మంగళవారం, నవంబర్ 26, 2019

అసురసంధ్య వేళ ...

"నశ్వరమిది... నాటకమిది... 
నాలుగు ఘడియల వెలుగిది..." 

శృంగార రస ప్రధానమైన గీతంలో భక్తిని, వైరాగ్యాన్ని రంగరించడం అన్నది అనేక పరిమితుల మధ్య పనిచేసే సినీ గీత రచయితలకి పెద్ద సవాలే. ఇలాంటి సవాళ్లనెన్నింటినో అలవోకగా గెలిచిన చరిత్ర వేటూరిది. భగవదారాధనకి జీవితాన్ని అంకితం చేసిన ఓ సన్యాసి మీద, ఒక వేశ్య మనసు పడితే? అతన్ని తనవాడిని చేసుకోడానికి ఆమె పట్టువిడవకుండా ప్రయత్నాలు చేస్తే?

అందరికీ తెలిసిన 'విప్రనారాయణ' కథ ఇది. ఈ కథని తన సినిమా 'అమరజీవి' (1983) లో సందర్భానికి అనువుగా ఉపయోగించుకున్న దర్శకుడు జంధ్యాల, పాటని రాసే బాధ్యతని వేటూరికి అప్పగించారు. ఫలితమే, 'అసురసంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామీ...' అనే సుప్రసిద్ధ గీతం. చిన్నపిల్లల నృత్యనాటకంగా మొదలై, నాయికా నాయకుల యుగళగీతంగా మారే ఈ పాటలో ఆసాంతమూ విప్రనారాయణుణ్ణీ, దేవదేవినీ కళ్ళకి కట్టారు వేటూరి. 

"శ్రీ రంగనాధ చరణారవింద చారణ చక్రవర్తి.. పుంభావ భక్తి.. 
ముక్తికై మూడు పుండ్రాలు నుదుట దాల్చిన
ముగ్ధ మోహన సుకుమార మూర్తీ.. 
తొండరడిప్పొడి... నీ అడుగుదమ్ముల పడి ధన్యఅయినది ..
నీ దీన దీన దేవదేవి.. నీ దాసాను దాసి..
నీ పూజలకు పువ్వుగా.. జపములకు మాలగా.. పులకించి పూమాలగా..
గళమునను.. కరమునను.. ఉరమునను..
ఇహముకు.. పరముకు నీదాననై.. ధన్యనై..
జీవన వదాన్యనై తరియించుదాన.. మన్నించవే..మన్నించవే..
అని విన్నవించు నీ ప్రియ సేవిక .. దేవదేవి.."

ఈ సాకీతో పాట ప్రారంభమవుతుంది. ఇదంతా నాయకుడి వర్ణనే. శ్రీ రంగనాధ స్వామి పదాలని సదా పూజించే సంచారి, భక్తికి పురుష రూపం, ముక్తి కోసం మూడు పుండ్రాలు నుదిటి మీద ధరించిన వాడు (శ్రీ వైష్ణవులు మొత్తం పన్నెండు పుండ్రాలు శరీరం మీద ధరిస్తారు - శైవులు విభూది ధరించినట్టు - వీటికి ద్వారశోర్ధ్వ పుండ్రాలు అని పేరు), ముగ్ద మోహన సుకుమారుడు, తొండరడిప్పొడి (శ్రీరంగ నాధుణ్ని సేవించిన ఆళ్వారుల్లో ఒక ఆళ్వార్ పేరు - భక్తుడి పాదరేణువు అని అర్ధం) అయినటువంటి అతడి పాదముద్రలు తాకి తాను ధన్య అయ్యానంటోంది దేవదేవి. 

నువ్వు చేసే పూజలకు పువ్వునవుతాను, జపాలకి మాలనవుతాను, పూమాలగా మారి నీ కంఠాన్ని, చేతుల్ని, వక్షాన్ని అలంకరించడమే కాక, ఇహపరాలు రెంటికీ నీ దానినై నా జీవితాన్ని తరింప చేసుకుంటాను, నా ప్రార్ధనని మన్నించి, నా ప్రేమని అంగీకరించు అంటూ తనని తాను అతనికి 'ప్రియసేవిక' గా అభివర్ణించుకుంది దేవదేవి. ఇక్కడితో సాకీ ముగిసి, పాట మొదలవుతుంది: 
"అసురసంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..
ఆడ ఉసురు తగలనీకు స్వామీ...
ముసురుకున్న మమతలతో కొసరిన అపరాధమేమి ?
స్వామీ.. స్వామీ.." 

సూర్యాస్తమయం తర్వాతి సమయాన్ని అసురసంధ్య అంటారు. అసురసంధ్య వేళ చేయకూడని పనులతో పెద్ద జాబితానే ఉంది. అటువంటి పుణ్యకాలంలో ఆడపిల్లని బాధ పెట్టి ఆమె ఉసురు నీకు తగలనివ్వకు స్వామీ (ఇక్కడ స్వామి అంటే సన్యాసి అనీ, నా దైవమా అనీ అర్ధాలు తీసుకోవచ్చు). ప్రేమతో నీవైపు మొగ్గడంలో తప్పేముంది  అని ఆమె ప్రశ్న. 

"అసురసంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ.. 
స్వామి ఉసురు తగలనీకు దేవీ..
మరులుగొన్న హరిని వీడి మరలిన నర జన్మమేమి?దేవి ..దేవీ.." 

నా మనస్సు నీ వైపు మళ్లించుకుని ఆ స్వామి (శ్రీరంగనాధ స్వామి) ఉసురు నాకు, నీకూ కూడా తగలనివ్వకు, నా మనస్సంతా నిండి ఉన్న హరిని నేను విడిచిపెడితే ఇక ఈ జన్మకి అర్ధం ఏముంది? అని అతని జవాబు లాంటి ప్రశ్న. 

"హరిహర సుర జ్యేష్టాదులు.. కౌశిక శుక వ్యాసాదులు
నిగ తత్వములను దెలిపి.. నీమ నిష్టలకు అలసి.. 
పూనిన శృంగారయోగమిది కాదని .. నను కాదని..
జడదారీ.. ఆ..ఆ..ఆ..ఆ.. పడకు పెడదారి.." 

అతడు హరి ప్రస్తావన తెచ్చేసరికి, ఆమె తనని తాను సమర్ధించుకోవాల్సిన సందర్భంలో   పడింది. అందుకు తాను కూడా అదే దారిలో వెళ్ళింది. దేవతలు, మునులు కూడా శృంగారాన్ని నిషేధించలేదని గుర్తు చేస్తూనే, ఓ సన్యాసీ నాదారిని విడిచి పెడదారిలో వెళ్లొద్దు అని సలహా ఇచ్చింది. ఇప్పుడు అతడు సమాధానం చెప్పాలి. చెప్పాడు, రెండో చరణంలో: 

"నశ్వరమిది.. నాటకమిది... నాలుగు ఘడియల వెలుగిది..
కడలిని కలిసే వరకే... కావేరికి రూపు ఉన్నదీ.. 
రంగని కీర్తన చేసే రాగమాలికను కానీ..
రంగని భక్తుల ముంగిట రంగ వల్లికను కానీ..
దేవి..దేవీ..దేవదేవీ..." 

ఈ శరీరం  శాశ్వితం కాదు, కేవలం నాలుగు ఘడియల ఈ జీవితం ఓ పెద్ద నాటకం. ఆ కావేరీ నది కూడా (శ్రీరంగం ఉన్నది కావేరి ఒడ్డునే) సముద్రంలో కలవగానే తన రూపం కోల్పోతుంది. నన్ను ఆ రంగని కీర్తించుకొనీ, ఆ స్వామి భక్తుల వాకిట ముగ్గుగా నా జీవితాన్ని అలంకరించుకోనీ దేవదేవీ అన్నాడు (ఆళ్వారులు రంగనాధుడి కన్నా, స్వామి భక్తులకే ఎక్కువ విలువిచ్చారు. 'తొండరడిప్పొడి' కి అర్ధమే ఇందుకు ఉదాహరణ). ఇక్కడి నుంచి వాదం పెరిగింది, ఇద్దరూ చెరో మాటా అనుకున్నారు, మూడో చరణంలో: 

"అలిగేనట శ్రీరంగము.." 

ఇది ఆమె మాట. అతడు ఆమెని కాదంటే శ్రీరంగం ఎందుకు అలుగుతుంది? ఎందుకంటే శ్రీరంగ స్వామి యోగి కాదు, భోగి. 

"తొలగేనట వైకుంఠము.." 

ఇది అతడి వాదన. వైకుంఠం చేరాలంటే నిష్టగా, దీక్షగా బ్రహ్మచర్యం ఆచరించాలని అతడి నమ్మకం మరి. 

"యాతనకేనా దేహము?"

శరీరానికి కావాల్సినవి ఇవ్వకుండా బాధపెట్టడాన్ని ప్రశ్నిస్తోందామె.

"ఈ దేహము సందేహము" 

ఈ శరీరమే పెద్ద సందేహం అంటున్నాడతను. ఉంటుందో ఉండదో తెలియని శరీరాన్ని బాధ పెట్టడం పెద్ద విషయం కాదతనికి. 

"ఈ క్షణమే సమ్మోహము... వీక్షణమే మరు దాహము"

అంటూ అతని చెంత చేరిందామె. ("It is women that seduce all mankind" అని గిరీశం వాపోలేదూ?) 

"రంగా... రంగా... రంగరంగ శ్రీరంగ.. 
ఎటులోపను? ఎటులాపను?" 

అతను ఓడిపోతున్నాడు. చివరి ప్రయత్నంగా ఆ రంగడికే మొరపెట్టుకున్నాడు. 

"ఒకసారి.. అ.. అ.. అనుభవించు ఒడిచేరి.."

అంతిమ విజయం ఆమెదే. బహుశా, ఆ రంగడి సంకల్పం కూడా అదేనేమో మరి. ఆ విప్రనారాయణుడి లాగే 'అమరజీవి' కథానాయకుడు ఆనంద్ (అక్కినేని) కూడా స్త్రీలని దూరంపెట్టే వ్యక్తి. అతన్ని ప్రేమించిన లలిత (జయప్రద)  కూడా ఆ దేవదేవి లాగే తన ప్రేమని గెలుచుకోడానికి విడవకుండా ప్రయత్నాల్ని కొనసాగిస్తూ ఉంటుంది. జంధ్యాల సృష్టించిన సందర్భానికి వేటూరి రాసిన పాట అతికినట్టు సరిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. 

చక్రవర్తి సంగీత సారధ్యంలో బాలు, సుశీల కలిసి పాడిన ఈ శృంగార యుగళంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సుశీలని గురించి. ఎక్కువ సందర్భాల్లో రొమాంటిక్ డ్యూయెట్ అనగానే జ్వరం గొంతుతో పాడేసే సుశీల, ఈ పాటలో (మరీ ముఖ్యంగా చివరి చరణంలో) రొమాన్స్ ని పలికించిన తీరు ప్రత్యేకం. 'అసురసంధ్య వేళ..' అని పాడుతూ నాయికానాయకులు  మిట్టమధ్యాహ్నం పూట నది ఒడ్డున నడవడం ఏమిటో దర్శకుడికే తెలియాలి. క్లోజప్పుల్లో నాగేశ్వరరావు వయసు మరీ తెలిసి పోవడం వల్ల జయప్రద అందం మరింతగా ఇనుమడించింది ఈ పాటలో.