శుక్రవారం, నవంబర్ 27, 2020

ది హంగర్ గేమ్స్

గత కొద్ది నెలలుగా థాయిలాండ్ లో నిరసనలు జరుగుతున్నాయి. పాలనా విధానాలని నిరసిస్తూ నిరసనకారులు రాణికి మూడు వేళ్ళు చూపించండం, వెనువెంటే పాలకులు ఆ నిరసనకారుల్ని శిక్షించడమే కాకుండా 'మూడువేళ్ళ నిరసన' మీద నిషేధం విధించడం కూడా జరిగిపోయింది. దీన్ని నిరసించేవాళ్లూ మూడువేళ్ళ మార్గమే ఎంచుకోవడంతో అంతర్జాతీయ వార్తల్లో ఈ వేళ్ళు చూపించే నిరసన ఫోటోలు కొంచం తరచుగా కనిపిస్తున్నాయి. 'అసలీ మూడువేళ్ళ నిరసన' పుట్టుపూర్వోత్తరాలేమిటని వెతకడం ప్రారంభిస్తే 2008 లో వచ్చిన ఓ ఇంగ్లీష్ నవలలో మొదటిసారిగా ఈ తరహా నిరసన ప్రస్తావన ఉందని తెలిసింది. అంతే కాదు, ఆ నవలకి తర్వాత మరో రెండు భాగాలు కొనసాగింపు రావడం, అదే కథతో హాలీవుడ్ లో సినిమా కూడా నిర్మాణమవ్వడం అనేది నాకు దొరికిన అదనపు సమాచారం. ఆ బెస్ట్ సెల్లర్ నవల పేరు 'ది హంగర్ గేమ్స్', రచయిత్రి సూసన్ కాలిన్స్. 

Google Image

కథానాయిక పదహారేళ్ళమ్మాయి కాట్నిస్ ఎవర్దీన్. పానెమ్ అనే దేశంలో డిస్ట్రిక్ట్-12 లో తన తల్లి, చెల్లెలితో కలిసి నివసిస్తూ ఉంటుంది. డిస్ట్రిక్ట్-12 బొగ్గు గనులకి పెట్టింది పేరు. 'సీమ్' అనే ముద్దు పేరు కూడా ఉంది. పానెమ్ రాజధాని కాపిటోల్ మినహా మిగిలిన ప్రాంతాలన్నీ బాగా వెనకబడినవి. ప్రజలందరికీ రోజు గడవడమే కష్టం. కాట్నిస్ తండ్రి బొగ్గు గనిలో కార్మికుడిగా పనిచేస్తూ గనిలో జరిగిన ప్రమాదంలో మరణించి ఐదేళ్లయింది. ఆ సంఘటనతో తల్లి షాక్ లోకి వెళ్ళిపోయింది. ఆయుర్వేద వైద్యం చేసే ఆమె పూర్తిగా కోలుకుని మనుషుల్లో పడకపోవడంతో తల్లిని, చెల్లిని పోషించే బాధ్యత కాట్నిస్ మీదే పడింది. స్కూల్ కి వెళ్లొస్తూనే, డిస్ట్రిక్ట్-12 ని ఆనుకుని ఉండే అడవుల్లోకి వెళ్లి చిన్న చిన్న పక్షుల్ని, జంతువుల్నీ వేట చేసి, పళ్లనీ, దుంపల్నీ పట్టుకొచ్చి ఊళ్ళోనే ఉన్న బ్లాక్ మార్కెట్లో అమ్మి ఇంటి అవసరాలు గడుపుతూ ఉంటుంది కాట్నిస్. వేటలో ఆమె స్నేహితుడు గేల్ ఎంతో సహాయం చేస్తూ ఉంటాడామెకి. 

నిజానికి పానెమ్ మొత్తాన్ని 13 డిస్ట్రిక్ట్స్ గా విభజించారు. డిస్ట్రిక్ట్-13 లో ప్రజలు పాలకులని వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో, పాలకులే ఆ ప్రాంతం మొత్తాన్ని సర్వ నాశనం చేశారు. అప్పటినుంచీ ప్రజల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారు కాపిటోల్ లో ఉండే నాయకులూ, అధికారులూ. పానెమ్ కే ప్రత్యేకమైన క్రీడ 'హంగర్ గేమ్స్.' దేశం మొత్తంలో ఉండే 12-18 ఏళ్ళ పిల్లలందరికీ ఏడాదికి ఒకసారి ఈ గేమ్స్ జరుగుతాయి. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచీ ఒక అబ్బాయిని, ఒక  అమ్మాయిని లాటరీ ద్వారా ఎంపిక చేసి కెపిటోల్ కి పంపాలి. అక్కడ ఈ 24 మందినీ ట్రిబ్యూట్స్ అని పిలుస్తారు. వీళ్లందరినీ ట్రేస్ చేసేలా వాళ్ళ ఒంట్లో చిప్స్ ఇంజెక్ట్ చేసి, ఓ విశాలమైన ఎరీనా లోకి వదులుతారు. ఎరీనా మొత్తం కెమెరాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ 24 మందీ ఒకరినొకరు చంపుకోవాలి. చివరికి మిగిలిన ఒక్కరూ విజేత. ఈ క్రీడలు టీవీలో ప్రసారమైనప్పుడు ప్రజలంతా తప్పక చూడాల్సిందే. 

కాట్నిస్ చెల్లెలు ప్రిమ్ ఆ ఏడే పన్నెండో ఏట అడుగుపెట్టింది. హంగర్ గేమ్స్ కి జరిగే సెలక్షన్స్ కి కూతుళ్ళిద్దరినీ తయారు చేసి తీసుకెళ్తుంది తల్లి. పద్దెనిమిదేళ్ల గేల్ కూడా హాజరవుతాడా కార్యక్రమానికి. లాటరీ మొదలవుతుంది. ముందుగా అమ్మాయి ఎంపిక. లాటరీలో ప్రిమ్ పేరు ప్రకటిస్తారు నిర్వాహకులు. చెల్లెలి తరపున తాను క్రీడల్లో పాల్గొంటానని ముందుకొస్తుంది కాట్నిస్. అబ్బాయిల తరపున ఎంపికైన వాడు పీటా. స్థానిక బేకరీ నిర్వాహకుడి కొడుకు. పీటాకి అన్నదమ్ములున్నా వాళ్ళెవరూ ముందుకి రారు. ఎన్నో ఏళ్ళ క్రితం హాంగర్ గేమ్స్ విజేతగా నిలిచిన డిస్ట్రిక్ట్-12 వాసి హ్యమిచ్ వీళ్లిద్దరికీ కోచ్ గా కాపిటోల్ బయల్దేరతాడు. ప్రత్యేకమైన రైల్లో కాపిటోల్ బయల్దేరతారు ట్రిబ్యూట్స్ బృందం. అడుగడుగునా డిస్ట్రిక్ట్-12 ని కాపిటోల్ ని పోల్చుకుని విస్తుపోతూ ఉంటుంది కాట్నిస్. డిస్ట్రిక్ట్-12 (ఆమాటకొస్తే దేశం మొత్తం) ఎంత పేదరికంలో ఉంటుందో, కాపిటోల్ లో అంత ఐశ్వర్యం ఉంటుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీకి లోటే లేదు. 

Google Image
ఎరీనాలోకి పంపేముందు ట్రిబ్యూట్స్ అందరినీ కాపిటోల్ లో ఊగించి, అటుపైన అందరితోనూ టీవీ ఇంటర్యూలు తీసుకోవడం ఆనవాయితీ. కాట్నిస్ కి డిజైనర్ గా వచ్చిన సిన్నో అనే యువకుడు ఆమెని కొత్తగా ప్రెజెంట్ చేయాలి అనుకుంటాడు. ఆమె ప్రాంతం బొగ్గుగనులకి ప్రసిద్ధి కనుక, ఆ ఆ విషయాన్ని ప్రజలకి గుర్తు చేసేలా నల్లని దుస్తులు వేసి, తలపైన ఓ వెలుగుతున్న కుంపటిని అలంకరిస్తాడు. దాంతో 'గాళ్ ఆన్ ఫైర్' గా అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది కాట్నిస్. టీవీ ఇంటర్యూలో పీటా తాను చిన్నప్పటినుంచీ కాట్నిస్ ని ప్రేమిస్తున్నానని, ఇప్పటివరకూ ఆమెకా విషయం చెప్పలేదని చెప్పడంతో షాక్ కి గురవుతుంది. జనం అందరికీ ఈ జంట మీద ప్రత్యేకమైన ఆసక్తి కలుగుతుంది. చివరికి ఎవరో ఒకరే మిగలాలనే నిబంధన ఉంది కాబట్టి, ఎరీనాలో ఈ ఇద్దరి మధ్యా పోటీ ఎలా ఉంటుందనే చర్చ మొదలవుతుంది. ఇలా వార్తల్లో ఉండడం వాళ్ళ స్పాన్సర్లని సంపాదించడం సులువవుతుంది కాట్నిస్ ని ఒప్పిస్తాడు హేమిచ్. 

ట్రైనింగ్ లో 'కెరీర్ ట్రిబ్యూట్స్' ని ప్రత్యేకంగా గమనిస్తుంది కాట్నిస్. ఇలా గేమ్స్ కోసం పిల్లని ప్రత్యేక శిక్షణతో తయారు చేయడం నియమాలకు విరుద్ధమే అయినా కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రం ఎంపిక చేసిన పిల్లల్ని ఇందుకోసం తయారు చేస్తూ ఉంటాయి. వాళ్ళకి 'కెరీర్స్' అని పేరు. తనకి మొదటి ముప్పు కెరీర్స్ నుంచే అని అర్ధం చేసుకుంటుంది కాట్నిస్. ఎరీనా లో అటవీ ప్రాంతం కూడా ఉండడం కాట్నిస్ కి కొంత ఊరట. ప్రతి రోజూ రాత్రి ఆకాశంలో కనిపించే అప్డేట్స్ ద్వారా మాత్రమే గేమ్స్ లో ఇంకా ఎవరు మిగిలిఉన్నారో తెలుసుకునే వీలుంటుంది ట్రిబ్యూట్స్ కి. వాళ్ళపని ఎవరికీ దొరక్కుండా తమని తాము రక్షించుకోవడం, మరొకరు ఎవరు కనిపించినా అంతమొందించడం. తన ఈడు పిల్లల కన్నా చాలా ముందే జీవన పోరాటం చేయడం మొదలు పెట్టిన కాట్నిస్ ఈ గేమ్స్ లో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంది? చివరికి విజేత కాగలిగిందా అన్నది ముగింపు. మొదటి భాగం తర్వాత మరో రెండు నవలలు (కాచింగ్ ఫైర్, మాకింగ్ జే) వచ్చాయి. ఆపకుండా చదివించే కథనం. ఇంతకీ ఈ మొదటిభాగంలో 'మూడువేళ్ళ నిరసన' ఒకట్రెండు చోట్ల ప్రస్తావనకు వచ్చిందంతే. 

శనివారం, నవంబర్ 21, 2020

మిడిల్ క్లాస్ మెలొడీస్

మలయాళంలో వస్తున్న నేటివిటీ సినిమాలు చూసి ఆహా ఓహో అనుకోడమే కాదు, మనవాళ్ళు అలాంటి ప్రయత్నం చేసినప్పుడు చూడాలి కూడా అనే స్ఫురణ కలిగి చూసిన సినిమా  'మిడిల్ క్లాస్ మెలొడీస్.'  భవ్య క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకి కొత్తదర్శకుడు వినోద్ అనంతోజు దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్లు. కథ మొత్తం గుంటూరు (టౌన్/సిటీ), చుట్టుపక్కల ఊళ్లలో జరగడం ఈ సినిమా ప్రత్యేకత. పైగా, హీరో రాఘవకి గుంటూరులో ఓ హోటల్ పెట్టి తను బ్రహ్మాండంగా చేస్తానని అనుకుంటున్న 'బొంబాయి చెట్నీ' (శనగపిండి ఉడకపెట్టి చేస్తారు, గోదావరి జిల్లాల్లో 'చింతామణి చట్నీ' అనేవారు - సుబ్బిశెట్టి గారి 'చింతామణి' కాదు) రుచిని అక్కడివాళ్ళకి చూపించి వాళ్ళ మెప్పు పొందాలన్నది ఆశయం.

తల్లిదండ్రులు (థియేటర్ నటులు సురభి ప్రభావతి, గోపరాజు రమణ) హోటల్ వ్యాపారంలోనే ఉన్నారు కానీ, గుంటూరుకి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పల్లెటూరిలో.  అలా చిన్నప్పటినుంచీ హోటల్ అనేది రాఘవ జీవితంలో ఓ భాగం. పైగా గుంటూరు కొత్తేమీ కాదు. మామ వరసయ్యే నాగేశ్వరరావు ఉండేది అక్కడే. ఆ మావయ్య కూతురు సంధ్య ఇంటర్మీడియట్ నుంచీ రాఘవని మూగగానూ, మాటల్లోనూ ఆరాధిస్తూ ఉంటుంది కూడా. మామయ్యకి షాపు ఉంది కానీ, అతగాడు 'తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే' అని నమ్మిన మనిషి. రాఘవకేమో తండ్రి సాధింపు, పాతికేళ్ళొచ్చేసినా ఇంకా ప్రయోజకుడవ్వలేదని. అక్కడ ఇంటర్లో క్లాస్మేట్ సంధ్యేమో ఇంకా ఇంజినీరింగ్ చదువుతూ.... ఉంటుంది (ఆమెది బాగా కష్టమైన బ్రాంచో, హీరో ఆలీసెంగా బళ్ళో చేరేడో తెలీదు మరి). 

రాఘవ నానా రకాల కష్టాలూ పడి తండ్రి తిట్లు, తల్లి దీవెనల నేపథ్యంలో మావయ్య షాపులోనే 'రాఘవ టిఫిన్ సెంటర్' మొదలు పెడతాడు.  అదిమొదలు, అప్పటివరకూ చక్కగా పక్కింటి కుర్రాడిలా ఉన్నవాడు కాస్తా వింతగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండకి తమ్ముడనీ, ఆ విజయ్ కి 'అర్జున్ రెడ్డి' అనే బలమైన ఇమేజి ఉందనీ దర్శకుడికి ఉన్నట్టుండి జ్ఞాపకం వచ్చిందేమో అని సినిమా చూసే ప్రేక్షకులకి  అనుమానం వచ్చేసేలా మన రాఘవ చీటికీ మాటికీ అందరితోనూ గొడవలు పెట్టేసుకుంటూ ఉంటాడు. తన హోటల్ కి కష్టమర్లు బొత్తిగా రారు. అప్పుడు హీరోయినొచ్చి, ప్రేక్షకులందరి తరపునా వకాల్తా పుచ్చుకున్నట్టుగా, "నువ్వు చేసే బొంబాయి చెట్నీ అంత గొప్పగా ఏమీ ఉండదు. దాన్నే నమ్ముకుంటే కష్టం. కాస్త నేలమీదకి దిగు" అని చెప్పి వెళ్తుంది. 

హోటల్ వ్యాపారంతో పాటు, రియలెస్టేటు, రాజకీయాలు, కాంట్రాక్టులు, చిట్ ఫండ్లు, జాతకాలు, సోషల్ రెస్పాన్సిబిలిటీ.. ఇలా అనేక విషయాలని కథలో భాగం చేసే ప్రయత్నం చేశాడు కొత్త దర్శకుడు. గుంటూర్లో హోటల్ పెట్టాలని కలలు కనే హీరో, తన ఊళ్ళో హోటల్ కి వచ్చిన కష్టమర్లని తక్కువ చేసి మాట్లాడ్డం ఏవిటో అర్ధం కాదు.  కష్టమర్లని  అవమానించి ఏ వ్యాపారస్తుడూ మనజాలడు కదా. సదరు గ్రామస్తులు కూడా, ఓ కాకా హోటల్ వాడు మనల్ని ఇన్నేసి మాటలు అనడం ఏమిటన్న ధ్యాస లేకుండా అతగాడు హీరో, మనం జూనియర్ ఆర్టిస్టులం అన్నట్టుగా ఊరుకుండి పోతారు. హీరో తండ్రిదీ పెద్దనోరే కానీ అతనెప్పుడూ కష్టమర్ల మీద అరిచినట్టుగా చూపించలేదు. అగ్రెసివ్ తండ్రి పాత్రని గోపరాజు రమణ బాగా చేశాడు. మన తెలుగు సినిమా హీరోహీరోయిన్లకి ఓ 'తెలుగు తండ్రి' దొరికినట్టే. 

రాఘవ ఫ్రెండ్ గోపాల్ (చైతన్య గరికిపాటి) కేరక్టర్ డిజైన్ బాగుంది. హీరో లవ్ ట్రాక్ కన్నా ఇతని లవ్ ట్రాకే ఆసక్తికరంగా అనిపించింది. ఈ కుర్రాడు, ఇతనికి జతగా నటించిన అమ్మాయి (దివ్య శ్రీపాద) చాలా సహజంగా చేశారు. పౌరాణిక, జానపద నాయికగా రంగస్థలాన్ని ఏలిన సురభి జమునా రాయలుని సినిమాలో చూడడం భలేగా అనిపించింది. ఓపెనింగ్ సీన్ లో కుర్చీతో మేడెక్కే బామ్మగా కనిపించిందీమె. హీరో తల్లిగా వేసిన సురభి ప్రభావతి కేఆర్ విజయని జ్ఞాపకం చేసింది. డిఫరెంట్ సినిమా తీద్దామని మొదలెట్టిన దర్శకుడు మధ్యమధ్యలో రొటీన్ తెలుగు సినిమా ఫార్ములాలోకి జారిపోతూ, పడుతూ లేస్తూ తాపత్రయ పడడం స్పష్టంగా తెలుస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో డ్యూయెట్లు, 'ప్రత్యేక' గీతాలు, ఫైట్లని ఇరికించక పోవడం పెద్ద రిలీఫ్. 

కొన్ని సీన్లు అవసరానికి మించి సా..గడం, మరికొన్ని అర్ధాంతరంగా ఆగిపోయినట్టు అనిపించడం ఎడిటర్ జాగ్రత్తపడవలసినవి. పాటలు, నేపధ్య సంగీతం బాగున్నాయి. గుంటూరుని పూర్తి స్థాయిలో తెరమీద చూపించలేదన్న లోటుని క్లైమాక్స్ తీర్చేస్తుంది. ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించిన 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లైమాక్స్ లో ప్రత్యేక ఆకర్షణ. ఇతగాడు ప్రయాణించే కారూ, ఆటో గుంటూరులో ముఖ్య ప్రాంతాలని చుట్టేశాయి.  'రొటీన్ సినిమా'  చట్రాన్ని పూర్తిగా బద్దలుకొట్టగలిగి ఉంటే మరింత మంచి సినిమా అయ్యే అవకాశం ఉన్న ఈ 'మిడిల్ క్లాస్ మెలొడీస్' ని అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.

మంగళవారం, నవంబర్ 17, 2020

రాతి తయారీ

వైవిధ్యభరితమైన కథల్ని అందించే తెలుగు రచయిత సురేష్ పిళ్లె నుంచి వచ్చిన రెండో కథా సంకలనం 'రాతి తయారీ'. తొలి సంకలనం 'పూర్ణమూ నిరంతరమూ' లో లాగే ఇందులోనూ పందొమ్మిది కథలున్నాయి.  ఇవన్నీ గడిచిన పాతికేళ్లలో వివిధ పత్రికల్లో అచ్చయినవి, బహుమతులు గెల్చుకున్నవీను. ఎక్కువగా సమకాలీన అంశాలనే ఇతివృత్తాలుగా తీసుకున్నప్పటికీ, ఈ కథలన్నీ ఇవాళ్టి సమాజానికి రిలవెంట్ అనిపిస్తాయి. తద్వారా, గత పాతికేళ్లలో కొన్ని కొన్ని విషయాల్లో పెద్దగా మార్పేమీ వచ్చెయ్యలేదని బోధ పడుతుంది, ఈ కథలు చదవడం పూర్తి చేశాక. ఎక్కువ కథలకి 'వ్యంగ్యాన్ని' టోన్ గా ఎంచుకున్నారు రచయిత. నిజానికిది కత్తిమీద సాము. కనీసం కొందరు పాఠకులైనా వ్యంగ్యాన్ని హాస్యంగా భ్రమ పడే ప్రమాదం ఉంది. అయితే, ఈ సాముని బహు నేర్పుగా చేయడం ద్వారా తన పాఠకుల్ని ఆ ప్రమాదంలోకి నెట్టలేదు రచయిత.  

నక్సల్బరీ ఉద్యమం నేపధ్యంగా సాగే 'అలియాస్' కథతో మొదలయ్యే ఈ సంకలనం ఆశావహ దృక్పథంతో సాగే 'సేవ-బాధ్యత' అనే చిన్న కథతో ముగుస్తుంది. ప్రతి కథనీ ముగించగానే కాసేపు ఆగి ఆలోచించాల్సిందే. కవలలుగా పుట్టిన శివ కేశవుల్లో ఒకడు అన్నల వెంట అడవుల దారి పడితే, రెండో వాడు దాని తాలూకు చేదు ఫలితాలు అనుభవిస్తాడు. కొన్ని పరిణామాల అనంతరం, రెండో వాడు అడవి దారి పట్టేందుకు సిద్ధమవుతాడు. మొదటివాడు సౌకర్యవంతమైన జీవితంలోకి ప్రవేశిస్తాడు. బతకడానికి అవసరమైన లౌక్యం విలువని అన్యాపదేశంగా చెప్పే కథ ఈ 'అలియాస్.' రెండో కథ 'కుక్కా నక్కల పెళ్లి' హాస్యంగా మొదలవుతుంది కానీ హాస్యకథ కాదు. తన క్లాసు పిల్లలు గురుకులానికి సెలక్టయితే వాళ్ళ ప్రతిభకి గర్వపడాలో, క్లాసులో 'క్రీమ్' అంతా వెళ్ళిపోతోన్నందుకు బాధ పడాలో తెలియని సందిగ్ధావస్థలో ఉన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కథ ఇది.  

సారా వ్యాపారంతో ప్రభుత్వాలాడే దోబూచులాటని 'చమించేయండి' చిత్రిస్తే, పల్లె మూలాలున్న చాలామంది నగర జీవుల ఎవర్ గ్రీన్ కలకి అక్షర రూపం 'జిందగీ.' ఓ. హెన్రి తరహా మెరుపు ముగింపు కలిగిన కథ 'తడిచిన సోఫా'. రచయితలో ఆశావహ దృక్పథానికి ఉదాహరణలుగా నిలిచే కథలు 'తోడు', 'థియరీ ఆఫ్ యాక్టివిటీ.' నిజానికి ఈ ఆశావహ దృక్పథం అన్ని కథల్లోనూ కనిపిస్తుంది. సంసారాన్ని చక్కదిద్దుకునేందుకు ఏడాది పాటు ఓపిక పట్టిన రాధ కథ 'దిద్దుబాట.' ఏడాది పెద్ద గడువే నిజానికి. హిరణ్యాక్ష వరాన్ని గుర్తుచేసే కథ 'దొరకానుక.' దేవుడి చుట్టూ జరిగే వ్యాపారంలో ఒకానొక కోణాన్ని చిత్రించారు 'నవ్వు మొలిచింది' కథలో. ఎంసెట్ ఒత్తిడికి నలిగిపోయే ఓ కుర్రాడి జీవితం 'నాన్నకి ప్రేమతో' కథలో కనిపించి భయపెడుతుంది. 
 

అడపాదడపా వినవస్తున్న బదిలీలల కథ 'బదిలీ.' కథానాయిక పేరు 'అప్పలమ్మ' అని చూసి దీనిని హాస్య కథ అనుకోరాదు. రచయితకెంతో పేరు తెచ్చిన కథ 'రాతి తయారీ.' నిరంతర వార్తాస్రవంతులని ఇతివృత్తంగా చేసుకుని సూటిగా, నిస్పక్షపాతంగా రాసిన తెలుగు కథల్లో బహుశా   ఇదే మొదటిది. తర్వాత కూడా వేళ్ళమీద లెక్కపెట్టే అన్ని కథలు మాత్రమే వచ్చాయి. 'రిరంస' అనే సంస్కృత పదానికి అర్ధం వెతుక్కోనక్కర్లేదు, ఇదే పేరుతో ఉన్న కథ చదివితే. కథతో సాఫ్ట్వేర్ దంపతులు మరీ ఏటా ఉద్యోగాలు మానేయడాన్ని చిత్రించారు కానీ, లాంగ్ లీవ్ ఆప్షన్లు కూడా ఉంటాయనుకుంటా. పల్లెటూరి బడిచదువులు ఇతివృత్తంగా ఓ ఉపాధ్యాయురాలి దృష్టికోణం నుంచి వచ్చిన కథ 'లచ్చిమి.' గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసపు లేమి ఎక్కడ నుంచి మొదలవుతుందో చాలా చక్కగా పట్టుకున్నారు రచయిత.  

'కర్మ ఈజ్ బూమరాంగ్' అంటూ ఉంటారు కదా. ఈ మాటని ఓ కథలో బంధిస్తే ఆది 'వేరు పాత్రలు ఒకటే కథ.' ఈ కథని చెప్పిన విధానం మాత్రం దామల్ చెరువు అయ్యోరు మధురాంతకం రాజారాం కథన శైలిని గుర్తు చేసింది. అలాగే 'శివమ్' కథని పూర్తి చేశాక నాటక, సినీ, కథా రచయిత గంధం నాగరాజు కథ 'జీవితానికో పుష్కరం' గుర్తొచ్చింది. సురేష్ పిళ్లె కథల్లో రొమాంటిక్ సన్నివేశాలు వచ్చిన ప్రతిసారీ యండమూరి నవలలు గుర్తుకొచ్చాయి. వాటి ప్రభావం రచయిత మీద ఉందో, పాఠకుడి (నేనే) మీద ఉందో మరి. కాంట్రాక్టర్లు-ఇంజినీర్లు-రాజకీయ నాయకుల మధ్య ఉండే ఇనుప త్రికోణాన్ని నేర్పుగా పాఠకుల ముందుంచిన కథ 'సెవెంత్ ఫ్లోర్.' ఈ కథ మూడేళ్ళ క్రితం ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురింప బడిందని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను.  

పుస్తకం చివర్లో ఉన్న రెండు అనుబంధ వ్యాసాలూ 'రాతి తయారీ' కథకి సంబంధించినవే. మొదటిది జాన్సన్ చోరగుడి రాసిన సమీక్ష వ్యాసం కాగా, రెండోది కథా నేపధ్యాన్ని గురించి ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో రచయిత సురేష్ పిళ్లె చేసిన ప్రసంగ పాఠం. 'రాతి తయారీ' కథని మొదటగా బహుమతికి తిరస్కరించిన పత్రికని మనం అభినందించకుండా ఉండలేం. ఈ రెండు సంకలనాలతో ఆగిపోకుండా సురేష్ పిళ్లె మరిన్ని కథలు రాయాలని కోరుకుంటున్నా. తన నవల 'సుపుత్రికా ప్రాప్తిరస్తు' చదవాల్సి ఉంది. ('రాతి తయారీ' కథా సంకలనం, ఆదర్శిని మీడియా ప్రచురణలు, పేజీలు 176, వెల రూ. 200. ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు అమెజాన్ ద్వారానూ లభిస్తోంది.

శనివారం, నవంబర్ 14, 2020

ఆకాశం నీ హద్దురా

తెలుగు దర్శకురాలు సుధ కొంగర తమిళంలో తీసిన 'సూరారై పోట్రు'  సినిమాకి తెలుగు డబ్బింగ్ 'ఆకాశం నీ హద్దురా.' ఎయిర్ డెక్కన్ పేరుతో చౌక విమానయానాన్ని భారతీయులకి పరిచయం చేసిన కెప్టెన్ గోపీనాథ్ ఆత్మకథ 'సింప్లి ఫ్లై' లో కొన్ని భాగాలు తీసుకుని, వాటికి సినిమాకి అవసరమైన మరికొన్ని దినుసుల్ని చేర్చి వండిన కథలో - కన్నడనాట పుట్టిన గోపీనాథ్ ని మదురై తమిళుడిగా ఒరిజినల్ లోనూ, గుంటూరు జిల్లా చుండూరు వాసి చంద్ర మహేష్ గా తెలుగులోనూ చూపించారు. చిన్నప్పటినుంచీ విమానాలని ప్రేమించిన మహా (చంద్ర మహేష్ గా తమిళ నటుడు సూర్య)కి సామాన్య ప్రజలకి విమానయానాన్ని అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం. 

స్కూలు మేష్టారు, గాంధేయ వాదీ అయిన తండ్రి ప్రభుత్వానికి ఉత్తరాలు రాసి ఊరికి కరెంటు తెప్పించడమే కాక, ఎక్స్ప్రెస్ రైలు స్థానిక స్టేషనులో ఆగేలా కృషి చేస్తాడు. అయితే రైలుకి హాల్టుని యువకుడైన మహా సాధిస్తాడు. దానితో అతనిలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. నేవీలో కొన్నాళ్ళు ఉద్యోగం చేశాక, చౌక విమాన సర్వీసుల వ్యాపారం కోసం ఉద్యోగం వదిలిపెట్టి ఊరికి తిరిగి వచ్చేస్తాడు. బేకరీ వ్యాపారం చేసి తానేమిటో నిరూపించుకోవాలని తపన పడే బేబీగా పిలువబడే సుందరి (మలయాళ నటి అపర్ణ బాలమురళి) మహాని ఇష్టపడి అతనికి కొన్ని కండిషన్లు పెట్టిమరీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటుంది. అక్కడి నుంచీ చౌక విమాన సర్వీసు అన్నది వాళ్ళిద్దరి కలా అవుతుంది. మహా ఎయిర్ ఫోర్స్ మిత్రులతో పాటు, ఊళ్ళో వాళ్లంతా అతని వెనుక నిలబడతారు. 

అయితే అతను తలపడాల్సింది ప్రభుత్వాన్నే శాసించే కార్పొరేట్ దిగ్గజం పరేష్ గోస్వామి (పరేష్ రావల్) తో. సాక్షాత్తూ టాటా గ్రూపునే  ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి రానివ్వనంత మోనోపలీని ఆ సరికే సాధించేసిన పరేష్, మహాకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తాడు. వాటన్నింటినీ అంతే సమర్ధవంతంగా ఎదుర్కొంటూ, పడుతూ లేస్తూ మహా తన లక్ష్యాన్ని చేరుకోవడం ముగింపు. అన్ని బయోపిక్స్ మాదిరిగానే ఇందులోనూ కెప్టెన్ గోపీనాథ్ జీవిత విశేషాలని చివర్లో జతచేశారు. విలన్ అడ్డంకులు సృష్టిస్తాడనీ, హీరో లక్ష్యాన్ని సాధిస్తాడనీ ప్రేక్షకులు అంచనా వేసేసుకోగలిగిన కథని చివరివరకూ ఆసక్తికరంగా చెప్పడం దర్శకురాలి విజయం. బేబీ పాత్రని పాటలకీ, సెంటిమెంటుకీ పరిమితం చేసేయకుండా చాలా బలంగా రాసుకోడాన్నే తన విజయానికి దగ్గరదారిగా చేసుకుంది దర్శకురాలు. 


డిఫరెంట్ షేడ్స్ ఉన్న మహా పాత్రని అనాయాసంగా చేశాడు సూర్య. అతనికి సత్యదేవ్ చేత డబ్బింగ్ చెప్పించడం ద్వారా ఈ డబ్బింగ్ సినిమాకి తెలుగుదనం అద్దే ప్రయత్నం చేశారు. బేబీగా చేసిన అపర్ణ సూర్యతో పోటీ పడడమే కాదు, కొన్ని సన్నివేశాల్లో అతన్ని డామినేట్ చేసింది కూడా. వీళ్లిద్దరి తర్వాత ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నది విలన్ పరేష్ రావల్ కి. విలనిజమే అయినా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రత్యేకత చూపించేందుకు కృషి చేసే నటుడు కావడంతో, ఈ సినిమాలో కార్పొరేట్ విలనీని ఎక్కడా అతి లేకుండా ప్రదర్శించగలిగాడు. హీరో తల్లిగా కనిపించిన ఊర్వశికి ఇలాంటి పాత్రలు చేయడం బహు సులువు. 

ఓ అతిధి పాత్ర లాంటి ప్రత్యేక పాత్రలో కనిపించి మన మోహన్ బాబు ఆశ్చర్య పరిచాడు. తన ఈడు వాళ్ళు ఇంకా హీరో వేషాలు కొనసాగిస్తూ ఉండగా, తాను కేరక్టర్లకి షిఫ్ట్ అయిపోవడమే కాక, నిడివిని కాక పాత్రని మాత్రమే చూసి సినిమాలు అంగీకరిస్తున్నాడని మరోసారి అనిపించింది. ఎయిర్ ఫోర్స్ అధికారిగా నాలుగైదు సీన్లకే పరిమితమైన పాత్రే అయినా, కథకి కీలకం. డబ్బింగ్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ  తమిళ నేటివిటీ అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. బోర్డులు, వాల్ పోస్టర్ల వరకూ తెలుగు చేసినా ఇంకా చాలా విషయాలు వదిలేశారు.  అయితే, సినిమాలో కథ పాకాన పడే కొద్దీ ఈ నేటివిటీ పలుకురాయిని మర్చిపోగలుగుతాం. 

కొన్ని సన్నివేశాలు - మరీ ముఖ్యంగా కాసిన్ని ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు - మరియు హీరోయిన్ పాత్ర చిత్రణ చూసినప్పుడు మణిరత్నం మార్కులా అనిపించి, ఆరాతీస్తే, దర్శకురాలు సుధ మణిరత్నం శిష్యురాలని తెలిసింది. 'గీతాంజలి' సినిమాలో ఓ బిట్టు, 'సఖి' పోస్టరూ కనిపించాయి సినిమాలో. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో పాటలకన్నా నేపధ్య సంగీతం బాగా కుదిరింది. సినిమా నిడివి రెండున్నర గంటలు. కనీసం ఓ పావుగంట ట్రిమ్ చేయచ్చు. హీరో-విలన్ ల రెండో భేటీ, ఛాలెంజులు లాంటి  సినీ మసాలాలని కాస్త తగ్గించి ఉంటే బాగుండేదనిపించింది. ఇలాంటి వాటిని కాస్త సరిపెట్టుకుంటే, చూడదగిన సినిమా ఇది. ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉందీ సినిమా 

బుధవారం, అక్టోబర్ 14, 2020

శోభానాయుడు

"సిరిసిరిమువ్వ సినిమాలో హేమ వేషం వెయ్యమంటే, స్టేజి వదిలి సినిమాల్లో చెయ్యనని చెప్పేసిందిట" ... శోభానాయుడు పేరు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన తొలి సందర్భం ఇది. సినిమాలంటే ఇప్పుడున్నంత క్రేజు నలభయ్యేళ్ళ క్రితం లేకపోయినా, పిలిచి సినిమా అవకాశం ఇస్తే వద్దనడం మాత్రం వార్తే అయ్యింది. అప్పటికే ఆమె పేరున్న నర్తకి. పెద్ద పెద్ద వేదికల మీద తప్ప, ఓ మాదిరి కార్యక్రమాలకి పిలిచేవారు కాదు. కొన్నాళ్లకే విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి వచ్చిన నర్తకి అనే విశేషణం తోడయ్యింది. శోభానాయుడు ప్రదర్శనల్ని చూస్తూ వచ్చింది మాత్రం గత పాతికేళ్లుగా. మొట్ట మొదట చూసిందీ, చివరిసారిగా చూసిందీ ఒకటే బ్యాలే - 'శ్రీనివాస కళ్యాణం.' ఆమె పద్మావతి. వేదిక మీద ఆమె నర్తిస్తూ ఉంటే కళ్ళుతిప్పి మరో పాత్రని చూడడం కష్టం, చూపు తిప్పుకోనివ్వనిది రూపం మాత్రమే కాదు, అభినయం కూడా. 

విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో, స్థిరపడిన తెలుగు వాళ్ళు వాళ్ళ పిల్లలకి కూచిపూడి నేర్పించడం, వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి రవీంద్రభారతిలో అరంగేట్రం చేయించడం అనే పధ్ధతి ఓ పాతికేళ్ల క్రితం మొదలై, ఐదారేళ్ళ పాటు ఉధృతంగా సాగింది. యూఎస్ వెకేషన్ సీజన్ లో అయితే వారానికి రెండు మూడు అరంగేట్రాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిలో చాలా కార్యక్రమాలకి శోభానాయుడు ముఖ్య అతిధి. అరంగేట్రం చేసే పిల్లల గురువులు, శోభానాయుడు శిష్యులు. అలా, తన ప్రశిష్యుల్ని ఆశీర్వదించడం కోసం ఆమె వీలు చేసుకుని వచ్చేవాళ్ళు. నాలుగు ముక్కలు మాట్లాడే వాళ్ళు. వాటిలో తాను చిన్నప్పటి నుంచీ నృత్యం మీద ఇష్టం పెంచుకుని, నేర్చుకోవడం మొదలు, దేశ విదేశాల్లో ప్రదర్శనలు, అక్కడి అనుభవాలు ప్రముఖంగా వినిపించేవి. ఆమెని గురించి ఆమె నుంచే విన్న సంగతులు ఎన్నో. 

ఒకసారి విదేశంలో (రష్యాలో అని జ్ఞాపకం) తన ప్రదర్శన చూసిన ఓ యువజంట, ఆ తర్వాత వాళ్ళకి పుట్టిన పాపకి శోభ అని పేరు పెట్టుకున్నారని చాలా అపురూపంగా జ్ఞాపకం చేసుకునేవారు. ఈ అరంగేట్రాల కాలంలోనే 'అశ్విని' హెయిరాయిల్ ప్రకటనకు మోడలింగ్ చేశారు శోభానాయుడు. సినిమాలే వద్దనుకున్నామె  ఇలా మోడలింగ్ చేయడం ఏమిటన్న ఆశ్చర్యం కలిగింది. దాదాపు అదే సమయంలో ఐఏఎస్ అధికారి అర్జునరావుని ఆమె వివాహం చేసుకున్నారు. ఇద్దరూ చెరో రంగంలో సెలబ్రిటీలు కావడంతో ఆ వివాహం అప్పట్లో విశేషమైన వార్త అయ్యింది పేపర్లకీ, మేగజైన్లకీ. 'ఇండియా టుడే' లో చదివిన కథనం ఇప్పటికీ గుర్తే. మొదటినుంచీ ఆమె ట్రూపులోనూ, అకాడెమీ లోనూ పురుషుల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. పురుష పాత్రల్ని కూడా స్త్రీలే పోషించే వాళ్ళు.  కొంతకాలం క్రితం ట్రూపు వరకూ సడలింపు ఇచ్చారు.

Google Image

తెలుగింటి పాత్రల్నే కాక, చండాలిక లాంటి పాత్రలకీ తెలుగుదనం అద్ది ప్రదర్శించారు శోభానాయుడు. సత్యభామగా ఆమెని స్టేజి మీద చూడడం ఒక అనుభవం. రెప్పపాటులో ఆమె ఎక్స్ప్రెషన్ మారిపోయేది. అడుగులు కూడా అంతే వేగంగా పడేవి. ముఖ్యంగా లైవ్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శన ఇచ్చేటప్పుడు పాడే వాళ్ళకి సవాలుగా ఉండేది ఆమె ప్రదర్శన. (ఇలా పోటీ ఇచ్చే మరో 'అభినవ సత్యభామ' గురు కళాకృష్ణ). రంగాలంకరణలో విశేషమైన మార్పులు శోభానాయుడుతోనే మొదలయ్యాయి అంటారు. తెరలు, లైటింగ్ లాంటి ప్రతి విషయంలోనూ ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారనీ, ఎక్కడా ఏ చిన్న విషయంలోనూ రాజీ పడరనీ చెప్పుకునే వారు. కొందరు నర్తకులు అభినయానికి (ఎక్స్ ప్రెషన్స్) , మరికొందరు అడుగులకీ (ఫుట్ వర్క్) పెట్టిందిపేరు. ఈ రెండింటిలోనూ విశేష ప్రతిభ ఉన్న కొద్దిమందిలో శోభానాయుడు ఒకరు. ఆమె నర్తిస్తుంటే అక్షరాలా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడాలి, అది కూడా రెప్పపాటు లేకుండా. 

దాదాపు రెండేళ్ల క్రితం ఆమెని ముఖాముఖీ కలిసే అవకాశం వచ్చింది. మా మిత్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 'శ్రీనివాస కళ్యాణం' ప్రదర్శించడానికి శిష్యులతో వచ్చారు. ఆర్గనైజర్లతో ఉన్న అనుబంధం వల్ల ఆమెతో కలిసి బ్రేక్ఫాస్ట్ తీసుకునే అవకాశం దొరికింది. 'సిరిసిరిమువ్వ' మొదలుగా చాలా విషయాలు దొర్లాయి కబుర్లలో. వాళ్ళమ్మాయి 'శివరంజని' ని పరిచయం చేశారు. బృందంలో ఆమె కూడా ఓ సభ్యురాలు. ఆవేళ రాత్రి ప్రదర్శించిన 'శ్రీనివాస కళ్యాణం' మాత్రం నిరాశ పరిచింది. అభినయం విషయంలో ఆమె రాజీ పడలేదు కానీ, అడుగులు చాలా బరువుగా పడ్డాయి. వయసు తెచ్చిన మార్పు శరీరంలో కనిపించింది కానీ, అది అడుగుల్లో కూడా కనిపించేసరికి బాధేసింది. 

ఆ మర్నాడు సహజంగానే ఆమె ఆరోగ్యం గురించి చర్చ జరిగింది మాలో మాకు. అప్పుడు విన్న కొన్ని విషయాలు యద్దనపూడి సులోచనారాణి 'కీర్తి కిరీటాలు' నవలని గుర్తు చేశాయి. రెండు రోజుల క్రితం డాన్సర్ మిత్రులొకరు ఆమె ఆరోగ్యం బాలేదన్న అప్డేట్ ఇచ్చారు. అయితే, ఇంత విషమం అని ఊహించలేదు. ఆమె నృత్యం, ఆమె మాటలు, ఆమె జీవితం.. ఇవన్నీ ఉదయం నుంచీ ఏ పని చేస్తున్నా గుర్తొస్తూనే ఉన్నాయి. కూచిపూడి నృత్యరీతిని ప్రపంచం నలుమూలలకీ తీసుకెళ్లిన నర్తకి, ఎందరికో నాట్యం మీద ఆసక్తి కలిగించిన నర్తకి, నాట్యం తప్ప జీవితంలో ఇంకేదీ తన మొదటి ప్రాధాన్యత కాదని కడదాకా మనసా వాచా నమ్మిన నర్తకి 'ఇకలేరు' అనుకోవడం కష్టంగానే ఉంది. మువ్వల చప్పుళ్ళల్లో ఆమె జ్ఞాపకాలు కలగలిసిపోతాయి. శోభానాయుడు ఆత్మకి శాంతి కలగాలి.. 

శుక్రవారం, అక్టోబర్ 09, 2020

కొండపొలం 

తెలుగు నవల ప్రౌఢిమను సంతరించుకుని శతాబ్దం కావొస్తున్నా అనేక వర్గాల జీవితాలు సమగ్రంగా రికార్డు కాలేదన్న సత్యాన్ని మరోమారు ఎత్తిచూపే నవల సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన 'కొండపొలం.'  కరువుసీమ రాయలసీమలోని గొర్రెల కాపరుల జీవితాలని ఇతివృత్తంగా తీసుకుని ఈ నవల రాశారు. ఏళ్లతరబడి వాళ్ళ జీవితాలని పరిశీలించి, ఎన్నో వివరాలని సేకరించి, దానికి ఓ వ్యక్తిత్వ వికాసపు కథని జోడించి నవలగా మలిచారు రచయిత. పుస్తకం చదవడం పూర్తి చేసి పక్కన పెట్టాక కూడా గొర్రెలు, గొర్రెల కాపరులు, వాళ్ళ జీవన విధానం కొన్నాళ్లపాటు పాఠకులని వెంటాడతాయనడం అతిశయోక్తి కాదు. కథానాయకుడు రవిని మాత్రమే కాదు, అతని తండ్రి గురప్పనీ, గురు సమానుడు పుల్లయ్యనీ, స్నేహితులు అంకయ్య, భాస్కర్ తదితరులనీ, మరీముఖ్యంగా అతని జీవన గతిని మార్చేసిన పెద్దపులినీ మర్చిపోవడం అంత సులువేమీ కాదు. 

పంటపొలాలకి సకాలంలో నీరందకపోతే పంట నష్టం. అదే గొర్రెలకు మేతా, నీరూ అందకపోతే ప్రాణ నష్టం. కరువు విలయతాండవం చేస్తున్న ఓ వేసవిలో, తమ గొర్రెలకి ఎలాగయినా మేత, నీరు అందించి వాటిని రక్షించుకోవాలని 'కొండపొలం' బయల్దేరతారు అహోబిలం సమీపంలోని ఓ గ్రామంలో గొల్లలు.ముందుగా కొందరు అడవికి వెళ్లి పచ్చిక, నీరు అందుబాటులో ఉన్న చోట్లని గుర్తు పెట్టుకుని రావడంతో ప్రయాణ సన్నాహాలు మొదలవుతాయి. ఒక్కో మంద లోనూ వందేసి గొర్రెలు. వాటిని నిలేసేందుకు ఇద్దరిద్దరు కాపరులు. వారం రోజులకి సరిపడా పాడవ్వని ప్రత్యేకమైన ఆహారం (రొట్టెలు వగయిరా), నీళ్ల క్యాన్లు తదితర సామాగ్రితో బయల్దేరతారు. ప్రతివారం ఊరినుంచి ఎవరో ఒకరు అందరు కాపరుల మరుసటి వారపు ఆహారాన్నీ (భత్యం అంటారు) అడవికి తీసుకెళ్లి ఇవ్వాలి. ఊళ్ళో వానలు కురిశాకే మందలు, వాటితో పాటు కాపరులూ  వెనక్కి తిరిగి వచ్చేది. 

గురప్ప మందకి రెండో మనిషి కావాలి. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అందరికీ గొర్రెలు అలవాటే. పెద్ద కొడుక్కి మూడు నెలల క్రితమే పెళ్లయింది. పెళ్ళైన తొలి ఏడాది కొండపొలం వెళ్లకూడదని గొల్లల ఆచారం. అలాగే ఆడపిల్లని అడవికి తీసుకెళ్లడాన్ని కూడా సమర్ధించరు. అలా వెళ్లిన అమ్మాయికి పెళ్లి సంబంధాలు రావడమూ కష్టమే. ఇక మిగిలింది రెండో కొడుకు రవి. ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న రవి, ఆ సమయానికి ఊళ్ళోనే ఉంటాడు. రవి అడవిలో ఉండగలడా, తనకి సాయ పడగలడా అన్నది గురప్ప సందేహమైతే, చదువుకున్న కుర్రాణ్ణి కొండపొలం పంపడం అతని భార్యకి అభ్యంతరం. మందకి రెండో మనిషి దొరక్క పోవడంతో అడవికి ప్రయాణం కాక తప్పదు రవికి. ఆ ప్రయాణం మొదలైనప్పటి నుంచీ, కొండపొలాన్ని రవి కళ్ళతో పాఠకులకి చూపించారు రచయిత. 

చదువుకున్న వాడే కానీ బొత్తిగా భయస్తుడు రవి. ఆ భయం కారణంగానే నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఉద్యోగం సంపాదించుకోలేక పోతున్నాడు. ఇంటర్యూ అన్నా, గ్రూప్ డిస్కషన్ అన్నా తగని భయం అతనికి. పల్లెటూరివాడిననే ఆత్మ న్యూనత నుంచి బయట పడలేక పోతున్నాడు. ఈ అడవి ప్రయాణం అతనికి పూర్తిగా కొత్త. యాభై రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన కొండపొలం తొలినాళ్లలో తాడుని చూసి పామనుకుని భయపడిన వాడు, నక్కని చూసి జడుసుకున్న వాడూ, చివరికి వచ్చేసరికి తన గొర్రెల మందని రక్షించుకోడానికి పెద్దపులితో తలబడే ధైర్యాన్ని సంతరించుకుంటాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని మించి ఇంకేదన్నా సాధించాలనీ, తనవల్ల అడవికి ఏదన్నా ఉపకారం జరగాలనీ తపిస్తాడు. కొత్త లక్ష్యాన్ని ఏర్పరుచుకుని విజయం సాధిస్తాడు. 

నవలలో పాఠకులని కట్టిపడేసేది మాత్రం యాభై రోజులపాటు సాగే కొండపొలం. గొర్రెలు, కాపరులతో పాటు పాఠకులు కూడా నల్లమలకి వెళ్ళిపోతారు. కొండచిలువలు, చిరుతలు, పెద్దపులుల నుంచి గొర్రెలకు, కాపరులకు ఎదురయ్యే సవాళ్ళకి ఉద్విగ్న పడతారు. కాపరుల వ్యక్తిగత జీవితాలలో జరిగే సంఘటనలని సొంత మనుషులకి జరిగిన వాటిగా భావిస్తారు. ఊళ్ళో ఎప్పుడు వర్షం కురుస్తుందా, ఈ మందలన్నీ ఎప్పుడు ఈ అడవి నుంచి బయట పడతాయా అని ఎదురు చూస్తారు. ఇలా చూసేలా చేయడంలో రచయిత కృతకృత్యులయ్యారు. నవల చదువుతూ ఉంటే, కాపరులతో పాటు రచయిత కూడా కొండపొలం వెళ్లి తన అనుభవాలని రికార్డు చేశారా అనిపించేంత గాఢమైన సన్నివేశ కల్పన చేశారు. ఎర్ర చందనం అక్రమ రవాణాని, చెంచుల సమస్యలని కూడా ఈ గొల్లల కథలో భాగం చేశారు. 

'కొండపొలం' చదవడం పూర్తి చేశాక సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డిలోని ఆశావాది కనిపిస్తాడు పాఠకులకి.  రవిని అటవీశాఖ అధికారిని చేయడం మాత్రమే కాదు, అతని కారణంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆగిపోయిందని చెబుతారు మరి. పాత్రల చిత్రణకి వస్తే మనుషుల్ని కేవలం బ్లాక్ అండ్ వైట్ లో మాత్రమే చూశారు. అధికశాతం పాత్రలు మంచి వాళ్ళు (దాదాపుగా ఒకే మూసలో ఉంటారు వీళ్ళు), కొద్దిమంది చెడ్డవాళ్ళు (వీళ్ళదీ ఒకే ధోరణి). నలుగురు మనుషులు కలిస్తే రాజకీయం పుడుతుందని వాడుక. అందరు గొల్లలు కలిసి అన్ని రోజులు అడవిలో గడిపినా ఎక్కడా వాళ్లలో వాళ్ళకి అభిప్రాయ భేదాలు వచ్చే సందర్భం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అందరూ అన్నివేళలా ఒకే మాట మీద ఉండడం, ఎవరూ, ఎదురాడక పోవడం అన్నది కొండపొలం లాంటి ప్రత్యేక సందర్భాలలో సహజంగానే జరుగుతుందా, లేక రచయిత పాజిటివిటీకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి అలాంటి వాటికి కథలో చోటివ్వలేదా అన్న ఆలోచన వచ్చింది నాకు. 

నవల ప్రారంభం కొంచం నాటకీయంగా ఉన్నా, ఒక్కసారి కొండపొలం  మొదలయ్యాక ఊపిరి బిగబట్టి చదివిస్తుంది. సంభాషణలు అక్కడక్కడా ప్రీచీగా అనిపిస్తాయి కానీ అవేవీ కథా గమనానికి అడ్డు పడవు. ఎక్కడా సుదీర్ఘమైన సంభాషణలు లేవు కూడా. రవిలో మార్పు వచ్చే క్రమాన్ని, చుట్టూ జరిగే సంఘటనలకు అతని స్పందనలో క్రమేపీ వచ్చే మార్పునీ ప్రత్యేకంగా చిత్రించారు. కథని పట్టుగా నడిపించడానికి పెద్దపులి పాత్ర ఎంతగానో దోహద పడింది. ఏ మలుపు నుంచి, ఏ చెట్టు/బండచాటు నుంచి పెద్దపులి వచ్చి మంద మీద దాడి చేస్తుందో అనే సందేహం పాఠకులని ప్రతి పేజీలోనూ అప్రమత్తంగా ఉంచుతుంది. తరువాతి పేజీకి పరుగెత్తేలా చేస్తుంది. నిజానికి ఈ నవలని కొండపొలం వెళ్లొచ్చిన గొల్ల కులం వారెవరైనా రాసి ఉంటే ఎలా ఉండేదా అన్న ఆలోచన వచ్చింది. చివర్లో చదివిన ముందుమాటలో రచయిత కూడా ఇలాంటి అభిప్రాయాన్నే ప్రకటించారు. సాహిత్యాభిమానులు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. 

(తానా నవలల పోటీలో రెండు లక్షల రూపాయల బహుమతిని గెలుచుకున్న ఈ నవల 'తానా ప్రచురణలు' ద్వారా మార్కెట్లో ఉంది. పేజీలు 350, వెల రూ. 200).

బుధవారం, అక్టోబర్ 07, 2020

కొన్ని సమయాలలో కొందరు మనుషులు 

గంగ ఇప్పుడు పుట్టి ఉంటే ? ..యాభయ్యేళ్ళ నాటి నవలల్ని ఇప్పుడు చదువుతుంటే తరచూ వచ్చే ప్రశ్నలు ఇలాంటివే. ఆ పాత్రలు ఇప్పుడు పుట్టి ఉంటే? అనో లేక ఆ కథ ఈ కాలంలో జరిగి ఉంటే? అనో. దీనర్ధం ఆయా రచనలు అవుట్ డేటెడ్ అని ఎంతమాత్రం కాదు, ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ మర్చిపోలేనివీ, వెంటాడుతూ ఉండేవీ కాబట్టే వాటిని మళ్ళీ మళ్ళీ చదువుకోవడం, మరింతగా ఆలోచించడమూను. సరిగ్గా యాభయ్యేళ్ళ క్రితం డి. జయకాంతన్ రాసిన తమిళ నవల ' సిల నేరంగళిల్, సిల మనితర్గళ్' లో నాయిక గంగ. తమిళ మూలం విడుదలై, సంచనలం సృష్టించి, అదే పేరుతో వచ్చిన సినిమాలో గంగగా నటించిన లక్ష్మికి జాతీయ అవార్డు వచ్చాక, ఆ నవలని  'కొన్ని సమయాలలో కొందరు మనుషులు' పేరిట తెనిగించారు విదుషి మాలతీ చందూర్. ఈమధ్యే కంట పడిన ఆ పుస్తకాన్ని మరోమారు చదువుతుంటే, మళ్ళీ వచ్చిన ప్రశ్నే 'గంగ ఇప్పుడు పుట్టి ఉంటే?' నిజానికిది గంగ ఒక్కదాని కథే కాదు, ఆమె చుట్టూ ఉండే అందరి కథాను. 

ఓ సంప్రదాయపు పేదింటిలో పుట్టిన గంగ మద్రాసు కాలేజీలో చదువుతూ ఉండగా, ఓ వర్షపు సాయంత్రం ఓ ధనవంతుడైన యువకుడు ఆమెకి తన కారులో లిఫ్ట్ ఇస్తాడు. ఆ కారులోనే వాళ్లిద్దరూ ఒక్కటౌతారు. ఆమెని ఇంటి దగ్గర దింపేసి తన దారిన వెళ్ళిపోతాడు. కనీసం అతని పేరుకూడా తెలీదు గంగకి. తమ మధ్య జరిగిందేవిటో తల్లి కనకానికి చేప్పేస్తుంది గంగ. బిగ్గరగా ఏడుపు ఆరంభిస్తుంది ఆ తల్లి. చుట్టుపక్కల అందరికీ విషయం తెలిసిపోతుంది. గంగని ఇంట్లో నుంచి గెంటేస్తాడు ఆమె అన్న గణేశన్. కొడుకుని కాదని కూతురితో పాటు బయటికి వచ్చేస్తుంది కనకం. మేనమామ వరసైన న్యాయవాది వెంకటేశ అయ్యంగార్ గంగకి తంజావూరులోని  తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి చదివిస్తాడు. యూనివర్సిటీ టాపర్ అయిన గంగకి ప్రభుత్వంలో ఉన్నతోద్యోగం రావడంతో తిరిగి మద్రాసులో అడుగు పెడుతుంది. అన్నావదినలకి దూరంగా తల్లితో కలిసి వుంటుంది. 

తన కూతురికి పెళ్లి జరిగే రాత లేదని కనకానికి స్థిర నిశ్చయం. 'వెంకూ అన్నయ్య' దయవల్ల తన కూతురికి బతుకుతెరువు దొరికిందనీ, ఆమె నీడన తన జీవితం కూడా వెళ్ళిపోతుందనీ భావిస్తూ ఉంటుంది. జరిగినదాని పట్ల ఓ తల్లిగా ఆమెకి బాధ ఉంది, అంతకు మించి గంగకి తాను ఏమన్నా చేయగలనా అన్న ఆలోచన లేదు. ఇక గణేశన్ పనల్లా చెల్లెలి గురించి వినిపించే పుకార్లని మరింతగా ప్రచారంలో పెట్టడం, తానే స్వయంగా వచ్చి తల్లి చెవిన వేస్తూ ఉండడం. అలాగని గంగ సంపాదన మీద అతనికి ఆశ లేదు. తల్లిని ఏనాడూ రూపాయి చేబదులు అడగలేదు. అతని భార్యకైతే గంగ మీద అకారణ ద్వేషం. వేంకటేశ అయ్యంగార్ దృష్టిలో గంగ తను మలిచిన బొమ్మ. ఆమె మీద తనకి అధికారం ఉన్నదనే భావిస్తూ ఉంటాడు. ప్రాచీన ధర్మాలని అలవోకగా వల్లెవేసే, పిల్లలు లేని ఆ ప్లీడరు గంగలో కూతుర్ని కాక, స్త్రీని చూస్తూ ఉంటాడు. అవకాశం కోసం కాసుకునీ ఉంటాడు. 

ఇంతకీ గంగ ఏమనుకుంటోంది? ఆమెకి మగవాళ్ల పట్ల విముఖత. ఆమెకి తారసపడే వాళ్ళ చూపులు, చర్యలూ ఆ వైముఖ్యాన్ని మరింత పెంచుతూ ఉంటాయి. 'వెంకూ మామయ్య' మనసులో ఏముందో ఆమెకి తెలుసు. ఆశ్రయం ఇచ్చాడన్న గౌరవం ఉంది. అంతకు మించి అతని చర్యల పట్ల అసహ్యమూ ఉంది. అతన్ని హద్దు దాటనివ్వకుండా ఉంచడం ఎలాగన్నది ఆమె నేర్చుకుంది. గంగకి ఈ జాగ్రత్తని బోధించింది స్వయానా వెంకూ భార్యే. గంగ ఎవరికన్నా ఉంపుడుగత్తెగా ఉండేదుకు తప్ప, భార్య అయ్యేందుకు అర్హతని కోల్పోయిందని తీర్మానిస్తాడు వెంకూ. దాని వెనుక ఆమె తనకే ఉంపుడుగత్తె కావాలన్న ఆలోచన ఉన్నదని గంగకి మాత్రమే తెలుసు. గంగకి చేతనైతే ఆవేళ ఆమెని కార్లో తీసుకెళ్లిన వాడిని వెతికి పట్టుకోవాలని, కనకం దగ్గర ఛాలెంజి చేస్తాడు వెంకూ. ఈ ఛాలెంజి గంగ చెవిన పడుతుంది. అనూహ్యంగా, ఆ వ్యక్తిని వెతికి పట్టుకోడానికి నిశ్చయించుకుంటుంది గంగ. 

పన్నెండేళ్ల తర్వాత అతన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తుంది గంగ. అతని కారు తప్ప, ముఖం కూడా గుర్తు లేదామెకి. ఆర్నెల్ల ప్రయత్నం తర్వాత ప్రభూగా పిలవబడే ప్రభాకర్ని వెతికి పట్టుకుంటుంది. అతను సంఘంలో గౌరవనీయుడు. ఓ టీనేజ్ అమ్మాయి మంజుకి తండ్రి. భార్య పద్మ, మరో ఇద్దరు మగపిల్లలు. అనూహ్యంగా గంగకి, ప్రభుకి స్నేహం కుదురుతుంది. తాను చేసిన పని పట్లా, దాని పర్యవసానం పట్లా పశ్చాత్తాపం కలుగుతుంది ప్రభులో. తగిన వరుణ్ణి చూసి గంగకి పెళ్లి చేయాలని అతని ప్రయత్నం. వెంకూ మామయ్య ప్రవచనాల ఫలితం వల్ల కావొచ్చు, గంగ దృష్టిలో మరో మగవాడు లేడు, ప్రభు తప్ప. అలాగని అతనితో సంబంధానికి ఆమె వ్యతిరేకి. కానీ, అతని మనిషిగా ముద్ర వేయించుకోవాలని తనంత తానుగా ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుతో పరిచయం తర్వాత గంగలో వచ్చే మార్పు ఈ నవలకి ఆయువుపట్టు అని చెప్పాలి. ఆమె అంతః సంఘర్షణ నవల చదివే పాఠకులకి తప్ప, ఆమె చుట్టూ ఉన్న ఎవరికీ అర్ధం కాకపోవడం ఒక విషాదం. 

ప్రభుతో గంగ స్నేహాన్ని సంఘం మాత్రమే కాదు, కనకం కూడా అంగీకరించదు. ప్రభు భార్య అతన్ని పట్టించుకోడం ఏనాడో మానేసింది. ఆమె జాగ్రత్తల్లా ఆస్తిని కాపాడుకోవడం, పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచడం. మంజుకి గంగకి స్నేహం కుదురుతుంది. మంజు మగ స్నేహితుల గురించి విన్నప్పుడు తరంతో పాటు స్త్రీ-పురుష సంబంధాలని గురించి యువత ఆలోచనల్లో వచ్చిన మార్పులని అర్ధం చేసుకుంటుంది గంగ. ప్రభు ఆమెకి మానసికంగా దగ్గరయ్యే సమయానికి గంగ జీవితంలో కొన్ని ఊహించని పరిణామాలు జరగడం, అటుపైన గంగ జీవితం ఊహకందని విధంగా మారిపోవడం ఈ నవల ముగింపు. నిజానికి ఈ నవలకి కొనసాగింపుగా మరో నవల రాశారు జయకాంతన్. మనస్తత్వ విశ్లేషణ మీద జయకాంతన్ కి ఉన్న పట్టుని గురించి కొత్తగా చెప్పుకోడానికి ఏమీ లేదు. తెలుగు నవలేమో అనిపించేలా అనువదించారు మాలతీ చందూర్. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని ఆర్కీవ్స్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

శనివారం, సెప్టెంబర్ 26, 2020

బాలూ

తనకి కరోనా పాజిటివ్ వచ్చిందనీ, ముందు జాగ్రత్త కోసం ఆస్పత్రిలో చేరుతున్నాననీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సెల్ఫీ వీడియో విడుదల చేసినప్పుడు, "ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చేస్తే ఇక పాడుతా తీయగా, స్వరాభిషేకం ప్రోగ్రాం షూటింగులు పెట్టేసుకుంటారు కాబోలు" అనుకున్నాను. వైద్యం అలా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా అదే నమ్మకం, "ఇవాళ కాకపోతే రేపు.. 'నా ఆరోగ్యం కోసం ప్రార్ధించిన మీ అందరికీ అనేక నమస్కారాలు' అంటూ టీవీలో కనిపించేస్తాడు" అనుకున్నా. కోలుకుంటున్న కబురులు వినిపిస్తూనే, ఉన్నట్టుండి పరిస్థితి విషమం అనీ, అటుపైన 'ఇకలేరు' అనీ చెప్పేశారు హాస్పిటల్ వాళ్ళు. వాళ్ళు చెప్పే వరకూ కూడా ఆగకుండా సోషల్ మీడియాలో నివాళులు హోరెత్తడం మొదలుపెట్టేశాయి. నివాళులు అర్పించడంలో మనమే ముందుండాలనే సోషల్ మీడియా రష్ బాలూని కొన్ని గంటల ముందుగానే స్వర్గస్తుణ్ణి చేసేసింది. ఇది విషాదంలోని మరో విషాదం. 

బాలూ అంటే నాకు మా ఇంట్లో ఉండే కరెంట్ రేడియో. తర్వాతి కాలంలో విరివిగా వచ్చిన పోర్టబుల్ టీవీ సైజులో ఉండే ఆ రేడియోలోనే బాలూ పేరుని, పాటని మొదటగా వినడం. అరుదుగా పత్రికల్లో ఇంటర్యూలు వచ్చేవి. తను కాస్త బొద్దుగా మారిన రోజుల్లో ఓ కాలేజీ అమ్మాయి తన దగ్గరికి వచ్చి 'లవ్ బాలూ' అందనీ, తనేమో 'లవ్ బాలూ కాదమ్మా లావు బాలూ' అన్నాననీ చెప్పిన ఇంటర్యూ బాగా గుర్తుండిపోయింది. సినిమాల్లో అడపాదడపా వేషాలు, డబ్బింగులు ఇవన్నీ ఓ వైపైతే పాతికేళ్ల క్రితం మొదలైన ప్రయివేటు తెలుగు చానళ్ళు, వాటిల్లో తరచుగా కనిపిస్తూ, పాడుతూ, మాట్లాడుతూ ఉండే బాలూ మరోవైపు. ఘంటసాల తర్వాతి తరంలో వచ్చిన పాటల్లో నూటికి తొంభై బాలూవే అవ్వడం వల్ల కూడా కావొచ్చు, వైవిధ్యంగా ఉండే జేసుదాసు గొంతు నాకు అభిమాన పాత్రమయ్యింది. దీనర్ధం బాలూ పాట ఇష్టం లేదని కాదు. అసలు బాలూ పాటని ఇష్టపడకుండా ఉండడం సాధ్యపడదేమో కూడా. 

టీవీ చానళ్ళు-బాలూ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది 'పాడుతా తీయగా' కార్యక్రమం. నేను టీవీ తెరమీద బాలూని దగ్గరగా గమనించింది మాత్రం అదే సమయంలో జరిగిన ఓ సినిమా కార్యక్రమంలో. అందరూ చిన్న పిల్లలతో ఎమ్మెస్ రెడ్డి మల్లెమాల పతాకం మీద నిర్మించిన 'రామాయణం'  (జూనియర్ ఎన్ఠీఆర్ మొదటి సినిమా) చిత్రాన్ని ప్రమోట్ చేయడం కోసం బాల నటీనటులతో  జెమినీలో ఓ ఇంటర్యూ వచ్చింది. ఆశ్చర్యంగా, ఆ ఇంటర్యూ నిర్వహించింది బాలూనే. రాముడి పాత్ర కాకుండా నీకు ఇష్టమైన ఇంకో పాత్ర ఏమిటి అని బాలూ అడిగినప్పుడు, 'రావణాసురుడు'  అని జూనియర్ చెప్పడమూ, "మీ తాతయ్యకి కూడా రావణబ్రహ్మ పాత్రంటే చాలా ఇష్టమయ్యా" అంటూ బాలూ నవ్వడమూ అలా గుర్తుండిపోయాయి. నావరకూ, బాలూ నవ్వు అంటే ఇప్పటికీ ఆ క్షణంలో  నవ్విన నవ్వే.

(Google Image)
అదే సమయంలో, అదే ఛానల్ కోసం చేసిన ఓ సరదా కార్యక్రమంలో (ఓ హిట్ పాట ట్యూన్ లో మరో హిట్ పాటని అప్పటికప్పుడు ప్రేక్షకుల ఫోన్ కోరిక మేరకు పాడడం) 'శంకరా.. నాద శరీరా పరా' ని వేరే ట్యూన్ లో పాడినప్పుడు 'ఇలా చేయకుండా ఉంటే బాగుండేది' అనిపించింది. రానురానూ టీవీలో బాలూ కనిపించడం పెరిగే కొద్దీ ఈ 'ఇలా చేయకుండా ఉంటే బాగుండేది' జాబితా కూడా పెరుగుతూ వచ్చింది. పాట ట్యూన్ లో కిట్టింపులు చేయడం నన్ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం (సినిమాలో పాడినట్టు కాకుండా కొంత మార్పు చేయడం -  తగినంత ప్రాక్టీసు లేకనా లేక కావాలని చేస్తూ వచ్చిందా అన్నది ఇప్పటికీ సందేహమే). అలాంటి సందర్భాల్లో కో-సింగర్ల ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తూ ఉండేది మొదట్లో (రానురాను వాళ్ళూ అలవాటు పడిపోయారు). 

తను వేలల్లో పాటలు పాడిన కాలంలో పదుల సంఖ్యలో మాత్రమే పాటలు పాడిన గాయకుల్ని 'పాడుతా తీయగా' కి అతిధులుగా పిలిచి, వాళ్ళు పాడిన ఆ కొన్ని పాటలూ కూడా తను మిస్ అయినందుకు వాళ్ళ సమక్షంలోనే బాధ పడడం ("ఇంకానా బాలూ? ఇంకా ఎన్ని పాటలు పాడాలి? ఇంకెవరూ పాడకూడదా?"), రెండు మూడు సినిమాల్లో హీరో వేషాలు వేసి తర్వాత అవకాశాల కోసం తిరుగుతున్న వాళ్ళని అతిధులుగా పిలిచి "అందరు హీరోలకీ పాడాను. మీకూ పాడాలని ఉంది, కనీసం ఒక్క పాట" అని కోరడం (మాడెస్టీ అని తను అనుకుని ఉండొచ్చు గాక) లాంటివి చూసినప్పుడు 'అబ్బా' అనిపించడం - వీటితో పాటు మరికొన్ని కారణాల వల్ల ఆ ప్రోగ్రాం మీదే ఆసక్తి సన్నగిల్లింది. - మాత్రమే కాదు, "అసలు బాలూ టీవీలో కనిపించకుండా ఉంటే బాగుండేదేమో" అనిపించేది. నిజానికి 'పాడుతా తీయగా' 'పాడాలని ఉంది' లాంటి కార్యక్రమాలు ఎందరికో ప్లాట్ఫార్మ్ ని, కెరీర్నీ ఇచ్చాయి. 

బాలూ తనని తాను కొంచం ఎక్కువగా ఆవిష్కరించుకున్న కార్యక్రమం 'మా' టీవీ కోసం ఝాన్సీ చేసిన 'పెళ్లి పుస్తకం.' ఆసాంతమూ ఆసక్తిగా సాగే ఆ కార్యక్రమం చివర్లో, "మేం చాలా నిజాయితీగా మాట్లాడాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అన్ని జంటలూ ఇలాగే నిజాయితీగా మాట్లాడాలి" అని సందేశం ఇవ్వడం బాలూ మార్కు చమక్కు. తను అడపాదడపా మాత్రమే తెరమీద కనిపించే రోజుల్లో బాలూ ఎలా చేశాడో చూడడం కోసం 'ఓపాపా లాలి' లాంటి సినిమాలకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి కానీ, టీవీలో తరచూ కనిపించడం బాగా పెరిగిన కాలంలో వచ్చిన 'మిథునం' నాటికి మాత్రం బాలూ ఎలా చేశాడన్న కుతూహలం కన్నా, సినిమా ఎలా తీసి ఉంటారన్న ఆసక్తే ఎక్కువైంది. (తెలియకుండానే తన నటన మీద ఓ అంచనా వచ్చేసిందేమో బహుశా). బాలూని నాలుగడుగుల దూరం నుంచీ చూసిన సందర్భాలు నాలుగైదు ఉన్నాయి కానీ, ఒక్కసారి కూడా దగ్గరకి వెళ్లి పలకరించాలనిపించలేదు - బహుశా టీవీ వల్లే. 

కొన్నాళ్ల క్రితం నేనూ, నా మలయాళీ మిత్రుడూ సినిమా పాటల గురించి ఇంగ్లీష్లో  మాట్లాడుకుంటున్నాం. జేసుదాస్, విజయ్ ఏసుదాస్ పాటల గురించి నేనూ, 'ఎస్పీబీ సర్' పాటల్ని గురించి తనూ. "హీ ఈజ్ వెరీ హంబుల్. డౌన్ టు ఎర్త్..." అంటూ చాలా సేపు మాట్లాడాడు. నేను 'బాలూ' అని రిఫర్ చేస్తే, కాసేఫు తెలుగులో బాలూ అనే ఇంకో గాయకుడు ఉన్నాడనుకుని పొరబడ్డాడు తను. 'బాలూ, ఎస్పీబీ సర్ ఒక్కరే' అని నేను చెప్పినప్పటి తన రియాక్షన్ ఇప్పటికీ గుర్తే. "హౌ కెన్ యు కాల్ హిం బాలూ?" అంటూ తగువేసుకున్నాడు. ఏళ్లతరబడి మన జీవితంలో ఓ భాగమైపోయిన వాళ్ళని ఇంకెలా పిలుస్తాం? అదే విషయం చెప్పడానికి ప్రయత్నించా. 'ఎస్పీబీ సర్' ని ఒక్కసారైనా కలవాలన్న నా మిత్రుడి కోరిక తీరకుండానే, కరోనా మహమ్మారి బాలూని బలి తీసుకుంది.  'నీవు లేవు నీ పాట ఉంది' అంటూ ఏనాడో కవికుల తిలకుడు దేవరకొండ బాలగంగాధర తిలక్ చెప్పిన కవితా వాక్యం బాలూ విషయంలో అక్షర సత్యం. బాలూ పాట ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది.   

సోమవారం, సెప్టెంబర్ 21, 2020

పూర్ణమూ... నిరంతరమూ...

శ్రీకాళహస్తి కి చెందిన జర్నలిస్టు, కథకుడు సురేష్ పిళ్లె రాసిన పందొమ్మిది కథలతో వెలువడిన సంకలనం 'పూర్ణమూ... నిరంతరమూ... ' మూడు దశాబ్దాలకి పైగా రచనా వ్యాసంగాన్ని నిర్వహించాక ఒకేసారి రెండు కథాసంపుటాలు, ఒక నవలా వెలువరించారు సురేష్. వాటిలో ఇది తొలి సంకలనం. జర్నలిస్టు రాసిన కథలు కావడంతో సహజంగానే బోల్డంత వస్తు వైవిధ్యం కనిపించింది. పేపరు భాష అస్సలు కనిపించకపోవడం హాయిగా అనిపించింది. ఎక్కువ కథలకి కథాస్థలం కాలాస్త్రిగా, కొన్నింటికి హైదరాబాదు, ఒకట్రెండు కథలకి అమెరికా మరియు ఒకే ఒక్క కథకి తూర్పు గోదావరి. కథాస్థలానికి వెళ్లడంలో పాఠకులకి ఎలాంటి కష్టమూ లేకుండా, వేలుపట్టి తీసుకుపోయారు రచయిత. చుట్టూ జరిగే విషయాల తాలూకు పరిశీలన, కొంత తాత్వికత, మరికొంత వ్యంగ్యం కలగలిపిన కథలివి. 

కోతినుంచి మనిషి పుట్టాడనే పరిణామ సిద్ధాంతం కేవలం శారీరక నిర్మాణానికేననీ, ఒక్కో తరమూ జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్లడం అన్నివేళలా సాధ్యపడకపోగా ఒక్కోసారి తిరోగమించే తరాలూ పుట్టుకు రావచ్చునని చెప్పే కథ '2.0', సంపుటిలో ఇదే మొదటి కథ. జ్ఞానాన్ని మాత్రమే నమ్ముకున్న వేంకటేశ్వరుడి కడుపున పుట్టినా, ఆ జ్ఞానం జోలికి వెళ్లని అవధాన్ల పరమేశ్వరుడి కథ ఇది.  నాస్తికత్వం- ఆస్తికత్వాలని రచయిత చర్చకి పెట్టలేదు కానీ, నాస్తికుల కడుపున పుట్టిన పరమభక్తులు గుర్తొస్తారు ఈ కథ చదువుతూ ఉంటే. ఆదర్శానికి-ఆచరణకి మధ్య జరిగే సంఘర్షణని 'ఆరోజు' చెబితే, దైవదర్శనాంతరపు ఓ భక్తురాలి మానసిక స్థితిని 'ఇక్కడే ఉన్నాడేమిటీ?' కథ వర్ణిస్తుంది. దాదాపు ఇరవయ్యేళ్ళ క్రితం రాసిన 'కొత్త చెల్లెలు' కథలో పాయింట్ ఆ తర్వాత వచ్చిన అనేక ఫ్యాక్షన్ సినిమాల్లో వాడుకోబడింది. 


'రూట్స్' నవల (తెలుగు అనువాదం 'ఏడు తరాలు') చదివిన వాళ్ళకి మరింతగా నచ్చేసే కథ 'ఈగ'.  ఆఫ్రికన్ పాత్రలతో అమెరికాలో కథ నడిపినా, నాకెందుకో మన సమాజపు కథనే  ప్రతీకాత్మకంగా చెబుతున్నట్టుగా అనిపించింది. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకి సిద్ధ పడిన ఓ స్త్రీ కథ 'తోటకాడ బావి'. దీనిని స్త్రీవాద కథ అనొచ్చు. రైతు ఆత్మహత్య ఇతివృత్తంగా రాసిన కథ 'నా నూకలు మిగిలే ఉన్నాయి' నాస్టాల్జియా కథలా అనిపించే 'పశువుల కొట్టం' కథలో ఓ సన్నివేశం కొన్నేళ్ల క్రితం మా ఇంట్లో జరగడమూ, ఆ కథ ముగింపులో 'పెద్దక్క' పాత్ర మాట్లాడిన మాటల్నే ఇంచుమించుగా అప్పుడు నేనూ మాట్లాడి ఉండడమూ నా వరకూ ఓ విశేషం (అప్పటికే ఈ కథ పత్రికలో అచ్చయింది కానీ, నేను ఇప్పుడే చదివాను). మూన్నాలుగేళ్ల క్రితం నిత్యం వార్తల్లో నలిగిన విజయవాడ కాల్ మనీ లాంటి ఇతివృత్తంతో తూర్పుగోదావరి నేపధ్యంగా రాసిన కథ 'వరాలత్త గాజులు.' వరాలత్త లాంటి స్త్రీలు నాక్కూడా తెలుసు కాబట్టి  ఈ కథని కల్పితం అనుకోలేను. 

కెమెరా కంటితో చూసి రాసినట్టుగా అనిపించే కథ 'ఆ 5 నిమిషాలు.'  మన చుట్టూ జరిగిన, జరుగుతున్న కథలో మనకి బాగా తెలియని అంశం ఇతివృత్తం. అమెరికాలో బాగా సంపాదించి అటుపై తెలుగు నేల మీద రాజకీయ ప్రవేశం చేసి, ఎమ్మెల్యే కావాలని కలగన్న ఓ ఎన్నారై కథ 'పులినెక్కిన గొర్రె.' రచయిత ఒక్క గొర్రెని గురించే చెప్పినా, నిత్యం వార్తలను ఫాలో అయ్యే వాళ్ళకి మరికొన్ని 'గొర్రెలు' గుర్తు రాక మానవు. వాటిపట్ల సానుభూతి కలిగించేలా రాశారీ కథని. స్త్రీ గొంతుతో వినిపించిన పురుషుల కథ 'మా ఆయన అపరిచితుడు.'  సంకలనానికి శీర్షికగా ఉంచిన 'పూర్ణమూ... నిరంతరమూ...' తో పాటు, 'అనాది అనంతం' 'గార్డు వినాయకం భజే' కథల్ని గురించి నా బ్లాగు తొలిరోజుల్లో ఓ టపా రాశాను. ఈ కథా సంకలనం చివర్లో ఆ టపాకి చోటిచ్చారు రచయిత. థాంక్యూ సురేష్ పిళ్లె గారూ. 


నాకు ఎక్కువగా నచ్చేసిన కథలు 'గడ్డి బొగ్గులు' 'తపసుమాను' 'పేరు తెలియని ఆమె' 'రుచుల జాడ వేరు.' మొత్తం కథా సంకలనంలో లాగే ఈ నాలుగింటిలో కూడా ఏ రెండు కథలకీ పోలిక లేదు. 'గడ్డిబొగ్గులు' లో ఇస్మాయిల్ ని తలచుకోగానే చెరుకురసం మిషన్ నుంచి బయటికి వచ్చే పిప్పి జ్ఞాపకం వస్తుంది. చిత్తూరు జిల్లాకి మాత్రమే ప్రత్యేకమైన 'భారతాలు' ఇతివృత్తంగా రాసిన 'తపసుమాను' ఆ జిల్లాలో నేను స్వయంగా తెలుసుకున్న స్థానిక సాంస్కృతిక విషయాన్ని చెప్పింది. హైవేని బతుకుతెరువుగా చేసుకున్న 'పేరుతెలియని ఆమె' కథలో ముగింపు వెంటాడుతుంది. గత కొంతకాలంగా స్థాయీ ప్రదర్శనగా మారిపోయిన పూర్వ విద్యార్థుల కలయిక ఇతివృత్తంగా సాగే 'రుచుల జాడ వేరు' లో రచయిత జీవన వైరుధ్యాల్ని పట్టుకున్న తీరు ఇట్టే ఆకర్షిస్తుంది. నావరకూ, వెంటాడుతున్న కథలివి. 

"ద్రౌపతమ్మ  అగ్నిగుండాం తొక్కినట్టుగా భారతంలో యేడుండాదో మాకు దెలవదు. మా తిరనాల్లలో మాత్రం అదే ఆచారం" ('తపసుమాను'), "దేవుడు విటుడిగా వస్తే ఇలాగే ఉంటాడేమో అనిపించింది నాకు" ('పేరు తెలియని ఆమె'), "ఆయన అనే వాడికీ అన్నయ్యకీ అక్షరాల అమరికలో ఒకింత తేడా తప్ప భేదం ఏమీ ఉన్నట్టు అనిపించలేదు నాకు" ('తోటకాడ బావి'), "ఎన్ని గడ్డిపరకలు కాలిస్తే బొగ్గులవుతాయ్?" ('గడ్డి బొగ్గులు) లాంటి వాక్యాలు, చదువుకుంటూ వెళ్లిపోకుండా ఆపి ఆలోచనలో పడేస్తాయి.  ద్రౌపతమ్మ  అగ్నిగుండం ప్రశ్నయితే, గురజాడ 'మీ పేరేమిటి?' కథలో రాసిన "ఈ దేశంలో పాండవులు ఉండని గుహలూ, సీతమ్మవారు స్నానమాడని గుంటలూ లేవు" వాక్యాన్ని గుర్తు చేసింది. మధురాంతకం నరేంద్ర రాసిన ముందుమాట కథల నేపధ్యాన్ని వివరిస్తే, సురేష్ పిళ్లె రాసుకున్న 'న వినుతి.. నా వినతి' రచయిత నేపధ్యాన్ని చెబుతుంది. ఆదర్శిని మీడియా ప్రచురించిన ఈ పుస్తకం, పుస్తకాల షాపులతో పాటు అమెజాన్ లో దొరుకుతోంది. (పేజీలు 200, వెల రూ. 200). 

మంగళవారం, సెప్టెంబర్ 08, 2020

జయప్రకాశ్ రెడ్డి

ఓ సినిమాలో వేసిన ఓ పాత్ర ప్రేక్షకులకి బాగా దగ్గరైతే, ఆ నటి/నటుడు కొన్నాళ్ల/కొన్నేళ్ల పాటు అదే తరహా పాత్రలు వేయాల్సి ఉంటుంది. కొత్తదనం కోసం ప్రయత్నిస్తే ప్రేక్షకులు తిరస్కరిస్తారేమో అనే భయం ఆయా నటీనటులతో పాటు, నిర్మాత, దర్శకుల్లోనూ పేరుకుపోయి ఉంటుంది. మన తెలుగు సినిమా పరిశ్రమ దీనికి పెట్టిన ముద్దుపేరు 'ఇమేజ్.' ఒక్కసారి ఓ ఇమేజ్ వచ్చిందీ అంటే, అందులోనుంచి బయట పడడం మాటల్లో అయ్యే పని కాదు. (అలాగని అదే ఇమేజ్ ని సుదీర్ఘకాలం పాటు చెక్కు చెదరకుండా నిలబెట్టుకోడమూ కుదిరే పని కాదు, అది వేరే కథ). ఇమేజ్ నుంచి బయట పడడానికి  నటులకి టాలెంట్ తో పాటు తెగువ కూడా అవసరం. ధైర్యం చేసే దర్శక నిర్మాతలూ కలిసి రావాలి. ఇలా అన్నీ కలిసొచ్చినప్పుడు జయప్రకాష్ రెడ్డి లాంటి నటులు ఇమేజిని బద్దలుకొట్టగలిగిన కొందరిలో ఒకరవుతారు. 

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'ప్రేమించుకుందాం రా' సినిమాలో ప్రధాన ఆకర్షణ ఇద్దరు. కథానాయిక కావేరిగా కనిపించిన ఉత్తరాది నాయిక అంజలా జవేరి, విలన్ గా మెప్పించిన జయప్రకాశ్ రెడ్డి. అప్పటికే చిన్న చిన్న పాత్రల్లో తెరమీద కనిపించినా, ఆ సినిమాతోనే 'ఎవరీ జయప్రకాశ్ రెడ్డి?' అన్న ప్రశ్న వచ్చింది, సినిమా పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ కూడా. భయం గొలిపే భారీ విగ్రహం, అప్పటికి తెలుగు తెరకి అంతగా పరిచయం లేని రాయలసీమ యాసలో సంభాషణలు, చూపుల్లో క్రౌర్యం, చేతల్లో రాజసం.. ఓ మంచి విలన్ దొరికేశాడు తెలుగు సినిమాకి. అది మొదలు రాయలసీమ విలనీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు కొన్నేళ్ల పాటు. 'సమరసింహా రెడ్డి' సినిమాలో పోషించిన విలన్ పాత్రతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది 'రాయలసీమ వాసులంటే విలన్లేనా?' అని ఆ ప్రాంత ప్రజల మనోభావాలు గాయపడే వరకూ వెళ్ళింది, ఈ విలనీ పరంపర. 

ఒక టైంలో జయప్రకాశ్ రెడ్డి అవుట్ డోర్ షూట్ లో ఉంటే, షూటింగ్ చూడ్డానికి చేరే జనం ఆయన్ని పలకరించడానికి భయపడే వాళ్ళట! అంతటి నిలువెత్తు విలనూ హాస్య పాత్రల్ని అవలీలగా పోషించి కడుపుబ్బా నవ్వించడం ఒక విచిత్రం. ముందుగానే చెప్పుకున్నట్టుగా, ఒక ఇమేజిని సంపాదించుకోడమే కాదు, దానిని తనకి తానే బ్రేక్ చేసుకున్నారు జయప్రకాశ్. తరువాత కొన్ని సెంటిమెంట్ పాత్రల్నీ పండించారు. అలాగని విలనీని విడిచిపెట్టలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే తనకి వచ్చిన ప్రతి పాత్రకీ న్యాయం చేశారు. ప్రేక్షకుల చేత ఔననిపించుకున్నారు. నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన జయప్రకాశ్ రెడ్డికి నాటకాల మీద మక్కువ తగ్గలేదు. సినిమాల నుంచి కొంత ఆటవిడుపు దొరికాక 'అలెగ్జాండర్' అనే నాటిక (ఏకాంకిక అనొచ్చేమో, ఎందుకంటే, స్టేజి మీద కనిపించేది ఆయనొక్కడే. మధ్యమధ్యలో కొన్ని గొంతులు (రికార్డెడ్ ఆడియో) వినిపిస్తూ ఉంటాయి) అనేక చోట్ల ప్రదర్శించారు. అయన సినిమా ఇమేజీ, ఆ నాటిక విజయానికి దోహదపడింది. 

Google Image

'అలెగ్జాండర్' ప్రదర్శన సందర్భంలోనే నాటకాల మీద మక్కువ తగ్గని కొందరం ఆయన్ని కలిసి కాసేపు గడిపాం. అసలే సినిమా వాడు, ఆ పైన గంభీర విగ్రహం కావడంతో మాలో కొందరు పలకరించడానికి కూడా జంకారు. కానీ, జయప్రకాశ్ చాలా మృదు స్వభావి, నిజమైన కళాకారుడూను. మేము సహజంగానే సినిమా విషయాలు, మరీ ముఖ్యంగా విలన్ నుంచి కేరక్టర్ ఆర్టిస్టుగా మారడాన్ని గురించి అడిగాం. జవాబు గా చెప్పినవి రెండు విషయాలు. మొదటిది, నటుడన్న వాడు అన్నిరకాల పాత్రలూ చేయాలి (ఇది అందరూ చెప్పేదే). రెండోది, కేవలం విలన్ పాత్రలు మాత్రమే చేస్తాను అని కూర్చుంటే అలాంటి సినిమాలు ఎన్ని వస్తాయి? వాటిలో మనదాకా వచ్చే పాత్రలు ఎన్ని? ప్రేక్షకులకి విసుగొస్తే తర్వాత పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలు, వాటికి జవాబులూను. 'బురిడీ' అనే సినిమాలో ఆసాంతమూ ఓ టర్కీ టవల్లో కనిపిస్తారాయన. ఆ సినిమాని గుర్తు చేస్తే పగలబడి నవ్వారు. "ఏం జెప్పమంటారూ? సత్తిబాబు (దర్శకుడు ఈవీవీ) టేక్ అవుతుంటేనే పగలబడి నవ్వేసేవాడు" అని చాలా విశేషాలు గుర్తు చేసుకున్నారు. 

టిక్కెట్టు నాటకాలని ప్రమోట్ చేయడం అన్న కాన్సెప్ట్ గురించి అడిగాం. మీరు సినిమా వాళ్ళు కదా, మీరు టికెట్ పెడితే జనానికి నాటకానికి టికెట్ కొనడం అలవాటు అవుతుందేమో కదా అని. తను ఎందుకు టిక్కెట్ పెట్టడం లేదు అనే విషయాన్ని గురించి చాలాసేపు చెప్పారు. ముఖ్యంగా చెప్పింది ఎక్కువమంది తన నాటకం చూసేలా చేయడం కోసం అని.  తాను కోరుకున్నట్టుగానే ఆ నాటక ప్రదర్శన చాలా విజయవంతం అయ్యింది. కొన్నాళ్ళకి సినిమాల్లో మళ్ళీ బిజీ అయిపోయారు కూడా. ఒక్క మాండలీకాన్ని పలికే తీరే కాదు, చిన్న చిన్న విరుపులు ద్వారా డైలాగుల్ని మెరిపించడం జయప్రకాష్ రెడ్డి ప్రత్యేకత. విసుగు, చికాకు లాంటి రొటీన్ ఎక్స్ప్రెషన్ లలో కూడా బోలెడంత వైవిధ్యం చూపించడాన్ని గమనించొచ్చు. గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పడం మొదలు, అస్సలు డైలాగే లేని పెద్ద పాత్రలో మెప్పించడం వరకూ వెండితెర మీద జయప్రకాశ్ రెడ్డి చేసిన ప్రయోగాలు అనేకం. 

దిగుమతి విలన్లకి దీటుగా మెప్పించినా, హాస్యాన్ని, సెంటిమెంట్ ని రసభంగం కాకుండా పండించినా ఆయనతో ప్రత్యేకమైన తరహా. ఆ నటుడు మరింక తెరమీద కనిపించబోడు అనుకుంటే కష్టంగా ఉంది. జయప్రకాశ్ రెడ్డి ఆత్మకి శాంతి కలగాలి. 

బుధవారం, ఆగస్టు 19, 2020

పాజిటివిటీ

"కావడి కొయ్యేనోయ్.. కుండలు మన్నేనోయ్.. కనుగొంటే సత్యమింతేనోయీ.." ...'దేవదాసు' గొంతుతో ఘంటసాల పాడుతున్న పాట అలలు అలలుగా వినిపిస్తోంది.. ఇదొక్కటేనా? జేసుదాసు విషాద గీతాలు, సత్యహరిశ్చంద్ర కాటిసీను పద్యాలు ఇవన్నీ రోజూ ఏదో ఒక టైములో తప్పకుండా వినడం ఈమధ్యనే వచ్చి పడిన కొత్త అలవాటు అయి కూర్చుంది. ఆ కథా కమామీషూ చెప్పాలంటే, మొన్నామధ్య జరిగిన 'మోటివేషన్ క్లాసెస్' దగ్గరికి వెళ్ళాలి. 'ఇంటి నుంచి పని' కారణంగా ఉద్యోగులంతా స్తబ్దుగా తయారయ్యారని అనుమానించిన శ్రీ ఆఫీసు వారు, ఓ బట్టతలాయనతో మాట్లాడి ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేశారు. రోజూ రెండు గంటల చొప్పున నాలుగు రోజులు జరిగిన ఆ ముచ్చటలో మమ్మల్ని 'పాజిటివిటీ' లో ముంచి తేల్చడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడా శిక్షకుడు (ట్రైనర్). తీసుకున్న సొమ్ముకి న్యాయం చేయాలి కదా మరి. 

నాకు తెలిసినంతలో ఈ ట్రైనింగుల కల్చరు ఊపందుకుని ఓ ఇరవై ఏళ్ళు దాటింది. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి శిక్షణ ఇచ్చినా కొన్ని పడికట్టు మాటలు, ఇంకొన్ని పరమ రొటీను ప్రాక్టికల్సూ తప్పనిసరి. వినే వాళ్ళు కూడా, పరమ పాత విషయాల్ని కూడా జీవితంలో అప్పుడే తొలిసారి తెలుసుకుంటున్నటుగా అభినయించడానికి బాగా అలవాటు పడిపోయారు. "అన్నీ నీవే.. అంతా నీవే.. " అంటూ బాగా వినేసిన పాత పాటతో పలకరించాడు కొత్త ట్రైనరు. ఇక్కడ 'నీవే' అనగా పరమాత్మ కాదు, శిక్షణలో పాల్గొంటున్న అందరూ ఎవరికి వారే అన్నమాట. "సర్వశక్తులూ నీలోనే ఉన్నాయి.. ఈ సత్యం నీవు తెలుసుకున్న నాడు ప్రపంచం నీ పాదాక్రాంతమవుతుంది" అని హిందీ యాస వినిపించే ఇంగ్లీష్ లో ఇంకో జ్ఞాన గుళిక విసిరాడు. అతన్ని మేము వీడియోలో చూడడం తప్పని సరి, మా దివ్యమంగళ విగ్రహాలని అతగాడికి చూపించక్కర్లా (అడిగినప్పుడు తప్ప). లెక్చరు మొదలైన పది నిముషాలు తిరక్కుండానే చాట్ విండోలు యమ యాక్టివ్ అయ్యాయి. 

ఈ ట్రైనర్ ఎక్కడ దొరికి ఉంటాడు మొదలు ఎంత ఛార్జ్ చేసి ఉంటాడు వరకూ గాసిప్పులు మొదలయ్యాయి. అతగాడు ఇలాంటివి ఎన్ని చూసి ఉండడూ? ఉన్నట్టుండి  అందరూ ఆడియోలు ఆన్ చేసి తను చెప్పింది చెప్పినట్టు పలకమని ఆదేశించాడు. చిన్నప్పుడు బళ్ళో చెప్పిన 'ఇండియా ఈజ్ మై కంట్రీ..' లాంటిది (అతని స్వీయ రచన అనుకుంటా) ఒకటి చెప్పించాడు. దీనిమీద కూడా చాట్లో జోకులు బాగా పేలాయి.  ఓ గంటన్నా గడవక ముందే అతగాడు చెబుతున్నవన్నీ మన ప్రవచనాల్లోనే ఉన్నాయన్న నిశ్చయానికి వచ్చేసాం అందరం, అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష టైపులో. మొదటి రోజు రెండు గంటలూ పూరయ్యేసరికి, "ఇంకో మూడ్రోజులు భరించాలా?" అనే ఒకలాంటి నీరసం ఆవహించేసింది అందరినీ. క్లాసు సరిపోదన్నట్టు, హోమ్ వర్కు ఒకటి మళ్ళీ. దీంతో అందరికీ పూర్తిగా నీరసం వచ్చేసింది. 

(Google Image)

అతడు తెలివైన వాడు. ఎందుకంటే, రెండో రోజు 'హోమ్ వర్క్ చేశారా?' అని అడగలేదు. 'మీరు చేసి ఉంటారనే భావిస్తున్నా' అన్నాడు నమ్మకంగా. 'నచ్చావోయీ ట్రైయినరూ ' అనుకున్నాం చాట్ లలో. పాజిటివిటీని పెంచే పుస్తకాలూ సినిమాలని గురించి అనర్గళంగా ప్రసంగించాడు. జెనెరిక్ టాపిక్ అవ్వడంతో పెద్దగా బోరు కొట్టలేదు. పాజిటివిటీతో ప్రపంచాన్ని మార్చేయచ్చని నమ్మకంగా చెప్పాడు, చెడ్డవారి పట్ల కూడా మంచిగా ఉండమని మధురవాణికి సలహా ఇచ్చిన సౌజన్యరావు పంతుల్లాగా. ప్రశ్నలు అడగమనడమే తడవుగా, 'మనం ఓ పిచ్చికుక్కతో పాజిటివ్ గా ఉండడం ద్వారా దానిని మంచి కుక్కగా మార్చవచ్చా?' అనే ప్రశ్న వచ్చింది. సదరు 'పిచ్చికుక్క' గురించి తెలిసిన అందరం గుంభనంగా నవ్వుకున్నాం. ట్రైనరేమో పిచ్చి గురించీ, కుక్క గురించీ వివరించి, 'సమాన స్థాయి ఆలోచనలు' అనే కొత్త సిద్ధాంతం ప్రవేశపెట్టాడు. అనగా, ఒకే వేవ్ లెన్త్ ఉన్నవాళ్ళని మార్చవచ్చట. చాట్ బాక్స్ లోకి ఓ తెలుగు సామెత వచ్చి పడింది. 

మూడోరోజు రొటీన్ గానే గడిచింది కానీ, చివరిరోజున అతగాడు పాజిటివ్ థింకింగ్ ద్వారా గాయాలని మాన్పుట అనే కార్యక్రమానికి ఒడిగట్టాడు. కొత్తగా చేరిన కుర్రాడొకడు - రెండేళ్ల క్రితం తనకి బైక్ యాక్సిడెంట్ అయిందనీ, వెన్నునొప్పి ఇంకా పోలేదనీ చెప్పాడు. చిటికలో నొప్పి తగ్గిస్తానని ట్రైనర్ హామీ ఇచ్చి ఆన్లైన్ లోనే 'దేవుడా ఓ మంచి దేవుడా' టైపులో ఈ కుర్రాడిచేత 'నేను పడలేదు.. నాకు నొప్పిలేదు..' లాంటిది హిందీ యాస ఇంగ్లీష్ లో తను చెప్పి, తమిళింగ్లీషులో కుర్రాడిచేత చెప్పించాడు. ఈలోగా మేమంతా 'అసలు యాక్సిడెంట్ ఎలా అయి ఉంటుంది? రాష్ డ్రైవింగా? డ్రంకెన్ డ్రైవింగా?' లాంటి గాసిప్ మాట్లాడుకున్నాం చాట్లో.  ఇలా హాయిగా ఓ అరగంట పైగా గడిచాకా, 'నా నొప్పి సగం పోయింది' అని ప్రకటించాడు కుర్రాడు. ఎవరి అనుమానాలు వాళ్ళకున్నాయ్ కానీ, ఎవ్వరం కిమ్మనలా. పరిసరాల్ని పాజిటివిటీతో నింపుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పి ట్రైనింగ్ ముగించాడు శిక్షకుడు. 

ఓ రెండ్రోజులు టైమిచ్చి, ఓ ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేసి మరీ అందరం కలిసి కుర్రాడిని అడిగేసాం, 'నీకిప్పుడేమీ నొప్పి లేదు కదా?' అనేసి. మేము ఊహించినట్టే "ఏమీ తగ్గలేదు. అతను ఫీలవుతాడని తగ్గిందని చెప్పా" అని గుట్టు విప్పాడు. ఆ ట్రైనింగ్ కోసం పెట్టిన ఖర్చుని వాటాలేసి అందరికీ తలోకొంచం ఏదో అలవెన్సు పేరుతో ఇచ్చి ఉంటే ఇంతకన్నా ఎక్కువ పాజిటివ్ గా ఉండేవాళ్ళం కదా అని నిట్టూర్చాము అందరం. సరే, అంత గొప్ప ట్రైనింగ్ లో పాల్గొన్నందుకు పాజిటివ్ గా ఉండే ప్రయత్నాలు ఎవరివంతుగా వాళ్ళం చేయాలి కదా.. నావరకు, 'దేవదాసు' పాటలు, హరిశ్చంద్ర పద్యాలని మించిన పాజిటివిటీ ఇంకెక్కడా కనిపించడంలేదు. అదిగో, "ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ.. " అంటూ గుర్రం జాషువా పద్యాన్ని అందుకున్నారు డీవీ సుబ్బారావు జూనియర్.. మరికాస్త పాజిటివిటీ నింపుకుని వస్తా.. 

సోమవారం, ఆగస్టు 17, 2020

అక్షరాంజలి

'నేనెవర్ని?' 'నన్ను నడిపించే శక్తి ఏమిటి?' ఆలోచనాపరులందరికీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదురవ్వక తప్పని ప్రశ్నలివి. అతికొద్దిమందిని ఏళ్ళ తరబడి వెంటాడే ప్రశ్నలూ ఇవే. మహర్షులు, మహాత్ముల జీవిత చరిత్రల్ని పరిశీలిస్తే, వాళ్ళ ప్రయాణం మొదలయ్యిందీ ఈ ప్రశ్నలతోనే అని తెలుస్తుంది మనకి. 'అనామకుడు' అనే కలంపేరుతో కథలు, నవలలు రాస్తున్న ఏ. ఎస్. రామశాస్త్రి చేత 'అక్షరాంజలి' అనే చిరుపొత్తాన్ని రాయించింది కూడా ఈ ప్రశ్నలే అనిపించింది, పుస్తకం చదవడం పూర్తి చేయగానే. భౌతికశాస్త్రంలో అత్యున్నత విద్యాభ్యాసం చేసి, భారతీయ రిజర్వు బ్యాంకులో ఉన్నతోద్యోగం చేసి, ఆర్ధిక శాస్త్రాన్ని గురించి ఆంగ్లంలో గ్రంధాలు రాసి, మధ్యమధ్యలో మాతృభాషలో కథలు, నవలలు రాసిన 'అనామకుడు' తన  'అక్షరాంజలి' ని పాఠకులకి అందించే మాధ్యమం గా పద్యాన్ని ఎంచుకున్నారు. 'చదువులలోని సారమెల్ల' చదవడం అంటే ఇదేనేమో. 

అరవై పేజీల పుస్తకాన్ని 'అక్షరాంజలి', 'ఆత్మ నివేదన', 'నీ వినోదం', 'మా సందేహం', 'నీ విలాసం', 'ఉపనిషత్తులు', 'సనాతన విజ్ఞానం', 'నా విన్నపం' అనే ఎనిమిది అధ్యాయాలుగా విభజించడంతో పాటు, తాను ప్రస్తావించిన అంశాల తాలూకు వివరణలతో ఓ 'అనుబంధం' ని కూడా జతచేశారు. "అరవై సంవత్సరాలుగా ఈ సృష్టి నన్ను అనుక్షణం అబ్బురపరుస్తూనే ఉంది. ఆనందంలో ముంచెత్తుతూనే ఉంది.." అని చెబుతూ,  "సృష్టికర్త ప్రేరణతోనే సృష్టిలో నేను చూస్తున్న విశేషాలనీ, వింతలనీ సృష్టికర్తకు విన్నవించుకునే ప్రయత్నం మొదలు పెట్టాను. ఆ ప్రయత్న ఫలితమే ఈ అరవై పద్యాల అక్షరాంజలి" అంటూ ఈ రచన వెనుక తన ప్రేరణని వచన రూపంలో వివరించి, అక్కడి నుంచి అత్యంత సరళమైన పద్యాలతో 'ఆత్మనివేదన' ఆరంభించారు కవి. 


"ఇచ్చితివీవు భోజ్యములు - ఇచ్ఛితి నీకు నివేదంబుగా/ ఇచ్చితివీవు పుష్పములు - ఇచ్ఛితి నీకు సుమమాలగా/ ఇచ్చితివీవు విద్యలను - ఇచ్చుచుంటిని పద్యమట్లుగా/ ఇచ్చిన  నీకె  ఇచ్చుటను - ఎంచక తప్పుగా స్వీకరించుమా" ..బహుశా 'నేను' నుంచి బయటికి వచ్చే క్రమంలో ఈయన చాలా దూరమే ప్రయాణం చేశారనిపించింది ఈ పద్యం చదువుతుంటే. 'నీ వినోదం' అధ్యాయంలోని పదకొండు పద్యాలూ మనకెప్పుడూ మామూలుగా అనిపించే ప్రపంచాన్ని, కొత్తగా చూపిస్తాయి. తారలు, కృష్ణ బిలాలతో కూడిన సౌర కుటుంబం మొదలు, క్రమం తప్పకుండా జరిగే ఉదయాస్తమయాలు, మానవ శరీర నిర్మాణం, సృష్టిక్రమం, ఒకే శరీర భాగాలతో పుట్టిన మనుషుల రూపురేఖల్లో స్థూలమైన, సూక్ష్మమైన తేడాలు.. వీటన్నింటినీ నిబిడాశ్చర్యంతో పరిశీలిస్తూనే, ఆటను సృష్టిచేసి, నియమావళి ఏర్పాటు చేసి ఆడనిచ్చేదీ, అందులో గెలవనిచ్చేది కూడా నువ్వే అంటారు సృష్టికర్తతో. 

మనందరికీ చూసే కళ్ళు, వినే చెవులు, ఆలోచించే మెదడు ఉన్నాయి. మన వివేచనతో మనం నిర్ణయాలు తీసుకుంటాం. అయితే ఈ నిర్ణయాలన్నీ మనవేనా లేక మనల్ని సృష్టించి, తన ఆటలో మనల్ని పావుల్ని చేసి ఆడించే సృష్టికర్తవా? ఇవే ప్రశ్నలు సంధించారు 'మా సందేహం' అధ్యాయంలో. 'నీ విలాసం' అధ్యాయం కూడా ఇవే ప్రశ్నలకి కొనసాగింపుగా అనిపిస్తుంది. "ఉపనిషత్తులలో కొన్ని కథలు అవాస్తవంగా కనిపించవచ్చు. కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నట్టు అనిపించవచ్చు. ఐతే మనం ఉపనిషత్తులు చదువుతున్నప్పుడు - అవి ఏ కాలంలో, ఏ పరిస్థితుల్లో చెప్పబడ్డాయో ఆలోచించుకోవాలి" అంటూ చేసిన సూచన, కేవలం ఉపనిషత్తుల విషయంలోనే కాదు సాహిత్య అధ్యయనానికి  కూడా వర్తిస్తుంది. 

ఈశ, కేన, కఠ, ప్రశ్నాది  దశోపనిషత్తుల సారాన్ని చిన్న చిన్న పద్యాల రూపంలో అందించడం వెనుక కవి/రచయిత  చేసిన కృషి అంచనాకి అందదు. "అనుకున్నది జరుగనపుడు/ అనుకోనిది జరిగినపుడు ఆరటపడకన్/ మనకది ప్రాప్తంబనుకొన/ మనసున సం'తృప్తి ' నింపు మాకందరికిన్" అంటారు 'నా విన్నపం' లో. అదంత సులువుగా సాధ్యమయ్యేదా? ఎన్ని దెబ్బలు తినాలి, ఎంత సాధన చేయాలి?? మొత్తంమీద చూసినప్పుడు, రెండు భిన్న ప్రపంచాలుగా అనిపించే భౌతిక శాస్త్రాన్ని, సనాతన ధర్మాన్నీ కలగలిపి పద్య రచన చేయడం ఈ పుస్తకం ప్రత్యేకత అనిపించింది. తెలియని విషయాలు చెప్పడం కన్నా, అందరికీ బాగా తెలిసిన విషయాలనే బాగా అర్ధమయ్యేలా చెప్పడమే ఎక్కువ కష్టమేమో కూడా అని మరోమారు అనిపించింది. ఈ పుస్తకాన్ని చదవాలనుకునే వారు 'కినిగె' నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కవి/రచయిత గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడొచ్చు. 

శుక్రవారం, జులై 31, 2020

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

అతని పేరు ఉమామహేశ్వర రావు. అతన్ని గురించి ఒక్కమాటలో చెప్పాలంటే మూర్తీభవించిన మంచితనం. వృత్తిరీత్యా ఫోటో గ్రాఫర్, టెక్నిక్ మాత్రమే తెలుసును తప్ప, క్రియేటివిటీ గురించి ఆలోచన లేదు. ఇప్పటి లోకంలో బతకాలంటే మంచితనం మాత్రమే ఉంటే సరిపోదనీ, సృజనాత్మకత లేకుండా కేవలం టెక్నిక్ మీదే ఆధారపడితే మంచి ఫోటోగ్రాఫర్ కాలేనని అతడు తెలుసుకోవడం, ఆ దిశగా ప్రయత్నాలు చేసి విజయం సాధించడమే సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా. మహేష్ అని పిలవబడే ఈ ఉమామహేశ్వరరావు ఉండేది అరకులోయలో. ఇందువల్ల ప్రేక్షకులకి కలిగిన ప్రయోజనాలు ఏమిటంటే, సినిమా జరిగిన రెండు గంటల పదహారు నిమిషాలపాటూ అరకు, పరిసర గ్రామాల పచ్చదనం కళ్ళని ఆహ్లాద పరుస్తూ ఉండగా, ఇన్నాళ్లూ సినిమాలో కామెడీకి మాత్రమే పరిమితమైన ఉత్తరాంధ్ర మాండలీకం సినిమా ఆసాంతమూ సొగసుగా చెవులకి వినిపించింది. 

వైవిద్యభరితమైన 'C/o. కంచరపాలెం' సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన వెంకటేష్ మహా తన రెండో ప్రయత్నానికి రీమేక్ సినిమాని ఎంచుకోవడం (మాతృక 'మహేసిన్టే ప్రతీకారం' (2016) అనే మలయాళీ సినిమా) ఆశ్చర్యం కలిగించినా, కథా స్థలాన్ని తనకి పట్టున్న ఉత్తరాంధ్రకి మార్చేయడం అతడి తొలివిజయం అనిపించింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక అతడి రెండో విజయం. తొలి సినిమాని అందరూ కొత్తవాళ్లతో తీసిన వెంకటేష్, రెండో సినిమాలో నలుగురైదుగురు మినహా కథా నాయికలతో సహా మిగిలిన అన్ని పాత్రలకీ కొత్తవాళ్ళనే ఎంచుకున్నాడు. సత్యదేవ్ తో పాటు సీనియర్ నరేష్ (ఇతని తాజా పేరు వీకే నరేష్), నిర్మాతల్లో ఒకరైన విజయ ప్రవీణ పరుచూరి (ఈమె  'C/o. కంచరపాలెం' సినిమాని నిర్మించడంతో పాటు అందులో ఓ ముఖ్య పాత్రని పోషించారు), ఇద్దరు ముగ్గురు టీవీ నటులు మినహా  మిగిలిన అందరూ కొత్త మొహాలే. 


మహేష్ (సత్యదేవ్) కి కెమెరా వారసత్వంగా వస్తుంది. అతడి తండ్రి వయసులో ఉండగా ఫోటోలు తీసుకోడం కోసం అరకు వచ్చి అక్కడే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకుని, ఫోటోగ్రాఫర్ గా స్థిరపడి పోతాడు. ఆ జంటకి మహేష్ ఒక్కడే సంతానం. భార్య మరణం తర్వాత, స్టూడియోని కొడుక్కి అప్పగిస్తాడతను. పాస్పోర్ట్ ఫోటోలు, పెళ్ళిళ్ళకి, చావులకి ఫోటోలు తీసే మహేష్ కి తండ్రి చేసినట్టుగా కెమెరాతో ప్రయోగాలు చేయాలన్న ఆలోచన రాదు. తనో మంచి ఫోటోగ్రాఫర్ని అని గాఢమైన నమ్మకం. ఫోటోకి బ్యాక్ గ్రౌండ్, లైటింగ్ సరిగ్గా ఉంటే చాలుకదా అనుకుంటాడు. తండ్రికి వండిపెడుతూ, చుట్టుపక్కల వాళ్లందరితోనూ స్నేహంగా ఉండే మహేష్ జీవితం ఒకేసారి మూడు మలుపులు తిరుగుతుంది. ప్రియురాలు దూరమవ్వడం, అనుకోని రీతిలో అతనికి పదిమందిలోనూ అవమానం జరగడం, ఫోటో తీయించుకోడానికి వచ్చిన ఓ అమ్మాయి 'నీకసలు ఫోటోగ్రఫీ తెలుసా?' అని మొహం మీదే అడిగేయడం. అక్కడినుంచి మలుపు తిరిగిన అతని కథ, మహేష్ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడంతో ముగుస్తుంది. 

నటీనటులందరూ బాగా చేశారు. సత్యదేవ్, నరేష్, నాయికలిద్దరి నటనా గుర్తుండిపోతుంది. రెండో సగంలో వచ్చే నాయిక కెరీర్ తొలినాళ్లలో భానుప్రియని గుర్తు చేసింది. పాత్రలు, సంభాషణలు ఎంత సహజంగా ఉన్నాయంటే, సినిమా చూస్తున్నట్టుగా కాక అరకులో రోడ్డు పక్కన నిలబడి జరుగుతున్నది చూస్తున్నట్టుగా అనిపించింది చాలాసార్లు. కెమెరా (అప్పు ప్రభాకర్), సంగీతం (బిజిబల్) విభాగాలని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  సహజంగానే ఎంతో అందమైన అరకు, కెమెరా కంటిలో మరింత అందంగా కనిపించింది. యుగళ గీతాలు లేకపోయినా, నేపధ్య సంగీతంతో పాటు, మూడు పాటలూ కూడా సినిమాలో కలిసిపోయాయి. మలయాళం ఒరిజినల్ చూసిన మిత్రులు "యథాతథంగా దించేశాడు" అన్నారు కానీ, నేను ఒరిజినల్ చూడలేదు. రెండోసగంలో హీరో ఫోటోగ్రఫీతో ప్రేమలో పడే సన్నివేశాలని మరికొంచం బాగా రాసుకుంటే బాగుండేది అనిపించింది. 

కథాకాలం విషయంలో కొంచం కన్ఫ్యూజన్ కనిపించింది. ఓ పక్క మహేష్ బాబు-జూనియర్ ఎన్ఠీఆర్ ఫ్యాన్స్ ని కథలో పాత్రలు చేస్తూనే, హీరో తన స్టూడియోలో పాత పద్ధతితో ఫోటోలు డెవలప్ చేసినట్టుగానూ ('కడగడం' అనేవాళ్ళు), పాతకాలపు కంప్యూటర్ వాడుతున్నట్టుగానూ చూపించారు. అలాగే కాలేజీ స్టూడెంట్స్ చేసిన ఫ్లాష్ మాబ్ లో అన్నీ పాత పాటలే ఉన్నాయి. మొదటి సగంలో కనిపించిన కొన్ని పాత్రలు (అరకు వాసులు) రెండో సగంలో మాయమవడం వల్ల ఆ పాత్రల్ని కథలో భాగంగా కాక, కామెడీ ఫిల్లింగ్ కోసం వాడుకున్న భావన కలిగింది. స్థానిక ఆచారాలు, వంటకాల్ని కథలో భాగం చేశారు కానీ, యాత్రికులని మర్చిపోయారు. సంభాషణలు సహజంగా ఉండడమే కాదు, నవ్విస్తూనే ఆలోచలోకి నెట్టేశాయి చాలా సన్నివేశాల్లో.  ఫోటోగ్రఫీతో పరిచయం లేనివాళ్ళకి రెండోసగం సాగతీతగా అనిపించే అవకాశం ఉంది. రొటీన్ కి భిన్నంగా ఉండే క్లీన్ సినిమాలని ఇష్టపడేవాళ్ళకి నచ్చే సినిమా ఇది. ఓటీటీ లో విడుదలైంది కాబట్టి కలెక్షన్ల లెక్కలు కుదరవు కానీ, సినిమాగా చూసినప్పుడు వెంకటేష్ మహా  కొత్త దర్శకులు ఎదుర్కొనే 'రెండో సినిమా గండం' దాటేసినట్టే. 

శుక్రవారం, జులై 24, 2020

పీవీ గురించి మళ్ళీ ...

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుని 'కాంగ్రెస్ మనిషి' గా గుర్తించారు! పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీవీ శతజయంతి కార్యక్రమానికి పంపిన సందేశంలో సోనియా పీవీని 'నిజమైన కాంగ్రెస్ మనిషి' గా అభివర్ణించారు. బాగా ఆలస్యంగానే అయినా, సోనియా ఓ నిజాన్ని గుర్తించి, అంగీకరించారు. ప్రధానిగా పీవీ చేసిందంతా దేశం కోసమూ, కాంగ్రెస్ పార్టీ కోసమే తప్ప తాను, తన కుటుంబం బాగుపడేందుకోసం ఏమీ చేయలేదనీ, చేసిన దానికి ఫలితంగా అనేక కేసుల్నీ, బోలెడంత అపకీర్తినీ మాత్రమే  మూటకట్టుకున్నారనీ దేశం యావత్తూ గుర్తించిన చాలా ఏళ్ళకి సోనియాకి ఈ గమనింపు కలిగింది. ఓ పదహారేళ్ళ క్రితం ఆమెకీ ఎరుక కలిగి ఉంటే కనీసం పీవీ పార్థివ దేహానికి  ఓ గౌరవం దొరికి ఉండేది. 

ఇన్నాళ్లూ పీవీ ప్రస్తావనని కూడా ఇష్టపడని సోనియా ఇంతకీ ఇప్పటికిప్పుడు ఈ ప్రకటన చేయడం వెనుక కారణం ఏమిటి? ఆ కారణం రెండు కాంగ్రెసేతర పార్టీలు కావడం - ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కి బద్ధ విరోధులు కావడం - ఇక్కడ విశేషం. గత నెల 24 న పీవీ తొంభై తొమ్మిదో జయంతిని హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆరెస్), ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించాయి. అప్పుడప్పుడూ లీలగా, పీలగా వినిపిస్తూ వచ్చిన 'పీవీకి భారత రత్న' డిమాండ్ ఈసారి కొంచం గట్టిగా వినిపించింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పీవీకి 'భారత రత్న' ప్రకటించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటు ఢిల్లీ లోనూ, ఇటు పీవీ స్వరాష్ట్రంలోనూ ఏడాది పాటు పీవీ శతజయంతి జరిపేందుకు అధికార పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఒకరోజు ఫోటోకి దండేసే కార్యక్రమం మాత్రమే అయితే కాంగ్రెస్ పెద్దగా పట్టించుకుని ఉండేది కాదేమో, కానీ ఏడాది పాటు తెలియనట్టుగా ఉండడం అంటే కష్టం కదా. 

కేంద్ర ప్రభుత్వం పీవీకి ప్రాధాన్యం ఇవ్వడం వెనుక కారణం ఊహించగలిగేదే. ఆయన నెహ్రు-గాంధీ కుటుంబేతరుడు కావడం. సోనియా-రాహుల్ పీవీ ప్రస్తావనని వీలైనంత దూరం పెట్టడమూను. శత్రువుకి శత్రువు మిత్రుడే అవుతాడు కదా. పీవీ కృషిని ప్రశంసించడాన్ని, నెహ్రు-గాంధీ వారసుల అసమర్ధతని ఎత్తిచూపడంగా భావించుకునే పరిస్థితులున్నాయిప్పుడు. ('అప్పుడు మా వంశీకులు ప్రధాని పదవిలో ఉండి ఉంటె బాబరీ మసీదు కూలేదే కాదు' అని రాహుల్ గాంధీ కొన్నేళ్ల క్రితం చేసిన ప్రకటనని ఎవరు మర్చిపోయినా బీజేపీ మర్చిపోతుందని అనుకోలేం). దేశంలోని సకల అనర్ధాలకీ నెహ్రుని, కాంగ్రెస్ ని కారణాలుగా చూపే బీజేపీ నాయకులు పీవీ శతజయంతి జరపడం అంటే ఒకరకంగా కాంగ్రెస్ ని కవ్వించడమే. కాంగ్రెస్ పార్టీకి కూడా పీవీని తల్చుకోక తప్పని పరిస్థితిని కల్పించడమే. 

(Google Image)
'పీవీ తెలంగాణ ఠీవి' అని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్త్రి కె. చంద్రశేఖర్ రావు. ఆయనకి కూడా కాంగ్రెస్ ని విమర్శించని రోజు ఉండదు. కానీ, పీవీ విషయంలో మినహాయింపు. ప్రధాన కారణం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్ని ఇరుకున పెట్టే అవకాశం దొరకడం. వాళ్ళు పీవీని ఓన్ చేసుకోలేరు, వదిలేయనూ లేరు. ఈ శతజయంతి సంవత్సరంలో చేసే కార్యక్రమాల్లో భాగంగా పీవీ కుటుంబం నుంచి ఒకరిని (కుమార్తె సురభి వాణీదేవి పేరు వినిపిస్తోంది) గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. సభలు, సమావేశాలు జరుగుతాయి. 'పీవీకి భారత రత్న' అనే ఖర్చు లేని డిమాండ్ ఉండనే ఉంది. ఈ డిమాండ్ విషయంలో ఢిల్లీ కూడా ఆసక్తి చూపిస్తోందంటూ వార్తలు రావడం కొంచం ఆలోచించాల్సిన విషయం.  

వివాదాస్పదులు, కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవారి పేర్లని 'పద్మ' పురస్కారాలకి పరిశీలించరు అన్నది అందరూ అనుకునే మాట. 'పద్మశ్రీ' మొదలు 'పద్మవిభూషణ్' వరకూ ఇప్పటికే ఆచరణలో మినహాయింపులు వచ్చేశాయి. ఇక మిగిలింది 'భారత రత్న.'  పీవీ ద్వారా మార్గం సుగమం చేసుకునే ఆలోచనగా దీనిని భావించాలా? ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత పీవీ చివరి రోజులు దుర్భరంగా గడిచాయి. కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగడం, లాయర్ల ఫీజుల కోసం సొంత ఇంటిని అమ్ముకోవడం లాంటివన్నీ జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ పీవీ ఎవరో తెలియనట్టు ప్రవర్తించింది.  తర్వాతి కాలంలో మరో అడుగు ముందుకేసి ఆర్ధిక సంస్కరణలన్నీ మన్మోహన్ సింగ్ ఖాతాలో మాత్రమే వేసే ప్రయత్నమూ చేసింది. (అయితే, మన్మోహన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు). చివరికి పీవీ మరణించినప్పుడు ఢిల్లీలో అంత్యక్రియలు జరిపేందుకే కాదు, పార్టీ కార్యాలయంలో పీవీ పార్థివ దేహాన్ని ఉంచేందుకు కూడా అధినేత్రి సోనియా అంగీకరించలేదు. 

ఇన్నేళ్ల తర్వాత అదే సోనియా అదే పీవీ శతజయంతి జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకి అనుమతి ఇచ్చారు. తన సందేశంలో పీవీని  'కాంగ్రెస్ మనిషి' గా అంగీకరించారు. దేశానికి ఆయన చేసిన సేవల్ని ప్రశంసించారు. వార్తలు చూస్తుంటే ఒక్కటే అనిపించింది. 2004 డిసెంబర్ 23న దేశంలోనూ, రాష్ట్రం లోనూ (సమైక్య ఆంధ్ర ప్రదేశ్) కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకుండా ఉండి ఉంటే, మాజీ ప్రధానులు అందరి అంత్య క్రియలూ జరిగిన దేశ రాజధానిలోనే పీవీ అంత్యక్రియలు కూడా జరిగి ఉండేవేమో కదా. క్లిష్ట సమయంలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టి, ఆర్ధికంగా దేశాన్ని ఒడ్డున పడేసి, ఆ పడేసే క్రమంలో జరిగిన చెడుకి తాను మాత్రమే జీవితాంతం బాధ్యత వహించిన పీవీకి కనీసం మరణానంతర గౌరవమైనా దక్కేదేమో. పీవీ పదవుల్లో ఉన్నప్పుడు మొదలు ఇప్పటి శతజయంతి వరకు ఆయన వల్ల చుట్టూ ఉన్నవాళ్లు మాత్రమే ఏదో ఒక రీతిలో ప్రయోజనం పొందుతూ ఉండడాన్ని విధి వైచిత్రి అనే అనాలేమో...

సోమవారం, జులై 20, 2020

వెంకట సత్య స్టాలిన్ 

పెద్ద పెద్దవాళ్ళు ఎవరు ఎక్కడినుంచి పిలిచినా, ఏ పేరుతో పిలిచినా పలుకుతాడతను. ఎక్కడున్నా రెక్కలు కట్టుకుని వాలతాడు. సలహా సంప్రదింపు కానిచ్చేసి, తాను చెప్పదల్చుకున్న నాలుగు ముక్కలూ వాళ్ళ చెవిన వేసేసి మాయమైపోతాడు. చేసిన సాయానికి ప్రతిగా కృతజ్ఞతలు చెప్పడాన్ని కూడా ఒప్పుకోని బహు మొహమాటి. బిరుదులూ, సన్మానాలకి ఆమడ దూరం. బాల నెహ్రు కోటుకి మొదటగా గులాబీని గుచ్చింది అతనే. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఇంకా 'కుంజమ్మాళ్' గా ఉండగానే సంగీతంలో సుళువులు చెప్పిందీ అతనే. అరవిందుడికి 'సావిత్రి' రాయమని సూచించిన వాడూ, చక్రవర్తుల రాజగోపాలాచారి రాసిన రామాయణ సారానికి మెరుగులు దిద్దినవాడూ ఒక్కడే. అతను తెలుగు వాడు. వెంకట సత్య స్టాలిన్ అతని పేరు. 

'నేమ్ డ్రాపింగ్' అనేది ఒక కళ. అందరికీ చేతనయ్యేది కాదు. విషయాన్ని అతికినట్టుగా చెప్పాలి. ఆ చెప్పడంతోనే అవతలి గొప్పవాళ్ళకి మనం ఎంత దగ్గరో చెప్పాలి. అలా చెబుతూనే, 'అబ్బే  మనదేం లేదు' అన్నట్టుగా ధ్వనించినా, చేరాల్సిన వాళ్ళకి చేరాల్సిన విషయం చేరిపోవాలి. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఈ బాపతు జనం పుష్కలంగా కనిపిస్తూ ఉంటారు. అది ఇది ఏమని అన్ని రంగాలనీ చక్కపెట్టేసే వాళ్ళు నిజ జీవితంలో అరుదే కానీ, సాహిత్యంలో అప్పుడప్పుడూ తారసపడుతూ ఉంటారు. వాళ్ళు మహా సీరియస్ గా చెప్పే విషయాలు మనల్ని గిలిగింతలు పెట్టేస్తాయి. కొండొకచో ఆపుకోలేని నవ్వు పుట్టిస్తాయి కూడా. కాలం నాడు గురజాడ వారి గిరీశం ఈ 'నేమ్ డ్రాపింగ్' ని ప్రశస్తంగా నిర్వహించాడు. దానిని పరాకాష్టకు తీసుకెళ్లిన వాడు మాత్రం, శ్రీరమణ సృష్టించిన ఈ వెంకట సత్య స్టాలిన్. 

బెంగాలీలు ఇతన్ని 'బెంకట్' అనీ 'స్తోలిన్' అనీ పిలిస్తే, తమిళులు ఆదరంగా 'సచ్చూ' అంటారు. కన్నడిగులు 'హోళిన్ గారో' అని మర్యాద చేస్తే, ఉత్తరాది వారు 'వెంకట్ జీ' అంటూ పాదాభివందనాలు చేస్తారు. ఇతను ఏ కాలంలోకైనా, ఏ ప్రాంతానికైనా వెళ్లగలిగిన వాడు. విక్టోరియా మహారాణి మొదలు పీవీ నరసింహా రావు వరకూ, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మొదలు ఎంటీ రామారావు వరకూ ఎవరికి ఏ సందేహం వచ్చినా చిటికలో తీర్చే వాడూ, సమయానికి తగు సలహాలు ఇచ్చేవాడూను. తన పేరు బయటికి రావడాన్ని బొత్తిగా ఇష్టపడడు. లేకపోతే, చిన్నయసూరి బాల వ్యాకరణానికి సహరచయితగా స్టాలిన్ పేరు ఉండేది. ప్రతిభని మొగ్గ దశలో గుర్తిచే శక్తి స్టాలిన్ లో అపారం. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, ద్వారం వెంకట స్వామి నాయుడు, ఈలపాట రఘురామయ్య, స్థానం నరసింహారావు.. వీళ్లంతా స్టాలిన్ డిస్కవరీలే. 


కేవలం అతడికున్న తీవ్రమైన మొహమాటం, విపరీతమైన మాడెస్టీ వల్ల స్టాలిన్ పేరు మనకి చరిత్ర పుస్తకాల్లో కనిపించదు. అసలు మొట్టమొదట ఉప్పు సత్యాగ్రహం చేసిన వాడు స్టాలినే. ఎవరెస్టుని అధిరోహించిన టెన్సింగ్ నార్కే కి పర్వతారోహణలో మెళకువలు చెప్పిన వాడూ ఇతడే. స్టాలిన్ ధైర్యం చెప్పి ఉండకపోతే యూరి గెగారిన్ అంతరిక్ష యాత్ర చేసేవాడే కాదు. గాలిబ్ రచనలన్నీ తనకి వెంటనే కావాలని పీవీ నరసింహారావు పట్టుపడితే, రెండు దస్తాల ఠావులు, పుల్లకలం, సిరాబుడ్డి సాయంతో  గాలిబ్ కవిత్వాన్నంతటినీ అక్షరం పొల్లుపోకుండా కాగితం మీదకి ఎక్కించిన జ్ఞాపకశక్తి స్టాలిన్ సొంతం. మోతీలాల్ నెహ్రు ఖరీదైన బారిస్టర్ అని అందరికీ తెలుసు కానీ, మోతీలాల్ విజయం వెనుక ఉన్నవి స్టాలిన్ సలహాలే అని ఎందరికి తెలుసు? 

అనేక స్థలకాలాదుల్లోకి బొంగరంలా తిరుగుతూ ఎన్నో పనులు చక్కబెట్టినా, స్టాలిన్ చేయలేక పోయిన పనులూ చాలానే ఉన్నాయి. 'శ్రీ సూర్య రాయాంధ్ర నిఘంటువు' నిర్మాణంలో చేయి వేయలేదని పిఠాపురం మహారాజా ఫిర్యాదు. తన దర్బారులో కనీసం ఓ వారం విడిది చేసి తన పండితులకి సాహిత్య విషయాలు బోధ పరచలేదని మైసూరు మహారాజు పెద్ద వడయారుకి ఓ వెలితి. వంగ సాహిత్యాన్ని గురించి స్టాలిన్ తో తనివితీరా చర్చించలేదన్న లోటు రవీంద్రుణ్ణి పీడిస్తూనే ఉంది. సరోజినీ దేవి, డాక్టర్ ముత్యాల గోవిందరాజులు నాయుణ్ణి ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు, పెళ్లిపెద్దగా ఉండాల్సిన వాడే, వేరే అత్యవసరమైన పని తగలడంతో ఆ వేళకి హాజరు కాలేకపోయాడు. అనేకానేకులకి అంతరంగికుడు మరి. ఒకేసారి అన్నిచోట్లా ఉండడం సాధ్యమవుతుందా? 

ముందుమాటలో 'వెంకట సత్య స్టాలిన్' ని పరిచయం చేస్తూ 'కాలం నాటి కందిగింజ' అన్నారు శ్రీరమణ. స్టాలిన్లు అన్ని కాలాల్లోనూ కనిపిస్తూనే ఉంటారు. మంచం కింద దాగిన రామప్పంతులు 'ఏవిట్రా వీడి గోతాలు?' అనుకున్నంత మాత్రాన, గిరీశం తన ధోరణి మార్చుకున్నాడా? 'వెంకట సత్య స్టాలిన్' చదువుతూ ఇదే మాటని కొన్ని వందల సార్లు అనుకోవచ్చు. మన సర్కిల్లో మనకి తెలిసిన 'స్టాలిన్' లని గుర్తు చేసుకోవచ్చు. పుస్తకం చదివేశాక, 'స్టాలిన్' లు తారసపడినప్పుడు కష్టపడి నవ్వాపుకోవడం మాత్రం తప్పక సాధన చేయాలి. స్టాలిన్ అనుభవాలు మొత్తం ఇరవై మూడింటిని అక్షరబద్ధం చేశారు శ్రీరమణ. ఇరవై ఒక్కింటిలో సాక్షాత్తూ స్టాలిన్ మాత్రమే కనిపిస్తాడు పాఠకులకి. ఎంటీఆర్, బాపూ-రమణ గురించి రాసిన వాటిలో మాత్రం స్టాలిన్ కాస్త వెనకడుగేయడం వల్ల కాబోలు, శ్రీరమణ కనిపించిపోయారు. వాళ్ళముగ్గురితో 'తన మార్కు' చనువుని ప్రదర్శించ లేక పోయాడు స్టాలిన్. ఈ బహు చక్కని వ్యంగ్య రచనని వీవీఐటీ ప్రచురించింది. పేజీలు 104, వెల రూ. 120. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు, ఆన్లైన్ లోనూ లభిస్తోంది. 

బుధవారం, జులై 08, 2020

కనిపించని సమస్య

నెమ్మదిగా నాలుగు నెలలవుతోంది, కరోనా అని మనం పిలుచుకుంటున్న కోవిడ్-19 తో సహజీవనం మొదలై. కొన్ని ప్రపంచ దేశాలు మనకన్నా (భారతదేశం) ముందే కరోనా బారిన పడితే, మరికొన్ని మన వెనుక నిలిచాయి. దేశాల పేర్లు వేరు తప్ప పరిస్థితులు దాదాపు ఒక్కటే. కరోనా క్రిమి ఎలా అయితే కంటికి కనిపించడం లేదో, జనజీవనం మీద దాని ప్రభావం కూడా అలాగే దృశ్యాదృశ్యంగా ఉంది.  పైకి కనిపించని విధంగానే జీవితాలని అల్లకల్లోలం చేసేస్తోంది. మొదట్లో ఇది కేవలం ఆరోగ్య సమస్య అనుకున్నాం కానీ, రానురానూ ఇది ఆర్ధిక వ్యవస్థల్ని మింగేసేదిగా విశ్వరూపం దాలుస్తోంది. ఫలితం, ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోయారు, మరి కొన్ని కోట్ల మంది 'ఏక్షణంలో అయినా మెడమీద కత్తి పడొచ్చు'  అనే భయంతో బతుకుతున్నారు. 

'కరోనా-ఉపాధి' అనగానే మొదట గుర్తొచ్చేవాళ్ళు వలస కూలీలు. నగరాల్లో ఉపాధి కోల్పోయి, ప్రయాణ సాధనాలేవీ అందుబాటులో లేక కాలినడకన వందల కిలోమీటర్లు నడిచి స్వస్థలాలకు చేరుకున్న వాళ్ళు. వాళ్ళ కష్టాన్ని తీసేయలేం కానీ, స్వచ్చంద సంస్థల నుంచీ, వ్యక్తుల నుంచీ, ప్రభుత్వం నుంచీ కూడా వాళ్లకి ఎంతో కొంత సహాయం అందింది. 'మేమున్నాం' అంటూ ముందుకొచ్చి తోచిన సాయం చేసినవాళ్లు లక్షల్లో కాకపోయినా, వేలల్లో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఉచిత రేషన్ లాంటి పథకాలు ప్రకటించింది. దేశంలో ఎక్కడున్నా రేషన్ పొందొచ్చన్న వెసులుబాటునీ ఇచ్చింది. దీనివల్ల వాళ్ళకి మూడుపూటలా భోజనం దొరక్క పోవచ్చు, కానీ ఒక్క పూట భోజనానికైనా భరోసా ఉంది. ఈ వలస కూలీల సమస్య అందరి దృష్టిలోనూ పడింది. మొత్తంగా కాకపోయినా, కనీసం కొంతమేరకైనా వాళ్ళకి తోడు నిలబడే వాళ్ళూ తారస పడ్డారు.

కరోనా తొలిదశలో దెబ్బతిన్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉండగా, రెండో దశలో దెబ్బ తింటున్న వాళ్ళు, తినబోతున్న వాళ్ళది మరో కథ. మనం పెద్దగా మాట్లాడుకోని కథ. మాట్లాడుకోవాల్సిన కథ కూడా. ప్రయివేటు సెక్టార్లో జీతాల కోతతో మొదలైన కరోనా ప్రభావం ఇప్పుడు ఉద్యోగాల కోత దశకి చేరుకుంది. బాధితులంతా మధ్య తరగతి వాళ్ళు. ప్రభుత్వం ముక్కు పిండి మరీ పన్ను వసూలు చేసే వర్గం ఏదైనా ఉందా అంటే అది వీళ్ళు మాత్రమే. వీళ్ళలో చాలామందికి జూలై మొదటి వారంలో వాళ్ళ వాళ్ళ ఆఫీసులనుంచి రెండు రకాల కబుర్లు వచ్చాయి. కొందరికి 'మీసేవలు చాలు' అని, మరి కొందరికి 'ఈ కష్ట కాలంలో మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మానసికంగా సిద్ధ పడండి' అనీను. ఒక్కసారిగా వీళ్లందరి కాళ్ళ కింద నేలా కదిలినా, ప్రసార సాధనలకి అది 'వార్త' కాలేదు. ప్రభుత్వానికి 'పట్టించుకోవాల్సిన విషయం' కూడా కాలేదు. 

కరోనా కారణంగా భారతదేశంలో ఎక్కువగా ప్రభావితం అయ్యిందీ, ఎటు నుంచీ సాయానికి నోచుకోనిదీ ఏదన్నా వర్గం ఉందా అంటే, అది ఈ ప్రయివేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగ వర్గమే. ఇన్నాళ్లూ పని చేసిన సంస్థలకి వీళ్లిప్పుడు ఒక్కసారిగా 'వదిలించుకోవాల్సిన బరువు' అయిపోయారు. ప్రభుత్వం దృష్టిలోనేమో సాయం పొందేంత పేదలు కాదు. సోషల్ మీడియా తో సహా ఎవరికీ మాట్లాడుకోవాల్సిన టాపిక్ కూడా కాదు. ఒకపూట భోజనంతోనో, ప్రయాణపు ఏర్పాట్ల ద్వారానో లేక ఉచిత రేషన్ వల్లనో (కనీసం కొంతైనా) పరిష్కారమయ్యే  సమస్యలు కూడా కావు వీళ్ళవి. 'అంతకు మించి' చేయాల్సిన అవసరం ఉండగా, అసలు సమస్యే లేనట్టుగా వ్యవహరిస్తూ ఉండడం జరుగుతోందిప్పుడు. 'బ్యాంక్ రుణాల చెల్లింపు వాయిదా' అనే ప్రహసనాన్ని చూస్తూనే ఉన్నాం. 

జీతాల్లో కొంత మేర కోత పడితేనే సర్దుబాట్లు చేసుకోలేక తబ్బిబ్బు పడిన వాళ్ళలో చాలామందికి 'ఇకపై జీతాలే రావు' అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలిగేదే. ఖర్చులేవీ ఆగవు. పూలమ్మిన చోట కట్టెలమ్ముదామన్నా ఈ కరోనా కాలంలో కొనేవాళ్ళు లేరు. ఇప్పట్లో ఉద్యోగాలేవీ దొరికే సూచనలూ లేవు. ఒకవేళ జాబ్ మార్కెట్ పుంజుకున్నా, మరింతగా పెరిగే పోటీలో ఉద్యోగం దొరకబుచ్చుకోడం అంత సులువేమీ కాదు. ఉద్యోగం చేసినంత కాలం ముక్కుపిండి పన్ను వసూలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు సమస్యనే గుర్తించడం లేదు. 'ఉపశమనం' స్కీముల్లో ఈ వర్గానికి ప్రాతినిధ్యమే లేదు.  వ్యక్తి స్థాయిలో ఎవరు ఎవర్ని ఆదుకోగలుగుతారు? అదైనా ఎన్నాళ్ళు? 

ఉద్యోగాలు పోయిన వాళ్ళ సమస్యలు ఒకరకమైతే, మెడమీద కత్తి వేలాడుతున్న వాళ్ళ ఇబ్బందులు మరోరకం. నూరేళ్లాయుస్సుకి హామీ లేదు కానీ, పరిస్థితి మాత్రం దినదిన గండమే. ఎప్పుడు ఏ కబురు వినాల్సి వస్తుందో తెలీని అనిశ్చితిలో రోజులు గడుపుతున్న వాళ్ళు అనేకమంది.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, బయటికి వెళ్లి ఉద్యోగం చేయడం వల్ల ప్రాణానికి ఉన్న ముప్పు ఒకటైతే, ఇప్పటికిప్పుడు ఈ ఉద్యోగం పోతే జరుగుబాటు ఎలా అన్న మిలియన్ డాలర్ ప్రశ్న మరొకటి. నిజానికి, ఈ ఉద్యోగాలు పోవడం అన్నది కరోనా బారిన పడ్డ అనేక దేశాల్లో జరుగుతున్నా, వాటిలో చాలా దేశాలు సమస్యని గుర్తించాయి. ఎంతోకొంత ఉపశమనానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ కూడా కనీసం సమస్యని గుర్తిస్తే బాగుండును.

శనివారం, మే 30, 2020

ఏడాది పాలన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో కనీసం నాలుగైదు సందర్భాల్లో జగన్ నిర్ణయాలని గురించి రాద్దామనుకునే, ఏడాది పూర్తయ్యే వరకూ ఏమీ మాట్లాడకూడదని నేను పెట్టుకున్న నియమం గుర్తొచ్చి ఆగిపోయాను. ఏడాది ఆగడం ఎందుకంటే, జగన్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కాదు. ముఖ్యమంత్రిగా కాదు కదా, మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం లేదు. ఇప్పుడు మాట్లాడడం ఎందుకంటే, ఆయన వెనుక ఏడాది కాలపు పాలనానుభవం ఉంది. మరే ఇతర నాయకుడికైనా ఐదేళ్ల కాలంలో ఎదురయ్యే అనుభవాలన్నీ జగన్ కి తొలి సంవత్సరంలోనే అనుభవానికి వచ్చేశాయి. 

శెభాష్ అనిపించే నిర్ణయాలతో పాటు, అయ్యో అనిపించే నిర్ణయాలనీ తీసుకుని అమలు పరిచారు గత  పన్నెండు నెలల్లోనూ.  అనేక ఇబ్బందులనీ ఎదుర్కొన్నారు. చెయ్యదల్చుకున్న పనులన్నీ వరుసగా చేసేయాలనే తొందర  కొన్ని వివాదాస్పద  నిర్ణయాలకి తావివ్వగా, మరికొన్ని నిర్ణయాలు కేవలం రాజకీయ కారణాల వల్లే వివాదాస్పదం అయ్యాయి.  వ్యక్తిగతంగా నన్ను కలవర పెట్టిన నిర్ణయాలు రెండు. మొదటిది పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనేది. వినడానికి ఇది చాలా బాగుంది. కానీ ఆచరణలో కష్టనష్టాలు అనేకం. చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే, వెనక్కి వచ్చేసే అందరికీ రాష్ట్రం ఉపాధి చూపించగలదా? 

రెండో నిర్ణయం, ఏదో ఒక పేరుతో చేస్తున్న ఉచిత పంపిణీలు. నిజానికి ఈ ఉచితాలు మొదలై చాలా ఏళ్ళే గడిచినా, ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక సందర్భంలో అమలు చేసిందే అయినా, ప్రస్తుత ప్రభుత్వం వీటిని పరాకాష్టకి తీసుకెళ్లినట్టు అనిపిస్తోంది. విద్య, వైద్యం ఈ రెండు సేవలనీ అర్హులకి ఉచితంగా అందించడం అవసరం. వ్యవసాయం చేసుకునే రైతులు సమయానికి రుణాలని, పంటలకు గిట్టుబాటు ధరల్నీ ఆశిస్తున్నారు తప్ప అంతకు మించి కోరుకోవడం లేదు. ప్రతివర్గానికీ ఏదో ఒక పేరిట నిరంతరంగా డబ్బు పంపిణీ అన్నది సుదీర్ఘ కాలంలో ఒక్క ఆర్ధిక వ్యవస్థకి మాత్రమే కాక అన్ని వ్యవస్థలకీ చేటు చేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇదో పులి స్వారీలా తయారయ్యే ప్రమాదం ఉంది. ఉచితాల మీద కన్నా ఉపాధికల్పన మీద దృష్టి పెట్టడం శ్రేయస్కరం. 

Google Image

వినగానే నచ్చిన నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం. ఈ నిర్ణయం వల్ల పేదల జీవితాల్లో  రాత్రికి రాత్రే వెలుగొచ్ఛేస్తుందన్న భ్రమలేవీ లేవు కానీ, దీర్ఘ కాలంలో ప్రయోజనాన్ని ఇచ్చే నిర్ణయం అవుతుంది అనిపించింది. అయితే ఈ నిర్ణయం అమలులో చాలా సాధకబాదకాలున్నాయి. తెలుగుని ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశపెట్టే మాటుంటే,  దానిని కేవలం ప్రభుత్వ విద్యాసంస్థలకి మాత్రమే పరిమితం చేయకుండా ప్రయివేటు సంస్థల్లోనూ కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. బాగా పనిచేస్తున్న మరో వ్యవస్థ గ్రామ వాలంటీర్లు. మా ఊరు, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి నాకున్న సమాచారం ప్రకారం ఈ వ్యవస్థ బాగా పనిచేస్తోంది. ముఖ్యంగా కరోనా కాలంలో వాలంటీర్లు చాలా బాధ్యతగా పనిచేశారు. నిరుద్యోగ సమస్యని కొంతవరకూ పరిష్కరించడం ఈ వ్యవస్థలో మరో పార్శ్వం. 

"మొండివాడు రాజుకన్నా బలవంతుడు అంటారు, ఇప్పుడు మొండివాడే రాజయ్యాడు," ఏడాది క్రితం ఒక మిత్రుడన్న మాట ఇది. జగన్ మొండితనాన్ని తెలియజెప్పే దృష్టాంతాలు గత కొన్నేళ్లుగా అనేకం జరిగాయి. కాంగ్రెస్ ని వ్యతిరేకించడం మొదలు, తెలుగు దేశం పార్టీని ఢీ కొనడం వరకూ అనేక సందర్భాల్లో, "మరొకరైతే ఈపని చేయలేకపోయేవారు" అనిపించింది. ఒక ఓటమితో ప్రయాణాన్ని ఆపేసిన/మార్గాన్ని మార్చుకున్న నాయకులతో పోల్చినప్పుడు జగన్ ని ముందుకు నడిపించింది ఆ మొండితనమే అని చెప్పక తప్పదు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి వారసత్వంగా జగన్ కి  అంది ఉంటే కథ  వేరేగా ఉండేది. ప్రస్తుతానుభవాలని బట్టి చూస్తే, అప్పట్లో ఆ పదవిని నిలబెట్టుకోవడం ఆయనకి బహుశా కష్టమై ఉండేది. 

ప్రజలు  అఖండమైన మెజార్టీ ఇచ్చి ఉండొచ్చు కానీ, బలమైన ప్రతిపక్షం అనేక రూపాల్లో చుట్టుముట్టి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రతి నిర్ణయాన్నీ ఆచితూచి తీసుకోవడం అవసరం. ప్రతి ప్రకటన వెనుకా ఒక సమగ్ర సమీక్ష ఉండాల్సిందే. సమస్యలు ఏయే రూపాల్లో ఉండొచ్చు అన్న విషయంలో ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఆ వైపుగానూ ఆలోచనలు సాగాలి. మూడు రాజధానులు, మండలి రద్దు వంటి నిర్ణయాల అమలులో కనిపించిన తొందరపాటు విమర్శలకి తావిచ్చింది. (వీటిలో మండలి రద్దు నాకు బాగా నచ్చిన నిర్ణయం). అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటిలోనూ అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. అలాగే, సంక్షేమం అంటే కేవలం ఉచిత పంపిణీలు మాత్రమే అనే ధోరణి నుంచి  బయటికి వచ్చి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏడాది కాలపు అనుభవాల నుంచి జగన్ ఏం నేర్చుకున్నారన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. 

మంగళవారం, మే 12, 2020

నలుపెరుపు

కథనం మీద శ్రద్ధ చూపించే రచయిత ఏ ఇతివృత్తాన్ని తీసుకుని కథ రాసినా చివరి వరకూ ఆపకుండా చదువుతారు పాఠకులు. పర్యావరణవేత్త, కవి, నవలా రచయితా కూడా అయిన కథకుడు తల్లావఝుల పతంజలి శాస్త్రికి పాఠకులని అక్షరాల వెంబడి పరిగెత్తించడం ఎలాగో బాగా తెలుసు. అలాగే, ఎక్కడ వాళ్ళని ఆపి  ఆలోచించుకోనివ్వాలో కూడా తెలుసు. ఆయన ఏం రాసినా అందులో చదివించే గుణం పుష్కలంగా ఉంటుందన్నది నిర్వివాదం. పన్నెండు కథలతో ఆయన వెలువరించిన కథా సంపుటి 'నలుపెరుపు.'  పాఠకుల వయసు, పఠనానుభవంతో సంబంధం లేకుండా వాళ్ళని వేలుపట్టి అదాటున కథలోకి తీసుకెళ్ళిపోయి, కథా స్థలంలో పాత్రల మధ్యన కూర్చోపెట్టి జరుగుతున్న కథకి వాళ్ళని సాక్షీభూతుల్ని చేయడం ఎలాగో ఆయనకి బాగా తెలుసు. 

సంకలనంలో మొదటి కథ 'జై' స్వాతంత్రోద్యమ కాలంనాటిది. సీతానగరం పక్కనున్న ఓ పల్లెటూళ్ళో మలేరియా వల్ల జనం ప్రాణాలు పోతుంటే, వాళ్ళని చూసి, పరిసరాల పరిశుభ్రత గురించి వివరించి చెప్పడానికి మహాత్మాగాంధీ ఆ ఊరిలో పర్యటించడమే కథ. ఆ ఊరి బడిలో మేష్టారు నరసింహమూర్తికి తప్ప మిగిలిన ఎవరికీ గాంధీ ఎవరో తెలీదు. ఆయన ఎందుకు గొప్పవాడో అంతకన్నా తెలీదు. "అంటే ఆయనగారికి బోయినాలూ గట్టా ... ఆరు బేమర్లా అండీ? కోణ్ణీ గట్టా కొయ్యమంటే తప్పదనుకోండి. అంటే తెలవక అడుగుతున్నానండి, ఆయ."  గాంధీజీ వస్తున్న వార్త తెలిసి చాలా హడావిడి చేసిన నరసింహ మూర్తి మేష్టారు ఊరిని ఉన్నంతలో  శుభ్రం చేయించడం మొదలు, పిల్లలకి 'గాంధీజీకి జై' నినాదాన్ని, స్త్రీలకి 'రఘుపతి రాఘవ రాజారామ్' పాటని నేర్పించడం వరకూ అనేక పనులు మీద వేసుకుని ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. గాంధీ పర్యటన ప్రహసనంగా ముగిసిన వైనాన్ని చిత్రిస్తుందీ కథ. 

తనకిష్టమైన పర్యావరణం ఇతివృత్తంగా రాసిన కథలు మూడు. వీటిలో 'కాసులోడు' ప్రత్యేక ఆర్ధిక మండళ్ల కోసం చేసే భూసేకరణ గురించి చెబితే, 'జోగిపంతులు తిరిగి రాలేదు' కథలో ఉత్పత్తి పెంచే వ్యవసాయ విధానాల పట్ల నిరసన కనిపిస్తుంది. 'కాసులోడు' సగం చదివేసారికే ముగింపు గురించి ఓ అంచనా వచ్చినా, కథని ఆ ముగింపుకి ఎలా తీసుకెళ్తారన్న కుతూహలం ఆపకుండా చదివిస్తుంది. 'జోగిపంతులు..' కథలో ఎన్ని విషయాలు చర్చించారంటే..లెక్క పెట్టే ప్రయత్నం చేసినప్పుడల్లా ఇంకో కొత్త కోణం కనిపిస్తూ ఉంటుంది. కాస్త మేజిక్ రియలిజం ఛాయలు కనిపిస్తాయి ఈ కథలో. ఇక 'ఈ చెట్టు తప్ప' కథ ఒక యాభై-అరవై ఏళ్లలో ఓ చిన్న పట్టణం పెద్ద నగరంగా మారిన క్రమాన్ని మాత్రమే కాక, అక్కడ కనుమరుగైపోయింది పచ్చదనాన్ని గురించి ఉపన్యాస ధోరణిలో కాక కథనంలో నేర్పుగా చెప్పడం వల్ల, ఆగి ఆలోచింపజేస్తుంది పాఠకుల్ని. 


సాఫ్ట్వేర్ జీవితాలు ఇతివృత్తంగా రాసిన కథలు రెండు. 'ఆర్వీ చారి కరెంటు బిల్లు,' 'అయాం సారీ మూర్తి గారూ.' ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో, చాలా పెద్ద పొజిషన్లో ఉన్న ఆర్వీ చారికి కరెంటు బిల్లు ఎంత వస్తోందో చూసుకునే తీరిక ఉండదు. గత నాలుగు నెలలుగా అతనికి ఎక్కువ బిల్లు వస్తోంది. అతను కట్టిన అదనపు బిల్లు మొత్తం అపార్ట్మెంట్ వాచ్మన్ అలీ (కౌంటర్ కి వెళ్లి ఈ బిల్లులు కట్టేది ఇతనే)  మూడు నెలల జీతానికి సమానం. అలీ చెప్పిన ఈ సంగతి సూదిలా గుచ్చుకుంటుంది చారిని. అతనేమీ పుట్టు ధనవంతుడు కాదు. తండ్రి సుబ్బాచారి పల్లెటూళ్ళో బంగారప్పని చేసేవాడు. పెరట్లో పండించిన ఆకుకూరల్తోనే పొదుపుగా వంట కానిచ్చేసేది తల్లి. ఆర్వీ చారి వైభవాన్ని వాళ్లిద్దరూ కూడా చూడకుండానే లోకం విడిచి వెళ్లిపోయారు. అలీ గుచ్చిన సూది, ఆర్వీ చారి ఆలోచనల్లో ఎలాంటి మార్పు తెచ్చిందో చెబుతుందీ కథ. 'అయామ్ సారీ... ' ఐస్క్రీం పార్లర్లో జరిగిన ఓ సాఫ్ట్వేర్ జంట పెళ్లిచూపుల కథ. 

రాజకీయాలని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథలు 'సింవ్వాసెలం గోరి గేదె' 'కపి జాతకం 1' కపి జాతకం 2.' వీటిలో 'సింవ్వాసెలం గోరి గేదె' ' కథలో సమస్య నేను దగ్గరనుంచి చూసినా కావడం వల్ల కొంచం ఎక్కువగా కనెక్ట్ అయ్యాను. ఇలాంటి 'గేదె' బాధితులు మా ఊళ్లోనూ ఉన్నారు. కానీ, ఈ కథకి రచయిత ఇచ్చిన ముగింపుని మాత్రం అస్సలు ఊహించలేం. బౌద్ధ జాతక కథలని, వర్తమాన రాజకీయాలతో ముడిపెట్టి కథలు చెప్పడం పతంజలి శాస్త్రి మొదలు పెట్టిన ప్రయోగం. బహుశా, ఈ సిరీస్లో వచ్చిన తొలి రెండు కథలూ 'కపి జాతకం' అయి ఉండొచ్చు. నిజానికి ఈ తరహా కథలు రాసి 'రాజకీయ పంచతంత్ర కథలు' తరహాలో ఓసంపుటిగా ప్రచురిస్తే బాగుండుననిపించింది చదువుతున్నంతసేపూ. పేరుకి తగ్గట్టే కోతుల బెడద, వాటికి 'రాజకీయ' పరిష్కారాలూ, ఆ క్రమంలో తెరవెనుక జరిగే రాజకీయాలూ.. వీటన్నింటినీ వ్యంగ్యంగా చెప్పారీ కథల్లో. 

వేటికవే ప్రత్యేకం అనిపించే మూడు కథలు 'నలుపెరుపు' 'నెమలికన్ను' 'గారడీ.' పుస్తకానికి మకుటంగా ఉంచిన 'నలుపెరుపు' ని ఓ పనిమనిషి-యజమానురాలి మధ్య జరిగే కథ అనడం కన్నా, పనిమనిషి సోలిలోక్వీ అనడం సబబు. ఇద్దరి జీవితాల మధ్య ఉన్న కాంట్రాస్ట్ ని చిన్న చిన్న సన్నివేశాల్లోనూ, మాటల్లోనూ చిత్రించారు రచయిత. అల్లరి అనేది బాల్యంలో ఒక భాగం కావడం ఎంత ముఖ్యమో 'నెమలికన్ను' చెబితే, జీవితంతో రాజీ పడిన ఖాదర్ సాహెబు తీసుకున్న ఓ నిర్ణయాన్ని చెప్పే కథ 'గారడీ.' ముందుగానే చెప్పినట్టు ఆపకుండా చదివించే గుణం పుష్కలంగా ఉన్న కథలివి. 'వడ్ల చిలకలు' లాంటి కథా సంపుటాలు, 'దేవర కోటేశు,' 'గేదెమీద పిట్ట' లాంటి నవలికలూ ప్రచురించిన పతంజలి శాస్త్రి మరిన్ని రచనలు చేయాల్సిన అవసరం ఉంది. ('నలుపెరుపు,' చినుకు ప్రచురణలు (అచ్చుతప్పులు అక్కడక్కడా కొంచం ఎక్కువ ఇబ్బంది పెట్టాయి), పేజీలు 104, వెల రూ. 120).