ఆదివారం, జులై 31, 2011

చేపలెగరా వచ్చు!!!

చేపలు ఏటికి ఎదురీదగలవు.. కానీ ఆనకట్టలని యెగిరి దూకలేవు. సహజ నదీ ప్రవాహాలని మానవావసరాల కోసం అడ్డుకుని, దారి మళ్ళించేందుకు నిర్మించే ఆనకట్టలు కొన్ని జాతుల చేపలకి శాశ్వితంగా మరణశాసనం రాసేస్తున్నాయి. అయితే, ఇలా అంతరించిపోతున్న మత్స్య జాతిని రక్షించుకునేందుకు కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. జరుగుతున్న నష్టంతో పోల్చినప్పుడు ఈ ప్రయత్నాలు మాత్రం బహు స్వల్పమనే చెప్పాలి.

'సామన్' ఇది మన దేశపు చేప కాదు.. అమెరికన్ చేప జాతి. ఐరిష్, అమెరికన్ ప్రజల భోజనాల్లో మాత్రమే కాదు, జీవితాల్లోనూ సామన్ ఒక భాగం. ఒక ముఖ్యమైన భాగం. అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాల్లోనూ, గ్రేట్ లేక్ తదితర సరస్సుల్లోనూ కనిపించే ఈ అన్ హైడ్రస్ చేప, మంచి నీటిలో పుట్టి, సముద్రంలో పెరిగి, తిరిగి మంచినీటిలోనే సంతానాభివృద్ధి చేస్తుంది. తను మరణించి, తన సంతానానికి తొలి పౌష్టికాహారంగా మారిపోయే అరుదైన లక్షణం ఈ సామన్ చేపలది.

చిరు సామన్లకి సముద్ర వలసకి సిద్ధం అయ్యేందుకు అవసరమైన శారీరక మార్పులు సహజంగానే మొదలవుతాయి. సరిగ్గా ఐదు సంవత్సరాల వ్యవధిలో పరిణతి చెంది, సంతానోత్పత్తికి సిద్ధమై తిరిగి సముద్రం నుంచి మంచి నీటికి ప్రయాణం ప్రారంభిస్తాయి. ఇది సామాన్ల జీవన చక్రం. ఈ చక్రం ఆగిపోయింది. కారణం, నదులమీద కట్టిన ఆనకట్టలు. వాటి ఫలితంగా వాతావరణంలో వచ్చిన అనూహ్యమైన మార్పులు. ఈ మార్పులు ప్రకృతి ధర్మాల్ని మార్చేశాయి. నియమాలని తిరగరాశాయి.

భారీగా నిర్మించిన ఆనకట్టల మీద నుంచి సామన్లని ఎగిరేలా చేయడం ఎలా? అమెరికన్ సమాజానికి ఎదురైన ఈ సవాల్ కి సాంకేతికంగా వచ్చిన జవాబు 'చేపల నిచ్చెన.' సియాటెల్ లో ఉన్న క్లార్క్ ఇంగ్లిష్ బొటానికల్ గార్డెన్ సమీపంలో, యూనియన్ సరస్సు, వాషింగ్టన్ సరస్సులని పసిఫిక్ మహాసముద్రం తీరప్రాంతం పగెట్ సౌండ్ తో కలుపుతూ నిర్మించిన చిట్టెన్డన్ లాక్స్ లో చూడొచ్చు ఈ చేపల నిచ్చెనని.

ఎక్కడో అమెరికాలో ఉన్న సామన్ చేప ఏమైపోతే మనకెందుకు? ఆ చేపని మిగుల్చుకోడం కోసం వాళ్ళు ఏం చేసినా, చేయకపోయినా మనకేమిటి సంబంధం? ...ఈ ఆలోచనలని వదిలించుకోవడం అవసరం. ఎందుకంటే, మనదైన పులసకూడా సామన్ బాటలోనే ప్రయాణించేందుకు రంగం సిద్ధం అవుతోంది. సరిగ్గా సామన్ లాంటి జీవచక్రమే పులసది. గోదారిపై రాబోతున్న ఆనకట్టలు పులస మనుగడని ప్రశ్నార్ధకం చేయబోతున్నాయి.

జలావరణాన్ని ఇతివృత్తంగా తీసుకుని 'దృశ్యాదృశ్యం' నవలని రాసిన రచయిత్రి చంద్రలత సామన్ చేపలగురించి రాసిన చిరుపుస్తకం 'చేపలెగరా వచ్చు!!!' రెండేళ్ళ క్రితం ఆదివారం ఆంధ్రజ్యోతి ముఖచిత్ర కథనంగా వచ్చిన వ్యాసానికి, 'దృశ్యాదృశ్యం' నవలలో పెద్దకట్ట నిర్మాణం కారణంగా అదృశ్యమై పోయిన చంద్రవంక చేపని గురించి రాసిన 'సెందర వొంక' చాప్టర్ ని జతచేసి వెలువరించిన పొత్తమిది. మనకి తెలిసిన జలచరాల వెనుక ఉన్న తెలియని సంగతులని విశదంగా చెప్పే ఈ పుస్తకాన్ని ప్రభవ పబ్లికేషన్స్ ప్రచురించింది. (వెల రూ. 30. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శనివారం, జులై 30, 2011

ఉప్పులేక...

జీవిత రంగస్థలం మీద సందర్భానికి తగ్గట్టుగా పాత్ర పోషణ చేయడాన్ని గురించి చెప్పాలంటే ఉప్పుని మించిన ఉదాహరణ కనిపించదు. లవణము అని అచ్చతెలుగు లోనూ, సాల్ట్ అని ఇంగ్లిష్ లోనూ, సోడియం క్లోరైడ్ అని సైన్స్ లోనూ, 'జాడీ లోది' 'కాశీ రాచ్చిప్ప లోది' అని పూర్వ కాలపు రాత్రి భోజనాల్లోనూ మారు పేర్లు పొందిన ఒకానొక దినుసే ఇది, మరేమిటో అని అస్సలు కంగారు పడక్కర్లేదు. జీవిత రంగస్థలం లాంటి బరువైన విషయానికి ఉప్పులాంటి తేలిక పాటి ఉదాహరణా? అని కూడా సందేహం వలదు.

ఏదన్నా వంటకం.. కూరా, పులుసూ, పచ్చడీ... తీపి కానిది ఏదన్నా తీసుకోండి.. దానియొక్క రుచి దేనిమీద ఆధారపడి ఉంటుంది? కచ్చితంగా ఉప్పు మీదే కదా. ఉప్పు పడాల్సిన దానికన్నా కూసింత తగ్గినా, లేదా ఒక రవ్వ పెరిగినా వంటకం రుచి మారిపోతుంది. అంటే, ఉప్పు ఎంత పడాలో అంత మాత్రమే పడాలన్న మాట. కొంచమైనా ఎక్కువా కాకూడదు, తక్కువా అవ్వకూడదు. అలాగే మనం కూడా ఎప్పటి కెయ్యది ప్రస్తుతమో సరిగ్గా అలా ఉంటే చాలు. పప్పు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పరిమాణంలో తేడాలోస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్.

మనం చేయాల్సిన పనుల్ని చేయకుండా వదిలేయడం, మనవి కాని పనుల్ని మీదేసుకోవడం... రెండూ కూడా మనకి మంచి చెయ్యకపోగా చెడు చేసేవే. మనకి నిర్దేశింపబడ్డ విధుల్ని తప్పించుకుని తిరిగి ధన్యులం అయిపోదాం అని ఆలోచన చేయడం అంటే కోరి చిక్కుల్ని తెచ్చుకోవడమే. అలాగే, మన పరిధిలో లేనివి, మనవల్ల కానివీ అయిన పనుల్ని మొహమాటానికో, మరెందుకో ఒప్పుకుని ఆపై చేతులెత్తేయడం వల్ల మనం కేవలం శాశ్విత శత్రువులని మాత్రమే సంపాదించుకోగలం. (సిని, రాజకీయ జీవులకి ఈ 'మనం' నుంచి మినహాయింపు ఇవ్వబడింది, వారికి శాశ్వత మిత్రులూ, శత్రువులూ ఉండరన్నది జగమెరిగిన సత్యం).

చిన్నప్పుడు నేను తాతయ్యతో పాటు భోజనానికి కూర్చునేవాడిని. బామ్మ, చక్కగా అన్నీ వడ్డించి మేము తింటూ ఉండగా "వంటలెలా ఉన్నాయ్?" అని అడిగేది జనాంతికంగా. నిజానికి ఆ ప్రశ్న తాతయ్యని ఉద్దేశించి. కానైతే, అప్పటి నా అజ్ఞానం వల్ల ఆ విషయం తెలుసుకోలేక పప్పులోనూ, కూరలోనూ, పులుసులోనూ ఉప్పు ఎక్కువయ్యిందని చెప్పేసేవాడిని. అప్పట్లో నేను రోజువారీ రోటి పచ్చళ్ళకి కొంచం దూరంగా ఉంటూ ఉండడం వల్ల, ఆ విషయంలో నా కామెంటు రిజర్వు చేయబడి ఉండేది. బామ్మ చేతికి ఉప్పు ఎక్కువ పడేసే అలవాటు ఉండడం వల్ల, ఆవిడ ఏం వండినా ఉప్పు తగులుతూనే ఉండేది.

తాతయ్య ఈ సత్యం తెలిసిన జ్ఞాని. అందువల్ల మౌనంగా ఉండేవారు. నేను నా అత్యుత్సాహం, మరియు అప్పటి నా పోర్షన్ కి డైలాగు స్క్రిప్టు తెలియకపోవడం అనే కారణాల వల్ల అనవసరంగా నిజమాడి బామ్మకి శాశ్వత శతృవుగా మిగిలిపోయాను. ఇక, చెప్పాల్సిన డైలాగు చెప్పకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే, నేను ఎనిమిదో తరగతిలోకి వచ్చాక ప్రతి సంవత్సరంలాగే టైం టేబిల్ ఇచ్చారు. ఏ కారణం వల్లో తెలీదు కానీ ఏ మేష్టారూ ఇంగ్లిష్ క్లాసు తీసుకోలేదు. పరిక్షలు ఎవరికోసమూ ఆగవు కదా. అలా యూనిట్ పరిక్షలు వచ్చేశాయి.

కేవలం ఏడో తరగతి జ్ఞానంతో ఎనిమిదో తరగతి ఇంగ్లిష్ పేపరు రాయాల్సి రావడం వల్ల పాతిక్కీ ఏడు మార్కులు వచ్చాయి. తొమ్మిది వస్తే పాస్ మార్కు. అయినప్పటికీ నా ఏడు మార్కులే క్లాస్ ఫస్ట్. ప్రోగ్రస్ కార్డులో పాస్ మార్కుల కన్నా తక్కువ వచ్చిన మార్కులని ఎర్ర సిరాతో రౌండ్ చేసేవాళ్ళు, నాన్నల కళ్ళలో స్పుటంగా పడేలాగా. నా ఇంగ్లిష్ మార్కుల చుట్టూ ఉన్న ఎరుపు నాన్న కళ్ళలోకి వచ్చేసింది, సంతకం కోసం కార్డు ఇవ్వగానే. మేష్టారు లేరనీ, కనీసం ఒక్క పాఠమన్నా వినకుండా, చదవకుండా ఏడు మార్కులతో క్లాస్ ఫస్ట్ వచ్చాననే సత్యాన్ని కేవలం భయం వల్ల నాన్నకి చెప్పలేకపోయాను.

ఫలితంగా అప్పుడు కాసిన్ని దెబ్బలు మరియు తర్వాత చా...లా కాలం పాటు నాకు ఇంగ్లిష్ ఏమాత్రమూ రాదన్ననాన్న ప్రగాఢ నమ్మకం. "మా వాడికి పొట్ట కోస్తే ఇంగ్లిష్ ముక్క రాదు," అని చాలాసార్లు విన్నా, నాన్న నోటినుంచి. తర్వాత అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులే వచ్చినా, అప్పటికే ఒక నమ్మకం బలపడి పోవడం వల్ల, ఆ మార్కులని అనుమానంగా చూసేవాళ్ళు. బామ్మ విషయంలో ఉప్పెక్కువయితే, ఇక్కడ ఉప్పు తక్కువయ్యింది. రెండూ చేటే చేశాయి కదా. సందర్భానికి తగ్గట్టుగా తగుమాత్రంగా ప్రవర్తించడం వల్ల ఇలాంటి సమస్యల బారిన పడకుండా తప్పించుకోవచ్చు అన్నది నీతివాక్యం. ఉప్పు గురించి ఇంకా రాయాలనే ఉంది కానీ, టపాలో ఉప్పెక్కువవుతుందేమో మరి...

శుక్రవారం, జులై 29, 2011

పాఠకుడు-సమీక్షకుడు-విమర్శకుడు

పుస్తకాలు చదివే వాళ్ళందరూ పాఠకులే. ఆ పుస్తకాలని గురించి సమీక్షలు రాసేవాళ్ళు సమీక్షకులు, రచనని సునిశితంగా విమర్శించే వాళ్ళు విమర్శకులు. అక్షర జ్ఞానం, పుస్తకాలంటే ఆసక్తి ఉండి నచ్చిన పుస్తకాలని చదివే పాఠకులు మొదలు, ఆ పుస్తకంలో మూల వస్తువుకి సంబంధించిన రంగంలో కాకలుతీరి, రచనలో గుణదోషాలని సాధికారికంగా ప్రకటించగల విమర్శకుల వరకూ ప్రతి ఒక్కరికీ తాము చదివిన పుస్తకాలని గురించి ఏదో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది.

సమీక్షకుడికీ, విమర్శకుడికీ కొన్ని అర్హతలు కావాలి. ప్రస్తుతం అమలులో ఉన్న సంప్రదాయం ప్రకారం అయితే, పత్రికలు తగినంత అర్హత, అనుభవం ఉన్న వారిని సమీక్షకులుగానూ, విమర్శకులుగానూ నియమించుకుని, మార్కెట్లోకి వస్తున్న పుస్తకాలని వీరి ద్వారా సమీక్ష/విమర్శ చేయించి తమ పత్రికల్లో ప్రచురిస్తున్నాయి. సామాన్య పాఠకులకి ఉన్న అర్హతల్లా ముందుగానే చెప్పినట్టుగానే అక్షరజ్ఞానమూ, ఆసక్తీ మాత్రమే కాబట్టి వీళ్ళు పుస్తకాలు చదివి ఒక అభిప్రాయాన్ని నిశ్శబ్దంగా ఏర్పరచుకోవడమూ సమీక్షకుడో, విమర్శకుడో అలాంటి అభిప్రాయాన్నే ప్రకటించినప్పుడు సంతోషించడమూ జరుగుతూ ఉండేది.

సాంకేతిక పరిజ్ఞానం విరివిగా పెరగడం వల్ల బ్లాగులు అందుబాటులోకి వచ్చాయి. ఎవరికి వారు ఒక బ్లాగు ప్రారంభించుకుని తమ ఆసక్తుల మేరకి తమకి నచ్చిన, నచ్చని విషయాలని గురించి అదే ఆసక్తులున్న మరో నలుగురితో పంచుకోగలుగుతున్నారు. ఈ ఆసక్తులలో పుస్తకం పఠనం ఒకటి అయినప్పుడు అత్యంత సహజంగానే ఇలా పంచుకునే విషయాల్లో చదివిన పుస్తకాలూ, వాటి గురించిన అభిప్రాయాలూ వచ్చి చేరతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, బ్లాగ గలిగే అవకాశం ఉన్న ప్రతి పాఠకుడికీ తను చదివిన పుస్తకాలని గురించి తనవైన అభిప్రాయాలని ప్రకటించడానికి అవకాశం దొరికింది.

'ఈ పరిణామం మంచికా? చెడుకా?' ...మార్పు మొదలైన ప్రతిసారి మొదట వచ్చే ప్రశ్నే ఇది. ఇక్కడ అభిప్రాయాలు పంచుకుంటున్నది కేవలం పాఠకులు అయినందువల్ల, వీరి భావాలు సమీక్షకుల, విమర్శకుల భావాలంత పదునుగానో, విశాలంగానో ఉండకపోవచ్చు. అలాగే ఒక్కోసారి వారికి కనిపించని కోణాలు వీరికి కనిపించనూ వచ్చు. ఫలానీ పుస్తకాన్ని చదివాం అనే కబురుని నలుగురితో పంచుకోవాలనే ఉత్సాహం వల్లనో, అంతకు మించి ఏం చెప్పాలో తెలియక పోవడం వల్లనో ఒక్కోసారి కేవలం పుస్తకాన్ని గురించిన ప్రాధమిక సమాచారాన్ని మాత్రమే ఇచ్చి ఊరుకోనూవచ్చు.

ఈ పాఠకులకి వాళ్ళు చదివిన పుస్తకం పరమాద్భుతంగానో, లేదా కనీసం అద్భుతంగానైనా అనిపించినంత కాలం సమస్య ఏమీ ఉండదు. నచ్చని విషయాలని గురించి మాట్లాడడం మొదలు పెడితే...? సమీక్షకులు, విమర్శకుల ముఖతా ఇలాంటి విషయాలే వచ్చినప్పుడు వాటిని స్వీకరించడానికి అభ్యంతరం కనిపించదు, కానీ 'కేవలం పాఠకుడు' తనకి నచ్చని వాటిని గురించో, అభ్యంతరకరంగా అనిపించిన వాటిగురించో సౌమ్యంగానే చెప్పినా అది అభ్యంతరం అవుతోంది. ఒక రచనని మెచ్చవలసినది సమీక్షకులూ, విమర్శకులూ అయినా, నచ్చవలసింది మాత్రం పాఠకుడికే కదా.

వ్యక్తిగత దూషణలూ, రచయితనో, రచననో కించ పరిచే దాడులూ లేనప్పుడు - రాసిన వాళ్ళు ఎవరు అని కాక రాసిన విషయం ఏమిటి అన్నది చూడడం ద్వారా ఒక రచనని గురించి అనేకరకాల అభిప్రాయాలని తెలుసుకునే వీలుని కలిగిస్తున్నాయి బ్లాగులు. పుస్తకాలు చదివిన వారంతా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని పంచుకో గలుగుతున్నారిక్కడ. కేవలం బ్లాగులో రాయడం కోసం పుస్తకాన్ని హడావిడిగా చదివేసో, పూర్తిగా చదవకుండానో అభిప్రాయాన్ని ప్రకటించే సంస్కృతి ఇక్కడ లేదు. ఎందుకంటే, పత్రికలతో పోల్చినప్పుడు 'ఫీడ్ బ్యాక్' ఇక్కడ వేగవంతం, పారదర్శకం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పాఠకుల వేదిక. (ఈమధ్యనే నా టపా 'ముక్కోతికొమ్మచ్చి' పై ఈ బ్లాగులో జరిగిన ఓ ఆరోగ్యకరమైన చర్చ నేపధ్యంలో నాకొచ్చిన కొన్ని ఆలోచనలకి అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం..).

గురువారం, జులై 28, 2011

చలవ మిరియాలు

అచ్చ తెలుగు... జాను తెలుగు... పదహారణాల స్వచ్చమైన తెలుగుకి చిరునామా మల్లాది రామకృష్ణ శాస్త్రి రచనలు. తెలుగు భాషలో సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే వారు శాస్త్రి గారి వచనాన్ని చదివితే చాలు. రచయిత, కవి, సినీ గీత రచయితగా లబ్ద ప్రతిష్టులైన మల్లాది, 1930 నుంచి తర్వాతి మూడున్నర దశాబ్దాల కాలంలో వెలువరించిన వ్యాసాల సమాహారమే 'చలవ మిరియాలు.'

తనకి స్నేహితులైన కవులు, రచయితలు, నటుల గురించి మాత్రమే కాక, కొన్ని గ్రంధాలకి శాస్త్రి గారు వెలువరించిన పీఠికలూ, ఆనాటి సమస్యలని గురించి హాస్య వ్యంగ్య ధోరణిలో రాసిన వ్యాసాలనీ ఈ సంకలనంలో చేర్చారు. మల్లాది నూట మూడవ జయంతిని పురస్కరించుకుని, 2008 లో విశాలాంధ్ర ప్రచురణ సంస్థ వెలువరించిన ఈ 'చలవ మిరియాలు' సంకలనానికి మల్లాది నరసింహ శాస్త్రి సంపాదకత్వం వహించారు.

వ్యాసాలన్నీ పాఠకులని కాలయంత్రంలో కూర్చోబెట్టి వందేళ్ళ వెనక్కి అలవోకగా తీసుకు పోగలిగేవే. తల్లావఝుల శివ శంకర శాస్త్రి మొదలు కాటూరి మేష్టారు వరకూ మొత్తం పది మంది 'కవి మిత్రుల'ని పరిచయం చేశారు. విశ్వనాథ సత్యనారాయణ, పింగళి నాగేంద్ర రావు వంటి తెలిసిన వారిలో తెలియని కోణాలు తెలుసుకోవడంతో పాటు, వెంపటి నాగభూషణం, మిష్టర్ వెల్లటూరు వంటి వారిని గురించి కొత్తగా తెలుసుకోడానికి ఉపయోగపడే వ్యాసాలివి.

'మన కథకులు' శీర్షికన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, చలం, శిరోమణి లని గురించిన వ్యాసాలున్నాయి. శ్రీపాద వారు రాసిన మొత్తం కథలన్నీ కలిపి ఇరవై సంపుటాలు వెలువరించ వచ్చునంటే, ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నవి సంఖ్యలో ఎంత స్వల్పమో కదా. అంతేనా, శ్రీపాద హిందీ వ్యతిరేకతని వస్తువుగా తీసుకుని హాస్యస్పోరకంగా రాసిన వ్యాసం, హిందీ మన వాడుక భాషలో ఎంతగా విడదీయరానిదిగా కలిసిపోయిందో చెప్పకనే చెప్పారు. 'ఏకైక వీరుడు' అంటూ మొదలు పెట్టిన చలాన్ని గురించిన వ్యాసాన్ని "చిత్రాంగి చలం అజమాయిషీలో తరిఫీయదు అయిన తర్వాత...సారంగునికే దైవమిచ్చిన భార్య" అంటూ చమత్కార భరితంగా ముగించారు.

"కాళిదాసంతటి వాణ్ణి అందరి ఊహలూ సొంతానికి వాడుకుంటున్నాడని దిగ్నానుడు ఎక్కదీశాడు. ఇక సామాన్యుల విషయం చెప్పడం ఎందుకూ.. సరే భాష కూడా ఎవరి పోకడలు వారు పేటెంటు చేసుకున్నప్పుడు ఏమీ అనడానికి వీలు లేదు కదా" అంటూ 'కొత్త పోకడల'ని పరామర్శిస్తూనే, "ప్రతి యుగంలోనూ, ప్రతి దేశంలోనూ, దొంగలు అడపాదడపా ఉద్భవిల్లుతూనే వచ్చారు.దొంగలేని యుగం అందయుగము. దొంగలను కననేరని జాతికి చరిత్ర గాని, తదితర సభ్య జాతుల్లో స్థానం కానీ లేదు," అంటూ 'చోర మీమాంశ' ని సరదాగా వర్ణించారు శాస్త్రి గారు.

తంజావూరు రాజుల ఆస్థాన వేశ్య రంగాజీని గురించి ఎంత సరసంగా చెప్పారో, క్షేత్రయ్య ని గురించి అంత గంభీరంగానూ చెప్పారు. సాహిత్యంలో శృంగార సంబంధ ప్రస్తావనలని విపులంగా రాసిన శాస్త్రిగారు, 'హంస వింశతి' ని గురించి పరిశోధన పత్రం స్థాయిలో వ్యాసాన్ని ప్రచురించారు. 'రాధికా సాంత్వనము' సముఖ వేంకట కృష్ణప్ప నాయకుని రచనగా ప్రచారం చేయడం, ముద్దుపళని ని అవమానించడానికి అయి ఉంటుందని అభిప్రాయ పడ్డారు. సారంగధర-చిత్రాంగి కథని పోలిన కథలు ఏయే సాహిత్యంలో ఏయే రూపాల్లో వున్నాయో, శాస్త్రిగారి ద్వారా తెలుసుకోవచ్చు.

'తెలుగు నటులు' శీర్షికన అలనాటి రంగస్థల నటులు యడవల్లి సూర్యనారాయణ, డి.వి. సుబ్బారావు, నెల్లూరు నాగరాజారావు, స్థానం నరసింహా రావు, టి. రాఘవాచార్యులని గురించిన వ్యాసాలున్నాయి. యడవల్లి కి ఆహార్యం పై ఉన్న ప్రత్యేకమైన శ్రద్ధని గురించి రాస్తూ, కాలం కలిసిరాక కట్టెలు కొట్టే నలుడు పాత్రని పోషించినా, శిల్కు దుస్తులూ, వెండి గొడ్డలితోనే రంగస్థలం మీద కనిపించేవారన్న సంగతిని సరదాగా ప్రస్తావించారు. ఆనాటి రంగస్థల పరిస్థితులనీ, పాశ్చాత్య రంగస్థల ప్రభావాన్నీ తెలుసుకోడానికి ఉపయోగ పడే వ్యాసాలివి. సద్విమర్శ చేసే విషయంలో రెండో ఆలోచనలేదు మల్లాది వారికి. కేవలం విమర్శ కోసం విమర్శ కాకుండా, ఆయా లోపాలని ఎలా సరిచేసుకోవచ్చో సూచనలు ఇవ్వడం గమనించాల్సిన విషయం. (164 పేజీల ఈ సంకలనం వెల రూ. 90. విశాలాంధ్ర తో పాటుగా ఏవీకెఎఫ్ లోనూ లభిస్తోంది.)

బుధవారం, జులై 27, 2011

స్థానికం

స్థానిక సంస్థలకి జరగాల్సిన ఎన్నికలు ఏదో ఒక కారణానికి అలా అలా వాయిదా పడుతూ వస్తున్నాయి. మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల మొదలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల వరకూ చాలా చోట్ల ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధులు అధికారంలో లేరు. వాళ్ళ వాళ్ళ ఐదేళ్ళ పదవీకాలం ముగియడంతో, తాజా మాజీలుగా మారి తదుపరి ఎన్నికలకి సిద్ధం అవుతుండగా, ఇన్నాళ్ళూ వాళ్ళు పోషించిన బాధ్యతలని కూడా అధికారులే ఆనందంగా భరిస్తున్నారు.

ఈ ఎన్నికలు జరగకపోవడం అన్నది సామాన్య ప్రజలని పెద్దగా ఇబ్బంది పెడుతున్న దాఖలాలేవీ కనిపించడం లేదు. బహుశా స్థానిక నేతలు (స్థానిక ప్రభుత్వాలు అనాలేమో?!) ఉండడానికీ, లేకపోవడానికీ మధ్య భేదం వాళ్ళకి పెద్దగా తెలియడం లేదేమో. ఆమాటకొస్తే ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రం లోనూ ప్రభుత్వం అన్నది పనిచేస్తోందేమో అన్న సందేహం ఏమాత్రం కలగని విధంగా జన జీవనం సాగిపోవడం లేదూ?

తమ సత్తా చూపించుకోడానికి ఉత్సాహ పడుతున్న ప్రతిపక్ష పార్టీలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ ఎన్నికలు వచ్చి పడతాయా అన్న ఎదురు చూపులు పెరిగే కొద్దీ అలా అలా వెనక్కి వెళ్ళిపోతూ మరీ మరీ ఊరిస్తున్నాయీ ఎన్నికలు. రాజకీయ పరిస్థితులు అధికార పక్షానికి అననుకూలంగా ఉండి, తమ వాళ్ళే తమకి శత్రువులయ్యే విధంగా వాతావరణం ఉండడంతో, ఇది ప్రతిపక్షానికి అనుకూలంగా మారుతుందేమో అన్న సందేహం ఏలిన వారిలో కలగడం అత్యంత సహజం.

రాజకీయ విశ్లేషకులు స్థానిక సంస్థల ఎన్నికలని అధికార పక్షానికి లిట్మస్ టెస్ట్ గా అభివర్ణిస్తూ ఉంటారు. అమ్లాలనీ, క్షారాలనీ పరీక్షించడానికి అవి నీలి లిట్మస్ ని ఎర్రగా మారుస్తాయా లేక ఎర్ర లిట్మస్ని నీలం రంగులోకి మారుస్తాయా అనే పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చని చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా. అలా, ఈ స్థానిక ఎన్నికల్లో అధికార పక్షం గెలిస్తే, ప్రజల్లో ఆ పక్షం పట్ల విశ్వాసం కొనసాగుతున్నట్టు, అలా కానిపక్షంలో ప్రజల్లో వ్యతిరేకత మొదలై పరిస్థితులు ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నట్టూ ప్రజలు తీర్పు ఇచ్చారని అంచనా వేస్తారన్న మాట.

రాజకీయాల్లో చాలావరకూ బహిరంగ రహస్యాలే కాబట్టి, ఇక్కడ కూడా అలాంటి రహస్యం ఒకటి ఉంది. ఈ స్థానిక ఎన్నికలనేవి ఎప్పుడూ ఓ పార్టీ అధికారంలోకి వచ్చి, ఐదేళ్ళ పాలనా కాలంలో దాదాపు సగం పూర్తయ్యాక వస్తాయి. అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనప్పటికీ ప్రజలకి ఆసరికి కొత్త మోజు తీరి మార్పు కోసం ఎదురు చూడడం మొదలవుతుంది. అటు అధికార పక్షంలోనూ పదవులు ఆశించి భంగపడ్డ వాళ్లకి శిఖండి పాత్ర పోషించడం ద్వారా ఏలిన వారి ఎదుట తమ సత్తా ప్రదర్శించాలనే కోరిక మొదలవుతుంది.

ఈ కారణాలన్నింటి దృష్ట్యా, ఏ పక్షం అధికారంలో ఉన్నప్పటికీ, ఈ స్థానిక ఎన్నికలని తమకి సమయం అనుకూలంగా ఉన్నప్పుడు జరిపించుకోవాలనీ, రాజకీయ వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు వాయిదా వేయాలనీ మనసారా కోరుకోవడం, అధికారాన్ని ఆ నిమిత్తం ఉపయోగించడం, అటు ప్రతిపక్షం కూడా వాతావరణం తమకి అనుకూలంగా (అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా) ఉన్నప్పుడే ఈ ఎన్నికలు జరగాలని ఆశించడం జరుగుతూ వస్తోంది. అయితే, మరీ ఎక్కువ కాలం ఎన్నికలు వాయిదా వేసినా, స్థానిక ప్రతినిధులు లేకపోయినా తమకి వచ్చిన లోటేమీ లేదని జనసామాన్యం కనిపెట్టేస్తారేమో అన్న భయం రెండు పక్షాల్లోనూ ఉండకపోదు. కాబట్టి స్థానిక ఎన్నికలు ఎక్కువకాలం వాయిదా పడకపోవచ్చు..

మంగళవారం, జులై 26, 2011

సెందామరై

"సెందామరైని కథ మొదట్లోనే చంపేసి, పాఠకుల మనస్సులో మాత్రం ఆమెని చిరంజీవిని చేసేశారు రచయిత.." సి. రామచంద్రరావు కథా సంపుటం 'వేలుపిళ్ళై' చదివాక, ఒక్కో కథని గురించీ తన అభిప్రాయం చెబుతూ, 'వేలు పిళ్ళై' కథని గురించి మిత్రులొకరు చెప్పిన మాట ఇది. నిజం, సెందామరైని మర్చిపోవడం అంత సులువేమీ కాదు. వద్దనుకున్నా గుర్తొస్తూనే ఉంటుంది తను. కథానాయకుడు వేలు పిళ్ళై జీవితంలో రెండో భార్యగా అడుగుపెట్టి అతని కథని మార్చేసిన నాయిక సెందామరై.

ప్రోస్పెక్ట్ టీ ఎస్టేట్ లో పనిచేసే వేలుపిళ్ళై కి చాలా చిత్రంగా పరిచయమయ్యింది సెందామరై. ఎస్టేట్ కండక్టర్ తో గొడవపడ్డ వేలుపిళ్ళై ఉద్యోగం మానేసి, ఓ చిన్న కొట్టు మొదలు పెట్టాడు. కింద ఉన్న పొల్లాచ్చి సంతలో మిగిలిన సరుకు తెచ్చి ఎస్టేట్ కూలీలకి అమ్మే వ్యాపారం. అయితేనేం? అది బాగా కలిసొచ్చింది. భార్య పవనాళ్ ఒంటినిండా బంగారు నగలు అమర్చాడు. ఎంత సంపాదించినా గంప గయ్యాళి పవనాళ్ వల్ల ఏ సుఖమూ లేదు అతనికి. ఉన్నట్టుండి ఏదన్నా మంచిపని చేసి పేరు సంపాదించుకోవాలన్న కోరిక పుట్టింది వేలుపిళ్ళైకి.

ఎస్టేట్ కూలీలని అడిగితే, 'వినాయకుడి గుడి కట్టించ' మన్నారు. అలాగేనని మాటిచ్చాడు వాళ్లకి. కానైతే, పైసా సొమ్మివ్వని పవనాళ్ అడ్డం తిరిగి కూర్చుంది. చూస్తూ చూస్తూ దైవకార్యం కాదనడానికి మనసొప్పలేదు వేలుపిళ్ళైకి. పవనాళ్ కి తెలియకుండా దాచిన సొమ్ముతో చిన్న గుడి కట్టించాడు కానీ, విగ్రహ ప్రతిష్టకి డబ్బు లేదు. ప్రతిష్టకీ, శాంతులకీ కలిపి ఐదారు వేలవుతుందన్నారు పూజారులు. చిన్న సుళువు ఏమిటంటే, ఎక్కడైనా అనాదరంగా ఉన్న విగ్రహాన్ని దొంగిలించి తెస్తే శాంతులూ అవీ అవసరం లేదు.

అదిగో, అలా విగ్రహం దొంగతనానికి వెళ్ళినప్పుడు పరిచయమయ్యింది సెందామరై. వేలుపిళ్ళై-సెందామరై ల మధ్య మొదలైన సంబంధం చాలాకాలం రహస్యంగానే కొనసాగింది. కానైతే వినాయకుడి గుడి విషయం, ఆ నిమిత్తం వేలుపిళ్ళై ఆడిన అబద్ధాలు పవనాళ్ కి తెలిసిపోవడంతో, ఆమె ఇంట్లో ఉన్న సమస్తమూ తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ధైర్యం చేసి, సెందామరైని ఇంటికి తీసుకొచ్చేశాడు వేలుపిళ్ళై. రోడ్డున పడ్డ వేలుపిళ్ళైని తన మాట మంచితనంతో నిలబెట్టింది సెందామరై.

వస్తూనే, ఎస్టేట్ కూలీలందరినీ మంచి చేసుకుంది. సరిగ్గా అప్పుడే పరిచయమైన చెట్టియార్ మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టడానికి సహాయం చేశాడు. సెందామరై సాయంతో పిళ్ళై మళ్ళీ నిలదొక్కుకుంటూ ఉండగా, తిరిగి వచ్చి పంచాయితీ పెట్టించింది పవనాళ్. అయితేనేం, పంచాయితీ తీర్పు సెందామరై పక్షానే వచ్చింది. ఆసరికే పంచాయితీ పెద్దలందరినీ మంచి చేసేసుకుంది సెందామరై. వేలుపిళ్ళై కి పవనాళ్ వల్ల ఏవైతే దొరకలేదో, వాటన్నింటినీ అందించింది సెందామరై.

అలాంటి సెందామరై హఠాత్తుగా మరణిస్తే, చుట్టూ ఉన్నవాళ్ళంతా ఎలా స్పందించారు, అందుకు వేలుపిళ్ళై ప్రతిస్పందన ఏమిటన్నదే ఈ కథ. రచయిత వర్ణించిన కథా స్థలం తెలుగు ప్రాంతం కాదు, పొరుగు రాష్ట్రంలో ఉన్న టీ ఎస్టేట్. ఏ ఒక్క పాత్రా కూడా తెలుగు కాదు. అయినప్పటికీ ఇది అచ్చ తెలుగు కథ. పాఠకులని కథా స్థలంలోకి తీసుకెళ్ళి పోయె శైలీ, ఆపకుండా చదివించే కథనమూ ఈ కథ ప్రత్యేకత. పుస్తకం మూసి పక్కన పెట్టాక కూడా సెందామరై నేనున్నానంటూనే ఉంటుంది.

సోమవారం, జులై 25, 2011

బొమ్మ రేడియో

"వచ్చే వారం మన బడికి ఇన్స్పెక్టర్ గారు వస్తారు. మీ ఇళ్ళలో ఉండే బొమ్మలేవన్నా పట్టుకురండి. ఇన్స్పెక్షన్ అయిపోయాక, మళ్ళీ పట్టుకెళ్ళి పోదురుగాని," అని బళ్ళో మేష్టారు చెప్పేశారోరోజు. అందరూ ఇన్స్పెక్టర్ గారు వచ్చే విషయం ఇళ్ళలో చెప్పి, ఎవరేం బొమ్మలు తెస్తారో మర్నాడు తనకి చెప్పాలన్నారు. అందరూ ఒకేలాంటి బొమ్మలు తేకూడదు కదా మరి, అందుకన్న మాట. చందనం బొమ్మలు, రబ్బరు బొమ్మలు, కత్తి బొమ్మా, కారు బొమ్మా.. ఇలా ఎవరింట్లో ఉన్న బొమ్మల గురించి వాళ్ళం చెప్పుకుంటూ ఇళ్ళు చేరుకున్నాం.

నేను ఏ బొమ్మ పట్టుకెడితే బాగుంటుందా అని దారిపొడుగునా ఆలోచించాను కానీ, ఇంట్లో ఉన్న ఏ బొమ్మా నాకే నచ్చలేదు. అదీకాక, మంచి బొమ్మ బళ్ళో ఇచ్చేస్తే అది మళ్ళీ వెనక్కి వస్తుందో రాదో అని అనుమానం ఒకటి. సరే, ఇంటికి వెళ్ళగానే పాలైనా తాక్కుండానే మేష్టారు చెప్పిన సంగతి అమ్మ చెవిన వేశాను. అచ్చం అమ్మకి కూడా నాకొచ్చిన అనుమానమే వచ్చింది, ఇంట్లో బొమ్మలు పట్టుకెడితే మళ్ళీ తిరిగి వస్తాయో, రావో, ఒక వేళ వచ్చినా ఏమీ పాడవ్వకుండా ఉంటాయో లేదో అని. అటు చూస్తే, ఉత్తి చేతులతో వెళ్తే మేష్టారు ఊరుకోరు కదా.

"ఇంట్లో ఉన్న బొమ్మ ఎందుకూ.. మనం రేడియో బొమ్మ చేద్దాం. అదైతే మళ్ళీ ఇంటికి తేవక్కర్లేదు. బళ్లోనే ఉంచెయ్యొచ్చు," అంది అమ్మ. రేడియో బొమ్మ ఎలా చేయాలో, అది ఎలా వస్తుందో బోల్డన్ని సందేహాలు నాకు. కానైతే, నా ఆట బొమ్మల్లో ఏదీ కూడా మేష్టారికి ఇవ్వక్కర్లేక పోవడం బాగా నచ్చింది. మర్నాడు బళ్ళో పిల్లలందరూ ఎవరెవరు ఏయే బొమ్మలు తెస్తారో చెబుతుంటే, నేను లేచి "మా అమ్మగారు రేడియో బొమ్మ చేసి ఇస్తానన్నారండీ.. ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిపోయాక కూడా బళ్లోనే ఉంచెయ్యొచ్చు అన్నారు," అని చెప్పేశాను, చేతులు కట్టుకుని.

మేష్టారు ఏమీ అనలేదు కానీ, అవుట్ బెల్లులో నా ఫ్రెండ్సులందరూ చుట్టూ చేరి ఒకటే అడగడం, రేడియో బొమ్మ ఎలా చేస్తారని. నాకు మాత్రం తెలిస్తే కదా. కొందరేమో వాళ్లకి తోచినట్టు ఊహించేసుకున్నారు. మట్టితో బొంగరాలు, కారుబొమ్మా అవీ చేసినట్టే రేడియో కూడా చేసేస్తారని. నేను అవుననీ, కాదనీ చెప్పలేదు. బళ్లోకి తేకముందే, వాళ్ళని ఇంటికి పిలిచి చూపించేస్తానని మాత్రం చెప్పాను. ఆవేళ సాయంత్రం బడినుంచి ఇంటికి వెళ్లేసరికి, రేడియోకి కావాల్సిన సరంజామా సిద్ధంగా పెట్టేసింది అమ్మ. అవి చూసి నేను నోరు తెరిచేశాను.

ఎక్కడినుంచి సంపాదించిందో కానీ ఓ పెద్ద అట్ట పెట్టి, పాత స్కేలు, ఎలకలు కొరికేసిన జల్లెడ, కొన్ని సీసా మూతలు. "వీటితో రేడియో ఎలా చేస్తాం అమ్మా?" అని అడిగాను, గూట్లో ఉన్న పెద్ద రేడియోని చూస్తూ. "చూస్తూ ఉండు, నేను చేసేస్తాను కదా" అంది అమ్మ. అట్ట పెట్టికి రంగు కాగితం అంటించేసిందా.. సీసా మూతలనేమో నాబుల్లా అతికేసింది. స్కేలేమో, స్టేషన్లు చూసుకోడానికన్న మాట. జల్లెడని మిషన్ కత్తెరతో కత్తిరించి, అరిచేయంత గుండ్రటి ముక్క చేసింది. దానిని స్కేలు కింద అతికించి, రంగు పెన్సిళ్ళతో రంగులేసేసరికి మా బొమ్మ రేడియో అచ్చం నిజం రేడియోలా తయారయ్యింది.

ఆ రేడియో మీద నా పేరు కూడా రాసేసింది అమ్మ. మా ఇంటి దగ్గర ఉన్న నా ఫ్రెండ్సులతో పాటుగా, పెద్దవాళ్ళకి కూడా నచ్చేసింది ఆ రేడియో. బళ్ళో మేష్టారు కూడా భలే మెచ్చుకున్నారు. పుస్తకంలో లేకపోయినా, ఆవేళ మాకు 'రేడియోనందలి భాగములు మరియు అది పనిచేయు విధానము' పాఠం చెప్పేశారు. నా బొమ్మ రేడియోని చూపించే అని వేరే చెప్పక్కర్లేదు కదా. పిల్లలెవరికీ అందకుండా పై గోడమీద పెట్టేశారా రేడియోని. బళ్లోకి ఎవరైనా వస్తే మొదట రేడియోనే కనిపించేది. ఇన్స్పెక్షన్ కి వచ్చిన ఇన్స్పెక్టర్ గారు గోడ మీద నుంచి దింపించి మరీ చూశారు. నేను హైస్కూల్లో చేరాక కూడా, ఎప్పుడన్నా మా పాత స్కూలికి వెడితే ఆ రేడియో పలకరించేది నన్ను.

ఆదివారం, జులై 24, 2011

హడావిడి

ఆదివారం అన్న పేరే గానీ ఎంత హడావిడిగా జరిగిపోయిందో రోజంతా.. ఉన్నట్టుండి ఏవేవో పనులు.. బిజీ బిజీ.. వీటిలో పడి అసలు 'హడావిడి' విషయం మరిచిపోయాను. అదే, సుమన్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పించు ప్రీమియర్ షో 'హడావిడి.' సుమన్ బాబు కేవలం నిర్మాణ బాధ్యతలకి మాత్రమే పరిమితం అయినందువల్లనేమో ప్రచారం మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. టీవీలో అరుదుగా క్లిప్పింగులూ, పేపర్లో ఒకటి రెండు ప్రకటనలూ మాత్రం ఇచ్చేసి ఊరుకున్నారంతే.

సరే, నా హడావిడి కారణంగా ఈ 'హడావిడి' ని శ్రద్ధగా కూర్చుని చూడడం వీలు పడలేదు. అలాగని పూర్తిగా వదిలిపెట్టలేం కదా. అందుకని చెప్పేసి అప్పుడోసారీ, అప్పుడోసారీ ఓరకంట చూసి కథ, కథనం, సంభాషణలు, హాస్యం, సెంటిమెంటు తదితర నవరసాలు, మరీ ముఖ్యంగా నిర్మాణ విలువలని వీలు మేరకి పరిశీలించాను. ఈ షోతో జానకిరాం అనే కొత్త టెక్నీషియన్ కి సుమన్ ప్రొడక్షన్స్ లో దర్శకుడిగా ప్రమోషన్ రావడం తో పాటు, సుమన్ బాబు కథానాయకుడిగా విజయవంతమైన షోలు తీసిన దర్శకుడు ఇంద్రనాగ్ (పూర్వాశ్రమంలో నటుడే) కి హీరోగా ప్రమోషన్ వచ్చింది. కానైతే, కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఇంద్రనాగ్ నటన చూసినప్పుడు, దర్శకత్వం వహించింది సుమన్ బాబేమోనని అని అనుమానం వచ్చేసింది నాకు.

అసలు, 'అయ్యాం బాల్రాజ్ ఫ్రం బలభద్రపురం' అంటూ ఇంద్రనాగ్ పలికిన డైలాగుని ఒకానొక ప్రకటనలో చూసినప్పుడే, ఇంద్రనాగ్ అసలుపేరు నాగేంద్ర అనీ, సుమన్ బాబు సూచనల మేరకి ఇంద్రనాగ్ అని మార్చుకున్నాడనీ, అతని సొంతూరు బలభద్రపురం అనీ అప్పుడెప్పుడో కర్ణ పిశాచులు కూసిన విషయం గుర్తొచ్చింది. సరే, సొంతూరు మీద అభిమానం ఉండడం అభినందించాల్సిన విషయమే కదా. అసలంటూ ఏదో ఒక ఊరుండా లని సన్నివేశం బలవంతం చేసింది కాబట్టి (సిట్యుయేషన్ డిమాండ్ చేసింది కాబట్టి అన్నమాట) తన ఊరి పేరు వాడుకొని ఉంటాడు అనుకున్నా.

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచించిన ముక్కోణపు ప్రేమ కథలు ఒకటి కాకపొతే ఒకటైనా వెండితెర మీద చూసే ఉంటారు కదూ.. అంటే హీరో, హీరోయిన్ని మూగగా ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆ హీరోయిన్నేమో మరొకడితో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉంటుంది. అప్పుడు హీరో ప్రేమ త్యాగాన్ని కోరి, హీరోయిన్నీ, ఆమె ప్రేమికుడినీ కలపడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తాడు. చివర్లో హీరోయిన్ను తను ప్రేమించిన వాడి దుర్మార్గాన్నీ, హీరో ప్రేమనీ ఏకకాలంలో అర్ధం చేసేసుకుని, పెళ్ళిపీటల మీద నుంచిలేచొచ్చి హీరోతో నువ్వేకావాలి అంటుంది.

కొన్నైనా తెలుగు సినిమాలు గుర్తొచ్చాయి కదూ. అదేం విచిత్రమో కానీ, సుమన్ ప్రొడక్షన్స్లో పని చేసే ఏ ఒక్కరూ కూడా ఈ కథతో వచ్చిన ఏ ఒక్క సినిమానీ కూడా చూడలేదు. చూసి ఉంటే, ఇదే కథతో మళ్ళీ ఓ ప్రీమియర్ షో నిర్మించరు కదా.. బాలరాజు తను ప్రేమించిన అమ్మాయిని, ఆమె ప్రేమించే వాడికి ఇచ్చి పెళ్లి చేయడం కోసం చేసే 'హడావిడి' ని మూడుగంటల పాటు బుల్లితెర మీద చూపించారు. నిర్మాణ విలువలు కూడా నిర్మాణ సంస్థ స్థాయిలోనే ఉన్నాయి. అయినప్పటికీ, ఈ షోని సమర్పించడానికి పోటీలు పడుతూ వచ్చారు స్పాన్సర్లు.

అనేకానేక సినిమాల్లో మళ్ళీ మళ్ళీ చూసిన సన్నివేశాలు, వినేసిన డైలాగుల్ని ఇంద్రనాగ్ అండ్ కో ద్వారా మళ్ళీ చూపించారు ఇందులో. సుమన్ బాబు ఏదన్నా ప్రత్యేక అతిధి పాత్రన్నా చేసి ఉండకపోతాడా అన్న ఆశతో చివరికంటా ఓ కన్నేసి ఉంచాను ఈ షో మీద. చివరాకరికి పెళ్ళికూతురు, పీటల మీదనుంచి లేచొచ్చేసి, హీరో మోటార్ సైకిల్ మీద వాళ్ళిద్దరూ పారిపోయేటప్పుడు కూడా, సుమన్ బాబు కార్లో వచ్చి "ఇలా రోడ్డు మీద కాదు, ఇంటికెళ్ళి ప్రేమించుకోండి" అని సందేశం ఇవ్వడమో, లేక దగ్గరుండి పెళ్లి చేయడమో చేయకపోతాడా అని ఎదురు చూశాను. ప్చ్.. ఆ రెండూ కూడా జరగలేదు.

అయితే, నన్ను నిరాశ పరచని సంగతులు రెండు కనిపించాయి. మొదటిది ఒకానొక బ్రేక్ లో వచ్చిన ఒకానొక ప్రకటన. అప్పట్లో ఈ తరం 'మాయాబజార్' గా అనేకానేకుల ప్రశంశలు అందుకున్న నిరుపమాన పౌరాణిక చిత్రం 'ఉషాపరిణయం' త్వరలో ఈటీవీలో ప్రసారం కాబోతోందన్నది మొదటి ప్రకటన. థియేటర్లో ఈ సినిమాని చూడని వాళ్ళు, పౌరాణికాల్లో ఎన్టీఆర్ కి నిజమైన వారసుడు సుమన్ బాబేనన్న పెద్ద మనుషుల ప్రశంశలని గుర్తు చేసుకుని మరీ ఈ సినిమాని చూడాలి. అలాగే యూట్యూబ్లో భద్ర పరిచే ఏర్పాట్లూ జరగాలి. ఇక రెండోది, ఎండ్ టైటిల్స్ రోలవుతుండగా, క్లాప్ కొట్టిన సుమన్ బాబు కాళ్ళకి ఇంద్రనాగ్ భయముతో, భక్తితో, అనురక్తితో నమస్కరించడం. ఇంద్రనాగ్ హీరోగా మరికొన్ని ప్రీమియర్ షోలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కదూ.

శనివారం, జులై 23, 2011

ముక్కోతి కొమ్మచ్చి

చదివిన పుస్తకమో, చూసిన సినిమానో అంచనాలని అందుకోలేదంటే, ఆలోపం రాసిన/తీసిన వాళ్లదా లేక చదివిన/చూసిన వాళ్ళ అంచనాలదా? ఈ సందేహాన్ని తాజాగా మరోమారు కలిగించిన పుస్తకం ముళ్ళపూడి వెంకటరమణ ఆత్మకథ సిరీస్ లో మూడోదీ, చివరిదీ అయిన 'ముక్కోతి కొమ్మచ్చి.' అర్ధాంతరంగా ఆగిపోయిన రచన అవడం వల్ల అంతగా సంతృప్తికరంగా అనిపించడం లేదేమో అని సరిపెట్టుకుందామన్నా, రాసిన సంగతుల్లో చాలా వరకూ చర్విత చర్వణాలే.. అంటే 'కోతి కొమ్మచ్చి' '(ఇం)కోతి కొమ్మచ్చి' ల్లో చెప్పేసిన విశేషాలే..

చెప్పిన వాడు రమణ కాబట్టి, చెప్పిన తీరు వైవిధ్యంగా ఉన్నమాట నిజమే అయినప్పటికీ, వస్తు వైవిధ్యం మాత్రం బహు స్వల్పం. మొదటి భాగంలో బాల్యం, ఈదేసిన కష్టాలని గురించి ఎంతో స్పూర్తివంతంగా చెప్పిన రమణ, రెండో భాగానికి వచ్చేసరికి సినిమా అనే పెద్ద కొమ్మ మీదకి దూకి, అక్కడక్కడే ఒక్కో రెమ్మనీ పరామర్శిస్తూ ఆ భాగాన్ని పూర్తి చేశారు. ఈ మూడో భాగంలో అదే కొమ్మకి ఉన్న మరి కొన్ని రెమ్మలపై కొమ్మచ్చులాడడం వల్ల చదివిన పుస్తకాన్నే మళ్ళీ చదువుతున్న భావన కలిగింది చాలాసార్లు.

అక్కినేని తో తీసిన 'అందాల రాముడు' షూటింగ్ విశేషాలతో ప్రారంభమైన 'ముక్కోతి కొమ్మచ్చి' ప్రారంభంలో సందర్భానుసారంగా దువ్వూరి వారి 'స్వీయ చరిత్ర' ని తలచుకున్నారు ముళ్ళపూడి. అత్యంత ఖరీదుగా వేసిన పడవ సెట్టు, అక్కినేని మంచితనం, నట వైదుష్యం మీదుగా సాగిన పేజీలు కొందరు, ఆర్టిస్టులనీ, టెక్నీషియన్లనీ పరిచయం చేస్తూ, 'ముత్యాల ముగ్గు' 'భక్త కన్నప్ప' 'గోరంత దీపం' 'వంశ వృక్షం' 'త్యాగయ్య' తదితర షూటింగుల మీదుగా వెళ్లి, నందమూరి కోరిక మేరకి తీసిన వీడియో పాఠాలు, చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ అక్రమాల దగ్గర సడన్ బ్రేక్ తో ఆగిపోయాయి. ఆ కథ మరి ముందుకు కదలదన్న సత్యం కలుక్కుమనిపించిన మాట నిజం.

కొమ్మచ్చిలూ, రెమ్మచ్చిలూ అలవాటే కదా, ఇకపై ఏమన్నా కొత్త విషయాలు వస్తాయేమో అన్న ఆసక్తి చివరికంటా పేజీలని తిప్పించింది. ఆత్మ కథ ప్రారంభంలోనే 'కన్నప్ప' గారిని ఉతికారేసిన రమణ, ఈ మూడో భాగంలోనూ (చివరి అనాలని అనిపించడం లేదు, కానీ చివరిదే) కన్నప్ప కోసం కొన్ని పేజీలని కేటాయించారు. కానైతే, ఆయన కృష్ణంరాజు ని మెచ్చుకున్న సందర్భంలోనూ దీని వెనుక ఏమన్నా వ్యంగ్యం ఉందేమో అని అనుమానించాల్సి వచ్చింది. 'మనవూరి పాండవులు' గురించీ, అది హిందీలో 'హం పాంచ్' గా బాపూ నిర్దేశకత్వంలో రూపొందడం గురించీ కూడా వివరంగానే చెప్పారు.

సంగతులు చర్విత చర్వణాలవుతున్న విషయం గమనించినట్టు ఉన్నారు.. "ఈ కోతి ముసలిది అయిపోయింది" అని రాసుకున్నారు అక్కడక్కడా. రావి కొండలరావు ప్రేమకథ, అక్కినేనికి తప్పిపోయిన 'త్యాగయ్య' వేషం, శ్రీరమణ పేరడీలు, బాపూ రమణల మౌనపోరాటం లాంటి చమక్కులు అక్కడక్కడా మెరిశాయి. సీతాకల్యాణం, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం లాంటి చాలా బోలెడన్ని పునరుక్తులూ ఉన్నాయి. 'ఇల్లు మారిన భరాగో' శీర్షికతో, భమిడిపాటి రామ గోపాలానికి రాసిన నివాళి లో 'ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు' అంటూ రాసిన వాక్యమే ఈ సిరీస్ కి చివరి పేరా కావడం ఎంత యాదృచ్చికం!

ఆత్మకథ రెండో భాగంతోనే నిరాశ పరచడం ప్రారంభించిన ముళ్ళపూడి, ఈ సిరీస్ తో దానిని మరికొంచం ముందుకు తీసుకెళ్ళారు. ఆయన కోరుకున్న రీతిలో ఈ కథని ముగించి ఉంటే బహుశా చాలా ఆకర్షణీయమైన పుస్తకం అయి ఉండేదేమో.. అనుకోకుండా ఆత్మకథా రచనకి విరామం ఇవ్వడం, ఊహించని విధంగా అది శాశ్వత విశ్రాంతి కావడంతో ఈ అసంపూర్ణ రచనలో 'ఏదో మిస్సైన' భావన కలుగుతోందేమో. మొదటి రెండు భాగాలూ చదివిన పాఠకులు తప్పక చదివే రచన ఇది, పైగా ముళ్ళపూడి చివరి రచన కూడా. బాపూ కార్టూనులూ, క్యారికేచర్ల తో పాటుగా అనేక సినిమాల వర్కింగ్స్టిల్స్ , పబ్లిసిటీ స్టిల్స్ తో అలంకరించిన ఈ 131 పేజీల పుస్తకాన్ని 'హాసం' ప్రచురణలు అందుబాటులోకి తెచ్చింది. వెల రూ. 100. విశాలాంధ్ర తో పాటుగా అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తోంది.

శుక్రవారం, జులై 22, 2011

సులోచనాలు

రెండు రెళ్ళు నాలుగు. అంటే మనకున్న రెండు కళ్ళకి రెండు అద్దాలు జత పడితే మొత్తం నాలుగు కళ్ళన్న మాట. ఈ చతురాక్షులంటే (నాలుగు కన్నులు కలవారు -- కలది, కలవాడు బహువ్రీహి సమాసము) నాకు చిన్నప్పుడు భలే ఎడ్మిరేషన్. ఎందుకో తెలీదు కానీ, స్కూల్ రోజుల్లో కళ్ళజోడుతో ఉండే పిల్లలని చూస్తే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళన్న అభిప్రాయం కలిగేది. దాదాపుగా మేష్టర్లందరికీ కళ్ళజోడు ఉన్నప్పటికీ, వాళ్ళ విషయంలో ఇలాంటి భావన కలగక పోవడం ఏమిటో ఇప్పటికీ అర్ధం కాని విషయం నాకు.

హైస్కూల్లో లెక్కకు మిక్కిలిగా కళ్ళజోడు పిల్లలు కనిపించే వాళ్ళు. దానికి తోడు, మేష్టర్లు కూడా కొత్తగా కళ్ళజోడు వచ్చిన పిల్లలని ప్రత్యేకంగా పలకరిస్తూ "తలనొప్పా? సైటా? ఎన్నాళ్ళ నుంచీ? ఎన్ని పాయింట్లూ?" లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉండేవాళ్ళు. గాంధీజీ గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా ఆయన కళ్ళజోడు గురించి తప్పకుండానూ, ప్రత్యేకంగానూ చెబుతూ ఉండేవాళ్ళు. 'నాక్కూడా కళ్ళజోడు వస్తే బాగుండు' అని నేను కోరుకోడంలో అసహజం ఏమీ లేదు కదా. ఓ బలహీన క్షణంలో ఈ కోరికను ఇంట్లో ప్రకటించడం "రోగం కోరుకోవడం ఏమిటీ దరిద్రం" అని అక్షింతలు వేయించుకోవడం కూడా జరిగిపోయిందే తప్ప నాకు సులోచనాధారణ భాగ్యం మాత్రం కలగలేదు.

కళ్ళజోళ్ళ వాళ్ళ మీద నాకున్న ప్రత్యేకమైన అభిమానం కారణంగా, నెమ్మదిగా వాళ్ళతో స్నేహం చేసి, కళ్ళజోడు సంగతులు అప్పుడప్పుడూ కనుక్కుంటూ ఉండేవాడిని. ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళలో చాలామంది కళ్ళజోడుని ఓ అపురూపమైన ఆస్థిలా కాక, అనవసరమైన బరువుగా చూసేవాళ్ళు. దళసరి కళ్ళద్దాలు, లావుపాటి ఫ్రేములు చాలా బరువనీ, చాలా జాగ్రత్తగా చూసుకోవాలనీ కొంచం నేరంగా చెప్పేవాళ్ళు. నేను కనిపెట్టిన ఇంకో విషయం ఏమిటంటే కళ్ళ జోడు ఉన్నవాళ్ళందరూ ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళు కాదు. వాళ్ళలో చాలామంది కన్నా నాకే ఎక్కువ మార్కులు వచ్చేవి. అయినప్పటికీ కూడా నాకు కళ్ళజోడు మీద ప్రేమ తగ్గలేదు.

కాలేజీ మిత్రుల్లో కూడా కొందరికి కళ్ళజోళ్ళు ఉండేవి. వాళ్ళు ఎప్పుడైనా కళ్ళజోడు కళ్ళ మీద నుంచి నుదిటి మీదకో, తల పైకో జరుపుకుంటే "కళ్ళు నెత్తి కెక్కాయ్, ఏంటబ్బాయ్?" అంటూ సెటైర్లు వేసేవాడిని. కళ్ళజోడు ఉన్న అమ్మాయిలని గుర్తు పెట్టుకోవడం మరింత సులభం అన్నది ఆరోజుల్లో చేసిన ఒకానొక డిస్కవరీ. చూస్తుండగానే ఇంట్లో అందరికీ కళ్ళజోళ్ళు వచ్చేశాయి, నాకు తప్ప. ఉద్యోగం వస్తే తప్ప కళ్ళజోడు రాదేమో అనేసుకున్నాను. అదేదో పెళ్లి కాదేమో అన్నట్టుగా. కళ్ళజోడు కేవలం తలనొప్పో, సైటో ఉన్నవాళ్ళకి మాత్రమే కాదనీ, మామూలు వాళ్లకి కూడా గ్లాసెస్ ఉంటాయనీ తెలిసిన క్షణం నా ఆనందం వర్ణనాతీతం.

చూస్తుండగానే అన్ని చోట్లకి మల్లేనే కళ్ళజోళ్ళ విషయంలోనూ విప్లవాత్మకమైన మార్పులు వచ్చేశాయి. ఒకప్పటి సోడాబుడ్డి కళ్ళద్దాలు మచ్చుకైనా కనిపించడం లేదు. తేలికపాటి, అందమైన అద్దాలే. చిన్న చిన్న సమస్యలకి మైనర్ సర్జరీలు వచ్చేశాయి. సైటు ఉన్నవాళ్ళు కూడా లెన్సుల్లోకి మారిపోతున్నారు. ఇక ఫేషన్ కళ్ళజోళ్ళు సరేసరి. మల్టినేషనల్ కంపెనీలు కళ్ళజోళ్ళ మార్కెట్లోకి వచ్చేశాయంటే వీటి మార్కెట్ ఎంత పెరిగిందో సులభంగానే అంచనా వెయ్యొచ్చు. పెద్ద పెద్ద తారలు ఈ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్లు. ప్రతి రోజూ వందల కొద్దీ మోడళ్ళు మార్కెట్ ని ముంచెత్తుతున్నాయి.

చాలామందికి కళ్ళజోళ్ళు సేకరించడం ఒక హాబీ. చాలా మంది సిని తారలు కూసింత గర్వంగా ఈ హాబీని గురించి చెప్పుకుంటూ ఉంటారు. వెండితెర గయ్యాళి అత్తగారు సూర్యకాంతం దగ్గర వందల సంఖ్యలో కళ్ళజోళ్ళు ఉండేవిట. కొత్త వేషం అనగానే ఆవిడ మొదట ఎలాంటి కళ్ళజోడు బాగుటుందో అని ఆలోచించేవారంటే సులోచనాల మీద ఆవిడ ప్రేమని అర్ధం చేసుకోవచ్చు. అసలు సులోచనాలు అంటే కళ్ళు అని అర్ధం కానీ, ఎలా అయిందో ఇది కళ్ళద్దాలకి సమానార్ధకమైపోయింది. నవలాదేశపు రాణి యద్దనపూడి సులోచనారాణి నవలలు చదివే రోజుల్లో ఈవిడ ఒక్కో నవలకీ ఒక్కో కళ్ళజోడు మారుస్తుందేమో అనుకునే వాడిని. కానైతే నేను చూసిన మొట్ట మొదటి ఫోటోలో ఆవిడకి కళ్ళజోడు లేనేలేదు. ఇంతకీ నాదగ్గర ఎన్ని కళ్ళజోళ్ళు ఉన్నాయో చెబుతానని అనుకుంటున్నారు కదూ? అబ్బే, నా ఆస్థులు నేనెందుకు వెల్లడిస్తాను??

గురువారం, జులై 21, 2011

రాజశేఖర చరిత్రము

తెలుగులో తొలి నవల కందుకూరి వీరేశలింగం రచించిన 'రాజశేఖర చరిత్రము.' నూట ముప్ఫై మూడేళ్ళ క్రితం, వీరేశలింగం తన పత్రిక 'వివేక వర్ధని' లో సీరియల్ గా ప్రచురించిన ఈ నవల తర్వాతి కాలంలో ఎన్నో ప్రచురణలు పొందింది. ఐరిష్ రచయిత ఆలివర్ గోల్డ్ స్మిత్ రచించిన 'ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్' కి స్వేచ్చానుసరణగా రచయిత చేత ప్రకటింపబడిన ఈనవల ఆసాంతమూ అచ్చతెనుగు నుడికారంతో హాయిగా సాగుతుంది. కథా స్థలాలు ధవళేశ్వరం, రాజమండ్రి, పెద్దాపురం, పిఠాపురం కాగా, రచనాకాలానికి రెండు వందల సంవత్సరాలకి పూర్వం జరిగిన కథగా పాఠకులకి చెప్పారు రచయిత.

ప్రధాన పాత్ర గోటేటి రాజశేఖరుడు రాజమహేంద్రవరానికి సమీపంలోని ధవళేశ్వరం గ్రామంలో భార్య మాణిక్యాంబ, కుమార్తెలు రుక్మిణి, సీత, కుమారుడు సుబ్రహ్మణ్యంతో నివసిస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఇరవై, ముప్ఫై మంది బంధువులకి తక్కువకాకుండా ఇంటినిండా బంధు జనం. దూరపు చుట్టాలు సైతం పనిగట్టుకుని వచ్చి నెలల తరబడి ఉండిపోతూ ఉంటారు. ఇక రాజశేఖరుడు గారిని పొగిడి పబ్బం గడుపుకునే ఊరిజనానికి లోటు లేదు. కాశీ యాత్రకి వెళ్ళిన రాజశేఖరుడు గారి పెద్దల్లుడు నృసింహ స్వామి మార్గమధ్యంలో చనిపోయాడని వార్త రావడంతో కష్టాలు మొదలవుతాయి ఆ ఇంట్లో.

రుక్మిణికి అనారోగ్యం మొదలు కావడంతో దానిని నయం చేయడంకోసం వచ్చే భూత వైద్యులు, వాళ్ళు చేసే రకరకాల వైద్యాలు, పోయిన వస్తువులని అంజనం వేసి వెతికే వాళ్ళు, రాగిని బంగారంగా మారుస్తామని చెప్పే గోసాయిలు.. ఇలా ఇల్లంతా తిరునాళగా మారుతుంది. బంగారు నగలని రెట్టింపు చేసిస్తానన్న గోసాయి మాటలు నమ్మిన రాజశేఖరుడు, ఇంట్లో బంగారం మొత్తం అతని చేతిలో పెట్టడం, అతగాడు నగలన్నీ పట్టుకుని ఉడాయించడంతో అంత గొప్ప రాజశేఖరుడూ కుటుంబంతో సహా రోడ్డున పడతాడు. ఒకప్పుడు ఆహా ఓహో అన్నవాళ్లు పలకరించినా తిరిగి చూడడం లేదు. ముప్పొద్దులా అతని ఇంట భోజనం చేసిన వాళ్ళూ, చేబదుళ్లు తీసుకున్న వాళ్ళూ ముఖం చాటేస్తారు.

తన చుట్టూ ఉన్న వాళ్ళ నిజ స్వరూపాలు తెలుసుకున్న రాజశేఖరుడికి, కుటుంబంతో కలిసి కాశీయాత్ర చేసి రావాలన్న సంకల్పం కలుగుతుంది. ఇంటిని తాకట్టు పెట్టి, యాత్రకి బయలుదేరిన ఆకుటుంబానికి దారిలో ఎదురైన అనుభవాలతో పాటుగా, పోగొట్టుకున్న సంపదని తిరిగి పొందడం, విలువైన పాఠాలు నేర్చుకోవడంతో నవల ముగుస్తుంది. 'తొలి నవల' అనగానే బుడి బుడి అడుగులని ఊహించుకునే పాఠకులని ఆశ్చర్య పరుస్తూ, అతి తక్కువ నాటకీయతతో, ఉత్కంఠ భరితమైన మలుపులతో ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగే కథనం ఈ నవల ప్రత్యేకత. ధవళేశ్వరములోని ధవళగిరి వర్ణనతో మొదలయ్యే ఈ నవల, ప్రారంభంలో వ్యాస రూపంలో ఉన్నా పేజీలు తిరిగే కొద్దీ కథ మొదలై రాను రాను విడవకుండా చదివిస్తుంది.

అప్పటికే సంఘ సంస్కారం మొదలు పెట్టిన వీరేశలింగం ఆనాటి సాంఘిక సమస్యలనన్నింటినీ కథానుసారంగా చర్చకి పెట్టారు నవలలో. గ్రహదోషాలు, జాతకాలు, బాల్య వివావాహాలు, వితంతువుల సమస్యలు, చోర భయం లాంటి ఎన్నో అంశాలని కథలో భాగం చేశారు. అయితే, కుటుంబ సభ్యులంతా విడిపోవడం, మళ్ళీ కలవలవడం, ఊహించని విధంగా వారికి అందే సహాయాలు ఇవన్నీ కొంత నాటకీయంగా అనిపించినా తొలి నవలలో ఈమాత్రం నాటకీయత ఉండడం సహజమేనని సరిపెట్టుకోగలం. కథని ఎన్నో మలుపులు తిప్పినా, సుఖాంతం చేశారు చివరికి. మనుషుల నిజ గుణాలని తెలుసుకున్న రాజశేఖరుడు తిరిగి పూర్వ వైభవం పొందాక వారితో ఎలా వ్యవహరించాడన్నది సైతం విపులంగా రాశారు. "కొట్టుకొని పోయె కొన్ని కోటిలింగాలు... వీరేశలింగమొకడు మిగిలెను చాలు" లైన్స్ గుర్తొస్తూ ఉంటాయి, నవల చదువుతుంటే.

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 1987 నుంచీ పదేపదే ప్రచురిస్తున్నఈ నవలలో మెచ్చుకోవాల్సిన అంశం ఫుట్ నోట్స్. ప్రచురణ కర్తలు ఏర్పాటు చేసిన ఈ ఫుట్ నోట్స్ సాయంతో, నవలలో కొన్ని సన్నివేశాలకి మూలాలని, కొన్ని పదాలకి అర్ధాల్ని, అలాగే అలాంటి సంఘటననే పోలిన సంఘటనలు రచయిత జీవితంలో జరిగిన వైనం, 'స్వీయ చరిత్ర' లో అందుకు సంబంధించిన వివరాల్నీ విపులంగా తెలుసుకోవచ్చు. అలాగే కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి పెరగడాన్ని గురించీ కూడా ఫుట్ నోట్స్ లో ప్రచురణ కర్తలు వివరించారు. సుమారు ఇరవై ఏళ్ళ క్రితం దూరదర్శన్లో ధారావాహిక గా ప్రసారమైన 'రాజశేఖర చరిత్రము' లో దేవదాస్ కనకాల కుటుంబం రాజశేఖరుడి కుటుంబంగా కనిపించింది. విశాలాంధ్రతో పాటు, అన్ని పుస్తకాల షాపులూ, ఏవీకెఎఫ్ లోనూ లభ్యం. (పేజీలు 223, వెల రూ. 60).

బుధవారం, జులై 20, 2011

నాన్న

ప్రయోగాలు చేయడంలో మన తెలుగు హీరోలతో పోల్చినపుడు తమిళ హీరోలెప్పుడూ ముందుంటున్నారు. ప్రయోగాలని అభిమానులు అంగీకరించరు అన్నది మన తెలుగు హీరోలని సర్వత్రా పట్టి పీడించే సమస్య. తమిళ హీరోలకి ఆ శషభిషలేవీ లేవు కాబట్టి వైవిధ్య భరితమైన పాత్రలని ఎంచుకుని, ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తునారు. 'అపరిచితుడు' లాంటి హిట్లూ 'మల్లన్న' లాంటి ఫ్లాపులూ తన ఖాతాలో వేసుకున్న నటుడు విక్రమ్ వెండితెర మీద చేసిన మరో ప్రయోగం 'నాన్న,' తమిళం నుంచి ('దైవా తిరుమగళ్') అనువాదమై గత వారమే విడుదలయ్యింది.

ఇది మానసికంగా ఎదగని ఒక తండ్రి కృష్ణ (విక్రమ్) అతని ఐదేళ్ళ కూతురు వెన్నెల (బేబీ సారా) ల కథ. పురిట్లోనే తల్లిని పోగొట్టుకున్న వెన్నెలని అల్లారు ముద్దుగా పెంచుతాడు కృష్ణ, ఊటీలోని ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో పని చేసే చిరుద్యోగి. కృష్ణ అంటే అందరికీ అభిమానం. అతను అడక్కుండానే పాప పెంపకంలో సహాయం చేస్తూ ఉంటారు చుట్టుపక్కలవారు. వెన్నెలకి ఐదో ఏడు రాగానే ఆమెనో మంచి స్కూల్లో వేస్తాడు కృష్ణ. ముమ్మూర్తులా తండ్రి మంచితనాన్ని పుణికి పుచ్చుకున్న వెన్నెల ఎంతో తెలివైనది కూడా. "నేను లేనప్పుడు నాతో మాట్లాడాలంటే ఆకాశంలో కనిపించే వెన్నెలతో మాట్లాడు నాన్నా.." అంటుంది తండ్రితో.

వెన్నెల చదివే స్కూలు యాజమాన్యమే కృష్ణని మోసం చేసి, ఆ పాపని కిడ్నాప్ చేస్తుందొక రోజు. "నాకు వెన్నెల కావాలి.." అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ అడుగుతూ కృష్ణ విశాఖపట్నం వీధుల్లో తిరుగుతూ ఉండడం సినిమాలో ప్రారంభ సన్నివేశం. కోర్టులో వాదించడానికి కేసుల్లేక గోళ్ళు గిల్లుకుంటున్న న్యాయవాది అనూరాధ (అనుష్క) దగ్గరికి వస్తాడు కృష్ణ. మొదట్లో కృష్ణని ఓ పిచ్చివాడిగా తీసిపారేసిన అనూరాధ, చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని ద్వారా కృష్ణ గతం, అతనికి జరిగిన అన్యాయం తెలుసుకుని కేసు టేకప్ చేయడానికి అంగీకరించి, వెన్నెలని కోర్టులో ప్రవేశ పెట్టాలంటూ 'హెబియస్ కార్పస్' పిటిషన్ వేస్తుంది.

అవతలి పక్షం న్యాయవాది మరెవరో కాదు, ఓటమి అంటే ఏమిటో తెలియని భాష్యం (నాజర్). అసలు నిన్న మొన్నటివరకూ భాష్యం దగ్గర జూనియర్ గా పనిచేసే అవకాశం వస్తే చాలని ఎదురు చూసింది అనూరాధ. అంతటి భాష్యాన్ని ఎదుర్కొని అనూరాధ కేసుని గెలవగలిగిందా? కృష్ణ వెన్నెలని కలుసుకో గలిగాడా? వెన్నెలని కిడ్నాప్ చేసి, కృష్ణ నుంచి దూరం చేయాలని స్కూలు వాళ్ళు ఎందుకంత పట్టుదలగా ఉన్నారు? కూతురికోసం కృష్ణ ఏం చేశాడు? తదితర ప్రశ్నలన్నింటికీ జవాబులిస్తూ బరువుగా ముగుస్తుందీ సినిమా.

కేరక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ మీద దృష్టి పెట్టిన దర్శకుడు విజయ్ ఇందుకోసమే ఎక్కువ స్క్రీన్ టైం ని వినియోగించాడు. సినిమా ప్రారంభంలోనే కృష్ణ తన అమాయకత్వంతో కూడిన మంచితనంతో ఓ చిల్లర దొంగ మనసు మార్చడం, పొరపాటున గూటి నుంచి జారిపడ్డ పక్షి పిల్లని చాలా కష్టపడి తిరిగి గూటిలోకి చేర్చడం ద్వారా జరగబోయే కథని సూచన ప్రాయంగా చెప్పాడు. తమ 'మేడం' కి కేసులు తేవడం కోసం అనూరాధ జూనియర్లు పడే పాట్లు లాంటివన్నీ చాలా వివరంగా చూపించడంతో సన్నివేశాల నిడివి, మొత్తంగా సినిమా నిడివి బాగా పెరిగి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి చేరింది. సబ్జక్టు కూడా బరువైనది కావడంతో, విడివిడిగా సన్నివేశాలన్నీ బాగున్నప్పటికీ సినిమాని సాగదీశారన్న భావన కలిగింది.

నటీనటుల పరంగా మొదట చెప్పుకోవాల్సింది కృష్ణ గా చేసిన విక్రమ్ గురించే. నిజానికి ఈ తరహా ఎదిగీ ఎదగని పాత్రల మీద 'స్వాతిముత్యం' లో కమల్ హాసన్ చేసిన పాత్ర ప్రభావం ఎంతో కొంత ఉండడం సహజం. అయితే నటనలో ఆ ఛాయలేవీ రాకుండా జాగ్రత్త పడ్డాడు విక్రమ్. అయితే కొన్ని కొన్ని సన్నివేశాల్లో 'పా' లో అమితాబ్ నటనని గుర్తుచేశాడు. తర్వాత చెప్పుకోవాల్సింది వెన్నెలగా చేసిన బేబీ సారా గురించి. తొలి సినిమానే అయినప్పటికీ, చాలా సన్నివేశాల్లో విక్రమ్ తో పోటీ పడిందీ చిన్నారి. ఈమె చేత పలికించిన కొన్ని డైలాగులు బాగా గుర్తుండిపోతాయి. 'అమ్మేదీ' అని అడిగినప్పుడు 'దేవుడి దగ్గరుంది' అని కృష్ణ చెప్పగానే, 'ఏం? దేవుడికి అమ్మ లేదా?' అని అడుగుతుంది వెన్నెల.

అనుష్క విక్రమ్ తో కన్నా, నాజర్ తో పోటీ పడి నటించిందనడం సబబు. ఎందుకటే, వాళ్ళిద్దరి మధ్యనే ఎక్కువ కాంబినేషన్ సీన్స్ (కోర్ట్ సన్నివేశాలు) ఉన్నాయి. సహాయ నటుల్లో ఎక్కువమంది తమిళులే. తెలుగు నటి సురేఖావాణి కి చెప్పుకోదగ్గ పాత్ర దొరికింది. కథాంశం బరువైనది కావడంతో వీలున్న చోటల్లా హాస్యాన్ని జతచేసి బరువుని తగ్గించాలన్న దర్శకుడి ప్రయత్నం కొంతవరకూ ఫలించింది. కానైతే, సినిమా నుంచి బయటికి వచ్చాక వెంటాడేవి మాత్రం కరుణరస ప్రధానమైన దృశ్యాలే. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతంలో పాటలతో పాటు, మొదటి సగంలో నేపధ్య సంగీతమూ బాగుంది. విక్రమ్ రెండు పాటలని పాడాడు కూడా.

చివర్లో వచ్చే విక్రమ్ అనుష్కల గ్రాఫిక్స్ వానపాట లేకపోయినా నష్టం లేదు. నాయికానాయకులకి డ్యూయట్ ఉండాలన్ని బాక్సాఫీస్ నియమం ప్రకారం ఇరికించినట్టున్నారు. మెచ్చుకోవాల్సిన మరో అంశం నీరవ్ షా ఫోటోగ్రఫి. ఊటీ అందాలని తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. తమిళ నేటివిటీ పంటికింద రాయిలా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మొత్తంగా చూసినప్పుడు సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమా సీరియస్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చుతుంది. ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే మరింత బాగుండేది అనిపించింది. విక్రమ్ తో పాటు సారాకీ అవార్డులు లభించే అవకాశం ఉంది.

మంగళవారం, జులై 19, 2011

నాలుగు నవలికలు

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ విడుదల చేస్తోన్న 'పాలగుమ్మి పద్మరాజు రచనలు' సిరీస్ లో మూడో సంకలనం పద్మరాజు రచించిన నాలుగు నవలికల సమాహారం. మొదటి సంకలనంలో కథలనీ, రెండో సంకలనంలో 'రెండవ అశోకుడి మూన్నాళ్ళ పాలన' 'రామరాజ్యానికి రహదారి' 'నల్లరేగడి' నవలలల్నీ ప్రచురించిన విశాలాంధ్ర, ఈ సంకలనంలో 'బ్రతికిన కాలేజీ' 'చచ్చి సాధించాడు' 'భక్త శబరి' 'చచ్చిపోయిన మనిషి' నవలికలని చేర్చింది.

కథావస్తువులన్నింటిలోనూ 'మృత్యువు' అంటే పద్మరాజు గారికి ప్రత్యేకమైన ఇష్టమన్న సంగతి ఆయన కథలు చదివిన వాళ్లకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజా సంకలనంలోని మూడు నవలికల పేర్లు మృత్యువుని సూచించేవే కావడం విశేషం. మొదటి నవలిక 'బ్రతికిన కాలేజీ.' నిజానికి కథకీ, శీర్షికకీ ఏమాత్రమూ సంబంధమూ లేదు. కనీసం అందుకు సంబంధించిన వివరణా లేదు. 'నా సంజాయిషీ' పేరిట పద్మరాజు రాసిన ముందుమాట ఈ నవలిక ప్రత్యేకత.

'బ్రతికిన కాలేజీ' కి వోడ్ హౌస్ శైలి స్పూర్తినిచ్చిందని చెబుతూనే, "వోడ్ హౌస్ లాగా వ్రాయగలగడం అసంభవమని తెలుసు. అయితే వ్రాయాలన్న అభిలాష చాలా కాలంగా బాధ పెడుతోంది. అసాధ్యమైనది సాధించాలని పూనుకున్నాను, నా వైఫల్యాన్ని మీకర్పిస్తున్నాను" అన్నారు పద్మరాజు తన సంజాయిషీలో. ఆసాంతమూ నవ్వుల్లో ముంచెత్తే 'బ్రతికిన కాలేజీ' ఒక ప్రేమకథ. పెళ్ళిచూపులకి వెళ్లి, పెళ్ళికూతురి చెల్లెలితో తొలిచూపులోనే ప్రేమలో పడ్డ యువకుడు పట్టూ కథ.

పట్టూ ప్రేమని గెలిపించే బాధ్యతని తన మీద వేసుకున్న అతని స్నేహితుడు మిష్టర్ చింతా ఈ నవలికలో ప్రధాన కథానాయకుడు. శాంతమ్మ, శేషయ్య, కామన్న, రామలింగయ్య, మస్తాను, నటరాజ మార్తాండ శర్మ, రోశయ్య.. ఇలా ప్రతి పాత్రకీ ఒక ప్రత్యేకమైన, హాస్య స్పోరకమైన ఐడెంటిటీ ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి గిలిగింతలు పెట్టే ఒకానొక వాక్యం: "మంగలి రాముడు శిలావిగ్రహానికన్నా సరే, పదిచోట్ల గంట్లు పెట్టకుండా క్షవరం చేయలేడు. అతని చేతులకు పక్షవాతం ద్వారా సంక్రమించిన చిన్న వణుకుంది. పట్టుకున్న గడ్డమూ, కత్తీ కూడా వణకడం మూలంగా కత్తి ఒక్క వెంట్రుకలనే గీయదు."

రాజమండ్రి కి చెందిన పేరు మోసిన క్రిమినల్ లాయర్ ముఖ్యప్రాణరావు హత్య కేసు ఇన్వెస్టిగేషనే 'చచ్చి సాధించాడు' అపరాధ పరిశోధక నవల. రాజమండ్రి నుంచి మద్రాసుకి మొదటి తరగతి రైలు పెట్టెలో ప్రయాణం చేస్తూ, మార్గ మధ్యంలో హత్య గావింపబడతాడు ముఖ్యప్రాణరావు. ఆ పెట్టెలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికుల్లో నలుగురు అతనికి కావాల్సిన వాళ్ళే. ఆసాంతమూ ఆసక్తికరంగా చదివించే ఈ నవలికలో, పోలీసులకన్నా ఎక్కువ శ్రద్ధగా కెమాల్ ఎందుకు అపరాధ పరిశోధన చేశాడన్నది జవాబు లేని ప్రశ్న గానే మిగిలిపోయింది.

'భక్త శబరి' వెండితెర నవల. పండరీబాయి టైటిల్ పాత్రధారిణి గా చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో 1960 లో నిర్మితమైన ఈ సినిమాకి సంభాషణలు రాసింది పాలగుమ్మి పద్మరాజే. 'ఏమి రామ కథ శబరీ శబరీ' పాట పెద్ద హిట్. అంతే కాదు, ఈ సినిమాలో 'కరుణ' పాత్ర ద్వారానే శోభన్ బాబు వెండితెర జీవితం ప్రారంభమయ్యింది. నాకు తెలిసి, ఈ 'భక్త శబరి' తొలితరం వెండితెర నవలలో ఒకటి. కానైతే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి సమాచారాన్నీ ఇవ్వలేదు ప్రకాశకులు. సినిమా చూస్తున్న అనుభూతి కలిగించేలా సాగింది రచన.

చిట్ట చివరి నవలిక 'చచ్చిపోయిన మనిషి.' డి.హెచ్. లారెన్స్ రచనకి అనువాదమనీ, 1946 లో తొలి ముద్రణ జరిగిందన్న వివరాలు మాత్రమే ఉన్నాయి. పద్మరాజు అనువాద కథలతో పోల్చినప్పుడు, ఈ నవలిక నిరాశ పరిచిందనే చెప్పాలి. అనువాదం ఏమంత సరళంగా లేదు. అలాగే కథా, కథనాల్లో స్పష్టత లోపించినట్టుగా అనిపించింది చదువుతుంటే. మూల రచన చదివితే మరింత బాగా అర్ధం అవుతుందేమో మరి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడా 'పద్మరాజు మార్కు' కనిపించలేదీ రచనలో.

మొత్తంగా చూసినప్పుడు, నాలుగు నవలికలకీ కలిపి ఒక ముందుమాట రాయించి, పద్మరాజు జీవిత విశేషాలని కూడా చేర్చి ప్రచురించి ఉంటే సంకలనానికి నిండుతనం చేకూరి ఉండేది. గత సంకలనంలో లాగానే ఇందులోనూ అక్కడక్కడా అచ్చుతప్పులు తగిలాయి. వీటిని పరిహరించాలి. పద్మరాజు సాహిత్యాన్ని పునః ప్రచురించడం అనే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన విశాలాంధ్ర దీనిని మరికొంచం శ్రద్ధతో చేస్తే బాగుండునన్న అభిప్రాయం కలిగింది, సంకలనం చదవడం పూర్తి చేయగానే. (పేజీలు 291, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, జులై 18, 2011

విడిచివచ్చే...

"....వేళ సెలవని అడుగనైనా అడుగలేదని.. ఎంతగా చింతించెనో.. ఏమనుచు దుఃఖించెనో..." మల్లీశ్వరి (భానుమతి) మంద్రంగా పాడుతోండగా, నాకు రకరకాల ఫేర్వెల్ లు ఒక్కసారిగా గుర్తొచ్చేశాయి. అసలు వీడ్కోలు అనే పదమే కొంచం విచారాన్ని సూచిస్తుంది, పైగా చాలా బరువుగా ఉంటుంది కూడా. ముఖ్యంగా ఆ వీడ్కోలు ఇచ్చేది మనకి ప్రియమైన వాళ్లకి అయినప్పుడు గుండెల్ని మెలిపెట్టే ఒకలాంటి అనుభూతిని అక్షరాల్లోకి అనువదించడం చాలా కష్టమైన పని.

ఫేర్ వెల్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది కాలేజీనే. ఇప్పుడంటే "తడి కన్నులనే తుడిచిన నేస్తమా.." లాంటి పాటలు ప్లే చేసేస్తూ, చాలా గ్రాండ్ గా వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ ని షేర్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్. జూనియర్స్ కి సీనియర్స్ వెల్కం పార్టీ చేయడం, ఇందుకు ప్రతిగా జూనియర్స్, సీనియర్స్ కి ఫేర్ వెల్ ఇవ్వడం అనే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతున్నట్టే ఉంది. కాకపొతే భవిష్యత్తుని గురించి లెక్చరర్లు ఇచ్చే బరువైన ఉపన్యాసాల లాంటి వాటికి భిన్నంగా, కొంచం సరదాగా సరదాగా జరుగుతున్నట్టున్నాయీ పార్టీలు.

ఉద్యోగం మారేటప్పుడో, బదిలీ అయినప్పుడో లేదా ఉద్యోగ పర్వం ముగిసినప్పుడో జరిగే ఫేర్ వెల్ అయితే ఒకేసారి భిన్నమైన అనుభూతులని అనుభవంలోకి తెచ్చేస్తుంది. అప్పటివరకూ తెర వెనుక రాజకీయాలు చేసిన సహోద్యోగులు, నిండు సభ సాక్షిగా మనంత మంచి వాళ్ళు లేరనీ, మనల్ని వాళ్ళెంతో మిస్సవుతారనీ చెప్పడం వింటుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? మనసుకవి ఆత్రేయ 'పోయినోళ్ళందరూ మంచోళ్ళు' అని సూత్రీకరించేశారు. పోయిన వాళ్ళ గురించి ఎవరూ చెడుగా మాట్లాడరు. ఇదో సంప్రదాయం. అలాగే ఫేర్ వెల్ ఎవరికైతే జరుగుతోందో, వాళ్ళని గురించి కూడా ఒక్క చెడ్డ మాట వినపడదు.

అందువల్లే ఫేర్ వెల్ స్పీచిలు వింటుంటే 'ఇదంతా నిజమేనా?' అన్న సందేహం ప్రతి ఒక్కరికీ కలిగి తీరుతుంది. నేను హైస్కూల్లో ఉండగా, చండశాసనుడిగా పేరు తెచ్చుకున్న ఒక మేష్టారు రిటైరయ్యారు. ఆయనకి ఆవేళ సన్మానం. ఓ పక్క ఏర్పాట్లు జరుగుతూ ఉండగానే, పిల్లలు అల్లరి చేయకుండా పాటల కార్యక్రమం పెట్టారు. స్థానిక ఔత్సాహిక గాయకుడు ఉత్సాహంగా స్టేజీ ఎక్కి "భలే మంచి రోజు.. పసందైన రోజు.." అని పాటందుకోగానే మా ఆనందానికి పట్టపగ్గాల్లేవు. మేష్టార్లు చాలా కష్టపడి మమ్మల్ని అదుపులో పెట్టారు. చాలా మంది పిల్లలు వన్స్ మోర్ అని అరిచినా, మేష్టార్లు వీలు కాదనేశారు.

మనల్ని చూడవచ్చి తిరిగి వెళ్తున్న బంధుమిత్రులకీ, దూర ప్రయాణం చేస్తున్న దగ్గరి వాళ్ళకీ ఇచ్చే ఫేర్ వెల్ మరో రకం. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఏర్పోర్ట్లు ఇందుకు వేదికలు. తెచ్చి పెట్టుకునే గాంభీర్యాలు, అవి కరిగిపోయే క్షణాలు వీటన్నింటికీ నిశ్శబ్ద సాక్షులు మన బస్సులూ, రైళ్ళూ, విమానాలూను. ఎనిమిదేళ్ళ క్రితం ఒక మిత్రుడికి సెండాఫ్ ఇవ్వడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు, అక్కడ దొర్లిన సంభాషణలో తను నాకు రికమెండ్ చేసిన పుస్తకం గొల్లపూడి మారుతీరావు 'సాయంకాలమైంది.' చాలా కాలం క్రితమే ఎన్ని సార్లు చదివానో లెక్క పెట్టడం మానేసిన ఈ పుస్తకాన్ని తిరగేసిన ప్రతిసారీ ఆనాటి దృశ్యం కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది నాకు.

పెళ్లి జరిగాక అమ్మాయిని అత్తవారింటికి పంపించే దృశ్యం, అమ్మాయి సంబంధీకులని మాత్రమే కాదు, చూసే ప్రతి ఒక్కరినీ కూడా కదిలిస్తుంది. "ఆ క్షణంలో, వచ్చే జన్మంటూ ఉంటే ఆడపిల్లగా పుట్టించకు దేవుడా అని మనసులో దండం పెట్టుకున్నాను" అని నా సర్కిల్లో చాలామందే అన్నారు నాతో. అప్పటి వరకూ ఆడ పెళ్లి వాళ్ళు, మగ పెళ్లి వాళ్ళుగా విడిపోయిన రెండు గ్రూపులూ ఒక్కటైపోయే సందర్భమది. పిల్లల్ని మొదటిసారి, మొదటిరోజు బడికి పంపించే సందర్భమూ ఇలాంటిదే. 'ఆకాశమంత..' సినిమా చూసినప్పుడు, 'ఎమోషన్స్ ని చాలా బాగా పట్టుకున్నాడు కదూ' అంటూ మెచ్చుకున్నాను, దర్శకుడు రాధామోహన్ ని. జీవితంలో ఎన్నో సందర్భాల్లో, ఎన్నోసార్లు ఎదురయ్యేదే అయినా, ఎదురైన ప్రతిసారీ కొత్తగా అనిపించే సందర్భం ఈ ఫేర్ వెల్. కాదంటారా?

ఆదివారం, జులై 17, 2011

షోడా నాయుడు

వర్తమానం బరువుగా సాగుతున్నట్టుగా అనిపిస్తే మనం చేయగలిగేవి రెండు పనులు. భవిష్యత్తుని గురించి అందమైన కలలు కనడం లేదా గడిచిపోయిన జీవితాన్ని, ముఖ్యంగా అందులో అత్యంత మధురమైన బాల్యాన్ని గుర్తు చేసుకోవడం. ఈ రెండో పనిని ఏమంత కష్ట పడకుండా అదాటున చేసేయాలంటే మాత్రం ఒక్కటే మార్గం.. శ్రీరమణ రాసిన 'షోడా నాయుడు' కథని ఒక్కసారి చదివితే చాలు. ఆకాశంలో చందమామని అద్దంలో చూపించినట్టుగా, మన బాల్యాన్నంతా తెచ్చి మన కళ్ళముందుంచే కథ ఇది.

కథకుడు ఏడెనిమిదేళ్ళ పిల్లవాడిగా ఉన్నప్పుడు మొదలవుతుందీ కథ. వేసవి సెలవుల్లో అందరిలాగా హాయిగా ఆడుకోకుండా, అమ్మిచ్చిన డబ్బులతో ఏ జీళ్ళో, ఐస్ ఫ్రూటో కొనుక్కోకుండా మన హీరో చేసే పనేమిటంటే, పొద్దస్తమానం వాళ్ళూరి షోడా నాయుడి బండి వెనక తిరగడం. అప్పుడప్పుడూ షోడాలు కొనుక్కుని తాగడం. కనీసం ఒక్కటి, ఓకే ఒక్క షోడా గోళీని సంపాదించడమే మనవాడి ఆశయం మరి. గోపిగాడి దగ్గరా, శీనాయ్ దగ్గరా ఉన్న షోడా గోళీ తన దగ్గర లేకపొతే ఎలా? అక్కడికీ నాయుణ్ణి ఎంతో మర్యాదగా అడిగాడు, గోళీ కావాలని. నాయుడేమో కసిరి కొట్టాడు. షోడా పగిలిపోతేనే కదా గోళీ వచ్చేది. షోడా పగిలితే నష్టం కన్నా ప్రమాదం ఎక్కువ.

ఊరంతటికీ షోడాలు సప్లయ్ చేసేది నాయుడు ఒక్కడే. అందుకే పాలకోసం నల్లరాయి మోసినట్టుగా, ఎద్దు వెనుక నక్క తిరిగినట్టుగా, నాయుడి వెంట ఆశగా తిరగడం. షోడాలు తాగుతూ, తేన్చుకుంటూ, తన మీద తనే జాలిపడుతూ తిరగడం. నాయుడేమీ కోపిష్టి మనిషి కాదు. బోళా మనిషి, లౌక్యం కూడా బాగానే తెలుసు. షోడాలే అతని ప్రపంచం. ఇంకో మాటలో చెప్పాలంటే మొత్తం ప్రపంచంలో షోడా వంటి వస్తువు మరొకటి లేదతనికి. మూడు కాయల మిషన్ ని తనంత బాగా తిప్పే వాడు ఆ చుట్టుపక్కల ఎవడూ లేదని గాట్టి నమ్మకం కూడాను.

షోడా కోసం మన బుల్లి హీరో చేసే ప్రయత్నాలన్నీ పాఠకులని బాల్యంలోకి తీసుకెళ్ళిపోయేవే. గుళ్ళో పురాణం చెప్పేటప్పుడైతేనేం, ఊళ్లో వాళ్ళంతా కలిసి పౌరాణిక నాటకం వేసినప్పుడైతేనేం.. ఏదోలా నాయుడు చూడకుండా ఓ షోడా నొక్కేసి, గోళీ తీసేసుకోవాలన్న తాపత్రయాన్ని కేవలం చదివి తీరాలి. పనిలో పనిగా షోడా కనిపెట్టినవాడి చవటాయితనాన్ని తిట్టేస్తాడు కూడా, సీసాలో గోళీ అలా బయటకి రాని విధంగా అమర్చినందుకు. (నా చిన్నప్పుడు నేను కూడా షోడా తాగిన ప్రతిసారీ, గోళీ తీసేసుకోవాలని విఫల ప్రయత్నాలు చేసి అచ్చం ఇలాగే తిట్టేసుకున్నాను.)

కాలం ఎవరికోసమూ ఆగదు కదా.. మన వాడు గోళీకోసం ప్రయత్నిస్తూ ఉండగానే హైస్కూలు చదువుకి వచ్చేస్తాడు. పైగా అమ్మనీ, ఊరినీ విడిచిపెట్టి మావయ్య ఊరికి ప్రయాణం. తన దగ్గరున్న గోళీలన్నీ లెక్కపెట్టి, లెక్క రాసి పెట్టుకుని, ఓ కవర్లో భద్రంగా మూటకట్టి, నేరేడు చెట్టు మొదట్లో జాగ్రత్తగా పాతి పెట్టి, మావయ్య ఇంటికి బయలుదేరితే ఏముంది? పందికొక్కులు ఆ మూటని తవ్వేసినట్టుగా రోజూ పీడకలలు. పెరిగి పెద్దయిన హీరోని వెతుక్కుంటూ షోడా నాయుడు వస్తాడొక రోజు. వయసు మీద పడింది తప్ప, అతని ధోరణిలో ఎలాంటి మార్పూలేదు. తర్వాత వచ్చే హృద్యమైన సన్నివేశమే ఈ కథకి ప్రాణం. అక్షరాలా కొన్ని వందల సార్లు చదివినా, ఇప్పటికీ చదివే ప్రతిసారీ చివరి వాక్యాలు నా కంటికి మసక మసగ్గానే కనిపిస్తాయి. అది కథలో ఉన్న తడి.

రెండున్నరేళ్ళ క్రితం నేనో బ్లాగు మొదలు పెట్టాలనుకున్నప్పుడు, 'ఏం పేరు పెట్టాలి?' అన్న ఆలోచనకి ఈ కథే సమాధానం చెప్పింది. నెమలికన్నుల విసనకర్రలతో అందరినీ దీవించి పొట్టపోసుకునే సంచార జాతివాళ్ళ దగ్గర నుంచి ఒకే ఒక్క 'నెమలికన్ను' సంపాదించడం కోసం నేను పడ్డ తిప్పలన్నీ కళ్ళముందు మెదిలాయి. ఓ నెమలికన్ను సంపాదించుకోగలిగి ఉంటే నా (బ్లాగు) కథ వేరే విధంగా ఉండేదేమో. అంతే కాదు, ఈ కథ స్కాన్ కాపీని కొందరు బ్లాగర్లకి పంపి వాళ్ళని మిత్రులని చేసేసుకున్నాను కూడా. చదివి తీరవలసిన ఈ 'షోడా నాయుడు' కథ శ్రీరమణ 'మిధునం' కథ సంకలనం లోది. నవోదయ నుంచి మొన్ననే తాజా ప్రచురణ వచ్చింది. 'ధనలక్ష్మి' 'బంగారు మురుగు' తో సహా మొత్తం ఎనిమిది కథలున్న ఈ సంకలనం వెల రూ. 60. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం.

శనివారం, జులై 16, 2011

ఇక్కడ సాధ్యమేనా?

టీవీలో వార్తలు చూస్తూ ఉన్నట్టుండి ఆలోచనలో పడ్డాను. రూపర్ట్ మర్దోక్ జాతికి క్షమాపణలు చెప్పాడన్న వార్తే నా ఆలోచనలకి కారణం. మర్దోక్ చిన్నవాడేమీ కాదు. ఎనభయ్యేళ్ల వయసు వాడు, అంతర్జాతీయ మీడియా మీద తనదైన ముద్రవేసి, వివిధ దేశాల్లో లెక్కకు మిక్కిలి దినపత్రికలు, మాగజైన్లు, టీవీ చానళ్ళు, స్టూడియోలకి అధిపతి. తన మీడియా బలంతో అగ్ర రాజ్యాలనే గడగడలాడించి, తన కనుసన్నల్లో ఉండేలా చేసుకున్న 'మీడియా మొగల్.'

చాలామంది భారతీయుల్లాగే నాక్కూడా ఇరవయ్యేళ్ళ క్రితం వరకూ మర్దోక్ ని గురించి పెద్దగా ఏమీ తెలీదు. టీవీ అంటే కేవలం దూరదర్శన్ మాత్రమే అని, ఇంట్లో కూర్చుని చూడగలిగే వార్తలంటే 'ప్రసారభారతి' ఆమోదించినవి మాత్రమే అని ఎవరికి వారే సమాధానపడిపోయిన కాలంలో, పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన ఆర్ధిక సంస్కరణల ఫలితంగా విదేశీ చానళ్ళు దేశంలోకి అడుగుపెట్టాయి. అయితే ఇవి వినోద కార్యక్రమాలకి మాత్రమే పరిమితం.

సరిగ్గా అదే సమయంలో రంగ ప్రవేశం చేసింది స్టార్ టీవీ. ఈ ఛానల్ పెద్ద ఎత్తున వార్తా ప్రసారాలకి ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే, విదేశీ వార్తా చానళ్ళని ఆమోదించే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా వ్యతిరేకించాయి. వార్తా ప్రసారాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్ళడం వల్ల జరగబోయే పరిణామాల గురించి ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. స్టార్ టీవీకి అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అది 'మర్దోకిజం' కి దారితీస్తుందని సంపాదకీయాలు రాశాయి కొన్ని పత్రికలు.

అదిగో అప్పుడు విన్నాను రూపర్ట్ మర్దోక్ పేరు. దాదాపుగా ప్రతి రోజూ చర్చల్లో ఉండేది. అప్పుడే ఈ ఆస్ట్రేలియన్-అమెరికన్ జర్నలిజం రంగంలో సాధించిన విజయాలూ, వివిధ దేశాల్లో తన పత్రికా సామ్రాజ్యాన్ని స్థాపించి, విస్తరించిన వైనం, నష్టాల్లో ఉన్న స్థానిక పత్రికలని కొని తనదైన మార్కెటింగ్ విధానంతో ఆయా పత్రికలని అగ్ర భాగంలో నిలబెట్టడం లాంటి సంగతులెన్నో తెలిశాయి. సదరు మర్దోక్ స్టార్ టీవీ పేరిట భారత దేశంలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడనీ, అతన్ని రానివ్వడం దేశానికీ ప్రమాదమనీ కథనాలు రాశాయి మెజారిటీ పత్రికలు. తర్వాతి కథ టీవీ చూసే ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

ప్రస్తుతానికి వస్తే, అంత గొప్పవాడైన రూపర్ట్ మర్దోక్ బ్రిటన్ జాతికి క్షమాపణలు చెప్పాడంటే అదేమన్నా మామూలు విషయమా? బ్రిటన్ పత్రిక 'న్యూస్ ఆఫ్ ది వరల్డ్' చాన్నాళ్ళ క్రితమే మర్దోక్ కొనుగోలు చేశాడు. మార్కెట్లో మంచి స్థాయికి వచ్చేలా చేశాడు. ఈ పత్రికలో వచ్చిన సంచలనాత్మక కథనాలు ఇందుకు దోహద పడ్డాయి. అయితే, ఈ కథనాలు రాయడానికి ఈ పత్రికలో పని చేసే సిబ్బంది ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్దవాళ్ళ ఫోన్లని ట్యాప్ చేశారనీ, ఆ విధంగా అనైతిక పద్ధతుల్లో సేకరించిన సమాచారంతో సంచనల కథనాలు వండి వార్చారనీ పెద్ద ఎత్తున దుమారం రేగింది.

ఈ గొడవ ఎంత పెద్దదయ్యిందంటే, అంత గొప్ప 'న్యూస్ ఆఫ్ ది వరల్డ్' పత్రికా, గత వారం తన నూట అరవై ఎనిమిదో ఏట శాశ్వితంగా మూతపడింది. తన పత్రిక జరిపిన అనైతిక కార్యకలాపాలకి గాను మర్దోక్ క్షమాపణలు చెబుతూ, బ్రిటిష్ పత్రికల్లో ప్రకటనలు విడుదల చేశాడు. ఈ వార్త టీవీలో చూడగానే నాకు వచ్చిన మొదటి ఆలోచన 'అదే మనదగ్గరైతే?' ...అవును, ఇలా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితే వస్తే మన పత్రికల వాళ్ళూ, టీవీల వాళ్ళూ ఎన్నింటికని, ఎన్నిసార్లని క్షమాపణలు చెప్పగలరు?

ఏ ఒక్క పక్షం పట్లా పక్షపాతం లేకుండా వార్తలూ, వ్యాఖ్యలూ ఉండాలి, ప్రచురించే/ప్రసారం చేసే కథనాలు ప్రజలకి ఉపయోగ పడాలి.. లాంటి నియమాలని అది ఇది అని లేకుండా ఏ ఒక్క పత్రికా/చానలూ కూడా అమలు చేయడం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. నైతికం కాని వీటి పనితీరు అనైతికం గానే సాగుతోందనడానికి ఉదాహరణలని కష్టపడి వెతకాల్సిన పని లేదు. ఒక పార్టీనో, నాయకుడినో సమర్ధిస్తూ కథనాలు వెలువరిస్తున్నందుకూ, తమకి అనుకూలం కానివారిని పనిగట్టుకుని టార్గెట్ చేసి వారికి వ్యతిరేక కథనాలతో పత్రికలూ, చానళ్ళూ నింపుతున్నందుకూ క్షమాపణలు చెప్పాల్సిన పత్రికలనీ, చానళ్ళనీ లెక్క పెట్టడానికి మన వేళ్లు సరిపోవు కదూ..

శుక్రవారం, జులై 15, 2011

రుక్మిణి

గోదారొడ్డున తీసిన అందమైన తెలుగు సినిమాల్లో 'రుక్మిణి' ఒకటి. చిన్న కథకి చక్కటి స్క్రీన్ ప్లే, శ్రావ్యమైన సంగీతం, బహు సుందరమైన లొకేషన్లూ జతపడ్డాయి. ఆదర్శ చిత్రాలయ పతాకంపై జొన్నాడ రమణమూర్తి పద్నాలుగేళ్ళ క్రితం నిర్మించిన ఈ సినిమాకి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వ బాధ్యతలని నిర్వహించింది రీమేక్ సినిమాలతో ఎక్కువ పేరు తెచ్చుకున్న తెలుగు దర్శకుడు రవిరాజా పినిశెట్టి.

అప్పటికే తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన వినీత్ కథానాయకుడు కాగా, అలనాటి అందాల తార మంజుల కూతురు ప్రీత (ఈ సినిమా తర్వాత రుక్మిణి గా మారింది) కథానాయిక పాత్రనూ, చిన్న కూతురు శ్రీదేవి (తర్వాతి కాలంలో హీరోయిన్) బాలనటిగా సహాయ పాత్రనీ పోషించారు. ఈ అమ్మాయిలిద్దరి నిజ జనకుడు విజయకుమార్ రుక్మిణి తండ్రి దొరబాబుగా, చిరంజీవి సోదరుడు నాగబాబు రుక్మిణి మేనమామ బండబాబుగానూ చేశారు. దాసరి నారాయణరావు ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించారు.

గోదావరి తీరంలో ఉన్నఅందమైన పల్లెటూరు దొడ్డిపట్ల. ఈ లంక గ్రామాన్ని మిగిలిన ప్రపంచంతో కలిపే ప్రయాణ సాధనం పడవ మాత్రమే. ఆ ఊరి పెద్ద మనిషి, భూస్వామి దొరబాబు. అతని కూతురు రుక్మిణి చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుని, నాయనమ్మ పెంపకంలో పెరుగుతూ ఉంటుంది. స్నేహానికి ప్రాణమిస్తాడు దొరబాబు. ఇతని స్నేహితుడు గోవిందరావు (వంకాయల) బొంబాయిలో పెద్ద వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతని కొడుకు కిరణ్ (దూరదర్శన్ కోసం కే.ఎస్. రామారావు తీసిన 'వెన్నెల్లో ఆడపిల్ల' సీరియల్లో రేవంత్ పాత్రధారి సాయికృష్ణ) కి రుక్మిణినిచ్చి పెళ్లి చేయాలని స్నేహితులిద్దరూ అనుకుంటారు.

సకలగుణాభిరాముడైన కిరణ్ బొంబాయిలో ఓ ఐదారుగురు అమ్మాయిలని ఏకకాలంలో ప్రేమిస్తూ, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ పల్లెటూరి పెళ్లి సంబంధం తప్పించుకోడానికి, తండ్రికి తెలియకుండా తన స్నేహితుడూ, మంచివాడూ అయిన రవి (వినీత్) ని దొడ్డిపట్ల పంపుతాడు, పెళ్ళిచూపులకి. అమ్మాయిని చూసి వచ్చేయమనీ, తను తన తండ్రికి అమ్మాయి నచ్చలేదని చెబుతాననీ, ఈ ఒక్క సాయం చేసి పెట్టమనీ రవిని బతిమాలి ఒప్పిస్తాడు.

పల్లెటూరికి వచ్చిన రవి రుక్మిణితో తొలిచూపులోనే ప్రేమలో పడిపోవడం, రుక్మిణి కూడా అతనితో ప్రేమలో పడ్డాక అప్పటివరకూ దాచిన తన రహస్యాన్ని ఆమెకి చెప్పేయడం, ఇంతలోనే రుక్మిణి ఆస్తికోసం తన మనసు మార్చుకుని తండ్రిలో కలిసి కిరణ్ ఆ పల్లెటూరికి వచ్చి పెళ్లికి సిద్ధ పడడంతో కథ చకచకా సాగి, కొన్ని కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత రవి-రుక్మిణి ఏకమవడంతో సుఖాంతమవుతుంది. సినిమా చూడగానే మొదట ఆకట్టుకునేది రాం పినిశెట్టి ఫోటోగ్రఫి. అందమైన గోదారినీ, లంకనీ, అక్కడి తోటలనీ, పొలాల్నీ అంతే అందంగా తెరకెక్కించాడు.

తర్వాత చెప్పుకోవాల్సింది సంగీతం. విద్యాసాగర్ సంగీత సారధ్యంలో సిరివెన్నెల రచించిన పాటలన్నీ దాదాపుగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవే. అన్ని పాటలూ బాగున్నా 'గోదారి రేవులోన..' పాట నాక్కొంచం ఎక్కువ ఇష్టం. మిగిలిన వాటిలో 'ఉన్న మాట విన్నవించుకుంటా' ఎక్కడో విన్న బాణీలా అనిపించింది. 'బాగున్నావే..' పాట చిత్రీకరణ కే. రాఘవేంద్ర రావు శైలిలో సాగుతుంది. 'సరిగమపదని' పాట శైలిలో ఆ తర్వాత చాలా చాలా పాటలు చిత్రించారు, ముఖ్యంగా ఎస్.ఏ. రాజ్ కుమార్ సంగీతంలో వచ్చిన పాటలు. విద్యాసాగర్ పాడిన 'ప్రేమా ప్రేమా చెప్పమ్మా..' పాటని దాసరిపై చిత్రించారు. 'శివశివ మూర్తివి గణనాధా' పాటలో నాగబాబు కూడా స్టెప్పులేశారు.

నేనీ సినిమా థియేటర్లో చూడడానికి వెళ్ళినప్పుడు, 'ఇప్పుడే మొదలైంది సార్' అన్న గేట్ కీపర్ మాటనమ్మి టికెట్ తీసుకుని లోపలి వెళ్లాను. అప్పటికి తెరమీద వినీత్ గోదారిమీద పడవలో ప్రయాణిస్తూ 'నాయనా క్షేమమా అన్నది ఈ ఊరు' అని పాడుకుంటున్నాడు. సినిమా హాయిగా సాగిపోతూ ఉండగా, ఉన్నట్టుండి సెకండాఫ్ లో దాసరి ముస్సలి గెటప్ లో ప్రత్యక్షమై 'ప్రేమా ప్రేమా చెప్పమ్మా..' అని పాటందుకోగానే ఒక్కసారి ఉలిక్కి పడ్డాను. రెండో సారి చూసినప్పుడు అర్ధమైన విషయం ఏమిటంటే, సినిమా మొదలయ్యేదే దాసరి పోషించిన రచయిత పాత్రమీద.

ఆ మహా రచయిత అంతరించిపోతున్న తెలుగు సంస్కృతీ సంప్రదాయాల గురించి తగుమాత్రం ఉపన్యసించి, 'రుక్మిణి' కథ రాయడానికి పూనుకుంటాడన్న మాట. ఒక పాటతో సహా అరగంట సినిమా అయ్యాక నేను మొదటిసారి చూసినప్పుడు మొదలెట్టిన సన్నివేశం వచ్చింది. అలా 'గేట్ కీపర్ మాట నమ్మరాదు' అనే నీతిని మరోసారి తెలుసుకున్నాను. వినీత్, రుక్మిణి బాగా చేశారు. రుక్మిణి కన్నా శ్రీదేవి ఎక్కువ మార్కులు కొట్టేసింది అప్పట్లో. బండబాబుగా నాగబాబు నటన మరీ మొనాటనస్ అనిపించింది.. క్లైమాక్స్ లో తప్ప ఆ పాత్ర అవసరం లేకపోవడం వల్ల కావొచ్చు. అతని అనుచరులుగా ఇప్పటి ప్రముఖ కమెడియన్స్ ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్ కనిపిస్తారు.

సినిమా తీసేనాటికి సెల్ ఫోన్లూ అవీ వాడుకలో లేకపోవడం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ ని బాగా చూపించగలిగారు. రెండోసగంలో అనవసరపు నాటకీయతని కొంచం తగ్గిస్తే బాగుండేది. అలాగే అప్పటివరకూ కూతురు మీద విపరీతమైన ప్రేమ చూపించిన దొరబాబు మరీ అంత మూర్ఖంగా ప్రవర్తించడం కూడా అర్ధం కాని విషయం. అయినప్పటికీ ఇది చూడాల్సిన సినిమానే, క్లీన్ గా తీయడం, ద్వితీయార్ధం మొదటి సగం వరకూ ఆహ్లాదంగా సాగిపోవడం, మళ్ళీ చూడాలనిపించే పాటలు, హాస్యం, వీటన్నింటి వల్లా. డిస్క్ కోసం చాలా ప్రయత్నించినా దొరకలేదు నాకు. నిన్న రాత్రి ఈటీవీలో వస్తుంటే అర్ధరాత్రి రెండు వరకూ కూర్చుని చూశాను.

గురువారం, జులై 14, 2011

ఇల్లూ-గుడీ

'ఇంటికన్నా గుడి పదిలం' అని ఎవరన్నారో, ఎందుకన్నారో నాకు తెలీదు కానీ, గుడికి దగ్గరగా ఇల్లు ఉండడం మాత్రం అన్ని వేళలా పదిలం కాదు. ముఖ్యంగా మనకి ఇంట్లో పనులున్నప్పుడో, ఒంట్లో బాగోనప్పుడో గుళ్ళో పెద్ద ఎత్తున భజనల్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మాత్రం 'ఎక్కడికన్నా పారిపోతే బాగుండు' అనిపిస్తుంది. కానీ ఇంటినుంచి, ఇంటిళ్ళపాదీ పారిపోవడం అనేది ఎల్లవేళలా ఆచరణ సాధ్యం కాదు కాక కాదు.

నా అదృష్టం ఏమిటో కానీ, పుట్టి పెరిగిన ఇల్లు మొదలు ఇప్పుడుంటున్న ఇల్లు వరకూ నేను పాదం మోపిన చాలా ఇళ్ళు గుడికి దగ్గరగా ఉన్నవే. ఈ ఆధ్యాత్మిక వాతావరణం చాలా వరకూ అలవాటైపోయినా, అప్పుడప్పుడూ చుట్టూ ఉండే భక్తుల యొక్క భక్తి శృతి మించి రాగాన పడ్డప్పుడు మాత్రం అసహనం కలుగుతూ ఉంటుంది. కానీ ఎవర్నీ ఏమీ అనలేని పరిస్థితి. దైవ భక్తి అనేది చాలా సున్నితమైన విషయం మరి. ఈ కారణానికి ఓపిక పడుతూ ఉండాలి.

ఇంటికి దగ్గరగా గుడి ఉండడం లేదా గుడి దగ్గర ఇల్లు ఉండడం వల్ల చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. ఎవరికైనా ఇంటి ఎడ్రస్ చెప్పడం బహు సుళువు. గుడి ఓ బ్రహ్మాండమైన లాండ్ మార్క్ కాబట్టి, ఎవరూ చిరునామా పట్టుకోలేక పోవడం అనే సమస్య ఉండదు. అలాగే, ఎప్పుడన్నా గుడికి వెళ్లాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి ప్రయాణం కానక్కర్లేదు. మనకి మనంగా ఎలాంటి ప్రయత్నమూ చేయనప్పటికీ గుడికివచ్చే భక్తులతో పరిచయాలేర్పడి సర్కిల్ కొంచం విస్తరిస్తుంది.

చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో ఏటా ఉగాదికి పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగేవి. వారం రోజుల పాటు బోల్డన్ని సాంస్కృతిక కార్యక్రమాలు. ఊరంతా అక్కడే ఉండేది. చిన్న క్లాసుల్లో ఉండగా సరదాగానే గడిచినా, కొంచం పెద్ద క్లాసులకి వచ్చేసరికి సమస్యలు మొదలు. సరిగ్గా అదే సమయంలో వార్షిక పరిక్షలు ఉండేవి. రోజులో పద్దెనిమిది గంటలు మైకుసెట్టు చెవుల్లో మోగుతూ ఉంటే క్లాసు పుస్తకాలు తీసి చదువుకోవడం అన్నది ఎంత దుస్సాధ్యమైన విషయమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అలాగని దూరంగా ఎవరింటికైనా వెళ్లి చదువుకోడానికి ఇంట్లో ఓ పట్టాన ఒప్పుకునే వాళ్ళు కాదు. రెండు చెవులూ గాట్టిగా మూసేసుకుని, చదివిందే పదేసి సార్లు చదవడం ఇప్పటికీ అప్పుడప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది నాకు. పరీక్షల గండాలు దాటడానికి ఎంతలేసి ఇబ్బందులు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఊళ్లు తిరగడం మొదలు పెట్టాక ఒక్కో ఊళ్లోనూ ఒక్కో అనుభవం. ప్రతి చిన్న విషయాన్నీ పెద్దది చేయలేం అన్న ఆలోచన కొంతా, గుడి అన్నాక ఇలాంటివి తప్పవు కదా అని మరికొంతా.. సర్దుకుపోదాం లెండి అనేసుకోవడం.

చాలా విసుగ్గా, చిరాగ్గా ఇంటికొచ్చేసరికి గుళ్ళో ఏ ఏకాహమో జరుగుతుంటే? రాక రాక వచ్చిన బంధువులతోనో, మిత్రులతోనో సరదాగా కబుర్లు చెబుదాం అనుకుంటూండగా గుళ్ళో ఏ సప్తాహమో మొదలైతే? అనుభవించే వాళ్లకి మాత్రమే అర్ధమయ్యే బాధ ఇది. మైకక్కర్లేకుండా మైళ్ళ దూరం వినిపించే గాత్ర సౌలభ్యం ఉన్న గాయనీ గాయకులు మైకులు పెట్టుకుని మరీ పాడేస్తుంటే వడగళ్ళ వానలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో మనుషులతోనే కాదు, వచ్చిన ఫోన్లని కూడా ఆన్సర్ చేయలేని పరిస్థితి. ఇక అనారోగ్యంగా ఉన్నప్పుడైతే ఈ భజనల కారణంగా కలిగే అసౌకర్యం వర్ణనాతీతం.

ఒకప్పుడంటే ఆలయాలు ప్రత్యేకంగా ఉండేవి.. ఇప్పుడు గుళ్ళ చుట్టూ ఇళ్ళూ, ఇళ్ళ మధ్యన గుళ్ళూ వచ్చేశాయి. భక్తిగా చేసుకునే భజనలు దేవుడికి వినిపిస్తే చాలును కదా. మైకులు పెట్టి ఊరందరికీ వినిపించడం ఎందుకో ఎంత ఆలోచించినా అర్ధం కాదు. గాత్ర శుద్ధి ఏమాత్రమూ లేనివాళ్ళు ఒకరితో ఒకరు పోటీ పడి హై పిచ్ లో పాడేస్తూ ఉంటే, పాడేవాళ్ళకి సరదాగా, పోటీలాగా ఉంటుందేమో కానీ వినేవాళ్ళకి మాత్రం దుర్భరంగానూ, దుస్సహంగానూ ఉంటుంది. భక్తి అనేది మనసులో ఉంటే చాలు కదా అని మళ్ళీ మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది.

బుధవారం, జులై 13, 2011

మా దిగువ గోదారి కథలు

గోదారి.. అందునా నేను పుట్టి పెరిగిన దిగువ గోదారి ప్రాంతపు కథలు. రాసిందేమో తన ఒంట్లో రక్తానికి బదులుగా గోదారి ప్రవహిస్తోందేమోనని అందరూ సందేహించే వంశీ.. మరి, మార్కెట్లోకి వచ్చిన వెంటనే పుస్తకాన్ని సొంతం చేసుకుని చదవకపోతే ఎలా? మొత్తం యాభై ఒక్క కథలున్న'మా దిగువ గోదారి కథలు' సంకలనం, దిగువ గోదారి గ్రామాలతో పాటు, అక్కడి భాషా సంస్కృతులని, ప్రజల మనస్తత్వాలనీ సాదృశంగా కళ్ళముందు ఉంచుతుంది. కళాప్రపూర్ణ బాపూ తన మనసుని వేళ్ళ కొసల్లోకి తీసుకొచ్చి చిత్రించిన బొమ్మలు పాఠకులని కథాస్థలానికి, కథకాలానికీ అదాటున తీసుకుపోతాయి.

"ఏవుంటాయ్ మీ వంశీ కథల్లో.. తిండిగోలా, సెక్సు గొడవలూ తప్పితే?" ...'మా పసలపూడి కథలు' పుస్తకం విడుదలైన కొత్తలో వంశీని ఏమాత్రమూ ఇష్టపడని ఓ గోదారేతర మిత్రుడి వ్యాఖ్య ఇది. "అవి రెండూ కూడా ప్రాధమిక అవసరాలే. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా, మనిషి మనుగడకి అర్ధం ఉండదు" అన్నాన్నేను. గోదావరి ప్రాంత ప్రజల, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆహారపు అలవాట్లు మిగిలిన వాళ్ళ కన్నా ఏవిధంగా ప్రత్యేకమో వివరించి చెప్పాను. అలాగే "క్రైమ్ రికార్డుల ప్రకారం, దేశంలోని చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నహత్యల్లో అధిక శాతం హత్యలకి కారణం వివాహేతర సంబంధాలే," అని పోలీసు శాఖలో పనిచేసే ఒక మిత్రుడు చెప్పిన సంగతినీ ఉదహరించాను.

వంశీ తనదైన శైలిలో చెప్పిన ఈ దిగువ గోదారి కథల్లో అధిక శాతం జీవిత చిత్రణలే. 'మా పసలపూడి కథలు' ని కేవలం ఒక కథకుడిగా మాత్రమే చెప్పిన వంశీ, ఈ కథలని మాత్రం రచయితతో పాటుగా దర్శకుడిగానూ చెప్పినట్టుగా అనిపించింది. కొన్ని కథ, కథనాల్లో శృతి మించిన నాటకీయత, సినిమాటిక్ ముగింపులు ఇందుకు కారణం. తన పుట్టిన రోజుతో సహా ఇప్పటివరకూ ఎవరికీ చెప్పకుండా ఉంచిన అనేక వ్యక్తిగత విషయాలని ఈ పుస్తకంలో పంచుకున్నారు వంశీ. తన భార్యా పిల్లల గురించి, దర్శకుడిగా ఉచ్ఛ స్థితిలో ఉండగా ఓ నాయికతో జరిగిన ప్రేమ వ్యవహారాన్ని గురించీ, కొన్ని సినిమాల్లో పాత్రలకి ఉపయోగించిన ఊతపదాలు, ఆహార్యాల పుట్టుక గురించీ కథల మధ్యలో సందర్భానుసారంగా చెప్పారు. ఈ కథకుడు సినిమా దర్శకుడు కూడా అనే విషయాన్ని పదే పదే గుర్తుచేశాయివి.

ఇవి అలవోకగా రాసిన కథలు కాదు. ధవళేశ్వరానికి దిగువున ఉన్న గోదావరి పరీవాహక గ్రామాలనీ, లంకలనీ రకరకాల ప్రయాణ సాధనాల్లో తిరిగి అక్కడి ప్రజలు చెప్పుకునే కథల్ని విని వాటికి కొంత కల్పన జోడించి రాసినవి. "నేటివిటీని నరనరాల్లోకి ఎక్కించుకున్న సాదాసీదా మనిషిని నేను. అందుకే నా కథల్నీ, కేరక్టర్లనీ, వాళ్ళ కేరక్టరైజేషన్లనీ అందరికీ పరిచయం చేయాలని నా తాపత్రయం. అందులో భాగంగానే ఇంటిపేర్లు, వర్ణాలు, వృత్తులూ అప్పుడప్పుడూ తడుముతా వుంటాను. కులాలతో విలాసంగా చేతులు కలిపే వ్యక్తులకి నా కథలు కిడ్నీల్లో రాళ్ళలా ఇబ్బంది కలిగిస్తే క్షమించమని అడుగుతున్నాను వార్ని," అన్న వివరణ సాక్షిగా గ్రామసీమల వర్ణ వ్యవస్థనీ, కొండొకచో అందులోని అవ్యవస్థనీ తన కథల్లో చిత్రించారు.

సినిమాలకి మల్లేనే తన కథలకీ పేరు పెట్టడం ద్వారానే సగం ఆసక్తిని రేకెత్తించగల ఆలోచనా శక్తి వంశీ సొంతం. 'ఏటిగట్టుమీద చీకటి పడింది - ఆ అమ్మాయింకా రాలేదు' (ఈ కథకి బాపూ గీసిన బొమ్మని సంకలనానికి ముఖచిత్రంగా కూడా వాడారు), 'ఇప్పుడే వస్తానంది శకుంతల,' 'గోవిందుగాడి మరణం - దానికో ఫ్లాష్ బాక్,' 'దివాణంలోకి కొత్త కోడలొచ్చింది,' 'నాగరాజు రాత్రి మా యింటికొచ్చాడు,' 'తొందరగా వచ్చెయ్యండేం.. ఇక్కడ ఒంటరిగా ఉన్నాను' లాంటి శీర్షికలు ఇవ్వడం వంశీకి మాత్రమే సాధ్యం. వర్ణనల మీద ఎక్కువ మక్కువ చూపించే వంశీ అలవాటు ఈ కథల్లోనూ కొనసాగింది. కాకపొతే ఒక్కోసారి ఈ వర్ణనల మోతాదు అసలు కథను మింగేయడమూ జరిగింది. 'దివాణంలోకి కొత్త కోడలొచ్చింది,' కథ ఇందుకు ఉదాహరణ.

మరు జన్మంటూ ఉంటే గోదారొడ్డునే పుట్టాలన్నది ఎప్పటినుంచో నాకున్న కోరిక. ఈ సంకలనంలో దివాణాలని బ్యాక్డ్రాప్ గా తీసుకుని వంశీ రాసిన కథలు చదివాక ఆ కోరిక 'గోదారొడ్డున ఉన్న దివాణంలో పుట్టాలి' గా మారింది. కానైతే అప్పటికి ఈ దివాణాల రూపు రేఖలు ఎలా ఉంటాయో మరి. నా మిత్రుడి ఫిర్యాదు దగ్గరికి వస్తే, ఈ కథల్లోనూ గోదారి ప్రాంతపు, ముఖ్యంగా దిగువగోదారికే ప్రత్యేకమైన, వంటకాలెన్నింటినో పరిచయం చేశారు. పనసాకులతో చేసే పొట్టిక్కలు, పప్పుచారు, లంకల్లో మాత్రమే దొరికే వేరు పనసపళ్ళు, ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజాలు, కోడిగుడ్డు పెసరట్టు, రొయ్యల గారెలు, గుడ్డిపీతల పులుసు, పచ్చిరెయ్యలూ-చింతచిగురు, ఉప్పు చేపల వేపుడు, వేటమాంసం పులుసు, కోడిమాంసం ఇగురు... ఒకటా రెండా.. ఇప్పటికే కొన్ని రుచులు అంతరించిపోతున్నాయ్.

వివాహేతర సంబంధాలు, వేశ్యావృత్తి నేపధ్యంలో సాగే కథలూ ఉన్నాయి. "సినిమా ఫీల్డ్ లో ఇదంతా మామూలే" అంటూ అక్కడి తెరచాటు వ్యవహారాలనీ కథావస్తువులు చేశారు వంశీ. చలం 'మైదానం' కి కొనసాగింపుగా అనిపించే 'సూరి కామేశ్వరరావు వ్రాలు' కథలో నాయిక పేరు కూడా రాజేశ్వరే! 'అలాటిదా మడిసి' కథలో మంగ, 'ఇప్పుడే వస్తానంది శకుంతల' కథలో శకుంతల, 'బేబీ.. ఓ మాసిపోని జ్ఞాపకం' కథలో బేబీ పురాతన వృత్తిలో ఉన్నవాళ్ళే కాగా, 'వెన్నెల నీడలో వాసంతి' కథలో వాసంతి, 'చివరి కాన్క' కథలో కృష్ణలీల ఆ వృత్తిలోకి లాగబడ్డ వాళ్ళు. కొన్ని కథలకి ఓ.హెన్రీ తరహా మెరుపు ముగింపు నిచ్చి ఆశ్చర్య పరిచిన వంశీ, మరికొన్ని కథలని ఆసాంతమూ ఆసక్తిగా నడిపించినప్పటికీ ముగింపు తేల్చేసి నిరాశ పరిచాడు. కథనం ఉత్కంఠభరితంగా సాగిపోతున్నప్పుడు మధ్యలో వచ్చి పడే వర్ణనలు విసిగిస్తాయ్ ఒక్కోసారి. అయితే రెండో సారి కథని చదివేటప్పుడు ఈ వర్ణనలని ఆస్వాదించగలం.

ప్రత్యేకంగా చెప్పాల్సింది బాపూ గీసిన బొమ్మల గురించి. ప్రతి కథా చదవడానికి ముందు, చదివిన తర్వాత బొమ్మని పరీక్షగా చూడడం ద్వారా, బాపూ ఎంతగా కథలో లీనమై బొమ్మ గీశారో అర్ధం చేసుకోగలం. ఒక్క మాటలో చెప్పాలంటే రచయిత హృదయాన్ని తన కుంచెతో ఆవిష్కరించారు బాపూ. 'పోతాబత్తుల నీలమ్మ,' 'దొమ్మరిసాని,' 'సత్యభామ ఎవరనుకుంటున్నారు!,' 'బనేలురెడ్డిది బళెస్టోరీ,' 'దొంగశ్రీను,' 'సోమయాజులుగారి సెంటర్,'వై. సావిత్రి ఫర్ సేల్' కథలకి వేసిన బొమ్మలని చూసి తీరాల్సిందే. మొత్తం 519 పేజీలున్న ఈ పుస్తకంలో ప్రతి పేజీనీ ఎంతో కళాత్మకంగా తీర్చి దిద్దారు. కంటికింపుగా ఉన్న ప్రింటింగ్ లో అచ్చుతప్పులు తక్కువే. ముందుమాట రాసిన బి.వి.ఎస్. రామారావు ప్రతి ఒక్క కథనీ తనదైన శైలిలో పరామర్శించారు.

"...నా గతాన్నీ, జ్ఞాపకాల్నీ, బాధల్నీ, గాధల్నీ, ఇష్టాల్నీ, అయిష్టాల్నీ, అనుభూతుల్నీచేర్చే ప్రయత్నం చేసిన నేను, నాకిష్టమైన గోదావరిని ఆవిష్కరించే చిన్న ప్రయత్నం చేసిన నేను, ఇంక చెప్పడానికి నాదగ్గరింకే జ్ఞాపకం లేదని మనవి చేస్తున్నాను. ఇంకా ఏవన్నా, ఎప్పుడన్నా అడుగూ బొడుగూ గుర్తొస్తే కల్పించగలిగే శక్తి ఈశ్వరుడు నాకు ప్రసాదిస్తే రాసే ప్రయత్నం చేస్తానేమో..." అంటూ వంశీ రాసిన చివరిమాట కలుక్కుమనిపించింది. ఇలియాస్ ఇండియా బుక్స్ ప్రచురించిన రంగుల పేజీల 'మా దిగువ గోదారి కథలు' సంకలనం విశాలాంధ్రతో పాటు అన్ని పుస్తకాల షాపుల్లోనూ, ఏవీకెఎఫ్ లోనూ లభిస్తోంది.వెల రూ. 475. పుస్తకం చదవడం పూర్తి చేసి పక్కన పెట్టగానే ఒక్కసారి ఆ ఊళ్ళన్నీ తిరిగి రావాలనిపిస్తుంది.

మంగళవారం, జులై 12, 2011

బాబూజీ అన్నయ్య

నాకన్నా ఏడాది చిన్నవాడైన బాబూజీ నాకు అన్నయ్య ఎలా అయ్యాడో చెప్పాలంటే, ముందుగా బాబూజీ గురించి చెప్పాలి. నలుగురు పిల్లలు పుట్టి పోయిన తర్వాత పుట్టిన బాబూజీ అంటే వాళ్ళమ్మకీ, నాన్నకీ ప్రాణం. ఇంకా చెప్పాలంటే ప్రాణం కంటే ఎక్కువే కూడాను. పిల్లాడిని బతికించుకోడం కోసం చేసిన అనేక ప్రయత్నాల్లో ఒకటిగా పేరు పెట్టలేదు. ఏదో ఒక పేరుతో పిలవాలి కాబట్టి 'బాబూజీ' అని పిలవడం మొదలెట్టి, చివరికి బళ్ళో కూడా అదే పేరు రాయించారు.

ఊహ తెలిసినప్పటినుంచీ ఆడింది ఆట, పాడింది పాట అవ్వడంతో చాలా చిన్నప్పుడే తను సర్వజ్ఞుణ్ణనే నమ్మకం మొదలయ్యింది బాబూజీలో. కొన్ని కొన్ని నమ్మకాలకి ఆధారాలు ఉండవు. దానికి తోడు, వాళ్ళ నాన్న రెండ్రోజులకోసారి బడికొచ్చి పిల్లలందరి ఎదురుగానూ వాళ్ళబ్బాయి అర్భకం పిల్లాడు కాబట్టి వాణ్ణి కొట్టకండనీ, మిగిలిన పిల్లలు కూడా ఏమీ చేయకుండా చూడమనీ మేష్టారిని బతిమాలి వెళ్ళేవాడు. బాబూజీతో సమస్య ఏమిటంటే తను చెప్పిందే కరక్టు. అది తప్పయి ఉండచ్చనే ఆలోచన పొరపాటున కూడా వచ్చేది కాదు.

రెండూ రెండూ కలిపితే మూడు వస్తుందని తనకి అనిపిస్తే, మేష్టారు ఎంతగా చెప్పినా కూడా జవాబు నాలుగు అని నమ్మేవాడు కాదు. వాళ్ళ నాన్న కారణంగా మొదట్లో బాబూజీని క్షమించేసినా, తర్వాత్తర్వాత మేష్టారు కోపం ఆపుకోలేక సుద్దముక్కలు బాబూజీ తలమీద తగిలేలా విసరడం లాంటి శిక్షలు వేసేవాళ్ళు. అదే మాకైతే తొడ పాశాలూ, గోడకుర్చీలూను. తను నా తర్వాత క్లాసు కాబట్టి, ప్రతి వేసవిలోనూ నా పుస్తకాలు తను తీసుకునే వాడు. మా ఇంట్లో వాళ్ళకీ, వాళ్ళింట్లో వాళ్ళకీ ఉన్న స్నేహం వల్ల నాకు తప్పేది కాదు.

నేను నా పుస్తకాలని ఎలా చూసుకోవాలో అప్పుడప్పుడూ జాగ్రత్తలు చెబుతూ ఉండే వాడు. తర్వాత తను తీసుకోవాలి కదా మరి. కొంచం పెద్దయ్యే కొద్దీ బాబూజీ అభిరుచులు కూడా కొంచం ప్రత్యేకం అని తెలుస్తోంది మాకందరికీ. తనకి కత్తి ఫైటు కాంతారావంటే తెగిష్టం. ఎంతగా అంటే, మా ఊళ్లోకి రికార్డింగ్ డేన్స్ వచ్చినప్పుడు కాంతారావు పాట వేయించమని వాళ్ళ నాన్నతో ట్రూప్ వాళ్లకి రికమెండ్ చేయించే అంత. "ఇప్పటివరకూ కాంతారావు పాటలు ఎవరూ అడగలేదండీ.. మాకు రావు," అని చెప్పేశారు వాళ్ళు.

ఓరోజు బళ్ళో మేష్టారికి బాబూజీ మీద బాగా కోపం వచ్చేసింది. కొట్టడానికి లేదు కదా. అందుకని హాజరు పట్టీ తీసి, "నీపేరు బాబూజీ కాదు. బాపూజీ అని ఉండాలి. తప్పు పడింది" అన్నారు. "కాదండీ నా పేరు బాబూజీనే" అని మావాడి వాదన. అక్కడ మేష్టారిదే బలం కాబట్టి అప్పటికప్పుడు రికార్డులో 'బాపూజీ' అని పేరు మార్చేసుకుని పగ సాధించారు. బాబూజీ ఊరుకోకుండా వాళ్ళ ఇంట్లో చెప్పేశాడు. పేరు విషయంలో మేష్టారు రాజీ పడని కారణంగా మా బాబూజీ రికార్డుల్లో బాపూజీ గా మారిపోయాడు.

రోజులు గడుస్తూ ఉండగా, బాబూజీ ఒకసారి వాళ్ళింట్లో వాళ్ళతో హైదరాబాద్ వెళ్లి వచ్చాడు. తనకి బాగా నచ్చింది. నేనప్పటికే హైదరాబాద్ చూసేసినా, తను చెప్పే కబుర్లన్నీఆశ్చర్యంగా నోరు తెరుచుకుని వినాల్సి వచ్చేది. లేకపొతే తనకి కోపం వచ్చేసేది మరి. ఆరకంగా నాకు కొద్దిగా నటించడం నేర్పించాడు బాబూజీ. ఊళ్ళో అడిగిన వాళ్ళకీ, అడగని వాళ్ళకీ హైదరాబాద్ విశేషాలు చెబుతూ ఉండగా, బాబూజీకి ఉన్నట్టుండి మా ఊరిని కూడా హైదరాబాద్ గా మార్చేయాలని కోరిక పుట్టింది. "మనం పెద్దయ్యాక అలాగే మార్చేద్దాం. మీ ఇంటిదగ్గరే చార్మినార్ కట్టిద్దాం" అని నమ్మకంగా చెప్పాను.

పదో తరగతి పరీక్ష తప్పగానే బాబూజీకి పెళ్లి చేసేయాలని నిశ్చయించారు వాళ్ళింట్లో. వాళ్ళు పెద్ద స్థితిమంతులేమీ కాదు. ఇతగాడికా చదువూ అబ్బడం లేదు, ఏ పనీ చేసేంత బలమూ లేదు. "ముందేదన్నా కుసి (కృషి-చేతిపని) నేర్పించవయ్యా. పెళ్లి తర్వాత చెయ్యొచ్చు" అని ఊళ్ళో వాళ్ళు చెప్పి చూశారు కానీ, వాళ్ళ నాన్న వినకుండా తనకి ఎన్నో ఏట పెళ్లయ్యిందో, వాళ్ళ నాన్నకీ, తాతకీ ఏ వయసులో పెళ్లయ్యిందో ఆపకుండా అరగంట సేపు ఉపన్యసించి అందరి నోళ్ళూ మూయించేశాడు.

తగుమాత్రం వైభవంగా బాబూజీ పెళ్ళయిపోయింది. ఆడవాళ్ళు కూడా మెచ్చుకున్న అందం ఆ అమ్మాయిది. "కాకి ముక్కుకి దొండపండు" అన్నారు కిట్టనివాళ్ళు. పెళ్ళయిన వాణ్ణి, అతని భార్య ఎదురుగా ఏరా, ఒరే అని మాట్లాడకూడదని మా అందరికీ ఇళ్ళలో మళ్ళీ మళ్ళీ చెప్పి ప్రాణాలు తోడేశారు. మిత్రులందరం కలిసి కూర్చుని ఆలోచించుకుని బాబూజీని 'అన్నయ్య' అని పిలవాలని నిర్ణయించేసుకున్నాం. కానైతే పెద్దగా మాట్లాడే పని ఉండడం లేదు. ఎప్పుడో తప్ప తను బయటికి రాడు. మేం వెళ్లకూడదని ఇళ్ళలో ఆర్డర్లు.

బాబూజీ అన్నయ్య ఆడవాళ్ళని కూడా తన ఇంటికి రానివ్వడం లేదనీ, భార్యని ఎవరితోనూ మాట్లాడనివ్వడం లేదనీ బోల్డన్ని కథలు ప్రచారంలోకి వచ్చేశాయి. కాలేజీ గొడవల్లో పడి పెద్దగా పట్టించుకోలేదు. ఉన్నట్టుండి ఒకరోజు, బాబూజీ, భార్యా విడిపోయారనీ, ఆ అమ్మాయి మరో పెళ్లి చేసేసుకుందనీ చెప్పుకున్నారు ఊళ్ళో. పట్టుదలలో పరశురాముడైన బాబూజీ వాళ్ళ నాన్న నెల తిరక్కుండా మరో సంబంధం చూసి కొడుక్కి పెళ్లి చేసేశాడు. మాకెవ్వరికీ పెళ్ళనేది కనుచూపు మేరలో కనిపించడం లేదు కానీ, బాబూజీకప్పుడే రెండో పెళ్లి!

ఉన్నట్టుండిబాబూజీ తనే మాతో కల్పించుకుని మాట్లాడడం మొదలు పెట్టాడు. వచ్చిన ప్రతిసారీ తనకి ఉద్యోగానికి రమ్మంటూ బ్యాంకుల నుంచీ, ఆఫీసుల నుంచీ ఉత్తరాలు వస్తున్నాయని, ఇంట్లో ఒప్పుకోవడం లేదనీ చెప్పేవాడు. నమ్మినట్టు నటించేవాడిని. మనకి అబద్ధం అని కచ్చితంగా తెలిసిన విషయాన్ని నిజమన్నట్టుగా వినడంలో ఉన్న ఆనందాన్ని నాకు మొదట రుచి చూపించిన వాడు కూడా బాబూజీనే. నేను ఊరు విడిచిపెట్టిన కొన్నాళ్ళకే, వాళ్ళ కుటుంబమూ బతుకు తెరువు కోసం వేరే ఊరు వెళ్ళిపోయింది. తర్వాత్తర్వాత ఊరు వెళ్ళినప్పుడల్లా శిధిలావస్తలో ఉన్న వాళ్ళ ఇల్లు చూసినప్పుడల్లా మా ఊరిని హైదరాబాద్ గా చూడాలన్న బాబూజీ కోరిక గుర్తొస్తూ ఉండేది. బాబూజీని మళ్ళీ కలుస్తానో కలవనో..

సోమవారం, జులై 11, 2011

ఏడు తరాలు

పుస్తకాలు కేవలం విజ్ఞానాన్నీ, వినోదాన్నీ పంచి ఊరుకోవు. అవి మనల్ని ప్రభావితం చేస్తాయి కూడా. అలా నన్ను ప్రభావితం చేసిన ఒకానొక పుస్తకం 'ఏడు తరాలు.' ఎలెక్స్ హెలీ ఆంగ్ల నవల 'రూట్స్' కి సహవాసి చేసిన సరళమైన తెలుగు అనువాదం. విజేతలే చరిత్రలు రాశారు, రాస్తారు. ఇది సామాన్యంగా జరిగే విషయం. ఎందుకంటే పరాజయాలు చెప్పుకోగలిగే విషయాలుగా అటు పరాజితులకీ, ఇటు సమాజానికే కూడా అనిపించవు కాబట్టి. కానీ, ఈ ఆనవాయితీని బద్దలు కొట్టిన వాడు హెలీ.

'ఏడు తరాలు' బానిసల కథ. కేవలం తమ అమాయకత్వం కారణంగా, చీకటి ఖండం ఆఫ్రికా నుంచి అమెరికాకి బానిసలుగా తీసుకురాబడ్డ దురదృష్టవంతుల కథ. పచ్చటి ఆఫ్రికా పల్లెల్లో, తమవైన సంస్కృతీ సంప్రదాయాల మధ్యన, ఆటపాటలతో జీవితం గడుపుతున్న ఆఫ్రికా వాసులని, వలవేసి పట్టుకుని, బంధించి, రోజుల తరబడి గాలైనా సోకని ఓడలలో తమ దేశానికి రవాణా చేసి, నడిబజార్లో వాళ్ళని వేలం వేసిన అమెరికన్ల కథ.

క్రీస్తుశకం 1750 లో పడమటి ఆఫ్రికా లో గాంబియా సమీపంలోని జపూరు అనే పల్లెటూళ్ళో ఉమరో-బింటా దంపతులకి నేరేడు పండులా నిగనిగలాడే 'కుంటా' అనే కొడుకు పుట్టడం కథా ప్రారంభం. ఆఫ్రికా పల్లెల సౌందర్యాన్నీ, సమస్యలనీ, ప్రకృతి వైపరీత్యాలనీ పరిచయం చేస్తూనే, అక్కడి జీవన విధానాన్నీ కళ్ళ ముందుంచుతారు రచయిత. ముఖ్యంగా పిల్లల పెంపకం, పనిపాటలతో పాటు రాయడం, చదవడం నేర్పించడం, మగ పిల్లలని ప్రత్యేకమైన 'పురుష' శిక్షణ కోసం పంపించడం ఇవన్నీ పాఠకులని ఆశ్చర్య పరుస్తాయి.

కుంటా తమ పల్లె దగ్గరలో ఉన్న అడవిలో పురుష శిక్షణ పూర్తి చేసుకుని యువకుడి గ్రామానికి తిరిగి వచ్చాక, అతనికి వేరే ఇల్లు కట్టించి అక్కడికి పంపేస్తారు తల్లిదండ్రులు. అడవుల్లో తిరిగేటప్పుడు 'తెల్లోడి' బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలో కొడుక్కి వివరంగా చెబుతాడు ఉమరో. తడిసిన కోడి మాంసం వాసన వచ్చిందంటే దగ్గరలో తెల్లోడు ఉన్నట్టేననీ, వాడి అడుగులు బరువుగా పడతాయనీ, ఆకుల్ని తుంపుతూ పోతాడనీ.. ఇలా ఎన్నో ఆనుపానులు విశదంగా చెబుతాడు.

మంచెమీద కూర్చుని రాత్రంతా పొలం కావలి కాస్తూ, యవ్వన సహజమైన కోర్కెలతో భావి సంసారజీవితాన్ని గురించి మేల్కొనే కలలు కంటూ నిద్రకు దూరమైన కుంటా, మర్నాడు ఉదయాన్నే తమ్ముడికి మృదంగం చేసి ఇవ్వడం కోసం నాణ్యమైన దుంగ కోసం అడవికి వెళ్లి ఏమరుపాటున తెల్లోడికి చిక్కుతాడు. అక్కడినుంచి అతని కష్టాలు ప్రారంభం. దెబ్బలతో స్పృహ తప్పించి తీసుకెళ్ళిన తెల్లోళ్ళు, కుంటాని ఒక ఓడలో గొలుసుతో బంధిస్తారు. ఆ ఓడ నిండా వందలాది ఆఫ్రికావాసులే.

దుర్భరమైన ప్రయాణం తర్వాత తీరం చేరుతుంది ఓడ. వేలంలో కుంటాని కొనుక్కున్న యజమాని అతనికి 'టోబీ' అని పేరు పెట్టి తనతో తీసుకెళ్ళి పోతాడు. చేతులుమారిన కుంటా వర్జీనియాలో 'నిగ్గరు' (బానిస) గా స్థిరపడతాడు. పారిపోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అవన్నీ విఫలమవుతాయి. తన ప్రయత్నానికి శిక్షగా కాలు కోల్పోతాడు. నలభయ్యేళ్ళ వయసులో తోటి నిగ్గరు బెల్ ని పెళ్లి చేసుకుని 'కిజ్జీ' కి తండ్రవుతాడు. కూతురికి జ్ఞానం రాగానే, దగ్గర కూర్చోబెట్టుకుని జపూరు గురించీ, తన బాల్యాన్ని గురించీ, తను బానిసగా వచ్చిన వైనాన్ని గురించీ వివరంగా చెప్పడంతో పాటు తన భాషనీ నేర్పుతాడు.

ఈ కథ పరంపరాగతంగా ప్రతీ తరమూ తన తర్వాతి తరానికి చెప్పడం ద్వారా, ఎనిమిదో తరం వాడైన ఎలెక్స్ హెలీకి చేరడం, అతడు చాలా పరిశోధన చేసి 688 పేజీల ఆంగ్ల నవలగా తీసుకురావడం తర్వాతి కథ. ఈ ఆంగ్ల నవల సారాన్ని క్లుప్తంగా, సరళంగా తెనిగీకరించారు 'సహవాసి' గా పేరొందిన జంపాల ఉమామహేశ్వర రావు. (నాకు కొద్దిపాటి పరిచయం ఉంది అని చెప్పుకోడానికి గర్వ పడే వ్యక్తుల్లో ఒకరీయన). తనకి మరికొంచం వివరంగా రాయాలని ఉన్నా, ప్రకాశకుల కోరిక మేరకే బాగా క్లుప్తీకరించాల్సి వచ్చిందని ఆదివారం ఆంధ్రజ్యోతి 'ఫెయిల్యూర్ స్టోరీ' కి ఇచ్చిన ఇంటర్యూ (బహుశా ఆయన చివరి ఇంటర్యూ) లో చెప్పారు.

జపూరు నాగరికత, తరాల పాటు కొనసాగిన అంచె డప్పుల వ్యవస్థ మొదలుకొని, విముక్తి కోసం కుంటా పడే తపన, తన సంస్కృతీ సంప్రదాయాలని నిలబెట్టుకోవడం కోసం పడే తాపత్రయం వెంటాడతాయి. అంతేనా? నిగ్గర్ల కష్టాలు, యజమానుల కారణంగా వాళ్ళు పడే హింస, ఒకరితో ఒకరు కనీసం మాట్లాడుకోలేని అసహాయత, యజమానుల మెప్పు కోసం చేసే వృధా ప్రయత్నాలు ఇవన్నీ కలుక్కుమనిపిస్తాయి. ఒక్క క్షణం ఏమరుపాటు కారణంగా తమ జీవితాలనే మూల్యంగా చెల్లించిన వాళ్ళు వాళ్ళంతా. అంతే కాదు, ప్రపంచానికి నాగరికత నేర్పానని నిస్సిగ్గుగా చెప్పుకునే దేశం చేసిన అనాగరిక పనికి ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా.

తరచి చదవగలిగితే ఎన్నో జీవిత సత్యాలని విప్పి చెబుతుందీ నవల. ఒక్కో పాత్రనుంచీ నేర్చుకోగలిగింది ఎంతైనా ఉంది. సహవాసి రాసిన ఎన్నో చిన్న వాక్యాలు పదే పదే వెంటాడతాయి. ఆలోచనల్లో పడేస్తాయి. ప్రతి ఒక్కరూ చదవాల్సిన, చదివించాల్సిన ఈ నవలని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది.

ఆదివారం, జులై 10, 2011

వ్యవ'సాయం'

మన రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకి 'ఋణ అర్హత కార్డులు' పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఐదున్నర లక్షలమంది కౌలు రైతులని గుర్తించి వాళ్లకి కార్డులు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అసలీ కౌలు రైతులు ఎవరు? వీళ్ళకిప్పుడు కార్డులు పంచడం ఎందుకూ అంటే, ఇది ఇవాల్టి సమస్య కాదు. చాలా రోజులుగా ఉన్నదే, చాలా ప్రభుత్వాలు తేనెటీగల తుట్టెని కదపడం ఎందుకని పక్కన పెట్టేసిందే.

వ్యవసాయ భూమి ఉన్న భూయజమానుల్లో చాలామంది వ్యవసాయం చేయరు. ఆసక్తి లేకో, ఇతరత్రా లాభదాయకమైన వ్యాపారాలు నిర్వహిస్తూ ఉండడం వల్లనో, లేదా నగరాలకి వలస వెళ్ళిపోవడం వల్లనో వ్యవసాయం వాళ్లకి సాధ్యం కాదు. అప్పుడు ఏం చేస్తారంటే, వాళ్లకి ఉన్న వ్యవసాయ భూమిలి కౌలుకి ఇస్తారు. ఈ కౌలు తీసుకునే వాళ్ళు సాధారణంగా చిన్న రైతులో, రైతుకూలీలో అవుతారు. యజమాని దగ్గరనుంచి తీసుకున్న భూమిలో పెట్టుబడులన్నీ పెట్టి పంట పండించి, చివర్లో భూమిని ఇచ్చిన యజమానికి పండిన పంటలో భాగం ఇస్తారు. దీనినే కౌలు అంటారు.

మామూలు భాషలో చెప్పాలంటే, భూమి యజమాని తన భూమిని మరో రైతుకి అద్దెకి ఇస్తాడు. ప్రతి పంట సీజన్లోనూ ఆ అద్దెని వసూలు చేసుకుంటాడు. ఈ కౌలు రెండు రకాలుగా వసూలు చేస్తారు. పండిన పంటలో ఇంత భాగం అని కానీ, పంటతో నిమిత్తంలేకుండా కచ్చితంగా ఇంత కౌలు చెల్లించాలని కానీ ముందుగానే అనుకుంటారు. సాధారణంగా ఇందుకు సంబంధించి రాతకోతలేవీ ఉండవు. ఊళ్ళో పెద్దమనుషుల సమక్షంలో ఈ కౌలు ఒప్పందాలు జరిగిపోతూ ఉంటాయి.

ఈ కౌలు రైతులకి భూమి మీద ఎలాంటి హక్కూ ఉండదు. పన్నులు వీళ్ళే కట్టాలి కానీ, రశీదులు భూయజమాని పేరు మీద ఇస్తారు. భూమిని తనఖా పెట్టి అప్పు తీసుకునే హక్కూ, ఒకవేళ ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటిస్తే అది తీసుకునే హక్కూ కూడా భూ యజమానివే. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం, భూ యజమాని తన భూమిని అమ్మదల్చుకుంటే ముందుగా కౌలురైతుకి అవకాశం ఇవ్వాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కౌలు రైతులకి బాధ్యతలే తప్ప ఎలాంటి హక్కులూ లేవు. వీళ్ళ మనుగడ యజమాని మంచితనం మీద ఆధారపడి ఉంటుంది.

ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న కార్డులు కూడా, వీళ్ళని కేవలం కౌలురైతులుగా గుర్తిస్తూ ఇస్త్తున్న గుర్తింపు కార్డులు మాత్రమే. గ్రామ స్థాయిలో అనేక సర్వేలూ, ఎంక్వయిరీలూ చేసి జాబితాలు సిద్ధం చేసి అర్హులని ప్రకటించారు. వీటి సాయంతో వ్యవసాయ పెట్టుబడులకోసం కౌలు రైతులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవచ్చు. అయినప్పటికీ ఈ పరిణామం పట్ల చాలామంది భూయజమానులు అసంతృప్తితో ఉన్నారు. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. మొన్నటి వరకూ వ్యవసాయ శాఖని నిర్వహించి ఈమధ్యనే రెవిన్యూ శాఖ మంత్రయిన రఘువీరా రెడ్డి టీవీలో చెప్పారు. కౌలు రైతులు అనేది చాలా సున్నితమైన విషయమనీ, ప్రభుత్వం చాలా జాగ్రత్తగా డీల్ చేస్తోందనీ కూడా చెప్పారు.

గడిచిన అరవైనాలుగేళ్ళలోనూ వ్యవసాయాన్ని గురించి మాత్రమే కాదు, వ్యవసాయ భూముల గురించీ ప్రభుత్వం పట్టించుకున్నది చాలా కొంచం. కొన్ని పొరపాటు నిర్ణయాల ఫలితంగా, ఇవాల్టి రోజున భూముల గురించి సమగ్ర సమాచారం లేదు ప్రభుత్వం దగ్గర. రికార్డుల్లో బీడుభూమి, పరిశీలనలో పంటభూమిగా కనిపించడం లాంటివి కోకొల్లలు. మరోసమస్య ఏమిటంటే, రెవిన్యూ-రిజిస్ట్రేషన్ శాఖల మధ్యన సమన్వయం లేకపోవడం. దీనివల్ల భూయజమానులని గుర్తు పట్టే విషయంలో ఎన్నో సమస్యలు. అయితే, భూపరిమితి చట్టం లాంటి వాటి ఫలితంగా ఒకప్పుడు కేవలం ముప్ఫై లక్షలుగా ఉన్న భూయజమానుల సంఖ్య ప్రస్తుతం కోటీ ఇరవై లక్షలకి పెరిగింది.

మొన్ననే ఒక రైతుని కలిశాను. ఆయనేమీ సన్నకారు రైతు కాదు. పెద్దకారు రైతు. స్కార్పియో కార్లో తిరుగుతూ ఉంటాడు. అప్పట్లో అగ్రికల్చర్ బీఎస్సీ చదివి, వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేసే ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేసి, సీనియర్ హోదాలో రిటైరై, పెద్దఎత్తున వ్యవసాయ భూమి కొని వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన చెప్పిన ఆసక్తికరమైన సంగతేమిటంటే, వరిపంటకి సంబధించి వ్యవసాయ అధికారుల నుంచి ఎలాంటి ప్రోత్సాహమూ లేదు కానీ, సెరి కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం పట్టు పురుగులు పెంచమంటూ రోజూ ఈయన పొలం చుట్టూ తిరుగుతున్నారుట.

"హైలీ ఎక్స్పెన్సివే అయినా, సెరి కల్చర్ ప్రస్తుతం హైలీ సబ్సిడైజ్ద్. నేను అప్లికేషన్ మీద సంతకం పెట్టానంతే, మిగిలిన పనంతా వాళ్ళే చేసేశారు. మామూల్ కూడా తీసుకోలేదు," అన్నాడాయన ఉత్సాహంగా. నాకు పదేళ్ళ క్రితం, పట్టు రైతులు మద్దతు ధరకోసం చేసిన ధర్నాలు కళ్ళ ముందు మెదిలాయి. పంటని నిలవ చేసి అమ్మితే లాభాలు చాలా బాగున్నాయనీ, తనిప్పుడు గోడౌన్ల మీద దృష్టి పెడుతున్నాననీ చెప్పాడాయన. ఆయన మిత్రులు కొందరు ఈయన భూముల పక్కనే భూములు కొని కార్పొరేట్ ఫార్మింగ్ చేయబోతున్నారుట. ఈ భూములు అమ్ముకొనేది కొందరు చిన్న రైతులే అని వేరే చెప్పక్కర్లేదు కదా.

ప్రభుత్వం కదిలి వ్యవసాయం కోసం ఏదో ఒకటి చేయకపోతే, వ్యవసాయం కేవలం కొందరు వ్యక్తులు/సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయేమో అనిపించింది ఆయనతో మాట్లాడాక. కేవలం ఋణ కార్డుల లాంటి సహాయాలు సరిపోవు. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవాలి. లేనిపక్షంలో అనివార్యంగా రాబోయే మార్పుకి సిద్ధ పడాలి. ఆ మార్పు మంచికా, చెడ్డకా అన్నది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే అది కాలం మాత్రమే జవాబు చెప్పగలిగే ప్రశ్న.