గురువారం, మే 23, 2019

చంద్రబాబు పొరపాట్లు

కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత 2014 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చిన అంశం ఒక్కటే - వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు వైఎస్  జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారనీ, ప్రజల సొమ్ము లక్ష కోట్ల రూపాయలు సొంతానికి వెనకేసుకున్నారనీ. ఇతరత్రా కారణాలతో పాటు, ఈ 'అవినీతి' ప్రచారమూ తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాడానికి కలిసొచ్చిందన్నది నిర్వివాదం. చంద్రబాబు, ఇతర నాయకుల ప్రచారావేశం చూసిన ప్రజల్లో కొందరైనా కొత్త ప్రభుత్వం ఏర్పడగానే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లడం ఖాయం అని భావించారు. తెలుగు దేశం అధికారం లోకి వచ్చింది, కానీ, జగన్మోహన్ రెడ్డి మీద చేసిన అవినీతి ఆరోపణలు రుజువు కాలేదు.

ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలొచ్చాయి. జగన్ లక్ష కోట్ల అవినీతి పరుడు అంటూ చంద్రబాబు మళ్ళీ పాత పల్లవి అందుకున్నారు. మరి ఐదేళ్ల పాటు ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోలేదు అంటే జవాబు దొరకదు. జగన్ అవినీతిని చంద్రబాబు కేవలం ఎన్నికల అంశంగా మాత్రమే చూస్తున్నారన్న ఆలోచన జనంలోకి వెళ్ళింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మిత్రపక్షం బీజీపీతో నాలుగేళ్లకు పైగా సత్సంబంధాలు నెరిపిన కాలంలో కూడా అవినీతి ఆరోపణల కేసుల్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు ఏమాత్రం ప్రయత్నాలు జరిగాయన్నది తెలీదు. ఫలితం 'అవినీతి జగన్' ఆరోపణల్ని జనం ఈసారి సీరియస్ గా తీసుకోలేదు. ఆరోపణల్లో నిజం ఉండి, తన పార్టీ నేతల చేత ప్రత్యర్థి మీద కేసులు వేయించడంతో ఊరుకోకుండా, వాటి పురోగతి విషయంలో కూడా చంద్రబాబు శ్రద్ధ చూపి ఉంటే ఇవాళ ఎన్నికల ఫలితం మరోలా ఉండేది బహుశా.

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తన వ్యవసాయ విధానాలతో రైతులకి దూరమైన చంద్రబాబు, గత ఎన్నికలకి ముందు సంపూర్ణ రైతు రుణ మాఫీ హామీ ప్రకటించారు. సహజంగానే రైతుల్ని ఇది ఆకర్షించింది. కానీ, హామీ అమలు విషయానికి వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. అర్హుల్ని నిర్ణయించడం మొదలు, పంపిణీ వరకూ రుణ మాఫీని నానారకాలుగా నీరుకార్చడంతో విసిగిపోయిన రైతులకి, రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేసేసిందంటూ చేసిన భారీ ప్రచారం పుండు మీద కారంలా మారింది. స్వయం శక్తి సంఘాల మహిళల రుణమాఫీదీ ఇదే తీరు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు రావడం మీద కన్నా, నియోజకవర్గాల పునర్విభజన మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం, మెజారిటీ ప్రజల సెంటిమెంట్ అయిన ప్రత్యేక హోదాని చిన్నబుచ్చుతూ మాట్లాడ్డం చంద్రబాబు స్థాయి నేత చేయాల్సిన పనులు కావు.

స్థాయికి తగని వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కోవడం చంద్రబాబుకి గతంలోనూ అనుభవమే (లక్ష్మీ సెహగల్ ఎవరో తనకి తెలీదనడం లాంటివి) కానీ గడిచిన ఐదేళ్ళలో అలాంటి సందర్భాల సంఖ్య మరింత పెరిగింది. వయసు, అనుభవంతో పాటు హుందాతనాన్ని పెంచుకోవాల్సిన ఉండగా, అలా కాకుండా జనం నొచ్చుకునేలా మాట్లాడడం, క్షమాపణ ప్రస్తావనే లేకపోవడం కొన్ని వర్గాలని నొప్పించింది. ఇక, ప్రతిపక్షానికి సంబంధించిన విషయాల్లో అయితే హుందాతనం ప్రసక్తే లేదు. ఓటుకి నోటు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు లాంటి విషయాలని ఓటర్లు గమనించారని, గుర్తు పెట్టుకున్నారని ఈ ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. ప్రధాని మీద కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగని విధంగా విమర్శలు చేయడం కొందరు వోటర్లని తెలుగుదేశం పార్టీకి దూరం చేసింది. కాంగ్రెస్ తో పెట్టుకున్న పొత్తయితే చాలామంది తెలుగుదేశం వారినే విస్మయపరిచింది.

'జలయజ్ఞం' లో అవినీతి జరిగిందంటూ పదేపదే విమర్శలు చేసిన చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టు వ్యయం విషయంలో పారదర్శకతని చూపలేకపోయారు. జనానికి జవాబుదారీగా ఉండడం మాట అంటుంచి, నిధులు విడుదల చేసిన కేంద్రానికే లెక్కలు చెప్పలేదన్న ఆరోపణలున్నాయి. ప్రాజెక్టు కోసం కేటాయించిన నిధుల్ని ఇతర ఖర్చులకి వాడడాన్ని కాగ్ ఎత్తిచూపినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. గత ఐదేళ్లుగా జరిగిన వృధావ్యయానికి లెక్కేలేదు. ప్రత్యేక విమానాల్లాంటి ప్రత్యేక ఖర్చులు అదనం. ఎన్టీఆర్ వెన్నుపోటు నుంచి మొన్నటి 2014 సార్వత్రిక ఎన్నికలవరకూ ఎప్పుడూ పొత్తు లేకుండా పోటీ చేయని చంద్రబాబు, మొదటిసారిగా అన్ని స్థానాలనుంచీ తన పార్టీ వారినే నిలిపే ప్రయోగం చేశారు. ఇందుకు దారితీసిన పరిస్థితులు ఏవైనప్పటికీ, ఫలితం మాత్రం తేడా కొట్టేసింది.

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఖాళీ ఖజానా మొదలు, ప్రస్తుతం జరుగుతున్న పనులు పూర్తి చేయడానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోడానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతాయి. కేంద్ర ప్రభుత్వానికి సొంత మెజారిటీ ఖాయంగా కనిపిస్తోంది కాబట్టి, పార్టీ ఎంపీల ద్వారా ఒత్తిడి చేసి నిధులు సాధించుకునే వీలుండకపోవచ్చు. ప్రతిపక్షంలో సభ్యుల సంఖ్య మరీ తక్కువే అయినా, తొంభై శాతం ప్రసార సాధనాలు బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాయి. జగన్ ని వైఎస్సార్ తో పోల్చి చూడడం అనే సవాలు ఒకటుంది. వారసత్వ రాజకీయాల్లో ఇది తప్పదు. రాష్ట్రంలో వాడవాడలా అవినీతి జెడలు విప్పుకుని నాట్యం చేస్తోందంటూ రేపటినుంచే కథనాలు మొదలైనా ఆశ్చర్యం లేదు.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటినుంచీ, రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేస్తే 'అభివృద్ధి' ఆగిపోతుందనీ, అవినీతి పెరిగిపోతుందనీ కొందరు పౌరులు ఆవేదన చెందుతూ వచ్చారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మాత్రం ఆగిపోయేంత అభివృద్ధి, పెరగడానికి అవకాశం ఉన్న స్థాయిలో అవినీతి రాష్ట్రంలో లేవనే భావించినట్టున్నారు. తొమ్మిదేళ్లపాటు అలుపెరగకుండా చేసిన కృషి, ఎదురుదెబ్బలు తట్టుకుని నిలబడ్డ ఓరిమి, మొండితనాలతో పాటు చంద్రబాబు చేసిన పొరపాట్లు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని దక్కించుకోడానికి దోహదం చేశాయనడంలో సందేహం లేదు. పొరపాట్లకు ఫలితంగా తన రాజకీయ అనుభవం అంత వయసున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండే సభలో తాను ప్రతిపక్ష పోషించాలి. చంద్రబాబు అనుభవాల నుంచి జగన్ ఏమన్నా నేర్చుకుంటారా అన్నది వేచి చూడాల్సిన విషయం.

శనివారం, మే 18, 2019

రాళ్ళపల్లి ...

చిరంజీవి-కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన 'అభిలాష' సినిమాలో, చిరంజీవికి ఉరిశిక్ష రద్దయ్యే సన్నివేశం గుర్తుందా? ఓ పక్క ఉరి తీయడానికి ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటే, రద్దు వార్తని జైలు అధికారులకి చెప్పడానికి రొప్పుతూ, రోజుతూ పరిగెత్తుకు వచ్చే సెంట్రీ గుర్తున్నాడా? గుండెలవిసే పరుగు.. అల్లం శేషగిరిరావు 'చీకటి' కథలో డిబిరిగాడి పరుగులాంటి పరుగు. నటుడు రాళ్ళపల్లిని ఎప్పుడు తల్చుకున్నా నాకు మొదట గుర్తొచ్చేది 'అభిలాష' సినిమాలో ఈ సన్నివేశమే. ఆ సినిమాకి ముందు, తర్వాత కూడా రాళ్ళపల్లి ఎన్నో మంచి పాత్రలు చేశారు. కానీ, నావరకూ 'అభిలాష' ప్రత్యేకం. 
 

ఎప్పుడా సినిమా చూస్తున్నా, ఆ సన్నివేశం రాగానే ఊపిరి బిగపడతాన్నేను. తెరమీద జైలు సెంట్రీ పరిగెడుతుంటే, నా డొక్కలు ఎగిరిపడుతున్న అనుభూతి కలుగుతుంది. రాళ్ళపల్లి కన్నా సెంట్రీనే కనిపిస్తాడు (యూట్యూబ్ లో ఉన్న వీడియోలో ఈ పరుగు సీన్ ఎడిట్ అయిపొయింది). ఇలాంటి సీరియస్ పాత్రలే కాదు, కడుపుబ్బా నవ్వించే కామెడీ పాత్రల్నీ అలవోకగా చేసేశారు. కావాలంటే 'సిలోన్ సుబ్బారావ్ బావ' ని గుర్తు చేసుకోండి. అసలా పాత్ర లేకపోతే 'శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డేన్స్ ట్రూప్' సినిమా రెండోసగం ఎంత వెలితిగా ఉండేదో కదా. ఆ వెంటనే మణిరత్నం 'బొంబాయి' సినిమా చూస్తే అర్ధమవుతుంది రాళ్ళపల్లి బహుముఖీనత.

తనతరం నటులు చాలామంది లాగే, రాళ్ళపల్లి కూడా రంగస్థలం నుంచే సినిమా రంగానికి వచ్చారు. అదికూడా, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసుకుని. సాధారణంగా అనిపించే ముఖ కవళికలు, ఎలాంటి మాడ్యులేషన్నైనా అలవోకగా పలికించేయగల స్వరం, వీటి సాయంతో ఎలాంటి పాత్రనైనా అర్ధంచేసుకుని, సొంతం చేసేసుకునే నటనా పటిమ. వేసిన పాత్ర ఏదైనా, కేవలం పాత్ర మాత్రమే కనిపించేలా నటించడం ఆషామాషీ విషయం కాదు. మంచి చదువరి, రచయిత కూడా అయిన రాళ్ళపల్లి, సినిమాల్లోకి వచ్చాక నటన మీద మాత్రమే దృష్టి పెట్టి, రచనని పక్కన పెట్టేశారు. రచయిత, నటుడు తనికెళ్ళ భరణిని తన శిష్యుడిగా సినిమా రంగానికి అందించారు.

రాళ్ళపల్లి ఈడువాళ్ళు, ఇంకాస్త పెద్దవాళ్ళు ఇచ్చిన, ఇస్తున్న టీవీ ఇంటర్యూలు చూస్తున్నప్పుడు ఎక్కడో ఓచోట వాళ్ళు తమకి రావాల్సినంత పేరు, అవార్డులు రాలేదనో, సంపాదించుకోవాల్సినంత డబ్బు సంపాదించలేదనో చెప్పడం కనిపిస్తుంది. కానీ, రాళ్ళపల్లి నుంచి అలాని ఫిర్యాదు వినిపించలేదు. 'నా పని నేను చేశాను' అన్న నిమిత్తమాత్రపు ధోరణే కనిపిస్తుంది. వ్యక్తిగత జీవితంలో వరసగా తగిలిన ఎదురు దెబ్బలు ఎంతగానో రాటుదేల్చాయి ఆయన్ని. అందుకే కాబోలు, సంపాదన, ఆస్తుల బెంగలేదు. 'ఓ ప్రభుత్వోద్యోగి కన్నా ఎక్కువే సంపాదించా' అని ఊరుకున్నారు. ఆరోగ్యం విషయంలో కూడా అదే నిర్లిప్తత.

ప్రేక్షకుల్లో చాలామంది రాళ్ళపల్లి నటనకి అభిమానులైతే, సినిమావాళ్లలో చాలామంది ఆయన చేతివంటకి అభిమానులు. జంధ్యాల మొదలు కమల్ హాసన్ వరకూ ఆ జాబితా చాలా పెద్దది. కమల్ అయితే 'శుభసంకల్పం' షూటింగ్ అప్పుడు, 'మీరు నటుడిగా రిటైర్ అయ్యాక నాదగ్గరికి వచ్చేయండి, వండి పెడుదురుగాని' అని అడిగేశాడట. 'షూటింగ్ లో వంటంటే మనిష్టం. ఇంట్లో అయితే మా ఆవిడ ఒప్పుకోదు. నెలకి సరిపడా వంటనూనె, ఒక్కరోజులో ఖాళీ చేసేస్తానని..' ఈమాటా రాళ్లపల్లిదే. వెండితెరమీద ఎన్నో పాత్రలకి ప్రాణప్రతిష్ట చేసిన రాళ్ళపల్లి ఇక లేక లేరన్న వార్త బాధాకరం. నటనని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్లకి ఆయన పాత్రలు ఎన్నో కొత్తవిషయాలు చెబుతాయి. వారి ఆత్మకి శాంతి కలుగుగాక..

శనివారం, మే 04, 2019

మజిలీ

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఆమె తండ్రి వాళ్ళ ప్రేమకి అడ్డుపడ్డాడు. ఆమె ఉన్నట్టుండి అతని జీవితం నుంచి మాయమైపోయింది. ఆమె జ్ఞాపకాల్లో అతడు దాదాపు పిచ్చివాడైపోయాడు. ఎప్పటినుంచో అతన్ని మూగగా ప్రేమిస్తున్న ఇంకో అమ్మాయి అతన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంది. భార్యగా అతని జీవితంలో ప్రవేశించింది. అతని గతాన్ని, తనపట్ల అతని నిరాదరణనీ కూడా అంగీకరించింది. ఉందోలేదో తెలియని ప్రేయసిపై అతడి ప్రేమ, అతని లవ్ ఫైల్యూర్ ని భరిస్తున్న ఆమె ప్రేమ - ఈ రెండింటిలో ఏ ప్రేమ గెలిచిందన్నదే 'మజిలీ' సినిమా.

ఇంకోలా చెప్పాలంటే, 'సాగర సంగమం' కథానాయకుడు బాలూ డాన్సర్ కాక క్రికెటర్ అయి ఉంటే, మాధవి మీద అతడి ప్రేమ తెలిసీ మరో స్త్రీ అతని జీవితంలో ప్రవేశించి, బాలూ మనసు మారడం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఏం జరిగి ఉండేదన్న ఊహాజనిత ప్రశ్నకి జవాబు 'మజిలీ' సినిమా. మిగిలిన ఏ విషయాల్లోనూ పోలిక కుదరదు కానీ, స్టోరీలైన్ మాత్రం అలనాటి విశ్వనాధ్-కమల్-జయప్రద-ఇళయరాజాల క్లాసిక్ ని గుర్తుచేసి తీరుతుంది, 'శైలజ' ప్రవర్తనతో సహా.

వైజాగ్ కుర్రాడు పూర్ణ (అక్కినేని నాగచైతన్య) రైల్వే టికెట్ కలెక్టర్ జగన్నాధరావు (రావు రమేష్) గారబ్బాయి. ఐటీఐ చదువుతూ, క్రికెట్ ని లక్ష్యంగా ఎంచుకుని స్థానిక టీమ్ లో ప్రవేశం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. క్రికెట్ ఆడే అవకాశం, అన్షు (దివ్యాంశ కౌశిక్) తో పరిచయం ఒకేసారి జరుగుతాయి. కుర్రాడు క్రికెట్లో దూసుకుపోవడం, అన్షుతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోవడం కూడా సమాంతరంగా జరుగుతున్న తరుణంలో, నేవీలో పనిచేసే అన్షు తండ్రికి వీళ్ళ ప్రేమకథ తెలిసి, ఆమెని దూరంగా తీసుకుపోతాడు. 

స్థానిక రాజకీయాల కారణంగా క్రికెట్ టీం లో చోటు దొరకదు పూర్ణకి. దీంతో అప్పటివరకూ క్లీన్ షేవ్ తో ఉన్నవాడు కాస్తా గడ్డం పెంచుకుని తాగుబోతైపోతాడు. ఎప్పటికైనా అన్షుని కలుసుకోడం మాత్రమే అతని జీవిత లక్ష్యం ఇప్పుడు. పూర్ణ సంగతులు పూర్తిగా తెలిసిన ఎదురింటి అమ్మాయి, రైల్వేలో బుకింగ్ క్లర్క్ గా పనిచేస్తున్న శ్రావణి (సమంత రూత్ ప్రభు) అతన్ని తప్ప మరొకర్ని పెళ్లిచేసుకోనని పంతం పట్టి మరీ అతని జీవితంలోకి ప్రవేస్తుంది. అతను తనని ఏమాత్రమూ పట్టించుకోకపోయినా, పూర్ణ మీద ఈగ వాలనివ్వదు. తన తల్లిదండ్రులతోనూ, మావగారితోనూ పోట్లాడి మరీ అతన్ని వెనకేసుకొస్తూ ఉంటుంది.

ఈ నేపథ్యంలో పూర్ణ, అన్షు తండ్రిని కలుసుకోడవం, ఏం జరిగిందో తెలుసుకోవడంతో పాటు, అతడు తనకి అప్పగించిన బాధ్యతని తీసుకోవడం, ఆ బాధ్యత నెరవేర్చడానికి శ్రావణి తన వంతు సాయం చేయడం తర్వాతి కథ. ఇంతకీ, ఆ 'సాయం' పూర్ణ-శ్రావణి లని దగ్గర చేసిందా అన్నది ముగింపు. శ్రావణి అనే ఐడియలిస్టిక్ పాత్ర ఈ సినిమా విజయానికి దోహదం చేసిందన్నది ఒప్పుకోవాల్సిన విషయం. బాయ్ ఫ్రెండ్/భర్తకి ఓ అభిమాన కథానాయిక ఉండడాన్ని కూడా జీర్ణించుకోలేని 'పొసెసివ్' అమ్మాయిలున్న కాలంలో, దర్శకరచయిత శివ నిర్వాణ శ్రావణి పాత్రతో రావడం, కమర్షియల్ గా మంచి తెలివైన ఆలోచన అని చెప్పాలి. శ్రావణిగా సమంత రెండో సగం అంతా తానై సినిమాని నిలబెట్టింది.

నాగచైతన్య చాలాచోట్ల తన తాత నాగేశ్వరరావు ని గుర్తు చేశాడు. క్లీన్ షేవ్ తో కన్నా, గెడ్డంతోనే బావున్నాడు. రావు రమేష్, పోసాని, సుబ్బరాజులవి పూర్తి నిడివి పాత్రలు. వీళ్ళతో పాటు, హీరో ఫ్రెండ్స్ గా వేసిన కుర్రాళ్ళూ బాగా చేశారు. సినిమాలో చాలాభాగం విశాఖపట్నంలోనే షూట్ చేశారు. అయితే, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తీసినప్పుడు లొకేషన్ల ఎంపికలో మరికొంచం జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది అనిపించింది. తమన్-గోపీ సుందర్ ల సంగీతం పర్లేదు. ఒక హాంటింగ్ ట్యూన్ ఉంటే మరింత బాగుండేది. హాస్యాన్ని కథలో భాగం చేసి, బరువైన సన్నివేశాలకి ముందూ వెనుకా ఒకట్రెండు నవ్వించే సీన్స్ వచ్చేలా జాగ్రత్త పడ్డం వల్ల ప్రేక్షకుల మీద మరీ ఎక్కువ బరువు పడలేదు. మొత్తంగా చూసినప్పుడు, చూడాల్సిన సినిమా ఇది.