సోమవారం, జూన్ 20, 2022

'క్లాసిక్స్' తో పేచీ ...

విజయ-వాహినీ వారి 'గుండమ్మ కథ' సినిమాకి అరవై ఏళ్ళు నిండాయని గత వారమంతా హడావిడి జరిగింది. పత్రికల్లో ప్రత్యేక కథనాలు, టీవీల్లో ప్రత్యేక కార్యక్రమాలు, యూట్యూబ్ ఛానళ్లలో వాళ్ళకి తోచిన విశేషాలు.. ఇలా ఒక్కసారిగా ఆ సినిమా వార్తల్లోకి మళ్ళీ వచ్చింది. భారీ తారాగణం, వీనుల విందైన సంగీతం, గుర్తుండిపోయే పాటలు,  ఆరోగ్యకరమైన హాస్యం.. ఇలా విడివిడిగా చూసినప్పుడు ఒక్కొక్కటీ బాగుంటాయి కానీ మొత్తం సినిమాగా నేను 'క్లాసిక్స్' జాబితాలో వేసుకోలేను. నా పేచీ అంతా కథలోని ఓ  ముఖ్య భాగంతోనే. ఏళ్ళ తరబడి మిత్రులతో చర్చించి, చాలాసార్లు ఏకాభిప్రాయం కుదరక వదిలేసిన విషయమే కానీ, ఈ 'వజ్రోత్సవ' సందర్భంలో మళ్ళీ గుర్తొచ్చింది.  

చనిపోయిన తన స్నేహితుడి కుటుంబాన్ని బాగుచేయాలన్న ఎస్వీ రంగారావు తాపత్రయమే ఈ సినిమా కథ. ఆ స్నేహితుడికి భార్య వల్ల సావిత్రి, ఆ భార్య చనిపోయాక రెండో పెళ్లి చేసుకున్న సూర్యకాంతం వల్ల జమునా కలుగుతారు. సవితి తల్లి సూర్యకాంతం తనని నానా బాధలూ పెడుతున్నా, సాత్వికురాలైన సావిత్రి అవన్నీ భరిస్తూ అందరిపట్లా ఆదరం కనబరుస్తూ మంచి పిల్ల అనిపించుకుంటూ ఉంటుంది. తన పెద్ద కొడుకు ఎంటీఆర్కి సావిత్రినిచ్చి పెళ్లిచేసి, సవితి తల్లి బారినుంచి కాపాడి కొత్త జీవితం ఇవ్వాలనుకుంటాడు ఎస్వీఆర్. ఇక్కడి వరకూ పేచీలేదు. కానైతే, గారాబంగా పెరిగిన జమునని తన చిన్నకొడుకు నాగేశ్వర్రావుకి చేసుకుని ఆమెని 'సంస్కరించాలి' అని కూడా అనుకుంటాడు - ఇదే పేచీ. 

గారంగా పెరగడం జమున తప్పు కాదు. తల్లికలా సాగింది కాబట్టి, పనిపాటలకి సావిత్రి ఉంది కాబట్టీ, సతివి కూతురికి, సొంతకూతురికి మధ్య తల్లి భేదం చూపించాలి కాబట్టీ అలా అల్లారుముద్దుగానే పెరిగింది.  పనిపాటలు చేతకావు, ఆధునికంగా అలంకరించుకుని సినిమాలకి వెళ్లడం లాంటి సరదాలు మెండు. ఇలా ఉన్నవాళ్లు అన్ని కాలాల్లోనూ ఉన్నారు. ('సుమంగళి' 'చరణదాసి' లాంటి సినిమాలని ఇప్పటి పరిస్థితుల్లో చూసి పోల్చి తీర్పులివ్వడం కాదు అని గమనించాలి). చిన్ననాటి స్నేహితుడి ఇద్దరు కూతుళ్ళని తన కోడళ్ళుగా చేసుకోవాలనే అభిలాష తీర్చుకునే క్రమంలో జమునని యధాతధంగా అంగీకరించకుండా, ఆమెని ఓ కొత్త మూసలో ప్రవేశపెట్టి, హింసపడేలా చేసి (డొమెస్టికేట్ చేసి?) చివరాఖరి రీల్లో ఆమెలో 'మార్పు' తేవడం అనే ప్రాసెస్ అంతా ఎన్నిసార్లు ఆ సినిమా చూసినా నాకు అంగీకారం అవ్వడం లేదు. 

జమున, జమునలా ఉండిపోకుండా సావిత్రి లాగా ఎందుకు మారిపోవాలి? అలా మారిపోయాక మాత్రమే ఆమెకి మిగిలిన పాత్రల, ప్రేక్షకుల అంగీకారం ఎందుకు దొరకాలి? మారిపోవడం అంత సులభమా?? మామూలుగా అయితే ఇంత ఆలోచన అవసరం లేదేమో కానీ, 'క్లాసిక్' స్టేటస్ ఉన్న సినిమా కదా. అసలు సూర్యకాంతం గయ్యాళిగా వేసిన మెజారిటీ సినిమాల్లో చివరి రీల్లో భర్త పాత్రధారి ఎస్వీఆరో, గుమ్మడో ఓ చెంపదెబ్బ కొట్టగానే ఆమెలో పశ్చాత్తాపం వచ్చేయడం కూడా 'ఏదోలా సినిమాని ముగించాలి కాబట్టి' అనే అనిపిస్తుంది  తప్ప వాస్తవికంగా కనిపించదు. 'ఆ దెబ్బేదో మొదటి రీల్లోనే కొట్టేసి ఉంటే ఇంత గొడవ ఉండేది కాదు కదా' అనిపించిన సందర్భాలూ కోకొల్లలు. ఈ నేపథ్యంలో 'గుండమ్మ కథ' లో జమున పాత్ర తాను చేయని తప్పుకి శిక్ష అనుభవించిందనే అనిపిస్తుంది. మారిన జమునకీ, 'మార్చుకున్న' నాగేశ్వరరావుకీ ప్రేక్షకుల అభినందనలు నాకు కొరుకుడు పడవు. 

'Google' images

ఇలాంటి పేచీయే ఉన్న మరో 'క్లాసిక్' స్టేటస్ సినిమా కె. విశ్వనాథ్ 'స్వర్ణకమలం'. ఇందులో కూడా మంచి నటీనటులున్నారు, ఇళయరాజా సంగీతం, సంస్కృత పదబంధ సమ్మిళితమైన సిరివెన్నెల సాహిత్యం, అరుదుగా వినిపించే ఇళయరాజా-సుశీల కాంబినేషన్, కొన్ని హాస్య సన్నివేశాలు, మరికొన్ని సెంటిమెంట్ సీన్లు.. ఇవన్నీ బాగుంటాయి. కానీ, భానుప్రియ లో 'పరివర్తన' తెచ్చి, ఆమె నాట్యాన్ని ప్రేమించేలా చేయడానికి వెంకటేష్ పడే తాపత్రయం, తనకి నచ్చిన కెరీర్ ఎంచుకున్న ఆమెని రకరకాల ప్రయత్నాలతో నాట్యంలోకి వెనక్కి తీసుకురావడం.. ఇవన్నీ చూస్తుంటే 'ఆమె పాటికి ఆమెని వదిలేయచ్చు కదా.. వాళ్ళ నాన్నకున్న చాలామంది శిష్యుల్లో ఎవరో ఒకరు నాట్యాన్ని ముందుకు తీసుకెళ్తారు కదా' అనిపిస్తూ ఉంటుంది. 

'గుండమ్మ కథ' తో పోల్చినప్పుడు 'స్వర్ణకమలం' విషయంలో రిలీఫ్ ఏమిటంటే, భానుప్రియ నాట్యంలో మమేకమైన తర్వాత అందులో ఆత్మానందాన్ని సంపాదించుకోవడం. తనకి ఇష్టమైన హౌస్ కీపింగ్ ఉద్యోగంలో ఆమెకిది దొరికేది కాదా? అంటే, సందేహమే మళ్ళీ. సినిమా మొదటినుంచి, చివరివరకూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాట్యం గొప్పదనాన్ని గురించి ఆమెకి ఏదో ఒక విధంగా చెప్పి చూసేవాళ్ళే. ఇష్టపడక పోడానికి ఆమె కారణాలు ఆమెకి ఉన్నాయి. అవీ సబబైనవే. కానైతే, హీరో కంకణం కట్టేసుకుని మరీ ఆమెలో మార్పు తెచ్చేయడం, తండ్రి ఆత్మార్పణ లాంటి బలమైన సంఘటనల తర్వాత ఆమెలో ఆ మార్పు వచ్చేయడం.. ఇదంతా కాస్త హైరానాగానే అనిపిస్తుంది. అందరికీ అన్నీ నచ్చాలని లేదుకదా..

6 కామెంట్‌లు:

 1. మార్పు చాలా అందమైన ప్రయాణం. పసితనం నుంచి పరిపక్వత దాకా.. మనిషి తన జీవితంలో ఎప్పుడు ఉన్న విధంగానే ఉండిపోవాలనే కోరుకుంటే జీవితానికి అర్థమే లేదు. నా దృష్టి లో మనిషి అంటే, ఓ ఆగమ్యగోచరమైన గమనం వైపు నిరంతరం సాగే అన్వేషి. ఎక్కడికి చేరుతారనేది ఆ వ్యక్తిత్వం మరియు తపన మాత్రమే నిర్వచిస్తుంది.

  ప్రతిఒకరిని వారిలా ఉండనిద్దాం అనే ఆలోచన కూడా కేవలం మార్పు ద్వారానే , పరిపక్వత , ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక కోణం ద్వారానే కలుగుతుంది. మార్పు అనివార్యం, కాలానికి మూలం.

  సినిమాటిక్ గ సడన్ మార్పులు, డ్రమాటిక్ మార్పులు కొంత చిరాగ్గా అనిపించినా, మనుషులకి మార్పు మూలంగా కలిగే అనుకోని ఉపద్రవాలు, లేదా ఆనందాలు జీవితం లో సాధారణం అనే సందేశం కూడా వ్యక్తమౌతోంది. ఏ శబ్ద ఘోషలు, వెగటు కలిగించే హింస, అశ్లీలం లేని ప్రశాంతమైన పాత సినిమాలు నేను బాగా ఇష్టపడతాను. అందులో ఒకటి గుండమ్మ కథ.

  రిప్లయితొలగించు
 2. బాగుందండీ మీ వ్యాఖ్యానం. స్వర్ణకమలం విషయంలో మీలాగే అనుకున్నాను నేను కూడా. గుండమ్మ కథ విషయం అంత ఆలోచించలేదు. కానీ, అప్పటి సినిమాలలో ఉన్న విలువలే ఆ సినిమాలో కూడా ప్రతిబింబించాయని అనుకుంటాను. దురదృష్టం ఏమిటంటే ఇప్పటికీ సినిమాల్లో మరీ సాత్వికంగా లేని ఆడపాత్రలని చెడ్డగా చూపడమో, వాళ్ళని "టేం" చేయడం హీరోయిజం అనడమో చూస్తూనే ఉన్నాము కదా. క్లాసిక్ తెలుగు సినిమా అంటే అదే ఏమో.

  రిప్లయితొలగించు
 3. ఈ పోస్ట్ చదివి చాలా ఆనందం కలిగింది. ఆడవారి క్యారెక్టర్స్ వైపు నుంచి చూస్తే ఎన్నో చిత్రాలు తమ క్లాసిక్ స్టేటస్ ని కోల్పోవలసి వస్తుంది... ఇది చాలా చేదు నిజం... చేదు ఎందుకంటే అందులో కొన్ని... తెలిసీ తెలియని తనం లో బానే ఎంజాయ్ చేసి, ప్రేమించాం కాబట్టి. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా క్లాసిక్స్ ని స్త్రీల దృష్టి నుంచి చూస్తున్నారు... "movies that have not aged well" అని లిస్ట్స్ రాస్తున్నారు! భలే మంచి మాట కదా... "not aged well" అనేది... కానీ ఒక్క మాట నిజం... ఆర్ట్ కి ఈ రిస్క్ ఎప్పుడూ ఉంటుంది... భక్తి మూవ్మెంట్ రాక మునుపు కర్ణాటక సంగీతం లో శృంగార భరిత వర్ణాలే ... ఆ వర్ణాలు ఇప్పటికీ పాడుకుంటాం ... but we know they have not aged well .. in terms of lyrical value :)

  రిప్లయితొలగించు