శుక్రవారం, ఏప్రిల్ 30, 2021

చందమామలో 'అమృతం'

నిండు చంద్రుణ్ణి చూసినప్పుడల్లా మనసుకి దగ్గరైన వాళ్లంతా వరసగా గుర్తొస్తారు - దూరంగా ఉన్నవాళ్లూ, బహుదూరంగా ఉన్నవాళ్లూను. ఆ జ్ఞాపకాలన్నీ ఆనందాన్నీ, బాధనీ ఏకకాలంలో అనుభవానికి తెస్తాయి. నిన్నటి వరకూ సంతోషపెట్టిన మీ జ్ఞాపకం ఇవాల్టినుంచీ బాధ పెడుతుందని  ఏమాత్రం అనుకోలేదు 'అమృతం' గారూ.. ఎందుకిలా జరిగింది? వేణూశ్రీకాంత్ అనే మీ అసలు పేరు కన్నా మీరెంతో ఇష్టంగా పెట్టుకున్న 'అమృతం అమృతరావు' అనే కొసరుపేరే నాకెంతో నచ్చింది. ఎంత అంటే, మీకు రాసిన పర్సనల్ మెయిల్స్ లో కూడా మిమ్మల్ని 'అమృతం గారూ' అని సంబోధించడం, అదిచూసి మీరు నవ్వుతూ జవాబివ్వడం వరకూ. కోవిడ్ జ్వరంతో ఆస్పత్రిలో చేరుతున్నట్టుగా మీరు పోస్టు పెట్టినప్పుడు కూడా, ఒకట్రెండు రోజులు చికిత్స చేయించుకుని, ఆరోగ్యంగా తిరిగొచ్చి ఆ కబుర్లన్నీ పంచుకుంటారనుకున్నాను.. కానీ మీరు ఇక లేరన్న వార్త వినాల్సొస్తుందని ఏమాత్రం ఊహించలేదు. 

పుష్కర కాలానికి పైగా కలిసి ప్రయాణం చేశాం. దాదాపు రోజూ అన్నట్టుగా కబుర్లు చెప్పుకున్నాం. మీ పోస్టులు చదివి నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు అనిపించిన సందర్భాలు ఎన్నో. "అసలు కరుకుదనం అంటే తెలుసా?" అనిపించేటంతటి మెత్తదనం - మీ పోస్టుల్లోనూ, కామెంట్లలోనూ కూడా. ఈ మార్దవాన్ని గురించి మన మిత్రులు సరదాగా జోకులేసినా స్పోర్టివ్ గానే తీసుకున్నారు తప్ప అప్పుడు కూడా కోపం చూపించలేదు. ఇప్పుడు మాత్రం మాకందరికీ కోపంగా ఉంది. మీ మీద మాత్రమే కాదు. మిమ్మల్ని మాకు దక్కకుండా చేసిన పరిస్థితులన్నింటి మీదా కూడా. కోప్పడడాన్ని మించి ఏమీ చేయలేనివాళ్ళం అయిపోయాం అందరమూ. 

గత ఏడాదిగా మీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నారో, మాకందరికీ ఎన్ని జాగ్రత్తలు చెప్పారో తెలుసు. ఎవరిదో నిర్లక్ష్యానికి మీరు బలవ్వడం అత్యంత విషాదం. మీ చుట్టుపక్కలి నిర్లక్ష్యపు మనుషుల మొదలు, ప్రభుత్వమనే బ్రహ్మపదార్ధం వరకూ అందరికీ ఈ పాపంలో భాగం ఉంది. అందుకేనేమో దుఃఖం కన్నా ఎక్కువగా కోపమొస్తోంది. మీ చివరి పోస్టు, చివరి మెసేజీ అన్నీ ఆశావహమైనవే. మీకిలా జరుగుతుందని మేమే కాదు, మీరూ ఊహించలేదు, భయపడలేదు. ఆస్పత్రికి వెళ్తూ కూడా మీ గురించి కన్నా, మీ నాన్నగారి గురించే ఎక్కువ ఆలోచించారు. 'విష్ అజ్ ఆల్డి బెస్ట్' అన్నారు. మా విషెస్ చాలలేదు. మీరు మాకు మిగల్లేదు. ఉహు, మీరు లేరంటే ఇంకా నమ్మకం కలగడం లేదు. 

ఎవరిమీదన్నా కోపం వస్తే వాళ్లతో ఉన్న విభేదాలో, అభిప్రాయ భేదాలో గుర్తొస్తాయి కదా. మీ విషయంలో అది కూడా జరగడం లేదు.  "వినదగునెవ్వరు చెప్పిన.." అనే మాటని అక్షరాలా అమలు చేశారు.. అలాగని ఎప్పుడూ వినినంతనే వేగపడలేదు, నచ్చని సంగతుల్ని ఒప్పుకోలేదు. 'ఇలా ఉండగలగడం ఎలా సాధ్యం?' అనే ప్రశ్నని మిత్రులందరిలోనూ కలిగి, 'ఒక్క వేణూశ్రీకాంత్ కి మాత్రమే సాధ్యం' అనే సర్వామోదమైన జవాబు ఏళ్ళ కిందటే వచ్చేసింది. కాలం గడిచినా ఆ జవాబులో మార్పు రాలేదు. మీలా ఉండగలడగం మీకు మాత్రమే సాధ్యం. కనీసం కొన్నిసార్లన్నా కటువుగా ఉండుంటే ఇప్పుడు మాకింత బాధ ఉండేది కాదేమో అనిపిస్తోంది. మీ కబుర్లలో సగం నాన్న, తమ్ముడు, చెల్లి గురించే.. ఇప్పుడు వాళ్లెలా ఉన్నారో కదా.. 

మీకందరూ ఆప్తులే అయినా ప్రత్యేకించి మనిద్దరినీ దగ్గర చేసినవి సినిమాలు, పాటలు. కొత్త సినిమాలు ఒకేసారి ఇద్దరం విడివిడిగా చూసి, పోస్టులు రాసుకుని, ఒకరిది మరొకరం చదువుకుని 'అరె, ఒకేలా రాశామే!' అని నవ్వుకుని ఆపై మెయిల్స్ రాసుకున్న సందర్భాలు ఎన్నో. కొన్నాళ్ళకి ఈ 'ఒకేలా ఉండడం' కూడా మనకి అలవాటైపోయింది. అన్నట్టు, నా మొదటి పుస్తకానికి రూపుదిద్దింది మీరే.. ఎంత ఓపికగా, శ్రద్దగా తీర్చిదిద్దారో కదా. కేవలం సినిమా పాటల కోసమే ఓ బ్లాగు మొదలు పెట్టి, ప్రతి రోజూ ఓ పాటతో మమ్మల్నందరినీ పలకరించారు. ప్రతిరోజూ సూర్యుడు ఉదయించినంత సహజంగా, ఓ కొత్త పాట పలకరించేది. రేపటినుంచి కూడా సూర్యుడు ఉదయిస్తాడు. కానీ మమ్మల్ని పలకరించే మీ పాట? 

మీ బ్లాగు పోస్టులు, పాటల చర్చలు, మెగాభిమానం కబుర్లు.. ఒకటేమిటి చాలా గుర్తొస్తున్నాయి. మీ బ్లాగుని తల్చుకోగానే గుర్తొచ్చే మొదటి పది పోస్టుల్లో ఒకటి మీ అమ్మగారిని గురించి రాసిన పోస్టు. ఇప్పుడు గుర్తు చేసుకుంటే 'ఆ తల్లి ఒడిని వెతుక్కుంటూ సేదదీరడానికి వెళ్లిపోయారా?' అనిపిస్తోంది. ఎస్కెపిజం కదూ? ఎన్నో సినిమాలు చూస్తానన్నారు, కొత్త వంటలు ప్రయత్నిస్తానన్నారు.. మీరు లేరన్న వార్త నమ్మడానికి చాలా సమయం పట్టింది.. ఇప్పుడు కూడా ఇది అబద్ధం అయితే బాగుండునని, అలా తెలిసిన మరుక్షణం ఈ పోస్టు డిలీట్ చేసేయాలని బలంగా కోరుకుతుంటున్నాను. మీరెక్కడున్నా ప్రశాంతంగానే ఉంటారు.. కానీ, మీరు లేకపోవడం అలవాటయ్యేంత వరకూ మాకందరికీ అశాంతి తప్పదు. చంద్రుడు మబ్బుల్లోకి వెళ్ళిపోతే బాగుండు. నాకు మా అమృతాన్ని చంద్రుళ్ళో కాదు, ఆన్లైన్లో చూడాలని ఉంది.. 

బుధవారం, ఏప్రిల్ 14, 2021

'ఎమి' నేర్చుకున్న పాఠం

ఉద్యోగం చేస్తున్న సంస్థని 'కుటుంబం' గా భావించుకుని అనుబంధం పెంచుకోవచ్చా? నేనొక ఉద్యోగిని అని కాకుండా, ఫలానా సంస్థలో నేనో విడదీయరాని భాగం అని భావించుకోడం ఎంతవరకూ సబబు? 'గూగుల్' సంస్థ మాజీ ఉద్యోగిని ఎమి నైట్ ఫీల్డ్ తను ఉద్యోగం విడిచిపెట్టేందుకు దారితీసిన పరిస్థితులని వివరిస్తూ గతవారం 'ది న్యూయార్క్ టైమ్స్' కి రాసిన వ్యాసం చదివాకా తలెత్తే అనేకానేక ప్రశ్నల్లో ఇవికూడా ముఖ్యమైనవే. యూనివర్సిటీ క్యాంపస్ నుంచి నేరుగా గూగుల్ సంస్థలో ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరి, నాలుగేళ్లు మాత్రమే అక్కడ పనిచేయగలిగి 2019 లో ఉద్యోగాన్ని విడిచిపెట్టేశారు ఎమి.  ఆమె ప్రధాన ఆరోపణ పని ప్రదేశంలో తాను లైంగిక వేధింపులకు గురయ్యానని, సంస్థ నుంచి ఎలాంటి భరోసానీ పొందలేక పోయననీను.  ఆమె రాసిన విషయాలని గురించి అటు 'న్యూయార్క్ టైమ్స్' కామెంట్స్ సెక్షన్ లోనూ, ఇతరత్రా మాధ్యమాలలోనూ విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆమె వేలెత్తి చూపిన సంస్థ అతిపెద్ద కార్పొరేట్ కావడం కూడా ఈ విస్తృత చర్చకి ఒక కారణం. 

అనాధాశ్రమంలో పెరిగిన ఎమీకి గూగుల్ లో ఉద్యోగం చేయడం అన్నది చదువుకునే రోజుల్లో ఒక కల.ఎంతో శ్రమించి ఆ కలని నెరవేర్చుకుంది. ఆఫీసు వాతావరణం, పని ప్రదేశంలో లభించిన సౌకర్యాలు, ఉద్యోగభద్రత ఇవన్నీ ఆమెకి చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా సంస్థ ఆమెకి కల్పించిన సౌకర్యాలకు (ఉచిత భోజనం, జిమ్, తరచూ ప్రయాణాలు, పార్టీలు ఇత్యాదులు) అతిత్వరలోనే అలవాటు పడిపోయింది. "నా మేనేజర్లో నేను తండ్రిని చూసుకున్నాను" అంటూ ఆమె రాసిన వాక్యం దగ్గర ఒక్క క్షణం ఆగుతారు పాఠకులందరూ. అయితే, ఆమెకి వేధింపులు ఎదురయ్యింది మేనేజర్ నుంచి కాదు. మరో సీనియర్ సహోద్యోగి నుంచి. మేనేజర్ మాత్రమే కాదు, మానవ వనరుల విభాగం కూడా ఆమె కోరుకున్నట్టుగా స్పందించలేదు. పైపెచ్చు ఆమె వేధించినతని కనుచూపు మేరలోనే పనిచేయాల్సి వచ్చింది. "ఇంటి నుంచి పనిచెయ్యి, లేదా సెలవుపెట్టు" అని ఆమెకి సలహా ఇచ్చింది మానవవనరుల విభాగం. 

చాలా ఓపిక పట్టి, మూడు నెలలు సెలవు పెట్టినా కూడా ఆమె ఫిర్యాదు మీద విచారణ ఓ కొలిక్కి రాలేదు. ఆమె అతనితోనే పనిచేయాల్సి వచ్చింది. కాలేజీ రోజుల నాటి కలలు, ఉద్యోగంలో చేరిన కొత్తలో పెంచుకున్న భరోసా.. ఇవన్నీ బద్దలైపోవడం ఆమెని కుంగదీసింది. వేరే ఉద్యోగం వెతుక్కుంది. "ఇది కేవలం ఉద్యోగం.. చేస్తాను, కానీ ఎప్పటికీ నేను నా ఉద్యోగాన్ని ప్రేమించలేను" అంటుంది ఎమి. వేధింపుల విషయంలో మహిళా ఉద్యోగుల నుంచి వచ్చే ఫిర్యాదుల పట్ల సంస్థల ఉదాసీన వైఖరి కొత్తేమీ కాదు. నిజం చెప్పాలంటే ఇలాంటి ఫిర్యాదుల విషయంలో సంస్థలు వేగంగా స్పందించిన  సందర్భాలు అరుదు. సాక్ష్యాల సేకరణ, నేర నిరూపణ జాప్యానికి ముఖ్య కారణాలని చెప్పొచ్చు. ఒక జూనియర్ ఉద్యోగికి, సీనియర్ కి మధ్య అభిప్రాయ భేదాలు వస్తే, యాజమాన్యాలు సీనియర్ పక్షానే ఉంటాయన్నది తరచూ వినిపించే మాట. గూగుల్ కూడా ఇందుకు భిన్నంగా వ్యవహరించలేదు. బాధితురాలిగా ఎమి రాసింది చదువుతున్నప్పుడు, చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, విచారణని ఆమె సంస్థ మరికొంత సహానుభూతితో నిర్వహించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. 

ఎమి రాసింది చదువుతూ ఉంటే బాగా ఆకర్షించేది, ఆలోచింపజేసేదీ సంస్థని, ఉద్యోగాన్ని ఆమె ప్రేమించిన తీరు. ఓ ఇరవై, పాతికేళ్ల క్రితం వరకూ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందని క్రితం ఉన్న బంధాన్ని గుర్తు చేసింది. గూగుల్ సంస్థలో ఉన్నన్ని ఆకర్షణలు లేకపోయినా, ఒకప్పుడు ఉద్యోగం సంపాదించడం అంటే జీవితంలో స్థిరపడడమే. రిటైర్మెంట్ వరకూ ఉద్యోగమూ, సంస్థా కూడా ఉంటాయన్న భరోసా బాగానే ఉండేది. కాస్త భద్రమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టడం అనేది బహు అరుదు. ఉద్యోగం పోతుందేమో అన్న భయం ఉద్యోగుల్లో ఉన్నప్పటికీ, సంస్థలు కూడా "వీళ్ళకి మనం తప్ప మరో దిక్కు లేదు" అన్నట్టు కాకుండా ఉన్నంతలో బాగానే చూసేవి. ఆ భయం వల్లనే కావొచ్చు, సంస్థలో విడదీయలేని భాగం అనేంత అనుబంధం అయితే ఉండేది కాదు. అంత అనుబంధం పెంచుకోవాల్సిన అవసరం లేదనిపించే సందర్భాలూ తటస్తిస్తూనే ఉండేవి. సంస్థకి, ఉద్యోగానికి అలవాటు పడడం అనే ప్రసక్తి ఉండేది కాదు. ఉద్యోగుల వయసు, పూర్వానుభవాలు కూడా ఇందుకు దోహదం చేస్తూ ఉండేవి బహుశా. 

గడిచిన ఇరవై ఏళ్లలో సంస్థ-ఉద్యోగి సంబంధాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఎమి ఉదంతాన్ని పరిశీలించడం అవసరం. మిలీనియల్స్ లో (1990 తర్వాత పుట్టిన వాళ్ళు) ఎక్కువగా కనిపించే 'ప్రాక్టికాలిటీ' ఉద్యోగంలో చేరిననాటి ఎమిలో కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది.  ఇందుకు ఆమె ఆలోచనా ధోరణితో పాటు, ఆ సంస్థలో పనిచేస్తున్న కారణంగా ఆమెకి దొరికిన హోదా, లభించిన సౌకర్యాలూ కూడా తగుమాత్రం పాత్ర పోషించి ఉండాలి. నిజానికిప్పుడు జాబ్ మార్కెట్లో 'లాయల్టీ' కి విలువ లేదు. 'ఒక సీనియర్ కి ఇచ్చే డబ్బుతో ఇద్దరు/ముగ్గురు  జూనియర్లు' అనే సూత్రాన్ని వంటబట్టించుకున్న సంస్థలే అధికం. ఈ కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు, అభద్రతతో రోజులు వెళ్లదీస్తున్న వాళ్ళు (ముఖ్యంగా ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తూ, సీనియర్లు అయిన వాళ్ళు) చాలామందే ఉన్నారు. గూగుల్ లాంటి బాగా పేరున్న కార్పొరేట్లు కొంత మినహాయింపు కావచ్చేమో కానీ, మెజారిటీ సాఫ్త్వేర్ కంపెనీల్లో ఉద్యోగుల సగటు సర్వీసు ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు మించడం లేదు. 

సంస్థ-ఉద్యోగి సంబంధాల్లో వచ్చిన మార్పుని ఉద్యోగులు - మరీ ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న యువత - బాగా గుర్తు పెట్టుకోవాలని ఎమి ఉదంతం హెచ్చరిస్తోంది. సంస్థని ఓ కుటుంబంగానో, భరోసాగానో భావించడం తెలివైన పని కాదని చెబుతోంది. కుటుంబాన్నీ, సోషల్ సర్కిల్నీ త్యాగం చేసి ఉద్యోగంలో నిరూపించుకోవాల్సిన అవసరం లేదని గుర్తుచేస్తోంది. 'వర్క్-లైఫ్ బాలన్స్' అనేది ఎవరికి వారు నిర్వచించుకుని అమలు చేసుకోవాలి తప్ప సంస్థే సర్వస్వం అనుకోకూడదు అంటోంది ఎమి. సగటు మిలీనియల్స్ కన్నా ఆమె తన సంస్థని, ఉద్యోగాన్ని కొంచం ఎక్కువగానే ప్రేమించి ఉండొచ్చు. అందుకుగాను మూల్యాన్ని చెల్లించింది కూడా. పని ప్రదేశంలో ఇచ్చిపుచ్చుకునే లెక్క తప్పకూడదనీ, తప్పితే అందుకు మూల్యం చెల్లించాల్సింది ఉద్యోగేననీ 'గూగుల్' సాక్షిగా చెప్పింది ఎమి. కొన్ని చేదు అనుభవాల తర్వాత ఆమె నేర్చుకున్న పాఠాన్ని గమనంలో ఉంచుకోడం ద్వారా ఎవరికివారు వృత్తిగత-వ్యక్తిగత జీవితాల మధ్య ఒక రేఖ గీసుకోగలిగే వీలుంది. ఆమె అనుభవాలు చదివిన కొందరైనా ఈ ప్రయత్నం మొదలు పెడతారు, తప్పకుండా. 

మంగళవారం, ఏప్రిల్ 13, 2021

చైత్రము కుసుమాంజలి ...

సాహిత్యంలో ఋతు సౌందర్య వర్ణనకి కాళిదాసు పెట్టింది పేరు. తెలుగులో ఆ ఘనత కవిసామ్రాట్వి శ్వనాథ సత్యనారాయణదే. ఋతుసంహార కావ్యం సాక్షిగా. మరి, ఆ విశ్వనాథకి ప్రత్యక్ష శిష్యుడైన వేటూరి ఋతుశోభని వర్ణిస్తూ పాట రాస్తే? నిజానికి వేటూరి పాటల్లో ఋతువుల ప్రస్తావన కనిపిస్తూనే ఉంటుంది కానీ, కేవలం ఋతువులే ఇతివృత్తంగా రాసిన పాటలు తక్కువ. అలాంటి పాటలు రాసే అవకాశాలు అరుదుగానే వచ్చాయని అర్ధం. వచ్చిన ప్రతిసారీ వేటూరి కలం పరవళ్లు తొక్కింది. ఇందుకు 'ఆనంద భైరవి' (1984) సినిమా కోసం దర్శకుడు జంధ్యాల రాయించుకున్న 'చైత్రము కుసుమాంజలి' పాట చక్కని ఉదాహరణ. 


"చైత్రము కుసుమాంజలి
పంచమ స్వరమున ప్రౌఢ కోకిలలు
పలికే మరందాల అమృత వర్షిణి"

శాస్త్రీయ సంగీత స్వరాలు ఒక్కొక్కటీ ఒక్కొక్క పక్షి/జంతువు చేసే ధ్వనుల నుంచి పుట్టాయంటారు. వీటిలో పంచమానికి ఆధారం కోకిల స్వరం. ఆ కోకిల వసంత ఋతువు (చైత్ర వైశాఖ మాసములు) లో మాత్రమే పాడుతుంది. చైత్రము అంటేనే కొత్త చివుళ్లు, పువ్వులు. ఆ పూలతో సాక్షాత్తూ చైత్రమే అంజలి ఘటిస్తోంది, కోకిల పాటల నేపథ్యంలో.. ఆ కోయిలలు అమృతం (మరందము) తాగి పడుతున్నాయా, లేక 'అమృత వర్షిణి' రాగం పాడుతున్నాయా? వేటూరికే తెలియాలి. ఇంతకీ ఈ అంజలి ఎవరికో తెలియాలంటే చరణాల్లోకి వెళ్ళాలి.

"వేసవిలో అగ్నిపత్రాలు రాసే
విరహిణి నిట్టూర్పులా కొంత సాగి
జలద నినాదాల పలుకు మృదంగాల
వార్షుక జలగంగలా తేలిఆడే
నర్తనకీ, కీర్తనకీ, నాట్య కళాభారతికీ
చైత్రము కుసుమాంజలి"

విరహం కారణంగా వచ్చే నిట్టూర్పు లాంటి రాగం.. ఆ విరహం కూడా వేసవిలో ఆకులు కాలినప్పుడు పుట్టే వేడి లాంటిది (అసలే వేసవి, ఆపై అగ్ని). మృదంగ ధ్వనుల్లాంటి మేఘ గర్జనల నేపథ్యంలో (జలద నినాదాల) తెలివచ్చే వర్షం లాంటి నృత్యం. ఈ సంగీత నృత్యాలతో పాటు నాట్యకళా భారతికి కూడా చైత్రము కుసుమాంజలి పలుకుతోంది అంటున్నారు కవి. వసంతం తర్వాత వరసగా వచ్చే గ్రీష్మ, వర్ష ఋతువుల్ని వర్ణించారీ చరణంలో. 

"శయ్యలలో కొత్త వయ్యారమొలికే
శరదృతు కావేరిలా తీగ సాగి
హిమ జలపాతాల, సుమశర బాణాల
మరునికి మర్యాదలే చేసి చేసి
చలి ఋతువే సరిగమలౌ నాద సుధా మధువనికీ
చైత్రము కుసుమాంజలి"

శయ్యలు కొత్త వయ్యారాలు ఒలికించే శరదృతువులో (ఆశ్వయుజ, కార్తీక మాసములు శరదృతువు కదా - సహజం), తీగసాగి ప్రవహించే కావేరీ నది, హిమ జలపాటలతోటి, మన్మధుడి  బాణాలతోటీ  మన్మధుడికి మర్యాదలు చేసే చలి ఋతువునే  (హేమంతం - మార్గశిర, పుష్య మాసములు) సరిగమలుగా మార్చగలిగిన సంగీత వనానికి చైత్రము కుసుమాంజలి అర్పిస్తోంది. శరత్తు, హేమంతం ఈ చరణంలో భాగాలయ్యాయి. సందర్భశుద్ధి కాదని కాబోలు, శిశిరం జోలికి వెళ్ళలేదు కవి. 

దొమ్మరికులానికి చెందిన ఒక బాలికని నాట్యగత్తెగా తీర్చిసిద్ధేందుకు శిష్యురాలిగా స్వీకరించిన ఓ అగ్రహారపు నాట్యాచార్యుడు ఆమెకి పాఠం చెప్పడం ఈ పాట సందర్భం. పల్లవిలో బాలిక, చరణాలకి వచ్చేసరికి అందమైన యువతిగా ఎదుగుతుంది. రుతువులు గడిచాయన్నమాట! సంగీత నాట్యాల ప్రత్యేకతని చెప్పే సందర్భోచిత గీతమే అయినా, ఋతువులని నేపథ్యంగా తీసుకోడం వల్ల పాట మధ్యలో ఫార్వార్డ్ చక్రం తిప్పాల్సిన పని లేకపోయింది దర్శకుడికి. రమేష్ నాయుడు స్వరపరిచిన ఈ పాటని ఆర్తితో పాడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. గిరీష్ కర్నాడ్, మాళవిక, బేబీ కవిత నర్తించగా,  పుచ్చా పూర్ణానందం కూడా కనిపిస్తారీ పాటలో. 

మిత్రులందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!