ఆదివారం, జనవరి 31, 2010

ఓ అడుగు పడింది..

గడిచిన రెండు రోజులుగా టీవీ చానళ్ళ, ముఖ్యంగా వార్తా చానళ్ళ, ప్రసారం లో వచ్చిన మార్పు నిత్యం టీవీ చూసే వాళ్ళలో చాలా మందిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఉన్నట్టుండి చానళ్ళన్నీ సంయమనం వహించడం మొదలు పెట్టాయి. ఏ చిన్న వార్త దొరికినా దానిని అతి చేసి హడావిడి చేసే తమ నైజాన్ని పక్కన పెట్టాయి. యెంతో ప్రాముఖ్యత ఉన్న (చానళ్ళ దృష్టిలో) వార్తలని సైతం ఆచి తూచి ప్రసారం చేశాయి.

అడ్డూ అదుపూ లేకుండా వార్తల పేరుతో నిరంతర ప్రసార స్రవంతిని జనం మీదకి వదులుతున్న చానళ్ళకి మార్గ దర్శకాలు విడుదల చేసిన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కి తొలి వందనం. వార్తల ముసుగులో ప్రసారం చేస్తున్న హింసాత్మక, అశ్లీల కార్యక్రమాల పట్ల హైకోర్టు ఒకింత ఘాటుగానే స్పందించింది. టీవీల్లో చూపిస్తున్న దృశ్యాలు, ఉపయోగిస్తున్న భాష, వివిధ రకాల కార్యక్రమాలు, వాటిని రూపొందించి ప్రసారం చేస్తున్న తీరుని నిశితంగా పరిశీలించిన మీదట ఉత్తర్వులని జారీ చేసింది.
రెండు రోజుల టీవీ కార్యక్రమాలు చూసినప్పుడు హైకోర్టు ఉత్తర్వులు అమలవ్వడం మొదలయ్యాయనే అనిపించింది. రెండు రోజులుగా ప్రమాదాలు జరిగినా మృతదేహాలని క్లోజప్ లో చూపలేదు. గాయాల మీద కెమెరా ఉంచి ప్రసారాలు చేయలేదు. రక్త దృశ్యాలని సాధ్యమైనంత వరకూ చూపకుండా ఉండడానికి దాదాపు "అన్ని చానళ్ళూ" ప్రయత్నించాయి. తెలుగు ప్రేక్షకులకి ఇదొక శుభ పరిణామం.

నిజానికి ప్రజాస్వామ్యంలో మిగిలిన వ్యవస్థలతో సమాన గౌరవాన్నీ, హోదాన్నీ అందుకున్న మీడియా ఇలా "చెప్పించుకోవాల్సి రావడం" ఓ దురదృష్టకర పరిణామం. ప్రజలకి మంచి-చెడు చెప్పాల్సిన, వాళ్లకి మార్గదర్శకత్వం వహించాల్సిన మీడియా మరో వ్యవస్థ చేత చెప్పించుకోవడం అంటే తన విలువనీ, గౌరవాన్నీ తగ్గించుకోవడమే.

అయితేనేం.. హైకోర్టు చెప్పింది మెజారిటీ ప్రజల, ప్రేక్షకుల మనోభీష్టానికి అనుకూలంగా ఉంది. వార్తల పేరిట ప్రసారమవుతున్న వికృత కార్యక్రమాల పట్ల జనం ఎంతగా విసిగిపోయారో తెలుసుకోడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు.. 'కూడలి' లేదా 'జల్లెడ' చూస్తే చాలు. బరి తెగించిన టీవీ ప్రసారాల గురించి ప్రతి రోజూ టపాలు కనిపిస్తున్నాయిక్కడ.

ఇప్పుడింక టీవీ కార్యక్రమాల ప్రసార సరళి పూర్తిగా మారిపోయినట్టేనా? ఈ ప్రశ్నకి జవాబు ఇప్పటికిప్పుడు చెప్పగలిగేది కాదు. కొన్నాళ్ళు వేచి చూసి తెలుసుకోవాల్సిన విషయం. అయితే, టీవీ కార్యక్రమాల ప్రసారాలని నిత్యం గమనిస్తూ ఉండడానికి, దారి తప్పిన/తప్పుతున్న చానళ్ళపై తక్షణ చర్యలు తీసుకోడానికీ ఒక బలమైన, చురుకైన వ్యవస్థ అవసరాన్ని ఈ పరిణామం మరోసారి నొక్కి చెప్పింది.

గురువారం, జనవరి 28, 2010

నా రెండో కథ...

నా మొదటి కథ 'బెల్లం టీ' కి మీ నుంచి వచ్చిన స్పందన నన్ను మరో కథ రాసేలా ప్రోత్సహించింది.. ఫలితమే 'ఉత్పరివర్తనం.' "బాల్య జ్ఞాపకాలతో ఏమాత్రం సంబంధం లేని ఇతివృత్తం తీసుకుని కథ రాయమని" నాకు పరిక్ష పెట్టిన బ్లాగ్మిత్రులు, 'మానసవీణ' బ్లాగరి నిషిగంధ గారికి, కథను ప్రచురించిన 'పొద్దు' వారికీ కృతజ్ఞతలు. నేను పరిక్ష రాసేశాను.. నిర్మొహమాటంగా ఫలితం చెప్పాల్సింది మీరే..
*****

 "ఆకస్మికముగా సంభవించే గుణాత్మక వైవిధ్యములను ఉత్పరివర్తనములు అందురు.." నిశ్శబ్దంగా ఉన్న క్లాసు రూములో ఖంగుమంటోంది మధు సార్ గా పిలవబడే రాజా మధుసూదన వరప్రసాద రావు గొంతు. పల్లెకి ఎక్కువ, పట్టణానికి తక్కువగా ఉన్న ఆ ఊరి ఎయిడెడ్ స్కూల్లో ఏడో తరగతి లోకి అడుగు పెట్టబోతున్న పిల్లలంతా తల వంచుకుని శ్రద్ధగా నోట్సు రాసుకుంటున్నారు. అప్పుడప్పుడూ పిల్లలు నోట్ పుస్తకాల పేజీలు తిప్పుతున్న సవ్వడి వినిపిస్తోంది. ఎండ ప్రచండంగా ఉంది. మే నెల మధ్యాహ్నం కావడంతో సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. అప్పుడప్పుడూ వడగాలి కెరటంలా వచ్చి వెళ్తోంది.   

ఇరవై ఎనిమిదేళ్ళ మధు ఆలోచనలు డార్విన్ పరిణామ సిద్ధాంతం దాటి మరెటో వెళ్ళిపోయాయి. "వస్తుందా? రాదా?" గత కొద్ది రోజులుగా అతన్ని వేధిస్తున్న ప్రశ్న దగ్గర ఆ ఆలోచనలు మరోసారి ఆగాయి. కొద్దిగా మాసినట్టుగా అనిపించే నీలంరంగు జీన్స్ ఫ్యాంట్ లో, అదే రంగు నిలువు చారలున్న చొక్కాని ఇన్ చేశాడు . టేబిల్ కి ఆనుకుని నిలబడి పాఠం చెబుతున్నా, అలవాటు చొప్పున భుజాలని కొద్దిగా ముందుకు వంచి నేల వైపు చూస్తున్నాడు.

ఐదడుగుల పదకొండంగుళాల పొడవుండే మధు భుజాలువంచిన తీరు చూసేవాళ్ళం దరికీ "భూభారం అంతా ఇతనే మోస్తున్నాడా?" అనిపిస్తుంది.  నోట్సు రాయడం పూర్తి చేసిన పిల్లలు అతను చెప్పబోయే పాఠం కోసం ఎదురు చూస్తున్నారు. సమ్మర్ క్లాసులు మొదలైనప్పటి నుంచీ మేష్టారలా ఉన్నట్టుండి ఆలోచనల్లోకి  వెళ్ళిపోతూ ఉండడాన్ని గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు.  వెనుక బెంచీల్లో కలకలం మొదలవ్వడంతో ఈ లోకంలోకి వచ్చాడు మధు.  నోట్సు ఆగిపోవడం తో వెనుక బెంచీ పిల్లలు కబుర్లలో పడ్డారు.
 
'ఉత్పరివర్తనము' గురించి ఇప్పుడు తను వివరించినా పిల్లలు పాఠం వినే మూడ్ లో లేకపోవడం గమనించి "ఈ పాఠం రేపు చెప్పుకుందాం.." అంటూ పిల్లలకి భోజనాలకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చేసి, తను ప్రిన్సిపాల్ గది వైపు బయలుదేరాడు మధు. అలవాటు చొప్పున గది బయట 'ఎస్. త్రినాధ మూర్తి, ప్రిన్సిపాల్' అన్న నీలం రంగు బోర్డు కేసి ఒక్క క్షణం తదేకంగా చూసి లోపలికి అడుగుపెట్టాడు. ఒక సేవా సంస్థ, ప్రభుత్వ సాయంతో నడుపుతున్న ఆ ఎయిడెడ్ స్కూల్లో ఇంగ్లీష్ మేష్టారుగా చేరి, పదోన్నతిపై ప్రిన్సిపాల్ అయిన యాభయ్యేళ్ళ త్రినాధ మూర్తిది స్వతహాగా జాలిగుండె.

ఆ స్కూల్లో చదివే పిల్లల్లో ఎక్కువ మంది రోజు కూలీల పిల్లలే కావడం, తల్లిదండ్రులు సెలవుల్లో తమ పిల్లలని పనికి పంపే ప్రయత్నాలు చేస్తుండడం గమనించి, వేసవి సెలవుల్లో పిల్లలకి బడిలోనే లెక్కలు, ఇంగ్లీష్, సైన్సు క్లాసులు చెప్పే ఏర్పాటు చేశాడాయన. కొద్దిమంది సీనియర్లకి మినహా, మిగిలిన టీచర్లకి సెలవుల్లో జీతాలు చెల్లించే అవకాశం లేకపోవడంతో, ఈ ఏర్పాటు వల్ల మధు లాంటి మేష్టార్లకి కొంత వెసులుబాటు ఉంటుందన్నది ఆయన ఆలోచించిన మరో విషయం.

గదిలోకి అడుగుపెట్టగానే ఫ్యాను గాలి ఒక్కసారిగా తాకి వెన్నులో వణుకు వచ్చినట్టు అనిపించింది మధుకి. ఎప్పటిలాగే తల వంచుకుని మౌనంగా నిలబడ్డాడు ప్రిన్సిపాల్ ముందు. ఇంటర్నెట్ లో సులభంగా పిల్లలకి చెప్పే ఇంగ్లీష్ పాఠాల వివరాలు వెతుకుతున్న త్రినాధ మూర్తి అలికిడికి తలెత్తారు. "ఒకే మధూ.. రేపు మొదటి క్లాసు మీరే తీసుకోవాలి. 'బి' సెక్షనే చూసుకోండి. సాయిరాం 'ఏ' సెక్షన్ వాళ్లకి మేథ్స్ చెబుతారు.. పది గంటలకల్లా వచ్చేయండి..," అనగానే, ఆ మాటకోసమే ఎదురు చూస్తున్నట్టుగా  వెను తిరిగాడు మధు.

పచ్చని పసిమి చాయతో మెరిసిపోయే ఆ కుర్రాడు, ఎండ వేడికి కందిపోవడం చూసి చివుక్కు మనిపించింది త్రినాధ మూర్తికి. వెళ్తున్న మధుని చూసి 'పూర్ ఫెలో' అనుకున్నారు. రెండేళ్లుగా మధు ఆ స్కూల్లో పని చేస్తున్నా, అతను ఆయనతో మాట్లాడింది తక్కువ. తను అతని తండ్రికి స్నేహితుడూ, ఇదే స్కూలు నుంచి తండ్రి రిటైరయ్యాక బీయీడీ క్వాలిఫికేషన్ లేకపోయినా పిలిచి ఉద్యోగం ఇచ్చిన వాడూ అవడం వల్ల తనంటే అతనికి భయంతో కూడిన గౌరవం అనుకుంటారు త్రినాధ మూర్తి.
స్ట్రాపాన్ బ్యాగ్ భుజాన తగిలించుకుని తల వంచుకుని నడుస్తూ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ చేరుకునేసరికి, ట్రైన్ వస్తోందన్న ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. ఎర్రటి ఎండలో ఆ పది నిమిషాల నడకా ఎన్నో గంటల శ్రమలా అనిపించిందతనికి. అక్కడినుంచి గంటసేపు రైల్లో ప్రయాణం చెయ్యాలి, అతను కలవాలనుకుంటున్న వ్యక్తిని చేరుకోడానికి.. ఇది అతను తరచూ చేసే ప్రయాణమే.

ఎప్పటిలాగే ఖాళీగా ఉంది ఆ పాసింజరు బండి. కిటికీ పక్క సీట్లో కూర్చున్నాడు మధు. ఎదుటి సీట్లో ఓ పల్లెటూరి దంపతులు, వాళ్ళ కాళ్ళ దగ్గర కోళ్ళ గంప. ఎండ వేడికి నిద్రావస్తలో ఉన్నాయి ఆ గంపలో ఉన్న రెండు కోళ్ళూ. వాటిని చూడగానే మధుకి తన బాల్యం గుర్తొచ్చింది, అప్రయత్నంగా. మధుకి ఊహ తెలిసిన నాటినుంచి వాళ్ళింట్లో ప్రతి ఆదివారం ఉదయం కనిపించే దృశ్యం ఒకటే. కొడుకుని దగ్గర కూర్చోపెట్టుకుని, బజారు నుంచి తెచ్చిన కోడిని ముక్కలుగా కోసేవారు మధు తండ్రి, అప్పటికే  రంగారావు మేష్టారుగా మారిన రాజా రంగారావు.

తమ వంశపు పూర్వ వైభవానికి గుర్తుగా ఆయన దగ్గర మిగిలిన పాతకాలం నాటి పిడిబాకుతో యెంతో కష్టపడి కోడిని కోసేవారు రంగారావు మేష్టారు. వెండి పిడిమీద బంగారు లతల డిజైన్లో ఉన్న ఆబాకు,  కోడిని కోసేందుకు ఏమాత్రం అనువుగా లేకపోయినా, దానిని ఉపయోగించ గలగడమే అదృష్టంగా భావించేవారాయన. "మా తాతగారు, అంటే మీ ముత్తాతగారైన శ్రీ రాజా మధుసూదన వరప్రసాద రావు గారు వేటకి ఉపయోగించిన పిడి బాకు ఇది. దీనితో వారు ఏకంగా పెద్ద పులినే చంపేశారు," అంటూ గుర్తు చేసుకునే వారు తన్మయంగా. 

నిజానికి రంగారావు మేష్టారికి తన తాతగారు అంతబాగా తెలీదు. ఈయనకి జ్ఞానం వచ్చేసరికే ఆ పెద్దాయన కాలంచేశాడు. అయితే ఆయన వీరగాధలు జనం నోళ్ళ నుంచి విని, అంతటి గొప్పవాడికి మనవడిగా పుట్టినందుకు గర్వపడ్డారు.. ఇద్దరు ఆడపిల్లలకి మధ్యలో పుట్టిన తనకొడుక్కి ఆయన పేరే పెట్టుకున్నారు. ఉన్న జమీని విందువినోదాలకీ, వేట సరదాలకీ, మేజువాణీలకీ ఖర్చు చేసి కుటుంబాన్ని రోడ్డున పడేసినా, ఆ తాత గారంటే వల్లమాలిన గౌరవం రంగారావు మేష్టారికి.

తను ఎంత గొప్ప వంశానికి వారసుడో కొడుక్కి తెలియాలని ఆయన తాపత్రయం. ఆదివారపు ఉదయాన్ని అందుకోసం వెచ్చించేవారు. అయితే తండ్రి చెప్పే కథలకన్నా, కోడి శరీర భాగాలు ఎక్కువ ఆకర్షించేవి మధుని. "అన్ని పక్షులు, జంతువుల శరీర నిర్మాణం ఒకేలా ఉంటుందా?" లాంటి సందేహాలెన్నో వచ్చేవి. అలా తనకి తెలియకుండానే జీవ శాస్త్రం మీద మక్కువ పెంచుకున్నాడు  మధు. ఇంటర్మీడియట్  రోజుల్లో  జువాలజీ మీద అతనికున్న ఆసక్తి లెక్చరర్లని ఆశ్చర్య పరిచింది. 

మెజారిటీ స్టూడెంట్లు అయిష్టతతోనో, తప్పనిసరి అన్నట్టో చేసే డిసెక్షన్ని చాలా ఇష్టంగా చేసేవాడు మధు. డిసెక్షన్ టేబిల్ మీద అతని పొడవాటి వేళ్ళ కదలికల్ని ప్రత్యేకంగా చూసేవారు జువాలజీ లెక్చరర్ "నీవి సర్జరీ చేయాల్సిన వేళ్ళు మధూ.. నువ్వు మెడిసిన్ లో చేరాల్సిందే," అనే వారు ప్రతిసారీ.. ఇంటర్మీడియట్ పరిక్షలు అయ్యాక ఓ ఆదివారం ఉదయం కోడిని కోస్తుండగా, తనకి మెడిసిన్ లో చేరాలని ఉందని తండ్రికి చెప్పాడు మధు.

రంగారావు మేష్టారు మొదట ఆనంద పడ్డారు.. ఆ తర్వాత బాధ పడ్డారు. "అంతా తాతగారి పేరు మహత్యం.. అందుకే అంత గొప్ప ఆలోచన వచ్చింది.." అంటూ చాలా సేపు ఆ తాతగారిని తలుచుకుని,  "మనకి ఆస్తులు ఉంటే వాటిని అమ్మైనా మెడిసిన్లో చేర్చేవాడిని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నావల్ల కాదు," అని తేల్చేశారు చివరికి.

బుట్టలో పడుకున్నరెండు కోళ్లలో ఒకటి నిద్ర లేచి 'కొక్కోక్కో..' అని గొంతెత్తి కూయడంతో ఉలిక్కిపడి, ఆలోచనల నుంచి బయటకి వచ్చాడు మధు. పల్లెటూరి ఆసామీ సీసాలో నీళ్ళని ఓ చిన్న గిన్నెలోకి వంచి కోళ్ళ ముందు పెట్టగానే ఆ గిన్నెని ముక్కుతో పొడవడం మొదలు పెట్టాయి ఆరెండు కోళ్ళూ. అది చూడగానే తనకీ దాహం వేస్తున్నట్టు అనిపించింది మధుకి. బ్యాగులో ఉన్న ప్లాస్టిక్ సీసా తీస్తుంటే, నీళ్ళ సీసాతో పాటు ఉన్న స్టీలు బాక్స్ కనిపించి, తను ఏమీ తినలేదన్న విషయం గుర్తొచ్చింది.

ముందుగా గొంతు తడుపుకుని, లంచ్ బాక్స్ మూత తీశాడు. ఉదయం స్కూలికి బయలుదేరేటప్పుడే మధ్యాహ్నం టౌనుకి వెళ్ళే పని ఉందని చెప్పగానే తల్లి ఇచ్చిన బాక్సు అది. మూత తీయగానే వచ్చిన ఘాటైన వాసన, కనిపించిన ఎర్రటి ఆవకాయ అన్నాన్ని చూడగానే తల్లి మీద కోపం ముంచుకొచ్చింది.. అది కూడా ఒక్క క్షణం మాత్రమే.

ముప్ఫై ఐదేళ్ళ క్రితం రాజా రంగారావుని (అప్పటికింకా ఆయన మేష్టారు కాదు) పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చిన ఆమె బయటి వాళ్ళతో మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళతోనూ మాట్లాడేది అంతంత మాత్రమే. అద్దె కట్టడం ఆలస్యం అవుతోందని ఇంటి ఓనరు వచ్చి కేకలేసినా, జన్మానికో శివరాత్రి అన్నట్టుగా భర్త కొత్త చీర తెచ్చినా ఆవిడ స్పందన ఒకటే, నిశ్శబ్దంగా చూడడం. 

రెండేళ్ళ క్రితం ఆ ఇంటి రెండో ఆడపిల్ల పెళ్లి జరగడం, రంగారావు మేష్టారు రిటైరవ్వడం ఒకేసారి జరగడంతో ఆ ఇంటి ఆర్ధిక పరిస్థితి మరికొంచం దిగజారింది. రంగారావు మేష్టారు మాత్రం తమకి పూర్వ వైభవం ఉండి ఉంటే  జమిందార్లంతా వచ్చి తన కొడుక్కి పిల్లనిస్తామంటూ తన ఇంటి ముందు నిలబడే దృశ్యాన్ని అప్పుడప్పుడూ ఊహించుకుంటూ తన్మయులవుతున్నారు.

ఓ చిన్న స్టేషన్లో రైలాగడం, మజ్జిగ పొట్లాలమ్మే ఓ కుర్రాడు బోగీలోకి రావడం ఒక్కసారే జరిగింది. వాడిని చూడగానే ప్రాణం లేచొచ్చింది మధుకి. ఆవకాయ కారానికి మండుతున్న నోటిని మజ్జిగతో శాంతింప జేశాడు. ఎదుటి సీటు పల్లెటూరి ఆసామీ భార్య మజ్జిగ పేకెట్ ని నేరుగా తాగకుండా తనతో తెచ్చుకున్న గ్లాసులో వంపుకోడం  చూసిన మధుకి మేరీ సువార్త కళ్ళముందు మెదిలింది. అతను మొదటిసారిగా ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు  ఇలాగే షాపు నుంచి తెప్పించిన మజ్జిగ పేకెట్ ని గాజు గ్లాసులోకి వంపి ఇచ్చింది మేరీ సువార్త.

డిగ్రీ నుంచి కలిసి చదువుకున్నా, మధుకి ఆమె పరిచయమైంది యూనివర్సిటీ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే. అది కూడా తనంతట తానుగా ఆమె వచ్చి పరిచయం చేసుకున్నప్పుడు. ఎమ్మెస్సీ లో గోల్డ్ మెడల్ కి మధుతో పోటీ పడి, రెండో స్థానం తో సరిపెట్టుకుంది సువార్త. ఆమె  బహూకరించిన 'ది సెవెన్ హేబిట్స్ అఫ్ హైలీ ఎఫిక్టివ్ పీపుల్' పుస్తకాన్ని బ్యాగ్ లోనుంచి తీసి, అందులో లీనమైపోయాడు మధు. మరి కాసేపట్లో ఒక్క కుదుపుతో గమ్యస్థానంలో ఆగింది రైలు. దిగడానికి కంగారు పడుతున్న పల్లెటూరి దంపతులని దిగనిచ్చి, వాళ్ళ వెనుక తను నింపాదిగా రైలు దిగాడు మధు.

అక్కడినుంచి కోచింగ్ సెంటర్ కి పదినిమిషాల నడక. అన్నిరకాల పోటీ పరీక్షలకి శిక్షణ ఇచ్చే సెంటర్ అది. సువార్త కనిపిస్తుందేమో అని వెతుకుతూ, తనకి బాగా పరిచయమైన క్లాసు రూముల్ని దాటుకుని డైరెక్టర్ గది వైపు వెళ్ళాడు మధు. ఆమె కనిపించక పోవడంతో కొంచం రిలీఫ్ గా అనిపించింది. అంతలోనే తనకి కావాల్సిన వ్యక్తి కనిపించడంతో  అప్పటివరకూ తను పడ్డ శ్రమంతా మర్చిపోయి "హాయ్ శివా.." అంటూ పలకరించాడు మధు.

ఐదారేళ్ళ స్నేహం  వాళ్ళిద్దరిదీ.. అప్పుడే మొదలైన బట్టతల, నలుపు తెలుపు కలగలిసిన గడ్డం, సర్వకాలాల్లోనూ కళ్ళని అంటిపెట్టుకుని ఉండే కళ్ళజోడూ.. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ నలభై ఏళ్ళ శివకుమార్ ని చూడగానే ఎవరికైనా 'ఇంటలెక్చువల్' అనిపించక మానదు. అతని కళ్ళలో విజ్ఞానం తొణికిసలాడుతూ ఉంటుంది. భౌగోళిక శాస్త్రాన్ని అతనిలా చెప్పగలిగే వాళ్ళు ఆ చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లో లేరంటారు. ప్రపంచంలో ఏ దేశాన్ని గురించైనా నిద్రలో లేపి అడిగినా మ్యాప్ గీసి మరీ వివరించగలడు అతను.

"ఒకటి రెండు రోజుల్లో మీ రిజల్ట్స్ రావొచ్చట.." శివ మాట వినగానే అప్పుడే ఆగిన టెన్షన్ మళ్ళీ మొదలయ్యింది మధుకి. "ఇప్పుడింక మళ్ళీ ప్రిలిమ్స్ రాసే పని కూడా లేదు.." అన్నాడు మధు. మెడిసిన్లో చేర్చనందుకు తండ్రి మీదా, తమ ఆర్ధిక పరిస్థితి మీదా కోపం వచ్చింది మధుకి. తన దగ్గర డిసెక్షన్  నేర్చుకున్న మిత్రులు మెడిసిన్లో చేరితే బాధ పడకుండా ఉండడం అతని వల్ల కాలేదు. చాలా రోజులు తండ్రితో మాట్లాడలేదు కూడా. డిగ్రీలో చేరాక తను అందరిలాంటి ఉద్యోగం చేయకూడదు అనుకుని, కలెక్టర్ కావడాన్ని తన లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. ఐదేళ్లుగా తను పడుతున్న శ్రమ కళ్ళముందు సినిమా రీలులా తిరిగింది మధుకి. తనకెంతో ఇష్టమైన జువాలజీ, శివకి కొట్టిన పిండైన జాగ్రఫీ ఆప్షన్స్ గా సివిల్ సర్వీసు పరిక్ష రాస్తున్నాడు.

పీజీ తర్వాత రెండేళ్ళ పాటు కష్టపడి చదివి, ప్రిలిమ్స్ రాసి విజయం సాధించినా మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాడు. ఏడాది గ్యాప్ తీసుకుని చేసిన రెండో ప్రయత్నంలోనూ అంతే. . ఈలోగా ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. త్రినాధ మూర్తి గారి మంచితనం వల్ల, ఉద్యోగంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, ప్రిపరేషన్ కి మునుపటి సమయం కేటాయించడం కష్టమయ్యింది. ఆ టైములో మధుకి మోరల్ సపోర్ట్ ఇచ్చినవాడు శివ. మూడోసారి ఇంటర్వ్యూ వరకూ వెళ్ళినా ఫలితం అనుకూలంగా రాలేదు. ఈ మధ్యనే నాలుగోదీ, చివరిదీ అయిన ప్రయత్నంలో ఇంటర్వ్యూకి వెళ్లి వచ్చాడు.

"నువ్వూ, సువార్త ఇద్దరూ సెలక్ట్ అవుతారులే.." అన్నాడు శివ. ఇరవై మంది సివిల్ సర్విస్ స్టూడెంట్స్ బ్యాచిలో ఇంటర్వ్యూకి వెళ్ళింది వాళ్లిద్దరే. సువార్త ప్రస్తావన రాగానే, గత సంవత్సరం ఇంటర్వ్యూ ఫలితాలు వచ్చినప్పుడు శివతో జరిగిన వాగ్వాదం గుర్తొచ్చింది మధుకి. సువార్త మెయిన్స్ క్వాలిఫై కాలేదు అప్పుడు.

"నాకున్నది ఇంకొక్కటే అవకాశం శివా.. లైఫ్ అండ్ డెత్.. ఆమెకి అలాంటి సమస్య లేదు.. రాస్తూనే ఉండొచ్చు.. ఇది అన్యాయం కాదూ?" మధు ప్రశ్న వినగానే అతని మానసిక సంఘర్షణ అర్ధమయ్యింది శివకి.  "జనరల్ స్టడీస్ కోసం పాలిటీ చదివావ్.. రిజర్వేషన్లు ఎందుకు పెట్టారో మర్చిపోయావా?.."  అంటూ క్లాసు తీసేసుకున్నాడు శివ.

"రాజ్యాంగం రాసిన నాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు.. ఇద్దరం చదువుతున్నాం.. ఇద్దరం పరిక్ష రాస్తున్నాం.. పైగా నాకన్నా ఆమెది ఆర్ధికంగా ఉన్నత స్థితి. ఆమెకి అవకాశాలు ఇచ్చి నాకు ఇవ్వకపోవడం అన్యాయం కాదూ?"  శివ దగ్గర మిగిలింది ఇక ఒకటే అస్త్రం, దానినే  ప్రయోగించాడు. "ఒక్కసారి ఆమె తాత ముత్తాతలు ఎలా బతికారో, మీ వాళ్ళు ఎలాంటి జీవితం గడిపారో ఆలోచించు.. నీకే అర్ధం అవుతుంది.."  శివ నుంచి తాత ముత్తాతల ప్రస్తావన వచ్చేసరికి ఒక్కసారిగా పట్టరాని కోపం వచ్చింది మధుకి.. బలవంతాన అదిమి పట్టాడు.

జరిగిందంతా గుర్తొచ్చి, సువార్త గురించి ఏమీ మాట్లాడలేదు మధు. ఇంటర్వ్యూ నుంచి వచ్చాక మధు, సువార్తని కలవలేదని తెలుసు శివకి. ఆ టాపిక్ మళ్ళీ తీసుకు రాకుండా, మధుకి మరోసారి ధైర్యం చెప్పాడు.. "తప్పకుండా సర్విస్ తెచ్చుకుంటావు మధూ.. మన కోచింగ్ సెంటర్ పేరు రాష్ట్రమంతా మారుమోగుతుంది," ఈ మాటలు వినగానే చాలా రిలీఫ్ గా అనిపించింది మధుకి. కాసేపు శివ తో కబుర్లు చెప్పి సాయంత్రం రైలుకి ఇంటికి బయలుదేరాడు.

"రిజల్ట్స్ వచ్చేస్తాయి" అన్నమాట పదే పదే గుర్తొచ్చి ఆ రాత్రి చాలాసేపటి వరకూ నిద్ర పట్టలేదు మధుకి. మొట్ట మొదటిసారిగా సివిల్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టి పొరపాటు చేశానా అన్న ఆలోచన తొలిచేసింది అతన్ని. మరేదైనా మంచి ఉద్యోగం ప్రయత్నించి ఉంటే జీవితం ఈ పాటికే మరికొంచం బాగుపడేది కదా అనిపించింది. వంటింటి నుంచి వినిపిస్తున్న గిన్నెల చప్పుడుకి కలత నిద్ర నుంచి మెలకువ వచ్చింది మర్నాడు ఉదయం.  "మా తాతగారిది పెద్ద చెయ్యి.. దాన ధర్మాలకి లోటు చేయలేదు వారు.." ఎదురింట్లో కొత్తగా వచ్చిన వాళ్లకి తన వంశం గొప్పదనాన్ని కథలు కథలుగా వర్ణిస్తున్నారు రంగారావు మేష్టారు.

ఎందుకో ఒక్కసారిగా నీరసం ఆవహించింది మధుకి. స్కూలికి వెళ్లాలనిపించక పోయినా బలవంతంగా సిద్ధమయ్యాడు. ముందురోజు వేసుకున్న షర్ట్ కొంచం మాసినట్టుగా అనిపించడంతో, బీరువా తీసి చేతికందిన బూడిద రంగు టీ షర్ట్ తీసుకున్నాడు. భుజాలు కొంచం గూనిగా వంచే అలవాటు వల్ల, అతని వంటిమీద ఆ నలిగిన టీషర్ట్ అచ్చం చిలక్కొయ్యకి తగిలించినట్టుగా ఉంది.

ఎప్పటిలాగే స్కూలికి నడక మొదలు పెట్టాడు. ఉదయపు ఎండైనా వంటిమీద మంటలు పుట్టిస్తోంది. మోటార్ సైకిళ్ళమీద వెళ్తున్న వాళ్ళని చూసినప్పుడు తనూ ఒక మోటర్ సైకిల్ కొనుక్కోగలిగితే బాగుండేది అని మరోసారి అనిపించింది మధుకి. ఇంతలో అతని పక్కనుంచే మోటర్ సైకిల్ మీద వెళ్తూ కనిపించాడు మేథ్స్ టీచర్ సాయిరాం. ప్రిన్సిపాల్ ని మినహాయిస్తే, ఆ స్కూల్లో మోటర్ సైకిల్ ఉన్న టీచర్ అతనొక్కడే. అతని భార్య రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఎల్డీసీ గా పనిచేయడం, అతను ఇంటి దగ్గర ట్యూషన్లు చెబుతూ ఉండడం వల్ల ఆ వెసులుబాటు కలిగింది.
 
సహోద్యోగి తన పక్కనుంచే వెళ్తున్నా నోరు తెరిచి లిఫ్ట్ అడగలేకపోయాడు మధు. ఎప్పుడూ మధు పరోక్షంలో అతని మీద జోకులేసే సాయిరాం లిఫ్ట్ ఆఫర్ చేసే ప్రయత్నం చేయలేదు. ప్రిన్సిపాల్ కి ఒకసారి కనిపించి, నేరుగా తన క్లాసుకి వెళ్ళాడు.మధు.  క్లాసు కోలాహలంగా ఉంది. తన అలవాటు ప్రకారం ముందు బెంచీలో కూర్చున్న అమ్మాయిని క్రితం రోజు రాసిన నోట్సు చదవమన్నాడు మధు. ఆ అమ్మాయి పేరు చంద్రిక. అదే పేరుతో ఒక సౌందర్య సబ్బు మార్కెట్లో ఉండడంతో, మిగిలిన పిల్లలంతా ఆమెని 'సబ్బూ' అని పిలుస్తూ ఉంటారు. ఆ క్లాసులో మధుకి ఇష్టమైన స్టూడెంట్ ఆమె.

లేచి నిలబడి, క్లాసందరి వంకా ఒకసారి గర్వంగా చూసి, తను రాసుకున్న నోట్సు చదివింది సబ్బు.. "ఆకస్మికముగా సంభవించే గుణాత్మక వైవిధ్యములను ఉత్పరివర్తనములు అందురు.."  అంటూ..   ముందుగా  నోట్సు చెప్పి తర్వాత పాఠం చెప్పడం అలవాటు మధుకి.

"హ్యూగో డివ్రిస్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన ఈ ఉత్పరివర్తన సిద్ధాంతం ప్రకారం చుట్టూ ఉండే వాతావరణం లో వచ్చే మార్పులకి అనుగుణంగా జీవులు  మనుగడ  సాగించడం కోసం వాటి శరీర నిర్మాణంలో మార్పులు జరుగుతాయి.." తను యెంతో ఇష్టంగా చదువుకున్న సబ్జెక్టుని పిల్లలకి అర్ధమయ్యేలా వివరించడాన్ని ఒక చాలెంజ్ గా తీసుకున్నాడు మధు. వాళ్ళ ముఖాలు చూడడం తోనే తను చెప్పింది పిల్లలకి కొద్దిగానే అర్ధంయ్యిందనీ, మరింత వివరంగా చెప్పాల్సిన అవసరం ఉందనీ గమనించాడు. 

జీవశాస్త్రం మీద అతనికి ఉన్న ప్రేమ కారణంగా చాలాసార్లు పాఠాలు సిలబస్ పరిధిని దాటేస్తూ ఉంటాయి.  ఇంగ్లండ్ లో మాత్ లపై వందేళ్ళ పాటు జరిగిన పరిశోధనని వివరించేందుకు సిద్ధమయ్యాడు.  "ఇంగ్లండ్ లో మన సీతాకోక చిలుకలని పోలిన మాత్ లు చెట్ల కాండాలపై నివాసం ఏర్పరచుకుని ఉంటాయి. అక్కడి చెట్ల కాండాల్లాగే ఈ మాత్ లు కూడా తెల్ల రంగులో ఉండేవి. ఇంగ్లండ్ అభివృద్ధి చెంది పరిశ్రమలు పెరగడంతో, కాలుష్యం పెరిగి చెట్ల కాండాలు నలుపు రంగులోకి మారడం మొదలయ్యింది. దీనితో నల్లగా మారిన కాండాలపై నివాసం ఏర్పరచుకున్నతెల్లని మాత్ లు సులువుగా వాటి శత్రువుల కళ్ళలో పడి ప్రాణాలు పోగొట్టుకునేవి.."  పిల్లలంతా పాఠంలో లీనమై పోవడం గమనించాడు మధు. అతనికి ఉత్సాహం పెరిగింది.

"ఇక మాత్ జాతి అంతరించిపోతుందా  అనిపించే సమయంలో ఒక విచిత్రం జరిగింది. మాత్ ల సంతతిలో నలుపు రంగు మాత్ లు కనిపించడం మొదలయ్యింది. కాలక్రమంలో తెల్ల మాత్ ల సంఖ్య తగ్గుతూ, నల్ల మాత్ ల సంఖ్య పెరిగింది. ఇలా జరగడానికి కారణం ఉత్పరివర్తనం. ఉత్పరివర్తనమే జరగక పోతే మాత్ జాతికి మనుగడ ఉండేది కాదు," క్లాసులో సూది పడితే వినిపించేతంత నిశ్శబ్దం. . "ఇది ఇక్కడితో  అయిపోలేదు. పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యాన్ని గురించి ప్రజలు ఆందోళనలు చేయడంతో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాతావరణంలో మార్పులు జరిగి చెట్ల కాండాలు మళ్ళీ తెల్లగా మారడం మొదలయ్యింది.." అప్పటికే పిల్లలంతా ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచేశారు.

"అప్పటికి తెల్ల మాత్ ల సంఖ్య బహు స్వల్పంగా ఉంది. చెట్ల కాండాలు తెల్లబడడంతో నల్ల మాత్ ల మనుగడకి ముప్పు వచ్చింది. తెల్లని కాండంపై నల్లని మాత్ లు దాగి ఉండలేక శత్రువుల కళ్ళ పడేవి. దీనితో నల్ల మాత్ ల సంఖ్య తగ్గి తెల్ల మాత్ ల సంఖ్య పెరగడం మొదలయ్యింది. ఈ మొత్తం ప్రక్రియ వంద సంవత్సరాల కాలంలో జరిగింది.." అక్కడివరకూ చెప్పి ఆగాడు మధు అతని బుర్రలో మ్యూటేషన్స్ థియరీ, హ్యారిసన్ పరిశోధన, దానిపై వచ్చిన భిన్నాభిప్రాయాలు గిర్రున తిరుగుతున్నాయి. పిల్లలకి మాత్రం పాఠం విన్నట్టుగా కాక ఏదో చందమామ కథ విన్నట్టుగా అనిపించింది.

"సార్ నాకో డౌటు.." అంటూ లేచి నిలబడింది సబ్బు. "జాతులు అంతరించిపోతున్నప్పుడు మాత్రమే ఉత్పరివర్తనాలు జరుగుయాయా సార్?" ఆమె ప్రశ్నని మధు అర్ధం చేసుకునే లోపునే "అంటే.. ఇంక వేరే ఏ కారణానికీ జరగవా?" అంటూ తన ప్రశ్న పూర్తి చేసింది. జవాబు చెప్పడానికి మధు సిద్ధ పడుతుండగానే ఓ వడగాలి కెరటం బలంగా తాకి వెళ్ళింది. పరుగులాంటి నడకతో త్రినాధ మూర్తి గారు క్లాసుకి వచ్చారు. ఉన్నట్టుండి ప్రిన్సిపాల్ రావడంతో పిల్లలంతా లేచి నిలబడ్డారు. "ఫిఫ్టీంత్ ర్యాంక్ మధూ.. ఐఏఎస్..కంగ్రాట్స్.." ఎప్పుడూ సీరియస్ గా ఉండే త్రినాధ మూర్తి, ఆక్షణంలో తన ఉద్వేగాన్ని దాచుకునే ప్రయత్నం ఏదీ చేయలేదు.

మధుకి విషయం అర్ధం కావడానికి అర నిమిషం పట్టింది. అర్ధం కాగానే నిటారుగా నిలబడ్డాడు. భుజాలు వెనక్కి వెళ్లి చాతీ ముందుకు పొంగడం తో టీ-షర్ట్ శరీరానికి అతుక్కుపోయిందా అనిపించేలా అయింది.  కళ్ళెత్తి సూటిగా చూశాడు త్రినాధమూర్తి వైపు. ఇంకా ఉద్వేగంలోనే ఉన్న త్రినాధ మూర్తి గారు మధు చేతులు పట్టుకోబోతుండగా, వారించి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, బలంగా. మధూ సార్ కలక్టర్ కాబోతున్నారని అర్ధమయ్యింది పిల్లలకి. వాళ్ళంతా అభినందన పూర్వకంగా చప్పట్లు కొట్టడంతో, ఆ సందడికి పక్క రూంలో క్లాసు చెబుతున్న సాయిరాం, ఆ సెక్షన్ పిల్లలూ, స్టాఫ్ రూం లో ఉన్న టీచర్లు, స్టాఫ్ అంతా అక్కడికి చేరిపోయారు. అందరి అభినందనలనీ హుందాగా అందుకున్నాడు మధు.

"ఇంటికి వెళ్లి మీ నాన్నకి చెప్పు మధూ.. చాలా సంతోషిస్తాడు," అన్నారు త్రినాధ మూర్తి. ఏకవచన ప్రయోగానికి చురుక్కున చూశాడు మధు. ఇప్పుడతని శరీరంలో శ్రీ రాజా మధుసూదన వరప్రసాద రావుగారి రక్తం పరవళ్ళు తొక్కుతోంది. "శివకి ఈ వార్త చెప్పడం ఎలా?" అన్న ఆలోచన ఒక్క క్షణంలో వచ్చి మాయమయ్యింది. "రిజల్ట్స్ చూసి తనే వస్తాడులే.." అనుకున్నాడు.

మోటార్ సైకిల్ తెచ్చి క్లాసు ముందు ఆపి వినయంగా ఆహ్వానించాడు సాయిరాం "రండి..ఇంటిదగ్గర దింపుతాను.." అంటూ. ఎవ్వరివైపూ చూడకుండా, ఏమీ మాట్లాడకుండా ఠీవిగా వెళ్లి మోటార్ సైకిల్ వెనుక సీటుమీద కూర్చున్నాడు మధు. మేష్టర్లే కాదు, పిల్లలు కూడా వింతగా చూశారు ఆ దృశ్యాన్ని. "జాతులు అంతరించిపోతున్నప్పుడు మాత్రమే ఉత్పరివర్తనాలు జరుగుయాయా సార్?" అని అడిగిన సబ్బు కూడా వాళ్ళలో ఉంది.

మంగళవారం, జనవరి 26, 2010

శంభో..శివ శంభో...

విజయవంతమైన తమిళ సినిమా 'నాడోడిగళ్' కి తెలుగు రీమేక్ 'శంభో..శివ శంభో..' సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో, మిగిలిన రెండింటితో పోలిస్తే ప్రచారంలో ఒకింత వెనుకబడిన సినిమా అయినా, నేను మొదటగా చూద్దామనుకున్నది ఈ సినిమానే. కొంచం ఆలస్యంగా చూడగలిగాను. స్టార్ హీరో అన్నీ తానై సినిమాని తన భుజాల మీద మోస్తున్న ప్రస్తుత ట్రెండ్ కి భిన్నంగా ఈ సినిమాలో ముగ్గురు కథానాయకులు ఉన్నారు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా ఒక్క డ్యూయట్టూ లేదు.. ఈ సినిమా కథే వేరు.

ఓ పిల్లా పిల్లాడూ ప్రేమించుకోడం, రెండువైపుల పెద్ద వాళ్ళూ వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోక పోవడం, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ స్నేహం కోసం, ప్రేమని గెలిపించడం కోసం అన్నీ తామే అయ్యి వాళ్ళ పెళ్లి జరిపించడం అన్నది గత పడి, పన్నెండేళ్ళుగా తెలుగు సినిమాల్లో బాగా నలిగిన ఫార్ములా. ఇంత మంది, ఇన్ని త్యాగాలు చేసి పెళ్లి జరిపిస్తే, ఆ జంట సవ్యంగా కాపురం చేస్తుందా? పెళ్లి జరిపించిన మిత్రుల పట్ల వాళ్లకి గౌరవం, కృతజ్ఞత ఉంటుందా? సరిగ్గా ఈ పాయింట్
నే పట్టుకుని తమిళ దర్శకుడు సముద్రఖని ఈ తెలుగు సినిమాని తీశారు.

అందరూ కర్ణ అని పిలుచుకునే కరుణాకర్ (రవితేజ) ఆశయం ప్రభుత్వ ఉద్యోగి కావడం. బీయే గోల్డ్ మెడల్ తెచ్చుకుని, సర్విస్ కమిషన్ పరిక్షలు రాస్తూ ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగం ఎందుకంటే అతనికి మామ (తనికెళ్ళ భరణి) కూతురు (ప్రియమణి) అంతే ప్రేమ. ఆ మామకేమో తన అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అవ్వాలని కల. గవర్నమెంట్ జాబ్ చేసేవాదికే తన కూతుర్ని ఇస్తానని తరచూ చెబుతూ ఉంటాడతను. కర్ణ ప్రాణ స్నేహితులు మల్లి (అల్లరి నరేష్), చంద్ర (శివ బాలాజీ). కర్ణ చెల్లెలు పవిత్ర (అభినయ), చంద్ర ప్రేమించుకుంటూ ఉంటారు. చూసీ, చూడనట్టు నటిస్తూ ఉంటాడు కర్ణ.

మాజీ ఎంపీ భవాని (రోజా) కొడుకు సంతోష్ ('వినాయకుడు' ఫేం అల్తాఫ్). ఇతను కర్నూల్ ఫ్యాక్షనిస్ట్ నరసింహా రెడ్డి (ముఖేష్ రుషి) కూతురితో ప్రేమలో పడతాడు. ఇరువైపులా పెద్దలూ రాజకీయ కక్షల వల్ల పెళ్ళికి అంగీకరించారు. తమ పెళ్లి జరిపించాల్సిందిగా ప్రాణ స్నేహితుడు కర్ణ ని కోరతాడు సంతోష్. కర్ణ తన స్నేహితులతో కలిసి హీరోచితంగా సీమకి వెళ్లి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి సంతోష్ తో పెళ్లి జరిపిస్తాడు. ఇందుకోసం చంద్ర ఒక కాలినీ, మల్లి తన వినికిడి శక్తినీ 'త్యాగం' చేయాల్సి వస్తుంది. కర్ణ పోలీసు కేసులో ఇరుక్కుని గవర్నమెంట్ జాబ్ కి పనికి రాకుండా పోతాడు. తర్వాత ఏం జరిగిందన్నదే అసలు కథ.

సినిమా చూస్తున్నంతసేపూ తెలుగు నటులంతా తమిళంలో నటిస్తున్నట్టు అనిపించింది. ఇంకొంచం వివరంగా చెప్పాలంటే, తమిళ దర్శకుడు, తమిళ కథకి తెలుగు నటులని ఎంచుకుని, రాజమండ్రి, కర్నూలులో తమిళ సినిమా తీసి దానిని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేసినట్టుగా ఉందీ సినిమా. ఒక్కమాటలో సినిమాకి నేటివిటీ లోపించింది. చూస్తున్నంతసేపూ ఎక్కడా ఇది మన పక్కన జరుగుతున్న కథ అన్న భావన కలుగలేదు. నటీనటుల ఆహార్యం, మాటలు, పాటలు, చివరికి కృష్ణ భగవాన్ మీద పెట్టిన కామెడీ ట్రాక్ కూడా తమిళ వాసనే కొట్టింది.

యువకుడిగా కనిపించడం కోసం రవితేజ బానే చిక్కాడు కానీ, అతను పరిక్షలు రాయడం లాంటివి అసహజంగా అనిపించాయి. రవితేజ కి భిన్నంగా శివబాలాజీ కొంచం (బాగానే) వొళ్ళు చేశాడు. మరికొంచం వొళ్ళు చేయకుండా జాగ్రత్త పడాలి. ముగ్గురు హీరోల్లోనూ మంచి మార్కులు కొట్టేసినవాడు అల్లరి నరేష్. దర్శకుడు కనుక మల్లి పాత్రను తీర్చి దిద్దడం మీద మరికొంచం శ్రద్ధ పెట్టి ఉంటే ఈ పాత్ర నరేష్ కి మరో 'గాలి శీను' పాత్ర అయి ఉండేది.

ప్రియమణి తక్కువ మేకప్ తో కనిపించింది కానీ, నటించడానికి పెద్దగా ఏమీ లేని పాత్ర. వినికిడి శక్తి లేని, మాట్లాడలేని అమ్మాయి అభినయ పవిత్ర పాత్ర బాగా చేసింది. రెండు మూడు మంచి సన్నివేశాలు దొరికాయి ఈ అమ్మాయికి. రాజకీయ నాయకురాలి పాత్రలో రోజాని చూసినప్పుడు, ఒక మహిళా నేతని అనుకరించే ప్రయత్నం చేసిందని అనిపించింది. ఆహుతి ప్రసాద్, సుధా లవి రొటీన్ తల్లిదండ్రుల పాత్రలు కాగా, రాధాకుమారి అంతగా ప్రాధాన్యం లేని నాయనమ్మ పాత్రలో కనిపించింది. టీవీ నటిగా స్థిరపడ్డ ఒకప్పటి సిని నటి కిన్నెర తనికెళ్ళ భరణి భార్యగా ఒక్క డైలాగూ లేని పాత్రలో నటించింది.

కృష్ణ భగవాన్ మీద తీసిన కామెడీ ట్రాక్ ప్రస్తుత 'పబ్లిసిటీ రాజకీయాల' మీద మంచి సెటైర్.. ముఖ్యంగా అతని మీద తీసిన 'రాజువయ్యా.. మహ రాజువయ్యా..' బిట్ థియేటర్ మొత్తాన్ని నవ్వించింది. హీరోల కర్నూలు స్నేహితుడిగా సునీల్ తనదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఎల్బీ శ్రీరామ్ ది బొత్తిగా ప్రాధాన్యత లేని పాత్ర. కోటి తండ్రిగా కోట బాగా చేశాడు. నటీ నటులెవ్వరినీ దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదనిపించింది.

దర్శకత్వం గురించి చెప్పాలంటే.. సముద్రఖని తెలుగు నేటివిటీని అర్ధం చేసుకుని ఉంటే బాగుండేది. కథని స్ట్రెయిట్ నేరేషన్ లో చెప్పడం వల్ల మొదటి సగం చాలా నెమ్మదిగానూ, రెండో సగం హడావిడిగానూ సాగిపోయినట్టు అనిపించింది. ప్రేమ గురించీ, స్నేహం గురించీ రవితేజ, రావు రమేష్ ల చేత చెప్పించిన 'పవర్ఫుల్' డైలాగులు సినిమాలో నాటకీయతని పెంచాయి. రావు రమేష్ ప్రేమ సలహాలిచ్చే పాత్రలు తగ్గించుకోక పోతే ఒక బ్రాండ్ పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అంగ వికలుర చేత హాస్యం పుట్టించడాన్ని ఇంకా ఎన్నాళ్ళు చూడాలో ఏమిటో.

ముత్తయ్య సినిమాటోగ్రఫీ బాగుంది. సుందర్ సి. బాబు సంగీతాన్ని గురించీ, పాటల గురించీ చెప్పుకోడానికి ఏమీ లేదు. తెలుగు రీమేక్ అనుకునే కన్నా, తమిళ్ డబ్బింగ్ సినిమా అనుకుని చూస్తే బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. సినిమాకీ, టైటిల్ కీ ఉన్న సంబంధం ఏమిటో మాత్రం నాకింకా అర్ధం కాలేదు.

ఆదివారం, జనవరి 24, 2010

తొలి వసంతం

నిన్నగాక మొన్ననే మొదలుపెట్టినట్టు ఉంది.. ప్రతి రోజూ కొన్ని కొత్త సందేహాలు, సమాధానాలు.. కొత్త మిత్రులు.. కొందరు చేరువయ్యారు.. మరి కొందరు చేరువై దూరమయ్యారు.. ఇంకొందరు దూరమై చేరువయ్యారు.. అంతా రెప్ప పాటులో జరిగిపోయినట్టుగా ఉంది.. కేలండర్ చూస్తే అప్పుడే గిర్రున ఏడాది తిరిగిపోయింది.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున 'నెమలికన్ను'తెరిచింది.నిజంగా నేనేనా? అన్నది ఎప్పుడూ నన్ను వేధించే ప్రశ్న. తల్చుకున్నది ఏదైనా ఆలస్యం లేకుండా చేసేసే నా అలవాటు నాకు మంచీ చేసింది, చెడూ చేసింది. అలా తలచుకోగానే ఏమీ ఆలోచించకుండా మొదలు పెట్టేసిన పనుల్లో బ్లాగింగ్ ఒకటి. ఎన్నెన్నో బ్లాగులు.. రకరకాల టపాలు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి.. ఏ బ్లాగు తెరిచినా ఏదో ఒక కొత్త విషయం.. అప్పుడే తుఫాను వెలిసిన బ్లాగ్వాతావరణం.

ఏడాది క్రితం 'నెమలికన్ను' తొలి అడుగు వేసేనాటికి బ్లాగావరణం పరిస్థితి ఇది. "వీటి మధ్య మరో బ్లాగు అవసరమా?" అనుకోలేదు నేను. "మనమూ రాద్దాం" అనుకున్నాను. అలా అనుకునే మొదలు పెట్టాను. ఏడాది కాలం మరీ ఎక్కువేమీ కాకపోవచ్చు.. కానీ ఒకసారి వెనక్కి తిరిగి నడిచి వచ్చిన దారిని చూసుకోడానికీ, వెళ్ళాల్సిన మార్గం నిర్ణయించుకోడానికీ పనికొచ్చే ఒక మైలు రాయి.

మంచైనా, చెడైనా ప్రతి అనుభవమూ ఒక పాఠమే.. నేర్చుకో గలగాలే కానీ మనకి తారసపడే ప్రతి వ్యకీ ఒక పాఠం నేర్పుతారు. నేను కూడా అలాగే నేర్చుకున్నాను. నా అభిరుచులకి తగ్గ సమాచారం సేకరించుకున్నాను. ఓ పుస్తకం చదివినప్పుడో, ఓ సినిమా చూసినప్పుడో, చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి ఏదైనా కొత్త విషయాన్ని గమనించినప్పుడో, మనసుకి సంతోషం వేసినప్పుడో, బాధ కలిగినప్పుడో..నాకు ఏదైనా ఎవరితోనైనా పంచుకోవాల్సింది ఉంది అనిపించినప్పుడు ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను.

ఈ బ్లాగుకి ఉన్న రీచ్ తక్కువే కావొచ్చు. కానీ నా ఆలోచన ఏమిటంటే బ్లాగ్ అనేదే లేకపోతే కనీసం ఈ కొందరితో అయినా నా భావాలు ఎలా పంచుకోగలను? వాళ్ళ అభిప్రాయాలు ఎలా తెలుసుకో గలను? అందువల్ల నా బ్లాగు నాకు అపురూపమే. బ్లాగ్మిత్రులు కొందరు చెబుతున్నట్టుగా బ్లాగులకి అడిక్ట్ కావడం, చూడకుండా ఉండలేక పోవడం అనే సమస్య నాకింకా కలగలేదు. కాబట్టి బ్లాగింగ్ ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నానని చెప్పగలను.

ఏపనినైనా క్రమం తప్పకుండా చేయడానికి ఏదో ఒక రూపంలో ఒక ఉత్ప్రేరకం అవసరం అవుతుంది. వ్యాపారం అయితే లాభాలు, ఉద్యోగం అయితే జీత భత్యాలు, పదోన్నతి.. ఇలాంటివన్న మాట.. మరి బ్లాగింగ్ కి?? పాఠకుల నుంచి వచ్చే స్పందన. సలహాలు, సూచనలు. ఈ విషయంలోనూ నేను అదృష్టవంతుడినే.. 'నెమలికన్ను' పాఠకులు తమ సమయాన్ని వెచ్చించి ఇస్తున్న సలహాలు, సూచనలు నాలో రాయాలనే ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.

నా టపా చదివి ఓ పుస్తకం చదివామనో, ఓ సినిమా చూశామనో మిత్రులు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. బ్లాగు మొదలయిన ఆరు నెలలకి తెలుగు దిన పత్రిక 'ఈనాడు,' గత నెలలో బ్లాగరి 'సిరిసిరిమువ్వ' గారు 'నెమలికన్ను' ని సమీక్షించారు. 'కృతజ్ఞతలు' అన్నది చాలా చిన్న మాటే అవుతుంది. వారి సూచనలు దృష్టిలో ఉంచుకుంటాను. నాకు సంబంధించి, మెరుగు పరుచుకోవడం అన్నది ఒక నిరంతర ప్రక్రియ.

బ్లాగ్మిత్రులతో మాట్లాడడానికి కామెంట్ బాక్స్ తో పాటు మరేదైనా వేదిక ఉంటే బాగుండునన్న ఆలోచన ఫలితమే nemalikannumurali@gmail.com. తమ సలహాలు, సూచనలను వివరంగా అందించాలనుకున్న బ్లాగ్మిత్రులు మెయిల్ పంపవచ్చు. మీ అభిప్రాయాలు నాకు అమూల్యమైనవి. ఏడాది బ్లాగింగు అనుభవంలో సినిమా సమీక్షల వంటివి రాయడాన్ని కొంత మెరుగు పరుచుకోడంతో పాటు, అనుకోకుండా ఒక కథనీ రాయగలిగాను. నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

శుక్రవారం, జనవరి 22, 2010

బ్లాగులు-మధురవాణి

ఆ బ్లాగు లో టపాలు చదువుతూ ఉంటే రోజూ మన కళ్ళెదురుగా తిరిగే పక్కింటి అమ్మాయి గలగలా చెబుతున్న కబుర్లు వింటున్నట్టుగా ఉంటుంది. వట్టి కాలక్షేపం కబుర్లు కాదు సుమా.. సరదా చమక్కులతో పాటు, మనసుకు పట్టేసేవి, మనకి పనికొచ్చేవి ఎన్నో ఉంటాయి.. కేవలం మాటలు మాత్రమే కాదు.. అపురూపమైన పాటలూ దొరికే ఆ బ్లాగు పేరు 'మధురవాణి' ..బ్లాగరు పేరు కూడా అదే.

తెలుగు సాహిత్యంలో నా అభిమాన నాయికల్లో అగ్రస్థానంలో ఉన్న నాయిక పేరుతో ఒక బ్లాగు నా కంట పడినప్పుడు చదవకుండా ఉంటానా? గబగబా చదివేశాను. చదవగానే ఒక్కసారిగా రెక్కలు కట్టుకుని జెర్మనీ కి ఎగిరిపోతే బాగుండు అనిపించింది. ఎందుకంటే 'మధురవాణి-తెలుగురాణి' బ్లాగులో నేను మొదటగా చదివిన టపా 'జర్మనీలో క్రిస్మస్ మార్కెట్-గ్లూ వైన్ విశేషాలు.' జర్మనీలో ఎన్ని రకాల వైన్లు ఏయే రుచులలో దొరుకుతాయో రాసి నోరూరించారు మధురవాణి. ఆవిడ జర్మనీలో ఉంటారని తెలిసింది, ఆ టపా వల్ల.

ఒక్కసారి పాత టపాలు తిరగేస్తే తెలిసింది ఆ బ్లాగు కేవలం కబుర్ల పుట్ట మాత్రమే కాదనీ, పాటల ఖజానా కూడా అనీ.. పాతా, కొత్త అని కాకుండా వినసొంపైన పాటలన్నీ దొరుకుతాయిక్కడ. వినడమే కాదు చక్కగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా.. నేను మొదటగా డౌన్ లోడ్ చేసుకున్న పాట 'శుభోదయం' లో 'కంచికి పోతావా కృష్ణమ్మా..' ఈ సినిమా గురించి 'నవతరంగం' లో ఒక చక్కని సమీక్ష కూడా రాశారు మధురవాణి.

కొంచం చరిత్ర లోకి వెళ్తే, 2008 సెప్టెంబర్ 27 న 'Welcome to Madhuravaani' అనే ఆంగ్ల శీర్షికతో మొదటి టపా రాశారు. బాపు బొమ్మలు, సుమతీ శతక పద్యాలతో అందంగా అలంకరించారు బ్లాగుని. త్వరలోనే తెలుగు కి మారిపోయినా, అప్పుడప్పుడూ ఆంగ్ల టపాలు తళుక్కు మంటూనే ఉన్నాయి, ప్రారంభంలో. ఐతే రాను రానూ తెలుగు టపాల మీదే దృష్టి పెట్టారు.

నీతి కథలు చెప్పినా, వాళ్ళ బంగారం విశేషాలు రాసినా, ముద్దు పేర్లను గురించి ముచ్చట్లు వివరించినా మనం అలా అలా చదువుకుంటూ వెళ్లి పోవాల్సిందే. 'అమ్మ' గురించి రాసిన టపా కదిలిస్తే, వాళ్ళింటి 'గుర్రం బొమ్మ' గురించి రాసిన టపా కాసేపు ఆలోచనల్లో పడేస్తుంది. వాళ్ళ పెరటి జామచెట్టు గాధ చదివాక మన కళ్ళ ముందు ఒక బుల్లి రాజు గారూ, మరో బుల్లి మంత్రి గారూ మెదలక మానరు. సినిమా పాటలతో పాటు సీరియస్ సాహిత్యాన్ని గురించీ చెప్పే మధురవాణి మహాకవి 'శ్రీశ్రీ' గొంతు వినిపించారు ఇక్కడ.

అప్రస్తుతం కాదు కాబట్టి ఇక్కడ నా గురించి కొంచం చెప్పాలి. నేను సాంకేతిక విషయాలు ఏవీ తెలుసుకోకుండా ఒకలాంటి మొండి తనంతో బ్లాగు మొదలు పెట్టేసి, బిక్కుబిక్కు మంటున్న వేళ తనంతట తానుగా వచ్చి నాకు సూచనలు చేశారు మధురవాణి. అప్పుడే తెలిసింది, ఇక్కడ మనకి సాయం చేసేవాళ్ళకి లోటు లేదని. అంతేనా.. నాకో చక్కని బహుమతిని కూడా ఇచ్చారు.

అన్నట్టు మధురవాణి గారు కేవలం బ్లాగరి మాత్రమే కాదు, రచయిత్రి కూడా. ఆవిడ మొదటి కథ 'ఆవృతం' పొద్దు లో ప్రచురితమయ్యింది. 2008 లో చాలా ఉత్సాహంగా టపాలు రాసిన మధురవాణి గారు - ఒక్క అక్టోబర్ నెలలోనే 36 టపాలు - 2009 లో బ్లాగింగ్ కి అతి కొద్ది సమయం మాత్రమే కేటాయించారు.. ఏడాది మొత్తం లో రాసినవి కేవలం 32 టపాలు మాత్రమే. 'మధురవాణి' తో పాటు మరో మూడు బ్లాగుల్ని నిర్వహిస్తున్నారు మరి. ఇప్పటి నుంచైనా కొంచం తరచుగా కబుర్లు చెబుతారనీ, కథలు రాస్తారనీ ఎదురు చూస్తున్నాను..

బుధవారం, జనవరి 20, 2010

(ఇం)కోతి కొమ్మచ్చి

చూడదగ్గ సినిమాలని నేను రెండు రకాలుగా వర్గీకరించుకుంటాను. గొప్ప సినిమాలు, మంచి సినిమాలు. గొప్ప సినిమా మనం థియేటర్ నుంచి బయటికి వచ్చినా మనల్ని వెంటాడుతుంది. అందులో పాత్రలో, మాటలో, పాటలో, కొండొకచో మొత్తం సినిమాలో కొన్నాళ్ళ పాటు మనకు తరచూ గుర్తొస్తూ ఉంటాయి. ఇక మంచి సినిమా అంటే, చూసినంత సేపూ సినిమాని ఆస్వాదిస్తాం. ఎక్కడా బోర్ కొట్టదు. సినిమా నుంచి బయటికి వచ్చాక తల్చుకోడానికి, గుర్తు చేసుకోడానికి పెద్దగా ఏమీ ఉండదు.

సిని రచయిత, నిర్మాత ముళ్ళపూడి వెంకటరమణ 'సిరీస్' గా రాస్తున్న తన జీవిత చరిత్రలో మొదటి భాగం 'కోతి కొమ్మచ్చి' గొప్ప సినిమా అయితే, రెండో భాగం '(ఇం)కోతి కొమ్మచ్చి' ని మంచి సినిమా అనొచ్చు. సినిమా వ్యక్తి జీవిత చరిత్ర కాబట్టి సినిమాలతో పోలిక సరైనదేనేమో. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయడం తో మొదటి భాగాన్ని ముగించిన రమణ, అదే అంశంతో రెండో భాగాన్ని ప్రారంభించి, సిని రంగ ప్రవేశాన్ని గురించి సుదీర్ఘంగా వివరించారు.విమర్శకుడిగా అప్పటివరకూ విడుదలైన సినిమాలని చీల్చి చెండాడుతూ సమీక్షలు రాసిన రమణ, సినిమా కి రచన చేసే అవకాశం రాగానే సహజంగానే కొంచం భయపడ్డారు. వద్దనుకున్నారు. చివరికి దిగారు. రచయితగా కెరీర్ మొదలుపెట్టి నిర్మాతగా ఎదిగారు. అయితే ఇదంతా మంచినీళ్ళు తాగినంత సులువుగా జరిగిపోలేదు. ఎందుకంటే రమణ జేబు నిండా సొమ్ములున్న వ్యక్తి కాదు. కేవలం టాలెంట్ ని నమ్ముకుని ధైర్యం చేసిన వ్యక్తి. పక్కనే బాపూ కొండంత అండ.

'కోతి కొమ్మచ్చి' లో రమణ బాల్యం, ఎదుర్కొన్న ఆటుపోట్లు, అలవి కాని కష్టాలని కూడా చిరునవ్వుతో భరించిన వైనాన్ని అత్యంత హాస్య భరితంగా చెప్పారు మనకి. అయితే రెండో భాగంలో కేవలం సినిమా రంగం మాత్రమే కనిపిస్తుంది. వ్యక్తిగత జీవితాన్ని కేవలం రెండు మూడు పేజీలకి మాత్రమే కుదించారు. ఫలితం, సినిమాలంటే ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే ఈ రెండో భాగాన్ని ఆస్వాదించ గలుగుతారు. పైగా, సినిమా రంగ వార్తలని క్రమం తప్పకుండా ఫాలో అయ్యే వాళ్లకి కొత్తగా అనిపించే విషయాలు కొన్నే ఉన్నాయి.

నిర్మొహమాటంగా రాయడం రమణ శైలే అయినా, ఆత్రేయ గురించీ, ఆదుర్తి గురించీ రాసిన కబుర్లు చివుక్కు మనిపిస్తాయి. ఎంతైనా 'పోయినోళ్ళందరూ మంచోళ్ళు' కదా.. ఆత్రేయ డబ్బు తీసుకుని 'సాక్షి' సినిమాకి పాట రాయకపోవడం, ఆదుర్తి 'మూగమనసులు' సినిమాకి కథ, మాటలు రాయించుకుని డబ్బు ఎగ్గొట్టడాన్నిగురించి రమణ రాసిన విధానం చదివితే ఆయనలోని నిర్మాతే మన కళ్ళ ముందు మెదులుతాడు. ఎస్వీఆర్ భోజనం, జమునతో షూటింగ్ అనుభవాలు, 'బుద్ధిమంతుడు' లో నటిస్తానని భానుమతి అడిగినప్పుడు రమణ గుండెల్లో రాయి పడడం లాంటివి నవ్విస్తాయి.

మొదటి భాగం తో పోల్చినప్పుడు పుస్తకం రెండో భాగంలో కథనం కొంచం పల్చబడిందని అనిపించింది. ఒక ఆత్మకథని కాక సినిమా కబుర్ల పుస్తకం చదువుతున్న భావన కలిగింది. మొత్తం మీద మొదటి భాగం అందించిన రసానుభూతి రెండో భాగంలో లోపించింది. అందువల్లనే కావొచ్చు, పుస్తకం పూర్తి చేసి పక్కన పెట్టాక మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చిన విషయాలేవీ లేవు నాకు. బాపు బొమ్మలతో 'హాసం' ప్రచురించిన '(ఇం)కోతి కొమ్మచ్చి' పేజీలు 200, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది. ఈ పుస్తకాన్ని గురించి బ్లాగ్మిత్రులు వేణూ శ్రీకాంత్ గారి టపాని ఇక్కడ చదవొచ్చు.

మంగళవారం, జనవరి 19, 2010

ఆంధ్రలేఖ వారికి...

ఆంధ్రలేఖ వారికి,

నమస్తే. నా పేరు మురళి. గత ఏడాది కాలంగా 'నెమలికన్ను' (http://nemalikannu.blogspot.com/) పేరుతో తెలుగు బ్లాగు రాస్తున్నాను. మీరు ప్రకటించిన బ్లాగుల పోటీకి నా బ్లాగు ఎంట్రీ గా వచ్చిందని, టాప్ టెన్ కి ఎంపికయ్యిందని నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే నా బ్లాగును ఎంట్రీ గా నేను పంపలేదు. పోటీలో పాల్గొనడం నా అభిమతం కాదు కాబట్టి మీరు ప్రకటించిన పోటీకి నేను దూరంగా ఉన్నాను.

'చైతన్య యామినేని' పేరుతో మీకు ఎంట్రీ రావడం నన్ను షాక్ కి గురిచేసింది. ఇది ఎలా జరిగిందో అర్ధం కావడం లేదు. ఏమైనప్పటికీ, ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న పోటీ నుంచి 'నెమలికన్ను' ఎంట్రీ ని తొలగించాల్సిందిగా కోరుతున్నాను. మీకు పంపుతున్న ఈ ఉత్తరాన్ని నా బ్లాగులో కూడా ప్రచురిస్తున్నాను.

ధన్యవాదాలతో..
--
మురళి

మంగళవారం, జనవరి 12, 2010

సుబ్బీ గొబ్బెమ్మా...

అసలు పండగంటే పల్లెటూరిలోనే చూడాలి.. ఇక సంక్రాంతి పండుగ సంబరాలు చూడాలంటే గోదారి ఒడ్డున పల్లెటూరుకి ప్రయాణమై వెళ్ళాల్సిందే. రాత్రిపూట చలి ముదిరి రగ్గు కప్పుకోవాల్సి వచ్చిందంటే, వీధిలో బంతి మొక్కలు నవలాడుతూ ఎదిగి పూతకి సిద్ధమవుతున్నాయంటే, డిసెంబరాలు విరగబూయడం మొదలు పెట్టాయంటే అర్ధమైపోయేది చిన్నప్పుడు, సంక్రాంతి పండుగ రాబోతోందని.

గుళ్ళో ధనుర్మాసం సేవ మొదలవ్వడం, అమ్మ రోజూ వేసే ముగ్గుకు బదులుగా నెలపట్టు ముగ్గు వేయడం కొండ గుర్తులు. అమ్మో సంక్రాంతి అంటే ఎన్ని పనులు.. భోగి పిడకలు చేసుకోడం మొదలు, కొత్త బట్టలు కుట్టించుకోడం వరకూ.. అస్సలు ఊపిరి సలుపుతుందా?? వీధిలో అందరికన్నా మన ఇంటి ముందు వేసే భోగి మంటే పెద్దదిగా ఉండాలా.. పైగా మనం వేసే భోగి దండే పొడుగ్గా ఉండాలి.. కనీసం లక్ష పిడకలైనా ఉంటే కానీ (లెక్కల్లో నేను చిన్నప్పటి నుంచీ వీకే) అంత పెద్ద దండ రాదు మరి.

మరి భోగి పిడకలు చేసుకోడం మొదలు పెట్టాలంటే గొబ్బిళ్ళు పెట్టే వరకు ఆగి, వాటిని కూడా ఆవు పేడలో కలిపి అప్పుడు కదా పని మొదలు పెట్టాలి. అమ్మ వీధికంతటికీ 'అత్తయ్ గారు' కాబట్టి చుట్టు పక్కల ఆడపిల్లలంతా మనింటికి వచ్చి సందె గొబ్బిళ్ళు పెట్టుకోవాల్సిందే. అమ్మ పెరడంతా బాగు చేసి, కల్లాపి జల్లి ముగ్గులేసి, నేను కష్టపడి సంపాదించి తెచ్చిన ఆవుపేడతో గొబ్బెమ్మలు చేశాక అప్పుడు వచ్చే వాళ్ళు అమ్మాయిలు పూల బుట్టలు పట్టుకుని.

వీళ్ళీ గొబ్బిళ్ళేవో పెట్టేసుకుంటే రేపటినుంచి భోగి పిడకల పని మొదలు పెట్టేసుకోవచ్చు కదా అన్నది నా మొదటి ఆలోచన. ఈ పూజా కార్యక్రమమేదో తొందరగా అయిపోతే నాన బెట్టిన అటుకుల్లో, బెల్లం పొడీ, కొబ్బరి కోరూ, ఏలకు పొడీ కలిపి చేసిన ప్రసాదాన్ని రుచి చూడచ్చు కదా అన్నది రెండో ఆలోచన. వచ్చిన వాళ్లకి మంచినీళ్ళు, వాళ్ళు తెచ్చుకోడం మర్చిపోయిన పూజ వస్తువులు అందించే అదనపు డ్యూటీ కూడా పడేది.

అమ్మ తన పూజ పుస్తకాల్లోనుంచి ఓ పుస్తకం చూసి ఏదో చదివితే, ఆడ పిల్లలంతా గొబ్బెమ్మలకి పూజ చేసేవాళ్ళు. చివరగా వాళ్ళంతా గొబ్బిళ్ళు పెట్టిన ముగ్గు చుట్టూ ప్రదిక్షిణ చేస్తూ 'పాట' పాడేశారంటే గొబ్బిళ్ళు పెట్టడం అయిపోయినట్టే. ఇంక ప్రసాదాలు పెట్టేస్తారు. అమ్మ పాట చెబుతుంటే వాళ్ళు అందుకుని చప్పట్ల దరువేస్తూ, ప్రదిక్షణ చేస్తూ పాడేవాళ్ళు.


"సుబ్బీ గొబ్బెమ్మా.. సుబ్బణ్ణీయవే..
చామంతి పువ్వంటీ చెల్లెల్నీయవే
తామర పూవంటీ తమ్ముణ్ణీయవే..
మొగలి పూవంటీ.. మొగలి పూవంటీ.. మొగుణ్ణీయవే.."

పాట చివరికొచ్చేసరికి ఆడపిల్లలంతా ఉన్నట్టుండి పాడడం మానేసేవాళ్ళు.. "ఊ... అనాలమ్మా.." అని అమ్మ కొంచం నొక్కి చెబితే ఇక తప్పక లోగొంతుకతో చెప్పేవాళ్ళు చివరి వాక్యం.. వెంటనే బాగా నవ్వుకునే వాళ్ళని జ్ఞాపకం. ఆలోచనలు ప్రసాదం మీద, భోగి పిడకల మీదా ఉండడంతో పెద్దగా పట్టించుకునే వాడిని కాదు. చూస్తుండగానే కొన్ని సంక్రాంతులు గడిచిపోడం, నేను కాలేజీకి వచ్చేయడం జరిగిపోయింది. దృష్టి భోగి పిడకల లాంటి చిన్న విషయాల నుంచి 'ఇతర' విషయాల మీదికి మళ్లడం సహజమే కదా..

ఎప్పటిలాగే మా పెరట్లో గొబ్బిళ్ళు. నా డ్యూటీ నేను చేస్తున్నా, కించిత్ కుతూహలంగా.. అమ్మాయిలు వచ్చేశారు.. ఎక్కువ మంది నా ఈడు వాళ్ళు.. ఒకరిద్దరు కొంచం అటూఇటూ గా ఉన్నవాళ్ళూ.. నేను పెరట్లోనే యేవో పనులు కల్పించుకుని, నా పనుల్లో నేనున్నా.. వాళ్ళు ఎప్పటికీ పూజ మొదలు పెట్టరు.. ఇంతలో ఒకమ్మాయి 'అత్తయ్ గారి' చెవి కొరికింది. అమ్మ యెంతో లాలనగా "వీధిలోకెళ్లి చదువుకో నాన్నా.. " అని ఆర్డరేసేసింది. ఇంక చేసేదేముంది..

మామూలప్పుడే ఇంగ్లిష్ పాఠం అంతంతమాత్రంగా అర్ధమవుతుంది.. పెరట్లో అంత హంగామా జరుగుతుంటే, ఏ కుర్రాడైనా వీధిలో కూర్చుని షెల్లీ గురించో షేక్స్పియర్ గురించో చదవగలడా? నేనూ అంతే.. పైగా, గొబ్బిళ్ళ కోసం అన్ని ఏర్పాట్లూ చేసిన నాకు పూజ చూసే కనీస హక్కుందని ఆ క్షణంలో చాలా బలంగా అనిపించింది. దేవుడి గదికి ఉన్న చిన్న కిటికీ రెక్కని కొంచం పక్కకి తప్పిస్తే పెరడంతా చక్కగా కనిపిస్తుందన్న విషయం ఏదో ఆశరీరవాణి చెప్పినట్టుగా గుర్తొచ్చేసింది.

అసలే నాకు ఎప్పుడు ఏ పని అనుకుంటే అది వెంటనే చేసేసే అలవాటు అవడంతో, పుస్తకం పక్కన పెట్టి పిల్లిలా దేవుడిగదిలోకి ప్రవేశించాను. అమ్మ గొంతు వినిపిస్తోంది, అమ్మాయిలు కనిపిస్తున్నారు. నాక్కావాల్సిన పాట వచ్చేసింది. 'మొగలీ పువ్వంటీ..' తర్వాత నిశ్శబ్దం.. ఈసారి అమ్మ మాట వెంటనే వినలేదు వాళ్ళు. మొత్తం మీద అమ్మ సాధించింది.

వోణీలు నోటికి అడ్డం పెట్టుకుని, నేల చూపులు చూసుకుంటూ మొదటి సారి మెల్లిగా గొణిగి, రెండోసారి కొంచం గట్టిగా చెప్పారు వాళ్ళు. నేను బుద్ధిగా చదువుకోడం కోసం వీధి ఆరుగు మీదికి వెళ్ళబోతుండగా దేవుడి గది గుమ్మం దగ్గర .అలికిడయ్యింది. చూస్తే.. ఎదురుగా అమ్మ..

...బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు...

ఆదివారం, జనవరి 10, 2010

చిన్ని చిన్ని కన్నయ్యా..

ఏడు పదుల జీవితం.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ముళ్ళు..మరెన్నో పూలు.. స్వర సామ్రాజ్యంలో అధిరోహించిన శిఖరాలు ఎన్నో ఎన్నెన్నో.. భక్తి గీతం ఆలపిస్తున్నప్పుడు ఆ స్వరంలో వినిపించే ఆర్తి, విషాద గీతానికి స్వరం అందించేటప్పుడు అలవోకగా తొణికిసలాడే భావోద్వేగం అనితర సాధ్యం. కట్టసేరి జోసెఫ్ ఏసుదాస్ అంటే చాలా మందికి తెలియక పోవచ్చేమో కానీ.. కేజే ఏసుదాస్ అన్నా, క్లుప్తంగా జేసుదాస్ అన్నా ఆ పేరు వినగానే మొదట గుర్తొచ్చేది ఓ హృద్యమైన స్వరం.. నా అభిమాన స్వరరాజుకి డెబ్భయ్యో జన్మదిన శుభాకాంక్షలు.పాటల ప్రవాహం చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న క్షణాలివి. ఆ స్వరరాగ గంగా ప్రవాహంలో మునక వేయగలగడమూ ఒక అదృష్టమే. కె. బాలచందర్ అపూర్వ సృష్టి 'అంతులేని కథ' నాకు చేరువ చేసిన ఇద్దరిలో ఒకరు జేసుదాస్. 'దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..' పాట వస్తున్నప్పుడు తెరమీద కనిపిస్తున్న దృశ్యం లో కన్నా వినిపిస్తున్న గొంతులోని ఆర్ధ్రతే ముందుగా మనసుకి తాకింది. సినిమా పూర్తయినా ఆ గొంతు వెంటాడుతూనే ఉంది.. అది కేవలం ప్రారంభం.. ఆ తర్వాత ఎన్ని పాటలో..

రేడియోలో జేసుదాస్ పాట వస్తూ ఉంటే, ఎంత అర్జెంటు పని ఉన్నా పాట పూర్తయ్యేవరకూ కదలకపోవడం నిన్ననో మొన్ననో జరిగినట్టుగా ఉంది. గ్రామ ఫోన్ రికార్డు మీద గడ్డం తో ఉన్న జేసుదాస్ ఫోటో ఇంకా తడి ఆరని జ్ఞాపకం లాగా ఉంది. జేసుదాస్ పాటలు ఉన్న ఆడియో కేసెట్ల టేపులు తెగిపోవడం రాను రాను చాలా మామూలు అనుభవం అయిపోయింది.. మామూలు సందర్భాలలో కన్నా మనసు బాగోలేనప్పుడో, బరువెక్కినప్పుడో జేసుదాస్ పాటలు వినడం ఓ గొప్ప అనుభవం.. ఘనీభవించిన దిగులునంతటినీ ఓ చిన్ని కన్నీటి చుక్కగా మార్చి చెక్కిలి చివరి నుంచి జార్చేయగలగడం ఆ స్వరం చేసే మాయాజాలం.

యాభయ్యేళ్ళ కెరీర్ లో జేసుదాస్ పదిహేడు భాషల్లో నలభైవేల పాటలు పాడినా, నేను విన్నవి - కేవలం మూడు భాషల్లో - కొన్ని వందలు మాత్రమే. వాటిలో ఒక్కసారి మాత్రమే విన్నవి బహుశా లేవేమో. తను తెలుగు వాడు కాదు అన్న విషయం తెలిసింది అతి కొద్ది సందర్భాలలో మాత్రమే.. అదికూడా అతి చిన్న ఉచ్చారణా దోషాల వల్ల. భాష, భావం విషయంలో జేసుదాస్ తీసుకునే శ్రద్ధ పరభాషా గాయకులందరికీ ఆదర్శనీయం.

జేసుదాస్ పాటలు విని ఆనందిస్తూ, కేవలం తన పాటల కోసమే ఇష్టం లేకపోయినా కొన్ని సినిమాలు చూస్తున్న నాకు జేసుదాస్ కచేరీకి హాజరయ్యే అవకాశం వచ్చినప్పుడు అదృష్టం నా ఇంటి తలుపు తట్టినట్టు అనిపించింది. నిజానికి ఇప్పటివరకూ ఆ అదృష్టం రెండుసార్లు కలిగింది నాకు. మొదటిది శాస్త్రీయ సంగీత కచేరీ కాగా, రెండోది భక్తి సంగీత విభావరి. రవీంద్రభారతి స్టేజిపై డిం లైట్ల కాంతిలో శ్వేత వస్త్రధారియై "వాతాపి గణపతింభజే.." తో ప్రారంబించి దాదాపు రెండున్నర గంటలపాటు సాగించిన కచేరీ యావత్తు ప్రేక్షకుల్నీ ఏవేవో లోకాల్లో తిప్పి తీసుకొచ్చింది.

రెండోది ఓ ఆరుబయటి పందిరిలో జరిగిన అయ్యప్పభజన. భక్తి పూరిత వాతావరణం. "శరణమయ్యపా.." అంటూ జేసుదాస్ గళం విప్పగానే పరమ నాస్తికులు సైతం భక్తి పారవశ్యంలో మునిగిపోక తప్పదనిపించింది. వినాయకుడిని స్తుతించినా, అయ్యప్ప పాటలు పాడినా, సాయిబాబా లీలలు వర్ణించినా అవన్నీ జేసుదాస్ గొంతులో కొత్తగా వినిపిస్తాయి నాకు. ఆ గొంతులో వినిపించే ఆర్తి కట్టి పడేస్తుంది నన్ను. మంచు వర్షంలా కురుస్తున్న ఆ ధనుర్మాసపు రాత్రి, జేసుదాస్ భక్తిగాన వర్షంలో తడవడం ఓ జీవితకాల జ్ఞాపకం.

ఊహించని అదృష్టం ఎదురైనప్పటికీ ఇంకా ఏదో కావాలనుకోడం మానవ నైజం కదా.. అందుకేనేమో, ఓ కోరిక చిన్నగా మొలకెత్తి మెల్లగా మహా వృక్షమయ్యింది.. కొన్ని క్షణాలు..కనీసం అతి కొద్ది క్షణాలైనా జేసుదాస్ తో మాట్లాడాలని.. ఆయన అలవాట్లని గురించి తెలుసుకున్నప్పుడు ఇది సాధ్యమయ్యే పనిలా అనిపించలేదు.. కానీ ఏమో.. ఎవరికి తెలుసు? ఎప్పటికైనా సాధ్యమవుతుందేమో.. జేసుదాస్ శతాధిక జన్మదినాలు జరుపుకోవాలని, అత్యధికకాలం మధురమైన గొంతుతో పాటలు పాడిన గాయకుడిగా కొత్త రికార్డు స్థాపించాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ.. కన్నయ్యకు మరోమారు జన్మదిన శుభాకాంక్షలు..

శనివారం, జనవరి 09, 2010

నాలుగో స్థంభం

రాష్ట్రంలో ఊహించని పరిణామాలు కొన్ని శరవేగంగా జరుగుతున్నాయి. టీవీ చానళ్ళు తాము తలచుకుంటే చేయగలిగింది ఏమిటో నిరూపించిన ఇరవై నాలుగు గంటలు గడవక మునుపే పోలీసులు తమ శక్తి సామర్ధ్యాలు ప్రదర్శించారు. వైఎస్ మరణం వెనుక రిలయన్స్ సంస్థల కుట్ర దాగి ఉందన్న రష్యన్ వెబ్సైట్ కథనాన్ని ఆధారంగా చేసుకుని మూడు నాలుగు గంటలపాటు కథనాలు ప్రసారం చేసిన మూడు టీవీ చానళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కల్లోలాన్ని సృష్టిస్తే, జరిగిన పరిణామాలకి టీవీ చానళ్ళని బాధ్యులని చేస్తూ మొదటగా ఆ కథనాన్ని ప్రసారం చేసిన చానల్ యాజమాన్యాన్ని అరెస్టు చేశారు పోలీసులు.

జరిగిన దానికి పోలీసుల ఓవర్ యాక్షన్ కారణమని ఆ చానల్ ప్రతినిధులు, చానల్ వారి అతి వల్లనే అరెస్టులు తప్పనిసరి అయ్యాయని పోలీసులూ చెబుతున్నారు. అయితే, చానళ్ళ వారికి పెద్ద ఎత్తున మద్దతు లభించక పోవడం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం. గతంలో పత్రికలలో పనిచేసే వారి మీద ఎలాంటి దాడి జరిగినా, సంస్థల మధ్య వ్యాపార పోటీనీ, లావాదేవీలనీ పక్కన పెట్టి, అన్ని పత్రికల ఉద్యోగులూ ప్రదర్శనలు చేయడాన్ని మనం చూశాం. జరిగిన దాడిని పత్రికా స్వేచ్చ మీద దాడిగా అభివర్ణిస్తూ నల్ల బ్యాడ్జీలు, జెండాల ప్రదర్శన జరిగేది.

ఐతే ప్రస్తుత సంఘటనలో, ఒకపక్క అరెస్టులు జరుగుతూ ఉండగా, రష్యన్ పత్రిక కథనాన్ని ప్రసారం చేయని చానళ్ళు 'మీడియా బాధ్యత' ని గురించి చర్చా కార్యక్రమాలు నిర్వహించి, ఆ మూడు చానళ్ళనీ ఇతోధికంగా తప్పు పట్టడమే కాక, సుద్దులు చెప్పే ప్రయత్నాలు సైతం చేశాయి. అరెస్టులు జరిగిన టీవీ చానళ్ళ రిపోర్టర్లు మాత్రం, జరుగుతున్న పరిణామాలని లైవ్ లో చూపిస్తూ, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందేనని వక్కాణించారు. గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా దూరం నుంచైనా సరే మీడియా పనితీరుని గమనిస్తున్న వారికి ఇది ఒక ఆసక్తి కరమైన పరిణామం.

జనం సంగతి పక్కన పెట్టి, సాటి మీడియా సంస్థల నుంచే ఆ మూడు చానళ్ళూ మద్దతు పొందలేక పోడానికి కారణం కేవలం వార్తా కథనంలో విశ్వసనీయత లేకపోవడం మాత్రమేనా? మరి అలా అయితే, గతంలో ఎన్నో సందర్భాలలో మీడియాని పరోక్షంగానే అయినా 'సీజర్స్ భార్య' గా అభివర్ణించి ప్రభుత్వ చర్యలని ముక్త కంఠంతో వ్యతిరేకించారు కదా.. మరి ఇప్పుడు ఒక్కరు కూడా ఆ మూడు చానళ్ళకి మద్దతుగా మాట్లాడడం లేదేం? జరిగిన పరిణామం రాష్ట్ర రాజకీయాలని కుదిపెసిదే కావడం వల్లనా లేక ఒక పెద్ద కార్పోరేట్ సంస్థ కి నష్టం కలిగించడం వల్లనా?

మద్దతు పలకడం మాట పక్కనుంచి, సుద్దులు చెప్పడానికి ఒకరితో ఒకరు పోటీ పడడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది. "మాది చాలా బాధ్యత గల మీడియా సంస్థ.. అలాంటి కథనాలు మేమెప్పుడూ ప్రసారం చేయలేదు.. చేయబోము.." అని చెప్పుకోడానికి మిగిలిన చానళ్ళు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నవ్వొస్తోంది. ఓ నాయకుడు మరణించగానే, వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ ప్రతినిదులకి లైవ్ లో ఫోన్ చేసి ఎక్కడ ఎన్ని బస్సులు తగలబడుతున్నాయో లెక్కలు తీయడం.. 'మీ ఊళ్ళో ఇంకా మొదలవ్వలేదా?' అని పరోక్షంగా జనాన్ని రెచ్చగొట్టడం, వార్తల మాటున బూతు ప్రసారాలు తదితర తప్పులన్నీ ఈ విధంగా ప్రక్షాళన చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టున్నాయి.

గడిచిన రెండు మూడేళ్ళలో చానళ్ళ సంఖ్య విపరీతంగా పెరగడం, దాదాపు ప్రతి చానలూ అస్తిత్వ పోరాటంలో భాగంగా దొరికింది దొరికినట్టు ప్రసారం చేయడం.. ఈ అతికి ఏదో రూపంలో కళ్ళెం పడితే బాగుండు అనుకున్న సామాన్య ప్రేక్షకులకి మాత్రం జరిగిన పరిణామం ఊరటని ఇచ్చిందనే చెప్పాలి. మీడియాలో వర్గపోరు, వివిధ రాజకీయ పక్షాలకి కొమ్ము కాసే విధానం గురించి ఇప్పుడు అందరికీ స్పష్టంగా తెలియడం వల్ల మన నాయకులు, అధికారులు మీడియాకి 'భయపడడాన్ని' తగ్గిస్తారు బహుశా.. ఒక వార్తాసంస్థ ఏదైనా వ్యతిరేక కథనం ప్రసారం చేసినా, మరో సంస్థ దానిని ఖండించే పని చూసుకుంటుంది కదా.. ప్రజాస్వామ్యం తాలూకు నాలుగు మూల స్తంభాల్లోనూ మూడింటి మీద ఇప్పటికే సడలిన నమ్మకం, ఇప్పుడు నాలుగో స్థంభం వైపుకి కూడా విస్తరించింది.

బుధవారం, జనవరి 06, 2010

గాలివాన

కొందరు రచయితలు ఉంటారు.. వాళ్ళ మానాన వాళ్ళు రాసుకు పోతారు.. మిగిలిన విషయాల మీద వాళ్ళకి పెద్దగా దృష్టి ఉండదు. అలాంటి వాళ్ళ రచనలు చదివినప్పుడు మనకి అనిపిస్తుంది, వాళ్లకి రావల్సినంత పేరు రాలేదని. తెలుగు కథకి అంతర్జాతీయ స్థాయి లో పేరు తెచ్చిన పాలగుమ్మి పద్మరాజు గారి కథలు చదివినప్పుడు నాకు అలాగే అనిపించింది. వస్తు వైవిధ్యం మొదలు, భావ వ్యక్తీకరణ వరకూ 'తెలుగు కథ' కి ఒక రిఫరెన్స్ గా చెప్పగలిగిన కథలు రాసినా, ఆయన గురించి అందరికీ తెలిసింది తక్కువ.

పాలగుమ్మి పద్మరాజు రచించిన అరవై ఆరు కథలతో (యాభై తొమ్మిది తెలుగు కథలు, ఏడు అనువాదాలు) విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ గత సంవత్సరం ఒక సంపుటం తెచ్చింది. ఈ సంస్థ ప్రచురిస్తున్న 'పాలగుమ్మి పద్మరాజు రచనలు' సిరీస్ లో మొదటి పుస్తకం ఇది. ఇవన్నీ ఏకబిగిన చదివే కథలు కాదు. చదివి, ఆలోచనల్లో పడి, తేరుకుని, మళ్ళీ చదివి.. మనసుతో పాటు, మెదడుకి పట్టించుకునే కథలు. మొత్తం కథల గురించి చెప్పబోవడం సాహసమే అవుతుంది కాబట్టి, 'గాలివాన' కథ గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.న్యూయార్క్-హెరాల్డ్ ట్రిబ్యూన్ 1956 లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కథల పోటీలో రెండో బహుమతి పొందిన కథ 'గాలివాన.' నాకు తెలిసినంత వరకూ, తెలుగు కథకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మొదటి కథ. ప్రధాన పాత్ర రావుగారు. సంఘంలో గౌరవ ప్రదమైన వ్యక్తి. వకీలుగా పని చేసి, కొడుకు న్యాయవాద పరీక్షలు నెగ్గాక, తన వృత్తిని అతనికి అప్పగించి విశ్రాంత జీవితం గడుపుతూ ఉంటారు. జీవితం పట్ల కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్న రావు గారు తన నలుగురు పిల్లల్నీ చాలా క్రమశిక్షణతో పెంచారు.

రావుగారి క్రమశిక్షణ ఎంతటిదంటే తన ఇద్దరు కూతుళ్ళూ ఎలా తల దువ్వుకోవాలో కూడా ఆయనే నిర్ణయించారు. స్వీయ నియంత్రణల మధ్య జీవితం చాలా సాఫీగానూ, సంతోషంగానూ గడిచిపోతూ ఉంటుంది రావుగారికి. ఉపన్యాసాలమీద ఆసక్తి ఉన్న రావు గారు, వివిధ సంస్థల ఆహ్వానాల మేరకు భిన్న అంశాల మీద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. 'సత్వము-తత్వము' 'ప్రకృతి-పరిష్క్రుతి' ..ఇలా ఉంటాయి ఉపన్యాసాల కోసం ఆయన ఎంచుకునే అంశాలు. ఆయన ఉపన్యాసాల శీర్షికలు శబ్దాలంకారాలను బట్టి నిర్ణయమవుతాయి కానీ అర్ధ స్ఫురణని బట్టి కాదని ఆయన స్నేహితులు కొందరు ఆయన్ని వేళాకోళం చేస్తూ ఉంటారు.

'ఆస్తిక మహా సమాజము' వారి ఆహ్వానం మేరకు 'సామ్యవాదము-రమ్య రసామోదము' అనే అంశం మీద ఉపన్యాసం ఇవ్వడానికి రావుగారు రైల్లో బయలుదేరినప్పుడు చిన్నగా వర్షం మొదలై, ఆయన గమ్యస్థానం చేరేసరికి గాలివానగా తీవ్ర రూపం దాలుస్తుంది. రైల్లో తను బిచ్చం వెయ్యకుండా అసహ్యించుకున్న ముప్ఫై ఏళ్ళ యువతి మాత్రమే ఆయనకి సాయంగా ఉంటుంది ఆ రాత్రి, కూలిపోడానికి సిద్ధంగా ఉన్న వెయిటింగ్ రూములో. క్షణ క్షణానికి ఉద్ద్రుతమవుతున్న గాలివానని చూసి ధైర్యం కోల్పోతారు రావుగారు. కానీ ఆమె దేని గురించీ బాధ పడదు, గాలివానను గురించి కూడా.

"జరుగుతున్న ఆ క్షణంతోనే ఆమెకి సజీవమైన అనుబంధం, గడిచిన కాలపు స్మృతుల బరువుగానీ, రాబోయే రోజుల గూర్చిన ఆశలుగానీ ఆమెకు లేవు. ఆమె నడవడిని నిర్ణయించే సూత్రాలు లేవు. ఆ సూత్రాలలో నిషేధాలసలే లేవు. నిత్యమూ ధర్మాధర్మ చింతతో బాధపడే అంతరాత్మగానీ, నాగరికులకు సహజమయిన సంకీర్ణ మనస్తత్వమగానీ ఆమెకు లేవు.." ఆయన ప్రాణభయంతో వణుకుతుంటే "సరిగ్గా కూకోని నా సుట్టూ సేతులేసుకోండి.. కాంత ఎచ్చగుంటది పాపం!" అనగలదు ఆమె.

ప్రకృతి ప్రళయ భీభత్సాన్ని చూపిన ఆ రాత్రి, ఏ విలువలకీ లొంగని జీవితాన్ని గడుపుతున్న బిచ్చగత్తె, రావుగారు తను నమ్మిన విలువలూ, నియమాలూ, ధర్మచింతా, వేదాంతం.. వీటన్నింటినీ త్యజించడానికి సిద్ధపడేలా ఎలా చేయగలిగిందన్నది కథ చదివి తెలుసుకుంటేనే బాగుంటుంది. పుస్తకం ముందుమాటలో ఏటుకూరి ప్రసాద్ చెప్పినట్టుగా పద్మరాజు గారి కథలు చాలా భాగం పాఠకుల "గుండెకు కాకుండా మెదడుకు గురిపెట్టినవే!" కథలని ఇష్టపడేవాళ్ళు చదివి తీరాల్సిన ఈ 499 పేజీల పుస్తకం వెల రూ. 250, విశాలాంధ్ర అన్ని శాఖల్లోనూ దొరుకుతుంది.

శనివారం, జనవరి 02, 2010

సువర్ణ సుందరి

నేను ఒక సినిమా చూసి ఆ హీరోయిన్ తో ప్రేమలో పడడం అన్నది మొదటిసారి జరిగింది 'సువర్ణ సుందరి' సినిమాతో. హీరోయిన్ అంజలీ దేవి. ఆమెతో ప్రేమలో పడ్డ ముహూర్త బలం ఏమిటో కానీ, నా హీరోయిన్ల జాబితాకి అంతు లేకుండా పోతోంది. పిడకల వేటని పక్కన పెట్టి, అసలు కథ లోకి వస్తే, యాభై రెండేళ్ళ క్రితం వచ్చిన 'సువర్ణ సుందరి' సినిమాని ఆపాత మధురాల్లో ఒక ఆణిముత్యం అనడానికి అభ్యంతర పెట్టే వాళ్ళు ఎవరూ ఉండరేమో.

అంజలీ పిక్చర్స్ పతాకం పై అంజలి భర్త, ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు నిర్మించి, సంగీతం సమకూర్చిన 'సువర్ణ సుందరి' సినిమాకి దర్శకుడు వేదాంతం రాఘవయ్య. టైటిల్ పాత్రని అంజలీ దేవి, ఆమె సరసన కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వర రావు నటించారు. కథాశివబ్రహ్మం గా పేరు పొందిన సదాశివబ్రహ్మం రాసిన జానపద కథలో బోల్డన్ని మలుపులూ, మెలికలూ. మాయలూ, మంత్రాలూ, శాపాలూ, శాప విమోచనాలూ.. ఆద్యంతం ఆసక్తికరం.కథలోకి వస్తే జయంతుడు (అక్కినేని) అనే రాకుమారుడు. ఒకరకంగా ఇతనిది శాపగ్రస్త జీవితం. గురుకులం లో విద్యాభ్యాసం పూర్తవుతుండగానే, తను సోదరిగా తలచిన గురు పుత్రిక ప్రేమిస్తున్నానంటూ వెంట బడుతుంది. తనని కాదన్నందుకు, అత్యాచారం చేశాడని నింద మోపుతుంది. రాజ్యానికి వెళ్తే ఆవేశంలో తండ్రి విధించే శిక్షకి గురి కావాల్సి వస్తుందని రాజ్యం నుంచి పారిపోతాడు. అనుకోకుండా ఒక గంధర్వుడికి శాప విమోచనం కలిగించి, ఎగిరే చాపా, దండం, కమండలం కానుకలుగా అందుకుంటాడు. ఐతే, ఆ కానుకలు దొంగల పాలవుతాయి.

ఓ గుహలో తల దాచుకున్న జయంతుడికి, ఇంద్రలోకం నుంచి శివపూజ కోసం తన చెలికత్తెలతో కలిసి వచ్చిన ఇంద్ర దర్బారు ప్రధాన నర్తకి సువర్ణ సుందరి కంట పడుతుంది. కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజ ముగిశాక జయంతుడిని చూసిన సువర్ణ సుందరి తొలి చూపులోనే అతనితో ప్రేమలో పడిపోతుంది. జయంతుడికి ఒక వేణువుని కానుకగా ఇచ్చి తనని పిలవాలంటే ఆ వేణువు ఊదితే చాలని చెబుతుంది సుందరి. ఏ పనీ లేకుండా తోచీ తోచకా కాలక్షేపం చేస్తున్న జయంతుడు వేళా పాళా లేకుండా వేణువు ఊదేస్తూ ఉంటాడు.

ఒకసారి ఇంద్రలోకంలో నృత్య ప్రదర్శన ముగుస్తూనే కళ్ళు తిరిగి పడిపోయిన సువర్ణ సుందరిని పరీక్షిస్తాడు దేవ వైద్యుడు. (ఏం చెప్పాడో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా ఏమిటి? తెలుగు సినిమాలు చూసే వాళ్ళు సులువుగా ఊహించ గలరు) ఆగ్రహం పట్టలేని ఇంద్రుడు, సుందరికి స్వర్గ లోక ప్రవేశం నిషేధించడంతో పాటు జయంతుడు ఆమెని మర్చిపోతాడని, ఆమె తాకితే అతడు శిలగా మారిపోతాడనీ శాపం ఇస్తాడు. ఆమె బతిమాలితే, ఆమెకి పుట్టిన బిడ్డ వల్ల శాప విమోచనం కలుగుతుందని అమెండ్మెంట్ ఇస్తాడు.

ఇక్కడ భూలోకంలో సువర్ణ సుందరిని మర్చిపోయిన జయంతుడికి, అనుకోకుండా తను గంధర్వుడి నుంచి పొందిన దండం దొరుకుతుంది. అది పట్టుకుని తోచీ తోచకా అడవుల్లో తిరుగుతూ, ఒక పాము నెత్తిన దండంతో మోదుతాడు. ఆ పాము కాస్తా నెత్తురోడే తలతో నాగకన్యగా మారి, పగలు స్త్రీ గానూ, రాత్రి పురుషుడిగానూ మారిపొమ్మని శాపం ఇస్తుంది జయంతుడికి. సువర్ణ సుందరి భూలోకం వచ్చేసి ఒక మగ బిడ్డని ప్రసవిస్తుంది. ఓ ప్రమాదంలో ఆమె ఆ పసిబిడ్దని పోగొట్టుకోడం, ఆ బిడ్డ ఒక వృద్ధ పశువుల కాపరికి (గుమ్మడి) దొరకడం జరుగుతుంది.

విడిపోయిన జయంతుడూ, సువర్ణ సుందరీ, వాళ్లబ్బాయీ ఎలా కలిశారు? జయంతుడి శాపాలు ఎలా విమోచనం అయ్యాయి? అన్నది మిగిలిన కథ. మూడు గంటల ఇరవై నిమిషాల సుదీర్ఘ నిడివి (ఇప్పుడైతే ఇంచుమించు రెండు సినిమాలకి సమానం) గల ఈ సినిమాకి ప్రాణం పోసింది అంజలి నటన, సంగీతం. అసలు ఈ సినిమాకి నాయికా నాయకులు అంజలి, ఆదినారాయణ రావులే అనిపిస్తుంది నాకు. జయంతుడిగా నాగేశ్వర రావుది పాసివ్ పాత్ర. పైగా రెండో సగంలో స్త్రీ గా మారిపోతాడు.

ఆడ జయంతుడిగా రాజసులోచన చేసింది. (నాకు అత్యంత ఇష్టమైన ఒక 'రొమాంటిక్ సాంగ్' లో నటించినందుకు గాను ఈమె అంటే ప్రత్యేకమైన ఇష్టం) సినిమా మొదటి సగంలో దేవకన్యగా సాత్వికాభినయం ప్రదర్శించి, రెండో సగంలో భూలోకంలో సాధారణ స్త్రీగా, బిడ్డకి దూరమైన తల్లిగా, భర్త ఎదురుగా కనిపిస్తున్నా పలకరించలేని భార్యగా కరుణ రసాన్నీ, ఆపై ఒక రాజ్యానికి మంత్రిగా వీర రసాన్నీ అలవోకగా అభినయించింది అంజలి.

'సువర్ణ సుందరి' పాత్ర కోసం ఆమె ఎంపిక చేసుకున్న దుస్తులు, ఆహార్యం ఇప్పటికీ ఆ తరహా పాత్రలకి ఒక రిఫరెన్స్ అనడం అతిశయోక్తి కాదు. ఈ సినిమా చేసేనాటికి ఆమె వయసు ముప్ఫై ఏళ్ళు. నిజజీవితంలో ఇల్లాలు, మాతృమూర్తి. ఇవేవీ 'సువర్ణ సుందరి' పాత్ర పోషణకి అడ్డు రాలేదు. అంజలి నటన తర్వాత చెప్పుకోవాల్సింది ఆదినారాయణ రావు సంగీతం. ఏ ఒక్క పాటనీ తీసేయలేము.

ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే పాట, ఏ టీవీ చానల్లో పాటల పోటీ జరిగినా గ్రాండ్ ఫినాలే లో తప్పక వినిపించే పాట, నాకు అత్యంత ఇష్టమైన పాట 'హాయి హాయిగా ఆమని సాగే..' జిక్కి, ఘంటసాల పాడారు. ఈ పాట ఒక్కో చరణాన్ని, ఒక్కో రాగం లో కంపోజ్ చేయడమే కాక, ఒక్కో సెట్ లో చిత్రీకరించారు. ముఖ్యంగా 'చూడుమా చందమామ..' చరణంలో అంజలిని చూస్తే నిజంగా చందమామే దిగి వచ్చినట్టు అనిపిస్తుంది.

వెంటనే చెప్పుకోవాల్సిన మరో పాట 'పిలువకురా...' సుశీల పాడిన ఈ పాటకి అంజలి అభినయాన్ని చూసి తీరాల్సిందే. ఆమె ఇంద్రసభలో నృత్యం చేస్తూ ఉంటే, జయంతుడు భూలోక ఉద్యానవనంలో ఆపకుండా వేణువు ఊదుతూ ఉంటాడు. "ఇదో నాగేసర్రావూ.. ఆ పిల్ల డేన్సింగులో ఉంది కదా.. అవగానే వస్తుందిలే.. కాసేపు ఆ ఊదడం ఆపు.." అని చెప్పాలనిపిస్తుంది మనకి. సుశీల పాడిన 'నీ నీడలోన నిలచేను రా.' పాటకి కూడా అంతే.. ఆమె ఇంద్ర సభలో నాట్యం చేస్తూనే ఉంటుంది, జయంతుడు వేణుగానం ఆపకుండా కొనసాగిస్తూనే ఉంటాడు. ఈ రెండు పాటలూ ఇంద్రలోకం సెట్లలో చిత్రించారు. (వీనస్ స్టూడియో, అప్పటి బోంబే).

గురు పుత్రిక, ఆమె చెలికత్తెల మీద తీసిన పాట 'బంగారు వన్నెల..' కాగా హాస్య గణం రేలంగి, రమణారెడ్డి, బాలకృష్ణ ల మీద తీసిన పాట 'ఏరా.. మనతోటి గెలిచే వీరులెవ్వరురా..' బిడ్డ దూరం అయినప్పుడు సువర్ణ సుందరి పాడుకునే పాట 'నా చిట్టి పాపా..' (ఎప్పటిలాగే) గుమ్మడి మరణించగానే, అప్పటికి ఐదారేళ్ళ వాడైన పిల్లవాడు రోడ్డున పడడం, తల్లి, స్త్రీ రూపంలో ఉన్న తండ్రి అంతా ఒక చోట చేరినా ఒకరినొకరు గుర్తించుకోలేని సందర్భంలో నేపధ్యంలో వచ్చే విషాద గీతం 'అమ్మా అమ్మాయని..' ఈ మధ్యలో అంజలి బొమ్మలమ్ముతూ పాడే పాట 'బొమ్మాలమ్మా బొమ్మలూ..' అప్పటి సినిమాల పేర్లన్నీ వినిపిస్తాయి ఈ పాటలో.

ఇవే కాకుండా గిరిజ, బృందం మీద చిత్రించిన 'పూబాల పెళ్లి..' రాజసులోచన, గిరిజల మీద తీసిన 'తధీం నన..' రాజసులోచన, రాక్షసుడి మీద తీసిన 'నా నోము పండే ఈనాడు..' అంజలి పై మరో కరుణరస గీతం 'శంభో నా మొర వినవా..' ఉన్నాయి ఈ సినిమాలో. గ్రాఫిక్స్ అంతే ఏమిటో తెలియని ఆ రోజుల్లో చిత్రించిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు చూస్తుంటే ఆశ్చర్య పరుస్తాయి. మనిషి తల, పాము శరీరం తో ఉండే గంధర్వుడు, భారీగా కనిపించే రాక్షసుడు, శాపం వల్ల శిలగా మారిపోతున్న జయంతుడు.. తదితర సన్నివేశాలన్నీ కేవలం ట్రిక్ ఫోటోగ్రఫీ మీద ఆధారపడి తీసినా క్వాలిటీ లో ఎక్కడా నాసిరకంగా అనిపించవు.

కథలో నాయకుడు నాయికని మర్చిపోయే చోట 'శాకుంతలం,' కొడుకు ద్వారా శాప విమోచనం అన్న దగ్గర 'బాలనాగమ్మ' గుర్తొస్తాయి. హాస్యాన్ని కథలో భాగం చేసినప్పటికీ, కొన్ని కొన్ని సన్నివేశాలు మరీ సుదీర్ఘంగా అనిపిస్తాయి. పాత్ర స్వభావం వల్లనో, మరెందువల్లో తెలీదు కానీ అక్కినేని జ్వరం నుంచి అప్పుడే కోలుకున్న వాడిలా కనిపిస్తాడు చాలా చోట్ల. తెలుగులో విజయవంతమైన ఈ సినిమాని హిందీ, తమిళ భాషల్లో పునర్నిర్మించారు. ఆపాత మధురాలని ఇష్టపడేవాళ్ళు మర్చిపోలేని సినిమా ఈ 'సువర్ణ సుందరి.'