మంగళవారం, డిసెంబర్ 30, 2014

సొమ్మలు పోనాయండి

అప్పు.. కేవలం మూడొందల రూపాయల అప్పు.. దాసరి సన్యాసి కొడుకు దాసరి బోడియ్య జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఆ అప్పు కారణంగానే బోడియ్య సొమ్మలు పోనాయి, బూదేవత పోనాది, సంసారమంతా సల్లారిపోనాది. బోడియ్య చదువుకున్న వాడు కాదు. సొమ్ములున్నవాడు కాదు. బలం, బలగం ఉన్నవాడు అంతకన్నా కాదు. పైపెచ్చు, ఏనాడూ తగువులంటూ పోలీసు స్టేషన్లంట, కోర్టుల వెంట తిగిరినవాడూ కాదు. తనపనేదో తను చేసుకుపోయే బోడియ్య అప్పు పుచ్చుకున్నది మామూలు వాడి దగ్గర కాదు, వాళ్ళూరి ప్రెసిడెంటు దగ్గర. అందుకే, అప్పు కారణంగా అతగాడి సొమ్మలు పోనాయి.. వాటితో పాటే అన్నీ పోనాయి.

బలమున్నవాడిదే రాజ్యం. ఆదిమ యుగాల్లో లిఖితంగా (అనగా సర్వజనామోదంగా) ఉన్న ఈ నీతి, ఆధునిక ప్రజాస్వామిక యుగం నాటికి కూడా చెలామణిలోనే ఉంది -- కాకపోతే అలిఖితంగా. దీనితో పాటే, పిల్లిని గదిలో బంధించి కొడితే పులిగా మారుతుందన్న జంతుధర్మం ఉండనే ఉంది. ఈ రెంటినీ ఆధారంగా చేసుకుని ఉత్తరాంధ్ర ప్లీడరు గారైన రాచకొండ విశ్వనాథ శాస్త్రి సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం రాసిన నవలికే 'సొమ్మలు పోనాయండి.' చాలామంది సాహిత్యాభిమానులు సైతం నేటికీ 'సొమ్ములు' అని పొరబడుతూ ఉంటారు. కానీ కాదు, సొమ్మలే. అంటే పశువులు. బోడియ్య భాషలో 'జెత పోతులండి.'

"సొమ్మలు పోనాయండి. అదండి! అది ఆరాంబవండి. జెత పోతులండి. జెనం నిలబడి సూసీవోరండి. అలాంటి సొమ్మలండి. పోనాయండి.." అంటూ మొదలుపెట్టి బోడియ్య తన కథ మొత్తం ఏకబిగిన చెబుతాడు, ఎక్కడా అలుపు తీర్చుకోడానికి కూడా క్షణం ఆగకుండా. పాఠకులు సర్వం మరిచి, చివరికి ఊ కొట్టడం కూడా మరిచి వింటూ ఉండిపోతారు. ఈ వింటున్న క్రమంలో బోడియ్య అమాయకత్వానికి నవ్వొస్తుంది. అతనికి కష్టం కలిగినప్పుడు అయ్యో అనిపిస్తుంది. కళ్ళెదురుగానే అతనికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆవేశం వస్తుంది. బలమైన శత్రువు ఆ బలహీనుడి మీద ముప్పేట దాడి చేసినప్పుడు రౌద్రం కలుగుతుంది. అన్నింటినీ మించి బోడియ్య పట్టుదలకి శెభాష్ అనాలనిపిస్తుంది.

ఊరి ప్రెసిడెంట్ దగ్గర మూడొందల రూపాయలు అప్పు చేసి, అందుకు గాను ఆరొందల రూపాయలకి కరణం రాసిన నోటు మీద వేలిముద్దరేసి, ఆ సొమ్ముతో తుంపాల సంతలో జెత పోతుల్ని కొంటాడు బోడియ్య. సంక్రమణం వెళ్ళిన ఐదోనాడు కొన్న ఆ పోతులు శివరాత్రి వెళ్ళిన నాలుగో నాడు కనిపించకుండా పోయాయి. ఎక్కడ వెతికినా ఉపయోగం ఉండదు. సొమ్మలు పోయిన పదో రోజున ప్రెసిడెంట్ నుంచి కబురొస్తుంది బోడియ్యకి. ప్రోనోటు ప్రకారం ఆరొందల రూపాయలు బాకీ చెల్లించమని. "తాటిపండు దెబ్బకే నాను లెగలేపోతుంటే మరింక పిడుగు దెబ్బకి నానింకేటి తట్టుకోగల్నండి?!" అని అడుగుతాడు బోడియ్య, పాఠకులని.


వారం రోజుల్లో ఆరొందలు వ్యాపగించడం తనవల్ల కాలేదు బోడియ్యకి. బోడియ్య భార్య సంద్రం ఊరుకోలేదు. వీధిలో ప్రెసిడెంట్ ఇంటి ఎదురుగా నిలబడి తిట్లు అందుకుంది. ప్రెసిడెంట్ బయటికి రాలేదు కానీ అతని అన్న కొడుకు మిరపకాయల చిన్నారావు సంద్రం మీద చెయ్యి చేసుకున్నాడు. ఆమె చీరలాగి అల్లరిపెట్టాడు. దారే వెడుతున్న సూరప్పడి చేతిలో ఉన్న చేపాటి కర్ర అందుకుని చిన్నారావుకి రెండు తగల్నిచ్చాడు బోడియ్య. ప్రెసిడెంట్ మనుషులు బోడియ్య తల పగలగొట్టారు. తగువు పంచాయితీకి వెళ్ళింది. తగు మాత్రం పెద్దమనుషులు ఎవరున్నారక్కడ? ఉన్నవాళ్ళంతా ప్రెసిడెంట్ కి వత్తాసు పలికిన వాళ్ళే. బోడియ్య కొట్టిన దెబ్బలకీ, బోడియ్యకి తగిలిన దెబ్బలకీ చెల్లుకి చెల్లు అన్నారు.

పది రోజుల పాటు అంతా ప్రశాంతంగానే ఉంది. ఆ గొడవ అక్కడితో అయిపోయిందనే అనుకున్నాడు బోడియ్య. కానీ, పదకొండో రోజున పోలీస్ జవాను వచ్చాడు. బోడియ్య, సంద్రంతో పాటు ఈ గొడవకి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ పదహారేళ్ళ కూతురు చిలకని కూడా చలచల్లని మాటలు చెబుతూ పోలీసు స్టేషన్కి తీసుకెళ్ళి పోయాడు. పదిరోజుల్నాడు జరిగిన జరిగిన గొడవలో చిన్నారావు చిటికెన వేలు చితికిపోయింది. వీళ్ళు ముగ్గురూ ముద్దాయిలు. బావమరిది, జగిలీడు (తోడల్లుడు) తోడొచ్చారు బోడియ్యకి. వాళ్ళూ అంతంత మాత్రం వాళ్ళే.

అయితే, ప్రెసిడెంట్ వాళ్ళనీ వదలలేదు. బోడియ్య కుటుంబంతో పాటు వాళ్ళిద్దరి వల్లా తనకీ తన అన్న పిల్లలకీ ప్రాణ హాని ఉందని  బైండోవర్  కేసు బనాయించాడు. పులిమీద పుట్రలా భూవి జప్తు కేసు. ఆరొందల రూపాయల బాకీ చెల్లించలేదు కాబట్టి, బోడియ్యకున్న నలభై సెంట్ల భూవీ ఏల జప్తు చేయరాదంటూ సర్కారు వారి నోటీసు. ఇవన్నీ జరుగుతూ ఉండగానే సొమ్మల్ని ప్రెసిడెంటే కాజేసేడని తెలుస్తుంది బోడియ్యకి. పోలీసుల చుట్టూ, కోర్టుల వెంటా తిరగడంలో కూతురు చిలకని కోల్పోతాడు బోడియ్య. జగిలీడు భయపడి ప్రెసిడెంట్ వైపు తిరిగిపోతాడు.

ఎన్ని సమస్యలు వచ్చినా ప్రెసిడెంట్ కాళ్ళ కిందకి వెళ్లరాదన్నది బోడియ్య పంతం. అతనికి తగ్గ ఇల్లాలు సంద్రం. చివరివరకూ నిలబడినవాడు బావమరిది. ఇంతకీ, ప్రెసిడెంట్ బోడియ్య మీద ఎందుకింత కక్ష కట్టాడు? ఈ కేసుల్లోనుంచి బోడియ్య బయట పడ్డాడా లేదా? తనని ముప్పు తిప్పలు పెట్టిన ప్రెసిడెంట్ మీద ప్రతీకారం తీర్చుకున్నాడా?? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబిస్తూ ముగుస్తుంది 'సొమ్మలు పోనాయండి.' ఆద్యంతమూ రావిశాస్త్రి మార్కు ఉపమానాలతో సాగే కథనం ఊపిరి బిగపట్టి చదివిస్తుంది. పుస్తకం చదువుతున్నప్పుడే కాదు, పూర్తి చేసి పక్కన పెట్టాక కూడా ఎన్నో ప్రశ్నలు వెంటాడతాయి. 'మనసు' ఫౌండేషన్ ప్రచురించిన 'రావిశాస్త్రి రచనా సాగరం' లో చదవచ్చీ నవలికని.

సోమవారం, డిసెంబర్ 29, 2014

విశ్వనాథుని 'ఏకవీర'

ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరు రాచ బిడ్డ, మరొకరు సాధారణ రైతు పుత్రుడు. ఆర్ధిక తారతమ్యాలు వాళ్ళిద్దరి స్నేహానికీ ఏమాత్రం అడ్డుగోడలు కాలేదు. వాళ్ళ మధ్య రహస్యమన్నది లేదు. పైగా, ఎవరికి పట్టరాని దుఃఖం కలిగినా నిస్సంకోచంగా రెండోవారి భుజం మీద తలవాల్చి కన్నీళ్లు పెట్టుకోగలరు. ఇద్దరూ ప్రేమలో పడి, విఫలమయ్యారు. తర్వాత ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. దురదృష్టం, అక్కడ కూడా వైఫల్యమే పలకరించింది వారిని. వాళ్ళిద్దరితో పాటు, వాళ్ళని ప్రేమించిన అమ్మాయిలు, పెళ్ళాడిన యువతుల కథ ఏ తీరం చేరిందన్నదే 'కవిసమ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ రచించిన 'ఏకవీర' నవల.

విశ్వనాథ నవలల్లో నాకు 'ఏకవీర' అంటే ఓ ప్రత్యేకమైన ఇష్టం. ఎంత అంటే, ఇదే కథతో ఇదే పేరుతో ఎన్టీఆర్-కాంతారావు కథానాయకులుగా సినిమా వచ్చినా ఇప్పటివరకూ ఆ సినిమాని చూడనంత. 'అంతరాత్మ' తో నవలా రచన ప్రారంభించిన విశ్వనాథ రాసిన రెండో నవల ఇది. అంతే కాదు, ఆయన తన స్వదస్తూరీతో రాసిన ఏకైక నవల. మిగిలినవన్నీ ఆయన ఆశువుగా చెబుతూ ఉంటే వేరెవరో అక్షరబద్ధం చేసినవే. ముత్తు కృష్ణప్ప నాయకుడు మధురని పాలించే కాలం నాటి కథ ఇది. నాయక మహారాజు గారి ప్రధాన మంత్రులలో ఒకడైన ఉదయన్ సేతుపతి కుమారుడు కుట్టాన్ సేతుపతి, సామాన్యుడైన అతని స్నేహితుడు వీర భూపతిల జీవితాన్ని చిత్రించారీ నవలలో.

కథ వైగై నది ఒడ్డున మొదలై, ఆ ఇసుక తిన్నెలలోనే ముగింపుకి చేరుకుంటుంది. వైగై నది వర్ణనతో ఆరంభమయ్యే నవలలో మొదట కుట్టాన్ సేతుపతి పాత్ర ప్రవేశిస్తుంది. కుట్టాన్ తన విషాదాన్ని వీరభూపతితో పంచుకోవడం, అది విన్న వీరభూపతి తనకి కూడా అలాంటి కథే ఉందని చెప్పడంతో మొదలయ్యే 'తర్వాత ఏమయింది?' అన్న ఆసక్తి నవల ఆసాంతమూ కొనసాగుతుంది. కథా ప్రారంభానికి మూడునెలల క్రితం కుట్టాన్ కి 'ఏకవీర' తో వివాహం జరిగింది. కానీ, వారిద్దరూ అపరిచితుల్లాగే మసలుతున్నారు. కారణం, కుట్టాన్ తను ప్రేమించిన మీనాక్షిని మర్చిపోలేకపోవడం. అంతస్తుల అంతరం కారణంగా మీనాక్షితో పెళ్ళికి ఉదయన్ సేతుపతి అంగీకరించలేదు.


నిజానికి ఏకవీర కూడా వివాహానికి పూర్వం ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతన్ని మర్చిపోయి, కుట్టాన్ ని ప్రేమించాలన్న ఆమె ప్రయత్నానికి అతని నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇక, వీరభూపతిదో చిత్రమైన కథ. అతనో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయికీ అతనంటే ఇష్టమే. ఆమె చాలా గొప్పింటి పిల్ల. పునుగు, కస్తూరీ పూసిన భూర్జ పత్రం మీద ఇతగాడితో ప్రేమలేఖ రాసి, పూలదండలో చుట్టి అతనిమీదికి విసురుతుంది కూడా. ఏం లాభం? సుగంధ ద్రవ్యాల సువాసనల కారణంగా ప్రేమలేఖ విషయం అతని తల్లిదండ్రులకి తెలిసిపోతుంది. గొప్పవాళ్ళ మీదుండే భయం చేత, ఆ అమ్మాయిని మరచిపోతానని ఒట్టు పెట్టించుకుంటారు కొడుకుచేత. ఒట్టైతే వేశాడు కానీ, వీరభూపతి ఆమెని కల్లో కూడా మర్చిపోలేక పోతున్నాడు.

కుట్టాన్ నిరాదరణ కారణంగా ఏకవీరకి తను ప్రేమించిన వాడు పదేపదే గుర్తొస్తున్నాడు. కనీసం అతని పేరన్నా తెలియదామెకి. తెలిసిందల్లా అతడు రాజపుత్రుడు కాడనీ, ఓ సామాన్య కుటుంబీకుడు మాత్రమే అని. తన దురదృష్టానికి చింతిస్తూ కాలం గడుపుతూ ఉంటుందామె. కుట్టాన్ సాయంతో రాజాస్థానంలో కొలువు సంపాదించుకుంటాడు వీరభూపతి. తల్లిదండ్రులు అతనికి వివాహం జరిపిస్తారు. గతాన్ని మర్చిపోదామనుకున్న వీరభూపతికి భార్య నుండి నిరాదరణ ఎదురవుతుంది. ఈ సంగతిని కుట్టాన్ తో పంచుకుంటాడతడు. సంభాషణలో వీరభూపతి వివాహమాడిన వనిత - కుట్టాన్ ప్రేమించిన - మీనాక్షి అని తెలుస్తుంది స్నేహితులిద్దరికీ. ఏకవీర, మీనాక్షి, కుట్టాన్, వీరభూపతుల కథ వైగై తీరంలో ఎలా ముగిసిందన్నదే 'ఏకవీర' నవల.

ఆపకుండా చదివించే కథనం ఈ నవల ప్రత్యేకత. అయితే, రాజపుత్రుడు, ధీరోదాత్తుడు అయిన కుట్టాన్ పదేపదే కన్నీళ్లు పెట్టుకోవడం మింగుడు పడదు. అలాగే మీనాక్షి పాత్ర చిత్రణకి సంబంధించి కొన్ని సందేహాలు మిగిలిపోతాయి. నవలంతా వర్ణనల మయం. సర్పాలంటే అత్యంత అభిమానం విశ్వనాథకి. నిద్రపోతున్న ఏకవీరని గోధుమ వన్నె త్రాచు తో పోల్చడం మొదలుకొని, రస చిత్రణలో అనేకచోట్ల సర్పాన్ని ప్రతీకగా వాడుకున్నారు. ఈ నవలలోని 'అమృతం' అనే చిన్న పాత్ర 'వేయిపడగలు' నాటికి 'గణాచారి' గా మారినట్టు అనిపిస్తుంది. కూచిపూడి భామాకలాపాన్ని నవల ముగింపు సన్నివేశంలో బహు చక్కగా ఉపయోగించుకున్నారు. తనే స్వయంగా రాయడం వల్ల కాబోలు, నవలని విస్తరించకుండా 124 పేజీల్లో క్లుప్తంగా ముగించారు విశ్వనాథ. 'ఏకవీర' విడిగా లభించడం లేదు. విశ్వనాథ సమగ్ర సాహిత్య గ్రంధావళి (118 పుస్తకాలు, వెల రూ. 8,282/-) లో లభ్యం.

మంగళవారం, డిసెంబర్ 23, 2014

పతంజలి లేని అలమండ-2

(మొదటిభాగం తరువాత...)

కారు చాలా నెమ్మదిగా కదులుతోంది. ఇంత చిన్న ఊళ్ళో ఓ  ఇంటిని పట్టుకోలేక పోవడం ఏమిటన్న  పట్టుదల పెరిగినట్టుంది శ్రీకాంత్ కి. రోడ్డుకి రెండు వైపులా పరిశీలిస్తూ తాపీగా డ్రైవ్ చేస్తున్నాడు. కుడి వైపుకి చూస్తే రోడ్డుకి ఆనుకుని ఉన్న బాగా పాతకాలం నాటి దేవాలయం. కొత్తగా సున్నం వేశారు కాబోలు తళతళా మెరిసిపోతోంది. చుట్టూ ప్రహరీ, మధ్యలో పెద్ద ఖాళీ స్థలం. పెద్దావిడ చెప్పిన సంతబయలు అదే!! ఆవరణలో ఓ పక్క రావి చెట్టు కనిపించింది. కళ్ళు సంతబయలుని చూస్తున్నాయి. మనసులో ఓ పక్క దొమ్మీ యుద్ధం సినిమా రీల్లాగా గిరగిరా తిరుగుతోంది. మరోపక్క పతంజలి ఇల్లు ఎలా ఉండబోతోందో అన్న ఆలోచనలు.


శ్రీకాంత్ కి కూడా కుతూహలం పెరిగినట్టుంది. రోడ్డుకి రెండువైపులా పాతకాలపు ఇళ్ళేమన్నా కనిపిస్తాయా అని శ్రద్ధగా గమనిస్తున్నాడు. పెద్దావిడ 'కుడి వైపున' అని స్పష్టంగా చెప్పింది కానీ, ఎడంవైపున ఓ శిధిలావస్థలో ఉన్న ఇల్లు కనిపించగానే కారాపమన్నాను. రోడ్డునానుకుని ఉన్న ఇల్లు బాగా పాడైపోయింది కానీ, వెనుకగా ఉన్న ఓ ఇల్లు వాసయోగ్యంగా ఉండడమే కాదు అక్కడ మనుషుల అలికిడి కూడా కనిపించింది. ఆ ఇంటివైపు గబగబా నడిచాను. రాజుల లోగిలని ఎవరూ చెప్పకుండానే అర్ధమైపోయింది. వీధరుగు నిండా టేకు మానులు, కొమ్మలు సైజుల ప్రకారం కోసినవి అమర్చి ఉన్నాయి. తలుపు తీసే ఉంది కానీ, గుమ్మానికి తెర వేలాడుతోంది. తెరవెనుక గచ్చునేల పాలు ఒలికిపోతే ఎత్తుకోగలిగేలా ఉంది.


"ఎవరండీ ఇంట్లో.."  నా గొంతు నాకే కొత్తగా వినిపించింది. "వస్తున్నా" అంటూ వినిపించింది లోపలినుంచి. ఆ మాటతో పాటే ఓ స్త్రీ నడిచి వస్తున్న నగల చప్పుడు. రాణివాసపు ఘోషా స్త్రీ.. నాతో మాట్లాడతారో లేదో అని సందేహిస్తూ ఉండగానే, నన్ను రక్షిస్తూ మా వాళ్ళు వచ్చేశారు. ఆవిడ తెరవెనుక నిలబడ్డారు. ఆడవాళ్ళ మధ్య సంభాషణ జరిగింది. శిధిలావస్థ లో ఉన్న ఇంటి పక్కన ఓ తోట ఉంది. ఆ తోటకి ఎదురుగా ఉన్న ప్రహరీ ఇల్లే పతంజలిది. రోడ్డు మీదకి ఇల్లు కనిపించదనీ, గేటు దాటి బాగా లోపలికి వెళ్లాలనీ చెబుతూనే, గేటుకి తాళం ఉంటుందని చెప్పారావిడ. మొన్నటి తుపానుకి (హుద్ హుద్) టేకు చెట్లన్నీ పడిపోయాయనీ, ముక్కలు కోయించి పెట్టామనీ కూడా చెప్పారు. "మీ పేరేవిటండీ" అన్న మావాళ్ళ ప్రశ్నకి "ఉప్పలపాటోరి కోడల్నమ్మా" అని మాత్రం జవాబిచ్చి, నగలు చప్పుడవుతూ ఉండగా ఇంట్లోకి వెళ్ళిపోయారు.


వచ్చేశాం పతంజలి ఇంటికి. గుండె గొంతుకులోన కొట్టాడడం అంటే ఇదేనా? లోపలేదో విస్పోటనం లాంటిది జరుగుతోంది. ఏవిటీ ఉద్వేగం? కళ్ళలోనుంచి నీళ్ళెందుకు రావు?? ప్రహరీ గోడకి ఓ పెద్ద ఇనుపగేటు. ఆ గేటుకి తాళం. లోపలంతా జీబురు జీబురుగా.. కళ్ళు చికిలించుకుని బాగా లోపలికి చూస్తే దూరంగా, ఠీవిగా నిలబడ్డ పాతకాలం నాటి ఇల్లు. కొంత భాగం కూలిపోవడం తెలుస్తోంది. ఆవరణంతా పెద్ద పెద్ద చెట్లు. ఎక్కువగా మావిడి చెట్లే. వాటి రాలిన ఆకులతో పాటు, బాగా పెరిగిపోయిన గడ్డి నేలని కమ్మేసింది. "నేను ఆ తరంలో పుట్టాను" అని ఓ తరమంతా గర్వంగా చెప్పుకోగలిగే రచయిత తన బాల్యాన్ని గడిపింది ఇక్కడేనా?! నిజంగా ఇది పతంజలి ఇల్లేనా?? నా ఆలోచనల్లో నేనుండగానే కర్ర సాయంతో రోడ్డు మీద నడిచి వెళ్తున్న ఓ వృద్ధుడు మమ్మల్ని చూసి ఆగాడు. గోపాల్రాజు డాక్టర్ గారిల్లు చూడ్డానికి వచ్చామని శ్రీకాంత్ చెప్పాడతనికి.


"నానార్రైతుని.. తవరెవరూ?" తన చూపుడు వేలితో శ్రీకాంత్ పొట్టలో పొడుస్తూ అడిగాడా వృద్ధుడు. అది చూడగానే, "నువ్వెవరవోయీ? సేనాపతి అరసవిల్లివా.. రొంగలి అమ్మన్నవా లేక బిత్తిరి సోవులువా?" అని అడగాలనిపించింది. కానీ, "నానార్రైతుని" అని చాలా స్పష్టంగా ఆ ఇంటి మీద తన హక్కుని ప్రకటించుకుని, జవాబివ్వాల్సిన బాధ్యతని మా మీద పెట్టేశాడు కదా. "మీ రైతు 'మీరెవరు?' అని అడుగుతున్నాడు. ఏమని చెప్పాలి పతంజలి బాబూ? కనీసం 'రాజుల లోగిళ్ళు' అన్నా పూర్తి చేయకుండా జాతి యావత్తుకీ అన్యాయం చేసి వెళ్ళిపోయిన పతంజలికి పాఠకులం అని చెప్పాలా? చెప్పినా మీ రైతుకి అర్ధమవుతుందా??"  ...అక్కడికీ గొంతు పెగుల్చుకుని "మావు పతంజలి బావు చేయితులం" అన్నాను కానీ, నా మాట నాకే కొత్తగా వినిపించింది. ఇంతకీ ఆ రైతుకి వినిపించదట. ఆ మాటే శ్రీకాంత్ కి చెప్పి కర్ర తాటించుకుంటూ వెళ్ళిపోయాడు.


ఎదురుగా పతంజలి ఇల్లు. లోపలి వెళ్ళడానికి అడ్డుగా గేటుకి పెద్ద తాళం. ఏవిటి సాధనం? మేం ముఖాలు చూసుకుంటూ ఉండగా, "నేను ఫోటోలు తీసి పట్టుకొస్తా" అంటూ ఓ ఫోన్ అందుకుని చెంగున గోడ దూకేశాడు శ్రీకాంత్. అతగాడి ఉత్సాహం చూసి మాకు ముచ్చటేసింది కానీ, మా సంగతేవిటి? ఇంతదూరం వచ్చింది గేటుకున్న తాళం చూసి వెళ్లడానికా? గేటు వెనుకున్న సన్నాకుల మావిడిచెట్లు చూడగానే "పయిటేల" వాటికింద నిద్ర చేసే వీరబొబ్బిలి గుర్తొచ్చింది. అంతలోనే, ఓ రాత్రివేళ దివాణంలో ప్రవేశించిన దొంగాడికి అదే బొబ్బిలి కందా ఇంటికి దారి చూపించి, పోలుగు పిట్టల మాంసం కూరలో తన వాటా అడిగి పుచ్చుకున్న సంగతీ జ్ఞాపకం వచ్చేసింది. వెతికితే దివాణంలోకి ఏదో ఒక దొంగదారి దొరక్క పోతుందా?? ఉత్సాహంగా చుట్టూ చూస్తే ఓ చోట గోడ కూలిపోతే, ఒకదానిమీద ఒకటిగా రాళ్ళు అమర్చి ఖాళీని పూడ్చడం కనిపించింది. రాసోరింట్లోకి దారి దొరికేసింది!!


ఆ సాయంత్రం వేళ.. ఎండుటాకులు కాళ్ళకింద చప్పుడు చేస్తున్నాయి. దూరంగా కీచురాళ్ళ రొద వినిపిస్తోంది. ఆకులలముల చాటున పురుగూ పుట్రా ఉండొచ్చన్న జాగ్రత్త ఓ పక్కా, పతంజలి లోగిట్లో నడుస్తున్నానన్న భావన మరోపక్కా. ఎంత పెద్ద లోగిలసలు?! 'సీతమ్మ లోగిట్లో' కథ జరిగింది ఇక్కడేనా? ఒక్కో అడుగూ ముందుకు పడుతున్న కొద్దీ ఇల్లు మరింత దగ్గరగా వస్తోంది. సాక్షాత్తూ వాళ్ళ రైతే చెప్పినా సందేహమే, నిజంగా ఇది పతంజలి ఇల్లేనా?? అపనమ్మకం కాదు, ఆశ్చర్యం. ఫకీర్రాజు, చిట్టెమ్మ, మీర్జా పెదబాబు, అరసవిల్లి, వంటరాజు, గోపాత్రుడు, దుంపల దత్తుడు, ఈటె సూరి, కజ్జపు అప్పారావు, లగుడు ముత్తేల్ నాయుడు, పిల్లికళ్ళ సూరి, పాకలపాటి రంగరాజు మేష్టారు.. ఒక్కరనేమిటి? పతంజలి సృష్టించిన పాత్రలన్నీ సజీవులై ఆ ఆవరణలో తిరుగుతున్న భావన.


ముందు భాగం పైకప్పు కూలిపోయింది. నేలమీద మట్టిని తొలగిస్తే కొవ్వు గచ్చు మెరుస్తూ కనిపించింది. లోపల ఏ గదికీ తాళాల్లేవు. కొన్ని తలుపులైతే విరిగి పడిపోయాయి కూడా. తుపాను ప్రభావం కాబోలు. ఒక్కో గదినీ చూస్తుంటే మాటలకందని భావాలేవో సుళ్ళు తిరుగుతున్నాయి. ఫోటోలు తీసుకుంటూ, ఏ గది ఏమై ఉంటుందో ఊహించుకుంటూ ఉండగా.. చెదలు పట్టేసిన ఓ పుస్తకం మా వాళ్ళ కంట పడింది. పరీక్షగా చూస్తే తెలిసింది, అది 'రీడర్స్ డైజెస్ట్' అని. నిస్సంశయంగా ఇది పతంజలి ఇల్లే అనిపించిందా క్షణంలో. మండువా లోగిలి నిండా పిచ్చి మొక్కలు మొలిచిపోయి ఉన్నాయి. వాస్తు ప్రకారం ఆలోచించి, ఏ గదిని ఎందుకోసం వాడి ఉంటారో ఊహిస్తున్నాడు శ్రీకాంత్. "అప్పటి ఇల్లు కాబట్టండి.. కలపకెక్కడా చిన్న చెద కూడా లేదు చూడండి" అంటూ తను ఉత్సాహ పడుతూ మమ్మల్ని ఉత్సాహ పరుస్తున్నాడు.


రెండు చెక్క కుర్చీలు, ఓ చెక్క పెట్టి, ఓ పింగాణీ కాఫీ కప్పూ దుమ్ము కొట్టుకుపోయి కనిపించాయి. కందా ఇంట్లో గోడకి పుట్టపర్తి సాయిబాబా ఫోటో వేలాడుతోంది. ఓ పెద్దగదిని చెక్కలతో పార్టిషన్ చేసినట్టు తెలుస్తోంది. ఏమాత్రం ఆదరణ లేకపోయినా ఎంత మొండిగా నిలబడిందో కదా ఈ ఇల్లు అనిపించింది చూస్తుంటే. పతంజలిని జ్ఞాపకం చేసుకుంటూ ఇల్లంతా మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉండగా "ఈ పతంజలి ఏ విదేశంలోనో పుట్టి ఉంటే అతని పుట్టిల్లు మ్యూజియం గానూ, అతని ఊరు యాత్రా స్థలిగానూ మారి ఉండేవి కదా" అనిపించింది. "ఎక్కువరోజులుండదండి ఈ ఇల్లు" అని శ్రీకాంత్ అంటూ ఉంటే, వినడానికి బాధగా అనిపించింది. కానీ నిజం, ఇంకొంచం ఆలస్యం చేసి ఉంటే ఇల్లు పూర్తిగా శిధిలం అయిపోయి ఉండేదేమో. పతంజలి ఉండగా వచ్చి ఉంటే? "వాళ్ళు పిచ్చి వాళ్ళమ్మా" అని తన తల్లికి చెప్పి ఉండేవాడేమో, మాగురించి కూడా. వెనక్కి వెనక్కి చూసుకుంటూ లోగిలి బయటికి వస్తూ ఉండగా "ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టండి" అన్నాడు శ్రీకాంత్.

(అయిపోయింది)

సోమవారం, డిసెంబర్ 22, 2014

పతంజలి లేని అలమండ-1

విశాఖపట్నం నుంచి విజయనగరం దగ్గర పడుతూ ఉండగా పెట్రోల్ బంకు ఎదురుగా ఎడమవైపు వచ్చే రోడ్డుకి తిరిగి పది కిలోమీటర్లు లోపలికి వెళ్తే వచ్చే ఊరే అలమండ -- ఈ సమాచారం చాలదూ, పతంజలి పుట్టి పెరిగిన ఊరిని చూసిరాడానికి? పది కిలోమీటర్లు దాటినా ఎక్కడా ఊరన్నది కనిపించకపోవడంతో కారు డ్రైవర్ శ్రీకాంత్ కి కంగారు మొదలయ్యింది. రోడ్డు పక్కన నలుగురు మనుషులు కనిపించిన చోట కారాపి, అద్దం దించి "ఆల్మండ్ ఎలా వెళ్ళాలి?" అని అడుగుతూ ఉంటే నా గుండె తరుక్కుపోయింది.. "ఆల్మండ్ కాదు నాయనా.. అలమండ.. అలమండ" మనసు ఆక్రోశించింది. ముందుకెళ్ళమన్నారు వాళ్ళు.

మరో ఐదారు కిలోమీటర్లు ముందుకి సాగేసరికి పట్నపు వాసనలు ఏమాత్రం సోకని - కాస్త శుభ్రంగా ఉంటే బాగుండుననిపించే - ఓ పల్లెటూరు పలకరించింది. 'డా. అంబేద్కర్ సామాజిక భవనం, అలమండ' బోర్డు చూడగానే ప్రాణం లేచొచ్చింది. ఆడవాళ్ళూ, పిల్లలూ ఉన్నారు రోడ్డు పక్కన. "పతంజలి గారింటికి ఎలా వెళ్ళాలి?" కించిత్తు గర్వంగా అడిగాను. వాళ్ళు చాలా అయోమయంగా చూశారు. "రాజుగారు" అని చెప్పాను. "రాసోల్లు పెదసావిడి కాడుంటారు.. ఇల్లాగ లోనికెల్లాల" కుడివైపుకి దారి చూపించారు. పెదసావిడంటే రాజులందరూ కూడి "విదండీ చంగతి.. వదండీ బోగట్టా" అని మాట్లాడుకునే చోటు కదూ. ఇద్దరు పిల్లలు ఉత్సాహంగా కారెక్కి డ్రైవరు పక్కన సెటిలయ్యారు, మాకు పెదసావిడి చూపించడం కోసం.


రెండు మలుపులు తిరిగి కారు ముందుకి సాగుతూ ఉండగా ఓ కిళ్ళీ కొట్టు దగ్గర కూర్చున్న నీర్కావి పంచె రాజుగారు కనిపించారు. "సోలెడు ముక్కు" చూసి గుర్తు పట్టేయచ్చు ఏ రాజుగారినైనా. పెదసావిట్లో ఎవరూ లేరు. "ముందలికెల్తే సూరిబాబు గోరి లోగిలొత్తాది. రాసోలందరి బోగట్టా ఆరికి తెలుసు," పిల్లలు సలహా ఇచ్చారు డ్రైవర్ కి. సూరిబాబు గారి లోగిలి ముందు కారాగింది. పాతకాలం ఇల్లు కాదు, పది పదిహేనేళ్ళ క్రితం కట్టిన మేడ. లోగిలంతా పూలమొక్కలు. ఆ మొక్కల మధ్యలో వాటికి సంరక్షణ చేస్తున్న బాగా పెద్దాయన. గేటు తీసుకుని లోపలికి వెళ్లి చొరవగా ఆయన్ని పలకరించాను, "పతంజలి గారిల్లు చూద్దామని వచ్చామండీ.." నవ్వారాయన, "పుస్తకాలు చదివి వచ్చారా?" అన్న ప్రశ్నతో పాటుగా.

నీర్కావి పంచె రాజుగారు
"ఇదే రోడ్డులో ముందుకి వెళ్ళండి రామకోవెలొస్తుంది. దాటి ముందుకి వెడితే ఓ పెద్ద నుయ్యి కనిపిస్తుంది. దాన్ని ఆనుకుని ఉన్న లోగిలే పతంజలిది. ఎవ్వరూ ఉండడం లేదక్కడ. పతంజలి అంటే ఎవరికీ తెలీదు. గోపాల్రాజు డాక్టర్ గారిల్లు అని అడగాలి," ఓపిగ్గా చెప్పారాయన. "మీరెల్లండి.. మావు ఇల్లకెల్లిపోతాం," కారు దిగి తుర్రుమన్నారు పిల్లలిద్దరూ. వాళ్లకి పతంజలి తెలియకపోవడం నిరాశ పరిచింది మావాళ్ళని. పెద రామకోవెల చూడగానే కారాపమన్నాను. మూడు గుర్రాల బీడీ కాల్చుకుంటూ, "భూవి బల్లపరుపుగా ఉన్నాది" అని చెప్పి అలమండ భూవి తగువుకి గోపాత్రుడు తెరతీసింది ఈ కోవెల దగ్గరే. కోవెలని ఆనుకునే కిళ్ళీ కొట్టు. బొబ్బిలి రాజుగారిది కానీ కాదు కదా?!! కారాగడం చూసి ఇద్దరు ముగ్గురు మనుషులు దగ్గరికొచ్చి పలకరించారు. పల్లెటూళ్ళలో ఉండే సౌకర్యం ఇదే.

పెదసావిడి
"గోపాల్రాజు డాట్టర్ గోరు కాలం సేస్సేరు.. ఆరింట్లో ఎవర్లేరిప్పుడు" అన్న సమాచారం ఇచ్చేశారు, అడక్కుండానే. "వాళ్ళబ్బాయి పతంజలి కోసం" అని చెప్పినా ఇదే జవాబొస్తుంది. అందుకే, ఏమీ మాట్లాడలేదు. అడ్రస్ దొరికిన ఆనందంలో కారు డ్రైవ్ చేసేస్తున్నాడు శ్రీకాంత్. ఎవరింటికో కాకుండా ఓ ఇల్లు చూడడం కోసం ప్రయాణం పెట్టుకునే వాళ్ళు ఉండడం, వాళ్ళు తన కార్లో ప్రయాణం చేయడం అతనిక్కాస్త థ్రిల్లింగ్ గా ఉన్నట్టుంది. కిటికీలోంచి బయటికి చూస్తే తాటి తోపులు, పూరిళ్ళు కనిపిస్తున్నాయి తప్ప గోపాల్రాజు గారి దివాణం జాడ లేదు. నాలుగు రోడ్ల కూడలిని ఆనుకుని పెద్ద నుయ్యి. అక్కడ బట్టలుతుక్కుంటున్న ఆడవాళ్ళు. అడ్రస్ తప్పు చెప్పారా? లేక మేము దారి తప్పామా??

పెద రామకోవెల
"రాజుగోర్లిల్లు ఇక్కడేటీనేవు.. అలమండ్లో ఉంటాయారి లోగిల్లు.. ఎనక్కెల్లాలి," బట్టలుతుక్కుంటున్న ఓ స్త్రీమూర్తి వింతగా చూస్తూ చెప్పింది. పాపం, ఆవిడే మా అవస్థ గమనించి పక్కనున్న ఓ ఇంటి ముందు కూర్చుని అడ్డపొగని ఆస్వాదిస్తున్న ఓ పెద్దావిడని చూపించి, "రాసోల్ల బోగట్టాలైతే ఆయమ్మి సెబుతాది" అని సలహా ఇచ్చింది. తన అడ్డపొగ తపస్సుకి భంగం కలిగించినందుకు ఏమాత్రం విసుక్కోని ఆ పెద్దావిడ, "రాజుగోరంటే ఏ రాజుగోరు? సొట్ట రాజుగోరా? పిచ్చి రాజుగోరా? గుడ్డి రాజుగోరా?" అని ప్రశ్నలు సంధిస్తూ ఉంటే, తన అత్త దేవుడమ్మకి ఔషధం కోసం ఫకీర్రాజు ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి, పెదరాజుగోరికి దొరికిపోయిన కలగాడ నాయుడు కళ్ళముందు మెదిలాడు.


"ఓయమ్మ.. ఏనాటి గోపాల్రాజోస్సి. ఆబాబు నేడు గదా.. లోగిలిగూడా ఏటీ నేదు. తిన్నగెల్తే ఇసాపట్నం. ఎల్లొచ్చీండి" సలహా చెప్పి, చుట్టని నిప్పున్న వైపు నోట్లో పెట్టుకుని కళ్ళు మూసేసుకుందావిడ. ఓపిగ్గా నిలబడితే ఓ క్షణానికి కళ్ళు తెరిచి చిత్రంగా చూసింది. "ఎనక్కెల్తే సంత బయలొత్తాది. దాటెల్తే ఒత్తాదా రాజుగోరి లోగిలి. తాలవేసేసి ఉంటాది..." ఆవిడ ఓపిగ్గా చెబుతూనే ఉంది కానీ, 'సంత బయలు' దగ్గర ఆగిపోయాన్నేను. విశ్వాసాల కోసం అలమండ ప్రజలు దొమ్మీ యుద్ధానికి సిద్ధ పడిపోయిన చారిత్రక ప్రదేశం. చూడకపోతే ఇంకేమన్నా ఉందా అసలు?!!

భూవి బల్లపరుపుగా ఉంటాదని నమ్మిన రాజుల ఫౌజు రావి చెట్టు కిందా, గుండ్రంగా ఉందని వాదించిన వెలమల జట్టు మర్రిచెట్టు కిందా జమకూడి యుద్ధం మొదలు పెట్టిన స్థలం.. రొంగలి అమ్మన్నకి అతని పెదనాన్న రొంగలి బుజ్జి అచ్చం భగవద్గీతలో శ్రీకృష్ణుడి లాగా దొమ్మీ యుద్ధం సమగ్ర సారాంశాన్ని బోధ పరిచిన చోటు... అవతలి గ్రూపులో కుక్కలేవీ లేవని 'వీరబొబ్బిలి' చింతించిన తావు.. జామి పోలీసులొచ్చి దొమ్మీ గ్రూపులు రెండిటినీ అదుపులోకి తీసేసుకుని యుద్ధం మధ్యలోనే ఆగిపోడానికీ, అటు పిమ్మట మేస్ట్రెటు గంగాధరం గారు "భూవి బల్లపరుపుగా ఉంద"ని తీర్పు చెప్పడానికి కారణమైన ఆయొక్క సంత బయలు... నా ఆలోచనల్లో నేనుండగానే, పరిస్థితి అర్ధం చేసేసుకున్న శ్రీకాంత్ కారుని రివర్స్ చేశాడు.

(ఇంకా ఉంది)

సోమవారం, డిసెంబర్ 08, 2014

నేనూ, కోనసీమా, గోదారీ ...

మన పుట్టుక మన చేతిలో ఉండదు.. మన ప్రమేయం ఉండదు.. మన నిర్ణయాల ప్రకారం ఉండదు. మనం కారణం కాని విషయాలని గురించి గర్వ పడడం అనవసరం. కానీ, కోనసీమనీ గోదారినీ తలచుకున్నప్పుడల్లా ఏదో తెలియని ఉద్వేగం. ఓవైపు గలగలా గోదారి, మరోవైపు గంభీర కెరటాల సముద్రం.. చుట్టూ ఆకుపచ్చని గొడుగులు పాతినట్టుగా ఆకాశంలో పచ్చాపచ్చని గూళ్ళు అల్లే కొబ్బరి చెట్లు.. మధ్య మధ్యలో అరటి చెట్లు, అల్లంత దూరాన సరిహద్దులు గీసే తాడిచెట్లు, పచ్చని పొలాలకి పాపిడి తీసినట్టుండే గట్లు.. వాటి వెంబడి పూల మొక్కలూ, పళ్ళ చెట్లూ.. ఎంత భాష సరిపోతుంది కోనసీమని వర్ణించడానికి?!!

ఊహతెలిసినప్పటినుంచీ తెలిసిన ప్రపంచం అంతా సప్తవర్ణ శోభితమే. నిద్రలేస్తూనే వీధిలోకి వస్తే ఎదురుగా చెరువు మీద ఉదయించే సూర్యుడు, తల పక్కకి తిప్పితే ఎత్తైన ధ్వజ స్థంభం అంతకన్నా ఎత్తైన గోపురంతో గుడీ, అటుపై ఎటు పక్కకి తలతిప్పినా దట్టమైన కొబ్బరి అడవి. పెరట్లో అరటి చెట్లు, దబ్బ చెట్టు, కూరగాయ మడులు.. దాటి కొంచం ముందుకు వెడితే కొబ్బరి తోట. ఓ పక్క మావిడి చెట్టు, మరోపక్క వేప చెట్టు, ఇంకోపక్క వెలగచెట్టు. సరిహద్దులో పాముపుట్టని ఆనుకుని సంపెంగ పొద, అనాస పొదలూ. ఆవెంటే కనకాంబరాలలాంటి ఆకుపచ్చని పూలు పూసే పేరుతెలియని మొక్కలు.


అటుగా ఓ అడుగేస్తే పక్క వాళ్ళ తోటలో ఈత చెట్లూ, నేరేడు చెట్లూ. కాకులు, చిలకలు, పాలపిట్టలతో పాటు పేరు తెలియని పక్షులెన్నో. ఇక సీతాకోకచిలుకలైతే ఏరకం పూలమీద ఏ చిలుక వాలుతుందో నిద్రలో లేపినా చెప్పేసేంత జ్ఞానం!! పసుపురంగు కోల రెక్కలుండే సీతాకోకచిలుకలైతే ఎలాంటి పూల మీదైనా వాలేస్తాయి. అదే నలుపు మీద తెలుపు, ఎరుపు చుక్కలుండే పెద్ద రెక్కలవైతే మందారాలని విడిచి పక్కకి చూడవు. నల్లరెక్కల మీద తెల్లని చారలుండే బుజ్జి పిట్టలు సీతాఫలాలని బతకనివ్వవు. పిందె పండుగా మారుతూ ఉండగానే ఈతాకు బుట్టలు కట్టేయాల్సిందే.

దొండ పాదుకి రోజూ కోసినా కాయలు కాస్తూనే ఉంటాయి. పొట్ల పాదు పూత నిలబడగానే చిన్న చిన్న రాళ్ళకి పురికొస తాళ్ళు కట్టి సిద్ధం పెట్టుకోవాలి, కాయలు వంకర్లు తిరిగిపోకుండా కాసుకోడం కోసం. శీతాకాలపు ఉదయాలు, వేసవి కాలపు సాయంత్రాలు, వర్షాకాలపు మధ్యాహ్నాలు మరింత అందంగా ఉండే ప్రపంచం కదూ అదీ. మంచు తెరల్ని చీల్చుకుంటూ పచ్చని చెట్ల మీద ఉదయించే సూర్యుడూ, రోజంతా గాడ్పుల తర్వాత ఒక్కసారిగా చల్లబడే సాయంత్రాలూ, ముసుగేసుకుని పడుకోవాలనిపించే ముసురేసిన మధ్యాహ్నాలూ ఎక్కడైనా బావుంటాయి కానీ, కోనసీమలో అయితే అద్భుతంగా ఉంటాయి.


మొదటిసారి గోదారిని చూసిన అనుభవం ఎప్పటికీ తడి ఆరని ఓ జ్ఞాపకం. సైకిలు మీద నాన్నతో కలిసి ఏటిగట్టు మీద ప్రయాణం. నాన్న సైకిలు తొక్కుతూ ఉంటే చెరువు కన్నా ఎన్నో రెట్లు పెద్దగా ఉన్న గోదారిని కళ్ళు విప్పార్చుకుని గోదారిని చూడడం బాల్య జ్ఞాపకం అయితే, భాద్రపద మాసపు వరద గోదారిమీద వెన్నెల రాత్రులలో చేసిన పడవ ప్రయాణాలు యవ్వనాన్ని వెలిగించాయని చెప్పుకోడానికి అభ్యంతరం ఏముంటుంది? వరద పోటెత్తుతూ, క్షణ క్షణానికీ గోదారొచ్చేస్తూ ఉంటే నీళ్ళ మీద బరువుగా కదిలే పడవ. పైన మబ్బుల్లేని ఆకాశంలో ఇట్టిట్టే కళలు పెంచుకునే శుక్ల పక్షపు చంద్రుడు. అప్పుడు కలిగే అనుభూతికి పేరు పెట్టడం ఎవరి తరం??


వినగలగాలే కానీ గోదారి ఎన్నెన్ని కబుర్లు చెబుతుందో. ఎంత చక్కని వక్తో, అంతకి మించిన శ్రోత కూడా. చెప్పడం చేతనవ్వాలి ఎటొచ్చీ.. చూడ్డానికి ఎంత ప్రశాంత గంభీరంగా ఉంటుందో, అంతకు అనేకరెట్లు లోతైన నది కదా మరి. గోదారితో ప్రేమ పుట్టుకతో వచ్చేదని చెప్పడం సాహసం.. కానీ, ఒక్కసారి మొదలయ్యిందో.. కడవరకూ సాగాల్సిందే ఇక. వినగలగాలే కానీ గోదారి గలగలల్లో సంగీతం వినిపిస్తుంది.. చూడగలిగితే సాహిత్యం కనిపిస్తుంది. ఓ సంగీత రూపకం లానో, గేయ కావ్యంలాగో అనిపిస్తుంది. చూసే కళ్ళకి గోదారి నడకల్లో నాట్యం కనిపిస్తుంది. ఒంపుసొంపుల గోదారి ఏ నాట్యకత్తెకి తక్కువ?


కోనసీమనుంచీ, గోదారి నుంచీ సెలవు తీసుకోవాల్సి రావడం జన్మానికెల్లా అతిపెద్ద శాపం. ఆ విరామం తాత్కాలికమే కావొచ్చు కానీ దూరంగా ఉండాల్సి రావడం ఎంత కష్టం?! రేపేవిటో తెలియని బతుకని అనుక్షణం నిరూపితమవుతున్నప్పుడు రేపటి మీద అంత పెద్ద ఆశ పెట్టుకోవడం సాధ్యమేనా? ఎప్పటి పుణ్యమో కోనసీమకీ గోదారికీ దగ్గర చేసి, పండకుండా మిగిలిపోయిన పాపమేదో అంతలోనే దూరం చేసేసి ఉంటుందని సరిపెట్టుకోడాన్ని మించిన జోలపాట ఉంటుందా ఈ జీవితానికి???

(Pics courtesy: Google)