ఆదివారం, డిసెంబర్ 15, 2019

గజ్జె ఘల్లు మన్నదో ...

"వంగతోటెంతొ బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించి పో.. 
కొత్త కవ్వి౦త పుట్టించి గల్ల౦తు చేసేసి వేడిక్కిపో.. వేధించుకో.. వేటాడుకో.."

ఓ అమ్మాయి మావిడిపండులా ఉండే తన మేనమామతో ప్రేమలో పడింది. ఆ మేనమామకి ఆ అమ్మాయి మీద బొత్తిగా అలాంటి అభిప్రాయం లేదు. వాళ్ళుండేది కృష్ణా జిల్లాలో ఓ పల్లెటూళ్ళో. వాళ్ళిద్దరికీ ఓ శృంగార ప్రధానమైన యుగళగీతం రాయాలి (నిజానికి రెండు). దర్శకుడు శరత్ సందర్భం చెప్పారు. సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి ట్యూన్ ఇచ్చారు. 'బావ-బావమరిది' (1993) సినిమా కోసం వేటూరి రాసిన పాట ఇలా మొదలైంది: 

"గజ్జె ఘల్లు మన్నదో గుండే ఝల్లు మన్నదో.. 
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో.. 
తట్టుకో తడే తమషా.. ఇచ్చుకో ఒడే మజాగా..
లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే.. 
సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది నన్నంటుకో.. చిన్నింటిలో.. జున్నంటుకో.."



'సిరిసిరిమువ్వ' సినిమాలో 'గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది..' అంటూ తాను రాసిన పల్లవినే మరో అర్ధంలో ఉపయోగించారు వేటూరి. ఇక్కడ నాయకుడు ఎద్దుబండి మీద తిరిగే రైతు. ఆ బండి తాలూకు గజ్జెల శబ్దం వినిపించిందంటే అతను వస్తున్నాడని అర్ధం. ఆమె గుండె ఝల్లుమనడం సహజం. అతనికేమో ఆమె కాలి అందెల సవ్వడి వినిపిస్తూ ఉంటే గుండె ఝల్లుమంటోంది, జరగబోయే తతంగాన్ని తల్చుకుని. 'గుట్టు చప్పుడు కాకుండా' అనే వాడుకని, గుట్టు చప్పుడయింది అని చెప్పడం సందర్భోచితమే. శృంగార ప్రధాన గీతాల్లో జున్ను ప్రస్తావన తేకుండా ఉండరు వేటూరి, పైగా ఇక్కడ నాయికా నాయకులవి వ్యవసాయ ప్రధానమైన కుటుంబాలు కూడా. ఇక తొలి చరణానికి వస్తే: 

"ఒంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనె సంపంగి కంచాలు.. 
ఒళ్లంటుకుంటేనె ఝల్లంటు పుట్టేను వయ్యారి గంధాలు.. 
నీ గాలికే పైట మేఘాలు కమ్మేను సాయంత్ర వేళల్లో.. 
నీ చూపుకే ఊపు ఉయ్యూరు దాటేను ఉల్లాస లీలల్లో.. 
గుత్తమైన గుమ్మ౦దమూ.. వత్తుకున్న వడ్డాణమూ.. గంట కొట్టె కౌగిళ్ళలోనా.. 
మువ్వగోపాల రమ్మంది ముద్దిచ్చి పొమ్మంది మువ్వెన్నడో.. 
జివ్వు జివ్వంటు నా గువ్వ గూడెక్కి కూసింది నీ కోనలో.. నీరెండలో.. నీ గుండెలో.."

శృంగారంతో పాటు స్థానీయతని కూడా పాటలో మేళవించారు వేటూరి. ఊపు ఉయ్యూరు దాటడం, మువ్వగోపాలుణ్ణి మువ్వ (మొవ్వ) ముద్దిచ్చి పొమ్మందనడమూ ఈ కోవలోవే. (మువ్వగోపాల పదాలు రాసిన క్షేత్రయ్య స్వస్థలం కృష్ణా జిల్లాలో మొవ్వ గ్రామం అంటారు పరిశోధకులు, ఆ మొవ్వని మువ్వ అనడమూ కద్దు). రెండో చరణానికి వచ్చేసరికి, నాయికా నాయకులు కూడా రెండో దశకి వచ్చేశారు: 

"చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మ లాడేను నీ గోరువంకల్లో.. 
చీరంటు సిగ్గుల్లొ ఛీ పోలు రేగేను నా పూల సంతల్లో.. 
కొండమ్మ కోనమ్మ కోలాటమాడేను నీ రూపురే్ఖల్లో.. 
ఆడున్న యీడమ్మ ఈడొచ్చి కుట్టేను నీ వాలుచుపుల్లో.. 
పంచదార పందిళ్ళలో.. మంచు తేనె సందిళ్ళలో.. పాలు పంచుకోరా నా ప్రాయం.. 
వంగతోటెంతొ బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించి పో.. 
కొత్త కవ్వి౦త పుట్టించి గల్ల౦తు చేసేసి వేడిక్కిపో.. వేధించుకో.. వేటాడుకో.."

బుగ్గలు ఎరుపెక్కడం సహజమే కానీ, పక్షులు వాటిని పూలుగానో పళ్ళు గానో భ్రమించేంతగా ఎరుపెక్కాయని చెప్పడం ఆమె విరహ తీవ్రతకు చక్కని ప్రతీక. అతనిలో పురుషుడికి ఆమెలో ప్రకృతి (కొండా కోనా) కనిపించింది. ఆడున్న (అక్కడ ఉన్న) యీడమ్మ (వయసు) ఈడొచ్చి (ఇక్కడికొచ్చి) కొట్టేను అంటూనే, వాలుచూపుల్లో అని ముక్తాయించారు. పాలు-తేనే, పాలూ-నీళ్ళూ, పాలూ-పంచదారా.. ఇవన్నీ ఆలుమగలు ఎలా ఉండాలో చెప్పడానికి వాడే ఉపమలు. లావాదేవీల గురించి మాట్లాడేప్పుడు 'ఎక్కడైనా బావ కానీ, వంగతోట దగ్గర కాదు' అంటూ ఉంటారు. ఆ వాడుకని యుగళగీతంలోకి తేవడం వేటూరికే చెల్లు. 

బాలూ చిత్ర పోటీ పడి పాడిన ఈ పాటని సుమన్-మాలాశ్రీ లపై చిత్రీకరించారు. ఈ సినిమా విజయంలో పాటలది ప్రధాన పాత్ర. (నిజానికి ఇదే సినిమాలోని మరో యుగళ గీతం నాక్కొంచెం ఎక్కువ ఇష్టం. కానీ, బ్లాగ్ మిత్రులు పరుచూరి వంశీకృష్ణ మొదటగా నేనీ పాటని గురించే టపా రాసేలా చేశారు!)

గురువారం, డిసెంబర్ 12, 2019

గొల్లపూడి ...

నటుడు, రచయిత, పాత్రికేయుడు గొల్లపూడి మారుతి రావు ఇక లేరు. ఎనభయ్యేళ్ళ జీవితంలో తనకి కావాల్సినవన్నీ స్వయంకృషితో సాధించుకున్నారు. కష్టాలకి కుంగిపోకుండా, పొగడ్తలకి పొంగిపోకుండా జీవితం గడిపిన గొల్లపూడికి తీరకుండా మిగిలిపోయిన కోరికలు బహుకొద్ది. మొదట రచయితగానూ, ఆ తర్వాత నటుడిగానూ ఆయన పరిచయం నాకు. అయితే, ఆయనలోని రచయితే నన్నాయనకు ఏ కొద్దో దగ్గర చేసింది. గడిచిన పది-పన్నెండేళ్ల  కాలంలో జరిగిన మూడు సమావేశాల్లోనూ అనేక విషయాలు చర్చకి వచ్చినా, ఎక్కువగా మాట్లాడుకున్నది సాహిత్యాన్ని గురించే. 

గొల్లపూడిని గురించి ఆగి, ఆలోచించిన సందర్భం 'సాయంకాలమైంది' నవల చదివినప్పటిది. పదిహేనేళ్ల క్రితం ఒక రాత్రివేళ ఆ నవలని చదవడం మొదలు పెట్టి, తెల్లవారు జాముకి పూర్తి చేసి, చివరి పేజీ నుంచి మళ్ళీ మొదటి పేజీకి వచ్చి వెనువెంటనే రెండో సారి చదవడాన్ని జీవితంలో మర్చిపోలేను. అప్పుడు నేనున్న పరిస్థితుల వల్ల కావొచ్చు, నచ్చాల్సిన కన్నా ఎక్కువగా నచ్చేసిందా పుస్తకం. సమస్యల్లో ఉన్నప్పుడు పుస్తకాలని ఆలంబన చేసుకోడం నాకు కొత్త కాకపోయినప్పటికీ, ఆ పరిస్థితులు, ఆ పుస్తకం పూర్తిగా వేరు. ఆ తర్వాత నా వ్యక్తిగత  జీవితంలో వచ్చిన కొన్ని మార్పుల వెనుక కూడా ఆ పుస్తకం ప్రత్యేక పాత్ర పోషించింది, అందుకు కూడా నాకు 'సాయంకాలమైంది' ప్రత్యేకం. 

ఇంతకీ, 'సాయంకాలమైంది' నవలని కంఠతా పట్టి, చుట్టూ ఉన్న అందరిచేతా చదివిస్తున్న కాలంలో గొల్లపూడిని కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. తిరుపతిలో జరిగిన ఓ సాహిత్య సభకి ఆయన అతిధిగా వచ్చినప్పుడు, ముగ్గురు మిత్రులం హోటల్ గదిలో కలిశామాయన్ని. ఆయన, అయన భార్య శివాని (అసలు పేరు శివకామసుందరి అని జ్ఞాపకం) కూడా మేమాయన్ని ఓ సినిమా నటుడిగా కలవడానికి వచ్చామని అనుకున్నారు. మూడు నాలుగు గంటల పాటు జరిగిన మా సంభాషణలో ఒక్క సినిమా కబురూ దొర్లలేదు. అసలు 'సాయంకాలమైంది' ని దాటి మరో విషయం వైపే వెళ్ళలేదు. ఆ నవల్లో కొన్ని పాత్రలు, సన్నివేశాలు ఎలా పుట్టాయో ఆయన చెబుతుంటే నిబిడాశ్చర్యంతో విన్నాం మేం ముగ్గురం. (వాటిలో కొన్నివిషయాలు తర్వాత ఇంటర్యూలలో చెప్పారు. మరికొన్ని ప్రయివేటు సంభాషణల్లో తప్ప పంచుకునేందుకు వీల్లేనివి).  


విశాఖపట్నంలో తమ పొరిగింటాయన విదేశంలో ఉండే కూతురి ఫోన్ కోసం ఎదురు చూడడాన్ని సుభద్రాచార్యులు, రేచకుడు పాత్రల కోసం ఉపయోగించుకున్నానని, శివాని గారి మేనమామ ఆయన భార్యకి అక్షరాలు నేర్పించిన విధానాన్నే జైల్లో నవనీతం రామకోటి రాయడంగా మర్చి రాశానని చెప్పారు గొల్లపూడి. ఆ సాయంత్రం ఎక్కువ చర్చ జరిగింది మాత్రం 'ఆండాళ్ళు' పాత్రని గురించే. ఆండాళ్ళు, కూర్మయ్యని పెళ్లి చేసుకోడానికి మరికొన్ని బలమైన సన్నివేశాలు సృష్టించి ఉండాల్సింది అన్నాం మేము. శివాని గారు కూడా మాతో ఏకీభవించారు. నవల్లో అచ్చుతప్పులే కాక, కథాపరంగా కూడా కొన్ని తప్పులున్నాయని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. (అప్పుడు మేం చదివింది జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు ప్రచురణ. తర్వాత విశాలాంధ్ర ప్రచురించింది, మరిన్ని అచ్చు తప్పులతో). 

సుభద్రాచార్యుల అంతిమ సంస్కారం మొదలు జయవాణి ఉద్యోగం వరకూ వరుసగా చెప్పుకొచ్చాం మేము. అన్నీ శ్రద్ధగా విని, తన మెయిల్ ఐడీ ఇచ్చి, మేము చెప్పినవన్నీ మెయిల్ రాసి తనకి పంపితే, రీప్రింట్ లో సరిచేస్తానన్నారు. (మేము మాట నిలబెట్టుకున్నాం కానీ, ఆయన నిలబెట్టుకోలేదు). "ఎర్రసీత అని నా కొత్త నవల. సాయంకాలమైంది కన్నా బావుంటుంది. తప్పకుండా చదవండి," అని చెబుతూ మాకు వీడ్కోలిచ్చారు. రెండో మాట నన్ను బాగా పట్టుకుని, వెంటనే కొని చదివాను. నచ్చలేదు. ఆయన పెట్టిన పోలిక అంతకన్నా నచ్చలేదు. మొదటి సమావేశం జరిగిన ఐదారేళ్ళ తర్వాత రెండో సమావేశం. కొత్తగా మాట్లాడుకోడానికి ఏముంటుంది? ఆయన ఆత్మకథ 'అమ్మకడుపు చల్లగా' చదవడం మొదలు పెట్టాను కానీ పూర్తవ్వలేదు (ఇప్పటికీ పూర్తి చేయలేదు). సాహిత్యాన్ని దాటి మామూలు విషయాలు చర్చకొచ్చాయి. 

"నా పేరు మారుతి రావండీ. అందరూ కలిసి మారుతీరావు చేసేశారు" అన్నారు. సంభాషణలని 'పద్మ' అవార్డుల మీదకి తీసుకెళ్లారు ఆయనే. ఆయనకా అవార్డు మీద మనసుందని మాటల్లో అర్ధమయ్యింది. (విశాఖ రెవిన్యూ నుంచి ఆయన వివరాల ఫైలు కేంద్రానికి వెళ్లిందని రెవిన్యూ శాఖలో పనిచేసే మిత్రులొకరు చెప్పారు). కాంగ్రెస్ పార్టీ మీద ఆయనకున్న కోపం రాతల్లో అనేకసార్లు బయట పడినా (కాలమ్స్ లో) ఆవేళ మాటల్లోనూ చెప్పారు. ఆయన అభిమానించే పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, గొల్లపూడి 'పద్మ' పురస్కారం దక్కలేదు.  మూడోసారి క్లుప్తంగా జరిగిన సమావేశంలో తన అసంతృప్తిని నేరుగా కాకపోయినా కొంచం ఘాటుగానే బయటపెట్టారు. 

పత్రికలకి, రేడియోకి, నాటకాలకి, సినిమాలకి రచనలు చేసి, అనేక సినిమాల్లో నటించి, టీవీ కార్యక్రమాల ప్రయోక్తగా వ్యవహరించి, అభిరుచి గల ప్రేక్షకుడిగా అంతర్జాతీయ సినిమాలెన్నో చూసి, విదేశీ యాత్రలు చేసిన గొల్లపూడికి జీవితంలో తగిలిన పెద్ద దెబ్బ కొడుకు శ్రీనివాస్ దుర్మరణం. అందులోనుంచి కోలుకోడానికి ఆయనకి ఊతమిచ్చింది సాహిత్యమే. ఎన్ని భూమికలు నిర్వహించినా గొల్లపూడి నాకెప్పుడూ గుర్తుండిపోయేది 'సాయంకాలమైంది' రచయితగానే. ఆయన ఆత్మకి శాంతి కలుగు గాక. 

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

నేరము-శిక్ష-వ్యవస్థ

'దిశ' సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులు పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించారు. నేరం ఎలా చేశారో నటించి చూపించమని నిందితుల్ని సంఘటన స్థలానికి తీసుకెళ్తే, అక్కడినుంచి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారని, వాళ్ళని నిలువరించేందుకు కాల్పులు జరపగా నలుగురు నిందితులూ అక్కడికక్కడే మరిణించారనీ పోలీసులు ప్రకటించారు. సందర్భం ఏదైనప్పటికీ, ఎన్ కౌంటర్ అనంతరం పోలీసులు చేసే ప్రకటనలన్నీ దాదాపు ఇలాగే ఉంటాయన్నది నిజం. అలవాటైన ఈ ప్రకటనకన్నా, ఎన్ కౌంటర్ పట్ల ప్రజలు స్పందిస్తున్న తీరు ఆలోచింపజేస్తోంది, బాగా. 

జరిగిన నేరం సాధారణమైనది కాదు. నేర తీవ్రతా సామాన్యమైనది కాదు. కాబట్టి, శిక్ష కూడా అసాధారణంగా ఉండాలని సమాజంలో భిన్న వర్గాల ప్రజలు ఎలుగెత్తి చాటారు. సెలబ్రిటీలు సోషల్ మీడియాకే పరిమితమైనప్పటికీ, సామాన్య ప్రజలు రోడ్డెక్కి నినదించారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక, జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. నిందితుల్ని పోలీసు స్టేషన్ కి తీసుకెళ్తున్న వ్యాన్ మీద ప్రజలు చేసిన రాళ్ళ దాడి, సంఘటన పట్ల జనం స్పందననీ, నిందితులకి పడాల్సిన శిక్ష పట్ల వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పింది. ఓ పక్క ప్రభుత్వం నుంచి సత్వర నేర విచారణ, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు ప్రకటనలు వస్తుండగానే ఎన్ కౌంటర్ జరగడం గమనార్హం. 

ముందుగానే చెప్పినట్టు, ఎన్ కౌంటర్ లు గతంలోనూ జరిగాయి. అప్పటికన్నా ఇప్పుడు వచ్చిన స్పష్టమైన మార్పు ప్రజల స్పందన. పోలీసు అధికారులని కీర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలు, మహిళలు, యువతులు వాళ్లకి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లకి వెళ్లి పోలీసు అధికారులకి రాఖీలు కట్టడం వరకూ అనేక రూపాల్లో ఎన్ కౌంటర్ పట్ల హర్షాన్ని, పోలీసుల పట్ల కృతజ్ఞతని ప్రకటిస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులని అభినందిస్తూ ప్రదర్శనలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. కేవలం నేర విచారణకి మాత్రమే పరిమితం కావాల్సిన పోలీసులు, చట్టాన్ని చేతిలోకి తీసుకుని శిక్ష వేయడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్న మెజారిటీకి తట్టడం లేదు సరికదా, ఈ ప్రశ్నని లేవనెత్తాలనుకునే వాళ్ళు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు. 

మన వ్యవస్థలో ఒక నేరం జరిగినప్పుడు, విచారణ జరిపి నిందితుల్ని అదుపులోకి తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులది, విచారణ జరిపి శిక్ష విధించాల్సిన బాధ్యత న్యాయస్థానానిది. ఎన్ కౌంటర్ జరిగిందీ అంటే, న్యాయవస్థ చేయాల్సిన పనిని పోలీసు వ్యవస్థ తన చేతుల్లోకి తీసుకుంది అని అర్ధం. దీనిని ప్రజలంతా స్వాగతించారు. స్థూలంగా ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది జరిగిన నేరం (అత్యాచారం, హత్య) తాలూకు తీవ్రత. రెండోది, వ్యవస్థల పనితీరులో లోపాలు. మొదటి కారణాన్ని చర్చించాల్సిన అవసరం లేదు. పెల్లుబికిన జనాగ్రహాన్ని దేశం మొత్తం చూసిన తర్వాత ఇక కొత్తగా చర్చించాల్సింది ఏదీ లేదు. 

ఇక మిగిలింది రెండో కారణం. నిజానికి ఇప్పుడు చర్చ జరగాల్సింది దీనిని గురించే. సత్వర నేర విచారణ, శిక్ష విధింపు, అమలు అన్నవి జరుగుతూ ఉన్నట్టయితే ఈ చర్చకి ఆస్కారం లేకపోయేది. అనేక కారణాల వల్ల మన దేశంలో సత్వర విచారణ, సత్వర న్యాయం అన్నవి అందుబాటులోలేవు. సాక్షాత్తూ దేశ ప్రధానిని హత్య చేసిన నిందితులపై నేర నిరూపణ జరిగి, శిక్ష పడేందుకే సుదీర్ఘ కాలం పట్టిందిక్కడ. 'చట్టం ముందు అందరూ సమానులే' అని ఎంతగా చెప్పుకున్నప్పటికీ, వీవీఐపీ కేసుల విచారణకి, మామూలు కేసుల విచారణకి హస్తిమశకాంతరం భేదం ఉంటున్నది బహిరంగ రహస్యమే. ఏళ్ళ తరబడి కేసుల విచారణ జరగడం, అంచెలంచెల న్యాయ వ్యవస్థలో పై కోర్టుకు అప్పీలు చేసుకునే వీలుండడంతో అనేక కేసుల్లో నిందితులకి వాళ్ళ జీవిత కాలంలో శిక్షలు పడడం లేదు. పడినా, అమలు జరగడం లేదు.

'వందమంది అపరాధులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు' అన్నది మన న్యాయ వ్యవస్థ నమ్మిన సూత్రం. దీనితో న్యాయ స్థానం ప్రతి నేరస్తుడికీ 'బెనిఫిట్ ఆఫ్ డౌట్' ఇస్తుంది. పెరుగుతున్న జనాభాకి తగ్గ నిష్పత్తిలో నేరాలు జరుగుతున్నాయి. అయితే, అదే నిష్పత్తిలో న్యాయస్థానాల ఏర్పాటు జరగకపోవడం, ఇప్పుడు ఉన్న కోర్టుల్లో కూడా తగినంత సిబ్బంది లేకపోవడంతో పెండింగ్ కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఈ సమస్యని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల్ని ఇప్పుడు ప్రజలు అభినందిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే, ప్రజలే చట్టాన్ని చేతిలోకి తీసుకునే పరిస్థితి రావొచ్చు. అది అనేక అరాచకాలకు దారితీయొచ్చు. అక్కడివరకూ రాకుండా ఉండాలంటే, వ్యవస్థలో లోపాలని సరిదిద్దడం తక్షణావసరం. 

'దిశ' అమానుషం. నిందితులకు శిక్ష పడడం అభినందనీయం. కానీ, ఆ 'శిక్ష' నిర్ణయింపబడిన తీరు, అమలు జరిగిన తీరూ ఆమోదయోగ్యమేనా? అన్నదే ఇప్పటి ప్రశ్న. 

గురువారం, డిసెంబర్ 05, 2019

పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు ... 

"ఓరా వాకిలి తీసీ తీయని  దోరా వయసుల్లో.. 
మాఘామాసపు మంచూ బెబ్బులి పొంచే వేళల్లో.. "

మన సినిమాల్లో శృంగార భరిత యుగళగీతం సాధారణంగా పాడుకునే జంట సమాగమానికి ముందు వస్తుంది. పాట చివర్లో పూలు, పొదలు లాంటి సింబాలిక్ షాట్స్ ఉంటాయి. సమాగమం తర్వాత వచ్చే యుగళగీతాలు అరుదు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'మనోహరం' (2000) సినిమాలో "పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు..." అనే పల్లవితో వచ్చే డ్యూయెట్ ఇందుకు మినహాయింపు. కొత్తగా పెళ్ళైన యువజంట గంటల్ని క్షణాలుగా గడిపేయడం సందర్భం. కవి వేటూరి. పాట ఇలా మొదలవుతుంది:  

"పుచ్చా పువ్వుల విచ్చే తావుల వెచ్చా వెన్నెలలు.. 
పచ్చా మీగడలిచ్చే తీయన తెచ్చే నీ కలలు.. 
వచ్చీనాయమ్మా..  విచ్చీనాయమ్మా.. 
వచ్చీనాయమ్మా..  కలువలు విచ్చీనాయమ్మా.. "
అంటూ అతడు ఆరంభించగానే,
"ముద్దా బంతులు మునిగోరింటలు మురిసే  సంజెల్లో.. 
పొద్దే ఎరగని ముద్దే తరగని రసనారింజల్లొ.. 
వచ్చీనాయమ్మా.. విచ్చీనాయమ్మా.. 
వచ్చీనాయమ్మా.. కలువలు విచ్చీనాయమ్మా.. "

అని ఆమె అందుకుంటుంది. 'వెన్నెల పుచ్చపువ్వులా ఉంది' అనడం వాడుక. అలాంటిది పుచ్చపువ్వులు విచ్చే చోట కాసే వెన్నెల (అది కూడా వెచ్చని వెన్నెల!),  దానితో పాటుగా ఆ అమ్మాయి కన్న కలలు - అవికూడా పచ్చ మీగడ (పాలని మరగ కాచగా వచ్చే మీగడ) తాలూకు తీయదనాన్ని తెచ్చేవి - కలలూ వెన్నెలా కలిసి రావడంతో కలువలు విచ్చుకున్నాయట!! అతనిలా చెప్పగానే ఆమె కలువలు విచ్చుకున్నాయని వెంటనే ఒప్పేసుకుంది (పెళ్ళైన కొత్త కదా). కాకపోతే ఆమె చెప్పే కారణాలు వేరు. ముద్దబంతులు, మునిగోరింట పూలు మురిసే (విరిసే కాదు) వేళ, పొద్దు తెలియనంతగా ముద్దుముచ్చట్లు సాగుతున్న వేళల్లో కలువలు విచ్చాయి అంటోంది.  (అసలే కొత్తజంట, ఆపై ముద్దబంతులు పూసే, చలి చంపేసే ధనుర్మాసం.. అర్ధంచేసుకోవాలి మరి). 



"గువ్వ జంటలకు కువకువ..  ఇటు కుర్ర గుండెలకు మెలకువ.. 
వీణ మీటె  సెలయేరూ ..  చలి వేణువూదె చిరుగాలీ.. 
కలువ కనులలోనా కలవరింతలాయే.. 
చలువ తనువులోనా జలదరింతలాయే.. "

అంటూ తొలి చరణం మొదలవుతుంది. గూటికి చేరిన గువ్వలు కువకువలాడడం ఎంత సహజమో, కుర్ర గుండెలకి నిద్ర పట్టకపోడమూ అంతే సహజం. సెలయేరు పాడే వీణపాటతో పాటుగా వేటూరి మార్కు 'చలి వేణువు' మళ్ళీ ప్రత్యక్షం ఇక్కడ. మామూలుగా జలదరింతని భయం లాంటి వ్యతిరేక భవనాలు చెప్పేందుకు వాడతారు కానీ ఈ సందర్భంలో కవి చేసిన  'చలువ తనువులో జలదరింత' ఆలోచించేకొద్దీ నచ్చేసే ప్రయోగం.  

"పిండీ వెన్నెల వండీ వార్చిన వెండీ  ఇసకల్లో.. 
తెల్లా మబ్బుల  వెల్లా వేసిన పిల్ల కాలువల్లో.. 
వచ్చీనాయమ్మా.. వచ్చీనాయమ్మా.. 
వచ్చీనాయమ్మా.. అలజడులొచ్చీనాయమ్మా.. "

పల్లవి చివర్లో కలువలు విచ్చాయి. తొలి చరణం చివరికి వచ్చేసరికి అలజడులొచ్చాయి. పాట మొదలైన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటే సల్లాపాలు మరోమారు సరసానికి దారితీస్తున్నాయనిపిస్తుంది. ఇక, రెండో చరణానికి వస్తే:  

"లేత పచ్చికల అణకువ..  నును లేత మచ్చికల తొణకవ.. 
నిండు అల్లికల నవనవ..  తలదిండు మల్లికల శివశివ.. 
పట్ట పగటి ఎండే పండు వెన్నెలాయే.. 
నిట్ట నిలువు తపనే నిలువనీయదాయే.. "

ఒకసారి చెప్పిన దగ్గరితనాన్నే మళ్ళీ వేరే మాటల్లో చెప్పడం మిగిలిన కవులకి కష్టం కావచ్చేమో కానీ వేటూరికి కాదు. "తలదిండు మల్లికల శివశివ" ప్రయోగం మాత్రం పూర్తిగా వేటూరి మార్కు!

"ఓరా వాకిలి తీసీ తీయని  దోరా వయసుల్లో.. 
మాఘామాసపు మంచూ బెబ్బులి పొంచే వేళల్లో.. 
వచ్చీనాయమ్మా.. గిచ్ఛీనాయమ్మా.. 
వచ్చీనాయమ్మా.. వలపులు గిచ్ఛీనాయమ్మా.. "

అలజడులొచ్చి వలపుల్ని గిచ్చాయి.. అక్కడికీ వాకిలి ఇంకా పూర్తిగా తీయనే లేదు. అయితేనేం, పొంచి ఉన్న మంచు బెబ్బులి బోల్డంత దోహదం చేసింది దోర వయసుల వలపులకి. సంగీతాన్ని పక్కన పెట్టేసి కేవలం సాహిత్యాన్ని చూస్తే,  మాంచి రస దృష్టి ఉన్న కవి 'సంక్రాతి-కొత్తజంట' అంశం మీద రాసిన వచన కవితలా ఉంటుంది. తన తొలియవ్వనపు రోజుల్లో కృష్ణ ఒడ్డున విహరిస్తూ రాసుకున్న గాలిపాటని సినిమా కోసం ఇచ్చానని, ఈ పాట మీద విశ్వనాథ సత్యనారాయణ 'ఋతుసంహారం' కావ్య ప్రభావం ఉందనీ రాసుకున్నారు వేటూరి తన 'కొమ్మకొమ్మకో సన్నాయి' లో. 

మణిశర్మ చక్కని ట్యూన్ చేసినా, పార్థసారధి, చిత్ర అంతబాగా పాడలేకపోయారేమో అనిపిస్తుంది నాకు పాట విన్న ప్రతిసారీ. బోల్డన్ని గ్రాఫిక్స్ తో జగపతి బాబు-లయ ల మీద చిత్రించారు గుణశేఖర్. గ్రాఫిక్స్ లేకపోతే చిత్రీకరణ ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. కేవలం సాహిత్యం కోసం వినే పాటల్లో ఇదీ ఒకటి.