గురువారం, జులై 20, 2017

శమంతకమణి

కోటీశ్వరుడు జగన్నాధరావు కొడుకు కృష్ణ. ఎనిమిదేళ్ల వయసులో 'శమంతకమణి' ని తనకి పుట్టినరోజు కానుకగా ఇమ్మని తల్లిని కోరుకున్నాడు. అందరు తల్లుల్లాగే ఆమె కూడా 'నువ్వు పెద్దయ్యాక ఇస్తా' అని చెప్పింది. వెనువెంటనే జరిగిన ప్రమాదంలో కృష్ణని బతికించి ఆమె కన్నుమూసింది. సవతి తల్లినీ, తనని పట్టించుకోని తండ్రినీ భరిస్తూ పెరిగి పెద్దవాడవుతాడు కృష్ణ. సరిగ్గా పదిహేనేళ్ల తర్వాత కృష్ణ పుట్టిన రోజుకి కొన్ని రోజుల ముందు అతని ఇంటికి చేరుతుంది 'శమంతకమణి.' తండ్రి ఐదు కోట్లు పెట్టి కొన్నాడు, ఒక వేలంలో.

ఓ ఖరీదైన పబ్ లో ఫ్రెండ్స్ కి పుట్టినరోజు పార్టీ ఇచ్చిన కృష్ణ, అనూహ్యంగా ఆ పార్టీలోనే 'శమంతకమణి' ని పోగొట్టుకుంటాడు. తల్లే తన దగ్గరకి వచ్చినట్టుగా భావిస్తున్న కృష్ణ, రెండోసారి చేజారిన ఆ కానుకని తిరిగి పొందగలిగాడా అన్నదే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య ఫిలిమ్స్ నిర్మించిన 'శమంతకమణి' సినిమా. సింగల్ పాయింట్ స్టోరీని మల్టి డైమెన్షనల్ స్క్రీన్ ప్లే గా డెవలప్ చేసి, ప్రేక్షకులకి ఎక్కడా విసుగు కలగని విధంగా ఆద్యంతమూ ఆసక్తికరంగా మలచిన దర్శకుడిని మొదట అభినందించాలి.

తెలుగు సినిమా ఫార్ములాలో భాగమైపోయిన డ్యూయెట్లు కానీ, ఫైట్లు కానీ లేకపోయినా, ఎక్కడా అవి లేవన్న భావన కలగక పోవడం, ప్రత్యేకించి కామెడీ ట్రాక్ అంటూ లేకపోయినా నవ్వులకి లోటు లేకపోవడం, చివర్లో సస్పెన్స్ రివీల్ అయిపోయిన తర్వాత కూడా ప్రేక్షకులు సీట్లలో నుంచి కదలకుండా ఎండ్ టైటిల్స్ రోలయ్యే వరకూ థియేటర్ వదలకుండా చేయడం దర్శకత్వ ప్రతిభతో మాత్రమే సాధ్యమయ్యాయి. స్క్రిప్ట్ మీద బాగా కసరత్తు చేయడం, పాత్రకి తగ్గ నటుల్ని ఎంచుకుని, పాత్రోచితంగా నటింపచేయడం, సాంకేతిక నిపుణుల నుంచి చక్కని ఔట్పుట్ రాబట్టుకోవడం శ్రీరామ్ ఆదిత్య విజయ రహస్యాలని చెప్పాలి.


కృష్ణ చేజారిన శమంతకమణి మొత్తం మూడు చేతులు మారింది. మెకానిక్ గా పనిచేసే ఉమామహేశ్వర రావు (రాజేంద్ర ప్రసాద్), పల్లెటూరి ప్రియురాలు శ్రీదేవి మోసం చేస్తే, పట్నం పారిపోయిన యువకుడు శివ (సందీప్ కిషన్), డబ్బున్న ప్రియురాలు తనని నిర్లక్ష్యం చేయడాన్ని భరించలేక ఆమెకి బుద్ధి చెప్పాలని తాపత్రయపడే మధ్య తరగతి యువకుడు కార్తీక్ (ఆది సాయికుమార్). ప్రధాన కథకి సమాంతరంగా వీళ్ళ కథలు సాగుతూ వచ్చి, అసలు కథతో పాటు వీళ్ళ కథలూ ఆసక్తికరంగా ముగుస్తాయి.

వీళ్ళతో పాటు కృష్ణ తల్లిదండ్రులు (సుమన్, సురేఖ వాణి), కార్తీక్ తల్లిదండ్రులు (తనికెళ్ల భరణి, హేమ) మరియు కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ (నారా రోహిత్), అతని సహాయకుడు సత్యనారాయణ (హాస్యనటుడు రఘు), ఉమామహేశ్వర రావు ప్రియురాలు భానుమతి (ఇంద్రజ) లవి కీలక పాత్రలు. పబ్ లో పార్టీ జరిగిన రోజు రాత్రి అసలు ఏం జరిగింది? అక్కడే  పట్రోలింగ్ ద్యూటీ లో ఉన్న రంజిత్ కుమార్ దొంగతనం విషయాన్ని ఎందుకు పసిగట్టలేకపోయాడు? 'శమంతకమణి' ఎవరెవరికి ఏవిధంగా ఉపయోగపడింది? ఈ విషయాలన్నీ ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాడు దర్శకుడు.

ప్రథమార్ధం కథలో ముడులు వేసి, ద్వితీయార్ధంలో ఒక్కో ముడినీ విప్పుతూ రావడం వల్ల ఎక్కడా ఆసక్తి సడలలేదు. వినాయక వ్రతకల్ప కథలో తారసపడే శమంతకమణి దినానికి ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది. ఈ 'శమంతకమణి' కూడా చేతులు మారిన ముగ్గురిలో ఎవరినీ నిరాశ పరచకుండా అందరి సమస్యలనీ పరిష్కరించింది. దుష్ట శిక్షణకి కూడా కారణమయింది. ప్రేక్షకులకి పైసా వసూల్ అనిపించే ఈ సినిమా నిర్మాతకీ సొమ్ములిస్తే ఇలాంటి సినిమాలు మరిన్ని రావడానికి అవకాశం ఉంటుంది.

శనివారం, జులై 08, 2017

మంచివృక్షం

"త్రిపుర కథల్లో భగవంతం, శేషాచలపతి లాగా మీ రచనల్లో సుందరం, వీరా తరచుగా కనిపిస్తూ ఉంటారు, ఏదో కారణం ఉండే ఉంటుంది కదూ?" ... "మీ రచనల్లో కనిపించే 'మోహిని' గ్లోబలైజేషన్ కి ప్రతీక అనుకుంటున్నాను, కరెక్టేనా?" ...ఎప్పుడైనా ఆయన ఎదురుపడితే ఈ ప్రశ్నలు అడిగి, జవాబులొస్తే కనుక, కొనసాగింపుగా "మీ తొలిరచనల్లో మార్కిస్టు-లెనినిస్టు (ఎమ్మెల్) రాజకీయాల పట్ల కనిపించిన ఆరాధన, కాలం గడిచే కొద్దీ కరిగిపోతూ, అవే రాజకీయాలని వ్యంగ్యంగా ప్రస్తావించడం కనిపిస్తుంది, దీన్ని కాలం తెచ్చిన మార్పు అనుకోవాలా?" లాంటి ప్రశ్నలెన్నో అడగాలనుకున్నాను. కానీ, ఇక అడగలేను. ఇవాళ్టినుంచీ ఇవన్నీ ఎప్పటికీ జవాబు దొరకని ప్రశ్నలే. జవాబులివ్వాల్సిన డాక్టర్ వి. చంద్రశేఖర రావు ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లిపోయారు.

పాతికేళ్లుగా ఆయన కథలు చదువుతూ ఉన్నా, చంద్రశేఖర రావుని గురించి ఆగి, ఆలోచించింది మాత్రం 'ఆకుపచ్చని దేశం' నవల చదివినప్పుడే. అత్యాధునిక కవిత్వాన్ని ఓ కొరుకుడు పడని విషయంగా భావించే నేను, ఆ నవల్లో కవితాత్మక వచనానికి ముగ్ధుణ్ణయిపోయాను. చివరిపేజీ చదివిన వెంటనే మళ్ళీ మొదటి పేజీకి వచ్చి ఆపకుండా చదివేసిన కొన్ని పుస్తకాల్లో అదీ ఒకటి. కొన్ని రోజుల పాటు నవల్లో చెంచులు అక్షరాలా నన్ను వెంటాడారు. అత్యంత బలహీనమైన, అత్యంత పట్టుదల కలిగిన మనుషుల గుంపు అడివి వెంబడి అలా నడుచుకుంటూ వెళ్లిపోవడం అప్పుడప్పుడూ గుర్తొచ్చి గగుర్పాటు కలుగుతూ ఉంటుంది.

చంద్రశేఖరరావు మీద గౌరవం మరో మెట్టు పైకెక్కి, ఎప్పటికైనా కలవాలి అని బలంగా అనుకోడానికి కారణం కూడా నవలే. ఆ నవల పేరు 'నల్లమిరియం చెట్టు.' సాంఘికంగానూ, రాజకీయంగానూ కూడా అత్యంత సున్నితమైన అంశాన్ని తీసుకుని, నిర్మొహమాటంగా, నిస్పక్షపాతంగా రాసిన నవల అది. కొన్ని పేజీలని వెనక్కి తిప్పి మళ్ళీ మళ్ళీ చదువుకోవడం, కథలో వచ్చే కొన్ని మలుపులు 'నిజమేనా?' అని కళ్ళు నులుముకుని మరోసారి చదువుకోవడం ఆ నవల చదివిన నాటి జ్ఞాపకాలు. వస్తువు, శైలీ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ, పాఠకులని ఆశ్చర్యంలో ముంచెత్తే శిల్పంతో ఆపకుండా చదివించేలా, చదివిన తర్వాత కూడా ఆలోచించేలా నవలలు రాయడం, అదికూడా తెలుగు నవల క్షీణ యుగంలో ఉండగా రాయడం - బహుశా ఆయనపట్ల నాక్కలిగిన గౌరవానికి కారణాలు.

నాకు తెలిసినంత వరకూ మొత్తం ఆరు పుస్తకాలు - మూడు కథా సంపుటాలు, మూడు నవలలు - తెలుగు సాహిత్యానికి ఆయన కంట్రిబ్యూషన్. రచనల్లోలాగే, ప్రచురణలోనూ నాణ్యతకి రాజీ పడలేదాయన. "చంద్రశేఖర రావు గారు పుస్తకాలు సొంతంగా వేసుకుంటారు. కవర్ పేజీ నుంచి, లేఔట్ వరకూ అన్నీ ఆయన ఇష్ట ప్రకారం జరగాలి. హై క్వాలిటీ పుస్తకానికి చాలా నామినల్ రేటు పెడతారు," సుమారు రెండేళ్ల క్రితం ఓ పబ్లిషర్ నుంచి ఈ మాటలు విన్నప్పుడు ఆయన పుస్తకాలని ఈ కోణం నుంచి చూశాను. పబ్లిషర్ మాట అసత్యం కాదు. వైద్య వృత్తిని అభ్యసించి, ఎమ్మెల్ రాజకీయాలని అభిమానించి, రైల్వేలో ఉన్నతోద్యోగం చేస్తూ, సాహితీ యాత్రని కొనసాగించిన చంద్రశేఖర రావు చేయాల్సిన, తాను మాత్రమే చేయగలిగిన రచనలు చాలా చాలా ఉన్నాయి. 

నిజానికి సరిగ్గా వారం క్రితం 'ద్రోహవృక్షం' కథా సంకలనం గురించి టపా రాయాలని మొదలు పెట్టాను. ఎప్పడూ లేనన్ని అవాంతరాలు. ఇవాళ ఎలాగైనా ఆ టపా పూర్తి చేయాలి అనుకుంటూ ఉండగా ఆయన ఇక లేరన్న నమ్మశక్యం కాని వార్త. రెండు నవలల్లోనూ 'అలలసుందరం' 'రాజసుందరం' పాత్రలు జ్ఞాపకం ఉండిపోతే, 'ద్రోహవృక్షం' లోని మొత్తం ఇరవై కథల్లో చాలా కథల్లో కథా నాయకుడు 'సత్యసుందరం.' అన్నదమ్ముల్లా కలిసున్న మాల, మాదిగల మధ్య రాజకీయంగా పబ్బం గడుపుకోడం కోసం కొందరు నాయకులు పెట్టిన చిచ్చు ఎలాంటి పరిణామాలని దారితీసిందో ప్రతీకాత్మకంగా చెప్పిన కథ 'ద్రోహవృక్షం.' ఒక్క రాజకీయాలనే కాదు, అన్ని వ్యవస్థల్లోనూ పెరిగిపోతున్న అరాచకాన్ని కళ్ళకి కట్టారు ఈ సంపుటంలో కథల్లో.

నిస్పక్షపాతంగా రచనలు చేసే రచయిత(త్రు)లు అరుదైపోతున్న కాలంలో, ఒక కమిట్మెంట్ తో రచనలు చేసిన రచయిత చంద్రశేఖర రావు. ప్రతీకల్ని వాడుకోవడంతో తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకోడమే కాదు, తాను సృష్టించిన లోకంలోకి పాఠకుణ్ణి అలవోకగా తీసుకుపోయే విద్యలో ఆరితేరారు కూడా. ముఖ్యంగా, గ్లోబలైజేషన్ అనంతర పరిణామాలని నిశితంగా పరిశీలించి కథలుగా మలిచారు. తెలుగు సాహిత్య వాతావరణంలో చంద్రశేఖర రావు లాంటి రచయితల అవసరం పెరుగుతున్న సమయంలోనే, ఆయన అనారోగ్యంతో కన్నుమూయడం అత్యంత దురదృష్టకరం. తెలుగు సాహితీ వనంలో ఓ మంచివృక్షం డాక్టర్ వి. చంద్రశేఖర రావుకి కన్నీటి నివాళి.