గురువారం, జూన్ 18, 2015

తెర వెనుక -2

(మొదటిభాగం తర్వాత...)

"లంక తగిలేసింది బాబుగోరూ.. మరేటీ బయ్యం లేదు," వీర్రాజు కేక వినిపించింది. కళ్ళు చీకటికి అలవాటు పడుతూ ఉండగానే మబ్బులు తొలగిపోయి వెన్నెల కురిసింది. పడవ నీళ్ళదారి పట్టింది నెమ్మదిగా.

స్వామి చేతిలో గ్లాసు పరుపు మీద పడి, కొంత స్కాచ్ ఒలికింది. కాసేపటి తర్వాత, నా సిగరెట్ అయిపోవడం చూసి, తనో పెగ్గు కలుపుకుని, నాకూ ఓ స్మాల్ పెగ్ అందించాడు. చల్లని వాతావరణంలో, చలచల్లని డ్రింక్ గొంతు దిగడం, ఆ వెనుకే లోపలినుంచి వేడి పుట్టడం ఓ గమ్మత్తైన అనుభవం.

స్వామి నాతో మాట్లాడాలనడం మంచి శకునం అనిపించింది. చేపముక్క కొరుకుతూ వాడివైపు చూశాను. గ్లాసు చేత్తో పట్టుకుని ఒడ్డు వైపు చూస్తున్నాడు. చంద్రమ్మ వాడి జీవితంలోకి రానిక్రితం రోజుల్లోనూ ఇదే నిర్లిప్తత ఉండేది వాడిలో. ఆమె వచ్చాక వాడి జీవితంలో చెప్పుకోదగ్గ మార్పే వచ్చింది.

ఆరు వారాల్లో తిరిగి వస్తుందనుకున్న మా ట్రూపు నటి, ఆరు నెల్ల  తర్వాతే రాగలిగింది. వైద్యం వల్లేమో, ఒక్కసారిగా బరువు పెరిగిపోయింది. ఇక ఆమెచేత నాయిక వేషాలు వేయించలేం. అప్పటికే చంద్రమ్మ మా బృందంలో కుదురుకుంది.

అదే సమయంలో అవ్వ కాలం చేసింది. చంద్రమ్మకి మేమందరం సాయం చేసినా, స్వామి మాత్రం అన్నీ తనే అయ్యాడు. వాళ్ళిద్దరూ కలిసి ఓ ఇంట్లోకి మారారు. దూరం ఊళ్లలో నాటకాలకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరినీ చూసి భార్యాభర్తలనే అనుకునేవాళ్లు అక్కడివాళ్లు.

నన్ను 'బాబుగారూ' అనీ, స్వామిని తప్ప మిగిలిన ట్రూపు సభ్యులని 'అన్నయ్యా' అనీ పిలిచేది చంద్రమ్మ. ఆ చనువు చూసుకునేమో, ఒకరోజు స్వామి లేకుండా చూసి "నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు. మీరిద్దరూ పెళ్లి చేసేసుకోవచ్చు కదమ్మా.." అన్నాడు మా సభ్యుడొకడు చంద్రమ్మతో.

"మీ నలుగురి కోసవే చేసుకోవాలన్నయ్యా.." అందామె. ఆ తర్వాత, ఇంకెవరూ వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడలేదు.

మునుపటి వేగం కొంత తగ్గినా, మాలో ఉత్సాహం తగ్గలేదు. కొందరు పాతవాళ్ళు వెళ్లి, కొత్తవాళ్ళు వచ్చారు. చంద్రమ్మ-స్వామి నాయికా నాయకులుగా వేసేవాళ్ళు. తప్పితే, స్వామికి విలన్ వేషం. మా ట్రూపు పేరు చెప్పగానే వాళ్ళ జంట పేరు ముందుగా గుర్తొచ్చేంతగా పేరు తెచ్చుకున్నారు ఇద్దరూ. అందుకున్న బహుమతులకైతే లెక్కేలేదు.

కర్ణుడు-ద్రౌపది పాత్రల్ని సోషలైజ్ చేసి రాసిన 'మీరే చెప్పండి' నాటకాన్ని రవీంద్రభారతిలో వేసినప్పుడు ప్రేక్షకుల్లో తనికెళ్ళ భరణి కూడా ఉన్నాట్ట. మాకు తెలియదు. ప్రదర్శన అయ్యాక, భరణిని స్టేజి మీదకి పిలిచారు.

"నేను గతంలో కూడా చెప్పాను.. మహాభారతం.. నిజంగా జరిగితే అద్భుతం.. కల్పన అయితే మహాద్భుతం. చాలా రోజుల తర్వాత ఓ మంచి నాటకం చూశాను.." భరణి ప్రసంగం ముగియడంతోనే ఆడిటోరియం చప్పట్లతో మార్మోగింది.

"అందుకేనా గురు గారూ.. మీరు నాటకాలన్నీ భారతంలో కథల్తోనే రాస్తారు?" ఆవేళ రాత్రి నాలుగో రౌండ్ లో అడిగాడు స్వామి.

"మన జీవితంలో జరిగేవన్నీ భారతంలో కనిపిస్తాయిరా.. భారతంలో లేనివేవీ జీవితంలో జరగవు.. అంతే.." నా జవాబు వాడికి గుర్తుందో లేదో కానీ, నాకు మాత్రం గుర్తే.

పడవ బరువుగా సాగుతోంది. వీర్రాజు పదం పాడుకుంటూ గెడ వేస్తున్నాడు. పెరుగన్నం బాక్సు నేనొకటి తీసుకుని, స్వామికొకటి అందించబోయాను.

"ఈ కాస్తా లాగించేస్తాను గురు గారూ.." అన్నాడు చేతిలో ఉన్న గ్లాసు చూపిస్తూ. అర్ధరాత్రి కావొస్తోంది. ఉదయాన్నే బయల్దేరి నేను తిరిగి వెళ్ళాలి. నేను ఉద్యోగం నుంచి రిటైర్ అవ్వడం, పిల్లలు హైదరాబాద్ లో ఉద్యోగాల్లో స్థిరపడడంతో అక్కడే ఇల్లు తీసుకున్నాం. లంకలో ఉన్న కొబ్బరి తోటని వీర్రాజుకి కౌలుకిచ్చాను.

మా బృందం ఊరికొకరుగా చెదిరిపోయినా ఇప్పటికీ నాటకాలు ఆడుతూనే ఉన్నాం. 'ఎందుకొచ్చిన నాటకాలు?' అని ఎవరూ అనుకోరు. బహుశా, నాటకంలో ఉన్న ఆకర్షణో మరోటో కారణం అయి ఉంటుంది.

ఇప్పుడొచ్చింది ఊరిని చూసుకోడానికి కాదు, స్వామిని చూడ్డానికి. నేను రమ్మంటే వాడు రెక్కలు కట్టుకుని వాలతాడు. కానీ, ఇది వాడిని రప్పించుకునే సందర్భం కాదు. నేను రావాల్సింది. అందుకే వచ్చాను. సన్నగా గాలి తిరిగింది. వీర్రాజు పాట ఆగింది.

"గురు గారూ.. నేను నాటకాల్లోకి ఎందుకొచ్చేనో తెల్సా మీకు?" ఉన్నట్టుండి అడిగాడు స్వామి. వాడి చేతిలో గ్లాసు ఖాళీ అయిపోయింది. వీస్తున్న గాలి ఒక్కసారిగా ఆగిపోయింది.

"మీరు అడగలేదు గురు గారూ.. అస్సలేం అడగలేదు నన్ను. మీకు చెప్పుకోటం ఇదాయకం.. అమ్మే పెంచింది నన్ను.. అమ్మ కష్టం చూళ్ళేక ఉజ్జోగవెతుక్కుని చేరిపోయేను. ఉజ్జోగం ఒచ్చేసింది కదానేసి సమందం చూసి పెళ్లి చేసింది మా అమ్మ.. మనవల్ని ఎత్తాలనుకున్నాది పాపం.." నేను వింటున్నాను, నిశ్శబ్దంగా.

"స్మాల్ పెగ్ గురు గారూ.. విత్ యువర్ పర్మిషన్.." కొంచం నాటకీయంగా అడిగాడు స్వామి, బాటిల్ మూత తీస్తూ. ఓ గుటక వేసి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు.

"మంగ తో నాకు పెళ్లిచేసింది గురు గారూ అమ్మ. పెళ్లి పీట్ల మీద ఏడుపు మొకంతో కూచున్నాది మంగ. నేను పట్టించుకోలేదు. కార్యెం గెదిలోనూ అదే ఏడుపు. 'నాకొంట్లో బాలేదు..' అని చెప్పింది. నేను బయటికెల్లిపోతా నన్నాను... 'మూర్తానికి ఏవీ జరగలేదంటే మావోళ్ళు కోపం సేత్తారు.. బయటికెల్లకు..' అని బతిమాలింది. నేలమీద తలగడేసుకుని పడుకున్నాను..." ఊపిరి తీసుకున్నాడు.

"వారం పదిరోజులు రోజులు ఇదే తంతు.. అమ్మతోటీ పెడమొకంతోనే ఉండేది.. ఈలోగా తల్లిగారోళ్ళు మంగని పుట్టింటికి తీసుకెళ్ళేరు.. అక్కణ్ణించే అది లేచిపోయింది.." చెప్పడం ఆపి రెండు గుక్కలు గటగటా తాగాడు స్వామి.

"అది లేచిపోటంతో నాకేం పేచీలేదు గురు గారూ.. ఇష్టం లేని కాపరం సాగుతాదా.. కానండీ, ఆ బాత్తోటి మాయమ్మ గుండాగి చచ్చిపోయింది. చచ్చిపోలేదు.. పొడిచి పొడిచి చంపేసేరండి ఊళ్ళో వోళ్ళు, చుట్టాలోళ్ళూ.." కళ్ళు తుడుచుకున్నాడు. 

"నన్ను మాత్రం ఒదిలేరనుకున్నారా.. చెడ్డీ బొత్తం పెట్టుకోటం చేతకాన్నాకొడుకులు కూడా 'ఈడి పెల్లం లేసిపోయిందిరోయ్..' అనేవోడే. కాకులు చాలా మంచియి  గురు గారూ.. ఈ ఎదవలు కాకులకన్నా కనా కష్టం.. ..ఇంకొక్క పెగ్గుకి పర్మిషనివ్వాల్నాకు.." అంటూనే బాటిల్ అందుకున్నాడు.

వాడు పరిచయమైన తొలిరోజులు గుర్తొచ్చాయి నాకు. ఆ ఆవేశానికి కారణం అర్ధమవుతోంది.

"అమ్మే లేకపోయేక, ఈ ఎదవల చేత మాటలు పడతా బతకాలా అనిపించింది గురు గారూ.. ఆఫీసోళ్ళు కాకినాడంపితే, రాత్రేం తోచక నాటకం చూసేను. 'ఓ తల్లి తీర్పు' .. మీకు గుర్తున్నాదా?" తలూపాను, నిలువుగా.

"ప్రెతి డైలాగూ గుర్తే.. ఎన్ని చప్పట్లు గురు గారూ.. అది చూసేక నాకూ చప్పట్లు కొట్టించుకోవాలనిపించింది.. నాటకాల్లో జేరాలనిపించింది..చచ్చేం సాధిత్తాం, బతికి చూపించాలి కానీ అనుకున్నాను మీ నాటకం చూసేక," మాట్లాడ్డం ఆపి ఓ గుక్క తాగాడు.

"మీరు ఒక్క మాటకూడా అడక్కుండా నాటకాల్లో చేర్చుకున్నారు. చెప్పకపోటవే, నా జ్యేస చప్పట్ల మీదే.. ఏ డైలాగు ఎలాగ చెప్తే చప్పట్లడతాయా అని చూసేవోడిని. జనం చప్పట్లు కొడతంటే నన్ను నానామాట్లన్న కొడుకులందరూ వొచ్చి చప్పట్లు కొడతన్నట్టుగా ఉండేది నాకు.." క్షణం ఆగాడు.

"ఆర్టిస్టులు ఇబ్బంది పడతన్నారని తెల్సు గురు గారూ.. కానీ నాకు పడే చప్పట్లే నాకు ముఖ్యెం అనిపించేది.. ఇదంతా చెంద్ర ఒచ్చేవొరకూ... చెంద్ర.. చెంద్రేం చేసిందో చూసేరా గురు గారూ.." ఉన్నట్టుండి నా ఒళ్లో తలపెట్టుకుని భోరుమన్నాడు వాడు. వాడి తల నిమిరాను.. వెక్కిళ్ళు పెడుతున్నాడు స్వామి.

"ఒరే.. లేవరా.. లేచి మంచినీళ్ళు తాక్కొంచం.." కాస్త గట్టిగానే చెప్పాను. వాడు లేచి మొహం తుడుచుకున్నాడు.

"చెంద్రతో కలిసి స్టేజీమీద నాటకం ఆడుతుంటే, ఈ మనిషి మెచ్చితే చాలు కదా అనిపించేసింది గురు గారూ.. జనం చప్పట్లు లెక్కెయ్యడం మానేసేను.. చెంద్రేవంటదో అది చాలన్న లెక్కలోకొచ్చేసేను.."

"...ఇచిత్రం చెప్పనా గురు గారూ.. ఒకానొకప్పుడు జెనం నన్ను నాలుగు మాట్లంటే చచ్చిపోవాలనుకున్నాను.. చెంద్ర నేను కలిసుంటం చూసి నలుగురూ నాలుగు మాట్లంటే.. 'ఇంకో నాలుగనిపించాలీళ్ళచేత' అనిపించేది నాకు.." గ్లాసందుకుని ఓ గుటకేశాడు.

"చెంద్రేనాడూ పెళ్లి మాటెత్తలేదు.. అయితే ఏటి గురు గారూ.. మాకన్నా బాగా బతికిన మొగుడూ పెళ్ళాల్ని చూపించండి చూద్దాం.. ఈ దేవుడనే వోడున్నాడు చూడండి.. ఆణ్ణామీద పగబట్టేడు.. దాన్ని తీసుకుపోయేడు..." వెక్కిళ్ళు పెట్టేడు స్వామి.

నేను మాట్లాడాల్సిన సమయం వచ్చిందనిపించి గొంతు సవరించుకున్నాను. "దానికి అర్దాయుష్షు పెట్టేడ్రా భగవంతుడు.. మన చేతుల్లో ఏముంది చెప్పు? నీకు మేవందరం ఉన్నావని మర్చిపోకు. ఉజ్జోగానికి సెలవు పడేసి హైదరాబాద్ ఒచ్చెయ్.." ఒక్క క్షణం ఆగాను, వాడేమన్నా అంటాడేమో అని.

చంద్రమ్మ పోయినప్పటి నుంచీ వాడు మనుషుల్లో లేడు. పడవ బరువుగానే సాగుతోంది. ఒడ్డున వెలుగుతున్న వీధి దీపాలు దగ్గరగా కనిపిస్తున్నాయి.

"ఒక్కడివీ  ఇక్కడెందుకురా.. ఇక్కడున్నంత సేపూ చంద్రమ్మే గుర్తొస్తుంది నీకు.. మనాళ్ళు కొందరు టీవీ సీరియళ్ళలో ఉన్నారు.. నీలాంటి వాడు కావాల్రా వాళ్లకి. అంతా ఒకట్రెండు టేకుల్లో అయిపోవాలి. మన్నాటకాలు మనకెలాగా ఉంటాయ్.. అన్నీ చూసుకోడానికి మేవందరం ఉన్నాం.. నామాట విని నాతో వచ్చేయ్..." నా మాటలు పూర్తవుతూనే లేచి కూర్చున్నాడు వాడు.

"ఎక్కూ తాగేస్తన్నానని తెల్సు గురు గారూ.. ఇదే లాస్టు పెగ్గు.. కాదనకండి.." బతిమాలేడు.

ఇప్పుడు చెప్పినా వినడు వాడు. చెప్పాలని కూడా అనిపించలేదు నాకు. నా దృష్టంతా వాడు ఏం చెబుతాడా అన్నదానిమీదే ఉంది. వాడు వస్తానంటే నాకన్నా సంతోషించేవాడు లేడు. చంద్రమ్మ విషయం తెలియగానే 'స్వామినిక్కడికి తీసుకొచ్చేయండి' అని మావాళ్ళందరూ ముక్త కంఠంతో చెప్పి సాగనంపారు నన్ను. 

"జెనం చప్పట్ల కోసం నాటకాల్లోకొచ్చేను గురు గారూ.. తర్వాత, చెంద్ర కోసవే నాటకాలేసేను.. ఏ వేషం ఏసినా, ఏ డైలాగు చెప్పినా అదేవంటాదో అనే జ్యేస. చప్పట్లు, ప్రైజుల కన్నా దాని మాటే ముక్యెవైపోయింది.. అలాగలాటు పడిపోయేను.." చివరి గుక్క తాగాడు.

"మీరంటే నాకు చాలా గౌరం గురు గారూ.. మీ మాట తీసెయ్యాల్సి వొస్తాదని ఏనాడూ అనుకోలేదు.. కానీ.. కానీ.. చెంద్ర లేకపోయేక నేనింక మొకానికి రంగేసుకోలేను..నావల్ల కాదు..." అంటూనే పరుపు మీదకి ఒరిగిపోయాడు.

చిన్న కుదుపుతో ఒడ్డున ఆగింది పడవ. రేవులో ఉన్న గుంజకి పడవని కట్టేసి మా దగ్గరికి వచ్చాడు వీర్రాజు. సరంజామా అంతా సంచిలో వేసి అందించాను. అందుకోడానికి ముందు, రెండుచేతులూ పైకెత్తి స్వామికి దణ్ణం పెట్టాడు వీర్రాజు. వాడిని లేవదీశాడు నెమ్మదిగా.

"నా కదలాటిది బారతంలో ఉన్నాదా గురు గారూ?" కళ్ళు సగం తెరిచి అడిగాడు స్వామి.

మరో మబ్బులగుంపు చంద్రుణ్ణి  కప్పేసింది.

(అయిపోయింది)

బుధవారం, జూన్ 17, 2015

తెర వెనుక -1

పెద్ద మబ్బుల గుంపొకటి దూరం నుంచి చంద్రుడి వైపుగా కదిలొస్తోంది. శరత్కాలం మొదలయ్యిందేమో, చంద్రుడు అధిక చక్కని వెన్నెలలు పూయిస్తున్నాడు. కరిగిపోతున్న సమయాన్ని సూచిస్తున్నట్టుగా, గాజు గ్లాసులో ఉన్న స్కాచ్ మధ్యలో కదులుతున్న ఐస్ క్యూబ్ నెమ్మదిగా కరుగుతోంది.

రూపం కోల్పోతున్న మంచుముద్ద మీద చంద్రకిరణం పడి మెరిసినట్టుగా అనిపించడంతో ప్రకృతిలో పడ్డాను. అవును.. సమయం కరిగిపోతోంది. వచ్చిన పని ఈసరికే మొదలుపెట్టేసి ఉండాల్సింది. కానీ ఏదో సంశయం. మా బృందం అందరికీ నమ్మకమే, నేనీ పని సాధించుకు వస్తానని. ఇంకా చెప్పాలంటే, నేనుమాత్రమే సాధించగలను అనేశారు వాళ్ళు.

నల్లని గోదారి నీళ్ళ మీద మెత్తగా సాగిపోతోంది పడవ. పరుపు మీద కూర్చుని, బాలీసుకి జేర్లబడి కాసేపు చేతిలో ఉన్న గ్లాసునీ, మరికాసేపు ఆకాశాన్నీ చూస్తూ అప్పుడప్పుడూ గొంతు తడుపుకుంటున్నాను. చుక్కాని కాసుకుంటున్న వీర్రాజు ఉండుండీ ఏదో కూని రాగం అందుకుని తన ఉనికి చాటుకుంటున్నాడు.

నా ఎదురుగా కూర్చున్న స్వామిలో మాత్రం ఎలాంటి చలనమూ లేదు. మర్యాద కోసం గ్లాసు పట్టుకున్నాడంతే. నేను మూడో పెగ్గుకి వచ్చినా వాడింకా మొదటిది పూర్తి చెయ్యలేదు. నేను సాధించాల్సిన కార్యం స్వామితో ముడిపడ్డదే. ఎలా వీడిని కదిలించడం?

భుజం మీద చిన్నగా తట్టి, వాడి చేతిలో ఉన్న గ్లాసువైపు చూపించి తాగమన్నట్టు సైగచేశాను. అతిప్రయత్నం మీద రెండు గుటకలు వేశాడు. జీడిపప్పు పలుకులున్న పింగాణీ ప్లేటు అందించాను. ప్లేటుకి బదులు నాలుగు పలుకులు మాత్రమే అందుకున్నాడు.

"పర్వాలేదు.. మాట వింటున్నాడు," అనుకున్నాను అప్రయత్నంగా. నిజం చెప్పాలంటే స్వామి నామాట ఎప్పుడూ కాదనలేదు. ఇరవయ్యేళ్ళ క్రితం మొదటిసారి కలిశాడు నన్ను. ఆవేళ రాత్రి కాకినాడ పరిషత్తులో నాటకం ఆడడం పూర్తి చేసి గ్రీన్ రూం దగ్గర చుట్టుముట్టిన వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు జనంలో ఉన్నాడు వాడు. 'ఓ తల్లి తీర్పు' నాటకం ఆడాం. స్క్రిప్టు, డైరెక్షను నావే.

నాటకం నడుస్తున్నప్పుడు వినిపించే చప్పట్లే కాదు, గ్రీన్ రూం దగ్గర వినిపించే సమీక్షలూ బాగా ఉపయోగపడతాయి మాకు. మరీ ముఖ్యంగా, మేము గమనించుకోని లోపాలు విశ్లేషించి చెప్పేవాళ్ళు గ్రీన్ రూం దగ్గరే ఎక్కువగా తారసపడుతూ ఉంటారు.

అందరూ వెళ్ళే వరకూ ఓపిక పట్టి అప్పుడు వచ్చాడు స్వామి నా దగ్గరికి. అటూ ఇటూగా పాతికేళ్ళు ఉంటాయేమో వాడికప్పుడు. సూదంటు చూపు నన్ను గుచ్చుకున్నట్టే అనిపించింది.  నేనింకా మేకప్ తుడుచుకోలేదు. ప్రయాణానికి ఆలస్యం అయిపోతోందని మా ట్రూప్ వాళ్ళు అప్పటికే కంగారు పడుతున్నారు.

"మహాభారతంలో కుంతి కథని భలే సోషలైజ్ చేశారు," ఇదీ వాడన్న మొదటిమాట. చెప్పొద్దూ, చాలా ముచ్చటగా అనిపించింది. వాడికి థాంక్స్ చెప్పి, మా వాళ్లకి పనులు పురమాయిస్తున్నాను.

"మీతో కొంచం తీరుబడిగా మాట్లాడాలి. అడ్రస్ ఇస్తే, వచ్చి కలుస్తాను," అన్నాడు. ట్రూపులో కుర్రాడొకడు ఓ కాగితం మీద నా అడ్రస్ రాసిచ్చాడు. నేను పెద్దగా పట్టించుకోలేదు.

నాటకం చూసిన వేడిలో చాలామందే ఇలా అడ్రస్లు అడుగుతారు. తెల్లారేసరికి ఆ వేడి చల్లారిపోతుంది. మూడోనాటికి అడ్రస్ కాగితం చిత్తుకాగితాల్లోకి చేరుకుంటుంది. కానీ, స్వామి ఆ చాలామందిలా కాదు. కాబట్టే, ఇవాళ నాకీ పరిక్ష. వాడి గ్లాసు ఖాళీ అయ్యింది. మరో పెగ్గు ఫిక్స్ చేసి ఇచ్చాను.

మామూలప్పుడు వాడు మితభాషి. ఇలాంటి సందర్భాల్లో మాత్రం మూడు నాలుగు పెగ్గులు దాటాక గొంతు విప్పుతాడు. ఒక్కో పెగ్గూ పడే కొద్దీ మాటలు పెరుగుతాయి. కానీ, ఎక్కడా బ్యాలన్స్ తప్పడు. అదీ ఆశ్చర్యం. వాడిలో నన్ను ఆశ్చర్య పరిచే విషయాలు చాలానే ఉన్నాయి.

అడ్రస్ తీసుకున్న వారం పది రోజుల తర్వాత ఓ సాయంత్రం వేళ నన్ను వెతుక్కుంటూ వచ్చేశాడు. వస్తూనే "నేనూ మీ ట్రూపులో చేరతాను గురువు గారూ," అన్నాడు. 'చేరి ఏం చేస్తాడూ ట్రూపులో?' వాడినోసారి పరిక్షగా చూశాను. ఒడ్డూ పొడవూ బానే ఉన్నాడు. గొంతు, మాటతీరూ కూడా పర్వాలేదు. కాస్త సాన పడితే నటుడవుతాడు.

గాలివాటం మనిషేమో అనిపించింది ఓ క్షణం. ఓ నాలుగైదు నాటకాల స్క్రిప్టులు చేతికిచ్చాను. కూర్చుని శ్రద్ధగా చదివి తన అభిప్రాయాలు కుండ బద్దలు కొట్టాడు. "ఆదివారం ఉదయం వస్తే ట్రూపుని పరిచయం చేస్తా," అని చెప్పాను.

మా ట్రూపు సభ్యులం ప్రతి ఆదివారం తప్పకుండా కలిసేవాళ్ళం అప్పట్లో. చర్చలు, రిహార్సల్సు అన్నీ ఆదివారాలే. మాలో ఎక్కువమంది ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళమే. సరదాకి కళాపోషణ. అలాగని కేవలం కాలక్షేపానికి నాటకాలు కాదు. పరిషత్తుకి వెళ్ళామంటే బహుమతులతో రావలిసిందే.

నేను చెప్పిన ప్రకారమే ఆదివారం ఉదయాన్నే వచ్చేశాడు స్వామి. మా వాళ్ళని పరిచయం చేశాను. వాడు ఇంటర్ పాసయ్యి, కో-ఆపరేటివ్ సొసైటీ లో గుమస్తాగా పని చేస్తున్నాట్ట. ఇతరత్రా వివరాలేవీ నేను అడగలేదు. వాడు చెప్పలేదు.

ఆ వేళ మా కొత్త రిహార్సల్ ప్రారంభం. నాలుగు డైలాగులున్న పనివాడి పాత్ర ఒకటి ఉంటే అదిచ్చాం స్వామికి. జరిగిన నాలుగైదు రిహార్సల్స్ కీ శ్రద్ధగా వచ్చాడు. చిన్న వేషమే కదా అని నిర్లక్ష్యం చూపించలేదు సరికదా, మిగిలిన వాళ్ళు చేస్తుంటే కూడా రెప్పవేయకుండా చూశాడు.

డైలాగులు చెప్పడం తప్ప ఎవరితోనూ మాట కలిపేవాడు కాదు. తరువాతి నాటకం 'ఏకాకి' లో విలన్ వేషం ఇచ్చాం. దగ్గరి బంధువులని మోసం చేసే మనిషి పాత్ర. "శకుని కదా గురువుగారూ?" అడిగాడు మేమిద్దరం ఉన్నప్పుడు.

రిహార్సల్స్ లో ఎంత ఒద్దికగా చేశాడో, స్టేజి మీద అంతగా విజృంభించాడు స్వామి. మిగిలిన నటీనటులు ఉలికిపడ్డారు ఒక్కసారి. రిహార్సల్స్ ని మించి స్టేజీ మీద చేయడం, వాళ్లకి పేరు రావాలని అప్పటికప్పుడు పాత్రని ఇంప్రొవైజ్ చేయడం ఇవన్నీ నాటకాల్లో మామూలే. కొంత పేరొచ్చాక చాలామంది నటీనటులు చేసే పనే.

కానీ, ఓ కొత్తవాడు అలా పాత్ర పరిధికి మించి నటించడం మిగిలిన ఆర్టిస్టులకి మింగుడు పడలేదు. అలాగని నాటకాన్ని మధ్యలో ఆపలేరు కదా. ప్రేక్షకుల నుంచి చప్పట్లు వచ్చే కొద్దీ మరింత ఉత్సాహంగా నటించేస్తున్నాడు స్వామి. రెండు సీన్లయ్యేసరికి మావాళ్ళందరికీ విషయం అర్ధమయ్యింది కాబట్టీ, అందరూ రంగస్థలం మీద అనుభజ్ఞులే కాబట్టీ ఎవరి పాత్ర విషయంలో వాళ్ళు జాగ్రత్త పడ్డారు.

సైడ్ వింగ్ లో నిలబడి నాటకం చూస్తున్న నాకు కొత్తగా కనిపించాడు స్వామి. నాటకం అవుతూనే చప్పట్లు మిన్నంటాయి. గ్రీన్ రూం దగ్గర జనం. ప్రశంసలన్నీ స్వామికే. స్టేజి దిగుతూనే వాడు మామూలైపోయాడు. "థాంక్స్" తప్ప ఇంకేమీ మాట్లాడడం లేదు ఎవరితోనూ. ఏమైపోయింది ఆ ఆవేశం? 

'ఏకాకి' తో స్వామికి మంచి పేరొచ్చింది. అప్పటివరకూ వాడితో అంటీముట్టనట్టుగా ఉన్న మా ట్రూపు వాళ్ళు కూడా స్నేహం చేసే ప్రయత్నాలు చేశారు. స్టేజీ మీద అంతా తనే అయిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడన్న విమర్శ నావరకూ రాకపోలేదు.

మా తర్వాతి నాటకం 'వనవాసం' లో హీరో వేషం ఇచ్చాను వాడికి. ఇది కేవలం విమర్శకి సమాధానం మాత్రమే కాదు. వాడిమీద పెరిగిన నమ్మకం కూడా. బయట చూస్తే 'వీడికి మాట్లాడ్డం వచ్చా?' అని సందేహం కలిగేలా ఉండే స్వామి, స్టేజి మీద ఒకలాంటి ఆవేశంతో కనిపించేవాడు. చప్పట్లు వినిపించే  కొద్దీ ఒళ్ళు మర్చిపోయేవాడు.

సైడ్ వింగ్ నుంచి వాడిని చూస్తూ ఉంటే దక్ష వాటిక నుంచి పరమశివుడు నేరుగా మా రంగస్థలం మీదకి వచ్చేశాడా అనిపించేది నాకు. 'వనవాసం' క్లైమాక్స్ సీన్లో స్వామిని చూస్తూ "వీడి ఆవేశాన్ని అదుపులో పెట్టగలిగే వాళ్ళెవరో" అనుకున్నాను అప్రయత్నంగా.

గెడ అవసరం లేకుండానే గాలివాలుకి జాయిగా సాగిపోతోంది పడవ. దోమతెరలాంటి మంచుతెర గోదారి నీళ్ళమీద చిక్కబడుతోంది. పడవ కదలికలకి ఏర్పడ్డ అలల మీద చంద్రుడు ముక్కలు ముక్కలుగా మెరిసిపోతున్నాడు. వీర్రాజు చుట్ట వెలిగించినట్టున్నాడు. లంక పొగాకు వాసన ఘాటుగా తగులుతోంది.

నా చేతిలో గ్లాసు ఖాళీ అయింది. తనో పెగ్గు ఫిక్స్ చేసుకుని, నా గ్లాసులో స్కాచ్, సోడా కలిపి, ఐస్ క్యూబ్స్ వేసి అందించాడు స్వామి. 'స్మాల్ చాలు' అని నేను చెప్పాల్సిన అవసరం లేకపోయింది.  హాట్ ప్యాక్ నుంచి ఫిష్ ఫ్రై బయటికి తీసి, ప్లేట్లో పెట్టి అందించాడు.

నా ప్రతి కదలికా తెలిసిన వీడికి, నేనిప్పుడు ఏం అడగబోతున్నానో తెలీదా? ఇప్పటికే వాడు సమాధానం సిద్ధం చేసేసుకుని ఉండడా? ఎంత చిత్రమైన పరిస్థితి! ఈ పరిస్థితి రాడానికి కారణం చంద్రమ్మ. ఇరవయ్యేళ్ళ క్రితం, మొదట మా ట్రూపులోకీ తర్వాత స్వామి జీవితంలోకీ అడుగుపెట్టిన కథానాయిక. ఆమె పేరుని మేమే చంద్రకళ అని మార్చాం.

స్వామికన్నా చిత్రంగా మా ట్రూపులోకి వచ్చింది చంద్రమ్మ. మా రిహార్సల్ గదిని శుభ్రం చేయడం, రిహార్సల్ అప్పుడు మాకు టీ కాఫీలు అందించడం, సెట్ ప్రాపర్టీలు తయారు చేసుకోడంలో మాకు సాయం చేయడం లాంటి పనులన్నీ ఓ ముసలవ్వ చూసుకునేది.

ఇరవయ్యేళ్ళ వయసులో ఆ ముసలవ్వ దగ్గరకి చేరింది చంద్రమ్మ. "అనాద పిల్ల బాబుగోరూ.. సేరదీసి నాలుగు ముద్దలెడితే పున్నెవే గానీ పాపం కాదుగదా నాకు," అంది ముసలవ్వ. అవ్వతోపాటే రిహార్సల్స్ కి వస్తూ, ఆమెకి సాయంగా ఉండేది చంద్రమ్మ.

ఆరోజుల్లోనే మాకో ఊహించని సమస్య వచ్చింది. 'ఆరో వేలు' నాటకం తయారు చేసుకున్నాం. గుంటూరు పరిషత్తుకి సెలక్ట్ అయ్యింది. మరో రెండు రిహార్సల్స్ చేస్తే నాటకం ఆడేయచ్చు. అంతలో లేడీ ఆర్టిస్టు జబ్బు పడింది. ఆపరేషన్ చేయాలన్నారు డాక్టరు. కనీసం ఆరువారాలు ఆమె అందుబాటులో ఉండదు.

పరిషత్తు చూస్తే పదిహేను రోజులు కూడా లేదు. కొత్త ఆర్టిస్టు కోసం వెతకడం మొదలుపెట్టాం. మామూలు రోజుల్లోనే లేడీ ఆర్టిస్టులు దొరకరు. ఇక పరిషత్తు రోజుల్లో ఎక్కడ దొరుకుతారు? ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. సరిగ్గా అప్పుడు అవ్వ నాదగ్గరికి వచ్చింది, చంద్రమ్మని తీసుకుని.

"ఈ పిల్ల సెయ్యగలూతాదేమో సూడండి బాబుగోరూ.. దీనికిట్టవేనంట నాటకాలంటే," సంగీతంలా వినిపించిందా మాట. అప్పుడు చూశాను చంద్రమ్మని పరిక్షగా. 'తెలివైన పిల్ల' అనిపించింది చూడగానే.

'ఆరో వేలు' లో నాయిక పాత్ర చాలా బలమైనది. మా ట్రూపులో ఆర్టిస్టు చాలా ఏళ్ళుగా నటిస్తోంది. ఆమెని దృష్టిలో పెట్టుకుని రాసిన నాటకం అది. తొలిసారి స్టేజి ఎక్కుతూనే పరిషత్తు, అది కూడా ప్రధాన పాత్ర.. ఈ అమ్మాయి చెయ్యగలదా? అన్న సందేహం లేకపోలేదు. నాటకం మానుకోవడం కన్నా ప్రయత్నం చేయడం మంచిదనిపించింది.

మొదట ఆమె పోర్షన్ భట్టీయం వేయించాను. డైలాగులు ఆమెకి నోటికి వచ్చాయి అనిపించాక, ట్రూపుని పిలిచి రిహార్సల్ చేయించాను. ఎవరి ఆలోచనలు, భయాలు వాళ్లకి ఉన్నట్టున్నాయి. ఎవరూ మాట్లాడలేదు. నాటకం ఆడడానికే నిర్ణయించుకున్నాం.

పైకి చెప్పకపోయినా మా వాళ్లకి ఉన్న సందేహాలు నాకూ ఉన్నాయి. తోటి ఆర్టిస్టులకి స్టేజి మీద చుక్కలు చూపించే స్వామి, చంద్రమ్మని నటించనిస్తాడా? వాళ్ళిద్దరూ నాయికా, నాయకులు. కాంబినేషన్ సీన్లు తప్పవు. చంద్రమ్మ నెగ్గుకురాగలదా?

నా పోర్షన్ అవుతూనే సైడ్ వింగ్ లోకి వచ్చి నిలబడి నాటకం చూస్తున్నాను.వాళ్ళిద్దరి కాంబినేషన్ లో మొదటి సీన్. మా బృందం అందరూ ఊపిరి బిగపట్టారు. ఆశ్చర్యం! చాలా మామూలుగా చేశాడు స్వామి. వాడు తన పాత్రని అండర్ ప్లే చేయడంతో హీరోయిన్ పాత్ర బాగా ఎలివేట్ అయ్యింది. నాటకానికీ, చంద్రమ్మకీ కూడా మంచిపేరొచ్చింది. అందరం ఊపిరి పీల్చుకున్నాం.

'ఏమయ్యింది స్వామికి?' అన్న ప్రశ్న మాత్రం రోజురోజుకీ పెరిగి పెద్దదయ్యింది. ఎవరితోనూ మాట్లాడని వాడు చంద్రమ్మతో చనువుగా ఉంటున్నాడు. స్టేజి మీద వాడిని చూస్తుంటే 'మన స్వామేనా?' అని సందేహం కలుగుతోంది మాకు. వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండడం నలుగురి దృష్టిలోనూ పడే లోగానే మరో రెండు నాటకాలు ఆడాం. ఈలోగా ఊహించనవి చాలానే జరిగాయి.

"గురు గారూ..." స్వామి పిలుపుతో ఆలోచనలనుంచి బయటికి వచ్చాను. నాలుగో పెగ్గు కలుపుకుంటున్నాడు వాడు. రెండు గుక్కలు తాగి, "చెంద్ర.. చెంద్రేం చేసిందో చూసేరా గురు గారూ.." అన్నాడు. వెన్నెల్లో వాడి కళ్ళు మెరుస్తున్నాయి. టిష్యూ తీసిచ్చి, కళ్ళు తుడుచుకోమని సైగ చేశాను.

"మీకు.. మీకు చాలా చెప్పాలి గురూ గారూ.. మీకే చెప్పాలి.. ఇప్పుడే చెప్పాలి... కాస్సేపు ఉండండేం..." అన్నాడు, మరో గుటక వేస్తూ. నేను సిగరెట్ వెలిగించాను. మబ్బుల గుంపు చంద్రుణ్ణి కప్పేయడంతో ఉన్నట్టుండి చీకటి అలుముకుంది చుట్టూ. ఆ చీకట్లో ఒక్క కుదుపుతో ఆగింది పడవ.

(నావకీ, రేవుకీ మధ్య మరికాస్త దూరం...)

సోమవారం, జూన్ 15, 2015

నాగావళి నుంచి మంజీర వరకు

నాటక, సినీ, కథా రచయిత, నటుడు, సినీ పాత్రికేయుడుగా రావి కొండలరావు పేరు తెలుగువాళ్ళకు సుపరిచితం. కొండలరావు భార్య రాధాకుమారి సైతం నాటకాలు, సినిమాల్లో నటించారు.  ఎనభై మూడేళ్ళ కొండలరావుకి నాటక, సినిమా రంగాలతో అరవై ఏడేళ్ళ అనుబంధం. తన అనుభవాలు, జ్ఞాపకాలతో ఇటీవలే అయన వెలువరించిన సంకలనం 'నాగావళి నుంచి మంజీర వరకు.' శ్రీకాకుళంలో నాగావళి నది ఒడ్డున జన్మించిన కొండలరావు మద్రాసు మీదుగా హైదరాబాద్ చేరుకొని, స్థిరపడిన వైనాన్ని చెప్పే పుస్తకం ఇది.

ఇంట్లో చెప్పకుండా మద్రాసు రైలెక్కితే సినిమాల్లో వేషాలు దొరుకుతాయని అప్పట్లో ఓ నమ్మకం. కేవలం ఈ ఒక్క కారణానికే ఇంట్లో వాళ్లకి చెప్పకుండా, స్నేహితుడి దగ్గర ఇరవై రూపాయలు తీసుకుని మద్రాసు రైలెక్కేశారు పదహారేళ్ళ కొండలరావు. అప్పటి పత్రికల్లో వచ్చే సినిమా వార్తలన్నీ ఆసరికే కంఠోపాఠం కావడం వల్ల, మద్రాసు ఎలా ఉంటుందో తెలియకపోయినా సినిమా వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఏయే స్టూడియోల్లో షూటింగులు జరుగుతాయో, జరుగుతున్నాయో బాగా తెలుసు. ఇవే కాకుండా, మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యే ఆకాశవాణి కార్యక్రమాలు క్రమం తప్పకుండా విన్న అనుభవం ఉంది. అంతేనా, చందమామ పత్రికకి చందాదారు కూడా.

వీటన్నింటినీ మించిన మరో ధైర్యం, రంగస్థల నటుడు, సినిమాల్లో డబ్బింగులు చెప్పే అన్న కామేశ్వర రావు మద్రాసులో ఉంటూ ఉండడం. కనీసం అన్నగారి చిరునామా కూడా దగ్గర పెట్టుకోకుండా మద్రాసు స్టేషన్ లో రైలు దిగి, యెకాయెకిన ఆకాశవాణికి వెళ్లి అన్నగారి అడ్రస్ సంపాదించిన వైనం, ఉత్సాహంగా పేజీలు  తిరిగేలా చేస్తుంది. అప్పటికే కాస్త నాటకానుభవం ఉండడం అక్కరకి వచ్చింది. ఆకాశవాణి 'బాలానందం' కార్యక్రమాలు, అప్పుడప్పుడు స్టేజీ నాటకాల్లో వేషాలు, సినిమా స్టూడియోల చుట్టూ ప్రదక్షిణలతో రోజులు గడుపుతూ ఒక్కొక్కరి స్నేహమూ సంపాదించుకోవడం, నాటకాల్లో కుదురుకుని సినిమాల్లో వేషాలు సంపాదించుకోవడం తర్వాతి కథ.


కొండలరావు మద్రాసులో చేరేనాటికి అప్పుడప్పుడే తెలుగు స్టూడియోల నిర్మాణం ఊపందుకుంటోంది. రాశిలోనూ, వాసిలోనూ తెలుగు సినిమా వికసిస్తున్న కాలం. అటు నాటకాల్లోనూ సాంఘిక నాటకాలు పౌరాణికాలకి పోటీ ఇవ్వడమే కాక, తెలుగు తెరకి నటీనటుల్ని, సాంకేతిక నిపుణులని అందిస్తున్న కాలం. మరోవైపు తెలుగునాట సాహిత్య పత్రికలు ఊపందుకుంటున్న సమయం. ఇలాంటి సందర్భంలో ఈ రంగాలన్నింటిలోనూ ప్రవేశించి, కొనసాగిన కొండలరావు ఆయా రంగాలని గురించి రేఖామాత్రపు ప్రస్తావన మాత్రమే చేసి ఊరుకోవడం నిరాశ పరిచింది. అదే సమయంలో, చదువు మధ్యలోనే ఆపేసిన ఓ కుర్రాడు కథా, నాటక రచయితగా, నటుడిగా, పాత్రికేయుడిగా రాణించిన వైనాన్నీ అసమగ్రంగానే చెప్పారు.

మొత్తం పుస్తకంలో బాగా ఆకర్షించేవి కొండలరావు రాసిన బాల్య జ్ఞాపకాలు. చండశాసనుడైన తండ్రి, కథలు చెప్పి, నాటకాలు వేసేలా ప్రోత్సహించిన నాయనమ్మ, స్కూలు వాతావరణం, నాటక సమాజాలతో పరిచయాలతో పాటు, నాటి తరం ప్రముఖ హరికథా కళాకారులు ఆదిభట్ల నారాయణ దాసు, 'కళావర్ రింగ్' గా ప్రసిద్ధురాలైన సరిదే లక్ష్మీ నరసమ్మలని గురించి ఆసక్తికరమైన కబుర్లు, విజయనగరం రాజావారికి నాటకాల మీద ఉన్న ఆసక్తి, ఘంటసాల వెంకటేశ్వర రావు విజయనగరంలో సంగీతం నేర్చుకున్న వైనం లాంటి విశేషాలెన్నో ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రముఖుల సంగతులు అక్కడక్కడా మెరిశాయి. బాల్యస్నేహితులని గురించిన కబుర్లలో పునరుక్తులూ దొర్లాయి.

సీరియల్ గా రాయడం వల్ల కాబోలు, ఒకటిరెండు విషయాల్లో స్పష్టత లోపించింది. మొదటిసారి 'చందమామ' ఆఫీసుకి వెళ్ళినప్పుడు 'చక్రపాణి' అనుకుని 'కొకు' ని కలిశానని ఒకచోట, చక్రపాణిని కలిశానని మరొకచోట, కొకుని కలిశానని ఇంకోచోట రాశారు. మాటీవీ కోసం రూపొందించిన 'కన్యాశుల్కం' సీరియల్ కబుర్లని రేఖామాత్రంగా ప్రస్తావించారు. మొత్తం మీద చూసినప్పుడు తాపీగా తన కథని చెప్పడం మొదలుపెట్టి, ఉన్నట్టుండి ఏదో జ్ఞాపకం వచ్చి 'ఫాస్ట్ ఫార్వార్డ్' బటన్ నొక్కేసి, మళ్ళీ కాసేపు తాపీగానూ ఇంకాసేపు గబగబానూ కథచెప్పేసి హడావిడిగా ముగించేశారన్న భావన కలిగింది, పుస్తకం పూర్తిచేశాక. ఆత్మకథలు, నాటకాలు, సినిమాల కబుర్లు నచ్చేవాళ్ళు ఇష్టపడే పుస్తకం. (ఆర్కే బుక్స్ ప్రచురణ, పేజీలు  176, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులూ).

బుధవారం, జూన్ 10, 2015

భూచక్రం

గడిచిన రెండు దశాబ్దాలలో శరవేగంగా విస్తరించిన కొన్ని వ్యాపారాలలో రియల్ ఎస్టేట్ ఒకటి. వ్యవసాయ భూములని వ్యవసాయేతర ప్రయోజనాలకోసం, మరీ ముఖ్యంగా గృహ నిర్మాణాల కోసం వినియోగించడం అన్నది ఒకప్పుడు ఏమాత్రం ఊహించని పరిణామం. నూతన ఆర్ధిక విధానాల కారణంగా కొత్తకొత్త ఉద్యోగాల రూపంలో ఆదాయం పెరిగినట్టుగానే, కొత్తకొత్త ఖర్చు మార్గాలూ పుట్టుకొచ్చాయి. భూమి విలువని అకస్మాత్తుగా పెంచి, డిమాండ్ సృష్టించిన ఈ వ్యాపారం సరికొత్త సామాజిక వర్గాలనీ సృష్టించింది.

రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇతివృత్తంగా చేసుకుని తెలుగు సాహిత్యంలో ఎన్నో కథలు వచ్చాయి. అయితే, విస్తారమైన కేన్వాను వినియోగించుకుని నవలని రాసిన ఘనత మాత్రం 'దామల్ చెరువు అయ్యోరు' మధురాంతకం రాజారాం గారబ్బాయి మధురాంతకం నరేంద్రది. తిరుపతి సమీపంలోని 'కృష్ణానగర్' ప్రాంతంలో గృహనిర్మాణ పనుల్లో జీవితాలని వెతుక్కుంటున్న అనేకరకాల మనుషుల కథలని 'రెండేళ్ళ పద్నాలుగు' గా సంకలనం చేసిన నరేంద్ర, భూ వ్యాపారాన్ని గురించి మరింత లోతుగా పరిశోధన చేసి రాసిన నవల 'భూచక్రం.'

తిరుపతి కేంద్రంగా సాగే కథని రాష్ట్రంలోనే కాదు, దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తున్న ఏ  ప్రాంతానికైనా సులువుగా అన్వయించుకోవచ్చు. వందేళ్ళ కాలంలో వ్యవసాయ భూమి చేతులు మారి మారి ఎలా తన రూపాన్నీ, విలువనీ మార్చుకుందో, మూడు నాలుగు తరాల కాలంలో ఆ భూమి యజమానుల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో నిశితంగా చిత్రించిన నవల ఇది. రచయిత చేసిన పరిశోధన, సేకరించిన వివరాలతో పాటు, తనకి తెలిసిన విషయాన్ని ఓ కథలో పొదిగి నవలగా అందించిన తీరూ ముచ్చట గొలుపుతుంది. తెలిసిన నిజాల వెనుక తెలియని కోణాలని తెలియజెప్పే నవల ఇది.


తిరుపతి అనగానే మొదటగా గుర్తొచ్చేది కొండమీద కొలువైన వెంకటేశ్వర స్వామి. కొండంత దేవుడికి భక్తితో కానుకలు సమర్పించుకునే భక్తులకి కొదవలేదు. అయితే, ఈ కానుకలన్నీ నేరుగా స్వామికే సమర్పించే వారు కొందరైతే, తిరుపతిలో ఉన్న మఠాలకి బహూకరించిన వారు మరికొందరు. కానుకలలో ధన, కనక, వస్తు, వాహనాలతోపాటు వ్యవసాయ భూములూ ఉన్నాయి.  అలాంటి ఒకానొక మఠానికి చెందిన వ్యవసాయ భూములని సాగు చేసి, భుక్తిని వెతుక్కోడం కోసం వందేళ్ళ క్రితం తమిళనాడు నుంచి తిరుపతికి వలస వచ్చిన ఇళవరసి అనే స్త్రీది 'భూచక్రం' నవలలో ప్రధాన పాత్ర. కేవలం ఆమె వల్లే, మఠం పేరిట ఉన్న భూమి మనుషుల పేరుమీదకి మారింది.

సంపదని నిలబెట్టుకోవడం కష్టం. అందునా, అది అయాచితంగా వచ్చినది అయినప్పుడు మరీ కష్టం. బహుశా ఈ కారణానికే, ఇళవరసి కొడుకు రాజమన్నార్ రెడ్డి తనకి సంక్రమించిన మఠం భూములని కొద్ది కొద్దిగా తెగనమ్మి జల్సాలకి ఖర్చుచేయడానికి అలవాటు పడ్డాడు. పుత్ర సంతానం లేని రాజమన్నార్ రెడ్డికి ఇల్లరికపుటల్లుడు జనార్ధన రెడ్డి. మామని మించిన వాడు. సరిగ్గా జనార్ధన రెడ్డి సమయంలోనే తిరుపతిలో ఇళ్ళ నిర్మాణం ఊపందుకుంది. రాజమన్నార్ రెడ్డికి భూమి తనకి రావడం వెనుక ఉన్న 'కష్టం' తెలుసు. జనార్ధన రెడ్డికి అదీ తెలియదు. పైగా అత్తింటి సొమ్ము. అడిగేవాడు లేడు. భార్య నోట్లో నాలుకలేని మనిషి కావడంతో ఆస్థంతా హరించుకుపోయింది.

జనార్ధన రెడ్డి అల్లుడు అమిత్ రెడ్డి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. భార్య పేరిట ఉన్న కొద్దిపాటి భూమినీ అమ్మకానికి పెట్టి ఆ డబ్బుతో హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుక్కోవాలి అన్నది అతని ఆలోచన. అదిగో, ఆ అమ్మకం సమయంలో తెలుస్తుంది, మావగారి కుటుంబానికి ఒకప్పుడు ఎన్ని భూములు ఉండేవో.. ఇప్పటి రోజుల్లో అయితే వాటి విలువ ఎన్ని కోట్లు ఉండేదో. ఇంతకీ, మిగిలిన ఆ కాస్త భూమినీ అమిత్ రెడ్డి అమ్మగలిగాడా? ఈ ప్రశ్నకి రచయిత జవాబు చెప్పినా, నవల పూర్తిచేశాక ఎన్నెన్నో ప్రశ్నలు పాఠకులని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మరీ ముఖ్యంగా ఇళవరసి తో పాటు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ శేషారెడ్డిని మర్చిపోవడం కష్టం.

'ఆంధ్రప్రభ' దినపత్రికలో సీరియల్ గా ప్రచురితమైన 'భూచక్రం' నవలని విజయవాడకి చెందిన 'అలకనంద ప్రచురణలు' ప్రచురించింది. (పేజీలు  151, వెల రూ. 120, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, జూన్ 08, 2015

దాశరథి రంగాచార్య ...

అచ్చ తెలుగులో, అచ్చు పుస్తకంలో వేదాలని చదువుకోవడం అన్నది సాధ్యపడుతుందని ఇరవయ్యేళ్ళ క్రితం వరకూ ఎవరూ ఊహించలేదు. "అపౌరుషేయాలని అక్షరీకరించడమా?" అని ఆశ్చర్యపడ్డవారూ, ఆగ్రహం ప్రకటించిన వాళ్ళూ ఎందరో. ఓ సంస్కృతాంధ్ర పండితుడు ఆ కృషికి నడుం కట్టాడు. పేరున్న ఓ ప్రచురణ సంస్థ అచ్చొత్తి విక్రయించడానికి ముందుకొచ్చింది. ఫలితం.. ఇరవై శతాబ్దాలపాటు సాధ్యం కాని ఓ బృహత్కార్యం, ఇరవయ్యోకటో శతాబ్దం ప్రారంభానికి కొంచం ముందుగా సుసాధ్యమయ్యింది. ఎమెస్కో తలపెట్టిన వేదాల ప్రచురణకి అన్నీ తానై ముందు నిలిచి, విమర్శలకి తావులేని విధంగా వేదార్ధానికి పుస్తక రూపం ఇచ్చిన ఆ పండితుడు దాశరథి రంగాచార్య.

రంగాచార్య మరణ వార్త విన్న క్షణం నుంచీ ఎన్నెన్నో ఆలోచనలు. 'చిల్లర దేవుళ్ళు,''మోదుగుపూలు' నవలల్లో పాత్రల మొదలు 'జీవనయానం' లో పంచుకున్న విశేషాల వరకూ.. వీటితో పాటే తన సోదరుడిని గురించి దాశరథి కృష్ణమాచార్య చెప్పిన కబుర్లు.. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. నాలుగైదు సార్లు ఆయన ఉపన్యాసాలు విన్నా, ఎప్పుడూ పలకరించి మాట్లాడాలి అనిపించలేదు. అలాగని, రంగాచార్య ఏమీ సీరియస్ గా కనిపించే మనిషి కాదు. అయితే చెదరని చిరునవ్వు, లేదా భ్రుకుటి ముడివేసి దీర్ఘాలోచన.. ఈ రెండు భావాలే ఎక్కువగా కనిపించాయి ఆయన ముఖంలో. పలకరించినవారితో చాలా ఆప్యాయంగా మాట్లాడారు కూడా.

శిఖ, తిరునామం, విజ్ఞానంతో మెరిసే కళ్ళతో చూడగానే నమస్కరించాలనే భావన కలిగే సౌమ్యమైన మూర్తి రంగాచార్యది. అయితే, ఈ సౌమ్యత ఆయనలో కేవలం ఒక పార్శ్వం మాత్రమే. ఎందుకంటే, ఆయన పుట్టింది సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబం, నమ్మింది కార్ల్ మార్క్స్ సిద్ధాంతం. వైష్ణవాన్ని వదులుకోకుండానే, మార్క్సిస్టుగా జీవించడం, ఆయుధం పట్టి తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొనడం ఒక్క రంగాచార్యకి మాత్రమే సాధ్యపడింది. భిన్న ధృవాలుగా అనిపించే రెండు సిద్ధాంతాలనీ ఏకకాలంలో ఆచరించి చూపించారు తన ఎనభై ఎనిమిదేళ్ళ జీవితంలో.


రామాయణ, భారత, భాగవతాలని అమితంగా ఇష్టపడిన రంగాచార్య వాటిని మార్కిస్టు దృష్టి కోణం నుంచి చూసే ప్రయత్నం చేయకపోగా, వాటినుంచి 'మంచి' ని తీసుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. "విడి విడిగా చూస్తే రామాయణంలో తప్పులు కనిపిస్తాయి. కానీ, సమగ్రంగా చూడాలి. మానవజీవితాన్ని విశ్లేషించిన గ్రంధం రామాయణం.. ఇది సెక్యులర్ గ్రంధం" అన్నారు రంగాచార్య అనేక సందర్భాలలో. రామాయణంతో పాటు, భారతాన్నీ సరళంగా తెనిగించారు. రంగాచార్య మిగిలిన సాహిత్యం అంతా ఒక ఎత్తు, వేదాల తెనిగింపు ఒక్కటీ ఒక ఎత్తు. ఎన్నో విమర్శల నడుమ చేపట్టిన ఈ రచనని విజయవంతంగా పూర్తి చేశారు.

గడిచిన కొన్ని తరాల జీవితాలని కళ్ళముందు ఉంచే రచన, రంగాచార్య జీవితచరిత్ర 'జీవనయానం.' అప్పట్లో 'వార్త' ఆదివారం అనుబంధంలో సీరియల్ గా వచ్చేది. కేవలం ఈ సీరియల్ కోసమే ఆదివారం కోసం ఎదురుచూసేవాళ్ళం అప్పట్లో. ఇంగ్లీష్ కంపెనీలు భారతీయులకి తేనీరు అలవాటు చేయడం కోసం చేసిన ఎడతెగని ప్రయత్నాల మొదలు రజాకార్ల ఆగడాల వరకూ ఎన్నెన్నో సంఘటనలని కళ్ళముందు ఉంచారు. సీరియల్ గా వస్తున్న రోజుల్లోనే పుస్తకం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేలా చేసిన రచన అది. రంగాచార్య నవలలతో పాటు. 'జీవనయానం' కూడా గడిచిన తరాల తెలంగాణా జీవితాలని గురించిన రిఫరెన్స్ పుస్తకం అనడం అతిశయోక్తి కాదు.

పద్యం నుంచి గద్య రచనకి మళ్ళిన రంగాచార్య రచనల్లో ఎక్కడా నాన్చుడు ధోరణి ఉండదు. ముక్కుసూటిగా, కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం రంగాచార్య శైలి. మాటల్లోనూ, రాతల్లోనూ అదే నిర్మొహమాట ధోరణి. సోదరుడు కృష్ణమాచార్య విశాలాంధ్రని కోరుకుంటే, రంగాచార్య తెలంగాణాకి మద్దతు ఇచ్చారు. అయితే ఆయన కోరుకున్నది 'ప్రజా తెలంగాణా.' "నాయకులకి కాక, ప్రజలకి మేలు చేసే తెలంగాణా కావాలి"ఇది రంగాచార్య పదేపదే చెప్పిన మాట. నిండు జీవితాన్ని చూసిన రంగాచార్య మరణంతో తెలుగు సాహిత్యంలో ఓ శకం ముగిసిపోయింది అనిపిస్తోంది.

శనివారం, జూన్ 06, 2015

ఆర్తి అగర్వాల్ ...

పదిహేనేళ్ళ వయసులో ఆమె వెండితెరకి పరిచయమయ్యింది. పదిహేడో ఏట తారాపథానికి దూసుకు పోయింది. అయితే, అగ్రస్థానంలో ఆమె నాలుగైదేళ్ళ కన్నా నిలవలేకపోయింది. క్రమంగా కిందకి జారిపోయింది. ఈ తిరోగమనానికి కారణం ఆమె కాక, ఆమెని కన్న వాళ్ళూ, నమ్మిన స్నేహితులూ కావడం అత్యంత విషాదం. వెండితెరపై అగ్రస్థానానికి చేరడం కన్నా, ఆ స్థానాన్ని నిలుపుకోడానికి ఎక్కువగా కష్టపడాలి అన్న సత్యానికి ఆమె కెరీర్ మరో ఉదాహరణగా నిలిచింది. ఆమె పేరు ఆర్తి అగర్వాల్.

అమెరికాలో న్యూజెర్సీని ఓ ఆస్పత్రిలో అధిక బరువు తగ్గించుకోవడం కోసం ఆర్తి అగర్వాల్ చేయించుకున్న శస్త్రచికిత్స వికటించడంతో ఆమె కన్నుమూసిందనే వార్త ఓ చిన్న ఉలికిపాటు కలిగించింది. ఆర్తి వయసు కేవలం ముప్ఫై ఒక్క సంవత్సరాలు. అమెరికాలో పుట్టి పెరిగి, ఇండియా ట్రిప్ లో సినిమా రంగానికి పరిచయమై, ఆనతికాలంలోనే తారాపథానికి దూసుకుపోయి కేవలం తన చుట్టూ ఉన్న వాళ్ళ కారణంగా కెరీర్ ని నష్టపోయిన కథానాయిక. చిన్నవయసులోనే ఉత్థాన పతనాలని చూసి, వాటికి అతీతంగా నిలబడగలిగిన స్థితప్రజ్ఞత ఆమె సొంతం. 

వెంకటేష్ కథానాయకుడిగా విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా ఇద్దరికి బాగా కలిసొచ్చింది. ఒకరు సంభాషణల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. మరొకరు కథానాయిక ఆర్తి అగర్వాల్. హిందీలో ఏవరేజ్ గా ఆడిన 'పాగల్ పన్' ఆమె మొదటి సినిమా. ఆ సినిమాతోనే కొత్త టాలెంట్ ని వెతికి పట్టుకునే స్రవంతి,సురేష్ ప్రొడక్షన్స్ సంస్థల దృష్టిలో పడిందామె. అది యూత్ సినిమాలు తెలుగు తెరని ముంచెత్తుతున్న కాలం. యువ హీరోలు వరుసగా పరిచయమవుతున్న తరుణం. అప్పుడు నాయికగా కెరీర్ ఆరంభించిన ఆర్తి ఇటు యువ నాయకులతోనూ, అటు అప్పటికి తన తండ్రి వయసున్న అగ్ర హీరోలతోనూ ఏకకాలంలో సినిమాలు చేసి, ఎన్నో విజయాల్ని సొంతం చేసుకుంది.


తెలుగు సినిమాల్లో ఆర్తి ఎంతగా బిజీ అయ్యిందంటే, అప్పటివరకూ అమెరికాలో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆమె కుటుంబం ఒక్కసారిగా హైదరాబాద్ కి మకాం మార్చేసేంత. ఆమె వ్యవహారాల్లో ఆమె తండ్రి మితిమీరిన జోక్యం దర్శకనిర్మాతలకి తలనొప్పిగా మారినా, సెట్స్ పై ఆర్తి చాలా ప్రొఫెషనల్ కావడం ప్లస్ వరుసగా విజయాల్లో ఉండడం ఆమె కెరీర్ ని కాపాడాయి. నిర్మాతలనుంచి ప్రతి పైసానీ ముక్కు పిండి వసూలు చేసిన ఆమె తండ్రి, ఆ మొత్తాన్ని చాలా జల్సాగా ఖర్చు చేసేసేవాడు అంటారు. ఊపిరి సలపనంత బిజీగా ఉన్న తరుణంలో ఓ యువ కథానాయకుడితో జరిగిన ప్రేమ వ్యవహారం విఫలం కావడం ఆమెకి తగిలిన మొదటి షాక్ అంటారు ఆర్తిని బాగా తెలిసినవాళ్ళు.

ఆ షాక్ నుంచి బయట పడే ప్రయత్నంలో కుటుంబం నుంచి మద్దతు లేకపోగా ఒత్తిళ్ళు పెరగడం ఆమెని ఆత్మహత్యా ప్రయత్నం వైపు తోశాయని అప్పట్లో కొన్ని పత్రికలు రాశాయి. ఇన్ని ఒత్తిళ్ళ మధ్యా తన చెల్లెల్ని కథానాయికగా నిలబెట్టే ప్రయత్నాలు చేసింది ఆర్తి. అయితే, అక్కకి వచ్చినంత పేరూ, వచ్చినన్ని సినిమాలూ అదితికి రాలేదు. కారణాలు ఏవైనా, అతి తక్కువ కాలంలోనే ఆమె ఆకృతిలో మార్పులు వచ్చేశాయి. అప్పటి అగ్ర కథానాయకుడు చిరంజీవితో హిట్ సినిమా చేసిన ఆర్తి రేంజ్, అప్పటి హాస్యనటుడు సునీల్ పక్కన నాయికగా చేసేంతకి పడిపోయింది.

కుటుంబ కలహాలు, ఆత్మహత్యా ప్రయత్నాలతో అవకాశాలు బాగా సన్నగిల్లాయి. నాలుగైదేళ్ళ పాటు స్టార్డం చూసిన ఆమె, అవకాశాలు లేక పూర్తిగా గోళ్ళు గిల్లుకునే పరిస్థితికి వచ్చేసింది. వైవాహిక జీవితమూ ఆర్తికి కలిసిరాలేదు. అక్కడా వైఫల్యమే. దానితో, ఏదోలా సినిమా రంగంలోకి మళ్ళీ వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చిన్న చిన్న సినిమాలు, ప్రాధాన్యత లేని పాత్రలు, టెలి బ్రాండ్ టీవీ ప్రకటనలు.. వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. సినిమా రంగంలో, అందునా కథా నాయికలకి అదృష్టం అన్నది ఒక్కసారే తలుపు తడుతుందేమో. అవకాశాలు రాకపోగా ఆరోగ్యం దెబ్బ తినేసింది. తెలుగు సినిమా ప్రపంచం ఆమెని దాదాపుగా మరచిపోయిన సమయంలో మరణవార్త పలకరించింది.

"ఇవాళ చెబుతున్నాను.. ఈ అమ్మాయి కనీసం పది పదిహేనేళ్ళు ఇండస్ట్రీని ఏలుతుంది.." 'నువ్వు నాకు నచ్చావ్' విడుదలయ్యాక ఓ సినిమా మిత్రుడు అన్న మాటలు పదేపదే గుర్తొస్తున్నాయి. ఏలేందుకు అర్హతలూ, అవకాశాలూ ఉన్నా ఏలలేకపోయింది ఆర్తి. ఈ వైఫల్యం ఆమెది కాదు, ఆమెని కేవలం ఓ 'బంగారు బాతు'గా మాత్రమే చూసిన వాళ్ళందరిదీ. 'సినిమా వాళ్ళ జీవితాలు' అనే పాఠ్య గ్రంధంలో ఆర్తికీ ఓ పేజీ ఉంది.. ఆర్తి అగర్వాల్ ఆత్మకి శాంతి కలుగుగాక..

బుధవారం, జూన్ 03, 2015

'మేగీ' మాయ ...

ఉదయాన్నే త్వరగా తయారు చేయగలిగే బ్రేక్ ఫాస్ట్ అన్నా, మధ్యాహ్నానికి బాక్స్ లో  పిల్లలు మిగల్చకుండా  తినేసే లంచ్ ఐటెం అన్నా, ఓపికలేని సాయంత్రం పూట అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకు తినగలిగే స్నాక్ అన్నా మొదటగా గుర్తొచ్చేవి మేగీ నూడుల్స్. పిల్లల్నీ, పెద్దల్నీ సమంగా ఆకట్టుకున్న 'మేగీ' ఎంతవరకూ ఆరోగ్యకరం? ఢిల్లీలో మొదలైన ఈ ప్రశ్న ఇప్పుడు దేశం మొత్తాన్నీ చుట్టి రావడమే కాదు, షేర్ మార్కెట్ మీదా ప్రభావాన్ని చూపిస్తోంది. 'మేగీ' ఉత్పత్తుల్ని తయారు చేసి, మార్కెట్ చేస్తున్న స్విట్జర్లాండ్ సంస్థ 'నెస్లే' మాత్రం ఇప్పటివరకూ పెదవి విప్పలేదు.

ఢిల్లీ ప్రభుత్వం తాజాగా జరిపించిన పరీక్షల్లో 'మేగీ' నూడుల్స్ లో పరిమితికి మించి లెడ్ వాడుతున్నట్టుగా తేలడంతో ఆ ప్రభుత్వం మేగీ తినడం సురక్షితం కాదని తేల్చింది. ఢిల్లీ పరిశోధనా శాలల్లో పరిశీలించిన 13 ప్యాకట్ల మేగీ నూడుల్స్ లోనూ, పది ప్యాకట్లలో లెడ్ పరిణామం అనుమతించిన 2.5 పిపియెం (పార్ట్స్ పర్ మిలియన్) ని మించి ఉన్నట్టుగా తేలింది. కొద్ది రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ లేబరేటరీలలో జరిపిన పరీక్షల్లో ఒక మేగీ ప్యాకట్లో 17 పీపీయెం లెడ్ ఉన్నట్టుగా వెల్లడయ్యింది. అజనిమాటో గా పిలవబడే మొనోసోడియం గ్లుటామేట్ ని ఆహార ఉత్పత్తులలో వాడడాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. 'మేగీ' ఈ నిషేధాన్ని ఉల్లంఘించింది.

పరిమితికి మించి ఉప్పును వాడుతోంది అన్నది 'మేగీ' కి సంబంధించి బయట పడిన మరో ఉల్లంఘన. ఒక మనిషి సగటున తీసుకోగలిగే ఉప్పు రోజుకి ఆరు గ్రాములు. ఒక మేగీ ప్యాకట్లో ఉండే లవణం మూడు గ్రాములు!  అంటే, మేగీ తిన్న రోజున మిగిలిన ఆహార పదార్ధాల ద్వారా తీసుకునే ఉప్పుని నియంత్రించుకోవలసిన అవసరం ఉంది. అయితే, ఈ ఉప్పు శాతాన్ని గురించి మేగీ ప్యాకట్లపై ఎలాంటి ప్రస్తావనా కనిపించడం లేదు. నిషేధాలని ఉల్లంఘించడంతో పాటు, వినియోగదారులకి సమాచారం అందించకుండా తప్పుదోవ పట్టిస్తోంది అన్నవి 'మేగీ' పై వచ్చిన అభియోగాలు. ఢిల్లీ లో మొదలైన ప్రకంపనలు దేశం మొత్తానికి నెమ్మదిగా విస్తరిస్తున్నాయి.


'మేగీ' కి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న సినీ నటులు అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, ప్రీతీ జింతా లపై బీహార్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. చిన్న పిల్లల ఆహారానికి సంబంధిచిన ప్రకటనల తయారీ, ప్రసారం విషయంలో మిగిలిన దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో నిబంధనలు మరీ అంత కఠినంగా లేవు. వీటి అమలుతీరు కూడా ఏమంత గొప్పగా లేదు. ఇక, సెలబ్రిటీ ఎండార్స్ మెంట్లకి సంబంధించి ఎలాంటి నిబంధనలూ లేవిక్కడ. ఈ నేపధ్యంలో, బీహార్ ప్రభుత్వం పెట్టిన కేసులు ఎంతవరకూ నిలబడతాయి అన్నది ప్రశ్నార్ధకమే అయినప్పటికీ, ఎండార్స్ మెంట్లని గురించి కొంత చర్చ జరిగేందుకు మాత్రం దోహదం చేస్తాయి.

ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయానికి స్పందిస్తూ, కేరళ రాష్ట్రం ప్రభుత్వం నిర్వహించే షాపుల్లో 'మేగీ' అమ్మకాల్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ షాపులన్నీ ఇప్పుడు స్టాకుని వెనక్కి పంపే పనిలో ఉన్నాయి. శీతల పానీయాల్లో క్రిమిసంహారకాల నిల్వలు ఉన్నాయంటూ పరిశోధనా ఫలితాలతో ముందుకు వచ్చి దేశవ్యాప్తంగా సంచలానికి కారణమైన స్వచ్చంద సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సిఎస్ఇ) మేగీ విషయంలోనూ స్పందించింది. 'మేగీ' లో మోతాదుకు మించి లవణాలని వాడుతున్న విషయాన్ని తమ సంస్థ నాలుగేళ్ల క్రితమే బయట పెట్టిందనీ, ఆహార పదార్ధాల విషయంలో ప్రభుత్వానికి ఉదాసీనత తగదనీ చెబుతోంది సిఎస్ఇ. 'మేగీ' లో కార్బో హైడ్రేడ్లు మినహా పోషకాలేవీ లేవంటోందీ సంస్థ.

వీటన్నింటి ప్రభావం 'మేగీ' అమ్మకాల మీద ప్రభావం చూపిస్తోంది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లలో బుధవారం ఒక్క రోజునే నెస్లే షేర్లలో పదిశాతం తగ్గుదల నమోదయ్యింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి 'మేగీ' లో వాడుతున్న ఇన్ గ్రేడియంట్స్ ని గురించి నెస్లే ఇండియా ని వివరణ కోరింది కూడా. ఇప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ వర్గాలు, స్వచ్చంద సంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది కేంద్ర ప్రభుత్వ స్పందన కోసమే. ఇప్పటివరకూ రాష్ట్ర స్థాయిలో పరిశోధనలు చేసి, అమ్మకాల విషయంలో నిర్ణయాలు జరిగాయే తప్ప కేంద్రం నుంచి ఎలాంటి చర్యా, ప్రకటనా లేవు. బడా బహుళజాతి సంస్థ 'నెస్లే' నిబంధనలని ఉల్లంఘిస్తూ పట్టుబడినప్పుడు, కేంద్రం స్పందన ఎలా ఉంటుందన్నది ఊహకి అందడంలేదు.