గురువారం, సెప్టెంబర్ 13, 2012

మిస్డ్ కాల్

చారులత-జగన్ ఒకరికొకరు చాలా చిత్రంగా పరిచయమయ్యారు. వాళ్ళిద్దరూ తలో పనిమీదా అరకు వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి ఘాట్ రోడ్డు పాడైపోడం, రైలు మినహా ఇతరత్రా ప్రయాణ మార్గాలు మూసుకుపోడంతో, ఇద్దరూ కలిసి ఓ రాత్రి అరకులోయలో గడపాల్సి వచ్చింది. వాల్తేరు పాసింజర్ మిస్సైన కాసేపటికే, తనను చూసిన పెళ్ళికొడుకు శ్రీరామ్ కి తను నచ్చాననీ, మరో రెండు రోజుల్లో విశాఖపట్నంలోనే తన పెళ్లనీ తెలుస్తుంది చారులతకి. పెళ్ళైన వారానికే శ్రీరామ్ తో కలిసి అమెరికా వెళ్లిపోవాలి. పెళ్ళి చూపుల్లోనే శ్రీరామ్ నచ్చాడు కాబట్టి, ఆ సంబంధం ఇష్టమే చారులతకి.

భద్రాచలం వెళ్ళాల్సిన జగన్ కూడా, రైలు మిస్సై అరకు ప్లాట్ఫాం మీద మిగిలిపోతాడు. అదిగో, అప్పుడు చారులత తారసపడుతుంది అతనికి. ఆ వెన్నెల రాత్రి ఆ ఇద్దరూ కలిసి అరకు అంతా కలియతిరుగుతారు. ఓ స్మశానానికి వెళ్లి మంగభాను సమాధి చూడడం మొదలు, ఓ చోట బోనులోనుంచి తప్పించుకున్న కుందేళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసి ఓడిపోయి, స్థానికంగా జరుగుతున్న ఓ జాతరలో రికార్డింగ్ డేన్స్ చూసి, ఆ పై అరకు ట్రైబల్ మ్యూజియం చూసి బయటికి వస్తారు ఇద్దరూ.

ఏ పని చేస్తున్నా శ్రీరామ్ ని తలచుకుంటూనే ఉంటుంది చారులత. అతనెంత మంచి వాడో, గొప్పవాడో కథలు కథలుగా చెబుతుంది జగన్ కి. కాబోయే భర్తని అంతగా ప్రేమిస్తున్న చారులత మీద గౌరవం కలుగుతుంది జగన్ కి. అనుకోకుండా, మైథునం లో మునిగి ఉన్న ఓ జంట ఈ ఇద్దరి కంటా పడుతుంది.జగన్ లో కలిగిన ఆవేశం, శ్రీరామ్ గుర్తు రావడంతో చప్పున చల్లారుతుంది. ఖాళీగా ఉన్న బస్టాండ్ ఆవరణలో, జగన్ మ్యూజిక్ స్టిక్ నుంచి వస్తూన్న లయకి అనుగుణంగా నాట్యం చేస్తున్న చారులత ఉన్నట్టుండి వైన్ తాగాలని ఉందన్న కోరికని బయట పెడుతుంది.


జగన్ మీద ఆసరికే అధికారం చలాయించడం మొదలుపెట్టిన చారులత, అతన్ని కోరివచ్చిన ఓ గిరిజన యువతిని కొట్టినంత పని చేస్తుంది. అతన్ని కోప్పడుతుంది. 'ఏమిటీ అధికారం?' అన్న అతని ప్రశ్నకి, జవాబు లేదు ఆమె దగ్గర. ఓ రెడ్ వైన్ బాటిల్ తీసుకుని చెరిసగం తాగిన జగన్, చారులతలకి చలి తెలుస్తుంది. ఒకే శాలువాలో ఇద్దరూ సద్దుకుంటారు. మత్తెక్కిన జగన్ 'నాగ మల్లివో, తీగ మల్లివో, నీవే రాజకుమారి..' పాట అందుకుంటాడు. ఏమిటేమిటో మాట్లాడతాడు. ఆ క్షణంలో శ్రీరామ్ గుర్తురాడు..అతనికే కాదు, ఆమెకి కూడా.

మరునాడు ఉదయం ఎవరి గమ్యం వాళ్ళు చేరుకుంటారు, కనీసం చిరునామాలు మార్చుకోకుండా. తొమ్మిదేళ్ళ తర్వాత అనుకోకుండా ఒకరికి ఒకరు మళ్ళీ తారసపడతారు, ఓ పుస్తక ప్రదర్శనలో. అమెరికాలో స్థిరపడిన జగన్, తెలుగు నవలా రచయితగా పేరు తెచ్చుకుంటాడు. అరకు నేపధ్యంగా, చారులత కథానాయికగా అతను రాసిన తొమ్మిది నవలలూ చాలా పాపులర్ అవుతాయి. పుస్తక ప్రదర్శన వేదిక మీద అతని తాజా నవల ఆవిష్కరణ జరిగాక, ప్రేక్షకుల్లో ఉన్న చారులతని గుర్తు పట్టి పలకరిస్తాడు. ఓ గంటలో ఫ్లైట్ అందుకోవాల్సిన జగన్, దగ్గరలో ఉన్న ఆమె ఇంటికి వెడతాడు. తర్వాత ఏం జరిగిందన్నదే వంశీ రాసిన 'మిస్డ్ కాల్' కథ.

వెన్నెల రాత్రి అరకు అందాలని వంశీ వర్ణించిన తీరు, మరీ ముఖ్యంగా చారులత పాత్ర ఈ కథకి బలం. భాషా భేదం లేకుండా సినిమాలు చూసే మిత్రులొకరు ఈ కథ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. 'బిఫోర్ సన్రైజ్'  'బిఫోర్ సన్సెట్' అనే రెండు ఇంగ్లిష్ సినిమాల కథల్ని తీసుకుని, నేపధ్యాన్ని అరకుకు మార్చి వంశీ ఈ కథ రాసేశారని. హాలీవుడ్ సినిమాలు విడవకుండా చూసే మరో ఫ్రెండ్ ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అయినప్పటికీ, నేటివిటీ కూర్పుని అభినందించాల్సిందే అనిపించింది నాకు. వంశీ 'ఆకుపచ్చని జ్ఞాపకం' సంకలనంలో ఉందీ కథ. (ఇలియాస్ ఇండియా ప్రచురణ, పేజీలు 360, వెల రూ. 350, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

ఆదివారం, సెప్టెంబర్ 09, 2012

కాళిదాసు మూడు నాటకాలు

సంస్కృత నాటకం అనగానే మొదట గుర్తొచ్చే పేరు మహాకవి కాళిదాసు. "ఉపమా కాళిదాసస్య.." అని ఆర్యోక్తి. ఉపమానాలు వాడడంలో కాళిదాసు తర్వాతే ఎవరైనా అని భావం. ఉపమానాలు మాత్రమే కాదు, పాత్రలని తీర్చి దిద్దడంలోనూ, ప్రకృతి వర్ణనలోనూ, కథని తీరుగా నడిపించడంలోనూ కాళిదాసుది ప్రత్యేకమైన బాణీ. ఈ మహాకవి రాసిన మూడు ప్రసిద్ధ నాటకాలని పరిచయం చేస్తూ పీకాక్ క్లాసిక్స్ వెలువరించిన చిరు పొత్తం 'కాళిదాసు మూడు నాటకాలు.'

'మాళవికాగ్నిమిత్రం,' 'విక్రమోర్వశీయం,' 'అభిజ్ఞాన శాకుంతలం' ఈ మూడూ కాళిదాసు పేరు చెప్పగానే గుర్తొచ్చే నాటకాలు. వీటిని తెలుగులో సంక్షిప్తీకరించారు దోనెపూడి రామాంజనేయ శర్మ. మూడూ వేటికవే ప్రత్యేకమైన నాటకాలు. మూడింటి పరిచయాలూ ఒకేసారి చదివినప్పుడు నాకు వీటిలో కనిపించిన సామ్యం 'విరహం.' మాళవిక మీద మనసుపడ్డ అగ్నిమిత్రుడూ, ఊర్వశిచేత మోహితుడైన పురూరవుడూ, తొలిపరిచయం తర్వాత శకుంతలా, దుష్యంతుడూ అనుభవించిన విరహాన్ని కాళిదాసు వర్ణించిన తీరు అమోఘం.

నర్తకి మాళవిక చిత్తరువుని చూసిన మహారాజు అగ్నిమిత్రుడు ఆమెతో ప్రేమలో పడిపోతాడు. తన స్నేహితుడైన విదూషకుడికి తన గోడు వెళ్ళబోసుకుంటాడు. రాజు విరహం చూడలేని విదూషకుడు, నాట్య గురువులిరువురి మధ్య స్పర్ధ కలిగించి, రాజు ఎదుట మాళవిక నాట్య ప్రదర్శన ఏర్పాటు జరిగేలా చేస్తాడు. మాళవిక సైతం అగ్నిమిత్రుడితో తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది. వారిరువురి ప్రణయం, వివాహానికి ఎలా దారి తీసిందన్నదే 'మాళవికాగ్నిమిత్రం'నాటకం ముగింపు.


స్వర్గాధిపతిదేవేంద్రుడి స్నేహితుడు పురూరవుడు. ఓ ప్రమాదం నుంచి దేవ నర్తకి ఊర్వశిని రక్షించిన ఆ రాజు, ఆమెతో ప్రేమలో పడతాడు. రాజు భుజ బలాన్నీ, శౌర్యాన్నీ, సాయం చేసే గుణాన్నీ దగ్గరనుంచి చూసిన ఊర్వశి సైతం అతనితో ప్రేమలో పడుతుంది. ఊర్వశి ప్రేమని ఆమోదిస్తాడు దేవేంద్రుడు. మరోవంక, అంతఃపురంలో రాణులు సైతం పురూరవుడు తన వాంఛ నెరవేర్చుకోడానికి అనుమతి ఇస్తారు. రాజ్యానికి దూరంగా పర్వత సానువుల్లో, చెట్టూ చేమల్లో ప్రణయ కలాపంలో మునిగి తేలిన ఊర్వశీ పురూరవులకి అనుకోకుండా విరహం సంభవిస్తుంది. వారి పునస్సమాగమం ఎలా జరిగిందన్నదే 'విక్రమోర్వశీయం' నాటక కథ.

'అభిజ్ఞాన శాకుంతలం' కథ రేఖామాత్రంగానైనా తెలియని భారతీయులు తక్కువ. భరతుడి పేరిట ఏర్పడ్డ భరత ఖండ వాసులు కదా మరి. ఆ భరతుడి తల్లిదండ్రులు శకుంతలా, దుష్యంతులు. కణ్వ మహర్షి ఆశ్రమం సాక్షిగా మొదలైన వారి ప్రేమ కథ ఎన్నెన్ని మలుపులు తిరిగిందో కాళిదాసు కలం నుంచే తెలుసుకోవాలి. మరీముఖ్యంగా, తొలి పరిచయం తర్వాత అటు శకుంతల, ఇటు దుష్యంతుడు అనుభవించిన విరహాన్ని ఉపమాన సహితంగా వర్ణించారు కాళిదాసు.

పుస్తకం విషయానికి వస్తే, 'మాళవికాగ్నిమిత్రం' ప్రారంభంలో కించిత్ ఇబ్బంది అనిపించినా, రానురానూ చకచకా సాగిపోయింది. అనువాదం అత్యంత సరళంగా సాగింది. 'విక్రమోర్వశీయం' లో ముని శాపానికి ఊర్వశి పూలతీగెగా మారిపోయిన సంగతి తెలియని పురూరవుడు, ఆమెకోసం అనుభవించిన విరహబాధ, చెట్టునీ, పుట్టనీ, పామునీ, పురుగునీ సైతం వదలకుండా ఆమె ఆచూకీ అడిగిన వైనం చదువుతుంటే ఆలస్యం చేయకుండా సంస్కృతం నేర్చేసుకుని, మూల గ్రంథం చదివేయాలన్న కోరిక బలపడింది.

ఇదివరకు వసంతసేన గురించి చదివినప్పుడు, మరీముఖ్యంగా 'కన్యాశుల్కం' నాయిక మధురవాణి కి వసంతసేనే స్ఫూర్తి అని గుర్తొచ్చినప్పుడు, 'మృచ్ఛకటికమ్' నాటకాన్ని ఇంగ్లిష్ లో చదివాను నేను. అప్పటికన్నా, ఈ క్లుప్తీకరించిన తెలుగు పుస్తకం చదువుతున్నప్పుడు కథలో బాగా లీనం కాగలిగాను. ఈ పుస్తకం తేవడంలో ఉద్దేశ్యం, కాళిదాసు మూడు నాటకాలని పరిచయం చేయడమే కాబట్టి, ఆ ఉద్దేశ్యం నూరు శాతం నెరవేరిందనే చెప్పాలి. (పేజీలు 173, వెల రూ. 75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

శుక్రవారం, సెప్టెంబర్ 07, 2012

శ్రద్ధాంజలి

సుమన్ బాబూ,

నీ కోసం మొదలు పెట్టిన సిరీస్ ని ఈ టపాతో ముగిస్తానని అనుకోలేదయ్యా.. నీ అనారోగ్యం సంగతి తెలిసి బాధ పడినా, తలచుకుంటే దేనినైనా సాధించ గల మీ నాన్నగారి తాహతు గురించి తెలిశాక, నువ్వు వైద్యం చేయించుకుని, కళకళలాడుతూ మీ టీవీ తెరమీద కనిపిస్తావనే ఆశ పడ్డాను. నీకు తెలుసా? నువ్వు లేవనే వార్తని మీ పత్రిక కన్నా ముందే, భూగోళానికి అవతలిపక్క ఉన్న నా స్నేహితులు చెప్పారు. కనీసం ముఖ పరిచయం లేని వాళ్ళనీ, నన్నూ కలిపిన వాటిలో నువ్వూ ఉన్నావన్న సంగతి జ్ఞాపకం వచ్చి, కలుక్కుమనిపించింది.

మీ పేపర్లో నువ్వు రాసిన నవలలు కొనుక్కోమని వచ్చే ప్రకటనల ద్వారా నువ్వు మొదట పరిచయం నాకు. తర్వాత, మీరో టీవీ చానల్ పెట్టడం, కాల క్రమేణా దానికి అన్నీ నువ్వే కావడం మా కళ్ళ ముందే జరిగిపోయింది. మొదట్లో మీ చానల్లో వచ్చే ప్రతి కార్యక్రమాన్నీ విడిచి పెట్టకుండా చూశాను. పరిమితంగా కార్యక్రమాలు చూపించే దూరదర్శన్, జెమినిల తర్వాత రోజులో ఎక్కువ భాగం కార్యక్రమాలు, ఎక్కువగా సినిమా ఆధారిత కార్యక్రమాలని ప్రసారం చేసేది మీ చానల్.

అయితే సుమన్ బాబూ, నిన్ను కొంచం పరికించి చూసింది మాత్రం 'అంతరంగాలు' టైం లోనే. అప్పుడే కదూ, ఆ 'సీరియల్ సృష్టికర్త' వైన నీతో ప్రత్యేక ఇంటర్యూలు వచ్చిందీ. 'గుండెకీ సవ్వడెందుకో...' పాటని అరకు లో చిత్రీకరిస్తే 'ఆహా' అనుకున్నాను. రాన్రానూ నీ సీరియళ్ళు ఒకే మూసలో పోసినట్టు ఉండడం మొదలయ్యింది. 'అనుబంధం' 'అందం' 'కళంకిత' తరవాత నేను సీరియస్ గా చూసింది లేదనే చెప్పాలి. అయినప్పటికీ, ఆయా సీరియళ్ళ ప్రత్యేక ఎపిసోడ్లలో నువ్వు కనిపిస్తే మాత్రం మిస్సవ్వ లేదనుకో.

ఉన్నట్టుండి ఓ అలజడి సృష్టించావు. 'శ్రీకృష్ణ బలరామ యుద్ధం' అన్నావు. నువ్వే కృష్ణుడివి అన్నావు. ఒంటికి నీలం రంగూ, తలపై కిరీటం, నెమలిపించం, ధగద్ధగాయమైన దుస్తులూ, ఆభరణాలూ.. మీ పేపర్లో స్టిల్స్ చూసి, ఆ టెలి ఫిలిం చూసి తీరాల్సిందే అనుకున్నాను. చూశాను. నా స్నేహితుల్లో కొందరు మీ నాన్నగారికి వీరాభిమానులయ్యా. "అందరూ పిల్లలకి ఆడుకోడానికి బొమ్మలు కొని పెడితే, ఫలానా ఆయన ఏకంగా ఓ టీవీ చానల్నే కొడుక్కి ఇచ్చేశారు" అని నిష్టూరాలు ఆడారు.

ఎవరెన్ని అనుకోనీ, నువ్వు నాకు నచ్చావు. నిజం చెబుతున్నాను. నీ టాలెంట్ మీద నీకున్న నమ్మకం నాబోటి వాడికి ఎప్పుడూ ఆశ్చర్యమే. ఏ పనన్నా మొదలు పెట్టే ముందు, 'ఇది నేను చెయ్యగలనా?' అని ఆలోచనలో పడి, వెనకడుగు వేసే వాళ్లకి నువ్వో స్ఫూర్తి. ఇదే మాట నా మిత్రులతో అంటే కొందరు ఒప్పుకున్నారు, మరి కొందరు వాదించారు. నీమీద నీకున్న నమ్మకమే నీ చేత సినిమాలూ, టెలి ఫిల్ములూ తీయించింది. ఇప్పుడు కలికంలో కూడా కనిపించని తెలుగు పంచ కట్టునీ, పట్టు పరికిణీలనీ బుల్లి తెరకి ఎక్కించావు. నీకు చేతైనంతగా హాస్యానికి పెద్ద పీట వేశావు.

ఇంటిగుట్టుని నీ ప్రత్యర్ధి పత్రికలో బయట పెట్టిన్నాడు మాత్రం బాధ కలిగిందయ్యా. అప్పటి నీ ఇంటర్యూలో కూడా నిన్ను నువ్వు ఒక కళాకారుడి గానే చూసుకున్నావు. నీ తండ్రిని పెట్టుబడి దారుగా మాత్రమే చూశావు. 'కళ' పట్ల నీ కమిట్మెంట్ అర్ధమయినట్టే అనిపించింది. నీ ఆసక్తులని మీ ఇంట్లో వాళ్ళు కొంచం ముందుగానే గుర్తించి ఉంటే, పరిస్థితి మరోవిధంగా ఉండేదేమో అనుకున్నాను. ఎవరేమన్నా అనుకోనీ, నువ్వు అనుకున్నది చేయకుండా వెనక్కి తగ్గలేదు. నీ పేరు చెప్పుకుని అనేకమంది కడుపు నింపుకున్నారు.

నా మిత్రులు కొందరు నిన్ను కోప్పడే వాళ్ళు. మీ నాన్నగారి పేరు పాడు చేస్తున్నావని. ఎందుకో తెలియదు, ఎన్ని జరిగినా నీ మీద నాకెప్పుడూ కోపం రాలేదు. చాలా స్వచ్చంగా అనిపించేవాడివి నువ్వు. నీ ఆలోచనా విధానం ఎలా ఉంటుందో, నువ్వు తీసిన సీరియళ్ళు, సినిమాలు, టెలి ఫిల్ములు చూసిన వాడిగా ఓ అంచనాకు రాగలను కదా. ఇప్పుడు నువ్వు లేవనే వార్త. నమ్మలేకపోయాను.. కానీ నమ్మక తప్పని నిజం. సుమన్ బాబూ, నీమీద నీకున్న విశ్వాసానికీ, అనుకున్నది చేసి తీరిన నీ పట్టుదలకీ మరోమారు జోహారు..

మంగళవారం, సెప్టెంబర్ 04, 2012

సావిరహే

ఇద్దరు పెద్దమనుషులు ఆడుతున్న చదరంగంలో ఆ అమ్మాయి ఒక పావు. ఆమె పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటే తన తాతయ్య సంపాదించిన విలువైన ఆస్తికి వారసురాలు అవుతుంది. అలా కాక, ప్రేమ వివాహం చేసుకున్నట్టయితే ఆ ఆస్తి మొత్తం ఓ ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే హాస్పిటల్ కి చెందుతుంది. ఆ ఇద్దరు పెద్దమనుషుల్లో ఒకరు ఆమె శ్రేయోభిలాషి. ఆస్తి ఆమెకి మాత్రమే చెందాలని కోరుకుంటున్నారు. మరొకరు, ట్రస్టు శ్రేయోభిలాషి. ఆమె ప్రేమ వివాహం చేసుకుంటే, ట్రస్ట్ కి కలిసి రాబోయే ఆస్తితో ఏమేం అభివృద్ధి పనులు చేయాలో ఆలోచిస్తూ ఉంటారు.

విచిత్రం ఏమిటంటే, తన పేరిట పెద్దమొత్తంలో ఆస్తి ఉన్నట్టు గానీ, దాని కోసం జరుగుతున్న చదరంగం గురించి కానీ ఆ అమ్మాయికి ఎంత మాత్రం తెలియదు. పుట్టక మునుపే తండ్రినీ, పుట్టిన కొద్దిరోజులకే తల్లినీ పోగొట్టుకున్న ఆ అమ్మాయి తన మామయ్య  ఇంట అతి సామాన్యంగా పెరుగుతోంది. పదిహేడేళ్ళ ఆ అందమైన అమ్మాయి పేరు ప్రియాంక. విమెన్స్ కాలేజీలో బీయే ఇంగ్లిష్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల 'సావిరహే' ఈ ప్రియాంక ప్రేమకథే.

కాలేజీలో చేరిన తొలిరోజే ఇంగ్లిష్ లెక్చరర్ రాజ్ కృష్ణ ఆకర్షణలో పడుతుంది ప్రియాంక. మలయాళీ అయిన రాజ్ కృష్ణ, పాఠాలు చెప్పే విధానం మిగిలిన లెక్చరర్స్ కి భిన్నంగా ఉండడంతో పాటు, ఇంగ్లిష్ లిటరేచర్ మీద అతనికి విపరీతమైన ప్రేమ ఉండడం వల్ల, అతి త్వరలోనే ఆ క్లాసులో అమ్మాయిలందరూ అతని క్లాసు కోసం ఎదురు చూడడం మొదలుపెడతారు. స్నేహితురాలు వాహిలతో కలిసి ప్రతి వారం సినిమాకి వెళ్ళే అలవాటున్న ప్రియాంకకి, ఓసారి థియేటర్ లో రాజ్ కృష్ణ తారస పడడంతో అతని గురించి మరికొంచం ఎక్కువ తెలుసుకో గలుగుతుంది.

తను రాజ్ కృష్ణతో ప్రేమలో పడ్డానేమో అని ప్రియాంక అనుమానిస్తున్న సమయానికే, రాజ్ కృష్ణ తను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫారిన్ ఛాన్స్ వెతుక్కుంటూ రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి యూఎస్ వెళ్ళిపోతాడు. తన మనసుకి తగిలిన గాయం తాలూకు నొప్పి తెలుస్తూనే ఉంటుంది ప్రియాంకకి. స్నేహితురాలి మనసు అర్ధం చేసుకున్న వాహిల, ఆ గాయం మానేందుకు తనవంతు సాయం చేస్తూ ఉంటుంది. సరిగ్గా, రాజ్ కృష్ణ ఆలోచనల నుంచి బయట పడుతున్న సమయంలోనే సందీప్ పరిచయం అవుతాడు ప్రియాంకకి.


ఇరవై ఒక్క సంవత్సరాల సందీప్ ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలో ఉద్యోగి. అతని తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో, తల్లే పెంచి పెద్ద చేసింది. చురుకైన అ కుర్రాడు, తొలి చూపులోనే ప్రియాంకతో ప్రేమలో పడతాడు. అతని బాస్ ఏకాంబరం ప్రియాంక ప్రేమని గెలుచుకునేందుకు అవసరమైన సలహాలు ఇస్తూ ఉంటాడు సందీప్ కి, తగుమాత్రం 'ఫీజు' పుచ్చుకుని. సందీప్ చొరవ, ఏకాంబరం సలహాలు, కలిసొచ్చే పరిస్థితులతో పాటు, ప్రియాంక, వాహిలలిద్దరికీ సందీప్ మీద మంచి అభిప్రాయం ఏర్పడడంతో ప్రియాంక కూడా అతన్ని ప్రేమించడం మొదలుపెడుతుంది.

ప్రియాంక-సందీప్ ల ప్రేమ చిక్కబడేనాటికి, వారికి మద్దతుగా ఓ పెద్ద మనిషి, వ్యతిరేకంగా మరో ఆయనా చేసే ప్రయత్నాలూ ఊపందుకుంటాయి. వారి ప్రేమకథ పెళ్ళి పీటల వరకూ వెళ్ళ గలిగిందా? ప్రియాంక తన ఆస్తిని దక్కించుకో గలిగిందా? అన్న ప్రశ్నలకి జవాబిస్తూ ముగుస్తుందీ నవల. ఆద్యంతం మల్లాది మార్కు నవల ఇది. ప్రతి అంశాన్నీ విపులంగా రాసే మల్లాది, నవల శీర్షికని గురించి ఓ సందర్భంలో ఓ పాత్ర చేత ఇలా చెప్పించారు: "విరహం లేకపొతే అది సరయిన ప్రేమ కాదు. 'సావిరహే తవదీనా రాధా' అన్నాడు జయదేవుడు. అంటే, 'నా విరహంతో ధన్యురాలైన రాధ' అని అర్ధం." 

ప్రియాంక-సందీప్ ల తొలి ముద్దుకి మల్లాది మార్కు వర్ణన ఇది: "స్వల్పంగా గడ్డి పరక మీద వాన చినుకులా మొదలయిన ఆ చిరుముద్దు, క్షణాల్లో జడివానలా మారి, జలపాతంలా దూకి, నదులుగా సాగి సాగరమై పొంగి పొరలసాగింది. అంతా కొన్ని పదుల క్షణాలు మాత్రమే. ఒకరికి మాత్రమే కుదరనిది, ఇద్దరికీ సరిపోయేది, ముగ్గురికి ఎక్కువయ్యేది అయిన ఆ ముద్దు, ప్రపంచంలోని అతి తియ్యటి మధుర భాష అయిన ఆ ముద్దు ఉపయోగించడానికి పనికిరాని వస్తువులాంటిదయినా, డబ్బుకన్నా విలువైనదానిలా చూసుకునే ఆ ముద్దు కేవలం కొన్ని పదుల క్షణాల్లోనే వాళ్ళని వివశులని చేసింది." 

సందీప్ కాసే చిత్రమైన పందాలు, ప్రియాంక, సందీప్ ఒకరికొకరు తమ ప్రేమని వ్యక్త పరుచుకునే తీరు, కాలేజీలో అమ్మాయిల కోడ్ లాంగ్వేజీ చదవడానికి సరదాగా అనిపిస్తే, ప్రియాంక మామయ్య క్షీరసాగరానికి దినఫలాల మీద ఉన్న నమ్మకం నవల చివరికి వచ్చేసరికి విసుగు కలిగిస్తుంది పాఠకులకి. సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం రాసిన నవల ఇది. టీనేజ్ యువతీయువకులని, మరీ ముఖ్యంగా ప్రేమలో ఉన్న వారిని బాగా ఆకట్టుకుంటుంది. ప్రేమలో ఉన్నవాళ్ళకి, కొత్తగా ప్రేమలో పడ్డవాళ్ళకి బహుమతిగా ఇవ్వదగిన పుస్తకం. (సాహితి ప్రచురణ, పేజీలు 264, వెల రూ. 90, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శనివారం, సెప్టెంబర్ 01, 2012

నాయికలు-నతాష

నతాష అందమైన అమ్మాయి. నికోలాయ్-అన్నా దంపతుల ఏకైక కుమార్తె. వాళ్ళింట్లోనే పెరిగిన వాన్యా, నతషని ఎంతగానో ఆరాధించాడు. ఆవిషయం బాగా తెలుసు నతాషకి. కానీ, అతని ప్రేమకి ఆమె అవునని చెప్పలేదు. అలాగని కాదనీ చెప్పలేదు. పేదరికం నుంచి ప్రిన్స్ స్థాయికి ఎదిగిన వాల్కొవిస్కీ నికోలాయ్ తో స్నేహం చేస్తాడు. నికోలాయ్ నిజాయితీ, శ్రమించే తత్వం నచ్చి, ఎస్టేట్ వ్యవహారాల బాధ్యతని అతనికి అప్పగిస్తాడు. అంతే కాదు, లోకజ్ఞానం లేని తన కొడుకు అయోషాని కూడా నికోలాయ్ ఇంట్లో ఉంచుతాడు ప్రిన్స్.

నతాష-ఆయోష ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. ఆయోషలో, నతాషకి నచ్చింది ఏమిటి? అని అడిగితే జవాబు చెప్పడం కష్టం ఆమెకి. అతని అమాయకత్వం, స్వచ్చత ఆకట్టుకుంటాయ్ ఆమెని. అతను మిగిలిన కుర్రాళ్ళ కన్నా భిన్నం అని తెలుసు. జ్ఞానంలో తనకన్నా ఓ మెట్టు తక్కువేననీ బాగా తెలుసు నతాష కి. అయినప్పటికీ అతనంటే విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమ ఎంతటిదంటే, దానికోసం తనని ఎంతగానో ప్రేమించిన తల్లిదండ్రులని విడిచిపెట్టేయడానికి సైతం వెనకాడదు నతాష.

జరిగింది ఏమిటంటే, నతాష-ఆయోషల ప్రేమ గురించి విన్న ప్రిన్స్ భగ్గుమంటాడు. నతాష అంతస్తు తన అంతస్తుకి ఏమాత్రం తూగదు మరి. కూతుర్ని తన కొడుకు మీదకి ఉసిగొలిపాడని నికోలాయ్ మీద ఎగిరిపడతాడు. ఎస్టేట్ వ్యవహారాల వంకన నికోలాయ్ ని కోర్టుకి ఈడుస్తాడు. ఫలితం, ఆయోష తో కూతురి ప్రేమని ఏమాత్రం ఆమోదించడు నికోలాయ్. ఆయోష కోసం ఇల్లు విడిచిపెడుతుంది నతాష. ఓ చిన్న ఇంట్లో నతాష ని ఉంచుతాడు ఆయోష. అప్పుడప్పుడూ వచ్చి చూసి వెడుతూ, పెళ్ళి చేసుకుంటానని హామీలు ఇస్తూ ఉంటాడు.

ఆయోషకి తన మీద ఉన్న ప్రేమమీద అంతులేని నమ్మకం నతాషకి. అయితే, ఆ నమ్మకానికి బీటలు పడే పరిస్థితులు వస్తాయి. నతాష విషయంలో కొడుకుని నయానో, భయానో ఒప్పించడానికి ప్రయత్నించి భంగపడ్డ ప్రిన్స్ అతనికోసం మరో గొప్పింటి సంబంధం చూస్తాడు. ఆ గొప్పింటి అమ్మాయి పేరు కాత్య, ఓ జమీందారీకి ఏకైక వారసురాలు. ఆయోషకి స్థిరమైన అభిప్రాయాలు లేవని బాగా తెలుసు నతాషకి. అతను తండ్రి చేతిలో పావుగా మారడం, కాత్యలో ప్రేమలో పడడం ఆమె దృష్టిని దాటిపోవు.

తల్లిదండ్రులని విడిచి వచ్చిన నతాష కి మిగిలింది వాన్య మాత్రమే. అతని దగ్గర ఆమెకి దాపరికాలు ఏవీ లేవు. నతాష-వాన్యాల స్నేహం గురించి బాగా తెలుసు అయోషకి. అతనికి కూడా వాన్య అంటే ఇష్టం. ఎంతగా అంటే, తను అటు నతాషా ప్రేమకీ, ఇటు కాత్య  ప్రేమకీ మధ్య నలిగిపోయినప్పుడు వాన్యని సలహా అడిగేటంత. ఓపక్క ఆయోష, కాత్యాలని దగ్గర కానిస్తూనే, ఆయోషతో పెళ్ళి జరిపిస్తానని నతాష కి మాట ఇస్తాడు ప్రిన్స్, అది కూడా తన కొడుకు, వాన్యాల సమక్షంలో.

ప్రిన్స్ ఎలాంటివాడో నతాషకి బాగా తెలుసు. తన తండ్రికి జరిగిన అన్యాయం ఆమె మర్చిపోయేది కాదు. అలాంటి అన్యాయాన్నే తనకీ తలపెడుతున్నాడని సులభంగానే అర్ధం చేసుకుంది. మరోపక్క ఆయోష ఊగిసలాట కూడా తెలుసు నతాషకి. పరిస్థితులు తనకి పూర్తిగా ఎదురు తిరిగినా, ఆమె ఆయోష పక్షాన్నే నిలబడుతుంది. ఆయోష విషయమై, కాత్య తనని కలుసుకున్నప్పుడు సైతం ఎంతో స్థిత ప్రజ్ఞత చూపుతుంది నతాష.

చిన్న వయసులోనే జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు తిన్న ఆ అమ్మాయి, వ్యతిరేక పరిస్థితులని ఎదుర్కొన్న విధానం, తన భవిష్యత్తుని నిర్ణయించుకున్న తీరు ఆమె మనకి గుర్తుండిపోయేలా చేస్తాయి. సమస్యల నుంచి ఎన్నడూ పారిపోలేదు నతాష. అలాగే, ఆయోష మీద ఆమె ప్రేమలోనూ ఎలాంటి మార్పూ లేదు. అతని స్వచ్చత మీద ఎలాంటి సందేహమూ లేదామెకి. ఈ లక్షణాలే నతాషని ప్రత్యేకంగా నిలుపుతాయి. రష్యన్ రచయిత దస్తయే వస్కీ నవల 'తిరస్కృతులు' లో ఒక నాయిక నతాష. ఈమెతో పాటుగా, మరోనాయిక నీలీ సైతం పాఠకులని వెంటాడుతుంది, పుస్తకం పక్కన పెట్టాక చాలా రోజులపాటు.