శనివారం, జనవరి 31, 2009

మూడు సినిమాలు

రాజులు రాజ్యాలని పాలించే రోజుల్లో నెలకి మూడు వర్షాలు పడాలని యజ్ఞ యాగాదులు చేసే వాళ్ళట. నెలకి మూడు వానలు పడడం వల్ల పంటలు సక్రమంగా పండి రాజ్యం సుభిక్షంగా ఉండేదట. నేను నెలకి కనీసం మూడు సినిమాలు థియేటర్ లో చూస్తూ ఉంటాను. నా సంక్షేమం కోసం. ఒక్కోసారి ఇది సంక్షోభానికి దారి తీస్తూ ఉంటుంది..అన్ని సినిమాలూ ఒక్కలా ఉండవు కదా. గతం లో నెలకి ఆరు నుంచి ఎనిమిది సినిమాలు చూసేవాడిని కాని ఇప్పుడు కనీస సంఖ్య మూడుకి పడిపోయింది. ఆర్ధిక సంక్షోభం వల్ల కాదు..సినిమా సంక్షోభం వల్ల.

కొత్త సంవత్సరాన్ని 'వినాయకుడు' సినిమాతో మొదలుపెట్టా.. ప్రోమోస్ అవీ చూసి సినిమా బాగుంటుందని అనుకున్నా..పైగా 'ఆ నలుగురు' నిర్మాత. ఈ సినిమా నన్ను నిరాశ పరచలేదు. టేకింగ్ చాలా సార్లు శేఖర్ కమ్ముల 'ఆనంద్' ని గుర్తుచేసింది. శిష్యుడి మీద గురువుగారి ప్రభావం ఉండడం సహజమే కదా. ముఖ్యం గా కల్పన (సోనియా) కి ఆమె కుటుంబంతో ఉండే అనుబంధం, ఆమె వ్యక్తిత్వం ఇవన్నీ.. సంగీతం కొంచం నిరాశ పరిచింది. ఒక్క 'వర వీణా మృదుపాణి..' తప్ప మరే పాట గుర్తులేవు. కృష్ణుడు బాగా చేశాడు. క్లైమాక్స్ లో బాపు 'పెళ్లి పుస్తకం' గుర్తొచ్చేసింది. రెండోసారి చూసేందుకు టిక్ పెట్టి ఉంచాను.

జనవరిలో రెండో సినిమా కృష్ణవంశీ 'శశిరేఖా పరిణయం.' ఈ సినిమా గురించి 'నవతరంగం' లో రాశాను. మిగిలిన పాత్రలతో పోల్చినప్పుడు జెనిలియా బాగా చేసిందని అనిపించింది. ఆ అమ్మాయి ఇంకా 'బొమ్మరిల్లు' హాసిని హాంగోవర్ నుంచి బయట పడినట్టు లేదు. కృష్ణవంశీ కూడా పెళ్లి సబ్జెక్టు కాకుండా కొన్నాళ్లపాటు వేరే సబ్జక్ట్స్ గురించి ఆలోచించడం మంచిదేమో అనిపించింది. ఈ సినిమా కి కూడా సంగీతమే మైనస్. మనం 'కొంచం విషయం ఉంది' అనుకున్న దర్శకులు ఏ ప్రత్యేకతా లేని సినిమా తీస్తే అది చూసి మనకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఈ సినిమా చూసినప్పుడు అలాగే అనిపించింది.

ఇక చివరి సినిమా 'అరుంధతి.' కథ కథనాల్లో లోపాలు ఉన్నప్పటికీ గొప్ప సాకేతిక విలువలున్న సినిమా. తెలుగు సినిమాలు మాత్రమె చూసేవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అంతర్జాతీయ సినిమాలు చూసేవాళ్ళు మాత్రం ఏ సీన్ ఏ సినిమాలోదో ఆలోచించడంలో పడి ఈ సినిమాను అంత బాగా ఎంజాయ్ చేయలేక పోవచ్చు. చిన్న అరుంధతికి ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వకుండా ఆమెని కేవలం జేజమ్మ చేతిలో ఓ ఆయుధం గా చూపడం నచ్చలేదు. విలన్ ని ఎదుర్కోడానికి ఆమె తన బుర్ర కూడా కొంచం ఉపయోగిస్తే బాగుండేది. అదేమిటో కానీ ఈ సినిమాకి కూడా సంగీతమే మైనస్ అనిపించింది. సినిమాకి తగ్గట్టుగా నేపధ్య సంగీతం లేదు. సోనుసూద్ కి రవిశంకర్ (సాయికుమార్ తమ్ముడు?) చెప్పిన డబ్బింగ్ మాత్రం జస్ట్ యక్సలెంట్. చిన్నప్పటి జేజమ్మగా వేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది..డాన్స్ టీచర్ కూడా. అనుష్క కి ఇక 'జిన్తాక్ తాలు' 'ఝుంఝుం మాయాలు' ఉండవేమో. ఇంత ఇమేజ్ సంపాదించుకున్న అమ్మాయి తమ పక్క నటించడానికి మన పెద్ద హీరోలు ఒప్పుకోగాలరా? చూడాలి. మరో సారి చూడాల్సిన జాబితాలో ఈ సినిమా కూడా చేరింది.

శుక్రవారం, జనవరి 30, 2009

ఎడారి కోయిల

'కథే తానై, తానే కథై తెలుగు కథకు కొత్త వెలుగునిచ్చిన మధురాంతకం రాజారాం గారి దివ్య స్మృతికి మా ఈ ప్రదర్శన అంకితం చేస్తున్నాం..గంగోత్రి..పెదకాకాని వారు సమర్పించు ఎడారి కోయిల నాటిక. రచన వల్లూరు శివ ప్రసాద్..దర్శకత్వం నాయుడు గోపి..ఎడారి కోయిల మరికొద్ది క్షణాల్లో ..' ఈ ప్రకటనతో మొదలయ్యే 'ఎడారి కోయిల' నాటికను నాలుగుసార్లు చూసే అవకాశం దొరికింది నాకు. నచ్చిన పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం, సినిమా నచ్చితే రెండు మూడు సార్లు చూడడం నాకు అలవాటు. నాటకం/నాటిక విషయంలో మాత్రం ఈ అవకాశం అరుదుగా దొరుకుతుంది.

ఇది ఏడెనిమిదేళ్ళ క్రితం సంగతి. అప్పటికే దామల్ చెరువు అయ్యోరి (మధురాంతకం రాజారాం) కథలు కొన్ని..'ఎడారి కోయిల' తో సహా.. చదివి ఉన్నాను. ఓ కథనో, నవలనో సినిమాగానో, నాటకంగానో మలచడంలో ఉండే కష్ట నష్టాలపై కొంత అవగాహన ఉంది. మొదటిసారి ఈ నాటికను చూస్తున్నపుడు కథను పూర్తిగా మార్చేస్తున్నారా? అని సందేహం కలిగింది. ఐతే నాటిక పూర్తయ్యేసరికి నాకు కలిగిన అనుభూతి, కథను చదివినప్పటి అనుభూతితో సమంగా ఉండేసరికి మళ్ళీ ఈ నాటిక చూసే అవకాశం ఎప్పటికి వస్తుందా అని ఎదురు చూశా.

మధురాంతకం రాసిన 'ఎడారి కోయిల' కథ తన తాతయ్య, నాయనమ్మలను వెతుక్కుంటూ అమెరికా నుంచి రాయలసీమ లోని ఓ కుగ్రామానికి వచ్చే ఓ టీనేజ్ కుర్రాడి కథ. తన తండ్రికి పాఠాలు చెప్పిన మాష్టారి ద్వారా ఊరి పరిస్థితులు, ఇంటి పరిస్థితులు తెలుసుకోడం తో పాటు, తనమీద కోపంగా ఉన్న తాతయ్య మనసు ఎలా గెలుచుకున్నాడనేది కథాంశం. 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమా కథ కి కొంచం దగ్గరగా ఉంటుంది. బహుశా ఆ కథ రాసిన 'మానస' దామల్ చెరువు అయ్యోరి కథ నుంచి స్ఫూర్తి పొంది ఉండొచ్చు.

కథని నాటికగా మార్చడంలో కొన్ని మార్పులు చేశారు. కథలో లేని ఫాక్షనిజం అంశాన్ని నాటికలో చేర్చారు. కథలో ఉండే మేనత్త పాత్రకు బదులుగా బాబాయ్ పాత్రను సృష్టించారు. రాయలసీమ నేటివిటీ కోసం నాటికను ఓ చెక్క భజనతో ప్రారంభించారు. స్టేజి మీద సెట్టింగ్ సింపుల్ గా ఉన్నా, 'సీమ' గ్రామాన్ని ని ప్రతిబింబించింది. తాతయ్య పాత్రని నాయుడు గోపి, నాయనమ్మగా సీనియర్ రంగస్థల నటి రత్న కుమారి (ఈవిడకి నట రత్న కుమారి అని పేరు) మనవడిగా కిరణ్ అనే అబ్బాయి నటించారు.

కథ మొత్తం ఈ మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. నాయనమ్మకి మనవడంటే ఇష్టం, తాతయ్య కి కోపం. పెద్దాయన తన పెద్ద కొడుకుని కష్టపడి మెడిసిన్ చదివిస్తాడు. అతను ఓ కోస్తా జిల్లా అమ్మాయిని పెళ్లి చేసుకుని తల్లితండ్రులని, సీమని వదిలి అమెరికా లో సెటిల్ అవుతాడు. కుటుంబాన్ని పట్టించుకోడు. పెద్దాయన 'ఎందుకొచ్చావని' మనవడి మీద కోప్పడతాడు.. కుర్రాడికి విందు భోజనం పెట్టలేని తమ స్థితి పట్ల వృద్ధ దంపతులు బాధ పడతారు. బాబాయ్ ఫాక్షనిస్టు గా ఎందుకు మారవలసి వచ్చిందో, ఫలితంగా కుటుంబంలో పెరిగిన అశాంతి ఆ అబ్బాయి కళ్ళారా చూస్తాడు.

తమ కొడుకు కోడలు విజయవాడ వచ్చారని, మనవడు తిరుపతి వెళ్తానని వాళ్ళకి చెప్పి తమను చూడడానికి వచాడని తెలుసుకుని ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషిస్తారు. 'ఈ ఊరే తిరుపతి, మీరిద్దరే నా దేవుళ్ళు అనుకుని వచ్చాను తాతయ్యా..' అని అబ్బాయి చెప్పే డైలాగ్, బ్యాక్ గ్రౌండ్ లో 'గోవింద గోవింద' అనే మ్యూజిక్ ప్రేక్షకుల చేత అప్రయత్నంగానే చప్పట్లు కొట్టిస్తాయి. మెడిసిన్ చదువు పూర్తి చేసి అదే ఊళ్ళో హాస్పిటల్ పెడతానని తాతయ్యకి, నాయనమ్మకి హామీ ఇచ్చి మనవడు ప్రయాణం అవ్వడం, చెక్క భజన బృందం దగ్గర భజన నేర్చుకుని బస్ ఎక్కడం నాటిక ముగింపు.

ఓ సినిమా చూసాక అది మనకి నచ్చితే ఆ నటీనటుల్ని వ్యక్తిగతంగా కలిసి అభినందించడం మనకి వీలు కాదు. అదే నాటకం లో ఆ సౌలభ్యం ఉంది. రచన క్రెడిట్ పూర్తిగా మధురాంతకం వారికి ఎందుకు ఇవ్వలేదని నాయుడు గోపి ని అడిగాను. మూల కథని నాటకీకరించడంలో చాల మార్పులు చేశామని చెప్పారు. ప్రదర్శన పూర్తైన ప్రతిసారి కిరణ్ చాలా ఎమోషనల్ అయిపోయేవాడు. పాత్ర నుంచి బయటకి రావడానికి కొంచం టైం పట్టేది. హైస్కూల్ తో చదువు ఆపేసిన ఆ అబ్బాయి స్టేజి మీద అమెరికన్ యక్సేంట్ లో డైలాగులు చెపుతుంటే అబ్బురంగా అనిపించేది. డిగ్రీ అయినా చదవమని సలహా ఇచ్చా.. విన్నాడో లేదో తెలీదు.

చాలా రోజుల తర్వాత ఈ నాటికని ఓ టీవీ చానల్ వాళ్లు స్టూడియో లో షూట్ చేసి ప్రసారం చేశారు. క్వాలిటీ చాల నాసి రకంగా ఉంది..సగం చూసి ఇక చూడలేక చానల్ మార్చేశా..

గురువారం, జనవరి 29, 2009

అమ్మ పుట్టిన ఊరు..

మాది ఓ పల్లెటూరు..ఐతే అమ్మమ్మ వాళ్ల ఊరు మా ఊరికన్నా పల్లెటూరు. అక్కడివాళ్లు మమ్మల్ని ఓ మహా నగరం నుంచి వచ్చిన వాళ్ళలా ట్రీట్ చేసే వాళ్లు. అమ్మమ్మ వాళ్ల ఊరికి మా ఊరినుంచి నేరుగా ఐతే గంట ప్రయాణం. ఐతే కొంత దూరం నడక, కొంత దూరం బస్, మళ్ళీ కొంత దూరం నడక.. ఇలా సాగే ప్రయాణం ఓ రెండు మూడు గంటలు పట్టేది. అప్పట్లో బస్ లు కూడా సరిగా ఉండేవి కాదు. దానికి తోడు అమ్మకి బస్ ప్రయాణం పడదు. ఇక మా తిప్పలు ఉండేవీ...

బాగా చిన్నప్పుడు బస్ గోదారి బ్రిడ్జి దాటుతున్నపుడు భయంగా అనిపించేది. 'బ్రిడ్జి కూలి బస్ గోదారిలో పడిపోతే..' అని సందేహం. 'చెడు కోరుకోకూడదు.. భయమేస్తే కళ్లు మూసుకుని ఆంజనేయ స్వామి కి దండం పెట్టుకో' అని చెప్పేది అమ్మ. కొంతమంది బస్ డ్రైవర్లు బస్ ని బ్రిడ్జి దగ్గర ఆపి, స్వామి కి దండం పెట్టుకుని మళ్లీ బస్ ఎక్కేవాళ్ళు. పెద్దవాళ్ళు బస్ కిటికీ లోంచి గోదారిలోకి చిల్లర పైసలు విసిరే వాళ్లు. అలా వృధా చేసే బదులు అడుక్కునే వాళ్లకు ఇవ్వొచ్చు కదా అనిపించేది. అదే మాట అమ్మతో అంటే 'ఇవి కూడా వాళ్ళకే వెళతాయిలే' అనేది.

అక్కడ బస్ దిగినప్పటినుంచి అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళే వరకు దారి పొడుగునా చాలా మంది అమ్మని పలకరించే వాళ్లు. వాళ్ళంతా అమ్మ ఫ్రెండ్స్. అలా మాటల్లోనే ఇల్లు వచ్చేసేది. ఇక మేం వెళ్ళామంటే అమ్మమ్మ, తాతయ్య, పిన్నిలు, చిన్న మామయ్య చేసే హడావిడి చూడాలంటే. 'పాపం పిల్లలు అంత దూరం నుంచి వచ్చారు.. ఏమన్నా తిన్నారో లేదో' అంటూ అమ్మమ్మ పొయ్యి వెలిగించేది. మేము దారిలో అమ్మని పీడించి రకరకాల చిరుతిళ్ళు కొనిపించుకున్నామని ఆవిడకి తెలీదు కదా.

అక్కడికి చేరగానే అమ్మ మమ్మల్ని దాదాపు మర్చిపోయేది. తన చెల్లెళ్ళతో, తమ్ముడితో ఒకటే కబుర్లు. 'నువ్వు కూర్చో అమ్మా..నేను చెల్లెళ్ళు కలిసి పనంతా చేసేస్తాం' అనేది అమ్మ. అమ్మమ్మ వింటే కదా. అమ్మమ్మ పెట్టింది తిన్నాక మేము ఊరిమీద పడేవాళ్ళం. ఎక్కువ దూరం వెళ్తే తాతగారు ఏమంటారో అని భయం. అందుకని పక్క ఇళ్ళకి మాత్రమె వెళ్ళేవాళ్ళం.

మేము స్కూల్లో నేర్చుకున్న పద్యాలు, పాటలు పాడేవాళ్ళం. పాఠాల్లో మాకు నచ్చినవి కూడా చెప్పేవాళ్ళం. అందరూ చాల ఆసక్తిగా వినేవాళ్ళు 'ఎంత బాగా చెబుతున్నారో..' అంటూ. కొందరైతే వాళ్ల పిల్లల్ని కోప్పడే వాళ్లు..మమ్మల్ని చూసి నేర్చుకోమని. అలా వి ఐ పి ట్రీట్మెంట్ పొంది ఇల్లు చేరేవాళ్ళం. అప్పటికి మామయ్య తేగలు లాంటి చిరుతిళ్ళు సిద్ధం చేసేవాడు. మేము వచ్చినప్పుడే ఎవరైనా పెద్దమ్మలు, వాళ్ల పిల్లలు వస్తే ఇక పండగే.. అందరం కలిసి విపరీతంగా అల్లరి చేసేవాళ్ళం. అమ్మమ్మ తాతగారికి ముందే చేప్పేసేది 'పిల్లల్ని ఏమి అనకండి..రాక రాక వచ్చారు..' అని. అమ్మా వాళ్లు కూడా మమ్మల్ని వదిలేసే వాళ్లు, వాళ్ల కబుర్లకి మేము అడ్డు రాకుండా ఉంటే అంతే చాలని.

సాయంత్రాలు అమ్మ వాళ్ల ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. వాళ్ల ముందు మా విద్యా ప్రదర్శన. ఒకరు ఓ పాట పాడితే ఆ చివరి అక్షరం తో మొదలయ్యే పాట మరొకరు పాడడం (దానిని 'అంత్యాక్షరి' అంటారని అప్పట్లో మాకు తెలీదు). తాతగారు పద్యాలు రాగయుక్తంగా చదివేవాళ్ళు. అమ్మమ్మ మాచేత కబుర్లు చెప్పించుకుని వినేది. ఆవిడ చిన్న పిల్లల్ని కూడా 'నువ్వు' అనేది కాదు. మా కబుర్లలో మా ఇష్టాలేమితో తెలుసుకుని మర్నాడు అవి వండి పెట్టేది. ఎప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ ఉండేవాళ్ళం కాదు. మాకేవరికైనా జ్వరం వస్తే తప్ప.

ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య లేరు. మామయ్య వేరే చోటకి వెళ్ళిపోయాడు. ఆ ఇల్లు ఖాళీ గా ఉంది. ఎప్పుడు మా ఊరు వెళ్ళినా అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్ళాలని బలంగా అనిపిస్తూ ఉంటుంది. కాని ప్రతిసారి ఏదో ఒక ఆటంకం. అన్నీ కలిసొచ్చినా ఆ క్షణంలో 'వెళ్లి అక్కడ ఏం చూడాలి?' అనిపిస్తుంది. అప్పుడప్పుడూ అమ్మమ్మ వాళ్ల ఊరు, ఇల్లు, ఆ జ్ఞాపకాలూ బాగా గుర్తొస్తూ ఉంటాయి. ఒకసారి వెళ్లి చూసి రావాలి...

బుధవారం, జనవరి 28, 2009

ఉత్తమ ఉపాధ్యాయుడు

అది ఒక స్టార్ హోటల్ లో విశాలమైన కాన్ఫరెన్స్ హాల్. సుమారు వంద మందితో ఓ వర్క్ షాపు జరుగుతోంది. అక్కడ ఉన్నవారంతా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారే. పేరుపొందిన స్కూళ్ళలో ప్రతిరోజూ వందలాది విద్యార్ధులను పరిశీలిస్తూ, వారికి విద్యను బోధిస్తూ వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. వారందరికీ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నది కూడా ఓ ఉపాధ్యాయుడే. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించిన ఆయనకు విద్యార్ధుల మనస్తత్వమే కాదు, అధ్యాపకుల ఆలోచనా సరళిపైనా అవగాహన ఉంది. ఆ కార్యక్రమం ఉద్దేశ్యం ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా తయారుచేయడం.

కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధ్యాపకుడు పాల్గొన్న వారందరినీ కార్యక్రమం లో భాగస్వాములని చేశాడు. వాళ్ళచేత ఆడించాడు, పాడించాడు. వాళ్లకు పరిక్షలు పెట్టాడు..గెలిచిన వాళ్ళకి చాక్లెట్లను బహుమతిగా పంచాడు. ఈ క్రమంలోనే 'మంచి అధ్యాపకుడు ఎలా ఉండాలి?' అన్నది వివరిస్తూ ఆయన ఓ కథ చెప్పాడు. ఆ కథ ఆయన మాటల్లోనే..

ఓ స్కూల్లో లెక్కలు చెప్పే ఓ ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఆయన పరమ కోపిష్టి. విద్యార్ధుల నుంచి ప్రశ్నలు రావడం ఆయనకీ ఇష్టం ఉండదు. తన క్లాస్ లో విద్యార్ధులంతా క్రమశిక్షణతో ఉండాలి..ఆయన చెప్పేది శ్రద్ధగా వినాలి. విద్యార్దులనుంచి ఎలాంటి సందేహాలూ రాకూడదు. నిజానికి ఆయన సంగతి తెలిసిన విద్యార్ధులు క్లాస్ లో ఎలాంటి ప్రశ్నలూ వేయడానికి ఇష్టపడరు. ఆయన బోర్డ్ మీద రాసే లెక్కల్ని తమ పుస్తకాల్లో వేగంగా రాసుకోడానికే వారికి సమయం చాలదు. బోర్డ్ మీద లెక్కలో మూడో లైన్ రాయగానే మొదటి లైన్ చెరిపేయడం ఆయన అలవాటు. ఇప్పుడు ప్రశ్న'ఈయన మంచి అధ్యాపకుడేనా?' అని.. 'అవును' అని ఎవరూ చెప్పలేదు.

ఒకరోజు మొదటి పిరియడ్ లెక్కల క్లాస్ జరుగుతుండగా వెనుక బెంచ్ లో కూర్చున్న ఓ విద్యార్ధి టిఫిన్ బాక్స్ కింద పడింది. ఆ శబ్దానికి శ్రద్ధగా నోట్స్ రాసుకుంటున్న విద్యార్ధులంతా ఒక్కసారిగా వెనక్కి చూసారు. ఆ విద్యార్ధి సిగ్గు పడ్డాడు. మాష్టారు అతనికేసి సీరియస్ గా చూసి 'లంచ్ టైంలో నన్ను కలు' అని చెప్పి పాఠంలోకి వెళ్లిపోయారు. ఆ విద్యార్ధి ముఖంలో భయం, మిగిలిన విద్యార్ధుల్లో ఉత్కంత..ఇతనికి ఎలాంటి శిక్ష పడుతుందో అని. ఆ తరువాత జరిగిన క్లాసులు ఎవరూ శ్రద్ధగా వినలేదు. ఇదే టాపిక్ మీద క్లాసంతా గుసగుసలు.

లంచ్ టైం రానే వచ్చింది. విద్యార్ధి భయం భయంగా మాష్టారిని కలిసాడు. 'నేను కావాలని పడేయలేదు సార్..పొరపాటున జరిగింది..ఇంకెప్పుడూ ఇలా చెయ్యను సార్..' అతను భయంతో వణికిపోతూ చెబుతున్నాడు. ఐతే మాష్టారు అతన్ని మాట్లాడనివ్వలేదు. 'కాంటీన్లో నీకు నెల రోజుల భోజనం కోసం డబ్బు కట్టాను.. రోజు వెళ్లి భోజనం చెయ్. నెల అవ్వగానే మళ్ళీ కడతాను' అన్నారు సీరియస్ గానే.

'ఇప్పుడు చెప్పండి..అధ్యాపకుడు అలా ఎందుకు చేసాడు? అతను మంచి అధ్యాపకుడేనా? ' సమాధానం చెప్పడానికి ఓ ఉపాధ్యాయిని ముందుకొచ్చింది. 'టిఫిన్ బాక్స్ కింద పడ్డ శబ్దం వల్ల అది ఖాళిదని మాష్టారికి తెలిసింది. మొదటి పిరియడ్ లో ఖాళీ టిఫిన్ బాక్స్ అంటే..ఆ విద్యార్ధి భోజనం తెచ్చుకోలేదని ఆయనకి అర్ధమైంది. ఓ మంచి అధ్యాపకుడు తన విద్యార్ధి సమస్యలను తెలుసుకోవాలి. తనకు తోచిన సహాయం చేయాలి. ఆయన విద్యార్ధి సమస్యని అర్ధం చేసుకున్నాడు. సాయం చేసాడు. పైకి చాలా కటువుగా కనిపించినా ఆయన చాల మృదు స్వభావి, మంచి అధ్యాపకుడు.' వర్క్ షాప్ నిర్వాహకుడు ఆమెకు ఓ చాక్లెట్ బహూకరించాడు.

మంగళవారం, జనవరి 27, 2009

చీకట్లో గోదారి

'బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్ళు తొక్కింది గోదారి గంగ.. పాపి కొండలకున్న పాపాలు కరగంగా పరుగుల్లు తీసింది బూదారి గంగ...' ఇది నాకు చాలా ఇష్టమైన పాట. 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమాలో ఈ పాట విన్నప్పుడల్లా ఉరకలెత్తుతున్న గోదారి గుర్తొస్తుంది. కాని ఇప్పుడు ఇదే పాట వింటుంటే మనసంతా చేదుగా ఐపోతోంది. ఎందుకంటే ఇప్పటి గోదారి బద్దరగిరి రామయ్య పాదాలను కడగలేదు..పాపికొండలకి ఉన్న పాపాలనూ కరిగించలేదు. అందుకు సరిపోయేంత నీరు గోదారిలో లేదు... ఎందుకిలా జరిగింది? అంటే ఎవరి సమాధానం వారు చెబుతారు. రానున్న రోజుల్లో ఇది ఒక రాజకీయ అంశంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అవును..గోదావరి లాంటి ఓ జీవనది ఎండిపోయే దశకు చేరుకోడం మామూలు విషయం కాదు. నిజానికి గోదారి కేవలం ఒక నది మాత్రమే కాదు..పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజల జీవితంలో ఓ భాగం. కాటన్ మహాశయుడు ధవళేశ్వరం ఆనకట్ట కట్టి కోస్తా జిల్లాల ప్రజలని కరువు కోరల నుంచి విముక్తి చేసిన నాటి నుంచి అక్కడి ప్రజలకి గోదారి సాక్షాత్తూ అన్నం పెట్టె అమ్మ..అన్నపూర్ణ. కరుణించి ఏడాదికి మూడు పంటల వరమిచ్చినా, కోపగించి వరదై ముంచెత్తినా అక్కడి ఇల్లాళ్ళకి గోదారి తమ ఇంటి ఆడపడుచు. అంతేనా..కోడెకారు కుర్రకారు ఊహల్ని పూల పడవపై ఊరేగించి వారిలో భావుకత్వం పుట్టించే జాణతనం గోదారి సొంతం.

ఎంత వివశుడు కాకపొతే ఆరుద్ర 'గోదావరి వరద లాగ కోరిక చెలరేగింది..' అంటాడు? ఇదే గోదావరి గలగలలు మోదుకూరి జాన్సన్ కి వేదఘోష లా వినిపించాయి. 'వయ్యారి గోదారమ్మ వళ్ళంతా ఎందుకమ్మా కలవరం?' అని అడిగారు వేటూరి. తన కథా సంపుటానికి 'గోదారి కథలు' అని పేరుపెట్టిన బి.వి.ఎస్. రామారావు ఆ కథలని తనచేత రాయించింది గోదావరేనని ప్రకటించారు.

'గోదారి మీద మీకు ఎంత అభిమానం ఉంది?' జవాబు చెప్పడం కష్టమే.. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే 'వంశీ కి ఉన్నంత..' ఈ జవాబు 'ఆకాశమంత' లేదా 'గోదావరంత' అన్న జవాబులకన్న గొప్పదని ఒప్పుకొని వారెవరు? గోదావరి ప్రస్తావన లేకుండా వంశీ రాసిన కథలు, తీసిన సినిమాలు అరుదు. ఈ మధ్య కాలంలో వచ్చిన వంశీ పుస్తకం 'మా పసలపూడి కథలు' కి ప్రేరణ, నేపధ్యం గోదావరే. 'గోదారి గాలికి నా ఫెయిల్యుర్స్ ని మర్చిపోయాను..' అని తన 'ఫెయిల్యూర్ స్టోరి' లో వంశీ నే చెప్పాడు. అసలు వంశీ నరాల్లో రక్తానికి బదులు గోదారి ప్రవహిస్తోందేమో అని అనుమానించేవాళ్ళూ ఉన్నారు. గోదారిని తెరపై అందంగా చూపించడంలో వంశీ, బాపు, విశ్వనాద్ లది ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకమైన శైలి.

గోదారిని చూసిన వాళ్ళెవరూ ఆ నదితో ప్రేమలో పడకుండా ఉండలేరు..ఇది రుజువు చేయడానికి పరిశోధనలూ అవీ అవసరం లేదు. అక్కడివారే కానవసరం లేదు.. ఓ సారి ఆ నదిని చూసొచ్చిన వాళ్ళని ఎవరినైనా అడగండి.. రెండో ఆలోచన లేకుండా నిజమేనని ఒప్పుకుంటారు. నిశ్చల గోదారి కానివ్వండి లేదా వరద గోదారైనా కానివ్వండి, మిమ్మల్ని మీరు మర్చిపోయి అలా చూస్తూ ఉండాల్సిందే. వెన్నల రాత్రి గోదారి మీద పడవ ప్రయాణం ఓ జీవిత కాలం గుర్తుండే జ్ఞాపకం.

మరి ఇవాల్టి గోదారి? పంటలకి నీరు ఇవ్వలేక పోతోంది..కనీసం పాపి కొండలు చూడాలనుకునే వాళ్ల పడవలు అద్దరికి చేరేంత నీటినైనా తనలో మిగుల్చుకోలేక పోయింది. అలిగినప్పుడు తన ఉద్ధృత రూపం చూపించి భయపెట్టడం మాత్రమే తెలిసిన గోదారి ఇప్పుడెందుకో ఓ పిల్ల కాలువలా మారిపోతోంది. ఇంత తక్కువ నీటిమట్టం గడిచిన కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ రికార్డు కాలేదట. ఈసారి పంటనష్టం ఖాయమని, తాగునీటి సమస్య రావచ్చుననీ వార్తలు వస్తున్నాయి. గోదారి ఎవరినో శిక్షించాలనుకుని తనను తాను శిక్షించుకోవడం లేదు కదా?

సోమవారం, జనవరి 26, 2009

శ్రీ గణనాథం..

..భజామ్యహం..అంటూ గణేశుడిని తలుచుకుని ఏ పని అయినా మొదలు పెట్టాలని చిన్నప్పడు ఇంట్లో తాతయ్య మొదలు బడిలో మేష్టారి వరకు అందరూ చెప్పేవారు. అందుకే ఈ బ్లాగులో గణేశుడిని తలుచుకుంటున్నా. కాకపోతే ఇతను నా బాల్య మిత్రుడు గణేష్. మేమిద్దరం రెండో తరగతి నుంచి స్నేహితులం. ఎనిమిదో తరగతి వరకు కలిసి చదివాం. ఎలిమెంటరీ స్కూల్ లో మా ఇద్దరికీ విపరీతమైన పోటీ.. ఒక పరీక్షలో ఒకరికి ఫస్ట్ వస్తే, తరువాతి దాంట్లో మరొకరికి ఫస్ట్ రావాల్సిందే..

అప్పట్లో మా ఊళ్ళో ఒకాయన ప్రతి సంవత్సరం క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒకటి నుంచి నాలుగు తరగతుల వరకు పాతిక రూపాయలు, ఐదో తరగతి వాళ్ళకి యాభై రూపాయలు ప్రోత్సాహక బహుమతి ఇచ్చేవాళ్ళు. దీనికోసం ప్రతి క్లాస్ లోనూ ఇద్దరం పోటి పడేవాళ్ళం. కాని ఇద్దరం స్నేహితులం.. ఎంత అంటే ఒకరు బడికి వెళ్ళ లేకపోతే రెండో వాళ్లు వాళ్ల ఇంటికి వెళ్లి ఆరోజు ఏం చెప్పారో చెప్పి అవసరమైతే హోం వర్క్ లో సాయం చేసే అంత. యూనిట్ పరీక్షలలోను, క్వార్టర్లీ, హాఫ్ యియర్లీ పరీక్షలలోను తనకి ఫస్ట్ వచ్చినప్పుడల్లా నేను ఇంటికొచ్చి ఏడిస్తే 'వాడు నీకన్న యేడాది పెద్దవాడు..' అని అమ్మ నన్ను ఊరుకోపెట్టేది.

సరే.. ఐదో తరగతిలోకి వచ్చేశాం..స్నేహం స్నేహమే.. చదువు చదువే.. యాభై రూపాయలు ఎవరివో అని మిగిలిన స్నేహితులంతా చర్చించుకునేవారు. ఆ సంవత్సరం ఐదో తరగతి బహుమతి ఇద్దరికి చెరో పాతిక రూపాయలు ప్రకటించారు. అంటే గణేష్ కి నాకు. ఏడో తరగతిలో ఉండగా మా ఇద్దరికి చ్చిన్న మాట పట్టింపు వచ్చింది.. దాదాపు యేడాది పాటు మాట్లాడుకోలేదు. ఇప్పుడు తల్చుకుంటే చాలా సిల్లీగా ఉంటుంది కాని, అప్పట్లో ఇద్దరం చాలా పట్టుదలకి పోయాం. గణేష్ వాళ్ల తాతగారు మా ఊళ్ళో కిరాణా కొట్టు నడిపేవారు. చాలా కష్ట జీవి. దివిసీమ ఉప్పెన టైములో ఆయన 'మనందరం ఎన్నాళ్ళు ఒంటి పూట భోజనం చేస్తే ఈ నష్టం పూడుతుంది?' అనడాన్ని ఇప్పటికి ఎప్పుడు గోదారొచ్చినా మా ఊరివాళ్ళు తలచుకుంటారు.

ఆయన మరణం తరువాత పిల్లలు వేరు పడ్డారు. గణేష్ వాళ్ల నాన్నగారు ఓ సినిమా హాల్లో పనిచేసే వారు. తను సినిమాలు ఎక్కువగా చూసే వాడు. అంతే కాదు, ఆ కథలు చాలా వివరంగా చెప్పేవాడు. కొత్త సినిమా విడులైతే మర్నాడు స్కూల్లో 'సినిమా సూపరిట్టు' అనో 'ప్లాపైపాయింది..' అనో చెప్పేవాడు. ఆ రెండింటికీ భేదం ఏమిటో అప్పట్లో నాకు తెలిసేది కాదు.

నాకు అప్పట్లో సినిమా పరిజ్ఞానం చాలా తక్కువ. హీరోలని కూడా సరిగా గుర్తుపట్టలేక పోయేవాడిని. సినిమాకి వెళ్ళడం మీద మా ఇంట్లో చాలా ఆంక్షలు ఉండేవి. ఓ రకంగా సినిమా మీద నాకు ఆసక్తి ని పెంచింది అతనే. అంతేకాదు, నాకు ఊహ తెలిశాక అమ్మతో కాకుండా చూసిన మొదటి సినిమా తనతోనే.. అది 'లవకుశ' సినిమా. వాళ్ల నాన్నగారు పనిచేసే హాల్ వాళ్లు మార్నింగ్ షోలకోసం తెచ్చారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ పక్క ఊరికి తీసుకెళ్ళాడు.

ఎనిమిదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతుండగా ఓ రోజు మా ఇంగ్లిష్ మాష్టారు పిలిచి 'గణేష్ పరీక్షలకు రావడం లేదెందుకు?' అని అడిగారు. పరీక్ష అవ్వగానే గణేష్ వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ల నాన్నగారు ఉన్నారు. విషయం ఆయన్నే అడిగా. 'ఓ షాప్ లో పెట్టనమ్మా..అక్కడికి వెళ్తున్నాడు..' అన్నారు. ఏం చెప్పాలో కాసేపు అర్ధం కాలేదు. 'కనీసం పరీక్షలైనా రాయనీయండి. ఇన్నాళ్ళు చదివి పరిక్షలు రాయకపోవడం అంటే బాధ కదా. మాష్టారు అన్ని పరీక్షలూ రాయనిస్తానన్నారు' అన్నాను. ఆయన నా ముందే గణేష్ కి పర్మిషన్ ఇచ్చేశారు.

మర్నాడు ఇద్దరం కలిసి స్కూలుకి.. దారిలో చెప్పాడు తను చదువు మానేయల్సిందేనని. చాల బాధ అనిపించింది. మేమిద్దరం గొడవ తర్వాత కలిసిపోయమన్న ఆనందం ఏమి మిగలలేదు. చెప్పినట్టే తను చదువు మానేశాడు. అప్పుడప్పుడు కలిసేవాళ్ళం.. తను స్కూలు గురించి, మాష్టార్ల గురించి పేరు పేరునా అడిగేవాడు. తరువాత కొన్నాళ్ళకి నేను ఊరు వదిలేయాల్సి వచ్చింది. ఎప్పుడైనా ఊరెళ్ళినపుడు తనని కలిసేవాడిని. ప్రైవేటు గా చదవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ, ఎప్పటికప్పుడు ఏవేవో ఇబ్బందులు. నెమ్మదిగా తనకి చదవగలనన్ననమ్మకం పోయింది.

కుటుంబ బాధ్యతలని తనపై వేసుకుని పూర్తిచేశాడు. తన పెళ్ళికి పిలిచాడు కాని వెళ్ళడం నాకు వీలు పడలేదు. పెళ్లి టైం కి ఫోన్ లో శుభాకాంక్షలు మాత్రం చెప్పగలిగా. పెళ్ళయిన కొన్నాళ్ళకి మా ఊళ్ళోనే ఓ కిరాణా షాపు మొదలెట్టాడు తను. తన షాప్ కి వెళ్లి 'రామోజీరావు కూడా పచ్చళ్ళు అమ్మడం తోనే కెరీర్ మొదలు పెట్టాడు' అన్నా, తనని ఉత్సాహపరచడం కోసం. 'అంతకు ముందు, తర్వాత కొన్ని వేల మంది పచ్చళ్ళు అమ్మారు.. వాళ్ళంతా రామోజీరావు లు కాలేదు కదా?' అన్నాడు. బాగా చల్లటి గాలి ముఖానికి కొట్టిన ఫీలింగ్..అది వేసవి కాలం మరి.

తానేమీ నిరాశావాది కాదు, బట్ ప్రాక్టికల్ థింకర్.. కొన్నాల్లకే షాప్ మూసేయాల్సి వచ్చింది.. ఇంట్లో కూడా కొన్ని ఇబ్బందులు.తన సమస్యలన్నీ చెప్పేవాడు.. ఐతే తానేదో ఆ బరువు కి కుంగి పోతున్నానన్న భావనతో కాదు.. వాటిని తాను ఫేస్ చేయగలననే ధీమాతో.. భార్యా పిల్లలతో ఊరు విడిచిపెట్టాడు. చదువుకునే అవకాశం దొరికి ఉంటే తను చాలా మంచి స్థాయి కి వెళ్ళేవాడు అని నేను అనుకుంటూ ఉంటా. కాని తను అలా అనుకోడు. 'పర్వాలేదు..ఇప్పుడూ నేను బాగానే ఉన్నా..' అంటాడు నవ్వుతూ.

ఈమధ్య కలిసినప్పుడు చాలా సంతోషంగా చెప్పాడు.. పిల్లలు బాగా చదువుకుంటున్నారట.. 'మనం ఎలాగు చదవలేక పోయాం.. వాళ్ళని చదివించాలి..' అన్నాడు. చిన్నప్పుడు అమ్మ తరచూ చెప్పిన 'వాడు నీకన్నా యేడాది పెద్దాడు' అన్న మాట గుర్తొచ్చింది. 'యేడాది కాదు..చాలా పెద్దవాడు..' అనుకుంటున్నా.

శనివారం, జనవరి 24, 2009

నేనూ ఓ బ్లాగు వాడిని అయ్యాను..

బ్లాగు లోకంతో నాది కొద్ది నెలల పరిచయం. అదికూడా చాలా యాదృచ్చికంగా జరిగింది. సినిమా అంటే ఉన్నఆసక్తితో సినిమా వెబ్సైట్లు వెతుకుతుంటే 'నవతరంగం' కనిపించింది. నాలాంటి వాళ్లు అక్కడ చాలామంది కనిపించేసరికి నాక్కూడా రాయాలని అనిపించింది. వెబ్ లో తెలుగు లో రాయడం నేర్చుకుని అప్పుడప్పుడు సినిమా సమీక్షలు పంపడం మొదలు పెట్టాను. ఈ క్రమంలో బ్లాగుల గురించి తెలిసింది. కూడలి లోను జల్లెడ లోను బ్లాగులు చదవడం, అప్పుడప్పుడు కామెంట్స్ రాయడం జరిగింది. అత్యంత సహజంగానే 'వాట్ నెక్స్ట్' అనే ప్రశ్న, దానికి 'సొంతంగా ఓ బ్లాగు మొదలుపెట్టడం' అని సమాధానం.

మరి బ్లాగులో ఏం రాయాలి? మన అభిప్రాయలు లేదా మన జ్ఞాపకాలూ, అనుభవాలు. మిగిలిన అంశాలను గురించి రాసినా జ్ఞాపకాల గురించి ప్రస్తావన లేకుండా ఉన్న బ్లాగులు అరుదు అని నా చిన్న పరిశీలన. మరి బ్లాగుకి పేరేం పెట్టాలి? 'నామకరణం' సమస్యని అధిగమించడం కోసం ఓ సారి బాల్య స్మృతుల్లోకి వెళ్ళాను. చాలామంది పిల్లల్లాగే అప్పట్లో నాకూ 'నెమలి కన్ను' అంటే విపరీతమైన ఇష్టం. దానిని సంపాదించడం కోసం నేను పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. శ్రీరమణ 'షోడా నాయుడు' కథ చదివినప్పుడల్లా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మిత్రులని బతిమాలి ఓ నెమలీక సంపాదించడం, దానిని 'తెలుగు వాచకం' లో భద్రంగా దాచి అది పిల్లల్ని పెడుతుందనే నమ్మకంతో కొబ్బరి చెట్టు తాలూకు పైబర్ ను 'మేత' గా వేయడం, ఎప్పటికి పిల్లల్ని పెట్టడంలేదని నిరాశ పడ్డం..ఇంట్లో నాన్న కంటా, బడిలో మేష్టారి కంటా పడకుండా ఆ నేమలీకను కాపాడుకోవడం..

నెమలి కళ్ళతో చేసే విసనకర్రలతో అందర్నీ ఆశీర్వదిస్తూ పొట్ట పోసుకునే సంచార జాతులవాళ్ళ వెంటపడి 'ఒక్క కన్ను..కనీసం ఒక్క ఈక అయినా..' అని బతిమాలడం.. (వాళ్లు డబ్బులిచ్చినా ఇవ్వరు..ఆ విసనికర్రె వాళ్ల జీవనాధారం..కానీ అప్పట్లో మనకి ఆసంగతి అర్ధం కాలేదు, పైగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ల వెనకాల తిరగడం లో ఎన్ని రిస్కులనీ..) కళ్ళముందు గుండ్రాలు గుండ్రాలుగా ఫ్లాష్ బ్యాక్ పూర్తి అవ్వడంతో 'నెమలికన్ను' అనే పేరు డిసైడ్ చేసేసా. గూగులమ్మ వరమివ్వడంతో పని సులువైంది. కాని, అసలుపని అంతా ముందుందని ఎకౌంటు ఓపెన్ చేస్తున్నపుడు అర్ధమైంది. ఎన్నెన్నో సందేహాలు. ముందుగా మొదలు పెట్టేద్దాం, నెమ్మదిగా మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకుని, 'సాహసం సేయరా డింభకా..' అన్న'పాతాళభైరవి' మాంత్రికుడి మాట గుర్తు చేసుకుని మొదలు పెట్టేసా. సాయం చేయడానికి మీరంతా ఉన్నారు కదా.

ఇప్పటికిప్పుడు మిమ్మల్ని అక్షింతలు తెమ్మనడం భావ్యం కాదు కాబట్టి అవి లేకుండానే ఆశీర్వదించేయండి..