గురువారం, డిసెంబర్ 31, 2009

వీడ్కోలు-స్వాగతం

నిన్నకాక మొన్ననే గోడలకి కేలండర్లు తగిలించినట్టు, అందుకున్న డైరీలు ఒక చోట సర్దినట్టూ ఉంది.. అప్పుడే వాటిని మార్చేసే రోజు వచ్చేసింది. గోడ మీదికి చేరేందుకు కొత్త కేలండర్ తహతహలాడుతోంది.. డైరీలు రావడం మొదలయ్యింది. చూస్తుండగానే ఒక సంవత్సరం పూర్తయిపోయి, కొత్త సంవత్సరం వచ్చేస్తోంది.

న్యూ ఇయర్ రిజల్యూషన్స్ చేసుకోవడం, నెలన్నా గడవక ముందే వాటిని మర్చిపోవడం చాలా సార్లు జరిగాక, చాలా ఏళ్ళ క్రితమే ఇంక రిజల్యూషన్స్ చేసుకోకూడదనే రిజల్యూషన్ చేసుకుని దానిని మాత్రం విజయవంతంగా అమలు చేస్తున్నాను. అనుకున్న పనిని పెండింగ్ పెట్టకుండా వీలైనంత వెంటనే చేసేసే అలవాటు వల్ల రిజల్యూషన్స్ లేమి నన్ను పెద్దగా బాధ పెట్టడం లేదు.

ఎటూ రిజల్యూషన్స్ ప్రసక్తి వచ్చింది కాబట్టి, నేను చాలా సార్లు జనవరి ఒకటి రోజున అనుకుని కొన్నాళ్ళు అమలు చేసి ఆ తర్వాత వదిలేసినా పని డైరీ రాయడం. చిన్నప్పుడేమో పెద్దవాళ్ళ కంట పడుతుందేమో అనే భయం చేత, కొంచం పెద్దయ్యాక ఉన్నది ఉన్నట్టు రాసుకోలేనేమో అనే సందేహం చేత (మరీ డైరీలో కూడా ఆత్మవంచన చేసుకోలేము కదా) డైరీ రాయడం కొనసాగించలేదు.

కొన్నాళ్ళు రాసి చించేసిన డైరీలో కొన్ని విషయాలు అప్పుడప్పుడూ గుర్తొచ్చి నవ్వు తెప్పిస్తూ ఉంటాయి.. వాటిలో కొన్ని బ్లాగ్మిత్రులతో పంచుకున్నాను 'జ్ఞాపకాలు' గా.. వెళ్ళిపోతున్న సంవత్సరం ప్రారంభంలో నేను యాదృచ్చికంగా చేసిన పని బ్లాగు ప్రారంభించడం. డైరీ రాయలేదన్న కొరత చాలా వరకూ తీరింది, ఈ బ్లాగు పుణ్యమా అని.

వ్యక్తి గత జీవితం ఎప్పటిలాగే సాగింది.. కొన్ని విజయాలు, మరి కొన్ని ఓటములు.. ఒత్తిళ్ళు, చికాకులు, మధ్య మధ్యలో మెరిసి మాయమయ్యే చిన్న చిన్న సంతోషాలు.. ఎప్పుడూ సంతోషాన్నే కోరుకోడం మన స్వార్ధం.. తను ఇవ్వదల్చుకున్న వాటిని మాత్రమే ఇవ్వడం కాలం చేసే మాయాజాలం. అన్నీ మనం అనుకున్నట్టే జరిగిపోతే ప్రపంచం తలకిందులైపోదూ??

'తలచుకుంటే కానిదేముంది?' 'ఏదీ మన చేతుల్లో లేదు..' అనే ద్వంద్వ భావాల మధ్య కాలం కరిగిపోయింది.. బహుశా జీవితపు నడక ఇలాగే ఉంటుందేమో.. వెళ్ళిపోతున్న సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, కొత్తగా వస్తున్న సంవత్సరానికి స్వాగతం చెప్పాలి. మనం చెప్పక పోయినంతమాత్రాన కొత్త సంవత్సరం రాక మానదు. కానీ వస్తున్న అతిధిని ఆహ్వానించాలి.

జరగాల్సింది జగరక మానదన్న వేదాంతాన్ని కాసేపు పక్కన పెట్టి కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని కోరుకుందాం. ఇంటా, బయటా ఉన్న సమస్యలు ఒక్కొక్కటీ పరిష్కారమైపోతాయని ఆశిద్దాం.. నూతన సంవత్సరాన్ని మనస్పూర్తిగా ఆహ్వానిద్దాం.. బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

'పుస్తకం' లో రాసినవి..

'పుస్తకం' లో రాసిన వ్యాసాలు వరుసగా..
రేగడివిత్తులు
అంటరాని వసంతంఅనంతంమంచుపూలవాన
వార్తల వెనుక కథ

'నవతరంగం' లో రాసినవి..

'నవతరంగం' లో ప్రచురితమైన నా వ్యాసాలు వరుసగా..
సితార
సీతారామయ్యగారి మనవరాలు

శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
ఒకరికి ఒకరు

ఏప్రిల్ 1 విడుదల
కృష్ణవంశీ మార్కు (శశిరేఖా) పరిణయం
మేఘసందేశం
ఆనంద తాండవం
విజేత

ఆదివారం, డిసెంబర్ 27, 2009

ఓ వైవిధ్య భరితమైన కథ

"నేను ఎప్పటికైనా చూడగలనా..." అని నిరాశ పడిపోతున్న తరుణంలో చూశాను.. ఆపై చదివాను.. ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ. ఒకప్పుడు మంచి కథలు ప్రచురించిన 'ఈనాడు ఆదివారం' లో 'బాగుంది' అనిపించిన కథ చదివి చాలా వారాలయ్యింది. కథల పోటీ ప్రకటించినప్పుడు "ఈ రకంగా అయినా మంచి కథలు చదవొచ్చు" అనుకున్నా. ప్రధమ బహుమతికి అర్హమైన కథ ఏదీ లేదని, ద్వితీయ, తృతీయ మరియు కన్సొలేషన్ బహుమతులు ప్రకటించినప్పుడు "అవి ఎలా ఉంటాయో" అన్న కుతూహలం కలిగింది.

అయితే ఆ కుతూహలాన్ని రెండు, మూడు బహుమతులు గెలుచుకున్న కథలు ఇట్టే మింగేశాయి. "అనవసరంగా ఆశలు పెంచుకున్నా.." అని నన్ను నేను తిట్టుకుంటున్న సమయంలో వచ్చిన రెండు కథలు - రెండూ కన్సొలేషన్ బహుమతికి ఎంపికయినవే - చదివినప్పుడు మళ్ళీ ఆశ్చర్యం కలిగింది. ఆ వెంటనే జడ్జిమెంటు గురించి కూసింత సందేహమూ మొదలయ్యింది. అంతలోనే "వాళ్ళ పోటీ..వాళ్ళిష్టం" అనిపించింది.

ముఖ్యంగా ఇవాల్టి సంచికలో వచ్చిన 'ఎత్తరుగుల అమెరికా వీధి ' కథ.. బహుమతి కథల్లో ఇప్పటివరకూ ప్రచురించిన వాటిలో నాకు బాగా నచ్చిన కథ. 'ఈనాడు ఆదివారం' మార్కు "పిల్లలు అమెరికా వెళ్ళిపోతే వృద్ధులైన తల్లిదండ్రులు ఒంటరిగా పడే వేదన" కథా వస్తువుని కూసింత మార్చి, ముళ్ళపూడినీ, వంశీనీ, మధ్యే మధ్యే శ్రీరమణనీ గుర్తు చేస్తూ సాగిన కథనం ఆసాంతమూ చదివించింది. పడుచు జంట చిలిపి తగువుల ద్వారా కథ చెప్పించడం ద్వారా మొనాటనీ ని బ్రేక్ చేసేందుకు ప్రయత్నించిన రచయితని మనసులోనే అభినందించేశాను. ఈ కథని ఇక్కడ చదవొచ్చు.

గతవారం వచ్చిన 'అడుగుల చప్పుడు' కథ కూడా మరీ 'కన్సొలేషన్ బహుమతి' తో సరిపెట్టాలసింది కాదు అనిపించింది. నిజానికి కథలో కూడా వస్తువు పాతదే.. చాలా సార్లు ఇదే పత్రికలో కొద్దిపాటి మార్పు చేర్పులతో వచ్చినదే. ఆకథలో కూడా ఆకట్టుకున్నది కథనమే. భార్య, భర్తల రోల్ రివర్సల్.. వాళ్ళు పడ్డ ఇబ్బందులు..ఒకరినొకరు అర్ధం చేసుకోడం.. ఇదీ కథ.. ముందుగా చెప్పినట్టు, కథ కన్నా చెప్పిన విధానం ఆకట్టుకుంది.

మొత్తం మీద ఈ పోటీ వల్ల, ముఖ్యంగా ఫలితాలలో ప్రధమ బహుమతికి అర్హమైన కథ ఏదీ లేదన్న ప్రకటన చూశాక, తెలుగులో మంచి కథల కొరత ఎంతగా ఉందో మరోసారి అర్ధమయ్యింది. నిజానికి మంచి కథలు రావడంలేదా? లేక ఈ పోటీలు మంచి కథలకి వేదికలు కాలేక పోతున్నాయా? అన్న సందేహం కూడా కలిగింది. మంచి కథలకి అందుతున్న ప్రోత్సాహం ఏపాటిది? అన్న మరో సందేహం కూడా..

ఒకప్పుడు పత్రికలు ప్రధమ బహుమతి ఇచ్చిన కథలు ఇప్పటికీ చిరంజీవులుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రధమ బహుమతికి అర్హమైన కథలే లేకుండా పోయాయి. ఈ అంశాన్ని గురించి సాహిత్య రంగంలో విశేషంగా చర్చ జరగాల్సి ఉందని ఒక పాఠకుడిగా నాకు అనిపిస్తోంది. పోటీల నిర్వాహకులు సైతం మారుతున్న కాలమాన పరిస్థితులని దృష్టిలో ఉంచుకుని న్యాయ నిర్ణయం చేయాలేమో..

శనివారం, డిసెంబర్ 26, 2009

ఐదేళ్ళ క్రితం...

ఎప్పటిలాగే ఆరోజు కూడా తెల్లవారింది.. మామూలుగానే సమయం గడుస్తోంది. ఉన్నట్టుండి జనంలో కంగారు మొదలయ్యింది. మొదట తెలిసిన వార్త సముద్రం పొంగుతోందని. ఉప్పెన అనుకున్నాం. జరుగుతున్నది ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. జలప్రళయం అన్నారు కొందరు, భూకంపం రావొచ్చునన్నారు మరి కొందరు. టీవీలో ఏ చానల్ తిప్పినా తెర నిండా నీళ్ళే.

జరుగుతున్న ఉత్పాతం పేరు 'సునామీ' అని తెలిసింది ఎన్డీటీవీ చూస్తున్నప్పుడే. తీర ప్రాంతాలకి హెచ్చరికలు. నదులు కూడా పొంగ వచ్చన్న వదంతులు. వార్తలకన్నా వదంతులే ఎక్కువగా వేగంగా వ్యాపిస్తాయి. సముద్ర తీరానికి చాలా దూరంగానే ఉన్నా, బంధు మిత్రుల నుంచి ఫోన్లు. క్షేమం తెలుసుకోడం కోసం. హైదరాబాద్ వచ్చేయమన్నారు ఒకరిద్దరు. ఎందుకో తెలీదు కానీ ఆ మాట వినగానే నవ్వొచ్చింది.

మధ్యాహ్నం దాటేసరికి టీవీల్లో దృశ్యాలు మొదలయ్యాయి.. ప్రకృతి విలయానికి బలయిన వాళ్ళ మృతదేహాలు చూపించడం మొదలు పెట్టారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు. ఎంతటి వాళ్ళనైనా కలచివేసే దృశ్యాలు. మరణాల సంఖ్య ఇదమిద్దంగా తెలియకపోయినా నష్టం అపారం అని చెప్పాయి, టీవీ చానళ్ళన్నీ ముక్త కంఠంతో. ఓ పక్క మరో సునామీ గురించి వదంతులు, మరో పక్క గుట్టలుగా శవాలు.. రాత్రంతా ఇవే దృశ్యాలు టీవీల్లో.

మర్నాడు ఉదయం ఏ పత్రిక చూసినా ఇదే వార్త. నేలని కరిగిస్తున్న నీళ్ళు, శవాల గుట్టల ఫోటోలు. గడిచిన వందేళ్ళలోనే అతి పెద్ద ప్రకృతి వైపరీత్యం అన్నాయి సంపాదకీయాలు. ఇలాంటి విపత్తులని ముందుగా పసిగట్టగలిగే, నష్టాన్ని తగ్గించగలిగే వ్యవస్థ అభివృద్ధి చెందలేదన్న అంశం చర్చకి వచ్చింది. బాధితుల కుటుంబ సభ్యుల, ప్రత్యక్ష సాక్షుల కథనం ఒక్కటే.. ఊహించని వైపరీత్యం అని.

సునామీ మనుషుల్లో మానవత్వాన్ని మేల్కొలిపింది. మామూలు ప్రకృతి వైపరీత్యాలకి స్పందిచని వాళ్ళు సైతం ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. పెద్ద ఎత్తున నష్టపోయిన మత్స్యకారులకి ఇళ్ళు, వలలు అందించే ఏర్పాటు చేశారు. స్వల్పకాలిక, దీర్ఘ కాలిక సేవా కార్యక్రమాలకి రూపకల్పన జరిగింది. దీర్ఘ కాలిక ప్రాజెక్టులు ఇప్పుడు ఒక రూపు తీసుకున్నాయి.

రచయితలకి, కవులకి సునామీ ఒక రచనా వస్తువయ్యింది. ఈ మహా విషాదం నేపధ్యంగా తెలుగులో వచ్చిన కథ 'కడలూరు వెళ్ళాలి ఒక నీలిమ కోసం' ఎప్పటికీ మర్చిపోలేం. (ఈమధ్యనే 'హిమబిందువులు' బ్లాగులో ఈ కథ గురించి ఒక టపా వచ్చింది.) సునామీ దృశ్యాల్లాగే ఆ కథ కూడా చాలా రోజులు వెంటాడింది.

ఆంగ్ల పత్రిక 'ది హిందూ' ఆదివారం అనుబంధంలో వచ్చిన ఒక కథ కూడా చాలా ఆలోచింపజేసింది. ప్రకృతి విలయానికి పెద్ద ఎత్తున నష్టం జరగడానికి కారణం మనిషి అత్యాశే అన్న కాన్సెప్ట్ తో వచ్చిన కథ అది. బీచ్ కి దగ్గరగా ఇళ్ళు కట్టుకోడానికి ఏర్పాట్లు చేసుకున్న ఒక కుటుంబం తమకి నచ్చిన స్థలం కోసం రూల్స్ ని అతిక్రమించడం కథా వస్తువు. ఒక సిని గీత రచయిత అయితే 'వయస్సునామీ..' అంటూ ఏకంగా ఓ ప్రేమగీతం రాసేశాడు.

సునామీ వచ్చిన కొద్ది రోజులకి ఒక బీచ్ కి వెళ్లాను. వైపరీత్యం తాలూకు ఆనవాళ్ళు అక్కడ తాజాగా ఉన్నాయి. ఆపక్కనే సహాయ కార్యక్రమాలు మొదలయ్యాయి. సునామీ మనకి రెండు పాఠాలు నేర్పింది అనిపించింది. మొదటిది మనిషి కన్నా ప్రకృతి ఎప్పుడూ సుప్రీమే.. రెండోది మానుషుల మధ్య సంబంధాలు బలహీన పడుతున్న ప్రతిసారీ వారిని కలిపే పనికి ప్రకృతి పూనుకుంటుంది అని..

గురువారం, డిసెంబర్ 24, 2009

(వి)కేంద్రీకరణ

ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అంటే కేవలం ఒక నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేయడమా? ప్రస్తుతం మన రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే ఈప్రశ్నకి సమాధానం అవుననే వస్తుంది. రాజధాని నగరం మినహా ఆ స్థాయిలో అభివృద్ధి చేసిన నగరం మరొకటి కనిపించదు మనకి. అభివృద్ధి కేంద్రీకరణ గత పదిహేనేళ్ళలో వేగవంతం అయ్యిందన్నది ఎవరూ కాదనలేని నిజం. ఫలితంగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుంచి రాజధాని నగరానికి వలసలూ అదే స్థాయిలో వేగవంతం అయ్యాయి.

ఒక పక్క ఖాళీ అవుతున్న మారుమూల గ్రామాలు, మరో పక్క కిక్కిరిసిన, కిక్కిరిసిపోతూనే ఉన్న, నానాటికీ విస్తరిస్తున్నా అదే స్థాయిలో సమస్యలనీ పెంచుకుంటున్న రాజధాని నగరం. రాష్ట్రంలోని పెద్ద పారిశ్రామిక వేత్తల పెట్టుబడులు మాత్రమే కాదు, విదేశీ పెట్టుబడులూ ఒక్క రాజధానిలో మాత్రమే కేంద్రీకృతమయ్యాయి. రాజధాని నగరం కావడం వల్ల పెట్టుబడులు రావడం మొదలైతే, వాటిని ఆకర్షించేందుకు పారిశ్రామిక వాడల ఏర్పాటు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం తదితర వనరుల అభివృద్ధి మొదలయ్యింది.

అభివృద్ధి కేంద్రీకరణ వల్ల కలగబోయే దుష్ఫలితాలను గురించి సామాజిక శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అధికారం లో ఉన్నవాళ్ళు తాము చేయదల్చుకున్నది చేశారు. వారి చర్యల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జనాభా పెరుగుదల కారణంగా వనరుల కొరత, కనీస సౌకర్యాల కొరత, పెరిగిన మురికి వాడలు, శాంతిభద్రతల సమస్య..ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకి అంతు లేదు.

రాష్ట్రంలో రాజధాని నగరం మినహా, ఏ ఇతర నగరమూ పెట్టుబడులకి అనువుగా లేదా? ఈ ప్రశ్నకి సమాధానం 'కాదు' అనే చెప్పాలి. పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సిన కనీస వనరులు భూమి, నీరు, మానవ వనరులు, శాంతి భద్రతలతో కూడిన వాతావరణం ఇంకా అనుకూలమైన రవాణా సౌకర్యాలు. ఇలా చూసినప్పుడు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు పెట్టుబడులకి అనుకూలంగా ఉన్నాయి. ఉదాహరణగా చెప్పాలంటే రాజధాని తర్వాత ప్రధాన నగరాలుగా చెప్పబడుతున్న విశాఖపట్నం, విజయవాడ నగరాలు, తిరుపతి పట్టణం పెట్టుబడులకి అనుకూలమే.

ఈ మూడు ప్రాంతాలలోనూ విశాఖ లో పారిశ్రామిక అభివృద్ధి ఈ మధ్యకాలంలోనే ఊపందుకుంది. మొదటినుంచీ పారిశ్రామిక నగరమే అయినా, ఇప్పుడు విదేశీ పెట్టుబడులని ఆకర్షించడం లో రాజధానితో పోటీ పడుతోంది ఈ నగరం. భూములు అందుబాటులో లేకపోవడం, ఖరీదు చుక్కలని అంటడం విజయవాడ నగరంలో పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి సమస్య అంటున్నారు. నిజానికి ఈ నగరం నుంచి పొరుగు రాష్ట్రాలకి నేరుగా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

పాలకుల దృష్టిలో తిరుపతి ఇప్పటికీ ఒక యాత్రా స్థలం మాత్రమే. అటు బెంగుళూరుకీ, ఇటు చెన్నై కి మధ్యలో ఉన్న ఈ పట్టణంలో పరిశ్రమల స్థాపనకి, అభివృద్ధికి ప్రధాన సమస్య నీటి సరఫరా. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న తెలుగుగంగ ప్రాజెక్టు పూర్తయితే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కేవలం ఈ ప్రాంతాలు మాత్రమే కాదు, తృతీయ శ్రేణి పట్టణాలలో సైతం సౌకర్యాలని మెరుగు పరచడం ద్వారా పెట్టుబడులని ఆకర్షించి ఆయా ప్రాంతాలని అభివృద్ధి చేయొచ్చు. పాలసీ మేకర్స్ కి చిత్తశుద్ధి ఉంటే ఇది అసాధ్యమేమీ కాదు.

మంగళవారం, డిసెంబర్ 22, 2009

నాయికలు-అరుణ

"నేను ప్రకాశాన్ని పెళ్లి చేసుకుంటాను.. అప్పుడు నేను స్వేచ్ఛగా ఉండొచ్చు.." అంటుందో ఇరవై రెండేళ్ళ అమ్మాయి తన స్నేహితురాలితో. "అందరూ పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ పోతుందని గోల పెడుతుంటే, నువ్వు స్వేచ్ఛ కోసం పెళ్లి చేసుకుంటానంటే నవ్వు రాదూ.." అంటుందా స్నేహితురాలు, నవ్వాపుకుంటూ. మూడేళ్ళ సంసార జీవితం తర్వాత, ఓ పాపకి తల్లైన రెండేళ్ళకి, స్నేహితురాలి మాటలు అర్ధమవుతాయి ఆమెకి. ఆమె పేరు అరుణ.

తెలుగు పాఠకులకి వోల్గా గా పరిచయమైన పోపూరి లలిత కుమారి ఇరవై రెండేళ్ళ క్రితం రాసిన 'స్వేచ్ఛ' నవలలో నాయిక అరుణ. మధ్య తరగతి అమ్మాయి. ఇంట్లో తల్లి, తండ్రి, అన్న వదిన, చివరికి తల చెడి వాళ్ళ పంచన చేరిన మేనత్త అందరూ ఆమెని కట్టడి చేసేవాళ్ళే. ఆమె ఏ పని చేయాలన్నీ వీళ్ళందరి అనుమతీ తీసుకోవాల్సిందే. తండ్రికి ఆమెకి పెళ్లి చేసే ఆర్ధిక స్తోమతు లేకపోవడం వల్ల కష్టపడి ఎమ్మే చదవ గలిగింది అరుణ. అప్పుడే యూనివర్సిటీ లో పరిచయమై ప్రాణ స్నేహితురాలిగా మారింది ఉమ. అప్పటి స్నేహితుడు ప్రకాశం, తర్వాత ఆమెకి భర్తగా మారాడు.

చిన్నప్పటినుంచీ తను ఖర్చు పెట్టే ప్రతి పైసాకీ ఇంటిల్లపాది నుంచీ అనుమతి సంపాదించాల్సి రావడం వల్ల, ఆర్ధిక స్వాతంత్రం విలువ చిన్న వయసులోనే అర్ధమవుతుంది అరుణకి. అందుకే ఏదైనా ఉద్యోగం వచ్చేవరకూ పెళ్లి మాట తలపెట్ట వద్దంటుంది, అప్పటికే ఉద్యోగస్తుడైన ప్రకాశాన్ని. ఒక కాలేజీలో తెలుగు లెక్చరర్ గా చేరిన నెల్లాళ్ళకి, ఇంట్లో వాళ్లకి చెప్పకుండా ప్రకాశాన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది అరుణ. పుట్టింటితో సంబంధాలు శాశ్వతంగా తెగిపోతాయి ఆమెకి. స్నేహితురాలు ఉమ పై చదువుల కోసం వెళ్తుంది.

కాలం గడుస్తున్న కొద్దీ ప్రకాశం అర్ధం కావడం మొదలుపెడతారు అరుణకి. తామిద్దరి మధ్యా ఉన్న భేదం కూడా తెలుస్తూ ఉంటుంది ఆమెకి. అరుణ కేవలం తను, తన సంసారం అనుకుంటూ ఉండలేదు. జీతాల కోసం చేసే ఉద్యమం కావొచ్చు, బాధార్తుల జీవితాలని వెలుగులోకి తెచ్చే పత్రిక కావొచ్చు, వాటిలో పనిచేయడంలో ఆనందం, తృప్తీ లభిస్తాయి ఆమెకి. సంఘం లో ఉన్న సమస్యలకి తాను బాధ్యుడిని కాదు కాబట్టి, వాటి పరిష్కారంతో తనకి సంబంధం లేదంటాడు ప్రకాశం.

జీవితాన్ని కాచి వడపోసిన అత్తగారు కమలమ్మ పెద్ద అండ అరుణకి. కేవలం పాపని చూసుకోడమే కాదు, అరుణకి కావాల్సిన మానసిక స్థైర్యం కూడా ఇస్తూ ఉంటుందామె. కొడుకూ, కోడలూ కీచులాడుకుంటూ ఉండకూడదన్నది ఆమె కోరిక. ఇద్దరికీ చెప్పలేక సతమతమవుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ ఉమ రాసే ఉత్తరాలు పెద్ద ఊరట అరుణకి. 'వెలుగు' అనే పత్రిక కోసం అరుణ నెలకి వందరూపాయలు చందా ఇవ్వడం, ఆ పత్రిక కోసం సమాచారం సేకరించి వ్యాసాలు రాయడం అస్సలు నచ్చదు ప్రకాశానికి. ఆ పనిలో యెంతో ఆనందం దొరుకుతుంది అరుణకి.

"పెళ్ళయితే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరి పాత్రలనూ ప్రకాశమే పోషిస్తాడేమో.." అని ఒకప్పుడు ఉమ అన్న మాటలు గుర్తొస్తాయి అరుణకి. నిజానికి అరుణ దృష్టిలో ప్రకాశం చాలామంది మగవాళ్ళకన్నా మంచివాడు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే తను చేసేవి అతనికి నచ్చవు, అతనికి నచ్చేట్టుగా తను ఉండలేదు.. ఉంటే స్వేచ్ఛకి అర్ధం ఉండదు. తమ ఇద్దరి దారులూ వేరన్న విషయం అర్ధం కాగానే అరుణ ఎలాంటి నిర్ణయం తీసుకుందన్నది ఈ నవల ముగింపు.

'చతుర' నవలల పోటీలో ప్రధమ బహుమతి గెలుచుకున్న ఈ నవల అప్పట్లో ఒక సంచలనం. ఎన్నో వివాదాలకి కేంద్ర బిందువు. ప్రగతిశీల ఉద్యమాల్లో పనిచేసే మగవాళ్ళు తమ ఇంటి స్త్రీలని మిగిలిన అందరు మగవాళ్ళ లాగే చూస్తారనీ, తమతో పని చేసే స్త్రీల ఇబ్బందులని ఏమాత్రం పట్టించుకోరనీ రాయడం సహజంగానే చాలామందికి కోపం తెప్పించింది.

కథా వస్తువుతో పాటు, రచయిత్రి వ్యక్తిగత జీవితం కూడా చర్చల్లోకి వచ్చింది. వోల్గా రచనల్లో ఎక్కువ సార్లు పునర్ముద్రణలు పొందిన నవల బహుశా ఇదే. తనకి నచ్చినట్టుగా జీవించాలనుకున్న ఒక సాధారణ స్త్రీకి పరిస్థితులు ఎలాంటి పాఠాలు నేర్పుతాయన్నది సమగ్రంగా చిత్రించిన నవల 'స్వేచ్ఛ.' (స్వేచ్ఛ ప్రచురణలు, పేజీలు 155, వెల రూ. 60 అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

ఆదివారం, డిసెంబర్ 20, 2009

కలల అలజడి

కల.. నిద్ర లేవగానే నెమరువేసుకునే ఒక జ్ఞాపకం.. అసలు కలలు ఎందుకు వస్తాయి? నిజానికి ఇదో పెద్ద టాపిక్.. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలంతా సుదీర్ఘ పరిశోధనలు చేసి చాలా పుస్తకాలు రాశారు. మానవ మనస్తత్వానికీ, కలలకీ ఉన్న సంబంధాన్ని విశ్లేషించారు.. ఒక మనిషికి వచ్చే కలలని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకునే సిద్ధాంతాలు రూపు దిద్దారు.. ఇదంతా హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ కి సంబంధించిన విషయం.

కానీ కలలు కేవలం మేధావి వర్గానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. నిద్రపోయే ప్రతి జీవికీ.. అవును ప్రతి జీవికీ..కలలు వస్తాయి. కొన్ని అందమైనవి, మరికొన్ని భయపెట్టేవి. "నిద్రలో అందమైన కలొస్తే మేలుకోం.. ఆ కలని ఆస్వాదిస్తాం. అదే పీడ కలొస్తే.. నిద్ర మేల్కొంటాం," అంటుంది 'గమ్యం' సినిమాలో సరస్వతి పాత్ర. కథానాయకుడు అభిరాం కి నాయిక జానకి గురించి చెప్పేటప్పుడు ఆమె కలని ఉదహరిస్తుంది. పీడకల మనిషిని హెచ్చరిస్తుంది అంటుంది.

నిజమే కదా.. అందమైన కలొస్తే మళ్ళీ మళ్ళీ అదే కల రావాలని కోరుకుంటాం. ఎప్పుడు ఆ కల వస్తునా అని ఎదురు చూస్తాం. అదే పీడకల అయితే మళ్ళీ రాకపోతే బాగుండు అనుకుంటాం.. కొండొకచో వస్తుందేమో అని భయపడటం. చాలా ఏళ్ళ క్రితం నాకో పీడ కల వచ్చింది.. ఒకరోజు, రెండు రోజులు కాదు.. దాదాపు సంవత్సరం పాటు తరచూ వచ్చేది. ప్రతి సారీ కల చివర్లో హఠాత్తుగా మెలకువ రావడం, మంచినీళ్ళు తాగి నిద్రకి ఉపక్రమించడం..

అప్పట్లో మాటల సందర్భంలో ఒక మిత్రుడికి ఈ కల గురించి చెప్పాను. సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంత కోణం నుంచి ఆయన నా కలని విశ్లేషించిన తీరు చూశాక, ఇంకెప్పుడూ ఏ కల గురించీ ఎవరితోనూ చర్చించ కూడదని నిర్ణయించేసుకున్నాను. ఇంతకీ ఆ కల రావడం ఉన్నట్టుండి ఆగిపోయింది. ఇప్పుడు రమ్మన్నా రావడం లేదు. కల రావడం, రాకపోవడం మన చేతుల్లో లేదు కదా. చిన్నప్పుడు నేను చదివిన కథలు కలల్లోకి వచ్చేవి.

ఐదో తరగతి లో ఉండగా అనుకుంటా, ఒక కథ చదివి జ్వరం తెచ్చుకున్నా.. (కథ ఇప్పటికీ లీలగా గుర్తుంది, మామూలు కథే.. అప్పుడు సరిగా అర్ధం కాలేదు) చేసిన పొరపాటు ఏమిటంటే, డాక్టరు గారు ప్రేమగా మాట్లాడుతుంటే కథ చదివి భయపడ్డ విషయం చెప్పేశాను. ఫలితంగా పబ్లిగ్గా కథలు చదివే అవకాశం చాలా రోజులపాటు కోల్పోయాను. రహస్యంగా చదవడం, దొరికిపోవడం, దెబ్బలు తినడం..అదంతా వేరే కథ.

పొరుగూరు హైస్కూలికి నడుచుకుంటూ వెళ్లి వచ్చేటప్పుడు, చెప్పుకోడానికి కథలేమీ లేకపొతే మాకొచ్చిన కలల గురించి చెప్పుకునే వాళ్ళం. అప్పట్లో అందరికీ లెక్కల మేష్టారు, డ్రిల్లు మేష్టారు ఎక్కువగా కలలోకి వచ్చే వాళ్ళు. కాలేజీ రోజుల్లో కూడా కొన్ని కలలు చెప్పుకోడానికి భలే వీరోచితంగా ఉండేవి. నాకు ఏదైనా సినిమా బాగా నచ్చితే అది మొత్తం కలలోకి వచ్చేస్తుంది, డైలాగులు, సంగీతంతో సహా.. కానీ ఎప్పుడైనా మధ్యలో మెలకువ వస్తే, ఇక కల అక్కడితో ఆగిపోతుంది.

మనం బాగా మానసిక ఒత్తిడికి గురయినప్పుడు పీడకలలు వస్తాయని, సంతోషంగా ఉన్నప్పుడు అందమైన కలలు వస్తాయని నా చిన్న పరిశీలన. ఒకే కల రిపీట్ కావడం అన్నది పీడకలల విషయంలో జరిగినంత తరచుగా అందమైన కలల విషయంలో జరక్క పోవడం ఒక విషాదం. కల్లోకొచ్చిన పిల్లని హీరో ప్రేమించి పెళ్లి చేసుకోడం అన్నది వెండితెరకి సూపర్ హిట్ ఫార్ములా అయి కూర్చుంది.. సినిమా నాయికా నాయకులది ఏంపోయింది.. విదేశాల్లో డ్యూయెట్లు పాడుకుంటున్నట్టు కలగనేస్తారు.. ఖర్చు నిర్మాతదే కదా పాపం.

ఇక కలల మీద వచ్చిన సినిమా పాటలకైతే కొదవే లేదు. ఒకటా రెండా.. ఎన్నని చెప్పాలి? ప్రేమ గీతమైనా, విరహ గీతమైన కల అనేది ఒక కరిగిపోని కవితా వస్తువు సిని గేయ రచయితలకి.. "కలల అలజడికి నిద్దుర కరవై.. అలసిన దేవేరి అలమేలు మంగకీ.. తెలవారదేమో స్వామీ.." అని 'శ్రుతిలయలు' సినిమా కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటని అన్నమాచార్య కీర్తన అనుకుంటారు చాలామంది. జేసుదాసు పాడిన విధానం ముఖ్యంగా 'కలల అలజడికి' అని పలికే విధానం నాకు బాగా ఇష్టం.. ఇవీ కలల గురించి కొన్ని కబుర్లు.

గురువారం, డిసెంబర్ 17, 2009

కథ రాశాను..

అవును.. మొదటిసారిగా ఒక కథ రాశాను.. నిజానికి ఇది నా బాల్య జ్ఞాపకాల సమాహారం.. గతం లో ఒకటి రెండు జ్ఞాపకాల టపాలు చదివిన బ్లాగ్మిత్రులు కథ రాయమంటూ సూచించినా ఆ దిశగా ప్రయత్నం చెయ్యలేదు.. నా చిన్నప్పటి నేస్తం వెంకాయమ్మ గారి గురించి వివరంగా ఒక టపా రాయాలని ఎప్పటినుంచో ఉంది. ఆ జ్ఞాపకాలన్నీ గుది గుచ్చి ఒక చోట చేర్చి 'బెల్లం టీ' పేరుతో 'పొద్దు' కి పంపాను. 'కథ' వర్గం లో నా రచనని ప్రచురించిన జాల పత్రిక 'పొద్దు' వారికీ, నన్ను ప్రోత్సహించిన ఆ పత్రిక సంపాదక వర్గ సభ్యులు, బ్లాగరి 'చదువరి' గారికీ నా కృతజ్ఞతలు. నా టపాలు చదివి తమ విలువైన అభిప్రాయాలు చెబుతున్న బ్లాగు మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.

*     *     * 

"బాబూ.. మొహం కడుక్కుని రా. తల దువ్వుతాను. నాన్నగారు నిన్ను వెంకాయమ్మ గారింటికి తీసుకెళ్తారుట..." తల దువ్వించుకోవడం నాకు చాలా చిరాకైనా పనైనా, ఆ చివరి మాటలు వినగానే మంత్రించినట్టుగా నూతి దగ్గరకి పరిగెత్తే వాడిని చిన్నప్పుడు, మొహం కడుక్కోడం కోసం. వెంకాయమ్మ గారింటికి వెళ్ళడం అంటే ఒక చిన్న సైజు పండుగ అప్పట్లో.

బెల్లం పాకం తో చుట్టిన జీడిపప్పు ఉండలు, బెల్లం పూతరేకులు, గోర్మిటీలు, మడత కాజాలు.. వీటిలో కనీసం రెండు రకాల మిఠాయిలని ఇత్తడి పళ్ళెంలో పెట్టి అందిస్తారా.. అవి తినడం పూర్తి కాకుండానే ఓ పేద్ద ఇత్తడి గ్లాసు నిండా నురుగులు నురుగులుగా బెల్లంటీ ఇచ్చేస్తారు. మనం ఇంకేమీ అనడానికి ఉండదు. బుద్ధిగా తాగేయ్యడమే.. పైగా నాన్న కూడా 'వద్దు' అనరు.

రెండు చేతులతోనూ గ్లాసుని గట్టిగా పట్టుకుని, ఊదుకుంటూ తాగుతుంటే బెల్లంటీ ఎంత బాగుంటుందంటే.. ఆ రుచి వర్ణించడానికి రాదు. తియ్యగా, వగరుగా, అదోలాంటి వాసనతో.. అంత పేద్ద గ్లాసు చూడగానే అస్సలు తాగ గలమా? అనుకుంటాం.. కానీ తాగుతుంటే ఇంకా తాగాలని అనిపిస్తుంది.. మన ఇంట్లో పాలు తాగినట్టు బెల్లంటీ చివరి చుక్కవరకూ తాగ కూడదు.. ఎందుకంటే గ్లాసు అడుగున నలకలు ఉంటాయి.. అందుకని కొంచం వదిలెయ్యాలి.

వెంకాయమ్మ గారు.. మా ఊళ్ళో పరిచయం అక్కర్లేని పేరు. ఆవిడ మామూలుగా మాట్లాడిందంటే నాలుగు వీధులు వినిపిస్తుంది.. ఇంక కోపం వచ్చిందంటే ఊరంతటికీ వినిపించాల్సిందే. యాభయ్యేళ్లు పైబడ్డ మనిషైనా అంత వయసులా కనిపించేది కాదు. నల్లని నలుపు, చెయ్యెత్తు మనిషి.జరీ నేత చీర,ఐదు రాళ్ళ ముక్కు పుడక, బేసరి, చెవులకి రాళ్ళ దిద్దులు, మెడలో నాంతాడు, చంద్రహారాలు, కంటె, కాసుల పేరు, చేతులకి అరవంకీలు, గాజులు, కాళ్ళకి వెండి కడియాలు, పట్టీలు..ఆవిడ పేరంటానికి వచ్చిందంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి నడిచొచ్చినట్టు ఉందని అనేది అమ్మ. వీటిలో సగం నగలు నిత్యం ఆవిడ వంటిమీద ఉండాల్సిందే.. మా ఊరి గుళ్ళో అమ్మవారి మెడలో మంగళ సూత్రాల తర్వాత, మళ్ళీ అంత పెద్ద సూత్రాలు ఆవిడ మెడ లోనే చూశాను నేను.

వాళ్ళ ఇల్లు చూస్తే కోనసీమ మొత్తాన్ని చూసేసినట్టే. వీధివైపు కొబ్బరి చెట్లు. మల్లె పొదలు, జాజితీగలు, బంతి, కనకాంబరం మొక్కలు. దాటి లోపలి వెళ్తే పేద్ద పెంకుటిల్లు. పెరటి వైపున వంటకి ఇంకో చిన్న వంటిల్లు. ఓ పక్కగా కోళ్ళ గూడు, మరో పక్క వంట చెరకు. కాస్త దూరంలో నుయ్యి. నూతి గట్టుని ఆనుకుని వాళ్ళ కొబ్బరి తోట, కొంచం ముందుకెళ్తే వాళ్ళదే వరి చేను. ఈవిడ వంటగదిలో నుంచి కేకేసిందంటే పొలంలో కూలీలు ఉలిక్కి పడి, మాటలు ఆపి పని మొదలు పెట్టాల్సిందే.

నేనూ, నాన్నా ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ పెరటి అరుగు మీద కూర్చునే వాళ్ళం. ఆవిడ వంట ఇంట్లో పని చేసుకుంటూనే, ఓ పక్క నాన్నతో మాట్లాడుతూ మరో పక్క పొలంలో పనిచేసే కూలీల మీద అజమాయిషీ చేసేది. చిన్నప్పుడు నన్ను 'మనవడా' అనీ, నేను కొంచం పెద్దయ్యాక 'మనవడ గారా..' అనీ పిలిచేది. నేనేమో ఆవిణ్ణి మరీ పసితనంలో 'వెంకాయమ్మా..' అనీ కొంచం జ్ఞానం వచ్చాక 'నానమ్మ గారూ..' అనీ పిల్చేవాడిని. నాన్నని 'అబ్బాయి' అనీ అమ్మని 'కోడలు గారు' అనీ అనేది. నేనంటే భలే ముద్దు ఆవిడకి.

మా ఊరివాడైన నరసింహ మూర్తి గారిని పెళ్లి చేసుకుని తన పన్నెండో ఏట మా ఊరికి కాపురానికి వచ్చిందట వెంకాయమ్మ గారు. ఆవిడ పుట్టిల్లు మా ఊరికి నాలుగైదు ఊళ్ళు అవతల ఉన్న మరో పల్లెటూరు. జీడి తోటలకీ, మావిడి తోటలకీ ప్రసిద్ధి. కలిగినింటి ఆడపడుచు కావడంతో భూమి, బంగారం బాగానే తెచ్చుకుందని మా ఇంట్లో అనుకునే వాళ్ళు. ఆవిడ వచ్చాకే నరసింహ మూర్తి గారికి దశ తిరిగిందిట. ఆయన స్వతహాగా అమాయకుడు. కష్టపడతాడు కానీ, వ్యవహారం బొత్తిగా తెలీదు.

నలుగురు పిల్లలు బయలుదేరగానే ఇంటి పెత్తనం మొత్తం వెంకాయమ్మగారు తన చేతుల్లోకి తీసుకుందిట. వాళ్లకి ఆరుగురు ఆడపిల్లలు, ఒక్కడే మగపిల్లాడు. మొదటి నుంచీ ఆవిడకి ఆడపిల్లలంటే చిన్నచూపు, ఆస్తి పట్టుకుపోతారని. కొడుకంటే విపరీతమైన ప్రేమ. ఆవిడ పెత్తనం తీసుకున్నాక అప్పటివరకు ఖాళీగా పడున్న పోరంబోకు భూమిని మెరక చేసి కొబ్బరితోట గా మార్చింది. ఉన్న పొలానికి తోడు, మరికొంత పొలం కౌలుకి తీసుకుని వరి, అపరాలు పండించడం మొదలు పెట్టింది. పాడికి పశువులు, గుడ్లకి కోళ్ళు సర్వకాలాల్లోనూ ఇంట్లో ఉండాల్సిందే.

చివరి సంతానానికి నీళ్ళూ, పాలూ చూడడం అయ్యేసరికి పెద్ద కూతురి పిల్లలు పెళ్ళికి ఎదిగొచ్చారు. అంత సంసారాన్నీ ఈదుతూనే ఊరందరికన్నా ముందుగా తన ఇల్లంతా గచ్చు చేయించింది వెంకాయమ్మ గారు. "ఎదవ కోళ్ళు.. కొంపంతా నాసినం చేసి పెడతన్నాయి..వందలు తగలేసి గచ్చులు సేయించినా సుకం లేదు" అని విసుక్కుందోసారి. "మరెందుకు కోళ్ళని పెంచడం? తీసేయొచ్చు కదా?" అని నేను జ్ఞానిలా సలహా ఇచ్చాను, ఆవిడ పెట్టిన లడ్డూ కొరుక్కుంటూ.

"మీ మావలొచ్చినప్పుడు కోడి గుడ్డట్టు కంచంలో ఎయ్యకపోతే మీ అత్తలు ముకం మాడ్సరా నాయినా? ఈటిని తీసేత్తే గుడ్లెక్కడినుంచి అట్రాను?" అని అడిగిందావిడ. "మా ఆడపడుచుల చేత ఇల్లలికించారు.. మా తోటికోడలు కష్ట పడకూడదని గచ్చులు చేయించేశారు అత్తగారు" అని వేళాకోళం చేసింది అమ్మ. ఊళ్ళో వాళ్ళు ఆవిడ నోటికి జడిసినా, ఏదైనా అవసరం వచ్చినప్పుడు మొదట తొక్కేది ఆవిడ గడపే. ఇంటికి వచ్చిన వాళ్ళని వట్టి చేతులతో పంపదని పేరు. "అవసరం రాబట్టే కదా మన్ని ఎతుక్కుంటా వచ్చారు.. మనకి మాత్తరం రావా అవసరాలు?" అనేది ఆవిడ.

పొలం పనుల రోజుల్లో వాళ్ళిల్లు పెళ్ళివారిల్లులా ఉండేది. పెరట్లో గాడి పొయ్యి తవ్వించి పెద్ద పెద్ద గంగాళాల్లో ఉప్మా వండించేది.. ఓ పెద్ద ఇత్తడి బిందెలో బెల్లం టీ మరుగుతూ ఉండేది. "కడుపు నిండా ఎడతాది.. మారాత్తల్లి" అనుకునే వాళ్ళు కూలీలు. పని కూడా అలాగే చేయించేది. గట్టున నిలబడి అజమాయిషీ చేయడమే కాదు, అవసరమైతే చీరని గోచీ దోపి పొలంలోకి దిగిపోయేది. సాయంత్రానికి కూలీ డబ్బులు చేతిలో పెట్టి పంపించేది. "ఆళ్ళని తిప్పుకుంటే మనకేవన్నా కలిసొత్తాదా" అంటూ.

వెంకాయమ్మ గారికి భక్తి ఎక్కువే. కార్తీక స్నానాలకీ, మాఘ స్నానాలకీ సవారీ బండి కట్టించుకుని గోదారికి బయలుదేరేది. ఎప్పుడైనా సినిమా చూస్తే అది భక్తి సినిమానే అయ్యుండేది. ఆవిడ సవారీబండి కట్టించిందంటే అది మా ఇంటి ముందు ఆగాల్సిందే. మేము బండిలో కూర్చోవాల్సిందే. నాన్నని నోరెత్తనిచ్చేది కాదు. "ఆయమ్మని నువ్వూ ఎక్కడికీ తీస్కెల్లక, నన్నూ తీసుకెళ్ళనివ్వక.. ఎట్టా నాయినా?" అని గదమాయించేది.

ఎప్పుడైనా నాన్న ఊరికి వెళ్ళాల్సి వచ్చి, ఇంట్లో మేము ఒక్కళ్ళమే ఉండాల్సి వస్తే రాత్రులు మాకు సాయం పడుకోడానికి వచ్చేది ఆవిడ. పనులన్నీ ముగించుకుని ఏ పదింటికో తలుపు తట్టేది. "ఉడుకు నీల్లతో తానం చేసొచ్చాను కోడలగారా.. మా మనవడు సెవటోసన అనకుండా" అనేది. అది మొదలు అమ్మా, ఆవిడా అర్ధ రాత్రివరకూ కష్టసుఖాలు కలబోసుకునే వాళ్ళు. నేను నిద్రపోయానని నిశ్చయం చేసుకున్నాక, ఆవిడ బయటికి వెళ్లి అడ్డ పొగ పీల్చుకుని వచ్చేది. నాకు తెలిస్తే నవ్వుతానని ఆవిడ భయం. నాకు తెలిసినా తెలీనట్టు నటించే వాడిని. ఆవిడ సాయానికి వచ్చినప్పుడు అమ్మ నిద్రపోయేది కాదు. దొంగాడెవడైనా వెంకాయమ్మ గారి నగల మీద కన్నేసి, ఆవిడ మా ఇంట్లో ఉండగా పట్టుకుపోతే ఆ పేరు ఎప్పటికీ ఉండిపోతుందని అమ్మ భయం.

నాకు జ్వరం వస్తే టీ కాఫీలు తరచూ ఇమ్మని చెప్పేవారు డాక్టరు గారు. నేనేమో బామ్మ తాగే కాఫీ అయినా, వెంకాయమ్మ బెల్లం టీ అయినా కావాలని గొడవ చేసేవాడిని. అమ్మకేమో అంతబాగా చేయడం వచ్చేది కాదు. ఒక్కోసారి వారం పదిరోజుల వరకూ జ్వరం తగ్గేది కాదు. అలాంటప్పుడు ఖాళీ చేసుకుని నన్ను చూడ్డానికి వచ్చేది వెంకాయమ్మ గారు. "వెంకాయమ్మ ఇచ్చే టీ లాంటిది కావాలని గొడవ చేస్తున్నాడు మనవడు. నాయనమ్మగారు ఏం మందు కలిపి ఇస్తారో మరి" అనేది అమ్మ.

"అదేవన్నా బాగ్గెవా బంగారవా నాయినా.. మీ సిన్నత్త సేత అంపుతానుండు.." అనడమే కాదు, మర్చిపోకుండా వాళ్ళ చిన్నమ్మాయికిచ్చి పంపేది. ఎప్పుడు జ్వరం వచ్చినా "వెంకాయమ్మ బెల్లం టీ తాగితే కానీ నీ జ్వరం తగ్గదురా" అని ఏడిపించేది అమ్మ. టీ ఒక్కటేనా? పత్యం పెట్టే రోజున వాళ్ళ పెరట్లో బీరకాయలో, ఆనపకాయో ఎవరో ఒకరికి ఇచ్చి పంపేది.

ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాగానే వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూడడం మొదలు పెట్టింది వెంకాయమ్మ గారు. అతనికి పెద్దగా చదువు అబ్బలేదు.వ్యవసాయం పనులు గట్టుమీద నిలబడి అజమాయిషీ చేయడం కూడా అంతంతమాత్రం. వెంకాయమ్మ గారు బలపరిచిన ఆస్తి పుణ్యమా అని సంబంధాలు బాగానే వచ్చాయి. ఆవిడ అన్నలే పిల్లనిస్తామని ముందుకొచ్చారు.ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలున్న ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకుంటే కొడుక్కి ముచ్చట్లు జరగవని తన తమ్ముడి ఏకైక కూతురితో కొడుకు పెళ్ళికి ముహూర్తం పెట్టించింది.

ఆవిడ పుట్టిన ఊళ్ళో, పుట్టింట్లోనే కొడుకు పెళ్లి. మా ఊరి నుంచి ఎడ్ల బళ్ళు బారులు తీరాయి. కేవలం మాకోసమే ఒక సవారీ బండి ఏర్పాటు చేసింది వెంకాయమ్మ గారు. పెళ్లింట్లో మాకు ప్రత్యేకమైన విడిది.. మాకు కావలసినవి కనుక్కోడానికి ప్రత్యేకంగా ఒక మనిషి. అంత సందట్లోనూ ఆవిడ మమ్మల్ని. మర్చిపోలేదు. మధ్యలో తనే స్వయంగా వచ్చి ఏం కావాలో కనుక్కుంది. పుట్టి బుద్దెరిగిన ఆ పదేళ్ళ లోనూ అంతటి పెళ్లి నేను చూడలేదు. పెళ్లి కాగానే ముత్యాల పల్లకీలో ఊరేగింపు. పల్లకీ మా ఊళ్లోకి రాగానే కొడుకునీ, కోడలినీ మా ఇంటికి తీసుకొచ్చింది ఆవిడ.

ఆవిడ కోరుకున్నట్టే అల్లుడిని బంగారంతో ముంచెత్తడమే కాక, కొత్త మోటారు సైకిల్ కొనిచ్చాడు మావగారు. మా ఊళ్ళో కొత్త మోటర్ సైకిల్ నడిపిన మొదటి వ్యక్తి వెంకాయమ్మ గారి అబ్బాయే. మూడు బళ్ళ మీద సామాను వేసుకుని కాపురానికి వచ్చింది కొత్త కోడలు.పందిరి మంచం, అద్దం బల్లా, బీరువా.. ఇలా.. అందరిలా ఊరికే ఒక లడ్డూ, మైసూరు పాక్, అరటిపండూ కాకుండా సారె కూడా ఘనంగా తెచ్చుకుంది. మొత్తం తొమ్మిది రకాల మిఠాయిలు. ఊరందరూ చాలా గొప్పగా చెప్పుకున్నారు. పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా అన్ని మిఠాయిలు సారె తెచ్చుకునే అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అమ్మకి కచ్చితంగా చెప్పేశాను.

నేను పొరుగూరు హైస్కూలు చదువులో పడడంతో వాళ్ళింటికి పెత్తనాలు తగ్గాయి. అదీ కాక ఆ కొత్త కోడలంటే తెలీని బెరుకు. పాపం ఆవిడా బాగానే మాట్లాడేది. అయినా మునుపటి స్వేచ్చ ఉండేది కాదు. కాలం తెలియకుండానే గడిచిపోతోంది. ఒకరి తర్వాత ఒకరు వెంకాయమ్మ గారికి ఇద్దరు మనవరాళ్ళు బయలుదేరారు. 'మగ పిల్లలు కావాల్సిందే' అని పంతం పట్టడమే కాక, ఆ పంతం నెగ్గించుకుంది ఆవిడ. తర్వాత వరుసగా ఇద్దరు మనవలు. "సొంత మనవలు వచ్చేశారు.. నానమ్మగారికి ఇంక ఈ మనవడు ఏం గుర్తుంటాడు లెండి" వాళ్ళ చిన్న మనవడిని చూడ్డానికి వెళ్ళినప్పుడు అన్నాను. "ఎంత మాట నాయినా.. నీ తరవాతోల్లే నీ తమ్ముల్లు" అందావిడ ఆప్యాయంగా.

నేను కాలేజీ లో చదవడం ఆవిడకి ఎంత సంతోషమో. "మీరూ అన్నయ్య గారిలా సదుంకోవాలి" అనేది తన మనవల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని. వయసు పెరగడం, ఆవిడకి ఓపిక తగ్గడం తో వ్యవహారాల్లో కొడుకు జోక్యం పెరిగింది.. ఆవిడ జోక్యం క్రమంగా తగ్గింది. చేతినిండా డబ్బు ఆడుతుండడంతో అతను వ్యసనాలకి అలవాటు పడ్డాడు. ఒకటీ రెండూ కాదు, వ్యసనాల జాబితాలో ఉండే వ్యసనాలన్నీ అతనికి అలవడి పోయాయి. విపరీతమైన ప్రేమ కొద్దీ కొడుకు మీద ఈగని కూడా వాలనిచ్చేది కాదు వెంకాయమ్మ గారు. ఎక్కువరోజులు పుట్టింట్లోనే ఉండడం మొదలు పెట్టింది ఆవిడ కోడలు.

ఉద్యోగం వెతుక్కుంటూ నేను ఇల్లు విడిచిపెట్టాను. ఇంటికి రాసే ఉత్తరాల్లో మర్చిపోకుండా వెంకాయమ్మ గారి క్షేమం అడిగేవాడిని. జవాబులో ముక్తసరిగా ఒకటి రెండు వాక్యాలు రాసేది అమ్మ. దొరికిన ఉద్యోగం చేస్తూ, మంచి ఉద్యోగం వెతుక్కునే రోజుల్లో ఇంటికి రాకపోకలే కాదు, ఉత్తర ప్రత్యుత్తరాలూ తగ్గాయి. ఫలితంగా కొన్నాళ్ళ పాటు ఆవిడ విషయాలేవీ తెలియలేదు నాకు. కొంచం కుదురుకున్నాక ఊరికి వెళ్లాను, రెండు రోజులు సెలవు దొరికితే. వెళ్ళినరోజు సాయంత్రం ఇంటికి వచ్చిందావిడ. "మనవడు గారికి ఈ నానమ్మ గుర్తుందో లేదో అని ఒచ్చాను నాయినా.." అనగానే నాకు సిగ్గనిపించింది. "రేపు నేనే వద్దామనుకుంటున్నానండీ," అన్నాను.

ఆవిడెందుకో ఇబ్బంది పడుతోంది అనిపించింది కానీ, విషయం పూర్తిగా అర్ధం కాలేదు. "పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయేమో చూసిరా బాబూ," అంది అమ్మ. నేనక్కడ ఉండకూడదని అర్ధమై, అక్కడి నుంచి మాయమయ్యాను. ఆవిడ వెళ్ళిపోయాక కూడా అమ్మెందుకో ఆ విషయం మాట్లాడడానికి పెద్దగా ఇష్ట పడలేదు.. "వాళ్ళ పరిస్థితి ఇదివరకట్లా లేదు" అంది అంతే.. మళ్ళీ ఏడాది వరకూ ఊరికి వెళ్ళడానికి కుదరలేదు నాకు. ఊళ్లోకి అడుగు పెట్టగానే చిన్నప్పటి జ్ఞాపకాలతో పాటు నానమ్మగారి బెల్లం టీ కూడా గుర్తొచ్చింది. ఈసారి మిస్సవ్వకూడదు అనుకున్నాను.

మర్నాడు మధ్యాహ్నం ప్రయాణమయ్యాను వెంకాయమ్మగారింటికి. "టీ తాగి వెళ్ళు బాబూ.." అంది అమ్మ. "నీ టీ ఎవరిక్కావాలి.. నేను బెల్లం టీ తాగుతాను," అని అమ్మ చెప్పేది వినిపించుకోకుండా వాళ్ళింటికి బయలుదేరాను. "రండి మనవడ గారా.. రండి" ఆవిడ ఎప్పటిలాగే ఆహ్వానించింది. ఆవిడలోనే కాదు, వాళ్ళింట్లో కూడా చాలా మార్పు కనిపిస్తోంది. పాత చీరలో, మెళ్ళో పసుపు తాడుతో ఉందావిడ. నేను చూడడం గమనించి కొంగు భుజం చుట్టూ కప్పుకుంది. మనిషి బాగా వంగిపోయినా మాటలో కరుకుదనం తగ్గలేదు. నరసింహ మూర్తిగారు మంచంలో ఉన్నారు. కొంచం ఇబ్బందిగా అనిపించిది నాకు ఆ వాతావరణం.

"ఉజ్జోగం సేత్తన్నారంటగా.. అబ్బాయి సెప్పేడు. జాగర్త నాయినా.. అమ్మా, నాయినా జాగర్త.. ఆళ్ళ పేనం నీమీదే ఉన్నాది.. నువ్వే దాటించాలి.." ఆవిడ గొంతులో నేనెప్పుడూ వినని వైరాగ్యం. ఇది నేను ఊహించని వాతావరణం. కోడలు ఎక్కడా కనిపించలేదు. "అమ్మాయ్.. మనవడగారొచ్చేరు.. టీ ఎట్టియ్యి.. పనజ్దారెయ్యకు.. ఆరికి బెల్లం టియ్యంటే ఇష్టం.." అన్నేళ్ళ తర్వాత కూడా ఆవిడ నా ఇష్టాన్ని గుర్తు పెట్టుకోడం కదిలించింది నన్ను. అంతకు మించి లోపలి గదిలో నుంచి ఎలాంటి స్పందనా రాక పోవడం ఆలోచనలో పడేసింది. అప్పుడు చూశాను వంటింటికి తాళం. పరిస్థితి పూర్తిగా అర్ధమయ్యింది.

"అమ్మిచ్చిందండీ.. ఇప్పుడే తాగేను.. ఇంక ఇప్పుడేమీ తాగలేను" అన్నాను నమ్మకంగా.. కాసేపు మాట్లాడి ఇంటికి వచ్చేశాను. ఆవిడా, నరసింహ మూర్తిగారూ వాళ్ళ గంజి వాళ్ళు వేరుగా కాచుకుంటున్నారుట. మిగిలిన కాసింత భూమినైనా తన పిల్లలకి మిగల్చాలని మొత్తం పెత్తనం కోడలు తీసుకుందిట. పరిస్థితి అంతవరకూ వచ్చినా వెంకాయమ్మగారు కోడలినే తప్పు పడుతోంది తప్ప, కొడుకుని పల్లెత్తు మాట అనడం లేదుట.. వంటి మీది నగలన్నీ కరిగిపోవడంతో ఇల్లు కదిలి రాలేకపోతోందిట. తప్పని పరిస్థితుల్లో ఎప్పుడైనా రాత్రి వేళ మా ఇంటికి వచ్చి నాన్న దగ్గర చేబదులు పట్టుకెడుతోందిట. నేను గుచ్చి గుచ్చి అడిగితే అమ్మ చెప్పిన సంగతులివి.

బస్సులో వెళ్తున్నాను కానీ ఆలోచనలన్నీ వెంకాయమ్మ గారి చుట్టూనే తిరుగుతున్నాయి. ఎలాంటి మనిషి..ఎలా అయిపోయింది.. ఊరందరి అవసరాలకీ ఆదుకున్న మనిషికి ఇప్పుడు ఒకరి ముందు చెయ్యి సాచడం ఎంత కష్టం? "నాన్నగారు వాళ్ళింటికి వెళ్ళడం కూడా ఆవిడ ఇష్ట పడడం లేదు.. ఎప్పుడో ఓసారి తనే వస్తోంది.. కొబ్బరి తోట దింపుల మీద వచ్చే డబ్బులతో ఆయనా, ఆవిడా కాలక్షేపం చేస్తున్నారుట," అమ్మ చెప్పిన మాటలు పదే పదే గుర్తొచ్చాయి. బాధ పడడం మినహా ఏం చేయగలను నేను?

కొడుకు ఇక ఎప్పటికీ ఇంటికి అతిధి మాత్రమే అనే నిజం నెమ్మదిగా అర్ధం కావడంతో కష్టపడి మా ఇంట్లో ఫోన్ పెట్టించారు నాన్న. టెలిఫోన్ కనెక్షన్ కోసం జనం ఏళ్ళ తరబడి తపస్సు చేసిన రోజులవి. వారానికో ఉత్తరం, ఒక ఫోన్.. అలా ఉండేది కమ్యూనికేషన్. ఓ ఆదివారం సాయంత్రం ఇంటికి ఫోన్ చేసినప్పుడు "ఉదయాన్నే నరసింహ మూర్తి గారు పోయార్రా.. నాన్నగారింకా వాళ్ళింటి దగ్గరే ఉన్నారు" అని అమ్మ చెప్పిన వార్త పిడుగు పాటే అయ్యింది నాకు. అమ్మతో సహా అందరూ వెంకాయమ్మ గారి పసుపు కుంకాల గురించి మాత్రమే బాధ పడుతున్నారు.. కానీ అంత పెద్ద వయసులో, రాజీ పడ్డం అలవాటు లేని మనస్తత్వం ఉన్న ఆవిడ ఒంటరిగా ఎలా బండి లాగించగలదు?

దేవుడు ఆవిడకి తీరని అన్యాయం చేశాడనిపించింది.. డక్కామక్కీలు తినగలిగే వయసులో చేతినిండా భాగ్యాన్నీ, అధికారాన్నీ ఇచ్చి, సాఫీగా సాగాల్సిన చివరి రోజుల్లో ఇన్ని పరిక్షలు పెట్టడం ఏమి న్యాయం అనిపించింది.. ఏ పని చేస్తున్నా నా ఆలోచనల నిండా వెంకాయమ్మ గారే. కేవలం కొడుకు మీద చూపించిన అతి ప్రేమకి ఇంత శిక్ష అనుభవిస్తోందా? అనిపించింది. మూడు రోజుల తర్వాత, ఆఫీసుకి ఫోనొచ్చింది. ఇంటినుంచి అమ్మ.. "వెంకాయమ్మ గారు చనిపోయారు.. " అదిరి పడ్డాను నేను.

"నరసింహ మూర్తి గారు పోయినప్పటి నించీ తిండి తినలేదు, నీళ్ళు తాగలేదు.. నిద్ర అన్నది అసలే లేదు.. పొద్దున్నే ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు. డాక్టరుని తీసుకొస్తే ఆయన చెప్పాడు ఆవిడ చనిపోయిందని... అదృష్ట వంతురాలు.. పసుపుకుంకాలతో పార్వతీదేవిలా..." అమ్మ చెబుతూనే ఉంది కానీ నాకు వినిపించడం లేదు.. తర్వాత ఇంకెప్పుడూ నాకు బెల్లం టీ తాగాలనిపించలేదు.

మంగళవారం, డిసెంబర్ 15, 2009

కుర్రాళ్ళు

నిన్న మొన్నటి వరకూ మిత్రుల మధ్య జరిగే చర్చల్లో ఈతరం కాలేజీ కుర్రాళ్ళ గురించి టాపిక్ తరచూ వస్తూ ఉండేది. ఇప్పటి పిల్లలు మరీ 'కెరీర్ ఓరియంటెడ్' గా తయారయ్యారనీ, తమ చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకునే ఓపికా తీరికా వాళ్లకి లేవనీ ఏకాభిప్రాయానికి వచ్చేవాళ్ళం. ఏం జరుగుతోందో తెలుసుకునే ఆసక్తే లేని వాళ్ళనుంచి ఇక స్పందన ఏం ఆశిస్తాం??

మహాత్మాగాంధీ, వివేకానందుడూ లాంటి పెద్దల మొదలు యెంతో మంది ఎన్నో రకాలుగా యువతకి కర్తవ్య బోధ చేశారు. యువతే దేశానికి చోదక శక్తి అన్నారు. స్వాతంత్ర సంగ్రామం లో భగత్ సింగ్ లాంటి యువకుల పాత్ర ప్రత్యేకం, ఉత్తేజభరితం. మహాత్ముడు ప్రారంభించిన (మధ్యలో ఆపేసిన అనేక నిరసనలతో సహా) ప్రతి ఉద్యమంలోనూ యువత పాత్ర కీలకం.

స్వాతంత్ర్యం వచ్చాక.. అప్పటి వరకూ కన్న కలలు ఒక్కొక్కటిగా కరిగిపోవడం మొదలు పెట్టాక.. నిరుద్యోగ సమస్య దేశ ప్రజల్లో నిర్వేదాన్ని నింపేశాక 'మేము కొత్త వెలుగు చూపిస్తాం' అంటూ వచ్చాయి వామపక్షాలు. వ్యవస్థలో వేరుపురుగులా ప్రవేశించిన 'రాజకీయాన్ని' సంస్కరించాలంటే ఉద్యమ బాట పట్టడమే ఏకైక పరిష్కారం అని మనసా వాచా నమ్మారు వేల మంది. ఇక్కడా అగ్ర తాంబూలం యువతకే.

డెబ్భై, ఎనభై దశకాల్లో కాలేజీల్లోనూ, యూనివర్సిటీ కాంపస్ లలోనూ విద్యార్ధులు 'ఎర్రట్ట పుస్తకాలు' పట్టుకుని తిరగడం సామాన్య దృశ్యం. విద్యార్ధి రాజకీయాలు ఒక కొత్త మలుపు తీసుకున్నాయి. విద్యార్ధి సమస్యల మొదలు విధాన నిర్ణయాల వరకూ ఎన్నో అంశాల మీద వీధులకెక్కి పోరాటాలు చేశారు చైతన్యవంతులైన విద్యార్ధులు. ఉద్యమం కోసం తమ ప్రాణాలు బలిపెట్టడానికి సైతం సిద్ధ పడ్డారు.

విద్యార్ధి లోకంలో మండల్ కమిషన్ నివేదిక రేపిన చిచ్చు అంతా ఇంతా కాదు. గడిచిన రెండు దశాబ్దాలలో అంత తీవ్రమైన విద్యార్ధి ఉద్యమం మరొకటి జరగలేదనే చెప్పాలి.. ఓ పక్క రాజకీయ యవనికపై జరిగిన మార్పులతో చీలికలు పీలికలైన వామపక్ష రాజకీయం, మరోపక్క ప్రపంచీకరణ ఫలితంగా అన్నిరంగాలలోనూ పెరిగిన కార్పోరేటీ కరణ.. వెరసి దశాబ్ద కాలం లోపే సామాజికంగా ఊహించని మార్పులు.

విద్యారంగం ప్రభుత్వం నుంచి ప్రైవేటు వైపుకి పయనిస్తుండడంతో విద్యాలయాల్లో 'క్రమశిక్షణ' పెరగడం, అన్నిరంగాలలోనూ పెరిగిన పోటీ ఫలితంగా చదువునుంచి దృష్టిమళ్లిస్తే కెరీర్లో వెనుకబడతామన్న భయం విద్యార్ధులని ఉద్యమాలకి దూరం చేసింది. ఇదిగో ఈ నేపధ్యం నుంచి వచ్చిన వ్యాఖ్యే ఇప్పటి పిల్లలు మరీ కెరీర్ ఓరియంటెడ్ గా తయారయ్యారనీ, చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకునే ఓపికా, తీరికా వాళ్లకి లేవనీ..

ఉన్నట్టుండి ఇప్పుడు ఒకటి కాదు, ఏకకాలంలో రెండు ఉద్యమాలు మొదలయ్యాయి రాష్ట్రంలో. మాలాంటి వాళ్ళని ఆశ్చర్య పరుస్తూ ఈ రెండు ఉద్యమాలలోనూ కీలక పాత్ర పోషిస్తున్నది విద్యార్ధులే. బస్సులని, ఆస్తులని ద్వంసం చేయడం మొదలు తమని తాము దగ్ధం చేసుకోడం వరకూ ఎంతకైనా తెగించి పోరాడుతున్నారు తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాల విద్యార్ధులు. కేవలం ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే వాళ్ళు మాత్రమే కాదు, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్ధులూ ఈ ఉద్యమాలలో పాల్గొంటున్నారు.

యువకుల్లో పొంగే వేడి రక్తం ఆవేశాని రగిలిస్తుంది. ఆవేశం పెరిగిన చోటా సహజంగానే ఆలోచన నశిస్తుంది. ఫలితంగా.. తాము నమ్మిన నాయకుడు ఇచ్చిన ఆదేశాలని అమలు పరచడానికి మాత్రమే పరిమితమవుతారు కుర్రాళ్ళు. జరుగుతున్న పరిణామాలని విశ్లేషించుకునే ఓపికా, తీరికా వాళ్లకి ఉండవు. అసలు ఆ దిశగా ఆలోచనలే సాగవు.

ప్రాణాలను పణంగా పెట్టి సాగించే పోరాటం వల్ల ఈ కుర్రాళ్ళు ఏం సాధిస్తారన్నది పూర్తిగా నాయకుడి మీద ఆధార పడుతుంది. ఆ నాయకుడు మహాత్ముడైతే వాళ్ళది దేశ స్వాతంత్ర్య సంగ్రామం అంతటి ఉదాత్త ఉద్యమం అవుతుంది.. స్వార్ధ రాజకీయ నాయకుడైతే అర్ధం లేని త్యాగం అవుతుంది.

గురువారం, డిసెంబర్ 10, 2009

నాలోనేను

ఆత్మవిశ్వాసానికీ, అహంభావానికీ మధ్య ఉన్నది అతి సన్నని రేఖ. మనకి ఆత్మవిశ్వాసంగా అనిపించిన భావనే ఎదుటివారికి అహంభావంగా కనిపించొచ్చు. 'నేను' అనుకోవడంలో ఆత్మవిశ్వాసం కొందరికి వినిపిస్తే, అహంభావం మరికొందరికి కనిపించొచ్చు. అది చూసే దృష్టికి సంబంధించిన విషయం. తెలుగు సినిమా రంగంలో 'బహుముఖ ప్రజ్ఞాశాలి' గా పేరు తెచ్చుకున్న భానుమతీ రామకృష్ణ ఆత్మకథ 'నాలోనేను' కూడా అంతే.

శాస్త్రీయ సంగీతం అయినా, సినిమా నటన అయినా లేదా జ్యోతిష్య శాస్త్రం అయినా.. తను అడుగు పెట్టిన రంగాన్ని పైపైన పరిశీలించి ఊరుకోకుండా, లోతుగా పరిశోధించి తనదైన ముద్ర వేయడం భానుమతి ప్రత్యేకత. తను ప్రవేశించిన ఏ రంగాన్ని గురించైనా సాధికారంగా, ముక్కుసూటిగా మాట్లాడడం భానుమతికే చెల్లు. ఫలితంగా ఆమె ఆత్మవిశ్వాన్ని చూసిన వాళ్ళ కన్నా, అహంభావాన్ని గురించి మాట్లాడేవాళ్ళే ఎక్కువ.

'అత్తగారి కథలు' ద్వారా ఆంధ్ర పాఠకులకి దగ్గరైన భానుమతి తన సుదీర్ఘ నట ప్రస్థానాన్ని 'నాలోనేను' పేరిట అక్షరబద్ధం చేశారు. చేయితిరిగిన రచయిత్రి కావడం వల్ల, చదివించే గుణం పుష్కలంగా ఉండేలా పుస్తకాన్ని తీర్చి దిద్దారు. 1994 సంవత్సరానికి గాను ఉత్తమ జీవిత చరిత్రగా ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి పొందిందీ పుస్తకం. చిన్నప్పుడు తనని వీధిబడిలో చేర్చడంతో మొదలు పెట్టిన కథనం ఆద్యంతమూ ఆసక్తిగా సాగింది. స్కూలు వార్షికోత్సవంలో తొలిసారిగా లక్ష్మీదేవి, శ్రీరాముడి వేషాలు వేసిన జ్ఞాపకాలని అపురూపంగా గుర్తు చేసుకున్నారు భానుమతి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మేకప్ అంటే మొదటినుంచే చిరాకేనట భానుమతికి. స్కూలు వార్షికోత్సవానికి అక్కమ్మ తనకి మేకప్ చేసిన ముహూర్తం బలమైనదని ఆమె నమ్మకం. భానుమతి తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారికి తన కూతురిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అంతటి గాయనిగా చూసుకోవాలని కోరిక. అందుకోసం ప్రయత్నాలు చేస్తుండగానే 'వరవిక్రయం' సినిమాలో కాళింది పాత్రలో నటించే అవకాశం వచ్చింది ఆమెకి.

అటు ఇష్టం లేని నటన చేయలేక, ఇటు తండ్రిని నొప్పించలేక ప్రతిరోజూ ఏడిచే వారట ఆమె. అదొక్కటే కాదు, తను కంట తడి పెట్టిన సందర్భాల్ని ఆమె వివరిస్తుంటే పాఠకులకి ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే భానుమతికి ఏడిపించడమే తప్ప ఏడవడం తెలీదని బలమైన నమ్మకం మరి. ముక్కుసూటిగా మాట్లాడడం, నిక్కచ్చిగా వ్యవహరించడం భానుమతికి తండ్రి నుంచి వచ్చిన లక్షణాలు అనిపిస్తుంది, నిర్మాత, దర్శకులతో ఆమె తండ్రి వ్యవహరించిన తీరు చదివినప్పుడు.

కథానాయికగా నిలదొక్కుకుంటున్న కాలంలోనే రామకృష్ణతో ప్రేమలో పడ్డారు భానుమతి. పుస్తకం లో 'రామకృష్ణ ప్రేమ' చాప్టర్ చదువుతుంటే ఏదో సస్పెన్స్ నవల చదువుతున్న భావన కలుగుతుంది. ఇరు వైపులా తల్లి దండ్రుల ఇష్టానికి విరుద్ధంగా జరిగిన పెళ్లి వాళ్ళది. ఇంట్లోనుంచి పారిపోయిన క్షణాల్లో తన మానసిక స్థితిని ఆవిడ వర్ణించిన తీరు అపూర్వం. 'ఓహో..ఓహో.. పావురమా..' పాటకి స్ఫూర్తి ఒక ఆంగ్ల గీతం అని చెప్పినా, బెంగాలీ సినిమాలు చూపించి అక్కినేని నాగేశ్వర రావుకి తనూ, రామకృష్ణ నటన నేర్పించామని చెప్పినా భానుమతికే చెల్లింది.

తన వ్యక్తిగత జీవితం, సినిమా జీవితం, రచన వ్యాసంగం, ఇతర వ్యాపకాలతో పాటు ఆనాటి సామాజిక పరిస్థితులనూ పరామార్శ చేశాను భానుమతి. సినిమా రంగంలో వస్తున్న మార్పులనూ సూక్షంగా చెప్పారు తన ఆత్మకథలో. తను ప్రావీణ్యత సాధించిన ఒక్కో రంగాన్ని గురించీ ఒక్కో పుస్తకం రాయగలరు ఆమె. కానీ మొత్తం అంశాలన్నింటినీ కేవలం 246 పేజీల లోకి కుదించడం, ఎక్కడా సమగ్రత చెడకుండా జాగ్రత్తపడడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముందుమాటలో డి.వి. నరస రాజు చెప్పినట్టుగా ఈ పుస్తకం చదవడం మొదలు పెడితే పూర్తి చేయకుండా పక్కన పెట్టలేం. (శ్రీ మానస పబ్లికేషన్స్ ప్రచురణ, వెల రూ. 125.).

మంగళవారం, డిసెంబర్ 08, 2009

పా

అతనో పన్నెండేళ్ళ కుర్రాడు.. తెలివైన వాడు, చురుకైన వాడు.. యెంత పెద్ద లేక్కనైనా క్షణంలో చేసేస్తాడు.. తన క్రియేటివిటీ ఉపయోగించి తయారు చేసిన మోడల్ కి స్కూల్ ఎగ్జిబిషన్ లో ప్రైజు గెలుచుకుంటాడు. ఐతే ఆ కుర్రవాడు పుట్టుకతోనే వృద్ధుడు.. జన్యు పరమైన లోపాల వల్ల కలిగే ప్రోజేరియా అనే వ్యాధి బారిన పడ్డాడు, పుట్టుకతోనే.. ఆ కారణంగానే అతని రూపు రేఖల్లో బాల్యానికి బదులు వృద్ధాప్యం కనిపిస్తుంది.. రూపం లో వృద్ధుడైనా చేతల్లో అతను పసివాడు.. స్నేహితులతో ఆడి పాడతాడు.. ఇంట్లో అమ్మ మీద అలుగుతాడు, అమ్మమ్మ ని ఏడిపిస్తాడు.. అబ్బో అతని అల్లరికి అంతే లేదు.. ఆ కుర్రాడి పేరు అరు.

అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ఏబీ కార్పోరేషన్ నిర్మించిన 'పా' సినిమాకి దర్శకుడు ఆర్. బాలకృష్ణన్ (బాల్కి). తన సుదీర్ఘ నట ప్రస్థానంతో ఎన్నో చాలెంజింగ్ పాత్రల్లో నటించిన అమితాబ్ కి దొరికిన మరో చాలెంజింగ్ పాత్ర అరు. ఇంతకాలం నలుపు తెలుపు కలగలిసిన ఒత్తైన క్రాఫ్, గడ్డం తో, సూట్ ధరించి గంభీరంగా డైలాగులు చెప్పిన అమితాబ్ ఈ సినిమా కోసం ప్రోజేరియా సోకిన పన్నెండేళ్ళ బాలుడిగా మారిపోయారు. ఒత్తైన క్రాఫ్ స్థానం లో నున్నని గుండు, గంభీరమైన కంఠ స్వరానికి బదులు సన్నగా కీచుగా వినిపించే గొంతు, ఖరీదైన సూట్ కి బదులు మామూలు స్కూలు యూనిఫాం. స్కూల్లో జరిగే ఎగ్జిబిషన్ కి స్టాఫ్ రూం లో ఉన్న గ్లోబ్ దొంగిలించి, దానికి తెల్ల పెయింట్ పూసి 'సరిహద్దులు లేని ప్రపంచం' అనే కాన్సెప్ట్ తో ప్రదర్శనలో పెట్టి కప్పు గెలుచుకునే తెలివి తేటలు అరు సొంతం.

అరు తల్లి విద్య (విద్యాబాలన్) గైనకాలజిస్ట్. తను, తల్లి, అమ్మమ్మ.. వాళ్ళింట్లో ఉండేది ముగ్గురే. బళ్ళో మేష్టర్లందరికీ అతను ప్రియమైన విద్యార్ధి. క్లాసు పిల్లలందరికీ ఇష్టుడు. అతని ఆరోగ్యం బహు సున్నితమని మేష్టర్లకే కాదు, పిల్లలందరికీ తెలుసు.. అందుకే అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఎగ్జిబిషన్ కి ముఖ్య అతిధిగా ఆ స్కూలు పూర్వ విద్యార్ధి, యువ ఎంపీ అమోల్ (అభిషేక్ బచ్చన్) హాజరై అరు కి బహుమతి అందించడంతో వార్తా చానళ్ళ కంట్లో పడతాడు అరు. ఫలితం.. అతను తన స్వేచ్చని కోల్పోయే పరిస్థితి.. 'ఎంపీ వల్లే ఇదంతా..' అని అమోల్ మీద కోపం తెచ్చుకుంటాడు. ఆ తర్వాత అరు, అమోల్ మంచిస్నేహితులవుతారు.

రాజకీయాలని కెరీర్ గా తీసుకుని, ఆ రంగంలో 'మంచి' ని పెంచాలని తపన పడే వ్యక్తి అమోల్. ముప్పై రెండేళ్ళు వచ్చినా అతను పెళ్లి చేసుకోక పోవడం అతని తండ్రి (పరేష్ రావల్) కే కాదు, చాలామందికి మింగుడు పడని విషయం. రాజకీయంగా అతన్ని దెబ్బ తీయడం కోసం అతని శత్రువులు టీవీ చానళ్ళలో అతని మీద వ్యతిరేక కథనాలు ప్రచారం చేయిస్తే, వాటికి సమాధానంగా దూరదర్శన్ ద్వారా ప్రైవేటు వార్తా చానళ్ళ లో పనిచేసే జర్నలిస్టుల అవినీతిని బట్ట బయలు చేస్తాడు అమోల్. (మన చానళ్ళలో వస్తున్న కథనాల తీరు తెన్నులు చూస్తుంటే మనం కూడా ఈ తరహా 'ఆపరేషన్' లను త్వరలోనే చూస్తామేమో అనిపిస్తోంది.) చిత్రంగా మొదలైన అరు-అమోల్ ల స్నేహం అంతే చిత్రంగా బలపడుతుంది. తనకోసం చేసిన రుచిలేని చప్పని కిచిడీని తల్లి తినడాన్నే భరించలేని అరు కి, తనకోసం తల్లి చేసిన త్యాగం గురించి తెలుస్తుందొక రోజున.

'ప్రోజేరియా' వ్యాధితో బాధపడే పిల్లవాడు అనే అంశాన్ని మినహాయిస్తే, బాగా నలిగిన కుటుంబ కథ ఇది. ఈ సినిమాకి బలం అరు పాత్ర అయితే, సినిమాని నిలబెట్టింది అరు గా అమితాబ్ నటన. సుమారు అరడజను సన్నివేశాల్లో అమితాబ్ ప్రదర్శించిన నటనకి తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి. 'ఇంతింతై..' అన్నట్టుగా కథ ముందుకు జరుగుతున్నా కొద్దీ అమితాబ్ తన నట విశ్వరూపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. అతనికి పోటీగా నటించిన ఘనత విద్యా బాలన్ ది. ఆత్మగౌరవం ఉన్న వనితగా బలమైన పాత్ర దొరికింది ఈ అమ్మాయికి. కొన్ని కొన్ని సన్నివేశాల్లో అమితాబ్-విద్యా ల నటన నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. అభిషేక్ గురించి, ఆ మాటకొస్తే మిగిలిన నటీనటుల గురించి, చెప్పుకోడానికి పెద్దగా ఏమీలేదు.

మొదటి సగం చకచకా సాగినప్పటికీ, రెండో సగానికి వచ్చేసరికి కథనం కొంచం మందగమనంతో సాగింది. మరికొన్ని బలమైన సన్నివేశాలు రాసుకుని ఉండాల్సింది. పతాక సన్నివేశంలో సెంటిమెంట్ పతాక స్థాయికి చేరింది. అరు పాత్రనే సినిమాకి కర్త, కర్మ క్రియ చేసింది. సాంకేతిక విభాగాల్లో మొదట చెప్పుకోవాల్సింది మేకప్ గురించి.. హాలీవుడ్ రూపశిల్పి స్టీఫన్ తెర వెనుక శ్రమ తెరమీద స్పష్టంగా కనిపిస్తుంది.. పీసీ శ్రీరాం కెమెరా, ఇళయరాజా సంగీతం గురించి ఇవాళ కొత్తగా చెప్పుకోడానికి ఏమీ లేదు.. ఎప్పటిలాగే బాగా చేశారు ఇద్దరూ. నేపధ్య సంగీతం లో అక్కడక్కడా ఇళయరాజా సంగీతం చేసిన పాత తెలుగు సినిమాలు జ్ఞాపకం వస్తాయి. అమితాబ్, విద్యాబాలన్ ల కోసం చూడాల్సిన సినిమా ఇది.

ఆదివారం, డిసెంబర్ 06, 2009

చిన్నారి దేవత

ఉన్నట్టుండి ఓ ఏడేళ్ళ బాలిక భవిష్యత్తు చెప్పడం మొదలు పెట్టింది. వార్తల కోసం ఆవురావురంటున్న వార్తా చానళ్ళకి ఈసంగతి తెలిసింది. ఆ అమ్మాయి పూర్వాపరాలేమిటి? ఆమె చెబుతున్నది ఎంతవరకూ నిజం? అన్న విషయాలు తెలుసుకునే తీరిక, ఓపిక సహజంగానే వాళ్ళెవరికీ లేదు.. ఒకరిద్దరికి అనిపించినా, తాము ఆ పరిశోధనలో ఉంటే మరేవేఅరో ఆ న్యూసు బ్రేకేస్తారేమో అన్న టెన్షన్.. వెరసి ఒక్క రోజులోనే ఆ బాలిక వార్తల్లో వ్యక్తి అయిపోయింది.. ఇప్పుడదే ఆ చిన్నారికి శాపం గా మారింది.

'శాంభవి' పేరు తెలియని వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర దేశంలో ఎవరూ లేరు. చానళ్ళు, పత్రికలు పోటీపడి ఆ అమ్మాయికి ఉన్న 'అతీంద్రియ శక్తులని' ప్రచారం చేయడంతో ఇప్పుడామె ఎక్కడికి వెళ్ళినా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. ఆమె మాట్లాడే మాటలని ఆణిముత్యాలుగా స్వీకరించే వాళ్ళు, ఆమె మౌనానికి కూడా కొత్త కొత్త అర్ధాలు వెతికే భక్తులు పుట్టుకొస్తున్నారు. అప్పటికే పంజరంలో చిలుకగా మారిన ఆ అమ్మాయి జీవితంలో ఊహించలేనంత మార్పు వచ్చింది.. ఇనుప పంజరం, బంగారు పంజరం గా మారింది.

కర్నూలు జిల్లా సూర్యనందిలో ఆమెకోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించడానికి, అందుకు బౌద్ధ గురువు దలైలామా ని ఆహ్వానించడానికి తెర మీద ఏర్పాట్లు జరుగుతుండగానే, తెర వెనుక రాబోయే సంపదలో పంచుకోబోయే వాటాలకి అనుగుణంగా తమ వంతు ఖర్చులు పెట్టుకునే పెట్టుబడి దారుల సంఖ్య, వాళ్ళ బలం మరింత పెరగడం మొదలయ్యింది. ఫలితం.. శాంభవి చుట్టూ ఉన్న ఉచ్చు మరింత బలపడింది. దలైలామా వస్తారా రారా అని చర్చా కార్యక్రమాలు నిర్వహించాయి టీవీ చానళ్ళు.

మనమందరం వార్తలు చదువుతూ, చూస్తూ, ఎప్పటిలాగే ఎలాంటి స్పందనా లేకుండా ఉండగా శాంభవి హక్కుల కోసం పోరాడడానికి ఒక సంస్థ ముందుకొచ్చింది. ఆమె ఉండాల్సింది గుడిలో కాదని, బడిలో అనీ వాదించింది. హక్కుల కమిషన్ ని ఆశ్రయించింది. కేసు విచారణ మొదలయ్యింది. ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి.. మళ్ళీ మీడియాకు వార్తల వరద. శాంభవి తల్లి ఎవరో ఇప్పటివరకూ తెలీదు. తండ్రి, 'సంరక్షకురాలు' చెబుతున్న విషయాలు పొంతన లేవు.

ఇదిలా ఉండగా, శాంభవి తరపున వాదిస్తున్న సంస్థ మీద ఎదురు దాడి మొదలయ్యింది. అన్ని మతాలూ పిల్లలకి దేవుడితో సమ హోదాని ఇచ్చాయే తప్ప, ఏమతమూ పిల్లలని దేవుళ్ళుగా మార్చమనలేదే? శాంభవిని తెరపైకి తెచ్చిన వర్గానికి స్వప్రయోజనాలు ఉన్నట్టే, ఆమె తరపున పోరాడే సంస్థకీ పోరాటం వల్ల ప్రయోజనాలు ఉండి ఉండొచ్చు. కానీ ఇక్కడ అంశం సున్నితమైనది.. ఒక ఏడేళ్ళ పిల్ల భవిష్యత్తుకి సంబంధించింది. 'అతీంద్రియ శక్తులు' ఉండడం వేరు.. ఉన్నాయన్న ప్రచారం జరగడం వేరు.. ఇప్పటివరకూ జరిగింది కేవలం ప్రచారమే.

మన పుణ్యభూమిలో దేవుడి ప్రతినిదులకి లోటు లేదు.. ఈ మతం ఆ మతం అని కాకుడా.. కొండొకచో మతాలకి అతీతంగా మనకి బోల్డంత మంది నడిచే దేవుళ్ళు. యాదృచ్చికమో, మరేమో తెలీదు కానీ వీళ్ళలో చాలామంది కరువు ప్రాంతాల్లో స్థావరం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. కొందరు తాము సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని సమాజ సేవకి ఖర్చు పెడుతున్నారు.. సంతోషం. వీళ్ళ గతాలు మనం అడగకూడదు.. అది దేవ రహస్యం. వర్తమానానికి వస్తే, జరుగుతున్నవి చూస్తుంటే, శాంభవి ని వీళ్ళ బాటలోకి 'నెట్టే' ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయనిపిస్తోంది. ఆమెకి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను.

శుక్రవారం, డిసెంబర్ 04, 2009

దృశ్యాదృశ్యం

భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమయ్యేది జన హితం కోసమే. ప్రజలకు తాగునీరు, సాగు నీరు అందించడం కోసమే.. అయితే ఒకసారి ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యాక, ప్లాన్ లో చివరి నిముషం మార్పులు ఎందుకు జరుగుతాయి? తయారయ్యే ప్రాజెక్టు మొదట వేసిన ప్లానుకి పూర్తి భిన్నంగా ఉంటుంది ఎందుకని? కాంట్రాక్టర్లు-అధికారులు-రాజకీయనాయకులు అనే బలమైన ఇనుప త్రికోణ చట్రం ప్రాజెక్టు పనులని ఎలా ప్రభావితం చేస్తుంది?

ఐదారేళ్ళ క్రితం వరకూ ఇవి అతి కొద్దిమందికి మాత్రమే తెలిసిన విషయాలు. ఇప్పుడంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 'జలయజ్ఞం' పై వెల్లుతుతున్న విమర్శల పుణ్యమా అని సామాన్యులు సైతం ఈ 'ఇనుప త్రికోణం' బలాన్ని అంచనా వేయగలుగుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని కథావస్తువు గా తీసుకుని ఆరేళ్ళ క్రితం తాను రాసిన 'దృశ్యాదృశ్యం' నవలలో నీటి పారుదలకి సంబంధిన ఎన్నోకీలకమైన అంశాలను అత్యంత సరళమైన భాషలో వివరించారు రచయిత్రి చంద్రలత.

ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకునే వివిధ వర్గాలు, వాళ్లకి కలిగే ప్రయోజనాలు, ఇబ్బందులు, అప్పటివరకూ నది ఒడ్డున జీవించి కేవలం ప్రాజెక్టు కారణంగా తమ ఊరు మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఏమీ చేయలేని అసహాయతతో కొత్త ఊరిని నిర్మించుకునే జనం, కేవలం మానవ జీవితాల్లోనే కాదు, సమస్త ప్రకృతిలోనూ ప్రాజెక్టు నిర్మాణం వల్ల కలిగిన మార్పులు.. ఇలా ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలించి, కీలకమైన పర్యావరణం, నిర్మాణ శాస్త్రాలని పరిశోధించి, సంబంధిత నిపుణులతో చర్చించి, నోట్సు తయారు చేసుకుని దాదాపు ఆరేళ్ళ పరిశ్రమ తర్వాత 2004 లో చంద్రలత వెలువరించిన నవల ఇది.

కథాస్థలం రాష్ట్రంలో ఫలానాచోట అని స్పష్టంగా చెప్పలేదు. ప్రాజెక్టు కట్టే ప్రతి ఊరికీ ఈకథ వర్తిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెనడా లో పుట్టి పెరిగి, అక్కడే భారీ ఆనకట్టల మీద పరిశోధన చేస్తున్న అక్షత తన పరిశోధనలో భాగంగా తల్లి యశోద పుట్టిన ఊరికి రావడం తో నవల ప్రారంభం అవుతుంది. తన మామ పట్టాభి పార్లమెంట్ సభ్యుడు. ఆయన తన భార్య వత్సల, ఇద్దరు పిల్లలతో పట్నంలోనే ఉంటూ, అప్పుడప్పుడూ ఊరికి వచ్చి పోతూ ఉంటాడు.

ఊరిలో ఉన్న ఇంట్లో పెత్తనం అంతా వృద్ధురాలైన వంటమనిషి రాగవ్వదే. జీపు డ్రైవరు పాండు, పట్టాభి కి ఊళ్ళో కుడి భుజంగా మసలే యువకుడు శ్రీను.. వీళ్ళు ముగ్గురూ అక్షత ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. రాగవ్వ మొదలు ఊరిజనం లో వయసుమళ్ళిన ప్రతి ఒక్కరూ అక్షతని చూసి ఆమె మేనమామ 'కేశవ' ను గుర్తు చేసుకుంటారు. కేశవ ఆ యింటి పెద్ద కొడుకు. అతన్ని గురించి తన తల్లి కానీ, తన దగ్గరే గడిపిన అమ్మమ్మ కానీ ఎప్పుడూ పెద్దగా తల్చుకోక పోవడం ఆశ్చర్య పరుస్తుంది అక్షతని.

ఇక శ్రీను.. బాల్యం అంతా నదికి దగ్గరలో ఉన్న 'పాతూరి' లో గడిపి, జ్ఞానం తెలుస్తున్న వయసులో ప్రాజెక్టు కారణంగా 'కొత్తూరి'కి వలస వచ్చిన తరానికి ప్రతినిధి. తన వాళ్ళందరినీ పోగొట్టుకున్న ఏకాకి. నదన్నా, పశువులన్నా విపరీతమైన ప్రేమ ఉన్నవాడు. "నేను నదిని చూడడానికి వచ్చాను" అని అక్షత అంటే.. "చాలా ఆలస్యం చేసినారు.. నది చిక్కి శల్యమైన పొద్దు వచ్చినారు.. నది ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాది," అంటాడు అతను.

పెద్దకట్ట (ప్రాజెక్టు) కట్టక ముందు ఊరి వారి జీవితం హాయిగా గడిచింది . నది పుణ్యమా అని నేలలో బంగారం పండేది. ప్రతి ఇంట్లోనూ ఉండే కుటుంబ కలహాలు మినహా, ఊరివాళ్ళకి పెద్ద కష్టం అంటూ ఉండేది కాదు. నదిలో చేపో, అడివిలో ఆకో,కాయో అన్నానికి అడ్డం పడేవి. కాయగూరలు, పూలు, పండ్లు, వంట చెరకు.. వేటికీ లోటు ఉండేది కాదు. ఊరి పెద్ద భూపాలయ్యది నలుగురికి సాయం చేసే చెయ్యి.

కాలం అవ్యక్త మధురంగా గడిచిపోతుండగానే నది మీద ప్రాజెక్టు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, తామంతా ఊరిని ఖాళీ చేయక తప్పదనీ తెలుస్తుంది గ్రామస్తులకి. ఇంజనీరింగ్ చదివిన భూపాలయ్య పెద్ద కొడుకు కేశవ అదే ప్రాజెక్టు కి జూనియర్ ఇంజనీర్ గా వస్తాడు. ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంతానికి కలిగే ప్రయోజనాలు అతనికి తెలిసినా, ముంపు ప్రాంతంగా తన ఊరిని మార్కు చేయాల్సి వచ్చినప్పుడు కదిలిపోతాడు సున్నిత మనస్కుడైన కేశవ.

ఓ పక్క ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉంటూనే తన పై అధికారి కూతురు 'బంగారి' తో ప్రేమలో పడతాడు కేశవ. తండ్రితో పోరాడి, కుటుంబ కట్టుబాట్లకి వ్యతిరేకంగా చెల్లెలు యశోద ని మెడిసిన్ చదివిస్తాడు. పాతూరి నుంచి కొత్తూరికి జనమంతా వలస రావడంలో భూపాలయ్య క్రియాశీల పాత్ర తీసుకుంటాడు. ఈ క్రమంలో కుటుంబ ఆర్ధిక పరిస్థితిలో మార్పు వస్తుంది. తండ్రికి ఆసరాగా ఉండడం కోసం, చదువు పూర్తి చేసిన పట్టాభి తల్లి పేరిట 'కౌసల్య కనస్ట్రక్షన్స్' ప్రారంభించి, ప్రాజెక్టు కి సంబంధించిన చిన్న చిన్న కాంట్రాక్టులు చేయడం మొదలు పెడతాడు.

ప్రాజెక్టు పనుల్లో తెర వెనుక జరుగుతున్న తతంగాన్ని కేశవ కన్నా పట్టాభే త్వరగా అర్ధం చేసుకుంటాడు. కాంట్రాక్టరు ఎదగాలంటే రాజకీయ నాయకుల, అధికారుల సహాయం అవసరమని గ్రహించి ఆ దిశగా పావులు కదుపుతాడు. పరిస్తితులతో రాజీ పడలేని కేశవ ఏంచేశాడు, అక్షత తల్లి యశోద కానీ, అమ్మమ్మ కానీ కేశవని ఎప్పుడూ ఎందుకు తలచుకోలేదు లాంటి ప్రశ్నలన్నింటికీ హృద్యమైన ముగింపు ద్వారా సమాధానాలు దొరుకుతాయి నవలలో.

'దృశ్యాదృశ్యం' పూర్తి చేశాక పాఠకులని వదలకుండా వెంటాడేవి రెండు..నది, కేశవ. నదిలో వచ్చిన మార్పులు, రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు కేశవలో చెలరేగే భావ సంఘర్షణ ఎప్పటికీ మర్చిపోలేం. ఈ నవలకి ముందు తను రాసిన 'రేగడి విత్తులు'నవలలో జరిగిన పొరపాట్లని సరి దిద్దుకున్నారు చంద్రలత. ఈ నవలలో ఏ పాత్రా అనవసరం అనిపించదు. ప్రతి పాత్రనీ కథలో భాగం చేశారు. నవలలో ప్రతి పాత్రకీ నదితోనూ, కేశవతోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉంటుంది. ఇదో అందమైన అల్లిక. ఎన్నో అంశాలని చర్చించినప్పటికీ ఎక్కడా ప్రధాన కథ పక్కదోవ పడుతోందన్న భావన కలగదు.

ప్రకృతి వర్ణనలలో తనది అందెవేసిన చేయి అని తొలి రెండు నవలలతోనే నిరూపించుకున్న చంద్రలత, శాంత, గంభీర వాతావరణాలే కాదు ప్రళయ భీభత్సాన్నీ తనదైన శైలిలో వర్ణించారు. ప్రాజెక్టు పూర్తయ్యి ఊరు నీళ్ళలో మునగడం ప్రారంభం కాగానే చేల మధ్య పుట్టలో ఉన్న త్రాచుపాము ప్రాణభయంతో చెట్టు కొమ్మని చుట్టుకోవడం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. యెంతో క్లిష్టమైన సాంకేతిక విషయాలకి, కుటుంబ కథను జోడించి ఆద్యంతం ఆసక్తికరంగా మలచారు రచయిత్రి. టెక్నికల్ విషయాలని కేశవ డైరీ రూపంలో ఇవ్వడం ద్వారా ఆసక్తిగా చదివించారు.

ప్రాజెక్టు వల్ల మాయమైపోతున్న చంద్రవంక చేప మొదలు, వాతావరణం లో వచ్చిన మార్పులు తట్టుకోలేకా, కొత్త పరిస్థితులకి అనుగుణంగా తమని తాము మార్చుకోలేకా తల్లడిల్లే అమాయకులైన గిరిజనుల జీవన విధానం ఏ మలుపు తిరిగిందో వివరించిన తీరు అద్భుతం. నేనైతే ఈ నవల గడిచిన వందేళ్ళలో వచ్చిన ఉత్తమ నవలల్లో ఒకటి అని చెబుతాను. ('దృశ్యాదృశ్యం,' ప్రభవ పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 354, వెల రూ. 125, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు.)

బుధవారం, డిసెంబర్ 02, 2009

కళాత్మక చౌర్యం

సృష్టి కి ప్రతిసృష్టి చేయడం మొదలు పెట్టిన ఘనత విశ్వామిత్రుడిది. ఇంద్రుడితో మాట పట్టింపు రావడంతో, తన తపశ్శక్తి ధారపోసి 'త్రిశంకు స్వర్గం' సృష్టించాడాయన. అంత కష్ట పడక్కరలేకుండా అదే సృష్టిని చక్కగా కాపీ చేయడం అన్నది ఎప్పుడు మొదలైందో ఇదమిద్దంగా తెలీదు. బహుశా విశ్వామిత్రుడికి ముందు నుంచే ఉండి ఉంటుంది. ఎటొచ్చీ చేసింది కాపీ అని ఎవరూ ఒప్పుకోరు. ఇంగ్లీష్ అంత ప్రబలంగా లేని రోజుల్లో 'స్ఫూర్తి పొందాం' అని చెప్పుకుంటే, ఇప్పటి వాళ్ళు 'ఇన్స్పైర్' అయ్యాం అని మాట దాటేస్తున్నారు.

ఈ స్ఫూర్తి పొందడం లేదా ఇన్స్పైర్ అవ్వడం అన్నది అన్ని రంగాల్లోనూ ఉన్నా, సంగీతం లోనూ సాహిత్యం లోనూ ఇది కొంచం ఎక్కువ. సినిమా సంగీతం లో ఇప్పటికీ జనం నాలుకల మీద ఆడే ఆపాత మధురాల్లో చాలావాటికి హిందీ సినిమా పాటలు, విదేశీ సంగీతమూ స్ఫూర్తినిచ్చాయి. చాలా సందర్భాలలో ఆయా సంగీత దర్శకులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు కూడా. దక్షిణాది సంగీతాన్ని ఉత్తరాది సినిమాలకి వాడుకోడమూ జరిగింది. మొదట్లో ఈ 'స్ఫూర్తి' విషయం అతి కొద్దిమందికి మాత్రమే తెలిసేది.

మీడియా వ్యాప్తి పెరిగాక, ముఖ్యంగా విదేశీ చానళ్ళు తమ ప్రసారాలను మన దేశంలో ప్రారంభించాక, ఏ రచయిత/సంగీత దర్శకుడు ఏ విదేశీ చిత్రం నుంచి స్ఫూర్తి పొందారన్నది సామాన్య ప్రేక్షకుడికి కూడా తెలిసిపోతోంది. గతంతో పోల్చినప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా మెరుగు పడడంతో ఒకరికి తెలిసిన విషయం అతి తక్కువ కాలంలోనే పదిమందికీ చేరుతోంది. ఈ పరిణామం కొందరు కళాకారుల 'సృజనాత్మకత' కి గొడ్డలి పెట్టుగా మారింది.

"నా మ్యూజిక్ లో ఎక్కడైనా విదేశీ ట్యూన్స్ వినిపిస్తే రామచంద్రాపురం లో ఉన్న మా బంధువులు కూడా అడిగేస్తునారు.. ఈ పాటకి ఒరిజినల్ ఫలానా కదా అని" అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వాపోయాడు, నాలుగైదేళ్ళ క్రితం ఒక ఇంటర్వ్యూలో. 'నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు' అనుకునే వాళ్ళు మాత్రం తమ కృషిని కొనసాగిస్తున్నారు. స్వదేశం లోని వివిధ ప్రాంతాల జానపద సంగీతం నుంచి స్ఫూర్తి పొంది సినిమా పాటలు చేసే సంగీత దర్శకులు మరో రకం. చాలా 'చిత్రం' గా సినిమా రంగం లో పేరు తెచ్చేసుకున్న ఓ సంగీత దర్శకుడు ఇలా స్ఫూర్తి పొందిన పాపానికి కేసులు కూడా ఎదుర్కొన్నాడుట.

నిన్నటితరం సంగీత దర్శకుల నుంచి స్ఫూర్తి పొందే సంగీత దర్శకులకీ కొదవ లేదు. ఈమధ్య వస్తున్న వంశీ సినిమాలకి చక్రి చేస్తున్న సంగీతం వింటుంటే నాకే కాదు, చాలామందికి ఎనభైల్లో ఇళయరాజా చేసిన ట్యూన్లు గుర్తొస్తున్నాయి. సంగీతం గొడవ ఇలా ఉంటే, సాహిత్యానిది మరో కథ. రచయిత్రుల శకం ముగిసింది మొదలు, మొన్నటివరకూ ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించే రచనలు చేసిన ప్రముఖ నవలా రచయితలు ఇద్దరూ ఆంగ్ల నవలల నుంచి స్ఫూర్తి పొందినవారే. ఒకాయన ఒప్పుకుంటాడు, మరో ఆయన ఆవిషయం మాట్లాడడానికి ఇష్టపడడు.

సినిమా తీయడానికి కథ అవసరం అనుకున్న రోజుల్లో కథల మీద హక్కుల గురించి కోకొల్లలుగా గొడవలు జరిగాయి. "అన్ని కథలకూ మూలం రామాయణ భారతాలే.. అసలు ప్రపంచం లో ఉన్నవి ఏడు కథలే.. ఎవరు తీసినా వాటితోనే సినిమా తియ్యాలి" అని జంట రచయితలు పరుచూరి సోదరులు ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. "ఒక్కడు రాసిన కథతో సినిమా తీయడం ఏమిటి నాన్సెన్స్.. పది మంది రచయితలని కూర్చోపెట్టి చర్చిస్తే ఆ చర్చల్లోనుంచి కథ పుడుతుంది" అని వాదించిన దర్శకులూ ఉన్నారు.

ఇప్పుడైతే ఎంచక్కా కథల బాధ లేదు కాబట్టి కాపీ బాధా లేదు. బాగా హిట్టైన హిందీ సినిమాలోదో, రొటీన్ కి భిన్నంగా ఉన్న విదేశీ సినిమాలోదో 'పాయింట్' ని మాత్రం తీసుకుని సినిమాలు తీసేస్తున్నారు నవతరం దర్శకులు. అంటే వీళ్ళు స్ఫూర్తి కూడా పొందడం లేదు, కేవలం పాయింట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ఏమీ అనడానికి లేదన్నమాట. మనం కూడా కథ ఒరిజినలా, కాపీనా అన్న విషయంలోకి వెళ్ళకుండా, సినిమా బాగుందా లేదా అన్న విషయం మాత్రమే చూసి, బాగున్న పక్షంలో మూల కథ ఎక్కడిది అయి ఉంటుంది అని ఆలోచించడానికి అలవాటు పడిపోతున్నాం.

కొసమెరుపు: ఉదయాన్నే 'సాక్షి' సినిమా పేజీ లో 'శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్' సినిమా గురించిన వ్యాసం పూర్తిగా చదివి అవాక్కయ్యాను. ఇదే సినిమా గురించి సుమారు ఏడాది క్రితం నేను 'నవతరంగం' లో రాసిన టపాలో కొన్ని వాక్యాలు యధాతధంగా కనిపించడమే అందుకు కారణం.