బుధవారం, మే 09, 2018

మహానటి

'మహానటి' అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు సావిత్రి. దక్షిణ భారత సినీ పరిశ్రమ మీద తనదైన ముద్ర వేసి, సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని నిర్మించుకున్న సావిత్రి భౌతిక ప్రపంచాన్ని విడిచి దాదాపు నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా, ఆమె కథ సినిమాగా రికార్డు అవ్వలేదు. బహుశా, నాగ్ అశ్విన్ అనే యువ దర్శకుడి కోసమే ఆ అవకాశం ఇన్నాళ్లూ వేచి చూసిందేమో అనిపించింది, వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 'మహానటి' సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వస్తుంటే. ఒక్కమాటలో చెప్పాలంటే, వెండితెర మీద సావిత్రి ఎంత గొప్ప నటో, ఆమెకి అంత గొప్ప నివాళి ఈ సినిమా.

నిజానికి సావిత్రి జీవితం తెరిచిన పుస్తకం. బోళాతనం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్తత్వం అవ్వడం వల్ల, చాలామంది నటీనటుల్లాగా ఆమె తన గతానికి రంగులు పూసి చూపించే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా, ఆమె జీవితం మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కొన్ని నేరుగా ఆమె జీవితకథలుగానే ప్రకటించబడితే, మరికొన్ని ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకొని తయారైన కథలుగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ కథలన్నీ కాచి వడబోసి, నిజాలు నిగ్గుతేల్చి, ఆమె వ్యక్తిత్వాన్ని పట్టుకుని, ఆమె తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల తాలూకు మూలాల్నివెలుగులోకి తెచ్చి, ఈ నాటికీ ఆమెని అభిమానించే అశేష ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం చేయడం మామూలు విషయం కాదు. ఆ ప్రయత్నం చేసిన దర్శక నిర్మాతలకి ముందుగా అభినందనలు.


చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని, తనని ఏమాత్రం ఇష్టపడని పెదనాన్న పంచకి తల్లితో సహా చేరుకున్న ఓ అమ్మాయి మొదట నాటకాల్లోనూ, అటు తర్వాత సినిమాల్లోనూ చేరి మహానటిగా ఎదగడం, ఈ ఎదిగే క్రమంలో తీసుకున్న నిర్ణయాలు, చేసుకున్న అలవాట్ల ఫలితంగా కెరీర్నీ, డబ్బుని, మనుషుల్నీ నష్టపోయి మరణం అంచుకి చేరుకోటం.. ఇది ప్రధాన కథ. గొప్ప పేరు ప్రఖ్యాతులున్న నటీమణి కోమాలోకి జారి, ఎవరూలేని అనాధగా హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నప్పుడు, ఆమె జీవితంలో ప్రజలెవరికీ తెలియని సంఘటనల్ని పరిశోధించి ప్రచురిస్తే ఆ కథనాలు సేలబుల్ అవుతాయని భావించే ఓ పత్రికా, ఆ పత్రికలో కొత్తగా చేరి తనని తాను నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్న జర్నలిస్టు, ఆ జర్నలిస్టుని ప్రేమిస్తూ ఆమె ప్రేమకోసం ప్రయత్నించే ఫోటోగ్రాఫరు.. ఇది ఉప కథ.

ఈ రెండు కథల్నీ పడుగూ పేకలుగా అల్లి, సావిత్రి వ్యక్తిగత, వెండితెర జీవితాల్లో ముఖ్య సంఘటనలు వేటినీ విడిచిపెట్టకుండా నడిపించిన కథలో ప్రతి పాత్రకూ రీప్లేస్మెంట్ ఊహించలేని నటీనటులు, పాత్రోచితమైన సంభాషణలు, మీదుమిక్కిలి ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేసే నేపధ్య సంగీతం కలిసి 'మహానటి' ని ఓ గొప్ప సినిమాగా నిలబెట్టాయి. సినిమా చూసిన ప్రేక్షకులు, సావిత్రి అప్పటికే పెళ్ళై పిల్లలున్న జెమిని గణేశన్ కి రెండో భార్యగా వెళ్లడాన్ని మాత్రమే కాదు, ఆమె మద్యానికి బానిస కావడాన్ని కూడా ఒప్పేసుకోగలగడం దర్శకుడి విజయమే. అనారోగ్యంతో ఉన్న సావిత్రి ముఖాన్ని ఎక్కడా తెరమీద చూపించక పోవడమే కాదు, ఎండ్ టైటిల్స్ కి ముందు ఆమె నాటకాల రోజుల సన్నివేశాన్ని రి-ప్లే చేయడం ద్వారా ప్రేక్షకులు సావిత్రిని ఎలా గుర్తుపెట్టుకోవాలని తాను భావిస్తున్నాడో చెప్పకనే చెప్పాడు నాగ్ అశ్విన్.


నటీనటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది సావిత్రిగా నటించిన కీర్తి సురేష్ గురించి. ఈమె తప్ప ఇంకెవ్వరూ ఈ పాత్రని చేయలేరు అనిపించేలా నటించింది. ఒక మేకప్, కాస్ట్యూమ్స్ మాత్రమే కాదు, సావిత్రిగానూ, సావిత్రి నటించిన పాత్రలుగానూ కూడా ఒప్పించింది కీర్తి. జెమిని గణేశన్ గా నటించిన దుల్కర్ సల్మాన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి మమ్ముట్టి 'స్వాతి కిరణం' లో అనంత రామశర్మ పాత్రని ఎంత అలవోకగా నటించాడో, జెమిని గణేశన్ పాత్రని అంతే అలవోకగా ఒప్పించేశాడు దుల్కర్. సావిత్రి పెదనాన్న చౌదరి గా రాజేంద్రప్రసాద్ కి కీలకమైన పాత్ర దొరికింది. సావిత్రి నట జీవితంలోని సెలబ్రిటీల పాత్రల్లో నటులు, దర్శకులు మెరిశారు. ఏ పాత్ర ఔచిత్యానికీ భంగం కలగక పోవడం  మెచ్చుకోవాల్సిన విషయం.

సహాయ పాత్రల్లో నాకు బాగా నచ్చింది జెమిని గణేశన్ భార్య అలమేలు గా చేసిన మాళవికా నాయర్. ఆమె తెరమీద కనిపించేది రెండు మూడు సన్నివేశాలే అయినా అవి కథకి కీలకం కావడం వల్లా. కీర్తి, దుల్కర్ లతో పోటీపడి ఆమె నటించడం వల్లా ఆమె నటన గుర్తుండిపోతుంది. దర్శకుడి పనితనాన్ని గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎస్వీఆర్ గా నటించిన మోహన్ బాబు చేత కూడా అండర్ ప్లే చేయించి, ఎక్కడా మోహన్ బాబు కనిపించని విధంగా నటింపజేశాడు. సినిమా ప్రారంభ సన్నివేశం, ఇంటర్వెల్, ముగింపు వీటిని ఎంత శ్రద్ధగా ఎంచుకున్నాడో, సినిమాలో ప్రతి ఫ్రేమ్ నీ అంతే జాగ్రత్తగా ఎంచుకుని చిత్రించాడు. సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఈ సినిమాలో ఉండకపోవచ్చు, కానీ ఉన్న సన్నివేశాలన్నీ ఆమె జీవితంలో భిన్న కోణాలని, ఆమె వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని పరిచయం చేసేవే.


ప్రధాన కథ మీద ఎంత శ్రద్ధ చూపించాడో, ఉప కథనీ అంతే జాగ్రత్తగా మలిచాడు దర్శకుడు. ఉప కథలోని పాత్రలకి కూడా తమదైన వ్యక్తిత్వాన్ని ఇవ్వడం, ఉప కథ ముగింపుకి ప్రధాన కథతో లంకె వేయడం నాగ్ అశ్విన్ లో ఉన్న రచయిత తాలూకు ప్రతిభని పరిచయం చేస్తుంది. ఇంతకీ ఈ సినిమా ఇతడికి దర్శకుడిగా కేవలం రెండో ప్రాజెక్టు కావడం మరింత ఆశ్చర్యకరం. ఎంతో అనుభవజ్ఞుడిలా, పరిణతితో తీశాడు సినిమాని.  ప్రస్తావించుకోవాల్సిన మరో అంశం సంభాషణలు. గత శతాబ్దపు అరవై, డెబ్బై, ఎనభై దశకాలు, నాటి బెజవాడ, మద్రాసు ప్రాంతాలు, అక్కడి పలుకుబళ్లు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూనే పాత్రల వ్యక్తిత్వాలని ఎలివేట్ చేసే విధంగా క్లుప్తంగా పలికించిన మాటలు. అదికూడా నాటకీయత దాదాపుగా లేకుండా. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, మిక్కీ జె మేయర్ సంగీతం ఇవి రెండూ జిలుగు నగలో వెలుగు రాళ్ళలా అమిరాయి.

ఖర్చుకి వెనకాడకుండా తీసిన చిత్రం అనే మాట ఈ సినిమాకి అక్షరాలా సరిపోతుంది. ఆకాలం నాటి స్టూడియోలు, ఉపకరణాలు, సెట్టింగులు, వాహనాలు, నాటి మద్రాసు మహానగరం.. ఒకటేమిటి? సినిమాలో ప్రతి ఫ్రేము సెట్ లో తీసిందే. ప్రతి సెట్టూ కళ్ళు చెదిరేలా నిర్మించిందే. ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి విజయ-వాహిని స్టూడియోస్, మద్రాసు వీధులు, సావిత్రి భవంతి సెట్టింగులు. సావిత్రి వాడిన లాంటివే కాస్ట్యూమ్స్, నగలు, అవి కూడా ఆమె జీవితంలో వివిధ దశల్లోనూ, అనేక సినిమాల్లోనూ వాడినవి. అసలు ఆ రీసెర్చ్ కే ఎన్నాళ్ళు పట్టి ఉంటుందో కదా అనిపించింది. పత్రిక వాళ్లకి కథకి కథనానికి తేడా తెలియకపోవడం, ఒకట్రెండు చోట్ల ఎడిటింగు కాస్త ఇబ్బంది పెట్టాయి కానీ, మూడు గంటలకి మూడు నిముషాలు మాత్రమే తక్కువ నిడివి ఉన్న సినిమాలో ఆమాత్రం ఇబ్బందులు మామూలేనేమో. చివరిగా ఓ మాట, ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు, రాలేవు. మనం చేయాల్సిందల్లా మర్చిపోకుండా చూడడం, 'మహానటి' జ్ఞాపకాలను నెమరేసుకోవడం.

15 వ్యాఖ్యలు:

 1. భోజనం చివర్న పెరుగన్నం లా, ఎన్ని రివ్యూస్ చదివినా చివరికి మీ రివ్యూ కోసం ఎదురుచూస్తుంటాను .
  బాగుంది, ఇక చూడాలి సినిమా .

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మహానటి కి మహా అధ్బుతమైన రివ్యూ రాసారు. చూడాలి అని ముందే నిర్ణయించుకున్నా మీ రివ్యు చుసాక ఎపుడెపుడు చుద్దామా అనిపిస్తోంది

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నిన్న సినిమా విడుదలైనప్పటి నుంచి మీరు సినిమా గురించి వ్రాసే పోస్ట్ కోసం ఎదురుచూసానండీ.ఎప్పటి లాగానే చాలా చక్కని రివ్యూ.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఎప్పటిలాగానే మీ రివ్యూ బాగుంది. ముఖ్య పాత్రధారిణి చక్కగా నటించిందని వినబడుతోంది, సంతోషం. ఒక మంచి సినిమా తీసామని నిర్మాతలు, చూసామని ప్రేక్షకులు తృప్తి చెందవచ్చునన్నమాట, బాగుంది. ఈ సినిమాలో మలయాళ మనోరమలు పలువురు ఉన్నట్లున్నారే.

  నాకు పంటి క్రింద రాయి ఒకటి తగులుతోంది మురళి గారూ - తెలుగు మహానటి గురించి తీసిన సినిమాలో ఆ మహానటి పాత్ర పోషించడానికి మళయాళ/తమిళ అమ్మాయిని తీసుకువచ్చారు, తెలుగమ్మాయి ఎవరూ లేరా - అని. ఎవరూ లేరు, అందుకనే వేరే భాష నటిని ఎన్నుకున్నాం అంటారనుకోండి ..... మరి తెలుగు నటి కోసం ఎంత గట్టిగా ప్రయత్నం చేశారో తెలియదు. అలాగే ఎస్.పి.బి. గారి లాంటి వారు వేదికల మీద తరచూ వల్లించే ... కళకు భాషాభేదాలు లేవు, భాషాసరిహద్దులు లేవు ... లాంటి మాటల్ని సినిమారంగం వారు మరోసారి నొక్కి వక్కాణించే అవకాశాలూ లేకపోలేదు (డబ్బింగ్ సౌకర్యం ఉండగా ఇక నటీనటుల భాష గురించి చింతెందుకు అసలు?). ఆ అమ్మాయి కూడా తన శక్తి మేరకు నటించి ఉండచ్చు, కాదనలేం.

  మొత్తం మీద నాలాంటి వారికి ఈ అసంతృప్తి ఒకటి ఉండిపోతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. "సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, మిక్కీ జె మేయర్ సంగీతం ఇవి రెండూ జిలుగు నగలో వెలుగు రాళ్ళలా అమిరాయి." అద్భుతమైన వాక్యం అండీ! నేను మొదటిసారి విన్న భావవ్యక్తీకరణ సార్! వారిద్దరి పని స్థాయిలో ఉంది సార్! మీ రివ్యూ అత్యద్భుతంగా ఉందండీ!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మురళిగారు బాగున్నారా!? సినిమా గురించి ఎక్కడ చదివినా ఎదో చిన్న వెలితి ఉండేది నాకు మీ రివ్యూ చూడలేదని. ఆ లోటు తీరింది ఈ రోజు. అలాంటి సినిమాకి మీలాంటి వారు రాసే రివ్యూ చదవటం నిజంగా ఆసక్తికరం. తెలుగు సినిమాకి మంచిరోజులు వచ్చ్చాయని మనస్పూర్తిగా నమ్మొచ్చు అనుకుంట!!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. శేఖర్ గారు చాలా రోజులకు బ్లాగులు గుర్తొచ్చాయే...బాగున్నారా ? ఏటిగట్టున మళ్ళీ బ్లాగింగ్ మొదలుపెట్టాలని పాఠకురాలి విజ్ఞప్తి!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నిహారిక గారు, నేను ఇంకా మీకు గుర్తున్నానా!!? దాదాపుగా ఎనిమిదేళ్లు కావొస్తుంది బ్లాగ్ వదిలేసి. బ్లాగ్ ప్రపంచం వదిలేసినా మురళీ గారి బ్లాగ్ అప్పుడప్పుడు చూస్తుంటా! ప్రత్యేకంగా ఇలాంటి సినిమాల విడుదల టైములో.

   తొలగించు
 8. మురళి గారు,రాస్తే సావిత్రి పై మీరే రాయాలి అన్నంతగా కనెక్ట్ అయ్యాను.నా ఎదురుచూపులు ఫలించాయ్. చాలా గొప్ప నివాళి.
  మీ,భాస్కర్.కె

  ప్రత్యుత్తరంతొలగించు

 9. @అజ్ఞాత: ఈపాటికి చూసే ఉంటారనుకుంటున్నా.. ధన్యవాదాలండీ..
  @శశి: ధన్యవాదాలండీ
  @మహావిష్ణుప్రియ: మెనీ థాంక్స్ అండీ.. ఎదురుచూసి చదివినందుకు..

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @విన్నకోట నరసింహారావు: నాయిక గురించి సినిమా చూడక మునుపు నేనూ మీలాగే అనుకున్నానండీ.. అయితే చూశాక రెండు కారణాలకి నా అభిప్రాయం మారింది. మొదటిది కీర్తి సురేష్ వంక పెట్టలేని విధంగా నటించడం. రెండోది, సావిత్రి 'కులం' విస్తృతంగా చర్చకి రావడం. తెలుగమ్మాయి చేత వేయిస్తే ఆ అమ్మాయి కులాన్ని కూడా చర్చలోకి లాగేవాళ్ళేమో అనిపించింది.. ధన్యవాదాలు.
  @రాఘవ ప్రసాద్: చాలా పెద్ద కాంప్లిమెంట్ అండీ.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @శేఖర్ పెద్దగోపు: చాన్నాళ్ల తర్వాత!! నీహారిక గారి మాటే నాదీనండీ.. ఆలోచించండి మరి.. ధన్యవాదాలు..
  @భాస్కర్: మీ అభిమానానికి ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 12. సినిమా చూడలేకపోయానండీ ఇప్పటివరకూ దూరాభారం వల్ల,మీ రివ్యూతో కొంత ముచ్చట తీరింది అనుకోండి

  ప్రత్యుత్తరంతొలగించు
 13. “కులం” చర్చల్లో మనం ఘనులం కదా .... అవసరం లేని చోట్ల కూడా. అంతేలెండి, సింధు ఒలింపిక్స్ లో రజతపతకం గెలవగానే ఆ అమ్మాయి కులం ఏమిటనే శోధింపులతో గూగుల్ మోతెక్కిపోయిందట.

  కీర్తి సురేష్ బాగా నటించిందంటే సంతోషమే, ఆ అమ్మాయికి అభినందనలు. ఆ పాత్ర దక్కటం తన అదృష్టం. అయితే అరుదైన మంచి తెలుగు పాత్ర పోషించే ఆ అవకాశం తెలుగువారెవరికీ దక్కలేదనే మాట ఒక చారిత్రక సత్యం గా స్ధిరపడిపోయిందని నా బాధ.

  ప్రత్యుత్తరంతొలగించు