మంగళవారం, నవంబర్ 27, 2012

బీన్స్ కూరలు...

ఆ మధ్య ఎప్పుడో ఓ సందర్భంలో బ్లాగు మిత్రులొకరు సింపుల్ గా చేసుకోగలిగే వంటల గురించి రాస్తే బావుంటుంది అన్నారు. ఇప్పటివరకూ పులిహోర, నూడుల్స్, ఉప్మా మరియు స్నాక్స్ గురించి అప్పుడప్పుడూ చెప్పుకున్నాం కదూ. ఇవాళ కూరల సంగతి చూద్దాం. అంటే మొత్తం అన్ని కూరల గురించీ కాదు, ఇంగ్లీష్ కూరలైన బీన్స్, కేరట్, టమాటాలతో తక్కువ టైంలో, తక్కువ శ్రమతో, వీలైనంత రుచిగా చేసుకోగలిగే కూరల కబుర్లు అన్నమాట. పదండి, అలా వంటింట్లోకి వెళ్లి మాట్లాడుకుందాం.

శీతాకాలం వచ్చేసింది కదా, నాలుక కొంచం ఖారం ఖారం, ఘాటు ఘాటు రుచులు కోరుకుంటుంది. అల్లం, పచ్చిమిర్చీ ఉన్నది అందుకే కదూ. ఆ రెంటినీ సన్నగా తరిగి పక్కన పెట్టండి ముందు. బీన్సూ, కేరట్టూ ఒకే సైజు ముక్కలు కోసేసుకుంటే మరో పని కూడా అయిపోతుంది. కుక్కర్లో బియ్యం ఎలాగూ పెడతారు కదూ, ఆ గిన్నె మీద మూత పెట్టేసి ఈ బీన్సు, కేరట్టు ముక్కలని మూత మీద సద్దేసి, ఓ చిటికెడు పసుపు జల్లేసి, కుక్కరు మూత బిగించి స్టవ్ మీదకి ఎక్కించేయండి. నాలుగంటే నాలుగే విసిల్స్ రానిచ్చి, స్టవ్ కట్టేయండి.

ఇయర్ ఫోన్స్ లో కనుక ఆర్.నారాయణమూర్తి పాటల్లాంటివి వస్తూ ఉంటే, అర్జెంటుగా మార్చేసి ఇళయరాజాకో, కేవీ మహదేవన్ కో షిఫ్ట్ అయిపోండి ముందు. ఇప్పుడు బాండీని రెండో స్టవ్ మీద పెట్టి, కించిత్ వేడెక్కాక ఓ చెంచాడు నూనె పోయండి. మరీ ఎక్కువ అక్ఖర్లేదు. నూనె తగుమాత్రం వేడెక్క గానే, తరిగి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి, ఓ వేపు రానిచ్చి, పచ్చిమిర్చి చేర్చండి. ఇవి వేగుతూ ఉండగా శనగపప్పు, చాయ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కాసిన్ని మెంతులు చేర్చి వేగనివ్వండి. గరిటతో కదుపుతూ ఉండక్కర్లా.. ఈలోగా టమాటాలు ముక్కలు కోసుకుని, బాండీ లోకి జార విడవొచ్చు.


టమాటా ముక్కలు వేసేశాక బాండీ మీద మూత పెట్టి, వింటున్న పాట సగం అవ్వగానే ఆ మూత తీసేయాలి. టమాటా ముక్కలు ఇట్టే మెత్తబడతాయన్న మాట. కుక్కర్ చల్లారింది కదా. జాగ్రత్తగా విసిల్ తీసేసి, ఒక్క క్షణం ఆగి మూత తీసి, మరో క్షణం ఆగి, ఆవిరి బయటికి పోగానే ఉడికిన బీన్సూ, కేరట్టూ ముక్కలని గరిటె సాయంతో బాండీలోకి బదలాయించాలి. ఓ తిప్పు తిప్పేసి, బాండీ మీద మూత పెట్టేయాలి. బాండీలో తడి తక్కువగా ఉన్నట్టాయనా, మూత మీద కాసిన్ని నీళ్ళు చిలకరించాలి. ఈ బ్రేక్ లో కొత్తిమీర సంగతి చూద్దాం. రెండు తాజా మొక్కలు తీసుకుని, ఓసారి కడిగేసి వేళ్ళు కోసి పడేసి, నీళ్ళు పిండేసి మిగిలింది సన్నగా తరిగి పెట్టుకోవాలి.

కొత్తిమీర పని అయ్యాక, బాండీ మూత తీసి, కూర ఓసారి కలిపి, ఉప్పు వేసి మళ్ళీ కలిపి, మళ్ళీ ఓ క్షణం మూత పెట్టి తియ్యాలి. రుచికి కావలిస్తే ఓ పావు స్పూను చక్కర కూడా చేర్చుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు కొత్తిమీర జల్లేసి, మరో క్షణం మూత పెట్టి ఉంచి, స్టవ్ కట్టేయడమే. ఒకవైపు వేడన్నం, మరోవైపు వేడి వేడి కూర...మధ్యలో నేనెందుకు చెప్పండి? కూర వండగా మిగిలిన బీన్సూ, కేరట్టూ రెండు రోజులకి వాడు మొహం వేసేస్తాయి. అలాగని రేపు కూడా ఇదే కూర తినలేం కదా.. ఉపాయం లేని వాడిని ఊరి నుంచి తరిమేయమని సామెత.. ఊళ్ళో ఉండడం కోసం ఉపాయాలు సిద్ధం పెట్టుకుని ఉండాలన్న మాట. ఇదే కూరని మరో రుచి వచ్చేలా చేసుకోడం ఎలాగో చూద్దాం ఇప్పుడు.

అల్లం, పచ్చిమిర్చీ బదులుగా ఎండు మిరపకాయలని తీసుకుని ముక్కలుగా తుంపుకోండి. ఒక స్పూను నూనె సహితంగా బాండీ వేడెక్కగానే, ముందుగా ఎండుమిర్చి ముక్కలని వేగనివ్వండి. అవి వేగుతూ ఉండగానే శనగపప్పు, చాయ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులూ మామూలే. ఇవి వేశాక టమాటా ముక్కల కన్నా ముందు కాసిన్ని ఉల్లిపాయ ముక్కలు చేర్చండి. ఈ ఉల్లి ముక్కలు బంగారు వర్ణంలోకి వేగాక (వేలికి ఉన్న ఉంగరాన్నీ, వేగుతున్న ఉల్లిపాయ ముక్కలనీ మార్చి, పోల్చి, చూడక్కర్లేదు) అప్పుడు టమాటా ముక్కలు చేర్చండి. కొత్తిమీర గార్నిష్ తో సహా మిగిలిన విధానంలో ఏ మార్పూ లేదు. వేడి వేడి కూర వడ్డించుకుని రుచిలో తేడా గమనించడం మర్చిపోకండి.

జెండాకూర అనీ, అదికూడా చేసేసుకోవచ్చు కాసిన్ని బంగాళా దుంప ముక్కలు చేర్చుకుని. కుక్కర్లో పెట్టేప్పుడే బీన్సూ, కేరట్టూ ముక్కలతోపాటు, చెక్కు తీసిన బంగాళా దుంపల ముక్కలు కూడా చేర్చేసుకుని, పసుపు వేయకుండా ఊరుకోవాలి. అల్లం పచ్చిమిర్చీ తో అయితే ఉల్లి లేకుండానూ, ఎండుమిర్చి కారం అయితే ఉల్లి చేర్చీ రెండు రకాలుగానూ చేసేసుకోవచ్చు కూరని. గార్నిష్ కూడా కొత్తిమీర బదులు, పుదీనా ప్రయత్నించవచ్చు, ఇష్టమైతేనే సుమా. ఈ కూరలు కేవలం అన్నంలోకి మాత్రమే కాదు, చపాతీలు, రొటీల్లోకి కూడా భలే బావుంటాయి. అన్నట్టు, కేవలం చపాతీల కోసం చేసుకునే కూరలు ఉన్నాయి. వాటి విషయాలు మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం.  రుచి గలదని మిక్కిలి తినరాదు కదా మరి.

గురువారం, నవంబర్ 01, 2012

ఓ జ్ఞాపకం... కృష్ణశాస్త్రిది...

"లిఫ్టు కావాలి సార్"
"చంద్రంపాలెం వెడుతున్నాం"
"మా ఊరేనండి.. థాంక్సండీ బాబూ.. రెండు కిలోమీటర్లు నడవాల్సొచ్చేది.."
"ఎవరింటికి మీరు?"
"ఉహు... ఎవరింటికీ కాదు.. ఊరికే...ఊరు చూద్దామని.."
"నిజం చెప్పండే.. ఊరికే మా ఊరు ఎవరొస్తారు?"


"మీ ఊళ్ళో స్కూలు ఉంది కదండీ.. అది చూద్దామని.."
"దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి స్కూలు..."
"ఓహ్.. ఆయన పేరు తెలుసా మీకు?"
"అయ్ బాబోయ్... ఏటా ఆయన పుట్టిన్రోజు సేత్తాం కదండీ.. ఆయాల అన్నీ ఆయన పాటలే ఏస్తాం మైకులో... 'గోరింటా పూసింది కొమ్మాలేకుండా..' ఇంకా సాలా పాటలు.."
"బాగా పాడుతున్నారు.. పాడండి.. పాడండి.."
"అంత బాగా రావండి.. 'ఆకులో ఆకునై.. కొమ్మలో పువ్వునై.."
"కొమ్మలో కొమ్మనై అండీ.. పాడండి..."
"ఆరు బేమ్మలు కామోలు.. మీరు గానీ సుట్టాలా?"
"కాదండీ.. ఆయన ఇల్లు చూద్దామని వెళ్తున్నాం"
"ఆయన ఇల్లే స్కూలికి ఇచ్చేశారండి.. అక్కడే ఇగ్రహం కూడా పెట్టావండి, ఆయంది.. ఆరి పిల్లలూ గట్రా ఒచ్చారండి అప్పుడు .."
"మీ వయసు చూస్తే, ఆయన పేరు కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు అనిపించింది"
"నిజం సెప్పాలంటే తెల్దండి.. ఇగ్రహం పెట్టాక, పుట్టినరోజులు సేత్తన్నారు కదండీ.. అప్పట్నుంచీ తెలుసు"
"మీరు...?"
"ఈరబాబంటారండి. కాకినాట్లో పెట్రోలు బంకులో సేత్తన్నానండి.. రోజూ ఎల్లొస్తా ఉంటాను..ఊళ్ళో సొంతిల్లండి.."
"పిఠాపురం రాజా వారికీ కృష్ణ శాస్త్రి గారికీ మంచి స్నేహం ఉండేదంటారు?"
"తెల్దండీ.. ఇప్పుడారి కోటా లేదక్కడ.. ఏయో గుర్తులు మాత్రం ఉన్నాయ్ లెండి..."
"భలేగా ఉందండీ మీ ఊరు.. పచ్చగా..."


"ఈ ఊరు చూసే రాసుంటారండి.. 'మేడంటే మేడా కాదూ...' భలే పాట కదండీ.."
"మీకు కృష్ణశాస్త్రి గారి పాటలన్నీ నోటికి వచ్చేసినట్టే ఉన్నాయే.."
"అంటే మరి, ప్రెతి సంవత్సరం ఆయన పుట్టిన్రోజుకి మైకులో ఈ పాటలే ఏసుకుంటాం కదండీ...కానీ, మాకు పెద్ద బాగోందండి ఊరు..రోడ్డు సరింగా లేదు.. ఆటోలు కూడా గమ్మున్రావు..కానైతే, అయన వల్ల పేరండి.. "
"బయటి నుంచి వచ్చిన వాళ్ళకే నచ్చుతుందన్న మాట అయితే..."
"అంతేనండి... ఇక్కడోసారి ఆపండి.. నే దిగుతాను.. తిన్నగా ఎల్లి, సెంటర్లో లెఫ్టు తిరగండి.. స్కూలు కనిపిత్తాది.. అక్కణ్ణుంచి మీరు తిన్నగా ఎల్లిపోవచ్చు.. ఆ రోడ్డు బాగుంటాది దీనికన్నా.."


"థాంక్స్ అండీ.."
"అయ్ బాబోయ్.. ఎంతమాటా.. నేను చెప్పాలండి.. మీరు లేకపోతే నడుచుకుంటా రావాల్సొచ్చును ఇంతదూరం.." 

(తెలుగునాట భావకవితకి పర్యాయపదంగా నిలిచిన దేవులపల్లి  వేంకట కృష్ణశాస్త్రి జయంతి నేడు)