖరం బాగా చదువుకున్న, డబ్బున్న కమ్యూనిస్టు. ఊళ్ళో ఫ్యాక్టరీ నిర్మించి కార్మికులకి సకల సౌకర్యాలూ ఏర్పాటు చేస్తాడు. అయితే, అతనికి వ్యాపారంలో అనుభవం లేకపోవడంతో ఫ్యాక్టరీకి నష్టాలు మొదలవుతాయి. కార్మికులతో చర్చలు జరిపి, సహకార పద్ధతిలో ఫ్యాక్టరీ నడుపుదామని ప్రతిపాదిస్తాడు. కార్మికులు మాత్రం లాభనష్టాలతో తమకి సంబంధం లేదనీ, జీతభత్యాలు, సౌకర్యాలు మరింత పెంచాల్సిందేననీ తెగేసి చెబుతారు. తన సొమ్మే కాక, మామగారి సొమ్ము మొత్తం తెచ్చి పెట్టుబడి పెట్టినా, ఫ్యాక్టరీ దివాళా తీయడంతో ఆ రెండు కుటుంబాలూ వీధిన పడతాయి. 


ఫ్యాక్టరీని నిలబెట్టడం కోసం చంద్రశేఖరం చేసిన అప్పుల్లో పుల్లయ్య హామీ ఉన్న మార్వాడీ అప్పు ఒకటి. అయితే, పుల్లయ్య హామీ సంతకం చేసినట్టుగా సాక్ష్యం లేదు. చంద్రశేఖరం తరపున పుల్లయ్య మార్వాడీకి బాకీ తీర్చాల్సిన పరిస్థితి వస్తుంది. నిజానికి పుల్లయ్యకి చంద్రశేఖరం మీద సానుభూతి ఉంది. చెల్లించాల్సిన మొత్తమూ లెక్కలోది కాదు. కానీ, హామీ విషయాన్నీ అతడు తన భార్య నుంచి దాచాడు. ఇప్పుడు బయట పడితే ఆమె గొడవ చేయచ్చు. చంద్రశేఖరం బాకీ తాను తీరిస్తే, ఊళ్ళో తన పరపతి తగ్గొచ్చు. ఈ ఆలోచనల్లో ఉండి ఎటూ తేల్చుకోకుండానే, తానేమీ హామీ పడలేదని అర్ధం వచ్చేలా గొణుగుతాడు పుల్లయ్య.

అక్కడినుంచి అనూహ్యంగా పరిస్థితులు మారిపోతాయి. తాను అభిమానించిన చంద్రశేఖరం మీద ఫోర్జరీ కేసు పెట్టాల్సి వస్తుంది పుల్లయ్యకి. అతడి మనస్సాక్షికి, లోకరీతికీ మధ్య సంఘర్షణ. పుల్లయ్య దగ్గర గుమస్తాగా పనిచేస్తున్న సత్యనారాయణకి హామీ విషయం తెలుసు. కానీ ప్రభుభక్తి, ఉద్యోగభయం అతన్ని నోరు మెదపనివ్వవు. పట్నంలో చదువుకుంటున్న పుల్లయ్య కొడుకు రామారావు కమ్యూనిస్టు సానుభూతి పరుడు. చంద్రశేఖరం ఫోర్జరీ చేశాడని నమ్మలేని రామారావు తన తండ్రిని అనుమానిస్తాడు. అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరిగి అనూహ్యమైన ముగింపుకి చేరుతుంది.

పుల్లయ్య, చంద్రశేఖరాల కుటుంబాలతో పాటు, ఆదర్శభావాలతో ఊరి వాళ్లకి వైద్యం చేసే వాసుదేవ శాస్త్రి, సంఘసేవిక ముసుగులో రాజకీయాలు చక్కబెట్టే అమ్మాయమ్మ, ఊళ్ళో పుల్లయ్య ప్రత్యర్థి మల్లయ్య ఇతర ముఖ్య పాత్రలు. మానసిక సంఘర్షణలు, స్త్రీపురుష సంబంధాలని చిత్రించిన తీరు బుచ్చిబాబు 'చివరికి మిగిలేది' ని జ్ఞాపకం చేస్తుంది. వ్యంగ్యాన్ని కథనంలో భాగం చేశారు రచయిత. తాను సృష్టించిన ప్రతి పాత్ర పట్లా రచయిత సానుభూతి చూపడం, ప్రతి పాత్రకీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం ఈ నవల ప్రత్యేకత. అలకనంద ప్రచురణలు తాజాగా ప్రచురించిన 'కీలుబొమ్మలు' నవల  అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది. పేజీలు: 204, వెల రూ. 100.