మంగళవారం, డిసెంబర్ 20, 2022

ఆలీతో సరదాగా

తెలుగునాట టాక్ షో లు కోకొల్లలు. అలనాటి దూరదర్శన్ మొదలు నిన్నమొన్ననే మొదలైన యూట్యూబ్ ఛానళ్ల వరకూ ప్రముఖుల ఇంటర్యూలు జరపని వాళ్ళు అరుదు. మనకి కళ అంటే సినిమాలు, సెలబ్రిటీలు అంటే సినిమావాళ్ళే కాబట్టి ఈ ఇంటర్యూల అతిధుల్లో అధికులు సహజంగా సినిమా వాళ్ళే. తగుమాత్రం సినీ సెలబ్రిటీలందరూ ఒకటికి మించి చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చిన వాళ్ళే. ఇన్నేసి ఇంటర్యూల మధ్య తనదైన ప్రత్యేకతని నిలుపుకుంటూ దాదాపు ఏడేళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగి మూడు వందల ఎపిసోడ్లతో ముగిసిన కార్యక్రమం 'ఆలీతో సరదాగా'. అనేకానేక టాక్ షోలు నడుస్తూ ఉండగా ఈ కార్యక్రమాన్ని గురించి మాత్రమే మాట్లాడుకోడం ఎందుకూ అంటే, దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి. 

ఏ కార్యక్రమం రక్తి కట్టాలన్నా ముఖ్యంగా ఉండాల్సింది 'తగినంత నిడివి'. దూరదర్శన్ తొలినాళ్లలో చేసిన ఇంటర్యూల నిడివి పావుగంట, ఇరవై నిముషాలు మించి ఉండేది కాదు. బహుశా రేడియో ఇంటర్యూలకి కొనసాగింపుగా ఈ పద్దతి పాటించి ఉంటారు. ఇంటర్యూ కోసం ఎదురు చూసినంత సేపు పట్టేది కాదు, శాంతి స్వరూపో, విజయదుర్గో "చాలామంచి విషయాలు చెప్పారండి, నమస్కారం" అనడానికి. తర్వాత్తర్వాత వాళ్ళూ నెమ్మదిగా సమయం పెంచడమే కాకుండా, రెండు మూడు ఎపిసోడ్లుగా ప్రసారం చేయడం అలవాటు చేసుకున్నారు. శాటిలైట్ చానళ్ళు జెమినీ, ఈటీవీల్లో కూడా తొలినాటి ఇంటర్యూల నిడివి అరగంట మాత్రమే ఉండేది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో పదిహేను పదహారు గంటల సుదీర్ఘ ఇంటర్యూలు కూడా కనిపిస్తున్నాయి, ఇది మరీ అతివృష్టి. 

ఏదైనా విషయం మీద మనం ఫోకస్ చేయగలిగే గరిష్ట సమయం నలభై ఐదు నిమిషాలని, అందుకే హైస్కూల్, కాలేజీల్లో ఒక్కో పీరియడ్ నిడివి నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుందనీ అంటారు. ఆ లెక్కన చూసినప్పుడు ఈ 'ఆలీతో సరదాగా' షో నిడివి ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ కి సరిగ్గా సరిపోయేంత మాత్రమే. కనీసం ఒక్క ఎపిసోడ్ కూడా నేను టీవీలో ప్రసారం అవుతుండగా చూడలేదు కాబట్టి ఎన్ని బ్రేకులు ఇచ్చేవారో తెలియదు. ఈ ఇంటర్యూలని చూసింది, విన్నది యూట్యూబ్ లోనే. గెస్టులు మరీ బోరింగ్ అనిపిస్తే ఆ ఎపిసోడ్ల జోలికే పోలేదు తప్ప, మొదలు పెట్టి మధ్యలో ఆపేసినవో, స్కిప్పులు కొడుతూ చూసినవో లేనేలేవు. ఆ విధంగా గెస్టులూ, హోస్టూ కూడా నన్ను ఎంగేజ్ చేశారు. 

నవతరం ప్రేక్షకులకి బొత్తిగా తెలియని గెస్టులని వాళ్ళకి పరిచయం చెయ్యాలి, బాగా తెలిసిన వాళ్ళని గురించి కొత్త విషయాలు చెప్పాలి. ఈ రెండూ టాక్ షో లకి ప్రధానమైన సవాళ్లు. మూడొందల మంది గెస్టుల్లో ఓ పాతిక ముప్ఫయి మంది మినహా మిగిలిన అందరితోనూ కలిసి పనిచేసిన అనుభవం ఉంది ఆలీకి. ఆ అనుభవం ఈ షో కి చక్కగా ఉపకరించి ఆయా ఎపిసోడ్లు లైవ్లీ గా రావడానికి సహకరించింది. ఉదాహరణకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనేక ఇంటర్యూలు ఇచ్చినా, ఆలీ ఇంటర్యూ ఇప్పుడు చూసినా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రశ్నలు దాదాపు అందరూ అడిగేవే. కానీ, సంభాషణలో కనిపించే ఆత్మీయత వెనుక ఉన్నది వ్యక్తిగత అనుబంధమే. చాలామంది అతిధుల విషయంలో ఈ అనుబంధం చక్కగా పనిచేసింది 

అతిధులకీ, షో చూసే ప్రేక్షకులకి కూడా హాయిగా అనిపించే మరో విషయం అలీ చూపించే హంబుల్ నెస్. పెద్దవాళ్ళ ముందు కాస్త ఒదిగి ఉండడం మాత్రమే కాదు, తనకన్నా వయస్సులోనూ హోదాలోనూ చిన్నవాళ్ళని ఇంటర్యూ చేసినప్పుడూ ఎక్కడా అతిచనువు ప్రదర్శించక పోవడం ఈ షో ని ప్రత్యేకంగా నిలిపింది. ఎటు చూసినా అతి చనువు ప్రదర్శించాలని తహతహలాడే హోస్టులే కనిపిస్తూ ఉండడం వల్ల కావొచ్చు, ఈ ప్రత్యేకత మరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రారంభ ఎపిసోడ్లలో గెస్టులని వ్యక్తిగతమైన ప్రశ్నలు గుచ్చి గుచ్చి అడిగి ఇబ్బంది పెట్టినా, తర్వాత్తర్వాత అలాంటి ప్రశ్నల విషయంలో జాగ్రత్త పడడం కనిపించింది. అయితే, ఏదో వంకన గెస్టుల చేత ప్రయత్నపూర్వకంగా కన్నీళ్లు పెట్టించడం మాత్రం ఓ దశలో విసుగు తెప్పించింది. 

గెస్టుల గురించి సరే, ఆలీ గురించి కూడా అనేక విషయాలు తెలుసుకోడానికి ఈ షో ఉపకరించింది. అంతకు ముందు ఆలీ గురించి తెలిసింది తక్కువ. సినిమా ఫంక్షన్లకి యాంకరింగ్ చేస్తూ హీరోయిన్లని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లాంటి కాంట్రవర్సీలు అప్పటికే ఉన్నాయి. అతను పెద్దగా చదువుకోలేదనీ, సినిమా తప్ప మిగిలిన ప్రపంచం పెద్దగా తెలీదనీ తెలిసింది ఈ షో వల్లనే. ఎలాంటి బేక్ గ్రౌండూ లేకుండా సినిమాల్లోకి వచ్చి నలభయ్యేళ్ళ పాటు నిలదొక్కుకోవడం, కొనసాగుతూ ఉండడం మామూలు విషయం కాదు. మరీ ముఖ్యంగా, 'హీరో' ముద్ర పడ్డాక మళ్ళీ వెనక్కి వచ్చి మామూలు కమెడియన్ అయిపోవడమూ పెద్ద విషయమే. పాత ఎపిసోడ్లని కుదించి యూట్యూబ్ లో పెడుతున్నారు ఎందుకో. వాటిని ఉన్నఫళంగా ఉంచితే బాగుంటుంది. 

6 కామెంట్‌లు:

  1. మురళి గారు,
    బాగానే వ్రాసారు.
    ఎవరి అభిరుచులు, అభిప్రాయాలూ వారివి. అయితే ఏమనుకోకండి గానీ హాస్యాస్పదమైన (ఇంత కన్నా ఘాటైన పదం వాడడం ఇష్టం లేదు) టీవీ ప్రోగ్రాముల్లో ఇది మొదటి వరసలో ఉంటుందని నా నిశ్చితాభిప్రాయం. రెండు కారణాలు.

    (1). ఎవరినైతే ఆహ్వానించారో వారితో వ్యక్తిగతమైన కబుర్లు, వారిద్దరికి మాత్రమే తెలిసిన / పరిమితమైన విశేషాలు వారి డ్రాయింగ్ రూములో కూర్చుని చెప్పుకుంటున్నట్లు ఉంటుంది ఆ షో 90%. వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే అటువంటి విశేషాల పట్ల బయటివారికేమిటి ఆసక్తి? ఈ కాలంలో సినిమా వాళ్ళంటే ఎంత పిచ్చి పెరిగి పోయినప్పటికీ (దీనికి కూడా టీవీ వాళ్ళు సినిమాలకు నిరంతరం ఇస్తున్న విపరీతమైన పబ్లిసిటీయే 90% ముఖ్య కారణం అని నాకనిపిస్తుంది) మరీ అంత సూక్ష్మాతి సూక్ష్మమైన పర్సనల్ వివరాలు మనకు అవసరమా? ఫలానా షూటింగులో ఫలానా వారు మీతో ఇలా అన్నారట, అప్పుడు మీకు ఏం ... ఏం ... అనిపించింది / ఓసారి అవుట్ డోర్ కు మనమంతా ఊటీ వెడుతుంటే మధ్య దారిలో కారు చెడిపోయింది కదా, అప్పుడు మీరు ... మీరెలా ఫీలయ్యారు -- ఇటువంటి విశేషాల గురించి మాట్లాడటమా పబ్లిక్ ప్రోగ్రాం? హు కేర్స్? ఎవరికి కావాలి ఇదంతా? ప్రజల్లో సినిమాల పట్ల క్రేజ్ ను అంతకంతకూ పెంచడం, ఏ మాత్రం తగ్గకుండా చూసుకోవడం మాత్రమే ఇటువంటి షోల ప్రధాన ప్రయోజనంగా ఒక లక్ష్యం పెట్టుకున్నారేమో అనిపిస్తుంది నా మటుకు. దీన్నంతా ప్రైం టైం లో మనం గంటసేపు భరించాలా? పైగా మీరు కరక్ట్ గా చెప్పినట్లు అతిధిని ఏడిపించకుండా వదలక పోవడం మరొక చిరాకు కలిగించే అంశం. వెరసి చాలా హాస్యాస్పదమైన ప్రయత్నం ఈ షో. అందుకే నేనింక చూడడం మానేశాను.

    (2). ఆలీ తన అహంకారాన్ని, ఎదుటి వారి పట్ల చిన్నచూపుని ఒకసారి వేదిక మీద బయటపెట్టుకున్నాడు. ఆ ప్రోగ్రాం నేను టీవీ మీద చూడడం తటస్ధించింది (ఏ ప్రోగ్రాం, ఏ సందర్భం, ఎప్పుడు అన్నది సరిగా గుర్తు లేదు). ఈయన గారు మైకు పట్టుకుని మాట్లాడుతూ ఘాటైన రివ్యూ వ్రాసిన ఒక వ్యక్తిని ఉద్దేశించి సినిమా బాగుంది బాగులేదని చెప్పడానికి నువ్వు ఎవడవురా గొట్టాం గాడివి లాంటి మాటలు మాట్లాడాడు. అది విని నాకు మహా చిరాకనిపించింది. పేరు, డబ్బు సంపాదించుకున్నాడు మంచిదే, దానితో పాటు నలుగురిలో మాట్లాడే పద్ధతి కూడా అలవర్చుకోవాలిగా?

    వ్యక్తిగతంగా నాకేమీ సదభిప్రాయం లేనివి ఇటువంటి షో లు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇందులో అనుకోడానికి ఏముందండి? ఫిర్యాదులు లేకపోలేదు కానీ, మిగిలిన టాక్ షో లతో పోల్చినప్పుడు నాకిది ఆర్గనైజ్డ్ గా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.. 

      తొలగించండి
  2. బాగా వ్రాశారు మురళి గారు. ఈ కార్యక్రమం 350 సంచికలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమే . మీరు చెప్పినట్లు over a period of time, ఆలీ హుందాగా నిర్వహిస్తూ వచ్చాడు. ఎంతో మంది active, retired కళాకారులను పిలిచి వారితో ఎన్నో సంగతులు, అనుభవాలు ముచ్చటించడం చాలా వరకు ఆసక్తికరం గానే ఉండింది. ముచ్చర్ల అరుణ, అర్చన వంటి వారిని చూశాము. అహంకారంతో అతిథులను పూర్తిగా మాట్లాడనివ్వకుండా తనకే అన్నీ తెలుసు అనుకుని ఇరిటేట్ చేసే హృదయం తెరిపించే టాక్ షో ల కంటే ఆలీతో సరదాగా మంచి కార్యక్రమం. బాలుగారి ఎపిసోడ్ చక్కగా ఉండింది.

    రిప్లయితొలగించండి
  3. విన్నకోట వారు అన్నట్లు సినీప్రముఖుల వ్యక్తిగత (సినీ/జీవిత) విశేషాలు తెలుసుకోవటం నిష్ప్రయోజనం - సమయం వృథాచేయటం మాత్రమే. అందుచేత, ఇటువంటి షోలు హాస్యాస్పదమే. ఐతే ఒక విషయం. సమకాలీనప్రపంచంలో విలువల కన్నా వినోదాలకే పెద్దపీటగా ఉంది. ముఖ్యంగా మన తెలుగుప్రజల దృష్టిలో ముఖ్యమైనవి (౧) సినీమాలు (౨) రాజకీయాలు (౩) క్రీడలు - ఇవి ఇచ్చే ఫ్రీవినోదం. అంతే. మీరు ఒక షోను ప్లాన్ చేయండి చూదాం తెలుగుప్రముఖులు అని చెప్పి - కేవలం తెలుగువారిలో ప్రసిధ్ధులైన విద్యావేత్తలనూ శాస్త్రజ్ఞులనూ పండితులనూ స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తులనూ నిజమైన ప్రజసేవచేస్తున్న వ్యక్తులనూ - మీషోకు ఒక్కడంటే ఒక్కడూ స్పాన్సర్ దొరకడు. ఒక్కటంటే ఒక్కఛానెల్ కూడా ముందుకు రాదు. మీరే ఏదో రకంగా అదంతా ఏర్పాటు చేసినా సరే - వినండి - ఒక్క ఎపిసోడ్ కూడా జనం చూడనే చూడరు! ఎల్లా ప్రగ్గడ సుబ్బారావు గారి గురించి చెప్పినా త్యాగరాజస్వామి గురించి చెప్పినా సరే ఎవరికీ పట్టదు. అందుచేత ఈవినోదాల షోలు అన్నీ జనం వేలవెఱ్ఱి మీద ఆధారపడి నడిచే చెత్త ప్రోగ్రాములు అని మనం నమ్మవచ్చు. వీటి గురించి మాట్లాడుకోవటం కూడా సమయం వృధాచేయటమే నండి.

    రిప్లయితొలగించండి