బుధవారం, మార్చి 09, 2022

నట్టింట వినోదం

'ఒకే దెబ్బకి రెండు పిట్టలు' అనే సామెత ఇక్కడ ఎంతవరకూ సరిపోతుందో తెలియడం లేదు కానీ, ప్రపంచాన్ని వణికించిన కరోనా సినిమా పరిశ్రమకి, ప్రత్యేకించి తెలుగు సినిమా పరిశ్రమకి, ఓ మేలు చేసింది. చాన్నాళ్లుగా పరిష్కారం లేకుండా ఉన్న, అసలు పరిష్కారం అవుతుందా లేక నానాటికీ పెరిగి పెద్దదవుతుందా అని సందేహిస్తున్న ఓ దీర్ఘకాలిక సమస్యకి పరిష్కారాన్ని వెతికిపెట్టింది. ఈ పరిష్కారాన్ని అంది పుచ్చుకోవడం, అనువుగా ఉపయోగించుకోవడం అన్నది ఇప్పుడు సినిమా పరిశ్రమ చేతిలో ఉంది. ప్రేక్షకులు కోరింది మాత్రమే తీసే పరిశ్రమ, అదే ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పుని ఎంతవరకూ గమనిస్తుంది, వారు కోరుతున్నదే చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న విషయం.

కరోనా కి ముందు వరకూ సినిమా పరిశ్రమకి చెందిన చిన్న నిర్మాతలు, ఇంకా పెద్దవాళ్ళు  కాని హీరోల నుంచి వినిపించిన ప్రధాన ఫిర్యాదు తమ సినిమాలకి థియేటర్లు దొరకడం లేదని. పెద్ద సినిమాలు లెక్కకి మిక్కిలి థియేటర్లలో విడుదలవుతూ ఉండడం, థియేటర్లన్నీ 'ఆ నలుగురి' చేతుల్లో కేంద్రీకృతం అవ్వడం వల్ల, చిన్న సినిమాల విడుదల గాలిలో దీపంగా మారిందనీ, సినిమా మంచి టాక్ తెచ్చుకుని, నిలబడే అవకాశాలు ఉన్నా, పెద్ద సినిమాకి దారివ్వడం కోసం థియేటర్ల నుంచి బలవంతంగా ఎత్తేస్తున్నారనీ వెల్లువగా ఫిర్యాదులు వినిపించాయి. "అప్పట్లో ఇలాంటి పరిస్థితి ఉంటే 'శంకరాభరణం' సూపర్ హిట్ అయ్యి ఉండేదా?" అని ఆవేశంగానూ, ఆవేదనతోనూ ప్రశ్నించిన నిర్మాతల్ని మనం టీవీల్లో చూశాం.

మిగిలిన అన్ని రంగాల్లోనూ తెచ్చినట్టే, ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి సినిమాలకి సంబంధించి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. లాక్ డౌన్ వల్ల సినిమాహాళ్లు మూతపడి, టీవీ చానళ్ళు మూస కార్యక్రమాల నుంచి బయట పడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు (ఆ కార్యక్రమాలని కూడా కొన్నాళ్ళు ప్రసారం చేయలేకపోయినప్పుడు) ఓవర్ ది టాప్ (ఓటీటీ) వినియోగదారుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం మొదలయ్యింది. మార్కెట్ బాగుండడంతో కొత్త పెట్టుబడిదారుల దృష్టి పడి, తక్కువ కాలంలోనే ఓటీటీ ఓ లాభదాయకమైన పరిశ్రమగా మారింది. మనకి సంస్కృతి అయినా, వినోదం అయినా సినిమానే కాబట్టి ఈ ఓటీటీ కంటెంట్ లోనూ సినిమాలు, సినిమా ఆధారిత కార్యక్రమాలే సింహభాగాన్ని ఆక్రమించాయి. అవకాశాలు తగ్గిన సినిమా వాళ్ళకి, కొత్తగా ఈ రంగంలో అదృష్టం పరీక్షించుకుందామనుకునే వారికీ ఓటీటీ పునరావాస కేంద్రంగా మారింది.

Google Image

కొత్తగా ఏం వచ్చినా ఆదరించే ప్రజలు ఓటీటీలనీ బాగానే ఆదరించారు. కొన్ని సినిమాలు ప్రయోగాత్మకంగా 'డైరెక్ట్ ఓటీటీ రిలీజ్' బాట పట్టడంతో రిలీజైన సినిమాని, రిలీజు నాడే ఏ ఇబ్బందీ లేకుండా డ్రాయింగ్ రూములో ఇంటిల్లిపాదీ కలిసి కూర్చుని చూసే అవకాశం వచ్చింది. టీవీ చానళ్ళు సినిమాలని వేసినా ఆ బ్రాడ్ కాస్ట్ థియేటర్ రిలీజ్ జరిగిన కొన్ని నెలల తర్వాత ఉండేది. అప్పుడు కూడా వాళ్ళు చెప్పిన టైముకి సవాలక్ష ప్రకటనలతో పాటుగా ఓపిగ్గా సినిమా చూడాల్సి వచ్చేది. సినిమా రన్ టైం కన్నా ప్రకటనల ప్రసారానికి ఎక్కువ సమయం పట్టిన సందర్భాలు లెక్కలేనన్ని. ఓటీటీలో ఈ గొడవలేవీ లేవు. బ్రాడ్ కాస్ట్ టైం కోసం ఎదురు చూడక్కర్లేదు, మనకి నచ్చినప్పుడు ట్యూన్ చేసుకుని చూడొచ్చు. నచ్చిన పాటలో, సన్నివేశంలో వెనక్కి తిప్పీ, నచ్చని వాటిని గెంతించీ కూడా చూడొచ్చు. ప్రకటనల గొడవ లేనేలేదు. కొన్ని టీవీ చానళ్ల ఏడాది చందా కన్నా, కొన్ని ఓటీటీల వార్షిక చందా తక్కువ. పైగా, స్మార్ట్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా సినిమాలు చూసే సౌకర్యం ఉంది. 

థియేటర్లు దొరకడం లేదని, తమ ప్రతిభ జనానికి తెలిసే దారి లేకుండా పోతోందనీ ఆవేదన చెందుతున్న సినిమా వాళ్ళకి నిజానికి ఈ ఓటీటీ మంచి వరం.  ఎన్నిరోజులు ఆడుతుందో, పెట్టిన డబ్బులు వస్తాయో రావో అన్న బెంగ అక్కర్లేదు. పెట్టిన ఖర్చు మీద కొంత లాభాన్ని వేసుకుని ఓటీటీకి అమ్మే వీలుంది. ఇవాళ్రేపు యూట్యూబర్లు, టిక్ టాకర్లు కూడా స్టార్లుగా పరిణమిస్తున్న వేళ, బాగా నటిస్తే ఓటీటీ నటులకీ పేరుకి కొదవుండదు. ప్రతిభని ప్రదర్శించి, పేరు తెచ్చుకుంటే అవకాశాలు అవే వస్తాయి. కావాల్సిందల్లా జనాన్ని రంజింపజేయడం. థియేటర్ల మోనోపోలీ, టీవీ ఛానళ్ల ప్రైమ్ టైం మోనోపోలీలకి ఇక్కడ అవకాశం లేదు. ఒక్కసారి కొనుక్కున్న తర్వాత, ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యతని సదరు ఓటీటీలే తీసుకుంటున్నాయి కాబట్టి, నిర్మాతలకి ప్రచార ఖర్చు కూడా కలిసొచ్చినట్టే. కావాల్సిందల్లా సరుకులో నాణ్యత. సినిమాల్లో జనరంజకత్వం.

గడిచిన ఏణ్ణర్ధంలో ఓటీటీలో వచ్చిన సినిమాల్లో అధికశాతం నిరాశ పరిచాయి. కొన్నైతే, ఓటీటీ రిలీజ్ జరగడం వల్ల ఆయా నిర్మాతలు నష్టాల నుంచి బయట పడ్డారు కూడా. అయితే కొత్తదనం ఏమాత్రం లేకుండా అదే పడికట్టు పద్ధతిలోనూ, లేకపోతే సెన్సార్ గడబిడ ఉండదు కాబట్టి మసాలాలు దట్టించీ తీసిన సినిమాలని ఓటీటీలోకి వదిలారు. వీటిలో రివైండ్ చేసి చూసుకున్న వాటికన్నా, స్కిప్పులు కొట్టినవే ఎక్కువ కావడం విషాదం. 'ఓటీటీ అంటే ఇంత చిన్నచూపా?' అనిపించే లాంటి సినిమాలూ వచ్చి పడ్డాయి. ఈ చిత్రరాజాలు థియేటర్లలో విడుదలై ఉంటే బోల్డంత డబ్బు ఖర్చు పెట్టుకుని చూసిన ప్రేక్షకులు గగ్గోలు పెట్టి ఉండేవాళ్ళు. అందుబాటులోకి వచ్చిన ఓ కొత్త మాధ్యమాన్ని ఉపయోగించడం కన్నా, దుర్వినియోగం చేసేవాళ్ళే ఎక్కువయ్యారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం జనాలు ఓటీటీ సినిమా అంటే భయపడే రోజు ఎంతో దూరంలో ఉండదు. ఓటీటీలో ఒక్క 'శంకరాభరణం' కూడా ఎందుకు రాలేదన్నది కోటి రూపాయల ప్రశ్న. 

4 కామెంట్‌లు:

  1. బహుశా మంచి సినిమాలు తీయగలిగిన సత్తా ఉన్న వాళ్లు కూడా పెద్ద బేనర్ల లో ఇరుక్కుపోయి ,కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని ఆ 'ఒక్క ఛాన్స్ ' కోసం ఎదురు చూస్తూ ఓటీటీ వైపు దృష్టి సారించటంలేదేమో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అదే ఆశ్చర్యమండీ.. ఓ పక్క అవకాశాలు రావడం లేదంటారు, ఉన్న ప్లాట్ఫామ్ ని సరిగ్గా ఉపయోగించుకోకుండా తలాతోకా లేని కంటెంట్ తో నింపుతున్నారు.. వాళ్ళ లెక్కలేంటో మనకి తెలీదు కదా.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  2. /“ …. సెన్సార్ గడబిడ ఉండదు కాబట్టి ….”//

    అదేమిటి, OTT అయినంత మాత్రాన సెన్సార్ నుండి మినహాయింపు ఇచ్చేస్తే ఎలాగ? థియేటర్ సినిమాలకు వర్తించే రూల్స్ OTT సినిమాలకు, series లకు కూడా వర్తిస్తాయని అనుకున్నానే? కాదా? అసలు ఎందుకు మినహాయించాలి? సినిమాను ఎక్కడ ప్రదర్శించాలి అన్నదానికి, సెన్సార్ కు సంబంధం ఏమిటి? మినహాయింపు ఇచ్చి, మీరే స్వీయనియంత్రణ పాటించండి అనడం హాస్యాస్పదం. advertisements విషయంలో, టీవీ కార్యక్రమాల విషయంలోనూ సోకాల్డ్ స్వీయనియంత్రణ ఏమాత్రం పని చేస్తోందో చూస్తున్నాంగా?

    అంత సరళీకరణ సమాజానికి హానికరం అవుతుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రస్తుతానికైతే ఓటీటీ కంటెంట్ కి సెన్సార్ లేదండీ.. ఏర్పాటు చేయాలన్న చర్చ జరుగుతోంది.. ఈ మాధ్యమం కూడా బాగానే దుర్వినియోగం అవుతోంది.. ధన్యవాదాలు.. 

      తొలగించండి