శుక్రవారం, డిసెంబర్ 23, 2022

నవరస నట సార్వభౌమ ...

గుణచిత్ర నటుడు అనే తెలుగు అనువాదం కన్నా కేరక్టర్ ఆర్టిస్ట్ అనే ఇంగ్లీషు మాటే సులువుగా అర్ధమవుతుంది. అంతకన్నా కూడా 'కైకాల సత్యనారాయణ' అనే పేరు చెబితే చాలు చెప్పదల్చుకున్నది ఏ విషయాన్ని గురించో మరింత సులభంగా బోధ పడుతుంది. నటులు చాలామందే ఉండొచ్చు. కానీ తెరమీద తాను పోషించిన పాత్ర తప్ప తాను కనిపించకపోవడం అన్నది కొందరికే సాధ్యం. తెలుగు సినిమా వరకూ ఆ కొందరిలో తప్పక ఉండే పేరు కైకాల సత్యనారాయణ. 'నవరస నట సార్వభౌమ' బిరుదు ఎవరిచ్చారో తెలియదు కానీ, కైకాల విషయంలో అది అక్షర సత్యం. ప్రేక్షకలోకం 'సత్తిగాడు' అని ముద్దుగా పిలుచుకునే ఈ నటుడు ఏడొందల పైచిలుకు సినిమాల్లోనూ తానుగా ఎక్కడా తెరమీద కనిపించలేదు, ఆయా పాత్రలు మాత్రమే కనిపించాయి. 

సత్యనారాయణ విలన్ గా వెలిగిన కాలం బహు ప్రత్యేకమైనది. హీరో ఎవరైనా కావచ్చు, విలన్ మాత్రం తనే. రకరకాల మేకప్పులు, మేనరిజాలు, వాటిల్లో పునరుక్తులు తప్పించడానికి ప్రయత్నాలు.. విలన్ వేషం ఎవరు వేసినా సినిమా చివరికి గెలుపు హీరోదే అని ప్రేక్షకులకి ముందే తెలిసినా, సినిమా చూస్తున్న వాళ్ళకి విలన్ మీద కోపం పెరిగే కొద్దీ హీరోకి మైలేజీ పెరుగుతుందన్నది వెండితెర సూత్రం. అలా విలన్లందరూ తమని తాము తగ్గించుకుని హీరోని హెచ్చింపజేస్తూ ఉంటారు. రచయితలు రాసిన పాత్ర బలానికి తోడుగా, సత్యనారాయణ నిండైన విగ్రహం, స్పష్టమైన ఉచ్చారణ, భావాలని పలికించే కళ్ళు.. ఇవన్నీ ఆ హెచ్చింపుకి మరింత బాగా దోహదం చేశాయి. ఒకానొక సమయంలో తెలుగు తెరకి మోస్ట్ వాంటెడ్ విలన్ అవడంలో ఆశ్చర్యం లేదు. 

విలనీ తర్వాత చెప్పుకోవాల్సినవి కామెడీ వేషాలు. జుట్టు నుదుటిమీదకి దువ్వి డిప్ప కటింగ్ చేస్తే అది 'సత్తిగాడి హెయిర్ స్టయిల్'. ఆ గెటప్ లో సత్యనారాయణ ని చూడగానే నవ్వొచ్చేసేది. 'ఈ మనిషిలో సహజసిద్ధంగానే ఓ పాలు అమాయకత్వం ఉందేమో' అని సందేహం కలిగేంతగా ఆ పాత్రలు పండేవి. ఆ హెయిర్ స్టైల్ కి తోడు చిత్ర విచిత్రమైన కాస్ట్యూమ్సు. ఆ గెటప్ లో సత్యనారాయణని చూస్తూ సీరియస్ గా నటించాల్సి రావడం మిగిలిన నటీనటులకు ఎంత పరీక్షో కదా. ఇక, సత్యనారాయణ వేసినన్ని 'ఎస్ బాస్' వేషాలు ఇంకెవరూ వెయ్యలేదేమో. అలా విలన్ డెన్ లో 'ఎస్ బాస్' అంటూనే, కనుబొమ పైకెత్తి ప్రేక్షకులవైపు సాలోచనగా చూశాడంటే, ఆ సినిమాలో సత్యనారాయణ విలన్ని ముంచెయ్యబోతున్నట్టే. 

Google Image

తెల్లపంచె, లాల్చీ వేసుకుని తండ్రి/తాత వేషం ధరిస్తే కరుణామూర్తి అన్నట్టే. ఇలాంటి వేషాలున్న రెండు మూడు సినిమాలు తెలుగేతరులకి చూపించి, ఆ తర్వాత ఇతను క్రూరమైన విలన్ గా ఫేమస్ తెలుసా?' అంటే వాళ్ళు నమ్మకపోవచ్చు. పాత్రలోకి పరకాయ ప్రవేశం అంత సులువుగా ఎలా సాధ్యపడుతుంది అని ఆశ్చర్య పరిచిన సందర్భాలు ఎన్నో. ఒక్క సాంఘికాలు మాత్రమే కాదు, పౌరాణికాలు, జానపదాలు కూడా ఉన్నాయి తన ఖాతాలో. 'యమగోల' లోనూ 'యమలీల' లోనూ యముడి వేషమే అయినా, ఇద్దరు యముళ్ళకీ పోలిక కనిపించదు. అసలు ఆ వైవిధ్యం కోసం చేసిన నిరంతర పరిశ్రమే సత్యనారాయణని అన్నాళ్ళు సినిమా రంగంలో బిజీగా ఉంచిందేమో. 

అందరిలాగే హీరో అవుదామని సినిమా పరిశ్రమకి వచ్చినా, గిరిగీసుకుని ఉండిపోకుండా, వచ్చిన అవకాశాల్లోనే తనని తాను నిరూపించుకుని ఏ ఒక్క ముద్రా, మూసా తనమీద పడకుండా కెరీర్ ని కొనసాగించిన ఘనత సత్యనారాయణది. 'ప్రతి అవార్డుకీ ఓ లెక్కుంటుంది' అనే మాట నిజమేనేమో అనిపించడానికి సత్యనారాయణకి చెప్పుకోదగ్గ అవార్డులేమీ రాకపోవడం కూడా ఓ ఉదాహరణ. రాజకీయాల్లోనూ, సినిమా నిర్మాణంలోనూ ప్రవేశించినా, నటనే తన ఫుల్ టైం ప్రొఫెషన్ గా కెరీర్ కొనసాగించారు. వయోభారంతో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా వేషాలు తలుపు తట్టాయి. నిండైన జీవితాన్ని, నట జీవితాన్నీ చూసిన నవరస నట సార్వభౌముడు తెలుగు ప్రేక్షకులకి కొన్ని తరాల పాటు జ్ఞాపకం ఉంటాడు. సత్యనారాయణ ఆత్మకి శాంతి కలగాలి. 

9 కామెంట్‌లు:

  1. బాగా వ్రాశారు. సత్యనారాయణ గారి నటన సహజం గా ఉంటుంది. ఆయన అమాయక పాత్రల్లో భలే నటించేవారు. యముడి వేషంలో కూడా ఇన్నోసెన్స్ చూపించడం గ్రేట్. సత్యనారాయణ, రావు గోపాలారావు, అల్లు రామలింగయ్య వీరు ముగ్గురు కలిసి ఉన్న సీన్స్ అద్భుతంగా ఉంటాయి.లెజెండ్.

    రిప్లయితొలగించండి
  2. // “నవరస నట సార్వభౌమ” // .. ఏమాత్రం అతిశయోక్తి లేదు.
    తెలుగు సినీరంగ చరిత్రలో ముగిసిన మరో అధ్యాయం 🙏.

    రిప్లయితొలగించండి
  3. NTR, SVR లతో సమంగా నటించగల నటుడు కైకాల. NTR లాగ చాలా పౌరాణిక పాత్రలు, SVR లాగ విలన్/కేరక్టర్ వేషాలు మేసి జనాల్ని మెప్పించగలిగారు. BTW, కేరక్టర్ అర్టిస్ట్ అనే పదం లేదండి నాకు తెలిసినంతవరకు. గుణచిత్ర నటుడు అన్న పదం కూడా ఎక్కడా విన్లేదు. కేరక్టర్ ఏక్టర్ లేదా సపోర్టింగ్ ఏక్టర్ అంటారు. తెలుగులో సహాయ నటుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తొలిరోజుల్లో బాగా చేసినా, హీరోయిజం ఆవహించాక ఎంటీఆర్ నటన లౌడ్ గా మారిపోయింది అనిపిస్తుందండీ.. సత్యనారాయణ చివరి వరకూ సటిల్డ్ గానే చేశారు. ఎస్వీఆర్ కి దొరికినన్ని వైవిధ్యభరితమైన పాత్రలూ సత్యనారాయణకీ దొరికాయి.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
    2. రానురాను ntr నటన unbearable ఐపోయిన మాట వాస్తవం.

      తొలగించండి
    3. దీనిమీద ఒక జోక్ కూడా అప్పట్లో చదివేను. ఒకాయన అదే పనిగా ఏఎన్ఆర్‌ని ఆయన నటనని/సినిమాల్ని దుయ్యబడ్తూ తిడుతుండేవాడుట. అతని స్నేహితుడు "మరి ఎన్‌టీఅర్ కూడా అలాంటి సినిమాలే చేస్తున్నాడుకదా ఆయన్నెందుకు తిట్టట్లేద"ని అడిగితే, ఏఎన్ఆర్‌ని తిడితే అయినా బాగుపడతాడని ఒక ఆశ ఉంది. ఎన్‌టీఅర్ విషయంలో అది కూడా లేదు అన్నాడట ఆ పెద్ద మనిషి.

      తొలగించండి
  4. అన్నట్టు, 'నంది' అవార్డులు ఇచ్చే రోజుల్లో కేరక్టర్ యాక్టర్స్ కి 'గుణచిత్ర నటుడు/నటి' విభాగంలో అవార్డులు ఇచ్చే వారండీ.. 

    రిప్లయితొలగించండి