![]() |
| (Google Image) |
నేను క్రమం తప్పకుండా చదివే ఓ కాలమ్ లో "దొండపాదు బాగా కాస్తోందిటనా? విత్తనాలు తీసుకెళ్లారుగా?" అని చదివి ఉలిక్కి పడ్డాను. సరిగ్గానే చదివేనా? అని సందేహ పడి, కళ్ళు నులుముకుని మళ్ళీ చూసినా అక్షరాలు మారలేదు. ఆనప, గుమ్మడి లాంటి పాదులు విత్తనాల నుంచి మొలుస్తాయి. కానైతే, దొండపాదు కోసం నాటాల్సింది దొండ వేరు. చిన్న వేరు ముక్క పాతి, కాస్త పందిరేసి, తీగ ఎగబాకే వరకూ జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఆపైన వద్దన్నా కాయలు కాస్తూనే ఉంటాయి. మిగిలిన పాదులతో పోలిస్తే, దొండ కాస్త మొండి జాతి. పోషణ పెద్దగా లేకపోయినా హాయిగా బతికేస్తుంది, కాపులో ఏమాత్రం తేడా పెట్టదు. ఇంకా చెప్పాలంటే, 'చాలమ్మా తల్లీ' అని బతిమాలినా కూడా ఆపకుండా కాసేస్తుంది దొండపాదు.
అమ్మకూడా అంతే, 'వద్దమ్మా తల్లీ' అన్నా వినకుండా వారంలో కనీసం రెండు మూడు రోజులు దొండకాయ వండేసేది. ఎక్కువగా దొండకాయ, కొబ్బరి కోరు కూర, తప్పితే బెల్లం పెట్టిన కూర. "దొండకాయ ఎక్కువగా పెడితే పిల్లలు మందబుద్ధులవుతారు" అనేది మా బామ్మ, విస్తట్లో దొండకాయ కూరని, పక్కన కూచున్న నన్నూ మార్చి మర్చి చూస్తూ. అమ్మ విననట్టుగా ఊరుకునేది. "ఎప్పుడూ కూరేనా? చక్కగా వేపుడు చేయచ్చు కదా?" అనేది నా ఘోష. 'చక్రాల వేపుడు' అని పాడుతూ ఉండేవాడిని. అంటే, దొండకాయని చక్రాలుగా కోసి చేసే వేపుడన్న మాట. మామూలుగానే ఇంట్లో వేపుళ్ళు తక్కువ. వేపుడు వేయిస్తే చిన్న సైజు పండగ మాకు. ఎప్పుడన్నా బంగాళా దుంపలన్నా వేయించేది కానీ, దొండకాయ మాత్రం కూరే. "వెధవ దొండకాయలు గంటసేపు వేగుతాయి" అనేది.
అచ్ఛం ఇదే మాట డాక్టర్ సోమరాజు సుశీల గారి అమ్మగారు సరోజిని గారి నోటి వెంట విన్నాను 'ఇల్లేరమ్మ కతలు' లో. ఇల్లేరమ్మ (సుశీల ముద్దుపేరు) వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర రావు, గృహసంబంధ విషయాలేవో మాట్లాడడానికి సరోజిని గారిని పిలవడం, ఆవిడేమో దొండకాయలు, కత్తిపీట, రెండు పళ్లాలతో రావడాన్ని వర్ణించారు 'పిల్లేటి సొగసులు' కథలో. రెండు పళ్ళాలు ఎందుకంటే, "అమ్మ ముచికలు కూడా నేలమీద తరగదు, వాటికో ప్లేటు పెడుతుంది." ఎంతటి పనిమంతురాలావిడ!! "నే ఎప్పుడు పిలిచినా కత్తిపీటతో సహా వస్తావేవిటే హడలిపోయేలాగా" అని నాన్నంటే, "ఏమో! ఎవరి జాగ్రత్త వాళ్ళది. ఈ వెధవ దొండకాయలు గంటసేపు తరగాలి. రెండు గంటల సేపు వేయించాలి. అయినా మీతో చేతులు కబుర్లు చెప్పవుగా!" అంటారు అమ్మ.
దండిగా కాసే దొండకాయలు మాకు మాత్రమే కాదు, 'కన్యాశుల్కం' కరటక శాస్త్రులు గారికి కూడా సమస్య అయి కూర్చున్నాయి పాపం. "వర్ణ ప్రకర్షే సతికర్ణి కారం! ధునోతినిర్గంధ తయాస్మి చేతః !!" పాఠం చదువుకుంటుంటున్న మహేశం, "ఆ పువ్వేదో కవికిష్టం లేదట. యిష్టం లేకపోతే ములిగిపోయింది కాబోలు? మా గురువుగారికి దొండకాయ కూర యిష్టం లేదు. గురువుగారి పెళ్ళాం పెరట్లో దొండపాదుందని రోజూ ఆ కూరే వొండుతుంది. బతికున్న వాళ్ళ యిష్టవే యిలా యేడుస్తూంటే చచ్చిన వాడి యిష్టాయిష్టాలతో ఏంపని?" అనుకుంటాడు నాటకం ద్వితీయాంకంలో. తన భార్య చేసే 'మర్యాద' గురించి కరటకుడు కూడా మధురవాణి తో మొర పెట్టుకుంటాడు కానీ, దొండకాయ కూర విషయం ప్రస్తావించడు పాపం. మరి ఆయొక్క దొండపాదు ఒక్క భారద్దేశంలోనే కాదు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ అనూపంగా అల్లుకుంది. దీని వెనుక ఉన్నది అక్షరాలా ఓ తెలుగు వాడే.
హాస్య రచయితగానూ, తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వాహకుడిగానూ పేరు గాంచిన వంగూరి చిట్టెన్ రాజు, స్వస్థలం కాకినాడ నుంచి దొండవేరుని అత్యంత సాహసోపేతంగా అమెరికా తరలించిన వైనాన్ని రికార్డు చేశారు. అప్పటికింకా స్కానర్లు కన్ను విప్పక పోవడం వల్ల, దొండ వేరుని కోటు వెనుక దాచి కస్టమ్స్ వాళ్ళని మాయ చేయగలిగారు కానీ, ఇప్పుడైతే అలా తరలించే వీలే లేదు. అనేక శ్రమదమాదులకి ఓర్చి హ్యూస్టన్ చేర్చిన దొండవేరుని తన పెరటికే పరిమితం చేసేసుకోకుండా, అమెరికాలో అడిగిన తెలుగు వాళ్ళందరి పెరళ్ళలోనూ వ్యాపింపజేశారు వంగూరి. ఇంకా ఇలాంటి సాహసాలు చాలానే చేసి వుంటారు కదా. వాటి వివరం కోసం ఆ మధ్య ధారావాహికంగా మొదలైన ఆయన ఆత్మకథని శ్రద్ధగా చదవడం మొదలు పెట్టాను. కారణాలు తెలియవు కానీ, అమెరికాలో ఉద్యోగం దొరకడంతో ఆ ధార ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడో మొదలు పెట్టి మరికొన్ని అధ్యాయాలు రాయకపోరని ఎదురు చూస్తున్నా.
మళ్ళీ నేను చదివిన కాలమ్ దగ్గరికి వచ్చేస్తే 'అప శుభం' అనే పదప్రయోగం కూడా చేశారు కాలమిస్టు. ఆవిడేమీ చిన్నా చితకా కాదు, పేరున్న రచయిత్రి. హాస్యం మాటున అలవోకగా జీవిత సత్యాలనీ, సాఫ్ట్ స్కిల్స్ చిట్కాలనీ చెబుతూ వుంటారు తన కాలమ్ లో. అలాంటిది, "అపశుభం మాట్లాడకమ్మా" అని రాయడం చూసి అవాక్కయ్యా. అప్పటికింకా దొండ విత్తనాల నుంచి తేరుకోలేదు. ఇవి చాలవన్నట్టు "నాలో ఊహలకి.. నాలో ఊసులకి నటనలు నేర్పావూ.." అని కూడా రాసేశారు. ఇష్టానుసారం అక్షరాలని విరుస్తూ ఆశాభోంస్లే పాడిన ఆ పాట సాహిత్యంలో వున్నవి 'నడకలు' తప్ప 'నటనలు' కావు మరి. 'నవతరం రచయితలతో పోటీ పడడం కోసమని ఈ తరహా పదప్రయోగాలు చేస్తున్నారా ఈవిడ?' అని ఆలోచనలో పడ్డాను. ఏమో, రేపన్ననాడు 'దొండ చెట్టుక్కాస్తాయ్ దొండకాయలూ.. దొండకాయలూ' లాంటి సినిమా పాటలు కూడా వినాల్సి వస్తుందో ఏవిటో.. ఇప్పటికివీ దొండకాయ కబుర్లు.
చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేదు.. మరో ఏడాది గడిచింది..
అత్యల్పంగా సగటున రెండు నెలలకి ఒక పోస్టు..
అయినా అదే ఆదరణ.. మీకేం చెప్పగలను, ధన్యవాదాలు తప్ప...
నిజానికి ఈ పోస్టు రాయడమా, వద్దా అని చాలా ఆలోచించాను. బ్లాగింగ్ మొదలు పెట్టి పదిహేనేళ్ళు పూర్తవ్వడం సంతోషం కలిగించే విషయమే. కానీ, గడిచిన ఏడాది బ్లాగు చరిత్రని తిరిగి చూసుకుంటే ఏమున్నది గర్వకారణం అనిపించింది. వ్యక్తిగత జీవితం తాలూకు ప్రభావం బ్లాగింగ్ మీద ఉండడం అన్నది ఎప్పుడూ నిజమే అయినా, గడించిన సంవత్సర కాలంలో అది మరింతగా రుజువయ్యింది. రాయాలని అనిపించక పోవడం, మొదలు పెట్టబోతూ వాయిదా వెయ్యడం, నెమ్మదిగా రాద్దాం అనుకోవడం...ఇలాంటి అనేక అనుభవాలే గుర్తొస్తున్నాయి నెమరువేతల్లో. ఏమీ సాధించక పోయినా ఏడాది తిరిగేసరికి పుట్టినరోజు వచ్చేసినట్టే, పెద్దగా రాయకపోయినా కేలండర్ మారడంతో బ్లాగుకీ పుట్టినరోజు వచ్చేసింది. ఇదొక సహజ పరిణామ క్రమం అన్నమాట.
మరీ 'మా రోజుల్లో' అనబోవడం లేదు కానీ, పదిహేనేళ్ళు అయింది కాబట్టి నేను బ్లాగుల్లోకి వచ్చిన తొలినాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలనిపిస్తోంది. అప్పటికే తెలుగులో వందకి పైగా బ్లాగులుండేవి. ప్రతి వారం కొత్త బ్లాగులు జతపడుతూ ఉండేవి. కొందరు ప్రతి రోజూ, చాలామంది కనీసం వారానికి ఒకటి రెండు పోస్టులు రాసేవాళ్ళు. ఆవకాయ మొదలు అమెరికా రాజకీయాల వరకూ ప్రతి విషయం మీదా పోస్టులు, కామెంట్లలో చర్చలూ ఉండేవి. ఆవేశకావేశాలు లేకపోలేదు కానీ, కామెంట్ మోడరేటర్ పుణ్యమా అని అసభ్య కామెంట్లు, వ్యక్తిగత దూషణలు అరుదుగా తప్ప కనిపించేవి కాదు. తెలుగు బ్లాగు అగ్రిగేటర్లకి ట్రాఫిక్ పెరుగుతున్న కాలంలోనే కొన్ని వెబ్ మ్యాగజైన్లు కూడా ప్రారంభం అయ్యాయి. చదివేవాళ్ళు, రాసేవాళ్ళతో మంచి సాహిత్య వాతావరణం ఉండేది.
![]() |
| Google Image |
అప్పటితో పోలిస్తే బ్లాగులు రాసే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. అయితే, బ్లాగుల్ని చదివి, అభిప్రాయాలు పంచుకునే పాఠకులు ఇప్పటికీ కొనసాగుతున్నారు. అప్పట్లో ఆన్లైన్ లో తెలుగు కంటెంట్ అరుదుగా దొరికేది. ఇప్పుడు విస్తృతి పెరిగింది. చదవడానికి, చూసేందుకు కూడా కంటెంట్ కి లోటు లేదు. మోడరేషన్ లేని చర్చలు లైవ్ లో నడుస్తున్నాయి. సభా మర్యాదల్లోనూ మార్పు వచ్చింది. మైక్రో కంటెంట్ వెల్లువెత్తుతోంది. నాలుగైదు లైన్లు/అర నిమిషం వీడియోల్లో విషయాలని కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. చదివే/చూసే వాళ్ళ ధోరణిలోనూ మార్పు కనిపిస్తోంది. ఒకప్పటిలా సుదీర్ఘమైన పోస్టులు, అర్ధవంతమైన చర్చలు అరుదుగా కనిపిస్తున్నాయి. మార్పు అనివార్యం.
విస్తృతి పెరగడం తాలూకు విపర్యయం ఏమిటంటే కంటెంట్ చోరీ. బ్లాగుల్లో రాసుకున్న పోస్టులు లేదా వాటిలో కొన్ని భాగాలూ తెలియకుండానే ఇంకెక్కడో ప్రత్యక్షం కావడం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కానీ అప్పట్లో ఫలానా చోట వచ్చిందని పట్టుకోడానికి వీలు ఉండేది. ఇప్పుడు ఎక్కడని వెతకాలి? తాజా ఉదాహరణ 'గుంటూరు కారం' సినిమా. ఆ సినిమా విడుదలకి కొన్ని రోజుల ముందు యద్దనపూడి సులోచనా రాణి రాసిన 'కీర్తి కిరీటాలు' నవల ఆధారంగానే సినిమా తయారవుతోందనే గాలి వార్త ఒకటి బయటికి వచ్చింది. ఆ నవలని గురించి నేను రాసిన బ్లాగ్ పోస్టు, అందులో కొన్ని భాగాలూ నాకు తెలిసి నాలుగైదు చోట్ల ఉపయోగించుకో (చోరీ చేయ) బడ్డాయి. తెలియకుండా ఇంకెన్ని చోట్ల వాడారో మరి. సోర్సుకి క్రెడిట్ ఇవ్వడాన్ని అవసరం లేని పనిగానో, పరువు తక్కువగానో భావించే వాళ్ళు ఉన్నత కాలం ఇది జరుగుతూనే ఉంటుంది బహుశా.
ఈ తరహా చౌర్యాలు తాత్కాలికంగా ఉసూరుమనిపిస్థాయి కానీ, 'ఎందుకొచ్చింది, రాయడం మానేద్దాం' అనిపించవు నాకు. చోరీ చేసిన వాళ్ళ మీద కోపం కన్నా చికాకే ఎక్కువ కలుగుతూ ఉంటుంది. ముందే చెప్పినట్టుగా ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఏం చేసినా ఆగేది కూడా కాదు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, బ్లాగింగ్ ఆపేసే ఉద్దేశమేమీ లేదు. వీలైనంత తరచుగా రాయాలనే ఉంది. అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా మరింత గట్టిగా చేయాలన్నదే సంకల్పం. పదిహేనేళ్ళుగా నా రాతల్ని చదివి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఇక్కడే మరింత తరచుగా మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాను.
గట్టి పట్టుదలతో ఏడాదిని మొదలుపెట్టి, కొన్నాళ్ళపాటు ఆ పట్టుదలని కొనసాగించి, నెమ్మది నెమ్మదిగా జారిపోవడం అన్నది బ్లాగింగ్ విషయంలో అనుభవం అయ్యింది గడిచిన ఏడాది కాలంలో. మళ్ళీ ఇప్పుడిప్పుడే 'బ్యాక్ ఆన్ ట్రాక్' అనుకోగలిగే పరిస్థితులు కనిపిస్తూ ఉండడం సంతోషదాయకం. బ్లాగరుగా పద్నాలుగేళ్ళ పూర్తి చేసుకుని పదిహేనో ఏట అడుగు పెట్టబోతున్న సమయంలో చేసుకుంటున్న స్వీయ విశ్లేషణ ఇది. ఎప్పటిలాగే రాయాలనుకున్నవన్నీ రాయలేకపోవడం, చదవల్సినవి చదువకుండా పెండింగ్ పెట్టడమే గడిచిన ఏడాదీ జరిగింది. మునుపటితో పోలిస్తే చాన్నాళ్ల తర్వాత రాశి కాస్త కనిపిస్తూ ఉండడం వల్లనేమో ఈసారి సింహావలోకనంలో హింస పాళ్ళు కనిపించడం లేదు నాకు.
కరోనా భయాల నుంచి అందరూ నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నట్టే ఉంది పరిస్థితి. ఇదిగో వేరియంట్ అదిగో వేవ్ అనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నా పరిస్థితులు చక్కబడడం తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఊళ్లు తిరిగే వాళ్ళకి కాస్త వెసులుబాటుగా ఉంటుంది. ఆందోళనల నుంచి ఉపశమనం దొరికితే వ్యాపకాల వైపుకి దృష్టి మళ్లుతుంది. గతేడాదితో చాలామంది టూర్లు పోస్టుపోన్ చేసుకున్నాం అని చెప్పిన వాళ్ళే. కరోనా వల్ల జరిగిన మెలేమైనా ఉందా అంటే ఓటీటీ ప్లాట్ ఫారాలు మరింత దగ్గరయ్యాయి. పరభాషా సినిమాలని పరికించే వీలు దొరికింది. బాగుంటుంది అనిపిస్తే తప్ప సినిమా కోసం థియేటర్ కి వెళ్లాల్సిన అగత్యమూ తప్పింది. మలయాళం, మరాఠీ భాషల్లో వస్తున్న సినిమాలు మిగిలిన వాటికన్నా ప్రత్యేకంగా ఉండి ఆకర్షిస్తున్నాయి.
![]() |
| Google Image |
గమనించిన సంగతేమిటంటే తెలుగు సినిమా వాళ్ళు నటీనటుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. అటు మలయాళీలు కానీ ఇటు మరాఠీలు కానీ నటులకు వెచ్చించే దానికి సరిసమానంగా కథ, సంగీతం కోసం వెచ్చిస్తారు. మొత్తంగా చూసినా వాళ్ళ సినిమాల బడ్జెట్ మన వాటిలో నాలుగో వంతు కూడా ఉండదు. ఖర్చు నేలమీద ఉండడం వల్లనేమో కథలూ నేలమీదే నడుస్తాయి. ఫోటోగ్రఫీలో మలయాళీలని (లొకేషన్లు వాళ్ళకి భలే ప్లస్ పాయింట్), నేపధ్య సంగీతంలో మరాఠీలనీ కొట్టేవాళ్ళు లేరు అనిపించింది కొన్ని సినిమాలు చూశాక. అసలు మరాఠీలు ఇంత ప్రోగ్రెసివ్ అని వాళ్ళ సినిమాల వల్లే తెలిసింది. సినిమాలు చూడ్డం బాగానే ఉంది కానీ, ఇవి కాస్తా చదువు, రాత టైంని తినేస్తున్నాయి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని హిందీ సామెత ఉంది కదా.
థియేటర్ కి వెళ్లి చూసినవి రెండే సినిమాలు. 'సీతారామం' మొదటిది, కన్నడ 'కాంతార' రెండోది. 'కాంతార' ఎక్కువగా నచ్చింది, పల్లెటూరి మట్టివాసన ప్రభావం కాబోలు. పుస్తకాల్లో కూడా కన్నడ నుంచి అనువాదం అయి వస్తున్న కథలు, నవలలు భలే ప్రత్యేకంగా ఉంటున్నాయి. 'తూఫాన్ మెయిల్' సంపుటిలో కథలు చాలారోజులు వెంటాడాయి. అన్నట్టు ఈ బ్లాగు వెయ్యిపోస్టుల మైలు రాయిని దాటింది గతేడాదిలోనే. ఆ సందర్భం కోసం 'వేయిపడగలు' మళ్ళీ చదవడం, అనుకోకుండా ఆ వెంటనే 'వేయిపడగలు నేడు చదివితే' అనే వ్యాసాల సంపుటి చదవడం తటస్థించాయి. విశ్వనాథ నవలల్లో 'ఏకవీర' ఎక్కువ ఇష్టం నాకు. కానీ, 'వేయి పడగలు' ని ప్రస్తావించకుండా తెలుగు సాహిత్యం అసంపూర్ణం అనిపించే స్థాయిని సాధించుకున్నది. ఈసారి చదివినప్పుడు నాకు ధర్మారావు మీద ఫిర్యాదుల సంఖ్య కాస్త తగ్గింది.
వాళ్ళ సినిమాల ద్వారా మన కుటుంబ సభ్యులుగా మారిపోయిన కృష్ణంరాజు, కృష్ణ, సత్యనారాయణ కొద్దిరోజుల తేడాలో వెళ్లిపోయారు. ముగ్గురూ దాదాపు నిండు జీవితం గడిపిన వాళ్లే. ఫిర్యాదులు లేకుండా (అవార్డులు రాలేదు వగయిరా) బతికేసిన వాళ్ళే. ముగ్గురూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన వాళ్ళే అయినా, కృష్ణంరాజుని పెద్దపదవులు వరించాయి - అదికూడా పెద్దగా కృషి లేకుండా. 'ప్రాప్తం' అనేది ఇలాంటి విషయాల్లో పనిచేస్తుందేమో. ఎలాంటి పరిష్కారమూ లేకుండా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. శ్రీలంక ఆర్ధిక సంక్షోభానికి ఇంకా ఇదమిద్ధమైన పరిష్కారం ఏదీ దొరికినట్టు లేదు. ఆ ప్రకారంగా కాలచక్రం గిర్రున తిరిగింది. సగటున వారానికో పోస్టుని ఈ బ్లాగు నమోదు చేసింది. ఈ అంకెని కాస్త పెంచాలని ఎప్పటిలాగే ఇప్పుడూ అనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన ఈ సందర్భంలో మీ అందరికీ థాంక్స్ చెప్పకుండా ఈ టపాని ముగించేదెలా...
రెండు మూడు రోజులుగా న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో క్లిప్ ఇది. ఓ ప్రజాప్రతినిధి (?) తన మందీ మార్బలంతో ఓ జనావాసంలో తిరుగుతూ కనిపించినవాళ్ళని పలకరిస్తున్నారు. బొద్దుగా ఉన్న ఓ పిల్లాడిని చూడగానే ఆగి "ఏం చదువుతున్నావమ్మా?" అని అడగ్గానే, కుర్రాడు చేతులు కట్టుకుని "ఎయిత్ క్లాస్" అని బదులిస్తాడు. "ఏదిరా అంత లావై పోయినావు? గేమ్స్ ఆడుకోవా?" అని సదరు ప్రతినిధి ఆశ్చర్యపడుతూ అడగ్గానే, కుర్రాడు ధీర గంభీరంగా "అమ్మ సెల్లియ్యదు" అని జవాబు చెబుతాడు. వింటున్న వాళ్ళకే కాదు, వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా అర్ధం కాడానికి ఓ క్షణం పడుతుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ కుర్రాడి దృష్టిలో గేమ్స్ అంటే సెల్ ఫోన్ లో ఆడుకునేవి మాత్రమే అని అర్ధం కాగానే నా బుర్రని అనేక ప్రశ్నలు తొలచడం మొదలెట్టాయి.
ఇప్పటి పిల్లలు మనుషులతో కన్నా ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ తో ఎక్కువ సమయం గడుపుతున్నారన్నది నిజం. కరోనా పుణ్యమా అని పలకా, పుస్తకాలని కూడా స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు రీప్లేస్ చేసేయడంతో ఈ గాడ్జెట్స్ తో సావాసం మరింత పెరిగింది. వీడియో గేమ్స్ చూస్తూ పెరిగి పెద్దవుతూ, గాడ్జెట్స్ లోనే చదువుకుంటూ, అన్నీ మొబైల్ లోనే ఉన్నాయని నమ్ముతున్న పిల్లలకి గేమ్స్ అంటే వీడియో గేమ్స్ మాత్రమే అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? అవితప్ప వాళ్లకి తెలిసిన వేరే గేమ్స్ ఏమున్నాయి కనుక? తల్లిదండ్రులిద్దరి దగ్గరా మొబైల్ ఫోన్లు ఉండడం మాత్రమే కాదు, అవి వాళ్ళకి దాదాపుగా శరీర భాగాలుగా కలిసిపోడాన్ని చూస్తూ పెరుగుతున్న పిల్లలు వీళ్ళు. చందమామని కాక, సెల్ఫోనుని చూస్తూ గోరు ముద్దలు తిన్న వాళ్ళూను. ఇలా కాక, ఇంకెలా ఆలోచించగలరు మరి?
పిల్లవాడి వీడియో చాలాసార్లు చూశాక (చాలామంది మిత్రుల నుంచి ఫార్వార్డ్ అయి వచ్చింది, కొందరైతే రకరకాల జిఫ్ లూ అవీ జోడించారు కూడా) ప్రధానంగా అనిపించినవి రెండు - పిల్లలకి సెల్లు మాత్రమే తెలియడం, సెల్ ఫోన్ తప్ప ఇంకేమీ తెలియక పోవడం. అన్నం కన్నా ముందు సెల్ ఫోన్ పరిచయం అవుతోంది కాబట్టి, పిల్లలు వాటికి అలవాటు పడడంలో ఆశ్చర్యం లేదు. కానీ వాళ్ళని సెల్ ఫోన్ ఆకర్షించినంతగా మిగిలిన ప్రపంచం ఎందుకు ఆకర్షించడం లేదు? టీవీలో సినిమా వస్తున్నా, చివరికి అమ్మానాన్నలతో సినిమా హాలుకి వెళ్లినా ఫోన్ లో తలదూర్చేసే పిల్లల్ని చూసినప్పుడల్లా బహురూపాల్లో వచ్చే ప్రశ్నే ఇది. పిల్లవాడి పుణ్యమా అని ప్రశ్నలో స్పష్టత వచ్చింది. చేత్తో పట్టుకోగలిగి, కంట్రోల్ చేతుల్లో ఉండి, కళ్ళకి సరిగ్గా సరిపోయేంత తెర ఉండడం మాత్రమేనా, ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయా?
గమనించిన మరో విషయం ఏమిటంటే పిల్లలు ఇలా సెల్ఫోన్ లోనే ప్రపంచాన్ని చూసుకోడాన్ని మెజారిటీ తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు, కొందరైతే గర్వ పడుతున్నారు కూడా. "వీళ్ళ వయసులో మాకు ఫోనే తెలియదు. వీళ్ళకి ఫోన్ వాడకం మొత్తం వచ్చేసిందప్పుడే" అనే గర్వరేఖలకీ లోటులేదు. పిల్లల కళ్ళమీదా, బుర్రమీదా పడే ప్రభావాలని గురించి ఆలోచిస్తున్నవాళ్ళు అరుదు. ఇగ్నోరెన్సు అన్నివేళలా బ్లిస్సేనా? ఇదిగో ఇలాంటి తల్లితండ్రులమధ్య, సెల్లియ్యని ఆ అమ్మ చిన్న ఆశాకిరణంలా కనిపించింది. ఇవ్వకపోడానికి కారణాలు తెలియవు కానీ, ఇవ్వకుండా ఉండడం ద్వారా బిడ్డకి బయటి ప్రపంచం కాస్త పరిచయం అవడానికి సాయం చేస్తోంది. అదే సెల్లు చేతిలో ఉంటే ఆ నాయకుడికి ఈ పిల్లవాడు దొరికి ఉండేవాడు కాదు, ప్రశ్నని అర్ధం చేసుకోగలిగే వాడూ కాదు.
నిజానికి పిల్లవాడికి కొంచం ప్రపంచం తెలిసి, "గేమ్స్ ఆడడానికి గ్రౌండ్ లేదు" అని చెప్పి ఉంటే సదరు నాయకుడు ఎలా స్పందించి ఉండేవాడన్నది మరో ఆలోచన. ఇప్పుడు ఎన్ని స్కూళ్ళకి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, వ్యాయామ విద్య అనే క్లాసు టైం టేబుల్ లో ఉంది, అసలు బోధించే ఉపాధ్యాయులు ఎందరు ఉన్నారు అన్నవన్నీ జవాబు దొరకని ప్రశ్నలే. లెక్కకు మిక్కిలిగా ఉన్న ప్రయివేటు స్కూళ్లలో వ్యాయామ విద్యని గుర్తించేవి బహుతక్కువ. స్కూలు మొత్తానికి ఒకరో ఇద్దరో పిల్లల్ని - వాళ్ళు కూడా తల్లితండ్రుల పుణ్యమా అని క్రీడల్లోకి వచ్చినవాళ్లు - గుర్తించడం, వాళ్ళకి ఏదైనా పోటీల్లో బహుమతులొస్తే 'మా బడి పిల్లలకి బహుమతులు' అని ప్రచారం చేసుకోవడం మాత్రమే కనిపిస్తోంది.
సర్కారు బడుల్లో కొన్నింటికి ప్లే గ్రౌండ్లు, మరికొన్ని చోట్ల పీఈటీలు ఉన్నా రెండూ ఉన్నవి తక్కువే అనిపిస్తుంది. నిజానికి వనరులు అన్నీ అందుబాటులోనే ఉన్నా, ఆడేందుకు ఆసక్తి చూపించే పిల్లలెందరు? ప్రోత్సహించే తల్లిదండ్రులెందరు? 'పిల్లల భవిష్యత్తంతా కంప్యూటర్ల లోనే ఉంది. ఫోన్ బాగా వస్తే (?) కంప్యూటరూ బాగా వస్తుంది' అనే ఆలోచనల్ని బద్దలుకొట్టేది ఎవరు, ఎప్పుడు? "గేమ్స్ ఆడుకోవా?" అని అడగడానికి ముందు, గేమ్స్ అంటే ఏమిటో స్పష్టంగా చెప్పి, ఎందుకు ఆడాలో వివరించి ఉంటే ఆ కుర్రాడు ఆడేందుకు ప్రయత్నించి ఉండేవాడేమో. సెల్లులోనే కాకుండా గ్రౌండ్ లో ఆడే గేమ్స్ కూడా ఉంటాయని తెలుసుకుని ఉండేవాడేమో. సెల్ ఫోన్ దాటి బయట ఉన్న ప్రపంచాన్ని పిల్లలకి పరిచయం చేయాల్సిన సమయం వచ్చిందేమో అనిపిస్తోంది. పిల్లలకన్నా ముందు పెద్దలకి అర్ధంకావాలి. పిల్లి మెడలో గంటని కట్టేదెవరు??
తెలుగునాట టాక్ షో లు కోకొల్లలు. అలనాటి దూరదర్శన్ మొదలు నిన్నమొన్ననే మొదలైన యూట్యూబ్ ఛానళ్ల వరకూ ప్రముఖుల ఇంటర్యూలు జరపని వాళ్ళు అరుదు. మనకి కళ అంటే సినిమాలు, సెలబ్రిటీలు అంటే సినిమావాళ్ళే కాబట్టి ఈ ఇంటర్యూల అతిధుల్లో అధికులు సహజంగా సినిమా వాళ్ళే. తగుమాత్రం సినీ సెలబ్రిటీలందరూ ఒకటికి మించి చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చిన వాళ్ళే. ఇన్నేసి ఇంటర్యూల మధ్య తనదైన ప్రత్యేకతని నిలుపుకుంటూ దాదాపు ఏడేళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగి మూడు వందల ఎపిసోడ్లతో ముగిసిన కార్యక్రమం 'ఆలీతో సరదాగా'. అనేకానేక టాక్ షోలు నడుస్తూ ఉండగా ఈ కార్యక్రమాన్ని గురించి మాత్రమే మాట్లాడుకోడం ఎందుకూ అంటే, దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి.
ఏ కార్యక్రమం రక్తి కట్టాలన్నా ముఖ్యంగా ఉండాల్సింది 'తగినంత నిడివి'. దూరదర్శన్ తొలినాళ్లలో చేసిన ఇంటర్యూల నిడివి పావుగంట, ఇరవై నిముషాలు మించి ఉండేది కాదు. బహుశా రేడియో ఇంటర్యూలకి కొనసాగింపుగా ఈ పద్దతి పాటించి ఉంటారు. ఇంటర్యూ కోసం ఎదురు చూసినంత సేపు పట్టేది కాదు, శాంతి స్వరూపో, విజయదుర్గో "చాలామంచి విషయాలు చెప్పారండి, నమస్కారం" అనడానికి. తర్వాత్తర్వాత వాళ్ళూ నెమ్మదిగా సమయం పెంచడమే కాకుండా, రెండు మూడు ఎపిసోడ్లుగా ప్రసారం చేయడం అలవాటు చేసుకున్నారు. శాటిలైట్ చానళ్ళు జెమినీ, ఈటీవీల్లో కూడా తొలినాటి ఇంటర్యూల నిడివి అరగంట మాత్రమే ఉండేది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో పదిహేను పదహారు గంటల సుదీర్ఘ ఇంటర్యూలు కూడా కనిపిస్తున్నాయి, ఇది మరీ అతివృష్టి.
ఏదైనా విషయం మీద మనం ఫోకస్ చేయగలిగే గరిష్ట సమయం నలభై ఐదు నిమిషాలని, అందుకే హైస్కూల్, కాలేజీల్లో ఒక్కో పీరియడ్ నిడివి నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుందనీ అంటారు. ఆ లెక్కన చూసినప్పుడు ఈ 'ఆలీతో సరదాగా' షో నిడివి ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ కి సరిగ్గా సరిపోయేంత మాత్రమే. కనీసం ఒక్క ఎపిసోడ్ కూడా నేను టీవీలో ప్రసారం అవుతుండగా చూడలేదు కాబట్టి ఎన్ని బ్రేకులు ఇచ్చేవారో తెలియదు. ఈ ఇంటర్యూలని చూసింది, విన్నది యూట్యూబ్ లోనే. గెస్టులు మరీ బోరింగ్ అనిపిస్తే ఆ ఎపిసోడ్ల జోలికే పోలేదు తప్ప, మొదలు పెట్టి మధ్యలో ఆపేసినవో, స్కిప్పులు కొడుతూ చూసినవో లేనేలేవు. ఆ విధంగా గెస్టులూ, హోస్టూ కూడా నన్ను ఎంగేజ్ చేశారు.
నవతరం ప్రేక్షకులకి బొత్తిగా తెలియని గెస్టులని వాళ్ళకి పరిచయం చెయ్యాలి, బాగా తెలిసిన వాళ్ళని గురించి కొత్త విషయాలు చెప్పాలి. ఈ రెండూ టాక్ షో లకి ప్రధానమైన సవాళ్లు. మూడొందల మంది గెస్టుల్లో ఓ పాతిక ముప్ఫయి మంది మినహా మిగిలిన అందరితోనూ కలిసి పనిచేసిన అనుభవం ఉంది ఆలీకి. ఆ అనుభవం ఈ షో కి చక్కగా ఉపకరించి ఆయా ఎపిసోడ్లు లైవ్లీ గా రావడానికి సహకరించింది. ఉదాహరణకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనేక ఇంటర్యూలు ఇచ్చినా, ఆలీ ఇంటర్యూ ఇప్పుడు చూసినా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రశ్నలు దాదాపు అందరూ అడిగేవే. కానీ, సంభాషణలో కనిపించే ఆత్మీయత వెనుక ఉన్నది వ్యక్తిగత అనుబంధమే. చాలామంది అతిధుల విషయంలో ఈ అనుబంధం చక్కగా పనిచేసింది
అతిధులకీ, షో చూసే ప్రేక్షకులకి కూడా హాయిగా అనిపించే మరో విషయం అలీ చూపించే హంబుల్ నెస్. పెద్దవాళ్ళ ముందు కాస్త ఒదిగి ఉండడం మాత్రమే కాదు, తనకన్నా వయస్సులోనూ హోదాలోనూ చిన్నవాళ్ళని ఇంటర్యూ చేసినప్పుడూ ఎక్కడా అతిచనువు ప్రదర్శించక పోవడం ఈ షో ని ప్రత్యేకంగా నిలిపింది. ఎటు చూసినా అతి చనువు ప్రదర్శించాలని తహతహలాడే హోస్టులే కనిపిస్తూ ఉండడం వల్ల కావొచ్చు, ఈ ప్రత్యేకత మరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రారంభ ఎపిసోడ్లలో గెస్టులని వ్యక్తిగతమైన ప్రశ్నలు గుచ్చి గుచ్చి అడిగి ఇబ్బంది పెట్టినా, తర్వాత్తర్వాత అలాంటి ప్రశ్నల విషయంలో జాగ్రత్త పడడం కనిపించింది. అయితే, ఏదో వంకన గెస్టుల చేత ప్రయత్నపూర్వకంగా కన్నీళ్లు పెట్టించడం మాత్రం ఓ దశలో విసుగు తెప్పించింది.
గెస్టుల గురించి సరే, ఆలీ గురించి కూడా అనేక విషయాలు తెలుసుకోడానికి ఈ షో ఉపకరించింది. అంతకు ముందు ఆలీ గురించి తెలిసింది తక్కువ. సినిమా ఫంక్షన్లకి యాంకరింగ్ చేస్తూ హీరోయిన్లని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లాంటి కాంట్రవర్సీలు అప్పటికే ఉన్నాయి. అతను పెద్దగా చదువుకోలేదనీ, సినిమా తప్ప మిగిలిన ప్రపంచం పెద్దగా తెలీదనీ తెలిసింది ఈ షో వల్లనే. ఎలాంటి బేక్ గ్రౌండూ లేకుండా సినిమాల్లోకి వచ్చి నలభయ్యేళ్ళ పాటు నిలదొక్కుకోవడం, కొనసాగుతూ ఉండడం మామూలు విషయం కాదు. మరీ ముఖ్యంగా, 'హీరో' ముద్ర పడ్డాక మళ్ళీ వెనక్కి వచ్చి మామూలు కమెడియన్ అయిపోవడమూ పెద్ద విషయమే. పాత ఎపిసోడ్లని కుదించి యూట్యూబ్ లో పెడుతున్నారు ఎందుకో. వాటిని ఉన్నఫళంగా ఉంచితే బాగుంటుంది.
ఇస్తాంబుల్ అంటే ఇప్పటివరకూ తెలిసింది తెలుగు సినిమాలో ఖరీదైన విలన్ల స్థావరం మరియు నాయికానాయకులు ఒకటో రెండో యుగళగీతాలు పాడుకునే చోటు అని మాత్రమే. అయితే, ఈ టర్కీ దేశపు నగరం బట్టతలపై జుట్టు నేసే (హెయిర్ ట్రాన్స్ ప్లాంట్) పరిశ్రమ(?)కి ప్రపంచ స్థాయి రాజధాని అన్నది కొత్తగా తెలిసిన విశేషం. ప్రపంచం నలుమూలల నుంచీ ఏటా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది (ప్రధానంగా పురుషులు) హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం ఇస్తాంబుల్ వచ్చి వెళ్తున్నారట! ఇందుకు కారణం, ఇక్కడ దొరికే ట్రీట్మెంటు ప్రపంచంలోనే అత్యుత్తమం అనుకుంటే పొరపాటు. చాలా ధనిక దేశాల కన్నా చాలా చౌక. అమెరికాలో ఇరవైవేల డాలర్ల వరకూ ఖర్చయ్యే జుట్టు నేతని ఇస్తాంబుల్లో రెండువేల డాలర్ల ఖర్చుతో పూర్తి చేసుకోవచ్చు. భలే మంచి చౌక బేరము కదా.
తల నెరుపునీ, బట్టతలనీ ప్రకృతి సహజాలుగా అంగీకరించేసిన తరాలు తప్పుకున్నాక మొదటగా వర్ధిల్లింది రంగుల పరిశ్రమ. హెయిర్ డై ప్రకటనలు ఒకప్పుడు ఎంతగా తప్పుదోవ పట్టించేవిగా ఉండేవంటే, ఒక డై ని నేను ఔషధం అని పొరబడి, సలహా అడిగిన ఓ మిత్రుడికి సిఫార్సు చేశా. అతని అనుభవం నుంచి తెలిసింది, అది మందు కాదు రంగని. అప్పటి నుంచీ ఇలాంటి సలహాలిచ్చే పని మానుకున్నా. నాటకాలు, సినిమాల వాళ్ళకి మాత్రమే పరిమితమైన విగ్గులు కూడా జనబాహుళ్యానికి అందుబాటులోకి వచ్చేసి మార్కెట్ని దున్నేశాక ఈ హెయిర్ వీవింగ్, ట్రాన్స్ ప్లాంట్ లు రంగ ప్రవేశం చేశాయి. ఈ ట్రాన్స్ ప్లాంట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది డాక్టర్ల చేత చేయబడుతుంది. ఒక్క సారి నాట్లు పూర్తయ్యాక, కొన్ని వారాలపాటు మొలకల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఇక ఆ కొత్త జుట్టు ఊడిపోదు.
వైద్యరంగంలో కొత్త ఆవిష్కరణలతో సమస్య ఏమిటంటే, వచ్చిన కొత్తలో చాలా వైద్య విధానాలు ఖరీదు గానే ఉంటాయి. ఏళ్ళు గడిచిన తర్వాత తప్ప సామాన్యులకి అందుబాటులోకి రావు. బాగా ఖర్చు పెట్టగలిగే వాళ్ళు తొలివరసలో నిలబడి వినియోగించుకుంటారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి? ఒకప్పటి సంగతేమో కానీ, ఇప్పుడు ప్రపంచం ఓ కుగ్రామం అయిపోయాక అన్నింటికీ ఏదో రూపంలో ప్రత్యామ్నాయాలు దొరికేస్తున్నాయి. ఇదిగో, ఈ క్రమంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ అనే ఖరీదైన ప్రక్రియని అందుబాటు(?) ధరలో అందించే దేశంగా టర్కీ, నగరంగా ఇస్తాంబుల్ వినుతికెక్కాయి. వేగవంతమైన జీవన శైలి వల్ల అయితేనేమి, మారిన ఆహార అలవాట్ల వల్ల అయితేనేమి బాల నెరుపులు, బట్ట తలలు విరివిగా పెరిగాయి. తలసరి ఆదాయాలు, జీవన ప్రమాణాలు కూడా పెరగడంతో వినియోగదారుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది.
![]() |
| Google Image |
ప్రపంచంలో ఎన్నో నగరాలు, మహా నగరాలూ ఉండగా ఈ ఇస్తాంబుల్ మాత్రమే తలనేత రాజధానిగా ఎలా పరిణమించ గలిగింది? మొదటిది - అక్కడ తగినంతమంది డాక్టర్లు, ఇతర సిబ్బంది ఉండడం, రెండోది - అక్కడి ప్రభుత్వం 'హెల్త్ టూరిజం' ని బాగా ప్రమోట్ చేయడం, మూడోదీ బాగా ముఖ్యమైనదీ - టర్కీ ఇంకా 'అభివృద్ధి చెందుతున్న' దేశం కావడం వల్ల తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ అందివ్వ గలగడం. అంతర్జాతీయ హెల్త్ టూరిజం పర్యాటకులకి ప్రధాన సేవ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కాగా, అనుబంధంగా దంత వైద్యం, శరీర బరువు తగ్గింపు లాంటి సేవలనీ సరసమైన ధరలకి అందిస్తున్నారు. స్టార్ హోటల్ లో బస, లోకల్ ట్రాన్స్పోర్టు, సదా అందుబాటులో ఉండే అనువాదకులు.. ఇవన్నీ కలిపి పేకేజీ నిర్ణయిస్తారు. పేకేజీ కాకుండా, టిక్కెట్టు ఖర్చులు మాత్రమే అదనం. దీనివల్ల జరగబోయే ఖర్చు గురించి ముందుస్తుగా ఓ అంచనా వచ్చేస్తుంది యాత్రీకులకి.
చౌక వైద్యం అనగానే ముందుగా వచ్చే సందేహం సేవల్లో నాణ్యత గురించి. ఇస్తాంబుల్ వైద్యాన్ని గురించీ బోల్డన్ని ప్రచారాలున్నాయి. డాక్టర్లు కేవలం పర్యవేక్షణ చేస్తూ, నాట్లు, ఊడుపు లాంటి క్రతువులన్నీ సహాయకుల చేత చేయిస్తారనీ, చాలా సందర్భాల్లో ఈ సహాయకుల అనుభవ లేమి వల్ల యాత్రికులు (రోగులు అనకూడదేమో) ఇబ్బంది పడుతున్నారని వినిపిస్తున్నా, యాత్రికుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. నాట్లు పూర్తి చేయించుకుని స్వదేశానికి తిరిగి వచ్చాక కూడా, ఓ సహాయకుడు హమేషా వాట్సాప్ లో అందుబాటులో ఉంటూ, ఫోటోలు, వీడియోల పరిశీలన ద్వారా మొలకల పెరుగుదలని పర్యవేక్షిస్తూ ఉంటాడట. దీనికి అదనపు రుసుమేమీ లేదు, పేకేజీలో భాగమే. ఆ ప్రకారంగా టర్కీ 'హెల్త్ టూరిజం' ని ప్రమోట్ చేస్తోంది.
అసలు 'హెల్త్ టూరిజం' అన్నమాట వినగానే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తొచ్చారు. "ఏ ఇజమూ లేదు, టూరిజం ఒక్కటే ఉంది" అన్న ఆయన పాపులర్ స్లోగన్ తో పాటు, అప్పట్లో హైదరాబాద్ ని 'హెల్త్ టూరిజం హబ్' గా డెవలప్ చేస్తానన్న హామీ కూడా. ఒకవేళ ఆంధ్ర ఓటర్లు ఆయనకి మళ్ళీ ప్రజాసేవ చేసుకునే అవకాశం ఇస్తే అమరావతి హెల్త్ టూరిజానికి కూడా రాజధాని అవుతుందేమో చూడాలి. అసలే విజయవాడ, గుంటూరు చుట్టూ లెక్కలేనన్ని హాస్పిటళ్లు ఉన్నాయి. ఒకవేళ, ప్రస్తుత పాలకులకి ఇస్తాంబుల్ విషయం చెవిన పడితే అన్న ఆలోచన రావడమే కాదు, ఏ 'జుట్టు దీవెన' లాంటి సంక్షేమ పథకమో పురుడు పోసుకుంటుందేమో అన్న సందేహమూ కలిగేసింది. అమంగళం ప్రతిహతమగు గాక!
అప్పు తీసుకోవడం నామర్దాగా భావించే రోజుల్నించి, అప్పులేకుండా బతకలేని రోజుల్లోకి మనకి తెలియకుండానే వచ్చేశాం. ఇది ఎంతవరకూ వచ్చిందంటే, అప్పిస్తాం తీసుకోమంటూ రోజూ వెంట పడేవాళ్ల నుంచి తప్పించుకోడానికి దారులు వెతికే దాకా. బ్యాంకుల మొదలు, ఫైనాన్సు కంపెనీల వరకూ మన ఫోన్ నెంబరు దొరకని వాళ్ళది పాపం, మీకు ఇంత మొత్తం ఋణం తీసుకునేందుకు అర్హత ఉంది (ఈ అర్హతని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారో తెలీదు, ఒకరు చెప్పే మొత్తానికీ, మరొకరు ఇస్తామని ఊరించే అప్పుకీ పొంతన ఉండదు మరి), పెద్దగా డాక్యుమెంటేషన్ కూడా అక్కర్లేదు, మీరు ఊ అనండి చాలు, అప్పు మీ బ్యాంకు అకౌంట్లో పడుతుంది అంటూ ఊదరగొట్టేస్తారు. "అబ్బే, దేవుడి దయవల్ల రోజులు బానే గడిచిపోతున్నాయి.. ఇప్పుడు అప్పులూ గట్రా అవసరం లేదు," అని చెబుతామా, "రేపెప్పుడన్నా అవసరం రావొచ్చు, ఈ నెంబరు సేవ్ చేసుకోండి.. అవసరం వచ్చిన వెంటనే ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు" అన్నది రొటీన్ సమాధానం. రోజూ ఎన్ని నెంబర్లని సేవ్ చేసుకోవాలి?
మొదట్లో నేను చాలా ఆశ్చర్యపడిపోతూ ఉండే వాడిని, ఫోన్లు చేసి ఇంతలేసి అప్పులు ఎలా ఇచ్చేస్తారు? తీరుస్తామన్న వీళ్ళ ధైర్యం ఏమిటీ? అని. అయితే, ఒకానొక అనుభవం తర్వాత తత్త్వం బోధపడింది. అప్పులు ఇచ్చే బ్యాచీ వేరు, వసూలు చేసుకునే బ్యాచీ వేరు. ఎవరి పద్ధతులు, మర్యాదలు వారివి. నాకు పరిచయం ఉన్న ఒకాయన ఓ ప్రయివేటు ఫైనాన్సులో అప్పు తీసుకున్నాడు. అప్పుడు, వాళ్ళకి నన్ను తన స్నేహితుడిగా పరిచయం చేసి నా ఫోన్ నెంబరు ఇచ్చేశాడు. వాళ్ళు అప్పు ఇచ్చేశారు. ఇవేవీ నాకు తెలీదు. గడువు తీరినా బాకీ తీరక పోవడంతో, అతగాడి ఫోన్ స్విచ్చాఫ్ ఉండడంతో వాళ్ళు నాకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. మొదట్లో మర్యాదగానే మాట్లాడినా, రాన్రానూ వాళ్ళ స్వరం మారడం తెలుస్తోంది. ఇతగాడు ఫోనుకి దొరకడు. ఇలా దొరికిపోయానేవిటా అని నేను చింతిస్తూ ఉండగా, ఫైనాన్సు వాళ్ళు బెదిరింపు ధోరణిలోకి దిగారు.
ఓ రోజు నేను మహా చిరాగ్గా ఉండగా వాళ్ళ ఫోన్ వచ్చింది. ఎప్పటిలాగే తీయగా మొదలెట్టి, కటువుగా మారుతుండగా నాకు చిర్రెత్తుకొచ్చింది. "మీరు అతనికి అప్పు ఇచ్చే ముందు నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు?" అని అడిగా. వాళ్ళ దగ్గర జవాబు లేదు. నాకు దారి దొరికింది. "అప్పిచ్చే ముందు నాకు ఫోన్ చేసి ఇలా చేస్తున్నాం అంటే నేను ఇవ్వమనో, వద్దనో చెప్పేవాడిని. ఇవ్వమని పూచీ పడితే ఇప్పుడు నాకు బాధ్యత ఉండి ఉండేది. అప్పుడు నా నెంబరు తీసుకుని ఊరుకుని ఇప్పుడు ఫోన్లు చేస్తే నాకేం సంబంధం?" అని గట్టిగా అడిగా. అవతలి వాళ్ళు వాళ్ళ మేనేజర్ని లైన్లోకి తెచ్చారు. ఆ అప్పుతో నాకు ఎలాంటి సంబంధం లేదనీ, ఇంకెప్పుడూ ఫోన్లు చేయద్దనీ, చేస్తే మర్యాదగా ఉండదనీ గట్టిగా చెప్పా. అలా ఆ పీడ విరగడయ్యింది. అప్పుల వసూళ్లు ఏ పద్ధతిలో జరుగుతాయో తగుమాత్రం అర్ధమయింది నాకు.
ఇది జరిగిన కొన్నాళ్లకే 'వాట్సాప్ అప్పులు' అంటూ వార్తలు రావడం మొదలైంది. ప్రయివేటు ఫైనాన్సు కంపెనీల వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి, ఎలాంటి హామీలూ లేకుండా అప్పులిచ్చేశారు. ఒకే ఒక్క మెలిక ఏమిటంటే, అప్పు తీసుకునే వాళ్ళు వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ సదరు సంస్థ వాళ్ళకి సమర్పించాలి. వాళ్ళు, సదరు కాంటాక్ట్స్ అందరినీ పీడించి బాకీ వసూలు చేసుకుంటారన్నమాట. అప్పు తీసుకుని తీర్చలేకపోయిన ఒకరిద్దరు సున్నిత మనస్కులు ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడంతో, పోలీసులు రంగంలోకి దిగి సదరు సంస్థల్ని మూసేయించారు. ఇంతలేసి మంది అప్పులివ్వడానికి ఎందుకు పోటీ పడుతున్నారో అంటే, తాకట్టో వాకట్టో పెట్టుకుని ఇచ్చే అప్పుల మీద కన్నా ఇలాంటి హామీ లేని రుణాల మీద రెండింతలు వడ్డీ వసూలు చేయచ్చు. రిస్కు ఉన్నప్పటికీ లాభం ఎక్కువ.
ఇక అప్పు తీసుకునే వాళ్లలో నూటికి పది మందికి నిజమైన అవసరం అయితే, మిగిలిన వాళ్ళు అప్పు దొరుకుంటోంది కదా తీసేసుకున్న బాపతు. వీళ్ళకి వడ్డీ గురించి ఆలోచన కానీ, ఎలా తీర్చాలో అన్న చింత కానీ లేవు. వాట్సాప్ అప్పులు తీసుకుని, హెడ్సెట్ వగయిరా గాడ్జెట్లు కొనుక్కున్న కుర్రాళ్ళున్నారు. అప్పుల వాళ్ళు ఇళ్ల మీదకి వస్తే, పెద్దవాళ్ళు ఏడ్చుకుంటూ బాకీలు తీర్చారు. అయితే, ఈ పరిస్థితి ఇండియాలో మాత్రమే కాదనీ, ప్రపంచానికి అప్పులిచ్చే అమెరికాలో కూడా ఇంతేననీ ఈ మధ్యనే తెలిసింది. 'ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి' అనే ఆన్లైన్ స్కీంలో అప్పులు తీసుకున్న వాళ్ళు ఏకంగా నాలుగు రెట్ల మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నారట. వీళ్ళలో మెజారిటీ యువతే. అప్పు చేసి వాళ్ళు కొంటున్నవి ఫ్యాషన్ దుస్తులు, మేకప్ సామాగ్రి, గాడ్జెట్లు వగయిరాలు తప్ప ప్రాణం మీదకి వస్తే చేసిన అప్పులు కావు.
కొనుగోలు చేసే వస్తువు వెలని నాలుగు నుంచి ఐదు సమ భాగాలు చేసి, మొదటి భాగం చెల్లించగానే వస్తువు డెలివరీ చేస్తున్నారు. మిగిలిన మొత్తం నాలుగుకు మించని వాయిదాల్లో చెల్లించాలి. నాలుగే ఎందుకు? ఐదు వాయిదాల నుంచీ మొదలయ్యే రుణాలన్నీ వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ విషయం అప్పు ఇచ్చే వాళ్ళకి తెలుసు, తీసుకునే వాళ్ళకి తెలీదు. వాళ్ళకింకా చాలా విషయాలే తెలీదు. అప్పు చేసి కొనే ఫ్యాషన్ దుస్తులు, ఆ అప్పు తీరే లోగానే అవుటాఫ్ ఫాషన్ అయిపోతున్నాయి. మళ్ళీ కొత్త ఫ్యాషన్, కొత్త అప్పు.. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. పైగా అప్పులు చేయించడం కోసం టిక్ టాక్ ఇంఫ్లుయెన్షర్లు, వాళ్ళకి కంపెనీల నుంచి ఉచిత బహుమతులూ.. ఇదో పెద్ద వలయం. ఇందులో చిక్కుకున్న వాళ్ళు చివరికి గాస్ (పెట్రోల్) కొనడానికి కూడా ఈ నాలుగు వాయిదాల అప్పు చేయాల్సిన పరిస్థితి. ఈ అప్పులు ఇంకా ఎన్నేసి రూపాలు మార్చుకుంటాయో చూడాలి.
స్థానిక రాజకీయ మరియు సినిమా వార్తల పట్ల విరక్తి చెంది, ప్రపంచం ఎటుపోతోందో చూసొద్దాం అనుకుంటూ అంతర్జాతీయ వార్తలు బ్రౌజ్ చేస్తూంటే కనిపించిన 'రాయిటర్స్' వార్త ఆకర్షించడమే కాదు, వెంటనే చదివేసి ఆతర్వాత ఆగి కాసేపు ఆలోచించేలా చేసింది. అది జపాన్ రాజధాని టోక్యో నగరంలో నడుస్తున్న ఓ కెఫె గురించి. 'మాన్యుస్క్రిప్ట్ రైటింగ్ కెఫె' పేరుతో ఈ కాఫీషాపుని నడుపుతున్నది తకువా కవాయ్ అనే రచయిత. ఇక్కడ పది సీట్లు రచయిత(త్రి)ల కోసం రిజర్వు చేయబడ్డాయి. వాళ్ళ రచన ఏదైనా సరే, ఈ కెఫె లో కూర్చుని రాసుకోవచ్చు. మధ్య మధ్యలో కావాల్సినన్ని టీ కాఫీలు సేవించవచ్చు. ఇది చదువుతూ ఉంటే సాహిత్య ప్రపంచంలో ఓ సంచలనాన్ని నమోదు చేసిన 'హ్యారీ పోటర్' సిరీస్ లో మొదటి పుస్తకాన్ని అప్పట్లో పేదరాలైన జేకే రౌలింగ్ ఓ కాఫీ షాపులో కూర్చుని రాసిన విషయం గుర్తొచ్చింది.
జపాన్ కెఫె దగ్గరికి వస్తే, కాఫీ టీ లతో పాటు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సర్వీసునీ అందిస్తోంది రచయితలు, ఎడిటర్ల కోసం. రచయితలు చేయాల్సిందల్లా తమ పేరుతో పాటు, ఏం రాయాలనుకుంటున్నారో ఆ వివరం, ఉజ్జాయింపున ఎన్ని గంటల్లో రాయడం పూర్తి చేద్దామనుకుంటున్నారో రిజిస్టర్లో నమోదు చేయాలి. రాత పనిని సకాలంలో పూర్తి చేయడానికి అక్కడ అందుబాటులో ఉన్న మూడు రకాల సేవల్లో ఒకదానిని ఎంచుకోవాలి. మొదటిది 'మైల్డ్', రెండోది 'నార్మల్', మూడోదేమో 'హార్డ్'. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ రకమైన సేవలు లేకపోబట్టి కదా అల్లసాని వారు నిరుపహతి స్థలము, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడెము వగయిరాలు కోరుకున్నారు తన కావ్య సృష్టికీ అనిపించేసింది. అయినా, ఈ సేవలేవీ రాక పూర్వమే ఆధునిక జపాన్ నుంచి 'మురకామి' లాంటి గొప్ప రచయిత ఉద్భవించలేదూ?
'మైల్డ్' సేవలు ఎంచుకున్న రచయితలు చెప్పిన గడువు లోపల రచన పూర్తి చేశారా లేదా అన్నది మాత్రమే చెక్ చేస్తారు కెఫె వారు. 'నార్మల్' కనుక ఎంచుకుంటే, గంటకోసారి వచ్చి, పలకరించి, ప్రోగ్రెస్ చెక్ చేస్తూ ఉంటారు. ఇక 'హార్డ్' వారి పరిస్థితి చదువుతుంటేనే గుండె గుభేల్ మంది. కెఫె స్టాఫు తరచూ వచ్చి వీరి వెనుక నిలబడుతూ ఉంటారట, మన రామయ్య మెస్సు, సుబ్బయ్య హోటలు లాంటి చోట ఓ బంతి వాళ్ళ భోజనాలు అవుతూ ఉండగానే, టోకెన్లు కొనుక్కున్న తర్వాతి బ్యాచి వాళ్ళు వచ్చి కుర్చీల వెనకాల అసహనంగా నిలబడ్డట్టు. ఇదంతా రచయితల్లో బద్ధకం వదిలించి, రాయాలనే వాళ్ళ లక్ష్యం పూర్తి చేయించడానికే అంటున్నాడు కవాయ్ మహాశయుడు. అయితే, ఈ సేవలు ఉచితం కాదు, తగుమాత్రం ఫీజు వసూలు చేస్తున్నాడు రచయితల దగ్గరనుంచి. నేనేమో 'హార్డ్' వాళ్లకి తక్కువ ఫీజు, 'మైల్డ్' వాళ్ళకి ఎక్కువా ఉంటుందేమో అనుకున్నా కానీ, కాదు.
'మాన్యుస్క్రిప్ట్ రైటింగ్ కెఫె' లో కూర్చుని రాసుకోడానికి మొదటి అరగంటకి 1.01 అమెరికన్ డాలర్ (ర్లు), తర్వాత ప్రతి గంటకీ 2.34 డాలర్లూ చెల్లించాలి. జపాన్ కరెన్సీలో మొదటి అరగంటకి 130 యెన్ లు, తర్వాత ప్రతి గంటకీ 300 యెన్ లూ అన్నమాట. టేబులు, కుర్చీతో పాటు టీ, కాఫీలు, ఇంటర్నెట్టూ, త్వరగా రాసేందుకు దోహదం చేసే సిబ్బంది సేవలూ (?) ఉచితమే. ఈ సోషల్ మీడియా యుగంలో ఇలాంటి కొత్త వింతలు క్షణాల్లో 'వైరల్' అవ్వకపోతే కదా ఆశ్చర్య పోవాలి. యుగ ధర్మాన్ని అనుసరించి ఈ కెఫె వార్త టోక్యోని చుట్టేసింది. రచయితలు క్యూ కట్టేశారు. "మా సేవల వల్ల చాలామంది ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న రచనల్ని కొన్ని గంటల్లో పూర్తి చేసేస్తున్నారు" అనడమే కాదు, అలా పూర్తి చేసిన వాళ్ళ జాబితానూ ప్రదర్శిస్తున్నాడు కవాయ్.
ఎమికో ససాకి అనే బ్లాగర్ ఈ కెఫె సేవల్ని ఉపయోగించుకుని మూడే గంటల్లో ఏకంగా మూడు బ్లాగు పోస్టులు రాసేసిందట. దృష్టిని మరల్చే ఇతరత్రా ఆటంకాలేవీ లేవు కాబట్టి రాయడం మీద గురి కుదుర్చుకో గలిగిందట. ఈవిడ 'హార్డ్' కేటగిరీ సేవల్ని ఎంచుకుని ఉంటుందని నాకెందుకో బలమైన సందేహం కలిగింది. రెండేళ్ల క్రితం వరకూ లైవ్ స్ట్రీమింగ్ వ్యాపారం చేసిన కవాయ్, కోవిడ్ రెండేళ్ళూ ఖాళీగానే గడిపి (రచయిత కదా, ఏవో రచనలు చేసే ఉంటాడు), ప్రపంచం కాస్త కుదుట పడ్డాక ఇదిగో ఈ వ్యాపారం మొదలు పెట్టాడు. "ఇక్కడి నుంచి ఎలాంటి రచనలు రాబోతున్నాయో నాకు తెలీదు. కానీ, అందరూ చదివే రచనలకి నావంతు మద్దతు పలకడం గర్వంగా ఉంది" అని జాపనీస్ లో సంతోషపడ్డాడు కవాయ్. కెఫె కి వచ్చే రచయితలు అక్కడి సేవల్ని మెచ్చుకుంటూ, మామూలుగా ఒక రోజు పట్టే రచనని మూడు గంటల్లో పూర్తి చేసేయగలుగుతున్నామనీ, మూడు గంటలు పట్టే రచన గంటలోనే పూర్తైపోతోందనీ చెబుతున్నారట.
సహజంగానే నాకు ఇండియాలో ఇలాంటి కెఫె ఎవరైనా మొదలు పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన మొదలైంది. మన దగ్గర రాసే వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ, దాన్నో పూర్తి స్థాయి వ్యాపకంగా చేసుకున్న వాళ్ళు బహు తక్కువ. రచనల ద్వారా బాగా ఆర్జించే సినిమా వాళ్ళు వగయిరాలది అంతా భారీ వ్యవహారమే. స్టార్ హోటళ్లు, రిసార్టులు కావాలి కానీ, ఇలాంటి చిన్న ఏర్పాట్లు కాదు. చిన్న, సన్నకారు రచయితలకి ఇప్పటికే స్వీయ ప్రచురణ ఖర్చులు తలకి మోపెడు, ఇంకా ఈ 'రాత' ఖర్చు కూడానా? ఎడిటింగ్ అనే (ప్ర)వృత్తి దాదాపు అంతరించిపోతోంది, కాబట్టి వాళ్ళకీ అవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య కార్పొరేషన్ వారి దృష్టికి తీసుకెళ్తే, వారేమన్నా ఓ బిజినెస్ మోడల్ గా స్వీకరించే వీలుందా? దగ్గర ఆగాయి నా ఆలోచనలు ప్రస్తుతం. (నా ఉటంకింపులు లేకుండా వార్తని వార్తగా ఇక్కడ చదవొచ్చు).
అమెరికా కాఫీ చైన్ 'స్టార్ బక్స్' ఒడిదుడుకుల్లో ఉందన్న వార్త చూడగానే నాకు మన 'కేఫ్ కాఫీ డే' గుర్తొచ్చింది. ఈ రెండు కాఫీ చైన్లకీ పోలికలు పెరిగిపోతున్నాయి రోజురోజుకీ. 'కాఫీ డే' ని తన ఇంటిపేరుగా మార్చేసుకున్న దివంగత వీజీ సిద్ధార్థ ఒకానొక టైం లో ఈ 'స్టార్ బక్స్' కి పోటీ ఇవ్వాలనుకున్నాడు, దేశీయంగా మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో. బెంగళూరు నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఊపందుకుంటున్న తొలినాళ్లలో సిద్ధార్థ్ చేసిన 'కేఫ్ కాఫీ డే' ప్రయోగం ఊహించనంతగా విస్తరించింది, అది కూడా తక్కువ కాలంలోనే. సిద్ధార్థ్ వ్యాపార సామ్రాజ్యం కూడా కాఫీ నుంచి అనేక ఇతర రంగాలకి విస్తరించింది. అతడి అకాల, అనూహ్య మరణం తర్వాత 'ఇక కాఫీ డే పని అయిపోయినట్టే' అనుకున్నారు అందరూ. ఆ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపధ్యం మంచినీ, చెడునీ కూడా చేసిందన్నారు. ఊహించని విధంగా సిద్ధార్థ భార్య మాళవిక తెరమీదకి వచ్చింది. కాఫీ డే పగ్గాలు చేపట్టడమే కాదు, అప్పులన్నీ తీర్చి సంస్థని గాడిన పెడతానని నమ్మకం కలిగించింది ఉద్యోగులు అందరిలోనూ. ఆమె కృషి కొనసాగుతోంది.
అటు 'స్టార్ బక్స్' కూడా చిన్నగా మొదలై తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకుని వేగంగా విస్తరించిన సంస్థ. అప్పటివరకూ ఇల్లు, పని ప్రదేశం తప్ప మరో చోటు తెలీని వారికి 'థర్డ్ ప్లేస్' ని పరిచయం చేసింది. రకరకాల కాఫీ ఫ్లేవర్లని అన్ని రకాల ధరల్లోనూ అందుబాటులో ఉంచడం, కస్టమర్లు కోరిన కొత్త ఫ్లేవర్లని, కాంబినేషన్లని అప్పటికప్పుడు చేసి ఇవ్వడం లాంటివి 'స్టార్ బక్స్'ని సగటు అమెరికన్లకి దగ్గర చేశాయి. అదే సమయంలో ఓ సంస్థగానూ మిగిలిన సంస్థలకి భిన్నంగా వ్యవహరించింది 'స్టార్ బక్స్'. పూర్తి కాలపు ఉద్యోగులకే కాదు, కాంట్రాక్టర్లకీ షేర్లు ఇవ్వడం, సామాజిక బాధ్యత తలకెత్తుకుని, అవసరమైన సమయాల్లో అవసరమైన విషయాల మీద జనంలో కదలిక తెచ్చే ప్రయత్నం చేయడం (రేస్ సమస్య లాంటివి), చిన్నచిన్న అమ్మకం దారులని ప్రోత్సహించడం, విద్యార్ధులకి స్కాలర్షిప్పులు.. ఇలా సామాజిక బాధ్యతని నెరవేర్చడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అలాంటి 'స్టార్ బక్స్' లో అంతర్గత సంక్షోభం ముదురుతోందంటోంది అమెరికన్ మీడియా.
![]() |
| Google Image |
అమెజాన్ తో కలిసి 'స్టార్ బక్స్' ప్రారంభించిన నో టచ్ కాఫీ షాపులు వివాదం మొదలవడానికి కారణమట. బరిస్టా (కాఫీ కలిపి ఇచ్చే ఉద్యోగి) అవసరం లేకుండా, యాప్ ద్వారా కాఫీ ఆర్డర్ ఇచ్చి, పే చేసి, మెషీన్ నుంచి కప్పు అందుకుని తాగే ఈ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో ఉద్యోగాల కోత ఏర్పడుతుందని భయం మొదలైందట ఉద్యోగుల్లో. ఈ కొత్త ఏర్పాటుకి ప్రజలింకా పూర్తిగా అలవాటు పడలేదు. కాఫీ షాపులోకి వెళ్ళడానికి ఫింగర్ ప్రింట్స్ ఎందుకివ్వాలో అర్ధం కాని వాళ్ళే ఎక్కువ ఉన్నారు ప్రస్తుతానికి. ఒకప్పుడు ఘనంగా అనిపించిన 'స్టార్ బక్స్' వాళ్ళ పే చెక్కులు, కోవిడ్ తర్వాత సవరింపబడిన మార్కెట్ వేతనాలతో పోలిస్తే వెలవెలపోతూ ఉండడం, షిఫ్టుల విషయంలో స్పష్టత లేకపోవడం వంటివన్నీ ఉద్యోగులు రోడ్డెక్కేలా చేశాయి. ఫలితంగా, 'స్టార్ బక్స్' షేరు పతనమవుతోంది. ఓ పక్క మూతపడిపోతోందనుకున్న 'కేఫ్ కాఫీ డే' పునరుత్తానం వైపు అడుగులు వేస్తుండగా, 'స్టార్ బక్స్' భవిష్యత్తుని గురించి సందిగ్ధత ఏర్పడడం ఓ చిత్రమైన పరిణామం.
ఇంతకీ, 'కేఫ్ కాఫీ డే' ని పునర్నిర్మించడం మాళవికకి నల్లేరు మీద బండి నడక అవుతుందా? సిద్ధార్థ్ కాఫీ డే ప్రారంభించే నాటికీ, ఇవాళ్టికీ మార్కెట్లో చాలా మార్పులు వచ్చాయి. నాడు ప్రజలకి వేరే ఛాయిస్ లేదు. ఇప్పుడు ఎంచుకునేందుకు ఛాయిస్ లు అనేకం. సాఫ్ట్వేర్ రంగంలో మొదలయిన 'స్టార్ట్ అప్' ల ట్రెండు కాఫీ వ్యాపారానికీ విస్తరించింది. కొత్తగా వస్తున్నవాళ్ళు కూడా వ్యాపారాన్ని ఆషామాషీగా తీసుకోడం లేదు. నేరుగా కాఫీ ఎస్టేట్లకి వెళ్లి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ సరుకుని కొనుక్కు తెచ్చి, గింజల్ని స్వయంగా పొడికొట్టి, కాఫీ చేసి అమ్ముతున్నారు. కాఫీ నాణ్యత విషయంలో రాజీ పడక పోవడం, కొత్త రుచుల్ని పరిచయం చేయడానికి సర్వదా సిద్ధంగా ఉండడంతో ఆదరణ బాగుంటోంది. వీటికి లేనిదీ, 'కాఫీ డే' కి ఉన్నదీ బ్రాండ్ ఇమేజి. ఈ కారణంగానే వీటి విస్తరణ ఆలస్యమవుతోంది. ఈ కొత్త సంస్థలు నిలదొక్కుకునే లోగానే 'కాఫీ డే' బండిని పూర్తిగా పట్టాలెక్కించడం మాళవిక ముందున్న పెద్ద సవాలు. మరి దేశీయ 'స్టార్ బక్స్' కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
కాఫీ గురించి మాట్లాడుకుని, టీ గురించి చెప్పుకోకపొతే ఎలాగ? సిద్ధార్ధ్ చూపించిన మార్గాన్ని టీ వ్యాపారులూ ఉపయోగించుకున్నారు. 'కాఫీ డే' స్థాయిలో కాకపోయినా, అనేక 'టీ' చైన్లూ మార్కెట్లోకి వచ్చాయి. పోటీ ఎక్కువగా ఉండడం, విస్తరణ వేగంగా కాక మందకొడిగా సాగుతూ ఉండడం ఈ రంగాన్ని పీడిస్తున్న సమస్య. నగరాల్లో ఉండే పోటీకి దూరంగా, చిన్న పట్టణాల మీద దృష్టి పెట్టి 'టీ టైం' చైన్ ని విస్తరించిన గోదావరి కుర్రోడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కథ స్ఫూర్తివంతంగా అనిపించింది. ఇంజనీరింగ్ చదివి, పదేళ్ల పాటు సాఫ్ట్వేర్ రంగంలో పని చేసిన ఈ కడియం కుర్రాడు, ఉద్యోగాన్ని వదిలి టీ వ్యాపారంలోకి దిగడం, అది కూడా కార్పొరేట్ స్థాయిలో కాకుండా, గ్రామీణ స్థాయి నుంచి మొదలు పెట్టడం అతని కుటుంబాన్నే కాదు, అందరినీ ఆశ్చర్య పరిచింది. పెద్ద గ్రామాలు, చిన్న పట్టణాల్లో టీ వ్యాపారానికి కొదవ లేదని, కోట్లలో ఆదాయం సంపాదించే వీలుందని నిరూపించింది 'టీ టైం'. రకరకాల పేర్లతో స్థానిక షాపుల వాళ్ళు ఇమిటేషన్ బ్రాండింగ్ చేసేసుకున్నా, ఆ పోటీని తట్టుకుని తన బ్రాండ్ నేమ్ ని నిర్మించుకుని, నిలబెట్టుకున్నాడు శ్రీనివాస్. ఇవీ కాఫీ, టీ లని గురించి కాసిన్ని కబుర్లు.
ఉగాది కన్నా ముందే ఎండలు మండిపోతున్నాయి. డీహైడ్రేషన్, వడదెబ్బ నుంచి ఎవరిని వారు రక్షించుకోవాల్సిన తరుణం వచ్చేసింది. కనబడ్డ ఓ జ్యూస్ షాపు లోకి అదాటున వెళ్లి, మెనూ చూడకముందే ఆర్డర్ ఇచ్చేసి, తాపీగా కూర్చుని మెనూ తిరగేస్తుండగా పక్క టేబుల్ నుంచి ఆర్డర్ వినిపించింది 'బటర్ ఫ్రూట్ జ్యూస్'. మెనూలో స్పెషల్ ఐటమ్స్ కేటగిరీలో కనిపించింది 'అవొకాడో' బొమ్మతో. ఆహా! ఏ దేశపు ఫలాన్నైనా ఆపళంగా తినేయడం ఒక్కటే కాదు, జ్యూస్ పిండుకుని తాగేయగలుగుతున్నాం కూడా కదా అని ఆశ్చర్యం కలిగింది. ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోవడం అంటే ఏమిటో మరోమారు అనుభవానికి వచ్చింది. నోరు తిరగని పేర్లున్న రకరకాల ఫలాలని, స్థలకాలాదులతో నిమిత్తం లేకుండా ఆరగించగలగడాన్ని ఒకప్పుడు ఎవరూ ఊహించలేదు.
ఇప్పుడిప్పుడు పెద్ద పెద్ద మాల్స్ లో మాత్రమే కాదు, వీధి చివర సూపర్ బజార్ల లోనూ ఇప్పుడు అవొకాడోలూ, ఫిగ్సూ, కివీ పళ్ళూ ఇంకా అనేకానేక విదేశవాళీ ఫలాలూ ప్రత్యేక ప్యాకింగుల్లో నోరూరిస్తున్నాయి.ధరవరల గురించి మాట్లాడ్డం ఓల్డ్ ఫ్యాషన్ కాబట్టి ఆ జోలికి వెళ్లొద్దు కానీ, ఇలా చప్పన్నారు దేశాలకీ పళ్ళని ఎగుమతి చేయడం వల్ల ఆయా రైతులు ఏమాత్రం ఆర్జిస్తున్నారు? మన రైతులు వాళ్ళ పంటల్ని ఇలాగే ఎగుమతి చేయగలుగుతున్నారా? ఆయా విదేశీ పంటల్ని మన దగ్గర పండించేందుకు చేసే ప్రయత్నాల వల్ల లాభనష్టాలేంటి? లాంటి ప్రశ్నలతో బుర్ర మరికొంచం వేడెక్కింది. షాపులో రద్దీ చూస్తే ఆర్డర్ నా నోటిదగ్గరకి రాడానికి బాగానే సమయం పడుతుందని అర్ధమై, ప్రశ్నల మీదే దృష్టి పెట్టాను.
![]() |
| Google Image |
'వెన్న ఫలం' గా తెనిగించ గలిగే అవొకాడో జన్మస్థలం మెక్సికో. అల్లప్పడు డోనాల్డ్ ట్రంపు సరిహద్దు గోడ కట్టేస్తానని బెదిరించిన అమెరికా పొరుగు దేశం. ఈ అవొకాడోలు తొలుత అమెరికాకీ, అక్కడినుంచి గ్లోబులో ఉన్న చాలా దేశాలకీ మొదట పరిచయమై, అటు పైని వదల్లేని అలవాటయ్యాక మెక్సికో రైతులకి అక్షరాలా పంట పండింది. మిగిలిన అన్నిదేశాల్లోలాగే అక్కడా మధ్య దళారులు బాగా డబ్బు చేసుకున్నా, వెన్న పళ్ళు పండించిన రైతులు కూడా చెప్పుకోదగ్గ లాభాలనే ఆర్జిస్తున్నారు. మెక్సికోలో ఉన్న నీళ్లన్నీ అవొకాడోలు పండించదానికే చాలడంలేదంటూ మీడియా కోడై కూయడం మొదలుపెట్టింది. మనకి 'ఈనాడు' 'సాక్షి' ఉన్నట్టే అన్ని స్థాయిల్లోనూ పరస్పర విరుద్ధ పత్రికలు ఉంటాయి కదా. ఆ రెండో వర్గమేమో చికెనూ, మటనూ కోసం కోళ్ళనీ, మేకల్నీ పెంచడానికయ్యే నీళ్ల ఖర్చు కన్నా, అవొకాడోలు పండించడానికి వ్యయమయ్యే నీళ్లు బహుతక్కువనే లెక్కలతో వచ్చింది.
అన్నట్టామధ్య మన మీడియా 'డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సీమలో సిరుల పంట' అంటూ హోరెత్తింది గుర్తుందా? సదరు డ్రాగన్ ఫ్రూట్ కూడా విదేశీ ఫలమే. స్పష్టంగా చెప్పాలంటే అమెరికన్ మూలాలున్న పండు. దిగుమతుల ఖర్చు తగ్గించుకోడానికీ, వీలయితే ఎగుమతులు చేసి డాలర్లు ఆర్జించడానికీ ప్రభుత్వం వారు రైతుల్ని డ్రాగన్ ఫ్రూట్ సాగుకి విపరీతంగా ప్రోత్సహిస్తున్నారని చెప్పింది మన మీడియా. 'అరకు లో యాపిల్ సాగు' అంటూ ఇంకో రకం వార్తలు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి చదివినప్పుడు నాకేమనిపిస్తుందంటే మన నేలలో విదేశీ పంటలు పండించడం వల్ల, మనవైన పంటలు పండించుకునే చోటుని నష్టపోతున్నాం కదా అని. దీనికి జవాబు బ్రెయిన్ డ్రైన్ అనబడే మేధోవలసలకు జవాబంత పెద్దదని కూడా తెలుసు కాబట్టి, ఎవరితోనూ చర్చ పెట్టలేదు.
జిహ్వకో రుచి ఉండడంలో ఆశ్చర్యం లేదు కానీ, అన్ని జిహ్వలకీ అమెరికా/విదేశీ పళ్లే ఎందుకు రుచి అవుతున్నాయి అన్నది ఆశ్చర్య పరిచే విషయం. మనవైన తాటి ముంజలు, రేగు, ఈత, నేరేడు పళ్ళ లాంటివి ఇంతే విస్తృతంగా మార్కెట్లో ఎందుకు కనిపించడం లేదన్నది బొత్తిగా అర్ధంకాని విషయం. ఈ విదేశీ పళ్ళన్నీ అందమైన పేకింగుల్లో, సూపర్ మార్కెట్ల అద్దాల పెట్టెల వెనుక నుంచి షోగ్గా రారమ్మని పిలుస్తుంటే, మనవైన పళ్ళు మాత్రం ఇంకా సైకిలు వెనుక బుట్టలకీ, చెట్టు కింది గోనె పట్టాలకీ మాత్రమే పరిమితమై పోవడం బొత్తిగా అర్ధం కాని విషయం. పోనీ, విదేశాల్లో ఏవన్నా ఇవి మహారాణీ భోగం అనుభవిస్తున్నాయా అంటే అదీ లేదు. మావిడి మినహా మిగతా ఏ పళ్ళకీ ఆ భాగ్యం దక్కినట్టు లేదు. మనం మాత్రం మనవైన పళ్ళని బలిపెట్టి మరీ విదేశీ ఫలాలని నెత్తిన పెట్టుకుంటున్నాం అని గుర్తొచ్చి చివుక్కుమనిపించింది. మెనూని మరింత జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టాను, మళ్ళీసారి వచ్చినప్పుడు అప్పటికి కొత్తగా వచ్చిచేరిన జ్యూసులని పసిగట్టడంకోసం...
'ఒకే దెబ్బకి రెండు పిట్టలు' అనే సామెత ఇక్కడ ఎంతవరకూ సరిపోతుందో తెలియడం లేదు కానీ, ప్రపంచాన్ని వణికించిన కరోనా సినిమా పరిశ్రమకి, ప్రత్యేకించి తెలుగు సినిమా పరిశ్రమకి, ఓ మేలు చేసింది. చాన్నాళ్లుగా పరిష్కారం లేకుండా ఉన్న, అసలు పరిష్కారం అవుతుందా లేక నానాటికీ పెరిగి పెద్దదవుతుందా అని సందేహిస్తున్న ఓ దీర్ఘకాలిక సమస్యకి పరిష్కారాన్ని వెతికిపెట్టింది. ఈ పరిష్కారాన్ని అంది పుచ్చుకోవడం, అనువుగా ఉపయోగించుకోవడం అన్నది ఇప్పుడు సినిమా పరిశ్రమ చేతిలో ఉంది. ప్రేక్షకులు కోరింది మాత్రమే తీసే పరిశ్రమ, అదే ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పుని ఎంతవరకూ గమనిస్తుంది, వారు కోరుతున్నదే చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న విషయం.
కరోనా కి ముందు వరకూ సినిమా పరిశ్రమకి చెందిన చిన్న నిర్మాతలు, ఇంకా పెద్దవాళ్ళు కాని హీరోల నుంచి వినిపించిన ప్రధాన ఫిర్యాదు తమ సినిమాలకి థియేటర్లు దొరకడం లేదని. పెద్ద సినిమాలు లెక్కకి మిక్కిలి థియేటర్లలో విడుదలవుతూ ఉండడం, థియేటర్లన్నీ 'ఆ నలుగురి' చేతుల్లో కేంద్రీకృతం అవ్వడం వల్ల, చిన్న సినిమాల విడుదల గాలిలో దీపంగా మారిందనీ, సినిమా మంచి టాక్ తెచ్చుకుని, నిలబడే అవకాశాలు ఉన్నా, పెద్ద సినిమాకి దారివ్వడం కోసం థియేటర్ల నుంచి బలవంతంగా ఎత్తేస్తున్నారనీ వెల్లువగా ఫిర్యాదులు వినిపించాయి. "అప్పట్లో ఇలాంటి పరిస్థితి ఉంటే 'శంకరాభరణం' సూపర్ హిట్ అయ్యి ఉండేదా?" అని ఆవేశంగానూ, ఆవేదనతోనూ ప్రశ్నించిన నిర్మాతల్ని మనం టీవీల్లో చూశాం.
మిగిలిన అన్ని రంగాల్లోనూ తెచ్చినట్టే, ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి సినిమాలకి సంబంధించి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. లాక్ డౌన్ వల్ల సినిమాహాళ్లు మూతపడి, టీవీ చానళ్ళు మూస కార్యక్రమాల నుంచి బయట పడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు (ఆ కార్యక్రమాలని కూడా కొన్నాళ్ళు ప్రసారం చేయలేకపోయినప్పుడు) ఓవర్ ది టాప్ (ఓటీటీ) వినియోగదారుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం మొదలయ్యింది. మార్కెట్ బాగుండడంతో కొత్త పెట్టుబడిదారుల దృష్టి పడి, తక్కువ కాలంలోనే ఓటీటీ ఓ లాభదాయకమైన పరిశ్రమగా మారింది. మనకి సంస్కృతి అయినా, వినోదం అయినా సినిమానే కాబట్టి ఈ ఓటీటీ కంటెంట్ లోనూ సినిమాలు, సినిమా ఆధారిత కార్యక్రమాలే సింహభాగాన్ని ఆక్రమించాయి. అవకాశాలు తగ్గిన సినిమా వాళ్ళకి, కొత్తగా ఈ రంగంలో అదృష్టం పరీక్షించుకుందామనుకునే వారికీ ఓటీటీ పునరావాస కేంద్రంగా మారింది.
| Google Image |
కొత్తగా ఏం వచ్చినా ఆదరించే ప్రజలు ఓటీటీలనీ బాగానే ఆదరించారు. కొన్ని సినిమాలు ప్రయోగాత్మకంగా 'డైరెక్ట్ ఓటీటీ రిలీజ్' బాట పట్టడంతో రిలీజైన సినిమాని, రిలీజు నాడే ఏ ఇబ్బందీ లేకుండా డ్రాయింగ్ రూములో ఇంటిల్లిపాదీ కలిసి కూర్చుని చూసే అవకాశం వచ్చింది. టీవీ చానళ్ళు సినిమాలని వేసినా ఆ బ్రాడ్ కాస్ట్ థియేటర్ రిలీజ్ జరిగిన కొన్ని నెలల తర్వాత ఉండేది. అప్పుడు కూడా వాళ్ళు చెప్పిన టైముకి సవాలక్ష ప్రకటనలతో పాటుగా ఓపిగ్గా సినిమా చూడాల్సి వచ్చేది. సినిమా రన్ టైం కన్నా ప్రకటనల ప్రసారానికి ఎక్కువ సమయం పట్టిన సందర్భాలు లెక్కలేనన్ని. ఓటీటీలో ఈ గొడవలేవీ లేవు. బ్రాడ్ కాస్ట్ టైం కోసం ఎదురు చూడక్కర్లేదు, మనకి నచ్చినప్పుడు ట్యూన్ చేసుకుని చూడొచ్చు. నచ్చిన పాటలో, సన్నివేశంలో వెనక్కి తిప్పీ, నచ్చని వాటిని గెంతించీ కూడా చూడొచ్చు. ప్రకటనల గొడవ లేనేలేదు. కొన్ని టీవీ చానళ్ల ఏడాది చందా కన్నా, కొన్ని ఓటీటీల వార్షిక చందా తక్కువ. పైగా, స్మార్ట్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా సినిమాలు చూసే సౌకర్యం ఉంది.
థియేటర్లు దొరకడం లేదని, తమ ప్రతిభ జనానికి తెలిసే దారి లేకుండా పోతోందనీ ఆవేదన చెందుతున్న సినిమా వాళ్ళకి నిజానికి ఈ ఓటీటీ మంచి వరం. ఎన్నిరోజులు ఆడుతుందో, పెట్టిన డబ్బులు వస్తాయో రావో అన్న బెంగ అక్కర్లేదు. పెట్టిన ఖర్చు మీద కొంత లాభాన్ని వేసుకుని ఓటీటీకి అమ్మే వీలుంది. ఇవాళ్రేపు యూట్యూబర్లు, టిక్ టాకర్లు కూడా స్టార్లుగా పరిణమిస్తున్న వేళ, బాగా నటిస్తే ఓటీటీ నటులకీ పేరుకి కొదవుండదు. ప్రతిభని ప్రదర్శించి, పేరు తెచ్చుకుంటే అవకాశాలు అవే వస్తాయి. కావాల్సిందల్లా జనాన్ని రంజింపజేయడం. థియేటర్ల మోనోపోలీ, టీవీ ఛానళ్ల ప్రైమ్ టైం మోనోపోలీలకి ఇక్కడ అవకాశం లేదు. ఒక్కసారి కొనుక్కున్న తర్వాత, ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యతని సదరు ఓటీటీలే తీసుకుంటున్నాయి కాబట్టి, నిర్మాతలకి ప్రచార ఖర్చు కూడా కలిసొచ్చినట్టే. కావాల్సిందల్లా సరుకులో నాణ్యత. సినిమాల్లో జనరంజకత్వం.
గడిచిన ఏణ్ణర్ధంలో ఓటీటీలో వచ్చిన సినిమాల్లో అధికశాతం నిరాశ పరిచాయి. కొన్నైతే, ఓటీటీ రిలీజ్ జరగడం వల్ల ఆయా నిర్మాతలు నష్టాల నుంచి బయట పడ్డారు కూడా. అయితే కొత్తదనం ఏమాత్రం లేకుండా అదే పడికట్టు పద్ధతిలోనూ, లేకపోతే సెన్సార్ గడబిడ ఉండదు కాబట్టి మసాలాలు దట్టించీ తీసిన సినిమాలని ఓటీటీలోకి వదిలారు. వీటిలో రివైండ్ చేసి చూసుకున్న వాటికన్నా, స్కిప్పులు కొట్టినవే ఎక్కువ కావడం విషాదం. 'ఓటీటీ అంటే ఇంత చిన్నచూపా?' అనిపించే లాంటి సినిమాలూ వచ్చి పడ్డాయి. ఈ చిత్రరాజాలు థియేటర్లలో విడుదలై ఉంటే బోల్డంత డబ్బు ఖర్చు పెట్టుకుని చూసిన ప్రేక్షకులు గగ్గోలు పెట్టి ఉండేవాళ్ళు. అందుబాటులోకి వచ్చిన ఓ కొత్త మాధ్యమాన్ని ఉపయోగించడం కన్నా, దుర్వినియోగం చేసేవాళ్ళే ఎక్కువయ్యారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం జనాలు ఓటీటీ సినిమా అంటే భయపడే రోజు ఎంతో దూరంలో ఉండదు. ఓటీటీలో ఒక్క 'శంకరాభరణం' కూడా ఎందుకు రాలేదన్నది కోటి రూపాయల ప్రశ్న.
మనుషులకైతే చాలా అయోమయాన్ని కలిగించే సందర్భం. ఏవేవో చేసేయాలనే ఉత్సాహం, ముందు వెనకలు తెలియని ఆవేశం, కొంచం అమాయకత్వం, మరికాస్త మూర్ఖత్వం, అన్ని విషయాల గురించీ బోల్డంత స్పష్టత ఉందనుకునే అస్పష్టత, అన్నింటినీ మించి ఎదుటి వాళ్ళకి ఏమీ తెలీదేమో అనిపించే అజ్ఞానం.. ప్రత్యేకంగా చెప్పాలా, ఇవన్నీ టీనేజీ లక్షణాలని? పదమూడో పుట్టినరోజనేసరికి వస్త్రధారణ మొదలు, సెలెబ్రేషన్స్ వరకూ అప్పటివరకూ లేని ఎన్నో మార్పులు చోటు చేసేసుకుంటాయి. ముందే చెప్పినట్టుగా ఇవన్నీ మనుషుల విషయంలో. మరి బ్లాగుకి? టీనేజీలో అడుగు పెట్టింది 'నెమలికన్ను' బ్లాగే తప్ప, రాసే నేను కాదు కాబట్టి తేడాలేవీ ఉండవన్నమాట!!
కొన్నేళ్లుగా బ్లాగు రాతలు పెద్దగా లేకపోయినా, ఏడాదికోసారి ఇదిగో ఇలా చేసుకునే సింహావలోకనం మాత్రం భలేగా అనిపిస్తోంది. మొదట్లో అయితే రాయలేకపోతున్నామే అని సిగ్గూ, మొహమాటం లాంటివి అడ్డం పడి, ఈ ఏడాది అలా జరక్కూడదు లాంటి నిర్ణయాలు బలంగా తీసేసుకునేలా చేసేవి. అయితే, రానురానూ ఈ రాయకపోవడం కూడా అలవాటైపోయింది. కాబట్టి, చట్టంలాగే మనం కూడా మన పని మనం చేసుకుంటూ పోవడమే. తలంటు స్నానాలూ , కొత్త బట్టలూ లాంటివి పక్కన పెట్టి కాస్త డిఫరెంట్ గా ఆలోచిద్దామని కూర్చుంటే, అప్పట్లో ఉన్న బ్లాగుల్లో ఇప్పటికీ నడుస్తున్నవెన్ని? అనే ప్రశ్న వచ్చింది. రాశి తక్కువే కానీ, వాసిలో మంచి టపాలే అప్పుడప్పుడన్నా పలకరిస్తూ ఉండడం సంతోషాన్నిచ్చే సంగతి.
గతకొన్నేళ్ళుగా అప్పుడప్పుడూనూ, గతేడాదిగా కొంచం తరచుగానూ నాకెదురైన ఓ సమస్యని మీతో పంచుకోవాలనిపిస్తోంది. ఈ బ్లాగులో వచ్చే పుస్తక పరిచయాలు చదివిన వారిలో కొందరు, ఆయా పుస్తకాల పీడీఎఫ్ కాపీలు తమకి షేర్ చేయమని అభ్యర్థిస్తూ మెయిల్స్ రాస్తున్నారు. ఈమధ్య కాలంలో ఇది కొంచం పెరిగి పెద్దదై, తమకోసం నా దగ్గర ఉన్న పుస్తకాలని స్కాన్ చేసి పంపాల్సిందిగా డిమాండు కూడా చేస్తున్నారు. బ్లాగు పాఠకులుగా తమకా అధికారం ఉందని కొందరు అనుకుంటూ ఉండడం నన్నిప్పుడు ఆశ్చర్య పరచడం కూడా మానేసింది. నేను కాస్త ఓపికగా ఆయా పుస్తకాలు వెతికి, కాపీలు దొరికే చోటు వివరాలన్నీ మెయిల్ పంపినా అడిగిన వారు తృప్తి చెందడం లేదు. "వీటి బదులు, పుస్తకం స్కాన్ చేసి పంపేయండి" అని సలహా ఇస్తున్నారు నాకు. "పరిచయం రాస్తున్నందుకు మీకు కాంప్లిమెంటరీ కాపీలు వస్తాయి కదా?" తరహా ప్రశ్నలూ పలకరిస్తున్నాయి.
నాకు పుస్తకాలు కొని చదవడమే అలవాటు. ఎవరికైనా బహుమతి ఇవ్వాలన్నా ఫిజికల్ కాపీలనే కొని ఇస్తాను. ఉచితంగా పుస్తకాలంటే - నా స్నేహితుల దగ్గర నుంచి బహుమతిగా వచ్చినవే తప్ప ఇంకెక్కడినుంచీ కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, స్కానింగ్, పీడీఎఫ్ కాపీల సర్క్యులేషన్ కి నేను బద్ధ వ్యతిరేకిని. రచయితలు, పబ్లిషర్ల మీద నాకున్న గౌరవం ఇందుకు ఒక కారణం. మిగిలిన కారణాలు ఇక్కడ అప్రస్తుతం. పుస్తకాలు ప్రచురించుకున్న కొందరు రచయితలు నాకు కాంప్లిమెంటరీ కాపీ పంపుతానని మెయిల్ రాసిన సందర్భాలున్నాయి. ఆ మెయిల్స్ ని నేను నా బ్లాగుకి దక్కిన గౌరవంగా భావించి, ఆయా పుస్తకాలని కూడా కొనే చదివాను. కాబట్టి, నాదగ్గర ఒక్కో పుస్తకమూ ఒకటికి మించి కాపీలు పోగుపడి ఉంటాయని అనుకోవద్దు.
అచ్చయిన కొంత కాలానికి పుస్తకాలు ప్రింట్ లో దొరక్కపోవడం అనే సమస్య ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఎప్పటినుంచో ఉన్నదే. దీనికి పరిష్కారం స్కానింగ్ కాపీల సర్క్యులేషన్ ఎంతమాత్రమూ కాదు. పైగా, రచయిత జీవించి ఉండగానే, మరో ప్రింట్ తెచ్చే ఏర్పాట్లు చేసుకుంటూండగానే, ఓరిమి పట్టలేకపోవడం మెచ్చే సంగతి కాదు. కొన్ని క్లాసిక్స్ ఎలాగో ఆన్లైన్ ఆర్కీవ్స్లో భద్రపరచబడి ఉన్నాయి. అందరికీ ఉచితంగా దొరుకుతున్నాయి. పబ్లిక్ లైబ్రరీలు, పాత పుస్తకాల షాపులు లాంటి చోట్లు ఉండనే ఉన్నాయి. రచయితో, పబ్లిషరో వ్యయ ప్రయాసలకోర్చి వేసుకున్న పుస్తకాన్ని, నేను ఓ కాపీ కొన్నాననే హక్కుతో స్కాన్ చేసి సర్క్యులేట్ చేయలేను. ఆ పుస్తకం మీకెంత ప్రియమైనదైనా కావొచ్చు, ఎంతో అవసరమైనదైనా కావొచ్చు. దానిని పొందే మార్గం 'నేను' కాదు.
సరే, గడిచిన ఏడాది తాలూకు రాతకోతల లెక్కలోసారి చూస్తే, రాసినవి ముచ్చంగా ముప్ఫయి పోస్టులు. చదివిందీ, చూసిందీ (సినిమాలు) కూడా తక్కువే. 'కరోనా ఎత్తుకుపోయిన ఇంకో సంవత్సరం' అనిపిస్తోంది వెనక్కి తిరిగి చూసుకుంటే. సగం చదివినవి, మొదలు పెట్టాల్సినవి ఇంకా అలా ఉండగానే, బెజోస్ గారి మనిషి కొత్త పార్సిల్ తెస్తున్నాడంటూ సందేశం వచ్చింది. ముందుగా సగంలో ఉన్నవాటిని పూర్తి చేయాలా? వాటినలా ఉంచి కొత్తవి అందుకోవాలా? అన్నది శ్రీశ్రీ కి తెలియని సంధ్యా సమస్య. ఇక, ఈ టీనేజర్ ప్రయాణం ఎలాఉండబోతోందన్న ప్రశ్నకి కాలమే జవాబు చెప్పాలి..
అడ్డబాస చూడడం నాకు భలే ఇష్టం. ఐతే అది అందరికీ సూటవ్వదు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, వయసైపోయిన భానుమతి.. వీళ్ళని అడ్డబాస లేకుండా ఊహించలేం. చిన్నప్పుడు కజిన్స్ ఎవరైనా ముక్కు కుట్టించుకుంటుంటే అడ్డబాసకి కూడా ఓ కుట్టు వేయించుకోమని ఉచిత సలహా ఇస్తూ ఉండేవాడిని. "రేపు మీ ఆవిడకి/పిల్లలకి కుట్టిద్దువుగానిలే" అంటూ విరుచుకుపడే వాళ్ళు తప్ప ఒక్కరూ నా సలహా పాటించలేదు. 'ఓ కుట్టు ఎలాగో కుట్టించుకుంటున్నప్పుడు ఇంకో కుట్టుకి ఏమవుతుందో' అని అయోమయ పడేవాడిని. అటు శాస్త్రానికి, ఇటు ఫ్యాషన్ కీ కూడా కుట్లేవీ వేయించుకోకుండానే రోజులు గడిచిపోయాయి. ఇంకొకరిని ఇన్స్పైర్ చేసి, కుట్లు వేయించుకునేలా చేసే శక్తి లేదని కూడా తెలిసొచ్చేసింది.
ఇదిలా ఉండగా, అసలు ఆ 'ముక్కు కుట్టుట' అనే ప్రక్రియ ఎలా ఉంటుందో కూడా అనుభవంలోకొచ్చింది, కరోనా పుణ్యమా అని. అది కూడా ఒకసారి కాదు, ముచ్చంగా మూడుసార్లు. అది యెట్లన్నన్.. అనగనగా కరోనా ఫస్ట్ వేవ్ కాలంలో అనుకోకుండా పరీక్ష చేయించుకోవాల్సి వచ్చింది. 'కరోనా టెస్ట్' అంటే బ్లడ్ టెస్ట్ కాబోలనుకున్న అమాయకపు రోజులవి. కుర్చీలో కూర్చుని, ఎడమచేయి పిడికిలి బిగించి, సర్వససన్నద్దుడినై, టెక్నీషియన్ వైపు 'స్టార్ట్.. కెమెరా.. యాక్షన్ ' అన్న లుక్ ఇచ్చాక బదులుగా సిరంజి కాకుండా ఓ చిరునవ్వు వచ్చింది అతన్నుంచి. నే చేసిన నేరమదేమో తెలియక ప్రశ్నార్థకంగా చూసిన పిమ్మట, "కోవిడ్ టెస్టుకు రావడం మొదటిసారా?" అని ప్రశ్నించి, నా అమాయకత్వాన్ని మన్నించి, తల పైకెత్తమన్నాడు. ఓ పొడుగాటి పుల్లని వైనంగా నా ముక్కులో చొప్పించినప్పుడు ముందు కళ్ళ నీళ్లు తిరిగాయి. వెంటనే తుమ్ము రాబోయి, మర్యాదకి ఆగిపోయింది.
నా అదృష్టానికి, ఆ పుల్ల టెస్టు మొదటిసారి ఫెయిలయింది. మరో పుల్ల, అదే ముక్కు. నేనేమో సర్వశక్తుల్నీ ముక్కు మీద కేంద్రీకరించి టెక్నీషియన్ కి సహకరించా, 'ఇంకోసారి' అంటాడేమో అని భయపడి. మరో పుల్లని గొంతు వరకూ జొనిపి, బయటికి తీసి, శాంపిల్ తీసుకోవడం పూర్తయింది లెమ్మన్నాడు. అప్పుడు పేరూ, ఫోన్ నెంబరూ ఇస్తే చాలన్నారు కానీ, రెండో వేవ్ లో రెండో సారి టెస్టుకి వెళ్ళినప్పుడు ఆధార్ తో సహా సవాలక్ష ఆధారాలు అడిగారు రిజిస్ట్రేషన్ కోసం. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, క్రితం రోజు ఆఫీసులో కలిసి లంచి చేసిన ఓ సహోద్యోగికి పాజిటివ్ వచ్చిందని, తెల్లారుతూనే ఫోనొచ్చింది. అలా టెస్టుకు వెళ్లి, నేను నేనేననే రుజువులన్నీ చూపించాక, 'బ్యాంకు స్టేట్మెంట్ సబ్మిట్ చేయమంటారా?' అని బాధ్యతగా అడిగాను.
"ఇప్పుడు అవసరం లేదు, ఒకవేళ పాజిటివ్ వస్తే అప్పుడు చూస్తాం" అంది కౌంటర్ అమ్మాయి. బ్యాలన్సు కొద్దీ వైద్యం కాబోలనుకున్నాను. సరే, లేబ్ లోకి వెళ్తే పుల్లలధారియై టెక్నీషియను. భూగర్భ జలాలు పైకి తెచ్చేందుకు బోర్ వేసే కార్మికుడిలా అతి శ్రద్ధగా ఆ పుల్లతో నా నాసికను చిలికాడు. గతానుభవాన్ని గుర్తు తెచ్చుకుని నేను పూర్తి స్థాయిలో సహకరించా. 'వన్స్ మోర్' అనకుండా రక్షించాడు నన్ను. వాక్సిన్ రావడమూ, పొడిపించుకోవడమూ, ఇక కరోనా కథ కంచికే అని ఆనందించడమూ జరుగుతూ ఉండగా ఉన్నట్టుండి మూడో వేవ్ మొదలైంది. ఈసారి ఇంటి చుట్టుపక్కల కేసులు పెరిగాయి. దాంతో సామూహికంగా కోవిడ్ టెస్టులు జరిపే ఏర్పాటు మా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. పైగా, టెస్టు చేయించుకోడం తప్పనిసరి.
ఈసారేం డాక్యుమెంట్లు అడగబోతారో అనుకుని, ఎందుకైనా మంచిదని ఓ డాక్యుమెంట్ల బొత్తి చంకన పెట్టుకుని బయల్దేరానా, వాళ్లేమో ఫోన్ నెంబరు ఒక్కటీ చాలనేశారు. ఏవిటో, క్షణక్షణముల్ టెస్టుల వాళ్ళ చిత్తముల్ అనుకుంటూ, దూరం పాటిస్తూ క్యూలో నిలబడ్డా. ఈసారి లేబ్ కాకుండా ఓపెన్ ప్లేస్ అవడం వల్ల, అందరి టెస్టులు అందరికీ కనిపిస్తున్నాయి. ఎవరి ముక్కులోకి పుల్ల వెళ్తున్నా, నా ముక్కు దురదేస్తూ ఉండడం. నేనేమో, ప్రిన్సులాగా మాస్కు మీంచి నా ముక్కు తుడుచుకుంటూ ఉండడం. ఓ అరగంట పాటు ఈ హింస కొనసాగింది. ఆ తర్వాత అసలు హింస. ఇదేదో రెండు టెస్టుల కాంబో అట. ముక్కు పుల్లలు రెండు, ఒక వేళ శాంపిల్ రాకపోతే మరొహటో రెండో పుల్లలు అదనం. వినగానే గుండె ఝల్లుమంది. సర్వశక్తులూ ఒడ్డి శాంపిల్ ఇచ్చేశా, అది మొదలు రోజంతా తుమ్ములే తుమ్ములు.
ముక్కు కుట్టించుకొనుట అనే ప్రక్రియలో ఇమిడి ఉన్న కష్టమేంటో దెబ్బకి అనుభవానికి వచ్చింది. పాపం వాళ్ళేదో ముక్కు పుడక సరదా కోసం తెగించి ఓ కుట్టుకి సిద్ధ పడితే, నేను 'అడ్డబాస' అని సలహా చెప్పడం విని వాళ్లకెంత ఇరిటేషన్ వచ్చి ఉంటుందో బాఘా అర్ధమయ్యింది. ఆఫ్ కోర్స్, ఇప్పుడు ముక్కుకి, చెవులకి కూడా కుట్లు అవసరం లేని జ్యుయలరీ అందుబాటులోకి వచ్చేసింది. అయినప్పటికీ, వాటికి పెద్దగా ఆదరణ ఉన్నట్టు లేదు. చెవులవరకూ ఓకే కానీ (అబ్బాయిలూ ఎక్కువగానే కుట్టించుకుంటున్నారు) ఇప్పుడు ముక్కు కుట్టించుకుంటున్న వాళ్ళు పెద్దగా కనిపించడం లేదు. ఇంతకీ మూడు టెస్టుల రిజల్టు సంగతి చెప్పలేదు కదా.. మూడూ నెగిటివ్ రిజల్టు ఇచ్చి నన్నానంద పరిచాయి. మీ అందరికీ కూడా నెగిటివే రావాలని కోరుకుంటున్నా.. పదండి, ఈ మూడో వేవుని దాటేద్దాం..
ఓ శనివారం మధ్యాహ్నం.. చుట్టూ ఎవ్వరూ లేరు. చేయడానికి ఇతరత్రా పనులేమీ లేకపోవడంతో ఎదురుగా ఉన్న కంప్యూటర్లో గూగుల్ తోనూ, బ్లాగర్ తోనూ కుస్తీ మొదలు పెట్టాను. ఓ రెండు గంటలు గడిచేసరికి కాస్త సంతృప్తికరమైన రూపమొకటి కళ్ళముందు కనిపించింది. ఈలోగా చేయాల్సిన పని తరమడం మొదలు పెట్టడంతో, 'పబ్లిష్' బటన్ నొక్కి, ఆ విండో క్లోజ్ చేసి, రోజువారీ పనిలో పడ్డాను. 'రెస్టీజ్ హిస్టరీ' అనేంత లేదు కానీ, ఇది జరిగింది మాత్రం ఇవాళ్టికి సరిగ్గా పుష్కర కాలం క్రితం. 'నెమలికన్ను' పన్నెండో పుట్టినరోజివాళ.
'బ్లాగు రాయడం ఎందుకు?' అనే విషయంలో మొదటి నుంచీ నాకో స్పష్టత ఉంది. ఇన్నాళ్ల లోనూ నా అభిప్రాయాలలో మార్పు రాలేదు. రాయడాన్ని ఆస్వాదిస్తున్నా, అప్పుడూ, ఇప్పుడూ కూడా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నాకు అర్ధమయ్యింది ఏమిటంటే, గత పుష్కర కాలంలోనూ నా వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో వచ్చిపడిన మార్పుల తాలూకు ప్రభావం నా బ్లాగు మీద స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, అంతకు ముందు కాలానికీ, గడిచిన ఏడాదికీ చాలా స్పష్టమైన తేడా ఉంది. అది నా ఒక్కడికే కాదు, మొత్తం ప్రపంచానికి. మరికొన్ని వారాల్లో 'కరోనా' నామ సంవత్సరం పూర్తవ్వబోతోంది.
ఈ సంవత్సరం ప్రభావమో లేక ఇతరత్రా కారణాల వల్లనో తెలీదు కానీ, గతంలో ఎన్నడూ లేని విధంగా "ఇంకా ఎన్నాళ్ళు రాస్తాం, బ్లాగు ఆపేద్దాం" అన్న ఆలోచన గతేడాదితో చాలాసార్లు వచ్చింది. బ్లాగు మొదలు పెట్టని క్రితం నాకు బ్లాగర్లు ఎవరితోనూ పరిచయం లేదు. మొదలు పెట్టిన కొన్నాళ్లకే చాలా మందితో స్నేహం కుదిరింది. వ్యాఖ్యలు, చాట్లతో పాటు, ఉత్తర ప్రత్యుత్తరాలూ ఉండేవి. కాలం గడిచే కొద్దీ వారిలో కొందరు మార్గశ్రాంతులయ్యారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి 'బ్లాగులు మరణించాయి' అని ప్రకటించేశారు. మిగిలిన కొద్దిమందీ అడపాదడపా రాస్తున్నారు. కొత్తవాళ్లు రాకడ అప్పుడప్పుడూ కనిపిస్తోంది.
![]() |
| Google Image |
పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ కూడా పలకరించే బ్లాగుమిత్రులు ఉండడం విశేషంగానే అనిపిస్తోంది. ఈ మాధ్యమంలో ఉన్న సౌకర్యానికి అలవాటు పడ్డం వల్లనో, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో ప్రారంభం ఎందుకన్న ఆలోచనో, లేదూ రెండింటి కలగలుపో తెలీదు కానీ మరో మాధ్యమంలో రెండో కాలు పెట్టాలని అనిపించడం లేదు. పైగా, ఇప్పటికే వేరే చోట అకౌంట్లు నిర్వహిస్తున్న మిత్రులు ఇస్తున్న ఫీడ్ బ్యాక్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఒకరిద్దరు మాత్రం "అందరం ఇటు వచ్చేశాం, మీరొక్కరూ అక్కడెందుకూ?" అంటూ మెయిల్స్ రాస్తున్నారు అప్పుడప్పుడూ. వాళ్ళని మిస్సవుతున్నప్పటికీ, నావరకూ ఈ పడవ ప్రయాణం బాగుంది మరి.
వెనక్కి తిరిగి లెక్కలు చూసుకుంటే ఒకటి తక్కువ అరనూరు పోస్టులు కనిపించాయి గడిచిన ఏడాదిలో. ఎప్పటిలాగే పుస్తకాలూ సినిమాల కబుర్లే అధికం. పీవీ శతజయంతి సందర్భంగా పోస్టు రాస్తే, కారణాలు వెతికారు కొందరు. అక్కడితో ఆగకుండా, జగన్ పార్టీ అభిమానిని అని ముద్రవేసే ప్రయత్నం చేశారు. నవ్వుకున్నాను. ఎవరైనా క్రమం తప్పకుండా నా బ్లాగు చదువుతూ ఉన్నట్టయితే వాళ్ళు కూడా నవ్వుకునే ఉంటారు బహుశా. చాలామందికి మల్లేనే నాక్కూడా లాక్ డౌన్ లో మలయాళం సినిమాలు పరిచయం అయ్యాయి, కొత్తగా. ఒకప్పుడు ఇరానీ సినిమాలు (ఎక్కువగా బాలల చిత్రాలే) ఎంత కొత్తగా అనిపించాయో, ఇప్పుడు ఇవీ అలాగే అనిపిస్తున్నాయి.
ఇంతకీ, బ్లాగు కోసం రాయాలనుకున్న కొన్ని సంగతులు అలాగే ఉండిపోయాయి. "ఇక ఆపేద్దాం" అనే ఆలోచన బలపడక ముందే రాయాలనుకున్నవన్నీ రాసేయాలని సంకల్పం. ఎంతవరకూ నెరవేర్చుకోగలనో చూడాలి మరి. సముద్ర పరిమాణంలో సమాచారం చుట్టుముట్టేసిన ప్రస్తుత సందర్భంలో కూడా బ్లాగుల్ని గుర్తు పెట్టుకుని చదువుతున్న వారికీ, అభిప్రాయాలూ పంచుకుంటున్న వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానీ పుట్టినరోజు సందర్భంలో..
ముందుగా 'రియలిస్టిక్' సినిమాల మీద బాపూ చెప్పినట్టుగా చెలామణిలో ఉన్న ఓ జోకు: హీరో ఆఫీసు నుంచి నిదానంగా ఇల్లు చేరుకొని, అంతే నిదానంగా కుర్చీలో కూర్చుంటాడు. అతని భార్య అంతకన్నా నిదానంగా వచ్చి, చేతిలో ఫైల్ అందుకుని, 'టీ తీసుకురానా' అని అడుగుతుంది. అతను తలూపుతాడు. ఆమె వంటింట్లోకి వెళ్లి, గిన్నె కడిగి, నీళ్లతో స్టవ్ మీద పెట్టి, స్టవ్ వెలిగించి, నీళ్లు కాగాక టీ పొడి తదాదులన్నీ వేస్తుంది. టీ మరిగే వరకూ కెమెరా టీగిన్నె మీంచి కదలదు. కప్పులో పోసి తెచ్చి భర్తకి ఇచ్చి, పక్కన కూర్చుంటుంది. అతను నింపాదిగా తాగి, కప్పు కింద పెట్టాక, 'ఇంకో కప్పు టీ తీసుకురానా?' అని అడుగుతుంది. అతను జవాబు చెప్పేలోపే థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులందరూ ముక్త కంఠంతో 'వద్దూ' అని అరుస్తారు, హాలు దద్దరిల్లిపోయేలా.
ఇప్పుడో ప్రశ్న: మన తెలుగు సినిమాల్లో వంట చేయడాన్ని చూపించిన సినిమాలెన్ని?? అలా అలనాటి 'మాయాబజార్' నుంచీ ప్రయాణం మొదలు పెడితే, ఘటోత్కచుడి వేషంలో ఉండే ఎస్వీఆర్ పళ్ళాలతో, గుండిగలతో నిండిన వంటకాల్ని చులాగ్గా ఆరగించడాన్ని చూపించారే కానీ, ఎక్కడా వంట చేయడాన్ని చూపలేదు. ఆ వంటకాలన్నీ వండబడినవి కాదు, సృష్టింపబడినవి. 'గుండమ్మ కథ' లో రామారావు పప్పు రుబ్బిపెడితే, 'బుచ్చిబాబు' లో నాగేశ్వర రావు -జయప్రద ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం - వంటవాడిగా నటించాడు. 'దసరా బుల్లోడు' లో వాణిశ్రీ, చంద్రకళల మిరపకాయ బజ్జీల సీన్ సినిమా కథనే మలుపు తిప్పింది. 'గొప్పింటి అల్లుడు' సినిమాలో బాలకృష్ణ వంటవాడిగా హీరోయిన్ల ఇంటికొచ్చి ఒక్క పాటలోనే ఇంటిల్లిపాదికీ కావాల్సినవన్నీ వండి వార్చేస్తాడు. 'చిరునవ్వుతో' హీరో వేణు తొట్టెంపూడి వృత్తి గరిట తిప్పడమే అయినా రెండే సీన్లలో వంట చేస్తూ కనిపిస్తాడు.
కేరక్టర్ ఆర్టిస్టుల వంట అనుకోగానే డబ్బింగ్ జానకి గుర్తోచేస్తుంది మొదటగా. స్టేజీ మీద మంజుభార్గవీ, వెనుక కమల్ హాసనూ 'బాల కనకమయ చేల' కి నాట్యం చేస్తూ ఉంటే, సాక్షి రంగారావు ట్రూపులో వంట చేసే జానకి, పప్పు రుబ్బుతూ కమల్ నాట్యాన్ని అబ్బురంగా చూడడం, ఆ దృశ్యాలని జయప్రద కెమెరాలో బంధిచడం.. 'సాగర సంగమం' చూసినవాళ్లు మర్చిపోలేని దృశ్యం. 'సప్తపది' లో ఇదే డబ్బింగ్ జానకి కోడలు పాత్రధారిణి కుంపటి రాజేసే సీన్ కూడా భలే సింబాలిక్ గా ఉంటుంది. బాగా గుర్తుండి పోయే మరో సన్నివేశం 'సీతారామయ్య గారి మనవరాలు' లోది. సీత పెళ్లి గురించి స్త్రీ బంధు జనమంతా వంటింట్లో వాదులాడుకుంటూ ఉండగా, తనకేం పట్టనట్టుగా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ ఉంటుంది రోహిణి హట్టంగడి. ఏమాటకామాట, ఎంత సహజంగా వంట చేస్తుందో అసలు!! మేనత్త పప్పు రుబ్బుతుంటే, సీత తన వేలు నలిగినట్టుగా అభినయించడమూ ఉందీ సినిమాలో.
బాలూ-లక్ష్మిల 'మిథునం' లో భోజనాలది పెద్ద పాత్ర. పెసరపప్పు రుబ్బిన పిండితో లక్ష్మి పెసరట్టు వేయడాన్ని క్లోజప్ లో చూడొచ్చు. మన సినిమాల్లో వంట సన్నివేశాలు సినిమాలో అంతర్భాగంగా ఉన్నాయి తప్ప, వంటింటి చుట్టూ మాత్రమే తిరిగే సినిమాలు రాలేదనే చెప్పాలి. మనకి మాత్రమే ప్రత్యేకమైన బోలెడన్ని రకాల వంటలున్నప్పటికీ ఇలా ఎందుకు జరిగిందో మరి. అసలిదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే, ఈ మధ్య చూసిన ఒకానొక మలయాళం సినిమా వల్ల. 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' అనే టైటిల్ బాగా ఆకర్షించడంతో చూడడం మొదలు పెట్టా. సినిమా నిడివి కేవలం వంద నిమిషాలే కావడం, లాక్ డౌన్ లో మలయాళం సినిమాలు చూసిన అనుభవం ఉండడం కూడా నన్నీ సినిమా చూడడానికి పురిగొల్పాయి. సినిమాలో మూడొంతులు వంటగదిలోనే జరుగుతుంది. కేరళ మాంసాహార, శాఖాహార వంటలన్నీ వండించారు నాయిక చేత.
ఈ సినిమా మొదట్లో కూడా, నాయిక తన భర్తకి కాఫీ ఇచ్చి, అతగాడా కాఫీని పూర్తిగా తాగాక, ఆ కప్పుని సింకులో శుభ్రంగా కడుగుతుంది, క్లోజప్పులో. అసలు ఈ సీన్ చూస్తుంటేనే నాకూ బాపూ రియలిస్టిక్ సినిమా జోకు గుర్తొచ్చింది. సినిమా ఆసాంతమూ కూడా వంటగదిలో ఆమె చేసే ప్రతి పనినీ అంతే నిశితంగా చిత్రించారు. మొదట్లో ఏంటబ్బా ఇదీ అనిపించినా, రానురాను ఆసక్తి పెరిగి, చివరికొచ్చేసరికి ఆ షాట్ల ఆంతర్యం బోధ పడింది. వంటపని ఒక 'డ్రెడ్జరీ' గా ఎందుకు మారుతుందన్నది సులువుగా తెలిసేలా ఉన్నాయి సన్నివేశాలు. సినిమా ఆసాంతామూ కిచెన్ ఇతివృత్తంతోనే తీసిఉంటే మరింత బాగుండేది కానీ, రెండేళ్ల నాటి ఈ సినిమా రెండో సగంలో అప్పటి ట్రెండింగ్ టాపిక్ వైపుకి కథని మలుపు తిప్పారు. దీనివల్ల అసలు పాయింట్ కి కాస్త అన్యాయం జరిగిందన్న భావం కలిగింది, సినిమా పూర్తయ్యాక.
'మన దగ్గర ఇలాంటి సినిమాలు ఎందుకు రావు?' అన్న ప్రశ్న మలయాళం సినిమాలు చూసే ప్రతిసారీ వచ్చేదే కానీ, ఈ సారి మాత్రం 'కిచెన్ చుట్టూ తిరిగే కథల్ని తెలుగులో ఇంకా బాగా చెప్పే వీలుంటుంది కదా' అనిపించింది. మొన్నటి 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఇతివృత్తం 'బొంబాయి చట్నీ' అయినప్పటికీ అందులో కూడా మెయిన్ పాయింట్ కి జరగాల్సిన న్యాయం జరగలేదు. జంధ్యాల కూడా 'బాబాయ్ హోటల్' సినిమాలో కాసేపు మాత్రమే హోటల్ని చూపించి, తర్వాత కథనంతా బాబాయి చుట్టూ తిప్పేయడం, శేఖర్ కమ్ముల నిర్మించిన 'ఆవకాయ్-బిర్యానీ' కూడా టైటిల్ ని దాటి ఎటో వెళ్లిపోవడం మనకి తెలిసిందే. భోజనం అనేది మనుషులందరికీ సంబంధించిన విషయం కాబట్టి, విషయాన్ని సరిగా చెబితే ప్రేక్షకులు 'కనెక్ట్' కాకపోవడం అనే ప్రశ్న ఉండదు. కిచెన్ కథల్ని మన సినిమా వాళ్ళు ఎప్పుడు వండుతారో..
![]() |
| (Google Image) |
![]() |
| Google Image |