మంగళవారం, మార్చి 26, 2019

బీ'జేపీ'

సరిగ్గా ఇరవై ఏడు రోజులుంది, నేనివాళే ఎదురు చూడడం మొదలు పెట్టిన ఒక ఎన్నిక జరగడానికి. దేశం, రాష్ట్రం, నియోజకవర్గం వగయిరా ఎన్నికల మీద నాకు పెద్దగా దృష్టి లేదు. ప్రచారార్భాటాలు చూడడం, స్నేహితుల చర్చలు వినడం, పేపర్లో విశ్లేషణల్లాంటివి చదవడం జరుగుతున్నాయి కానీ, ఏం జరిగిపోతుందో అన్న ఉత్కంఠ, కుతూహలం పెద్దగా లేవనే చెప్పాలి. నిజానికి అవి లేకుండానే ఈ ఎన్నికల సీజన్ గడిపేసే వాణ్ణే కానీ ఉత్తరప్రదేశ్ లో రాంపూర్ పార్లమెంటు స్థానం అలా వీల్లేదు పొమ్మంటోంది.

గత కొంతకాలంగా రాజకీయాల విషయంలో మౌనంగా ఉంటున్న జయప్రద ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం, ఆమెని రాంపూర్ లోక్ సభ స్థానం నుంచి అభ్యర్థిగా ప్రకటించడం వెనువెంటనే జరిగిపోయాయి. ములాయం సింగ్ - అమర్ సింగ్ ల మధ్య మొలకెత్తిన విభేదాలు పెరిగి పెద్దవైనప్పుడూ, ఆ మిత్రులిద్దరూ బద్ధ శత్రువులుగా మారినప్పుడూ ఎక్కువగా ఇబ్బంది పడింది జయప్రదే. జాతీయ రాజకీయాల్లో తనకి గురు సమానుడైన అమర్ సింగ్ వెనుకే అప్పట్లో ఆమె స్థిరంగా నిలబడింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి నేర్చుకున్న పాఠం ఆమెకి ఉపయోగపడి ఉండొచ్చు బహుశా.

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు  ఎన్టీ రామారావుతో వెండితెరని పంచుకున్న జయప్రద, ఆయన పిలుపుతోనే పార్టీలో చేరి 1994 ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పటికే ఆమెకి నాయికగా అవకాశాలు తగ్గడం, అక్క, వదిన పాత్రల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఎన్నికల తర్వాత రాజకీయాలకి పూర్తి సమయం కేటాయిచారు. ఎన్టీఆర్ వెన్నుపోటు, అనంతరం జరిగిన అధికార మార్పులో జయప్రద అనూహ్యంగా ఎన్టీఆర్ వైపు కాక, చంద్రబాబు నాయుడు పక్షాన చేరారు. అయితే, కొంత కాలానికే అత్యంత అవమానకర పరిస్థితుల్లో పార్టీ నుంచి ఆమె నిష్క్రమణ జరిగింది. 

(Google Image)
హిందీ సినిమాల్లో నాయికగా నటించి ఉత్తరాది వారికి దగ్గరవడంతో పాటు, అమితాబ్ బచ్చన్ వంటి రాజకీయ సంబంధాలున్న కథానాయకులతో ఉన్న స్నేహం కారణంగా జాతీయ రాజకీయాల్లో కాలూనుకున్నారు జయప్రద. అమితాబ్ స్నేహితుడు అమర్ సింగ్ ఆమెకి రాజకీయ గురువయ్యాడు. రాంపూర్ లోక్ సభ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున 2004 ఎన్నికల్లో పోటీ చేసిన జయప్రద భారీ మెజారిటీతో గెలుపొందారు. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి పోటీ చేసి తక్కువ మెజారిటీతో గట్టెక్కారు. ఎన్నికలు జరిగిన మరుసటేడే (2010) సమాజ్ వాదీ పార్టీలో చీలిక రావడంతో అమర్ సింగ్ తో కలిసి పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. 

ఇటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికలు జరగడంతో, తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపినా, ఎందుచేతనో ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు జయప్రద. తాజా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆమె రాజకీయ ప్రవేశం గురించి వార్తలు వస్తున్నా, ఆమె వెళ్ళేది ఎటు అన్న విషయంలో ఇవాళ్టి వరకూ స్పష్టత రాలేదు. జరుగుతున్న ఎన్నికలు బీజీపీకి గత ఎన్నికలంత కేక్ వాక్ కాదని వార్తలు వినిపిస్తున్న సమయంలో జయప్రద ఆ పార్టీలో చేరడం ఆసక్తి కలిగించింది. వరుసగా రెండు సార్లు 'రాంపూర్ కీ రాణీ' కిరీటాన్ని ధరించిన ఈ నిన్నటితరం వెండితెర కలల రాణి భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నది మరికొద్ది వారాల్లో తెలియనుంది.

ఆమె, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఎన్నికల్లో విజయం సాధించినట్టైతే రాబోయే కేంద్ర మంత్రివర్గంలో జయప్రద పేరు చేరడానికి అవకాశాలు ఎక్కువే. స్వరాష్ట్రంలో అవమానాలు ఎదుర్కొన్న ఆమెకి లభించబోయే గొప్ప గౌరవం అవుతుందది. భవిష్యత్తు సంగతి ఎలా ఉన్నా, వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నప్పటికీ వాటిని తట్టుకుని నిలబడుతూ, ప్రతిసారీ తనని తాను నిరూపించుకుంటూ వస్తున్న నా అభిమాన తారని చూసి కించిత్తు గర్వపడుతున్న మరో సందర్భం ఇది. There is a long way to go, Jayaprada...