సోమవారం, మార్చి 16, 2020

సందమామ కంచవెట్టి ...

"పిల్ల సిగ్గు చచ్చినా మల్లె మొగ్గ విచ్చినా 
కదలడూ మెదలడూ కలికి పురుషుడూ..."

కారణాలేంటో తెలీదు కానీ, బాపూ-రమణలు  వేటూరి చేత రాయించుకున్న పాటలు బహు తక్కువ. ఆ తక్కువలో ఎక్కువ పాటలు ఆణిముత్యాలే, సాహిత్య పరంగానూ సంగీత పరంగానూ కూడా. ఇక, బాపూ మార్కు చిత్రీకరణ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? అందునా, సన్నివేశంలోనూ, సాహిత్యంలోనూ కూసింత రొమాన్స్ ఉన్నట్టయితే తెరమీదకి వచ్చేసరికి అది కాసంత అవుతుంది. రాజేంద్రప్రసాద్ నిర్మాణంలో వచ్చిన 'రాంబంటు' (1996) సినిమా కోసం వేటూరి రాసిన ఈ రొమాంటిక్ గీతం బాపూ-రమణలకి ఎంతగా నచ్చేసిందంటే, రమణ తన ఆత్మకథ 'కోతికొమ్మచ్చి' లో ప్రత్యేకంగా ప్రస్తావించేంత! 

బాలూ చిత్రా పాడిన ఈ పాట యుగళగీతం కాదు. ఎందుకంటే, చిత్ర పాట పాడితే, బాలూ పోర్షన్ కి చరణాల మధ్యలో డైలాగులు ఉంటాయి. ఓ జమీందారు మీద జరిగే కుట్రలో భాగంగా ఆయనగారమ్మాయి కావేరి (ఈ సినిమాలో కావేరి స్క్రీన్ నేమ్ తో పరిచయమై, ఇప్పుడు ఈశ్వరి రావు పేరుతో నటిస్తోంది) ని పెళ్లి చేసుకున్న వాడు అల్పాయుష్కుడౌతాడని జాతకం చెప్పిస్తారు. జమీందారు గారి నమ్మినబంటు రాంబంటు (రాజేంద్రప్రసాద్) అమ్మాయిగారి మెడలో తాళికట్టేసి, నేడో రేపో తను పోయాక ఆమె గండం గడిచిపోతుందని, అప్పుడు నిజమైన పెళ్లి జరుగుతుందన్న ఆలోచనలతో ఉంటాడు. అమ్మాయిగారు రాంబంటుతో ప్రేమలో పడిపోయి, అతనే తన భర్తని మనసా వాచా నమ్ముతూ ఉంటుంది. బ్రహ్మచర్యం అతని దీక్ష, దానిని భగ్నం చేయడం ఆమె కర్తవ్యం. ఈ సందర్భంలో వచ్చే పాట ఇది. సందమామ కంచవెట్టి సన్నజాజి బువ్వపెట్టి 
సందెమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి 
సిగపువ్వు తెమ్మంటే మగరాయుడు 
అరిటిపువ్వు తెస్తాడు అడవి పురుషుడు 

అవును, 'రాంబంటు' అడవిపురుషుడే. చిన్న బాలుడిగా అడవి నుంచి దివాణం చేరి, అక్కడే పెరిగి పెద్దయినా, అడవి అలవాట్లు విడిచి పెట్టడు. పెళ్లయింది కదా, కొత్త అలవాట్లు చేసుకోవాలి కదా అని ఆమె ఫిర్యాదు. 

భద్రాద్రిరామన్న పెళ్లికొడుకవ్వాల 
సీతలాంటి నిన్ను మనువాడుకోవాల 
బెజవాడ కనకదుర్గ బాసికాలు తేవాల 
బాసరలో సరస్వతి పసుపు కుంకుమలివ్వాల 

ఆమె ఏమంటోందో అస్సలు పట్టించుకోకుండా, అమ్మాయిగారికి జరగాల్సిన పెళ్లి కోసం దేవతలకి ప్రార్ధనలు చేస్తున్నాడు రాంబంటు. 

విన్నపాలు వినమంటే విసుగంటాడు 
మురిపాల విందంటే ముసుగెడతాడు 
బుగ్గపండు కొరకడు పక్కపాలు అడగడు 
పలకడు ఉలకడు పంచదార చిలకడు 
కౌగిలింతలిమ్మంటే కరుణించడు 
ఆవులింతలంటాడు అవకతవకడు 

సందర్భానుసారం అవసరమైన పండు, పాలుని బుగ్గపండు, పక్కపాలుగా మార్చిన చమత్కారం వేటూరిది. 'పంచదార చిలక' అని అమ్మాయిలని అనడం కద్దు. ఆమె ముద్దుగా అతన్ని 'పంచదార చిలకడు' అంటోందా, లేక 'పంచదార' 'చిలకడు' అని ఫిర్యాదు చేస్తోందా? వేటూరికే తెలియాలి.  డైలాగుల్లో మాటల్ని విరిచేసి కామెడీ చేసేసే  ముళ్ళపూడి రమణ డంగై పోయిన పదప్రయోగం 'అవకతవకడు.' 

ఏడుకొండలసామి ఏదాలు సదవాల 
చెవిటి మల్లన్నేమో సన్నాయి ఊదాల 
అన్నవరం సత్తెన్న అన్ని వరాలివ్వాల 
సింహాద్రి అప్పన్న సిరిసేసలివ్వాల 

ఆమె ఘోష అతనికి అస్సలు పట్టడం లేదు. ప్రార్ధనలు కొనసాగాయి, మరికొంచం గట్టిగా.. 

పెదవి తేనెలందిస్తే పెడమోములు 
తెల్లారిపోతున్న చెలి నోములు 
పిల్ల సిగ్గు చచ్చినా మల్లె మొగ్గ విచ్చినా 
కదలడూ మెదలడూ కలికి పురుషుడూ 
అందమంత నీదంటే అవతారుడు 
అదిరదిరి పడతాడు ముదురుబెండడు  

అతిమామూలు వాడుకమాట 'తెల్లారిపోడం' పాటలో ఎంత చక్కగా అమరిపోయిందో అసలు!  'పిల్ల సిగ్గు చచ్చినా మల్లెమొగ్గ విచ్చినా..' రైమింగ్ మాత్రమేనా, ఆ అమ్మాయి విసుగుని ఎంత చక్కగానూ, ముద్దుగానూ చెప్పిందో. ఇక, 'కలికి పురుషుడు,' 'అవతారుడు,' 'ముదురు బెండడు' పూర్తిగా వేటూరి మార్కు పదప్రయోగాలు. చిత్ర చాలా చక్కగా పాడినప్పటికీ, ఈ పాటలో ఎక్స్ ప్రెషన్స్ జానకి గొంతులో అయితే ఇంకెలా పలికి ఉండేవో అనిపిస్తూ ఉంటుంది విన్నప్పుడల్లా. నిజానికి జానకి యాక్టివ్ ఇయర్స్ లోనే ఈ సినిమా వచ్చింది. కానీ, సంగీత దర్శకుడు కీరవాణి జానకి చేత ఏ పాటా పాడించినట్టు లేడు. ఈ పాటలో ఫ్లూట్ ని చాలా బాగా ఉపయోగించారు, అలాగే మొదట్లోనూ, మధ్యలోనూ వచ్చే చిత్ర హమ్మింగ్ కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. 

మంగళవారం, మార్చి 10, 2020

సత్యవతి కథలు

స్త్రీవాద రచయిత్రి పి. సత్యవతికి ఉత్తమ అనువాదకురాలిగా కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు ప్రకటించడం, వెనువెంటనే ఆమె కథలకి కాక అనువాదానికి అవార్డు ప్రకటించడం ఏమిటన్న సాహిత్యాభిమానుల  ప్రశ్నల నేపథ్యంలో చదివిన పుస్తకం 'సత్యవతి కథలు.' గత నాలుగు దశాబ్దాల కాలంలో సత్యవతి రాసిన కథల నుంచి ఆవిడే ఎంపిక చేసి, ఎడిట్ చేసిన నలభై ఐదు కథల సమాహారం. గతంలో వచ్చిన 'ఇల్లలకగానే...' 'మెలకువ' సంపుటాల్లో వచ్చిన కొన్ని కథలతో పాటు, మరికొన్ని తాజా కథలనీ చేర్చారీ సంకలనంలో.  స్త్రీవాదంతో పాటు, తరాల మధ్య అంతరాలు, వృద్దాప్యపు సమస్యలనీ ఈ కథల్లో విశదంగా చర్చించారు రచయిత్రి. నిశితమైన పరిశీలన, తర్కబద్ధమైన ఆలోచన, సంయమనం నిండిన గొంతు ఈ కథల్ని మిగిలిన స్త్రీవాద కథల కన్నా ప్రత్యేకంగా నిలబెడతాయి. 

కథాకాలం గడిచిన నలభై సంవత్సరాలే అయినా, కథల్లో కనిపించే కాలం దాదాపుగా గడిచిన వందేళ్లు అనొచ్చు. స్వతంత్ర పోరాటంలోనూ, కమ్యూనిస్టు ఉద్యమం లోనూ పాల్గొన్న పాత్రలు మనకీ కథల్లో కనిపిస్తాయి. తొలినాళ్ళ కథల్లో తల్లి, తండ్రి పాత్రలు, తర్వాతి కథల్లో తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు ఈ పోరాటాల నేపధ్యం నుంచి వచ్చిన వాళ్ళుగా కనిపిస్తారు. 'పిల్లాడొస్తాడా' కథలో అమ్మమ్మ ఎనభై ఐదేళ్లావిడ. మనవరాలు విజయకి నలభై ఐదు. ఆమె కొడుకు, కాలేజీలో చదువుకుంటున్న వాడు, ఒక వర్షపు రాత్రి ఇంటికి రాడు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయడు. విజయకి ఒకటే గాభరా, పిల్లాడికి ఏదన్నా అయిందేమో అని. అమ్మమ్మ నిబ్బరంగా ఉంటుంది, "ఒక్క మంచి ఆలోచన కూడా ఎందుకు చెయ్యదు? ఎవరికైనా సాయం చేయడానికి ఆగిపోవాల్సి వచ్చిందేమో అని ఎందుకు అనుకోదు?" అని మనవరాలి గురించి ఆశ్చర్యపడుతుంది. కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన భర్త చెప్పాపెట్టకుండా పదేసి రోజుల పాటు ఇంటికి రాకపోవడం ఆవిడ అనుభవం. టీవీ సీరియళ్ళలో కనిపించే హింస, ప్రతీకారాలు విజయ జీవితంలో భాగం.

స్త్రీవాదులు తరచూ మాట్లాడే 'మారిటల్ రేప్' ని చాలాకథల్లోనే ప్రస్తావించినా, ఈ ఇతివృత్తంతో రాసిన మొదటి కథ 'మాఘ సూర్య కాంతి' (1978). నాలుగు దశాబ్దాల కాలంలో మధ్యతరగతి విలువల్లో పెద్దగా మార్పేమీ లేదని నిరూపించే కథ. నిజానికి, మధ్య తరగతి ఆర్థిక పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది, ముఖ్యంగా గడిచిన పాతికేళ్లలో.  దాని ప్రభావం వ్యక్తుల మీదే కాదు, కుటుంబ బంధాల మీదా పడింది. ఈ మార్పుని నిశితంగా పట్టుకుని రాసిన కథల్లో మొదట ప్రస్తావించుకోవాల్సినది 'మంత్రనగరి.'  సంప్రదాయం అనే బానిసత్వం నుంచి, డబ్బు అనే బానిసత్వంలోకి జరిగిన ప్రయాణం, ఇంతదూరం వచ్చాక కూడా మనసుని సమాధాన పరుచుకోడం కోసం ఆ సంప్రదాయంలోనే ఆలంబనని వెతుక్కోడాన్నీ (అమెరికాలో నోములూ, పూజలూ వైభవంగా చేసుకోడం) చిత్రించిన కథ ఇది. భర్త అయ్యప్ప మాలో, భవాని మాలో వేసుకుంటే భార్య మీద పడే కనిపించని ఒత్తిడిని చిత్రించిన కథ 'పతిభక్తి.' ఓ యజమానురాలు, ఆ ఇంటి పనిమనిషి, తమ భర్తల భక్తి కారణంగా పడిన ఇబ్బందుల్ని చిత్రించిన ఈ కథలో కనిపించే కాంట్రాస్ట్ రచయిత్రి పరిశీలననాశక్తి కి ఓ చిన్న మచ్చుతునక. 


చాలామంది రచయితలు పెద్దగా పట్టించుకోని పేదింటి అమ్మాయిల కథల్ని అక్షరబద్ధం చేశారు సత్యవతి. పెద్దగా చదువు లేకపోయినా జీవితేచ్చ మెండుగా ఉండే అమ్మాయిలు, కుటుంబం కోసం ఏదో ఒకటి చేయాలనే వాళ్ళ తాపత్రయాలు, ఈ క్రమంలో వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బందులు.. వీటన్నింటినీ వస్తువులుగా చేసుకుని విరివిగా కథలు రాశారీ రచయిత్రి. యజమాని నుంచి తనని తాను రక్షించుకునే అమ్మాయి కథ 'చీపురు' అయితే, తల్లి బరువుని తానూ మోసే అమ్మాయి కథ 'కాడి.' ఇంజనీరింగ్ లో ఫ్రీ సీట్ వచ్చినా చదువు మీద దృష్టి పెట్టలేని పేదింటి మెరిట్ స్టూడెంట్ కథ 'దొంగపిల్లి.' ఈ అమ్మాయిలందరూ చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వాళ్ళని గురించి వాళ్ళకి చక్కని స్పష్టత ఉంటుంది. అలాగే భవిష్యత్తుని గురించి బోల్డన్ని ఆశలూ ఉంటాయి. మనచుట్టూ తారసపడే ఇలాంటి అమ్మాయిలని గమనించకుండా ఉండలేం, ఈ కథలు చదివిన తర్వాత. 

సత్యవతి కథల్లో హాస్యం కన్నా వ్యంగ్యం పాళ్ళు ఎక్కువ. అది కూడా కనీకనిపించనిదేమీ కాదు, చురుక్కుమనేదే. 'గోధూళి వేళ' కథలో ప్రొఫెసర్ గారు తన ఇంట్లో ఆడవాళ్ళని ఉల్లిపాయలు తరగనివ్వడు, వాళ్ళ కళ్ళవెంట ఎక్కడ నీళ్లు వస్తాయో అని. ఆయన తనపేరుతో కన్నా, చెరువు తులశమ్మ గారి మనవడిగానే ఎక్కువమందికి తెలుసు. సదరు తులశమ్మగారి అసలు పేరు మహాలక్ష్మి. ఆవిడ తన కష్టాలు వినేవాళ్ళు లేక, రోజూ సాయంత్రం తులసికోట ముందు కూర్చుని కన్నీళ్లు కార్చేది. ఆ కన్నీళ్లు చెరువుగా మారి, ఆవిడ 'చెరువు తులశమ్మ' అయింది. పల్లెటూళ్ళో వెయ్యి గజాల కొంపా, లంకంత పెరడూ గనుక చెరువులొచ్చినా, వరదలొచ్చినా తట్టుకున్నాయి. సిటీల్లో అలాంటివి జరిగితే గదుల్లో పడవలేసుకుని తిరగాలి కదాని, మన ప్రొఫెసర్ గారు చిన్నప్పుడే ఈ ఉల్లిపాయల శపథం తీసుకున్నారట. ఇక ప్రొఫెసర్ గారి భార్య నాయనమ్మకైతే కన్నీళ్లు అశుభం. ఆవిడ భర్త పోయినప్పుడు కూడా, 'ఇప్పుడు ఏడవడం శుభమా, అశుభమా' అని ఓ క్షణం తటపటాయించి, ఏడవకపోవడం అశుభం అని ఎవరో చెప్పగా గబగబా ఏడ్చేసిందట!

నలభై ఐదు కథలు ఏకబిగిన చదవడం వల్ల కొన్ని విషయాలు అనుకోకుండా నా దృష్టికి వచ్చాయి. ఈ కథల్లో మంచి లక్షణాలున్న పెద్ద వయసు మగ పాత్ర ఉంటే, ఆ పాత్ర పేరు కచ్చితంగా 'వెంకట్రామయ్య' అయి ఉంటుంది. పేదింటి అమ్మాయి పేరు సాధారణంగా 'స్వర్ణ.' స్త్రీ పురుష సంబంధాల కన్నా, ఇద్దరు స్త్రీల మధ్య సంబంధాలు ఏ కథలో అయినా సరే ఓ మెట్టు పైనే ఉంటాయి. ఆ ఇద్దరు స్త్రీలు యజమాని-పనమ్మాయి, అత్త-కోడలు, సవతి తల్లి-కూతురు ఇలా ఎవరైనా కావొచ్చు.  ఈ స్త్రీల మధ్య ఏవన్నా అభిప్రాయం భేదాలు వచ్చినా కథ పూర్తయ్యేలోగా అవి సమసి పోతాయి. అదే స్త్రీపురుషుల మధ్య ఇలా జరగదు. వెంకట్రామయ్య మినహా, మిగిలిన మగవాళ్ళతో అభద్రతో, ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ లాంటిదో ఉండి తీరుతుంది. అయితే, స్త్రీవాద సాహిత్యం పేరిట వెల్లువలా వచ్చిపడుతున్న కథల మధ్య ఈ కథలు కచ్చితంగా ప్రత్యేకమైనవి. అనువాదానికి కాక, సత్యవతి కథలకే అవార్డు రావాల్సింది అన్న మాటతో ఏకీభవిస్తాం, పుస్తకం పూర్తి చేశాక. (పేజీలు 385, వెల రూ. 270, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ, అన్ని పుస్తకాల షాపుల్లోనూ లభిస్తోంది). 

బుధవారం, మార్చి 04, 2020

ఛానల్ 24/7

తెలుగు సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ అంటూ కొన్ని టీవీ చానళ్ళు ఓ ఏడాది క్రితం చాలా హడావిడి చేశాయి. అంతకన్నా చాలామందే, టీవీ ఛానళ్లలో కాస్టింగ్ కౌచ్ ని చర్చకి పెట్టిన నవలిక  'కాంచన వీణ. ' పత్రికా రంగంలో విలువలతో కూడిన రాతలు రాసిన చాలా మంది జర్నలిస్టులు, టీవీ చానళ్లకు వచ్చేసరికి ఆ విలువల విషయంలో ఎందుకు రాజీ పడాల్సి వస్తోందో విపులంగా చర్చించిన మరో నవలిక 'ఛానల్ 24/7.' అటు పత్రికారంగంలోనూ, ఇటు టీవీ ఛానళ్లలోనూ సుదీర్ఘ కాలం పనిచేసిన రచయిత్రి సి. సుజాత రాసిన ఈ రెండు నవలికలనీ 'సాహితి' ప్రచురణల సంస్థ ఒక పుస్తక రూపంలోకి తెచ్చింది రెండేళ్ల క్రితం. ఆ పుస్తకం పేరు 'ఛానల్ 24/7.'  సినిమాతో సమంగా అనలేం కానీ, టీవీ రంగానికీ గ్లామర్ ఉంది. న్యూస్, ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో పని చేసే వారిపట్ల జనసామాన్యానికి ఓ ఆసక్తి, కుతూహలం ఉన్నాయి. తెరమీద నిత్యం కనిపించే మనుషుల్ని పోలిన పాత్రలే ఉండడం ఈ రెండు నవలికల ప్రత్యేకత. టీవీరంగం మీద రచయిత్రికి ఉన్న పట్టుకి పరాకాష్ట కూడా. 

కాంచన అనే న్యూస్ ప్రెజెంటర్, వీణ అనే యువ గాయనిల కథ 'కాంచన వీణ.' న్యూస్ ఛానెల్ లో  ప్రెజెంటర్ గా పనిచేస్తున్న కాంచన, నిర్భయ సంఘటన జరిగిన తర్వాత  ట్యాంక్ బండ్ మీద జరిగే కొవ్వొత్తుల ప్రదర్శనని కవర్ చేయడానికి వెళ్లడంతో మొదలయ్యే కథ, ఆ రాత్రి తెల్లవారేసరికి ఆ ఛానల్ లో పనిచేసే వారి జీవితాలు ఒక్కసారిగా ఎలా మారిపోయాయి? ఆ ఛానలే ప్రమోట్ చేసిన గాయని వీణ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నది చెబుతూ ముగుస్తుంది. ఛానల్ ప్రమోటర్ సత్య ప్రసాద్ ఉన్నట్టుండి అదృశ్యమైపోవడంతో మొదలు పెట్టి, అతన్ని గురించి ఒక్కో విషయమూ చెబుతూ, ట్యాంక్ బండ్ కార్యక్రమం, వీణ కథలని సమాంతరంగా నడుపుతూ కథలన్నింటినీ కంచికి చేరుస్తారు రచయిత్రి. మామూలు జర్నలిస్టుగా ఉన్న సత్య ప్రసాద్ ఏకంగా ఓ న్యూస్ ఛానల్ ని ఎలా ఏర్పాటు చేయగలిగాడో, ఆ ఛానల్ ని అడ్డం పెట్టుకుని అతను చేసే బ్లాక్ మెయిల్స్, ఆ సంపాదనని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం మాత్రమే కాదు, అధికారంలో ఉన్న వాళ్ళకి తన ఛానల్ యాంకర్స్ ని ఎరవేసి పనులు జరిపించుకోడాన్నీ చూడొచ్చు. 

"మొత్తం మూడు షిఫ్టులు. 18 మంది న్యూస్ రీడర్లు, యాంకర్స్ ఉన్నారు. ఎవ్వళ్లకీ 12 వేలు మించకపోతే మా ఎనిమిదిమందికీ లక్షలు ఎందుకు మేడం? ప్యాకేజ్, వితవుట్ ప్యాకేజ్. ఇవి ప్రసాద్ గారు పెట్టిన సొంత పేర్లు. విత్ ప్యాకేజ్ అంటే దేనికయినా సహకరించాలి. మినిస్టర్స్, స్పెషల్ పార్టీలు, సెలబ్రిటీలు, వాళ్ళ ఇంటర్యూలు, ఒక టైం అంటూ లేని అవుట్ డోర్ పనులు ..."  అంటుంది కాంచన. భర్తకి ఆమె సంపాదన మాత్రమే కావాలి. కొడుకంటే ఆమెకి ప్రాణం. ఆ కొడుకు కోసం భర్తని భరిస్తూ వస్తున్న కాంచన, ఆ సాయంత్రం మాత్రం 'ఇక చాలు' అనుకుని నిర్భయ లైవ్ చెబుతూనే హుస్సేన్ సాగర్ లో దూకేస్తుంది. ఛానల్ తరపున త్వరలో మొదలు పెట్టబోయే ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి గేమ్ షో రికార్డ్ చేయడం కోసం రిసార్ట్స్ కి వెళ్లిన ఇద్దరు యాంకర్స్ - సత్యప్రసాద్ బాధితులే ఇద్దరూ - ఉన్నట్టుండి మాయమవుతారు ఆ రాత్రి. లైవ్ టాక్ షో లో పాల్గొనాల్సిన సత్యప్రసాద్ ఫోన్ కి కూడా దొరకడు. ఇరవయ్యేళ్లు నిండని గాయని వీణ కథ పూర్తిగా వేరే. సత్యప్రసాద్ ఆమెకి కేర్ టేకర్. యాభయ్యేళ్ళు దాటిన అతను, ఆమెని కోరుకుంటున్నాడు. తనమాట వినకపోతే తొక్కేస్తానని బెదిరిస్తున్నాడు. హోమ్ శాఖ మంత్రి కొడుకు అనంత్ తో వీణ ప్రేమలో పడడం అస్సలు నచ్చడం లేదు సత్యప్రసాద్ కి. ఇంతకీ సత్యప్రసాద్ ఏమయ్యాడన్నది నవలిక  ముగింపులో భాగం. 


ఇక ఈ సంకలనానికి పేరు పెట్టిన 'న్యూస్ 24/7' నవలిక పేరుకి తగినట్టే ఒక న్యూస్ ఛానల్ లో జరిగే రోజువారీ హడావిడిని కళ్ళకి కడుతుంది. ట్యాంక్ బండ్ మీద విగ్రహాల కూల్చివేత నేపథ్యంలో ఒక రోజున న్యూస్ ఛానల్ స్టూడియోలో జరిగే కథే ఇదంతా. కాకపొతే, ఆ స్టూడియోలో జరిగే రకరకాల రికార్డింగులు, మేనేజింగ్ ఎడిటర్ నాయుడు చాణక్యాలతో నిండి ఉంటుంది. ప్రింట్, టెలివిజన్ రంగాల్లో తలపండిన జర్నలిస్టు స్వాతి ఉద్యోగానికి ఆ ఛానల్లో అది చివరి రోజు. ఆ ఛానల్ మొదలు పెడుతున్న 'ప్రముఖుల ఇంటర్యూలు' సిరీస్ లో మొదట రాబోయే ఇంటర్యూ ఆమెదే. ఒక స్టూడియో లో ఆమె ఇంటర్యూ రికార్డింగ్ జరుగుతూ ఉంటే, పక్క రూమ్ లో విగ్రహాల విధ్వంసం మీద లైవ్ నడుస్తూ ఉంటుంది. ఇవి కాకుండా యాంకర్లు, న్యూస్ ఎడిటర్లు, వాళ్ళ వృత్తిగత, వ్యక్తిగత సమస్యలు.. వీటన్నింటితో పాటు ఒక మామూలు జర్నలిస్టు నుంచి ఛానల్ ఎండీగా ఎదిగిన నాయుడు కథ, అధికారపు నిచ్చెనమెట్ల మీద వేగంగా ఎదుగుతున్న అతని పనితీరు, సంపాదన, పెట్టుబడులు.. ఇలా ఎన్నో ఉపకథలు. 

ప్రధాన కథ స్వాతిదే. వామపక్ష రాజకీయ నేపధ్యం నుంచి వచ్చిన స్వాతి, అదే భావజాలం ఉన్న దిన పత్రికలో జర్నలిస్టుగా కెరీర్ మొదలు పెట్టి, తర్వాతి కాలంలో అదే పత్రికకి ఎడిటర్ కావడం, కాలక్రమేణా టెలివిజన్ రంగంలోకి వచ్చి ఛానల్ ఎడిటర్ గా ఎదగడం, అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, వృత్తిలో ఎదురైనా ఛాలెంజిలు.. వీటన్నింటినీ ఆమె ఇంటర్యూ రికార్డింగ్ లో ఇంటర్ కట్స్ గా చెబుతూనే, వార్తా ఛానళ్ల పనితీరు, ఒకే వార్తని ఎవరి ప్రయోజనాలకి అనుగుణంగా వాళ్ళు చూపించడం,  సంచలనాత్మక వార్తా కథనాల తెరవెనుక కథలు, ఛానల్ లోనూ, ఛానల్ చుట్టూనూ అల్లుకున్న రాజకీయాలు లాంటి విషయాలెన్నో చర్చకు పెట్టారు రచయిత్రి. వార్తా పత్రికల్లో మానవీయ వార్తా కథనాలు రాయడానికి పోటీ పడిన జర్నలిస్టులు, టీవీ ఛానల్ కి వచ్చేసరికి సంపాదనలో పోటీ పడడం, అందుకు తొక్కే సవాలక్ష దారుల్ని గురించి నేరుగానే చెప్పారు. 

వ్యవస్థలో మంచిచెడులని ఉన్నదున్నటుగా చెప్పడంలో తన తొలి నవల 'సుప్త భుజంగాలు' నుంచి ఈ 'ఛానల్ 24/7' వరకూ సుజాత ఒకే శైలిని కొనసాగించారు. వాక్యాలు మరింత పదునెక్కడాన్నీ, మరింతగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడాన్నీ ఈ నవలికల్లో గమనించవచ్చు. వ్యవస్థలో చెడుని ఎంత స్పష్టంగా తను చూసి, పాఠకులకి చూపినా 'మంచి' కూడా ఉందన్న నమ్మకం  రచయిత్రిని విడిచిపెట్టలేదు. 'సుప్తభుజంగాలు' లో స్కూల్ మేష్టారు, 'రాతిపూలు' లో చంద్రశేఖర్ లాగా '24/7 ఛానల్' లో దక్షిణామూర్తి పాత్ర ఆదర్శవంతంగా ఉంటుంది. వార్తాపత్రిక నుంచి రిటైర్ అయిన దక్షిణామూర్తి, తన సమయాన్ని అనువాదాలు చేయడానికి కేటాయిస్తాడు. కెరీర్ పందెంలో పరుగులు పెడుతున్న నాయుడికి గతాన్ని గుర్తు చేసి, ఇప్పుడు పెడుతున్న పరుగు ఎందుకోసం అని అడగడమే కాదు, కర్తవ్యాన్ని సూచిస్తాడు కూడా. 'కాంచనవీణ' లో వందన భర్త ప్రకాష్, వీణ తల్లి శారద పాత్రల్లోనూ ఈ తరహా ఆలోచనల్ని చూడచ్చు. నిత్యం మన డ్రాయింగ్ రూముల్లో కనిపించే, వినిపించే మనుషుల్ని పోలిన పాత్రలు, విడిచిపెట్టకుండా చదివించే కథనం రెండు నవలికల్నీ పూర్తిచేయందే పుస్తకాన్ని పక్కన పెట్టనివ్వదు. (పేజీలు 144, వెల రూ. 60, ఎమెస్కో పుస్తకశాలల్లో లభ్యం)