గురువారం, జులై 26, 2012

ఇంకెన్నాళ్ళు....

రాన్రానూ నేరారోపణలూ, కేసులూ లేని మంత్రులనీ, అధికారుల్నీవెతుక్కోవడం మరీ కష్టమైపోతోంది రాష్ట్ర ప్రజలకి. కనీసం ఒక్క కేసులోనూ లేనివాళ్ళని 'చేతకాని నాయకులు' అని ముద్ర వేసేసే ప్రమాదమూ కనిపిస్తోంది. ఇటు మంత్రులకీ, అటు అధికారులకీ అవసరమైన 'న్యాయ సహాయం' అందిచడానికి తను సిద్ధంగా ఉన్నానని చెప్పడం ద్వారా, ఆర్ధిక నేరాలపై తన వైఖరి ఏమిటన్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే చెప్పేసింది.. ఇప్పుడింక సంపాదించుకోగలిగిన వాళ్లకి సంపాదించుకోగలిగినంత.

ఒకప్పుడు సమాజంలో 'నైతిక బాధ్యత' అనేది ఒకటి ఉండేది. తప్పు చేసిన వాళ్ళు, ఆ తప్పు రుజువైనప్పుడు తల వంచుకోవడం రివాజుగా ఉండేది. కానీ ఇప్పుడు, ఫలానా వాళ్ళు తప్పు చేశారు అనగానే వాళ్ళలో ఒకలాంటి దిలాసా మొదలవుతోంది. ఎందుకంటే, తప్పులు చేసిన వాళ్ళనే పేపర్లూ, టీవీ చానళ్ళూ ఎక్కువగా పట్టించుకుంటాయి. ఓ నాయకుడు నాల్రోజుల పాటు మీడియాలో ఎక్కడా కనిపించకపోతే, ఆతర్వాత కనిపించినా ప్రజలు అతగాడిని గుర్తు పట్టలేని ప్రస్తుత పరిస్థితుల్లో, ఏం చేసినా, చేయకపోయినా వార్తల్లో నానడం అన్నది మన నాయకులకి అత్యవసరం.

ఈ కేసులు, కోర్టుల పుణ్యమా అని పెద్దగా శ్రమ పడనక్కరలేకుండానే వార్తల్లో నానుతున్నారు మన నాయకులు. కేబినెట్లో ముఖ్యమైన శాఖలని చూస్తున్న మంత్రులందరూ కోర్టు తాఖీదులు అందుకున్నారు. ఆయా శాఖల ముఖ్య అధికారులకీ శ్రీముఖాలు అందాయి. తాజాగా ఓ మంత్రిగారికి జైలు శిక్ష ఖరారయ్యింది. అయినప్పటికీ ప్రభుత్వానికేమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే, చట్టం తన పని తాను చేసుకు పోతున్నట్టే, ప్రభుత్వమూ తన పని తాను చేసుకుపోతోంది. తన మంత్రులనీ, అధికారుల్నీ కాపాడుకోడానికి సహాయం అందిస్తోంది.

ఆరోపణలు రావడంతోనే పదవులకి రాజీనామాలు చేయడం, శిక్ష పడ్డాక కూడా రాజీనామా చేయని పక్షంలో ఆయా నాయకులని బర్తరఫ్ చేయడం అన్నది ఇప్పుడు కేవలం చరిత్ర మాత్రమే. ఇప్పటివరకూ అలా పదవులు కోల్పోయిన నాయకులందరూ శుద్ధ అమాయకులు, వారిచేత రాజీనామా చేయించిన వారి భయస్తులూ అన్నమాట. ఎందుకంటే, ఇప్పుడెవరూ రాజీనామాలు చెయ్యరు.. ఎవరూ ఎవర్నీ బర్తరఫ్ అంతకన్నా చేయరు. ఇదేమంటే, "మనలో ఏ పాపం చెయ్యని వారు ఎవరో చెప్పండి?" అంటారు. తొలి రాయిని విసరడానికి, ఎవరు మాత్రం సిద్ధంగా ఉన్నారు కనుక? తిలాపాపం, తలా పిడికెడు.

రానున్న రోజుల్లో మన మంత్రి వర్గ సమావేశాలు ఏదన్నా ప్రముఖ జైల్లో జరగొచ్చు. జాతికి ప్రయోజనం కలిగించే నిర్ణయాలని మన రాజకీయ ఖైదీ నాయకులు కారాగారం నుంచే తీసుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. అప్పుడు కూడా, మన నాయకులు ఏమాత్రం తొణక్కుండా జైలు నుంచి జరిగిన స్వతంత్ర పోరాటాన్ని గుర్తు చేసి, తమని తాము మహాత్ములతో పోల్చుకోగలరు. ఎందుకంటే వారికి అస్సలు మొహమాటం లేదు, వారిని కాదనే వారు లేనేలేరు. ముఖ్యనాయకుడు జైల్లో ఉండగా, అతడి అనుచరులు ఎన్నికల్లో గెలిచేయడాన్ని చూశాం మనం. కాబట్టి, జైలు నుంచి ఎన్నికల్లో పోటీ పడినా మనకేమీ ఆశ్చర్యం కలగదు.

మనకి సహనం కొంచం ఎక్కువే. బహుశా, ఇది మన సంస్కృతిలో భాగం కావొచ్చు. రామాయణం, మహాభారతం తెలియని వారు మనలో అరుదు. తమకి రావాల్సిన సింహాసనం రాకుండా పోయినా సహనంతో ఎదురు చూసిన రాజులే నాయకులు మన ఇతిహాసాల్లో. మనకి శ్రీకృష్ణుడు తెలుసు. శిశుపాలుడూ తెలుసు. దుష్టుడైన శిశుపాలుడికి సైతం మారడానికి వంద అవకాశాలు ఇచ్చాడు మన శ్రీకృష్ణుడు. గణితంలో కూడా మన ప్రతిభ తక్కువదేమీ కాదు. 'సున్నా' ని కనుగొన్నది మన వాళ్ళే. ఇప్పుడు అర్ధం కాని విషయం ఒక్కటే. మన నాయకుల తప్పులు వందా పూర్తయ్యాయా, ఇంకా లేదా??