సోమవారం, ఫిబ్రవరి 28, 2022

రాయల్ ఎన్ ఫీల్డ్

బెంగళూరు శివార్లలోని వెంకటాల అనే ఊరికి దగ్గరలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో పుట్టి పెరిగాడు జిమి. నిజానికి జిమి అతని అసలు పేరు కాదు. చిన్నప్పుడోరోజు తాజా చేపలు కొనడానికి యలహంక సంతకి వెళ్లి, చేపలకన్నా ముందు ఓ పాత న్యూస్ పేపర్ మీదకి దృష్టి పోవడంతో అక్కడే నిలబడి చదివేశాడు. అది ప్రఖ్యాత గిటారిస్ట్ జిమి హెండ్రిక్స్ పేరుతో ప్రసిద్ధుడైన జాని అలెన్ హెండ్రిక్స్ గురించిన వార్తా కథనం. ఆ క్షణంలోనే తన పేరుని జిమి అని మార్చేసుకుని, క్వార్టర్స్ లోనే గిటార్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. తల్లితండ్రులు రామన్-నీల లకి ఒక్కడే సంతానం కావడంతో ఆ ఇంట్లో జిమి ఆడింది ఆట, పాడింది పాట.  టీనేజీ దాటేసరికి, గిటార్ నేర్చుకోడం నుంచి నేర్పడానికి ప్రమోట్ అయ్యాడు జిమి. క్లాసులు కూడా క్వార్టర్స్ లోనే. దాదాపు అదే సమయంలో అతని జీవితంలోకి వచ్చిన అతనికి ఎంతో ఇష్టమయిన రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్, ప్రియ శిష్యురాలు తరుణిల కారణంగా జిమి జీవితంలో వచ్చిన మార్పులే 'రాయల్ ఎన్ ఫీల్డ్' నవల.

కన్నడ సాహిత్య రంగంలో కవిగా ప్రవేశించి, కథలు, నాటకాలు, నవలలు రాసిన మంజునాథ వి.ఎం. తొమ్మిదేళ్ల క్రితం రాసిన 'రాయల్ ఎన్ ఫీల్డ్' నవలని అదే పేరుతో తెనిగించారు రంగనాథ రామచంద్ర రావు.  ప్రస్తుతం బెంగళూరులో సొంతంగా థియేటర్ ట్రూప్ నిర్వహిస్తున్న మంజునాథకి నాటక శిల్పం మీద మంచి పట్టు ఉందనిపించింది ఈ నవల చదువుతుంటే. సహజత్వాన్ని మింగేయని నాటకీయతని కల్పించడంలో మంచి పట్టు సాధించారనిపించింది. వెంకటాలలో పుట్టి పెరిగిన ఈ రచయిత నవల్లో కథ మొత్తాన్ని పోలీస్ క్వార్టర్స్, వెంకటాల, యలహంక, హెబ్బాళలోనే నడిపారు. సెల్ఫోన్లు వాడకంలో ఉన్నప్పటికీ ఇంకా ఎస్సెమ్మెస్లు చేసుకునే రోజులు, నగరం మింగేయని బెంగళూరు శివార్లు కనిపిస్తాయి ఈ నవలలో.

అతి తక్కువ కాలంలోనే తరుణితో స్నేహం ప్రేమగా మారుతుంది జిమికి. రాయల్ ఎన్ ఫీల్డ్ మీద వర్షంలో లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం, ఎడ్వెంచర్లు చేయడం వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం. అలా ఒక రోజు లాంగ్ డ్రైవ్ నుంచి తిరిగొస్తూ ఓ పబ్ దగ్గర ఆగినప్పుడు, తరుణికి తన చిన్ననాటి స్నేహితుడు గిరి కనిపిస్తాడు. ఖరీదైన కార్లో నుంచి దిగిన గిరిని తరుణి గుర్తుపట్టదు, పట్టించుకోదు. కానీ, గిరి ఆమెతో మాట కలిపి, గతం గుర్తు చేస్తాడు. కేవలం జిమి పబ్ లోకి వెళ్లి, బీర్ టిన్నుతో తిరిగి వచ్చేలోగా గిరితో అతని కార్లో వెళ్ళిపోతుంది తరుణి. తనో పెద్ద బిజినెస్ పర్సన్ అని పరిచయం చేసుకున్న గిరి, తరుణితో కలిసి కొత్త వ్యాపారం చేయడానికి ప్లాన్లు చర్చించడం మొదలుపెడతాడు. అతన్ని పూర్తిగా నమ్ముతుంది తరుణి. జిమికి మాత్రం గిరి మీద మంచి అభిప్రాయం లేదు. త్వరలోనే తరుణి నిజం తెలుసుకుని తన దగ్గరకి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు. 

ఊహించనంత వేగంగా జిమిని తనకి అడ్డు తొలగించుకునేందుకు పావులు కదుపుతాడు గిరి. పోలీసులకి డబ్బు వెదజల్లి జిమిని ఇబ్బంది పెట్టడం మొదలు, అతను గిటారిస్టుగా పనిచేసే పబ్ వాళ్ళని ప్రభావితం చేసి ఉద్యోగం పోగొట్టడం, అక్కడితో ఆగకుండా బెంగళూరు లోని అపార్ట్మెంట్ కూడా ఖాళీ చేసేలా చేయడంలో కృతకృత్యుడవుతాడు. సరిగ్గా అప్పుడే తరుణి నుంచి బ్రేకప్ ఉత్తరం అందుతుంది జిమికి. దాంతో పూర్తిగా కుంగిపోతాడు. ఫ్లాట్లో సామానుతో పాటు, తనకెంతో ఇష్టమైన రాయల్ ఎన్ ఫీల్డ్ ని అమ్మకానికి పెడతాడు. గిటార్ ని కూడా అమ్మేద్దాం ఆనుకుని, చివరి నిమిషంలో మనసు మార్చుకుంటాడు. మిత్రుల సాయంతో కొత్త ఉద్యోగాల వేట మొదలు పెడతాడు. ఓ మిత్రుడికి చెందిన ఎన్ ఫీల్డ్ షోరూమ్ లో ఉద్యోగం దొరుకుతుంది.

దాదాపు అదే సమయంలో జిమి జీవితంలోకి అనూహ్యంగా ప్రవేశిస్తుంది అల. ఓ పబ్ నిర్వహిస్తూ, తీరిక వేళల్లో కవిత్వం రాసే అలకి గిటార్ అంటే ఇష్టం. మొదట జిమిని అపార్ధం చేసుకున్నా, తర్వాత అర్ధం చేసుకుని స్నేహం చేస్తుంది. అంతా కుదురుకుంటోంది అనుకునే సమయంలో అల నుంచి ఓ కుదుపు, తరుణి నుంచి మరో కుదుపు వస్తాయి జిమి జీవితంలోకి. వీళ్ళ ముగ్గురి కథ ఏ తీరం చేరిందన్నదే నవల ముగింపు. పూర్తి అర్బన్ పోకడలతో సాగే కథనంలో జిమి గిటార్ మీద వాయించే పాటలు, అల రాసే భావుకత నిండిన కవితలు, వర్షంలో లాంగ్ డ్రైవ్లు మాత్రమే కాదు ఇంగ్లీష్ నవలలు చదువుకుంటూ ఉండే డాన్ గణేష్, తన ముద్దు పేరుకి అర్ధం 'జింక' అని బలంగా నమ్మే 'డాంకి' ల ఉప కథలూ ఉన్నాయి. క్వార్టర్స్, పల్లె, నగరం ఈ మూడు జీవితాలనీ నిశితంగా చిత్రించారు రచయిత. తొలిపేజీలు కొంచం బరువుగా తిరిగినా కథలో పడ్డాక ఆపకుండా చదివిస్తుంది కథనం.

రంగనాథ రామచంద్ర రావు అనువాదంలో అక్కడక్కడా కొన్ని పలుకురాళ్లు తగిలాయి - 'గాఢనిద్ర' కి బదులుగా 'దీర్ఘనిద్ర' లాంటివి. ఇవే కాకుండా అచ్చు తప్పులు కూడా కొంచం ఎక్కువగానే ఉన్నాయి. క్లుప్తంగానే చెప్పినప్పటికీ రామన్-నీలల ప్రేమకథ గుర్తుండిపోతుంది. పంకజం పాత్ర ప్రారంభం, ముగింపు కూడా నాటకీయంగానే ఉన్నాయి. బెంగళూరు కి చెందిన శ్రీ యంత్రోద్ధారక ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ ప్రచురించిన ఈ 184 పేజీల పుస్తకం వెల రూ. 175. అనువాద సాహిత్యం అంటే ఇష్టపడేవాళ్ళకి బాగా నచ్చుతుంది. అలాగే అర్బన్ జీవిత చిత్రణలని చదివేందుకు ఇష్టపడే వారికి కూడా. ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్లైన్ లోనూ లభిస్తోంది.

శుక్రవారం, ఫిబ్రవరి 25, 2022

గుండెలో వాన

తెలంగాణ పల్లె జీవితాలను తెలుగు కథల్లో విస్తారంగా చిత్రించిన కథకుడు పెద్దింటి అశోక్ కుమార్ నుంచి వచ్చిన తాజా కథా సంకలనం 'గుండెలో వాన.' ఈ సంకలనంలో ఉన్న మొత్తం ఇరవై కథలు 2006-2019 మధ్య కాలంలో వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 'ప్రాణం ఖరీదు వంద ఒంటెలు' లాంటి ప్రామిసింగ్ కథలు రాసిన పెద్దింటి నవలలు, సినిమా సంభాషణలు కూడా రచించారు. బడి వాతావరణం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య బోధన, వ్యవసాయ సంక్షోభం, అతి సామాన్యుల జీవితాలు, మీడియా పోకడలు లాంటి భిన్న ఇతివృత్తాలతో రాసిన కథలున్నాయి ఈ సంకలనంలో. ఒకే ఇతివృత్తంతో రాసిన కథలు కూడా వేటికవే ప్రత్యేకంగా నిలబడడం, కొన్ని కథలు మళ్ళీ చదివించేవిగా ఉండడం ఈ సంకలనం ప్రత్యేకత.

వృత్తి రీత్యా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడైన అశోక్ కుమార్ బడి చదువులని ఇతివృత్తంగా తీసుకుని రాసిన ఐదు కథలున్నాయి ఈ సంకలనంలో. 'చుక్కలు రాని ఆకాశం' కథ డ్రాపవుట్స్ కి కారణాలని విశ్లేషిస్తే, 'ఆనాటి వానచినుకులు' కథ మూతపడబోతున్న తన పాఠశాలని నిలబెట్టుకోడం కోసం ఓ ఉపాధ్యాయిని పడే ఆవేదనని చిత్రించింది. చిరకాలం నమ్మిన విలువల్ని ఒక్కసారిగా పక్కన పెట్టించేవి ఏవిటో చెప్పకనే చెప్పే కథ 'దారిచూపిన వాడు' కాగా, ప్రభుత్వ ఉపాధ్యాయుల గురించి సమాజంలో ఉన్న అభిప్రాయాలకి - సరిగా చదువు చెప్పరు, బడి సమయాన్ని ఇతరత్రా వ్యాపకాలకి, వ్యాపారాలకి వెచ్చిస్తారు - తగినట్టుగా ఉండే పాత్రని చిత్రించిన కథ 'పురుగు'. ఇక, 'ఆకలి' కథ ఓ ఉపాధ్యాయుడి సుదీర్ఘ రైలు ప్రయాణమే ఆయినా, అసలు కథ వజ్రమ్మ ది. అసలీ కథకి 'వజ్రమ్మ' అని పేరు పెడితే బాగుండేది. గుర్తుండి పోయే కథ ఇది.

తెలంగాణ పల్లెల్లో వ్యవసాయ సంక్షోభాన్ని చిత్రించిన కథలు రెండు - 'గుండెలో వాన' 'జలగండం'. ఈ రెండు కథల్లోనూ వ్యవసాయ సమస్యల్ని ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా ప్రస్తావించడం మంచి ఎత్తుగడ. ఓ టైలర్ షాపులో మొదలయ్యే కథ 'గుండెలో వాన'. చాలా మామూలుగా మొదలై, కుతూహలాన్ని పెంచుతూ కొనసాగి ఊహించని ముగింపుకి చేరుతుంది. వ్యవసాయం ఇతివృత్తంగా వచ్చిన మంచికథల్లో ఒకటిగా నిలబడుతుంది. 'జలగండం' కథ ఓ రచయితని వెతుక్కుంటూ వచ్చిన ఓ పాఠకురాలు తన మనవడికి జలగండం తప్పించే మార్గం చెప్పమని అడగడంతో మొదలై ఆమె కథని పొరలుపొరలుగా చెబుతుంది. మాతృత్వం ఇతివృత్తంగా వచ్చిన రెండు కథల్లో మొదటిది 'ఈ పాప(o) ఎవరిది' ముగింపు మరో కథకి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఉపన్యాసాన్ని చదివించే కథగా మారిస్తే అది 'ప్లాసెంటా' అవుతుంది.

మీడియా చేస్తున్న అతిని చిత్రించిన మూడు కథల్లో మొదటిది 'చీమా చీమా ఎందుకు పుట్టావ్?' బ్రేకింగ్ న్యూసులు మీద సెటైర్. 'ఇప్పుడే అందిన వార్త' కూడా సెటైరే అయినప్పటికీ, నీటిపారుదల ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలని కొంచం లోతుగా చర్చించింది. 'మూడోకన్ను' కాస్త పాత కథలా అనిపిస్తుంది. పేదల జీవితాల చుట్టూ అల్లిన 'కొన్ని చేపలు...  ఒక గాలం' 'ఆట' కథలు ఆసాంతమూ ఆపకుండా చదివిస్తాయి. 'కొన్ని చేపలు..' కథలో కాస్త ఉపన్యాస ధోరణిలో ఉన్నా, 'ఆట' మాత్రం చివరికంటా ఆసక్తిగా చదివిస్తుంది. 'బిందెడు నీళ్లు' కథ క్లైమాక్స్ ట్విస్ట్ మీద నమ్మకంతో రాసినట్టున్నారు కానీ, నిరాశని కలిగిస్తుంది. ఇలాంటి నిరాశనే ఇచ్చే మరో కథ 'స్కావెంజర్'. రచయిత న్యూట్రల్ గా ఉంటూ కథ నడపలేని ఇతివృత్తాల్లో ఇదీ ఒకటి.

కాలంతో పాటు మనుషుల ఆలోచనల్లో మార్పులు వస్తాయంటారు కానీ, అందుకు మినహాయింపులుంటాయని చెప్పే కథ 'నింద'. మిగిలిన వాటిలో 'మరమనిషి' 'తీపిచావు' కథలు చదవడం మొదలుపెట్టగానే ముగింపుని ఊహించగలిగేవి. 'తీపిచావు' కథనం ఆసక్తికరం. ఇక, 'దగడు' ఆద్యంతం ఆసక్తిగా సాగిన కథ.  కథ నడిపేందుకు వ్యావహారిక భాషనీ, సంభాషణలకి తెలంగాణ మాండలికాన్ని ఉపయోగించారు. విస్తృతంగా వాడుకలో లేని కొన్ని పదాలకి ఫుట్ నోట్స్ లో అర్ధాలు ఇచ్చి ఉంటే బాగుండేది. కవర్ పేజీ డిజైన్, నాణ్యత చాలా బాగున్నాయి. శిరంశెట్టి కాంతారావు రాసిన ముందుమాటలో చాలా కథల్ని ముగింపులతో సహా పరామర్శించారు (స్పాయిలర్ అలెర్ట్ లేదు). ఈ ముందుమాటని కథలు పూర్తిచేశాక చదవడం మంచిది. అన్వీక్షికి ప్రచురించిన ఈ 224 పేజీల పుస్తకం వెల రూ. 200. పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్లోనూ కొనుక్కోవచ్చు. 

సోమవారం, ఫిబ్రవరి 21, 2022

నెరజాణవులే .. వరవీణవులే ..

చెలి ఒంపులలో హంపి కళ ఊగె ఉయ్యాల
చెలి పయ్యెదలో తుంగ అల పొంగే ఈ వేళ
మరియాదకు విరిపానుపు సవరించవేమి రా...

అరుదుగానే అయినా స్థలకాలాదులతో తీసిన సినిమాలు లేకపోలేవు తెలుగులో. ఇలాంటి సినిమాలకి కావాల్సినవన్నీ సమకూర్చడం ఛాలెంజే, పాటల సాహిత్యంతో సహా. పాట వినగానే కథాకాలం స్ఫురించాలి, పాత్రల ఔచిత్యాలు రేఖామాత్రంగానే అయినా తెలియాలి. కలం జవనాశ్వంలా పరుగులెత్తే వేటూరి లాంటి కవులకి ఇలాంటి పాట రాసే అవకాశం దొరకడమంటే, విందు భోజనానికి పిలుపు రావడమే. 

చిత్రమైన కథాంశంతో వచ్చిన సినిమా 'ఆదిత్య 365' (1991). ఓ సైంటిస్ట్ చాలా ఏళ్ళు పరిశోధనలు చేసి 'టైం మెషిన్' కనిపెట్టి, దానికి ఆదిత్య 369 అని పేరు పెడతాడు. అతని కూతురు హేమ (మోహిని), ఆమె బాయ్ ఫ్రెండ్ కృష్ణ కుమార్ (బాలకృష్ణ), మరికొందరూ ఆ టైం మెషిన్ లోకి అనుకోకుండా ప్రవేశించి అనూహ్యంగా గతంలోకి, అక్కడినుంచి భవిష్యత్తులోకి ప్రయాణం చేసి, వర్తమానంలోకి తిరిగి రావడమే కథ. వాళ్ళు గతం లోకి వెళ్ళింది సాక్షాత్తూ శ్రీకృష్ణదేవరాయల కాలానికి. అక్కడి రాజనర్తకి సింహ నందిని (సిల్క్ స్మిత)  కృష్ణకుమార్ మీద మనసు పడుతుంది. అతన్ని తన మందిరానికి ఆహ్వానిస్తుంది. ఆపై తన కోరికని బయట పెడుతుంది, అదీ పాట రూపంలో.. 

నెరజాణవులే వరవీణవులే 
కిలికించితాలలో... ఆహ్హహహా 
జాణవులే మృదుపాణివిలే
మధు సంతకాలలో... 

'కిలికించితం' అనేది స్త్రీ చేసే ఓ శృంగార చేష్ట. 'మధు సంతకాల'కి ఎన్ని అన్వయాలైనా చెప్పుకోవచ్చు కానీ, దృశ్యంలో సింహనందిని, కృష్ణ కుమార్ కి మధువు అందిస్తుంది. 

కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవి గనీ, మొగ్గగ నే మోజు పడిన వేళలో

'సన్న' అంటే సైగ. నీ మోవి (పెదవి )ని చూసి మొగ్గలాంటి నేను మోజు పడ్డాను అంటోంది. అతన్ని జాణ అంటూ, తనని మాత్రం మొగ్గగా అభివర్ణించుకుంది రాజ నర్తకి. 

మోమటు దాచి మురిపెము పెంచే లాహిరిలో
మూగవు గానే మురళిని ఊదే వైఖరిలో

ఆమె ఆహ్వానానికి అతడు సంసిద్ధుడు కాదు. అందుకే ముఖం తిప్పుకున్నాడు. అతడలా మొహం తిప్పుకున్నా కూడా ఆమెకి మురిపం పెరుగుతుందట. అతడేమీ మాట్లాడకపోయినా మురళీనాదం వినిపిస్తోందంటోంది. ఇలా మొదలైన చరణంలో ఆ తర్వాత.. 

చెలి ఒంపులలో హంపి కళ ఊగె ఉయ్యాల
చెలి పయ్యెదలో తుంగ అల పొంగే ఈ వేళ
మరియాదకు విరిపానుపు సవరించవేమి రా

రాయలెన్నో నిర్మాణాలు చేసినా, అయన పేరుచెప్పగానే మొదట గుర్తొచ్చేది రాజధానీ నగరం హంపి. ఆ నగరాన్ని ఆనుకుని ప్రవహించే నది తుంగ. 'సవరించవేమి రా' లో విరుపు ఉంది. 'సవరించవేమి?' అన్న ప్రశ్న కావొచ్చు, 'వచ్చి సవరించు' అన్న ఆహ్వానమూ కావచ్చు. 

సింహ నందినిని తిరస్కరించి, ఆమె ఆగ్రహానికి గురవుతాడు కృష్ణకుమార్. అక్కడి నుంచి హేమ మందిరానికి వచ్చేసరికి ఆమె అలకబూనుతుంది. ఇప్పుడు తన సచ్చీలతని, హేమ మీద ప్రేమని నిరూపించుకోవాల్సిన బాధ్యత అతనిది. 

చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో
వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో

నిజానికి హేమ, కృష్ణకుమార్ లు రాయలు కాలం వాళ్ళు కాదు కాబట్టి, వీళ్ళ కోసం నాటి భాష వాడాల్సిన అవసరం లేదు. కానీ, భాషని పలచన చేస్తే పాట సాహిత్యంలో సమగ్రత దెబ్బతింటుంది. పైగా, కథ ప్రకారం కృష్ణకుమార్ కి తెలుగంటే బోలెడు అభిమానం కూడా. 

చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సొయగమే ఓ సగము ఇవ్వాలీ వేళ
పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా

అతను న్యాయమా అని ప్రశ్నించేసరికి ఆమె కరిగింది. పల్లవి అందుకుంది..పాటని పూర్తి చేసింది. వేటూరి రాయగా, ఇళయరాజా స్వరపరచగా, జిక్కి, బాలూ, శైలజ పాడారు ఈ పాటని. సింహ నందిని పాత్రకి జిక్కి చేత పాడించడం భలే ప్రయోగం. ఇక, హేమ పాత్రకి డబ్బింగ్ కూడా శైలజ చేతే చెప్పించారు కాబట్టి, పాట అతికినట్టు సరిపోయింది. బాలకృష్ణగా మారిపోవడం బాలూకి ఏమంత కష్టం? 

చిత్రీకరణలో ముందుగా చెప్పుకోవాల్సింది సిల్క్ స్మిత గురించే. ఈమెలో ఉన్న నటిని, నర్తకిని మన సినిమా పరిశ్రమ సరిగ్గా ఉపయోగించుకోలేదని మళ్ళీ అనిపిస్తుంది, ఈ పాట చూస్తుంటే. అటు నర్తకిని తిరస్కరిస్తూ, ఇటు హేమని బతిమాలుకుంటూ రెండు వేరియేషన్స్ తో కనిపిస్తారు బాలకృష్ణ. జావళీ ఛాయలున్న గీతమే అయినా, సిల్క్ స్మిత లాంటి నటీమణి మీద చిత్రీకరిస్తున్నా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ పాటని ఆహ్లాదంగా చిత్రించారే తప్ప, అసభ్యతకి ఎక్కడా చోటివ్వలేదు. హాస్య పాత్రలు పోషించిన సుత్తివేలు, శ్రీలక్ష్మి కూడా కనిపిస్తారు తెరమీద.

గురువారం, ఫిబ్రవరి 17, 2022

మనసున్న మనుషులు

గళాభినేత్రి శారదా శ్రీనివాసన్ రాసిన తొలి నవల 'మనసున్న మనుషులు'. సుదీర్ఘమైన ఆకాశవాణి కెరీర్ లో ఎంతోమంది సాహితీవేత్తలతో కలిసి పనిచేసి, కొన్ని వేల కాల్పనిక పాత్రలకి తన గొంతుతో ప్రాణ ప్రతిష్ట చేసిన ఈ విదుషి ఆలస్యంగా కలం పట్టినా, వరుసగా పుస్తకాలు ప్రచురిస్తూ ఉండడం సంతోషం కలిగించే విషయం. ఎనభయ్యేడేళ్ళ జీవితాన్ని చూసిన రచయిత్రి రాసిన ఈ నవలలో మెజారిటీ పాత్రలు ఎంతో మెచ్యూరిటీ కలిగినవీ, జీవితాన్ని గురించి స్థిరమైన అభిప్రాయాలున్నవీను. రెండు మూడు 'నెగిటివ్' పాత్రలున్నప్పటికీ వాటి పరిధి తక్కువ. పైగా ఈ మెచ్యూర్డ్ పాత్రల వెలుగుల ముందు వెలవెలబోతాయవి. నిజానికి 118 పేజీల ఈ రచనని నవల అనడం కన్నా, ముందుమాటలో రచయిత్రి డి. కామేశ్వరి చెప్పినట్టు నవలిక అనడమే సబబు. ఏకబిగిన చదివించే కథనం ఈ రచన ప్రత్యేకత.

ఇది ఎలీషా అనే ఓ అనాధ కథ. అతడు పెళ్లి చేసుకున్న సుజాత కథ. వాళ్లిద్దరూ కలిసి పెంచుకున్న రుక్మిణి కథ కూడా. ఈ మూడు భిన్న జీవితాలతో పాటు, వీరికి సంబంధించిన వారి జీవిత చిత్రణ కూడా కనిపిస్తుంది. అనాధ శరణాలయంలో పెరిగిన ఎలీషా స్వయంకృషితో యూనివర్సిటీ ప్రొఫెసర్ స్థాయికి ఎదుగుతాడు. పెరిగిన పరిస్థితుల కారణంగా అతనికి పెళ్లిమీద మనసు పోదు. అయితే, ఊహించని పరిస్థితుల నేపథ్యంలో తనకన్నా పద్దెనిమిదేళ్లు చిన్నదైన సుజాతని పెళ్లి చేసుకుంటాడు. సుజాత వ్యక్తిత్వం, ఆత్మాభిమానం ఉన్న స్త్రీ. జీవితంలో తగిలిన ఎదురు దెబ్బ వల్ల భవిష్యత్తుని గురించి పెద్దగా ఆలోచనలు ఉండవు ఆమెలో. పైగా ఎలీషా ఆమెకి పూజనీయుడు. అతని నిర్ణయాలకు ఆమె అడ్డు చెప్పదు. 

ఎలీషా-సుజాతల జీవితాల్లోకి అనూహ్యంగా ప్రవేశిస్తుంది రుక్మిణి. పద్దెనిమిదేళ్ల వయసుకే చాలా ఎదురు దెబ్బలు తిన్న అమ్మాయి. సుజాత తల్లిదండ్రులకి ఆమె సోదరుడి వల్ల కలిగే ఇబ్బందులని, రుక్మిణికి సోదరుడి కారణంగా ఎదురైన సమస్యలని (రెండు చోట్లా తోబుట్టువులే విలన్లు) పరిష్కరించడానికి ఎలీషా చొరవ తీసుకోవడం, రుక్మిణి భవిష్యత్తుకి సంబంధించిన నిర్ణాయాలతో కథ ముగుస్తుంది. నవల మొదట్లో చాలా బలమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రగా పరిచయమయ్యే సుజాత రానురాను ఎలీషా నీడలోకి వెళ్లిపోవడం, రుక్మిణి తన సమస్యల్లో ఒకదాన్ని నేరుగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నా, చిన్న అడ్డదారిని వెతుక్కోవడం నన్ను నిరాశ పరిచిన విషయాలు. 

కథాకాలం విషయంలో స్పష్టత లేకపోవడం మరో సమస్య. మొదట ఆటోరిక్షా అతనిగా పరిచయమయ్యే పాత్ర అంతలోనే రిక్షా అతనిగా మారిపోవడం వల్ల మొదలైన కన్ఫ్యూజన్, మొబైల్ ఫోన్ వాడని పాత్రలు బ్యాంక్ ఏటీఎం, ఇంటర్నెట్టు వాడడం దగ్గర పరాకాష్టకి చేరింది. ఎలీషా-సుజాతల పెళ్లికి దారితీసే పరిస్థితుల చిత్రణలో కొంత నాటకీయత చోటుచేసుకుంది. తను నటించిన రేడియో నాటకాల ప్రభావం రచయిత్రి మీద కొంచం ఎక్కువగానే పడినట్లుందనిపించింది. అయితే, చెప్పదలుచుకున్న విషయం మీద స్పష్టత ఉండడం వల్ల కథనం సాఫీగానే సాగిపోయింది. ఈ నవల రాయడానికి తనకి ప్రేరణనిచ్చిన విషయాలేంటో తన ముందుమాటలో వివరంగా చెప్పారు రచయిత్రి.

"ప్రతి పాత్రా కొద్దో గొప్పో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లినా, ఎక్కడా చిన్న జర్క్ కూడా కనిపించదు. నల్లేరుమీద బండిలా మెత్తగా సాగిపోతుంది కథ. స్థితప్రజ్ఞుల సంగతి వేరు. కానీ, సామాన్యులే తమ బుద్ధి కుశలతతో స్థితప్రజ్ఞత పొందడం ఈ నవలలోని ప్రత్యేకత" అన్నారు సినీ గీత రచయిత భువనచంద్ర తన ముందుమాటలో. "ఇది మామూలు మధ్యతరగతి కథ" అన్న డి. కామేశ్వరి తన ముందుమాటలో కథ మొత్తం చెప్పేయకుండా ఉండి ఉంటే మరింత బాగుండేది. నవలలాగే ముందుమాటలో క్లుప్తంగా ఉన్నాయి. క్రియేటివ్ లింక్స్ ప్రచురించిన ఈ 130 పేజీల పుస్తకం వెల రూ. 130. ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఆన్లైన్ లోనూ లభిస్తోంది. 

బుధవారం, ఫిబ్రవరి 16, 2022

భరోసా

పిల్లల పెంపకం మొదలు పర్యావరణ పరిరక్షణ వరకూ కాదేదీ కథావస్తువుకి అనర్హం. కావల్సిందల్లా కథ చెప్పే నేర్పు. ఆ కథలకి ఉండాల్సింది ఆసాంతమూ చదివించే లక్షణం. చదవడం పూర్తి చేసి వేరే పనుల్లో తలమునకలైనప్పుడు కూడా ఆ కథలు గుర్తొచ్చాయంటే అది కచ్చితంగా రచయిత విజయమే. 'భరోసా' కథా సంపుటిలోని పదిహేను కథల్లోనూ వస్తువులు పాతవే, కానీ చెప్పిన తీరు ఆ కథల్ని గుర్తు పెట్టుకునేలా చేసింది. ఈ కథలన్నీ గడిచిన పదకొండేళ్లలో వివిధ పత్రికల్లో అచ్చైనవి. ఇంకోంన్నేళ్ల తర్వాత చదివినా 'భలే చెప్పారే' అనిపించేవి. రచయిత జి. ఉమామహేశ్వర్ కి కథనం మీద ఉన్న శ్రద్ధ ఈ కథల్ని ప్రత్యేకంగా నిలిపింది. విలువల్ని గురించిన రచయిత ఆలోచనలు ఈ కథల్లో ప్రతిఫలించాయి.  బాగా నలిగిన విషయాలని కూడా కొత్తగా చెప్పాలనే ప్రయత్నం కనిపిస్తుంది అన్ని కథల్లోనూ.

మొదటి కథ 'భరోసా' సాఫ్ట్వేర్ కంపెనీ నేపధ్యంగా సాగడంతో మొత్తం కథలన్నీ ఇదే నేపధ్యంతో సాగుతాయా? అన్న సందేహం వచ్చింది. కానీ, ఏ రెండు కథలదీ ఒకే నేపధ్యం కాదు. ఏ రెండు కథల వస్తువూ ఒకటి కాదు. మిడిల్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్న నడివయసు కంప్యూటర్ నిపుణులు, కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తున్న తరంలో కమిట్మెంట్ ఎంత అనే చర్చ నేపధ్యంగా సాగుతుంది కథ. "బిజినెస్ లో గతికితే తప్ప అతకదు కదా" లాంటి చెణుకులకి లోటులేదు. ఇంతకీ కొత్త తరం మీద వాళ్ళకి 'భరోసా' కలిగించిన సంగతేమిటన్నది ముగింపు. రెండో కథ 'ఎట్లా బతకబోతాడో' వ్యంగ్యపూరితంగా సాగుతుంది. నలుగురితో పాటుగా కాకుండా, కాస్త భిన్నంగా ఆలోచించే వ్యక్తిని గురించి అతని కుటుంబం ఏమనుకుంటుందో చెబుతుందీ కథ. 

'ఒక దళారీ పరాభవం' కథ 'ఇలా జరిగితే బాగుండును' అన్న ఆలోచననిస్తుంది. జరగదు అనుకోలేం, అలాగని జరుగుతుందని నమ్మనూలేం. 'క్విజ్ మాస్టర్' కథ కూడా విలువల్ని చర్చించేదే. విజయానికి మెట్లే కాదు, అడ్డదారులు కూడా ఉంటాయని చిన్న వయసులోనే గ్రహించిన పిల్లలని, వాళ్ళని ప్రోత్సహించే పెద్దల్నీ చూసి ఆలోచనలో మునిగిపోయే క్విజ్ మాస్టర్ కథ ఇది. భార్యకి భయపడే ఓ భర్త (ఈ సంపుటంలో ఉన్న కథల్లో భర్తలందరూ భార్యలకు భయపడే వాళ్ళే), ఆమె మనసు నొప్పించకుండానే తన తొమ్మిదేళ్ల కొడుకు కోరిన కోరిక తీర్చిన కథ 'గోకులన్న' - ఈ మధ్యే మార్గాలు అన్నిసార్లూ అక్కరకొస్తాయా? అన్న సందేహాన్ని మిగులుస్తుంది. 'జలపాఠం' కథ చదువుతుంటే నీటి పంపిణీని గురించి మానవహక్కుల నేత దివంగత కె. బాలగోపాల్ రాసిన పుస్తకం 'జలపాఠాలు' బాగా గుర్తొచ్చింది. వ్యంగ్య ధ్వనిలో సాగే కథ ఇది.

అన్నదమ్ముల ఆస్తి పంపకాలు ఇతివృత్తంగా సాగే కథ 'ధర్మామీటర్' ఇంటింటి కథలాగే అనిపిస్తుంది. ఓ. హెన్రీ తరహా మెరుపు ముగింపుతో గుర్తుండిపోయే కథ 'నీ లీల పాడెద దేవా'. ఆలయాల వెనుక జరిగే రాజకీయాలని చెప్పే కథ 'మనిషి-దేవుడు', నలిగిన ఇతివృత్తాన్ని కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు రచయిత. సెల్ టవర్ల కారణంగా పిచ్చుకలు అంతరించిపోతుండడానికి ఓ ఆశావహ ముగింపు ఇస్తూ రాసిన కథ 'మొదటి పిచ్చుక'. 'వారసులు అంటే కడుపున పుట్టిన వాళ్ళా లేక ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్లే వాళ్ళా?' అన్నది చర్చిస్తుంది 'వారసులు' కథ. 'చందమామ రావే' కథని ఓ అంథాలజీగా చెప్పాలనే ప్రయత్నం బాగుంది కానీ, అన్ని కథల్లోనూ కొడుకులు విలన్లు కావడం వల్ల కొత్తదనం లోపించింది.

పిల్లలు ప్రధాన పాత్రలుగా నడిచే మరో కథ 'వైట్ బోర్డు'. అక్కాతమ్ముళ్ల గిల్లికజ్జాలు కథని చివరికంటా చదివిస్తాయి, ముగింపు ఊహించగలిగేదే అయినప్పటికీ. ఆద్యంతమూ ఆసక్తిగా డిటెక్టివ్ తరహాలో సాగే కథ 'నేను నా దేశమును..' ఏమాత్రం కన్విన్సింగ్ కాని విషయాన్ని తన కథనంతో ఒప్పించేలా చెప్పారు రచయిత. పర్యావరణ పరిరక్షణ ఉపన్యాసాన్ని చదివించే కథగా చెప్పారు 'హరిత విప్లవం' కథలో. కార్పొరేట్ ఆఫీసు వాతావరణం, అక్కడి రాజకీయాల్ని కథలో భాగం చేయడం తెలివయిన ఎత్తుగడ. కథల్లో అక్కడక్కడా వామపక్షపాతం కనిపించినా, ఎజెండాతో రాసిన జెండా కథలు కావివి. శైలి ఆపకుండా చదివించేదిగా ఉండడం వల్ల 'అప్పుడే కథ పూర్తైపోయిందా' అనిపిస్తుంది. పాలపిట్ట బుక్స్ ప్రచురించిన ఈ 168 పేజీల సంకలనం వెల రూ. 120. ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు. 

మంగళవారం, ఫిబ్రవరి 15, 2022

చిత్రలేఖ

ఆమె ఒక నర్తకి. కళ్ళు చెదిరే అందం ఆమె సొంతం. చురుకైన బుద్ధి కలది. అయితే, ఆమెలో స్థిరత్వం పాళ్ళు కొంచం తక్కువ. పైగా పట్టుదల మనిషి. ఆమె తెలివితేటల వల్ల ఉపకారం మాట అటుంచి, ఆమెకే అపకారం జరిగే పరిస్థితులు తలెత్తాయి. ఇందుకు ఆమె స్వయంకృతం  కూడా చాలావరకూ కారణం. అసలేం జరిగిందో తెలియాలంటే చాణక్యుని మంత్రిగానూ, పాటలీపుత్రాన్ని రాజధానిగానూ చేసుకుని చంద్రగుప్తుడు రాజ్యపాలన చేస్తున్న రోజుల్లోకి వెళ్ళాలి. ఆ రాజ్యంలో రత్నాంబరులు అనే గురువు ఆశ్రమంలో చదువు పూర్తి చేసుకున్న ఇద్దరు శిష్యులు  'పాపం అంటే ఏమిటి గురుదేవా?' అని సందేహం వెలిబుచ్చడం, ఆ ప్రశ్నకి వారే సమాధానం వెతుక్కునేలా ఆ గురువు చేసిన ఏర్పాటుని తెలుసుకోవాలి. చిత్రంగా, ఆ శిష్యులిద్దరి జ్ఞాన్వేషణకీ కేంద్రం ఆ నర్తకే అవుతుంది. ఆమె పేరు చిత్రలేఖ.

సుప్రసిద్ధ హిందీ రచయిత భగవతీ చరణ్ వర్మ 1934 లో రాసిన 'చిత్రలేఖ' నవలలో కథానాయిక చిత్రలేఖ.  హిందీలో నవలగా లక్షలాది కాపీలు అమ్ముడై, సినిమాలుగా తెరకెక్కిన ఈ నవలని లంక నారాయణరావు తెనిగించారు. క్లాసిక్ బుక్స్ సంస్థ తాజాగా ప్రచురించింది. రత్నాంబరుల ప్రియశిష్యులిద్దరిలో శ్వేతాంకుడు క్షత్రియుడు కాగా, విశాల దేవుడు బ్రాహ్మణ యువకుడు. ఇద్దరికీ 'పాపం' అంటే ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహాలం కలిగింది. రత్నాంబరులు - శ్వేతాంకుడు సామంత బీజగుప్తుని వద్దా, విశాల దేవుడు యోగి కుమారగిరి దగ్గరా ఏడాది పాటు శుశ్రూషలు చేసి తమ సందేహానికి సమాధానాన్ని అన్వేషించాల్సిందిగా సూచించి, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు. శిష్యులిద్దరూ ఒకరు బీజ గుప్తుని రాజభవనానికి, మరొకరు కుమారగిరి ఆశ్రమానికి బయల్దేరతారు. తాను తపస్సు నిమిత్తం రాజ్యాన్ని విడిచిపెడతారు రత్నాంబరులు.

పాటలీపుత్రంలో సుప్రసిద్ధ నర్తకి చిత్రలేఖ. పూర్వాశ్రమంలో ఆమె ఒక బ్రాహ్మణ వితంతువు. భర్త మరణానంతరం ఆమె వేసిన అడుగులు నాట్యం వైపు నడిపించి తక్కువ కాలంలోనే ప్రఖ్యాత నర్తకిని చేశాయి. చిత్రలేఖ రూపలావణ్యాలని చూసి ఎందరో ప్రముఖులు ఆమెని మోహించారు. కానీ, ఆమె ఎవరివైపూ దృష్టి సారించలేదు. ఓ సందర్భంలో ఆమె నృత్య ప్రదర్శన చూసిన సామంత బీజగుప్తుడు చిత్రలేఖ ఆకర్షణలో పడ్డాడు. పెద్ద పదవిలో ఉన్న, అవివాహితుడైన బీజగుప్తుడు చిత్రలేఖనూ ఆకర్షించాడు. వారిద్దరిమధ్యా అనుబంధం మొదలైంది. ప్రతి సాయంత్రం చిత్రలేఖ బీజగుప్తుడి భవనానికి వస్తుంది. ఇద్దరూ కలిసి మధువు సేవించి రాత్రంతా కలిసి గడుపుతారు. ఏ తెల్లవారు జామునో ఆమె తన భవనానికి బయలుదేరుతుంది. వారి సంబంధం బహిరంగమే. బీజగుప్తుని శుశ్రూష చేయడానికి వచ్చిన శ్వేతాంకునికి చిత్రలేఖని 'యజమానురాలి' గా పరిచయం చేస్తాడా సామంతుడు.

యోగి కుమారగిరికి విశేషమైన యోగ బలంతో పాటు లెక్కలేనంత గర్వం కూడా ఉంది. తనని మించిన వాడు లేడన్న విరుగుబాటు చాలా ఎక్కువ. ఒకనాడు రాజాస్థానంలో జరిగిన ఓ కార్యక్రమంలో అత్యంత అనూహ్యంగా చిత్రలేఖ చేతిలో అవమానానికి గురవుతాడు కుమారగిరి. ఆమె తనకి క్షమాపణలు చెప్పడానికి వచ్చినప్పుడు ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు కూడా. అదే సమయంలో, చిత్రలేఖ కారణంగా బీజగుప్తుడు వివాహానికి విముఖుడయ్యాడన్న మాట ఆమె చెవిన పడుతుంది. అతని వివాహానికి తాను అడ్డు తొలగాలనుకుని, రాజ్యం విడిచి కుమారగిరి ఆశ్రమం చేరుతుంది. తనకి సన్యాస దీక్ష ఇవ్వాల్సిందిగా కుమారగిరిని ఒత్తిడి చేస్తుంది. తాను అతనితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి ఉన్నానని చెబుతుంది. అక్కడ విశాలదేవుడు కుమారగిరికి ప్రధాన అనుచరుడు. కుమారగిరి, చిత్రలేఖకి దగ్గరవడానికి అతడు ప్రత్యక్ష సాక్షి.

చిత్రలేఖ ఎడబాటు బీజగుప్తుణ్ణి చింతాక్రాంతుణ్ణి చేస్తుంది. ఇటు చిత్రలేఖ ఆగమనం కుమారగిరి ఆశ్రమ జీవితంలో అనేక అసంగతాలకి కారణమవుతుంది. అటు శ్వేతాంకుడు, ఇటు విశాలదేవుడు జరుగుతున్న పరిణామాలని శ్రద్ధగా గమనిస్తూ ఉంటారు. చిత్రలేఖ ఈ ఇద్దరినీ తన అంతరంగికులుగా భావించి, తన నిర్ణయాలని గురించి వారితో చర్చిస్తూ ఉంటుంది. బీజ గుప్తుడు, కుమారగిరి ఇద్దరిలో చిత్రలేఖ ఎవరిని ప్రేమించింది? ఐహిక సుఖాలని విడిచిపెట్టి ఆమె సన్యాస దీక్ష స్వీకరించ గలిగిందా? ఏడాది శుశ్రూష తర్వాత శిష్యులిద్దరూ 'పాపం' అంటే ఏమిటో తెలుసుకో గలిగారా? వారి నిర్వచనాలని వారి గురువు రత్నాంబరులు ఆమోదించారా? ఇత్యాది ప్రశ్నలకి జవాబు 176 పేజీల 'చిత్రలేఖ' నవల. అనువాదం సరళంగానే జరిగినా, అక్కడక్కడా వ్యతిరేక పదాలు పడ్డాయి - 'స్తబ్దంగా' అని ఉండాల్సిన చోట 'నిస్తబ్దంగా లాంటివి.

ఈ చారిత్రక కల్పనని చదువుతున్నంత సేపూ తెలుగులో చారిత్రక కల్పనకి పరాకాష్టగా చెప్పదగిన అడివి బాపిరాజు 'హిమబిందు' పదేపదే జ్ఞాపకం వచ్చింది. రెండు కథల మధ్యా లేశమైనా పోలిక లేదు. కానీ, 'హిమబిందు' ఇతర భాషల్లోకి అనువాదమై ఉంటే ఎంత బాగుండేదో కదా అన్న ఆలోచన వెంటాడింది. మనవాళ్ళెందుకో మన సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి పంపడం మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. మనదగ్గరా గొప్ప సాహిత్యం ఉందని ప్రపంచానికి తెలియకుండా పోతోంది కదా అనిపించింది. ఆద్యంతమూ ఆసక్తిగా చదివించే 'చిత్రలేఖ' నవల వెల రూ. 150. ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు.

సోమవారం, ఫిబ్రవరి 14, 2022

మల్లీశ్వరి

'ప్రేమకావ్యం' అనగానే గుర్తొచ్చే తెలుగు సినిమాల్లో మొదటి వరసలో ఉండే పేరు 'మల్లీశ్వరి'. భానుమతి, రామారావుల నటన, బి.ఎన్. రెడ్డి దర్శక ప్రతిభ, కృష్ణశాస్త్రి సాహిత్యం, సాలూరి రాజేశ్వర రావు సంగీతం.. వంటొచ్చిన చేతి నుంచి కావాల్సిన దినుసులన్నీ తగు మోతాదులో పడి తయారైన పసందైన వంటకం. తయారై డెబ్బై ఏళ్ళు గడిచినా ఆ వంటకం రుచి మరింత పెరిగిందే తప్ప, కొంచం కూడా తగ్గలేదు. వాహినీ పతాకంపై తయారైన ఈ సినిమా పండిత పామరుల చేత 'క్లాసిక్' అనిపించుకుంది, ఏకగ్రీవంగా. తర్వాతి కాలంలో అతి నటనకి పర్యాయ పదాలుగా మారిపోయిన నాయికా నాయకులిద్దరూ పాత్రోచితంగా ఒదిగి నటించడం వల్ల ఇప్పుడు చూస్తున్నా ఈ సినిమా ఆహ్లాదంగానే ఉంటుంది. 

హంపీ విజయనగరం రాజధానిగా శ్రీకృష్ణ దేవరాయలు పాలిస్తున్న రాజ్యంలో వీరాపురం అనే పల్లెటూరు. ప్రధానంగా పద్మశాలీల గ్రామం. ఆ ఊళ్ళో ఒక్క నారప్ప ఒక్కడే వంద మగ్గాలకి యజమాని. నిత్యం చీనీ చీనాంబరాలు, మెడ తిరగనన్ని నగలూ ధరించి, బిగ్గా వేసుకున్న జడతో ఎల్లప్పుడూ కళ్ళు పెద్దవి చేసి చూసే నాగమ్మ (రుష్యేంద్రమణి) చాటు (సగటు) భర్త ఈ నారప్ప. వాళ్ళకి ఒకే ఒక్క కూతురు మల్లీశ్వరి (భానుమతి). దగ్గరవాళ్ళు 'మల్లమ్మా' అని పిలుచుకుంటూ ఉంటారు ముద్దుగా. పనిపాటలు తెలిసిన చలాకీ అల్లరి పిల్ల. చుట్టూ ఉన్న వాళ్లలో ఆమెని ఇష్టపడే వాళ్లతో పాటు, వెనకాల మూతి విరిచే వాళ్ళూ ఉంటారంటే అందుకు కారణం ముక్కున గుద్దినట్టుండే ఆమె మాటతీరే. 

నారప్పకి ఓ వితంతువైన తోబుట్టువు గోవిందమ్మ, ఆమె కొడుకు నాగరాజు (ఎన్టీఆర్). వీళ్లది కలిగిన కుటుంబం కాదు. గోవిందమ్మకి కులవృత్తి మీద గట్టి పట్టు లేదు. ఇక నాగరాజైతే ఆ వృత్తినే వదిలేసి శిల్పిగా మారతాడు. ఇందుకు మల్లీశ్వరి ప్రోత్సాహం చాలానే ఉంది. నారప్పకి మల్లీశ్వరిని నాగరాజుకిచ్చి పెళ్ళిచేయాలని ఉంటుంది. వాళ్లిద్దరూ ఒకే ప్రాణంగా పెరిగారని అతనికి తెలుసు. మేనల్లుడి మీద గట్టి నమ్మకం కూడా. అయితే,  నాగమ్మ 'ససేమిరా' అంటుంది. ఆ పేదింటికి తన కూతుర్ని పంపనని తెగేసి చెబుతుంది. ఆమె దృష్టిలో కూతురు మహారాణి. గొప్పింటి కోడలు కావాల్సిన పిల్ల. అత్త మనసులో ఏముందో తెలుసుకున్న నాగరాజు, డబ్బు సంపాదించే నిమిత్తం పట్టణానికి ప్రయాణమవుతాడు. ఏడాది తిరిగేసరికి కళ్ళు చెదిరే ధనం సంపాదించి తిరిగి వస్తానని శపధం చేసి మరీ బయల్దేరతాడు. 

ఎంతైనా కథానాయకుడు కాబట్టి అన్నప్రకారమే ఏడాది తిరిగేసరికల్లా బోల్డంత సంపదతో తిరిగొస్తాడు నాగరాజు. కానైతే అప్పటికి మల్లీశ్వరి ఇల్లు విడిచిపెట్టాల్సి వస్తుంది. ఆమెకోసం రాణీ వాసపు పల్లకీ వస్తుంది. ఆమె ఇప్పుడు మల్లమ్మ కాదు, మహారాణీ తిరుమల దేవమ్మ గారి ఇష్టసఖి మల్లీశ్వరీ దేవి. రాణివాసం వెళ్లిన స్త్రీల జీవితం వైభవోపేతం. ఈ కారణానికి కూతుర్ని తల్చుకుని గర్వ పడుతుంది నాగమ్మ. రాణివాసపు స్త్రీలకి వ్యక్తిగత జీవితమే కాదు, ఇష్టాఇష్టాలూ ఉండకూడదు, పంజరపు బతుకు బతకాలి. ఈ కారణానికి కూతుర్ని తల్చుకుని కుమిలిపోతాడు నారప్ప. అలాగని, రాజాజ్ఞని ధిక్కరించే శక్తి లేదతనికి. 

మల్లీశ్వరి కోసం ఇల్లొదిలి, దాదాపు పిచ్చివాడైపోయిన నాగరాజు ఓ ప్రముఖ శిల్పి కళ్ళలో పడతాడు. ఆ శిల్పి రాయలు నిర్మించ తలపెట్టిన నర్తనశాలకి ఓ రూపం ఇస్తున్నాడు. నాగరాజుని ఒప్పించి ఆ పనిలో భాగం చేస్తాడు. ఇప్పుడు మల్లీశ్వరి, నాగరాజు ఇద్దరూ రాజాస్థానంలోనే ఉన్నారు. కానీ రాణీవాసపు స్త్రీలు, పురుషుల్ని కలవరాదు, కనీసం వారితో మాట్లాడరాదు. చిన్ననాటి నుంచీ స్నేహితులు, వయసొచ్చాక ప్రేమికులూ అయిన ఈ జంట, అంతఃపుర నియమాలని ధిక్కరించ గలిగిందా? తదనంతర పరిణామాలేవిటి? అన్నది దాదాపు మూడున్నర గంటల నిడివి గల 'మల్లీశ్వరి' సినిమా ముగింపు. యూట్యూబ్ లో రెండున్నర గంటల సినిమా మాత్రమే లభిస్తోంది, అనేక కట్స్ తో. 

 'వాహినీ' కుమారి

'మల్లీశ్వరి' సినిమాకి మూలం ఆకాశవాణి కోసం బుచ్చిబాబు రాసిన 'రాయల కరుణ కృత్యం' అనే నాటిక. అయితే, టైటిల్స్ లో ఎక్కడా క్రెడిట్ ఇవ్వలేదు. బీఎన్ కి బుచ్చిబాబుకి వచ్చిన మాటపట్టింపులే ఇందుకు కారణం అన్నది కర్ణాకర్ణిగా వినిపించే మాట. భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రికి సినిమా కవిగా స్థానాన్ని సుస్థిరం చేయడమే కాదు, వాళ్ళబ్బాయి 'బుజ్జాయి' చిత్రకారుడిగా నిలదొక్కుకోడానికి కూడా దోహదపడిందీ చిత్రం. పాటలు మాత్రమే కాదు, మాటలూ లలితంగానే ఉంటాయి ఈ సినిమాలో. సంగీతం సమకూర్చడంలో సాలూరి రాజేశ్వర రావుకి అద్దేపల్లి రామారావు సహకారం అందించారు. కొన్ని పాటల్ని మాత్రమే ప్రస్తావించడం సాధ్యపడదు. అన్ని పాటల్నీ తల్చుకోవడం అంటే సినిమా మొత్తాన్ని మరోమారు పునఃశ్చరణ చేసుకోవడమే. 

శ్రీకృష్ణదేవరాయలుకి దాదాపు సమకాలికుడైన పురందరదాసు కీర్తన 'లంబోదర లకుమికరా' తో సినిమా మొదలవ్వడంలో  ఎంతైనా ఔచిత్యం ఉంది. అయితే, మల్లీశ్వరి నాగరాజులు పెద్దయ్యాకాను, సినిమా చివర్లోనూ గుళ్లో ప్రసాదం తీసుకునేప్పుడు వినిపించే ట్యూను 'మానస సంచరరే..' సదాశివ బ్రహ్మేంద్రులది. ఈయన రాయలికి దాదాపు 250 ఏళ్ళ తర్వాతి వాడు. (ఇలాంటిదే 'మాయాబజార్' సినిమాలో లక్ష్మణ కుమారుడు అద్దంలో చూసుకుంటూ త్యాగరాజ కీర్తన 'సమయానికి' ని 'ననినా నని..' అంటూ కూనిరాగం తీయడం -- వీటిని 'క్లాసిక్ మిస్టేక్స్' అందామా?). భజనపాటలు, యక్షగానమూ కూడా ఈ సినిమా సంగీతంలో భాగమే. పాటలు మాత్రమే కాదు, నేపధ్య సంగీతమూ సినిమాకి ప్రాణం పోసింది. 

 టి.జి. కమలాదేవి

నటీనటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది భానుమతి గురించి. సహాయ దర్శకుడు రామకృష్ణ ని ప్రేమించి, సినిమా కథని మించిన ట్విస్టులతో పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్నాక, కొత్త జంటని ఆశీర్వదించడానికి వచ్చిన బీఎన్, 'మల్లీశ్వరి' ప్రాజెక్టు గురించి ఇద్దరికీ చెప్పి, సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకూ పిల్లల్ని కనడం వాయిదా వేసుకోమని కోరారట. తన ఆత్మకథ 'నాలో నేను' లో రాసుకున్నారు భానుమతి. (ఈ సినిమాకి కీలకమైన 'జామకాయల' సీను కూడా తన సలహా మేరకే చేర్చారని కూడా చెప్పారు). పాత్ర పోషణ మాత్రమే కాదు, పాటలూ తానే పాడారు.   అప్పటికింకా హీరోయిజం మొదలవ్వలేదు కాబట్టి, రామారావు నాగరాజు లో పరకాయ ప్రవేశం చేయడమే కాదు, రాయల ముందు చేతులు కట్టుకుని నిలబడ్డానికీ వెనుకాడలేదు. 

సహాయ పాత్రలు పోషించిన వాళ్లలో ఇద్దర్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. రాణీ తిరుమల దేవిగా నటించిన మిస్ కుమారి. 'వాహినీ' కుమారిగా ప్రసిద్ధురాలైన నాగరాజ కుమారి 'లక్స్' సబ్బుకు తొలి భారతీయ మోడల్. పుంభావ సరస్వతి మల్లాది రామకృష్ణ శాస్త్రి అభిమాన నటి. మరొకరు మల్లీశ్వరీ దేవి ఇష్టసఖి జలజ గా నటించిన టి.జి. కమలాదేవి (గోవిందమ్మ/కమలా చంద్రబాబు). సంభాషణలు తక్కువే అయినా వీళ్ళిద్దరూ ప్రత్యేకంగా గుర్తుండిపోతారు. ఆమాటకొస్తే చిన్నాపెద్దా పాత్రల్లో వేసిన ఏ నటీనటులూ కనిపించకుండా, కేవలం ఆయా పాత్రలు మాత్రమే కనిపించే సినిమా ఇది. చిన్నప్పటి మల్లీశ్వరీ, నాగరాజూ కూడా వాళ్ళే సహజంగా పెద్దైపోయి భానుమతీ, రామారావూ అయిపోయారేమో అనిపించేంతగా అతికినట్టు సరిపోయారు. 

రతనాలు రాశులు పోసి వీధుల్లో అమ్మిన రాయల కాలంలో చేతి వృత్తులవారి జీవితాలు ఎంత వైభవంగా ఉండేవో చెప్పే సినిమా 'మల్లీశ్వరి'. నాగరాజు తనకి  నచ్చిన పని చేయడానికి కులం అడ్డంకి కాలేదు సరికదా, చేతిలో విద్య అతన్ని భాగ్యవంతుణ్ణి చేసింది. ఆడితప్పని రాజు, ఆ రాజుకి ఆశీస్సులతో పాటు అవసరమైనప్పుడు సలహాలిచ్చే కవిరాజు, క్రమశిక్షణకి పెట్టింది పేరైన రాజాస్థానం.. వీటిని మాత్రమే కాదు, కాలాలకి అతీతమైన మానవ నైజాన్నీ, అజరామరమైన ప్రేమనీ హృద్యంగా తెరకెక్కించిన దర్శకనిర్మాత బీఎన్ రెడ్డి కీర్తికిరీటంలో కలికి తురాయి ఈ 'మల్లీశ్వరి'.  ఇంకా చూడలేదా? ఈ ప్రేమికుల రోజున చూసేయండి. మళ్ళీ చూడాలనిపించినా పర్లేదు, ఓసారి చూసిన వారందరికీ అలా అనిపించడం అత్యంత సహజమే. 

(Google Images) 

గురువారం, ఫిబ్రవరి 10, 2022

మంచి వెన్నెలవేళ

తెలుగు బ్లాగుల వైభవోజ్వల యుగంలో కలం పట్టిన వారిలో కొందరు బ్లాగరుల నుంచి రచయిత(త్రు)లు గా పదోన్నతి పొంది విరివిగా రాస్తూ, వరుసగా పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఈ కొందరిలోకి కొంచం ఆలస్యంగానైనా చేరారు 'కొత్తావకాయ' బ్లాగరు సుస్మిత. పుష్కర కాలానికి పూర్వం ఒకానొక మార్గశిర మాసంలో రోజుకో టపాగా తన బ్లాగులో ప్రచురించిన 'తిరుప్పావై' పాశుర కథా మాలికకి ఇప్పుడు పుస్తక రూపం ఇచ్చారు, 'మంచి వెన్నెలవేళ' అనే పేరుతో. ముప్పై కథలకి తోడు, ముందు, వెనుక మాటలు, ప్రతి కథకీ ఆ కథ కోసమే రచించారేమో అనిపించే లాంటి రేఖాచిత్రాలతో కలిపి 262 పేజీల గ్రంధమయ్యింది. ఆకర్షణీయమైన ముఖచిత్రాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి.

రచయితల మొదటి సవాలు తమ రచనని పాఠకుల చేత చివరికంటా చదివించడం. చెబుతున్నది ఎవరికీ తెలియని కొత్త కథ అయినప్పుడు తర్వాత ఏంజరిగిందో తెలుసుకోడం కోసమైనా పేజీలు తిప్పుతారు లెమ్మన్న ధైర్యం ఉంటుంది. కానీ, అందరికీ తెలిసిందీ, జనబాహుళ్యంలో బాగా నలిగిందీ అయిన కథని 'చదివించేలా' చెప్పడం అన్నది కత్తిమీద సామే. ఈ కథ శ్రీకృష్ణ దేవరాయ విరచిత 'ఆముక్త మాల్యద' కాదు. కానీ, ఆ నాయిక నోచిన కాత్యాయనీ వ్రతాన్నే ద్వాపర యుగంలో గోపకాంతలు ఆచరించిన విధాన్ని వర్ణించేది. నెలకి మూడు వానలు కురవడం కోసం, రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం తమ రాజు నందగోపుని ఆదేశం మేరకు ఓ మార్గశిర మాసం నెల్లాళ్ళూ కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించారు రేపల్లె పడతులు. ఆ నందగోపుని కొడుకు శ్రీకృష్ణుడు మరెవరో కాదు, వాళ్లందరికీ బాల్య స్నేహితుడే.

మంచు వర్షంలా కురిసే మార్గశిర మాసంలో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి, యమునా నదిలో తలారా స్నానం చేసి, నదీ తీరంలోనే కాత్యాయనీ దేవి సైతక ప్రతిమని ప్రతిష్టించి, ఇళ్లనుంచి తెచ్చుకున్న పువ్వులతో పూజ చేసి, పొంగలి ప్రసాదం వండి, నివేదన చేసి ఆరగించి, గృహకృత్యాల నిమిత్తం బాలభానుడితో పాటే ఇల్లు చేరాలి. ఊళ్ళో పెళ్లి కాని ప్రతి పడుచూ, ప్రతి రోజూ ఈ పూజలో పాల్గొనవలసిందే. ఇంకా నిద్రలేవని చెలులని, వారి ముంగిట నిలిచి సుతారంగా నిద్రలేపడం, పూజకి కావాల్సిన సంబారాలని సమకూర్చుకోవడం అనే నిత్య కృత్యాన్ని ముప్పై కథలుగా అల్లాలంటే చాలా దినుసులు అవసర పడతాయి. ఇందుకోసం రచయిత్రి ఎంచుకున్నవి బాలకృష్ణుడి లీలా వినోదాలు, ఓ యుగం వెనక్కి వెళ్లి త్రేతాయుగం నాటి రామ కథలూను.  

సూక్ష్మంగా పరిశీలిస్తే చాలా కథల్లో ఒక్కో దానిలోనూ ఒక్కో రామాయణ గాధ, ఒక్కో కృష్ణలీల కనిపిస్తాయి. నాటి రాముడే నేటి కృష్ణుడనీ, రెండూ శ్రీ మహావిష్ణువు అవతారాలే అనీ గోప వనితలందరికీ తెలుసు. అయినా కూడా వాళ్లంతా అతడిని తమ జతగాడిగా చూస్తారు. ఎంతో చనువుని ప్రదర్శిస్తారు. అంతలోనే అతని దైవత్వం గుర్తొచ్చి కుంచించుకు పోతారు. 'ఏమీ తెలియని అమాయకపు గొల్లలం' అని వాళ్లలో వాళ్ళు మాట వరుసకు అనుకుంటారు కానీ, వాళ్లకి తెలియని విషయాలు లేవు. రామాయణం కంఠోపాఠం. కృష్ణలీలలెప్పుడూ నాలిక చివరనే ఉంటాయి. ఎవరితో ఎలా మాట్లాడాలో, కార్యసాధనకి అవసరమైన కిటుకులేవిటో బాగా తెలిసిన వాళ్ళు. వాళ్లలో వాళ్ళకి చిన్నచిన్న తగువులున్నా వ్రతం విషయానికి వచ్చేసరికి అందరూ ఒకటైపోతారు.

'భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించి...' అనే మాటని వ్రత పురోహితుల నోటి నుంచి వింటూ ఉంటాం. ఈ గోపికలు చేసే వ్రతంలో భక్తి కన్నా శ్రద్ధ పాలే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే నిత్యం నదికి వెళ్లి వచ్చేప్పుడు వాళ్ళు చెప్పుకునే కథల్లో రామకథల్ని భక్తిగానూ, కృష్ణ కథల్ని శ్రద్ధగానూ చెప్పుకోడం గమనించవచ్చు. లక్ష్యాన్ని చేరేందుకు భక్తి కన్నా శ్రద్ధ ముఖ్యమన్న సూచన ఉందా? అని సందేహం కలిగింది. ఓ సందర్భంలో ఈ అమ్మాయిలందరూ యశోదని కలిసేందుకు వెళ్లి "నీ పోలిక పుణికి పుచ్చుకున్న ఆ కృష్ణుడే మాకు దిక్కు. అతనికి మా విన్నపం చెప్పుకోవాలంటే నీ అనుమతి కావాలి. నిద్ర లేచి రావమ్మా" అని ప్రార్ధిస్తారు. దేవకీ నందనుడికి యశోద పోలికలు ఎలా సాధ్యం అన్నది ఇంకో సందేహం.

'అనల్ప' ప్రచురించిన ఈ పుస్తకానికి సుదీర్ఘమైన ముందుమాట రాశారు మోదుగుల రవికృష్ణ - స్వయానా ప్రచురణకర్త, అరుదైన పుస్తకాలు వెలుగు చూడడం వెనుక సూత్రధారి. వారి స్వగతమూ, జ్ఞాపకాలూ బాగున్నాయి కానీ ఈ రచనని గురించి మరికొంచం ప్రస్తావించి ఉంటే బాగుండేదనిపించింది. ఏకబిగిన ఈ పుస్తకాన్ని పూర్తి చేస్తే ఆ వెంటనే ఇంకేమీ చదవాలనిపించదు. చివరి పేజీల్లో ప్రచురణ కర్తలు ఇచ్చిన ప్రకటనలు పలుకురాళ్ళలా అనిపించింది అందుకేనేమో. "ఏ పదార్ధం ఎటు వడ్డించాలో తెలిసిన ఇల్లాలు, మక్కువతో తన మగనికి వడ్డించిన విస్తరిలా ఉంటుంది రేపల్లె" లాంటి ఉపమలు ఉప్మాలో జీడిపలుకులు. మొదలు పెట్టాక, ఆసాంతమూ ఆపకుండా చదివించేవి ఇవే. భక్తి పరులకి మాత్రమే కాదు, అందమైన వచనాన్ని ఇష్టపడే వారికీ కానుకివ్వదగిన ఈ పుస్తకం వెల రూ. 250. ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు. రచయిత్రి నుంచి మరిన్ని పుస్తకాల కోసం ఎదురుచూస్తూ.. 

బుధవారం, ఫిబ్రవరి 09, 2022

తూఫాన్ మెయిల్

'ముంబయి మహానగరంలో పేదల జీవితాలని చిత్రించిన కథలు' అనగానే తిండి, బట్ట, గూడు సమస్యల చుట్టూ అల్లిన కథలై ఉంటాయన్న ఆలోచన రావడం సహజం. ప్రముఖ కన్నడ రచయిత జయంత్ కాయ్కిణి  'తూఫాన్ మెయిల్' పేరుతో వెలువరించిన పదకొండు కథల సంకలనం (అనువాదం - రంగనాథ రామచంద్ర రావు) ఏ ఒక్క కథలోనూ ఈ మూడు సమస్యల్లో ఏ ఒక్కటీ చర్చకి రాలేదు. ఈ కథలన్నీ ఆసాంతమూ ఆసక్తిగా చదివిస్తాయి. చదవడం పూర్తి చేసిన తర్వాత పాఠకుల్ని ఆలోచనల్లో పడేస్తాయి. కనీసం కొన్నాళ్ల పాటు ఈ కథల్లో పాత్రలు, వాళ్ళ ప్రవర్తన, తీసుకున్న నిర్ణయాలు విడవకుండా గుర్తొస్తూనే ఉంటాయి. ఈ వెంటాడే లక్షణంతో పాటు, ఎంచుకున్న ఇతివృత్తాలు, కథల్ని చెప్పే పద్ధతీ కూడా ఈ సంకలనాన్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. 

కథల గురించి మాట్లాడుకోడానికి ముందు రచయిత గురించి చెప్పుకోవాలి. జయంత్ కాయ్కిణి ముంబయిలో 23 ఏళ్ళు బయో కెమిస్ట్ గా ఉద్యోగం చేసి, అటుపై బెంగుళూరు చేరి 'ఫ్రీలాన్సర్' గా రచనా ప్రస్థానం సాగిస్తున్నారు. సుమారు పాతిక కన్నడ సినిమాలకి పాటలు రాశారు. కొన్ని సినిమాలకి కథలు, మాటలు సమకూర్చారు. ఇవి కాకుండా ఐదు కవితా సంకలనాలు, ఆరు కథా సంకలనాలు, మూడు నాటకాలు వెలువరించారు. సాహిత్య కృషికి గాను గౌరవ డాక్టరేట్ తో సహా ప్రతిష్ఠాత్మక బహుమతులెన్నో అందుకున్నారు. ఉత్తమ సినీ గేయ రచయితగా నాలుగు 'ఫిలింఫేర్' ఆవార్డులున్నాయి ఈయన ఖాతాలో. చాలా కథలు ఆంగ్లంలోకి అనువాదం అయ్యాయి. తెలుగులోకి అనువాదం అయిన తొలి కథా సంకలనం ఇదే. స్వస్థలం ఉత్తర కర్ణాటక జిల్లాలోని గోకర్ణ.

ముంబయిలో అనాధలుగా పెరిగి, యుక్తవయసుకి వచ్చేసరికి చిన్న చిన్న ఉద్యోగాల్లో కుదురుకున్న పోపట్, అసావరి లోఖండే ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరూ కలిసి వాళ్ళ పెళ్లి శుభలేఖ డిజైన్ ని ఎంచుకోవడమే సంపుటంలో తొలి కథ 'నో ప్రెజెంట్స్ ప్లీజ్' ఇతివృత్తం. శుభలేఖ చిత్తుప్రతి రాసే సమయానికి వరుడు పోపట్ కి వధువు పేరు గంభీరంగా ఉన్నట్టు, ఆమె పేరు పక్కన తన పేరు తేలిపోతున్నట్టూ తోస్తుంది. "అసావరి, లోఖండే అంటే ఏకులం?" అని అడిగేస్తాడు. ఆమె ఉలికి పడుతుంది. ఇన్నాళ్లుగా ఎప్పుడూ వాళ్ళ మధ్య రాని ప్రస్తావన అది. రిమాండ్ హోమ్ లో పెరిగిన ఆ అమ్మాయికి తన కులమేమిటో తెలీదు. ఈ సమస్యని ఎలా అధిగమించాలో ఇద్దరికీ తెలియదు. ఇద్దరూ కలిసి ఆలోచన చేస్తారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు, వాళ్ళ జీవిత చిత్రణా వెంటాడుతుంది. 

పీయూసీ ఫెయిలైన ఛోటూ తాను చేసిన ఓ తప్పు కారణంగా ఇంట్లో నుంచి బహిష్కరించబడ్డాడు. ఆ తర్వాత తండ్రి మరణించాడు. తల్లికీ, పెద్దక్కకి ఛోటూ తిరిగొస్తే బాగుండునని ఉంటుంది. పన్నెండేళ్ళు గడిచినా అతను తిరిగి రాలేదు. వీళ్ళ అన్వేషణా ఆగలేదు. ఉన్నట్టుండి ఛోటూ ఫలానా చోట ఉన్నాడన్న ఆచూకీ తెలుస్తుంది పెద్దక్కకి. తీరా చూస్తే ఆ చోటు వీళ్ళుండే చోటుకి అరగంట నడక దూరం. ఇంతకీ ఛోటూ అక్కడ ఉన్నాడా అన్నది 'కనుమరుగైన అడవి' కథకి ముగింపు. పైకి ఆర్ధిక సమస్యలా కనిపించినా, ఈ కథలో దిగువ మధ్య తరగతి పాటించే విలువల్ని గురించి లోతైన చర్చ ఉంటుంది. ఒకరికొకరు ఏమీ కాని ఇద్దరు రూమ్మేట్ల కథ 'పార్ట్ నర్'. ఇద్దరి మధ్యనా విభేదాలు పొడసూపిన తరుణంలో జరిగిన ఓ అనూహ్య సంఘటన కథని మలుపు తిప్పుతుంది. మానవత్వపు పరిమళాన్ని వెదజల్లే కథ ఇది. 

గోకర్ణలో పుట్టి, ముంబయిలో పెరిగి, అక్కడి వ్యక్తిని పెళ్లిచేసుకున్నాక, అనుకోకుండా రాజకీయాల్లో చేరిన యువతి కథ 'భామిని సప్తపది'. సౌందర్యరాశి అయిన భామిని ఇంటా బయటా ఎదుర్కొనే సమస్యల మీదుగా సాగే కథ, సాగర తీరంలో ఆమె తీసుకునే నిర్ణయంతో ముగుస్తుంది. పెళ్లికాని నడివయసు సత్యజిత్ కథ 'అద్దం లేని ఊరిలో'. తనకో పెళ్లి సంబంధం రావడం సత్యజిత్ ని ఆశ్చర్య పరుస్తుంది. అనంతర పరిణామాలని నిశితంగా చిత్రించిన కథ ఇది. సంకలనానికి శీర్షికగా ఉంచిన 'తూఫాన్ మెయిల్' ఓ ఫైటర్ కథ. 'తూఫాన్' అనే వ్యక్తి సినిమాల్లో గ్లాస్ బ్రేక్ ఫైట్ సీన్లలో హీరోలకి డూప్ గా నటిస్తూ ఉంటాడు. అతని స్నేహితుడి భార్య మధువంతి సినిమాల్లో ఎక్స్ ట్రా డాన్సర్. సమాంతరంగా సాగే వీళ్ళ కథల్లో బాలీవుడ్ లో పనిచేసి కిందిస్థాయి కార్మికుల జీవన చిత్రణ ఉంటుంది. 

చికిత్స కోసం ఆస్పత్రిలో చేరి, పక్క వార్డులో తన చిన్న నాటి స్నేహితురాలిని కనుగొన్న వ్యక్తి కథ 'పొగడపూల వాసన'. ఆమె తాలూకు వాళ్ళు ఇతని గదికి వచ్చి ఆమెని మళ్ళీ కలవొద్దని చెబుతారు. ఎందుకు అన్నదే ఈ కథ. సర్కస్ లో మోటార్ సైకిల్ విన్యాసాలు చేసే మనిషి కథని 'బావిలో ఒక తలుపు' కథలోనూ, నడివయసులో ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి కథని 'గేట్ వే' లోనూ చిత్రించారు. 'టిక్ టిక్ మిత్రుడు' కథ టీవీ క్విజ్ షో నేపధ్యంగా సాగితే, చివరి కథ 'ఒపేరా హౌస్' మూత పడ్డ ఓ సినిమా హాల్లో పనిచేసే వారి కథని కళ్ళముందు ఉంచుతుంది. అనువాదం దాదాపు సరళంగానే సాగింది. 'అనల్ప' ప్రచురించిన ఈ 136 పేజీల పుస్తకం వెల రూ. 160. ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్లోనూ లభిస్తోంది. 

సోమవారం, ఫిబ్రవరి 07, 2022

ఆ 21 రోజులు

పేరున్న రచయిత (త్రు) లకి కూడా సాహితీ సృజనలో తీరని కోరికలుంటాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. కథా, నవలా రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మికి ఓ చిరు కోరిక ఇన్నాళ్లూ తీరకుండా ఉండిపోయింది. "అప్పట్లో ప్రముఖ రచయితలు ఏ వారానికి ఆ వారం రాసి ఇస్తారు అని తెలుసుకుని అలా నేనుకూడా రాయాలని సరదా పడ్డాను. కానీ ఎక్కడో దూరాన వుండటం వల్ల అది సాధ్యం కాదని గ్రహించాను" అన్నారు తన తాజా నవల 'ఆ 21 రోజులు' కి రాసిన ముందుమాటలో. రేపు పబ్లిష్ చేసే భాగాన్ని ఇవాళ రాయడం అన్న పద్ధతిలో ఫేస్ బుక్ మాధ్యమంలో ప్రచురించిన ఈ నవల తనకో కొత్త అనుభవం అన్నారు రచయిత్రి. నవలని ఆదరించిన పాఠకులే ప్రింటింగ్ బాధ్యతనీ తీసుకోవడం ఈ నవల ప్రత్యేకత.

పొత్తూరి విజయలక్ష్మి ఇతర రచనల్లో లాగానే ఈ నవలలోనూ నాయికది నాయకుడికన్నా బలమైన పాత్ర. స్పష్టంగా చెప్పాలి అంటే నాయిక పక్కన ఓ నాయకుడు ఉండాలి కాబట్టి శ్రీలలిత పక్కన శరత్ ఉంటాడు. ఈ శ్రీలలిత ఓ పల్లెటూళ్ళో పుట్టి పెరిగి అక్కడే పదో తరగతి వరకూ చదువుకున్న అమ్మాయి. తనని పెంచిన తాతయ్య కాలం చేయడంతో అనాధగా మిగిలి, తాతయ్య పనిచేసిన ఆలయంలోనే పనికి కుదురుకుంటుంది. అక్కడ ఊహించని సమస్య ఒకటి రావడంతో ఉన్నట్టుండి ఆ ఊరు విడిచిపెట్టాల్సి వస్తుంది. శరత్ ది కూడా పల్లెటూరే, అతనూ అనాథే. కాకపోతే అతనికి కాస్త భూవసతి ఉంది. వారసత్వంగా వచ్చిన మెట్టపొలంలో నేరేడు పళ్ళు పండిస్తూ పొట్ట పోసుకుంటూ ఉంటాడు.

పెళ్లీడుకొచ్చిన శరత్ కి సంబంధాలు చూసేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో తనే పేపర్లో ప్రకటన ఇచ్చుకుంటాడు. అనూహ్యంగా ఆ ప్రకటన శ్రీలలిత కళ్ళలో పడుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం వాళ్ళిద్దరికీ పెళ్లవుతుంది. 'రాగాలా.. సరాగాలా..' సంసారం ఓ ఆర్నెల్లు సాగాక కథలో ప్రధానమైన మలుపు (కుదుపు) వస్తుంది. పుట్టింది పల్లెటూరైనా, చదివింది పదో తరగతే అయినా బోల్డన్ని తెలివితేటలు, సమయస్ఫూర్తి, కించిత్తు సాహసం, బోలెడంత నోటిమంచితనం ఉన్న శ్రీలలితకి కూడా అది గడ్డు సమస్యే. ఆ సమస్యతో ఆమె పోరాటపు గడువు 21 రోజులు. ఇంతకీ ఆ పోరాటంలో ఆమె గెలిచిందా? అన్నది ఆపకుండా చదివించే ఈ నవలకి ముగింపు.

ముందుమాటల్లో హెచ్చరించినట్టుగానే ఇది హాస్య నవల కాదు. ఈ కథలో హాస్యానికి చోటు కూడా తక్కువే. అయినప్పటీ పాఠకులకి దరహాసాన్నిచ్చే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోలేదు రచయిత్రి. చిన్న చిన్న మాటవిరుపులు, పాత్రల మేనరిజాలు ఉపయోగించుకుని నవ్వించారు చాలాచోట్ల. కథ తాలూకు మొత్తం భారాన్ని నాయిక మీద మోపేయడం వల్ల నాయకుడికి బొత్తిగా చేసేందుకు ఏమీ స్కోపు లేకుండా పోయింది. 'సువర్ణ సుందరి' లో నాగేసర్రావులా ఈ నవలలో శరత్ ది పాసివ్ పాత్ర. సహాయ పాత్రలన్నీ ఆ సమయానికి వచ్చి నాయికకి తగురీతిలో సాయం చేసి వెళ్తూ ఉంటాయి. పైగా, వ్యవసాయాన్ని చాలా సులువైన విషయంగా చిత్రించడం వల్ల ఎక్కడా హీరో కష్టపడ్డట్టు అనిపించదు మనకి.

మనందరం ఓ నెగటివ్ ప్రపంచంలో బతుకుతున్నాం. తెల్లారి లేస్తే వినే, చదివే, చూసే వార్తల్లో నెగటివ్ వార్తలే అధికం. వీటి ప్రభావం కాబోలు, కొత్త మనుషులు తారసపడినా కాస్త అనుమానాస్పదంగానే చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో ఒకటి మినహా అన్నీ పాజిటివ్ పాత్రలే ఉన్న ఈ నవల ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. లోకంలో మంచితనం మిగిలే ఉందన్న భరోసానిస్తుంది. సంకల్పం బలమైనదైతే, ఆశావహ దృక్పధంతో ముందుకు వెళ్తే, ఫలితం తప్పక ఉంటుందన్న ఓ ధైర్యాన్ని ఇచ్చే రచన ఇది. ముందుగానే చెప్పుకున్నట్టు చదివించే గుణం పుష్కలంగా ఉన్న ఈ నవలని చదువుతున్నంత సేపూ లాజిక్ లని కూడా పక్కన పెట్టేస్తాం. చదవడం పూర్తి చేశాక 'నిజజీవితంలో కూడా ఇలాంటి మనుషులు కొందరుంటే ప్రపంచం మరింత అందంగా ఉండేది కదా' అని నిట్టూరుస్తాం. శ్రీ రిషిక పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ 111 పేజీల నవల వెల రూ. 125. ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ దొరుకుతోంది. 

శుక్రవారం, ఫిబ్రవరి 04, 2022

మనంమనం బరంపురం

ఇప్పుడంటే 'మీది తెనాలి మాది తెనాలి' అనే వాడుక బాగా వినిపిస్తోంది కానీ, ఒకప్పుడు 'మనం మనం బరంపురం' అనేవాళ్ళు ఇదే అర్ధానికి. ఒరిస్సాలో ఉన్న తెలుగు నేల బరంపురం. తెలుగు నేలతో, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో బరంపురానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు ప్రత్యేకం. తనదైన ప్రత్యేక సంస్కృతీ సాహిత్యాలు ఉన్న ఆ ప్రాంతం నుంచి యాభయ్యేళ్ల క్రితం వచ్చిన కథాసంకలనం 'మనంమనం బరంపురం'. అప్పుడే కొత్తగా పురుడు పోసుకున్న 'వికాసం' అనే పొట్టి పేరుగల వికాసాంధ్ర సాహితీ సంస్కృతీ సంవేదిక సంస్థ కొత్తగా కథలు రాసే వారిని ప్రోత్సహించే నిమిత్తం వెలువరించిన ఈ సంకలనాన్ని, సంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా గత సంవత్సరం పునర్ముద్రించారు. మొత్తం పదకొండు కథలున్న ఈ సంకలనం ప్రత్యేకత ఏమిటంటే ఈ కథలన్నీ ఆయా రచయిత(త్రు) ల తొలి(నాటి)కథలు.

సంకలనం చదవడం పూర్తి చేశాక మొదటగా స్పష్టమయ్యేది వస్తు వైవిధ్యం. ఇతివృత్తాలు వేటికవే భిన్నంగా ఉన్నాయి. అయితే, ఏ కథా కూడా బరంపురం కేంద్రంగా లేదు. కథాస్థలంతో నిమిత్తం లేని ఈ కథలన్నీ ఆసాంతమూ ఆపకుండా చదివిస్తాయి. కొన్ని కథలు ఇవాళ్టికీ సమకాలీనం అనిపిస్తే, మరికొన్ని కథలు గడిచిన కాలపు సమాజానికి రికార్డుగా అనిపిస్తాయి. విలువలు, కట్టుబాట్ల విషయంలో గడిచిన యాభయ్యేళ్ళ కాలంలో సమాజంలో వచ్చిన మార్పులని ఎత్తిచూపించే కథలివి. రెండు ప్రేమకథల్ని సమాంతరంగా నడిపిన గరికపాటి జగన్నాధరావు కథ 'నల్లకారు నవ్వింది' చదువుతుంటే ప్రేమ దక్కకపోతే ప్రేమించిన అమ్మాయిమీద ప్రతీకారం తీర్చుకోవాలనుకునే అబ్బాయిలు అప్పుడూ ఉన్నారన్న సత్యం బోధపడుతుంది. ఆ ప్రేమికుడి ఆలోచనల్లో మార్పు ఎలా వచ్చిందన్నదే కథ.

బి. ఎల్. ఎన్. స్వామి కథ 'బ్రహ్మవరం' లో కీలకమైన పాయింట్ ని 'జంబలకిడిపంబ' అనే హాస్య చిత్రంలో వాడేసుకున్నారు. కె. ఎల్. ప్రసాద్ 'నిశీధి నిజాలు' రెండు రౌడీ గ్యాంగుల మధ్య ఒక అమ్మాయి కోసం జరిగే కథ. పాయింట్ సినిమాటిక్ గా ఉండడం మాత్రమే కాదు, కథ ఆసాంతమూ సినిమాలాగే సాగుతుంది. చిట్టా వెంకటప్పయ్య శాస్త్రి రాసిన 'ఆడది ఆహ్వానించింది' కథలో పాయింట్ ని కూడా తర్వాతి కాలంలో వంశీతో సహా చాలామంది రచయిత(త్రు)లు వాడుకున్నారు. న్యాయపతి వేంకట సత్యనారాయణ మూర్తి కథ 'మీకంటే మీ నాన్నే నయం' నాటి మధ్యతరగతి ఇళ్లలో పెళ్లిచూపులు ప్రహసనాలని జ్ఞాపకం చేస్తుంది. బలమైన కథానాయిక పాత్ర ఈ కథ ప్రత్యేకత.

ఇప్పుడు మన సమాజం నుంచి దాదాపుగా అంతమైపోయిన కుష్టు వ్యాధిని ఇతివృత్తంగా తీసుకుని మాస్టర్ రవి (దేవరాజు వేంకట నరసింహారావు) రాసిన 'చెయ్యి దాటిపోలేదు' కథకి బెంగాలీ వాతావరణాన్ని అద్దారు. ఈ కథనం కూడా ప్రత్యేకమే, ముఖ్యంగా 'టీ' ని వాడుకున్న తీరు. వడ్డిన ఏకాంబరం 'చంపకం' ఓ ఆదర్శ ప్రేమికుడి కథ. బలమయిన నాయిక చంపకం గుర్తుండిపోతుంది. తాతిరాజు వెంకటేశ్వర్లు రాసిన 'సేతుబంధనం' ఇంకో ఆదర్శ ప్రేమికుణ్ణీ, అతని ప్రేమలో బోలుతనాన్నీ కళ్ళముందు ఉంచుతుంది. జొన్న వెంకటరమణ మూర్తి కథ 'టిట్టిభం' పేరులాగే ప్రత్యేకమైనది. రచయిత చెప్పాలనుకున్న విషయం పాఠకులకి మొదటినుంచీ అర్ధమవుతూనే ఉంటుంది. ఉపమలూ, ఉత్ప్రేక్షలూ ఎక్కువయ్యాయనిపించే కథ. కుమారి దేవి రాసిన 'ఎలా అర్ధం చేసుకునేది!' ఓ లేడీ డాక్టర్ కథ. కొత్తగా వైద్య వృత్తిలో చేరిన ఆమెకి ఎదురయ్యే ఒక అనుభవం ఆమెకే కాదు కథ చదువుతున్న పాఠకులకీ గుర్తుండి పోతుంది.

సంకలనంలో చివరి కథ బి. నిర్మలా రావు 'శిక్షింపబడని దోషులు' ఇంకో ఆదర్శ ప్రేమికుడిని మన ముందుంచుతుంది. ఆతని ప్రేమ విఫలం కావడానికి కారణం చిత్రంగా అనిపిస్తుంది. కాథానాయకుడి పాత్ర మీద సానుభూతి కలిగించేందుకు రచయిత ప్రయత్నించడం పాఠకుల దృష్టిని తప్పించుకోలేదు. ప్రముఖ కథా రచయిత అవసరాల రామాకృష్ణారావు సంకలన కర్తగా వ్యవహరించారు. తొలిముద్రణకి రాసిన ముందుమాటలో రచయితల్ని పరిచయం చేయగా, తాజా ముద్రణకి ముందుమాట రాసిన ఎమ్మెస్వీ గంగరాజు ఒక్కో కథనీ క్లుప్తంగా విశ్లేషించారు. "సంకలనానికి మీరిచ్చే మూల్యంలో సగభాగం వికాసం స్వర్ణోత్సవ సంబరాలకి విరాళంగా భావించండి" అన్నారు సేతుపతి ఆదినారాయణ. నాటి సంకలనానికి చంద్ర గీసిన ముఖచిత్రాన్నే ఇప్పుడూ వాడారు. జేవీ పబ్లికేషన్స్ వారి ముద్రణ బాగుంది, అచ్చు తప్పులు తక్కువే. మొత్తం 127 పేజీల ఈ సంకలనం వెల రూ. 150. ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు. 

బుధవారం, ఫిబ్రవరి 02, 2022

పేషన్

అరవింద్ జాషువా పేరు వినగానే  'గోదావరి' సినిమాలో కమలినీ ముఖర్జీ వేసుకున్న కాటన్స్ గుర్తొస్తాయి నాకు. ఈ కాస్ట్యూమ్ డిజైనర్ 'గోదావరి' కి ముందు, తర్వాత చాలా సినిమాలకి పనిచేసినా నాకు మాత్రం ఆ సినిమానే టక్కున గుర్తొస్తుందెందుకో. అరవింద్ జాషువా కేవలం డిజైనర్ మాత్రమే కాదు, రచయిత కూడా అని ఈమధ్యనే తెలిసింది. తన (తొలి?) నవల 'పేషన్' ని చదవడం ముగించగానే ఓ సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఫ్యాషన్, పేషన్ వినడానికి దగ్గరగా ఉండే పదాలు అవ్వడం వల్ల మాత్రమే కాదు, పేషన్ ఉన్నవాళ్లు తప్ప ఫ్యాషన్ రంగంలో నిలదొక్కుకోలేరని బలంగా చెప్పేందుకే నవలకి ఈ శీర్షికని ఎంచుకున్నారేమో అనిపించింది. ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ లో చేరేందుకు కథానాయకుడు ప్రయాణం అవ్వడంతో మొదలయ్యే కథ, ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ గా ఓ ఫైవ్ స్టార్ హోటల్ లాబీలో కూర్చుని ప్రముఖ ఫ్యాషన్ పత్రిక జర్నలిస్టుకి ఇంటర్యూ ఇవ్వడంతో ముగుస్తుంది. 

ఎదుటివారి మీద వివక్ష చూపాలి అనుకునే వారికి ఎన్ని కారణాలైనా దొరుకుతాయి. పుట్టుక, శరీర వర్ణంతో మొదలు పెడితే పుట్టిన ప్రాంతం వరకూ కాదేదీ వివక్ష చూపేందుకు అనర్హం. చిన్న నాటినుంచీ తనకి సంబంధం లేని కారణాలకి వివక్షని రుచి చూసిన ఆదర్శ్ జాన్ హైదరాబాద్ లో ఉన్న ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో చేరాక ఎదుర్కొన్న అతిపెద్ద వివక్ష 'సౌత్ ఇండియన్'. ఫాకల్టీ మొదలు, మెజారిటీ విద్యార్థుల వరకూ ఉత్తరాది వారే ఉండే ఆ ఇన్స్టిట్యూట్లో దక్షిణాది విద్యార్థులు బహు తక్కువ. ఏలూరు పక్కన ఓ పల్లెటూళ్ళో మధ్యతరగతి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి, కేవలం డ్రాయింగ్ మీద అభిరుచితో ఎంట్రన్స్ రాసి తీవ్రమైన పోటీలో సీటు దక్కించుకున్న ఆదర్శ్ లాంటి వాళ్ళని అక్కడ వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అప్పటికే ఇంటర్మీడియట్ ఫెయిలయి ఉండడం, ఇంజనీరింగ్ లో సీటు రాకపోవడం, ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడలేక పోవడం వంటి న్యూనతలతో బాధ పడుతున్న ఆదర్శ్ కి తనని తాను నిరూపించుకోవడం అన్నది మొదటి సవాలు. 

కథానాయిక జారా (మొదటిసారి ఈ పేరు చదవగానే 'వీర్-జారా' సినిమాలో ప్రీతీ జింతా గుర్తు రావడం వల్ల కాబోలు, ఈ అమ్మాయి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ నాకు ప్రీతీనే కళ్ళముందు కనిపించింది) యూసఫ్ గూడా బస్తీలో పుట్టి పెరిగింది. పరదాని తప్పించడానికి ఒప్పుకోని ఇంట్లో నుంచి ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ వరకూ ఆమె చేసింది పెద్ద ప్రయాణమే. పైగా ఆమెది కూడా మధ్యతరగతి నేపధ్యం. వివక్ష ఆమెకీ కొత్త కాదు.  తన లాంటి వాడే అన్న భావన ఆమెని ఆదర్శ్ కి దగ్గర చేస్తుంది. మూడేళ్ళ కోర్సులో సగం గడిచేసరికి ఆదర్శ్ తన తెలివితేటలు, కష్టపడే తత్వంతో ఇన్స్టిట్యూట్లో తనని తాను నిరూపించుకుంటాడు. రెండో సగంలో ఆదర్శ్-జారా ల ప్రేమ ముదిరి పాకాన పడడంతో కాలేజీ కబుర్ల నుంచి రొమాన్స్ కి టర్న్ తీసుకుంది కథ. తొలిసగంలో ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్సిస్ట్యూట్ వర్ణన, అక్కడి జీవితం ఆపకుండా చదివిస్తుంది. చిరంజీవి తన కూతుర్ని కార్లో తీసుకొచ్చి దింపడం లాంటి చమక్కులు సరేసరి. హీరో ఓడిపోతున్న ప్రతిసారీ తమకి తెలియకుండానే 'కమాన్ ఆదర్శ్' అంటారు పాఠకులు కూడా. 

నవల చదవడం పూర్తి చేసాక నాక్కలిగిన మొదటి సందేహం 'ఇది సినిమా కోసం రాసిందా?' అని. రచయిత సినిమా మనిషి అయినందువల్ల మాత్రమే కాదు, కథ సాగిన తీరు సినిమా స్క్రీన్ ప్లే ని గుర్తు చేసింది. రెండో సగానికి వచ్చేసరికి 'ఇక్కడో పాటొస్తుంది' అనేసుకున్నా, సినిమా చూస్తున్నట్టుగా. సినిమా భాషలోనే చెప్పాలంటే, ప్రథమార్ధం 'అప్పుడే సగం అయిపోయిందా' అనిపించేంత వేగంగా సాగి, ద్వితీయార్ధం మొదట్లో కొంచం నెమ్మదించి, చివరికి వచ్చేసరికి మళ్ళీ పరిగెత్తించే కథనం. హీరో వంటి మీద నాయిక చేసిన 'లవ్ బైట్స్' వారాల తరబడి చెక్కుచెదరకుండా ఉండడం లాంటి 'సినిమాటిక్ లిబర్టీ' లని అక్కడక్కడా తీసుకున్నారు. ట్రైన్ సీన్తో మొదలు పెడితే రొమాంటిక్ సన్నివేశాలన్నీ కెమెరా కోసం రాసినట్టే ఉన్నాయి. బిపాసా బసు, డినో మారియోలని కథలో పాత్రల్ని చేయడం భలే సరదాగా అనిపించింది. ఫ్యాషన్ గురించి ఏకొంచం తెలిసిన వాళ్ళకైనా ఈ జంటని ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. 

ఆదర్శ్, జారా లు 1998 లో ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో చేరతారు. ఫ్రెషర్ బ్యాచ్ ఇనాగరల్ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ ని పరిచయం చేస్తూ "బ్రైడల్ వేర్ లో మన దేశం లోనే లీడింగ్ డిజైనర్ ఆయన. ఐశ్వర్య-బచ్చన్, కోహ్లీ- అనుష్క, కీర్తి అంబానీ వీళ్లందరి బ్రైడల్ వేర్ డిజైన్ చేసింది అభయ్ ఖోస్లానే అన్న విషయం మీకు తెలుసు" అంటారు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మహంతి. ఐశ్వర్య-బచ్చన్ పెళ్లి 2007 లోనూ, కోహ్లీ-అనుష్క ల పెళ్లి 2017 లోనూ జరిగింది. టైం స్టాంప్ తో రాసేప్పుడు ఇలాంటివి కొంచం చూసుకుంటే బాగుండేది. ఇంగ్లీష్ వాక్యాలని తెలుగులో రాసేప్పుడు స్పెల్లింగుని కాక, ఉచ్చారణని ఆధారం చేసుకోవాల్సింది. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఆదర్శ్ కి ఆశ్రయం ఇచ్చి,  కథనుంచి  ఉన్నట్టుండి మాయమైపోయిన ప్రవీణ్ మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తాడా అని చూశాను కానీ, కనబడలేదు. వచనం మీద యండమూరి ప్రభావం చాలాచోట్లే కనిపించింది. 

మొత్తంగా చూసినప్పుడు, ఫ్యాషన్ ప్రపంచం నేపధ్యంగా నవలలు తెలుగులో కొత్త కాకపోయినా (చల్లా సుబ్రహ్మణ్యం లాంటి రచయితలు తొంభైల్లో రాశారు) ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ విద్యార్థుల కథగా ఈ ఇతివృత్తం కొత్తది. మిగిలిన కోర్సుల కన్నా ఫ్యాషన్ టెక్నాలజీ చదవడం ఏవిధంగా భిన్నమో బలంగా చెప్పారు. ముఖ్యంగా టైం, డబ్బు రెండూ దగ్గర లేనివాళ్ళకి ఈ కోర్సు పూర్తి చేయడం ఎంత కష్టమో చెప్పిన విధానం బాగుంది. అదే సమయంలో, ఒక్కసారి విజయం సాధిస్తే కెరీర్లో ఎంత వేగంగా దూసుకెళ్లచ్చో కూడా చెప్పడం బాగా నచ్చేసింది. ఫ్యాషన్ టెక్నాలజీ చదవాలి అనుకునే వాళ్ళకి ఈ నవల రికమండ్ చేయొచ్చు అనిపించినా, రెండో సగంలో కనిపించే రొమాన్సు ఆలోచనలో పడేసింది - టీనేజర్స్ కి రికమెండ్ చేయొచ్చా? అని. ఛాయా పబ్లికేషన్స్ ప్రచురించిన (వాళ్ళ లోగోని కవర్ పేజీ మీద మరీ హీరో ముక్కున గుద్దేరు) ఈ 203 పేజీల పుస్తకం వెల రూ. 150. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు. విద్యార్థి జీవితాన్ని మాత్రమే ఈ నవలలో చిత్రించారు కాబట్టి, డిజైనర్ల ప్రొఫెషనల్ జీవితం ఇతివృత్తంగా అరవింద్ జాషువా మరో నవల రాస్తారని ఎదురు చూస్తున్నా. 

మంగళవారం, ఫిబ్రవరి 01, 2022

ది జర్నీ అఫ్ ఎ జర్నలిస్ట్

దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం మాట. కొంత విరామం తర్వాత 'ఆంధ్రజ్యోతి' పత్రిక తిరిగి ప్రారంభమైనప్పుడు నా మిత్రులొకరు అక్కడ ఉద్యోగంలో చేరారు. ఒకరోజు ఏదో మాట్లాడడం కోసం ఫోన్ చేశాను. ఇంకా లేండ్ లైన్ల కాలమే. మాటల మధ్యలో ఆవేళ వాళ్ళ పేపర్లో వచ్చిన ఒక వార్త బాగుందని చెప్పాను. "రాసినతను ఇక్కడే ఉన్నాడు, ఇస్తున్నా ఉండండి" అన్నారు. రిసీవర్ మార్పిడి జరుగుతూ ఉండగానే వార్తని మళ్ళీ ఓసారి చూస్తే రాసినతని పేరు కనిపించింది - కంభాలపల్లి కృష్ణ. ఆ తర్వాత అతన్ని కొన్ని టీవీ ఛానళ్లలో చూస్తూ వచ్చాను. ఇప్పుడు 'ది జర్నీ అఫ్ ఎ జర్నలిస్ట్' అనే పుస్తకం చూడగానే "ఇతను ఆత్మకథ రాసుకునేంత పెద్దవాడై పోయాడా అప్పుడే?" అనిపించింది. రాసిన విధానం వల్ల కావొచ్చు, ఎక్కడా ఆపకుండా చదవడం పూర్తి చేశాను. 

సూర్యాపేటలో పుట్టి పెరిగిన కృష్ణ, డిగ్రీ చదువుతూ ఉండగానే 'ప్రజాశక్తి' దినపత్రికలో ప్రూఫ్ రీడర్ గా ఉద్యోగ పర్వం ఆరంభించి, అటుపై అక్కడే సబ్-ఎడిటర్ గా మారి, అటు నుంచి ఆంధ్రజ్యోతి మీదుగా టీవీ నైన్లో చేరి అటు పైని అనేక టీవీ ఛానళ్లలో పని చేశారు. కెరీర్ మొదలు పెట్టి పాతికేళ్ళు పూర్తయిన సందర్భంగా రాసిన ఈ పుస్తకంలో కేవలం తన విషయాలు మాత్రమే కాకుండా, గడిచిన పాతికేళ్లలో దేశ, రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పులని ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ రావడం వల్ల జరిగిపోయిన పరిణామాలన్నీ ఒక్కసారి సింహావలోకనం చేసుకోడానికి ఉపకరించిందీ పుస్తకం. మరీ ముఖ్యంగా, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని నిశితంగా అక్షారబద్ధం చేసిన రచన ఇది. జరిగిన సంఘటనలన్నీ తేదీలతో సహా ఇవ్వడం వల్ల ఒక రెడీ రిఫరెన్సు గానూ పనికొస్తుంది. 

ఒకప్పుడు జర్నలిస్టుల్లో ఎక్కువమంది అన్ని రాజకీయ పార్టీలని సమదృష్టితోనూ, ఉద్యమాలని నిస్పక్షపాతంగానూ చూసేవారేమో. ఇప్పుడు ప్రతి పత్రికా, ఛానెలూ ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేదే కాబట్టి నిష్పక్షపాతాన్ని ఆశించలేం. పైగా ముందు మాటలోనే "నాకు జీతం ఇస్తున్న సంస్థలు రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తున్నా నేను మాత్రం ప్రత్యేక తెలంగాణకు 'జై' కొట్టాను" అని ప్రకటించారు కాబట్టి, లోపలి విషయాలు ఎలా ఉండబోతున్నాయన్న అంచనా సులువుగానే దొరికింది.  అయితే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఢిల్లీలో పని చేసే తెలుగు జర్నలిస్టుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి మీద, తెలంగాణ ప్రాంతం వారు భౌతిక దాడులు చేయడం లాంటి విషయాలనూ రికార్డు చేశారు. ఇవి వార్తల్లో కనిపించని వార్తలు. 

బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమం మొదలుకుని, తాను ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతి ఉద్యమాన్నీ ఈ పుస్తకంలో రికార్డు చేశారు కృష్ణ. ఎక్కడోతప్ప, రాగద్వేషాల జోలికి వెళ్లకుండా విషయాన్ని విషయంగా చెప్పేందుకే పుస్తకం అంతటా ప్రయత్నించారు. తాను కవర్ చేసిన రాజకీయాల మొదలు, తాను ఎదుర్కొన్న రాజకీయాల వరకూ చెప్పదల్చుకున్న ప్రతి విషయాన్నీ ఒకే టోన్ లో చెప్పడం పాఠకులని ఆకట్టుకుంటుంది. వృత్తి జీవితం తాలూకు మెళకువలు వేటినీ ప్రత్యేకించి చెప్పకపోయినా, కొన్ని కొన్ని వార్తలని తాను కవర్ చేసిన విధానాన్ని చెప్పే క్రమంలో జోడించారు. కొత్తగా జర్నలిజంలోకి వచ్చే వారికి ఈ మెళకువలు ఏమాత్రంగానైనా ఉపయోగపడొచ్చు. 

బ్రేకింగ్ న్యూసుల కోసం టీవీ వరకూ వెళ్లనవసరం లేకుండా సెల్ ఫోన్ల లోనే వార్తలు కనిపించేస్తున్న కాలంలో ఉన్నాం ఇప్పుడు. ఓ ఇరవై ఏళ్ళ క్రితం ఈ బ్రేకింగ్ న్యూసులు సంపాదించదానికి జర్నలిస్టులు ఎన్ని ప్రయత్నాలు చేసే వాళ్ళో చదివినప్పుడు టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తోందో కదా అనిపించక మానదు. తాను బ్రేక్ చేసిన వార్తల గురించి చెబుతూ 'మార్గదర్శి' వార్త ఎలా దొరికిందో వివరంగా చెప్పాడమే కాదు, ఆ కేసు ఇంకా సుప్రీం కోర్టులో పెండింగులో ఉందన్న అప్డేట్ నీ ఇచ్చారు. తీర్పు ఎలా వస్తుందన్నది ఆసక్తికరం. వైఎస్ హెలికాఫ్టర్ మిస్ అయినప్పుడు, మరణ వార్త తెలిసినా ఆధికారిక ప్రకటన వచ్చే వరకూ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేయలేకపోవడం, జగన్మోహన్ రెడ్డి పై కేసులు మొదలైన క్రమం లాంటి సంగతులన్నీ వార్తా ప్రసారపు దృష్టికోణం నుంచి చెప్పుకొచ్చారు. 

కొందరు రాజకీయ నేతలతో సన్నిహితంగా, అంతరంగికుడిగా మెలగడం, వాళ్లకి అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వడం ('ప్రజారాజ్యం' లో చేరొద్దని కాంగ్రెస్ నేత వీ. హనుమంత రావు కి) లాంటివన్నీ పుస్తకాన్ని ఆసక్తిగా చదివిస్తాయి. 'కారణాంతరాల' వల్ల వెలుగే చూడని వార్తల కబుర్లూ ఉన్నాయి. పాతికేళ్ల కాలంలో తెలుగు నాట రాజకీయాలు ఎన్నెన్ని మలుపులు తిరిగాయి, తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వాళ్ళ ఆకాంక్షలు, అప్పటి రాజకీయ సమీకరణాలు లాంటి విశేషాలని విహంగ వీక్షణం చేసేందుకు పనికొచ్చే పుస్తకం ఇది. క్లుప్తంగా రాసిన పుస్తకం కావడం, రాసిన విషయాల పట్ల ఆసక్తి ఉండటం వల్లనేమో ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసాంతమూ ఆసక్తిగా చదివించింది. భూమి బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ 160 పేజీల పుస్తకం వెల రూ. 100. అన్ని పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లయిన్ ద్వారానూ కొనుక్కోవచ్చు.