శనివారం, జనవరి 31, 2015

దారి చూపిన దేవత

గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ మాటకొస్తే, లోక్ సభ ఎన్నికలకి ముందూ, తర్వాతా జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ విజయాన్ని నమోదు చేసుకోలేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండడానికి చాలినంత బలం లేకపోయినప్పటికీ, లోక్ సభలో ప్రతిపక్ష పాత్ర దక్కింది. కానైతే, ఇప్పటివరకూ ప్రతిపక్షంగా కాంగ్రెస్ సాధించింది కూడా ఏమీ కనిపించడం లేదు. దీనితో, పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా తోస్తోంది ప్రస్తుతానికి. మునిగిపోయే పడవలో ప్రయాణం చేయడం ఇష్టం లేని నాయకులు సైతం బయటపడే మార్గం కనిపించక రోజులు లెక్ఖ పెడుతున్నారు.

ఇదిగో, ఈ తరహా నాయకులందరికీ ఆశాదీపమయ్యింది తమిళ తాయి జయంతి నటరాజన్. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ కి రాజీనామా చేయడమే కాక, రెండు రోజులుగా జాతీయ స్థాయి వార్తల్లో నానుతోందీ లాయరమ్మ. మామూలుగా అయితే, కాంగ్రెస్ నుంచి ఎవరు బయటికి వెళ్ళినా అదేమంత పెద్ద వార్త కాదిప్పుడు. అందుకే కాబోలు, ప్రత్యేక పరిస్థితులని సృష్టించుకుని మరీ పార్టీ నుంచి నిష్క్రమించడం ద్వారా తన ఇమేజిని పెంచుకునే ప్రయత్నం చేశారీ కేంద్ర మాజీ మంత్రిణి. అమ్మగారి పాచిక పారినట్టుగానే కనిపిస్తోంది ప్రస్తుతానికి.

గత యూపీఏ ప్రభుత్వంలో రెండున్నరేళ్ళు కీలకమైన పర్యావరణ, అటవీ శాఖలకి స్వతంత్ర హోదా గల మంత్రిగా పని చేసి, ఎన్నికలకి సరిగ్గా పదినెలల ముందు రాజీనామా చేసిన జయంతి, తన రాజీనామాకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారణమంటూ కేవలం మూడు నెలల క్రితం పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఓ ఉత్తరం రాశారు. బహుశా ఆ ఉత్తరం కోటరీని దాటి మేడమ్ దగ్గరికి వెళ్లి ఉండదు. అందుకే కాబోలు, తమిళ రాష్ట్రం నుంచి ప్రచురితమయ్యే ఓ జాతీయాంగ్ల పత్రికకి ఆ ఉత్తరం లీక్ కాబడింది. అది కూడా కేవలం రెండు రోజుల క్రితం.


జయంతి, సోనియాకి రాసిన ఆ కాన్ఫిడెన్షియల్ ఉత్తరం, దానితో పాటు రాహుల్ బాబు చేసినట్టుగా చెప్పబడుతున్న పాపాల చిట్టాని ఆ పత్రిక మొదటి పేజీలో ప్రచురించడం ఆలస్యం, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా సమర్పించేశారు శ్రీమతి నటరాజన్. కాంగ్రెస్ నుంచి బయటికి రావడానికి ఏకంగా రాహుల్ బాబునే కారణంగా చూపడం, నెహ్రూ కుటుంబాన్ని దైవ సమానంగా చూసే కాంగ్రెస్ పార్టీలో ఓ సరికొత్త ట్రెండ్ అని చెప్పాలి. ఇంత జరిగినా, చినబాబు కి మద్దతుగా ఎవరూ ఆత్మహత్యా ప్రయత్నాలూ అవీ చేయకపోవడం ఆలోచించాల్సిన విషయం. కాంగ్రెస్ రాజకీయాల తీరు మారుతోందో ఏవిటో మరి.

కాంగ్రెస్ పార్టీ నుంచి తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన భక్తవత్సలం మనవరాలైన జయంతి రాజీవ్ గాంధీ పిలుపు అందుకుని కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆయన ఆశీస్సులలతో రాజ్యసభ సభ్యురాలయ్యారు. రాజీవ్ హత్య అనంతరం, ప్రధాని పదవి చేపట్టిన పీవీ నరసింహారావుకి వ్యతిరేకంగా వేరు కుంపటి పెట్టిన తమిళ కూటంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడు ఏర్పడిన తమిళ మానిల కాంగ్రెస్ ద్వారా యునైటెడ్ ఫ్రంట్ కూటమిలో చేరి, పీవీ అనంతరం ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో తొలిసారిగా మంత్రి అయ్యారు. కాంగ్రెస్ పగ్గాలు సోనియా చేతికి రావడంతోనే తమిళ మానిల కాంగ్రెస్, దానితో పాటే జయంతి మళ్ళీ కాంగ్రెస్ లో కలిసిపోయారు.

సోనియా ఆశీస్సులతో మరోసారి చేపట్టిన కేంద్రమంత్రి పదవిని, రాహుల్ కారణంగానే వదులుకున్నానని తాజాగా రహస్యం విప్పారు జయంతి నటరాజన్. ఇప్పుడింక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా బయట పడాలా అని ఎదురుచూస్తున్న నేతలకి దారి దొరికేసింది. రాహుల్ చేసిన ద్రోహాల వివరాలతో అధినేత్రికి ఓ ఉత్తరం రాసి బయటకి నడవొచ్చు. రాహుల్ పేరు వాడుకోవడం వల్ల రాజీనామా వార్త నలుగురి నోళ్ళలోనూ నానుతుంది. అంతే కాదు, శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న వాడుకని అనుసరించి రాహుల్ బాధితులకి అధికార పార్టీలో సులువుగానే సీటు దొరికేయవచ్చు కూడా.

తమిళనాడు శాసన సభ ఎన్నికలకి సరిగ్గా ఏడాది ముందుగా, ఓ జాతీయ స్థాయి తమిళ నాయకురాలు కాంగ్రెస్ పార్టీని వీడిందంటే తెరవెనుక కారణాలు కూడా ఏవో ఉండే ఉంటాయి. ఓపక్క ఇంకా బలం పుంజుకోని కరుణానిధి గారి డీఎంకె, మరోపక్క పురచ్చి తలైవి జైలు జీవితం కారణంగా ప్రభ కొంత మసకబారిన అన్నా డీఎంకె, ఇంకో పక్క దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తానని పదేపదే ప్రకటిస్తున్న బీజీపీ అధ్యక్షుడు అమిత్ షా. "పరిశ్రమలపై 'జయంతి పన్ను' పడుతోందంటూ అప్పట్లో మోడీ నన్ను విమర్శించారు. అప్పుడు నేనున్న పరిస్థితులు అలాంటివి. మోడీ అలా అనడంలో ఎలాంటి తప్పూలేదు" అంటూ జయంతి పలుకుతున్న పలుకులు వింటుంటే తమిళ నాట ఏం జరగబోతోందో తెలుస్తున్నట్టే అనిపిస్తోంది.

(ఫోటో కర్టెసీ: ది హిందూ)

శుక్రవారం, జనవరి 30, 2015

కృష్ణారెడ్డిగారి ఏనుగు

కర్ణాటక పర్వత ప్రాంతంలో అటు ధర్మస్థల కీ ఇటు కూనూరుకి మధ్య ఉన్న చిన్న పట్టణం మూడిగెరె. గూళూరు మఠం కూడా బాగా దగ్గరే ఈ పట్టణానికి. మూడిగెరెలో చిన్నకీ, పెద్దకీ, అటు ప్రభుత్వ శాఖల వాళ్ళకీ, ఇటు స్థానిక నేతలకీ అందరికీ ఒకటే సమస్య.. కృష్ణారెడ్డి గారి ఏనుగు. ఆ ఏనుగు ఊళ్లోకి అడుగుపెట్టినప్పుడు వాళ్ళందరూ సాదరంగా ఆహ్వానించిన వాళ్ళే. అయితే, రానురానూ ఆ ఏనుగు వాళ్ళకో సమస్యగా మారిపోయింది. వాళ్ళకే కాదు, యజమాని కృష్ణారెడ్డి గారిక్కూడా సమస్యై కూర్చుందా ఏనుగు. ఆయొక్క ఏనుగు కథా కమామిషే కన్నడ రచయిత స్వర్గీయ పూర్ణచంద్ర తేజస్వి (విఖ్యాత రచయిత కువెంపు తనయుడీయన) కన్నడంలో రాసిన కథకి, శాఖమూరు రామగోపాల్ తెలుగు అనువాదం 'కృష్ణారెడ్డిగారి ఏనుగు.'

బొత్తిగా మనుషుల పొడ తెలియనిదేమీ కాదు ఏనుగు. గూళూరు మఠంలో జనం మధ్యనే పుట్టి పెరిగింది. జగద్గురువు ఊరేగింపుకి ఏనుగుని కాక, జనం మోసే పల్లకీని వినియోగించడంతో ఏనుగుకి అక్కడ బొత్తిగా పని లేకుండా పోయింది. ఏనుగుని పోషించడం కన్నా, తాగుబోతైన మావటి వేలాయుధంని భరించడం కష్టమయ్యింది వారికి. ఫలితం, ఏనుగుని అమ్మకానికి పెట్టేశారు. అప్పటికే చాలా వ్యాపారాలు చేసి అన్నింటిలోనూ నష్టాలే రుచి చూసిన కృష్ణారెడ్డి గారు ఆ ఏనుగుని కొనుక్కున్నప్పుడు మూడిగెరెలో అందరూ ఆయన్ని చూసి జాలిపడ్డ వాళ్ళే. వేలాయుధంతో సహా ఏనుగుని మూడిగెరె తీసుకొచ్చారు కృష్ణారెడ్డిగారు.

ఏనుగు వచ్చిన వేళా విశేషం, కృష్ణారెడ్డి గారికి కలిసొచ్చింది. అడవిలో కలప కొట్టే కాంట్రాక్టర్లకి ఏనుగు సేవలు అవసరం. పెద్దపెద్ద చెట్లు పడగొట్టడం, అడవి నుంచి లారీల దగ్గరకి మోసుకు రావడం మనుషుల వల్ల అయ్యే పని కాదు. ఇదిగో, తను కొన్న ఏనుగుని ఆ పనుల నిమిత్తం అద్దెకి తిప్పడం ద్వారా ఆర్జించడం మొదలు పెట్టారు కృష్ణారెడ్డిగారు. మొదట్లో ఊళ్ళో వాళ్ళు ఏనుగుని ఆదరంగానే చూశారు. కూరలు, పళ్ళు దుకాణాల వాళ్ళు మిగిలిపోయిన సరుకుని ఏనుగు కోసం ప్రత్యేకంగా  అట్టే పెట్టే వాళ్ళు. ఏదో వేళ ఊళ్ళో విహారానికి వెళ్ళిన ఏనుగు వాటిని భోంచేసి వచ్చేది. ఎంత మనుషుల మధ్య పెరిగిన ఏనుగే అయినా మనుషుల్లా ప్రవర్తించలేదు కదా.. దాని అలవాట్లు దానివి కదా. అవిగో, అవే జనానికి కోప కారణం అయ్యాయి నెమ్మదిగా.

వేలాయుధం వారానికోసారి వాగు దగ్గర కొబ్బరి పీచుతో శ్రద్దగా తోమి స్నానం చేయించినా, ఏనుగుకి అప్పుడప్పుడూ ఒళ్ళు దురద పెట్టక మానదు. అలాంటప్పుడు కనిపించిన స్తంభానికి ఒళ్ళు రాసుకోకా మానదు. ఇలాంటప్పుడే, కరెంటు స్తంభాల తీగలు తెగిపోవడం, లేదా కరెంటు వైర్లు, ఫోను వైర్లు కలిసిపోవడం లాంటివి సంభవించేవి. రెండు డిపార్ట్మెంట్ల లైన్ మెన్లూ మొత్తం లైన్ చెక్ చేసుకుని, బాగు చేసుకోవాల్సి వచ్చేది. ఫోన్ తీగల వల్ల ఒక్కోసారి క్రాస్ టాక్ వచ్చేస్తూ ఉండేది. మూడిగెరె లో ఎవరికీ రహస్యాలు లేవు కాబట్టి, ఎవరి ఫోన్ ఎవరికి వచ్చినా ఆ సమాచారం ఊరంతా తెలిసిపోయేది. ఇలాంటి చిన్న చిన్న సమస్యలే అయితే ఇబ్బంది లేకపోను.


ఓసారి ఏనుక్కి అంబారీ పెట్టి ఊరేగింపు చేస్తూ ఉంటే అంబారీతో సహా అడవిలోకి పారిపోయింది. ఏడెనిమి వేలు ఖరీదు చేసే ఇత్తడి ఆభరణాలతో అలంకరించారు ఏనుగుని. కరెంటు తీగలు తక్కువ ఎత్తులో వేలాడుతూ ఉండడం వల్ల ఏనుక్కి షాక్ కొట్టి పారిపోయిందని ఒకరూ, పిచ్చెత్తి పారిపోయిందని మరొకరూ.. రకరకాలుగా చెప్పుకున్నారు. కొన్నాళ్ళకి ఏనుగు మళ్ళీ కృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చేసింది. అంబారీ అడవిలో మాయమైపోయింది. కృష్ణారెడ్డి గారి ఏనుగు ఆడ ఏనుగు కావడంతో దానికోసం అప్పుడప్పుడూ అడవి నుంచి మగ ఏనుగుల మంద ఊరి మీదకి వచ్చి పడుతూ ఉండేది. మంద వచ్చినప్పుడల్లా ఊరి వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చేది.

ఏనుగుకి పని ఎక్కువగా ఉన్నప్పుడు కృష్ణారెడ్డి గారు రెండు లీటర్ల విప్పసారాయిని బహుమానంగా ఇచ్చేవారు. అందులో వేలాయుధం కొంత పుచ్చుకోగా మిగిలింది ఏనుగుకి తాపించేవాడు. ఓసారిలా సారాయి సేవనం అయిన తర్వాత పనికి వెళ్ళాల్సి వచ్చింది. స్మగుల్డ్ దుంగల లారీని సామిల్ నుంచి తరలించే పని కావడంతో రాత్రిపూటే చెయ్యాలి. అటు వేలాయుధం, ఇటు ఏనుగూ కూడా మత్తులో ఉండడంతో పొరపాటు జరిగిపోయింది. దుంగలకి బదులు మొత్తం లారీనే తిరగబెట్టేసింది ఏనుగు. కేబిన్ లో ఉన్న లారీ డ్రైవర్ జరిగింది ఏమిటో తెలియకుండానే  ప్రాణాలు విడిచాడు. మరోసారి, ఏనుగు స్తంభాలని రాసుకోవడంలో ఎలెక్ట్రిక్, టెలిఫోన్ వైర్లు కలిసిపోయాయి. ఈ సంగతి తెలియక పోల్ మీదకి ఎక్కిన టెలిఫోన్ లైన్మెన్ తిప్పణ్ణ కరెంట్ షాక్ తో చనిపోయాడు.

మూడిగెరె ప్రజలకి కృష్ణారెడ్డిగారి ఏనుగు ఓ సమస్యగా మారిపోయింది. ఏనుగుకి పిచ్చి ఎక్కిందేమో అన్న అనుమానం మొదలయ్యింది జనంలో. దానికి తోడు ఊళ్ళో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ధర్మస్థల జైనులు జీవహింస చెయ్యరు కాబట్టి, అక్కడి కుక్కలని రాత్రి వేళల్లో రహస్యంగా లారీలో మూడిగెరె తెచ్చి వదిలేస్తున్నారు. దీనితో ఎటు చూసినా కుక్కలే. కుక్కల సమస్య ఇలా ఉండగానే, గూళూరు మఠంలో ఓ పండితుడు ఏనుగుకి జాతకం చెప్పడం గుర్తొస్తుంది వేలాయుధానికి. ఆ ఏనుగు కారణంగా ఐదు ప్రాణాలు పోతాయని తెలిసిన తర్వాతే మఠం వాళ్ళు ఏనుగుని అమ్మకానికి పెట్టారన్న రహస్యం ఒక్క వేలాయుధానికే తెలుసు.

ఇంతకీ కృష్ణారెడ్డిగారి ఏనుగు కథ ఏమయ్యింది? ఇది తెలియాలంటే అరవై పేజీల అనువాదాన్ని చదవాల్సిందే. ఆపకుండా చదివించే కథనం. ఏనుగు కథ చెప్పే క్రమంలో సమాజనీతికి సంబంధించి, మానవ సంబంధాలని గురించి, వ్యవస్థ పనితీరుని గురించి ఎన్నెన్నో విషయాలని చర్చించారు రచయిత. 'కృష్ణారెడ్డి గారి ఏనుగు' తో పాటు మరో పద్నాలుగు కన్నడ అనువాద కథలున్న సంకలనాన్ని ప్రచురించింది హైదరాబాద్ కి చెందిన అభిజాత్య కన్నడ-తెలుగు భాషా (అనువాద) సంశోధన కేంద్రం. 294 పేజీలున్న ఈ సంకలనం వెల రూ. 100. ప్రతి కథ చివరా రచయిత ఇచ్చిన ఫుట్ నోట్స్ కథల నేపధ్యాన్ని వివరిస్తుంది. కూర్చున్న చోటినుంచి కదలకుండా గ్రామీణ కర్ణాటకమంతా తిరిగి వచ్చే అవకాశాన్నిచ్చే సంకలనం ఇది. కృష్ణారెడ్డి గారి ఏనుగునైతే ఓ పట్టాన మర్చిపోలేం..

బుధవారం, జనవరి 28, 2015

త్రిపుర కథలు

ఇది సమీక్ష కాదు. బహుశా పరిచయం కూడా కాదేమో. 'త్రిపుర' కలంపేరుతో రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు రాసిన పదిహేను కథలనీ చదివిన అనుభవం తాలూకు కబుర్లివి. 1963-90 మధ్యకాలంలో రాసిన ఈ కథల్లో ఏడు కథలు 'భారతి' లో ప్రచురితమయ్యాయి. 'రాబందుల రెక్కల చప్పుడు' అముద్రితం. మిగిలినవి 'జ్యోతి,' 'ఆంధ్రప్రభ,' 'తరుణ,' 'స్వాతి,' 'ఆంధ్రజ్యోతి' లలో ప్రచురితం అయ్యాయి. కథారచయిత త్రిపుర పేరు చాలా రోజులుగా పరిచయం. కానీ, త్రిపుర రాసిన కథ మాత్రం కొంచం చిత్రంగా పరిచయం అయ్యింది నాకు.

సుమారు పదిహేనేళ్ళ క్రితం ఓ వర్షాకాలపు సాయంత్రం వేళ నలుగురు మిత్రులం ఓ హోటల్లో టీ తాగుతున్నాం. "అచ్చం త్రిపుర కథలో వాతావరణంలా ఉంది" అన్నారొకరు. అనడమే కాదు, 'హోటల్లో' కథని మూడు ముక్కల్లో పరిచయం చేసేశారు. "హీరో ఓ హోటల్లో కూర్చుంటాడు. అక్కడ ఒక్కో టేబిల్ దగ్గరా వినిపించిన మాటలన్నీ వరసగా చెబుతాడు. కథ అయిపోతుంది.." ఇది విన్నాక ఆసక్తి పెరిగింది. ఎలాగో సంపాదించి ఆ ఒక్క కథా చదివాను. కథలో హీరో జీవితంలో అనేక కోణాల్ని ఏకకాలంలో చూశాడు, హోటల్లో కూర్చుని.

తర్వాతెప్పుడూ నేను త్రిపుర కథల జోలికి వెళ్ళలేదు. పుస్తకాల షాపుల డిస్ప్లే లో అవెప్పుడూ కనిపించకపోవడం బహుశా ఓ కారణం. మూడేళ్ళ క్రితం కనిపించింది 'త్రిపుర కథలు,' పర్స్పెక్టివ్స్ ప్రచురణ. కాపీ తీసేసుకుని, అప్పటికే పరిచయం ఉన్న 'హోటల్లో' కథ మాత్రం చదివేసి, పుస్తకాన్ని బుద్ధిగా పక్కన పెట్టేశా. రెండేళ్ళ క్రితం పేపర్లో త్రిపుర మరణవార్త. సాహిత్యం పేజీల్లోనూ, కొన్ని వెబ్ మేగజైన్లలోనూ త్రిపుర గురించీ, త్రిపుర కథల గురించీ వ్యాసాలు. పుస్తకం నా దగ్గర ఉందో లేదో చెక్ చేసుకున్నాను. కాపీ భద్రంగానే ఉంది, హమ్మయ్య!


ఓ ఆర్నెల్ల క్రితం, మొండి బకాయిల ప్రక్షాళనలో భాగంగా పైకి తీశాను 'త్రిపుర కథలు' పుస్తకాన్ని. అప్పటి నుంచీ అప్పుడో కథా, అప్పుడో కథా చదువుతూ.. వాటిగురించి ఆలోచనల్లో పడుతూ.. తేరుకుంటూ.. కొన్ని కొన్ని వాక్యాలనీ, మరికొన్ని ఎక్స్ ప్రెషన్లనీ అప్పుడప్పుడూ గుర్తుచేసుకుంటూ... కథల్లో ఏముందో పట్టుకోడానికి ప్రయత్నం చేస్తూ.. 'ఇంకా ఏదో ఉంది.. తప్పకుండా ఉంది' అన్న ఆలోచన దగ్గర ఆగుతూ వస్తున్నాను. కథ కి ఓ ఫ్రేం వర్క్ ఉందీ అనుకుంటే అందులో ఏమాత్రమూ ఇమడని కథలు త్రిపురవి. చదువుతూంటే 'ఇవి కథలేనా?' అన్న ప్రశ్న మాత్రం రాదుగాక రాదు.

'పాము,' 'చీకటి గదులు,' 'భగవంతం కోసం,' 'సుబ్బారాయుడి రహస్య జీవితం,' 'కేసరివలె కీడు,' 'జర్కన్' 'కనిపించని వంతెనలు' ... ఇవన్నీ కథల పేర్లు.భగవంతం, శేషాచలపతి, సుశీల, భాస్కర్.. వీళ్ళు చాలా కథల్లో కనిపిస్తారు. కాకపొతే వీళ్ళ ఆలోచనలు, ప్రవర్తన ఏ రెండు కథల్లోనూ ఒకే తీరుగా ఉంటాయనుకోరాదు. వాళ్ళ వ్యధలూ,  వాళ్ళకి ఎదురైన అనుభవాల ఆధారంగా ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ప్రపంచం అచ్చం 'అబ్ స్ట్రాక్ట్' పెయింటింగ్ లాగా ఉంటుంది. చూసిన వెంటనే ఏమీ అర్ధం కాదు. చూస్తూ ఉండగా ఏదో అర్ధం స్ఫురిస్తుంది. మరికొంచం ఓపిక చేసుకుంటే ఒకటికి మించిన అర్ధాలు కళ్ళముందు కనిపిస్తాయి.

ఈ అర్ధం కాకపోవడం అన్నది కథని ఆసాంతమూ చదవడానికి ఏమాత్రం అడ్డంకి కాకపోవడం త్రిపుర కథల ప్రత్యేకత. "ఇవి కథలా? కవితలా? కథల్లాంటి కవితలా? కవితల్లాంటి కథలా? లేక లాక్షణికంగా రెండు ప్రక్రియలకు మధ్యగా ఉండే మరో కొత్త ప్రక్రియా? ఇటువంటి చర్చ లాక్షణికులు, విమర్శకులు  తర్జన భర్జన చేసి తేల్చుకోవచ్చు. పేరులో ఏముందంటాను నేను," అన్నారు పాలగుమ్మి పద్మరాజు, త్రిపుర కథలకి రాసిన 'పరిచయం' (1980) లో. "ఈ కథలు చదువుతుంటే, నేను ఇలాంటివి రాయగలనా అనిపించింది. అంతకన్నా మెచ్చుకోలు ఏముంటుంది.. ఒక కథకుడు మరొక కథకుణ్ణి గురించి చెప్పేటప్పుడు" అని ముక్తాయించారు కూడా.

త్రిపుర కథల్ని వేరెవరి కథల్తోనూ పోల్చలేం. పోలిస్తే గీలిస్తే త్రిపుర తర్వాత వచ్చిన కథల్ని త్రిపుర కథలతో పోల్చవచ్చు. అయితే, మనస్తత్వ చిత్రణ దగ్గరికి వచ్చేసరికి మాత్రం నాకు బుచ్చిబాబు, తిలక్ గుర్తొచ్చారు చాలాసార్లు. పాత్రల అంతః సంఘర్షణలలో రచయిత కనీకనిపించకుండా కనిపిస్తూ ఉంటాడు. ఓ పలచని తెరవెనుక నిలబడినట్టుగా. జేమ్స్ జాయిస్, కాఫ్కా, ఆల్బర్ట్ కామూ ఇంకా శామ్యూల్ బెకెట్ ల రచనలంటే త్రిపురకి బాగా ఇష్టమని అర్ధవుతుంది కథలు చదువుతూ ఉంటే. వాళ్ళందరి రచనలూ చదివేసి, అప్పుడు మళ్ళీ 'త్రిపుర కథలు' చదివితే బాగా అర్ధమవుతాయేమో. అయితే ఒకటి, ఒకసారి చదివాక అర్ధం కాకపోయినా మళ్ళీ చదివించే గుణమున్న కథలివి. (పేజీలు  244, వెల రూ. 150).

సోమవారం, జనవరి 26, 2015

రంగ్ రసియా

సెలవురోజు మధ్యాహ్నం.. గూగుల్ ముందు కూర్చుని తోచీ తోచకా గుర్తొచ్చిన పదాలు టైప్ చేసి రిజల్ట్స్ చూస్తూ చూస్తూ యధాలాపంగా 'రాజా రవివర్మ' అని టైప్ చేశాను. రిజల్ట్స్ వెంట వెళ్తూ ఉండగా కనిపించిన 'రంగ్ రసియా' ఆసక్తిగా అనిపించింది. యూట్యూబ్ లో ఉంది సినిమా. పైగా నిడివి కూడా గంటా చిల్లరే (అనగా గంటా యాభై తొమ్మిది నిమిషాల ముప్ఫై ఒక్క సెకన్లు!!) కావడంతో చూడడం మొదలు పెట్టాను. పందొమ్మిదో శతాబ్దానికి చెందిన విఖ్యాత భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ జీవితం ఆధారంగా మరాఠీ రచయిత రంజిత్ దేశాయ్ రాసిన నవలకి దర్శకుడు కేతన్ మెహతా ఇచ్చిన దృశ్యరూపం ఇది.

ఒక స్టార్ హోటల్లో రాజా రవివర్మ పెయింటింగ్ వేలం జరుగుతూ ఉండగా, హోటల్ బయట పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉండడం సినిమా ప్రారంభం. వేలం, ఆందోళనల దృశ్యాలతో పాటు టైటిల్ కార్డ్స్ చూపించి, నేరుగా రవివర్మ కథలోకి తీసుకుపోయాడు దర్శకుడు. మధ్య వయస్కుడైన రాజా రవివర్మ (రణదీప్ హూడా) బొంబాయి నగరంలో బ్రిటిష్ వారి కోర్టులో హాజరై, తనపై వచ్చిన అభియోగాలకి జవాబులు చెప్పుకునే క్రమంలో ఫ్లాష్ బ్యాక్ ద్వారా తన జీవితంలో జరిగిన ఒక్కో సంఘటననీ నెమరు వేసుకుంటాడు. ఈ క్రమంలోనే రవివర్మ విఖ్యాత చిత్రకారుడిగా ఎదిగిన వైనం, ఎదుర్కొన్న ఆటుపోట్లు ఒక్కొక్కటీ తెలుస్తూ, కోర్టు తీర్పుతో సినిమా ముగుస్తుంది.


ట్రావెన్కోర్ లో పుట్టిన రవివర్మ కి చిన్నప్పటినుంచీ చిత్రకళ అంటే ప్రాణం. ఆలయం గోడ మీద బొగ్గు ముక్కతో గీసిన ఏనుగుల బొమ్మ ద్వారా మహారాజు దృష్టిలో పడతాడు. శిక్షించడానికి బదులు, ఎంతగానో మెచ్చుకుంటాడు మహారాజు. ఫలితం, రవివర్మకి చిత్రకళ మీద ఇష్టం మరింత పెరుగుతుంది. తన రాజ్యంలో కళాకారులని గౌరవించాలని తాపత్రయ పడే మహారాజు రవివర్మని 'రాజా' బిరుదుతో సత్కరిస్తాడు. వివాహం తర్వాత ఊహించని సమస్య వస్తుంది రవివర్మకి. భర్త అలా బొమ్మలు గీయడం ఏమాత్రం నచ్చదు అతని భార్యకి. పరువుతక్కువ పని అన్నది ఆమె భావన.

అత్తవారింటి పరిచారిక కామిని లో గొప్ప మోడల్ ని చూస్తాడు రవివర్మ. ఆమెని మోడల్ గా చేసుకుని ఎన్నో స్కెచ్ లు గీస్తాడు. ఈ క్రమంలో కామినితో అనుబంధం పెరగడంతో పాటు, భార్యతో దూరం పెరుగుతుంది. దీనిని ఏమాత్రం భరించలేని రవివర్మ భార్య అతనితో తెగతెంపులు చేసేసుకుంటుంది. కేరళ విడిచిపెట్టి బొంబాయిలో స్థిరపడతాడు రవివర్మ. స్థానిక దీవాన్ కళాభిమాని. అతని ప్రోత్సాహంతో తన నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆలయంలో సుగంధ బాయి (నందనా సేన్) ని చూసి ఆకర్షితుడవుతాడు రవివర్మ. ఆమె స్కెచ్ లు గీస్తాడు.

మొదట రవివర్మని అపార్ధం చేసుకున్న సుగంధ, తర్వాత అర్ధం చేసుకుని మోడల్ గా ఉండడానికి అంగీకరిస్తుంది. కొంత స్నేహబృందం, శిష్యబృందం ఏర్పాటవుతాయి రవివర్మకి. దీవాన్ ద్వారా బరోడా మహారాజుతో పరిచయం ఏర్పడుతుంది. మహారాజు కోరిక మేరకి భారతదేశమంతా పర్యటించి, దేశ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలెన్నో గీస్తాడు రవివర్మ. వీటితో పాటు భారతీయ దేవతా మూర్తులకి రూపం ఇస్తాడు. అతడి చిత్రాలని ప్రింట్ చేసి విక్రయించడం ద్వారా పేరూ, డబ్బూ సంపాదించవచ్చని సలహా ఇస్తారు మిత్రులు. తన బొమ్మలు మరింత మందికి దగ్గరవుతాయన్న ఊహ ఆనందాన్ని కలిగిస్తుంది రవివర్మకి. సేట్ గోవర్ధన దాస్ (పరేష్ రావల్) ప్రింటింగ్ ప్రెస్ కి పెట్టుబడి పెట్టడానికి ముందుకి వస్తాడు, భాగస్వామిగా చేరే షరతుమీద.


మరోపక్క, రవివర్మతో ప్రేమలో మునిగిపోతుంది సుగంధ. అతని కోరిక మేరకు అప్పటివరకూ దేవతా మూర్తుల చిత్రాలకి మాత్రమే మోడల్ గా చేసిన ఆమె, 'ఊర్వశి' చిత్రం కోసం అర్ధనగ్నంగా మోడలింగ్ చేయడానికి సిద్ధ పడుతుంది. వాళ్ళిద్దరూ మరింత దగ్గరవుతారు. ఇంతలో బొంబాయి మహా నగరంలో ప్లేగు మహమ్మారి వ్యాపించడంతో పాటు, దేవతామూర్తులకి రవివర్మ రూపం ఇవ్వడం వల్లే ఈ ఉపద్రవం వచ్చి పడిందన్న ప్రచారమూ మొదలవుతుంది. ప్రింటింగ్ ప్రెస్ కి నిప్పు పెడతారు దుండగులు. ఓ విదేశీ వనితతో రవివర్మ స్నేహాన్ని సుగంధ అపార్ధం చేసుకుంటుంది. మరోపక్క అతడి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇన్ని చిక్కుల్లో ఉండగా పులిమీద పుట్రలా, రవివర్మని ప్రాసిక్యూట్ చేయాలంటూ కోర్టు కేసు వచ్చిపడుతుంది. కోర్టు తీర్పుతో పాటు, రవివర్మ చిత్రం వేలంలో ఏం జరిగిందన్నది ముగింపు.

కళాకారుడి మనస్తత్వాన్ని ఒడిసి పట్టుకోడం మొదలు, కీలకమైన సన్నివేశాలని కళాత్మకంగా చిత్రీకరించడం వరకూ, దర్శకుడు కేతన్ మెహతా ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. కొన్ని కొన్ని సన్నివేశాలు ముందుగానే ఊహించగలిగేలా ఉన్నప్పటికీ, సినిమా ఎక్కడా విసుగు కలిగించదు. నాలుగైదు 'ఇంటిమేట్' సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటిని అసభ్యంగా కాక కళాత్మకంగా చిత్రించడాన్ని మెచ్చుకోవాలి. నటీనటుల్లో మొదట చెప్పుకోవాల్సింది సుగంధగా చేసిన నందనా సేన్ గురించి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె లేకపోతే ఈ సినిమా లేదు. 2008 లో ఈ సినిమా నిర్మాణం జరిగే నాటికి ఆమె వయసు అక్షరాలా నలభై ఒక్క సంవత్సరాలు!

ముగ్ధత్వాన్ని ఒప్పించడమే కాదు, తనకన్నా వయసులో తొమ్మిదేళ్ళు చిన్నవాడైన కథానాయకుడితో వయోభేదం ఏమాత్రం బయటపడని విధంగా నటించింది. ఇన్నిమాటలేల? 'నందన చాలా బోల్డ్' అనిపించి తీరుతుంది ఈ సినిమా చూస్తుంటే. తర్వాత చెప్పాల్సింది రణదీప్ హూడా గురించే. ఇరవయ్యేళ్ళ నుంచి అరవయ్యేళ్ళ వరకూ వయసున్న రవివర్మని కళ్ళముందు నిలబెట్టాడు. పాత్ర వయసుకి తగ్గట్టు తన శరీరాకృతిని మార్చుకోవడంతో పాటు, కళాకారుడికి ఉండే తపననీ, ఆత్మ విశ్వాసాన్నీ, ఆత్మగౌరవాన్నీ చక్కగా పలికించాడు.


ఫోటోగ్రఫీ, సంభాషణలు,సంగీతం, ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. సెన్సార్ అభ్యంతరాలు ఎన్నింటినో ఎదుర్కొని 'A' సర్టిఫికేట్ తో గతేడాది నవంబర్ లో రిలీజయ్యింది ఈ సినిమా. ఇదే కథతో మలయాళంలో 'మకరమంజు' (2011) పేరుతో సినిమా తీశారు. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ రవివర్మగానూ, రాధ కూతురు కార్తీక నాయర్ సుగంధ గానూ నటించారట. చూస్తున్నప్పుడు ఎన్నెన్నో ఆలోచనలని కలిగించి, చూడడం పూర్తయ్యాక కూడా ఆలోచనల్లో పడేసే సినిమా 'రంగ్ రసియా.' చిత్రకళతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్నవాళ్ళతో పాటు వైవిద్యభరితమైన సినిమాలు ఇష్టపడే వాళ్ళకి నచ్చే సినిమా ఇది. గంటా చిల్లర (!!) సమయం దొరికినప్పుడు యూట్యూబ్ లో ఇక్కడ చూడొచ్చు.

శనివారం, జనవరి 24, 2015

ఆరేళ్ళు ...

ఋతువులు మారాయి.. గోడమీది కేలండర్ మారింది.. వయసు గడిలో మరో అంకె వచ్చి చేరింది. 'నెమలికన్ను' కి ఆరేళ్ళు నిండాయి!! యధాప్రకారం, సింహావలోకనం చేసుకునే సమయం వచ్చింది. నాలుగో పుట్టినరోజు నుంచీ బ్లాగు టపాల సంఖ్య ఆరోహణ క్రమంలోనే వెళ్తోంది. గడిచిన సంవత్సరంలోనూ అదే జరిగింది. అయితే, 'టపా రాయాలి' అనుకుని రోజు చివర్లో వీలవ్వక మానేసిన రోజులు చాలానే ఉన్నాయి. అలా చూసినప్పుడు, గడిచిన సంవత్సరంలో రాయాల్సిన టపాలు కొన్ని మిగిలిపోయాయి..

గడిచిన ఏడాదిలో కూడా చదువేమీ సంతృప్తిగా సాగలేదు. చదవాల్సిన పుస్తకాల జాబితా తగ్గకపోగా, పెరిగింది. చదివిన వాటిలో గుంటూరు జిల్లా వ్యవసాయరంగాన్నిఇతివృత్తంగా తీసుకుని నల్లూరి రుక్మిణి రాసిన 'ఒండ్రుమట్టి' నవల బాగా నచ్చింది. ఎడిటింగ్ విషయంలో మరికాస్త శ్రద్ధ పెడితే బాగుండుననిపించినా, నవల రాయడం వెనుక రచయిత్రి చేసిన శ్రమ ప్రతి పేజీలోనూ కనిపించడం వల్ల కాబోలు, సర్దేసుకోవచ్చు అనిపించింది. ఆమధ్య చదివిన 'గౌతమీ గాథలు' తో పాటు ఈమధ్యే పూర్తిచేసిన ఆచంట జానకిరామ్ ఆత్మకథ 'నా స్మృతి పథంలో... సాగుతున్న యాత్ర' కూడా బాగా గుర్తుండిపోయే రచన.


మా జిల్లాలో 'ద్రాక్షారం,' అభిమాన రచయిత పతంజలి పుట్టి పెరిగిన 'అలమండ' గడిచిన సంవత్సరం చేసిన యాత్రలు. రెండూ గుర్తుండిపోయేవే, వేరువేరు కారణాలకి. దర్శనీయ స్థలాల జాబితా అలాగే ఉంది. ఆ జాబితాలో లేని చోట్లు మాత్రం చూసి వచ్చేశాను. జాబితాలో స్థలాలకీ ఓ టూర్ వస్తుంది, ఎప్పుడో. ఈలోగా లిస్టుతో నిమిత్తం లేకుండా వీలుకుదిరినవి చూసేయడమే. థియేటర్ లో చూసిన సినిమాలే బహుతక్కువ. చూసిన వాటిలో 'రౌడీ FELLOW' నచ్చింది. ముచ్చటగా మూడు కథలు - 'లవ్ లీ,' 'తప్పటడుగు,' 'నిక్వాణం' - రాశానీ సంవత్సరంలో. మొదటిదీ, మూడోదీ ఏకబిగిన రాసినవి.

బ్లాగింగ్ లో ఆరో సంవత్సరాన్ని ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుంచుకునేలా చేసింది 'కృష్ణవేణి.' యాదృచ్చికంగా మొదలుపెట్టాను రాయడం. పెద్ద కథ అవుతుంది అనుకున్నది కాస్తా నవలికగా రూపుదాల్చింది. ప్రచురించడం మొదలు పెట్టాక ఒకరిద్దరు మిత్రులు ఏదన్నా వెబ్ మేగజైన్ కి పంపాల్సింది అన్నారు. ముగింపు ప్రచురించిన తర్వాత కూడా వారిది అదే మాట! ప్రచురిస్తున్నానన్న మాటే కానీ, నా సందేహాలు నావి. అయితే, నేనేమాత్రం ఊహించని రీతిలో ఉంది స్పందన. వ్యాఖ్యలు, మెయిల్స్ తో పాటు పబ్లిక్ ఫోరమ్స్ లో చర్చలు.. చాలా, ఆశ్చర్యం, ఆనందం కలిగాయి.

ఒకరిద్దరు మిత్రులు 'ఈ-బుక్' చేద్దాం అన్నారు. కానీ, ఆ క్షణంలో నా మనసులో ఉన్న ఆలోచన వేరు. ఆ ఆలోచననే వారికి చెప్పాను. వారూ అది బావుందన్నారు, మంచి మనసుతో. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు మెయిల్ బాక్స్ ఓపెన్ చేసేసరికి ఒక మెయిల్ పలకరించింది. 'మనసుని తాకిన మీ కృష్ణవేణి కి చిన్న ట్రిబ్యూట్' అంటూ. అటాచ్మెంట్ ఓపెన్ చేస్తే 'కృష్ణవేణి' పీడీఎఫ్ ఫైల్. పంపినవారు మిత్రులు వేణూ శ్రీకాంత్. ఆ క్షణంలో నాక్కలిగిన అనుభూతిని అక్షరాల్లో పెట్టలేను. అప్పటికే నేను ముందుగా అనుకున్న ఆలోచన అమల్లో పెట్టడానికి ఇంకా సమయం పడుతుందని అర్ధమయ్యింది.


జరిగిన విషయంతో పాటు, 'ఈ-బుక్' డిజైన్ ని గురించిన నా అభిప్రాయాలనీ వేణూ శ్రీకాంత్ గారికి వివరంగా రాశాను. వారు అర్ధం చేసుకుని, తన విలువైన సమయాన్నీ, ఎంతో శ్రమనీ వెచ్చించి 'ఈ-బుక్' ని అందంగా తీర్చిదిద్దడమే కాదు, నా మాట మన్నించి, తను మనసుపెట్టి చక్కని 'ముందుమాట' రాశారు కూడా. ఏనాటి అనుబంధమో.. ఏ నేస్తమే జన్మ వరమో.. పుస్తకాన్ని చూసుకున్న క్షణంలో నా ఉద్వేగం అనిర్వచనీయం. కళాతపస్వి చేతిలో రూపుదిద్దుకున్న బాలూకే సాధ్యం కాలేదు దాన్ని ప్రకటించడం. ఇక, అక్షరాల్లో పెట్టడం నా వల్ల అయ్యేపనా?

మొత్తం మీద చూసినప్పుడు బ్లాగింగ్ చాలా ఉత్సాహంగా జరిగిందీ సంవత్సరంలో. ప్లానింగ్ అన్నది పెద్దగా అలవాటు లేని పని కాబట్టి, రాబోయే కాలానికి సంబంధించి ప్రణాళికలు ఏవీ లేవు. పెండింగ్ లో ఉన్న పుస్తకాల సంగతి చూడాలి. కొనాల్సిన వాటి మీదా దృష్టి పెట్టాలి. చూడాల్సిన సినిమాల జాబితా ఒకటి నెమ్మదిగా పెరుగుతోంది. ఆవైపూ ఓ కన్నేయాలి. కాలపరిమితులూ అవీ ఏవీ లేవు కానీ, వీలు చిక్కినప్పుడల్లా చేయాల్సిన పనులివి. 'కృష్ణవేణి' ని పుస్తకరూపంలో చదవాలనుకునే వారు మెయిల్ ఐడీని ఇక్కడ కామెంట్ బాక్స్ కి, లేదా నా మెయిల్ ఐడీకి పంపగలరు. నా బ్లాగింగ్ కొనసాగడానికి కారకులైన మీ అందరికీ మరోమారు హృదయపూర్వక కృతజ్ఞతలు..

గురువారం, జనవరి 22, 2015

నా స్మృతిపథంలో... సాగుతున్న యాత్ర

ఆత్మకథల్లో ఏదో తెలియని రుచి ఉంది. చదువుతూ ఉండగా ఎక్కడో ఏ సంఘటనో చిరపరిచితమన్న భావన కలుగుతుంది. ఏ స్పందనో, మరే ఇతర ఆసక్తో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతని స్నేహబృందంలో ఒకరో, కొందరో అంతకు పూర్వమే సాహిత్యం ద్వారా పరిచయం అయిన వాళ్ళయి ఉంటారు. లేదూ, అతడు జీవించిన స్థల కాలాదుల మీద తెలియని మోజు ఏదో లోపలెక్కడో ఉండి ఉంటుంది. అదిగో, అక్కడి నుంచీ ఆ రచయిత ఆత్మీయుడైపోయి పుస్తకాన్ని ఆపకుండా చదివించేస్తాడు. అలాంటి అనుభవాన్ని తాజాగా కలిగించిన రచయిత ఆచంట జానకిరామ్.

దేశ స్వాతంత్రోద్యమం ముమ్మరంగా జరుగుతున్న కాలంలో వాటిని దూరం నుంచే చూస్తూ తన బాల్యాన్నీ, యవ్వనాన్నీ గడిపి, దేశానికి స్వతంత్రం వచ్చిన ఏడాదే - తన నలభై ఐదో ఏట - తన జీవితంలో ఓ కొత్త వెలుగుని నింపుకున్న జానకిరామ్ ఆత్మకథా సంపుటాలు  -- 'నా స్మృతిపథంలో...,' 'సాగుతున్న యాత్ర' -- కలిపి ప్రచురింపబడిన బృహత్ గ్రంధాన్ని చదివే అవకాశం అనుకోకుండా దొరికింది. స్వతంత్ర పోరాట విశేషాలతో పాటు, నూరేళ్ళ నాటి తెలుగు సమాజపు తీరు తెన్నులు, భావకవిత్వపు తొలి, మలి దశలూ, తెలుగు రేడియో పుట్టు పూర్వోత్తరాలతో పాటు అనేక విషయాలని సాధికారికంగా ప్రకటించిన గ్రంధమిది.

నాటి వైద్య ప్రముఖుడు ఆచంట లక్ష్మీపతి ముద్దుబిడ్డ జానకిరామ్ అత్యంత సుకుమారుడు, సౌందర్యోపాసకుడు. విఖ్యాత రచయిత బుచ్చిబాబు మాటల్లో చెప్పాలంటే 'సౌందర్యం కోసం సౌకర్యాన్ని త్యాగం చేయగల కళాజీవి.' అనిబిసెంట్ కి ప్రత్యక్ష శిష్యుడు. ఉన్నత విద్యాభ్యాసం, ఉన్నత వర్గాల వారి సాహచర్యం. కొన్నేళ్ళ ఉద్యోగ జీవితం తర్వాత, ఇన్సూరెన్స్ కంపెనీ సెక్రటరీ పని. తెలుగు దేశం నలుమూలలా కారులో కలియతిరుగుతూ పెద్ద పెద్దవారందరినీ పరిచయం చేసుకుంటూ, వారిచేత ఇన్సూరెన్స్ చేయించి కంపెనీని అభివృద్ధిలోకి తేవాల్సిన బాధ్యత. అటుపై తెలుగు రేడియోకి తొలి ప్రయోక్త, కార్యక్రమ రూపకర్త.. వీటన్నింటితో పాటు చిత్రకారుడు, కవి, రచయిత, సాహితీ విమర్శకుడు..


చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న జానకిరామ్ కి తండ్రి దగ్గరా, అక్కయ్య దగ్గరా చేరిక ఎక్కువ. అడయార్ కాలేజీ ప్రిన్సిపాల్ జేమ్స్ కజిన్స్ ప్రభావం అత్యధికం. దేవులపల్లి కృష్ణశాస్త్రి, అడవి బాపిరాజు, పిలకా గణపతి శాస్త్రి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, కొంపెల్ల జనార్ధన రావు, దుర్గాబాయి దేశ్ ముఖ్, కమలాదేవి చటోపాధ్యాయ, గూడవల్లి రామబ్రహ్మం, తాపీ ధర్మారావు, త్రిపురనేని గోపీచంద్, ఎన్నార్ చందూర్, మాలతీ చందూర్...ఇంకా ఎందరో, ఎందరెందరో.. వీరందరూ జానకిరామ్ కి ఆత్మీయులు. వీరిలో ఎవరిని కలవడానికి వెళ్ళినా  దోసెడు కలువలో, బుట్టెడు గులాబులో లేకుండా వెళ్ళలేదు జానకిరామ్. మడత నగలని తెల్ల బట్టలూ, పల్చని సుగంధం జానకిరామ్ సంతకం.

పుస్తకం చదవడం మొదలు పెట్టాక ఈ సున్నిత హృదయుడితో స్నేహం కలవడానికి ఎన్నో పేజీలు  పట్టదు. అటు తర్వాత, "కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ" అన్నట్టుగా జానకిరామ్ బాధ పాఠకుల బాధ అయిపోతుంది. కుటుంబలో ఒక్కొక్కరూ స్వరాజ్య సాధన కోసం జైలుకి వెళ్తూ ఉంటే, తండ్రికిచ్చిన మాట కోసం తను మాత్రం ఉద్యమానికి దూరంగా ఉండి జానకిరామ్ అనుభవించిన బాధ అంచనాకి అందుతుంది. కానీ, అటుపై జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలని గురించి చెప్పకుండా చెబుతూ వాటి తాలూకు బాధని మాత్రం అక్షరమక్షరం పంచుకున్నప్పుడు ఆ బాధలో పూర్తిగా మమేకం కావడం కొంచం కష్టమే. ఆ సున్నితత్వం ఆశ్చర్య పరుస్తుంది, కేవలం ఒక్కసారి కాదు.. అనేకసార్లు. "ఇంత సున్నితంగా ఉండడం సాధ్యమా?" అన్న ప్రశ్న రాకుండా ఈ పుస్తకం పూర్తవ్వదు.

కృష్ణశాస్త్రి వచనంలో ఆవేశం, కవిత్వంలో సౌకుమార్యం ఉంటాయని చెబుతూ, ఆ సౌకుమార్యమే తనకి ఇష్టమని చెబుతారు జానకిరామ్. బాపిరాజు బహుముఖ ప్రజ్ఞని పరిచయం చేస్తూ, సగం మాత్రమే పూర్తి చేసిన సింహ తలాటం డిజైన్ ని కళ్ళముందు ఉంచుతారు. చలం, పాకాల రాజమన్నార్ రచనల్లో తీవ్రతని గురించి చెబుతూనే, వారి సాంగత్యం తాలూకు ప్రత్యేకతని వివరిస్తారు. సొంత కారులో షికార్లు, బెజవాడ గోపాలరెడ్డి పెళ్లి వేడుకలు లాంటివి అక్కడక్కడా కనిపించే ఆటవిడుపులు. తొలినాటి రేడియో కబుర్లయితే చకచకా సాగిపోతాయి. తొలిసారి ప్రత్యక్ష ప్రసారం చేసిన నాటకం 'అనార్కలి' కబుర్లు, మరీ ముఖ్యంగా కృష్ణశాస్త్రి చేత 'శర్మిష్ఠ' రేడియో నాటకం రాయించేందుకు చేసిన మహా ప్రయత్నం.. ఇవన్నీ ఇంకెవరు చెప్పినా ఇంత బాగుండవేమో అనిపిస్తుంది.

పుస్తకంలో బాగా ఆసక్తి కలిగించేవి రెండు విషయాలు. జానకిరామ్ సున్నితత్వం, జ్ఞాపకశక్తి. జీవితం ఎన్ని పరీక్షలని పెట్టినా తన సున్నితత్వాన్ని ఇసుమంతైనా వదులుకోని అదృష్టవంతుడు పరిచయమవుతాడు ఈ పుస్తకం ద్వారా. ఇక, నెమరువేత విషయానికి వస్తే రాసే నాటికి ఎప్పటెప్పటి క్రితమో జరిగిన విషయాలను ఎంతో వివరంగా.. నిన్ననో మొన్ననో జరిగాయా అనిపించేట్టు రాయడం జానకిరామ్ ప్రత్యేకత. రాసిన సంఘటనకి సంబంధించి ప్రతి చిన్న వివరాన్నీ ఎంత జాగ్రత్తగా పొందుపరిచారంటే, అక్షరాలా కళ్ళముందు జరిగినట్టే అనిపిస్తాయి. ఐదువందల నలభై ఎనిమిది పేజీల పుస్తకం 'అప్పుడే అయిపోయిందా' అనిపించిందంటే అది రచయిత ప్రతిభే. చదివే అలవాటున్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమిది. (రాజాచంద్ర ఫౌండేషన్ ప్రచురణ, సాహితి ప్రచురణలు పంపిణీ, వెల రూ. 200).

మంగళవారం, జనవరి 20, 2015

వడ్ల చిలకలు

కొత్తగా వచ్చిన సబ్-కలక్టర్ అనుపమ చటర్జీ దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్ళాడు విశ్వనాథం. డిగ్రీ పాసయ్యి, టైపూ, షార్ట్ హ్యాండూ నేర్చుకున్నాడు. పైగా బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడాను. కలెక్టర్ ఆఫీసులో టెంపరరీ ఉద్యోగాలున్నాయని దగ్గర బంధువుల  ద్వారా తెలిసి ఓ ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. విశ్వనాథం బయో డేటా చూస్తూనే, 'కూర్చో'మని తన ఎదురుగా కుర్చీ చూపించింది అనుపమ. తర్వాత పది నిమిషాల పాటు ఆమే మాట్లాడింది. విశ్వనాథం కేవలం శ్రోత.

ఉద్యోగంలో చేరడం కన్నా, సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి కలెక్టర్ కావాలన్న కోరిక మొలకెత్తింది అతనిలో. అనుపమ చెప్పిన దానికి సరిగ్గా వ్యతిరేకంగా మాట్లాడారు విశ్వనాథం కుటుంబ సభ్యులు. ఎవరి మాట నెగ్గింది అన్న ప్రశ్నకి జవాబే తల్లావజ్ఝల పతంజలి  శాస్త్రి రాసిన 'వడ్ల చిలకలు' కథ. చదివేప్పటి పాఠకుల మనఃస్థితిని అనుసరించి ఎన్ని అర్దాలైనా గోచరిస్తాయి ఈ కథలోనూ, ముగింపులోనూ. అనుపమ పక్షాన నిలబడాలా? విశ్వనాథం తల్లిదండ్రుల పక్షాన నిలబడాలా? అన్నది పాఠకులకి ఓ సవాలు.

పర్యావరణవేత్తగా, కవిగా పేరొందిన పతంజలి శాస్త్రి చక్కని కథా రచయిత కూడా. 1990-96 మధ్య కాలంలో శాస్త్రి రాసిన ఇరవై కథల సంకలనమే 'వడ్ల చిలకలు.' సంకలనానికి మకుటంగా ఇచ్చిన శీర్షికతో వచ్చిన కథని గురించి చాలా చర్చే జరిగింది. కొందరు విమర్శకులు ఈ కథకి 'గొప్ప తెలుగు కథల' జాబితాలో చోటిచ్చారు కూడా. 'ఎస్సై నవ్వాడు' కథతో మొదలయ్యే ఈ సంకలనం వంశీకి నచ్చిన 'వైతరిణికీవల' తో ముగిసింది. మెజారిటీ కథలు కాల పరీక్షకి నిలబడేవే. మళ్ళీ, మళ్ళీ చదవాలనిపించేవే.


ఆదర్శాలు మెండుగా ఉన్న ఓ ఎస్పీ దొరగారికి ఓ కూతురు. ఊళ్ళో పేరున్న కాన్వెంట్ లో ఆ అమ్మాయికి సీటు  కావాలి. దొరవారే స్వయంగా వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి వచ్చిన ఆ పనిని ఆ ఏరియా ఎస్సై ఎలా చక్కబెట్టాడో చెబుతుంది 'ఎస్సై నవ్వాడు.' పతంజలి 'ఖాకీవనం' కి మరో పార్శ్వంలాగా అనిపించే కథ ఇది. రెండో కథ 'కనకం గట్టెక్కిన వైనము' కూడా పోలీసుల కథే. కాకపొతే కానిస్టేబుళ్ల కథ. ఈ కథతో పాటు, 'అలవాటైన కోతి' కి కూడా మెరుపు ముగింపే ప్రత్యేకత. 'భోక్త' 'రుబ్బురోలు' 'మూడో జన్మ' బ్రాహ్మణ కుటుంబాలని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథలు. వీటిలో 'మూడో జన్మ' కథ ముగింపు ఓ చిన్న ఉలికిపాటుని కలిగిస్తుంది.

'వాల్ పోస్టర్-1' 'వాల్ పోస్టర్-2' పేరుతో రెండు కథలు రాశారు పతంజలి శాస్త్రి. ఒకటి పట్టణంలోని ఓ పేద ముస్లిం కుటుంబంలో జరిగిన కథైతే, రెండోది ఏజెన్సీ జరిగిన కథ. జీవిత చిత్రణ పట్ల రచయిత శ్రద్ధ కనిపిస్తుంది. రంగురాళ్ళ తవ్వకం ఇతివృత్తంగా రాసిన 'రంగురాళ్ళు' కథ పాఠకులని ఏజెన్సీ ప్రాంతంలోకి అదాటున తీసుకెళ్ళిపోతుంది. ఓ పల్లెటూళ్ళో రెండు బ్రాహ్మణ కుటుంబాల మధ్య వచ్చిన ఓ చిత్రమైన తగువు ఇతివృత్తంగా రాసిన కథ 'ఒకటీ బై నాలుగు.' ఈ కథకీ మెరుపు ముగింపునే ఇచ్చారు.

'ఎందాకా,' 'సర్మా,' 'బరువు సామాను,' 'జెన్,' 'టై,' 'ప్చ్..హూ..,' 'బొమ్మనేదు' కథలకి ఇతివృత్తం మానవ మనస్తత్వమే.ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో రెండు కథలు 'గ్రాసం' 'వైతరిణికీవల.' మొదటిది బ్రహ్మాండమైన పొలిటికల్ సెటైర్. మళ్ళీ మళ్ళీ చదువుకునే కథ. రెండోది, అంతిమయాత్ర నేపధ్యంగా సాగే కథ. చదవడం పూర్తిచేశాక చాలాసేపు ఆలోచనల్లో పడేస్తుంది. కథా సాహిత్యాన్ని ఇష్ట పడే వారితో పాటు, కొత్తగా కథా రచనలో ప్రవేశించే ఆసక్తి ఉన్నవాళ్లు తప్పక చదవాల్సిన కథలివి. (త్వరలోనే కొత్త ప్రింట్ మార్కెట్లోకి వస్తుందని భోగట్టా).

సోమవారం, జనవరి 05, 2015

గణేష్ పాత్రో ...

"విమానం, మా నాన్న కూడా కొనగలరు తాతయ్యా.. కానీ, నడిపించేవాడిని కొనడం మన తరమా?" మొదటిసారి ఈ ప్రశ్న విన్నప్పుడు నాక్కలిగిన అనుభూతి ఇప్పటికీ జ్ఞాపకమే. 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమా ఎప్పుడు చూసినా, అమెరికా నుంచి రావాల్సిన కొడుకు ప్రయాణం చివరి నిమిషంలో కేన్సిలయిన కారణంగా తను షష్టిపూర్తిని రద్దు చేసుకోడానికి సిద్ధపడిన సీతారామయ్యని, మనవరాలు సీత ఆ వేడుకకి ఒప్పించే సన్నివేశం రాగానే ఈ డైలాగు కోసం ఎదురు చూస్తాను నేను. నిజమే, నడిపించేవాడిని కొనడం ఎవరితరమూ కాదు. సీతారామయ్య కొడుకు వాసు విషయంలోనే కాదు, ఆ సినిమాకి సంభాషణలు రాసిన గణేష్ పాత్రో విషయంలోనూ రుజువయిన నిజమది.

కొన్ని కొన్ని పేర్లని విడిగా విన్నప్పుడు అసంపూర్ణంగా అనిపిస్తాయి. పక్కన మరో పేరు చేరినప్పుడే వాటికి సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. గణేష్ పాత్రో పేరు కూడా అంతే. ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే మరో పేరు కె. బాలచందర్. గడిచిన శతాబ్దపు డెబ్భై, ఎనభై దశకాల్లో తెలుగు తెరమీద ఈ ద్వయం చేసిన మేజిక్ అంతా ఇంతా కాదు. బాలచందర్ అరవ ఆలోచనలకి అచ్చ తెలుగు నుడికారాన్ని దిద్దిన రచయిత గణేష్ పాత్రో. అందుకే కాబోలు బాలు, స్వప్న, జానీ, సుహాసిని, బుచ్చిబాబు, విద్య, బేబీ.. ఈ పాత్రలేవీ కూడా పరభాషా దర్శకుడు సృష్టించినవన్న భావన కలగదు. సినిమాకి నేటివిటీని అద్దడంలో సంభాషణలది కీలకపాత్ర మరి.

అయితే, గణేష్ పాత్రో అనే సంభాషణల రచయితని శ్రద్ధగా గమనించింది మాత్రం 'సీతారామయ్య గారి మనవరాలు' నుంచే. ఆ సినిమా తర్వాత, వెనక్కి వెళ్లి పాత్రో రాసిన సినిమాలని 'సంభాషణల' కోణం నుంచి చూస్తే ఎన్నెన్ని మెరుపులో. పాత్రో రాసిన సంభాషణలని పరిశీలించినప్పుడు ఆత్రేయ పెట్టిన ఒరవడిలో ప్రయాణం మొదలు పెట్టి, తనదైన శైలిని అలవరుచుకున్నాడనిపిస్తుంది. సంభాషణల్లో నాటకీయత ఉంటుంది. కానీ, అదెక్కడా శృతి మించి అసలు విషయాన్ని మింగేయదు. 'సినిమా కోసం సంభాషణలు తప్ప, సంభాషణల కోసం సినిమా కాదు' గణేష్ పాత్రో నమ్మిన సిద్ధాంతం ఇదేనేమో అనిపిస్తుంది.


దర్శకుడి ఆలోచనలని ఆకళింపు చేసుకుని, అందుకు అనువుగా సంభాషణలు రాయడం అన్నది అంత సులువుకాదు. జాగ్రత్తగా గమనిస్తే, దర్శకుడు-సంభాషణల రచయిత అన్న కాంబినేషన్ ఎక్కడో తప్ప మారదు. కొందరు దర్శకులకి, కొందరు రచయితలతో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. బహుశా, ఈ సౌకర్యం కారణంగానే చాలామంది రచయితలకి ఎక్కువమంది దర్శకులతో పనిచేసే అవకాశం దొరకదు. కానీ, గణేష్ పాత్రో తన సినీ ప్రయాణంలో పని చేసిన దర్శకులందరూ వైవిధ్యాన్ని కోరుకునే వారే. వెండితెర మీద తమదైన ముద్ర వేసిన వాళ్ళే.

బాల చందర్ తో పాటు, సింగీతం శ్రీనివాసరావు, క్రాంతికుమార్, వంశీ, కోడి రామకృష్ణ, ఇంకా నేటితరం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఎవరి శైలి వాళ్ళది. తెలుగు తెరమీద ఎవరి సంతకం వాళ్ళది. వారి వారి అభిరుచులకి అనుగుణంగా సంభాషణలు రాసి మెప్పించిన ఘనత మాత్రం గణేష్ పాత్రోదే. కేవలం సంభాషణలు మాత్రమే కాదు, కొన్ని పాటలూ ఉన్నాయి గణేష్ పాత్రో ఖాతాలో. సీరియస్ సంభాషణలు రాసిన ఈ రచయితే, 'హలో గురూ ప్రేమకోసమేరా జీవితం..' అనే అల్లరి పాటని రాశారంటే ఎంతమాత్రం ఆశ్చర్యం కలగదు. ఎందుకంటే, పాత్రో సంభాషణల్లో హాస్యానికి ఏమాత్రం కొదవుండదు. 'రుద్రవీణ' సినిమాలో చిరంజీవి, శోభన చెప్పిన పేరు తన వదినకి చెప్పే సన్నివేశం గుర్తుందా? 'ప్రేమించు పెళ్ళాడు' సినిమాలో సంభాషణలు??

మళ్ళీ, 'సీతారామయ్య గారి మనవరాలు' దగ్గరికి వద్దాం. కొడుకు తన పెళ్లి తనే నిర్ణయించుకోడం కన్నా, తనకి ముందుగా చెప్పకపోవడం కోప కారణం అయ్యింది సీతారామయ్యకి. అటు భర్తకీ, ఇటు కొడుక్కీ మధ్య నలిగిపోతోంది జానకమ్మ. అక్కడికీ నోరు పెగుల్చుకుని, "వాడు పుట్టాక చేసిన మొదటి తప్పండీ" అంటుంది భర్తతో. "వాడికోసం నేనూ మొదటిసారే మాట తప్పాను జానకీ" అంటాడాయన. ఇక తిరుగులేదు. కథలో కీలకమైన సన్నివేశంలో అత్యంత సహజమైన ఆర్గ్యుమెంటు.  ఎక్కడ ఏం రాయాలో బాగా తెలిసిన రచయిత పాత్రో. ఒక్కమాటలో చెప్పాలంటే సినీ సంభాషణలకి రిఫరెన్స్, గణేష్ పాత్రో సినిమాలు.