శుక్రవారం, జనవరి 31, 2020

మెట్ట వంకాయ పచ్చడి

ఆకుపచ్చ రంగులో మిలమిలా మెరుస్తూ, గుండ్రంగా, గుండుచెంబుల్లా ఉండే వంకాయలకి మెట్ట వంకాయలు అని పేరు.  వీటిని అల్లం, పచ్చిమిర్చి,  కొత్తిమీర కారంతో కూర చేసుకోవచ్చు. అలాగే కాల్చి పచ్చడి కూడా చేసుకోవచ్చు.  బండ పచ్చడి, పులుసు పచ్చడి, పచ్చి పులుసు.. ఇలా కొద్దిపాటి మార్పులతో రకరకాల పచ్చళ్ళు చేసుకునే వీలు కూడా ఉంది. జుట్టున్నమ్మ ఏకొప్పు చుట్టినా అందమే అన్నట్టుగా, అసలంటూ నవనవలాడే వంకాయలు దొరకాలే కానీ ఏ పచ్చడి చేసుకున్నా రుచే. అన్నట్టు, 'మిథునం' అప్పదాసు చెప్పే వంకాయ బజ్జి పచ్చడి కూడా ఈ కోవలోదే.  పచ్చట్లో కొత్తిమీర తత్వాలు పాడేప్పుడు తంబూరా శ్రుతిలా, అసలు విషయాన్ని మింగేయని విధంగా ఉండాలని ఆ కథ చదివిన వాళ్లకి  వేరే చెప్పక్కర్లేదు కదా. 

మా చిన్నప్పుడు పెరట్లో నీళ్ళపొయ్యి మీద ఇంటిల్లిపాదికీ స్నానాలకి వేడి నీళ్లు కాచడం రోజూ ఓ మహా యజ్ఞం. పొద్దున్నే తోటకి వెళ్లిన నాన్నో, తాతో వస్తూ వస్తూ కూరలు తెచ్చేవాళ్ళు. వాటిలో ఈ వంకాయలు కనక ఉంటే, వాటిని పొయ్యిలో కాల్చే డ్యూటీ కూడా నీళ్లు కాచే వాళ్లదే. బజ్జి పచ్చడికి తాజా వంకాయ కన్నా వడిలిన వంకాయ శ్రేష్టమని అప్పదాసుగారు అప్పటికింకా చెప్పలేదు మరి. నీళ్ళపొయ్యి స్థానంలో గ్యాస్ స్టవ్ వచ్చినా, రోలు-రోకలి బండల్ని మిక్సీ రీప్లేస్ చేసినా మెట్ట వంకాయలు దొరికినప్పుడల్లా పచ్చడి చేసుకోవాల్సిందే.  ముందుగా వంకాయలకి కాస్త నూనె పట్టించి, చిన్న బర్నర్ల ని లో ఫ్లేమ్ లో పెట్టి సమంగా కాల్చుకోవాలి. వంకాయ ఎంత వైనంగా కాలితే పచ్చడి అంత రుచిగా వస్తుందన్న మాట. వంకాయతో చేసే ఏ పచ్చడికైనా కాల్చడం కామనే. 


కాల్చిన వంకాయల్ని చల్లార్చి, మాడిన పైపొరని జాగ్రత్త తీసి, ముచికలు కోసేసి, గుజ్జుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. కాలిన నుసి పొరపాటున గుజ్జులో కలిసిపోకుండా చూసుకోడంతో పాటు, వంకాయలు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నా పొట్టలో పురుగూ పుట్రా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి, గుజ్జుని కొంచం జాగ్రత్తగా మెదిపి పరిశీలించుకోవడం అవసరం. గుజ్జు మీద కాస్త పసుపు చల్లి, చెంచా సాయంతో మెత్తగా, గరిటజారుగా చేసుకోవాలి. అవసరమైతే కొంచం నీళ్లు కలుపుకోవచ్చు. ఈ గరిటెజారు గుజ్జుని ఓ పక్కన పెట్టుకుని, ఏ రకం పచ్చడి చేసుకోవాలి అన్నది అప్పుడు తీరికగా ఆలోచించుకోవచ్చు. ఈ గుజ్జుతోబాటే కావాల్సిన మరో దినుసు చింతపండు రసం. కాబట్టి, ఓ పక్క వంకాయలు కాలుతూ ఉండగానే చిన్న గిన్నెలో చింతపండు నానబెట్టేసుకుంటే పచ్చడి సమయానికి రసం రెడీగా ఉంటుంది. 

పచ్చడి బాగా సంప్రదాయంగా ఉండాలి అనుకుంటే, బాండీలో మూణ్ణాలుగు చెంచాల నూనె వేసి, వేడెక్కుతూ ఉండగా ఇంగువ, మెంతులు, ఆవాలు, సన్నగా తరిగిన పచ్చిమిరప ముక్కలు ఒక్కోటీ వేసి వేగిస్తూ, చివర్లో చిక్కని చింతపండు రసం పోసి, తగినంత ఉప్పు, కొంచం బెల్లం వేసి కలపాలి. సన్నసెగ మీద ఉడుకుతూ, పైకి నూనె తేలేటప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న గుజ్జుని బాండీలోకి దింపి బాగా కలిసి కాసేపు అదే సెగలో ఉంచి, గుజ్జు బాండీని విడిచిపెడుతున్న వేళ స్టవ్ కట్టేసి, పైన సన్నగా తరిగిన కొత్తిమీర జల్లేసుకోడమే. వేడివేడి అన్నం లోకి, చపాతీ, దోశల్లోకి కూడా బాగుంటుందీ పచ్చడి.  ఉప్పుడు పిండి తెలిసిన వాళ్ళకి, అందులోకి ఇది మాంచి కాంబినేషన్ అని కూడా తెలిసే ఉంటుంది. ఫ్రిజ్ లో పెట్టకపోయినా రెండు రోజులు నిలవుంటుంది, ఈ పద్దతిలో చేసిన పచ్చడి. 


ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు ఇదే పచ్చడిని. ఇంగువ, పచ్చిమిర్చికి బదులుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఎండు మిర్చి ముక్కలు వేసుకోవాలి బాండీలో. చింతపండు రసం పల్చగా చేసి వేసుకుని, రసం పొంగుతుంటే గుజ్జు కలిపి, కాసేపు మరగనిచ్చి స్టవ్ కట్టేయడం ఒక పద్దతి. పేరుకి పచ్చడే కానీ చిక్కని పులుసులాగా ఉంటుంది చూడ్డానికి. పచ్చిపులుసు చేసుకోడం ఇంకో పద్దతి. దీనికి పచ్చిమిచ్చి ముక్కలే కావాలి మళ్ళీ. వంకాయ గుజ్జులో, పచ్చి ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు రసం, ఉప్పు, బెల్లం కలిపి, అటుపైని గరిటె పోపు వేసేయడమే. ఈ పోపుకి గానుగ నూనె కానీ, నెయ్యి కానీ వాడితే రుచి ఇనుమడిస్తుంది. అలాగే కొత్తిమీర బదులు, పోపులో కర్వేపాకు చేర్చుకోవచ్చు.  కావాలంటే శనగపప్పు, మినప్పప్పు విడిగా వేగించి కలుపుకోవచ్చు. 

అన్నట్టు, 'మెట్ట వంకాయలతో చట్నీ చేసేదా'  అంటూ  ఎస్వీ కృష్ణారెడ్డి ఎగిరే పావురం లైలా చేత పాడించింది ఈ పచ్చడి గురించే. ఇంతకీ, చిన్నప్పుడు చేసే రోటి పచ్చడి ఎలా ఉండేదంటే కాల్చి, తొక్కతీసిన వంకాయలు రోట్లో వేసి బండతో నూరేవారు. రుచిలో ప్రధానమైన తేడా ఇక్కడే వస్తుంది. మనం ఈ చెంచాలు అవీ వాడి ఎంత జాగ్రత్తగా చేసినా ఆ బండ తాలూకు రుచి రాదుగాక రాదు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, రోళ్లలో వాడే పచ్చడి బండలు ఎర్ర చందనపు దుంగల నుంచి చేసేవాళ్ళు. పైగా రోకలికి ఉన్నట్టుగా బండకి పొన్ను ఉండదు కాబట్టి, వద్దన్నా కాస్త ఎర్ర చందనం ఈ పచ్చళ్లలో కలుస్తూ ఉంటుంది. నాటి పచ్చళ్ళ రుచి తెలియని వాళ్లకి నేటి పచ్చడి రుచి మేటిగానే ఉంటుంది. తెలిసిన వాళ్ళు కూడా చేసేదేమీ ఉండదు, చిన్న నిట్టూర్పుతో సరిపెట్టేసుకోడం తప్ప!  

బుధవారం, జనవరి 29, 2020

ఒక మనిషి... ఒక ఇల్లు... ఒక ప్రపంచం...

తమిళనాడు లోని మారుమూల పల్లెటూరు కృష్ణరాజపురానికి తన తండ్రి తాలూకు మూలాలు వెతుక్కుంటూ వస్తాడు హెన్రీ. మూడు దశాబ్దాల క్రితం ఓ తెల్లవారుజామున తన తండ్రి తాళం వేసిన ఒక ఇంటికీ, కొద్దిపాటి పొలానికి వారసుడతను. హెన్రీ నుంచి 'పప్పా' అని పిలుపు రావడం ఆలస్యం, 'కన్నా' అంటూ బదులిచ్చేవాడు సభాపతి పిళ్ళై. కొడుకు మీద ఎంత ప్రేమంటే, విడిచి ఉండలేక బిడ్డని బడికి కూడా పంపలేదు. 'ఏదోలా బతకలేక పోడు' అని మొండి ధైర్యం. అక్షరాలా తల్లిదండ్రుల ప్రేమతోనే పెరిగాడు హెన్రీ. మొదట తల్లి, ఆ వెనుక తండ్రి లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మరణించే ముందు, హెన్రీ కి వారసత్వపు ఆస్తి తాలూకు పత్రాలనీ, ఇంటి తాళాన్నీ అందించాడు సభాపతి పిళ్ళై. 

ఆ ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన హెన్రీ కి ఎదురైన అనుభవాలే జయకాంతన్ తమిళంలో రాయగా, జిల్లేళ్ళ బాలాజీ తెనిగించిన 'ఒక మనిషి... ఒక ఇల్లు... ఒక ప్రపంచం...' నవల. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ నవలని, అకాడెమీ ప్రచురణల విభాగం అచ్చులోకి తెచ్చింది. మూల నవల 'ఒరు మనితన్ ... ఒరు వీడు... ఒరు ఉలగం...' 1973 లో విడుదలైతే తెలుగు అనువాదం 2012 లో ముద్రితమయ్యింది. కొండల మధ్యలో వాగు ఒడ్డున ఉన్న కృష్ణరాజపురమే కథా స్థలం. బెంగళూరు నగరం నుంచి ఆ ఊరికి వచ్చిన హెన్రీ తప్ప, నవలలో మిగిలిన పాత్రలన్నీ స్థానికమైనవే. ఉండీ లేనట్టుగా బస్సు సౌకర్యం ఉన్న ఆ ఊరిని చేరుకోడానికి దొరైకణ్ణు నడిపే లారీని ఆశ్రయిస్తాడు హెన్రీ. అదే లారీలో సహా ప్రయాణికుడు, ఆ ఊరి బళ్ళో డ్రిల్ మేష్టారు అయిన దేవరాజన్, హెన్రీని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. 

ఇంతకీ దేవరాజన్ ఎదురిల్లే సభాపతి పిళ్ళైది. కొన్నేళ్ల క్రితం ఆ ఊరి క్షురకుడు పళని అదే ఇంటి అరుగు మీద ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం హెన్రీ కి చెబుతాడు దేవరాజన్. 'పప్పా' ద్వారా పళని గురించి విని ఉన్నాడు హెన్రీ, కానీ అతడు మరణించాడన్నది కొత్త విషయం. పప్పా మాటల్లో కృష్ణరాజపురాన్ని గురించి అనేకసార్లు విని ఉండడం వల్ల ఊరు మరీ కొత్తగా అనిపించలేదు హెన్రీకి. కానీ, ఆ ఊరి వాళ్లకి మాత్రమే హెన్రీ కొత్తగానూ, వింతగానూ అనిపించాడు. అతని కనుపాపలు నీలంగా ఉన్నాయ, అయితే అతని ఒంటిరంగు తెల్లదొరల లాగా లేదు. తలవెంట్రుకలు మాత్రం పూర్తిగా నల్లగా కాక కాస్త ఎర్రగా ఉన్నాయి. అతని రుమేనియా ముక్కు ఆ ప్రాంతపు మనుషుల్లో కనిపించని విధంగా ఉంది. "ఇతడితో తెలుగులో మాట్లాడితే అర్ధమవుతుందా?" అనే సందేహమే ఊరి వారందరికీ. 


దేవరాజన్ ఇంటికి పెద్దదిక్కు బాల్య వితంతువైన అతని సోదరి అక్కమ్మ. తమ్ముడి స్నేహితుడిని ఎంతగానో ఆదరిస్తుందామె. ఆ ఇంటికి హెన్రీని వారసుడిగా నిర్ణయించే నిమిత్తం ఊరి మునసబు పంచాయితీ ఏర్పాటు చేసేలోగా అందరితోనూ కలివిడిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంటాడతను.  దేవరాజన్ కైతే ఎంతో ఆప్తుడు అయిపోతాడు. హెన్రీ తన పప్పా చనిపోయిన మూడో రోజునే బెంగుళూరు విడిచి ఆ పల్లెకి వచ్చేశాడని తెలిసి ఆశ్చర్యపోతాడు దేవరాజన్. పరమ నిష్టాగరిష్టుడిగా జీవించిన సభాపతి పిళ్ళై ఓ తెల్లవారు జామునే ఇంటికి తాళం వేసి భార్యతో సహా ఊరినుంచి అదృశ్యం అయిపోడాన్ని గురించే ఇంకా వింతగా చెప్పుకుంటున్న ఆ ఊరి జనానికి, సభాపతికి హెన్రీ లాంటి బిడ్డ కలగడం ఎలా సాధ్యమో అర్ధం కాదు. మామూలు పంచాయితీల కన్నా, ఈ పంచాయితీ ప్రత్యేకమైనది అవుతుంది ఊరి పెద్దమనుషులకి. 

మునసబు నిర్వహించిన పంచాయితీలో తాను సభాపతి పిళ్ళై వారసుణ్ణి అనే ఆధారాలు అన్నీ చూపిస్తాడు హెన్రీ.  వాళ్ళ కోరిక మేరకు తన తల్లిదండ్రుల ఫోటోని చూపిస్తాడు. పిళ్ళై ఒక విదేశీ వనితతో ఉన్న ఆ ఫోటోని చూసి నిట్టూరుస్తారు వాళ్ళు. ఇన్నాళ్లూ పిళ్ళై ఆస్తిని అనుభవించింది మరెవరో కాదు, హెన్రీని కృష్ణరాజపురం తీసుకొచ్చిన లారీ డ్రైవర్ దొరైకణ్ణు. సభాపతి పిళ్ళైకి సాక్షాత్తూ తమ్ముడతను. కొంచం మొరటు మనిషి. ఐదుగురు సంతానం. అత్తగారింట్లో ఉంటూ, అన్నగారి భూములని చూసుకుంటూ ఫలసాయం అనుభవిస్తున్నాడు. పెద్దమనుషుల్లో కొందరికి కొత్తగా వచ్చిన హెన్రీకి ఆస్తిని అప్పగించడం అంటే దొరైకణ్ణుకి అన్యాయం చేయడమే అన్న ఆలోచన వస్తుంది. గొడవ చేయమని, కోర్టుకి వెళ్ళమని దొరైకణ్ణుకి సలహాలిస్తుంటారు కూడా. అయితే, మునసబు మాత్రం సాక్ష్యాలన్నీ పరిశీలించి హెన్రీని సభాపతి పిళ్ళై వారసుడిగా ప్రకటిస్తాడు. దొరైకణ్ణు సంతకం చేయాల్సిన ఆస్థిపత్రం  తయారు చేయిస్తాడు. 

ఆ పత్రానికి దొరైకణ్ణు చెప్పిన ఒకే ఒక్క అభ్యంతరం - తన అన్న సభాపతి పిళ్ళై కొడుకు పేరుని హెన్రీ పిళ్ళై అని మార్చాలని!!  హెన్రీ అందుకు అంగీకరించడంతో అప్పటికప్పుడే ఆ మార్పు చేసేస్తారు. అయితే ఆ తర్వాత హెన్రీ తీసుకున్న నిర్ణయం ఊరివారినే కాక, నవల చదువుతున్న పాఠకులనీ ఆశ్చర్య పరుస్తుంది. ఇంతకీ సభాపతి పిళ్ళై  ఊరినుంచి ఉన్నట్టుండి ఎందుకు మాయమయ్యాడు?  పళని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? పిళ్ళై భార్య స్థానంలోకి విదేశీ వనిత ఎలా వచ్చింది? లాంటి ప్రశ్నలతో పాటు కథలో కీలక పాత్రల వ్యక్తిత్వాలని దగ్గరగా తెలుసుకోవాలంటే 'ఒక మనిషి... ఒక ఇల్లు... ఒక ప్రపంచం...' నవలని చదవాల్సిందే. బాలాజీ అనువాదం సాఫీగానే సాగినా, మిక్కిలిగా కనిపించే అచ్చుతప్పులు చికాకు కలిగిస్తాయి. నవలతో పాటు మనస్తత్వ చిత్రణకి పెట్టింది పేరైన జయకాంతన్ రాసిన ముందుమాటని తప్పక చదవాల్సిందే. (పేజీలు 226, వెల రూ. 110, కేంద్ర సాహిత్య అకాడెమీ స్టాళ్లలో లభ్యం). 

సోమవారం, జనవరి 27, 2020

మిత్రుడి సమాధి

ఊరి శివార్లలో పంట కాలువ పక్కనే కొబ్బరి తోట. ఆ తోట మధ్యలో ఓ పాక. ఆ పాక పక్కనే రోడ్డు మీదకి కనిపించేలా ఓ సమాధి. ఆ సమాధి నా మిత్రుడిది. మా ఊరికి వెళ్లాలన్నా, ఊరినుంచి రావాలన్నా ఆ సమాధి మీదుగానే ప్రయాణించాలి. అలా ప్రతిసారీ ఊరికి వెళ్లేప్పుడు, వచ్ఛేప్పుడూ కూడా అతన్ని తల్చుకోకుండా ఉండడం కుదరదు. రీల్ కెమెరా నుంచి డిజిటల్ కెమెరా మీదుగా స్మార్ట్ ఫోన్ కెమెరాకి వచ్చినా ఎప్పుడూ ఆ సమాధిని ఫోటో తీయబుద్ధి కాదు. కానీ అతనితోనూ, ఆ సమాధితోనూ నా జ్ఞాపకాలు ఎన్నెన్నో. 

నేను ఆరోతరగతిలో చేరాక, మా ప్రభుత్వోన్నత పాఠశాలలో తగినంతమంది టీచర్లు లేకపోవడం నన్నో పుంభావ సరస్వతిగా చూడాలనుకున్న మా ఇంట్లో వాళ్ళని కొంచం ఇబ్బంది పెట్టింది. అదే సమయంలో మా ఊళ్ళోనే ఉన్న డిగ్రీ స్టూడెంట్ ఒకతను ట్యూషన్లు చెప్పడం మొదలు పెట్టడంతో నన్నూ అందులో చేర్చారు. ఐదేళ్ల పాటు మేం చదువుకున్న చిన్న బడి (ప్రాధమిక పాఠశాల) ఆవరణలోనే సాయంత్రం వేళల్లో ప్రయివేటు ఉండేది. ఆ బడి పక్కనే పంచాయతీ ఆఫీసు, ఆటస్థలం కూడా ఉండేవి. 

మా ట్యూషన్ మేష్టారిది కొంచం పైలా పచ్చీసు వ్యవహారం. వారంలో కనీసం రెండు మూడు రోజులు ఆయన టైముకి వచ్చేవారు కాదు. ఒక్కోరోజు వచ్చేవారే కాదు. అయినా కూడా మేము క్రమం తప్పకుండా ప్రయివేటుకి హాజరయ్యేవాళ్ళం, ఇళ్ల నుంచి ఆటవిడుపు కోసం. పంచాయితీ ఆఫీసు పక్కనే ఉన్న ఆటస్థలంలో కబడ్డీ ప్రాక్టీసు జరిగేది ప్రతి సాయంత్రమూ. అది చూడడం కొందరికి వినోదం. ఆ పక్కనే గోళీలు, గూటీ బిళ్ళ లాంటి క్రీడా సంరంభాలూ జరుగుతూ ఉండేవి. మిగిలిన మిత్రులు వాటిలో సర్దుకునే వాళ్ళు. 

నాకు మొదటి నుంచీ క్రీడా స్ఫూర్తి బొత్తిగా లేదు. కాబట్టి నాకు మిగిలిందల్లా పంచాయితీ ఆఫీసులో ఉండే రేడియో వినడం. వ్యవసాయం పనులు పూర్తి చేసుకున్న రైతులు, కొందరు యువకులూ కూడా చేరేవాళ్ళు, వార్తలు వినడానికి. అదిగో అక్కడ కలిశాడీ మిత్రుడు. మా ట్యూషన్ మేష్టారి కాలేజ్మేట్. ఒకే ఊరి వాళ్ళం కావడంతో పరిచయాలు అవసరం లేదు. ఇద్దరి ఇళ్లూ ఊరికి చెరో చివరా ఉన్నా, వాళ్ళ నాన్నా, మా నాన్నా మంచి స్నేహితులు. అలా ఒకరి గురించి మరొకరికి తెలుసు. నాలాగే ఆటలు చూస్తూ, రేడియో వినేవాడు. చేతిలో తప్పనిసరిగా పుస్తకమో, న్యూస్ పేపరో ఉండేవి. 

మేష్టారు రాని ఓ సాయంత్రం నేను రేడియో వింటూ ఉంటే, తనొచ్చి, పలకరించి, పక్కన కూర్చున్నాడు. కబుర్లు మొదలయ్యాయి. అవి ఎంతకీ తెగలేదు. ఆశ్చర్యం ఏమిటంటే, తన వయసులో దాదాపు సగం వయసున్న నన్ను తనతో సమంగా చూసి మాట్లాడాడు. అది మొదలు, ట్యూషన్ లేనప్పుడల్లా తనతో కబుర్లు సాగేవి. గ్రామ రాజకీయాల మొదలు, దేశ రాజకీయాల వరకూ మేం మాట్లాడుకోని విషయం ఉండేది కాదు. ఊళ్ళో జరిగే పంచాయితీ తగువుల్లో కొన్ని తీర్పులు మా వాకిట్లోనే జరిగేవి కాబట్టి, అప్పటి మా ఊరి రాజకీయాలు నాకు కొట్టిన పిండి. స్కూల్ అసెంబ్లీ లో వార్తలు చదవడం కోసం పేపరు చదవడం కొత్తగా అలవాటు చేసుకుంటున్న రోజులు. ఇక రేడియోతో అనుబంధం చిన్నప్పటినుంచీ పెరిగిందే. 

తన ఈడు వాళ్ళు నవ్వుతున్నా పట్టించుకోకుండా, నేను గనుక ఖాళీగా ఉంటే అతను నాతో కబుర్లు చెప్పేందుకే ఉత్సాహ పడేవాడు. అప్పటికే చదివిన కథలు, అప్పుడే చదవడం మొదలు పెట్టిన యద్దనపూడి నవలల్ని గురించిన నా జ్ఞాన ప్రదర్శనని తను చెంపకి చేయి ఆన్చుకుని శ్రద్ధగా వినడం ఇప్పటికీ గుర్తుంది. ఆరోజుల్లో అతని గురించి తెలిసిన విశేషం ఏమిటంటే, ఊరి చివర కాలువ పక్కన ఉన్న వాళ్ళ కొబ్బరి తోటలో ఉన్న పాక అంటే తనకి చాలా ఇష్టమని, ఇంట్లో కన్నా ఎక్కువసేపు అక్కడే గడుపుతాడనీను. "చదువుకోడానికి అక్కడ బాగుంటుంది" అనేవాడు. నాక్కూడా ఎప్పటికైనా అలాంటి ఏర్పాటు దొరుకుతుందేమో అని కలలు కన్నాను. 

ఇలా ఓ ఏడాది గడిచిందేమో. ఉన్నట్టుండి ఊరు అట్టుడుకిపోయే వార్త. తనకి ఇష్టమైన పాకలోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. (ఈ వాక్యం రాస్తుంటే మరోసారి ఒళ్ళు జలదరించింది). నాకేమీ అర్ధం కాలేదు. దుఃఖం రాలేదు. చిన్న వాడిని కాబట్టి అతన్ని చివరగా చూసేందుకు వెళ్లే స్వేచ్ఛ లేదు. సాయంత్రానికి వచ్చిన ఒకే ఒక్క ఆలోచన అతను నన్ను మోసం చేశాడని. ఈ ఆలోచన చాన్నాళ్లే వెంటాడింది. అతను వాళ్ళ నాన్నకి చివరి ఉత్తరం రాశాడు. తన డైరీని చితిలో కాల్చేయమని. ఊళ్ళో తగుమాత్రం పెద్దమనుషులు అందులో ఏముందో చదవమని సలహా ఇచ్చినా వినకుండా కొడుకు కోరిక తీర్చారాయన. 

ఊరి పద్ధతికి విరుద్ధంగా శ్మశానంలో కాకుండా ఆ పాక పక్కనే అంత్యక్రియలు చేసి, అక్కడే అతనికో సమాధి కట్టారు. కొన్నాళ్ళకి అతని ఆత్మ అక్కడే తిరుగుతోందని పుకార్లు లేచాయి ఊళ్ళో. మరో మూడేళ్ళ తర్వాత నేను కాలేజీ చదువుకి వచ్చాను. పక్కూళ్ళో కాకుండా, పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీలో చేరాల్సి వచ్చింది. ఇష్టం లేని కాలేజీ, బుర్రకెక్కని కోర్సు, శరీరంలో ఒక్కసారిగా వచ్చిపడిన మార్పులు, రోజూ ఎడతెగని సైక్లింగ్, ఇవి చాలవన్నట్టుగా ఇంటి వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు.. ఉన్నట్టుండి జీవితం అస్తవ్యస్తంగా మారిపోయిన కాలమది. అప్పుడు మరింత బలంగా అనిపించేది, అతనుంటే బాగుండేదని. 

కాలేజీ నుంచి ఇంటికి వచ్చేప్పుడు రోజూ బాగా చీకటి పడిపోయేది. సైకిల్ డైనమో లైట్లు కాలేజీ పార్కింగు లో తరచూ దొంగతనం జరిగేవి.  ఎటూ పోయేదే కాబట్టి, లైటు ఉండేది కాదు సైకిల్ కి. అప్పటికింకా వీధి దీపాలు పూర్తిగా రాలేదు. చీకట్లో ఆ పాక పక్క మట్టి రోడ్డు మీంచి రావాలంటే ఊళ్ళో పెద్ద వాళ్ళు కూడా లోపల్లోపల భయ పడేవాళ్ళు. నాకు మాత్రం ప్రతి రోజూ ఆశే, అతని ఆత్మ కనిపించి పలకరిస్తుందేమో అని. ఆత్మలు లేవు అనే హేతువుకీ, ఉంటే తప్పేంటి అనే మనసుకీ నిరంతర ఘర్షణ. మనసు బొత్తిగా బాగోని రోజుల్లో ఇంటికెళ్లడానికి ముందు కావాలనే అక్కడ సైకిల్ ఆపి, కాసేపు నిలబడేవాడిని. ఆ దారిలో ఇంకెవరైనా కనిపిస్తే, సైకిలు చైను ఇబ్బంది పెట్టినట్టు నటించేవాడిని. 

పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న సమయాల్లో 'అతని దారిలోనే వెళ్తే' అన్న ఆలోచనలు బలంగా వచ్చేవి. కానీ, అతను చేసిన పనిని నేను ఏనాడూ మెచ్చక పోగా తీవ్రంగానే వ్యతిరేకించాను, లోపల్లోపలే. ఈ సంఘర్షణ లోంచి కూడా ఎన్నో ప్రశ్నలు పుట్టేవి, అతన్ని గురించి. కాలం గడిచే కొద్దీ నా సమస్యలు రూపం మార్చుకుంటూ వచ్చాయి తప్ప సమసిపోలేదు. నాకు మాత్రం వాటిని ఎదుర్కొనే శక్తి కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చింది. తర్వాత జీవితంలో నా వయసు వాళ్ళ కన్నా పెద్ద వాళ్ళతో సులువుగా స్నేహాలు కుదిరాయి. నా తోటి వాళ్ళకి నా స్నేహాలెప్పుడూ ఆశ్చర్యంగానే ఉండేవి. 

ముళ్ళూ, రాళ్ల దారుల్లో జీవితపు ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఆ రోడ్డున వెళ్లేప్పుడు అతనోసారి కనిపిస్తే బాగుండునని బలంగా అనిపిస్తూ ఉంటుంది. తేడా అల్లా ఇప్పుడు నేను ఎదురు చూసేది అతని భుజం కోసం కాదు. నేను చేసిన ప్రయాణాన్ని గురించి చెప్పి, 'నేనే చేసినప్పుడు, నువ్వెందుకు ఈ ప్రయాణం చేయలేకపోయావు?' అని నిలదీయడానికి. 'నువ్వు నాకన్నా చిన్నవాడివి అయ్యుంటే, ఆ నిర్ణయం తీసుకుని ఉండేవాడివి కాదేమో' అని చెప్పడానికి. కానీ లోపలెక్కడో, ఏమూలో ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి - 'ఏ పరిస్థితులు, ఏ క్షణాలు అతన్నా నిర్ణయం తీసుకునేలా చేశాయో?' అని. ఈ సంఘర్షణ, బహుశా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే, అతని సమాధి నాకు ఫోటోగా దాచుకునే ఒక జ్ఞాపకం కాదు. అంతకు మించి చాలా చాలా... మాటల్లో చెప్పలేనంత... 

శుక్రవారం, జనవరి 24, 2020

పదకొండు

"తలంటోసుకుని..." చిన్నప్పుడు నా పుట్టినరోజుకి నేనేం చేయాలో నా పాటికి నేను ప్లాన్లేసుకుంటుంటే అమ్మో, బామ్మో ఈ 'తలంటు' ని గుర్తు చేసే వాళ్ళు. తలమీంచి కళ్ళు, ముక్కు, నోరు మీదుగా జారే కుంకుడుకాయ పులుసు ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చి ప్లాన్లన్నీ పైకెగిరి పోయేవి. కాసేపటి తర్వాత మళ్ళీ మామూలే. పండగలకీ తలంటు తప్పదు కానీ, పుట్టినరోజు తలంటు ప్రత్యేకం. పండగ నాడు ఇంటిల్లిపాదికీ అయితే, పుట్టిన్రోజున మనొక్కళ్ళకే తలంటన్న మాట. నీళ్లు మరికాస్త వేడిగా కాచి, పులుసు మరికొంచం చిక్కగా కలిపి, తల మాసినట్టైతే పులుసులో కాసిని మందారాకులు కలిపి, పాయసానికన్నా ముందు కుంకుడుకాయ పులుసు తాగించి, ఆపై ఉప్పుకల్లద్దిన చింతపండు తినిపించి.. అబ్బో, అదో మహా క్రతువు. 

కాలక్రమంలో పులుసు ఇబ్బంది పెట్టని విధంగా తలంటుకునే చిట్కాలు నేర్చుకోడం మొదలు, రానురానూ సీకాయ సబ్బు, అటుపై షాంపూ లాంటి ప్రత్యామ్నాయాలకి మళ్లడం వరకూ తలంటులో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. అలాగే 'తలంటు' కి ఉన్న నానార్ధాలు మరింత బాగా తెలిసొచ్చాయి. అక్కడినుంచీ తలంట్లు పోయడం, పోయించుకోడం అనే శాఖా చంక్రమణంలో జీవితం సాగిపోతోంది. ఇంతకీ ఇప్పుడిలా తలంటు, పుట్టిన్రోజూ జమిలిగా జ్ఞాపకం రావడానికి కారణం ఏమిటీ అంటే, పెద్ద కారణమే ఉంది. 'నెమలికన్ను' పదకొండో పుట్టినరోజివాళ. అంటే, పుట్టినరోజు బ్లాగుకీ, తలంటు నాకూ అన్నమాట. ముందుగా 'హేపీ బర్త్ డే నెమలికన్ను!!'


ఈ శుభసమయంలో కాస్త సోలిలోక్వీ.. ఏడాది క్రితం ఏమనుకున్నానంటే, ఎప్పటినుంచో రాయాలని అలా అలా వాయిదా వేస్తున్న కబుర్లు, కథలు వచ్చే ఏడాది కాలంలో వరస పెట్టి రాసేయాలి అని ఘాట్టి నిర్ణయం తీసుకున్నా. ఏడాది తిరిగాక ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కరిగిపోయిన కాలం 'వెవ్వేవ్వే' అని వెక్కిరిస్తోంది. రాయాల్సినవన్నీ బుర్రలోనే ఉండిపోయాయి. వాటిని రాయడమో, మర్చిపోడమో చెయ్యకపోవడం వల్ల కాబోలు, కొత్త డేటా ఏదీ పెద్దగా బుర్రలోకి వెళ్లలేదీ ఏడాది. జీవితావసరాలనో, ఊపిరి సలపని పనులనో వంక వెతుక్కోడం నాకే నచ్చడం లేదు. ఎందుకంటే, అవి ఎప్పుడూ ఉండేవే. "అవి కాస్త సద్దు మణిగాక" అనుకోడానికీ, కెరటాలు తగ్గాక సముద్ర స్నానం చేద్దాం అని ఎదురు చూడ్డానికీ  పెద్దగా తేడా ఉండదు. 

ఉన్నట్టుండి నేనిలా ఆత్మగతంలో పడ్డానికి కారణం లేకపోలేదు. బ్లాగు పాఠకుల నుంచి అప్పుడప్పుడూ వస్తున్న మెయిలుత్తరాలు పదేపదే ఆలోచనల్లో పడేస్తున్నాయి. "ఈమధ్య రాయడం బాగా తగ్గిపోయింది.." "పాత పోస్టులు మళ్ళీ చదువుతున్నా. కొత్తవి ఎప్పుడు రాస్తారు?" లాంటి వాక్యాలు ఓపక్క ఉత్సాహాన్ని ఇస్తూనే, కించిత్తు సిగ్గునీ కలిగిస్తున్నాయి. "అప్పుడప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాను కదా" అని సరిపెట్టుకుందామనుకున్నా, అంకెలు మోసం చేయవు కదా. బ్లాగులు మాత్రమే ఉన్న కాలంలో, బ్లాగ్మిత్రులు కొత్తపాళీ గారు కేలండర్ ప్రకారం టపాలు రాసేవారు. అది చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసేది. ఇంత టంచన్ గా ఎలా రాయగలుగుతారా అని. ఇప్పుడిప్పుడు అదే సరైన పధ్ధతి అనిపిస్తోంది కానీ, అంతలోనే అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదన్న స్పృహ కలుగుతోంది. 

ఈ హింసని కాస్త పక్కన పెట్టి, సింహావలోకనంలోకి వెళ్తే, గతేడాది మొదలుపెట్టి బాగానే కొనసాగించిన సిరీస్ 'వేటూరి పాట.' నా అభిమాన గీత రచయిత వేటూరి సుందర రామ్మూర్తి పాటల్లో నాకు ఇష్టమైన కొన్నింటి గురించైనా వివరంగా రాయాలన్న తాపత్రయంతో మొదలు పెట్టిన సిరీస్ ఇది. సినీ కవులెవరూ బూతుకి అతీతులు కాకపోయినా, అదేంటో వేటూరి అనగానే బూతురాశాడు అనేస్తూ ఉంటారు కొందరు, అదేదో పేటెంట్ లాగా. నిజానికి తేలికపాటలు రాసినా చెల్లిపోయే సినిమాలకి కూడా లోతైన భావం ఉన్న పాటలు రాశారు వేటూరి. అయితే, ఈ బూతు బ్రాండింగ్ ఆకర్షించినట్టుగా ఆ కృషి ఆకర్షించడంలేదు విమర్శకులని. వాళ్ళకేమీ చెప్పనవసరం లేదు కానీ, నాలాగే వేటూరి పాటల్ని ఇష్ట పడే వాళ్ళకోసం రాయాలనిపించి మొదలుపెడితే, నెమ్మదిగా సిరీస్ గా మారింది. 

నిజానికి నేను ముందుగా రాయాలన్న వాటిలో ఈ 'వేటూరి పాట' లేదు. కానీ, అనుకోకుండా మొదలై అలా అలా సాగుతోంది. పలికిస్తుంది వేటూరే. తప్పులేవి దొర్లినా అవి నావే. అభిమాన రచయిత్రి సోమరాజు సుశీల మరణం నన్ను బాగా బాధ పెట్టిన విషయాల్లో ఒకటి. రాయాల్సిన కథలింకా ఎన్నో ఉండగానే సెలవు తీసేసుకున్నారామె. చదివిన పుస్తకాల్లో పర్ల్ బక్ రాసిన 'ది గుడ్ ఎర్త్' ఇంకా వెంటాడుతోంది. వెంటాడుతూనే ఉంటుంది, బహుశా. చదవల్సినవి, రాయాల్సినవీ కూడా 'మా సంగతేంటి?' అంటూండగానే తగుదునమ్మా అంటూ పుట్టిన్రోజు వచ్చేసింది. ఏంచేయాలో తెలీకే ఈ తలంటి కార్యక్రమం అన్నమాట. మీరూ కాస్త పులుసు పొయ్యండి, పుట్టిన్రోజు ఊరికే వస్తుందా... 

గురువారం, జనవరి 02, 2020

'క్వీన్' రమ్యకృష్ణ

చిన్నప్పటినుంచీ చదువుని ఎంతగానో ప్రేమించిన 'శక్తి శేషాద్రి' పెద్దయ్యాక పెద్ద లాయర్ కావాలనుకుంది. తను చదివే కాన్వెంట్ స్కూల్లో చదువుతో పాటు, ఆటపాటల్లోనూ ముందుంటూ స్టూడెంట్ పీపుల్ లీడర్ గా ఎన్నికైంది. అంతే కాదు, పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రం మొత్తానికి ప్రధమ స్థానంలో నిలిచింది. కాలేజీలో చేరే క్షణం కోసం ఎదురుచూస్తున్న శక్తి  నెత్తిన "నువ్వింక చదవబోవడం లేదు" అంటూ ఓ బండరాయి వేస్తుంది ఆమె తల్లి రంగనాయకి, పెద్దగా పేరు లేని సినీ నటి. భర్త చనిపోయాక ఎంత కష్టపడి తన పిల్లలిద్దరినీ (శక్తి, ఆమె తమ్ముడు శ్రీకాంత్) పెంచుకొచ్చిందీ వివరంగా చెబుతుంది. 

పదిహేనేళ్ల శక్తికి తల్లి చెప్పేవేవీ పూర్తిగా బుర్రకెక్కవు. ఆమెకి అర్ధమయిందల్లా బాగా చదువుకోవాలనే తన కోరిక ఇక తీరదని. కొంత వాదన తర్వాత అయిష్టంగానే సినిమా షూటింగ్ కి బయలుదేరుతుంది. తనకి ఉన్న కాంటాక్ట్స్ సాయంతో కూతురికి ఓ సినిమాలో నాయికగా అవకాశం ఇప్పిస్తుంది రంగనాయకి. స్వతహాగా సిగ్గరి, ఉన్నదున్నట్టు మాట్లాడే తత్త్వం కలదీ అయిన శక్తికి ఆ సినిమా వాతావరణం ఎంత ఇబ్బంది కలిగిస్తుందంటే, ఆ షూటింగ్ పూర్తయ్యాక  మరే సినిమానీ ఒప్పుకోకూడదని బలంగా నిర్ణయించుకుంటుంది. సినిమాకి సంపాదించుకున్న పారితోషికంతో కాలేజీలో చేరొచ్చన్న ఆశా లేకపోలేదు. అయితే తల్లి ఆలోచనలు పూర్తిగా వేరు. తను ఓడిన చోటే కూతురు గెలవాలి అన్నది రంగనాయకి పట్టుదల. 

సినిమాలు చేయనని తల్లికి గట్టిగా చెప్పిన శక్తి తన మాటని తనే వెనక్కి తీసుకుంటుంది. తన అభిమాన హీరో జీఎమ్మార్ స్వయంగా ఇంటికొచ్చి కథానాయికగా అవకాశం ఇచ్చినప్పుడు మిగిలిన ఆలోచనల్ని (ఆ మాటకొస్తే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని) మర్చిపోతుంది శక్తి. అందమైన, తెలివైన శక్తి తక్కువకాలంలోనే అగ్ర నాయికగా అవతరిస్తుంది. ఒక్క జీఎమ్మార్ తోనే ఇరవై ఎనిమిది సినిమాల్లో జోడీ కడుతుంది. అయితే, సినిమా వాతావరణం ఆమెని ఏమీ మార్చలేదు. ఉన్నదున్నట్టు మాట్లాడే తన వైఖరితో ఎన్నో సమస్యలు తెచ్చుకుంది. పెళ్లి చేసుకుని తనకంటూ ఓ కుటుంబ జీవితం ఏర్పాటు చేసుకోవాలన్న కోరికనూ తీర్చుకోలేక పోయింది. కథానాయికగా తెరమరుగయ్యాక, తనకి ఏమాత్రం ఇష్టం లేని మరో రంగం రాజకీయాల్లోకి ప్రవేశించింది, కేవలం జీఎమ్మార్ కారణంగా. అతడి మరణానంతరం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగింది శక్తి శేషాద్రి.


కథ వింటుంటేనే తెలుస్తోంది కదా, శక్తి శేషాద్రి ఒక కల్పిత పాత్ర కాదు, అందరికీ బాగా తెలిసిన ఒకనాటి కథానాయిక మరియు దక్షిణాది రాష్ట్రపు మాజీ ముఖ్యమంత్రి అని. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్, మరో దర్శకుడు ప్రశాంత్ మురుగేశన్ తో కలిసి తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'క్వీన్' లో నాయిక శక్తి శేషాద్రి. అనిత శివరామకృష్ణన్ రాసిన 'క్వీన్' పుస్తకం ఈ వెబ్ సిరీస్ కి ఆధారం. టైటిల్ పాత్రలో మొత్తం ముగ్గురు నటించారు. పద్నాలుగు నుంచి పదహారేళ్ళ శక్తి గా అనిక, పదిహేడు నుంచి ఇరవై ఏడేళ్ల శక్తిగా అంజనా జయప్రకాశ్, అటుపైన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శక్తివంతమైన మహిళా నేత శక్తి శేషాద్రి గా రమ్యకృష్ణ వాళ్ళకిచ్చిన పాత్రల్లో జీవించారు అనడమే సబబు. 

ఓవర్ ది టాప్ (ఓటీటీ ) మీడియా సర్వీస్ ప్లాట్ఫామ్ మీద ఎమెక్స్ ప్లేయర్ స్ట్రీమింగ్ సర్వీసెస్  సంస్థ తమిళంలో నిర్మించి, తెలుగు సహా దక్షిణాది భాషల్లోకి, హిందీ లోకీ అనువదించి విడుదల చేసింది ఈ 'క్వీన్' ని. ప్రస్తుతం తొలి సీజన్ లో పదకొండు ఎపిసోడ్లు (ఒక్కొక్కటీ నలభై నుంచి యాభై ఐదు నిమిషాలు నిడివున్నవి) అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి స్ట్రీమింగ్ ఉచితమే. ఒక టీవీ వ్యాఖ్యాత నడివయసు శక్తి శేషాద్రిని ఆమె ఇల్లు 'రంగ నిలయం'లో ఇంటర్యూ చేయడంతో మొదలయ్యే ఈ సీజన్ మొత్తం శక్తి శేషాద్రి తన గతాన్ని ఇంటర్యూలో వివరించడం అనే పద్ధతిలో సాగి, జీఎమ్మార్ మరణం తర్వాత శక్తి రాజకీయ ప్రవేశం జరిగిన తీరు చెప్పి ఇంటర్యూని ముగించడంతో ముగుస్తుంది. 

"నిజానికి అసలు కథ అప్పుడే మొదలయ్యింది" అన్న శక్తి శేషాద్రి డైలాగ్ రెండో సీజన్ కి చక్కని పునాది ఏర్పాటు చేసింది. తొలి రెండు ఎపిసోడ్లు కొద్దిపాటి సాగతీతగా (గౌతమ్ మీనన్ మార్కు) అనిపించినా మూడో ఎపిసోడ్ నుంచీ కథనం వేగం అందుకుంది.  ముఖ్యంగా మూడో ఎపిసోడ్ కథ, చిత్రించిన విధానం కూడా చిరకాలం గుర్తుండిపోయేలా ఉన్నాయి. శక్తి శేషాద్రిగా వేసిన ముగ్గురూ పోటీ పడి నటించినా, అంజనా జయప్రకాశ్ కి కొంచం ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నా, ఎక్కువ మార్కులు గెలుచుకునేది మాత్రం అనికానే. బాల్యపు అమాయకత్వాన్ని, యవ్వనపు తెలిసీతెలియనితనాన్ని ఎక్కడా అతి అనిపించని విధంగా అభినయించింది. ఇల్లు, బడి, స్నేహితురాలి ఇల్లు, సినిమా అనే నాలుగు వేర్వేరు ప్రపంచాల్లో జరిగే కథలో శక్తిగా ఇమిడిపోయింది.

ఇక, అంజనా జయప్రకాశ్ అయితే అచ్చమైన సినిమా హీరోయిన్. తనకన్నా వయసులోనూ, హోదాలోనూ బాగా పెద్దవాడైన జీఎమ్మార్ తో ప్రేమలో పడే టీనేజ్ అమ్మాయి మొదలు, చిన్న వయసులోనే ఎక్కువ ఎదురు దెబ్బలు తిని రాటుదేలి తనదైన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా సంతరించుకున్న శక్తి శేషాద్రిని కళ్ళముందు ఉంచింది. మెచ్యూర్డ్ శక్తి శేషాద్రి పాత్రకి రమ్యకృష్ణని ఎంచుకోవడం దర్శకుడి విజయం. విడిపోయిన చాలా ఏళ్ళ తర్వాత జీఎమ్మార్, శక్తి శేషాద్రిని వెతుక్కుంటూ ఆమె ఇంటికి వచ్చే సన్నివేశం, జీఎమ్మార్ మరణం తర్వాత జరిగే పరిణామాలు.. ఇవి రమ్యకృష్ణలోని అనుభవశాలి అయిన నటికి సవాలు విసిరే సన్నివేశాలు. కొంత 'నీలాంబరి'  (రజనీకాంత్ 'నరసింహ') మార్కు కనిపించినా, వాటిని చక్కగా పండించింది రమ్యకృష్ణ. 

మిగిలిన నటీనటుల్లో జీఎమ్మార్ గా ఇంద్రజిత్ సుకుమారన్, చిన్నప్పటి శక్తి తల్లిగా సోనియా అగర్వాల్ (బృందావన్ కాలనీ నాయిక), సినీ కథానాయిక శక్తి తల్లిగా తులసి (శంకరాభరణం) గుర్తుండిపోయేలా తమ పాత్రల్ని పోషించారు. వీళ్ళే కాదు జీఎమ్మార్ భార్య జనని, సహాయకుడు ప్రదీపన్, రాజకీయాల్లోకి వచ్చిన శక్తి కి సహాయకురాలిగా చేరిన సూర్యకళ.. ఇలా ప్రతి పాత్రకీ ఓ ఐడెంటిటీ ఉంది. చిత్రీకరణ విషయానికి వస్తే, భారీ బడ్జెట్ సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా ఖర్చు చేశారు. పెట్టిన ఖర్చంతా తెరమీద కనిపించింది కూడా. యాభై ఏళ్ళ క్రితం నాటి వాతావరణాన్ని సృష్టించడం మొదలు, అప్పటి దుస్తులు, ఇళ్ళు, వాహనాలు.. ఇలా వింటేజ్ ప్రాపర్టీస్ ఎన్నింటినో ఉపయోగించారు. నేపధ్య సంగీతం కూడా సినిమాకి ఎక్కడా తగ్గలేదు. (కీలక సన్నివేశాల్లో వినిపించిన ఒక ట్యూన్ ఇళయరాజా 'ఆకాశం ఏనాటిదో' పాటని జ్ఞాపకం చేసింది). 

సంభాషణలు ఎంత జాగ్రత్తగా రాశారంటే, శక్తి ఇంటర్యూలో చెప్పే ఒక్కో డైలాగు వెంటనే వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో సన్నివేశాలకి లింక్ చేసేట్టుగా ఉంటుంది. తెలుగు అనువాదం అంత బాగా కుదరలేదు కానీ, ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ పెట్టుకుని తమిళంలో చూడడం బాగుంది. మొదటి సీజన్ లో పూర్తైన కథ ప్రకారం చూసినప్పుడు, రెండో సీజన్ మొత్తం రమ్య భుజాల మీదే ఉందన్నది నిజం. (ఛానల్ వారి ఇంటర్యూ ముగిసింది కాబట్టి, ఆ సీజన్ ని ఎలా మొదలు పెడతారో చూడాలి). మొత్తం మీద చూసినప్పుడు, శక్తి శేషాద్రిని పోలిన పాత్రల్లో త్వరలోనే వెండితెరమీద  కనిపించబోతున్న నిత్యా మీనన్, కంగనా రనౌత్ లకి రమ్యకృష్ణ సవాల్ విసిరినట్టే అనిపించింది. 'క్వీన్' తొలి సీజన్ లో పదకొండు ఎపిసోడ్లూ చూశాక, ఈ ఇంటర్యూ చూడడం బాగుంటుంది, మిస్సవ్వకండి.