శనివారం, జూన్ 15, 2013

మూడు ముగింపులు...

రచయిత సత్తా ఉన్నవాడైతే ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వచ్చినా ఎక్కడా పునరుక్తి అన్న భావన కలగకుండా రక్తి కట్టిస్తాడు అనడానికి ఉదాహరణ జంధ్యాల. నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చిన జంధ్యాల ఒకే విషయాన్ని మూడు సినిమాలలోని సన్నివేశాల్లో చెప్పారు.. మూడింటిలోనూ అవి పతాక సన్నివేశాలే.. సినిమాకి ప్రాణం అయిన సన్నివేశాలే. అయితేనేం.. చూసే ప్రేక్షకుడిని ఒప్పించడం మాత్రమే కాదు, 'ఈ విషయాన్ని ఇంతకన్నా బాగా మరోవిధంగా చెప్పడం సాధ్యమేనా?' అన్న ప్రశ్న వచ్చేలా రాయడం జంధ్యాల ప్రతిభకి నిదర్శనం. తను అర్దాయుష్కుడై మన మధ్య నుంచి వెళ్ళిపోయినా, జంధ్యాల రాసిన సినిమాల్లో కొన్ని చిరంజీవులుగా మిగిలిపోయేవి ఉండడం ఒక్కటే సంతోషించాల్సిన విషయం.

కె. విశ్వనాథ్ 'సిరిసిరిమువ్వ' తో జంధ్యాల సంభాషణల రచయితగా పేరు తెచ్చుకుని స్థిరపడ్డ నాలుగేళ్ళకి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక విచిత్రం జరిగింది. ఇద్దరు ప్రముఖ దర్శకులు ఒకేలాంటి కథతో సినిమాలు తీశారు. అంతేకాదు, ఇద్దరూ కూడా సంభాషణలు రాయడానికి జంధ్యాలనే ఎంచుకున్నారు. రెండు సినిమాలకీ కూడా ముగింపే ప్రాణం. వీటిలో మొదటిది, జంధ్యాల సినీ రంగ గురువు విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'సప్తపది' సినిమా. ఓ బ్రాహ్మణ యువతికీ, హరిజన యువకుడికీ మధ్య ప్రేమ మొలకెత్తి మొగ్గతొడగడం ఇతివృత్తం. ఈ ప్రేమ సంగతి తెలియక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న మేనబావ, తను ఆమెతో కాపురం చేయలేక, ఆ హరిజన యువకుడికి ఆమెని అప్పగించడం ముగింపు.


"చాతుర్వర్ణం మయాసృష్టం..." వరకూ మాత్రమే గీతాకారుణ్ణి గుర్తు చేసుకునే వాళ్లకి, "గుణ కర్మ విభాగచ..." అని చెప్పింది కూడా ఆ శ్రీకృష్ణుడే అని గుర్తు చేయడం మాత్రమేకాదు, వర్ణాశ్రమ ధర్మాల మర్మాన్ని వివరిస్తూ జంధ్యాల రాసిన సంభాషణలే 'సప్తపది' సినిమాని నిలబెట్టాయి అనడం అతిశయోక్తి కాదు. ఈ సంభాషణలని జెవి సోమయాజులు చేత పలికించడం వల్ల, జంధ్యాల రాసిన మాటలకి మరింత నిండుతనం వచ్చి, ప్రేక్షకులకి చేరువయ్యాయి. 'సప్తపది' సినిమా మొత్తం ఒక ఎత్తు, ముగింపు సన్నివేశం ఒక్కటీ ఒక ఎత్తు. జంధ్యాల అక్షరాలా కత్తిమీద సాముచేసి రాశారు అనిపించక మానదు.

అదే సంవత్సరం విడుదలైన మరో ప్రేమకథా చిత్రం 'సీతాకోక చిలుక.' తమిళ దర్శకుడు భారతీ రాజా తమిళ, తెలుగు భాషల్లో తీశారీ సినిమాని. ఓ పేద బ్రాహ్మణ యువకుడికీ, ధనవంతురాలైన క్రైస్తవ అమ్మాయికీ మధ్య ప్రేమ పుట్టి పెరగడం అన్నది ఇతివృత్తం. నాయికనాయకులిద్దరూ వయసురీత్యా చిన్న వాళ్ళు, అస్వతంత్రులు. నాయకుడి పేదరికం, ఇద్దరి మతాలతో పాటు, వాళ్ళ వయసు కూడా అడ్డంకే వాళ్ళ ప్రేమకి. నాయిక సోదరుడు డేవిడ్ వ్యక్తిగా ఎలాంటి వాడైనా, మతం విషయంలో పట్టింపు బాగా ఎక్కువ. అతడితో పాటు, ఊరి వాళ్ళందరినీ ఒప్పించే బాధ్యతని ఓ చర్చి ఫాదర్ తీసుకుంటారు. ఓ తెల్లవారు ఝామున ప్రేమ జంటని తరుముకుంటూ సముద్రం ఒడ్డుకు వచ్చిన ఊరి వాళ్ళందరికీ, మతం కన్నా ప్రేమే గొప్పదని చెప్పి ఒప్పిస్తారు ఆ ఫాదర్.


"అన్ని మతాలూ ప్రేమని బోధిస్తాయి..." అంటూ సాగే సంభాషణలు పలికింది కళా వాచస్పతి కొంగర జగ్గయ్య. చర్చి ఫాదర్ గా అతిధి పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాలో. నాయికా నాయకుల ప్రేమ గురించి డేవిడ్ ని, ఊరి వాళ్ళనీ మాత్రమే కాదు, సినిమా చూసే ప్రేక్షకుల్నీ ఒప్పిస్తారు. "ఇలాంటి సన్నివేశాన్నే సప్తపది లో చూశాం.. అక్కడా ఇవే డైలాగులు" అన్న భావన ప్రేక్షకుల్లో కలిగేందుకు ఏమాత్రం ఆస్కారం లేని విధంగా ఉంటాయి జంధ్యాల రాసిన సంభాషణలు. 'సప్తపది' లో ఊరిని ఒప్పించే వృద్ధుడు ఆలయ పూజారి మాత్రమే కాదు, నాయికకి స్వయంగా తాతగారు. కానీ ఇక్కడ చర్చి ఫాదర్ ఎవరికీ బంధువు కాదు.. కానీ ఊరందరి మంచీ కోరే వ్యక్తి. ప్రేమించడం తప్పుకాదని నమ్మే మనిషి.

ఈ రెండు సినిమాలూ విడుదలైన సంవత్సరమే, 'ముద్దమందారం' తో దర్శకుడిగా మారారు జంధ్యాల. మరో ఆరు సంవత్సరాల తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'పడమటి సంధ్యారాగం.' ఇది ఖండాంతర ప్రేమకథ. తెలుగమ్మాయి సంధ్యకీ, అమెరికన్ కుర్రాడు క్రిస్ కీ మధ్య పుట్టిన ప్రేమ. సంధ్య తండ్రి ఆదినారాయణ ఛాందసుడు. దేశం విడిచి పెట్టడానికే ఇష్ట పడని వాడు. అలాంటిది, కూతురు ఒక తెల్లవాడితో ప్రేమలో పడిందన్న విషయం తెలిసి తట్టుకోలేక పోతాడు. ఇండియా తిరిగి వెళ్ళిపోతాడు. సంధ్య-క్రిస్ దంపతులు తమకి పుట్టిన కూతురిని ఆదినారాయణ దగ్గర ఉంచి, ఆయన్ని పెంచమంటారు. తాతయ్య పెంపకంలో పెరిగిన ఆ పిల్ల అనిత, తండ్రి మీద ద్వేషం పెంచుకుంటుంది.. తల్లినీ ఈసడించుకుంటుంది.


అనిత టీనేజ్ కి వచ్చేసరికి, ఆదినారాయణ పరమపదించడంతో, అంత్యక్రియల నిమిత్తం ఇండియా వస్తారు సంధ్య, క్రిస్. తమపట్ల అనిత విముఖత చూసి బాధ పడ్డ సంధ్య, తన కూతురికి తన ప్రేమ కథ మొత్తం చెప్పడంతో పాటు, క్రిస్ మతం విషయం లో అనితకి ఉన్న అభ్యంతరాలకీ జవాబులు చెప్పి, మతం కన్నా మానవత్వం గొప్పదని చెబుతుంది. 'సప్తపది' 'సీతాకోక చిలుక' లలో కులం, మతం గురించి ఊరందరినీ ఒప్పించే విధంగా ఉండే సంభాషణలు రాసిన జంధ్యాల, ఈ సినిమాలో తండ్రి మతాన్ని గురించీ, దేశాన్ని గురించీ తల్లి కూతురుకి చెప్పడం అన్న సందర్భాన్ని గమనంలో ఉంచుకుని రాశారీ డైలాగులు. మిగిలిన రెండు సినిమాల్లోని సన్నివేశాలతో పోల్చినప్పుడు, ఈ సన్నివేశం లో వచ్చే డైలాగులు 'లౌడ్' గా లేకపోవడం గమనించవచ్చు. (జూన్ 19 కి జంధ్యాల మనల్ని విడిచిపెట్టి పుష్కర కాలం పూర్తవుతోంది).

బుధవారం, జూన్ 12, 2013

ఆకెళ్ళ కథలు

వంటి పేరుతో కాక, ఇంటి పేరుతో ప్రసిద్ధులైన కథా, నాటక, సినిమా రచయిత ఆకెళ్ళ. వెంకట సూర్యనారాయణ అంటే తెలియని ఉంటారేమో కానీ, తెలుగు నాట సాహిత్యం, సినిమా, టీవీ, రంగస్థలంతో ఏ కొద్ది పరిచయం ఉన్నవారైనా ఆకెళ్ళ పేరు వినగానే గుర్తుపడతారు. సెంటిమెంట్ ప్రధానంగా రచన చేయడంలో ఆకెళ్ళది అందెవేసిన చేయి. 'స్వాతిముత్యం' 'శ్రుతిలయలు' 'సిరివెన్నెల' లాంటి సినిమాలకి రచన చేసినా, 'శ్రీనాధుడు' లాంటి పద్య నాటకాలు, సాంఘిక నాటికలు రాసి రాష్ట్ర ప్రభుత్వం నుంచీ నంది అవార్డులు అందుకున్నా అది ఆకెళ్ళ లోని బహుముఖీన సాహితీ ప్రజ్ఞకి నిదర్శనం. ఆకెళ్ళ రాసిన ఇరవై ఒక్క కథలతో వెలువడిన సంకలనమే 'ఆకెళ్ళ కథలు.'

ఎనభయ్యో దశకంలో తెలుగు నాట ఆకెళ్ళ కథ ప్రచురించని పత్రిక లేదనడం అతిశయోక్తి కాదు. ఆకెళ్ళ ముమ్మరంగా కథా రచన చేసిన కాలం కూడా అదే. అటు తర్వాత సినిమా రంగానికి, అక్కడి నుంచి నాటక రంగం మీదుగా బుల్లితెరకీ ప్రయాణించారీ కాకినాడ వాసి. ఎనభయ్యో దశకపు తెలుగు కథా సాహిత్యం అనగానే మొదట గుర్తొచ్చేవి మధ్యతరగతి జీవితాలు, నిరుద్యోగి కుర్రాళ్ళు, చిరుద్యోగి తండ్రులు, పెళ్ళికి ఎదిగొచ్చిన ఆడపిల్లలు పట్నవాసాల్లోనూ, పని వాళ్ళని పురుగుల్లా చూసే కామందులు, కొండొకచో ఎర్రజెండా సౌజన్యంతో చైతన్యవంతులై యజమానులకి బుద్ధి చెప్పే పనివాళ్ళూ పల్లెటూళ్ళ లోనూ కనిపించిన కాలం. ఈ కాలంలో రాసిన కథల్లో నుంచి కాల పరిక్షకి నిలబడ గలిగే వాటిని ఎంచి సంకలించారు ఆకెళ్ళ.

కథ చెప్పే పద్ధతిలోనూ, అక్కడక్కడా సంభాషణల్లోనూ కనిపించే కూసింత నాటకీయతని మినహాయించుకుంటే, ఏకబిగిన చదివించే కథలు ఇవన్నీ. తన తరంతో తన సంప్రదాయం అంతరించిపోతుందని బాధ పడే ఓ తండ్రి కథ 'కాలం కత్తెరలో' లో మొదలయ్యే ఈ సంకలనం, తన పగటి వేషాలతో ఎందరినో మెప్పించినా, జీవన యవనికపై భర్త వేషాన్ని రక్తి కట్టించ లేకపోయానని, తన భార్య అంతిమ ఘడియల్లో బాధ పడే భర్త యాజీ కథ 'సహస్ర ప్రయాణం' లో ముగుస్తుంది. కథలే కాదు, వాటికి పెట్టిన పేర్లూ ఆలోచింపజేస్తాయి. సంపుటిలో రెండో కథ 'చంద్రగ్రహణం,' ఎమ్వీఎస్ హరనాధ రావు రాసిన 'లేడి చంపిన పులి నెత్తురు' కథని జ్ఞాపకం చేసింది. (ఈ కథ ఆధారంగానే రాజేంద్రప్రసాద్-యమునలతో 'ఎర్ర మందారం' సినిమా తీశారు).అలాగే, కాళీపట్నం రామారావు ప్రముఖ కథ 'యజ్ఞం' ను గుర్తుచేసిన కథ 'రాక్షసి బొగ్గు.' అయితే, ఇక్కడ రెండు కథలకీ పోలిక రేఖా మాత్రమే. 'కాముని పున్నమి' కథ చదువుతున్నప్పుడు బుచ్చిబాబు రచనలు, 'గొలుసు' కథ చదువుతున్నప్పుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలూ అప్రయత్నంగా గుర్తొచ్చాయి. పేదల బతుకుల గురించి రచయిత రాసిన తీరు, కనబరించిన ఆవేశం రావిశాస్త్రి రచనలని జ్ఞాపకం చేశాయి. "శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్ర రచనలు, రాచకొండ కథలు నేను రచయిత కావడానికి ప్రేరకాలుగా నిలిచాయి" అన్నారు రచయిత తన ముందుమాటలో. ఆకెళ్ళ యెంత అలవోకగా కథలు రాసేసేవారో గుర్తు చేసుకున్నారు ఆయన మిత్రుడు చెరుకువాడ సత్యనారాయణ తన 'ఆప్తవాక్యం' లో.

టైం మిషిన్ ఎక్కి ముప్ఫై ఏళ్ళు వెనక్కి ప్రయాణం చేసినట్టు అనిపిస్తుంది ఈ కథలు చదువుతూ ఉంటే. ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాల్సిన ఆడపిల్లల తండ్రులు - మరీ ముఖ్యంగా అంది వచ్చిన కొడుకు కోడలితో కలిసి వేరు కాపురం పెట్టేసిన వాళ్ళు - చాలా కథల్లోనే కనిపిస్తారు. 'తోలు బొమ్మలు' 'సంకెళ్ళు' కథలు ఉదాహరణలు. అమెరికా యుద్ధ దాహాన్ని ప్రతీకాత్మకంగా చెప్పిన కథ 'యుద్ధం.' ఓ పల్లెటూరి దీపావళి సంబరాలని అంతర్జాతీయ సమస్యతో ముడిపెట్టి చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. 'చీకట్లో శిఖండి' 'లవ్ గేమ్' 'ఆకలిబల్లి' 'గంతలు' లాంటి వైవిద్యభరితమైన కథలు ఉన్నాయీ సంకలనంలో. అలాగే, పేద-ధనిక తారతమ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథలూ ఎక్కువే - 'చేటపెయ్య' 'అడ్డుకట్ట' 'స్ట్రా' లాంటివి.

ఆకెళ్ళ కథలు క్లుప్తంగా ఉంటాయి. ఆరంభం, ముగింపు ఆకట్టుకుంటాయి. సుదీర్ఘమైన సంభాషణలు ఉండవు. ఈ కథలు చదువుతుంటే రంగస్థలం మీద ఓ నాటికను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. రచనా కాలాన్ని గుర్తుపెట్టుకుని చదివితే నాటకీయత పెద్దగా ఇబ్బంది పెట్టదు. రచయిత శ్రద్ధ తీసుకున్న మరో అంశం ముగింపు. కొన్ని కథల ముగింపు ఆశ్చర్యపరిస్తే, చాలా కథల విషయంలో ముగింపు ఆలోచనలో పడేసేదిగా ఉంది. "వీటిలో పన్నెండు కథలు మళ్ళీ మళ్ళీ చదవదగ్గవి ఉన్నాయి" అంటూ ముందుమాటలో రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య చెప్పిన మాటతో ఏకీభవిస్తాం, పుస్తకం పూర్తిచేశాక. ('ఆకెళ్ళ కథలు,' విశ్వశాంతి పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 154, వెల రూ. 90, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

సోమవారం, జూన్ 10, 2013

రెండు మహానగరాలు

అనువాద సాహిత్యం చదివే పాఠకులని ఇబ్బంది పెట్టే మూడు విషయాలు..పాత్రల పేర్లు, ప్రాంతాల పేర్లు, వారు ఉపయోగించే భాష. అనువాదం ఎంత సరళంగా ఉన్నా, చదువుతున్న నవల పరాయిది అన్న భావన కలుగుతూనే ఉంటుంది ఈ మూడు విషయాల్లోనూ. మొదటి రెంటినీ మార్చడం ఎటూ సాధ్యపడదు. మూడోదైన భాషని ఆసాంతమూ తెనిగించి, 'విదేశీ పాత్రలు స్వచ్చమైన తెలుగుని ఇంచక్కా మాట్లాడుతున్నాయే..' అన్న ఆశ్చర్యాన్ని పాఠకులకి కలిగించిన అనువాద రచయిత తెన్నేటి సూరి. పాత్రల మధ్య సంభాషణల్లోనే కాదు, కథ చెప్పడానికీ, సన్నివేశాల వర్ణనకీ జాను తెనుగుని ఇంత బాగా ఉపయోగించిన అనువాద రచయిత మరొకరు లేరేమో అన్న సందేహం కలగక మానదు, 'రెండు మహానగరాలు' చదువుతూ ఉంటే.

ఫ్రెంచి విప్లవాన్ని నేపధ్యంగా తీసుకుని చార్లెస్ డికెన్స్ 1859 లో రాసిన 'ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్' ని 'రెండు మహానగరాలు' పేరిట తెనిగించారు అభ్యుదయ కవి తెన్నేటి సూరి. మాతృకలో ఏ కొద్ది భాగాన్ని చదివిన వారికైనా, సూరి తన అనువాదాన్ని మక్కీకి మక్కీగా కాక, మొత్తం నవలని మళ్ళీ మళ్ళీ చదివి, జీర్ణించుకుని, తనదైన శైలిలో తిరగరాశారని ఇట్టే బోధ పడుతుంది. ఇప్పుడిప్పుడు వాడుక భాషనుంచి కూడా నెమ్మదిగా తప్పుకుంటున్న 'ఇక్ష్వాకుల కాలం నాటి' 'అహోబల బిలం' 'డచ్చీలు చరవడం' లాంటి ఎన్నో ప్రయోగాలు ఈ నవల్లో అడుగడుగునా కనిపిస్తాయి. పాత్రల పేర్లు, సంఘటనా స్థలాలని బట్టి విదేశీ నవల అనుకోవాలే తప్ప, ఇంకెక్కడా అనువాదం అన్న భావన కలగనివ్వలేదు రచయిత.

ఫ్రెంచి విప్లవం ప్రారంభానికి ముందు ఉన్న పరిస్థితులు, విప్లవం తీరుతెన్నులతో పాటు, నాటి ఇంగ్లండు నగరం స్థితిగతులనీ వర్ణిస్తుందీ నవల. "అది ఒక వైభవోజ్వల మహాయుగం - వల్లకాటి అధ్వాన్న శకం; వెల్లివిరిసిన విజ్ఞానం - బ్రహ్మజెముడులా అజ్ఞానం; భక్తీ విశ్వాసాల పరమపరిధనం - పరమ పాశందాల ప్రల్లద కల్లోలం..." అంటూ కవితాత్మకమైన వచనంతో నవలని మొదలు పెట్టి "గవిడిగవదల ఓ రాజూ, గాజుకళ్ళ ఓ రాణీ ఇంగ్లండు లోనూ, గవిడిగవదల ఓ రాజూ, కలువ కన్నుల ఓ రాణి ఫ్రాన్సులోనూ రాజ్యం చేస్తున్నారు" అంటూ నేరుగా కథలోకి తీసుకుపోతారు రచయిత. ఇది దేశ భక్తుడైన డాక్టర్ మానెట్ కథ. ఫ్రాన్సు జమీందార్ల దురాగతాలకు ప్రత్యక్ష సాక్షి అయిన మానెట్ సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితం గడపాల్సి వస్తుంది.


మానెట్ నూ, అతని కూతురు లూసీనీ కలిపే బాధ్యత తీసుకుంటాడు టెల్ సన్స్ బ్యాంక్ ఉద్యోగి లారీ. ఖాతాదారుల క్షేమం కోసం తపించే టెల్ సన్స్ బ్యాంకు, వారికి అవసరమైన అన్ని సేవలనూ నమ్మకంగా అందిస్తుంది. మానెట్ జైలుకి వెళ్ళాక, అతని కూతురు పెంపకం బాధ్యత గమనించడంతో పాటు, ఆయన జైలు నుంచి విడుదల అయ్యాడని తెలిశాక ఆ తండ్రీ కూతుళ్ళని కలిపే పనినీ బ్యాంకు తన భుజాన వేసుకుంటుంది. ఏకాకి జైలు జీవితంలో వెలుతుర్ని పూర్తిగా మర్చిపోయిన మానెట్ దాదాపు పిచ్చివాడిగా జైలు నుంచి బయటికి వస్తాడు. అతన్ని ఇంగ్లండు తీసుకువెళ్ళి తన ప్రేమతో అతన్ని మనిషిని చేస్తుంది లూసీ. అదే సమయంలో ఆమె డార్నే తో ప్రేమలో పడుతుంది. 

ఫ్రాన్స్ లో ఓ జమీందారీ కి వారసుడైన డార్నే తన ఆస్తిని బీదలకి పంచాల్సిందిగా మిత్రుడిని కోరి, ఒక సామాన్యుడిగా ఇంగ్లండు చేరుకొని లూసీని వివాహం చేసుకుంటాడు. ఆ దంపతులకి ఒక పాప పుట్టాక, ఫ్రాన్స్ లో విప్లవం మొదలవుతుంది. డార్నే స్నేహితుడు తానో చిక్కులో ఉన్నానని, ఒక్కసారి చూసి వెళ్ళమని రాసిన జాబు చూసుకుని హడావిడిగా బయలుదేరతాడు. అయితే, జమీందార్ల మీద పీకల వరకూ కోపంగా ఉన్న విప్లవ కారులు డార్నే ని నిర్బందిస్తారు. అతనికి మరణ శిక్ష ఖాయం అవుతుంది. తన యావత్ జీవితాన్నీ ఫ్రెంచి జైలుకి ధారబోసిన డాక్టర్ మానెట్ తన అల్లుడిని రక్షించుకోగలిగాడా? విప్లవం ప్రారంభం అయ్యేనాటికి ఫ్రాన్స్ లో ఉన్న పరిస్థితులు ఏమిటి? ఫ్రెంచి విప్లవం పరిణామాలు ఇంగ్లండుని ఏవిధంగా ప్రభావితం చేశాయి? తదితర ప్రశ్నలకి జవాబులిస్తూ ముగుస్తుంది ఈనవల.

తెన్నేటి సూరి అనువాదంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి భాష, క్లుప్తత. చక్కని తెలుగు నుడికారంతో నవలని నింపిన సూరి, ఎక్కడా ఏ సన్నివేశమూ కూడా 'సుదీర్ఘం' అనిపించనివ్వలేదు. నడిరోడ్డు మీద ద్రాక్ష సారా జాడీ భళ్ళున బద్దలైన వైనాన్ని వర్ణించినా, ఫ్రెంచి వీధుల్లో 'గిలెటిన్' పేరిట నిత్యం జరిగిన నరమేధాన్ని కళ్ళకి కట్టినా అనువాదంలో రచయిత చూపిన ప్రత్యేక శ్రద్ధ పాఠకుడికి అడుగడుగునా అర్ధమవుతూనే ఉంటుంది. ఏకబిగిన చదివి పక్కన పెట్టాల్సిన నవల ఇది. ఎక్కడ ఆగినా, మళ్ళీ మొదటినుంచీ చదవాల్సిందే. మళ్ళీ మళ్ళీ చదివించే కథనం. 'విశాలాంధ్ర' ప్రచురించింది. (పేజీలు 244, వెల రూ. 125, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శుక్రవారం, జూన్ 07, 2013

మహి

"ఒకరి మంచి చెడులు నిర్ణయించడానికి నేనెవరిని? విషయాలని బ్లాక్ అండ్ వైట్ లో చూడడం తేలిక. చాలా మంది ఆ తేలిక పనిని ఎంచుకుంటారు. నాకు అది చేతకాదు. వాటి షేడ్స్ చూడడం ఇష్టం. చూసే వాళ్ళన్నా గౌరవం," అంటుంది మహి. ఓ మధ్యతరగతి కుటుంబంలోని ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టిన మహి అవివాహిత. కాలేజీ లెక్చరర్ గా ఉద్యోగం చేస్తూ, ఒంటరిగా, తనకి నచ్చినట్టుగా జీవిస్తోంది. ఇంట్లో ఎవరికీ మహి అర్ధం కాదు. ఆమె తమ మనిషి అని చెప్పుకోవడం వాళ్లకి ఇష్టం లేదు. కానీ వాళ్ళందరికీ మహి నుంచి కావాల్సింది ఒక్కటే, ఆమె సంపాదన.

"నువ్వు ఒక్కదానివే కదా? సంపాదించింది అంతా ఏం చేసుకుంటావ్?" ఈ ప్రశ్నని తల్లి వైదేహి మొదలు, అక్కా బావా మాధవి, భాస్కర్, వాళ్ళ టీనేజ్ దాటిన పిల్లలు కార్తిక్, నందన ఏదో ఒక సందర్భంలో మహిని అడుగుతూనే ఉంటారు. ఎవరికీ ఏమీ తక్కువ చెయ్యదు మహి. తను చేయగలిగిన సహాయం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. కానీ, ఆమె చేసే సాయం ఎవరికీ గుర్తుండదు, తృప్తి గానూ ఉండదు. పైగా, ఆమె నుంచి డబ్బు తీసుకున్నామని పైకి చెప్పుకోలేరు. తన స్నేహితుడు 'చైత్ర' తో లివిన్ రిలేషన్ లోకి వెళ్ళాలనుకున్న మహికి ఈ కుటుంబం నుంచి వచ్చిన ప్రశ్నలు, ఇబ్బందులు ఏమిటి? ఆమె వాటిని ఎలా ఎదుర్కొంది? అన్న ప్రశ్నలకి జవాబే కుప్పిలి పద్మ రాసిన 'మహి' నవల. కథానాయిక మహి.

పుస్తకం కవర్ చూడగానే ఎందుకో అప్రయత్నంగా 'మిల్స్ అండ్ బూన్' నవలలు, ఆ వెంటనే తెలుగు మిల్స్ అండ్ బూన్స్ గా పేరుపడ్డ యద్దనపూడి సులోచనారాణి నవలలూ గుర్తొచ్చేశాయి. దానికి తోడూ నవల ప్రారంభంలోనే నందన "మమ్మీ, నాకు ఉద్యోగం వచ్చేసిందోచ్" అనడంతో చటుక్కున 'సెక్రటరీ' నవల గుర్తొచ్చింది. ఒకప్పుడు ఎంతో ఇష్టంగా, ఆకలీ నిద్రా కూడా మర్చిపోయి మరీ చదివిన యద్దనపూడి నవల్లాలాంటి మరో నవల చదవబోతున్న భావన కలిగింది. పేజీలు చకచకా తిరిగిపోవడంతో ఆ భావన మరింతగా బలపడింది. మహి అవివాహితగా ఎందుకు ఉండిపోయింది? అన్న విషయాన్ని చివరివరకూ దాచి ఉంచిన రచయిత్రి, ప్రపంచీకరణ ఫలితంగా మధ్యతరగతిలోనూ, యువతరం ఆలోచనల్లోనూ వచ్చిన మార్పుని చిత్రించడానికి ప్రధమార్ధాన్ని ఉపయోగించుకున్నారు.


డిగ్రీ పూర్తవుతూనే ఓ కాల్ సెంటర్లో పదివేల రూపాయల జీతానికి ఉద్యోగం సంపాదించుకున్న నందన, త్వరలోనే పబ్బులు, డిస్కో లకి అలవాటు పడుతుంది. అక్కడి కొత్త స్నేహితుల సంపాదనతో పోలిస్తే తన సంపాదన (అప్పటికే తల్లిదండ్రుల ఇద్దరి జీతాల కన్నా ఎక్కువ!) ఏ మూలకీ పనికిరాదనీ నిర్ణయించుకున్న నందన యూఎస్ ప్రయాణం అవుతుంది. అందుకు కావాల్సిన డబ్బు ఎలా సమకూర్చడం అన్నది ప్రధాన సమస్య. అంతమొత్తం తను సర్దలేనని చెప్పేస్తుంది మహి. మనవరాలు అంటే విపరీతమైన ప్రేమ ఉన్న వైదేహిది, మగపిల్లల్ని దోచి ఆడపిల్లలకి పెట్టే తత్త్వం. నందనకి కావాల్సిన డబ్బు సమకూర్చేందుకు నడుం బిగిస్తుంది ఆవిడ. మనవరాలు యూఎస్ లో ఉంటోందని చెప్పుకోవడం ఆమెకి గర్వకారణం కూడా.

నందన అన్న కార్తీక్ కి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని కోరిక. చెల్లెలి లాగే, మధ్యతరగతి జీవితానికి పూర్తి వ్యతిరేకం అతను. డబ్బుండీ మహి తనకి లిఫ్ట్ ఇవ్వడం లేదన్న భావన ఉంటుంది. ఈ పిల్లలకి చిన్న వయసులోనే అవసరాలు అంతగా పెరిగిపోవడం ఏమిటో, కోటీశ్వరులు కావాలన్న ఆరాటం ఏమిటో బొత్తిగా అర్ధం కాదు మహికి. ప్రశాంతమైన జీవితం ఆమెది. కవిత్వం, సంగీతం, సాహిత్య సమావేశాలు... వీటితో కాలం గడిపేస్తూ ఉంటుంది. తల్లి నడిపించే కుటుంబ రాజకీయాలు బొత్తిగా కిట్టవు ఆమెకి. వదినలని కూడా తమతో సమంగా చూడమని తల్లికి చెబుతూ, భంగపడుతూ ఉంటుంది. అందరితోనూ సరదాగా ఉంటూనే, తామరాకు మీద నీటి బొట్టు చందంగా తనని తాను మలుచుకుంటుంది మహి.

కుప్పిలి పద్మ రచనల్లో నాయికల కన్నా నాయకులే ఎక్కువగా పూలని ప్రేమిస్తూ ఉంటారు. అచ్చం అలాంటి నాయకుడే చైత్ర. లిల్లీపూల గుత్తులతో మహిని నవ్వుతూ పలకరించే ఈ అందగాడు, 'లివిన్' ప్రతిపాదన పెడతాడు. మహి ఇంటికి చైత్ర రాకపోకలు పెరగడం, ఆమె కుటుంబ సభ్యులకి ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. మహి కారణంగా నందనకి మంచి సంబంధాలు రావేమో అని దిగులు పడతారు వైదేహి, మాధవి. మహి గతం, చైత్ర విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం నవల ముగింపు. ఎక్కడా ఆపకుండా చదివించే పుస్తకం ఇది. ప్రపంచీకరణ, ఫెమినిజాలని చర్చిస్తూనే, బాబ్రీ విధ్వంసం, గుజరాత్ అల్లర్లని సందర్భోచితంగా కథలో భాగం చేశారు పద్మ. (ముక్తా పబ్లికేషన్స్ ప్రచురణ, పేజీలు 297, వెల రూ. 120, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

బుధవారం, జూన్ 05, 2013

విదేశీ కథలు

చదివించే గుణం పుష్కలంగా ఉండే రచనలు చేసే రచయితల జాబితాలో ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి పేరు సుస్థిరం. అమలిన శృంగారం మొదలు మలిన శృంగారం వరకూ మల్లాది ఏం రాసినా ఒకసారి చదవడం మొదలుపెట్టాకా పూర్తిచేసి కానీ పక్కన పెట్టలేం. అమెరికన్, జర్మన్, ఫ్రెంచ్, బ్రిటిష్, ఇజ్రాయిల్, జపనీస్ తదితర ప్రపంచ భాషల్లో వచ్చిన చిన్న కథలని తెలుగులోకి అనువదించిన మల్లాది, వాటన్నింటినీ 'విదేశీ కథలు' పేరిట సంకలనంగా విడుదల చేశారు. 'విపుల' మాసపత్రికలో ప్రచురితమైన ఈ కథల్లో ఏ ఒక్కటీ కూడా నాలుగైదు పేజీలు మించదు. చదివాక ఓ పట్టాన జ్ఞాపకం నుంచి తొలగిపోదు.

అనువాదం అనగానే 'మక్కీకి మక్కీ' అనువదించేసే రచయితలు ఉన్నారు. కానీ, మల్లాది అనువాదాలు మాత్రం అందుకు భిన్నం.. కథలని సరళమైన భాషలో చెప్పడంతో పాటు, వీలున్న చోటల్లా తెలుగు జాతీయాలు వాడడం ద్వారా 'పరాయీకరణ' ని వీలైనంత తగ్గించే ప్రయత్నం చేశారు. మల్లాది గతంలో రాసిన చిన్న కథలు చదివిన వారికి ఆయన అభిరుచి ఏమిటన్నది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్లకి ఈ పుస్తకంలో మొదటి నాలుగైదు కథలు చదివితే చాలు, మిగిలిన కథలు ఎలా ఉండబోతున్నాయో సులభంగానే బోధ పడుతుంది. విలియం కింగ్ రాసిన 'నంబర్ వన్' అనే అమెరికన్ కథతో మొదలయ్యే ఈ సంకలనం, ఎడ్మండ్ ఫిలిప్స్ రాసిన 'మై డియర్ రీటా' అనే అమెరికన్ కథతో ముగుస్తుంది.

అమెరికన్ కాటన్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు మిస్టర్ పీబాడి. అతని సెక్రటరీ మిస్ స్మిత్. మనుషులకి బదులు యంత్రాలు, కంప్యూటర్లతో పని చేయించాలి అని నిర్ణయించిన కంపెనీ, పీబాడి స్థానంలో ఓ రోబో ని నియమిస్తుంది. ఆ రోబోకి విధులు నేర్పవలసిన బాధ్యత పీబాడిదే. అతనికి ఏమీ విచారం లేదు. ఎందుకంటే, తన స్థానం లోకి రోబో వచ్చేసినా తనకి వేరే ఉద్యోగం దొరికే వరకూ లేదా పదవీ విరమణ వయసు వచ్చే వరకు జీతాన్ని యధావిధిగా చెల్లించడానికి కంపెనీ అంగీకరించింది. రోబో పేరు నెంబర్ వన్. చాలా చురుకైన రోబో. "నన్ను జాగ్రత్తగా గమనించు. నేనేం చేస్తున్నానో అర్ధం చేసుకో. నేను లేకపోయినా ఆ పరిస్థితుల్లో అలా చెయ్యి" అని పీబాడి ఒకటికి పదిసార్లు చెప్పిన మాటల ప్రభావం నెంబర్ వన్ మీద ఎలా పనిచేసింది అన్నది ఈ కథ ముగింపు.


అనువాద కథలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి... ఎప్పుడూ చూడని, చూసే అవకాశం లేని ప్రాంతాల గురించీ, కలిసేందుకు పెద్దగా అవకాశం లేని మనుషుల మనస్తత్వాలు, సంస్కృతిక నేపధ్యాల గురించీ తెలుసుకునే అవకాశం దొరకడం. ఈ కథల ద్వారా ఎందరో విదేశీ వ్యక్తుల గురించి తెలుసుకోగలుగుతాం. వాళ్ళ ఆలోచనలు, క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ జీవిత గమనం... ఇవన్నీ కొన్ని కొన్ని కథల్లో చాలా సరదాగా ఉంటే, మరికొన్ని కథల్లో జీవిత సత్యాలని తెలిపేవిగా ఉన్నాయి. హిట్లర్ పాలన, నాజీల దురాగతాల మొదలు, యూదుల జీవితం, అమెరికన్ వివాహ వ్యవస్థ, నల్ల జాతీయుల కృతజ్ఞత... ఇలా ఎన్నో ఇతివృత్తాలు.

ఈ సంకలనం లో ఉన్న మొత్తం ముప్ఫై ఒక్క కథల్లో, బ్రిటిష్ కథ 'కానుక' ఒక్కటే గతంలో చదివింది. 'విపుల' చదవడం ఆపేసి చాలా రోజులే అయిపోయిందన్న విషయం గుర్తు చేసిన కథ ఇది. విభిన్నమైన ఇతివృత్తాలు ఎంచుకున్నప్పటికీ, చాలా కథలు మెరుపు ముగింపుతో ఆకర్షించేవే. ఈ కారణానికే కొన్ని కథలు చదవడం అయ్యాక, మనకి తెలియకుండానే ముగింపు ఊహించే ప్రయత్నం చేసేస్తాం. ఏ కథా నాలుగైదు పేజీలు మించక పోవడం వల్ల చదువుతుంటే విసుగు కలిగే ప్రమాదం లేదు. ఆసాంతం చదివించే శైలి (అనువాద శైలి అందామా?!) ఉండనే ఉంది. మెజారిటీ కథలు మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించేవే.

సంకలనం చదవడం పూర్తిచేశాక, భారతీయ భాషల్లో వచ్చిన కథలని కూడా మల్లాది తెలుగులోకి అనువదిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది. ఆధ్యాత్మిక రచనలు, ట్రావెలాగ్ లతో బిజీగా ఉన్న మల్లాది ఈ విషయం మీద దృష్టి పెడతారో లేదో మరి. ఏకబిగిన చదివించేసే ఈ కథలన్నింటినీ లిపి పబ్లికేషన్స్ పుస్తక రూపంలో తీసుకువచ్చింది. ఆకట్టుకునే కవర్ పేజి.. అచ్చుతప్పులు లేని ముద్రణ. కథా సాహిత్యం అంటే ఆసక్తి ఉన్నవాళ్ళకి బాగా నచ్చే పుస్తకం ఇది. (పేజీలు 144, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

మంగళవారం, జూన్ 04, 2013

కాశీయాత్ర

"కాశీకి వెళ్ళిన వాడూ, కాటికి వెళ్ళిన వాడూ ఒక్కటే..." ..రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో బాగా ప్రచారంలో ఉన్న వాడుక ఇది. బస్సులు పెద్దగా లేకపోవడం, ఎక్కువ దూరం కాలి నడకన, బళ్ళ మీద ప్రయాణం చేయాల్సి రావడం, కాశీ పట్టణంలో తరచూ అంటువ్యాధులు ప్రబలుతూ ఉండడం... ఈ కారణాల వల్ల, కాశీకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారన్న నమ్మకం పెద్దగా ఉండేది కాదు. ఇలాంటి వాతావరణంలో కాశీకి ప్రయాణం అయ్యారు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి. తర్వాతి కాలంలో శతావధానిగా పేరు తెచ్చుకున్న పండితుడూ, తిరుపతి వేంకట కవుల్లో అర్ధభాగమూ అయిన వేంకట శాస్త్రి, తన యవ్వనారంభంలో చేసిన కాశీయాత్రని ఓ సుదీర్ఘ వ్యాసంగా అక్షరబద్ధం చేశారు.

ఈ కాశీయాత్ర విశేషాలతో పాటు, వేంకటశాస్త్రి విరచితమైన వ్యాసాలు మరికొన్నింటిని కలిపి ఓ సంకలనంగా తీసుకు వచ్చారు గుంటూరు కి చెందిన అన్నమయ్య గ్రంధాలయం వారు. సంపాదకుడు మోదుగుల రవికృష్ణ సుదీర్ఘంగా రాసిన 'మనవి మాటలు' తో ప్రారంభమయ్యే ఈ పుస్తకం ఆసాంతమూ చదివిస్తుంది. తిరుపతి వేంకట కవుల ప్రసిద్ధ నాటకం 'పాండవోద్యోగ విజయాలు' లో పండిత పామరులని సమంగా ఆకర్షించిన ఒకానొక పద్యం ప్రారంభ వాక్యం శీర్షికగా 'చెల్లియో చెల్లకో..!' అంటూ శ్రీరమణ చెప్పిన కబుర్లు దాటుకుని ముందుకు వెడితే, 'మా గురువుగారు' అంటూ పలకరిస్తారు 'కవి సామ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ. వేంకట శాస్త్రి ప్రత్యక్ష శిష్యుడైన విశ్వనాథ, తన ఆత్మకథలో గురువు గారి గురించి రాసుకున్న భాగాన్ని ఈ పుస్తకంలో చేర్చడంతో, చెళ్ళపిళ్ళ వారి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే వీలు కలిగింది.

తన పందొమ్మిదో ఏట (1889) కాశీ వెళ్ళడానికి ప్రయాణ ముహూర్తం నిర్ణయించుకున్న వేంకట శాస్త్రి గారికి, అనుకోకుండా అదే ముహూర్తంలో వివాహం జరిగింది. పెళ్ళికి ముందు జరిపే 'స్నాతకం' లో 'కాశీ యాత్ర' జరిపే సంప్రదాయం ఉంటుంది కాబట్టి, తను పెట్టుకున్న ముహూర్తానికి కాశీ ప్రయాణం జరిగినట్టే అని చమత్కారంగా చెబుతూనే, చదువరులని తనతో పాటు కాశీ క్షేత్రానికి ప్రయాణం చేసేస్తారు చెళ్ళపిళ్ళ వారు. కాశీ వెళ్ళాలనే సంకల్పం కలగడానికి మొదటి కారణం తాంబూల చర్వణం మీద ఆయనకి ఉన్న ఇష్టం. పుట్టిన ఊరు యానాం లో కానీ, గురువుగారు చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి స్వస్థలం కడియెద్ద లో కానీ తాంబూలం దొరికే పరిస్థితి లేదు. కాశీలో తాంబూల సేవనం హెచ్చు అనీ, దొరకడం సులభమనీ తెలిశాక కాశీ మీద మోజు కలిగింది అంటారాయన. స్థానికంగా ఎందరు పండితులు ఉన్నా, కాశీ పండితుల దగ్గర విద్య నేర్చుకోవాలి అన్న కుతూహలం మరొక కారణం.


వివాహం జరిగిన తర్వాత, కందుకూరి కృష్ణశాస్త్రి అనే సహాధ్యాయితో కలిసి అష్టావధానాలు చేసి సంపాదించిన సొమ్ముతో కాశీయాత్ర ప్రారంభించిన చెళ్ళపిళ్ళ వారికి ఎదురైన అనుభవాలు ఎన్నో... ఎన్నెన్నో... మొత్తం యాభై తొమ్మిది పేజీల వ్యాసంలో కాశీ యాత్రతో పాటు, ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ఎందరో కవిపండితులు, వారిని ఆదరించిన జమీందారులు, ఆయా జమీందారుల చుట్టూ ఉండే బలమైన కోటరీలు.. ఇలా ఎన్ని కబుర్లో... పండితుల మధ్య ఉండే స్పర్ధలు, ఫలితంగా ఎదురయ్యే సమస్యలు... ఇవన్నీ సందర్భానుసారంగా చెబుతూనే, అసలు విషయాన్ని పక్కదోవ పట్టనివ్వకుండా యాత్రాస్మృతిని ఆసాంతం ఆకర్షణీయంగా మలిచారు. కాశీ ప్రయాణం క్లుప్తంగానే చెప్పినా, తిరుగు ప్రయాణాన్ని గురించి విశదంగా రాసి, యాత్రలో ఉండే ఇబ్బందుల గురించి చదువరులకి ఓ అవగాహన కలిగేందుకు దోహదం చేశారు. కష్టార్జితం దొంగల పాలవ్వడం మొదలు, అనారోగ్యంతో చేసిన పడవప్రయాణం వరకూ అన్నీ ఆసక్తిగా చదివించేవే.

ఆకట్టుకునే మరో విషయం 'గంగా సంతర్పణ' వృత్తాంతం. కాశీ వెళ్లి, తిరిగి వచ్చిన వారు సంతర్పణ చేయడం రివాజు. అందరిలాగా కాకుండా, 'కనీసం ఒక మిఠాయితో' ఘనంగా సంతర్పణ చేసుకోవాలి అన్నది చెళ్ళపిళ్ళ వారి కోరిక. ఇంటి ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రం. ఆర్జనకి ఉన్న ఏకైక మార్గం అవధానమే. అప్పటికింకా తిరుపతి శాస్త్రి జతచేరలేదు కూడా.. యానాం నుంచి ముమ్మిడివరం వెళ్లి అవధానం చేసిన చెళ్ళపిళ్ళ వారికి అక్కడ కలిగిన ఖేదం, అటుపై అయినాపురం లో దొరికిన ఆదరణ, ఘనంగా జరిగిన సంతర్పణలతో పాటు, తన జాతకంలో సంభవించిన 'కుసుమ యోగా'న్ని వివరిస్తూ వ్యాసం ముగించారు. ప్రయాణ సౌకర్యాలు పెద్దగా లేని ఆ రోజుల్లో, ఆచారం సాగించుకునే విషయంలో ఏమాత్రమూ రాజీపడలేని ఓ బ్రాహ్మణుడు చేసిన యాత్ర ఎన్నో ఆసక్తికరమైన విషయాలని చెబుతుంది, తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి. 'కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర' చాలాసార్లే గుర్తొచ్చింది.

కాశీయాత్రతో పాటు, 'శృంగార వర్ణనము,' 'శతావధానము,' 'సిగ్గూ-బిడియము,' 'మా విద్యార్ధి దశ-నాటి కవిత్వం'అనే శీర్షికలతో వేంకట శాస్త్రి రాసిన వ్యాసాలని జతచేశారు ప్రకాశకులు. వీటిలో, 'శృంగార వర్ణనము' 'సిగ్గూ-బిడియము' వ్యాసాలు మళ్ళీ మళ్ళీ చదివించేవిగా ఉన్నాయి. శతావధాన ప్రక్రియపై వచ్చిన విమర్శలని ఖండిస్తూ రాసిన పదునైన వ్యాసం 'శతావధానము.' విద్యార్ధి దశలో తెలుగు కవిత్వం అంటే ఏమాత్రం ఆసక్తి లేకపోయినా, చివరికి తెలుగు కవులుగానే స్థిరపడిన వైనాన్ని వర్ణించారు 'మా విద్యార్ధి దశ-నాటి కవిత్వం' వ్యాసంలో. తిరుపతి వేంకట కవుల నుంచి వచ్చిన రచనల జాబితాతో పాటు, వారి అవధానాన్ని గురించి నాటి పత్రికల్లో వచ్చిన కథనాన్ని జతచేశారు. వీటితోపాటు విజయనగరం రాజులకి కాశీతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ సంపాదకుడు రాసిన 'కాశీ-విజయనగరం వారు' వ్యాసం ఏకబిగిన చదివిస్తుంది. (పేజీలు 176, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

ఆదివారం, జూన్ 02, 2013

అధూరె

మహమ్మదీయులు అనగానే గుర్తొచ్చేవాళ్ళు ఎవరు? మనం చదువుకున్న చరిత్ర బాబర్ శౌర్యాన్నీ, అక్బర్ రాజనీతిజ్ఞతనీ, ముంతాజ్ కోసం తాజ్ మహల్ నిర్మించిన షాజహాన్, భాగమతి కోసం భాగ్యనగరాన్ని నిర్మించిన కులీ కుతుబ్షా నీ గుర్తు చేస్తుంది. ముసల్మానులంటే వీళ్ళు మాత్రమేనా? తోపుడు బళ్ళ మీద అరటిపళ్ళు అమ్ముతూనూ, ఓ చిన్న బడ్డీలో గడియారాలు మరమ్మతు చేస్తూనూ కనిపించే వారి కథలు ఏమిటి? తెలుగు కథా సాహిత్యంలో అస్థిత్వ వాదం బలంగా వినిపిస్తున్న తరుణంలో, ఇన్నాళ్ళూ ప్రపంచానికి పెద్దగా తెలియని అనేక వర్గాల కథలతో పాటు, సామాన్య ముస్లిం జీవితాలు నేపధ్యంగా వచ్చిన కథలూ కొంచం తరచుగానే పాఠకులని పలకరిస్తున్నాయి.. అలాంటి ఒకానొక కథల సంకలనమే 'అధూరె' ..ముస్లిం కథలు అన్నది ఉపశీర్షిక.

వృత్తి రీత్యా జర్నలిస్ట్, తెలంగాణా, మైనారిటీ ఉద్యమాలలో చురుకైన కార్యకర్తా అయిన స్కైబాబ రాసిన పన్నెండు కథల సంకలనం ఈ 'అధూరె.' ఈ ఉరుదూ మాటకి అర్ధం అసంపూర్ణం అని.. చాలా కారణాలకి ఈ శీర్షిక ఈ కథలకి అతికినట్టు సరిపోయింది అనిపించింది పుస్తకం చదవడం పూర్తిచేయగానే. ఎందుకంటే ఈ కథలు ఏవీ కూడా పూర్తయినవి కాదు, జరుగుతూ ఉన్నవి.. ఎన్నాళ్ళుగానో జరుగుతున్నాయి.. ఇకమీదట కూడా జరుగుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇవి కథలు కావు, మన చుట్టూ ఉన్న పేద ముస్లిముల జీవితాలు. మన పక్కనే వాళ్ళూ ఉంటున్నా, ఇన్నాళ్ళూ మనం కనీసం ఆలోచించని ఎన్నో విషయాలని ఈ కథల ద్వారా చెప్పారు స్కైబాబ.

బుర్ఖా సంప్రదాయం మీద ఎక్కుపెట్టిన బాణం 'చోటీ బహెన్' ఈ సంకలనం లో మొదటి కథ. ఒక్క పేజీ తిరిగేసరికే "మా ఇండ్లల్ల ఆడపిల్లలకు తండ్రులే మొదటి విలన్లు. తర్వాత స్థానం అన్నలు-తమ్ముళ్ళదే" అన్న వాక్యం దగ్గర చాలాసేపే ఆగిపోయాను. సంప్రదాయాలు కేవలం ముస్లిం కుటుంబాల్లో తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళని మాత్రమే ఆడపిల్లల పాలిట విలన్లుగా చేస్తున్నాయా? అన్న ప్రశ్న చుట్టూ ఎన్నో ఆలోచనలు. ఈ ఒక్క వాక్యం మాత్రమే కాదు, మొత్తం కథే ఆలోచనల్లో ఉంచేసింది. మొత్తం పుస్తకం పూర్తయ్యాక కూడా ఆలోచనలు మొదటి కథ చుట్టూనే తిరుగుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. రెండో కథ 'మొహబ్బత్ 1421 హిజ్రి.' ఈ సంకనలం లో ఈ కథకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా ప్రేమకథ... బుర్ఖా సంప్రదాయాన్ని మరోకోణంలో చూపించిన కథ.

పేద ముస్లిం కుర్రాడి ప్రేమకథ 'మజ్బూర్' కాగా, ఒక పురుషుడి చర్యల కారణంగా అతని తల్లి, భార్యల జీవితాల్లో జరిగిన మార్పులని చిత్రించిన కథ 'భడక్తా చిరాగ్.' ఐదో కథ 'కబూతర్' కి రచయిత ఆశావహమైన ముగింపు ఇచ్చినా, కథని గురించి ఆలోచించడం మాత్రం మానుకోలేం. ఆడపిల్లకి పెళ్లి చేయడానికి ఓ పేద తల్లి పడే తాపత్రయం ఈ కథ. అద్దె ఇల్లు వెతుక్కునే ఓ యువ జంటకి ఎదురైన ఇబ్బందులని 'వెజిటేరియన్స్ ఓన్లీ' పేరుతో కథగా మలిచారు స్కైబాబ. కులమతాలకి అతీతంగా స్నేహంగా మసలిన ముగ్గురు యువకుల కథ 'దస్తర్,' ముగింపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కారణం చెప్పకుండా పోలీసులు తీసుకెళ్ళి పోయిన ఓ కుర్రాడి కోసం అతని తల్లి పడే తపన 'దావా' కథ. కాకిపిల్లని ప్రతీకాత్మకంగా వాడుకోవడం బాగుంది.

'వతన్' కథ మీద ఇప్పటికే చాలా చర్చ జరిగింది. ముస్లింలు దుబాయి వెళ్ళినా భారతదేశానికి తిరిగి వస్తున్నారు కానీ, అమెరికా వెళ్తున్న హిందువులు అక్కడే స్థిరపడి పోతున్నారన్నది ఇతివృత్తం. మిగిలిన కథలకి భిన్నంగా కొంత ఉపన్యాస ధోరణి కనిపించింది ఈ కథలో. కథకుడిలోని ఆవేశం కథలో ప్రతిఫలించింది అనడం సబబేమో. 'ఉర్సు' కథ విఫల ప్రేమ తాలూకు ఓ జ్ఞాపకం. దుబాయ్ ప్రయాణం ఇతివృత్తంగా సాగిన మరో కథ 'ఖిబ్లా.' సంకలనంలో చివరిదీ నన్ను బాగా ఆకర్షించిందీ 'జీవం' కథ. మృత్యువు నేపధ్యంగా సాగే ఈ కథకీ మెరుపు ముగింపుని ఇచ్చారు రచయిత. చదివించే గుణం పుష్కలంగా ఉన్న ఈ కథల్లో ముందుగా ఆకట్టుకునేది భాష. తెలంగాణా తెలుగు, ఉరుదూలు కలబోసిన వచనం. ముందుమాటలో అఫ్సర్ చెప్పినట్టుగా ఉస్మానియా బిస్కట్-ఇరానీ చాయ్ లని కలిపి ఆస్వాదిస్తున్నట్టుగా ఉంటుంది.

'అధూరె' సంకలనంలో ప్రతికథకీ చదివించే లక్షణం ఉంది. మొత్తం కథ చదవడం పూర్తిచేశాక కనీసం ఒక్క క్షణం ఆగి ఆలోచించకుండా ఉండలేం. రకరకాల స్త్రీ పాత్రలు.. వాళ్ళ బలమైన వ్యక్తిత్వాలు, ఏమీ చేయలేని అసహాయతలు, ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధతలు... ఇవన్నీ కేవలం ముస్లిం సమాజానికి సంబంధించినవి మాత్రమే కాదు.. అయితే, ఈ కథల్లో ఆకర్షించేది నిజాయితీ. కథలన్నీ సరళంగా సాగుతాయి. నాటకీయమైన మలుపులు ఉండవు... ముగింపు సాధారణంగా కనిపిస్తూనే, అసాధారణం అనిపిస్తుంది. మాండలీకం ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. ఓ వక్తగా ఎంతో ఆవేశంగా కనిపించే స్కైబాబ, రచయితగా ఇంత మృదువైన వాడా అన్న ఆశ్చర్యం చాలా చోట్లే కలిగింది. ముస్లిముల, మరీ ముఖ్యంగా పేద ముస్లిముల జీవితాలని గురించి తెలుసుకోడానికి ఉపయోగించే కరదీపిక ఈ సంకలనం. మొత్తం 166 పేజీల సంకలనం లో కథలు 101 పేజీలు కాగా, మిగిలిన 65 పేజీల్లోనూ ఈ కథల గురించి అనేకమంది వెలిబుచ్చిన అభిప్రాయాలు, లోతైన చర్చా కనిపిస్తాయి. (నసల్ కితాబ్ ఘర్, 'హర్యాలి' ముస్లిం రచయితల వేదిక సంయుక్త ప్రచురణ, వెల రూ. 75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)