మంగళవారం, అక్టోబర్ 23, 2018

పతంజలి మోనోగ్రాఫ్

సాహిత్య అకాడమీ చేస్తున్న మంచిపనుల్లో ఒకటి 'భారతీయ సాహిత్య నిర్మాతలు' అనే సిరీస్ లో ప్రముఖ రచయితలు, రచయిత్రుల మోనోగ్రాఫ్స్ వెలువరించడం. ఈ క్రమంలో వచ్చిన పుస్తకం విఖ్యాత రచయిత కె.యెన్.వై. పతంజలి ని గురించి కథా, నవలా రచయిత చింతకింది శ్రీనివాసరావు చేత రాయించిన మోనోగ్రాఫ్. పతంజలి పుట్టి పెరిగిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వాడే కాక, పతంజలి వీరాభిమానీ మరియు ఆ పరంపరకి చెందిన రచయితగా పేరుతెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న చింతకింది అత్యంత భక్తిశ్రద్ధలతో చేసిన రచన ఇది. పతంజలి రచనలు, ఇంటర్యూలు, ఇతరులు వెలిబుచ్చిన అభిప్రాయాలు సవివరంగా చదివిన వాళ్లకి కూడా కొత్త విషయాలు చెప్పే విధంగా ఈ రచన సాగడం విశేషం.

పతంజలి రచనల్ని తలచుకోగానే మొదట గుర్తుకొచ్చేది వ్యంగ్యం. 'రాజుగోరు' మొదలు 'రాజుల లోగిళ్ళు' వరకు, 'ఖాకీవనం' మొదలు 'గెలుపు సరే, బతకడం ఎలా' వరకూ పతంజలి ఏ ప్రక్రియలో రచన చేసినా ఆయన వాక్యాల మధ్య వ్యంగ్యం తొంగిచూస్తూ ఉంటుంది. చేదునిజాలకి చక్కెరపూతగా ఉపయోగపడింది. ఆ వ్యంగ్యమే లేకపోతే 'గోపాత్రుడు' నవ్వించడానికి ముందే ఏడిపించేసి ఉండేవాడు. 'వీరబొబ్బిలి' వెలుగు చూసేదే కాదు. తెలుగు సాహిత్యానికి చాలా చాలా నష్టం జరిగిపోయి ఉండేది. మరి, ఆ వ్యంగ్యం పతంజలి ఎలా అబ్బింది? తెచ్చిపెట్టుకున్నదిగా కాక, సహజాతంగా ఎలా అమిరింది? ఈ ప్రశ్నలకి జవాబిచ్చారు చింతకింది శ్రీనివాసరావు.

పతంజలి భూస్వామ్య నేపధ్యం మొదలు, ఉత్తరాంధ్ర సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితుల వరకూ ఆ వ్యంగ్యం తాలూకు చరిత్రలో భాగాలే అని బల్లగుద్ది చెబుతారు రచయిత. రాచరికాలు, జమీందారీలు కోల్పోయిన క్షత్రియ కుటుంబంలో పుట్టిన కుర్రాడికి తండ్రిగారి సాహిత్యాభిలాష కారణంగా చిన్ననాడే పుస్తకాలతో పరిచయం ఏర్పడడం, పాఠకుడి నుంచి రచయితగా పరిణమించడానికి అట్టే సమయం తీసుకోకపోవడం లాంటి విశేషాలు, ఈ మోనోగ్రాఫ్ చదవకపోతే ఎలా తెలుస్తాయి? బంధువులు, మరీ ముఖ్యంగా మేనమామ ప్రభావం లాంటి వివరాలని విశదంగా అక్షరీకరించారు ఈ పుస్తకంలో.
కేవలం కుటుంబ నేపధ్యం, చదివిన పుస్తకాలు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న వాతావరణం, మరీ ముఖ్యంగా సామాజిక పరిస్థితులు రచయిత మీద ప్రభావం చూపిస్తాయి. పతంజలి కలం పట్టిన నాటి సాహితీ, సామాజిక వాతావరణాలని రేఖామాత్రంగా స్పృశిస్తూనే 'కన్యాశుల్కం' నాటకం, చాగంటి సోమయాజులు (చాసో) పతంజలి పై వేసిన ముద్రని ప్రస్తావించడం మర్చిపోలేదు. కాలక్షేప సాహిత్యం పుష్కలంగానూ, ఉద్యమ సాహిత్యం తగుమాత్రంగానూ వెలుగుచూస్తున్న ఆ కాలంలో కలం పట్టి, ఈ రెండూ కాకుండా తనదైన కొత్త మార్గాన్ని నిర్మించుకున్న రచయిత పతంజలి. రచయితగా పతంజలి పరిణామ క్రమాన్ని కూడా ఆయా రచనలు వెలువరించిన కాలంనాటి పరిస్థితులతో బేరీజు వేసి చెప్పడం ద్వారా, పతంజలి రచనల ప్రత్యేకతని అరటిపండు ఒలిచినట్టుగా వివరించారు.

కాలేజీ మేగజైన్ కి రాసిన కథల మొదలు, నవలలు, నవలికల వరకూ పతంజలి ప్రతి రచన తాలూకు నేపద్యాన్నీ సేకరించిన రచయిత కృషిని మెచ్చుకోవాలి. నిజానికి పతంజలికి కథల వల్ల కన్నా నవలల వల్లే ఎక్కువ పేరొచ్చింది. రాసిన కథలు కూడా తక్కువే. 'చూపున్న పాట' కథ ఎక్కువమందికి చేరింది. 'ఖాకీవనం' 'పెంపుడు జంతువులు' నవలల మీద రావిశాస్త్రి ప్రభావం మొదలు, 'రాజుగోరు' నుంచీ పతంజలి సొంత శైలి నిర్మించుకోవడం వరకూ జరిగిన పరిణామ క్రమాన్ని బాగా పట్టుకున్నారు చింతకింది. అయితే, 'కన్యాశుల్కం' స్పూర్తితో పతంజలి రాసిన వాక్యాలు అనేకం ఉన్నా, స్థలాభావం వల్ల కావొచ్చు, కొన్నింటిని మాత్రమే ప్రస్తావించారు.

పత్రికా రచయితగా పతంజలి రాసిన సంపాదకీయాలు, చేసిన ఇతర రచనల్ని గురించి చెప్పారు కానీ 'వీరబొబ్బిలి' ని 'డాగీష్ డాబ్లర్' పేరుతో ఇంగ్లీష్ చేయడాన్ని గురించిన (తన రచనే కాబట్టి అనువాదం అనకూడదు కదా) వివరాలు మోనోగ్రాఫ్ లో లేకపోవడం చిన్నలోటే. పతంజలి రాసిన కవితకి, ఇచ్చిన ఇంటర్యూలకి చోటిచ్చారు చివర్లో. అలాగే, పతంజలిని గురించి కొందరు ప్రముఖులు రాసిన ఆత్మీయ వ్యాసాలు గతంలో చదివినవే అయినా మళ్ళీ చదువుకోవడం బాగుంది. మొత్తం మీద చూసినప్పుడు, శిఖర సమానమైన పతంజలి సాహిత్య సర్వస్వాన్ని 127 పేజీల చిన్న పుస్తకంలో అద్దంలో చూపించే ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తిచేసిన చింతకింది శ్రీనివాసరావుని, చేయించిన సాహిత్య అకాడెమీని అభినందించాల్సిందే. (వెల రూ. 50, సాహిత్య అకాడెమీ స్టాల్స్ లో లభ్యం).

శుక్రవారం, అక్టోబర్ 19, 2018

ఆవరణ

"సత్యాన్ని దాచిపెట్టే మాయాజాలాన్ని ఆవరణ అనీ అసత్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నాన్ని విక్షేపమనీ అంటారు. వ్యక్తిస్థాయిలో సాగే ఈ కార్యకలాపాన్ని అవిద్య అనీ, సామూహిక, ప్రపంచ స్థాయిలో జరిగే కార్యాన్ని మాయ అనీ అంటారు. వేదాంతులు చెప్పే ఈ పరికల్పనను బౌద్ధ దార్శనికులు కూడా అంగీకరించారు.." అంటారు సుప్రసిద్ధ కన్నడ రచయిత సంతేశివర లింగణ్ణయ్య (ఎస్. ఎల్) భైరప్ప తన నవల 'ఆవరణ' కి రాసిన ప్రవేశికలో. 2007 లో తొలిసారి ప్రచురితమైన ఈ కన్నడ నవల 2015 నాటికి నలభై రెండు పునర్ముద్రణలు పొందింది. ఎమెస్కో సంస్థ ఈ ఏడాది ఏప్రిల్ లో తెలుగు అనువాదాన్ని మార్కెట్లోకి తెచ్చింది.

చరిత్ర రచనని ఇతివృత్తంగా తీసుకుని రాసిన రాసిన ఈ నవలలో రచయిత రెండు కథలని పడుగు పేకలుగా అల్లారు. మొదటిది రజియాగా మారిన కథానాయిక లక్ష్మి కథ కాగా, రెండవది చరిత్రని ఎంతో ఆసక్తితో పరిశోధించిన ఆమె తండ్రి నరసింహయ్య ఒక పుస్తకాన్ని రచించడం కోసం తయారుచేసి పెట్టుకున్న నోట్సు. రెండు కథలూ సమాంతరంగా నడిచి ఒకే సారి ముగింపుకి చేరుకునే విధంగా రూపుదిద్దడం వల్ల నవల ఆసాంతమూ ఆపకుండా చదివిస్తుంది. చదువుతున్నంతసేపూ తలెత్తే అనేకానేక ప్రశ్నల్లో చాలావాటికి నవల చివర్లో రచయిత ఇచ్చిన పుస్తకాల జాబితా జవాబుని అందిస్తుంది.

కర్ణాటకలోని కునిగళ్ ప్రాంతానికి చెందిన నరసింహయ్య కూతురు లక్ష్మి. మొదటినుంచీ తండ్రి నుంచి ప్రోత్సాహం ఉండడంతో, డిగ్రీ తర్వాత ఆమె ఫిలిం మేకింగ్ కోర్సులో చేరుతుంది. అక్కడే ఆమెకి అమీర్ పరిచయం అవుతాడు. కొన్నాళ్ళకి పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఊహించని విధంగా నరసింహయ్య ఆ వివాహానికి అభ్యంతరం చెబుతాడు. "రేపు నీకు పుట్టే పిల్లలు దేవాలయాలని ధ్వంసం చేసేవాళ్ళు అవుతారు" అంటాడు. తండ్రితో బంధం తెంచుకుని అమీర్ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది లక్ష్మి.

అమీర్ తనకి మతం మీద పెద్దగా నమ్మకం లేదనీ, కానీ తన తల్లిదండ్రుల కోసం ఆమె ఇస్లాం తీసుకోక తప్పదనీ స్పష్టంగా చెబుతాడు. కేవలం పెద్దలకోసం చేసుకోవాల్సిన సర్దుబాటు కాబట్టి ఆమె అంగీకరిస్తుంది. ఆమె ఊరివాడే అయిన అభ్యుదయవాద మేధావి వర్గానికి చెందిన ప్రొఫెసర్ శాస్త్రి లక్ష్మి నిర్ణయాన్ని అభినందిస్తాడు. రజియాగా మారి అమీర్ ని వివాహం చేసుకుంటుంది. వివాహం తర్వాత ఆమె మీద ఆంక్షలు మొదలవుతాయి. వస్త్రధారణ మొదలు, నిత్యం క్రమం తప్పకుండా నమాజు చెయ్యడం వరకూ అమీర్ ఇంటి ఆచారాలు అన్నీ పాటించాల్సి వస్తుంది. ఒకే ఒక్క ఊరట ఏమిటంటే, ఆమె సినిమాల్లో పని చేయడానికి అభ్యంతర పెట్టరు ఇంట్లోవాళ్ళు.


సృజనాత్మక రంగంలో స్త్రీలు తక్కువగా ఉన్న రోజులు కావడంతో పాటు, వాళ్ళ ఆదర్శ వివాహం కూడా ఒక ఆకర్షణగా మారి అమీర్-రజియాలకి ఎక్కువ అవకాశాలు తెచ్చిపెడుతూ ఉంటుంది. వాళ్ళకి పుట్టిన బిడ్డ నజీర్ తాతయ్య-నాయనమ్మల పర్యవేక్షణలో పెరిగి పెద్దవాడవుతాడు. బాబ్రీ మసీదు అల్లర్ల నేపథ్యంలో, ప్రభుత్వం ప్రజల మధ్య ఆవేశాలు పెరగకుండా ఉండడం కోసం కొన్ని ప్రచార చిత్రాలు నిర్మించాలని సంకల్పించి, ఆ ప్రాజెక్టుని అమీర్-రజియాలకి అప్పగిస్తుంది. మొదటి డాక్యుమెంటరీ హంపీ శిధిలాలను గురించి. హంపి శిధిలమవ్వడానికి కారణం ముస్లిం నాయకులు కాదు, శైవ-వైష్ణవ శాఖల మధ్య వైరమే అని చెప్పే విధంగా ఉండాలని ఆదేశాలు వస్తాయి. రజియా స్క్రిప్ట్ రాస్తే అమీర్ నిర్మాణం, దర్శకత్వం చూడాలి. కానీ, ఆమె స్క్రిప్ట్ రాయలేకపోతుంది.

అదే సమయంలో తన తండ్రి నరసింహయ్య మరణ వార్త తెలియడంతో సొంతూరికి ప్రయాణమవుతుంది రజియా. కూతురి వివాహం తర్వాత, నరసింహయ్య తన జీవితమంతా పరిశోధనల్లోనే గడిపాడనీ, ముఖ్యంగా హిందూ దేవాలయాల మీద జరిగిన దాడుల్ని విశేషంగా పరిశోధించి ఒక పుస్తకం రాసేందుకు నోట్సు తయారు చేసుకున్నాడనీ తెలుస్తుంది ఆమెకి. అంతే కాదు, ఇల్లు, ఆస్తి కూతురి పేరే పెట్టి మరణిస్తాడు నరసింహయ్య. తండ్రికి తాను ఏకైక సంతానం కనుక ఆస్థి నిమజ్జనం చేయాల్సిన బాధ్యత తన మీద ఉందని భావిస్తుంది రజియా. అందుకోసం, ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ లక్ష్మిగా మారుతుంది. ఆస్థి నిమజ్జనం అనంతరం తండ్రి రాసిన నోట్సు చదవడం మొదలు పెడుతుంది.

ముస్లింలు బందీలుగా పట్టుకెళ్లిన ఒక రాజపుత్రుడి కథ అది. అతన్ని నపుంసకుడిగా మార్చి, అనేక లైంగిక దాడులు చేసి, అనంతరం రాణివాసపు జనానాలో పనివాడిగా చేరుస్తారు. ఔరంగజేబు పాలనని దగ్గర నుంచి చూసిన ఆ రాజపుత్రుడి అనుభవాలు ఒక పక్క, భర్త నుంచి, కొడుకు నుంచి, ప్రొఫెసర్ శాస్త్రి నుంచి అనేకరూపాల్లో లక్ష్మి ఎదుర్కొన్న ఒత్తిడులు మరోపక్క సాగుతూ కథనాన్ని వేగంగా నడిపిస్తాయి. నజీర్ ఛాందసం, శాస్త్రి ఆలోచనలు-ఆచరణల మధ్య బోలుతనం, మతానికి, భార్యకి మధ్య అమీర్ సంఘర్షణ, తండ్రి యెడల లక్ష్మికి కలిగే పశ్చాత్తాపం ఇవన్నీ పుస్తకాన్ని ఆపకుండా చదివిస్తాయి. అరిపిరాల సువర్ణ తెలుగు అనువాదం ఏమాత్రం సాఫీగా లేదు. తాను శ్రమ పడి, పాఠకుల్ని శ్రమ పెట్టారు అనువాదకురాలు.

చరిత్రని సమగ్రంగా అర్ధం చేసుకోవాలి అంటే నాణేనికి రెండువైపులా చూడాలి అని నమ్ముతాన్నేను. నవల ప్రాతిపదికలోనే ఇది వామపక్ష దృష్టికోణపు చరిత్ర మీద ఎక్కుపెట్టిన విమర్శ అని తేటతెల్లం అవుతుంది. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టంగా చెప్పారు భైరప్ప. బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలు కావడంతో కథనం ఆసాంతమూ బిగువుగా సాగింది. మతం-రాజకీయాలు-కళలు పరిధిలోనే మొత్తం నవలంతా సాగింది. ప్రధానకథ, ఉపకథా పోటాపోటీగా సాగాయి. చరిత్రని గురించి భిన్న కోణాన్ని తెలుసుకోవాలి అనుకునే వారు తప్పక చదవాల్సిన నవల ఇది. (పేజీలు 328, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, అక్టోబర్ 15, 2018

కొత్తనీరు

మూడున్నర  దశాబ్దాల పాటు అప్రతిహతంగా కథలూ, సాహిత్య విమర్శా చేసిన రచయిత ఉన్నట్టుండి బ్రేక్ తీసుకోడంలో విశేషం లేదు. కానీ, ఆ విరామం పుష్కర కాలం పాటు సాగడమూ, అనంతరం కలంపట్టి ఒకే ఏడాదిలో ఏకంగా 22 కథలూ, వంద వ్యాసాలూ రాసేయడం మాత్రమే కచ్చితంగా విశేషమే. 'విహారి' అనే కలంపేరుతో ప్రసిద్ధులైన ఆ రచయిత పేరు జె.ఎస్. మూర్తి. ఒకే ఏడాది (2007) లో రాసిన 22 కథల నుంచి 15 కథల్ని ఎంచి 'కొత్తనీరు' పేరిట సంకలనంగా ప్రచురించారు. ఈ సంకలనంలోని కథల్లో బాగా ఆకర్షించే విషయం వస్తు వైవిధ్యం. తాను ఎప్పుడూ ఎంచుకునే మధ్యతరగతి జీవితం తాలూకు ఇతివృత్తాలే అయినా, ఏ రెండు కథావస్తువులకీ పోలిక లేకపోవడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

సంపుటంలో మొదటి కథ 'కొత్తనీరు.' వృద్ధుడైన తన తండ్రికీ, ఈ తరం ప్రతినిధులైన తన పిల్లలకీ (సంపాదనపరురాలైన కూతురు, ఇంజినీరింగ్ చదువుకుంటున్న కొడుకు)  ఇంట్లో నిత్యం జరిగే ఘర్షణని పరిష్కరించలేని ఓ నడివయసు గృహస్థు కథ. అతడికి తన తండ్రి గురించి ఎంతగాబా తెలుసో, తన పిల్లల్ని గురించి అంతకన్నా బాగా తెలుసు. వాళ్ళమధ్య సామరస్య వాతావరణం ఏర్పాటు చేయడం అన్నది తనకి సాధ్యమయ్యే పని కాదు అనే నిర్ణయానికి వచ్చేసిన సమయంలో, వృద్ధ తండ్రి సమస్యకి 'పరిష్కారాన్ని' వెతకడం ముగింపు. నిజానికి తన తండ్రి నిర్ణయం కన్నా, దాని పట్ల తన పిల్లల ప్రతిస్పందన ఆందోళనకి గురిచేస్తుంది ఆ గృహస్తుని.

సాహిత్యం తాలూకు ప్రభావం సమాజం మీద ఏరూపంలో పడే అవకాశం ఉందో చెప్పే కథ 'అవ్యక్తం.' రచయితలు తమ పాత్రలకి ఇచ్చే ముగింపుల కన్నా, మనుషులు తమకి ప్రియమైన వారి విషయంలో తీసుకునే  నిర్ణయాలు భిన్నంగా ఉంటాయని చెబుతుందీ కథ. సినీ నటుడు రంగనాథ్ జీవితం (బలవన్మరణం కాదు) ఈ కథకి కొంత స్ఫూర్తి ఇచ్చి ఉండొచ్చు బహుశా. మానవ-ఆర్ధిక సంబంధాలను మరో మారు చర్చించిన కథ 'శేషప్రశ్నలు.' ఓ నిత్య అసంతృప్త వాది కథ 'మిస్టర్ ఆక్రోశం.' ఇలాంటి వాళ్ళు అన్నిచోట్లా  కనిపిస్తూనే ఉంటారు, సామాజిక మాధ్యమాలతో సహా.


భర్త చేతిలో హింసలకు గురయ్యే ఓ ఉద్యోగిని కథ 'రెండో సముద్రం.' ఇప్పుడొస్తున్న అనేకానేక 'స్త్రీవాద' కథల్లాగే ఉంది. మామూలు కథే అయినా, కథనం ఆసక్తికరంగా సాగింది. ఈజీ మనీ వెంట తాను పరుగులు పెట్టి, కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసే వ్యక్తి కథ 'కొత్త పాఠం.' ఆ వ్యక్తి జీవితం అతని కొడుక్కి పాఠం కావడం ముగింపు. ఇక, నగరంలో ఉన్న కొడుకుని చూసేందుకు పల్లెనుంచి వచ్చిన ఓ తండ్రి కథ 'ఉభయకుశలోపరి. కథనంతో పాటు, ముగింపు కూడా చాన్నాళ్ల పాటు గుర్తుండిపోతుంది. మిఠాయి కొట్టు యజమాని ఓ వారసుణ్ణి దత్తత చేసుకోడానికి చేసుకున్న ఏర్పాట్లు ఏ మలుపు తిరిగాయో చెప్పే కథ 'రుచుల జాడ.'

మిగిలిన కథలకి భిన్నంగా సాగిన కథ 'వంకర గీతలు.' ఎక్కడా నాటకీయత కనిపించకుండా సాగే ఈ కథ చదువుతుంటే, పాఠకులు కూడా కథకుడితోపాటు సిటీ బస్సు లో ప్రయాణం చేస్తున్న అనుభూతి పొందుతారు. "ఆధునికత తెచ్చిన సాంకేతిక పరిణామాలు జీవితాలను అపారంగా వృద్ధి చేస్తున్నాయి అంటున్నారు కానీ, పూసల్లో దారం లాంటి విశ్వాసం ఏది?" అన్న కథకుడి ప్రశ్న ఆలోచింపజేస్తుంది. వృద్ధాశ్రమాల్లో ఉండే జంటల కథ 'గూడు-నీడ. ఒక్కో జంటది ఒక్కో కథ. పిల్లలు వెనక్కి పిలిస్తే బాగుండుననే ఆశతో ఎదురు చూసేవాళ్ళు కొందరైతే, పిలుపు వచ్చినా వెళ్ళడానికి ఇష్ట పడని తల్లిదండ్రులు మరికొందరు.

'సిద్ధము సుమతీ,' 'రెండర్ధాల పాట' ఈ రెండు కథలూ నిరుద్యోగ/చిరుద్యోగ సమస్యని చర్చించినవి. ప్రపంచీకరణ ఫలితంగా జాబ్ మార్కెట్లో పెరిగిన పోటీని, పల్లెటూరి నేపధ్యం నుంచి వచ్చిన యువత నగరాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఎదుర్కొనే సమస్యలనీ చిత్రించారు రచయిత. మొదటి కథలో నాయకుడికి అతన్ని పెళ్లాడబోయే యువతి సాయం అందిస్తే, రెండో కథలో మార్కెటింగ్ ఉద్యోగంలో ఇమడలేని కుర్రాడు మార్గాంతరం వెతుక్కోడానికి ప్రయత్నం చేస్తాడు. 'భూ మధ్యరేఖ' కథ ఈజీ మనీ, ఆస్థిపంపకాల ఇతివృత్తంతో సాగితే, 'ఎదురద్దాలు' ఏ కాలానికైనా సరిపోయే కథ/స్కెచ్. చివరి కథ 'భ్రష్ట యోగి' పాఠకులకి చిన్న ఉలికిపాటునీ, "ఇలాంటి వాళ్ళు మనకీ తెలుసు" అన్న భావననీ కలిగిస్తుంది.

మొత్తం మీద చూసినప్పుడు, సమకాలీన ఇతివృత్తాలని ఎంచుకొని రాసిన ఈ కథలన్నీ ఆసాంతమూ చదివిస్తాయి. కొన్ని ఆలోచింపజేస్తాయి కూడా. ఎక్కడా తీర్పులు చెప్పే పని పెట్టుకోకుండా కథలని మాత్రమే చెప్పారు విహారి. కథకులు మునిపల్లె రాజు, పోరంకి దక్షిణామూర్తి రాసిన ముందు మాటలు అచ్చంగా ఆప్తవాక్యాలే. కథా సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్లు చదవదగ్గ పుస్తకం. (పేజీలు 127, వెల రూ. 80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శనివారం, అక్టోబర్ 13, 2018

స్థానం నట జీవన ప్రస్థానం

తెలుగు రంగస్థలంతో ఏ కాస్త పరిచయం ఉన్నవారికీ కూడా స్థానం నరసింహారావుని ప్రత్యేకించి పరిచయం చేయనవసరం లేదు. "మీరజాలగలడా నా యానతి, నటవిధాన మహిమన్ సత్యాపతి" పాటని జ్ఞాపకం చేస్తే చాలు, సత్యభామ ఠీవీ ఆ వెనుకే ఆ పాత్రకి రంగస్థలం మీద ప్రాణం పోసిన స్థానం నటనా గుర్తొచ్చేస్థాయి. ఆయన నాటకాలని నేరుగా చూసిన వాళ్లకి మాత్రమే కాదు, వాటిని గురించి పరోక్షంగా విన్నవారికి కూడా చిరపరిచితుడైపోయిన నటుడు స్థానం నరసింహారావు. ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన కాలంనాటి సామాజిక, రంగస్థల పరిస్థితులు, గొప్ప నటుడిగా పేరుతెచ్చుకోవడం వెనుక ఆయన చేసిన కృషి తదితర విషయాలని వివరించే పుస్తకం ఆచార్య మొదలి నాగభూషణ శర్మ రాసిన 'నటకావతంస స్థానం నరసింహారావు నట జీవన ప్రస్థానం.'

గుంటూరు జిల్లా బాపట్ల లోని ఒక పేద కుటుంబంలో 1902 సెప్టెంబరు 23న జన్మించిన స్థానం నరసింహారావు కుటుంబ పరిస్థితుల కారణంగా హైస్కూలు చదువుని కూడా పూర్తి చేయలేక పోయారు. బాల్యంలో సంగీతంలోనూ, చిత్రలేఖనంతోనూ కొద్దిపాటి పరిచయం కలిగింది. తన పద్ధెనిమిదో ఏట తండ్రి హఠాత్తుగా మరణించడం, వెనువెంటనే పెద్దకొడుకుగా కుటుంబ బాద్యత భుజాల మీద పడడంతో తల్లి అభీష్టానికి విరుద్ధంగా నటుడిగా మారారు స్థానం. నిజానికి ఆయన వేసిన మొట్టమొదట వేసింది స్త్రీ వేషమే. 'సత్య హరిశ్చంద్ర' నాటకంలో చంద్రమతి పాత్ర. చామనచాయ రంగులో, పీలగా, పొట్టిగా ఉండడంతో ఆయన్ని స్త్రీ పాత్రకి ఎంపిక చేశారట. రెండేళ్లు తిరిగేసరికల్లా నాటి నాటక సమాజాలన్నీ స్థానం రాక కోసం ఎదురు చూశాయంటే నటుడిగా ఆయన శ్రద్దాసక్తులు, తనని తాను మెరుగుపరుచుకున్న విధానాన్ని ఊహించవచ్చు.

ఆచార్య మొదలి నాగభూషణ శర్మ సాహిత్య విమర్శకుడు మాత్రమే కాక, రంగస్థల నటుడు, రచయిత, విమర్శకుడు కూడా కావడంతో ఈ పుస్తకంలో కేవలం స్థానం జీవిత విశేషాలని మాత్రమే కాక ఆంధ్రదేశంలో నాటి రంగస్థల పరిస్థితులనీ వివరంగా పొందుపరిచారు. వృత్తి నాటక సమాజాలు పోటాపోటీగా నాటకాలు ప్రదర్శించే రోజులు కావడం, స్త్రీ పాత్రలకి అన్నివిధాలా సరిపోయే నటులు దొరకడం అరుదైపోవడం ఒకవైపు, ఇతరత్రా వ్యాపకాల జోలికి పోకుండా క్రమశిక్షణతో నటనమీదే దృష్టి పెట్టి పాత్రకి న్యాయం చేయడం కోసం తపించే స్థానం దీక్షాదక్షతలు మరో వైపు - ఈ రెండింటి కలగలుపే స్థానాన్ని తక్కువ సమయంలోనే అగ్రశ్రేణి నటుడిగా నిలబెట్టింది అంటారు నాగభూషణ శర్మ.


నటనలో తన లోటుపాట్లని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడడం మాత్రమే కాదు, తాను పోషిస్తున్న పాత్ర స్వరూప స్వభావాలని అర్ధం చేసుకుని తదనుగుణంగా ఆహార్యం మొదలు వాచికం వరకూ పాత్రలో పరకాయ ప్రవేశానికి తపన పడడం స్థానం నరసింహారావుని ఆయన సమకాలీన నటులలో ప్రత్యేకంగా నిలబెట్టింది అంటారు రచయిత. సంగీతంతో పరిచయాన్ని ఉపయోగించుకుని పాత్రానుగుణమైన పాటల్ని రాసుకుని స్వరపరుచుకోవడం మొదలు (అలా పుట్టిన పాటల్లో ఒకటి 'మీరజాలగలడా') చిలేఖన విద్య సాయంతో వేషానికి మెరుగులు దిద్దుకోవడం, దుస్తులు, ఆభరణాల విషయంలో ఎక్కడా రాజీ పడకపోవడం ఇవన్నీ తన మూడున్నర దశాబ్దాల నటజీవితంలో ఆసాంతమూ పాటించారు నరసింహారావు.

దేశవిదేశాల్లో లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చి, అనేక సన్మానాలు, బిరుదులూ అందుకున్న నటుడికి సహజంగానే ఆ విజయం తలకెక్కాలి. కానీ, స్థానం విషయంలో అలా జరక్కపోవడానికి కారణం తొలినాళ్లలో జరిగిన ఒక సంఘటన అంటారు నాగభూషణ శర్మ. తొలిసారి బంగారు పతకం అందుకున్న తర్వాత, నాటకం పాంఫ్లెట్ లో తన పేరు పక్కన గోల్డ్ మెడలిస్ట్ అని రాయించుకోడమే కాక, ప్రదర్శనలో యశోద వేషం వేసి బంగారు పతకాన్ని కూడా ధరించారట. నాటకం ఆసాంతమూ గోల్డ్ మెడల్ ని ప్రేక్షకుల దృష్టిలో పడేలా చేసే ప్రయత్నంలో పాత్ర మీద, నాటకం మీద ఏకాగ్రత చూపలేకపోయారట. అప్పటివరకూ మెచ్చుకున్న వారే, ప్రదర్శన అనంతరం తీవ్రంగా విమర్శించడంతో మరెన్నడూ తన మెడల్స్ ని ప్రదర్శించలేదట.

ఇది కేవలం స్థానం నరసింహారావుని అభినందిస్తూ రాసిన పుస్తకం కాదు. స్త్రీపాత్రలలో రాణించినంతగా పురుష పాత్రల్లో పేరు తెచ్చుకోలేక పోవడం, రంగస్థలం మీద విజయం సాధించినా, సినిమాలలో రాణించక పోవడం లాంటి విషయాలనీ విశదం గానే రాశారు రచయిత. సత్యభామ, రోషనార, చిత్రాంగి, మధురవాణి పాత్రల విశేషాలని, స్థానం నటనపై వచ్చిన సమీక్షలనీ వివరిస్తూనే, నాటి నాటక సమాజాల పోటీ వాతావరణం, నటుల మధ్య స్పర్ధలు లాంటి విషయాలని కూడా సందర్భానుసారం ప్రస్తావించారు. కేవలం స్థానం నరసింహారావు నట జీవితాన్ని మాత్రమే కాక, తెలుగు రంగస్థలం పరిణామ క్రమాన్నీ వివరించే రచన ఇది. (కళాతపస్వి క్రియేషన్స్ ప్రచురణ, పేజీలు 146, వెల రూ. 200, స్థానం నరసింహారావు పాటల సీడీ ఉచితం, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులలోనూ లభ్యం).

శుక్రవారం, అక్టోబర్ 12, 2018

రెండు బంట్లు పోయాయి

చాసోకి శిష్య సమానుడూ, 'ఓన్లీ పతంజలి'కి గురు సమానుడూ అయిన ఉత్తరాంధ్ర కథా రచయిత పూసపాటి కృష్ణంరాజు. రాసిన కథలు నాలుగు పుంజీలకి మించకపోయినా, వాసికెక్కిన కథలవ్వడం చేత అనేకానేక కథా సంకలనాల్లో చోటు సంపాదించేసుకున్నాయి. కథలన్నీ విజయనగరం నేపథ్యంలోనూ, వాటిలో సింహభాగం క్షత్రియ కుటుంబాల్లోని పాత్రలతోనూ సాగుతాయి. 'దివాణం సేరీ వేట,' 'కుక్కుట చోరులు' తో పాటుగా నాకిష్టమైన మరో కథ 'రెండు బంట్లు పోయాయి.' చదరంగం బల్ల దగ్గర మొదలయ్యే ఈ కథ నడక ఆసాంతమూ చదరంగపుటెత్తుల్లాగే సాగుతుంది. అలాగని శ్రీపాద వారి 'వడ్ల గింజలు' తో ఎలాంటి పోలికా ఉండదు.

నిజానికి ఇదో పెళ్లి కథ. చంద్రం గారి కుమార్తె లక్ష్మీదేవిని శ్రీ రాజా కలిదిండి నీలాద్ధిర్రాజు గారి సుపుత్రుడు వరహాలరాజు ఎమ్.ఏ. కి ఇచ్చి చంద్రంగారి స్వగృహంలో వివాహం జరిపించాలని నిశ్చయించారు పెద్దలు. పొరుగూళ్ళలో ఉన్న బంధువులందరికీ మర్యాదపూర్వకంగా పిలుపులందాయి. పిలుపు అందుకున్న వారిలో 'తాతగారు' కూడా ఉన్నారు. తాతగారు ఎక్కడ ఉన్నా వెంట చదరంగం బల్ల ఉండాల్సిందే. ఆయనతో చదరంగం ఆడే అవకాశం కోసం ఆబాలగోపాలమూ ఎదురుచూస్తుంది అనడం అతిశయోక్తి కాదు. శుభలేఖ వచ్చే సమయానికి చదరంగం బల్ల ముందే ఉంటారు తాతగారు, వారి సన్నిహితులూను. అప్పటికప్పుడే ఓ మాట అనుకుని పెళ్ళికి ప్రయాణమవుతారు.

శుభలేఖ తెచ్చిన ఇద్దరు కుర్రాళ్ళ లోనూ ఒకడు శంకరం. పెళ్లికుమార్తెకి మేనబావ. కొన్నాళ్ల క్రితం వరకూ చంద్రం గారు అతన్నే అల్లుడిగా చేసుకుంటారని కూడా బంధువర్గం భావించుకుంది. కారణం తెలీదు కానీ, ఎమ్మే చదువుకుని, మదరాసులో ఏదో పనిచేస్తున్న ఆస్థిపరుడైన వరహాలరాజిప్పుడు వరుడయ్యాడు. మగ పెళ్ళివారు రావడంతోనే విడిదింట్లో మర్యాదలు మొదలయ్యాయి. ఇరువర్గాలూ చేతులు చాచి ఒకరినొకరు ఆహ్వానించుకుని, దయచేయండని గౌరవించుకున్నారు. "తలపాగాలు చుట్టుకుని తిలకం దిద్దుకొని ఠీవిగా ఉన్న రాజులంతా మీసాలు సరిజేసుకుంటూ, ఇస్త్రీ మడతలు నలక్కుండా విడిదిలో వేసిన తివాసీ మధ్యకు నెట్టి మర్యాదగా అంచులమీద ఒకరొకరు అంటీ  ముట్టకుండా జరిగి కూర్చున్నారు."వంటకాలన్నీ రుచిగానే ఉన్నా తాతగారికెందుకో ఈ శాకాహారం పడినట్టు లేదు. "ఏమిటో మొగ పెళ్ళివారు కొంచం తక్కువ కనిపిస్తున్నారు తాతా" అన్నారు మనవడి (కథకుడి)తో. "దూరంనుంచి కదా" అన్న జవాబు వారికి నచ్చలేదు. "అదేవిటి! మా రోజుల్లో మాత్రం దూరపు చుట్టరికాలు చెయ్యలేదూ? చినబాబు పెళ్ళికి కొప్పాక ముప్ఫయి కార్లలోనూ ఇరవై బస్సులలోనూ జిల్లా సరిహద్దుకు తరలి వెళ్ళేం. ఆ సప్లైలేమిటి? ఆ మర్యాదలేమిటి?" అనేశారు గతాన్ని గుర్తు చేసుకుంటూ. తెల్లవారుతూనే పెళ్లి ముహూర్తం. పెళ్ళరుగు పక్కనే కుర్చీలో తాతగారూ, వారికి ఎదురుగా చదరంగం బల్లా. పై ఎత్తులు వేయడానికి వధువు తాతగారు ఎదురుచూస్తున్నారు. ఆటా, పెళ్ళి తంతూ దాదాపు ఒకేసారి మొదలయ్యాయి. ఆట రసకందాయంలో పడే సమయానికే, పెళ్లి మండపంలోనూ అలాంటి పరిస్థితే సంభవించింది.

చంద్రంగారు ముహూర్తం సమయానికి సర్దుబాటు చేస్తానన్న కట్నం తాలూకు పాతికవేలూ సర్దలేకపోయారు. తప్పకుండా ఇస్తానని చెబుతున్నా పెళ్ళికొడుకు వినిపించుకోలేదు. "అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలన్నారు. అదేదీ పనికిరాదు. గతిలేకపోతే మానుకోవాలి. ముందు డబ్బు పడితేనే శుభకార్యం జరుగుతుంది. అంతే" అంటూ పీటలమీద నుంచి లేచి పెళ్లరుగు దిగిపోయాడు వరహాల రాజు. "వీడు రాచపుట్టుకే పుట్టాడా!" అనుకున్నారు తాతగారు. వధువు పితామహుడికి కట్నం ప్రసక్తే తెలియదు. చంద్రంగారి తమ్ముడు ఉగ్రరూపం దాల్చాడు. పెళ్లింటి నాలుగు తలుపులూ మూయించేశాడు. ఊరుకాని ఊరు, పైగా బలగం తక్కువ. ఏం చేస్తారు మగపెళ్లివారు? పెళ్లికుమార్తె పినతండ్రిగారు, మేనమామ గారూ కలిసి పెళ్ళికొడుకుని అమాంతం ఆకాశం మీదకెత్తి ఒక్క కుదుపుతో పెళ్ళిపీటల మీద కూర్చోపెట్టారు.

"ఏవిటీ కంగాళీ చట్రం" అని తాతగారు అనుకునేలోపే మరో గొడవ. ఈసారి పెళ్లి కుమార్తె లేచి నిలుచుంది. పెళ్లికుమారుడు ముఖం మీద తెరపట్టిన శాలువా విసిరికొట్టింది. అందర్నీ తలెత్తి ధైర్యంగా చూసి, ఒక్క తృటిలో గిరుక్కున తిరిగి ఆరేడు గది తలుపులు తోసుకుని వెళ్లి పేరంటాళ్ళ మధ్య పడింది. ఆమెననుసరించి తల్లిగారు కూడా వెళ్లిపోయారు. "ఏమిటీ దొమ్మరిమేళం! వెధవ సంత! యిది పెళ్లేనా!" అనుకున్నారు తాతగారు. "చూడండి బాబూ ముహూర్తం దాటిపోతోంది" అన్నారు సిద్ధాంతి గారు. వధువు తరపున దాసీ చిట్టెమ్మ జబర్దస్తీగా తెచ్చిన కబురేమిటో, తాతగారి చదరంగ బలగంలో రెండు బంట్లు (రెండే, బంట్లే) పోయిన వైనమేమిటో తెలియాలంటే 'రెండు బంట్లు పోయాయి' కథ చదవాలి. (అభ్యుదయ రచయితల సంఘం ప్రచురించిన 'కథాస్రవంతి' సిరీస్ లో 'పూసపాటి కృష్ణంరాజు కథలు' సంపుటిలో (కూడా) ఉందీ కథ).

గురువారం, అక్టోబర్ 11, 2018

ఇడియట్ - ఓ గొలుసు నవల

ముగ్గురు రచయితలు కలిసి ఓ గొలుసు నవల రాశారు. ఆ రచన 'ఆంధ్రజ్యోతి' లో సీరియల్ గా వచ్చింది, ఇప్పటికి సరిగ్గా యాభయ్ ఏళ్ళ క్రితం. దయగల ప్రచురణ కర్తలు ఓ రెండేళ్ల క్రితం ఆ నవలని మళ్ళీ ప్రచురించారు, నాటి మరియు నేటి పాఠకుల కోసం. నవల పేరు 'ఇడియట్.' రాసిన ముగ్గురూ సాహిత్య జీవులే కాక వేర్వేరు రంగాల్లో పేరు సంపాదించుకున్న వాళ్ళు కావడం విశేషం. పత్రికా సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ, సినీ రచయిత, నటుడు గొల్లపూడి మారుతి రావు, నవలా రచయితగానే కాక వైద్యుడిగానూ పేరు తెచ్చుకున్న కొమ్మూరి వేణుగోపాల రావు కలిసి రాశారీ నవలని.

'ఇడియట్' కథని ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో మధ్యతరగతి మందహాసం. ఆర్ధిక సమస్యలతో పాటు విలువల విషయంలో నిత్యం సంఘర్షణకి గురయ్యే ఈ వర్గంలోని కొన్ని కుటుంబాలలో ఒక దశాబ్ద కాలంలో జరిగిన పరిణామాలని రికార్డు చేసిన నవల. క్లుప్తంగా కథ చెప్పుకోవాలంటే రావుగారు రంగమ్మలది కలహాల కాపురం. రంగమ్మ తండ్రికి రావుగారితో కొన్ని విభేదాలు ఉండి, కక్ష తీర్చుకోడం అతనిగురించి వ్యతిరేకంగా నూరిపోస్తాడు కూతురికి. కలిసి కాపురం చేస్తున్నా తండ్రి ఎప్పుడో చెప్పిన మాటలు నాటుకుపోయిన రంగమ్మ, రావుగారితో శత్రుభావంతోనే ఉంటుంది. వాళ్లకి ముగ్గురు పిల్లలు. వీళ్ళతో పాటు రావుగారి చెల్లెలి కుటుంబం, ఆయన ఇంట్లో పొరుగు వాటాల్లో అద్దెకి ఉండే వాళ్ళ కథలూ సమాంతరంగా నడుస్తాయి.

మొత్తం 288 పేజీల నవల్లో మొదటి వంద పేజీలూ పురాణం సుబ్రహ్మణ్య శర్మ రాశారు. పాత్రల్ని పరిచయం చేసి, కథకి ఓ ముడి వేశారు. తర్వాత అందుకున్న గొల్లపూడి మారురుతిరావు ఓ 126 పేజీలు రాసి, వీలైనన్ని చిక్కుముడులు వేసి, ముగించే బాధ్యతని కొమ్మూరి వేణుగోపాల రావుకి అందించారు. కేవలం 62 పేజీలు మాత్రమే తీసుకున్న కొమ్మూరి పాత్రల్ని సమస్యలనుంచి వీలైనంత బయటికిలాగి కథని ముగింపు తీరానికి చేర్చారు. పాఠకుల సౌలభ్యం కోసం ప్రచురణ కర్తలు ఏ రచయిత ఏ భాగం రాశారన్న వివరం ఇచ్చారు. ముగ్గురి రచనలలోనూ పరిచయం ఉన్న పాఠకులు మాత్రం విడివిడిగా పేర్లు లేకపోయినా ఎవరిదే భాగమో సులువుగానే పోల్చుకోగలరు.


పురాణం రచనల్లో ఒకలాంటి ఆవేశమూ, ఒక నిర్లిప్తతా కూడా సమపాళ్లలో కనిపిస్తూ ఉంటాయి. సరిగ్గా ఈ నవల మొదట్లో పాత్రల స్వభావాలు కూడా అవే. ఎన్నో సమస్యలు చుట్టూ ఉన్నా, వాటినుంచి తప్పించుకుని వీలైనంత కులాసాగా బతికేసే ప్రయత్నం చేస్తూ, మళ్ళీ అంతలోనూ అలా ఉండాల్సి వచ్చినందుకు మధన పడుతూ ఉంటాయి. రావుగారి టీనేజీ కూతురు శ్యామల నిత్యం నవలలు చదువుకుంటూ, నవలా నాయకులతో కలల్లో విహరిస్తూ ఉంటే, పెద్దకొడుకు కృష్ణ తన క్లాస్ మేట్ కుసుమతో ప్రేమలో ఉంటాడు. చిన్న కొడుకు మోహన్ బడి ఈడువాడు. వీళ్ళతో పాటు రావుగారి చెల్లెలు డిసిప్లిన్ అత్తయ్య, చుట్టూ వాటాల్లో అద్దెకి ఉండే జగదాంబ, రుక్కు తల్లి, సామ్యూల్ కుటుంబాలతో పాటు, రావుగారూ నిత్యమూ పరిశీలించే మేదరి కుటుంబం పరిచయమూ ఉంటుంది. కుసుమ తండ్రి హఠాన్మరణంతో మొదటిభాగం ముగుస్తుంది.

సంప్రదాయ చట్రాన్ని దాటేందుకు ఇష్టపడనట్టుగా అనిపించే రచయిత గొల్లపూడి మారుతిరావు చేపట్టిన రెండో భాగంలో కృష్ణ తన ఇంటిని విడిచిపెట్టి కుసుమతో సహజీవనం మొదలు పెడతాడు. నిజానికి రావుగారికి పెద్దకొడుకు ఎంతో అవసరమైన సమయం అది. కానీ, తన ఇంటి విషయం కృష్ణకి పట్టదు. తమ్ముడు మోహన్ మీద కోపంతో ఒక నాటకీయంగా సందర్భంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డ శ్యామల అతనివల్ల మోసపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. ఆమెని తన స్నేహితుడైన ఓ రోజుకూలీకి ఇచ్చి పెళ్ళిచేస్తాడు కృష్ణ. మోహన్ అల్లరి చిల్లర తిరుగుళ్ళకి, వ్యసనాలకీ అలవాటు పడి, డిసిప్లిన్ అత్త కూతురు నర్సుని ప్రేమ పేరుతో మోసం చేసి రెడ్ లైట్ ఏరియా లో అమ్మేసేందుకు సిద్ధ పడతాడు. రావుగారు పక్షవాతం బారిన పడడం, కుసుమ పిన్ని కనకలత తన గతాన్ని ఆయనకి వివరించడంతో ఈ భాగం పూర్తవుతుంది. 

అతితక్కువ నాటకీయతతో జీవితానికి దగ్గరగా ఉండే రచనలు చేసిన రచయితగా పేరు పొందిన కొమ్మూరి వేణుగోపాల రావు రాసిన భాగంలో రంగమ్మ గతం, కృష్ణ-కుసుమ మధ్య గొడవలు, మోహన్ అతివాదిగా మారడం, శ్యామల కష్టాల మీదుగా నడిచి కథ మొదలైన రావుగారి ఇంటి సన్నివేశంతోనే ముగుస్తుంది. నవల మొత్తంలో 'ఇడియట్' ఎవరు అన్న ప్రశ్న అనేకసార్లు కలుగుతుంది పాఠకులకి. ఒక్కో రచయిత రాసిన భాగంలోనూ ఒక్కో పాత్ర ఇడియట్ అనిపిస్తుంది. నిజానికి ప్రతి పాత్రా ఏదో సందర్భంలో ఇడియట్ లా ప్రవర్తించిందే. యాభయ్యేళ్ళ కాలంలో మధ్యతరగతి విలువల్లో వచ్చిన మార్పుని తెలుసుకోడానికి ఉపయోగపడే నవల ఇది. అంతే కాదు, ముగ్గురు రచయితలూ ఎవరికి వారే పూర్తి నవలగా రాస్తే ఎలా ఉండేదో ఊహించుకోడానికి మంచి అవకాశం కూడా. (సాహితి ప్రచురణలు, వెల రూ. 125, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).