అనగనగా ఓ రాజేశ్వరి. ఉత్తి రాజేశ్వరి కాదు,
శ్రీ రాజరాజేశ్వరి. తల్లిలేని పిల్లవ్వడంతో నానమ్మ వెంకాయమ్మ పెంపకంలో
పెరిగి, ఆ చాదస్తం కాస్త వంటపట్టించుకుందన్నది ఆమె తండ్రి శేషాద్రి
ఫిర్యాదు. శేషాద్రికి - సగటు తండ్రుల్లాగే - కూతురంటే తగని ముద్దు. పైగా, ఆ
పిల్ల చిన్నప్పుడు మొదలుపెట్టిన చిన్న కాఫీ హోటలు పెరిగి పెద్దదై 'శ్రీ
రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్' గా అవతరించింది మదరాసు మహానగరంలో. పెళ్ళీడుకి
వచ్చిన రాజేశ్వరికి తగిన వరుణ్ణి చూసి ముడిపెట్టేసి బాధ్యత తీర్చుకునే
ప్రయత్నంలో ఉన్నాడు శేషాద్రి.
అనగనగా ఓ మత్తయ్యగా పిలవబడే మేథ్యూ. బీయే పాసయ్యాడు. చాలామంది బీయేల్లాగా ఉద్యోగం వెతుక్కుంటూ మదరాసు చేరుకున్నాడు. కాలేజీ రోజుల్లో తనంతటి వాడు మరొకడు లేడని విర్రవీగిన మత్తయ్యకి లోకం పోకడ తెలిసి రాడానికి ఆట్టే రోజులు పట్టలేదు. తన బీయే పక్కన పెట్టేసి, స్నేహితుడు నరసింహ శాస్త్రి మేనేజర్ ఉద్యోగం చేస్తున్న హోటల్లో సర్వర్ గా పనికి కుదిరాడు. ఆ హోటల్ మరేదో కాదు 'శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్!'
రాజేశ్వరి వేషం వేసినమ్మాయి జయప్రద కనుక, మత్తయ్యగా
వేసినవాడు కృష్ణ కనుకా (అప్పటికింకా సూపర్ స్టార్ అవ్వలేదు) వాళ్ళిద్దరికీ
పెళ్ళయ్యి, సినిమాకి శుభం పడుతుందని ఊహించడం కష్టమేమీ కాదు కానీ, హోటల్
సర్వర్ - పైగా బోలెడన్ని ఆదర్శాలూ అవీ ఉన్నవాడు - యజమాని కూతుర్ని
పెళ్ళాడిన వైనం తెలుసుకోవాలంటే, అక్కడక్కడా కాస్త సాగతీత అనిపించినా
మొత్తమ్మీద సరదాగా సాగిపోయే 'శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్' సినిమా
చూడాల్సిందే. అనగనగా ఓ మత్తయ్యగా పిలవబడే మేథ్యూ. బీయే పాసయ్యాడు. చాలామంది బీయేల్లాగా ఉద్యోగం వెతుక్కుంటూ మదరాసు చేరుకున్నాడు. కాలేజీ రోజుల్లో తనంతటి వాడు మరొకడు లేడని విర్రవీగిన మత్తయ్యకి లోకం పోకడ తెలిసి రాడానికి ఆట్టే రోజులు పట్టలేదు. తన బీయే పక్కన పెట్టేసి, స్నేహితుడు నరసింహ శాస్త్రి మేనేజర్ ఉద్యోగం చేస్తున్న హోటల్లో సర్వర్ గా పనికి కుదిరాడు. ఆ హోటల్ మరేదో కాదు 'శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్!'
ముప్ఫయ్యేనిమిదేళ్ళ క్రితం విజయా సంస్థ
నిర్మించిన ఈ సినిమా టైటిల్స్ లో దర్శకుడిగా చక్రపాణి పేరూ, సహకార
దర్శకుడిగా బాపూ పేరూ ఉంటాయి కానీ ఏ కొన్ని ఫ్రేములు మాత్రమే చూసిన
వాళ్ళకైనా సులువుగా అర్ధమైపోతుంది ఇది బాపూ సినిమా అని. అనేక సినిమాలకి కథ,
మాటలు, పాటలు అందించినా అతికొద్ది సినిమాలకి మాత్రమే తన పేరు
ప్రకటించుకోగలిగిన 'తెరచాటు రచయిత' పాలగుమ్మి పద్మరాజుకి టైటిల్ కార్డ్
ఉన్న సినిమా ఇది. సంగీతం సమకూర్చిన పెండ్యాల నాగేశ్వర రావు పేరు ప్రత్యేకంగా
చెప్పుకోవాల్సిందే. ఈ సినిమాలోవి కనీసం మూడు పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే
ఉంటాయి మరి.
కథలోకి వచ్చేస్తే, క్రిష్టియన్ అని తెలిస్తే
బ్రాహ్మణ హోటల్లో ఉద్యోగం దొరకదు కాబట్టి నరశింహ శాస్త్రి (పద్మనాభం) సలహా
మేరకి ముత్తయ్యగా పేరు మార్చుకుని హోటల్లో చేరి, తన బీయే జ్ఞానం సర్వర్
పనికి సరిపోక శేషాద్రి ఆగ్రహానికి గురయ్యి ఉద్యోగం పోగొట్టేసుకుంటాడు మత్తయ్య.
మళ్ళీ శాస్త్రి సలహానే పాటించి, రాజేశ్వరిని మంచి చేసుకుని ఆమె సిఫార్సు
సంపాదించడం కోసం శేషాద్రి ఇంటికి బయల్దేరతాడు. అదీ ఎప్పుడూ, రాజేశ్వరి
తనకి రాబోయే వాడిని గురించి కలలుకంటూ 'రాకోయీ అనుకోని అతిథీ' అని
రాగయుక్తంగా పాడుకుంటున్నప్పుడు. రాజేశ్వరి కన్నా ముందు వెంకాయమ్మ (జి.
వరలక్ష్మి) కి నచ్చేస్తాడు ముత్తయ్య దీక్షితులు.
జయప్రదంతటి
కూతురు గోముగా 'నా..న్నా' అని బతిమాలినా ముత్తయ్యని మళ్ళీ హోటల్లో పనికి
పెట్టుకోనని కుండ బద్దలు కొట్టేస్తాడు శేషాద్రి ('కళా వాచస్పతి' కొంగర
జగ్గయ్య). కావాలంటే అతని దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోమని సలహా ఇస్తాడు
కూతురికి. ముత్తయ్యకి ఉద్యోగం దొరికితే అంతే చాలని ఇంగ్లీష్ పాఠానికి
ఒప్పేసుకుంటుంది రాజేశ్వరి. చూడముచ్చటైన ఎక్స్ ప్రెషన్లతో కృష్ణ, జయప్రదకి
'సీఏటీ కేట్ పిల్లి.. డీఓజీ డాగ్ కుక్క' అంటూ ఇంగ్లీష్ పాఠం చెప్పడాన్ని
సినిమాలో చూడాలే తప్ప, మాటల్లో చెప్పడం కష్టం.
వెంకాయమ్మకి
నచ్చేశాడుగా ముత్తయ్య దీక్షితులు.. అవకాశం దొరకబుచ్చుకుని మరీ 'ఏరా అబ్బీ..
నియోగులా? ఆరువేలా? గోత్రం ఏవిటీ?' అంటూ పాపం మత్తయ్యకి ఏమాత్రం అర్ధం
కాని ప్రశ్నలతో వేధించేస్తూ ఉంటుంది. ఏవో తిప్పలు పడుతూ ఉంటాడు -
ఇంటిదగ్గర వృద్ధులైన తల్లిదండ్రులు, పెళ్లికెదిగిన చెల్లెలు వగయిరా
బాధ్యతలని జ్ఞాపకం చేసుకుంటూ. పగటిపూట రాజేశ్వరికి పాఠాలు చెబుతూ
రాత్రుళ్ళు ఆమె వినేలా 'నా పేరు బికారి.. నా దారి ఎడారి' అని పాడుకుంటూ కాలం
గడుపుతున్న ముత్తయ్యకి ఇంటినుంచి ఉత్తరం వస్తుంది, చెల్లెలి పెళ్లి
కుదిరిందంటూ.
చెల్లెలికి కాబోయే మావగారైన 'సుగుణమ్మ మొగుడు'
(అల్లు రామలింగయ్య) కుండమార్పిడి చేయాల్సిందే అంటాడు. ఆ ప్రకారం, అతని
కూతురు రోసీ (రమాప్రభ) ని మత్తయ్యకిచ్చి పెళ్లిచెయ్యాలి. ఈ సంగత్తెలియని
రాజేశ్వరి ముత్తయ్యని ప్రేమించేసి 'ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంటా' అని
పాడేసుకుంటుంది (మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం, ఈ ఒక్ఖ పాటకీ!). మత్తయ్య రహస్యం రాజేశ్వరికి తెలిసిందా? నిప్పులు కడిగే
వెంకాయమ్మ, శేషాద్రి ఏమన్నారు? శేషాద్రి తనలోనే దాచుకున్న రహస్యం ఏమిటి?
ఇత్యాది ప్రశ్నలకి జవాబులిస్తూ ముగుస్తుంది సినిమా.
ఈ
సినిమాకి తెరవెనుక బాపూ, తెరమీద జయప్రద.. అంతే. చక్రపాణి సెట్ లో లేనప్పుడు
(బాత్రూం కి వెళ్ళినప్పుడు) తనో షాట్ తీస్తే, తిరిగివచ్చి 'ఏం?
నేనొచ్చేదాకా ఆగలేవా?' అన్నారని రాసుకున్నారు బాపూ, 'కొసరు కొమ్మచ్చి' లో.
ముందే చెప్పినట్టు, బాపూ మార్క్ ప్రతి సీన్లోనూ కనిపిస్తూనే ఉంటుంది. ఇక,
పద్నాలుగేళ్ళ జయప్రదకి కెరీర్ మొదట్లో దొరికిన మంచి సినిమాల్లో ఇదొకటి.
అమాయకమైన అమ్మాయి రాజేశ్వరిగా జయప్రద ఎలా ఉంటుందంటే - అన్ మేరీడ్
కుర్రాళ్ళూ, బేచిలర్లూ కూడా ఈ సినిమా చూడకపోవడం మంచిదని ఓ ఉచిత సలహా.
జయప్రద తర్వాత చెప్పుకోవాల్సింది వరలక్ష్మి గురించి. అలవోకగా నటించేసింది.
మిగిలిన వాళ్ళ గురించి ప్రత్యేకం చెప్పాల్సింది ఏముంది. సెలవు రోజున సరదాగా
చూడచ్చీ సినిమాని.
ఇక చుడక్కర్లేదండి కళ్ళకు కట్టినట్లు చూపించారు .
రిప్లయితొలగించండికిందటి వారమే ఎందుకో చూడాలనిపించి చూసానండీ...నియోగులా? ఆరువేలా అంటే మా తాతల కాలం లో లక్షల్లోనే వుండేదండీ, ఇప్పుడు వేలల్లోకొచ్చేసింది అన్న చోట తెగ నవ్వొచ్చింది :). జయప్రద గురించి చెప్తే మీరో పప్పు గారో నే చెప్పాలి :)
రిప్లయితొలగించండిజయప్రద ఎలా ఉంటుందంటే - అన్ మేరీడ్ కుర్రాళ్ళూ, బేచిలర్లూ కూడా ఈ సినిమా చూడకపోవడం మంచిదని ఓ ఉచిత సలహా
రిప్లయితొలగించండి@తనూజ అంజలి: అబ్బే.. లేదండీ.. సినిమా చూడాల్సిందే :) ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@స్ఫురిత మైలవరపు: నేను కాదండీ, పప్పు గారే చెప్పాలి!! ధన్యవాదాలు
@రఘు: :)) ..ధన్యవాదాలండీ.