గురువారం, సెప్టెంబర్ 30, 2010

ముసురేసింది...

"దేవుడా దేవుడా గాట్టి వర్షం కురిపించు.." పొద్దు పొద్దున్నే నిద్ర లేవగానే ఆకాశంలో మబ్బులు కనిపిస్తే నేను దేవుణ్ణి కోరుకునే చిన్న కోరిక ఇది. బాగా వర్షం వస్తే బడికి వెళ్ళక్కర్లేదు కదా మరి. మా బళ్ళో ఉండే రెండు గదుల్లోనూ ఒకటి బంగాళా పెంకులది, రెండోది తాటాకుతో కప్పింది. వానొచ్చిందంటే నీళ్లన్నీ మామీదే. అందుకని పెద్ద వర్షమొస్తే బడికి సెలవన్న మాట. అసలు బళ్ళో కూర్చోడం మాటెలా ఉన్నా, మేష్టార్లు బడికి రావాలన్నా వీలు పడదు. బురద రోడ్ల మీద సైకిలు దొర్లించుకుంటూ రావడం చాలా కష్టం మరి.

బడికి సెలవిచ్చేస్తే ఎంచక్కా ఎంత బాగుంటుందో. మామూలుగా ఆదివారం నాడు సెలవిస్తారనుకో. అయినా కానీ ఇలా మధ్య మధ్యలో సెలవులోస్తే భలేగా ఉంటుంది. మనం చద్దన్నం తినేసి బడికి బయలుదేరే లోపే ఎవరో ఒకరు "ఇవాళ బళ్ళేదు" అని చెప్పేస్తారు కదా. అప్పుడు పుస్తకాల సంచీని అమ్మకీ, నాన్నకీ కనిపించకుండా దాచేయాలి. ఎదురుకుండా సంచీ కనిపిస్తుంటే "చదువుకో" అని ప్రాణాలు తోడెయ్యరూ, అందుకన్న మాట. పాఠాలన్నీ వచ్చేశాయ్ అన్నా వినిపించుకోకుండా, "మళ్ళీ చదువుకో" అనో "ఎక్కాలు నేర్చుకో" అనో ఆర్డర్లేస్తారు.

బయట బాగా వర్షం పడుతోందనుకో, మూల గదిలోకి వెళ్లి కిటికీ దగ్గరకి తలొచ్చేలా పెద్ద మంచం మీద పడుకోవాలి. అప్పుడైతే వర్షం ఎలా కురుస్తోందో బాగా చూడొచ్చు. ఒక్కోసారి ఊరంతా చీకటిగా అయిపోయి, ఉరుములూ అవీ వస్తూ, లావు లావు ధారలుగా వర్షం కురుస్తుంది చూడు, అలాంటప్పుడైతే భయమేస్తుంది కానీ, మామూలు వర్షమైతేనా ఎంతసేపైనా అలా చూస్తూ ఉండిపోవచ్చు. మధ్య మధ్యలో వచ్చే మెరుపులు భలేగా ఉంటాయి. చూరు మీద నుంచి నీళ్ళు ధారలు ధారలుగా పడ్డప్పుడు కింద నేలంతా చిల్లులు పడి చిన్న చిన్న చెరువుల్లా అయిపోతుంది. అప్పుడు కనక వర్షం తగ్గిందంటే ఆ నీళ్ళలో పడవలు ఆడుకోవచ్చు.చెరువంటే గుర్తొచ్చింది. వీధి గదిలో కూర్చున్నామంటే చెరువు మీద వర్షం కురవడం చూడొచ్చు. అసలే చెరువు నిండా నీళ్ళా? ఆ నీళ్ళలో మళ్ళీ బోల్డు బోల్డు నీళ్లన్న మాట. ఒక్కోసారి చెరువు పొంగిపోతుందేమో అని భయమేస్తుంది కానీ, అలా వర్షం కురవడం మాత్రం ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. చెరువవతల అందరివీ తాటాకిళ్ళే కదా. ఎంత వర్షం వచ్చినా వంట చేసుకోడం మానెయ్యరు కదా. అప్పుడు వాళ్ళిళ్ళలోనుంచి వచ్చే పొగల్ని పరాగ్గా చూశామంటే ఇళ్ళు తగలబడి పోతున్నాయేమో అని ఖంగారు పడిపోతాం. బాగా దూరంగా చూస్తే అక్కడ వర్షం కూడా మంచులాగే కనిపిస్తుంది.

తాటాకు గొడుగులేసుకుని రోడ్ల మీద తిరిగే జనం రోడ్డుని బురద బురదగా చేసేస్తారు. గొడుగులు లేనివాళ్ళు తువ్వాళ్ళు నెత్తిమీద కప్పుకుని పరిగెట్టడం. పాపం ఎంత పరిగెత్తినా గట్టిగా వానొస్తే తడిసిపోవాల్సిందే. అలా తడిస్తే జొరాలొస్తాయిట, అందుకే మన్ని తిరగనివ్వరు. అదే పప్పుచారునీ, గోపాల్రావునీ అయితే వాళ్లిళ్ళలో ఏమీ అనరు. అందుకే వాళ్ళు అలా తడుస్తూనే ఉంటారు. వానొచ్చిందంటే చెర్లో తిరిగే నీరుకట్లూ, బురదపాములూ మన వీధిలోకి వచ్చేస్తాయి. కర్రుంది కదా అని వాటిని చంపెయ్యకూడదు. తాచుపామైతేనే చంపాలి. కానీ హమ్మో.. తాచుపాముని చంపడం అంత సులువేంటి? నాన్నైతే ఒక్క దెబ్బకి చంపేస్తారనుకో.

కాకపొతే ఈ బుడత పాముల్ని చూసి 'పాము' 'పాము' అని అరిచి కాసేపు బామ్మని ఖంగారు పెట్టొచ్చు. ఎంత చద్దన్నం తిని ఊరికే కూర్చున్నా టయానికి ఆకలెయ్యక మానదు కదా. అలా అని "తినడానికి ఏవన్నా పెట్టు" అని అమ్మని పీక్కు తినకూడదు. తనకి చెయ్యి ఖాళీ అయ్యాక తనే పెడుతుంది. పొద్దున్నైతే ఒకటే హడావిడిగా ఉంటుంది కానీ, మధ్యాన్నం బోజనాలైపోయాక అమ్మక్కొంచం ఖాళీ దొరుకుతుంది కదా.. అప్పుడు ఏ వేరుశనగ గుళ్ళో వేయించి పెడుతుంది. కొంచం బెల్లమ్ముక్క కూడా తనే ఇస్తుందిలే, మళ్ళీ పైత్యం చేయకుండా.బామ్మైతే వర్షం వచ్చినప్పుడల్లా తన చిన్నప్పటి ఫ్రెండ్సులకి ఎవరెవరికి వర్షాల్లో ఏమేం దొరికాయో కథలు కథలుగా చెప్పేస్తుంది. వర్షం తగ్గిపోయాక బురదగా ఉంటుంది కదా. బామ్మ ఫ్రెండ్సులు ఆ బురదలో కర్రతో తవ్వే ఆట ఆడుతుంటే ఒకళ్ళకి గొలుసూ, మరొకళ్ళకి ఉంగరమూ (రెండూ నిజం బంగారమే) దొరికాయిట. వాళ్లకి అదృష్టం ఉందిట. నేను వెతుకుదామనుకున్నా తను పడనివ్వలేదు. ఎప్పుడూ ఉండే గొడవే జొరం వస్తుందని. అయినా ఎవరూ చూడకుండా నేను వెతికాననుకో. కానీ నాకు అదృష్టం లేదు.

మామూలప్పుడైతే అన్నం వేడి వేడిగా ఉంటే అస్సలు తినలేమా.. అదే వర్షం వచ్చినప్పుడైతే వేడన్నం ఊదుకుంటూ తింటే ఉంటుందీ.. అదే రాత్రప్పుడైతే పెరుగన్నం అవుతుండగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. కడుపులో వేడి వేడిగా ఉంటుంది కదా మరి. అప్పుడు నిండా రగ్గు కప్పేసుకుని గాట్టిగా కళ్ళు మూసేసుకుంటే వర్షం చప్పుడు వినిపించీ వినిపించీ అలా అలా నిద్రలోకెళ్లిపోతాం. తెల్లారిందంటే మళ్ళీ బళ్ళోకెళ్ళాల్సిందే. ఎంత మనం రోజూ దండం పెట్టుకుంటే మాత్రం, వానదేవుడు మనూళ్ళోనే రోజూ వర్షం కురిపించెయ్యడు కదా. మిగిలిన ఊళ్లలో కూడా మనలాంటి పిల్లలుంటారు కదా మరి.

బుధవారం, సెప్టెంబర్ 29, 2010

విశాలనేత్రాలు

కాంచీ రాజ్యంలోని నిచుళాపురం పట్టణంలో వృద్ధ వేశ్య శృంగారమంజరి చిన్న కూతురు హేమసుందరి గొప్ప అందగత్తె. ఆమెవి చెంపకి చారెడు కళ్ళు. ఓనాడు దేవాలయంలో హేమసుందరి నాట్యం చేస్తూ ఉండగా ఆమె విశాలనేత్రాలని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు రంగనాయకుడు, ఓ మామూలు రైతు చిన్న కొడుకు. అతని స్పురద్రూపం, సాము గరిడీల్లో అతని ప్రతిభ, మీదు మిక్కిలి అతడు తనపై చూపించే గాఢమైన ప్రేమ హేమసుందరిని అతనితో ప్రేమలో పడేలా చేస్తాయి.

పట్టణ ప్రముఖుడు తిరుమల రెడ్డి శృంగారమంజరి పెద్ద కుమార్తె మాణిక్యవల్లిని ఆదరిస్తూ ఉంటాడు. నానాటికీ పెరుగుతున్న హేమసుందరి సౌందర్యం అతనిలో కొత్త ఆలోచనలు రేపుతుంది. ఒకనాటి రాత్రి తిరుమల రెడ్డి పై దాడిచేసి, అతని కాలు విరిచి, బంగారు నగలు సంగ్రహించి హేమసుందరితో కలిసి పొరుగునే ఉన్న పాండ్యరాజ్య ముఖ్య పట్టణం శ్రీరంగానికి పారిపోతాడు రంగనాయకుడు. వారిద్దరూ తమ పేర్లని హేమాంబా ధనుర్దాసులుగా మార్చుకుని భార్యాభర్తలుగా చెలామణి అవుతూ కొత్తజీవితం ప్రారంభిస్తారు.

హేమని తనకి దక్కేలా చేస్తే శ్రీరంగేశునికి హేమసుందరి నేత్రాలని పోలిన పైడి కనుదోయి, స్వర్ణ తిలకం సమర్పించుకుంటానని విచిత్రమైన మొక్కు మొక్కుకున్న రంగనాయకుడు, దానిని తీర్చుకుని తిరిగి వస్తుండగా రామాజున మఠాధీశుడు రామానుజ యతి తన శిష్యులతో నగర సంచారం చేస్తూ ఎదురు పడతాడు. పండుటాకులా ఉన్న ఆ వృద్ధ యతి ముఖంలో చూడగానే ఆకర్షించేవి విశాలమైన నేత్రాలు. తొలిచూపులోనే యతికి రంగనాయకుడి మీద తెలియని వాత్సల్యం ఏర్పడుతుంది.

యతి సమక్షంలో శ్రీరంగేశుని దర్శించుకున్న రంగనాయకుడికి కోటికొక్కరికి మాత్రమే కలిగే మహద్భాగ్యం - శ్రీరంగశాయి నిజ నేత్ర దర్శనం - దొరుకుతుంది. ఆ విశాల నేత్రాలని దర్శించిన క్షణం రంగనాయకుడి జీవితం మరో అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. హేమసుందరి, రామానుజ యతి, శ్రీరంగనాధ స్వామి వారల 'విశాల నేత్రాలు' అతిసామాన్యుడైన రంగనాయకుడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయన్నదే నలభైనాలుగేళ్ళ క్రితం పిలకా గణపతి శాస్త్రి రాసిన నవల 'విశాల నేత్రాలు' కథాంశం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి అందుకున్నదీ నవల.

రాజభవంతిని తలపించే శృంగారమంజరి భవంతిలోకి ఒక అర్ధరాత్రి వేళ కావలి వాళ్ళ కళ్లుగప్పి, దేహానికి మసిపూసుకుని రంగనాయకుడు ప్రవేశించడంతో కథ ప్రారంభమవుతుంది. చకచకా మలుపులు తిరుగుతూ హేమసుందరి, రంగానాయకుడూ శ్రీరంగం చేరెంతవరకూ అత్యంత వేగంగా సాగే కథనం, అక్కడినుంచి కూసింత మందగిస్తుంది. కథానాయకుడు తొలి లక్ష్యాన్ని చేరుకోవడం, ఆ తర్వాతి లక్ష్యం ఏమిటన్నది పాఠకులకి తెలియకపోవడం ఇందుకు కారణాలని చెప్పాలి.

కాంచీ రాజ్య పాలన, క్రమశిక్షణ, శాంతిభద్రతలపై పాలకుల ప్రత్యేక శ్రద్ధ వంటి విషయాలతో పాటు, కుమార్తెల ద్వారా వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశించే వృద్ధ వేశ్య శృంగారమంజరి, తన చెల్లెలే తనకి పోటీ వస్తోందని భయపడే మాణిక్యవల్లి పాత్రలు ప్రధమార్ధాన్ని ఆసక్తిగా చదివిస్తాయి. రెండోసగంలో శ్రీరంగేశుడి మీద భక్తి, రామానుజ యతి మీద గౌరవం చూపిస్తూనే, రంగనాయకుడు వ్యసనాలకి బానిసవ్వడం, నేరం చేయడానికి వెనుకాడకపోవడం కథని మలుపులు తిప్పుతాయి.

రంగనాయకుడి మీద యతి చూపే అభిమానం, ఆశ్రమంలో మిగిలిన శిష్యులకి కంటగింపు కావడం, ఓ దశలో యతి ఆశ్రమం విడిచిపెట్టడానికి సిద్ధపడడం కథని ముగింపు వైపు నడుపుతాయి. సంస్కృతాంధ్రాలు క్షుణ్ణంగా చదివిన పిలకా గణపతి శాస్త్రి, ఈ నవల కోసం 'లైఫ్ ఆఫ్ రామానుజ' గ్రంధం తో పాటు, ఎన్నో సంస్కృత గ్రంధాలని రిఫర్ చేశానని ముందుమాటలో చెప్పారు. నవలలో పాత్రలు, సంఘటనా స్థలాలు, ప్రకృతి వర్ణనలని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటికారణంగా కథని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది పఠితలకి.

చాలా ఏళ్ళ క్రితం చదివిన ఈ పుస్తకం, "ఇక దొరకదేమో" అనుకుంటున్న తరుణంలో పుస్తకాల షాపులో కనిపించేసరికి నాక్కలిగిన ఆనందం వర్ణనాతీతం. సినిమాగా తీయడానికి వందశాతం సరిపోయే ఈ కథని అలనాటి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు స్క్రిప్టు గా మలుచుకున్నారు కానీ సినిమా చేయలేకపోయారు. ఇదే కథ హక్కులు తీసుకుని స్క్రిప్టు రాయించుకున్న నటుడు కృష్ణంరాజు ఎప్పటికైనా ప్రభాస్ కథానాయకుడిగా సినిమా తీస్తానని ప్రకటిస్తున్నారు. హేమసుందరి ఎవరో మరి?? రెండువందల పేజీల ఈ నవలని ఎమెస్కో ప్రచురించింది. వెల రూ. 70. 'విశాల నేత్రాలు' గురించి బ్లాగ్మిత్రులు తృష్ణ గారి టపా ఇక్కడ.

మంగళవారం, సెప్టెంబర్ 28, 2010

వినండి చెబుతా...

'చెప్పేవాడికి వినేవాడు లోకువ' అనేది చాలా పాత సామెత. ఎవరో 'వినే' వాడే వినీ, వినీ బోల్డంత అనుభవం సంపాదించి ఆ అనుభవంతో సృష్టించి ఉంటాడీ సామెత. మనందరమూ ఏదో ఒక సందర్భంలో వినేవాళ్ళమూ, చెప్పేవాళ్ళమూ కూడా. ఏమాటకామాటే చెప్పుకోవాలి. 'వినేవాడు' పాత్ర కన్నా 'చెప్పేవాడు' పాత్ర ఎంత గొప్పగా ఉంటుందో. మనం చెప్పేదంతా వినేవాడు దొరకాలే కానీ ఒళ్ళు మర్చిపోతాం కదూ మనం?

వినడం అనేది చిన్నప్పుడే మొదలుపెట్టాం మనం. ఇంట్లో పెద్దవాళ్ళు, బళ్ళో మేష్టార్లు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, నాన్న స్నేహితులు... ఇలా అందరూ మనకి చెప్పేవాళ్ళే. ఏం చెప్పేవాళ్ళు? "అల్లరి చెయ్యకూడదు.. బుద్ధిగా చదువుకోవాలి.. ఫస్టున పాసవ్వాలి.." ఇలా అన్నీ మనకి నచ్చని విషయాలే. అయినా ఎదురు చెప్పకుండా వినాల్సిందే.

అలా వినడం అలవాటైపోవడం వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటంటే మనం పెద్దైపోయాక పిల్లలు ఎదురు సమాధానాలు చెప్పినా వినగలగడం. ఇప్పుడు పిల్లలకి ఏదైనా చెప్పి ఒప్పించడం మన తరమా? ఆమధ్య ఎప్పుడో ఓసారి పక్కింటి పిల్ల నాలుగేళ్ల దానికి ఆల్ఫాబెట్స్ చెబుదామనిపించి 'ఏ' అన్నప్పుడు ఆ పిల్ల తడుముకోకుండా 'బీ' అంది. ఏం చెయ్యగలం? "అదే మా రోజుల్లో అయితేనా?" అని నిట్టూర్చడం తప్ప.

బుద్ధిగా వినడం అలవాటైపోడం వల్ల మనం ఎన్నెన్ని వినగలుగుతున్నామో చూడండి. టీవీ యాంకర్ మాట్లాడే సంకర భాష మొదలు రాజకీయనాయకుడు నీతులు, బూతులు కలిపి ఇచ్చే ప్రసంగం వరకూ ప్రతిదీ వినేస్తున్నాం. నిజజీవితంలో ఆదాయంపన్ను ఎగ్గొట్టే సిని తారలు సినిమాల్లో మాత్రం అవినీతికి వ్యతిరేకంగా తెగ బారెడు డైలాగులు చెబుతున్నా కిమ్మనకుండా వింటున్నాం. ఇలా ఎన్నెన్ని వింటున్నామో లెక్కలేసుకుంటే మనకే బోల్డంత ఆశ్చర్యం కలుగుతుంది.

ఈ జీవకోటిలో మన మాట వినే ప్రాణి ఏదైనా కనిపిస్తే... మనంత అదృష్టం ఇంకెవరికైనా ఉంటుందా? మనం చెప్పడం మొదలు పెట్టామంటే ఎవరైనా మనకి పోటీకి రాగలరా? ఏం? మనమేమీ చెప్పలేమా? ఆకలినీ, నిద్రనీ మరిచి, మధ్యలో మంచినీళ్ళు తాగడానికి కూడా బ్రేక్ తీసుకోకుండా అలా చెబుతూనే ఉండిపోగలం. వినేవాడు దొరకాలే కానీ ఎంతసేపైనా, ఎన్ని విషయాలైనా చెప్పగలం.

అవునూ.. ఒకవేళ వినడానికి ఎవరైనా దొరికితే మనం ఏమేం చెప్పగలం? నిజానికి ఏమేం చెప్పలేం? అని అడగాలి. మనం ఎంత గొప్పవాళ్ళమో చెప్పొచ్చు. ఎంత ప్రిన్సిపుల్డో, ఎన్నెన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చామో చెప్పొచ్చు. సమాజం పట్ల మన బాధ్యత లాంటి బరువైన విషయాలూ చెప్పేయొచ్చు.

వినేవాడు అవకాశం ఇవ్వాలే గానీ అతగాడు ఎంత అల్పుడో జ్ఞానోదయం చేసేయొచ్చు. మనం చెప్పేవన్నీ మనం పాటించి తీరాలన్న రూలేదీ అస్సలు లేదు కాబట్టి ఎలాంటి సందేహాలకీ తావు లేదు. ...మరి వినడానికి ఎవరూ దొరక్కపోతే?? ఇది కూడా ఓ సందేహమేనా? ఇలా ఓ టపా రాసేయడమే!!

శుక్రవారం, సెప్టెంబర్ 24, 2010

బ్లాగులు-FREE HUGS...

ఆకాశం ఉరిమినప్పుడు దట్టంగా పేరుకున్న మేఘం కరిగి వర్షించడం మొదలు పెడుతుంది. సముద్రపు అట్టడుగున ముత్యపు చిప్ప నోరు తెరుచుకుని వాన చినుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కురిసే కోట్లాది చినుకుల్లో ఒక్క స్వాతిచినుకు మాత్రమే ముత్యపు చిప్పలో చేరి స్వచ్చమైన స్వాతిముత్యమై మెరుస్తుంది. కురిసే ప్రతి చినుకూ స్వాతిచినుకు కాలేదు.

ఆరేడు నెలల క్రితం.. బ్లాగు మిత్రులొకరు "మురళీ, మీరు ఫ్రీహగ్స్ బ్లాగు చూస్తున్నారా?" అని మెయిల్లో అడిగినప్పుడు, క్షణం కూడా ఆలోచించకుండా "నేను ఇంగ్లీష్ బ్లాగులు పెద్దగా చదవనండీ" అని వినయంగా జవాబిచ్చేశాను. నా జవాబు వారికెంత నవ్వు తెప్పించి ఉంటుందో FREE HUGS... బ్లాగు చూశాక కానీ అర్ధం కాలేదు. ఎందుకంటే.. అచ్చమైన, స్వచ్చమైన, పదహారణాల తెలుగు బ్లాగిది.

"నిస్పృహతో భూమిలో దాగిన మొలకని పులకింపజేయడానికిఆనందంగా వచ్చే తొలకరి చినుకు యొక్క హర్షాతిరేకాన్ని నేను.తర్వాత నాకేమవుతుంది అన్న ఆలోచన, భయమూ నాకు లేవు.నేను ఈ క్షణపు సౌందర్యాన్ని." అంటూ 'ఒంటరి ఆలాపన' చేసినా.. "గగనకాంత మోహనక్రుష్ణుని కౌగిలి బంధనం లో మునిగిపోయి గాఢ నీలపు రంగులోకి మారిపోయింది. చంద్రుడు చుక్కలతో దొంగాట ఆడుతూ మా పెరటి చెట్టు వెనక్కి నక్కాడు." అని రొమాంటిగ్గా రాస్తూనే "టైము గాడు బండిని సర్రున లాగించేసాడు. జెలసీ ఫెలో. మేము వెళ్ళిపోవాల్సిన టైము వచ్చేసింది." అంటూ తన 'పరవశా'న్ని పంచుకున్నా...బ్లాగర్ 'మురారి'ది ఓ విలక్షణ శైలి. కవితాత్మకమైన వచనం ఈయన సొంతం.

అందంగా పరుచుకున్న అక్షరాల వెంట కళ్ళు పరుగులు తీస్తుండగానే, వాక్యాల్లో కవితాత్మకతకి మనసు, రచయిత భావాలకి మెదడు ఏకకాలంలో స్పందిస్తాయి. ఆ స్పందన అలా కొనసాగుతూనే ఉంటుంది.. ఎందుకంటే ఒక్కసారి చదవడం మొదలుపెట్టాక బాహ్యస్మృతిలోకి రావడం అంత సులువైన పనేమీ కాదు.

"మనసు ఎప్పుడూ మాతృభాషలోనే స్పందిస్తుంది" అంటూ మూడేళ్ళ క్రితం జూలై 21 న 'ముందుమాట'తో బ్లాగ్ప్రపంచం లోకి అడుగుపెట్టిన మురారి (గోపిశెట్టి శ్రీనివాస్), "I look like an unsolved bug" అంటూ తన గురించి చెప్పారు. 'చిన్న చిన్న ఆనందాల'నీ, 'టింగ్ టింగ్స్'నీ పంచుకుంటూ పాఠకులని తన ప్రపంచం లోకి తీసుకెళ్ళిన మురారి 'డార్క్ కార్నర్' కథతో పఠితల ఆసక్తిని పెంచారు. 'తనని తాను తెలుసుకోవడం' అనేది చాలా రచనల్లో కనిపిస్తుంది.

"నాలోని దాగుండిపోయిన పసివాడు నీ సమక్షంలో బయటకి వచ్చినప్పుడు వాడి మారాన్ని, కేరింతలని కాకిఎంగిలి చేసి పంచుకుంటావని... నా అనురాగాన్నంతటినీ ముద్దులు చేసి ముద్దలుగా నీకు కొసరి, కొసరి తినిపించాలని... నీకోసం ఆగిపోయాను." అంటూ నెచ్చెలి కోసం ఎదురు చూసినప్పుడు ఓ అచ్చమైన ప్రేమికుడు కళ్ళముందు మెదులుతాడు.

అయితే "నా ఊహలో నువ్వున్నప్పుడు ఈ దేహం సుగంధంతో తొణుకుతుంటుంది కదా.. మరి ఈ ధూపాలెందుకు అనిపించింది" అంటూ సుప్రజని పరిచయం చేసినప్పుడూ, "పొద్దున్నే లేచి అందంగా తయారయ్యాను. నీకోసం అలంకరించుకోవడమన్నది ఎంత మనోహరమైన వ్యాపకమో!. ఈ రోజు నువ్వు రావని తెలుసు. కానీ 'పొరపాటున వచ్చేస్తేనో!' అని ఆశపడే మనసుకి ఏమని సర్దిచెప్పను?" అని 'విరహ భోగా'న్ని వర్ణించినప్పుడూ ఎవరో అమ్మాయి కలంపేరుతో రాస్తున్న బ్లాగేమో అనిపించక మానదు. ఇక 'పూల పల్లకి' కథ సరేసరి.

"ప్రతి ఒక్కరిలోనూ కొంత అబ్బాయితనం, కొంత అమ్మాయితనం ఉంటాయి" అంటారాయన. మురారి రాసిన 'ఇన్నర్ డైమెన్షన్స్' చదువుతున్నప్పుడు అందులోని మూడు పాత్రల్నీ ఒకే రచయిత సృష్టించారంటే నమ్మడానికి కొంచం సమయం పడుతుంది. "నేను రచయితని కాదు" అన్న జవాబు ఆయన దగ్గర సిద్ధంగా ఉంటుంది.

టపాలు చదువుతుంటే ఇంత చక్కని బ్లాగుకి యూఆరెల్ లో ఉన్నఅచ్చతెనుగు పేరు 'స్వాతిచినుకు' చక్కగా సరిపోతుంది కదా అనిపించింది..అయితే "నా ఆలోచనలనూ, ఆవేశాలను మాటల కౌగిలింతలుగా ఇస్తున్నాను కాబట్టి 'Free Hugs' అని పేరు పెట్టాను" అన్నవ్యాఖ్య చూడగానే జవాబు దొరికినట్టు అనిపించింది. గడిచిన మూడేళ్ళ కాలంలో ఈ బ్లాగులో కనిపించిన టపాలు కేవలం నలభై ఎనిమిది. మురారి టపాల కోసం ఎంతకాలమైనా ఎదురుచూసే అభిమానులు ఉన్నారు. చినుకులెన్ని రాలినా స్వాతిచినుకు ప్రత్యేకమైనది మరి.

గురువారం, సెప్టెంబర్ 23, 2010

"శుభికే! శిర ఆరోహ"

అవి జాతీయోద్యమం రోజులు. జాతి యావత్తూ గాంధీజీ మాటని వేదవాక్కుగా ఆచరిస్తున్న కాలం. అత్యంత బలవంతులైన ఆంగ్లేయులపై పోరాటానికి జనం సన్నద్ధం అవుతున్న వేళ, వారికి మార్గదర్శనం చేయడానికి ముందుకొచ్చిన మహాత్ముడు జాతిని ఏక తాటిపై నిలపాల్సిన అవసరాన్ని గుర్తించాడు. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడం కోసం గాంధీజీ అనుసరించిన మార్గాలలో కొన్ని నూలు వడికించడం, హిందీ భాషని ప్రచారం చేయడం. బలవంతంగా హిందీని తమ మీద రుద్దడాన్ని చాలామంది వ్యతిరేకించారు. విఖ్యాత కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వారిలో ఒకరు.

హిందీ పట్ల తన వ్యతిరేక వైఖరిని వ్యక్తపరుస్తూ తనదైన హాస్య వ్యంగ్య ధోరణిలో శాస్త్రిగారు 1942 లో రాసిన కథ "శుభికే! శిర ఆరోహ." కథాస్థలం రాజమండ్రిలో న్యాయవాది జగ్గప్ప ఇల్లు. ముదుసలి తల్లి, భార్య రత్తమ్మ, ఇద్దరు కుమార్తెలు జానకి, అన్నపూర్ణ, ఇదీ జగ్గప్ప కుటుంబం. కళా సంస్కృతులంటే యెంతో మక్కువ జగ్గప్పకి. కూతుళ్లిద్దరికీ కర్ణాటక సంగీతం నేర్పిస్తూ ఉంటాడు. పెద్దమ్మాయి జానకి పదహారేళ్ళ పిల్ల. ఆమెని తమ కోడలిగా చేసుకోవాలని జగ్గప్ప అక్కలు గంగమ్మ, రంగమ్మ ల కోరిక. తమ్ముడితో పెళ్ళిసంబంధం మాట్లాడ్డం కోసం వాళ్ళిద్దరూ తమ కొడుకులని తీసుకుని రాజమండ్రి వస్తారు.

రంగమ్మ కొడుకు రామేశం లా చదివాడు. కాకినాడలో న్యాయవాదిగా పనిచేస్తూ ఏడాదికి రెండువేల వరకూ సంపాదిస్తున్నాడు. అయితే జగ్గప్ప తల్లి ముసలమ్మగారికి మాత్రం మనవరాలిని గంగమ్మ కొడుకు 'రొమేష్' కి ఇచ్చి చెయ్యాలని ఉంటుంది. ఉత్తర భారతదేశంలో చదువుకుంటున్న రొమేష్ కి ఆమాత్రం డబ్బు నెలజీతంగా వచ్చే ఉద్యోగమే అవుతుందని ముసలమ్మగారికి గట్టి నమ్మకం. పుట్టి పెరిగిందీ, ఉంటున్నదీ ఏలూరులోనే అయినా కొన్నాళ్ళపాటు కలకత్తాలో చదివి, ప్రస్తుతం కాశీలో చదువుకుంటున్న రొమేష్ దృష్టిలో సంప్రదాయం అంటే ఉత్తరాది వాళ్ళదే. సంగీతం, కళలు, ఒకటేమిటి ప్రతి ఒక్కటీ వారినుంచే నేర్చుకోవాల్సిందే.

"జారిపోతుందా అన్నట్టు వొదులు వొదులుగా బిళ్ళగోచీ పెట్టి పంచె కట్టుకునీ, దానిమీద మోకాళ్ళ దాకా పల్చని బెంగాలీ లాల్చీ వేసుకునీ, దానిమీద హిందూస్తానీ పొట్టికోటు తొడుక్కునీ, నెత్తిన లేసుగుడ్డ టోపీ పెట్టుకునీ ఉన్నాడతను. బీడీ వొకమాటు నోట ఉంచుకుని పీలుస్తూ, వొకమాటు తీసేసుకుంటూ, మధ్య మధ్య రకరకాలుగా పొగ విడుస్తూ, ఫ్రెంచి కట్టింగు మీసాలు కూడా సవరించుకుంటూ పోజుమీద పోజుకూడా మారుస్తూ ఉన్నాడతను." ఇదీ రొమేష్ పాత్ర పరిచయం. అతను మిఠాయి అంగడి మీద కూర్చునే వాడిలా కనిపిస్తాడు జగ్గప్ప, రత్తమ్మలకి.

తల్లి గంగమ్మ చేత హిందీ పరీక్షలు రాయించడమే కాదు, ఇంట్లో హిందీలోనే మాట్లాడాలనీ, తమ సంప్రదాయం కాకపోయినా నెత్తిమీద ముసుగు విధిగా ధరించాలనీ కచ్చితంగా చెప్పేస్తాడు రొమేష్. కొడుకు 'గొం-గామాయ్' అని పిలవగానే ప్రాణాలు లేచొస్తాయావిడకి. "గొంగ అంటే తెనుగులో శత్రువు, తెలుసా?" అని జగ్గప్ప అడిగితే, "వెధవ తెలుగు ఫోనిస్తూ తమ్ముడూ!" అనేశారావిడ. మొన్నటివరకూ వాల్మీకం చదివిన గొం-గామాయ్ గారు ఇప్పుడది పక్కన పెట్టేసి తులసీదాస్ రామాయణం పారాయణం చేస్తున్నారు. రాత్రి వేళ అన్నం బదులు గోధుమ రొట్టెలే తింటున్నారు, వరి అన్నంలో ఏమీ లేదనీ, రొట్టెలే బలమనీ 'నాయన' చెప్పాడు మరి.

పెళ్లికాగానే జానకిని 'నాయన' కి అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఆలోచనలు చేస్తూ ఉంటుంది గంగమ్మ. ఆమెకి హిందూస్తానీ సంగీతం చెప్పిస్తాననీ, అన్నం బదులు గోధుమ రొట్టెలే తినాల్సి ఉంటుందనీ, నెత్తిమీద ముసుగు తప్పనిసరిగా ధరించాల్సిందేననీ తన తల్లితో చెప్పేస్తుంది. మరోపక్క మనవరాలికి రొమేష్ సంబంధం ఖాయం చేయడానికి ముసలమ్మగారు తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.

గంగమ్మకి రంగమ్మ పోటీ వస్తుందేమో అని ఆవిడకి ఏమూలో భయం లేకపోలేదు. ఓ మంచి ముహూర్తం చూసి, సంగీతం మేష్టారిని పిలిచి జానకి కచేరీ ఏర్పాటు చేస్తుందావిడ. కచేరీ తర్వాత అక్కాబావాలకి మంగళ హారతి ఇవ్వమని అన్నపూర్ణని ఆదేశిస్తుందావిడ. పెళ్లి ముహూర్తం నిర్ణయించడానికి పురోహితుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. కచేరీ ముగింపులోనే కథకి ఆసక్తికరమైన, హాస్యస్పోరకమైన ముగింపు ఇచ్చారు రచయిత.

విశాలాంధ్ర ప్రచురించిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మూడు కథల సంపుటాల్లో రెండో సంపుటంలో ఉందీ కథ. ముప్ఫై పేజీల కథలో ప్రతి పాత్రనీ, సన్నివేశాన్నీ కళ్ళకి కట్టినట్టుగా వర్ణించారు రచయిత. శాస్త్రిగారి ప్రతి కథా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేదే. ప్రస్తుతం ఈ సంపుటాలు అందుబాటులో లేవు. త్వరలోనే 'విశాలాంధ్ర' నుంచి కొత్త ప్రింటు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

బుధవారం, సెప్టెంబర్ 22, 2010

సరదాగా కాసేపు

చాలా రోజుల తర్వాత వంశీ సినిమాని రిలీజ్ రోజు రిలీజ్ షో చూడలేదు. వంశీ కూడా చాలా రోజుల తర్వాత పూర్తిగా కూర్చుని చూడగలిగే సినిమా ఇచ్చారు. సినిమా పేరు 'సరదాగా కాసేపు.' కాసేపే సరదాగా ఉంటుందని టైటిల్ లో చెప్పకనే చెప్పేశారు. అక్కడక్కడా రొడ్డకొట్టుడు కనిపించినా, మొత్తానికి సరదాగానే సాగిందీ సినిమా. వంశీ సినిమాల్లో మెజారిటీ సినిమాల్లాగే ఇదికూడా సింగిల్ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ. ఈ కథని తనకి కొట్టిన పిండైన కామెడీ చట్రంలో బిగించి రెండున్నర గంటల సినిమాగా మలిచాడు దర్శకుడు.

ఓ కోటీశ్వరుడి కొడుకు శ్రీనివాస్ ('అష్టా చమ్మా' ఫేం అవసరాల శ్రీనివాస్) అతని కారు డ్రైవర్ రంగబాబు (అల్లరి నరేష్) ల కథ ఇది. ఫారిన్ నుంచి చదువు పూర్తి చేసి వచ్చిన శ్రీనివాస్ కి పెళ్లి సంబంధం సెటిల్ చేసి ఉంచుతారు తలిదండ్రులు. వధువు మణిమాల (నూతన నటి మధురిమ) ఓ రిటైర్డ్ జైలర్ రాజారావు (ఆహుతి ప్రసాద్) కూతురు. పెళ్ళికి ముందు ఓ పది రోజులు అమ్మాయి ఇంట్లో గడిపి, ఆమె కుటుంబ సభ్యులందరినీ స్టడీ చేశాక గానీ పెళ్ళికి ఒప్పుకోనంటాడు శ్రీనివాస్.


అతని తలిదండ్రులు ఆమె తల్లిదండ్రులని ఒప్పించడంతో అమ్మాయిని చూడ్డానికి రంగాబాబుతో కలిసి అమ్మాయి ఊరు హైదరాబాద్ బయలుదేరతాడు, అమెరికన్ యాక్సంట్ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ, అమెరికన్ రోడ్ల మీద డ్రైవ్ చేసినట్టే కారు డ్రైవ్ చేస్తూ. శ్రీనివాస్ అతి తెలివి కారణంగా సృష్టించుకున్న సమస్యలు అత్తవారింట్లో అతనికోసం ఎదురు చూస్తూ ఉంటాయి. తొలిచూపులోనే మణిమాలతో ప్రేమలో పడిపోయిన రంగబాబు పరిస్థితులని తనకి అనుకూలంగా ఎలా మలుచుకున్నాడు? తన ప్రేమని పెళ్ళివరకూ ఎలా తీసుకెళ్లగలిగాడు? అన్నది మిగలిన కథ.

రాజారావు మిలటరీ డిసిప్లిన్, అతని సోదరుడు నీలకంఠం (ఎమ్మెస్ నారాయణ) అమాయకత్వంతో కూడిన మంచితనం మొదటి సగంలో చక్కని హాస్యాన్ని పుట్టించినా రెండో సగానికి వచ్చేసరికి విసుగు కలిగిస్తాయి. ముఖ్యంగా నీలకంఠం లాయర్ చిట్టిరాజు (కృష్ణ భగవాన్) నీలకంఠం నుంచి డబ్బులాగే సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా ఉన్నాయి. అయితే చిట్టిరాజుకి రంగబాబు కౌంటర్ ఇచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఈమధ్య వచ్చిన వంశీ సినిమాల్లో కామెడీ తో పోలిస్తే ఈ సినిమాలో సన్నివేశాలు చాలా నయమనే చెప్పాలి.


ప్రధాన పాత్రలు పోషించిన అల్లరినరేష్, అవసరాల శ్రీనివాస్ లు తమ పాత్రలకి న్యాయం చేశారు. అల్లరి నరేష్ మీద కొన్ని టైట్ క్లోజప్ షాట్లు తీయకుండా ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. కథానాయిక మధురిమకి అందమైన కళ్ళున్నాయి. కానీ ఆ కళ్ళలో ఎలాంటి ఎక్స్ప్రెషనూ పలికించాల్సిన అవసరం కానీ, పలికించడానికి అవకాశంకానీ లేని పాత్ర. మిగిలిన వాళ్ళంతా సీజండ్ ఆర్టిస్టులే, వాళ్ళ వాళ్ళ శైలిలో చేశారు. లోకి సినిమాటోగ్రఫీ బాగున్నప్పటికీ, ప్రారంభ సన్నివేశాల్లోనూ, నాయిక పరిచయ సన్నివేశంలోనూ క్లారిటీ లోపించినట్టుగా అనిపించింది. ఒకవేళ థియేటర్లో సమస్యేమో తెలీదు.

చక్రి సంగీతం ఎప్పటిలాగే ఇళయరాజా సంగీతాన్ని గుర్తు చేసింది. ఒకపాటకి స్టీలు డబ్బాలు, బిందెలు, కుండలతో వేసిన సెట్ ఆకట్టుకుంది. పాటలన్నీ ఒకలాగే వినిపించాయి. పూర్తి వంశీ మార్కు చిత్రీకరణ. ఒక్క 'నవ్వు' పాటలో మాత్రమే గోదారి కనిపించింది. మొత్తం మీద 'ఔను! వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!!' తర్వాత (ఆ స్థాయిలో లేనప్పటికీ) ఆసాంతమూ కూర్చుని చూడగలిగే సినిమాగా చెప్పాలి ఈ 'సరదాగా కాసేపు'ని. స్క్రిప్ట్ (ముఖ్యంగా రెండో సగం), డైలాగులు, సన్నివేశాల చిత్రీకరణ పరంగా మరికొంచం వైవిధ్యాన్ని చూపించగలిగితే మరింత చక్కని సినిమాగా అయి ఉండేది. అయితే, నెమ్మదిగా అయినా సరే.. వంశీ మళ్ళీ ట్రాక్ లో పడుతున్నాడన్న ఆనందాన్ని మిగిల్చిన సినిమా ఇది

బుధవారం, సెప్టెంబర్ 15, 2010

నాయికలు-సుభద్ర

జీవితం అంటే..?? ఇది అందరూ ఒకే సమాధానం చెప్పే ప్రశ్న కాదు. ప్రశ్న ఒక్కటే అయినా సమాధానాలు వేనవేలు.. సుభద్రకి మాత్రం జీవితం అంటే ఎదురు చూపు.. ఒక సుదీర్ఘమైన ఎదురు చూపు. గతాన్ని నెమరు వేసుకుంటూనే భవిష్యత్తుకోసం చూసే ఎదురు చూపు. అలా అని ఆమె వర్తమానాన్నీ, తన కర్తవ్యాన్నీ మర్చిపోలేదు.. జ్ఞాపకాల సమాధిలో కూరుకుపోలేదు. జి. కళ్యాణ రావు రచన 'అంటరాని వసంతం' లో ఒక ముఖ్య పాత్ర సుభద్ర. పుస్తకం పూర్తి చేసి పక్కన పెట్టినా పదే పదే వెంటాడే పాత్రల్లో ఒకటి.

ఎన్నెలదిన్నెలో పుట్టింది సుభద్ర. పిట్టోడి కూతురు ఆమె. "మాలింట పుట్టినా మాలక్ష్మిలా ఉంది" అని ఎన్నెలదిన్నెఊరు ఊరంతా అనుకుంది. పెద్దింటి ఆడవాళ్ళు కూడా తన కూతురిని ప్రత్యేకంగా చూసేలా పెంచాడు పిట్టోడు. ఆ పల్లెలో మోకాలి కిందకి చీర కట్టిన తొలి పడుచు ఆమె. మెడకీ, చెవులకీ బంగారాన్నీ అలంకరించుకున్నదీ, కాళ్ళకి తోలు చెప్పులు తొడిగిందీ ఆమె. అంత గారంగా పెంచాడు పిట్టోడు.. అంత అపురూపంగా పెరిగింది సుభద్ర.

అలాంటి సుభద్ర ఎల్లన్నని ప్రేమించింది. ఎల్లన్న అంటే ఆటెల్లడు, పాటెల్లడు. ఆటా పాటా అతని జీవితంలో ఒక భాగం. తల్లీ తండ్రీ ఉన్నా మేనత్త బూదేవి పెంపకంలో పెరిగాడు ఎల్లన్న. సుభద్ర మనసు తెలిసిన క్షణం నుంచీ ఎల్లన్న పాటంతా సుభద్రే అయ్యింది. చుక్కల ముగ్గుకర్ర అన్నాడు, పచ్చి పగడానివి అన్నాడు. పండు వెన్నెలవనీ అన్నాడు. బూదేవి చొరవతో వాళ్ళిద్దరి పెళ్ళీ జరిగింది.. తండ్రికి ఎదురు చెప్పి మరీ ఎల్లన్నని పెళ్లి చేసుకుంది సుభద్ర.

ఆ తర్వాత? ఎల్లన్న కోసం ఎదురు చూపులు మొదలయ్యాయి సుభద్రకి. అప్పటికే నాటకాల్లో పేరు తెచ్చుకున్న ఎల్లన్న, తన గురువు నాగన్నతో కలిసి ప్రదర్శనలకి పొరుగూళ్ళకి వెళ్ళడం మొదలు పెట్టాడు. మొదట పౌరాణిక నాటకాలే ఆడినా, తన కులానికి జరిగిన అన్యాయాలు ఒక్కొక్కటిగా తెలిశాక, తమ ఊరికథనే పాటగా మలిచాడు.. పాడడం మొదలు పెట్టాడు. ఆ పాటకి ముగింపు కేవలం శ్రోతల కళ్ళనుంచి జారే కన్నీరు కారాదనీ, వాళ్ళలో ఆలోచన మొదలవ్వాలనీ ఆశించాడు.

"కాస్త పనుంది..ఎల్లోస్తా" అని సుభద్రకి చెప్పి బయలుదేరాడు ఎల్లన్న. ఆ కాస్త పనీ అన్ని సంవత్సరాల ఎడబాటు అనుకోలేదు సుభద్ర. ఎల్లన్న ప్రతి పాట లోనూ సుభద్రని ఉంచాడు. సుభద్రకి చెబుతున్నట్టే పాడాడు. అతని పాటకి పల్లవి సుభద్ర. అల్లికకి అసలైన దారం. శివయ్యకి జన్మనిచ్చిన సుభద్ర ఎల్లన్న కోసం ఎదురు చూస్తూనే కొడుకుని పెంచి పెద్ద చేసింది. ఏనాడూ గడప దాటి ఎరగనిది కూడా, పంట పొలానికి రావాల్సిన నీళ్ళ కోసం ఊరిని ఎదిరించి, పారతో గట్టు తెగ్గొట్టింది.

ఊరు ఆమెని చూసి భయపడింది. ఆ భయం నుంచి ఆమెని ఒక దేవతని చేసేసింది. అయినా ఏమీ మాట్లాడలేదు సుభద్ర. తన పనేదో తనది. తిరిగే ఎల్లన్న కోసం ఎదురు చూడడం, పెరిగే శివయ్య కోసం చేల గట్లకు శక్తినంతా ధారపొయ్యడం తప్ప సుభద్రకి చెయ్యాల్సింది ఇంకేమీ లేదు. అంతా ఆశే. ఎల్లన్న ఎప్పటికైనా వస్తాడన్న ఆశ. శివయ్య తండ్రి దగ్గర లేకపోయినా గొప్పగా ఎదగాలనే ఆశ.

వలస కూలీల పిల్ల శశిరేఖ పాడిన పాటలో ఎల్లన్న జాడ పట్టుకోగలిగింది సుభద్ర. "మిన్నూ పానుపు మీద.. దూదీ దుప్పటి పైన.. సుక్కాల పూలగుత్తి సూబద్రా.. నువ్వు పచ్చీ పగడానివే సూబద్రా.." అంటూ ఆ పిల్ల పాడిన పాట తనవాడు అల్లినదే అని గుర్తు పట్టింది. ఎల్లన్న-సుభద్రల సమాగమం గుండెని పిండే ఒక సన్నివేశం. సుభద్రని మర్చిపోవడం అంత తేలిక కాదు..ఎల్లన్నకే కాదు, పాఠకులకి కూడా..

సోమవారం, సెప్టెంబర్ 06, 2010

శనగలమాసం

"ఇవ్వాళ శనగలు సాతాళించొద్దమ్మా.. మాటోళీ చేసుకుందాం. లేకపొతే వడలేసినా సరే.." అమ్మా, బామ్మా పేరంటానికి వెళ్ళడానికి సిద్ధపడుతుండగానే రాబోయే శనగలని ఏం చేయాలో నిర్ణయించేశాను నేను. శనగలతో బోల్డన్ని వంటకాలు చేసుకోవచ్చు కదా మరి. "మాటోళీ ఏవిటి మాటోళీ? పాటోళీ అనాలి. వెనకటికి నీలాంటి వాడే, చదువుకి ముందు కాకరకాయ్, చదువయ్యాక కీకరకాయ్ అన్నాట్ట.." బామ్మింకా ఏమో అనేదే కానీ తాతయ్య నన్ను రక్షించేశారు "వాడు సరిగ్గానే చెప్పేడు లేవే.. నువ్వు చేసేదాన్ని మాటోళీ అనే అనాలి..."

బామ్మ మాట తిరగెయ్యబోయింది కానీ అప్పుడే గేటు దాటి లోపలికి వస్తున్న ఆడవాళ్ళని చూసి ఆగిపోయింది. పట్టు చీరలు కట్టుకుని, బోల్డన్ని నగలు పెట్టుకుని వచ్చారు వాళ్ళు. మరి పేరంటానికి వెళ్ళాలంటే అలాగే తయారవ్వాలి కదా. అమ్మ, బామ్మా కూడా తయారైపోయారు. అసలు శ్రావణ మాసం వస్తుందనగానే తనకి ఉన్న రెండు పట్టు చీరలూ గుర్రమ్మకి వేసేస్తుంది అమ్మ, ఓ వంద జాగ్రత్తలు చెప్పి. పేరంటానికి పట్టు చీరలే కట్టుకుని వెళ్లాలని అమ్మ సిద్ధాంతం. బామ్మేమో కొత్తచీర పట్టుచీరతో సమానం అంటుంది.

రోజూ ఇంట్లో సరిగ్గా ముడైనా వేసుకోకుండా ఉంటుందా? పేరంటం అంటే బామ్మ ఎంత బాగా తయారవుతుందో. జుట్టు ముడేసి దానికి ఒక బన్ను పెడుతుందా.. అది జారి పడిపోకుండా ఇంగ్లిష్ 'యు' లా ఉండే పిన్నులు గుచ్చుతుంది. ఆ పిన్నులు కనిపించకుండా పైన పూలదండ. కొత్త చీర కట్టేసుకుని, నుదుటిమీద గుండ్రంగా సబ్బు రాసుకుని, ఆ తడిలో రాళ్ళ కుంకం దిద్దుకుంటే బామ్మ తయారైపోయినట్టే. అప్పటికే ముస్తాబులై వచ్చిన స్నేహితురాళ్ళు "ఆలీసం అయిపోతోంది.. తొరగా వచ్చేయండి.." అని తొందర పెట్టగానే అత్తా కోడళ్ళిద్దరూ పేరంటానికి బయలుదేరతారన్న మాట.

శ్రావణ మంగళవారం అంటే కనీసం అరడజను పేరంటాలు తప్పకుండా ఉంటాయి ఊళ్ళో. ఇవి కాకుండా ఇంటికొచ్చి వాయినం ఇచ్చేవాళ్ళు సరేసరి. ఇంటినిండా వద్దంటే శనగలు. సాతాళింపు, వంకాయి-శనగల కూర, శనగ వడలు, పాటోళీ...నెలంతా ఇవే వంటకాలు మాకు. అసలు ఈ పేరంటానికి వెళ్ళడం ఓ పెద్ద ప్రహసనం. మధ్యాహ్నం పేరంటానికి పొద్దున్న నుంచీ హడావిడి. మధ్యాహ్నం కాఫీలవ్వగానే బయలుదేరతారా, మళ్ళీ దీపాలు పెట్టే వేళకి ఇళ్ళు చేరేవాళ్ళు. మామూలుగా అయితే మగ పిల్లలకి పేరంటాల్లో ప్రవేశం లేదు.. మరి నాకు ఎలా దొరికిందంటే.. బోల్డు బోల్డు శనగలు పట్టుకుని ఒక్కసారే ఇంటికి రావడం అమ్మకీ, బామ్మకీ కష్టం కదా అందుకని నేను ప్రతి పేరంటానికీ వెళ్లి శనగలు ఇంటికి చేరేసే వాడినన్న మాట.

నేనలా పేరంటాలకి వెళ్ళడం బామ్మకి నచ్చేది కాదు. "వీడెందుకూ పోతు పేరంటాల్లా.." అనేది కానీ, నేనస్సలు పట్టించుకునే వాడిని కాదు. పేరంటంలో తను ఏం మాట్లాడిందో నేను తాతకి చెప్పేస్తానని బామ్మ అనుమానమని నాకు తర్వాతెప్పుడో తెలిసింది. అమ్మ నన్ను వద్దు అనేది కాదు కానీ బోల్డన్ని జాగ్రత్తలు చెప్పేది. ముఖ్యంగా ఎవరు మాట్లాడుతున్నా మధ్యలో వచ్చి నా అభిప్రాయాలు చెప్పొద్దని మరీ మరీ చెప్పేది. అలా పిలవని పేరంటంలా మాట్లాడకూడదుట కదా, అందుకన్న మాట. నేను అప్పుడప్పుడూ జాగ్రత్తగానే ఉండేవాడిని.

పేరంటం శనగల్లో వేసే కొబ్బరి ముక్కలు ఎంత బాగుంటాయో. శనగలు ఇంటికి తెచ్చినప్పుడల్లా నేను కొన్ని కొబ్బరి ముక్కలు నోట్లో వేసుకుని (అన్నీ తీసేసుకుంటే బామ్మకి అనుమానం వస్తుంది) దేవుడి గూట్లో నైవేద్యం కోసం పెట్టిన బెల్లం ముక్కలు కూడా బుగ్గన వేసుకుంటూ ఉండేవాణ్ణి.. అలా నోట్లోనే కొబ్బరి లౌజు తయారు చేసుకునే ఏర్పాటు ఉండేది. ఒక్కోసారి శనగలు మరీ ఎక్కువ వస్తే అమ్మ కొన్నింటిని ఆవుకి పెట్టేసేది. "పాడు చేసుకునే కన్నా, దూడకి పెడితే పుణ్యం" అంటూ.

అసలు పేరంటంలో ఎన్నేసి విషయాలు మాట్లాడుకుంటారంటే.. కొత్తగా చేయించుకున్న నగల మొదలు, రేడియోలో వచ్చే నాటకాల వరకూ దొర్లని టాపిక్ ఉండదు. పిల్లల చదువులు, పక్కింటి వాళ్ళతో గొడవలు..ఇవన్నీవినిపిస్తూ ఉండేవి. ఒక్కోసారి మాటా మాటా పెరిగి సిగపట్ల వరకూ వెళ్ళిపోయేది వ్యవహారం. మళ్ళీ వాళ్ళలో వాళ్ళే సర్దుబాటు చేసేసుకునే వాళ్ళు. ఎవరైనా పేరంటానికి రాకపోతే వాళ్ళ గురించి కొంచం ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళు. అందుకేనేమో బామ్మెప్పుడూ పేరంటం మిస్సయ్యేది కాదు. ఇప్పుడెక్కడా అలాంటి సందడి కనిపించడం లేదు.. కొన్నాళ్ళు పోతే "ఒకప్పుడిలా పేరంటాలు జరిగేవి" అని చెబితే నమ్మరేమో కూడా..

శుక్రవారం, సెప్టెంబర్ 03, 2010

అమ్మకి జేజే!

'తొలి గురువు' అనే మాటకి పర్యాయపదం అమ్మ. తల్లిదండ్రుల దగ్గర బాల్యాన్ని గడిపిన వారిలో ఏ ఒక్కరూ కూడా "నా మీద అమ్మ ప్రభావం లేదు" అని చెప్పలేరు. అదీ అమ్మ గొప్పదనం. సామాన్యులు మాత్రమే కాదు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అమ్మ ప్రభావంతో పెరిగిన వాళ్ళే. 'ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే' అన్న సామెత ఊరికే పుట్టిందా మరి. అలా కొందరు గొప్పవాళ్ళు తమ తల్లుల గురించీ, తమ మీద వాళ్ళ ప్రభావం గురించీ చెబుతూ రాసిన వ్యాసాల సంకలనమే 'అమ్మకి జేజే!'

తెలుగు సాహిత్యంలో 'మిట్టూరోడు' గా ప్రసిద్ధుడైన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు సంకలనం చేసిన ఈ పుస్తకం లో ముళ్ళపూడి వెంకటరమణ మొదలు హెచ్. జే. దొర వరకూ వివిధ రంగాలకి చెందిన పదిహేడు మంది పెద్దలు తమ తమ మాతృమూర్తులని స్మరించుకున్నారు. వీరిలో చాలా మంది పెద్దవాళ్ళై ఆయా రంగాల్లో పేరు తెచ్చుకోడానికి బీజం పడింది బాల్యంలోనే అనీ, అందుకు కారకురాలు కన్న తల్లేననీ అర్ధమవుతుంది వారి వారి వ్యాసాల ద్వారా.

కష్టపడి పనిచేయడం నేర్పిన తన తల్లి అమ్మణ్ణమ్మని తలచుకున్నారు నారా చంద్రబాబు నాయుడు 'మా అమ్మ బలే కష్టజీవి' వ్యాసంలో. తన తల్లి చెప్పిన నక్కబావ, పందిబావ కథ పల్లెటూరి జనానికి భగవద్గీతతో సమానం అంటారాయన. ఆస్తులెన్ని సంపాదించినా సొంతూరు బుర్రుపాలెం లో పొలం ఉనాల్సిందేనని పట్టుపట్టి భూమి కొనిపించిన తన తల్లి నాగరత్నమ్మని జ్ఞాపకం చేసుకున్నారు 'సూపర్ స్టార్' కృష్ణ.

చిన్నప్పుడు అల్లరి చేస్తే తనకి తాడుకట్టి నూతిలోకి దించిన తల్లి శకుంతలమ్మ కోపాన్నీ, ఆపై ఆమె చూపిన ప్రేమనీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గుర్తు చేసుకుంటే, 'ఎవరైనా నీ కొడుకు గద్దర్ అంటే, ఏం లే నాకొడుకు విఠలే' అనే తన తల్లి లచ్చుమమ్మని అపురూపంగా జ్ఞప్తికి తెచ్చుకున్నారు ప్రజా గాయకుడు గద్దర్. ఆయన రాసిన తొలిపాట 'సిరి మల్లె చెట్టుకింద లచ్చుమమ్మా..'

తను ఎన్ని విజయాలు సాధించినా వాటిని ఇంట్లో నుంచే ఆస్వాదించిన తన తల్లి విశాలాక్షిని 'నాలుగో సింహం మా అమ్మ' అంటూ తలచుకున్నారు గాయని రావు బాలసరస్వతి. 'సోగ్గాడే చిన్ని నాయనా..' కూని రాగం తీస్తే దండించిన తల్లే, ఆ తర్వాత మంగళంపల్లి బాలమురళికృష్ణ లాంటి గాయకులు తమ ఇంటికి వచ్చినప్పుడు ఎంతగానో ఆనందించడం జీవితకాలపు జ్ఞాపకం ఆవిడకి.

"మా మేనకోడలి పేరు బాపూ రమణల 'ఛీ గాన పచూనాంబ' (శ్రీ జ్ఞాన ప్రసూనాంబ). దానిని మేమంతా పాపాయి అని పిలుస్తాము. దాన్ని పేరు పెట్టి పిలిచే ధైర్యం మా ఇంట్లో ఎవ్వరికీ లేదు. అది మా అమ్మ పేరు - అందుకని!" అని చెప్పిన మాలతీ చందూర్ ఆ ఒక్క వాక్యంలోనే తల్లి పట్ల తమ భయభక్తులని చెప్పేశారు.

తన కూతురి చేత అప్పర్ క్లాత్ ధరింపజేయాలని పట్టుబట్టడం మొదలు, సెట్లో దర్శకులకీ హీరోలకీ ఆంక్షలు పెట్టడం వరకూ తననో వెండితెర కలల రాణిగా తీర్చి దిద్దడం వెనుక తల్లి చేసిన కృషిని జ్ఞప్తికి తెచ్చుకున్నారు జమున. తన తల్లిని 'వెలకట్టలేని నగ' గా అభివర్ణించారు చిత్రకారుడు ఎస్వీ రామారావు. 'నన్ను కనేందుకే జన్మించిన మా అమ్మ!' అని మంగళంపల్లి బాలమురళి కృష్ణ రాస్తే, 'అమ్మ-కల్పవృక్షపు కొమ్మ' అన్నారు సహస్రావధాని మేడసాని మోహన్.

బాపూ రమణలు తమ తల్లుల గురించి రాసిన వివరాలు 'కోతి కొమ్మచ్చి' లోనూ, భానుమతీ రామకృష్ణ తల్లిగారికి సంబంధించిన సంగతులు ఆమె ఆత్మకథ 'నాలో నేను' లోనూ ప్రచురితమవ్వగా, చిరంజీవి తన తల్లిని గురించి రాసిన విశేషాలు 'ప్రజారాజ్యం పార్టీ' ప్రకటించినప్పుడు తిరుపతి సభలో అభిమానులతో పంచుకున్నవే. చదవడం పూర్తిచేశాక సంకలనాన్ని ప్రచురించిన నామినిని అభినందించకుండా ఉండలేం. ('అమ్మకి జేజే!,' టాంసాయర్ ప్రచురణలు, పేజీలు:116, వెల: రూ. 50, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

గురువారం, సెప్టెంబర్ 02, 2010

ఏడాది తర్వాత...

వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణించి ఏడాది పూర్తయ్యింది. గడచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. నాయకత్వ లోటు చాలా సార్లు స్పష్టంగా బయట పడింది. కాంగ్రెస్ అధిష్టానానికి సొంతమైన 'వేచి చూసే ధోరణి' వై.ఎస్. వారసుడి ఎంపిక విషయంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. రక్తం పంచుకుని పుట్టిన వారసుడు పదవీ వారసత్వం కోసం తన ప్రయత్నాలని కొనసాగిస్తూనే ఉన్నాడు.

ఆరేళ్ళ పాలనలో వైఎస్ ఇచ్చిన హామీలని అమలు పరచడం, వైఎస్ మరణం తర్వాత ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నరోశయ్యకి తలకి మించిన భారంగా పరిణమించింది. వాటిని అమలు పరచలేక, అమలు పరచాలేనని చెప్పలేక రోశయ్య పడుతున్న అవస్థ వర్ణనాతీతం. ఇది చాలదన్నట్టు వైఎస్ తనయుడు పోషిస్తున్న 'అసమ్మతి' పాత్ర ప్రస్తుత ముఖ్యమంత్రికి కంటిమీద కునుకుని దూరం చేసింది.

గడిచిన ఏడాది కాలంగా రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరగబోతోందన్నది ఎవరి ఊహకీ అందడం లేదు. ఈ ఏడాది కాలంలోనూ పోలీసు వ్యవస్థ బాగా బలపడిందని చెప్పాలి. అలాగే న్యాయ వ్యవస్థ ప్రభుత్వం మీద చురకలు వేస్తూనే ఉంది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కొత్త విషయం కాకపోయినా గడిచిన ఏడాది కాలంగా ఈ పెంపు ఊహించని వేగంతో పైపైకి పోతోంది.

ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అప్పుడప్పుడూ 'ప్రభుత్వానికి సహకరిస్తోందా?' అన్నసందేహం కలుగుతోంది. ధరల పెరుగుదల మీద అయితేనేమి, అవినీతి ఆరోపణల మీద అయితేనేమి ప్రతిపక్షం స్పందించాల్సినంతగా స్పందించడం లేదన్న భావన కలుగుతోంది. ఇక ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఏడాది కాలంగా ఎన్నో మలుపులు తిరిగింది. ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణా రాష్ట్ర సమితికి బోల్డంత బలాన్నీ, స్తైర్యాన్నీ ఇచ్చాయన్నది నిర్వివాదం.

వైఎస్ కుటుంబానికి చెందిన పత్రిక, టీవీ చానల్ చెబుతున్న రీతిలో జరుగుతున్న ప్రతి అంశాన్నీ వైఎస్ లేకపోవడంతో ముడి పెట్టలేం. అలా అని ప్రస్తుత వ్యవస్థ సమర్ధంగా పనిచేస్తోందనీ అనలేం. రాష్ట్ర స్థాయిలో ఏ నిర్ణయాన్నీ స్వతంత్రంగా తీసుకోక పోవడం, ప్రతి చిన్న విషయానికీ కేంద్రం మీద ఆధార పడడం, 'అంతా హైకమాండే చూసుకుంటుంది' అన్న ధోరణి సమస్యలని పెంచి పోషిస్తున్నాయి.

అటు కాంగ్రెస్ అధిష్ఠానం సైతం ప్రతి విషయానికీ నాన్చుడు ధోరణినే అవలంబిస్తోంది. రాజ్ భవన్ లో జరిగిన కొన్ని సంఘటనలు, ఫలితంగా జరిగిన కొన్ని మార్పుల నేపధ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబోతున్నారా? అన్న సందేహం కలిగినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇప్పటి ప్రభుత్వానికి (?) ఏ ఇబ్బందీ లేనట్టే కనబడుతోంది. బహుశా ఇప్పటి ప్రభుత్వం అధిష్టానానికి చాలా సౌకర్యవంతంగా ఉన్నట్టుంది. రాష్ట్ర రాజకీయంలో మార్పులు తేనున్న 'వారసుడి' నిర్ణయం జరిగేవరకూ పరిస్థితుల్లో పెద్దగా మార్పులు ఉండవనే అనిపిస్తోంది..

బుధవారం, సెప్టెంబర్ 01, 2010

కన్నయ్య కనిపించడేం...?

ఉదయం నుంచీ అలుపెరగకుండా వెతుకుతున్నాను. అయినా కనిపించలేదు.. ఎవరి మీద కోపం వచ్చిందో? ఎందుకు అలిగాడో? ఏ రాచకార్యం భుజాన వేసుకున్నాడో? ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో..? ఎందెందు వెతికినా కన్నయ్య జాడ లేదు. ఏమైపోయాడో మరి.. ఉదయాన్నేఇవాళ కృష్ణాష్టమి అన్న విషయం గుర్తొచ్చి 'ఆ రెండు చానళ్ళు' మార్చి మార్చి చూశాను.

నిరాశా నిస్పృహలు ముప్పిరిగొంటున్న వేళ... ఇంటి గుట్టు రచ్చ చేసి ఊరంతా హడావిడి చేసిన వాళ్ళ చానల్ లో కనిపిస్తాడేమో అన్న ఆశతో వెతికాను. ప్చ్.. లాభం లేకపోయింది. నేను వెతుకుతున్న కన్నయ్య నివాసం ఉండేది ద్వారకలో కాదు. గిన్నీసు పుస్తకంలో చోటు సంపాదించిన చిత్ర నగరిలో. బుల్లి తెరని ఏక చత్రాధిపత్యంగా ఏలి, ఆ తర్వాత వెండితెరపై ఓ మెరుపు మెరిసి, సంచలనాలు సృష్టించిన నల్లనయ్య ఇప్పుడెందుకో నల్లపూసైపోయాడు.

ఒకప్పుడు నాకు కృష్ణుడంటే అన్నగారే.. పౌరాణిక సినిమాల పుణ్యమా అని రాముడినీ, కృష్ణుడినీ తలచుకోగానే మొదట నందమూరి తారకరాముడి రూపమే కళ్ళముందు మెదిలేది. 'రామజన్మభూమి' శిలాన్యాసం పుణ్యమా అని రాముడి స్థానాన్ని అప్పట్లో ఊరేగించి, పూజలు చేసి అయోధ్యకి పంపిన పాల రాతి శిల ఆక్రమించింది.

ఇక కృష్ణుడిది కొంచం పెద్ద కథే.. ఓ పుష్కర కాలం క్రితం స్కూలు వార్షికోత్సవానికి వెళ్ళాల్సి వచ్చింది. పిల్లలంతా విచిత్ర వేషాలు వేసి ఆడి పాడుతున్న వేళ, ఉన్నట్టుండి ఓ భారీ కృష్ణుడు స్టేజీ మీద ప్రత్యక్షమయ్యాడు. వస్తూనే భగవద్గీత శ్లోకమొకటి అందుకుని ఆపై ఎవరు ఆపమన్నా ఆపకుండా తనకి అలుపు వచ్చే వరకూ శ్లోకాలు చదువుతూనే ఉన్నాడు, తనవైన హావభావాలతో సహా..

ఉదు కృష్ణుడిని స్టేజి మీద చూడగానే తమ పిల్లలకి దిష్టి తగలదు లెమ్మని సంతోష పడ్డ తల్లిదండ్రులకి శోష వచ్చినంత పనయ్యింది. మొత్తానికి ఆవేళ మాకందరికీ శ్రీకృష్ణుల వారి దివ్య దర్శనం ప్రాప్తించింది. అప్పుడప్పుడూ ఆ కృష్ణుడిని తల్చుకుని ఉలికిలికి పడుతుండగానే ఓ శుభోదయాన బుల్లితెరమీద మరో ముద్దు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.

ప్రత్యక్షం అయ్యీ అవుతూనే బలరాముడితో కయ్యానికి సయ్యన్నాడీ కృష్ణుడు. అలా 'శ్రీకృష్ణ బలరామ యుద్ధం' చూసిన నాటినుంచీ కృష్ణుడిని తలుచుకోగానే సుమనోహరుడు చిరునవ్వులు చిందిస్తూ కళ్ళ ముందు కనిపించడం మొదలుపెట్టాడు. టీవీలో ప్రసారమైన రెండుసార్లూ ఆ యుద్ధాన్ని చూసి, పదే పదే తలుచుకుని ఆనందిస్తుండగానే 'ఉషా పరిణయం' జరిపించేశారు స్వామి.

అంతేనా? ఆది విష్ణువుని కీర్తిస్తూ 'శ్రీహరి స్వరాల'ను ఆశువుగా ఆలపించి యావదాంధ్ర దేశాన్నీ భక్తిరస సాగరంలో ఓలలాడించారు..కీర్తించే భక్తుడూ, ఆలకించే స్వామీ తానే అయ్యారు. ఇవన్నీ చూసిన వాళ్లకి కృష్ణుడనగానే కళ్ళ ముందు మరో రూపం ఎలా కనిపించగలదు?? అంతఃపురం లో రాధమ్మని లాలిస్తున్నాడో.. కంసుడి పీచమణుస్తున్నాడో.. ఆయన లీలా వినోదాలు ఆయనకి మాత్రమే తెలుసు.. మము పాలింపగ టీవీ తెర మీదకి రావయ్యా కృష్ణయ్యా....