శుక్రవారం, ఏప్రిల్ 24, 2020

ఇది నా ప్రియ నర్తన వేళ ...

"ఉత్తరాన ఒక ఉరుము వురిమినా
ఉలిపి చిలిపి మెరుపొకటి మెరిసినా
ఒక కదలిక.. చిరు మెదలిక..
గిలిగింతగ జనియించగా.. "

నాట్యాన్ని తన జీవితంలో ఒక భాగంగా చేసుకున్న ఆ అమ్మాయికి, ప్రమాదంలో ఓ కాలిని కోల్పోవడం చాలా పెద్ద షాక్. అంగవికలురాలిని అయ్యానన్న బాధ కన్నా, తనకి ఇష్టమైన నాట్యాన్ని ఇక మళ్ళీ చేయలేనన్న బాధే ఆమెని ఎక్కువగా కుంగదీసింది. ఒక్కసారిగా తన శరీరంలో వచ్చిన మార్పు, ఆమెకి తన చుట్టూ ఉన్న వాళ్ళని అర్ధం చేసుకోడానికి ఉపకరించింది. సమాజం చూపించే నిరసనలు, సానుభూతి ఆమెలో పట్టుదలని పెంచాయి. కృత్రిమ కాలిని గురించి విన్నప్పుడు ఆమె మొదటి ఆలోచన, 'ఆ కాలితో తిరిగి నాట్యం చేయగలనా?' అనే. 

నిజానికి అదంత సులువైన విషయం కాదు. అసాధ్యం అన్నవాళ్లూ ఉన్నారు. కానీ, ఆమెలో పట్టుదల ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసింది. అప్పటికే ఔపోసన పట్టిన నాట్యాన్ని కృత్రిమ కాలితో మళ్ళీ నేర్చుకుంది. తన నాట్యం మీద తనకి నమ్మకం కుదిరాక, నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసింది. నవ్విన నలుగురినీ పిలిచింది. వాళ్ళ ఎదుట మరింత ఆత్మవిశ్వాసంతో ప్రదర్శన ఇచ్చింది. 

సుధాచంద్రన్ నిజజీవిత గాధకి కాస్త కల్పనని జోడించి సింగీతం శ్రీనివాసరావు రూపు దిద్దిన సినిమా 'మయూరి' (1984). తాన పాత్రని తానే పోషించింది సుధా చంద్రన్. కృత్రిమ కాలితో ఆమె చేసే నాట్యం సినిమాకి పతాక సన్నివేశం. ఆ సందర్భానికి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు వేటూరి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత సారధ్యంలో నిరుపమానంగా పాడారు ఎస్. జానకి. 


"అందెలు పిలిచిన అలికిడి లో
అణువణువున అలజడులూ
ఎద పదమొకటౌ లాహిరిలో
ఎన్నడు ఎరగని వురవడులూ.. " 

కాలి అందెలు రా రమ్మని పిలుస్తూ ఉంటే ఆ నర్తకి శరీరంలో అణువణువూ అలజడికి లోనవుతుంది. గుండె చప్పుడు, అందెల సవ్వడీ  కలిసిపోయి, ఆమెలో అంతకు మునుపెన్నడూ లేని వురవడి కలుగుతోంది. 

"ఇది నా ప్రియ నర్తన వేళ
తుది లేనిది జీవన హేల.. " 

తనకెంతో ఇష్టమైన నాట్యాన్ని (మళ్ళీ) చేస్తున్న వేళ.. జీవన్నాటకానికి ముగింపు ఎక్కడుంది??

"ఉత్తరాన ఒక ఉరుము వురిమినా
ఉలిపి చిలిపి మెరుపొకటి మెరిసినా
ఒక కదలిక.. చిరు మెదలిక..
గిలిగింతగ జనియించగా.. "

నాట్య మయూరి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టంలో పాడుకునే పాటకి వర్షాన్ని నేపధ్యంగా ఎంచుకోవడం.. ఎంత గొప్ప ఆలోచన అసలు? వర్షం వచ్చినప్పుడే కదా నెమలి మైమరిచి నాట్యం చేస్తుంది. ఉత్తరం వైపున ఆకాశం ఉరిమిందంటే కుంభవృష్టి కురవబోతోందని అర్ధం. పైగా, ఉరుముకి తోడు ఒక (ఉలిపి) చిలిపి మెరుపు కూడా మెరిసింది. ఆమెలో కదలికకి అంతకన్నా ఇంకేం కావాలి? 

"నాలుగు దిక్కుల నడుమ
పుడమి నా వేదికగా నటన మాడనా
అనంత లయతో నిరంత గతితో 
జతులు పాడనా.. ఆడనా.."

వర్షం ఉత్తరదిక్కు వైపునుంచి వస్తూ ఉండొచ్చు. కానీ ఆమె నాట్యానికి మాత్రం విశాలమైన వేదిక కావాలి. నాలుగు దిక్కులా మధ్యనా ఉన్న నేలంత విశాలమై ఉండాలి. ఎందుకంటే ఆమె లయలు అనంతం, గతులు నిరంతం.. మళ్ళీ చేయలేనేమో  అని బెంగపడ్డ నాట్యాన్ని తనివితీరా చేసి చూపుతానంటోంది ఆ కళాకారిణి. 

"మేఘ వీణ చలి చినుకు చిలికినా
మేను లోన చిరు అలలు కదిలినా
ఒక లహరిక.. మధు మదనిక.. 
వలవంతగ..  జనియించగా.. "

ఉరుము ఉరిమిన తర్వాత చినుకులు రాలడం అత్యంత సహజం. అంతే సహజంగా ఆమె శరీరం అలలుగా (లహరిక), మెరుపు తీగెలా (మదనిక) కదులుతూ, (నాట్యం మీద) వియోగం (వలవంత) కలిగిస్తోంది. 

"సుగమ నిగమ సుధ ఎడద పొంగగా
వరదలాగ ఉప్పొంగనా
వరాళి ఎదలో.. స్వరాల రొదతో 
పదము పాడనా.. ఆడనా ... "

వేదఘోషకి హృదయం పొంగుతూ ఉంటే (సామవేదం నుంచి సంగీతం పుడితే, నాలుగు వేదాల నుంచీ నాట్యం పుట్టింది) తానే వరదలా ఉప్పొంగుతాననీ, 'వరాళి' లో పాడి ఆడతాననీ (గురువు నేర్పించని రాగం 'వరాళి,' ఇది ఎవరికి వారు స్వయంగా నేర్చుకోవాల్సిందే. 'వరాళి' లో పాడడం అంటే, సంగీతాన్ని పూర్తిగా నేర్చుకోవడం) ముక్తాయించిందా నర్తకి. (రెండు చరణాలూ 'పాడనా.. ఆడనా..' తోనే ముగిశాయి). గమకాలని అలవోకగా పలికించే జానకి ప్రతి పదాన్నీ భావగర్భితంగా పలకగా, సాహిత్యంలో ప్రతి పదాన్ని అర్ధం చేసుకుని అభినయించింది సుధా చంద్రన్. 

శుక్రవారం, ఏప్రిల్ 17, 2020

నవ్విపోదురుగాక ....

తెలుగు సినిమా పరిశ్రమలో తక్కువ సినిమాలే తీసినా ఎక్కువ పేరు సంపాదించుకున్న నిర్మాతలు కొందరే. వారిలో ఒకరు  'యువచిత్ర' మురారిగా ప్రసిద్ధులైన కాట్రగడ్డ మురారి. 'సీతామాలక్ష్మి' నుంచి 'నారీ నారీ నడుమ మురారి' వరకూ తీసినవి కేవలం తొమ్మిదే సినిమాలైనా, సంగీతానికి పెద్ద పీట వేయడం, ప్రతి పాటా జనం నాలుకల మీద ఆడేలా శ్రద్ధ తీసుకోడం వల్ల ఆ సినిమాలు కమర్షియల్ హిట్స్ అవ్వడమే కాక, నిర్మాతకీ పేరు తెచ్చాయి. విజయవాడలోని మొగల్రాజపురంలో పుట్టి పెరిగిన మురారి, సినిమా నిర్మాతగా మారిన తీరుని, సినిమా నిర్మాణంలో తన అనుభవాలని అక్షరబద్ధం చేస్తూ రాసుకున్న ఆత్మకథ 'నవ్విపోదురుగాక ....'  ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ఈ పుస్తకం ఇప్పటికీ పునర్ముద్రణలు పొందుతోంది. 

ఓ సినిమా నిర్మాత ఆత్మకథ అనగానే సింహభాగం సినిమా కబుర్లే ఉంటాయనే పాఠకుల అంచనాలు తారుమారు చేస్తూ, ఉమ్మడి కుటుంబ రాజకీయాలతో తన కథని ప్రారంభించారు మురారి. "మా ఊరు మొగల్రాజపురం" అనే వాక్యం చదవగానే అప్రయత్నంగా నవ్వొస్తుంది. ఎందుకంటే, ఇప్పటి మొగల్రాజపురం విజయవాడలో ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి. కానీ, మురారి మాత్రం మొగల్రాజపురం ప్రస్తావన వచ్చినప్పుడల్లా 'ఊరు' అని రాయడం మాత్రమే కాదు, ఆ పల్లెటూరితనం తనని విడిచిపెట్టి పోలేదని నిరూపించే కబుర్లెన్నో పంచుకున్నారు. బాగా కలిగిన కుటుంబం, చదువుకున్న, సంగీత సాహిత్యాలంటే ఆసక్తి ఉన్న తండ్రి, ఎంతగానో ప్రేమించే తల్లి, బంధువులు. నిజానికి ఇలాంటి వాతావరణంలో బాల్యం స్వర్గంలా అనిపించాలి. కానీ, మురారికి మాత్రం నరకంలో ఉన్నట్టుగా గడిచింది. ఇందుకు కారణం ఉమ్మడి కుటుంబం. 

ఇంట్లో పెత్తనమంతా మురారి 'కాలభైరవుడు' అని పిలుచుకునే పెదనాన్న మధుసూదనరావుదే. ఇంట్లో పిల్లలందరూ ఏం చదవాలో, ఎక్కడ చదవాలో మొదలు, భవిష్యత్తులో ఏం చేయాలన్న విషయంలో కూడా ఆయనదే పెత్తనం. కేవలం ఈ పెత్తనం నుంచి బయట పడడం కోసమే వరంగల్ మెడికల్ కాలేజీలో డొనేషన్ కట్టి మెడిసిన్ లో చేరారు మురారి. చేతినిండా డబ్బు, 'మనవాడు' అనుకునే బంధుగణం ఉంటే చాలు, ఒక్క క్లాసుకీ వెళ్లకపోయినా, లేబొరేటరీ మొహం చూడక పోయినా మెడిసిన్ పరీక్షలు పాసవ్వొచ్చని నిరూపించారాయన. ('ఈ విషయాలు మీరు రాయకుండా ఉండాల్సింది' అని తొలిముద్రణ చదివిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఓ ఉత్తరం రాస్తే, ఆ ఉత్తరాన్ని కూడా మలిముద్రణలో పుస్తకం చివర్లో చేర్చిన నిర్మొహమాటి మురారి). ఐదొందల నలభై పేజీల పుస్తకంలో సగానికి పైగా పేజీలని ఈ గృహ రాజకీయాలే ఆక్రమించాయి. 


మెడిసిన్ అర్ధాంతరంగా ఆపేసిన మురారి దృష్టిని సినిమా రంగం ఆకర్షించడంలో విశేషం లేదు. 'నవయుగ' ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళ కుటుంబ వ్యాపారమే. అయితే, సినిమాల్లో ఇంటిపేరు వాడుకోకూడదని నిర్ణయించుకుని, సహాయ దర్శకుడు కె. మురారిగా సినిమాల్లోకి అడుగు పెట్టినా, దూరపు బంధువులు, మిత్రుల సహాయ సహకారాలు అక్కడా అక్కరకు వచ్చాయి. అప్పటికే కొందరు దర్శకుల దగ్గర పనిచేసి, చక్రపాణి చివరిరోజుల్లో ఆయన దగ్గర సహాయకుడిగా చేరిన మురారి దర్శకుడిగా కంటే, నిర్మాతగా ఉంటేనే తాను రాణిస్తాననే నిర్ణయానికి వచ్చారు. దర్శకుల మీద చక్రపాణి చేసిన అజమాయిషీని దగ్గరనుంచి చూడడం ఇందుకు బహుశా ఒక కారణం కావొచ్చు. సినిమాకి సంబంధిచిన ప్రతి నిర్ణయమూ తానే తీసుకోవాలి, దర్శకుడు కేవలం తనకి (మురారికి) నచ్చేట్టుగా సినిమా తీసిపెట్టాలి అనే నిర్ణయంతో నిర్మాతగా మారి, చిన్నచిన్న మినహాయింపులతో ఈ పద్ధతిలోనే సినిమాలు తీశానని రాసుకున్నారు. 

కులాల్ని గురించి రాయడానికి ఏమాత్రమూ మొహమాట పడలేదు మురారి. సహాయ దర్శకుడిగా పనిచేసే రోజుల్లో నటీమణి జి. వరలక్ష్మి "మీరు బ్రాహ్మలా?" అని అడిగితే "ఛీ ఛీ" అనడం మొదలు, బ్రాహ్మణాధిపత్యంలో ఉన్న సినిమా నిర్మాణ రంగం కమ్మ కులస్తుల చేతుల్లోకి రావడం కోసం జరిగిన ప్రయత్నాలు, అందుకు కృషి చేసిన వ్యక్తుల వివరాలు విశదంగానే రాశారు. తన పెంపుడు కుక్కల పేర్లు 'భానుమతి' 'రామకృష్ణ' అని ప్రస్తావించడం మొదలు, ఆత్రేయకీ, వేటూరికీ తను చేసిన అవమానాలనీ దాచలేదు. నిర్మాతగా తనకా హక్కుందని ఆయన బలమైన నమ్మకం. ('నారీ నారీ నడుమ మురారి' కోసం వేటూరి రాసిన పాటని ఎన్టీఆర్ తప్పు పట్టారని చదివినప్పుడు, మార్కెట్ నుంచి రీకాల్ చేసిన ఎమ్మెస్ రెడ్డి ఆత్మకథ 'ఇదీ నాకథ' లో పౌండ్రక వసుదేవుడి ఉదంతం గుర్తొచ్చింది, అప్రయత్నంగా).  తన సంస్థలో పని చేసిన దర్శకుల మీద ఉన్న కంప్లైంట్స్ లో  విశ్వనాధ్, జంధ్యాలల మీద ఉన్నవాటిని సవివరంగా రాశారు. 

బాల్యం నుంచీ మురారిని వెంటాడుతూ వచ్చిన 'ఉమ్మడి కుటుంబం' సినిమాల్లోకి వచ్చాక కూడా విడిచిపెట్టలేదు. సోదరులతో కలిసి సినిమా నిర్మాణం చేసినా, తన దృష్టి కథ, సంగీతం, షూటింగ్ సక్రమంగా జరిగేలా చూసుకోడంలాంటి వాటిమీదే ఉండడంతో డబ్బు విషయాలు పట్టించుకోలేదు. దీంతో, సినిమాలు విజయవంతమైనా ఎప్పుడూ డబ్బు చేతికి రాలేదు. ప్రాణ మిత్రుడు శోభన్ బాబు సలహా మేరకు, డబ్బు విషయాలు గట్టిగా మాట్లాడి తేల్చుకోడంతో పాటు, 'శ్రీనివాస కళ్యాణం' నుంచీ వచ్చిన డబ్బుని రియల్ ఎస్టేట్లో పెట్టడం వల్ల ఆర్ధికంగా నిలబడగలిగానని రాశారు. సినిమాల నిర్మాణం ఆపేసిన తర్వాత కూడా, 'తెలుగు సినిమా నిర్మాతల చరిత్ర' అనే బృహత్గ్రంధం రాయించడానికి పూనుకోవడం, ఇతరత్రా కార్యకలాపాలకీ చోటిచ్చారు ఈ ఆత్మకథలో. తన చిన్నప్పుడు ఉపవాచకంలో చదువుకున్న మల్లాది వసుంధర 'సప్తపర్ణి' ని గుర్తు చేసుకుంటూ,  "మా తర్వాతి తరం వారందరూ విద్యావంతులై మా కన్నా మరో అడుగు ముందుకు వేసి అమెరికా వంటి దేశాలకు వలసపోయారు" అన్నారోచోట.  మొత్తం మీద చూసినప్పుడు, కేవలం ఓ సినిమా నిర్మాత స్వీయ చరిత్రని కాక, జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలని, చేదు జ్ఞాపకాలనీ చూసిన వ్యక్తి ఆత్మకథ చదివేందుకు సిద్ధ పడేవాళ్ళకి నచ్చే పుస్తకం ఇది. మురారి స్వయంగా ప్రచురించి, పంపిణీ చేస్తున్న ఈ పుస్తకం వెల రూ. 500. 

బుధవారం, ఏప్రిల్ 15, 2020

మేఘసందేశం

(తొలి ప్రచురణ 'నవతరంగం వెబ్సైట్, జనవరి 30, 2009) 

అతను గోదారి ఒడ్డున ఉన్న పల్లెటూరిలో ఓ పెద్ద మనిషి. నలుగురికీ మంచీ చెడూ చెప్పే వ్యక్తి. అతని భార్య మామూలు పల్లెటూరి మహిళ. పూజలు, వ్రతాలు, కుటుంబ వ్యవహారాలు..ఇవే ఆమె ప్రపంచం. వాళ్ళిద్దరికీ ఓ కూతురు. అతనికి సంగీత సాహిత్యాల పట్ల అభినివేశం, వాటిలో ప్రవేశం ఉన్నాయి. అతని భార్యకి ఇవేమీ తెలియదు. ఇంతలో ఆ ఊరికి ఓ 'దేవదాసి' వచ్చింది. ఆమె తన ఆటపాటలతో ఆ ఊరి కుర్రాళ్ళందరినీ ఆకట్టుకోడం మొదలుపెట్టింది. ఆమెని ఊరినుంచి పంపేయమని ఊరిజనమంతా అతన్ని అభ్యర్ధించారు. తరువాత ఏం జరిగింది? జరిగిన పరిణామాలు ఆ ముగ్గురి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చాయి? ఈ ప్రశ్నలకి సమాధానమే పాతికేళ్ళ క్రితం విడుదలైన 'మేఘసందేశం.'

ఊరిపెద్ద రవీంద్ర బాబు (అక్కినేని నాగేశ్వర రావు), అతని భార్య పార్వతి (జయసుధ), దేవదాసి పద్మ (జయప్రద) ల మానసిక సంఘర్షణను చిత్రించిన ఈ కళాత్మక సినిమా నాలుగు జాతీయ అవార్డులతో కలిపి మొత్తం 27 అవార్డులను అందుకుంది. దాసరి నారాయణరావు నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించడంతో పాటు కథను, కొన్ని పాటలనూ కూడా సమకూర్చారు. గోదావరి తీర ప్రాంతాలతో పాటు హంపి అందాలనూ ఈ సినిమా లో చూడొచ్చు.

తన పిన్ని, చెల్లెలితో కలిసి గోదారిగట్టున ఓ ఇంట్లోకి దిగిన పద్మ ఆటపాటలు ఊరంతా మారుమోగుతాయి. మగవాళ్ళంతా పగలూ రాత్రీ ఆమె ఇంటి దగ్గరే కాలం గడుపుతూ ఉంటారు. ఆమెను ఊరినుంచి వెళ్ళగొట్టి, ఊరి వాళ్ల కాపురాలు బాగుచేయాలనే ఉద్దేశంతో ఆమె ఇంటికి వెళ్ళిన రవీంద్ర బాబు సంగీతం, సాహిత్యం, నాట్యాలలో ఆమెకి ఉన్న ప్రతిభ చూసి అప్రతిభుడవుతాడు. ఊహించని విధంగా వాళ్ళిద్దరి మధ్యా స్నేహం మొదలవుతుంది. ఆమె స్ఫూర్తితో అతను పద్యాలు రాయడం మొదలు పెడతాడు. అప్పటివరకూ తనలో ఉన్న అశాంతి తగ్గుతున్నట్టుగా గమనిస్తాడు. ఐతే ఊరంతా వాళ్ళిద్దరి మధ్యా ఏదో సంబంధం ఉందన్న గుసగుసలు వస్తాయి. ఇవి పార్వతి వరకూ వచ్చేసరికి ఆమె తన అన్న జగన్నాధాన్ని (జగ్గయ్య) పిలిపిస్తుంది.

బావగారిని, చెల్లెలి కాపురాన్ని బాగు చేయడం కోసం పద్మ ఇంటికి వెళ్ళిన జగన్నాధం ఆమె ప్రవర్తనను తప్పు పడతాడు. తనకు రవీంద్ర బాబుకి మధ్య ఊరంతా అనుకునే సంబధం ఏమీ లేదని పద్మ చెప్పినటికీ, "నువ్వు రవీంద్ర బాబు మంచి కోరే దానివే ఐతే ఊరు విడిచి వెళ్ళిపో" అంటాడు జగన్నాధం. రవీంద్ర బాబు బాగే తనకు కావాలన్న పద్మ ఊరు విడిచి వెళ్ళిపోతుంది. మొదట ఆగ్రహించి, తరువాత వేదన చెందిన రవీంద్ర బాబు ఓ పుస్తకం రాస్తాడు. ఆ పుస్తకం విడుదల కార్యక్రమానికి రహస్యంగా వచ్చిన పద్మ అతని కంట పడుతుంది. పార్వతి కూడా పద్మను తన ఇంటికి వచ్చి ఉండమంటుంది. "నేను వస్తే ఆయనకు మిగిలేది అవమానమే.." అని చెప్పిన పద్మ మళ్ళీ ఊరు విడిచి వెళ్ళిపోతుంది. పార్వతే పద్మను వెళ్ళగొట్టిందని అపోహ పడతాడు రవీంద్ర బాబు.


తన సాహచర్యంలో భర్త సంతోషంగా లేడని గ్రహించిన పార్వతి కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్లి పోతుంది. దేశదిమ్మరి గా మారిన రవీంద్రబాబు హంపి లో పద్మను కలుసుకుంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. చాలా ఏళ్ళ తర్వాత, కూతురి పెళ్ళికి రవీంద్రబాబు ని పిలవడం కోసం జగన్నాధం హంపి వస్తాడు. పెళ్ళికి వెళ్ళిన రవీంద్రబాబు పార్వతికి తాను చాలా అన్యాయం చేశానని గ్రహిస్తాడు. ఆ బాధతోనే అక్కడే కన్ను మూస్తాడు. ఈ వార్త పద్మకి చెప్పడం కోసం వెళ్ళిన జగన్నాధానికి అక్కడ ఇంట్లో పద్మ శవం కనిపించడంతో సినిమా ముగుస్తుంది.

బలమైన కథానాయిక పాత్రలున్న సినిమా ఇది. జయసుధ, జయప్రదలిద్దరూ పోటీపడి నటించారు. ఆత్మాభిమానం గల గృహిణి పార్వతి గా జయసుధ, 'సరస సరాగాల సారంగి' గా జయప్రద వంక పెట్టలేని నటనను ప్రదర్శించారు. ఐతే ఓల్డ్ గెటప్ నాగేశ్వర రావు, జయప్రదలకు సూట్ ఐనట్టుగా జయసుధ కి నప్పలేదు. ఆ సీన్స్ లో మేకప్ తో ఆమె ఇబ్బందిని మనం గమనించగలుగుతాం. రవీంద్రబాబు పాత్ర బెంగాలీ రచయిత శరత్ నవలల్లో నాయక పాత్రలను పోలి ఉంటుంది. ఆ పాత్ర వేషధారణ కృష్ణశాస్త్రి, ఆరుద్రలను గుర్తు చేస్తుంది. చిన్న పాత్రే అయినా జగ్గయ్య నటన గుర్తుండిపోతుంది. ముఖ్యం గా జగ్గయ్య-జయప్రద ల మధ్య వచ్చే సీన్. జయప్రద-జయసుధ ల మధ్య వచ్చే రెండు సీన్లని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ పాత్రలని ఎస్టాబ్లిష్ చేసిన తీరు ఈ రెండు సీన్లలో గమనించొచ్చు. కథ ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుంది.

రమేష్ నాయుడు సంగీతంలో అన్ని పాటలూ ఆణిముత్యాలే. సినిమాకి తగ్గ నేపధ్య సంగీతం. 'ముందు తెలిసేనా ప్రభూ..' పాట రవీంద్రనాథ్ టాగోర్ 'గీతాంజలి' ప్రేరణతో రాసినట్టు అనిపిస్తుంది. ఈ పాట సినిమా ప్రారంభం లోను, ముగింపు లోను వస్తుంది. 'రాధికా కృష్ణా..' అన్న జయదేవుడి అష్టపదిలో విరహిణి రాధ గా జయప్రద అభినయం ఆకట్టుకుంటుంది. 'ఆకాశ దేశాన' పాట జేసుదాస్ ఆల్ టైం హిట్స్ లో ఒకటి. అలాగే 'ఆకులో ఆకునై' పాట సుశీలకి చాల మంచి పేరు తెచ్చింది. 'నిన్నటిదాకా శిలనైనా..' ఆడియోలో మాత్రమే ఉండే 'శీతవేళ రానీయకు..' ఇలా ప్రతి పాటా ప్రత్యేకమే. 'పాడనా వాణి కళ్యాణిగా' పాటను మంగళంపల్లి బాలమురళి కృష్ణ పాడడమే కాకుండా గాయకుడి పాత్రలో కనిపిస్తారు కూడా.

రవీంద్రబాబు-పద్మల intellectual companionship ని ఎస్టాబ్లిష్ చేసే సీన్లలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. ఎన్నో కమర్షియల్ సినిమాలు తీసిన దాసరి ఈ సినిమాకి దర్శకత్వం చేశారంటే నమ్మడం కొంచం కష్టమే.. ఎంతో అభిరుచితో నిర్మించిన సినిమా ఇది. మూడు ప్రధాన పాత్రల్లో ఏ పాత్ర వైపునుంచి చూస్తే ఆ పాత్ర చేసింది కరక్ట్ అనిపిస్తుంది. ఐతే, రవీంద్రబాబు-పద్మ ల అనుబంధాన్ని అంగీకరించాలా? తాను చేయని తప్పుకి పార్వతి శిక్ష అనుభవించింది కదా? అన్న ప్రశ్నలకు సమాధానం ఎవరికి వాళ్లు వెతుక్కోవాల్సిందే.  ఈ సినిమాని మొదటి సారి చూసేవాళ్ళు మొదటి ఇరవై నిమిషాలు కొంచం ఓపికగా చూడాలి. చాలా స్లో నేరేషన్. ఒక్కసారి కథలో పడ్డాక ఇక సినిమాలో లీనమైపోతాం. కళాత్మక చిత్రాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళంతా ఈపాటికి ఈ సినిమాని చాలాసార్లు చూసి ఉంటారు. మంచి సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా చూసే ప్రయత్నం చేయొచ్చు.

సోమవారం, ఏప్రిల్ 13, 2020

ఏప్రిల్ 1 విడుదల

(తొలి ప్రచురణ: 'నవతరంగం' వెబ్సైట్, డిసెంబర్ 23, 2008)

ఆరేళ్ల క్రితం ఓ ఆంగ్ల పత్రిక వంశీని ఇంటర్వ్యూ చేస్తూ 'మీరు తీసిన సినిమాల్లో మీకిష్టమైన సినిమా?' అని అడిగితే, దానికి వంశీ సమాధానం: "సితార లో కొంత భాగం, ఏప్రిల్ 1 విడుదల లో కొంత భాగం" అని. మనం 'సితార' గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇప్పుడిక 'ఏప్రిల్ 1 విడుదల' గురించి. తెలుగు సినిమాల గురించి ఏమాత్రం ఆసక్తి ఉన్నవాళ్ల దగ్గరైనా ఈ సినిమా పేరు చెప్పి చూడండి. అప్రయత్నం గానే వాళ్ల ముఖంలో చిరునవ్వు మెరవడాన్ని గమనించొచ్చు. ఈ ఒక్కటీ చాలు, ఈ సినిమా ఎంత ప్రత్యేకమైనదో చెప్పడానికి.

'ఇంట్లో ఇద్దరు భార్యలు ఉన్నా, పక్కింటి భాగ్యం కోసం అష్టకష్టాలు పడే పేనుకొరుకుడు చిన్నారావు..' ఈ సినిమా పేరు చెప్పగానే నాకు గుర్తొచ్చే మొదటి పాత్ర ఇదే. నిజానికి దివాకరం (రాజేంద్రప్రసాద్), భువనేశ్వరి (శోభన) లాంటి బలమైన పాత్రలున్న ఈ సినిమాలో వాళ్ళందరితోనూ పోటీ పడి 'చిన్నారావు' గా మెప్పించారు మల్లికార్జునరావు.   కోలపల్లి ఈశ్వర్, ఎం.ఐ. కిషన్ రాసిన 'హరిశ్చంద్రుడు అబద్దమాడితే..' నవలకు వంశీ తన నవల 'గోకులంలో రాధ' లో కాలనీ నేపధ్యాన్ని జోడించి, మరికొన్ని మార్పులుచేర్పులతో రూపుదిద్ది 'ఏప్రిల్ 1 విడుదల' గా మలచారు. ఇప్పటి ప్రముఖ హాస్య నటుల్లో ఒకరైన ఎల్.బి. శ్రీరామ్ అత్యంత సహజమైన సంభాషణలు అందించారు. ఇప్పటి మరో ప్రముఖ హాస్య నటుడు కృష్ణ భగవాన్ తొలిసారిగా ఈ సినిమాలో ప్రాముఖ్యం ఉన్న పాత్రను  (గోపీచంద్) పోషించారు. వంశీ-ఇళయరాజాల కాంబినేషన్ వెండితెరపై మరోసారి మేజిక్ ని సృష్టించింది.

కథానాయకుడు దివాకరానికి అబద్దాలడడం, మోసాలు చేయడం మంచినీళ్ళు తాగినంత సులభమైన పనులు.  తను అనుకున్నదానిని ఎలా అయినా సాధించే రకం. అనుకోకుండా విజయనగరంలో తను వీడియో తీయడానికి వెళ్ళిన ఓ పెళ్ళిలో భువనేశ్వరిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. రైల్వేలో బుకింగ్ క్లర్క్ గా పనిచేసే భువనేశ్వరి ప్రిన్సిపుల్స్ ఉన్న మనిషి. అబద్ధాన్ని, మోసాన్ని సహించలేదు. భువనేశ్వరి మేనమామ (ప్రదీప్ శక్తి) ని పరిచయం చేసుకుని తను ఉంటున్న రాజమండ్రి నుంచి విజయనగరానికి ఉత్తరాలు రాస్తూ, ఫోన్లు చేస్తూ ఉంటాడు దివాకరం. భువనేశ్వరికి ఈ విషయం చెప్పకుండా ఆమె పేరుతో తనే ఉత్తరాలకి జవాబులు ఇస్తూ ఉంటాడు ఆమె మేనమామ.

భువనేశ్వరి తన కాళ్ళ మీద నిలబడే వాడినే భర్తగా అంగీకరిస్తుందని తెలుసుకుని, తను ఉండే కాలనీ వాళ్ళందరినీ మోసం చేసి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించి ఓ వీడియో షాప్ ప్రారంభిస్తాడు దివాకరం. ఇంతలొ రాజమండ్రి కి బదిలీ అయి వచ్చిన భువనేశ్వరి దివాకరం ఎవరో తనకి తెలీదంటుంది.  ఆ తర్వాత కాలనీ వాళ్ల ద్వారా అతని కథ విని అతన్ని అసహ్యించుకుంటుంది. అయినా పట్టు విడవని దివాకరం ఆమె వెంట పడుతుంటే, కేవలం అతన్ని వదుల్చుకోవడం కోసం అతనితో ఓ అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం నెల్లాళ్ళ పాటు దివాకరం నిజమే మాట్లాడాలి. పొరపాటున కూడా అబద్ధం చెప్పకూడదు. ఏ ఒక్క అబద్ధం చెప్పినా అగ్రిమెంట్ కాన్సిల్ అవుతుంది.


ఈ పరీక్షలో దివాకరం నెగ్గితే భువనేశ్వరి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. పట్టుపడితే వదలని దివాకరం షరతులన్నీ ఒప్పుకుని అగ్రిమెంట్ పై సంతకం పెడతాడు. ఆ తర్వాత దివాకరం ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అబద్ధలమీదే బతికే అతను కేవలం నిజాలే మాట్లాడాడా?  భువనేశ్వరిని పెళ్లి చేసుకోగలిగాడా? వీటన్నంటికీ  సమాధానమే సినిమా రెండో సగం. సినిమా మొదటి సగంలో దివాకరం చెప్పే అబద్ధాలు, మోసాలు ప్రేక్షకులని నవ్విస్తే, రెండో సగంలో అతను చెప్పే నిజాలు, వాటి తాలూకు పరిణామాలు రెట్టింపు హాస్యాన్ని అందిస్తాయి. రైల్వే కాలనీ లో మధ్యతరగతి మనుషుల మధ్య అత్యంత సహజంగా కథ నడుస్తుంది.

ఇద్దరు భార్యలున్న చిన్నారావు, ఇద్దరు భర్తలతో 'గుట్టుగా' కాపురం చేసుకుంటున్న భాగ్యం కోసం ప్రయత్నాలు చేస్తూ, ఎదురు దెబ్బలు తింటూ ఉంటాడు. వై. విజయ, ఆమె భర్త సాక్షి రంగారావు చిట్టీల వ్యాపారం చేస్తూ ఉంటారు.  వీడియో షాప్ కోసం వీళ్ళందరి దగ్గర దివాకరం డబ్బు వసూలు చేసే సన్నివేశాలు, బాకీ ఎగ్గొట్టడం కోసం చెప్పే అబద్ధాలు కథను నడిపిస్తూ ఉండగా, అగ్రిమెంట్ పుణ్యమా అని అతను నిజాలే మాట్లాడాల్సి వస్తుంది. చాల సిన్సియర్ గా అతను చెప్పే నిజాలవల్ల కాలని వాళ్ల మధ్య వచ్చే కలహాలు సైతం అత్యంత సహజంగా ఉంటాయి. వీడియో షాప్ ఓపెనింగ్ సీన్, డొక్కు టీవీని జపాన్ టీవీ అని చెప్పి సాక్షి రంగారావు కి అంటగట్టే సన్నివేశం, 'భక్త ప్రహ్లాద' ఎపిసోడ్ బాగా నవ్విస్తాయి. 'పాము' ఎపిసోడ్ చివర్లో "నా పేరు నాగరాజు కాదు నూకరాజు" అంటూ పాములతని ఎంట్రీ సీన్ లో ఆర్టిస్ట్ ల టైమింగ్ పర్ఫెక్ట్. 

ఇక, దివాకరం నిజాలు చెప్పడం మొదలెట్టాక భాగ్యం కొడుకు ఎవరి పోలికో చెప్పే సీన్ terrific.  అలాగే, చిన్నారావు భాగ్యాన్ని పెళ్లి చేసుకున్నా ఏమేమి చేయాలని ప్లాన్ చేసుకున్నాడో అతని ఇద్దరు భార్యలకూ దివాకరం చెప్పే సీన్ కూడా. దివాకరం, భువనేశ్వరిలుగా రాజేంద్రప్రసాద్, శోభనల నటనకి వంక పెట్టలేము.  కృష్ణభగవాన్ ది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. శోభన తల్లిగా జయవిజయ, మేనమామగా ప్రదీప్ శక్తి చక్కటి హాస్యాన్ని అందించారు. అందరికీ 'ఆశీస్సులు' చెప్పి వాళ్ల చేత నమస్కారాలు పెట్టించుకునే ముదురు బ్రహ్మచారి పాత్ర అతనిది. నిజానికి ఈ పాత్రలన్నీ మన చుట్టూ ఉన్నాయనిపిస్తాయి, సినిమా అయిపోయాక కూడా.

ఇళయరాజా సంగీతంలో 'చుక్కలు తెమ్మన్నా..' పాట ఓ అద్భుతం. ఆ పాటకి ముందు వచ్చే మ్యూజిక్ బిట్ కోసం ఆ పాట వింటాను నేను. అలాగే 'మాటంటే మాటేనంటా..' పాట కూడా. 'ఒక్కటే మాట,,' పాట చిత్రీకరణ అంతా వంశీ మార్కు లో ఉంటుంది.  ఇంత చక్కని సినిమాకి క్లైమాక్స్ కూడా 'వంశీ మార్కు' లోనే ఉంటుంది, అదొక్కటే లోపం. ముగింపులో అనవసరపు మెలోడ్రామాని తగ్గించి ఉంటే మరింత బాగుండేది.  ఎం.వి. రఘు ఫోటోగ్రఫీ ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా డివిడి ని మీ లైబ్రరీ లో ఉంచుకోండి. ఎప్పుడైనా మూడ్ బాగోనప్పుడు పూర్తిగా కాకపోయినా కొన్ని సీన్స్ అయినా చూడండి. తప్పకుండా రిఫ్రెష్ అవుతారు.

గురువారం, ఏప్రిల్ 09, 2020

ఒకరికి ఒకరు

(తొలి ప్రచురణ: 'నవతరంగం' వెబ్సైట్, డిసెంబర్ 9, 2008)

అనగనగా ఓ కామేశ్వరరావు.. రైల్లో కాశీ వెళ్తూ దారిలో ఓ చోట సుబ్బలక్ష్మిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అనుకోకుండా ఓ రెండు రోజులు వాళ్ళిద్దరూ కలిసి ఓ అడవిలో గడపాల్సి వస్తుంది.. అంతే అనుకోకుండా విడిపోవాల్సి వస్తుంది. సుబ్బలక్ష్మి అమెరికాలో ఉంటుందన్న విషయం తప్ప ఆమె గురించి మరే వివరాలూ తెలియవు కామేశ్వర రావుకి. చివరికి వాళ్ళిద్దరూ కలుసుకున్నారా, లేదా? అన్నదే 'ఒకరికి ఒకరు' సినిమా. నాయికా నాయకుల పేర్లు, కాశీ  ప్రయాణం చూసి 'ఇదేదో అరవయ్యో పడిలో ఉన్నవాళ్ళ కథ' అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే, సదరు కామేశ్వర రావు, సుబ్బలక్ష్మి ఇరవైలలో ఉన్నవాళ్ళే. అసలు కథ అంతా వాళ్ల పేర్లవెనుకే ఉంది.

కెమెరామన్ రసూల్ ఎల్లోర్ ను దర్శకుడి గా పరిచయం చేస్తూ ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై 'జెమిని' కిరణ్ నిర్మించిన 'ఒకరికి ఒకరు' 2003 లో విడుదలైంది. కామేశ్వరరావు గా తెలుగు, తమిళ నటుడు శ్రీరామ్ (తెలుగు వాడే, తమిళంలో 'శ్రీకాంత్' పేరుతో నటిస్తున్నాడు) సుబ్బలక్ష్మి గా ఉత్తరాది నటి ఆర్తి చాబ్రియా నటించారు. రసూల్ దర్శకత్వం తో పాటు, కీరవాణి సంగీతం, కోన వెంకట్ మాటలు, సునీల్, రాజాల ఫోటోగ్రఫీ ఈ సినిమా ను 'చూడదగ్గ సినిమా' చేశాయి. కామేశ్వరరావు బాలసారె తో (బారసాల అని వాడుక) కథ ప్రారంభం అవుతుంది. నాయకుడే తన కథను చెబుతూ ఉంటాడు. 

చచ్చి స్వర్గాన ఉన్నతన భర్త పేరునే మనవడికి పెట్టాలని పట్టుబట్టిన బామ్మ మల్లీశ్వరి (రాధాకుమారి) తన కొడుకు, కోడలిచేత (తనికెళ్ళ భరణి, హేమ) చంటి కుర్రాడికి 'కామేశ్వర రావు' అని పేరుపెట్టించడం సినిమా ఓపెనింగ్ సీన్. తరువాతి సీన్లలో కామేశ్వర రావు కుటుంబం, అతని స్నేహితుల పరిచయం ఉంటుంది. మనవాడు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడం తో అసలు కథ మొదలవుతుంది.  మనవడు ఇంజనీరింగ్ పాస్ ఐతే కాశీ తీసుకెళ్తానని బామ్మ మొక్కుకుంటుంది, తులసి చెట్టు దగ్గర నిరాహార దీక్ష చేసి మరీ తన పట్టు సాధించుకుంటుంది. కామేశం స్నేహితుడు పుచ్చు(విజయ్) కూడా వీళ్ళతో చేరతాడు. 

ఈ మనవళ్ళనిద్దరిని గదమాయిస్తూ, రైల్లో అందరిని పలకరిస్తూ బామ్మగారు చేసే హడావిడి తో కథ నడుస్తూ ఉండగా, ఓ స్టేషన్ లో రైలు ఆగడం, అక్కడ ఓ అమ్మాయిని చూసి - మమూలుగా అమ్మాయిలకి ఆమడ దూరంలో ఉండే - కామేశ్వర రావు తొలిచూపులోనే మనసు పారేసుకోడం జరుగుతాయి. కట్ చేస్తే, తుఫాన్.. ఓ అడవిలో రైలు ఆగిపోతుంది. స్టేషన్ లో అమ్మాయి అక్కడ కనిపించడంతో ఎగిరి గంతేసిన కామేశం, తన పేరు ఆ అమ్మాయికి నచ్చదేమో అనే భయంతో తనని 'రాహుల్' అని పరిచయం చేసుకుంటాడు. ఇతను వెంటబడడం నచ్చని ఆ అమ్మాయి తన అసలు పేరు 'స్వప్న రావు' అని చెప్పకుండా తన నాయనమ్మ పేరైన సుబ్బలక్ష్మే తనపేరని చెబుతుంది. 


రైల్వే ట్రాక్ పాడవ్వడంతో వీళ్ళిద్దరూ, బామ్మ, పుచ్చు, స్వప్న తాతయ్య (బాలయ్య) కలిసి అడవిలో ఉండే ఓ రిటైర్డ్ ఆంగ్లో ఇండియన్ ఆఫీసర్ ఇంట్లో నాలుగైదు రోజులు ఉండాల్సి వస్తుంది. ఓ రాత్రి అడవిలో తప్పిపోయి ఒంటరిగా గడుపుతారు కూడా. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నా, దానిని వ్యక్తం చేసుకునే లోగానే విడిపోవాల్సి వస్తుంది. ఇది సినిమా మొదటి సగం. తన ఇంజనీరింగ్ డిగ్రీ సాయంతో అమెరికాలో ఉద్యోగం సంపాదించుకున్న కామేశ్వర రావు, అక్కడ సుబ్బలక్ష్మిని వెతికే ప్రయత్నాలు, మరోపక్క అమెరికాలో స్వప్న రాహుల్ ని వెతకడం కోసం ఇండియా వచ్చి వెళ్ళడం, పెద్ద వాళ్లు చేస్తున్న తన పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేయడం వంటి సీన్లతో రెండో సగం నడుస్తుంది. నాటకీయ పరిణామాల మధ్య వాళ్ళిద్దరూ కలుసుకోవడమే సినిమా ముగింపు.

ఈ సినిమా లో మొదట చెప్పుకోవాల్సింది ఫోటోగ్రఫీ. దర్శకుడు స్వతహాగా కెమెరామాన్ కావడం తో సినిమా ని దృశ్య కావ్యం గా తీర్చిదిద్దాడు. 'వెళ్ళిపోతే ఎలా..' పాట చిత్రీకరణ ఒక్కటి చాలు, దర్శకుడి అభిరుచి తెలుసుకోడానికి. అలాగే 'నాదిర్ దిన..' పాట చిత్రీకరణ కుడా. అడవి సన్నివేశాల చిత్రీకరణ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక సంగీతం.. కీరవాణి 'అద్భుతమైన' సంగీతం అందించిన సినిమాలలో ఇది ఒకటి. పాటలతో పాటు, నేపధ్య సంగీతమూ అందంగా కుదిరింది. సీతారామశాస్త్రి, చంద్రబోస్ లు పాటలకి  'తెలుగు' సాహిత్యం అందించారు. ఒక్క 'ఎక్కడున్నావమ్మా..' పాటలో మాత్రం అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు వినిపిస్తాయి. చంద్రబోస్ 33 ఇంటిపేర్లతో రాసిన ఈ పాట ఓ ప్రయోగం.

'నువ్వే నా శ్వాస..' 'ఘాటు ఘాటు ప్రేమ..' 'అల్లో నేరెల్లో..' పాటలు కూడా వేటికవే ప్రత్యేకం. 'అల్లో నేరేల్లో..' పాటలో హీరో మాసిన గడ్డం కంటిన్యుటి దెబ్బ తినడం ఎడిటింగ్ శాఖలో జరిగిన పొరబాటు. బస్ లో ప్రయాణిస్తున్న హీరో గడ్డం కాసేపు మాసి, కాసేపు క్లీన్ షేవ్, మళ్ళి మాసి కనిపిస్తుంది. సినిమా రెండో సగంలో బిగి సడలినట్టు అనిపిస్తుంది. కొంతవరకు ఎడిటింగ్ లోపమే. క్లీన్ కామెడీ ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్లలో ఒకటి. ఎక్కడ అశ్లీలం, అసభ్యత కనిపించవు, వినిపించవు. 'మరచెంబు' సీన్ లో 'శంకరాభరణం,' అడవి సీన్ లలో మరో రెండు మూడు సినిమాలు గుర్తొచ్చినా అవేవీ ఈ సినిమాని ఎంజాయ్ చేయడానికి అడ్డంకి కాదు.

బామ్మ గా సీనియర్ నటి రాధాకుమారి, హీరో తండ్రి గా తనికెళ్ళ మంచి నటనని ప్రదర్శించారు. కొడుక్కి తన ప్రేమకథ చెప్పే సీన్ లో భరణి నటన గుర్తుండిపోతుంది. అలాగే, అమెరికా నుంచి కామేశ్వరరావు ఫోన్ చేసే సన్నివేశం కూడా. అమ్మాయిలకి సైట్ కొట్టి ఎదురుదెబ్బలు తినే 'పుచ్చు' పాత్రలో విజయ్ నటననీ మర్చిపోలేము. అమెరికా లో కామేశ్వర రావు ఫ్రెండ్స్ గా చేసిన కుర్రాళ్ళు సినిమా రెండో సగంలో హాస్యాన్ని అందించారు. ఇక శ్రీరామ్ అమాయకమైన కామేశ్వర రావు పాత్రలో ఒదిగిపోయాడు. ఇతనికి సంగీత దర్శకుడు శ్రీ చెప్పిన డబ్బింగ్ బాగా కుదిరింది. హీరోయిన్ పాత్రకి గాయని సునీత గాత్రం అందించింది. చలాకీ అమ్మాయి గా, సిన్సియర్ ప్రేమికురాలిగా ఆర్తి నటన బాగుంది, తెలుగు అమ్మాయి ఐతే ఇంకా బాగుండేది కదా అనిపించినప్పటికీ. 

హీరో, హీరోయిన్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ సృష్టించిన విధానమే కథలో పెద్ద మైనస్. సుబ్బలక్ష్మి అడవిలో తప్పిపోయిన రాత్రి తన ఫోటో వెనుక తన అసలు పేరు, అడ్రస్ రాసి కామేశ్వర రావు చూడకుండా అతని పర్స్ లో పెడుతుంది. అదే పర్స్ వాడుతున్నప్పటికీ రెండేళ్ళ తర్వాత కూడా కామేశ్వర రావు ఆ ఫోటో చూడడు. కథకి కీలకమైన ఈ పాయింట్ చాలా అసహజంగా అనిపించింది. ఈ పాయింట్ విషయంలో మరికొంచెం శ్రద్ధ వహించి  ఉంటే మరింత బాగుండేది. చివరిగా ఒక్క విషయం. ఈ సినిమా చూసి, తెలుగు తెరకి ఓ మంచి దర్శకుడు దొరికాడని చాలా సంతోష పడ్డా. ఐతే రసూల్ ఆ తర్వాత తీసిన 'భగీరధ' 'సంగమం' సినిమాలు నిరాశ పరిచాయి.  'ఒకిరికి ఒకరు' స్థాయి లో అతని నుంచి మరో సినిమా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నా.

మంగళవారం, ఏప్రిల్ 07, 2020

శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్

(తొలిప్రచురణ 'నవతరంగం' వెబ్సైట్, నవంబర్ 18, 2008)

సినిమా కథలకోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదని, చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తే ఎన్నో కథలు దొరుకుతాయని నిరూపించిన కొద్ది సినిమాలలో 'శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్' ఒకటి.  ఎనభయ్యో దశకంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, ముఖ్యంగా కోస్తా జిల్లాలని, ఊపేసిన రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సంస్కృతి ని నేపధ్యంగా తీసుకుని వంశీ తీసిన ఈ సినిమా హాస్య చిత్రాలని ఇష్టపడేవారికి ఓ విందు భోజనం. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈ కథకి నేపధ్యమైన రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ల గురించి కొంత చెప్పాలి. వీధి నాటకాలకి ఆదరణ తగ్గి, పల్లెల్లో ఉత్సవాలకి 16mm తెరపై సినిమాలు ప్రదర్శించే పధ్ధతి ప్రారంభం కాడానికి ముందు, అంటే డెబ్బై, ఎనభై దశకాలలో ఈ ట్రూప్ లు పల్లె ప్రజలకు వినోదాన్ని అందించాయి. 

ప్రారంభంలో వీరి నృత్యాలు అశ్లీలానికి దూరంగా ఉన్నా, ట్రూప్ ల మధ్య పెరిగిన పోటీ కారణంగా తరువాతి కాలంలో అసభ్య ప్రదర్శనలు మొదలయ్యాయి. వంశీ 'మా పసలపూడి కథలు' లో 'పాముల నాగేశ్వర రావు' 'కుమారి మా ఊరొచ్చింది' కథల్లో ఈ ట్రూప్ ల ఒకనాటి వైభవాన్ని తెలుసుకోవచ్చు. (అంబాసిడర్ కార్లలో వచ్చే ట్రూప్ సభ్యులకు సినీ తారలకు ఉన్నంత ఆదరణా ఉండేది.)  ఈ ట్రూప్ లు ఉచ్ఛదశలో ఉన్నకాలంనాటి కథ ఇది. తనికెళ్ళ భరణి,  వేమూరి సత్యనారాయణ లతో కలిసి వంశీ తయారుచేసిన ఈ కథ రికార్డింగ్ డాన్సర్ల తెర వెనుక జీవితాన్ని చూపిస్తుంది. తెర వెనుక వాళ్ళూ మామూలు మనుషులే అని చెబుతుంది. 

మేనల్లుడి ఆస్తిని అనుభవించే ట్రూప్ యజమాని యాళ్ళ పాపారావు (కోట శ్రీనివాస రావు), భర్త వదిలేస్తే పిల్లల్ని పెంచడం కోసం డాన్సులు చేయడం మొదలుపెట్టిన ఆకుల అనంతలక్ష్మి(వై. విజయ), మామ చాటు మేనల్లుడు దొరబాబు (భరణి), తన బావ సిలోన్ సుబ్బారావు(రాళ్ళపల్లి) కోసం కలలు కంటూ కొత్త కొత్త డాన్సులు చేసే పట్టు పద్మిని(సంధ్య),  తల్లి, తండ్రి చిన్నప్పుడే చనిపోతే తన మేనమామ (భీమరాజు) దగ్గరే ఉంటూ అతనంటే భయపడుతూ ఉండే గోపాలం(నరేష్),  ట్రూప్ వ్యాన్ నడిపే డ్రైవర్ మస్తాన్, పెళ్ళయిన బ్రహ్మచారి వ్యాన్ క్లీనర్ పెనుగొండ అబ్బులు (మల్లికార్జున రావు),  వీళ్ళతో పాటు జూనియర్ ఎన్టిఆర్, జూనియర్ ఏయన్నార్, జూనియర్ చిరంజీవి ఈ ట్రూప్ సభ్యులు. 

గోపాలం హీరో కృష్ణ డాన్సులు చేస్తూ ఉంటాడు ట్రూప్ ప్రోగ్రామ్స్ లో. రాజమండ్రి దేవి చౌక్ కి చెందిన ఈ ట్రూప్ ఊళ్ళు తిరిగి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటుంది. గోపాలం హోటల్ కి పాలు సప్లయ్ చేసే పాడి సుందరమ్మ (నిర్మలమ్మ) మనవరాలు సీత (హిరోయిన్ మాధురి) పిరికి వాడైన గోపాలాన్ని ప్రేమించి, అతని కోసం ట్రూప్ లో చేరి అతన్ని పెళ్లి చేసుకోడమే ఈ సినిమా కథ. దొరబాబు సీతని ప్రేమించడం, తన స్వార్ధం కోసం పాపారావు కూడా వాళ్ల పెళ్ళికి అంగీకరించడం కథలో మలుపులు. నిజానికి ఇలాంటి కథతో సినిమా తీయడం సాహసం. ఐతే 'లేడీస్ టైలర్' తో కామెడి బాట పట్టిన వంశీ ఈ సినిమా ను హాస్యరస భరితంగా తెరకెక్కించాడు. చివరి ఇరవై నిమిషాలు మినహాయిస్తే, నవ్వకుండా ఈ సినిమా చూడడం అసాధ్యం. పూర్తిగా డైలాగ్ కామెడీ. ప్రతి మాటా తూటాలా పేలుతుంది. పాపారావు పాత్ర లో కోట శ్రీనివాస రావు జీవించాడు. మిగిలిన వాళ్ళూ అతనితో పోటీ పడ్డారు. 


ముఖ్యంగా సీత కాలికి గాయం అయినపుడు పరామర్శించడానికి తన ట్రూప్ అంతటినీ పాపారావు సుందరమ్మ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని కూచిపూడి భాగవతార్ లు గా పరిచయం చేయడం, సుందరమ్మ కోరికపై 'రామాయణం' ప్రదర్శించే సీన్ సినిమా మొత్తానికే హైలైట్. అలాగే దొరబాబు కోడితో సీతకి లవ్ లెటర్ పంపే సీన్, రాంబాబు కి పోటీగా జూనియర్ ఎన్టిఆర్ ని ప్రోత్సహించే సీన్స్ గుర్తుండిపోతాయి. సినిమా హీరోల మధ్య ఉండే జెలసీలను సింబాలిక్ గా చుపించారనిపిస్తుంది. ఎక్కడా నటులు కనిపించరు..ఆయా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి.

ఈ సినిమా లో ఊతపదాలకీ కొదవ లేదు. 'ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ చెబుతున్నాను' అంటూ పెనుగొండ అబ్బులు, 'అదంతా వీజీ కాదు' అంటూ దొరబాబు,  'దొరబాబూ ఉక్కెట్టవా' అంటూ పట్టు పద్మిని..ఈ డైలాగులు ఇప్పటికి మనకి ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. ఇక సిలోన్ సుబ్బారావు సినిమా మొదటి సగం లో తెరపై కనిపించకుండానూ, రెండో సగం లో తెరపై కనిపించీ ప్రేక్షకులకు వినోదం పంచుతాడు. పట్టు పద్మినిని సిలోన్ సుబ్బారావు సినిమా హీరోయిన్ లా ట్రీట్ చేయడం, అది చూసి పాపారావు కడుపు మండడం, దొరబాబు కి పెనుగొండ అబ్బులు 'ఫ్రెండ్షిప్ కొద్దీ' ఇచ్చే సలహాలూ, పట్టు పద్మిని 'భరతపూడి' ప్రదర్శన,  పాపారావు కి సుందరమ్మ చేసే అవమానాలూ ప్రేక్షకులకి కావల్సినంత వినోదాన్ని పంచుతాయి. 

ఇళయరాజా సంగీతం లో పాత పాటల రీమిక్స్ లను వినొచ్చు.  రెండు స్ట్రెయిట్ పాటలు 'వెన్నెలై పాడనా' 'ఏనాడు విడిపోని' ఆకట్టుకుంటాయి. 'వెన్నెలై' పాటలో వంశీ మార్కు చిత్రీకరణ కనిపిస్తుంది. నైట్ అఫెక్ట్ లో రికార్డింగ్ డాన్స్ లను చాలా సహజంగా చిత్రీకరించారు. రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో మిగిలిన నటులంతా చాలా సహజంగా చేసినా, జూనియర్ కృష్ణ గా నరేష్ సూట్ కాలేదని నాకు అనిపిస్తుంది. కృష్ణ అభిమానులు అతనికి కరెన్సీ నోట్ల తో దండ వేసి దానిని ఊరు దాటేవరకూ తీయొద్దనడం ఓ ప్రహసనం. ప్రతి విషయంలోనూ  ఆచితూచి వ్యవహరించే సుందరమ్మ తన మనవరాలి పెళ్లి విషయంలో ఎందుకు తొందర పడుతుంతో, తను ఏమాత్రం నమ్మని పాపారావుని గుడ్డిగా నమ్ముతుందో అర్ధంకాదు. ఇక క్లైమాక్స్ ఐతే 'ఏదో సినిమాని ముగించాలి కాబట్టి' అన్నట్టుగా ఉంటుందే తప్ప కన్విన్సింగ్ గా ఉండదు.  

సినిమా ప్రారంభంలో వచ్చే కాఫీ హోటల్ సీన్లో టిఫిన్ తిని బిల్ ఎగ్గొట్టి పప్పురుబ్బే దొంగ సన్యాసి పాత్రలో వంశీ కనిపిస్తాడు. వంశీ నటించిన ఒకే ఒక సినిమా ఇది. ఈ సినిమా కి మొదట అనుకున్న టైటిల్ 'శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ రాజమండ్రి.' పేరు బాగా పెద్దదైందని 'రాజమండ్రి' తీసేసారు. ఐతే సినిమా షూటింగ్ మొత్తం రాజమండ్రి లోను, కోనసీమ గ్రామాల్లోనూ చేసారు. (ఈ మధ్యనే 'కొత్త బంగారు లోకం' చూసాక, మళ్ళీ ఈ సినిమా చుస్తే గడిచిన రెండు దశాబ్దాల కాలంలో రాజమండ్రి ఎంతగా మారిపోయిందో అర్ధమైంది.)  వంశీ మార్కు గోదావరిని చాలా షాట్స్ లో చూడొచ్చు. ఇరవై ఏళ్ళ క్రితం విడుదలైన ఈ లో-బడ్జెట్ సినిమా అంతగా విజయవంతం కాలేదు. రికార్డింగ్ డాన్స్ కాన్సెప్ట్ గురించి ఎక్కువ మందికి తెలియకపోవడం కూడా ఒక కారణమని చెబుతారు. కామెడీలని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా విసుగు కలగదు.

గురువారం, ఏప్రిల్ 02, 2020

సీతారామయ్యగారి మనవరాలు

(తొలి ప్రచురణ: నవతరంగం వెబ్సైట్, నవంబర్ 6, 2008) 

సాంకేతిక పరిజ్ఞానం అంతగా పెరగక పోవడం కూడా అప్పుడప్పుడు మంచి సినిమాలు రావడానికి కారణం అవుతుందేమో. ఇప్పుడు ఉన్నట్టుగా పల్లెటూళ్ళలో కూడా టెలిఫోన్ లు, ప్రతి మూడో మనిషి దగ్గర మొబైల్ ఫోన్లు పదిహేడేళ్ళ క్రితం ఉండి ఉంటే మనమంతా 'సీతారామయ్యగారి మనవరాలు' అనే 'తెలుగు' సినిమాను మిస్ అయ్యేవాళ్ళం కదా! ఆర్ద్రత నిండిన కథ, కథనం, పాత్రోచిత నటన, కథనానికి ప్రాణం పోసే సంగీతం ఈ సినిమా ని క్లాసిక్ గా మార్చాయి. నా స్నేహితుల్లో కొందరు దీనిని 'చివరి తెలుగు సినిమా' అని అంటుంటారు. కథగా చెప్పాలంటే ఇది మూడులైన్ల కథ. ఇచ్చిన మాటకి ప్రాణంఇచ్చే తండ్రికి, ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేయలేని కొడుక్కి మధ్య ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్. ఫలితంగా ఆ కొడుకు కుటుంబానికి దూరం అవడం, తిరిగి తన కూతురి ద్వారా కుటుంబాన్ని కలుసుకోవాలను కోవడం. క్రాంతి కుమార్ దర్శకత్వం, కీరవాణి సంగీతం, నాగేశ్వర రావు, రోహిణి హట్టంగడి, మీనాల నటన ఈ సాధారణ కథ ఓ అసాధారణ సినిమా గా రూపు దిద్దుకోడానికి తోడ్పడ్డాయి.

'మానస' రాసిన 'నవ్వినా కన్నీళ్ళే' నవల ఆధారంగా (ఈ నవల ఎక్కడ దొరుకుతుందో ఎవరికైనా తెలిస్తే తెలియజేయగలరు)  ఈ సినిమా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను అందుకుంది. అంతకు మించి, ప్రేక్షకుల నుంచి లభించిన  ఆదరణ 'మంచి సినిమా' భవిష్యత్తు పట్ల ఆశలు రేకెత్తించింది. కథాస్థలం గోదావరి తీరంలోని 'సీతారాంపురం' అనే గ్రామం. ఆ ఊరిపెద్ద సీతారామయ్య (అక్కినేని), ఆయన భార్య జానకమ్మ (రోహిణి హట్టంగడి) కొడుకు శ్రీనివాస మూర్తి (రాజా). "మా సీతారాంపురం గ్రామానికి విచ్చేసిన మీకందరికీ స్వాగతం" అనే బాలు వ్యాఖ్యానంతో సినిమా ప్రారంభమవుతుంది. ముందే చెప్పినట్టు, పెళ్లి విషయంలో తండ్రి, కొడుకుల మధ్య వచ్చిన అభిప్రాయ భేదం కారణంగా కొడుకు తను ప్రేమించిన సుమతిని పెళ్లి చేసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. 

ఇరవై ఏళ్ళ తరువాత అతని కూతురు సీత (మీనా) తన మేనత్త కూతురి పెళ్లికి సీతారాంపురం రావడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. మనవరాలి పట్ల మనసులో ఎంతో ప్రేమ ఉన్నా దానిని వ్యక్తం చేయని తాతగారు, మనవరాలిలో తన కొడుకుని చూసుకుని మురిసిపోయే బామ్మ, సీత రాకతో ఆస్తిలో తనకి వాటా రాదేమోనని బెంగ పడే ఇంటి అల్లుడు (తనికెళ్ళ భరణి) ఆమెకి తన కొడుకునిచ్చి పెళ్లి చేయడం ద్వారా సీతారామయ్య ఆస్తిని సొంతం చేసుకోవాలనుకునే అతని వియ్యంకుడు వీరభద్రయ్య (కోట)ల ప్రయత్నాలతో కథ సాగుతూ ఉంటుంది.

అమెరికా నుంచి శ్రీనివాస మూర్తి ఫ్రెండ్ (మురళీ మోహన్) రావడంతో సీత తల్లితండ్రులు ఓ ప్రమాదంలో చనిపోయారనే విషయం ప్రేక్షకులకు తెలుస్తుంది. ఆ నిజాన్ని సీత తన తాతయ్యకి ఎలా చెప్పిందన్నది చిత్రం ముగింపు. ఇది తెలుగుదనం ఉన్నకథ. నేపధ్యం గోదావరి ప్రాంతం కావడంతో అక్కడి భాష, సంస్కృతులను సినిమాలో ఉపయోగించారు. బరువైన పాత్రల్లో నటించడం అక్కినేని కి కొత్త కాదు. ఈ సినిమాలో ఆయన తొలిసారి విగ్ లేకుండా నటించారు. బాలనటిగా సినిమాల్లోకి వచ్చిన మీనాకి నాయికగా ఇది తొలి సినిమా. సీనియర్లతో సమానంగా నటించి ప్రసంశలు అందుకుంది.

నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన పాత్ర జానకమ్మ. భర్త, కొడుకు మధ్య నలిగిపోయే ఇల్లాలిగా రోహిణి హట్టంగడి నటన అసామాన్యం. ఆమె మాతృభాష తెలుగు కాకపోయినా, భాషను, పాత్రను బాగా అర్ధం చేసుకుని నటించారు.  అమాయకత్వం, ఆపేక్ష కలబోసిన పాత్ర. ముఖ్యంగా 'మౌన వ్రతం' సీన్లో ఆవిడ నటన చూసి తీరాలి. 'షష్టిపూర్తి' సీన్లో నిండుముత్తైదువగా చాలా  సహజంగా కనిపిస్తారు. ఐతే ఆ పాత్రను అర్ధాంతరంగా ముగించారనిపిస్తుంది.  'సుబ్బరాజు' అనే ఓ చిన్న పాత్రలో దాసరి కనిపిస్తారు. ఈ పాత్ర పట్ల ఆయన ఇష్టం, తర్వాతి కాలంలో ఆయనచేత 'సుబ్బరాజు గారి కుటుంబం' అనే సినిమా తీయించింది. భరణిది కామెడీ విలనీ కాగా సుధాకర్ ది కమెడియన్ పాత్ర. 'మాయబజార్' లో పాట పేరడీ కూడా ఉంది అతనిపై.


గణేష్ పాత్రో ఈ సినిమాకి తేలిక గా ఉండే పదాలతో బరువైన సంభాషణలు రాసారు. "నాన్న మన దగ్గరికి రారు తాతయ్యా, మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి" లాంటి సంభాషణలు కదిలిస్తాయి. క్రాంతికుమార్లో ఉన్న మంచి దర్శకుడిని తెలుగు సినిమాపరిశ్రమ సరిగా ఉపయోగించుకో లేదేమో అనిపిస్తుంది ఈ సినిమా చూశాక.  మనవరాలిపట్ల పైకి కఠినంగా ఉంటూనే, సీతారామయ్య తన ప్రేమని రహస్యంగా ప్రదర్శించే సన్నివేశాలు, మనవరాలు తెచ్చిన వీడియోలో కొడుకుని ఆత్రంగా చూసుకోవడం, జానకమ్మ చనిపోయిన తర్వాత "మీనాన్న వెంటనే రావాలమ్మా సీతా" అని చెప్పే సన్నివేశం, ఏంచేయాలో తెలియక గోదారి ఒడ్డున సీత పిచ్చిగా పరిగెత్తే సన్నివేశం...ఇలా చాలా సన్నివేశాలను ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసేవిధంగా చిత్రీకరించారు. అలాగే చాలా బరువుగా ఉండే క్లైమాక్స్ సన్నివేశం కూడా.

ఈ సినిమాలో సీత డైరీని సీతారామయ్య చదివి నిజం తెలుసుకోవడం అనే సీన్ ని ఆ తరువాత చాలా సినిమాల్లో కాపి చేసారు. (ఇంక్లూడింగ్ 'గోదావరి'). స్ట్రయిట్ నేరేషన్లో సాగే ఈ సినిమా (మధ్యలో ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్)  బాలు వ్యాఖ్యానం తోనే  ముగుస్తుంది. ఈ సినిమాను 'ఉధార్ కి జిందగి' పేరుతో హిందీలో తీసారు. తాతయ్య పాత్రను జితేంద్ర, మనవరాలిగా కాజోల్ నటించారు. ఆ తరువాతి కాలంలో అగ్ర నాయికగా ఎదిగిన కాజోల్ కి ఇది తొలి చిత్రం. అక్కడ ఈ సినిమా విజయం సాధించలేదు.  తల్లిని, తండ్రిని కోల్పోయిన ఓ టీనేజ్ అమ్మాయి ఆ రహస్యాన్ని తన తాతయ్య దగ్గర ఎలా దాచగలిగిందన్నది అర్ధంకాదు. శ్రీనివాసమూర్తి చనిపోతూ, "ఈ వార్త తాతయ్యని బాగా ప్రిపేర్ చేసి చెప్పమ్మా" అని సీత నుంచి మాట తీసుకుంటాడు. కానీ, సీత అలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. 

కథ, కథనాలపట్ల చూపిన శ్రద్ధ, హాస్యంపై చూపలేదని అనిపిస్తుంది. హాస్యం కొన్నిచోట్ల ముతకగా మరికొన్ని చోట్ల పేలవంగా ఉంటుంది. 'నువ్వు-నేను' సినిమాతో 'తెలంగాణా' శకుంతలగా అందరికి తెలిసిన నటి, ఈ సినిమాలో కోటకి సుబ్మిసివ్ భార్యగా హాస్యపాత్ర పోషించింది. సంగీతాన్ని గురించి చెప్పకుండా ఈ సినిమా గురించి చెప్పడం పూర్తికాదు. క్రాంతికుమార్ చేసిన బొమ్మకి కీరవాణి తన సంగీతంతో ప్రాణం పోశారు. మొత్తం పాటల్లో 'పూసింది పూసింది పున్నాగ' పాట అంటే కీరవాణికి ప్రత్యేకమైన ఇష్టం అనుకుంటా. అదే ట్యూన్ ని కొంచం మార్చి 'అన్నమయ్య' లో 'ఏలే ఏలే మరదలా' పాట చేశారు. 'కలికి చిలకల కొలికి' పాటలో మేనత్త- కోడలి మధ్య అనురాగాన్ని చిత్రించిన తీరు గుర్తుండి పోతుంది. ఇక నా ఛాయస్ 'బద్దరగిరి రామయ్య...' విషాద గంభీరంగా సాగుతుందీ పాట/కీర్తన. 'షష్టిపూర్తి' పాటలో జిక్కి గొంతు వినిపిస్తుంది 'ఆ పైన ఏముంది..' అంటూ.

సినిమా తాలూకు మూడ్ ని క్రియేట్ చేయడంలో నేపధ్య సంగీతానిది కీలక పాత్ర. ఒక్కసారి ఈ సినిమాని మ్యూట్ లో చుడండి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాధాన్యత ఏమిటో అర్ధం అవుతుంది. ఈ సినిమా సాధించిన విజయం పుణ్యమా అని ఇలాంటి కథ, కథనాలతో ఓ అరడజను సినిమాలు వచ్చాయి అప్పట్లో. కానీ అవేవీ పెద్దగా విజయం సాధించలేదు. ఈ సినిమా ప్రభావం గురించి ఒక మాట చెప్పాలి. అంతవరకు ఎవరైనా అమ్మాయి లంగావోణీలో కనిపిస్తే 'బాపు బొమ్మలా ఉంది' ఆనేవారు. ఈ సినిమా విడుదలయ్యాక 'సీతారామయ్యగారి మనవరాలిలా ఉంది' అనడం మొదలు పెట్టారు. ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది మిగిలిపోయింది అనిపించడం కూడా ఈ సినిమా ప్రత్యేకత అనుకుంటా!

బుధవారం, ఏప్రిల్ 01, 2020

సితార

(ఇది నా మొదటి ఆన్లైన్ రచన. 'నవతరంగం' అనే వెబ్సైట్ లో అక్టోబర్ 30, 2008 న ప్రచురితం అయింది. ఇప్పుడా  వెబ్సైట్ పనిచేయడం లేదు. తవ్వకాల్లో దొరికిన ఈ పోస్టులో కేవలం అచ్చుతప్పుల్ని మాత్రం సవరించి ప్రచురిస్తున్నాను. పుష్కర కాలంలో నా రాతల్లో ఏమన్నా మార్పు వచ్చిందా అన్నది మీరే చెప్పాలి) 

అందరికి నమస్కారం. నవతరంగం చదవడం ఈ మధ్యనే మొదలు పెట్టాను. పాత సంచికలతో సహా చదువుతున్నాను. ఎనభయ్యో దశకంలో విడుదలై ఎన్నో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు గెలుచుకున్న 'సితార' సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఈ ప్రయత్నం. 'మంచు పల్లకీ' సినిమా ద్వారా తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమైన వంశీ రెండో సినిమా ఇది. భానుప్రియ ఈ సినిమా ద్వారానే నాయికగా పరిచయమైంది. వంశీ తానే రాసుకున్న 'మహల్ లో కోకిల' అనే నవలను కొద్దిపాటి మార్పులతో రూపొందించిన 'సితార' సినిమా  1984 లో విడుదలై ప్రాంతీయ ఉత్తమ చిత్రం గా కేంద్ర ప్రభుత్వ అవార్డు ను అందుకుంది. 'వెన్నెల్లో గోదారి అందం' పాటకు గాను గాయని ఎస్ జానకి కి జాతీయ అవార్డు లభించింది. 

కథ విషయానికి వస్తే, ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ దేవదాసు (శుభలేఖ సుధాకర్) రైలులో ప్రయాణం చేస్తూ, టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నఓ అమ్మాయి (భానుప్రియ) కి సహాయం చేయడం కోసం టికెట్ కలెక్టర్ కి ఆమెని తన భార్య సితార గా పరిచయం చేస్తాడు. ఆమెకి ఎవరూ లేరని తెలుసుకుని తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడంతో పాటు మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తాడు. తన గతాన్ని గురించి అడగకూడదనే కండిషన్ పై అతనితో కలిసి పని చేస్తుంటుంది సితార. ఆమెకు సినిమా అవకాశాలు రావడంతో తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారుతుంది. డబ్బు, కీర్తి ప్రతిష్టలు సంపాదించినా, తన గతాన్ని తల్చుకుని బాధపడే సితార కి ఆ బాధని తనతో పంచుకోమని సలహా ఇస్తాడు  దేవదాసు. 

గోదావరి తీరంలోని ఓ పల్లెటూళ్ళో 'రాజుగారు' గా పిలవబడే చందర్ (శరత్ బాబు) చెల్లెలు కోకిల. పాడుబడ్డ భవంతిలో ఆ అన్నాచెల్లెళ్లు మాత్రమే ఉంటూ ఉంటారు. ఆస్తులు పోయినా,  పరువు కి ప్రాణం ఇచ్చే చందర్, ఓ కోర్ట్ కేసును  గెలవడం ద్వారా పోయిన ఆస్తులు తిరిగి సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. రాణివాసం లో ఉండే కోకిలకి బయటి ప్రపంచం తెలీదు. చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతం, నాట్యాలతో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. కోర్ట్ కేసు నిమిత్తం చందర్ ఓ పది రోజులు కోట విడిచి వెళ్తాడు. అదే సమయంలో ఊళ్లోకి వచ్చిన పగటి వేషగాళ్ళ నృత్యాలను కోటలోంచి  రహస్యంగా చూస్తూ ఉంటుంది కోకిల. ఆ బృందం లో రాజు (సుమన్) ని ఇష్టపడుతుంది. రాజుతో ఆమె పరిచయం, ఊరి జాతరకి రహస్యంగా అతనితో కలిసి వెళ్ళడం వరకూ వస్తుంది. 

కోర్ట్ కేసు ఓడిపోవడంతో కోటకి తిరిగి వచ్చిన చందర్ కి కోకిల ప్రేమ కథ తెలియడంతో, రాజుని చంపించి, తను ఆత్మహత్య చేసుకుంటాడు.  తన పుట్టు పూర్వోత్తరాలు రహస్యంగా ఉంచమని కోకిలనుంచి మాట తీసుకుంటాడు చందర్. దేవదాసుకి సితార తన గతాన్ని చెప్పడం విన్న దేవదాసు స్నేహితుడైన ఓ జర్నలిస్టు (ఏడిద శ్రీరామ్) ఆమె కథని ఓ పుస్తకంగా ప్రచురిస్తాడు. తన గతం అందరికీ తెలియడానికి  దేవదాసే కారణమని నమ్మిన సితార అతన్ని ద్వేషిస్తుంది. ఐతే ఆ పుస్తకం కారణంగానే రాజు బ్రతికే  ఉన్నాడన్న నిజం దేవదాసుకి తెలుస్తుంది. జర్నలిస్టు సహాయంతో అతను రాజుని వెతికి, ఆత్మహత్య చేసుకోబోతున్న సితారతో కలిపి, ఆమెని రక్షించడం తో సినిమా ముగుస్తుంది. 


వంశీ దర్శకత్వ ప్రతిభతో పాటు, ఇళయరాజా సంగీతం, భానుప్రియ నటన ఈ సినిమాని ఓ మాస్టర్ పీస్ గా మలిచాయి. సితార/కోకిల గా భానుప్రియ అసమాన నటనని ప్రదర్శించింది. పాడుబడిన కోటలో ఒంటరితనంతో బాధపడే కోకిలగా, తన గతం అందరికి తెలిసిన తర్వాతి సన్నివేశాలలోనూ ఆమె ప్రదర్శించే నటన ఎన్న దగినది. ఇళయరాజా సంగీతంలో పాటలన్నీ ఈనాటికీ వినబడుతూనే ఉంటాయి.  'కిన్నెరసాని  వచ్చిందమ్మా వెన్నెల పైటేసి' పాటను మొదట 'సాగర సంగమం' సినిమా కోసం రికార్డు చేసారు. ఆ సినిమా లో ఉపయోగించలేక పోవడంతో అదే సంస్థ నిర్మించిన 'సితార' లో ఆ పాటను ఉపయోగించారు. 

ఈ సినిమా లో నాకు ఇష్టమైన పాట 'కు కు కు.' ఈ పాట చిత్రీకరణ లో చివరి నిమిషంలో మార్పులు చేశారట వంశీ. ఇందుకు కారణం పాటలో నర్తించే జూనియర్ ఆర్టిస్ట్ లు కొంచం వయసు మళ్ళిన వాళ్ళు కావడమే. షూటింగ్ ఆపటం ఇష్టం లేక, వారి ముఖాలు చూపకుండా కేవలం చేతులు మాత్రం చూపుతూ పాటని చిత్రీకరించారు. ఈ పాటలో వచ్చే 'నువ్వేలే రాజ్యం ఉంది ఈ నాలుగు దిక్కులలో' అనే బిట్ నాకు చాలా నచ్చుతుంది. ఇక 'వెన్నెల్లో గోదారి అందం' పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతవరకు సాఫీ గా సాగిన కథ, క్లైమాక్స్ కి వచ్చేసరికి బాగా వేగం అందుకుంటుంది. క్లైమాక్స్ కొంచం సాగదీసినట్టు ఉంటుంది. ఐతే, వంశీ ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమా abrupt ending అనిపించదు. 

నవలలను సినిమాలుగా తీసినప్పుడు, ఎన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పటికీ నవల చదివిన పాఠకులకి సినిమా పట్ల అసంతృప్తి కలగడం సహజం. 'సితార' ను ఇందుకు మినహాయింపుగా చెప్పొచ్చు. నవల  రాసిన రచయితే సినిమా దర్శకుడు కావడం ఇక్కడి సౌలభ్యం. 'మహల్ లో కోకిల' (ఇటీవలే  పునర్ముద్రణ పొందింది) ని 'సితార' గా మార్చడం లో వంశీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కొన్ని పాత్రలను తగ్గించడంతో మెలోడ్రామా ను కూడా కొంతవరకూ తగ్గించాడు. కథనం, ముగింపులో ఉన్న వ్యత్యాసాల కారణంగా నవల, సినిమా వేటికవే భిన్నంగా కనబడతాయి. ఈ సినిమా తీసేనాటికి దర్శకుడి వయసు పాతికేళ్ళ లోపే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. 

గోదావరి పట్ల వంశీ కి ఉన్నమక్కువ టైటిల్స్ నుంచి చాలాచోట్ల కనిపిస్తుంది. అలాగే పాటల చిత్రీకరణ లో వంశీ మార్కును చూడవచ్చు.  'కోకిల' ని పంజరంలో చిలుకలా చూపే symbolic షాట్స్, చందర్ అసహాయతను చూపే సన్నివేశాలు, సినీతార గతం పట్ల జనానికి ఉండే ఆసక్తిని చూపించే షాట్స్.. ఇలా ఎన్నో. గడిచిన పాతికేళ్ళలో కేవలం 22 సినిమాలు (కొన్ని మంచివి, మరి కొన్ని చెత్తవి) మాత్రమే తీసిన వంశీకి, తనకంటూ చాలమంది అభిమానులు ఉన్నారు.