శుక్రవారం, డిసెంబర్ 23, 2016

ఆ రెండు పార్టీలు ...

ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ  పార్టీలని రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న తాజా నిర్ణయం, ఆ రెండు పార్టీల పుట్టుకని గురించి మరోసారి జ్ఞాపకం చేసుకునేలా చేసింది. ఎన్నికల సంఘం రద్దు చేసిన పార్టీల జాబితాలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు తనయుడు హరికృష్ణ, భార్య  లక్ష్మీ పార్వతి స్థాపించిన 'అన్న తెలుగుదేశం పార్టీ,' 'ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ (ఎల్పీ)' లు ఉన్నాయి. ఈ పార్టీల పుట్టుకకి దారితీసిన పరిస్థితులు, అనంతర పరిణామాలని రాష్ట్ర రాజకీయాలని దగ్గరనుంచి పరిశీలించే వారు మాత్రమే కాదు, ఎన్టీఆర్ అభిమానులు సైతం ఎప్పటికీ మర్చిపోలేరు.

తిరుపతిలో జరిగిన 'మేజర్ చంద్రకాంత్' సినిమా శతదినోత్సవ వేడుకలో నాటికి తన జీవిత చరిత్ర రాస్తున్న లక్ష్మీ (శివ) పార్వతిని వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించిన ఎన్టీఆర్, ఆ మర్నాడే రిజిస్ట్రార్ ని తన ఇంటికి పిలిపించుకుని వివాహాన్ని రిజిస్టర్ చేయించడం, అటుపై రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి భార్యా సమేతుడై తరలి వెళ్లి 1994 ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం జరిగిపోయింది. అప్పటివరకూ పార్టీలో రెండు పవర్ సెంటర్లు గా ఉన్న ఎన్టీఆర్ ఇద్దరు అల్లుళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, నారా చంద్రబాబు నాయుడుకి తోడు మూడోదీ, బలమైనదీ అయిన లక్ష్మీ పార్వతి వర్గం అనతికాలంలోనే తయారు కావడం, కొన్నాళ్లకే దగ్గుబాటి లక్ష్మీ పార్వతికి మద్దతివ్వడం జరిగిపోయింది.

చంద్రబాబు అభిమానులు 'రాజ్యాంగ పరిరక్షణ' గానూ, ప్రజాస్వామ్య వాదులు, ఎన్టీఆర్ అభిమానులు 'వెన్నుపోటు' గానూ పిలుచుకునే సంఘటన 1995 ఆగస్టులో జరిగింది. అత్యంత అవమానకర పరిస్థితులు సృష్టించి ఎన్టీఆర్ ని పదవీచ్యుతుణ్ణి చేసిన చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు. డెబ్బై రెండేళ్ల ఎన్టీఆర్ తీవ్రమైన పోరాటం చేశారు. కోర్టులకి, ప్రజాకోర్టుకి వెళ్లారు. కారణాలు ఏవైనప్పటికీ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగారు.. అప్పటి రాజకీయ పార్టీలు ఈ వ్యవహారాన్ని కేవలం ఎన్టీఆర్ కుటుంబ సమస్యగా మాత్రమే చూశాయి. మెజారిటీ మీడియా ఏకపక్షంగా వ్యవహరించడంతో ఎన్టీఆర్ కి తన గొంతు వినిపించే అవకాశం దొరకలేదు. అధికారం కోల్పోయిన కొద్దికాలానికే ఎన్టీఆర్ తుదిశ్వాస విడిచారు.

ముఖ్యమంత్రి అయిన కొత్తలో చంద్రబాబు అప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణతోనూ సత్సంబంధాలు నెరపారు. 'వెన్నుపోటు' అనంతరం ఎన్టీఆర్ స్థాపించిన 'ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ' పగ్గాలని ఎన్టీఆర్ మరణాంతరం లక్ష్మీ పార్వతి చేపట్టడంతో ఆ పార్టీ పేరు చివర బ్రాకెట్లో 'ఎల్పీ' వచ్చి చేరింది.  మరోపక్క, చంద్రబాబు-హరికృష్ణల మధ్య సంబంధాలు ఎన్నో చిత్రమైన మలుపులు తిరిగాయి. ప్రజలు తనని ముఖ్యమంత్రిగా అంగీకరించారన్న విశ్వాసం పెరిగాక, చంద్రబాబు హరికృష్ణని దూరం పెట్టడం ఆరంభిచడంతో, నెమ్మదిగా తెలుగుదేశం నుంచి బయటికి వచ్చిన హరికృష్ణ 'అన్న తెలుగుదేశం పార్టీ' స్థాపించి, కొంతకాలం నడిపించారు.

రాజకీయ పరిణామాలని తనకి అనుకూలంగా మార్చుకుని, ఇమేజి బిల్డింగ్ మీద దృష్టి పెట్టిన చంద్రబాబుకి నాటి మీడియా నుంచి పుష్కలంగా సహాయ సహకారాలు అందడం ఒకపక్క, తగినంత రాజకీయ అవగాహన, కార్యకర్తల బలం లేకపోవడం మరోపక్క -  ఈ కారణాలకి కొత్తగా పుట్టిన పార్టీలు రెండూ కొన్నాళ్లకే నామమాత్రంగా మిగిలిపోయాయి. అప్పటినుంచీ హరికృష్ణ చంద్రబాబుకి చేరువవుతూ, దూరమవుతూ, మళ్ళీ చేరువవుతూ, అంతలోనే దూరమవుతూ వస్తూ ఉండగా, లక్ష్మీ పార్వతి మాత్రం ఇప్పటికీ చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకతతోనే ఉన్నారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని పదేపదే ప్రచారం చేసిన లక్ష్మీ పార్వతి, కేవలం చంద్రబాబు వ్యతిరేకి అన్న కారణానికి వైఎస్సార్ కి, అటుపై జగన్ కి మద్దతు ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీలో అతికొద్ది కాలం పవర్ సెంటర్ గా చక్రం తిప్పిన లక్ష్మీ పార్వతి, 'వెన్నుపోటు' అనంతరం చంద్రబాబు అభిమానులు, అనుయాయుల చేత 'రాజ్యాంగేతర శక్తి' గా ముద్ర వేయించుకున్నారు. ఆంధ్ర ప్రజలు మాత్రమే కాదు, అటు హరికృష్ణ, ఇటు లక్ష్మీ పార్వతి కూడా తమ రాజకీయ పార్టీలని గురించి పూర్తిగా మర్చిపోయిన తరుణంలో, కేంద్ర ఎన్నికల సంఘం జరిపిన పార్టీల రద్దు పుణ్యమా అని వాళ్ళు నడిపిన పార్టీలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. 'ఎన్టీఆర్ కి నిజమైన వారసులం' అని వాళ్లిద్దరూ పదేపదే ప్రకటించుకున్నా, ప్రజలు మాత్రం వాళ్ళని ఆ దృష్టితో చూడలేదు. ఒక సందర్భంలో లక్ష్మీ పార్వతి చెప్పినట్టుగా, ఇప్పుడున్నంత విస్తృతమైన మీడియా ఇరవై ఏళ్ళ క్రితం ఉండి ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోవిధంగా ఉండేవి బహుశా...

శుక్రవారం, డిసెంబర్ 02, 2016

జయమ్ము నిశ్చయమ్మురా (2016)

జాతకాలని, శకునాలని బాగా నమ్మే ఓ కుర్రాడు జీవితంలో ఓ దశలో వాటికి దూరంగా జరిగి, తనకంటూ ఓ వ్యక్తిత్వాన్ని నిర్మించుకుని, సమస్యలని అధిగమించడంతో పాటు ప్రేమని సాధించుకున్న వైనమే హాస్యనటుడు శ్రీనివాస రెడ్డి  కథానాయకుడిగా గతవారం విడుదలైన 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమా. ఈ ఏకవాక్య కథని రెండున్నర గంటల సినిమాగా తెరకెక్కించారు శివరాజ్ కనుమూరి. తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యంలో వచ్చిన కొన్ని కథల్ని ఆధారంగా చేసి రాసుకున్న కథలో, సౌలభ్యం కోసం కొన్ని లాజిక్ లని విడిచిపెట్టినట్టు టైటిల్స్ లో చెప్పేసిన దర్శకుడి చిత్తశుద్ధి నచ్చేసింది.

కరీంనగర్ జిల్లాలోని పల్లెటూళ్ళో ఓ చేనేత కుటుంబంలో పుట్టిన సర్వమంగళం (శ్రీనివాస రెడ్డి) ఉద్యోగాన్వేషణలో ఉంటాడు. తల్లి (డబ్బింగ్ జానకి) నేతపని చేసి అతన్ని పోషిస్తూ ఉంటుంది. జాతకులని నమ్మే సర్వానికి పితా (జీవా) మాట వేదవాక్కు. అతని సూచనల ప్రకారం నడుచుకుని కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం సంపాదిస్తాడు సర్వం. అది మొదలు కరీంనగర్ కి బదిలీ చేయించుకోవడం మీదే అతని దృష్టి అంతా. తన నమ్మకాల కారణంగా తోటి ఉద్యోగుల్లో పలచన అయిన సర్వం, తన ఆఫీసు కాంపౌండ్ లోనే ఉన్న మీసేవా సెంటర్లో పనిచేసే రాణి (పూర్ణ)తో ప్రేమలో పడతాడు, అది కూడా ఆమె జాతకం తన జాతకంలో మేచ్ అయిందని పితా చెప్పాకే.

సొంతంగా నర్సరీ ఏర్పాటు చేసుకుని, ఉద్యోగం వదిలేయాలని ఆలోచనలో ఉన్న రాణి ని జాయింట్ కలెక్టర్ తన వలలో వేసుకునే ప్రయత్నం చేయడం, అప్పటికే ఆ అధికారి అసలు రంగు తెలిసిన సర్వం రాణిని రక్షించడంతో పాకాన పడ్డ కథ, సర్వం-జాయింట్ కలెక్టర్ ల మధ్య మొదలైన యుద్ధం పతాక స్థాయికి రావడం, రాణి తన అన్న చూసిన సంబంధానికి ఒప్పుకోవడంతో ముగింపు దిశగా నడుస్తుంది. సర్వం తన బదిలీని, రాణిని ఎలా సాధించుకున్నాడన్నది ముగింపు. మునిసిపల్ ఆఫీసులో పని జరిగే తీరుని ప్రవీణ్, కృష్ణభగవాన్, జోగి బ్రదర్స్, పోసాని కృష్ణమురళి పాత్రల ద్వారా చూపించాడు దర్శకుడు.


తొలి సినిమానే అయినా కథ చెప్పడంలో ఎలాంటి తడబాటూ ప్రదర్శించలేదు శివరాజ్ కనుమూరి. ప్రథమార్ధంలో నేలమీద నడిచిన హీరోని, జాయింట్ కలెక్టర్ మీద యుద్ధం ప్రకటించాక ఒక్కసారిగా నేల విడిచి సాము చేయించి, ప్రేమ సాధించుకునే విషయంలో మళ్ళీ నేలమీదకి దించాడు. ఇప్పటివరకూ డాక్యుమెంటరీల్లో తప్ప సినిమాల్లో కనిపించని పిఠాపురం-కాకినాడ బీచ్ రోడ్డుని చాలా చక్కగా, "ఆ రోడ్డు అంత బాగుంటుందా?" అనిపించేలా తీశాడు. కెమెరా (నగేష్ బానెల్) కంటికి హాయిగా ఉంది. నేపధ్య సంగీతం (రవిచంద్ర) బాగా కుదిరింది. రెండు మూడు సన్నివేశాలు తొలగిస్తే క్లీన్ 'యు' వచ్చేదే కానీ, ఆ సన్నివేశాలు కథకి కీలకం అయ్యాయి. 'యుఏ' ఇచ్చింది సెన్సారు.

కానైతే, ఈసినిమాకి ప్రధాన సమస్య నిడివి. సాధారణంగా చాలా సినిమాల్లో రెండో సగంలో కనిపించే సాగతీత, మొదటిసగంలో కూడా అనిపించిందంటే ఎడిటింగ్ లోపమే. పాత్రల పరిచయాన్ని కొంచం కుదించి ఉండొచ్చు. అలాగే, రెండో సగంలో శుభం కార్డు కోసం ఎదురు చూస్తుండగా మొదలయ్యే పెళ్లి ప్రహసనం వాచీ చూసుకునేలా చేసింది.హీరోయిన్ పాత్ర చిత్రణ, హాస్యం, ముగింపు ఈ మూడింటి మీదా వంశీ ప్రభావం కనిపించింది. సముద్రాన్ని కూడా కూడా గోదారంత బాగానూ చూపించారు తెరమీద.

థర్టీ ప్లస్ హీరో పాత్రకి శ్రీనివాస రెడ్డి చక్కగా సరిపోయాడు. ఆత్మన్యూనత ఉన్న వ్యక్తిగానూ, దాన్ని జయించిన వాడిగానూ వేరియేషన్స్ చక్కగా చూపించాడు. తెలంగాణ మాండలీకాన్ని సునాయాసంగా పలికాడు కూడా.  అలాగే పూర్ణ కూడా అతనికి సరిపోయే జోడీ. సహాయ పాత్రల్లో కాంతారావుగా కనిపించిన శ్రీవిష్ణు నటనతో గోదారి జిల్లాల వాళ్ళు కొంచం ఎక్కువ కనెక్ట్ అవుతారు. 'జబర్దస్త్' కమెడియన్స్ చాలామంది చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు. విలన్ గా రవివర్మ పూర్తి స్థాయి పాత్రలో కనిపించాడు. అలాంటి లక్షణాలున్న కొందరు గుర్తొచ్చారంటే, ఆ క్రెడిట్ దర్శకుడితో పాటు నటుడికీ దక్కుతుంది.

ఇన్నాళ్లూ హాస్యనటులు, విలన్లు పలికిన తెలంగాణ మాండలికాన్ని హీరో పలకడం బాగా అనిపించింది. బహుశా తెలంగాణ ఉద్యమం సాధించిన నిశ్శబ్ద విజయాల్లో ఇదీ ఒకటేమో. ఈ సినిమా బాగా ఆడితే, 'అగ్ర' హీరోలు సైతం పాత్రల్ని తెలంగాణ ప్రాంత వ్యక్తులుగా డిజైన్ చేయించుకున్నా ఆశ్చర్యం లేదు. మొత్తం మీద చూసినప్పుడు నాయికా నాయకులకి వ్యాపకాలు, లక్ష్యాలు ఉండడం, వాటికోసం వాళ్ళు శ్రమించడం మెచ్చుకోవాల్సిన విషయం. గవర్నమెంట్ ఆఫీసుల పనితీరుని వ్యంగ్యంగా చూపించిన తీరు సామాన్యులు బాగా ఎంజాయ్ చేసేదిగా ఉంది. కనీసం ఓ ఇరవై నిమిషాలు ట్రిమ్ చేస్తే రిపీటెడ్ ఆడియన్స్ ని ఆకర్షించేదిగా ఉండేది ఈ 'జయమ్ము నిశ్చయమ్మురా.' భారీ బిల్డప్ సినిమాలు మాత్రమే ఇష్టపడే వాళ్ళకి తప్ప మిగిలిన అందరూ చూడొచ్చీ సినిమాని.

ఆదివారం, నవంబర్ 27, 2016

ఓ కాపీ కథ

దినపత్రికల ఆదివారం అనుబంధాల్లో మంచి కథలకోసం వెతికే వాళ్ళని 'ఆంధ్రజ్యోతి,' 'సాక్షి' సాధారణంగా నిరాశపరచవు. తరచుగా మంచి కథలు, అప్పుడప్పుడూ గొప్ప కథలూ వస్తూ ఉంటాయి ఈ రెండు పత్రికల్లోనూ. కథల ఎంపికలో వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని వాళ్ళ ఎంపిక తెలియజెపుతూ ఉంటుంది. అయితే, ఇవాళ్టి ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథ మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. ఫక్తు కాపీ కథ ప్రచురితమవ్వడం, అదికూడా ఆంధ్రజ్యోతిలో కావడం ఓ పట్టాన మింగుడు పడ్డం లేదు. ఆ కథను గురించి చెప్పేముందు మూలకథని ఓసారి తల్చుకోవాలి.

'మా పసలపూడి కథలు'కి ముందు వంశీ రాసిన కథలతో వచ్చిన సంకలనం పేరు 'ఆనాటి వానచినుకులు.' రంగుల బొమ్మల హడావిడి లాంటి హంగులేవీ లేకుండా ఎమెస్కో ప్రచురించిన ఆ పుస్తకానికి శీర్షికగా ఉంచిన కథ పేరు 'ఆనాటి వానచినుకులు.' ఈ కథలో ప్రధాన పాత్ర పతంజలి అహంభావిగా కనిపిస్తాడు. తాను నమ్మింది మాత్రమే జీవితమనీ, అందంగా జీవించాలంటే అందమైన పరిసరాల్లో, చక్కని సంగీతం వింటూ, ఇంచక్కని  కవిత్వం చదువుకోడమే మార్గమనీ, అలాంటి వాళ్లకి మాత్రమే భావుకత్వం అలవడుతుందనీ  బలంగా నమ్ముతాడు.

మద్రాసు మహానగరంలో నివాసముండే పతంజలి అనుకోకుండా ఓ మారుమూల పల్లెటూరికి అవస్థలతో కూడిన ప్రయాణం చేయాల్సి రావడం, ఆ యాత్రలో అతడి చివరి ప్రయాణ సాధనమైన రిక్షాని చూడగానే అతడు భావుకత్వాన్ని గురించి అన్నాళ్ళుగా నమ్ముతూ వచ్చిన విషయాలన్నీ తప్పేనన్న ఎరుక ఒక్కసారిగా కలగడంతో కథ ముగుస్తుంది. ఆ మారుమూల కుగ్రామంలో రిక్షా నడుపుకునే గోపాలం అత్యంత సామాన్యుడు. తన ఒంటినీ, రిక్షాన్నీ పరిశుభ్రంగా ఉంచుకున్న వాడు. అంతే కాదు, రిక్షా వెనుక తన స్వహస్తాలతో 'ఆనాటి వానచినుకులు' అని రాసుకున్న వాడూను.

చదువుకీ, సంస్కారానికే కాదు, చదువుకీ భావుకత్వానికీ కూడా పెద్దగా సంబంధం లేదని నిరూపించే ఈ కథలో ముగింపు ఒక మాస్టర్ స్ట్రోక్. 'ఆనాటి వానచినుకులు' అనే వాక్యం ఎందుకు రాసుకుని ఉంటాడో అనే ఊహని పాఠకులకే వదిలేయడం వల్ల ఈ కథకి సంపూర్ణత్వం వచ్చిందనిపిస్తూ ఉంటుంది నాకు. ఇక, ఇవాళ్టి ఆదివారం ఆంధ్రజ్యోతి కథపేరు 'ఆనాటి చెలిమి ఒక కల.' అమెరికాలో మొదలయ్యి, అమెరికాలో ముగిసే ఈ కథలో ప్రధానమైన భాగం అంతా అమలాపురం, ఆ చుట్టుపక్కల పల్లెటూళ్లలో జరుగుతుంది, అదికూడా ఓ నాలుగు దశాబ్దాల క్రితం.

కథకుడి స్నేహితుడి బంధువు రాజు రిక్షా నడుపుకుంటూ ఉంటాడు. కవిత్వం అంటే ఇష్టం కూడా. నెమ్మదిగా కథకుడికి తన స్నేహితుడి కన్నా, రాజు దగ్గరవాడు అయిపోతాడు. సర్వవేళలా ఇస్త్రీ బట్టలు ధరించే రిక్షా రాజు, తన రిక్షాని అరిగిపోయేలా తుడుస్తూ ఉండడమే కాదు, రిక్షా వెనుక ప్రతినెలా ఓ వాక్యం రాయిస్తూ ఉంటాడు ఓ పెయింటర్ చేత. సాధారణంగా సినిమా పాటల పల్లవులు, అప్పుడప్పుడూ కవితా పంక్తులు అతని రిక్షా వెనుక దర్శనమిస్తూ ఉంటాయి. వచ్చే నెల ఏ వాక్యం అనే విషయం మీద కథకుడు, అతని స్నేహితుడూ పందేలు వేసుకుంటూ ఉంటారు కూడా.

రిక్షా రాజు రాయించిన ఒకానొక వాక్యం 'ఆనాటి వానచినుకులు.' ఈ వాక్యం ఎందుకు రాయించాడో కథకుడికి తెలియక మునుపే, కథకుడు మొదట చదువు కోసం, ఆ తర్వాత ఉద్యోగం కోసం ఊరికి దూరంగా వెళ్లి, ఆ తర్వాత శాశ్వతంగా ఊరితో సంబంధాలు కోల్పోవడం జరుగుతుంది. కథకుడి కొడుకు 'ఆడి' కారు వెనుక అతికించిన బంపర్ స్టికర్ లో ఉన్న వాక్యం చూడగానే రాజు గుర్తొచ్చి ప్రత్యేకంగా ఇండియా ప్రయాణంలో రాజుని కలిసి 'ఆనాటి వానచినుకులు' వెనుక కథని తెలుసుకోవడంతో బోల్డంత నాటకీయతతో ముగుస్తుందీ కథ.

వంశీ రాసిన 'ఆనాటి వానచినుకులు' కథ లేకపోతే, ఈ కథ లేదన్న విషయం రెండు కథలూ చదివిన వాళ్లకి సులభంగా అర్ధమయ్యే విషయం. ఎటొచ్చీ వంశీ కథలో పాత్రలు నేలమీద నడిస్తే, తాజా కథలో పాత్రలు నేల విడిచి కనిపిస్తాయి. గోపాలాన్ని రిక్షా నడుపుకునే వ్యక్తిగా అంగీకరించగలం కానీ, రాజు వేషభాషలకీ అతని వృత్తికీ ఏమాత్రం పొసగదు. గోపాలం తనకి ఇష్టమైన వాక్యాన్ని తన వంకర టింకర అక్షరాలతోనే రిక్షా వెనుక రాసుకున్నాడు. రాజు మాత్రం, నెలకో వాక్యం - అది కూడా 'ఆనాటి వానచినుకులు' మినహా మిగిలినవన్నీ కవులవీ, సినీ కవులవీ - డబ్బిచ్చి రాయిస్తూ ఉంటాడు. రెండు కథల మధ్యా పోలిక కేవలం యాదృచ్చికం అని సరిపెట్టుకుందాం అని చాలా ప్రయత్నించాను కానీ, నావల్ల కాలేదు.

ఆదివారం ఆంధ్రజ్యోతి వాళ్ళు పాఠకుల నమ్మకాన్ని నిలబెట్టుకునే విషయంలో మరింత శ్రద్ధ  తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

గురువారం, నవంబర్ 24, 2016

పెళ్లి - ప్రదర్శన

వయసొచ్చిన పిల్లలకి తగిన  సంబంధం చూసి పెళ్లి చేయడం అన్నది చాలామంది తల్లిదండ్రులకి బాధ్యత. అతి కొద్దిమంది తల్లిదండ్రులకి మాత్రం పరపతిని ప్రదర్శించుకునేందుకు దొరికే అవకాశం. పారిశ్రామిక, సినీ, రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్లకి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తాలు సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నది బహిరంగ రహస్యం. వాళ్ళు చేసే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండడాన్ని మనం చూస్తూనే ఉంటాం. రాజకీయనాయకులు ఎన్నికల సమయంలో భారీగా సొమ్ము వెదజల్లితే, మిగిలిన రెండు వర్గాలూ పెళ్లిళ్లు, వేడుకలకి బాగా ఖర్చు చేస్తూ ఉంటాయి.

నిన్నమొన్నటి వరకూ పెళ్లిళ్ల ఖర్చు విషయంలో రాజకీయ నాయకులు వెనకడుగు వేసేవాళ్ళు.. మరీ బయటపడిపోవడం ఎందుకని కావొచ్చు. ఎప్పుడైతే పబ్లిగ్గా డబ్బిఛ్చి ప్రజల నుంచి ఓట్లు కొనుక్కోడాలు, అలా గెలిచిన నాయకులని రాజకీయ పార్టీలు పెద్దమొత్తాలు చెల్లించి టోకున కొనుగోలు చేయడాలు - కొండొకచో కేసుల బారిన పడడాలు - లాంటివి నిత్యజీవితంలో భాగం అయిపోయాయో, హోదాని, దర్జాని చూపించుకుని విషయంలో రాజకీయ నాయకులు సైతం వెనకడుగు వేయడంలేదు. అలాంటి నాయకుల ఇళ్లలో జరుగుతున్న పెళ్లిళ్లు ఇప్పుడు హాట్ టాపిక్. జాతీయ స్థాయిని దాటేసి, అంతర్జాతీయ వార్తలుగా మారిపోయాయి ఆ వేడుకలు.

కాంగ్రెస్, బీజీపీ నాయకుల ఆశీస్సులతో, అండదండలతో వ్యాపారిగా ఎదిగి, రాజకీయనాయకుడిగా మారి కన్నడ రాజకీయాలని శాసించే స్థాయికి చేరుకున్న తెలుగువ్యక్తి గాలి జనార్దన రెడ్డి తన కుమార్తె బ్రాహ్మణి వివాహాన్ని బెంగళూరులో జరిపించారు గతవారం. పోలీసు కానిస్టేబుల్ కొడుకుగా జీవితాన్ని మొదలుపెట్టి, బళ్ళారి ప్రాంతంలోని ఇనుప గనులపై గుత్తాధిపత్యం సాధించడం ద్వారా తక్కువ కాలంలో వేలకోట్లు కూడబెట్టి, అక్రమాలు బయటపడడంతో జైలుకి వెళ్లి, బెయిలుపై బయటికి వఛ్చిన జనార్దన రెడ్డి కూతురి పెళ్లి నిమిత్తం ఖర్చు చేసిన మొత్తం ఐదొందల కోట్ల పైచిలుకు అంటున్నాయి ప్రసార సాధనాలు.

కేసుల కారణంగా తాను బెంగుళూరు విడిచి వెళ్ళకూడదు కాబట్టి, తన స్వస్థలం బళ్లారిని బెంగుళూరు పేలస్ గ్రౌండ్స్ లో సృష్టించుకున్నారు జనార్దన రెడ్డి. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని గుర్తుచేసేలా వేయించిన భారీ సెట్లలో, రాచరికపు పద్ధతుల్లో జరిగిన వివాహం తాలూకు వీడియోలిప్పుడు యూట్యూబు లో అత్యధిక వ్యూయర్షిప్ దిశగా దూసుకుపోతున్నాయి.ఈ 'మైనింగ్ కింగ్' ని దక్షిణ భారతదేశంలో ఇంత భారీ స్థాయిలో పరపతిని ప్రదర్శించిన రెండో రాజకీయనాయకుడని చెప్పాలి. కొన్నేళ్ల క్రితమే పెంపుడు కొడుకు సుధాకరన్ పెళ్లిని ఇంత వైభవంగానూ జరిపి వార్తల్లో నిలిచారు - సినిమాల నుంచి రాజకీయాలకి వఛ్చిన - తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత.

ఇక, గడిచిన వారం రోజుల్లో తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో ఒకటి ఖరీదైన వివాహాలు జరిగాయి, రెండూ కూడా అధికారానికి దగ్గరగా ఉన్న నేతల కుటుంబాల్లోనే. రెండు చోట్లా పదుల కోట్లలో సొమ్ము ఖర్చు చేశారని వినికిడి. ఓ పక్క పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యులు బ్యాంకులలో దాచుకున్న కష్టార్జితాన్ని డ్రా చేసుకోడానికి ఇబ్బందులు పడుతుండగా, రాజకీయ నాయకులు డబ్బును నీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడాన్ని 'పారడాక్సికల్' అన్న మాటతో సరిపుచ్చేయాలా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఎదురు చూడాలా? లేక, చట్టాల్లో లొసుగులు పూడ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతాయని ఆశించవచ్చా?

'భారతదేశంలో సంపద పెరుగుతోంది..దానితో పాటే ధనిక, పేద మధ్య అంతరాలూ పెరుగుతున్నాయి' అన్నది ఆర్ధిక వేత్తలు గత రెండు దశాబ్దాలుగా విశ్లేషించి చెబుతున్న విషయం. మొత్తం దేశ సంపదలో యాభై శాతానికి పైబడి కేవలం పది శాతం జనాభా దగ్గర పోగుపడి ఉందంటున్నారు ఎకనామిస్టులు. పెళ్లిళ్ల పేరిట జరుపుతున్న సంపద ప్రదర్శనలు సామాజిక అంతరాలని పెంచి పోషిస్తాయనడంలో సందేహం లేదు. 'ఏం చేసైనా డబ్బు సంపాదించడం ముఖ్యం.. డబ్బుంటే చట్టం ఏమీ చేయలేదు' అన్న సంకేతాలని సమాజంలోకి పంపే ప్రమాదమూ ఉంది. కొందరి వినోదం, సామాజిక విషాదానికి దారితీయకూడదు కదా...

సోమవారం, నవంబర్ 21, 2016

మాబడి

అల్లప్పుడెప్పుడో పందొమ్మిదివందలో సంవత్సరంలో బళ్ళో చదువుకున్న ఒకాయన, ఆతర్వాత యాభై ఏళ్ళకి బాగా పెద్దయిపోయాక ఆ జ్ఞాపకాలన్నీ పుస్తకంగా రాసుకుని ప్రచురించుకున్నారు.. నాటి (నేటికీ) సాహితీ పెద్దమనుషులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావు ముందుమాట రాసి ఆశీర్వదించిన ఆ పుస్తకం లైబ్రరీల్లో చెదపురుగుల బారిన పడిపోయేదే, మోదుగుల రవికృష్ణ అనే సాహిత్యాభిమాని కంట పడకుండా ఉండి ఉంటే. తెలుగు సాహిత్యం, అందునా ఆధునిక యుగం తొలినాటి రచనలంటే ప్రత్యేకాభిమానం ఉన్న రవికృష్ణ ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా రక్షించడమే కాకుండా తన మిత్రుల సాయంతో మళ్ళీ ప్రచురించి మార్కెట్లో విడుదల చేశారు. ఆ పుస్తకంతో తన అనుభవాలు మరియు శ్రీరమణ రాసిన తాజా తాజా ముందుమాటలో సహా.. ఆ పుస్తకం పేరే 'మాబడి.'

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణ వాసి తెన్నేటి కోదండరామయ్య రాసిన నాటి 'మాబడి' ని నేడు చదవాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నకి జవాబు వెతుక్కుంటే చాలు, ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటో అర్ధమవ్వడానికి. తరాలు మారిపోయినా, సాంకేతిక పరిజ్ఞానం బోల్డంత అభివృద్ధి చెందిపోయినా నాటికీ నేటికీ మారనివాటిలో మొదట చెప్పుకోవాల్సింది చిన్న పిల్లలు బడికి వెళ్లడం. ఇప్పటివాళ్ల సంగతెలా ఉన్నా, అప్పటివాళ్ళు ఎలిమెంటరీ స్కూలు చదువు ఆడుతూ పాడుతూ ముగించి, హైస్కూలు చదువుతుతో పాటు లోకజ్ఞానాన్నీ గ్రహించే వాళ్ళన్న విషయంతో పాటు, సదరు జ్ఞాన సముపార్జన కోసం జరిగిన ఏర్పాట్లు తెలుసుకోవచ్చు.

ఇప్పటి విద్యాలయాల్లో జరిగేవి ఒకరకం రాజకీయాలైతే, నాటి బళ్ళలో జరిగినవి మరో రకం రాజకీయాలనీ, రాజకీయం తగుమాత్రంగా రూపం మార్చుకుంది తప్ప స్కూళ్ళని పట్టి పీడించడం మానలేదనీ అర్ధమవుతుంది. పిల్లలకి కొందరు మేష్టర్ల మీద విశేషించి అభిమానం ఉండడం, మరికొందరంటే అస్సలు పడక పోవడం, అదేవిధంగా ఒక మేష్టారికి అనుకూల, ప్రతికూల వర్గాలు, వాటి మధ్య గొడవలు ఆనాడూ ఉన్నాయని బోధ పడుతుంది. నేటి చదువులతో పాటు, ఎక్స్ ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా టీచర్ల నిర్ణయం మేరకే జరుగుతూ ఉండగా, నాడు సదరు యాక్టివిటీస్ బాధ్యత పూర్తిగా పిల్లలదే అని, అవసరమైతే మేష్టర్లు సాయం చేసేవాళ్ళే తప్ప పెత్తనం ఏమాత్రం చేసేవారు కాదన్న సత్యం ద్యోతకమవుతుంది.


పిల్లల చదువుల విషయంలో కొందరు తల్లిదండ్రుల భయంకర పట్టుదల ఇప్పటి తరానికి మాత్రమే ప్రత్యేకం కాదనీ, వందేళ్ల నాటి పరిస్థితి కూడా అంతేననీ తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటివి ఇంకా అనేకం కనిపించి అనేకానేక భావాలు కలిగిస్తాయి పాఠకుల్లో. తణుకు బోర్డు స్కూల్లో చదువుకున్న కోదండరామయ్య గారికి బడన్నా, హెడ్మాస్టారన్నా విపరీతమైన భక్తీ, గౌరవమూను. రెండు భాగాలుగా విభజించిన ఈ పుస్తకంలో మొదటిభాగం హెడ్మాస్టారి గొప్పదనాన్ని వైనవైనాలుగా వర్ణించారు. నాటి యూనియన్ బోర్డు ప్రెసిడెంటుకి హెడ్మాస్టారి మీద కినుక కలగడం, ఆయన్ని బదిలీ చేయించడం కోసం ప్రయత్నించి ఓడిపోవడంతో తొలిభాగం ముగుస్తుంది. హెడ్మాస్టారి కోసం ఊరు మొత్తం రెండుగా విడిపోవడం, అందరూ పనులు మానుకుని ఆయనకి సాయం చేయడమో, వ్యతిరేకంగా నిలబడ్డమో తప్ప తటస్థులెవరూ లేకపోవడం లాంటివి అతిశయోక్తుల్లా ధ్వనిస్తాయి.

ఇక పుస్తకంలో రెండో భాగం, స్కూలు విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న నాటక సమాజాన్ని గురించి. మొదటిభాగం కొంచం గంభీరంగా సాగితే, ద్వితీయ భాగం ఆసాంతమూ నవ్వులు పూయిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నవ్వకుండా పేజీ తిప్పడం అసాధ్యం. మొదటి భాగంలో 'బాలుని సముద్ర వర్ణన,' కోర్టు కేసులో సాక్ష్యాలు లాంటి సంఘటనలు నవ్వించినా అందులో నిజమెంత, అతిశయోక్తి పాలెంత అన్న సందేహం పీడిస్తూ ఉంటుంది. రెండో భాగంలో అలాంటి శషభిషలని తావులేదు. నవ్వగలిగినంత నవ్వుకోవచ్చు. నారదుడు, అర్జునుడు, శివుడు, సుభద్ర పాత్రలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని నవ్వుకోకుండా ఉండడం అసాధ్యం. హెడ్మాస్టారితో సమంగా రచయితకి ఆరాధనీయుడు 'కృష్ణుడు' అనే సహవిద్యార్థి. ఇతణ్ణి మాత్రం రెండు భాగాల్లోనూ ఎత్తుపీట మీదే కూర్చోబెట్టారు.

లా చదువుకున్న కోదండరామయ్య గొప్ప చదువరి అన్న విషయం తొలి పుటల్లోనే తెలిసిపోతుంది. పందొమ్మిదో శతాబ్దపు ఆంగ్ల సాహిత్యం మీదా, రామాయణ, భారత, భాగవతాదుల మీద, తన సమకాలీన సాహిత్యం మీదా సమానమైన పట్టు ఉంది. స్నేహితుడు కృష్ణుడి గురించి చెబుతూ "ఒక్కమాటలో చెప్పాలంటే అడివి బాపిరాజు గారి 'నారాయణరావు' కి పాకెట్ ఎడిషన్ మా కృష్ణుడు" అనడం వెనుక కొంటె తనం తెలియాలంటే బాపిరాజూ, నారాయణరావూ పాఠకులకి కనీస పరిచయం ఉంటే బాగుంటుంది కదా. ఇప్పటికే చెళ్ళపిళ్ళ వారి 'కాశీయాత్ర' లాంటి పుస్తకాలు పునర్ముద్రించి తన అభిరుచి చాటుకున్న రవికృష్ణ, ఈ పుస్తకాన్ని తేవడం ద్వారా విద్యారంగానికి సేవచేశారని చెప్పాలి. సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళు అందరూ చదవాల్సిన 'మాబడి' ని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్లు తప్పక చదవాలి. (మిత్రమండలి ప్రచురణలు, పేజీలు 280, వెల రూ. 220, అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు).

ఆదివారం, నవంబర్ 13, 2016

నా కరెన్సీ నోట్ల మార్పిడి ...

"ఆదివారం ఉదయాన్నే ఈ క్యూలో నిలబడ్డం ఏమిటో?" నన్ను నేను ప్రశ్నించుకుంటూ మా ఏరియా పోస్టాఫీసు క్యూలో చోటు సాధించాను. పోస్టాఫీసుతో సంబంధబాంధవ్యాలు బాగా తగ్గిపోవడంతో, అక్కడైతే పెద్దగా జనం ఉండరనుకున్నాను కానీ నా అంచనా తప్పింది. ఆదివారం పూటా ఉద్యోగం చేయాల్సి వచ్చిందనో, ఓవర్ టైం భత్యం అనౌన్స్ చేయకుండా డ్యూటీ చేయించేస్తున్నారనో లేక వారి సహజాతమో తెలీదు కానీ స్టాఫందరూ ఒకానొక ప్రముఖ తెలుగు హీరోని గుర్తు చేసేవిధంగా మొహాలు విసుగ్గా పెట్టుకుని కూర్చున్నారు. ఏం చేస్తాం.. అవసరం మనది కదా..

ప్లాస్టిక్ కార్డులు సర్వత్రా రాజ్యమేలుతున్న రోజుల్లో ఇంకా కరెన్సీతో అవసరం ఏమిటన్న ప్రశ్న రావొచ్చు ఎవరికైనా. నిజమే.. నోట్లు అవసరం లేకుండా చాలా పనులు జరిగిపోతున్నాయి. కానైతే కూరల షాపతను, ఇస్త్రీ అబ్బాయి, క్షురకుడు, వీధి చివర కిరాణా అబ్బాయి క్రెడిట్/డెబిట్ కార్డులు అంగీకరించేది లేదని తెగేసి చెప్పాక కరెన్సీ ప్రాధాన్యత ప్రాక్టికల్ గా అర్ధమయ్యింది. మామూలుగా అయితే నాల్రోజుల్లో అంతా సర్దుకుంటుంది లెమ్మని ఊరుకోవచ్చు కానీ, పరిస్థితి చక్కబడడానికి కనీసం కొన్ని వారాలు పడుతుందని సాక్షాత్తూ అరుణ్ జైట్లీ చెప్పాక కూడా ఉపేక్షించడం మంచిది కాదు కదా.

పోస్టాఫీసు వాళ్ళు అందుబాటులో ఉంచిన ఫామ్ తీసుకుని అక్కడ సూచించిన కాలాలన్నీ పూర్తి చేశాను. ఇద్దరి తర్వాత నా టర్న్. ఒకింత సంతోషంగా ఫామ్ కౌంటర్ లో ఉన్న ఉద్యోగినికి ఇచ్చాను.. ఏ డినామినేషన్ నోట్లు ఎన్ని అడగాలో మనసులో రిహార్సల్ వేసుకుంటూ. "మీరు సరెండర్ చేయబోయే నోట్ల సీరియల్ నెంబర్లన్నీ వరసగా రాసి, సంతకం పెట్టి, మీ ఫోన్ నెంబర్ వేసి తీసుకురండి" అని ఆవిడ మృదువుగా చెప్పి ఫామ్ నా చేతికి ఇచ్చేయడంతో వెనకవాళ్ళు సంతోషించారు. ఆ పని పూర్తి చేసి క్యూలో చేరాను. కాస్త ఓపిక పట్టాక మళ్ళీ నా టర్న్ వచ్చింది. "నా దగ్గర రెండువేల నోట్లు మాత్రమే ఉన్నాయండీ.. మీకు వందలు కావాలంటే పక్క క్యూలో నిలబడండి," దూరదర్శన్ శాంతిస్వరూప్ ని జ్ఞాపకం చేస్తూ ప్రతి అక్షరం స్పష్టంగా పలికిందామె.

పక్కన ఉన్న రెండు క్యూల్లో ఒక చోట జనం తక్కువగా ఉండడంతో చేరిపోయాను.. నోట్లతో వచ్చే వాళ్ళ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నా టర్న్ మళ్ళీ వచ్చింది. ఇక్కడా ఉద్యోగినే. కానైతే ఈవిడ ఫామ్ చూస్తూనే ముఖం చిట్లించి "ఎక్స్చేంజ్ ఇక్కడ కాదు, పక్క కౌంటర్" అని దురుసుగా చెప్పాక కానీ, ముందావిడ మంచితనం అర్ధం కాలేదు. అత్యంత ఆసక్తికరంగా మూడో కౌంటర్లో కూడా స్త్రీమూర్తే! కాకపొతే ఈవిడ డైలీ సీరియల్స్ బాగా చూస్తారనుకుంటా.. ప్రతి పనీ అతి తాపీగా చేస్తున్నారు. నా ముందు వాళ్ళిచ్చిన ఫామ్ కి నోట్లు పిన్ చేయాలి.. స్టాప్లెర్ లో పిన్స్ అయిపోయాయి. ఆవిడ అటెండర్ లో పిలవగా పిలవగా అతగాడు వచ్చాడు. కాసేపటి తర్వాత పిన్నులు తెచ్చాడు. మళ్ళీ వచ్చి వాటిని స్టాప్లర్ లో వేశాడు.. అప్పటివరకూ ఆవిడ కంప్యూటర్ స్క్రీన్ ని శ్రద్ధగా పరికించారు.

ఒక్కో నోటుని పరిశీలిస్తూ, వేసిన నెంబర్లని నోట్ల మీద అంకెలనీ టాలీ చేసుకుంటూ నింపాదిగా ఉలికిపడ్డారు. "ఈ నోట్లన్నీ రాసిన ఆర్డర్లో పెట్టి తీసుకురండి" అని చెప్పి తిప్పి పంపేశారు. నాకు తెలియకుండానే ఊపిరి బిగిసింది. గుండె వేగం హెచ్చింది.. వందనోట్లు వచ్చేస్తాయి అన్న ఆత్రుత నిలబడనివ్వడం లేదు. ఆవిడ నా అప్లికేషన్ ఆసాంతమూ చదివి, ఒకట్రెండు చోట్ల నేను ఎలా రాసి ఉంటే బావుండేదో వివరించి చెప్పి, అప్లికేషన్తో పాటు జత చేసిన ఆధార్ కాపీ మీద నా సంతకం తీసుకున్నారు. హమ్మయ్య.. చివరి ఘట్టం.. ఓ రెండు గంటలు నావి కాకపోతేనేమి.. పనయిపోతోంది.. అనుకుంటున్నానో లేదో ఆవిడ సూటిగా ప్రశ్నించారు "ఆధార్ ఒరిజినల్ ఇవ్వండి?"

అయిపోయింది.. ఆశలన్నీ ఆవిరైపోయాయి.. "తేలేదండీ" తప్పుచేసిన భావన నా గొంతులో పలకలేదెందుకో. ఆధార్ ఒరిజినల్ వెరిఫికేషన్ ఉంటుందని నేనెక్కడా చదవలేదు. అసలు వాళ్లకి అంత టైం ఉంటుందని కూడా అనుకోలేదు. "ఉహు.. ఆధార్ ఒరిజినల్ లేకుండా నోట్లు ఇవ్వడం కుదరదు" ఫామ్ ని సున్నితంగా నా మొహాన కొట్టారు. పొడవాటి క్యూలు ఎందుకు ఉంటున్నాయో బాగా అర్ధమయింది. నా వెనుక ఎవరో డ్వాక్రా మహిళ.. ఎక్కడ తేడా వచ్చిందో గమనించలేదు కానీ.. "తెలుసుకోకుండా ఎందుకు వచ్చేస్తారమ్మా" అని తాపీగా కోప్పడింది కౌంటర్ ఆవిడ. నేను వెనక్కి చూడలేదు. "తెలిత్తే మాకీ తిప్పలెందుకమ్మా" రోషంగా అంది డ్వాక్రా మహిళ. ఆగి, వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయాను, ఆ మహిళని కళ్ళతో అభినందించడం కోసం.. 

బుధవారం, నవంబర్ 09, 2016

అమెరికన్ ఎన్నికలూ, ఇండియన్ కరెన్సీ..

నిన్న అర్ధరాత్రి నుంచీ ఈ రెండూ ట్రెండింగ్ టాపిక్స్ అయిపోయాయి.. అటు అమెరికా అధ్యక్ష స్థానానికి జరుగుతున్న ఎన్నికలు.. ఇటు భారతదేశంలో ఉన్నట్టుండి అమలులోకి వచ్చిన కరెన్సీ రద్దు. అప్పటివరకూ అమెరికా ఎన్నికలమీద మాత్రమే దృష్టి పెట్టిన భారతీయలు, ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లని రద్దు చేస్తూ నిన్నరాత్రి ప్రధాని ప్రకటన చేయగానే, ఎన్నికలని తాత్కాలికంగా మర్చిపోయి, ఇవాళ మధ్యాహ్నం తుది ఫలితం వెల్లడయ్యాక మళ్ళీ అమెరికా గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

డెమొక్రటిక్ పార్టీ తరపున హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థులుగా ప్రకటన వఛ్చిన కొద్దిరోజులకే నాకు ట్రంప్ గెలుస్తాడనిపించింది. దగ్గర మిత్రులు కొందరి దగ్గర అన్నాను కూడా. అమెరికాని బాగా ఫాలో అయ్యేవాళ్ళు కొట్టిపారేశారు. అత్యధిక మెజారిటీతో హిల్లరీ గెలుస్తుందన్నది వాళ్ళ జోస్యం. తక్కువ మెజారిటీతో ట్రంప్ అధ్యక్షుడు అవుతాడన్నది నా నమ్మకం. ఈ నమ్మకం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది, ఒక మహిళని అధ్యక్షురాలిగా ఒప్పుకునేంతగా అమెరికన్లు ఎదిగారా? అన్నది.

రోజులు గడిచే కొద్దీ, ఇద్దరి హామీలు, ప్రచారాలు, ప్రసంగాలు, వాదోపవాదనలు ఇవన్నీ క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నప్పుడు కూడా నా అభిప్రాయం మారలేదు. 'అమెరికాకి ఏం చెయ్యాలి?' అన్న విషయంలో హిల్లరీ కన్నా ట్రంప్ కి ఎక్కువ స్పష్టత ఉందనిపించింది చాలాసార్లు. నేను చదివిన పత్రికలు, చూసిన టీవీ కార్యక్రమాలలో సింహభాగం హిల్లరీకే మద్దతు ఇచ్చాయి. ఓ నెలక్రితం మిత్రులొకరు "ప్రపంచం బాగుపడాలంటే హిల్లరీ గెలవాలి.. అమెరికా బాగుపడాలంటే ట్రంప్ గెలవాలి" అన్నారు. అమెరికన్ ఓటర్లు అమెరికా గురించి ఆలోచిస్తారు కానీ, ప్రపంచం గురించి కాదు కదా అనుకున్నాను నేను.

కొందరు మిత్రులు పట్టు విడవకుండా, "ట్రంప్ గెలిస్తే ఇండియా కి నష్టం తెలుసా?" అంటూ నాలో దేశభక్తిని రగిల్చే ప్రయత్నం చేశారు. నేను మరీ గట్టిగా మాట్లాడితే అలమండ భూవి తగువులా మారే ప్రమాదం కనిపించి, అభిప్రాయలు దాచుకోడం మొదలుపెట్టాను. ఇప్పుడింక ట్రంప్  గెలిచాడు కాబట్టి, క్షణ క్షణముల్ ట్రంప్ చిత్తముల్ కాబట్టి.. ఏరోజు ఏం జరుగుతుందో చూడాలి తప్ప పెద్దగా ఊహించేందుకు ఏమీ ఉండకపోవచ్చు. అయినా ట్రంప్ ఒఖ్ఖణ్ణీ అనుకోడం ఎందుకూ, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ రాత్రికి రాత్రే కరెన్సీ ప్రకటన చేయలేదూ? 'కొంచం ముందస్తుగా తెలిసినా బాగుండేది' అనుకుంటున్న వాళ్ళు చాలామంది నా చుట్టూనే ఉన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు నెలక్రితమే నోట్ల రద్దు గురించి ప్రధానికి లేఖ రాశారు. పై సర్కిళ్లకి ముందస్తుగా ఉప్పేమన్నా అంది ఉంటుందా అన్న సందేహం కలుగుతోంది ఇప్పుడు ఆలోచిస్తుంటే. ఐదు వందల రూపాయల నోటు కొత్తది వచ్చేస్తోంది కానీ, వెయ్యి స్థానం లో మాత్రం రెండువేల రూపాయల నోటు వస్తుందని చెబుతున్నారు. "ఈ మొత్తం వ్యవహారంలో సామాన్యుడికి ఒరిగేది ఏమన్నా ఉంటుందో ఉండదో కానీ, ఓ వారం పది రోజుల పాటు కరెన్సీ కష్టాలు మాత్రం ఖాయం" అంటున్నారు మిత్రులు.

నాకైతే మార్కెట్లో మనీ ఫ్లో పెరుగుతుందనిపిస్తోంది. కొన్నాళ్లపాటు రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యి, షేర్ మార్కెట్ పెరగొచ్చు. యాభై రోజుల గడువుంది కాబట్టి, డబ్బు నిల్వలు ఉన్నవాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారు కాబట్టి, దేశీయంగా ఉన్న నల్లడబ్బు మొత్తం మార్కెట్లోకి వచ్చేస్తుందని అనుకోలేం.. కనీసం కొంతైనా రాకుండా ఉండడం అన్నది మాత్రం అసాధ్యం. డబ్బు కన్నా కూడా ముఖ్యమైన విషయం ప్రజలకి వ్యవస్థ మీద నమ్మకం కలగడం. ఒక్కో వ్యవస్థ మీదా జనానికి నమ్మకం పోతున్న తరుణంలో ప్రభుత్వం గట్టిగా తల్చుకుంటే, డబ్బున్న వాళ్ళని ఇలా కూడా ఇబ్బంది పెట్టగలదు అన్న సందేశం అయితే ప్రజల్లోకి వెళ్తుంది, కచ్చితంగా..

(మరి పేదవాడి ఇబ్బందులో అనొచ్చు, కొంత ఇబ్బంది ఉన్నా కష్టార్జితం రూపాయికి వంద పైసలూ తిరిగి వచ్చేస్తుంది, రాచమార్గంలో.. నల్లడబ్బు నిల్వలున్న వాళ్ళు ఇంత తక్కువ సమయంలో కరెన్సీని మార్చుకోవాలంటే ఎంతో కొంత ఖర్చు పెట్టక తప్పదు.. ఆ మొత్తం తెలుపే అవుతుంది కదా..)

మంగళవారం, నవంబర్ 01, 2016

పింజారి

ఎమెస్కో ఆ మధ్యన ప్రచురించిన 'తెలుగువారి ప్రయాణాలు' పుస్తకం చదువుతూ రాసుకున్న 'చదవాల్సిన పుస్తకాల' జాబితాలో ఒకటి బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ ఆత్మకథ. ఎం. ఆదినారాయణ సంకలనం చేసిన 'తెలుగువారి ప్రయాణాలు' లో అనేక రంగాలకి చెందిన తెలుగు వారి ప్రయాణ విశేషాలను వారే రాసిన పుస్తకాల్లో నుంచి సేకరించి ప్రచురించారు. ప్రజానాట్యమండలి కళాకారుడైన నాజర్ అటు పోలీసులు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలనీ తప్పించుకుంటూ గుంటూరు జిల్లాలో రహస్య జీవితం గడిపిన రోజుల్లో చేసిన ప్రయాణాలని చదివానా పుస్తకంలో. మొన్ననే నాజర్ ఆత్మకథ 'పింజారి' దొరికింది.

ఇప్పుడు వినడానికి 'పింజారి' అనేది నిందావాచకంలా అనిపిస్తుంది. కానీ, దూదేకుల కుటుంబంలో పుట్టి పెరిగిన నాజర్ 'నేను పింజారిని' అని చాలా సందర్భాల్లోనే చెప్పుకున్నారు. తెలుగునాట బుర్రకథకి కొత్త ఒరవడిని పెట్టి, పేరు ప్రతిష్ఠలతో పాటు ప్రభుత్వం నుంచి పద్మ పురస్కారాన్నీ అందుకున్న నాజర్ జీవితానికి సంబంధించిన విహంగ వీక్షణం ఈ పుస్తకం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి బుర్రకథలపై పీహెచ్డీ చేసిన అంగడాల వెంకటరమణ మూర్తి, తన పరిశోధనలో భాగంగా అనేక పర్యాయాలు నాజర్ ని కలిసినప్పుడు, ఆ కళాకారుడు తన గురించి పంచుకున్న విశేషాలని అక్షరబద్ధం చేసి 'పింజారి' పేరుతో ప్రచురించారు.

గుంటూరు జిల్లా పొన్నెకల్లులో నాజర్ పుట్టిపెరిగిన దూదేకుల వీధిలో పందిరి గుంజ కూడా పాటలు పాడుతుందిట. సంగీతంతో అంతగా మమేకమైన కుటుంబాలవి. నాజర్ కుటుంబం స్థానిక దేవాలయంలో అనువంశిక నాదస్వర కళాకారులు. అయితే, నాజర్ కి మాత్రం పుట్టుకతోనే విద్య పట్టుపడిపోలేదు. మొదట నాటకాల్లో బాల నటుడిగా నటించిన నాజర్ కి పాట బాగా పట్టుపడుతుందని గుర్తించిన వాడు హార్మోనిస్టు ఖాదర్. ఓ పక్క పేదరికం, మరోపక్క పిల్లవాడికి సంగీతం చెప్పించాలన్న ఆ కుటుంబ సభ్యుల తాపత్రయం.. తపన కొన్నాళ్ళు, పేదరికం కొన్నాళ్ళు గెలవడంతో కొంతమేరకు మాత్రమే సంగీతం నేర్చుకోగలిగారు నాజర్.


కుటుంబ పోషణ కోసం నటన, బుర్రకథలు, ఏమీ లేనప్పుడు టైలరింగ్ పనులతో ఎప్పుడూ క్షణం ఖాళీ లేకుండా గడుపుతున్న నాజర్ జీవితంలో పెద్ద మలుపు కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడు కావడం. ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురుపడ్డా అతడు పార్టీని విడవకపోయినా, పార్టీనే రాజకీయ కారణాలతో కొన్నాళ్ల పాటు నాజర్ ని దూరం పెట్టింది! విద్య నేర్చుకున్న విధానం మొదలు సాటి కళాకారుల సహకారం, అప్పుడప్పుడూ వాళ్ళ కారణంగా ఎదుర్కొన్న సమస్యలు, పార్టీ రాజకీయాల కారణంగా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి రావడం, వెంట్రుక వాసిలో చావు నుంచి తప్పించుకోవడం.. ఇవన్నీ ఈ పుస్తకాన్ని ఆపకుండా చదివిస్తాయి. సినీ రంగ ప్రవేశం, కొన్ని అనుభవాల తర్వాత వెండితెర కన్నా స్టేజీ మీద బుర్రకథ చెప్పడానికే మొగ్గు చూపడం ఆసక్తికరమైన సంగతులు.

కళాకారుడిగా ఎత్తులకు ఎదుగుతున్న సమయంలో కుటుంబంలో వచ్చిన సమస్యలు.. వాటిని నాజర్ ఎదుర్కొన్న వైనాన్ని క్లుప్తంగా వివరించారు రచయిత. తెలుగు ప్రజలు గర్వించ దగ్గ కళాకారుడిగా ఎదిగిన నాజర్ కు అస్సలు లేనిది డబ్బు జాగ్రత్త. సొంత ఇల్లు కట్టుకోవడం, పిల్లలకి విద్య నేర్పించడం మినహా ఆస్థుల రూపంలో దాచింది ఏమీ లేదన్న సంగతి పెద్దగా ఆశ్చర్య పరచదు. కమ్యూనిస్టు పార్టీ కోసం కమిటెడ్ గా పనిచేసిన వాళ్ళెవరూ ఆస్థులు కూడబెట్టుకున్న దాఖలాలు లేవు మరి. నాజర్ బహుముఖీన వ్యక్తిత్వాన్ని పాఠకులకి పరిచయం చేయడంలో రచయిత కృతకృత్యులయ్యారు. పుస్తకం మొత్తం ఒక ఎత్తైతే, చివర్లో 'మా బాజీ' అంటూ నాజర్ భార్య ఆదంబీ రాసిన వ్యాసం ఒక్కటీ మరో ఎత్తు.

ఆదంబీ నాజర్ కి మూడో భార్య. మేనమామ కూతురు కాశింబీని పెళ్లిచేసుకున్న నాజర్, ఆమెకి  అనారోగ్యం చేయడంతో మరో పెళ్లి చేసుకుని, ఆమె అకాల మరణం పాలవ్వడంతో కాశింబీ చెల్లెలు ఆదంబీని పెళ్లిచేసుకున్నారు. చివరి వరకూ కాశింబీ నాజర్, ఆదంబీలతో కలిసే ఉన్నారు. "నా తొమ్మిదో ఏట ఒకసారి మా ఇంటికి అడుక్కునే సాధువు వొచ్చాడు. నా చెయ్యి చూసి, నీకు పండితుడు దొరుకుతాడు అని చెప్పాడు. అది విని మా అక్కలు దూదేకుల సాయిబుల్లో పండితుడెవడే అని నవ్వేవాళ్ళు" అంటూనే, ఒక్కో బుర్రకథ తయారు చేయడానికీ నాజర్ పడ్డ శ్రమనీ, సేకరించిన వివరాలనీ జ్ఞాపకం చేసుకుని, సాధువు మాట పొల్లుపోలేదంటారు ఆదంబీ.

పుస్తకం చదవడం పూర్తి చేసేశాక, 'యుగధర్మం' శీర్షికతో 'అరుణ' రాసిన నాలుగు మాటల్లో ఆకర్షించిన వాక్యాలివి: "పెద్దనగారు గండపెండేరం తొడిగించుకున్న కాలానికి పింజారీ ఊరవతల ఉన్నాడు. పింజారీ గండపెండేరం తొడిగించుకునే కాలానికి పెద్దనగారు పెద్దమనిషి అయి ఇవన్నీ తప్పురా అంటే - కాలం చిన్నబుచ్చుకోదా.." ఎనభై ఆరు పేజీల 'పింజారి' సారాంశాన్ని అరుణ ఒకే ఒక్క వాక్యంతో చెప్పేశారనిపించింది. మరుగున పడిపోతున్న కళల మీద, కళాకారుల మీదా ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకమిది. విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ప్రచురించిన ఈ పుస్తకం వెల రూ. 65. అన్ని పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది.

గురువారం, సెప్టెంబర్ 15, 2016

కోర్టులు-తీర్పులు

ఈమధ్య మన న్యాయవ్యవస్థ తరచూ వార్తల్లో కనిపిస్తోంది. కోర్టుల్లో గుట్టలుగా పెరిగిపోతున్న కేసులు ఓ పక్క, భర్తీ కాక మిగిలిపోతున్న ఉద్యోగాలు మరోపక్క, వెరసి న్యాయమూర్తులు ఒత్తిడికి గురవుతున్నట్టుగా కనిపిస్తోంది. న్యాయమూర్తుల పోస్టుల భర్తీ విషయంలో సాక్షాత్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశ ప్రధాని సమక్షంలో భావోద్వేగానికి గురవ్వడాన్ని చూశాం మనం. కొన్ని న్యాయపరమైన చిక్కుల కారణంగా ఏళ్లతరబడి పోస్టుల భర్తీ నిలిచిపోయిందని వ్యాసాలు ప్రచురించాయి పత్రికలు. 'న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వం పాత్ర ఉండాలా? ఉండకూడదా?' అన్న చర్చ సుదీర్ఘంగా కొనసాగుతోంది.

న్యాయమూర్తుల కొలీజియం ద్వారానే నియామకాలు జరగాలి తప్ప ప్రభుత్వం జోక్యం ఉండకూడదని సీనియర్ న్యాయమూర్తులు అభిప్రాయ పడుతూ ఉండగా, ప్రభుత్వ జోక్యం ఉండని స్వాతంత్య్రం ఏ వ్యవస్థకీ ఉండకూడదనీ, న్యాయవ్యవస్థ కూడా ఇందుకు మినహాయింపు కాదనీ ప్రభుత్వ పెద్దలు వాదిస్తున్నారు. నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉన్న పక్షంలో కేసుల విచారణలోనూ, తీర్పు వెలువరించడంలోనూ న్యాయవస్థ తాలూకు స్వతంత్రం ప్రశ్నార్ధకవుతుందన్న వాదన కోర్టుల వైపు నుంచి వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, కావాల్సింది పెద్ద సంఖ్యలో న్యాయమూర్తులు కాదనీ, పనిచేసే న్యాయమూర్తులే తక్షణావసరమనీ ప్రకటించింది లా కమిషన్.

నియామకాలని గురించిన చర్చ జరుగుతూ ఉన్న సమయంలోనే, సుప్రీం కోర్టు వెలువరించిన ఒక తీర్పు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చిన రెండు తీర్పులు ఆసక్తికరంగా అనిపించాయి. సుప్రీం కోర్టు తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సింగూరు భూములకి సంబంధించింది. సతతమూ పేదల పక్షాన నిలబడి పోరాటాలు చేసే కమ్యూనిష్టు పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న సమయంలో టాటా సంస్థకి కార్ల కర్మాగారం ఏర్పాటు నిమిత్తం సింగూరులో భూసేకరణ చేసింది. రైతులంతా బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం, ఆ పోరాటాలకు నాయకత్వం వహించిన తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ తదనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కావడం చరిత్ర.


నాటి బలవంతపు భూసేకరణని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చి, సేకరించిన భూముల్ని రైతులకి స్వాధీనం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూసేకరణ అనంతరం బెంగాల్లో జరిగిన ఏ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు విజయం సాధించలేదు. కోర్టు తీర్పు తర్వాత, ఆ పార్టీ నాయకులు చట్ట ప్రకారమే భూసేకరణ జరిగింది తప్ప ప్రభుత్వం తప్పేమీ లేదని ప్రకటించారు. లోపం బ్రిటిష్ కాలం నాటి భూసేకరణ చట్టానిదేననీ, సింగూరు సంఘటన ఫలితంగానే ప్రభుత్వం ఆ చట్టానికి మార్పు చేసిందనీ కూడా పత్రికల్లోనూ, టీవీల్లోనూ గట్టిగా చెప్పారు. మమతా బెనర్జీ ప్రస్తుతం రైతులకి భూములని  స్వాధీనం చేస్తూ కోర్టు ఆదేశించిన నష్ట పరిహారాన్ని కూడా పంపిణీ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులని ప్రస్తావించే ముందు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మాన్య  చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పు పట్టిన సందర్భాలు బహు అరుదు. దీనిని న్యాయ వ్యవస్థ పట్ల చంద్రబాబుకి ఉన్న తిరుగులేని అవగాహనకి నిదర్శనంగా ఆయన అనుయాయులు టీవీ చర్చల సాక్షిగా గర్వపడేవారు కూడా. అయితే, ప్రపంచస్థాయి రాజధాని నగరం అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న 'స్విస్ ఛాలెంజ్' విధానాన్ని నిలిపివేయవలసిందిగా హైకోర్టు మూడు రోజుల క్రితమే ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్లేందుకు సిద్ధ పడుతూ ఉండగానే నిన్న మరోకేసులో ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు.

తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలో నిర్మించదలచిన ఔషధ పరిశ్రమనీ, అందునిమిత్తం జరిగిన భూసేకరణనీ స్థానిక రైతులు వ్యతిరేకించారు. నాడు బెంగాల్లో బలవంతపు భూసేకరణ జరిపిన వామపక్ష పార్టీలు తుని రైతులకి సంఘీభావం ప్రకటించాయి. రైతులు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ భూసేకరణని న్యాయస్థానం తప్పు పట్టింది. మాన్య చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలకి వ్యతిరేకంగా వరుసగా రెండు తీర్పులు రావడం బహుశా ఇదే మొదటిసారి. ప్రజాస్వామ్యంలో ఒక్కో వ్యవస్థ మీదా నమ్మకం కోల్పోతూ వస్తున్న సామాన్యులకి అంతో ఇంతో నమ్మకం ఉన్నది న్యాయ వ్యవస్థ మీదే అనడం అతిశయోక్తి కాదు. ఈ మూడు తీర్పుల్లాంటివి ఆ నమ్మకాన్ని పెంచుతున్నాయి కూడా. నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉన్నట్టయితే, స్వతంత్రంగా తీర్పులివ్వడం కోర్టులకి ఏమేరకు సాధ్య పడుతుంది అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా పెద్ద ప్రశ్న.

సోమవారం, సెప్టెంబర్ 12, 2016

జ్యో అచ్యుతానంద

టైటిల్ కోసం హిట్ పాటల పల్లవులు అయిపోయాయి, ఇప్పుడిక అన్నమాచార్య కీర్తనల వంతు కాబోలు అనుకున్నా 'జ్యో అచ్యుతానంద' టైటిల్ చూడగానే. సినిమాకీ, టైటిల్ కీ పెద్దగా సంబంధం ఉంటుందని కూడా అనుకోలేదు. కానీ, చక్కని టైటిల్ కి వంద శాతం న్యాయం చేస్తూ దర్శకుడు అవసరాల శ్రీనివాస్ రూపొందించిన సినిమా ఓ సకుటుంబ కథా చిత్రం. మెలోడ్రామాని కాక, సెంటిమెంట్ ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా. సినిమా అంటే నాలుగు ఫైట్లు, ఐదు డ్యూయెట్లు మరియు ఒక ఐటెం సాంగ్ మాత్రమే అనుకునే వాళ్ళు ఈ సినిమా ఆడుతున్న ధియేటర్ దరిదాపులకు వెళ్లకపోడమే మంచిది.

అన్నదమ్ముల కథ అనగానే నాటి 'అన్నదమ్ముల అనుబంధం' నుంచి మొన్నటి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వరకూ గుర్తు రావడం సహజం. కానైతే ఈ సినిమా ప్రత్యేకం. కాసింత లాజిక్ మిస్సయినా ఇందులో కథ ఉంది. ఆ కథని మింగేసే స్టార్లు లేకపోవడం, అన్నదమ్ములుగా నటించిన ఇద్దరూ 'నటులు' కావడం (స్టార్లు కాకపోవడం), ఎక్కడా విసిగించని కథనంతో పాటుగా బూతు ఏమాత్రం లేని హాస్యం ఉండడమే ఆ ప్రత్యేకత. జ్యోత్స్న(రెజీనా కసాండ్రా) అనే అమ్మాయిని ప్రేమించిన అన్నదమ్ములు అచ్యుతరామారావు (నారా రోహిత్), ఆనందవర్ధనరావు (మూల్పూరి నాగశౌర్య)ల కథ ఇది. చాలా సిన్సియర్ గా జ్యోత్స్నని ప్రేమించేసిన అన్నదమ్ములిద్దరూ, ఆమెకోసం ఒకరి కాలర్ ఒకరు పట్టుకునే స్టేజికి వచ్చేశాక, వీళ్ళిద్దరినీ కాదని, ఆమె పై చదువులకోసం విదేశాలకి వెళ్ళిపోతుంది.

అన్నదమ్ములిద్దరూ పెళ్లిళ్లు చేసుకుని జీవితాల్లో స్థిరపడే నాటికి జ్యోత్స్న మళ్ళీ ఊడిపడుతుంది. ఒకప్పుడు వీళ్ళ ప్రేమని తిరస్కరించిన ఆమె, ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ప్రపోజ్ చేస్తుంది. ఆమె ఎందుకలా చేసింది అన్న ప్రశ్నకి జవాబుతో పాటు, అప్పుడు అన్నదమ్ములిద్దరూ ఏం చేశారు అన్నది సినిమాకి ముగింపు. కథ కన్నా కూడా కథనం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు దర్శకుడు. ఫలితంగా సినిమా చాలా హాయిగా సాగిపోయింది. మొదటిసగం మొత్తం నవ్వుల్లో ముంచి తేలిస్తే, రెండో సగంలో హాస్యంతో సెంటిమెంట్ పోటీపడింది. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయని అప్పుడెప్పుడో ఆత్రేయ చెప్పిన మాటని నిజం చేసి చూపించాడు అవసరాల శ్రీనివాస్.


రోహిత్, నాగశౌర్య అన్నదమ్ములు అని వినగానే 'బాబాయ్ అబ్బాయ్ లా ఉంటారేమో' అని అనుమానించాను కానీ, చూస్తున్నప్పుడు అలాంటి ఇబ్బంది కలగలేదు. కానైతే, రోహిత్ ఫిజిక్ మీద శ్రద్ధ పెట్టడం అత్యవసరం. లేని పక్షంలో కేరక్టర్ ఆర్టిస్ట్ గా ప్రమోషన్ కొట్టేసే అవకాశాలు మరీ పెరిగిపోయాయి. అన్నదమ్ములుగా వీళ్ళిద్దరూ అతికినట్టుగా సరిపోయారు. సిగరెట్ షేర్ చేసుకోడం మొదలు, అమ్మాయి కోసం కొట్టుకోడం వరకూ ఎక్కడా అతి అనిపించలేదు. అలాగే, వాళ్ళ వ్యక్తిత్వాల్లో వైరుధ్యాలని డైలాగులు అవసరం లేకుండా ప్రదర్శించి మెప్పించారు. మొదటి సగంలో రెజీనా నటనకి వంక పెట్టడానికి లేదు కానీ, రెండో సగంలో అక్కడక్కడా అతి అనిపించింది. ఆమె పాత్ర కూడా కొంతమేర నేలవిడిచి సాము చేసింది. హీరోల తల్లిగా సీత, హీరోయిన్ తండ్రిగా తనికెళ్ళ భరణి కనిపించారు.

ఇంటివాళ్లతో అంత పెద్ద మాట పట్టింపు వచ్చినా భరణి ఏళ్లతరబడి ఇల్లెందుకు ఖాళీ చేయలేదన్నది జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది. హీరోల భార్యలకీ, రెజీనాకి మధ్య కాన్ఫ్లిక్ట్ సృష్టించే అవకాశం ఉన్నా దర్శకుడు ఎందుకో ఆ జోలికి వెళ్ళలేదు. కొడుకు పుట్టినరోజుకి తండ్రి ఓ తెలుగు నవలని కానుకగా ఇవ్వడంతో పాటు, ఆ నవల చుట్టూ కొన్ని సన్నివేశాలు అల్లడం ఈతరం దర్శకులు ఎవ్వరూ ఇప్పటివరకూ చేయని ప్రయత్నం. నా వరకూ చాలా బాగా నచ్చేసిన సీక్వెన్సు ఇది. మరోసారి పేరు మార్చుకున్న సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ పనిమీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదనిపించింది. ముఖ్యంగా రెండోసగంలో సన్నివేశాలకి, సంగీతానికీ పొత్తు కుదరని ఫీలింగ్. పాటలు, నేపధ్య సంగీతం గుర్తుండిపోయే విధంగా ఉంటే సినిమా మరో మెట్టు పైకెక్కి ఉండేది.

ఈ మధ్యకాలంలో చిన్న బడ్జెట్లో చక్కని సినిమాలు నిర్మిస్తున్న 'వారాహి' సంస్థ అందించిన సినిమా ఇది. ఇప్పటివరకూ నటుడిగా హాస్యాన్ని, విలనీని ప్రదర్శించిన అవసరాల శ్రీనివాస్ తనలో దర్శకుణ్ణి పూర్తిగా ఆవిష్కరించుకున్నాడని చెప్పాలి. పంచ్ ల కోసం పాకులాడకుండా, సందేశాలివ్వాలని ఆయాస పడిపోకుండా అవసరాల రాసుకున్న సంభాషణలు సన్నివేశాలని అలవోకగా నడిపించేయడమే కాక, ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాయి. రెండోసగంలో ఫైటింగ్ సీన్ చాలా కృతకంగా అనిపించింది.మొదటిసగం మీద పెట్టిన శ్రద్ధ రెండోసగం లోని ఓ ఇరవై నిమిషాల మీద పెట్టి ఉంటే వంక పెట్టడానికి వీల్లేని సినిమా వచ్చి ఉండేది కదా అనిపించింది. అయితే, దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ మీద అంచనాలని 'జ్యో అచ్యుతానంద' బాగా పెంచేసిందని చెప్పక తప్పదు.

ఆదివారం, ఆగస్టు 14, 2016

జెండా పండగ

"రండీ ఓ మిత్రులార జెండా ఎగురవేయ.. మన జాతికి గౌరవమీయ.." ఆడపిల్లలందరూ గదిలో ఓ మూల కూర్చుని పాట ప్రాక్టీసు చేసుకుంటున్నారు చక్కగా. వాళ్ళకయితే అదొక్కటే పని. అదే మగపిల్లలకయితేనా.. పురికొసలు కాలవలోకి పట్టుకెళ్లి నానబెట్టి, ఆ తర్వాత ఎండబెట్టాలి. రంగు రంగుల జెండా కాయితాలు మడతలు పెట్టి, మేష్టారు కత్తిరించడానికి రెడీగా పెట్టాలి. ఎవరింట్లో కత్తెరలు ఉన్నాయో లెక్కేసి, వాళ్లలో ఎవరు తిట్టకుండా ఎరువిస్తారో నిర్ణయించి, జెండా కాయితాలు కత్తిరించడడం కోసం అడిగి పట్టుకురావాలి. మేష్టారు జెండాలు కత్తిరిస్తుంటే, ఆయనకి కోపం రాకుండా చూసుకోవాలి. నోటిమీద వేలేసుకుని చూస్తూ ఉండాలి. అప్పుడు గనక ఏమన్నా మాట్లాడామంటే, చెయ్యి తిరగెయ్యమని వేళ్ళ కణుపుల మీద రూళ్ళ కర్రతో ఒక్కటేస్తారు మేష్టారు.

జెండాలు కత్తిరించడం అయిపోగానే కనీసం ఇద్దరం వెళ్లి కత్తెరని తిరిగిచ్చేసి రావాలి. పురికొస తాడుని బడి బయట ఆ చివర నుంచి ఈ చివరికి వరసలుగా కట్టి, రామారావు గారి ఇంటి దగ్గరనుంచి తెచ్చిన వేడి వేడి లైపిండి తాడుకి పులమాలి. అప్పుడేమో మేష్టారొచ్చి దగ్గరుండి జెండా కాగితాలు చిరిగిపోకుండా తాడుకి ఎలా అతికించాలో చూపిస్తారు. కొంతమంది జెండాలు అంటిస్తుంటే, ఇంకొంతమంది రద్దు ఏరి బయట పడేసే పని, బండిముందు ఇసుకలో నీళ్లు జల్లేపనీ చూడాలి. హమ్మయ్య పురికొస అంతా రంగురంగుల జెండా కాగితాలతో నిండిపోయింది.. మిగిలిన జెండాలు గుమ్మాల పైనా, బోర్డు పైనా అతికించేస్తే జెండాల పని అయిపోయినట్టే. ఈ పైన కట్టే పని మాత్రం పొడుగు పిల్లలదే. వొచ్చే ఏడాదికైనా వాళ్లంతా పొడుగైపోతే బాగుండును అనిపించేస్తుంది మనకి.

సరే, ఇప్పుడింక ఆడపిల్లల పని మొదలవుతుంది. మధ్యాహ్నం బళ్లోకి వచ్ఛేప్పుడే తెల్ల ముగ్గు, రంగు ముగ్గులూ తెచ్చేసుకుంటారు కదా వాళ్ళు. వాటిలో తడిసిన ఇసక మీద రంగు ముగ్గులు పెట్టేస్తారు. మేష్టారు దగ్గరుండి జెండా కర్ర చుట్టూ రంగు ముగ్గు పెట్టించేస్తారు. ఆరిపోయిన జెండాల తాడుని క్లాసులో కట్టే పనీ, నేల బెంచీలు పైకెత్తి, ఇసకంతా తుడిచి, నీళ్లు జల్లే పనీ మళ్ళీ మగ పిల్లలవే. ఇవయ్యాక ఆడపిల్లలు షోగ్గా వచ్చి మేష్టారిచ్చిన రంగు సుద్దలతో గచ్చు నేలమీద ముగ్గులు పెట్టేస్తారు. ఆ ముగ్గులు ఆరిపోయాక నేల బల్లలు మళ్ళీ పరిచేయాలి. అన్నట్టు, అంతకన్నా ముందే, అప్పటికి వారం ముందు నుంచీ రోజూ చేయిస్తున్న 'ఎటేంషన్' 'స్టెండిటీజ్' అందరం కలిసి మళ్ళీ ఓ సారి చేసి చూపించాలి మేష్టారికి.

ముగ్గులతోనూ, జెండాలతోనూ బడి భలే కొత్తగా అయిపోతుంది కదా. అప్పుడేమో మేష్టారు, మర్నాడు పొద్దున్నే జెండాలో వెయ్యడానికి పువ్వులు అవీ ఎవరెవరు తేవాలో చెప్పేసి, పొద్దున్నే ఉతికిన బట్టలు కట్టుకుని ఆలీసం చెయ్యకుండా బడికొచ్చేయాలని, ఎవ్వరూ మానకూడదనీ చెప్పేసి ఇంటికి పంపిస్తారు. ఇంటికొచ్చేమంటే జెండా పండగ సగం అయిపోయినట్టే. ఇంక మర్నాడు తెల్లారిందంటే ఇంట్లో ఒకటే హడావిడి. మామూలు పండగల్లాగే తలంటేస్తుంది అమ్మ. కుంకుడు కాయ రసం కానీ కంట్లో పడిందంటే కళ్ళు ఎర్రగా అయిపోతాయి. "అబ్బే మా నాన్నగారు అస్సలు కొట్టలేదు.. కుంకుడ్రసం పడిందంతే" అని మనం చెప్పినా సరే, ఫ్రెండ్సులు అనుమానంగా చూస్తారు.

ఇంక బళ్ళోకెళ్లింది మొదలూ ఎండలో నిలబెట్టి 'ఎటేంషన్' లు' 'స్టెండిటీజ్' లూను. సగం ముగ్గులు చెరిగిపోయి, మనకి కాళ్ళు నొప్పులు మొదలయ్యాక అప్పుడొస్తారు పెద్దమనుషులు, జెండా ఎగరెయ్యడానికి. ఫ్రెండ్సులేమో "మీ నాన్నగార్రోయ్" అంటారు మనకి తెలియనట్టుగా. వాళ్ళని కొంచం గీరగా చూసేమనుకో, ఆ కోపం కడుపులో పెట్టుకుని తర్వాతెప్పుడో ఏదో ఒకటి చేసేస్తారు. అందుకని మామూలుగా ఉండాలి, ఏమీ మాట్లాడకుండా. ఓ నాలుగు 'ఎటేంషన్' లు' 'స్టెండిటీజ్' లూ అయ్యాక వచ్చే 'ఎటేంషన్' లో పెద్దమనుషులు జెండా కర్ర దగ్గర కొబ్బరి కాయలు కొట్టి, జెండా ఎగరేసేస్తారు. ఆడపిల్లలు పాటలు పాడేస్తారు. ఈలోగా రామారావు గారొచ్చి, కొబ్బరి చెక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేసి వాళ్ళింట్లో బేసిన్లో తెచ్చుకున్న పంచదారలో కలిపేస్తారు. ఇంకో బేసిన్లో చాకలేట్లు, బిస్కట్లు కూడా కవర్లు చింపేసి పోసేస్తారు.

అది మొదలు పెద్ద మనుషులు గాంధీ గారనీ, నెహ్రు గారనీ ఏవిటేవిటో మాట్లాడతారు. ఫ్రెండ్సులందరూ చక్కగా కొబ్బరి ముక్కలూ అవీ ఎప్పుడు పెడతారో అని చూడొచ్చు కానీ, మనం మాత్రం పెద్ద మనుషులు మాట్లాడేది శ్రద్ధగా వినాలి. ఇంటికెళ్ళాక ఎవరెవరు ఏమేం మాట్లాడారు అని ప్రశ్నలు ఉంటాయి. సరిగ్గా కానీ చెప్పలేకపోయామా, పొద్దు పొద్దున్నే ఫ్రెండ్సులకి వచ్చిన అనుమానాలు నిజమయిపోతాయి. ఎండలో నిలబడి వినగా వినగా, మేష్టారు సైగ చేసినప్పుడల్లా చప్పట్లు కొట్టగా కొట్టగా, అప్పటికి పూర్తిచేస్తారు వాళ్ళు మాట్లాడడం. గాంధీ గారు, నెహ్రు గారు జైలుకి వెళ్లారు కాబట్టే మీరిలా చదువుకోగలుగుతున్నారు అని చెబుతారు వాళ్ళు. "వాళ్లంత కష్టపడి జైలుకి వెళ్లకపోతేనేం" అనిపిస్తుంది కానీ, ఆ మాట పైకనేస్తే పాతెయ్యరూ?

హమ్మయ్య! చిన్న చిన్న కాగితం ముక్కల్లో కొబ్బరి ముక్కలూ అవీ ఇచ్చేశారు కదా.. ఎప్పటిలాగే రామారావు గారు "పడెయ్యకూడదు.. గాంధీ గారి ప్రసాదం" అని కూడా చెప్పేశారు కదా.. ఇంకా ఇంటికి వెళ్లిపోవచ్చు అనుకుంటున్నారా? అప్పుడే ఎక్కడ.. ఇంకా కాంగ్రెస్ అరుగు దగ్గర జెండా ఎగరెయ్యద్దూ? అందరం రోడ్డుకి ఎడమవైపున వరుసలుగా బయలుదేరతాం.. కాంగ్రెస్ అరుగు దగ్గరికి వచ్చేస్తే మనిల్లు దగ్గరే కూడాను. ఆలా అని ఇంట్లోకి వెళ్లిపోకూడదు. అక్కడ మళ్ళీ కాసేపు 'ఎటేంషన్'  'స్టెండిటీజ్' చేశాక, వేరే పెద్దమనుషులు వచ్చి, కొబ్బరికాయలు కొట్టి జెండా ఎగరేస్తారు. ఇక్కడైతే ఒకళ్ళో ఇద్దరో మాట్లాడతారంతే. పైగా, కొబ్బరి ముక్కలతో పాటు తీబూందీ, కారబూందీ వేరేవేరే అరిటాకు ముక్కల్లో పెట్టి ఇస్తారు.

అంతేనా? గత సంవత్సరం ఎక్కువ మార్కులు వఛ్చిన విద్యార్ధులకి నగదు బహుమతుల పంపిణీ కూడాను. డబ్బులు తీసుకుని, ఆ పెద్దమనిషి ఎప్పుడూ మన ఇంటికొచ్చే నాన్న ఫ్రెండే అయినా అస్సలు నవ్వకుండా, ఆయనకీ, మేష్టారికి నమస్కారం చేసేసి, అప్పుడా డబ్బులతో ఏమేం చెయ్యొచ్చో ప్లాన్లు వేసేసుకోవచ్చు. బడికి దగ్గరగా ఇళ్లున్న వాళ్ళు వెనక్కి వెళ్తారు కానీ, మనం ఉండిపోవచ్చు ఎంచక్కా. వచ్చిన చిరుతిళ్లన్నీ ఒలికిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి వెళ్తామా? అమ్మ ముందుగా డబ్బులగురించి అడుగుతుంది. "నీ దగ్గరుంటే పారేసుకుంటావు.. నాన్నగారికి చెప్పి పోస్టాఫీసులో వేయిస్తాను" అని ఆమాటా ఈమాటా చెప్పి పుచ్చేసుకుంటుంది. బాగా చదువుకుని, వొచ్చే ఏడు కూడా బహుమతీ తెచ్చుకోవాలనీ, అప్పుడా డబ్బులు అమ్మకి అస్సలు ఇవ్వకుండా ప్రసాదం గారి కొట్లో బజ్జీలూ, వడలు అవీ కొనుక్కుని తినెయ్యాలనీ ప్లాన్లు వేసుకోడంతో ఆ ఏటికి జెండా పండగ అయిపోయినట్టే...

మిత్రులందరికీ డెబ్భయ్యో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

బుధవారం, ఆగస్టు 10, 2016

మనమంతా

తెలుగు సమాజంలో బాగా పెరిగిన మధ్యతరగతి వర్గానికి తెలుగు తెరమీద మాత్రం సరైన ప్రాతినిధ్యం కనిపించడం లేదు గత కొన్నేళ్లుగా. అసలు సినిమా కథలే నేల విడిచి సాము చేస్తున్న పరిస్థితుల్లో, మధ్యతరగతి వాస్తవ పరిస్థితులని ప్రతిబింబిస్తూ ఓ సినిమా రావడం విశేషమైతే, ఎక్కడా అనవసరమైన మెలోడ్రామాకి చోటివ్వకుండా, అత్యంత సహజంగా సినిమాని తీర్చిదిద్దడం మరో విశేషం. మనకి తెలిసిన మనుషులే తెరమీద కనిపించే ఆ సినిమా పేరు 'మనమంతా.' చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వారాహి సంస్థ నిర్మించిన ఈ సినిమాని తెలుగులో నిర్మించి తమిళ, మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేయడం ఇంకో విశేషం.

ఇది నలుగురి కథ. నలుగురూ మధ్య తరగతి జీవితానికి ప్రతినిధులే. ఎవరి పరిధిలో వాళ్లకి ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునే క్రమంలో ఎదురయ్యే ఒత్తిడులూ ఉంటాయి వీళ్లందరి కథలూ కంచికి చేరుతూనే ఓ మంచి సినిమాని చూసిన అనుభూతిని మిగులుస్తాయి ప్రేక్షకులకి. సాయిరాం (మోహన్ లాల్), గాయత్రి (గౌతమి), అభిరామ్ (విశ్వాంత్), మహిత (రైనా రావు) ల కథ ఇది. వీరిలో, ఓ సూపర్ మార్కెట్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే సాయిరాంకి మేనేజర్ అవ్వాలన్నది లక్ష్యం. చదివిన చదువు మర్చిపోయి గృహిణిగా మారిపోయిన గాయత్రికి చుట్టూ ఉన్నవారి నుంచి గౌరవం అందుకోవాలన్నది కోరిక.

తెలివైన విద్యార్థి అభిరామ్, ఉన్నట్టుండి ప్రేమలో పడి, ఆ ప్రేమని నిలబెట్టుకోడం కోసం శ్రమిస్తూ ఉంటాడు. ఇక, అందరిలోకీ చిన్న పిల్ల మహిత కి తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచడం అంటే ఇష్టం. రోజురోజుకీ పెరిగే ఆర్ధిక అవసరాలు, సాయిరాం కోరికని 'లక్ష్యం' గా మారుస్తాయి. తప్పని పరిస్థితుల్లో ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోడానికి అడ్డదారి తొక్కి, అటుపై చిక్కుల్లో పడతాడు. మధ్యతరగతి నుంచి కాస్త పైకెదిగి, నలుగురి చేతా భేష్ అనిపించుకోవాలని కలలుకనే గాయత్రికి ఉన్నట్టుండి ఓ పెద్ద అవకాశం తలుపు తడుతుంది. కానీ, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి ఎన్నో సందేహాలు. తాను ప్రేమించిన అమ్మాయి తనని కూడా ప్రేమిస్తోందన్న అతి నమ్మకంతో ఉన్న అభిరామ్ కి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి.


ఇక, తన శక్తికి మించి స్నేహితుడికి సాయం చేయాలని ప్రయత్నించిన మహిత ఓ చిక్కుముడిని విప్పాల్సి వస్తుంది. నిజానికి ఈ నలుగురి కథల్లోనూ కొంత నాటకీయతకి చోటిచ్చిన కథ మహితదే. వయసుకి మించిన పరిణతి, బాధ్యత చూపించే ఈ అమ్మాయి ఎవరికైనా సాయం చేయడానికే కాదు, అవసరమైనప్పుడు సాయం పొందడానికీ వెనుకాడదు. సాయిరాం సమస్యని మహిత పరిష్కరిస్తే, మహిత సమస్య సాయిరాం ద్వారా పరిష్కరింపబడుతుంది. గాయత్రిని గురించి ఆమె కుటుంబం తీసుకున్న నిర్ణయం ఒక్కటే నన్ను కన్విన్స్ చేయలేకపోయింది. బహుశా అందువల్లనే కావొచ్చు, ముగింపుని నా చుట్టూ ఉన్న ప్రేక్షకులు ఆస్వాదించినంతగా నేను చేయలేకపోయానేమో.

మణిరత్నం 'యువ' నుంచి ప్రవీణ్ సత్తారు 'చందమామ కథలు' వరకూ ఈ తరహా కథనం తెలుగు తెరకి కొత్త కాదు. నాలుగు కథల్ని వేర్వేరుగా చూపిస్తూ, ఆ నాలుగింటి ముగింపుకీ ఓ అందమైన ముడి వేయడం ద్వారా తన సినిమా, ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండి పోయేలా చేశాడు. సాయిరాం గా నటించిన మోహన్ లాల్ నటనకి వంక పెట్టలేం కానీ, సొంతంగా చెప్పుకున్న డబ్బింగ్ ప్రేక్షకుల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. సినిమా మొదలైన కాసేపటికి కానీ ఆ డబ్బింగ్ కి అలవాటు పడలేం. గాయత్రి పాత్రకి గౌతమి సరైన ఎంపిక. తెరపై ఆమె కనిపించినంత సేపూ మనకి తెలిసిన మధ్యతరగతి మహిళలు గుర్తొస్తూనే ఉంటారు. ముఖ్యంగా నగల షాపు సన్నివేశాల్లో ఆమె నటన గుర్తుండిపోతుంది.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మహితగా నటించిన రైనా రావు, దాసుగా కనిపించిన అయ్యప్ప పి. శర్మ గురించి.. (అయ్యప్పని ఇతని సోదరుడు 'బొమ్మాళి' రవిశంకర్ గా పొరబడి మొదట ఇలా రాశాను:  'అరుంధతి' డబ్బింగ్ ఎంత పేరు తెచ్చిందో, ఈ సినిమాలో నటనా అంతటి పేరు తెచ్చే అవకాశం ఉంది రవికి). గాయత్రి స్నేహితురాలిగా తెరమీద కనిపించినంత సేపూ ఊర్వశి నవ్విస్తుంది. గొల్లపూడి, ఎల్బీ శ్రీరామ్, పరుచూరి వెంకటేశ్వర రావు, నాజర్ ఇతర పాత్రల్లో కనిపించారు. మహేష్ శంకర్ సంగీతం సన్నివేశాల తాలూకు మూడ్ ని ఎలివేట్ చేసింది. మొదటి సగంతో పోల్చినప్పుడు రెండో సగంలో కథనం నెమ్మదించింది అనిపించింది. మొత్తంమీద,  మధ్యతరగతి తమని తాము ఐడెంటిఫై చేసుకునే సినిమాని అందించిన చంద్రశేఖర్ యేలేటిని అభినందించాల్సిందే..

ఆదివారం, ఆగస్టు 07, 2016

మరల తెలుపనా ప్రియా

భావుకత్వం  ఉన్న టైటిల్, బాగున్న సంగీతం, ఆసక్తి కలిగించిన స్టిల్స్, మహిళా దర్శకురాలి తొలి చిత్రం.. అన్నింటికీ మించి, కావాల్సిన వాళ్ళ ప్రొడక్షన్.. నిజానికి రిలీజ్ రోజునే చూడాల్సిన 'మరల తెలుపనా ప్రియా' సినిమాని కారణాంతరాల వల్ల రెండ్రోజులు ఆలస్యంగా చూశాను. దర్శకురాలు వాణి ఎం. కొసరాజు తానే రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమా కథ కూడా తెలిసిందే.. ఇదే పేరుతో కొన్నేళ్ల క్రితం ఓ వారపత్రికలో సీరియల్ గా ప్రచురితమయింది. మామూలుగానే ఓ నవలని సినిమాగా మలచడంలో అనేక సవాళ్లు ఉంటాయి. అది కూడా సొంత నవలని సినిమాగా మార్చి ఒప్పించడం, అది కూడా దర్శకురాలిగా తొలిప్రయత్నంలోనే చేయాల్సి రావడం నిజంగా కత్తిమీద సామే. ఈ సాముని గురించి మాట్లాడుకోవాలంటే, ముందుగా కథ గురించి చెప్పుకోవాలి.

కోటీశ్వరులింటి గారాబు పట్టి వైషూ అలియాస్ వైష్ణవికి జీవితం అంటే ఎంజాయ్ చేయడం మాత్రమే. బైకర్ అయిన ఈ అమ్మాయి అప్పుడప్పుడూ బైక్ రేసుల్లోనూ, ఎప్పుడూ ఇంటా, బయటా జరిగే పార్టీల్లోనూ బిజీగా గడిపేస్తూ ఉంటుంది. అలాంటి వైషూకి గాయకుడూ, సంగీత దర్శకుడూ అయినా జై అలియాస్ జయకృష్ణ తారసపడతాడు ఒకానొక పార్టీలో. పరిచయం స్నేహంగా మారినప్పుడు తెలుస్తుంది ఇద్దరి అలవాట్లూ పూర్తిగా భిన్నమని. వైషూకి వైనూ, సిగరెట్లూ మామూలు విషయాలైతే, ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా ఆంజనేయస్వామి గుడికి వెళ్లే జై కి బీరు రుచి కూడా తెలీదు. జై తో కలిసి, రాజమండ్రి దగ్గరలో ఉన్న అతని పల్లెటూరికి సంక్రాతి పండక్కి వెళ్ళొచ్చిన వైషూ, హైదరాబాద్ కి తిరిగి రాగానే అతనికి ప్రపోజ్ చేస్తుంది. అతను కూడా అంగీకరిస్తాడు. ఇంతలో ఊహించని విధంగా వాళ్లకి బ్రేకప్ అవ్వడంతో సినిమా విశ్రాంతికి వస్తుంది.

తన తప్పు తెలుసుకున్న వైషూ జై కోసం వెళ్లేసరికి అతని ఇంటికి తాళం ఉంటుంది. ఫోన్లకి జవాబు  ఉండదు. వాళ్ళ ఊరికి ఫోన్ చేసినా అతని సమాచారం ఏమీ తెలియదు.. ఇక, అతన్ని వెతుక్కుంటూ తానే స్వయంగా బయల్దేరుతుంది వైషూ. అతని కోసం జరిపిన అన్వేషణలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, అసలు అతను ఉన్నట్టుండి మాయమైపోడానికి కారణాలు, తిరిగి కలుసుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలని దాటుకుంటూ శుభం కార్డుకి చేరుకుంటుంది. వైషూ గా వ్యోమ నంది (తొలిపరిచయం), జై గా ప్రిన్స్ నటించారు. కథ ప్రకారం హీరో కన్నా, హీరోయిన్ కే నటించడానికి అవకాశం ఎక్కువ. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది వ్యోమ నంది. నాయిక పాత్రలో ఉన్న డిఫరెంట్ షేడ్స్ ని ఎక్కడా వంక పెట్టడానికి వీల్లేని విధంగా ప్రదర్శించింది. కేవలం నటనకి మాత్రమే పరిమితమైపోకుండా గ్లామర్ నీ చిలకరిచింది.


హీరోది ఒకరకంగా పాసివ్ పాత్ర. హీరోయిజం ఉన్న నాయికచేత ప్రేమించబడే హీరో. చాకోలెట్ బాయ్ లా కనిపించే ప్రిన్స్ ఈ పాత్రకి సరిగ్గా సరిపోయాడు. ఈ కుర్రాడు వాచికం, డాన్సులు మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. సాంకేతిక విభాగాల్లో మొదటగా చెప్పుకోవాల్సింది కెమెరా (ఎస్. రాజశేఖర్), సంగీతం (శేఖర్ చంద్ర) గురించి. హైదరాబాద్, రాజమండ్రి, గోవా, హరిద్వార్, రిషీకేశ్ లని అందంగా చూపించింది కెమెరా. కళ్ళకి హాయిగా ఉంది పనితనం. గ్రీటింగ్ కార్డుల్లాంటి ఫ్రేములకి కొదవ లేదు. ఇక సంగీతం విషయానికి వస్తే, పాటలతో పాటుగా నేపధ్య సంగీతమూ చక్కగా కుదిరింది. మార్తాండ్ కె. వెంకటేష్ లాంటి సీనియర్ ఎడిటర్ రెండో సగం విషయంలో ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఎందుకు మొహమాట పడ్డారో అర్ధం కాలేదు. చిన్న సినిమానే అయినా, చేసిన ఖర్చు తెరమీద కనిపించింది.

దర్శకత్వం గురించి చెప్పుకోవాల్సింది కొంత ఉంది. నాయకుణ్ణి వెతుక్కుంటూ నాయిక జరిపే అన్వేషణతో కథను మొదలు పెట్టి ఇంటర్కట్స్ లో వాళ్ళిద్దరి పరిచయం, ప్రేమని చూపి, బ్రేకప్ దగ్గర విశ్రాంతిని ఇచ్చారు. రెండో సగంలో తన అన్వేషణ కొనసాగిస్తున్న నాయిక గతాన్ని గుర్తు చేసుకునే క్రమంలో మరి కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్లు చూపి, కథని ముగింపుకి తీసుకొచ్చారు. నాయికని పల్లెటూరికి తీసుకెళ్లిన నాయకుడు, తన కుటుంబాన్ని పరిచయం చేస్తాడు. తండ్రితో అతనికున్న మాట పట్టింపులతో సహా అన్నీ తెలుస్తాయి నాయికకు. అలాగే, ఓ సంగీత దర్శకుడిగా అతడు ఎంత బిజీ అన్నది కూడా ఆమె ద్వారా ప్రేక్షకులకి తెలుస్తుంది. అలాంటిది, ఉన్నట్టుండి అతను కనిపించకుండా పోతే అటు కుటుంబమూ, ఇటు సంగీత రంగానికి సంబంధించిన వాళ్ళూ కూడా ఏమాత్రం పట్టించుకోక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

అలాగే, నాయికని ఎంతగానో ప్రేమించే ఆమె తల్లిదండ్రులు, ఓ స్నేహితుడి సాయంతో ఆమె నాయకుణ్ణి వెతుకుతూ, ఆ క్రమంలో జ్వరపడితే ఫోన్లో ఓదారుస్తారే తప్ప పరుగున వెళ్లే ప్రయత్నం చేయరు. మొదటి సగం ఇట్టే గడిచిపోయిన సినిమా, రెండో సగానికి వచ్చేసరికి సాగతీతగా అనిపించిందంటే స్క్రిప్ట్ లోపమే. సున్నితమైన భావోద్వేగాలనీ, నాయికపై నాయకుడి ప్రభావాన్నీ మైన్యూట్ డీటెయిల్స్ తో సహా చిత్రించిన దర్శకురాలు, ఐటెం సాంగ్ తో సహా కమర్షియల్ హంగుల విషయంలోనూ రాజీ పడలేదు. ప్రారంభ సన్నివేశంతో మొదలుపెట్టి, విశ్రాంతి వరకూ కలిగించిన ఆసక్తిని రెండో సగంలోనూ కొనసాగించే విధంగా శ్రద్ధ తీసుకుని ఉంటే గుర్తుండిపోయే సినిమా అయి ఉండే ఈ 'మరల తెలుపనా ప్రియా' హింసనీ, రక్తపాతాన్నీ కాక హాయైన సినిమాలని ఇష్టపడే వాళ్లకి నచ్చుతుంది.

ఆదివారం, జులై 31, 2016

నవతరం 'పెళ్ళిచూపులు'

రెండు దశాబ్దాల క్రితం వంశీ తీసిన ఫ్లాప్ సినిమా 'లింగబాబు లవ్ స్టోరీ' లో మొబైల్ కేంటీన్ కాన్సెప్ట్ ని నేటి తరం జీవన శైలిని ప్రతిబింబించే కథలో కీలకాంశంగా మలుచుకుని నవతరం దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపుదిద్దిన సినిమా 'పెళ్ళిచూపులు.' విజరయ్ దేవరకొండ ('ఎవడే సుబ్రహ్మణ్యం' లో నాని 'దూద్ కాశి' ఫ్రెండ్), రీతూ వర్మ (అదే సినిమాలో నాని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి) నాయికానాయకులు కాగా, షార్ట్ ఫిల్ముల్లోనూ, చిన్న సినిమాల్లోనూ నటించిన నటీనటులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రత్యేకత ఆసాంతమూ సరదాగా సాగిపోయే క్లీన్ కామెడీ కావడం. కుటుంబంతో కలిసి హాయిగా చూడగలిగే ఈ సినిమాలో కథ కన్నా, కథనమే ప్రేక్షకులని కట్టి పడేస్తుంది.

లెక్కకి మిక్కిలిగా సప్లీలు (సప్లిమెంటరీ పరీక్షలు) రాసి, ఇంజనీరింగ్ అయిందనిపించిన ప్రశాంత్ (విజయ్) కుదురుగా ఉద్యోగం చేసుకునే టైపు కుర్రాడు కాదు. ధర్మో డైనమిక్స్ స్పెల్లింగ్ కూడా తెలియని తన ఇంజనీరింగ్ చదువుతో ఆ ఫీల్డులో నెగ్గుకు రావడం కష్టమని తెలుసతనికి. తనకి ఇష్టమైన హోటల్ మేనేజ్మెంట్ రంగంలో భవిష్యత్తు వెతుక్కోవాలని నిర్ణయించుకుని, ఓ షెఫ్ దగ్గర శిక్షణ పొందుతాడు. కొడుకుని గుండెల మీద కుంపటిలా భరిస్తున్న విజయ్ తండ్రి, ఓ జ్యోతిష్యుడి సలహా మేరకి కొడుక్కి పెళ్లి చేసేయాలని నిర్ణయించుకుంటాడు. పెళ్లి చూపులు చూడ్డానికి చిత్ర (రీతూ వర్మ) ఇంటికి విజయ్ కుటుంబం వెళ్లడం, అక్కడ జరిగే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ తో ప్రథమార్ధం సరదాగా గడిచిపోతుంది.

ఎంబీఏ చేసిన చిత్ర ఏదైనా వ్యాపారం చేసి తనని తాను నిరూపించుకోవాలని నిర్ణయించుకుని, స్నేహితుడి సాయంతో ఓ మొబైల్ రెస్టారెంట్ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంటుంది. సరిగ్గా ఆ స్నేహితుడు ఆమెకి దూరం అయినప్పుడే, పెళ్లి చూపుల్లో విజయ్ తో పరిచయం అవుతుంది. పెళ్ళిచూపుల ఫలితం వేరేగా ఉన్నప్పటికీ, విజయ్ తో కలిసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటుంది చిత్ర. విజయ్ కి కూడా వ్యాపారంలో చేరక తప్పని పరిస్థితులు వస్తాయి. వ్యాపారం ఉహిచనంతగా విజయవంతం అవుతుంది. సరిగ్గా అప్పుడే, చిత్ర స్నేహితుడు తిరిగి రావడం, విజయ్ కి పెళ్లి నిశ్చయమవడంతో కథ క్లైమాక్స్ కి చేరుతుంది. ఒక అత్యంత నాటకీయమైన సన్నివేశం అనంతరం నాయికా నాయకులు వాళ్ళ జీవితాలకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంతో శుభం కార్డు పడుతుంది సినిమాకి.


దర్శకత్వంతో పాటు కథ, కథనం, సంభాషణలు సమకూర్చుకున్న తరుణ్ భాస్కర్ ని ముందుగా అభినందించాలి. బూతు లేకుండా కూడా యూత్ ని మాత్రమే కాక, అన్ని వర్గాలనే అలరించే సినిమా తీయొచ్చని సినిమా తీసి మరీ నిరూపించినందుకు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంత మాత్రమే ఖర్చు చేసి తీసిన ఈ సినిమాని కొత్తగా చిత్ర నిర్మాణ రంగంలోకి రావాలనుకుంటున్న వాళ్ళు ఒక రిఫరెన్స్ గా పరిశీలించాల్సిన అవసరం ఉంది. వేగవంతమైన కథనం, పాత్రోచితమైన సంభాషణలతో పాటు సినిమాటోగ్రఫీ (నగేష్ బానెల్) సంగీతం (వివేక్ సాగర్) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఎడిటర్ (రవితేజ గిరజాల) కి రెండో సగంలో కొంచం తక్కువ పని చెప్పినట్టనిపించింది. అయితే, సినిమా నిడివి మరీ ఎక్కువగా ఉండకపోవడం ప్లస్ పాయింట్ అయ్యింది. పాటలకి బదులు బిట్ సాంగ్స్ మాత్రమే ఉన్నా, అదో లోటుగా అనిపించలేదు ఎక్కడా.

తరుణ్ భాస్కర్ టేకింగ్ మీద శేఖర్ కమ్ముల ప్రభావంగా విపరీతంగా కనిపించి ఈ సినిమాలో. పాత్రలని డిజైన్ చేసుకోడం మొదలు, నటన రాబట్టుకోడం వరకూ ప్రతి చోటా శేఖర్ ముద్ర కనిపించింది. రీతూ వర్మ కైతే 'ఆనంద్' 'గోదావరి' సినిమాలు పదేపదే చూపించి కమలిని చేసినట్టే చేసేయమని చెప్పారేమో అని సందేహం కలిగింది. విజయ్ చాలా సీన్లలో 'ఆనంద్' సినిమాలో రాజాని గుర్తు చేశాడు. సంభాషణలు, నటీనటులు వాటిని పలికిన తీరు కూడా శేఖర్ సినిమాలనే జ్ఞాపకం చేశాయి. బలమైన నాయిక పాత్ర, అదే సమయంలో హీరో డమ్మీ కాకపోవడం, క్లైమాక్స్ మినహా ఇంకెక్కడా అతి పోకడలు కనిపించక పోవడం వల్ల ఎక్కడా విసుగు కలగదు. మొదటిసగం అయితే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. రెండో సగం మొదలైన కాసేపటికే కథనం ఎలా ఉండబోతోందో అర్ధం అయిపోవడం, సరిగ్గా అలాగే ఉండడం కాస్త నిరాశ పరిచాయి.

రెండో సగం విషయంలో, మరీ ముఖ్యంగా ముగింపు విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే పదికాలాల పాటు గుర్తుండిపోయే సినిమా అయ్యేది. అలాగని ఇప్పుడేమీ తక్కువ కాదు. కుటుంబం అంతా కలిసి నిర్భయంగా చూడగలిగే సినిమా. పైగా, ఆసాంతమూ సరదాగా సాగిపోతుంది కూడా. 'ఇలాంటి మనుషులు మనకి తెలుసు' అనిపించే పాత్రలు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ పెట్టకపోవడం పెద్ద రిలీఫ్. సినిమా చూశాక తరుణ్ భాస్కర్ లో ఓ ప్రామిసింగ్ దర్శకుడు కనిపించాడు. దట్టమైన గడ్డం మాటున పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ తో పని లేకుండా నెట్టుకొచ్చేశాడు హీరో. మొదటి సినిమా కన్నా వాచికం లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. కానైతే, చేయాల్సింది ఇంకా ఉంది. కమలిని అనుకరణ విజయవంతంగా చేసింది హీరోయిన్. హీరో స్నేహితుడిగా చేసిన కుర్రాడి కామెడీ టైమింగ్ భలేగా ఉంది. ఫుడ్ ట్రక్ బిజినెస్ చుట్టూ బలమైన సీన్స్ అల్లుకుంటే మరింత బాగుండేది. మొత్తంమీద, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోరుకునే వాళ్ళని అలరించే సినిమా ఇది.

మంగళవారం, జులై 26, 2016

నరసింహుడు

భారతదేశంలోకి నూతన ఆర్ధిక సంస్కరణలు ప్రవేశించి పాతికేళ్ళు పూర్తయ్యాయి. కొత్తతరానికి ఏమాత్రం తెలియని మార్పులెన్నో సాంఘిక, ఆర్ధిక పరిస్థితుల్లోకి చొచ్చుకు వచ్చాయి. మధ్యతరగతి జీవితాలని విశేషంగా ప్రభావితం చేసిన సాఫ్ట్వేర్ రంగం ఊపందుకోవడం మొదలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రజా జీవితంలో ఓ భాగమవ్వడం వరకూ జరిగిన అనేక పరిణామాలకి మూల కారణం ఆర్ధిక సంస్కరణలే. రాజీవ్ గాంధీ మరణానంతరం కాంగ్రెస్ సారధ్యంలోని మైనారిటీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన తెలుగు నాయకుడు పీవీ నరసింహారావు తీసుకున్న కీలక నిర్ణయాల ఫలితమే ఈ ఆర్ధిక సంస్కరణలు.

కేవలం సోనియా గాంధీ పట్ల తగినంత విశ్వాసం ప్రదర్శించలేదు అనే కారణానికి కాంగ్రెస్ పార్టీ పీవీ ని పార్టీ చరిత్రనుంచి తొలగించేసి సంస్కరణల సారధిగా నాటి ఆర్ధిక మంత్రి మన్మోహన్ సింగ్ ని కీర్తిస్తుండగా, ఆర్ధిక సంస్కరణల పర్వానికి నాడు అడుగడుగునా మోకాలడ్డిన వామపక్ష పార్టీల నాయకులు నేడు ఆవేళ ఆ పదవిలో ఎవరున్నా తీసుకునే నిర్ణయాన్నే పీవీ తీసుకున్నారు కాబట్టి అదేమీ పెద్ద విషయం కాదని తేల్చేస్తున్నారు. ఇక రాష్ట్ర స్థాయిలో నాయకులైతే సంస్కరణల తాలూకు ఫలితాలన్నీ తమ ఘనతే అని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. మరి, పీవీ ఆనాడు చేసిన కృషి, ఎదుర్కొన్న ఒత్తిళ్లు, ప్రదర్శించిన రాజనీతి ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోవలసినవేనా? ఈ ప్రశ్నకి 'కాదు' అని సమాధానం ఇస్తోంది 'నరసింహుడు.'

పాత్రికేయుడు, న్యాయవాది, రాజకీయ శాస్త్రవేత్త వినయ్ సీతాపతి ఆంగ్లంలో రాసిన 'ది హాఫ్ లయన్' పుస్తకానికి సీనియర్ పాత్రికేయులు జి. వల్లీశ్వర్, టంకశాల అశోక్, కేబీ గోపాలం కలిసి చేసిన తెలుగు అనువాదమే 'నరసింహుడు.' 'ఇప్పటి భారతదేశ నిర్మాత కథ' అన్నది ఉపశీర్షిక. పీవీ ప్రధానిగా పదవీ కాలం ముగించుకున్న రెండు దశాబ్దాల తర్వాత, భౌతికంగా దూరమైన పుష్కర కాలం తర్వాత వెలువడిన ఈ పుస్తకం ఒక నిస్పక్షపాతమైన రచన. రచయితకి పీవీ కృషి మీద అభిమానం ఉంది. కాబట్టే,  రెండేళ్ల పాటు విశేష పరిశోధన చేసి, కీలకమైన వాటితో సహా వేలాది డాక్యుమెంట్లు చదివి, పీవీ వ్యక్తిగత వంటమనిషి సహా వందలాది మందిని ఇంటర్యూ చేసి రాసిన పుస్తకం ఇది. అయితే, రచయితకి పీవీ మీద దురభిమానం లేదు..కాబట్టే పాలనలో జరిగిన తప్పులని తప్పులుగా ఎత్తి చూపించారు.

2004, డిసెంబరు 23న ఢిల్లీ లో పీవీ అంతిమ శ్వాస విడిచిన మరుక్షణం, అంత్యక్రియలు ఢిల్లీలో జరపడానికి వీలు లేదని సోనియా గాంధీ పట్టుపట్టి సాధించుకోడంతో మొదలయ్యే కథనం, పీవీ బాల్యం, తొలినాళ్ళ రాజకీయ జీవితం, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ, పదవీ చ్యుతి మీదుగా సాగుతూ, ప్రధాని అవుతూనే ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణలు, అవలంబించిన విదేశీ విధానాలు వివరిస్తూ, బాబరీ మసీదు విధ్వంసం లాంటి వైఫల్యాలని పరామర్శిస్తూ, పీవీ-సోనియాల మధ్య పొడసూపిన విభేదాల దగ్గరకి వఛ్చి, పీవీ వ్యక్తిత్వంలో భిన్న కోణాలని పరిచయం చేస్తూ ముగుస్తుంది.  పాతికేళ్ల నాటి రాజకీయాలతో పాటుగా, నేటి రాజకీయాలమీదా ఒక స్పష్టత వస్తుంది.


నిజానికి పీవీ రచనలు 'లోపలి మనిషి,' 'అయోధ్య' చదివిన వారికి 'నరసింహుడు' లో రాసిన కొన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. అలాగే, జైరాం రమేష్ తాజా రచన 'సంస్కరణల రథసారథి' పీవీ చదివిన వారికి సంస్కరణల పర్వం పరిచయం అవుతుంది. ఈ మూడూ చదివిన తర్వాత 'నరసింహుడు' చదివితే పీవీ తాలూకు పూర్తి చిత్రం కళ్ళకి కడుతుంది. అంతమాత్రాన, 'నరసింహుడు' చదవడానికి పైమూడూ చదివి ఉండడం తప్పనిసరి కాదు. ప్రధానిగా ఐదేళ్ల పదవీ కాలాన్ని పీవీ సమర్ధవంతంగా పూర్తి చేయడానికి, గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పొందిన 'వైఫల్యం' ఉపయోగ పడిందని ప్రతిపాదిస్తారు వినయ్ సీతాపతి. ఈ పరిశీలనని తోసిపుచ్చలేం. అలాగే, స్వాములు, బాబాలతో సన్నిహితంగా మెలగడం వెనుక రాజకీయ కారణాలని విశ్లేషించారు.

మన్మోహన్ సింగ్ ని ఏరికోరి ఆర్ధిక మంత్రిగా నియమించుకోవడం మొదలు, ప్రతిభావంతులైన అధికారులు ఎక్కడ ఉన్నా వెతికి వారికి తన కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించడం వరకూ ఎక్కడా కూడా పీవీ 'అభద్రత' కి లోనుకాలేదని చెబుతూ, తాను స్వయంగా ప్రతిభావంతుడు కాబట్టి, ప్రతిభావంతుల కారణంగా తనకి ప్రమాదం ఎదురవుతుందేమోనన్న (మెజారిటీ నాయకులకి కలిగే) సందేహాన్ని పీవీ జయించగలిగారన్నది మరో ప్రతిపాదన. పీవీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో 'పవర్ సెంటర్' గా అధికారం చెలాయించిన నాటి కాంగ్రెస్ ఎంపీ తేళ్ల లక్ష్మీకాంతమ్మ, ముఖ్యమంత్రి పదవి కోల్పోగానే ఆయన్ని నిష్కర్షగా దూరంపెట్టిన విధం పీవీకే కాదు, నాయకులందరికీ ఒక పాఠమే.

కీలక నిర్ణయం తీసుకోవాల్సి వఛ్చిన ప్రతిసారీ దాన్ని వాయిదా వేసి కాలం గడిపేశారన్నది నాడు పీవీ మీద వినిపించిన ఫిర్యాదు. ఆ ధోరణికి కారణాలతో పాటు, తాను చేయాలనుకున్న పనులని అత్యంత వేగంగా చేసిన వివరాలనీ ఉదాహరణలతో సహా అందించారు సీతాపతి. తనదైన ఒక సమాచార వ్యవస్థని నిర్మించుకోడం మొదలు, పార్టీ నాయకుల మీద నిఘా పెట్టడం వరకూ పీవీ చేసిన ప్రతిచర్యనీ విశ్లేషిస్తుందీ పుస్తకం. బయటి శత్రువులతోనూ, (పార్టీ) లోపలి శత్రువులతోనూ పోరాడుతూ, దినదిన గండమైన మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటూ వస్తూ దేశ గతిని మలుపు తిప్పే నిర్ణయాలని సమర్ధవంతంగా అమలు చేయడం అన్నది ఎంతటి కత్తిమీద సామో వివరిస్తుంది కూడా.

శాశ్వతంగా గౌరవించాల్సిన ఒక నాయకుణ్ణి చరిత్ర హీనుణ్ణి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలతో పాటు, పీవీ చేసిన చారిత్రిక తప్పిదాలనీ నిర్మొహమాటంగా రికార్డు చేశారు. పుస్తకం పూర్తి చేసిన తర్వాత మొదటగా తల్చుకునేది పీవీని అయితే, ఆవెంటనే గుర్తు చేసుకునేది వినయ్ సీతాపతి కృషిని. తెలుగు వాళ్ళెవరూ చేయలేకపోయిన బృహత్ ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రచయితని అభినందించకుండా ఉండలేం. అనువాదంలో ముగ్గురు రచయితలు పాలుపంచుకోడం వల్ల కావొచ్చు, రచనలో ఏకరూపత కనిపించదు. అయితే, మొత్తం పుస్తకం వేటికవే అయిన పదిహేను అధ్యాయాలుగా ఉండడం వల్ల ఈలోపం పాఠకులని పెద్దగా బాధించదు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల మీద ఆసక్తి ఉన్నవాళ్లు తప్పక చదవాల్సిన పుస్తకం ఈ 'నరసింహుడు.' (ఎమెస్కో ప్రచురణ, పేజీలు 440, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

బుధవారం, జులై 20, 2016

'శారద' నవలలు

వామపక్ష భావజాలం కలిగిన మిగిలిన రచయితల రచనలకన్నా, 'శారద' కలంపేరుతో తెలుగులో కథలూ, నవలలూ రాసిన ఎస్. నటరాజన్ రచనలు భిన్నంగా ఉంటాయి. మెజారిటీ రచయితలు పేదరికాన్నీ, పేదల కష్టాలనీ ఊహించి రాస్తే, నటరాజన్ వాటన్నింటినీ స్వయంగా అనుభవించి రాశారు. అందుకే కావొచ్చు, 'గొప్పవాళ్లందరూ చెడ్డవాళ్ళు.. పేదవాళ్లందరూ బహు మంచివాళ్ళు' అనే సూత్రీకరణ ఈ తమిళుడైన తెలుగు రచయిత కథల్లోనూ, నవలల్లోనూ కూడా కనిపించదు. ఆరవ దేశంలో పుట్టి, పదమూడేళ్ల వయసులో పొట్ట చేతపట్టుకుని తెనాలికి వలస వఛ్చి, హోటల్ కార్మికుడిగా పనిచేస్తూనే తెలుగు నేర్చుకుని, సాహిత్యం చదివి, తనదైన ముద్రతో రచనలు చేసిన శారద ముప్ఫయిరెండేళ్ల వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లిపోవడం, అతని కుటుంబానికే కాదు, తెలుగు సాహిత్యానికే పెద్ద లోటు.

నటరాజన్ ఈ లోకాన్ని విడిచిన అరవయ్యేళ్ళ తర్వాత, అతని రచనలన్నీ మరోసారి అచ్చుకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇది సాహిత్యాభిమానులకు కచ్చితంగా శుభవార్తే. కాలపరీక్షకి నిలబడే రచనలు కావడంతో నటరాజన్ రాసిన కథలూ, నవలల్లోని వస్తువులు ఇవాళ్టికీ సమకాలీనమే. ప్రస్తుతానికి వస్తే, 'శారద రచనలు - మొదటి సంపుటం' లో నటరాజన్ రాసిన మూడు నవలలు 'ఏది సత్యం,' 'మంచీ-చెడూ,' 'అపస్వరాలు' చాన్నాళ్ల తర్వాత మళ్లీ వెలుగు చూశాయి. పేద, మధ్యతరగతి మనస్తత్వాలు, వారి జీవన విధానాలపై నటరాజన్ కి ఉన్న పట్టుని సూచించే నవలలివి. అలాగే, మధ్యతరగతి నుంచి ఉన్నత తరగతికి ఎగబాకిన మనుషులు, పరిస్థితుల ప్రభావం వల్ల - వైకుంఠపాళిలో పెద్ద పాము నోట పడినట్టుగా - ఒక్కసారిగా పేదరికంలోకి జారిపోతే జీవితాన్ని ఎలా ఎదుర్కొంటారో నిశితంగా చిత్రించారు.

కొత్తగా పెళ్ళైన సాంబశివరావు-పార్వతి దంపతుల కథ 'ఏది సత్యం.' సాంబశివరావుకి నా అన్నవాళ్ళు లేరు. పార్వతి పరిస్థితీ ఇంచుమించు అంతే. ఓ మిల్లులో గుమస్తాగా పనిచేసే రావుకి పార్వతి అంటే పంచ ప్రాణాలు. ఇరుగుపొరుగులకి చూడ ముచ్చట ఆ జంట.  ఉన్నట్టుండి మిల్లులో జరిగిన ఓ ప్రమాదంలో రావు కాలికి బలమైన గాయం తగలడంతో ఉద్యోగం పోతుంది. మిల్లు వాళ్ళిచ్చిన నామ మాత్రపు నష్టపరిహారం ఖర్చైపోతే 'రేపు ఎలా?' అన్నది పెద్ద ప్రశ్న ఆ దంపతులకి. పొరుగింటి ప్లీడర్ దంపతులు వీళ్ళ పరిస్థితి చూసి జాలిపడతారు. ఎస్సెస్సీతో పాటు టైపు పరీక్షలు పాసైన పార్వతికి ఓ చిన్న ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తారు. ఇల్లు తప్ప బయటి ప్రపంచం తెలియని పార్వతి భయం భయంగా ఉద్యోగంలో ప్రవేశిస్తుంది. తన భర్త ఆరోగ్యం బాగై, తాను మళ్లీ గృహిణి బాధ్యతల్లోకి వెళ్ళిపోగలిగే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

ఆఫీసు సమస్యల్ని ఇంటికి తేని పార్వతికి ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. మంచాన పడిన రావుకి పార్వతి మీద అనుమానం మొదలవుతుంది. అతని ఆగడాలని ఓరిమితో భరిస్తుంది పార్వతి. అటు ఆఫీసులో ఒకదానిపై ఒకటిగా ఇబ్బందులు వఛ్చి పడుతూ ఉంటాయి. వాటిని నిర్వహించుకోడంలో సతమతమవుతున్న పార్వతికి రావు గురించి ఓ నిజం తెలియడం, మరోపక్క రావుకి ఆమె మీద అనుమానం నానాటికీ బలపడడంతో కథ ముగింపుకి చేరుతుంది. డెబ్భయ్యేళ్ళ నాటి నవల అని ఎంతమాత్రమూ అనిపించక పోవడం ఈనవల ప్రత్యేకత. మధ్యతరగతి ఆలోచనల్నీ, సంఘర్షణాల్నీ రచయిత చిత్రించిన తీరు ఈ నవలని ప్రత్యేకంగా నిలుపుతుంది. తర్వాతి కాలంలో వచ్చిన ఓ కమర్షియల్ నవలలో ముఖ్యమైన పాయింటు ఈ నవలలోదే. (కథంతా గుర్తుంది కానీ, నవల పేరు, రచయిత(త్రి) పేరూ జ్ఞాపకం రావడం లేదు).


ఇరవయ్యేళ్ళ కొడుక్కి తండ్రైన భద్రయ్య, భార్య మరణించిన కొన్నేళ్ళకి తన కొడుకు కన్నా వయసులో చిన్నదైన పద్మని ద్వితీయ వివాహం చేసుకోవడం, ఫలితంగా జరిగిన పరిణామాలే 'మంచీ-చెడూ' నవల. భద్రయ్య కొడుకు భాస్కరరావు పద్మని మాతృ స్థానంలో స్వీకరిస్తాడు. కానీ, పద్మకి భాస్కరరావు పునర్ యవ్వనం పొందిన భద్రయ్యలా కనిపిస్తాడు. 'సారంగధర' కథలా ఉందే అనుకునే లోగానే మొదటి మలుపు ప్రవేశిస్తుంది. వ్యవసాయం చేసుకునే భద్రయ్యని పట్నానికి తీసుకొచ్చి, వ్యాపారం పెట్టించి, గొప్పవాణ్ణి చేసిన సుదర్శనం, అనుకోని పరిస్థితుల్లో భద్రయ్య మీద పగ పట్టడంతో రోడ్డునపడుతుంది భద్రయ్య కుటుంబం. పెళ్లి నుంచి ఏమీ పొందలేకపోయిన పద్మ, భద్రయ్య మరణం తర్వాత తన దారి తను చూసుకునే క్రమంలో వేసిన తప్పటడుగులు ఆమెను ఓ బిడ్డకి తల్లిని చేస్తాయి. జీవితాన్ని పునర్నిర్మించుకునే కృషిలో నిమగ్నమవుతాడు భాస్కర రావు.

మరోపక్క సుదర్శనం, భద్రయ్యని దూరం చేసుకుని సాధించింది ఏమీ కనిపించదు. ఏ కారణానికి భద్రయ్యని దూరం చేసుకున్నాడో, అదే విషయంలో ఊహించని సమస్యల్లో చిక్కుకుంటాడు సుదర్శనం. పద్మ, భాస్కరరావు, సుదర్శనం.. వీళ్ళ ముగ్గురి జీవిత పథాన్ని చిత్రిస్తూ, ఆర్ద్రతతో ముగుస్తుందీ నవల. సంపుటంలో చివరి నవల 'అపస్వరాలు.' ధనిక, పేద, మధ్యతరగతి జీవితకథల కలబోత అయిన ఈ నవలలో ప్రధాన కథ, ఓ పేద వాడికి ఉన్నట్టుండి బోలెడంత డబ్బు దొరకడం.. ఆ డబ్బు విసుగెత్తించేత డబ్బుని సృష్టించడం.. చివరకి అతనికి కావాల్సినవి ఏవీ కూడా ఆ డబ్బుతో దొరకని పరిస్థితులు రావడం. వరదరాజు ఓ దొంగ. పదిమంది సభ్యులున్న ఓ ముఠాకి నాయకుడు. రంగయ్య ఓ మధ్య తరగతి స్కూల్ మేష్టారు. వీళ్లిద్దరికీ ఉన్న అలవాటు 'బ్రాకెట్' ఆట. బ్రాకెట్ గెలిస్తే తన డబ్బు కష్టాలు తీరతాయని రంగయ్య ఆశ. దరిద్రం నుంచి ఐశ్వర్యంలోకి మళ్లాలని వరదరాజు కోరిక.

బ్రాకెట్ ఆటలో కాక, మరోరకంగా వరదరాజుకి పెద్ద మొత్తంలో డబ్బు చేరుతుంది. ఆ డబ్బుతో మొదలు పెట్టిన వ్యాపారం, అతని కృషి లేకుండానే మరింత డబ్బు సంపాదించి పెడుతూ ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టే మార్గాల కోసం వెతుకుతున్న వరదరాజుకి నాటకాలు నిర్వహించే మృత్యుంజయ శాస్త్రి, అతని శిష్యుడు, పుస్తక ప్రచురణ కర్తా అయిన కరుణామూర్తి పరిచయమై ఎన్నికల్లో నిలబడమని ప్రోత్సహిస్తారు. ఒకప్పుడు తనకి అన్నం పెట్టిన వెలయాలు వసంతం, తనని మామా అని పిలిచే పక్కింటి పిల్లాడు చిన్నా, బ్రాకెట్ లో సలహాలు ఇచ్చిన రంగయ్య.. వీళ్ళకి ప్రాణావసరాలు వచ్చినప్పుడు వాటిని తీర్చేందుకు తన డబ్బు ఎందుకూ పనికిరాకపోవడం నివ్వెర పరుస్తుంది వరదరాజుని. అతను తీసుకున్న నిర్ణయం నవలకి ముగింపు. రంగయ్య కుటుంబం, మరీ ముఖ్యంగా అతని కొడుకు సదానందంతో పాటు వసంతం పాత్రని బలంగా చిత్రించారు రచయిత. కథనం మీద రావిశాస్త్రి ప్రభావం కనిపిస్తుంది. అయితే, సూటిగా, స్పష్టంగా సాగే వచనం నటరాజన్ ది. వర్ణనలు ఎక్కడా శ్రుతి మించవు.

ఈ మూడు నవలల సంపుటానికి నటరాజన్ స్నేహితుడు ఆలూరి భుజంగరావు, శ్రీవాసవ్య రాసిన ముందు మాటలు 'శారద' జీవితాన్ని గురించీ, రచనల్ని గురించీ ఆసక్తికరమైన విషయాలెన్నో చెబుతాయి. సాహిత్యం పట్ల నటరాజన్ తపన, వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నా సాహిత్యం కోసం సమయాన్ని వెచ్చించిన తీరు చదివినప్పుడు అతని మీద గౌరవం పెరుగుతుంది. నవలలు చదువుతున్నంతసేపూ రాసింది ఓ తమిళుడు అన్న మాట జ్ఞాపకం రాదెక్కడా. చక్కని తెలుగు నుడికారంతో పాటు, వాక్యం మీద పట్టుని సాధించడం నటరాజన్ ప్రత్యేకత అని చెప్పాలి. ఏ వాక్యమూ సుదీర్ఘమనీ, అనవసరమని అనిపించదెక్కడా. నవచేతన పబ్లిషింగ్ హౌస్ (మరేదో కాదు, తెలంగాణ లో 'విశాలాంధ్ర') ప్రచురించిన ఈ 497 పేజీల సంపుటం తెలుగు సాహిత్యాభిమానులు దాచుకోవలసినది. (వెల రూ. 325, నవచేతన, విశాలాంధ్ర అన్ని శాఖలూ). 'శారద' మిగిలిన రచనల్ని కూడా వీలైనంత త్వరగా ప్రచురించాల్సిందిగా ప్రచురణకర్తలకి విన్నపం.

సోమవారం, జులై 18, 2016

జీవనయానం

అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య ఆత్మకథ 'జీవనయానం.' సుమారు రెండు దశాబ్దాలకి పూర్వం 'వార్త' దినపత్రిక ఆదివారం అనుబంధంలో రెండేళ్ల పాటు సీరియల్ గా ప్రచురితమైన ఈ రచన విశేషమైన పాఠకాదరణ పొందింది. దాదాపు అదే సమయంలో రంగాచార్య సమగ్ర సాహిత్యాన్ని సంపుటాలుగా వెలువరించే కృషిని ఆరంభించిన విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ఈ ఆత్మకథనీ ప్రచురించి, ఇప్పటికి మూడు సార్లు పునర్ముద్రించింది. సంప్రదాయ కుటుంబంలో పుట్టి, వేద విద్యలు అభ్యసించిన రంగాచార్య నిజాం కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయుధం పట్టడం ఒక వైచిత్రి. పట్టి చూస్తే ఆయన జీవితంలో ఇలాంటి వైచిత్రులకి లోటే లేదు.

దాశరథి వంశీయుల స్వస్థలం భద్రాచలం. అయితే, రంగాచార్య పూర్వీకులు కొన్ని కారణాలకి భద్రాద్రి విడిచి పెట్టేశారు. ఇప్పటి వరంగల్ జిల్లా మహబూబాబాద్ కి సమీపంలోని చిన్న గూడూరులో మొదలైంది రంగాచార్య బాల్యం. అటుపై తెలంగాణ లోని అనేక ప్రాంతాల్లో గడిపి, సికింద్రాబాదులో స్థిరపడ్డారు కుటుంబ సమేతంగా. తల్లిదండ్రుల మధ్య లోపించిన సఖ్యత కారణంగా, రంగాచార్య చిన్నతనంలోనే తండ్రి ఇల్లు విడిచి వెళ్ళిపోతే, అన్నయ్య కృష్ణమాచార్య కుటుంబ బాధ్యత భుజాన వేసుకున్నారు. అయితే, కృష్ణమాచార్య పోరాట మార్గం ఎంచుకుని జైలుకి వెళ్లడంతో యవ్వనారంభం లోనే కుటుంబ పోషణ బాధ్యత స్వీకరించాల్సి వచ్చింది రంగాచార్యకి.

'బోద్ధారో మత్సరగ్రస్తా: ప్రభవః స్మయదూషితాః అబోధోపహతాశ్చాన్నే జీర్ణమంగే సుభాషితమ్' అన్న భర్తృుహరి సుభాషితం తో ఆరంభమయ్యే ఈ పుస్తకం తెలంగాణ చరిత్రను వివరిస్తూ సాగి, దాశరధి వంశాన్ని పరిచయం చేసి, వందేళ్లనాటి తెలంగాణ పల్లెల స్వరూపాన్నీ, నిజాము అకృత్యాలనీ కళ్ళకి కడుతూ, ఆ కాలంలో ఆ ప్రాంతంలో తెలుగు భాష దీన స్థితినివివరిస్తూ రంగాచార్య కథలోకి తీసుకెళ్తుంది పాఠకులని. అక్కడినుంచీ కథనం అక్షరాలా పరుగందుకుంటుంది. ఏకబిగిన పూర్తి చేసి కానీ పుస్తకాన్ని పక్కన పెట్టడం అసాధ్యం. కుటుంబ పరిస్థితులు, చదువుకునే అవకాశాలు పెద్దగా లేకపోవడంతో చదువు కొనసాగించలేకపోయిన రంగాచార్య, నిజాం పాలనలో అన్యాయాన్ని ఎదిరించి కమ్యూనిస్టు అనిపించుకున్నారు.

"నిజానికి నేను ఇవాళ్టికీ ఏ పార్టీలోనూ సభ్యుణ్ణి కాను" అని సందర్భం వఛ్చిన ప్రతిసారీ చెప్పారు. నిజాం వ్యతిరేకతతో పాటు, ఏ పార్టీ మీద ప్రత్యేకమైన అభిమానం లేకపోవడం వల్లనే కావొచ్చు, తెలంగాణ సాయుధ పోరాట సందర్భంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేసిన చారిత్రక తప్పిదాలని నిస్సంకోచంగా వివరించారు. ఆర్య సమాజం వంటి సంస్థల పనితీరునీ సునిశితంగా సమీక్షించారు. పోరాటం ముగిసి, నిజాం రాజ్యం భారతదేశంలో భాగమయ్యాక, ప్రయివేటుగా మెట్రిక్ పరీక్ష ఉత్తీర్ణులై ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన రంగాచార్య, తరువాతి చదువంతా ప్రయివేటుగానే సాగించారు. సికిందరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో అనువాదకుడిగా చేరి, ఉన్నత హోదాలో పదవీ విరమణ చేశారు.


ఓ వంక తెలంగాణ పోరాటాన్ని చిత్రించే 'చిల్లర దేవుళ్ళు,' 'మోదుగుపూలు' లాంటి నవలలు రాస్తూనే, మరోపక్క రామాయణ, భారత, భగవతాలని సరళమైన తెలుగులో వ్యాఖ్యానించారు రంగాచార్య. పన్నెండేళ్లవయసులో బాల్య వివాహం జరగడం, అటుపై దాదాపు పదేళ్ల తర్వాత కాపురం ఆరంభించడం తదనంతరం ఒడిడుకులు ఇవన్నీ ఎంతో ఆసక్తికరంగా చెప్పారు. అప్పుడే మొదలవుతున్న కన్యాశుల్క పద్ధతి మొదలు, కుటుంబంలో వచ్చిన చీలికలు వరకూ ఒకే ధోరణిలో చెప్పుకొచ్చారు.  రామాయణ మహా భారతాలని సిద్ధాంతాల చట్రాలనుంచి సమీక్షించే ఔత్సాహికులు ఎక్కడ పొరబడుతున్నారన్నదీ అంతే వివరంగా, కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు.

రంగాచార్యలో తిరుగుబాటు ధోరణి చిన్ననాటి నుంచీ ఉన్నదే. అది వయసుతోపాటు పెరిగిందే తప్ప తగ్గలేదు. పల్లెటూరి పోరాటాలు, ఉద్యోగ జీవితంలో చేసిన ఉద్యమాల మొదలు, అపౌరుషేయాలుగా పేరుపొందిన వేదాల తెనిగింపు వరకూ ఎన్నెన్నో ఉదాహరణలు జీవితపర్యంతం కనిపిస్తూనే ఉంటాయి. ఆత్మకథలో తప్పనిసరేమో అనిపించే ఆత్మస్తుతి, పరనింద అక్కడక్కడా ఎదురుపడతాయి. అలాగని, ధూమపానం మొదలు, మద్యపానం వరకూ తన అలవాట్లు వేటినీ దాచే ప్రయత్నం చేయలేదు. వాటిని మానుకున్న సందర్భాలని ప్రస్తావించక మానలేదు. ప్రత్యేకంగా గుర్తుండిపోయే అనేక విషయాల్లో మొదటిది అన్నతో అనుబంధం. ఎంతగా ప్రేమించి, గౌరవించారో,  సందర్భాన్ని బట్టి కృష్ణమాచార్య చర్యల్ని విమర్శించేందుకూ వెనుకాడలేదు. అలాగే తనని అభిమానించి, రచనలని ప్రోత్సహించిన వట్టికోట ఆళ్వార్ స్వామి, నార్ల చిరంజీవిల మీద అభిమానాన్నీ దాచుకోలేదు.

'చిల్లర దేవుళ్ళు' నవల గురించీ, మరీ ముఖ్యంగా 'వనజ' పాత్రని గురించీ చాలాసార్లే ప్రస్తావించారు. ఆ పాత్రకి రేడియాలో ప్రాణం పోసిన శారదా శ్రీనివాసన్, వెండితెరపై అభినయించిన కాంచన లను అభినందించారు. రంగాచార్య నవల 'మానవత' లో భిన్న మతాలకి చెందిన పాల్, జానకి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. నిజజీవితంలో రంగాచార్య చిన్న కొడుకు ప్రేమ వివాహం కారణంగా కొన్నేళ్ల పాటు కుటుంబానికి దూరం జరిగాడు!! జరిగినదాన్ని 'తల్లీ కొడుకులమధ్య ఘర్షణ' అంటారాయన. నిజాం వ్యతిరేక పోరాటాన్ని, తన జీవిత కథనీ పడుగు పేకలుగా అల్లిన అల్లిక పుస్తకాన్ని ఆసాంతమూ ఒకే రకమైన ఆసక్తితో చదివేందుకు దోహదం చేసింది. పుస్తకం పూర్తి చేసేసరికి ఏ ఒక్క జీవితాన్నో కాక, ఓ శతాబ్ద కాలపు సమాజ గతిని నిశితంగా పరిశీలించిన అనుభూతి కలుగుతుంది పాఠకులకి.

వైష్ణవ సంప్రదాయాల ప్రస్తావన మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్ర ఆత్మకథ 'హంపీ నుంచి హరప్పా దాక..' ని జ్ఞాపకం చేసింది. రెండు కుటుంబాలూ ఆచార వ్యవహారాల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేవే.. రెండూ కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా సర్దుబాట్లు చేసుకున్నవే. "మనం నిజాలు చెప్పకపోతే ముసలినక్క నిజాంని కొంత కాలానికి దేవుణ్ణి చేసేసే ప్రమాదం ఉంది" అంటూ ఒక సందర్భంలో రంగాచార్య తన మిత్రులతో అన్న మాట, తర్వాతి కాలంలో నిజమయ్యింది. ఆత్మకథల మీద ఆసక్తి ఉన్నవాళ్లు, తెలంగాణ పోరాట చరిత్రని తెలుసుకో గోరే వాళ్ళూ, వందేళ్ల కాలంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన మార్పుని గురించి పరిశోధించాలనుకునే వాళ్ళూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఈ 'జీవనయానం.' (విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 508, వెల రూ. 300).

శనివారం, జులై 16, 2016

పడవమునక

కళాశాల విద్య పూర్తి చేసుకోబోతున్న రమేష్, తన స్నేహితుడి చెల్లెలు హేమాలినితో ప్రేమలో పడతాడు. హేమాలిని కుటుంబం బ్రహ్మసామాజికులు కావడంతో ఆమె గోషా లాంటి సంప్రదాయాలేవీ పాటించదు. రమేష్ ఆ కుటుంబానికి సన్నిహితుడయ్యాడు. ప్రతినిత్యం ఆ కుటుంబాన్ని టీ వేళకి కలుసుకోడం, లోకాభిరామాయణం ముచ్చటించడం రివాజుగా మారింది అతనికి. రమేష్ మనసు హేమాలినికి తెలుసు. నిజానికి ఆమెకి కూడా అతనంటే ఇష్టమే. అంతే కాదు, ఆమె కుటుంబ సభ్యులకి కూడా రమేష్ మీద మంచి అభిప్రాయమే ఉంది.

పరీక్షలు పూర్వవుతూనే, రమేష్ ని ఉన్నపళంగా బయల్దేరి రమ్మని జాబు రాస్తాడు అతని తండ్రి. ఇంటికి వెళ్లే వరకూ అతనికి కారణం ఏమిటన్నది తెలీదు. హేమాలిని విషయం తెలుసుకున్న రమేష్ తండ్రి, కొడుక్కి సుశీలతో సంబంధం నిశ్చయం చేస్తాడు. సంప్రదాయవాది అయిన ఆ పెద్దాయన, బ్రహ్మసామాజికురాల్ని కోడలిగా అంగీకరించేందుకు సిద్ధంగా లేడు. పడవ దాటి పెళ్లి వారి ఊరికి చేరుకుంటుంది రమేష్ కుటుంబం. అన్యమనస్కంగానే సుశీల మెడలో తాళి కడతాడు రమేష్. వెన్నెల రాత్రి వేళ స్వస్థలానికి పడవలో తిరుగు ప్రయాణంలో ఉండగా, నది మధ్యలో పడవ తిరగబడుతుంది. స్పృహ వచ్చేసరికి ఓ ఇసుక తిప్పమీద ఉన్న రమేష్, తనకి కొంచం దూరంలో స్పృహ తప్పి పడి ఉన్న నవ వధువుని చూస్తాడు.

ఇరువైపుల బంధువులూ పడవ ప్రయాణంలో మరణిస్తారు. అమాయకురాలైన ఆ వధువు కోసం తానిక హేమాలినిని పూర్తిగా మర్చిపోవాల్సిందే అని నిశ్చయించుకుంటాడు రమేష్. తన వాళ్ళ ఉత్తర క్రియలు పూర్తయ్యాక, వధువుతో సంభాషించే ప్రయత్నం చేస్తాడు. 'సుశీలా' అని పిలిస్తే పలకదు ఆమె. ఎందుకంటే, ఆమె పేరు కమల. ప్రమాదానికి గురైన మరో పడవలో ప్రయాణించిన నవ వధువు ఆమె. జరిగింది ఏమిటో రమేష్ కి అర్ధమవుతుంది తప్ప, ఆమెకి అర్ధం కాదు. పడవ ప్రయాణం తాలూకు షాక్ నుంచి పూర్తిగా కోలుకోని ఆమెకి నిజం ఎలా చెప్పాలో అర్ధం కాదు రమేష్ కి. అయితే, ఆమె తన తాళి కట్టిన భార్య కాదు అని తెలిశాక, హేమాలిని పై మళ్లీ ఆశలు చిగురిస్తాయి అతనిలో. ఈ జంట కథ ఏ తీరం చేరిందన్నదే రవీంద్రనాథ్ టాగోర్ నవల 'పడవమునక.'


ఈకథకి మార్పులు చేర్పులతో చాలా భారతీయ భాషల్లో సినిమాలు వచ్చాయి. తెలుగులో అయితే పడవ ప్రయాణాన్ని రైలు ప్రమాదంగా మార్చేశారు. నవల విషయానికి వస్తే, నాటి కలకత్తా వాతావరణం, బ్రహ్మ సమాజం ప్రభావం, సంప్రదాయ-ఆధునిక వాదుల మధ్య అంతరాలు.. వీటన్నింటితో పాటూ, ప్రధాన పాత్రల అంతరంగాలని రవీంద్రుడు చిత్రించిన తీరు అబ్బుర పరుస్తుంది. నాటకీయతని ఎక్కడ శ్రుతి మించనివ్వక పోవడం వల్ల నవల ఆద్యంతమూ ఆసక్తిగా సాగడంతో పాటు, ఆద్యంతం సహజంగానే అనిపిస్తుంది. హేమాలిని, కమల పాత్రల చిత్రీకరణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రచయిత, వారి వారి నేపధ్యాలని ఆధారంగా చేసుకుని ఆలోచనా స్థాయిల్ని, పరిణతిని చిత్రించారు.

చిన్నప్పుడే తన వాళ్ళని కోల్పోయి, దూరపు బంధువుల ఇంట్లో పెరిగిన కమల కథ విని ఎంతగానో చలించి పోతాడు రమేష్. పెళ్లి కారణంగా తనకంటూ భర్త, ఇల్లు ఏర్పడ్డాయని తృప్తి పడుతున్న కమలకి నిజం చెప్పడం అన్నది అతనికి తలకి మించిన పని అవుతుంది. ఒకే ఇంట్లో ఉంటూ ఆమెకి దూరంగా ఉండడం కష్టం కాకపోయినా, ఆమె ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం కష్టం అవుతుంది అతనికి. ఆమె భవిష్యత్తుని కూడా ఆలోచించి, కమలని ఓ విద్యాలయంలో చేర్చి, అక్కడే ఆమెకోసం ఓ ఇల్లు కుదిర్చి పెడతాడు. యోగ్యుడైన వరుడికిచ్చి ఆమెకి పెళ్లి చేయడం ద్వారా తన బాధ్యతని నెరవేర్చుకుని, అటుపై జరిగిందంతా హేమాలినికి చెప్పి ఆమెతో జీవితం ప్రారంభించాలని తలుస్తాడు రమేష్. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు కథని ముందుకి నడుపుతాయి.

రమేష్ తనని మోసం చేశాడని భావించే హేమాలిని, భర్త తనని ఎందుకు దూరం పెడుతున్నాడో తెలియక కమల అనుభవించే సంఘర్షణ, కథనీ, పాత్రల్నీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. నవలలో చిత్రించిన బెంగాలీ వాతావరణం శరత్, బిభూతిభూషణ్ ల నవలల్ని గుర్తు చేస్తుంది. ద్వితీయార్ధంలో ప్రవేశించే కొత్త పాత్రల వల్ల ముగింపుని గురించి అవగాహన వచ్చినా, ఊహించిన ముగింపుకి కథ ఎలా చేరుతుందన్న ఆసక్తి పుస్తకాన్ని విడిచిపెట్టకుండా ఏకబిగిన చదివిస్తుంది. కథతో పాటు కథనం మీద రచయిత తీసుకున్న శ్రద్ధని గమనించవచ్చు. రవీంద్రుడి 'కుముదిని' ని అనువదించిన కమలాసనుడు ఈ 'పడవమునక' నూ తెనిగించారు.(సాహితి ప్రచురణ, పేజీలు 208, వెల రూ. 90, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, జులై 11, 2016

మా జ్ఞాపకాలు

సుప్రసిద్ధ రచయిత బుచ్చిబాబు శతజయంతి సందర్భంగా విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ప్రచురించిన తాజా సంకలనం 'మా జ్ఞాపకాలు.' బుచ్చిబాబు భార్య, రచయిత్రీ అయిన శివరాజు సుబ్బలక్ష్మి, బుచ్చిబాబుతో గడిపిన రోజులని జ్ఞాపకం చేసుకుంటూ, నాటి విశేషాలని వ్యాసాలుగా రాస్తే, 'చినుకు' పత్రిక పాతిక భాగాలుగా ప్రచురించింది. వాటన్నింటినీ కలిపి పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది విశాలాంధ్ర. ఇవి కేవలం బుచ్చిబాబు, సుబ్బలక్ష్మిలకి సంబంధించిన విశేషాలు మాత్రమే కాదు, ముప్ఫయ్యేళ్ళ  కాలంలో ఆంధ్ర దేశంలో జరిగిన అనేక పరిణామాల తాలూకు పరామర్శ కూడా.

పన్నెండేళ్ల వయసులో బుచ్చిబాబుకి భార్యగా అత్తవారింట అడుగుపెట్టిన సుబ్బలక్ష్మి, ముప్ఫయ్యేళ్ళ పాటు బుచ్చిబాబుతో కలిసి జీవించారు. 1967 లో బుచ్చిబాబు అకాలమరణం పాలైనప్పటి నుంచీ ఒంటరి జీవితం గడుపుతున్నారు. కథలు, నవలలు, వ్యాసాలు రచించడం, పెయింటింగ్స్ చేయడం ఆవిడ వ్యాపకాలు. నవ వధువుగా అత్తింటి జ్ఞాపకాల మొదలు, బుచ్చిబాబు చివరి రోజుల వరకూ జరిగిన ఎన్నో విశేషాలను అక్షరబద్ధం చేశారు. వ్యాసాల వరుసలో చెప్పాలంటే 'మల్లెమొగ్గ చెంబు మళ్ళా దొరికింది' మొదలు 'అభిమానం అంటే ఇదేనేమో' వరకూ.

అత్తవారింట్లో మనుషుల మనస్తత్వాలని గురించి ఆవిడ రాసింది చదువుతుంటే బుచ్చిబాబు కథల్లో కొన్ని పాత్రలు అదాటున గుర్తొస్తాయి. అలాగే, బుచ్చిబాబుతో కలిసి తిరిగిన ఊళ్ళు, చేసిన యాత్రలు కూడా కథల్లో సంఘటనలని జ్ఞాపకం చేస్తాయి. తొలుత అనంతపురంలోనూ, తర్వాత విశాఖపట్నంలోనూ లెక్చరర్ గా పనిచేసిన బుచ్చిబాబు, ఆకాశవాణి లో ఉద్యోగం రావడంతోనే మద్రాసుకి మకాం మార్చారు. అదే సమయంలో 'చివరకు మిగిలేది' నవల 'నవోదయ' పత్రికలో సీరియల్ గా రావడం, నాటి సాహితీ ప్రముఖులంతా బుచ్చిబాబు ఇంటికి వచ్చి నవలని గురించి చర్చించడం, వారికి అతిధి మర్యాదలు చేస్తూనే చర్చలని చెవి వొగ్గి వినడాన్ని గురించి గుర్తు చేసుకున్నారు సుబ్బలక్ష్మి.


సుబ్బలక్ష్మి కథల్ని 'ఇవి ఇంగ్లీష్ లోకి అనువాదం అవ్వాల్సినవి' అంటూ ప్రోత్సహించిన బుచ్చిబాబు, పెయింటింగ్స్ విషయంలో మాత్రం ఆమె వేసిన చిత్రాల కన్నా తాను చిత్రించినవే బాగున్నాయన్న అభిప్రాయంతో ఉండేవారట. తాను అభిమానించే ఇంగ్లీష్ రచయితల పుస్తకాలు మార్కెట్లోకి రాగానే కొనడం, సుబ్బలక్ష్మి చేత వాటికి అట్టలు వేయించుకోవడం బుచ్చిబాబుకి  ఇష్టమైన పనుల్లో ఒకటి. గాంధీ, నెహ్రూ, రమణ మహర్షిలని కలుసుకోడాన్ని అపురూపంగా గుర్తుచేసుకున్నారు. అలాగే, స్వతంత్రం  రాగానే నెహ్రూ చేయబోయే రేడియో ప్రసంగాన్ని వినడం కోసం రేడియో సెట్ కొనుగోలు చేయడం కూడా (అప్పట్లో రేడియోలకి రేషన్, పెద్ద రికమండేషన్ ఉంటే తప్ప దొరకని పరిస్థితి).

విశ్వనాథ సత్యనారాయణ, ఆచంట జానకిరామ్, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు లాంటి సాహితీ ప్రముఖులెదంరో ఆ ఇంటికి తరచూ వచ్చే అతిధులు. వచ్చిన వారి సంప్రదాయాన్ని అనుసరించి మర్యాదలు చేయాలి. (భోజనానికి వచ్చినప్పుడు తనకి ఏం వండాలో విశ్వనాథే స్వయంగా చెప్పేవారట). సాహిత్య విశేషాలతో పాటు, కాలంతో పాటు అత్తింటి, పుట్టింటి పరిస్థితుల్లో వఛ్చిన మార్పులు, నెలల తరబడి ఇంట్లో తిష్ట వేసే దూరపు బంధువుల బెడద లాంటి కబుర్లనీ జ్ఞాపకం చేసుకున్నారు. నాటి కవిపండితుల అలవాట్లు, వ్యవహార శైలి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి ఈ పుస్తకపు పేజీల్లో.

బుచ్చిబాబు పేరు చెప్పగానే గుర్తొచ్చే 'చివరకు మిగిలేది' గురించిన విశేషాలెన్నో. బంధువులు కథ అర్ధం కావడం లేదని గొడవ చేస్తే, స్నేహితులేమో 'నవల్లో స్త్రీ పాత్రలు నిజంగా బుచ్చిబాబుకి సన్నిహితమైన మహిళలా?' అని అడిగేవారట. ఆనాటి రేడియో కార్యక్రమాల తీరుతెన్నులు, సినిమాల సంగతులనీ సందర్భానుసారంగా ప్రస్తావించారు. తన చుట్టూవున్న మనుషుల్లో ఎవరికీ దైవత్వం ఆపాదించలేదు, అలాగని తూలనాడనూ లేదు. విశాలాంధ్ర వారి ప్రచురణలో తగుమాత్రం అచ్చుతప్పులు సాధారణమే కానీ, ఈ పుస్తకంలో ముద్రా రాక్షసాలు మాత్రం అసాధారణంగా ఉన్నాయి. కొన్ని సార్లు వాక్యాలు కూడబలుక్కుని మళ్లీ మళ్లీ చదువుకుని అర్ధం చేసుకోవాలి. 'అంపశయ్య' నవీన్ ముందుమాట నిరాశ పరిచింది. రచనకి మాత్రం వంక పెట్టేందుకు లేదు. (పేజీలు 128, వెల రూ. 100, విశాలాంధ్ర అన్ని శాఖలూ).

మంగళవారం, జులై 05, 2016

పూసపాటి కృష్ణంరాజు కథలు

అప్పటివరకూ సామాజిక సమస్యల మీద కథలు రాస్తూ వఛ్చిన కెఎన్వై పతంజలి దివాణాలని కథా వస్తువులుగా తీసుకుని రచనలు చేయడానికి ప్రేరేపించిన రచయిత పూసపాటి కృష్ణంరాజు.  ఈ రాజుగారు రాసిన 'దివాణం సేరీవేట' కథ స్పూర్తితో 'రాజుగోరు' నవలిక రాశారు పతంజలి. ఇంకేముంది, ఇంగ్లీష్ వాడు చెప్పినట్టు రెస్టిజ్ హిస్టరీ. పతంజలికి ఇక్కడో కామా పెట్టి, కృష్ణంరాజు దగ్గరకి వస్తే గురజాడకి శిష్యుడు, చాసో కి అనుయాయి. పుట్టి పెరిగింది దివాణంలోనే అయినా, పేద ప్రజల పక్షాన కలం పట్టి కథలు రాసిన రచయిత.

కృష్ణంరాజు రాసినవి కేవలం పదహారు కథలే అయినా వాటికవే సాటి. ఈ మధ్య కాలంలో పునఃప్రచురణకి నోచుకోలేదీ కథలు. అయితే, 'ఈతరం కోసం కథాస్రవంతి' పేరిట ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ప్రచురిస్తున్న చిన్న కథల సంకలనాల్లో భాగంగా కృష్ణంరాజు రాసిన పన్నెండు కథలతో ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. పూసపాటి పేరు చెప్పగానే గుర్తొచ్చే 'దివాణం సేరీవేట,' 'సీతాలు జడుపడ్డది,' 'కుక్కుట చోరులు,' 'రెండు బంట్లు పోయాయి' తో పాటు మరో ఎనిమిది కథలు చదువుకోవచ్చు ఈ సంకలనంలో.

పుస్తకంలో మొదటి కథ 'మహారాజ యోగం' లో విశాఖపట్నంలో డిగ్రీ చదివే కుమార్రాజాకీ, అనుకోకుండా అతని బసకి వచ్చి,  అంత అనూహ్యంగానూ దూరమైన నాగులు అనే కుర్రవాడికి మధ్య అనుబంధాన్ని చిత్రించారు రచయిత. నాటి విశాఖ వాతావరణం, అడివిని తలపించే వాల్తేరు, ఇళ్లలోకి జొరబడే పాములు.. ఈ వాతావరణంలోకి పాఠకులని అలవోకగా తీసుకుపోయి అప్పుడు చెబుతారు నాగులు కథని. రెండో కథ 'దివాణం సేరీవేట.' కూలిపోడానికి సిద్ధంగా ఉన్న దివాణాల్లో ఉంటున్నా పౌరుషాల విషయంలో రాజీపడని రాజుల కుర్రాళ్ళు వేట చేసిన వైనాన్ని చదవాలంతే. (ఈ చిన్నకథకి విస్తృత రూపమే పతంజలి రాసిన 'రాజుగోరు.')


మూడోకథ 'సీతాలు జడుపడ్డది.' మూఢనమ్మకాల కారణంగా పేదవాళ్ళు ఎలాంటి మూల్యాలు చెల్లిస్తారో చెబుతుంది. అయితే, పుస్తకానికి ముందుమాట రాసిన డాక్టర్ చందు సుబ్బారావు ఈ కథని కొంచం అపార్ధం చేసుకున్నారేమో అనిపించింది. 'తెల్లరాజు-నల్లదొర,' 'సామంతం' కథలు రెంటికీ దౌర్జన్యమే కథా వస్తువు. స్వార్ధానికి, ప్రలోభానికి బలైపోయిన అక్కా చెల్లెళ్ళ కథ 'పేరంటాలు గుండం.' కాగా, 'దిగులు' కథలో చెదల్ని ప్రతీకగా తీసుకుని కథ నడిపిన తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక 'కుక్కుట చోరులు' కథ ఏకకాలంలో రెండు కథల్ని చదివిన అనుభూతిని ఇస్తుంది. ఒకటి రచయిత నేరుగా చెప్పిన కథ, రెండోది ప్రతీకాత్మకంగా చెప్పిన కథలో కథ.

రాచవారి వివాహ వేడుకల్ని కళ్ళకి కట్టే కథ 'రెండు బంట్లు పోయాయి.' చదరంగం బల్ల నేపధ్యంగా సాగే కథలో ఎత్తులూ, పై ఎత్తులూ ఆసాంతమూ ఊపిరి బిగపట్టి చదివిస్తాయి. 'దారితప్పినా.. మాట తప్పినా' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వంశీకి నచ్చిన కథ. ఈ కథని అనుసరించి (అనుకరించి కాదు) చాలా కథలే రాశాడు వంశీ. వేట ఇతివృత్తంగా సాగే మరో కథ 'భూతాల స్వర్గం.' ఇది కూడా రెండు కథల కలగలుపు. సంపుటిలో చివరికథ 'గైరమ్మ' మీద చాసో కథ 'కుంకుడాకు' ప్రభావాన్ని కాదనలేం.

చాన్నాళ్ల తర్వాత పూసపాటి కృష్ణంరాజు రచనల్ని అచ్చులోకి తెచ్చిన అరసం వారికి అభినందనలు. మిగిలిన నాలుగు కథలకీ కూడా చోటిచ్చేస్తే సమగ్ర సంకలనం అయ్యేది కదా అనిపించింది కానీ, ప్రచురణకర్తలకి ఏవో పరిమితులు ఉండే ఉంటాయి. కథా సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్లు తప్పక చదవాల్సిన సంకలనం ఇది. కథలు రాయాలనుకునే వాళ్ళైతే అధ్యయనం చేయాలి. ఎందుకంటే కృష్ణంరాజు శైలి, శిల్పం ప్రత్యేకమైనవి. అలాగే, ఏ రెండు కథలకీ పోలిక ఉండదు. ఆవేశపూరిత ప్రసంగాలూ, రాజకీయ ఎజెండాలు కనిపించవు. పేదవాళ్ల పట్ల రచయిత సహానుభూతి మాత్రం అడుగడుగునా కనిపిస్తుంది. (పేజీలు 111, వెల రూ. 50, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).