శుక్రవారం, ఏప్రిల్ 25, 2014

చందమామ కథలు

అనగనగా ఓ రాజు. అతనికి ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకి వెళ్లి ఏడు చేపలు తెచ్చారు.. తర్వాత ఏమైంది అన్నది ఒకప్పటి  'చందమామ' కథ. ఇప్పటికి వస్తే, అనగనగా ఓ రచయిత.. అతగాడు ఏక కాలంలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు కథలు రాసేస్తాడు. ఈ ఏడు కథలతో పాటు అతగాడి కథ ఏ తీరం చేరింది అన్నదే 'చందమామ కథలు,' ఇవాళే విడుదలైన సరికొత్త తెలుగు సినిమా. ప్రవీణ్  సత్తారు దర్శకత్వంలో, బి. చాణక్య నిర్మించిన చిన్న సినిమా.

చాలా చాలా రోజుల తర్వాత థియేటర్ కి వెళ్లి సినిమా చూశాను. ట్రైలర్స్, పోస్టర్స్ చూశాక ఎందుకో కానీ, ఈ సినిమా చూడాలని బాగా అనిపించింది. సినిమాలో ఎనిమిది కథలు ఉంటాయి అని ముందుగానే తెలియడం వల్ల సిద్ధపడే వెళ్లాను. ఓ రచయిత కథతో మొదలైన సినిమా, తర్వాత అతను రాస్తున్న ఒక్కో కథనీ పరిచయం చేస్తూ, రచయిత కథలో ఓ మలుపు వచ్చేసరికి 'విశ్రాంతి' కి చేరింది. అన్ని కథలూ ముగింపుకి చేర్చి, 'శుభం' కార్డు వేశారు.

రచయిత కథతో పాటు, మిగిలిన ఏడు కథలూ కూడా బాగా నలిగినవే. యవ్వనంలో ఉండగా ప్రేమించుకుని, పెద్దవాళ్ళ అభ్యంతరం కారణంగా ఒకటి కాలేక, బాధ్యతలన్నీ తీరాక అనుకోకుండా ఒకరికొకరు తారస పడ్డ వృద్ధ జంట (నరేష్, ఆమని), బస్తీలో పిల్లని వెంటపడి, ఏడిపించి, అటుపై పెళ్లి చేసుకున్న ఓ బాధ్యత లేని కుర్రాడు, గొప్పింటి పిల్లని వలలో వేసుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలని కల కనే మరో పేదింటి కుర్రాడు, మినీ సూపర్ మార్కెట్ నడుపుకునే సాయిబుల కుర్రాడిని ప్రేమించి, పెళ్లి చేసుకోడానికి ఆలోచించే ముస్లిం అమ్మాయి వీళ్ళవి ఒకరకం కథలు.

ఒకప్పుడు బాగా బతికి, ఉన్నట్టుండి డిమాండ్ పడిపోయిన ఒక మోడల్ (మంచు లక్ష్మి),ముప్ఫయ్యేళ్ళు వస్తున్నా పెళ్లి కావడం లేదని బెంగ పడే సాఫ్ట్వేర్ ఇంజినీర్ (కృష్ణుడు).. వీళ్ళందరితో పాటు తనకో గూడు ఏర్పాటు చేసుకోవాలని కల కనే ఓ బిచ్చగాడు.. వీళ్ళవి మరో రకం కథలు. ఈ కథలు రాసే రచయిత జీవితంలోకి అనూహ్యంగా వచ్చి పడిన ఓ సమస్య.  ఈ ఎనిమిది కథల్నీ 135 నిమిషాల స్క్రీన్ టైం లో ప్రేక్షకులకి పరిచయం చేసి, అన్ని కథలకీ ముగింపులు ఇచ్చాడు దర్శకుడు.

ముందుగా చెప్పుకున్నట్టుగా కథలన్నీ బాగా నలిగినవే. మోడల్ కథ 'పేజ్ త్రీ' సినిమాని, బిచ్చగాడి కథ 'పుష్పక విమానము' సినిమానీ గుర్తు చేస్తాయి. నరేష్-ఆమనిల కథ, మిగిలిన ప్రేమకథలదీ అదే దారి. టేకింగ్ పరంగా చూసినప్పుడు, మణిరత్నం 'యువ' క్రిష్ 'వేదం' సినిమాలు గుర్తొచ్చాయి. అయితే, ఆ రెండు సినిమాల్లోనూ మూడేసి కథలైతే, ఇక్కడ ఏకంగా ఎనిమిది కథలు. ఒక్కో కథకీ దొరికిన సగటు స్క్రీన్ టైం పదహారు నిమిషాలు. మొదటి సగంలో కేరక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి, ఒక్కో కథకీ ఒక్కో ముడి వేసి, రెండో సగంలో ఆ ముళ్ళని విప్పాడు దర్శకుడు.

ఇన్ని కథలు చెప్పినా అక్కడక్కడా సాగతీత అన్న భావన కలిగిందీ అంటే, స్క్రీన్ ప్లే మీద మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని అర్ధం. ఒకటి రెండు కథల్ని తగ్గించి, మిగిలిన వాటిని ప్రెజెంట్ చేయడంలో కొత్తదనానికి ప్రయత్నం చేసి ఉంటే బావుండేది. ఫోటోగ్రఫీ ఎంత బావుందో, నేపధ్య సంగీతం అంతగా నిరాశ పరిచింది. మిక్కీ తన పాత పాటల ట్యూన్స్ ని నేపధ్య సంగీతానికి వాడేశాడు, ఆట్టే శ్రమ పడకుండా. ఫలితం, చూస్తున్న సినిమాతో పాటు చూసేసిన సినిమాలు కూడా గుర్తు రావడం.. మొత్తం మీద ఇదో మంచి ప్రయత్నం. రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమాలు ఇష్ట పడేవాళ్ళు, భారీ అంచనాలు లేకుండా చూసి రావొచ్చు.

శనివారం, ఏప్రిల్ 19, 2014

శ్రీపాద కథలూ - ఎన్.బీ.టీ...

తెలుగు కథని పరిపుష్టం చేసిన తొలితరం రచయితలలో మొదట చెప్పుకోవలసిన పేరు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఎనభయ్యేళ్ల క్రితమే తన కథల్లో అభ్యుదయాన్నీ, స్త్రీ వాదాన్నీ, దళిత వాదాన్నీ బలంగా వినిపించిన కథా రచయిత శ్రీపాద వారు. సంప్రదాయ కుటుంబంలో పుట్టి, సంస్కృతం, వేద విద్యలు నేర్చుకుని, పెద్దల అభీష్టానికి విరుద్ధంగా సాహిత్యం వైపుకి మళ్ళిన శ్రీపాద, ఆధునిక తెలుగు కథకి దశనీ, దిశనీ నిర్దేశించారు అనడం అతిశయోక్తి కాదు. ఇందుకు అభ్యంతరం ఉన్న వాళ్ళు 'కలుపు మొక్కలు,' 'ఇలాంటి తవ్వాయి వస్తే..' 'మార్గదర్శి' లాంటి కథలు చదువుకోవచ్చు.

పరిశోధకుల ప్రకారం, శ్రీపాద వంద కథలు ప్రచురించారు. నాటకాలు, నవలలతో పాటు తన ఆత్మకథని 'అనుభవాలూ-జ్ఞాపకాలూను' పేరిట అక్షరీకరించారు. 'కనక్ ప్రవాసి' గా ప్రసిద్ధులైన చామర్తి కనకయ్య 'శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చిన్నకథలు - సమగ్ర సమీక్ష' పేరిట సిద్ధాంత గ్రంధం రచించి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. దురదృష్టం ఏమిటంటే, శ్రీపాద మొత్తం రచనలన్నీ  సమగ్రంగా ఒకేచోట దొరకడం లేదు. అనేక  సంపుటాలుగా దొరుకుతున్న వాటిలో కొన్ని కథలు ప్రతిచోటా కనిపిస్తూ ఉండడం వల్ల, వెలుగు చూడని కథలు చీకటిలోనే ఉండిపోతున్నాయి.

శ్రీపాద శతజయంతి సందర్భంగా విశాలాంధ్ర ప్రచురణాలయం 1992 లో మూడు కథా సంపుటాలు, 'అనుభవాలూ-జ్ఞాపకాలూను' రెండు భాగాలనూ ప్రచురించింది. మూడు సంపుటాల్లోనూ కలిపి మొత్తం ఇరవై ఐదు కథలు ఉన్నాయి. (అవును, శ్రీపాద ఒక్కో కథా పదిహేను నుంచి నలభై-యాభై పేజీల నిడివి ఉంటుంది!) తర్వాత ఇదే సంస్థ 'నిలువు చెంబు' పేరుతో మరికొన్ని కథలు ప్రచురించింది. నవలలు, నాటకాలు రెండు సంపుటాలుగా విడుదల అయ్యాయి. కథా సంపుటాలకి 1999 లో ద్వితీయ ముద్రణ జరిగింది. తర్వాత కొంత కాలంపాటు శ్రీపాద పుస్తకాలు మార్కెట్లో దొరకలేదు.


విశాలాంధ్ర నుంచి బయటికి వచ్చి ప్రగతి పబ్లిషర్స్ సంస్థని స్థాపించిన పి. రాజేశ్వర రావు 2005 లో శ్రీపాద రచనల ముద్రణ ఆరంభించారు. 'పుల్లంపేట జరీచీర' పేరుతో 43 కథలు, 'కలుపు మొక్కలు' పేరిట ఏడు కథలు, 'మార్గదర్శి' పేరుతో తొమ్మిది కథలు. 'వడ్లగింజలు' అనే సంకలనంలో 14 కథలని  ముద్రించడంతో పాటు, 'అనుభవాలూ-జ్ఞాపకాలూను' పుస్తకాన్ని ఒకే వాల్యూముగా విడుదల చేశారు. లెక్క చూస్తే 73 కథలు తేలుతున్నాయి కానీ, ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది. కొన్ని కథల్ని శ్రీపాద ఒక్కసారి రాసేసి ఊరుకోలేదు. కొన్నింటిని పెంపు చేయగా, మరికొన్నింటిని కుదించారు.

ఉదాహరణకి 'తెనుగు రక్తం చప్పబడిపోతూ వుంది' పేరిట రాసిన కథకి తర్వాతి కాలంలో మార్పులు చేసి 'కలుపు మొక్కలు' పేరుతో ప్రచురించారు. అలాగే 'కీలెరిగిన వాత' అనే పెద్ద కథలో కొంత భాగాన్ని 'పుల్లంపేట జరీచీర' గా విడుదల చేశారు. ఇలా చూసినప్పుడు, నూటికి డెబ్భై మూడు కథలు అందుబాటులోనే ఉన్నాయి అనుకోలేం. మరి మిగిలిన కథల మాటేమిటి? నవలలు, నాటకాలు, చారిత్రిక గ్రంధం 'వీరపూజ' ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు కొత్త ప్రింట్ రాకపోయినట్టైతే, రాబోయే తరాలకి శ్రీపాద వారి సమగ్ర సాహిత్యం అందేది ఎలా?

ఈ ప్రశ్నల నేపధ్యంలో, నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన 'శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఉత్తమ కథలు' సంకలనం కంటపడింది. సంపాదకుడు వేదగిరి రాంబాబు. శ్రీపాద రచనా జీవితం సాగించిన రాజమండ్రిలో ఆయన విగ్రహం ఏర్పాటుకి కృషి చేసిన అభిమాని. పుస్తకం తీయగానే ఒకింత నిరాశ. కేవలం పదమూడు కథలు మాత్రమే ఉన్నాయిందులో. వీటిలో చాలావరకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సంకలనాల్లో ప్రచురితమైన కథలే. శ్రీపాద జీవిత విశేషాలతో రాసిన తొమ్మిది పేజీల 'భూమిక' లో కథల ఎంపిక ఎలా జరిగిందో చెప్పలేదు. మరికొన్ని కథలు తేబోతున్నామన్న సూచనా ఏదీ లేదు.

నిజానికి ఎన్.బీ.టీ. లాంటి సంస్థ పూనుకుంటే శ్రీపాద మొత్తం కథలని - ఆమాటకొస్తే మొత్తం సాహిత్యాన్ని పునర్ముద్రించగలదు. వనరులు పుష్కలంగా ఉన్న ఆ సంస్థకి అదేమీ పెద్ద పని కాదు. అలాగని, నష్ట భయమూ లేదు. ఒకప్పటితో పోలిస్తే ఎన్.బీ.టీ. కూడా పుస్తకాల రేట్లని బాగానే పెంచేసింది. (256 పేజీలున్న ఈ పుస్తకం వెల రూ. 140!!). ఏ కారణాల వల్లనైనా ఎన్.బీ.టీ. కి వీలు కాకపోయినా, ఈ మధ్య కాలంలో తెలుగు పాఠకులకి సమగ్ర సాహిత్యాలని అందిస్తున్న 'మనసు ఫౌండేషన్' ఇందుకు పూనుకున్నా సంతోషమే. ఎందుకంటే శ్రీపాద కథలు ఇవాళ చదివినా, సమకాలీనం అని మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా పాతబడని కథలు అనే అనిపిస్తాయి.

బుధవారం, ఏప్రిల్ 02, 2014

తప్పటడుగు

"వన్..టూ.. త్రీ..ఫోర్.. " చప్పట్లు చరుస్తూ హుషారుగా అరుస్తున్నాడు గోవిందు. పక్కనే రికార్డు ప్లేయర్ లో ఆ సంవత్సరపు బ్లాక్ బస్టర్ సినిమాలోని సూపర్ హిట్ పాట గట్టిగా వినిపిస్తోంది. సాయంత్రం వేళే అయినా నుదుటి మీద నుంచి చెమటలు ధారాపాతంగా కారుతున్నాయి గోవిందుకి. అతని సూచనలకి అనుగుణంగా స్టెప్పులేస్తున్న 'చోటూ' పరిస్థితి కూడా అదే. వాళ్లిద్దరే కాదు, జైల్లో మిగిలిన ఖైదీలంతా కూడా హడావిడిగా ఉన్నారు. బరాక్ ల వెలుపల ఉన్న ఖాళీ ఆవరణలో రంగు కాగితాలు కడుతున్న వాళ్ళు కొందరు, పాటలు, డైలాగులూ ప్రాక్టీసు చేసుకుంటున్న వాళ్ళు మరికొందరు. "వన్..టూ.. త్రీ..ఫోర్.. " చోటూ ని ఉత్సాహ పరచడం కోసం ఓపిక తెచ్చుకుని ఆ స్టెప్ ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీసు చేయిస్తున్నాడు గోవిందు.

నిజానికా పాట సోలో సాంగుకి ఎక్కువ, డ్యూయట్టు కి తక్కువ. పాటంతా హీరో డేన్స్ చేస్తాడు. చివర్లో హీరోయిన్ మెరుపులా వచ్చి ఒకే ఒక స్టెప్ వేస్తుంది. హీరో ఆమె ని పైకి లేపి, మరో పక్క దించి డాన్స్ కంటిన్యూ చేయాలి. ఆడ ఖైదీలని ఒప్పించడం, రిహార్సల్ చేయడం కష్టం కాబట్టి ఈ బిట్ తీసేసి, మిగిలిన పాటకి సోలో డాన్స్ చేయాలనుకున్నాడు గోవిందు. కానీ జైలు సూపర్నెంట్ వెంకటేశ్వర రావు ఒప్పుకోలేదు. పాట మొత్తం ఉండాలని గట్టిగా చెప్పడమే కాక, హీరోయిన్ వేషానికి చిన్న పిల్లాడిలా కనిపించే ఖైదీ చోటూ ని ఎంపిక చేసింది ఆయనే.

ఉదయం నుంచీ, తను డేన్స్ ప్రాక్టీసు చేస్తూనే, చోటూ చేత ప్రాక్టీసు చేయిస్తున్నాడు గోవిందు. మొదట్లో ఖైదీలంతా పనులు మానుకుని చాలా ఉత్సాహంగా చూశారు. అవే స్టెప్పులు మళ్ళీ మళ్ళీ చూడడం, సినిమాలో హీరోయిన్ అంత నాజూగ్గా చోటూ గోవిందుతో కలిసి స్టెప్పులేయక పోవడం వాళ్ళని కొంచం నిరాశ పరిచింది. చోటూ పర్ఫెక్ట్ గా చేసేంత వరకూ డాన్స్ నేర్పించాల్సిందే అంటూ గోవిందు కి వెంకటేశ్వర రావు ఆర్డర్.

ఇద్దరూ కలిసి వేయాల్సిన స్టెప్పు ఎన్నిసార్లు చేసినా గోవిందు కి సంతృప్తిగా అనిపించడం లేదు. ఆ విషయం చోటూకి అర్ధమై, పట్టుదలతో మళ్ళీ మళ్ళీ ప్రాక్టీసు చేయడానికి సిద్ధ పడుతున్నాడు. ఖైదీల్లో కుర్రాళ్ళంతా మర్నాడు జైలుకి రాబోతున్న హీరో, దర్శకుడి గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమాల మీద ఆసక్తి లేని కొందరు నడి వయస్కులు మాత్రం నిర్లిప్తంగా ఉన్నారు.

బ్లాక్ బస్టర్ మత్తులో ఉన్న కుర్ర హీరో, దర్శకుడూ వాళ్ళ రెండో సినిమా షూటింగ్ చాలా భాగం ఆ ఊళ్లోనే జరిపారు. విడుదల కి సిద్ధంగా ఉన్న ఆ సినిమా ప్రమోషన్ కోసం ఖైదీలతో గడపడానికి జైలుకి వస్తున్నారు వాళ్ళు . ఈ కార్యక్రమం మొత్తాన్ని ఒక టీవీ చానల్ ప్రసారం చేయబోతోంది. సినిమా వాళ్ళు రాబోతున్నట్టు వెంకటేశ్వరరావుకి వారం క్రితం హెడ్డాఫీసు నుంచి ఉత్తరం వచ్చింది. దానితో పాటే 'పెద్దవాళ్ళతో వ్యవహారం.. జాగ్రత్త' అన్న హెచ్చరిక కూడా. 

ఆ వార్త ఖైదీలకి తెలియడం తోనే జైల్లో సందడి మొదలయ్యింది. కుర్ర హీరో అభిమానులైతే కథానాయకుడిని ఎప్పుడు చూద్దామా అన్న ఆరాటంలో పడిపోయారు. వాళ్ళు ఏపని చేస్తున్నా సినిమా కబుర్లే. వెంకటేశ్వర రావు ఖైదీలతో ఓ మీటింగ్ పెట్టి, ఆసక్తి ఉన్న వాళ్ళు పాటలు పాడచ్చనీ, డేన్స్ చేయచ్చనీ చెప్పడంతో కుర్రాళ్ళ ఆనందానికి అంతులేకుండా పోయింది. గోవిందు సంగతి తెలిసిందే కావడం వల్ల, అతను డేన్స్ చేసి తీరాలని నిండు సభ సాక్షిగా ఆదేశం ఇచ్చేశారు. అప్పటికే ఆయన మనసులో ఆలోచనకి ఒక రూపం వచ్చింది.  
                                               
దీపాల వేళకి ఖైదీలంతా ఒక చోట చేరారు. అది మొదలు భోజనాలకి పిలుపు వచ్చే వరకూ వాళ్లకి కొంచం విశ్రాంతి. గోవిందుకి మనసేమీ బాలేదు. తెల్లవారితే ఇరవయ్యో తారీఖు. అది తలచుకున్నప్పుడల్లా అతనికి తన శరీరంలో ఒక భాగాన్ని ఎవరో బలవంతంగా లాగేసుకుంటున్నట్టు అనిపిస్తోంది. రీడింగ్ రూం లోకి వెళ్లి కృష్ణశాస్త్రి 'కృష్ణపక్షము' తీశాడు. పుస్తకాలు చదవడం జైల్లోకి వచ్చాక కొత్తగా అలవాటైంది అతనికి. అన్యమస్కంగా పేజీలు తిరగేస్తూ 'నా కొరకు చెమ్మగిలు నయనమ్ము లేదు' దగ్గర ఒక్కసారి ఆగాడు. ఆ వాక్యాన్ని తనకోసమే రాసినట్టు అనిపించింది. ఇంతలోనే అతన్ని వెతుక్కుంటూ చోటూ వచ్చాడు.

"రేపు నేను బ్రెమ్మాండంగా సేత్తానన్నా.. అదరగొట్టేత్తాను సూడు.." అన్నాడు ఉత్సాహంగా. గోవిందు జైలుకి వచ్చినప్పటి నుంచీ అతని వెంటే తిరుగుతున్నాడు చోటూ. బాగా చదువుకున్న వాడని అతనంటే కొంచం గౌరవం. అంతేకాదు, గోవిందుని ఖైదీలందరూ 'సూపర్నెంటు మనిషి' అని కొంచం ప్రత్యేకంగా చూస్తారు. తను 'గోవిందు మనిషి' అనిపించుకుంటే తన జోలికి ఎవరూ రారని చోటూ ఆలోచన. రెండేళ్ళ కాలంలో మూడోసారి జైలుకి వచ్చాడా కుర్రాడు.

"నీకు తెల్సా అన్నా.. నేను పుడతమే సినిమా ఆల్లో పుట్టేను. కానుపొచ్చేత్తాదన్నా లెక్క సెయ్యకుండా మాయమ్మ ఇట్లర్ సినిమా కెల్లిందంట, ఆల్లోనే నేను పుట్టేసేనంట. పిల్లల జైలుకంపాలని పోలీసోల్లు నాకు ఒయసు ఎక్కువేసేసి ఇక్కడికంపేసేరన్నా.." చోటూ చాలా హుషారుగా చెబుతున్న కబుర్లు గోవిందుకి వినిపించడం లేదు. 'హిట్లర్' పేరు వినగానే అతనికి తన బాల్యం గుర్తొచ్చింది.

                                                          *     *     *     

సీతారామ కల్యాణం జరిగిన మూడో రోజు రాత్రి.. గుడి దగ్గర పందిట్లో కుర్రాళ్ళు హడావిడి చేస్తున్నారు. మొదటి రోజు హరికథ, రెండో రోజు బుర్రకథ పూర్తిగా పెద్దవాళ్ళ కార్యక్రమాలు. ఆవేళ కుర్రాళ్ళ ప్రోగ్రాం, రికార్డింగ్ డేన్స్. రాజమండ్రి నుంచి మధ్యాహ్నానికే వచ్చేస్తామన్న రికార్డింగ్ డేన్స్ ట్రూప్ వాళ్ళు సాయంత్రం పందిట్లో లైట్లు వెలిగాక వ్యాన్ దిగారు. ప్రెసిడెంట్ గారింట్లో భోజనాలు కానిచ్చి, గుడి వెనకాల కట్టిన కొబ్బరాకుల దడిలో కోటా కొట్టుకోడం మొదలు పెట్టారు. రికార్డింగ్ డేన్స్ గురించి మైకులో ప్రచారం హోరెత్తించడంతో, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా కుర్రాళ్ళు సైకిళ్ళమీద దిగిపోయారు, దుబాయి సెంటు ఘుమఘుమలతో.

డేన్స్ ట్రూప్ వాళ్ళ మేకప్పులు ఎప్పటికీ అవ్వకపోవడంతో గోలగోలగా తయారయ్యింది వాతావరణం. పక్కూరి వాళ్ళ ముందు పరువు పోతుందని భయ పడుతున్నారు ఆ ఊరి కుర్రాళ్ళు. సరిగ్గా అప్పుడే, మైకులో వినిపిస్తున్న పాటకి తగ్గట్టుగా తన తోటి పిల్లల ముందు స్టెప్పులేస్తున్న ఎనిమిదేళ్ళ గోవిందు వాళ్ళ కంట పడ్డాడు. జనాన్ని ఆపడం కోసం, గోవిందుని స్టేజి ఎక్కించేసి కొత్త సినిమా 'హిట్లర్' లో పాటలు పెట్టేశారు. 'నడక కలిసిన నవరాత్రీ...' పాటకి డేన్స్ మొదలు పెట్టాడు గోవిందు. రెండు నిమిషాల్లో జనమంతా పాటలో లీనమైపోయారు.. పాట పూర్తవ్వడంతోనే ఈలలు, 'అబీబీ' అంటూ అరుపులూ, కేకలూ, వన్స్ మోర్లూ. అదే డేన్స్ నాలుగు సార్లు చేశాడు గోవిందు, పాట రివైండ్ అయ్యేటప్పుడు మధ్యలో కాసేపు ఊపిరి పీల్చుకున్నాడు అంతే.

చప్పట్లు, విజిల్స్ మోతతో ఊపిరి సలపలేదు గోవిందుకి.  వీటికి తోడు కొందరు కుర్రాళ్ళు స్టేజి మీదకి దూసుకొచ్చి గోవిందుని పైకి లేపి రెండు రూపాయల నోట్లు, ఐదు రూపాయల నోట్లు పిన్నీసుతో అతని చొక్కాకి గుచ్చడం. స్టేజి మీదున్న గోవిందు ఎంత సంతోష పడుతున్నాడో, అంతకన్నా ఎక్కువ ఆనందం అనుభవిస్తున్నాడు ప్రేక్షకుల్లో కూర్చున్న శేషయ్య, గోవిందు తండ్రి.  గోదారి కాలవని ఆనుకుని ఉన్న ఎకరా ఊడుపు చేనుకి సొంతదారుడు శేషయ్య. ఏడో తరగతితో చదువు ఆపేయాల్సి వచ్చిందన్నది ఆయనకి ఉన్న ఏకైక బాధ. తన ఇద్దరి కొడులుల్లో ఒకరినైనా గవర్నమెంట్ ఉద్యోగంలో చూసుకోవాలన్నది ఆ బాధ నుంచి పుట్టిన బలమైన కోరిక. దానితోపాటే, తనకున్న ఎకరా చేనుకీ తోడు మరో ఎకరం సంపాదించి ఇద్దరు కొడుకులకీ చెరిసగం పంచాలన్న కోరికా అప్పుడప్పుడే పెరిగి పెద్దదవుతోంది. 

ఒకరి జోలికి వెళ్ళకుండా తన పనేదో తను చేసుకు పోయే శేషయ్యకి ఉన్న ఒకే ఒక బలహీనత చిరంజీవి.   సినిమాలు పెద్దగా చూడక పోయినా, చిరంజీవి సినిమా వచ్చిందంటే మూడు నాలుగు సార్లు చూడాల్సిందే. అలా వెళ్ళేటప్పుడు పెద్ద కొడుకు గోవిందుని తనతో తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు అదే చిరంజీవి పాటకి తన కొడుకు అందరి ముందూ డేన్స్ చేయడం, దానిని జనం మెచ్చడం గొప్ప సంతోషాన్ని కలిగిస్తోంది ఆయనకి. ఆ మర్నాటి నుంచీ నాలుగైదు రోజుల పాటు రికార్డింగ్ డేన్స్ లో అమ్మాయిల గురించి కన్నా, గోవిందు వేసిన స్టెప్పుల గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు ఆ ఊరి జనం.

గోవిందుకి డేన్స్ మీద ఇష్టం పెరగడానికి అది ప్రారంభం. వయసుతో పాటే అది పెరిగి పెద్దయ్యింది. బీఎస్సీ, బీయీడీ పూర్తి చేసేనాటికి సినిమా డేన్స్ ఏదయినా టీవీలో ఒక్క సారి చూసి యధాతధంగా చేయగలిగేటంత ప్రావీణ్యత వచ్చేసింది. ఓ పక్క డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ, అందుకు ప్రిపేరవుతూనే, పక్కనే టౌన్లో ఉన్న ప్రైవేటు స్కూల్లో ఉద్యోగంలో చేరాడు గోవిందు. టీవీ చానళ్ళలో డేన్స్ ప్రోగ్రాములు పెరిగి పోవడంతో, ఉన్నట్టుండి సినిమా డేన్స్ లకి డిమాండ్ పెరగడం, గోవిందు ఓ డేన్స్ స్కూలు మొదలు పెట్టడం త్వర త్వరగా జరిగిపోయాయి. గవర్నమెంట్ స్కూల్లో మేష్టారిగా కాలి మీద కాలేసుకుని కూర్చుని పాఠాలు చెప్పాల్సిన కొడుకు, ఇలా డేన్స్ పాఠాలు చెప్పడం పెద్దగా రుచించ లేదు శేషయ్యకి. అలా అని కొడుక్కి అడ్డు చెప్పడమూ ఆయన అభిమతం కాదు. 

                                                              *     *     *

"ఎతుక్కుంటా మా ఇంటికొచ్చి నా మీద కేసు రాసేసేరన్నా పోలీసోల్లు.. కోర్టులో సిచ్చడిపోయింది.. మల్లీ ఇదే జైలు.. ఇంటన్నావా నువ్వు?" మాట్లాడ్డం ఆపిన చోటూ ఒక్కసారి భుజం పట్టి కుదపడంతో ఈ లోకంలోకి వచ్చాడు గోవిందు. వినడం లేదంటే ఆ కుర్రాడు బాధ పడతాడని "వింటున్నా" అన్నట్టుగా తలాడించాడు. అది అతను చాలాసార్లు విన్న కథే.

తన ఇల్లు గడవాలంటే దొంగతనం తప్ప మరో దారి లేదంటాడు చోటూ. పోలీసులకి డబ్బులివ్వక పోవడం వల్లే కేసు రాశారంటాడు. న్యాయానికి రోజులు కాదంటాడు. చోటూ వయసులో తను ఏనాడూ డబ్బు సంపాదన గురించీ, ఇల్లు గడవడం గురించీ ఆలోచించలేదన్న విషయం తరచూ గుర్తొస్తూనే ఉంటుంది గోవిందుకి. గోవిందు, ఆ వెనుకే అతని తమ్ముడి చదువు, అప్పుడప్పుడూ వచ్చే గోదారి వరదలు, అనుకోకుండా మీద పడే ఖర్చులు, పెరిగిపోతున్న పొలాల రేట్లు శేషయ్య రెండో ఎకరం కోరికని తీరనివ్వ లేదు. జాగ్రత్త పరుడు కనుక, ఉన్న పొలాన్ని కాపాడుకోగలిగాడు.

ఇంటిని గురించి ఆలోచించ కూడదని జైలుకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజూ ప్రయత్నం చేస్తున్నాడు గోవిందు. అతని ప్రయత్నం ప్రయత్నంగానే మిగిలి పోతోంది. ఏదో ఒక సందర్భంలో ఊరు, ఇల్లు, ఇంట్లో మనుషులు.. ఇంకా 'తను' గుర్తొస్తూనే ఉన్నారు. "రేపీపాటికి తను మరొకరి సొత్తు" అన్న ఊహే చాలా కష్టంగా ఉంది అతనికి. "ఇందు భోంచేద్దువు రావయ్యా గోవిందూ.. ఒంటకాలన్నీ సల్లారిపోతన్నాయంట.." అని పరాచికమాడుతూ వచ్చాడు సెంట్రీ. పక్కనే ఉన్న చోటూ ని చూసి "రారా బోయినానికి.. మీ ఈరో వొచ్చేది రేప్మద్దినేలకి రా బాబో" అంటూ భళ్ళున నవ్వేశాడు. భోజనాన్ని 'విందు' అని సెంట్రీ సరదాగానే అన్నా, ఆ మాట మరచిపోవాలనుకుంటున్న సంగతులన్నీ మరోసారి గుర్తుచేసింది గోవిందుకి. 

                                                           *     *     *

"విందూ బావా.. త్రికోణమితి లెక్కలు చెప్పవా.." అప్పుడే కొత్తగా వేసుకోడం మొదలు పెట్టిన వోణీ జారిపోకుండా జాగ్రత్త పడుతూనే గోవిందుని బతిమాలింది పద్నాలుగేళ్ళ స్వర్ణ. అతని ముందే పుట్టి పెరిగిన పిల్ల. చిన్నప్పుడు ఆటలాడిన నేస్తం. నాలుగిళ్ళ అవతలే వాళ్ళ ఇల్లు. రెండు మూడేళ్ళ క్రితం వరకూ మగ పిల్లలతో సమానంగా ఆటలాడిన స్వర్ణని, పెద్దదయ్యాక బయటికి పంపకుండా కట్టడి చేశారు ఆమె ఇంట్లో వాళ్ళు. 'విందూ బావ' ఆమె ఎప్పుడూ పిలిచే పిలుపే అయినా, ఆవేళ చాలా కొత్తగా వినిపించింది బీఎస్సీ సెకండియర్లో ఉన్న గోవిందుకి. పిలుపే కాదు, ఒక్కసారిగా పెద్దరికాన్ని మీద వేసుకున్న స్వర్ణ కూడా.

పదో తరగతి లెక్కల పేపర్లో మంచి మార్కులు రావడంతో పట్టు పట్టి ఇంటర్లో ఎంపీసీ గ్రూపు తీసుకుంది. గోవిందు దగ్గర ట్యూషన్ చెప్పించుకునేలా ఇంట్లో వాళ్ళని ఒప్పించింది. తను స్వర్ణ ని ఇష్టపడుతున్నానని అర్ధమయ్యింది  గోవిందుకి. కానీ ఆ ఇష్టాన్ని పైకి చెప్పేంత ధైర్యం లేకపోయింది. స్వర్ణ మాత్రం తన మనసు చెప్పే ప్రయత్నాలు విడవకుండా చేస్తూనే ఉంది. "నాక్కూడా డేన్స్ నేర్పొచ్చు కదా బావా.." అని అడిగిందోరోజున. "ఏం.. సినిమాల్లో హీరోయిన్ అవుదామనా?"   అడిగాడు సరదాగా.. "నీ పక్కన హీరోయినవుదారనీ..." అనేసి, చర్రున తన ఇంటికి వెళ్ళిపోయింది స్వర్ణ. 

కలిగినింటి పిల్ల స్వర్ణ. తండ్రి గ్రామ రాజకీయాల్లో ఉంటే, అన్న రకరకాల వ్యాపారాలు  ప్రయత్నిస్తున్నాడు. అందరి పనులూ మీదేసుకుని బుల్లెట్ మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉండడంతో అతనికి 'బుల్లెట్' అన్న పేరు స్థిర పడిపోయింది. కూతుర్ని కాలేజీలో చేర్పించినప్పటి నుంచీ ఆమె పెళ్లి గురించే ఆలోచిస్తున్నాడు. అల్లుడు బుద్ధి మంతుడూ, మాంచి ఉద్యోగస్తుడూ అవాలన్నది ఆయన చిరుకోరిక. సరైన సంబంధం దొరకాలే కానీ పిల్లకి పసుపు కుంకాల కింద పెద్ద చెరువు కింద ఉన్న నాలుగు ఎకరాలూ రాసేసి, పెళ్లి ఘనంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడాయన. 

స్వర్ణకెలాగూ డిగ్రీ అయ్యే వరకూ పెళ్లి చెయ్యరు, ఈలోగా తనకి మేష్టరుద్యోగం రాకపోదన్న ధైర్యం గోవిందుది. కానీ పెళ్లి విషయంలో అతని లెక్క తప్పింది. ఓ కేసు పనిమీద పోలిస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న బుల్లెట్ కి కొత్తగా ఉద్యోగంలో చేరిన ట్రైనీ ఎస్సై పరిచయం కావడం, అది పెరిగి పెరిగి స్వర్ణకీ అతనికీ పెళ్లి నిశ్చయించడం త్వరత్వరగా జరిగిపోయింది. తెల్లారితే ముహూర్తం పెట్టుకోవడం, పెళ్ళివారికి భోజనాలూ అనగా ఆరాత్రి తెలిసింది గోవిందుకి , స్వర్ణ పెళ్లి నిశ్చయం చేస్తున్నారన్న సంగతి. 

                                                                *     *     * 

పంటి కింద రాయి 'ఫట్' మనడంతో ఆలోచనల్లో నుంచి బయటికి వచ్చాడు గోవిందు. ఆలోచనల్లో పడి ఏం తింటున్నాడో కూడా గమనించుకో లేదు. చోటూ దూరంగా ఎవరితోనో కబుర్లు చెబుతూ భోజనం చేస్తున్నాడు. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. ఖైదీలు ఒకరితో ఒకరు గొడవ పడకుండా సెంట్రీలు జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. ఎక్కువగా తగువులు వచ్చేది భోజనాల సమయంలోనే అని వాళ్ళని అనుభవ పూర్వకంగా తెలుసు. రాబోయే కుర్ర హీరో అభిమానులకీ, అతనంటే పడని వాళ్ళకీ మొదలవ్వబోయిన ఘర్షణని ముందుగానే పసిగట్టి ఆపేశారు వాళ్ళు.

భోజనాలు అయిపోవడంతో కబుర్లలో పడ్డారు ఖైదీలు. రహస్యంగా బీడీలు, సిగరెట్లు సంపాదించుకున్న వాళ్ళు వాటిని కాల్చుకునే పనిలో ఉన్నారు. తత్వాలు పాడే వాళ్ళు కొందరైతే, పాటలు పాడేవాళ్ళు మరికొందరు. చుట్టూ వాతావరణం ఇంత కోలాహలంగా ఉన్నా గోవిందు ఈ లోకంలో లేడు. అతని కళ్ళ ముందు స్వర్ణ వాళ్ళ ఇల్లు, ఇంటి ముందు పెళ్లి పందిరి, ఊళ్ళో వాళ్ళ, బంధువుల హడావిడి వీటన్నింటి మధ్యా పెళ్లికూతురిగా స్వర్ణ... ఇవే జ్ఞాపకాలు, మళ్ళీ మళ్ళీ.

"అదేటన్నా.. దుప్పటీ పరుసుకోలేదూ?" అని చోటూ అడిగేంత వరకూ తను నేల మీద పడుకున్నానన్న స్పృహ లేక పోయింది గోవిండుకి. పక్క పరుచుకుంటుంటే మళ్ళీ చోటూనే అందుకున్నాడు.. "నేనంటే సదువు లేనోన్ని.. జేబీలు కొట్టి పోలీసోళ్ళకి దొరికిపోయాను. సదుంకున్నోడివి, నువ్వెందుకొచ్చావా? అని ఆలోసిత్తాను ఎప్పుడూ.. నిన్నడిగినా సెప్పవు కదా," కొంచం నిష్టూరం వినిపించింది ఆ కుర్రాడి గొంతులో. "నిజమే.. చెప్పడం లేదు.. యేమని చెప్పాలి? ఎలా చెబితే నీకు అర్ధం అవుతుంది?" ఈ మాటలు పైకి అనలేదు గోవిందు. 

                                                        *     *     *

నిశ్చితార్ధం జరిగిన మర్నాడు గోవిందు ని పొలానికి రమ్మని కబురు పెట్టింది స్వర్ణ. కుప్ప నూర్పిళ్ళు  అయిపోవడంతో ఎక్కడికక్కడ గడ్డిమేట్లు కనిపిస్తున్నాయి. ఓ ఇద్దరు పిల్లలని కూడా తీసుకొచ్చి, వాళ్లకి పొలంలో పరకేరే పని అప్పగించి తను గోవిందు దగ్గరికి వచ్చింది స్వర్ణ. "ఏం చెయ్యమంటావు బావా.. మావోల్లు నన్ను నోరిప్పనివ్వ లేదు. ఆయనగోరు ఎస్సై అంట.. అదీ ఈళ్ల మురిపెం.." ఆమె ఇంకా ఏదో చెప్పేదే.. కానీ గోవిందు అడ్డుపడ్డాడు. "నీకీ పెళ్లి ఇష్టమేనా?" పద్దెనిమిదేళ్ళ ఆడపిల్ల యేమని సమాధానం చెబుతుంది?? అతను ఆశించిన సమాధానం రాలేదు. అలా అని "ఇష్టమే" అనీ చెప్పలేదామె. 

"ఏమో బావా.. నా ఇష్టం ఎవళ్ళకి కావాలీ..." అంటూనే, గడ్డిమేటుకి ఆనుకుని నిలబడి ఓ ఎండు గడ్డిపరకని కొరుకుతూ ఆమె సమాధానం కోసం ఆత్రంగా చూస్తున్న గోవిందుకు అభిముఖంగా, అతనికి దగ్గరగా వచ్చింది స్వర్ణ. జరుగుతున్నది ఏమిటో అతనికి అర్ధమయ్యేలోపే "ఆయనగోరు నాకు తాళి కడితే కట్టుకోనీ.. నేనిస్తన్న మొదటి ముద్దు మాత్రం నీకే బావా" అంటూనే అతని పెదవులు అందుకుంది. తొలిముద్దు.. అది కూడా అడగకుండానే ఇస్తున్న ముద్దు.. మెదడు మొద్దుబారింది గోవిందుకి. ఒక క్షణం పాటు మెరిసిన విచక్షణ మరుక్షణం మాయమయ్యింది. అతని చేతి వేళ్ళు ఆమె భుజాలని గుచ్చుతున్న వేళ, ఆమె కళ్ళు బరువుగా మూతపడుతున్న క్షణంలో దూరంగా బుల్లెట్ వెళ్తున్న శబ్దం లీలగా వినిపించినట్టుగా అనిపించింది గోవిందుకి.. కానీ అతను పట్టించుకునే స్థితిలో లేడు.

మరి కాసేపుంటే ఏం జరిగేదో కానీ.. పెద్ద చెరువులో ఏదో పడ్డట్టు బరువైన శబ్దం వినిపించడంతో ఒక్కసారి ఉలికి పడి దూరం జరిగారు ఇద్దరూ. అదాటున చెరువు వైపుకి పరిగెత్తిన గోవిందుకి అక్కడేమీ కనిపించ లేదు. పరకేరుతున్న పిల్లల్ని తీసుకుని ఇంటి దారి పట్టింది స్వర్ణ. మర్నాడు రాత్రి గోవిందు ఇల్లు వెతుక్కుంటూ ఇద్దరు పోలీసులు వచ్చారు. ఏమీ చెప్పకుండానే అతన్ని పొరుగూళ్లో ఉన్న స్టేషన్ కి తీసుకెళ్ళారు.

మూడోనాటికి ఊరంతా గుప్పుమంది. టీవీలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తన దగ్గర డేన్స్ నేర్చుకునే పిల్లల తల్లితండ్రుల దగ్గర నుంచి గోవిందు డబ్బు వసూలు చేశాడనీ, ఎప్పటికీ అవకాశం రాకపోవడంతో వాళ్ళు పోలీసు కేసు పెట్టారనీ.. ఉన్నట్టుండీ కేసు ఎందుకు వచ్చి పడిందో నెమ్మదిగా అర్ధమయ్యింది గోవిందుకి. పూర్తిగా అర్ధమయ్యే నాటికి అతను జిల్లా జైల్లో ఉన్నాడు. శేషయ్య దృష్టంతా ఇప్పుడు రెండో కొడుకు మీద ఉంది. అతన్నైనా గవర్నమెంట్ ఉద్యోగంలో చూసుకోవాలని కోరిక. డబ్బు ఖర్చు పెట్టి కొడుకుని జైలు నుంచి బయటికి రప్పించుకున్నా, అతనికి గవర్నమెంట్ ఉద్యోగం దొరకదని అర్ధమయ్యింది. గోవిందు కూడా ఆర్నెల్లు జైల్లో ఉండడానికే సిద్ధ పడ్డాడు. 

                                                                    *     *     *

సెంట్రీ గణగణా గంట మోగించడంతో నిద్రపోతున్న ఖైదీలంతా అదాటున నిద్ర లేచారు. వాళ్ళ జీవితంలో మరో రోజు ప్రారంభమయ్యింది. రాత్రంతా నిద్ర లేని గోవిందు ఎర్రటి కళ్ళతోనే బరాక్ నుంచి జైలు ఆవరణలోకి వచ్చాడు. ఏ పని చేస్తున్నా అతనికి స్వర్ణ మాత్రమే గుర్తొస్తోంది. యోగా చేస్తూ ఆమెని పెళ్లి కూతుర్ని చేయడాన్నీ, అవిరేణి కుండలు తేడాన్నీ ఊహించుకున్నాడు. ఉప్మా తింటున్న గోవిందుకి కాలి గోళ్ళు తీయించుకుంటున్న స్వర్ణ  కళ్ళ ముందు కనిపించింది. వెంకటేశ్వర రావు డ్యూటీకి రావడంతో జైలు వాతావరణం గంభీరంగా మారిపోయింది. స్టాఫంతా కొత్త యూనిఫారాలు, పాలిష్ చేసిన బూట్లతో తళతళలాడిపోతున్నారు.

బరాక్ ల దగ్గరికి వస్తూనే, నేరుగా గోవిందు దగ్గరికి వచ్చారు వెంకటేశ్వర రావు. అతను తప్పు చేసి జైలుకి రాలేదని ఆయన అనుభవం చెప్పింది. అతను చదువుకున్న వాడు కావడం అతనిమీద అభిమానాన్ని పెంచింది. జైల్లో పనులు చేస్తున్న గోవిందు ని చూసినప్పుడల్లా, ఇంజనీరింగ్ పూర్తిచేయాలన్న ఆసక్తి లేని తన కొడుకుని గుర్తు చేసుకుని నిట్టూర్చడం ఆయనకి అలవాటైపోయింది. "చోటూగాడు బాగా చేశాడా?" అని అడగడం మర్చిపోలేదు, అంత హడావిడిలోనూ. ఖైదీల మధ్యాహ్నభోజనాలు అవుతుండడంతోనే టీవీ చానల్ వాళ్ళు వచ్చేశారు. యాంకర్ పది నిమిషాలకోసారి అద్దం చూసుకుని మేకప్ సరి చేసుకోడం ఖైదీలకి పెద్ద వినోదం. ఆమెని చాలాసార్లు టీవీలో చూశారు వాళ్ళు.

ఖైదీలతో పాటు టీవీ వాళ్ళు ఎదురు చూడగా, చూడగా చెప్పిన టైముకి గంటన్నర ఆలస్యంగా వచ్చారు కుర్ర హీరో, డైరెక్టరూ. ఖైదీల్లో చాలామంది హీరో దృష్టిలో పడాలని ప్రయత్నించారు కానీ, అతను పట్టించుకోలేదు. బిజీగా సెల్ ఫోన్ మాట్లాడుకుంటున్నాడు వచ్చినప్పటి నుంచీ. దర్శకుడిదీ అదే దారి. ఎట్టకేలకి ప్రోగ్రాం మొదలు పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వాళ్ళు. కుర్ర హీరో మేకప్ అసిస్టెంట్ హీరోకీ, దర్శకుడికీ తల దువ్వి, మేకప్ టచప్ ఇచ్చాడు. కెమెరా ఆన్ అయినట్టు సిగ్నల్ రాగానే, హీరో ముఖం ప్రసన్నంగా మారిపోయింది. ఖైదీలని చాలా ఆప్యాయంగా పలకరించాడు. కార్యక్రమం నిర్వహించే బాధ్యత యాంకర్ తీసుకుంది.

ఖైదీల పెర్ఫార్మెన్స్ అనగానే మొదట గోవిందు నే పిలిపించారు వెంకటేశ్వర రావు. ప్లేయర్ లో పాట మొదలు కాగానే ఒళ్ళు మర్చిపోయాడు గోవిందు. ఆక్షణంలో అతనికి డేన్స్ తప్ప మరేదీ గుర్తు లేదు. తను ముప్ఫై, నలభై టేకులు తీసుకుని చేసిన స్టెప్పుల్ని గోవిందు అవలీలగా చేసేయడం చూసి కుర్ర హీరో కళ్ళు భగ్గుమన్నాయి. అయితే నల్ల కళ్ళద్దాలు ఆ మంటలని బయటికి కనిపించ నివ్వలేదు. ముఖంలో ఏ భావమూ కనిపించకుండా జాగ్రత్త పడుతూ డేన్స్ చూస్తున్నాడు దర్శకుడు. పాట చివరికి వస్తుండగానే మెరుపులా స్టేజి మీదకి వచ్చాడు చోటూ. అతన్ని చూసి ఒకరిద్దరి ఖైదీలు అప్రయత్నంగా విజిలేశారు. చుడీదార్ వేసుకుని, తలకి స్కార్ఫ్ కట్టుకున్నాడు, కళ్ళకి కాటుక, పెదాలకి యెర్ర రంగు, పట్టి పట్టి చూస్తే తప్ప అతను అబ్బాయి అని పోల్చడం కష్టమే.

రిహార్సల్ లో కన్నా బాగా చేశాడు చోటూ, గోవిందు సరే సరి. డేన్స్ అవుతుండగానే చప్పట్లు మిన్నంటాయి. తను కూడా అప్రయత్నంగా చప్పట్లు కొట్టాడు దర్శకుడు. కెమెరా తన వైపే చూస్తుండడంతో తప్పనిసరై హీరో కూడా కొట్టాడు చప్పట్లు. డేన్స్ అయిపోవడం తోనే మళ్ళీ గోవిందు ఆలోచనల నిండా స్వర్ణ. మరో అరగంటలో కార్యక్రమం ముగిసింది. హీరో, డైరెక్టరూ హడావిడిగా బయలుదేరారు, అర్జెంటు పని ఉందంటూ. గోవిందుని పిలిచి పరిచయం చేశారు వెంకటేశ్వర రావు, చోటూ కూడా వెనుకే వచ్చాడు.  "డేన్స్ చాలా బాగా చేస్తాడండీ.. ఏదో పొరపాటున జైలుకి వచ్చాడు కానీ నేరం చేసి కాదు. మీకు సినిమాల్లోకి పనికొస్తాడు.. ఒక అవకాశం ఇప్పిస్తే..." సూపర్నెంట్ అలా బతిమాలడడం చూసి చేష్టలుడిగిపోయాడు గోవిందు. చోటూ పరిస్థితీ అదే.

డైరెక్టర్ ఏదో చెప్పబోతుండగానే హీరో తెలుగునీ ఇంగ్లీష్ నీ కలగలిపి చెప్పాడు... "సినిమా ఇండస్ట్రీ అంటే ఖైదీలకి పునరావాస కేంద్రం కాదు.." దర్శకుడు మరి మాట్లాడలేదు. వాళ్ళని గేటు వరకూ సాగనంపడానికి వెళ్ళారు వెంకటేశ్వర రావు. "ఎదవ నాకొడుకులు.. ఈళ్ల కాడ డబ్బులుంటాయి కాబట్టి కేసులు రాకుండా సేసేకుంటారు.. లేకపొతే ఈనా కొడుకులంతా జైల్లో ఉండాల్సినోల్లేనన్నా..." చోటూ కోపం అవధులు దాటింది. వీళ్ళు బరాక్ వైపు వెళ్తుండగానే, టీవీ కెమెరామెన్ పరుగున వచ్చాడు. "గోవిందూ.. నీ గురించి మా చానల్లో ఒక స్పెషల్ ప్రోగ్రాం చేద్దామనుకుంటున్నాం. నీ గురించి చెప్పాలి, ఒక రెండు మూడు పాటలకి డేన్స్ చేస్తే బాగుంటుంది.."

గోవిందు జవాబు చెప్పక ముందే, చోటూ యెగిరి గంతేసినంత పని చేసి "అన్న తప్పకుండా సేత్తాడు" అని మాటిచ్చేశాడు. అప్పుడే లోపలి వచ్చిన వెంకటేశ్వర రావు కూడా చెయ్యమనే చెప్పారు గోవిందుకి. డేన్స్ కేవలం తన హాబీ కాదనీ, జీవితమనీ ఆ క్షణంలో అనిపించింది గోవిందుకి. కెమెరా మెన్ 'రెడీ' అంటుండగానే "అన్నా ఒక్క నిమిషం" అన్నాడు చోటూ. అప్పటికే బరాక్ నుంచి తెచ్చిన దువ్వెనతో గోవిందుకి తల దువ్వి, పౌడర్ రాసి, "ఇప్పుడు తియ్యన్నా.. అద్దిరిపోవాలి," అన్నాడు. మనసులో 'వన్..టూ..త్రీ..ఫోర్..' అనుకుంటూ డేన్స్ మొదలు పెట్టిన గోవిందు ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉన్నాడు. వేయాల్సిన స్టెప్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు.