సోమవారం, మార్చి 27, 2017

విశ్వనాథ 'చిన్న కథలు'

'కవి సమ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ పేరు తలచుకోగానే 'వేయిపడగలు' లాంటి బరువైన రచనలు గుర్తుకురావడం సహజం. అప్రతిహతంగా సాగిపోయే ఆయన రచనా ధోరణిని గమనించిన వారెవరికైనా విశ్వనాథ చిన్న కథలు రాశారు అనగానే ఒక సందేహం, ఒకింత ఆశ్చర్యం కలగడం సహజం. పాతిక ముప్ఫయి పేజీల నిడివి ఉన్న కథలు రాసేసి వాటికి చిన్న కథలన్న పేరు పెట్టేసి ఉంటారన్న సందేహం కలగడమూ కద్దు. వీటన్నింటికీ జవాబు శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ ప్రచురించిన 'చిన్న కథలు' సంకలనం. ఒక్క పేజీ మొదలు పది పన్నెండు  పేజీల వరకూ నిడివి ఉన్న మొత్తం ముప్ఫయి ఒక్క కథలున్నాయీ సంకలనంలో.

ఇప్పటికే అనేక కథా సంకలనాల్లో ప్రచురితమైన 'జీవుని యిష్టము' మొదలు, స్వలింగ సంపర్కం ఇతివృత్తంగా తీసుకుని రాసిన 'ఇంకొక విధము' వరకూ ప్రతి కథా దేనికదే ప్రత్యేకమైనది. 1926 మొదలు 1960 మధ్య కాలంలో అనేక పత్రికల్లో ప్రధమ ముద్రణ పొందిన ఈ కథలని అదే వరుసక్రమంలో సంకలనం చేయడంతో పాటు, తొలిముద్రణ తాలూకు వివరాలని ప్రచురించడం పాఠకులకి మంచి వెసులుబాటు. మొదటిసారి చదవగానే నిగూఢంగా అనిపించే కొన్ని కథలు, ప్రచురణ తేదీని ఆధారంగా చేసుకుని నాటి సామాజిక, రాజకీయ పరిస్థితులని దృష్టిలో ఉంచుకుని చదవడం ద్వారా రచయిత హృదయాన్ని గ్రహించడానికి ఈ తేదీలు ఉపయుక్తమవుతాయి.

శాతవాహనుల కాలంలో ఆంధ్రదేశం అత్యంత ధనిక దేశం. రోమ్ దేశానికి చెందిన అందమైన యువతులు ఆంధ్ర చక్రవర్తులకి చామరగ్రాహిణులు పనిచేసే నిమిత్తం సముద్రాలు దాటి వచ్చేవారు. ఒక్క యువతికి చామరగ్రాహిణి (చక్రవర్తికి వింజామర వీచే పని) ఉద్యోగం దొరికినట్టయితే రోమ్ లో ఆ కుటుంబం దశ తిరిగినట్టే. చక్రవర్తి పంపే నజరానాలతో వాళ్ళో చిన్నసైజు జమీందారులుగా మారాల్సిందే. గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి దగ్గర ఆ ఉద్యోగంలో చేరి, చక్రవర్తి  మీద మనసు పడిన హెలీనా కథే 'చామరగ్రాహిణి.' నీగ్రోల పాలిట దేవుడిగా మారిన హిషీఖేయ్ కథ 'య్యో ర్హిషీ ఖేయ్' కాగా, స్త్రీలు మోహించేంతటి సౌందర్యవంతుడైన గ్రీకు యువకుడి కథ 'డయాన్ థస్.'


భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగంతో పాటు వారి అలకలు గృహ ఛిద్రాలు మెజారిటీ కథలకి ఇతివృత్తాలు. అందం విషయంలో భార్యాభర్తల మధ్య పోటీ అన్నది సంకలనంలో మొదటి కథ 'భావనా సిద్ధి' ఇతివృత్తం. పేదింటి అంధురాలు రాధని వివాహం చేసుకున్న ఆస్థిపరుడైన చంద్రశేఖరరావు కథ 'పరిపూర్తి.' అందగాడు, చదువుకున్న వాడు, ధనవంతుడు అయిన చంద్రశేఖర రావుకి తనమీద నిజంగానే ప్రేమ ఉందా అన్నది రాధ సందేహం. ఆమె సందేహ నివృత్తే కథకి ముగింపు. ఆదర్శాలు ఉన్నప్పటికీ ఇంట్లో వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి, చదువు పూర్తి కాకుండానే శకుంతలని వివాహం చేసుకుని, ఆమె గర్భవతిగా ఉండగా నిజాం వ్యతిరేకపోరాటంలో పాల్గొని జైలుకెళ్లిన రాముడు, ఫలితాన్ని అనుభవించిన శకుంతలల కథ 'శకుంతల విధికి ఎవరు కర్తలు."

ప్రత్యేకంగా అనిపించే కథల్లో మొదట చెప్పుకోవాల్సింది 'ద్విజాత,' ఓ సినీనటి కథ! పాత తెలుగు సినిమాలతో ఏ కొంచం పరిచయం ఉన్న వాళ్ళకైనా కథ చివరికి వచ్చేసరికి ఆ నటి ముఖం కళ్ళకి కడుతుంది. చదివిన ప్రతిసారీ కొత్తగా అనిపించే కథ 'మాక్లి దుర్గంలో కుక్క.' తాత్విక ప్రధానంగా సాగే కథ 'ఏమి సంబంధము.' ఈ కథ ముగింపు బాగా వెంటాడుతుంది. వ్యవస్థ మీద వ్యంగ్య బాణాలేసే కథలకీ లోటు లేదు. 'రాజు,' 'పరిశోధకులు' లాంటివి మచ్చుకి కొన్ని. నవ్య కథనరీతులుగా ప్రచారంలో ఉన్న కథా రచనా పద్ధతులని విశ్వనాథ విరివిగా ఉపయోగించారనడానికి నిదర్శనంగా 'వెలుగు మెట్లు' లాంటి కథల్ని చూపొచ్చు.

మొత్తం మీద చూసినప్పుడు, విశ్వనాథ విస్తారంగానే కాక క్లుప్తంగా, పొదుపుగా కూడా రాయగలరు అని నిరూపిస్తుందీ పుస్తకం. వస్తువైవిధ్యం మాత్రమే కాదు, కథను నడపడంలోనూ ఏ కథకి ఆ కథ ప్రత్యేకంగా ఉండేలా తీర్చిదిద్దారు రచయిత. తొలినాటి కథలతో పోలిస్తే రానురాను గ్రాంధికం తగ్గి, వ్యావహారిక పలుకుబళ్లు పెరగడం ఈ కథల్లో చూడొచ్చు. కథా సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళు తప్పక చదవాల్సిన ఈ పుస్తకం, విశ్వనాథ రచనల్ని చదవడం ఆరంభించాలనుకునే వారికి చక్కని ప్రారంభం అవుతుంది. నవలారచయితగా కన్నా, కథకుడిగా విశ్వనాథ ప్రత్యేకమని తెలిసిందీ పుస్తకం వల్ల. (పేజీలు 216, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శుక్రవారం, మార్చి 24, 2017

దాహం -2

(మొదటిభాగం తర్వాత...)

అడుగుల వేగం నెమ్మదించడం తెలుస్తోంది నాకు. ఒళ్ళంతా చిన్నగా చెమటలు పడుతున్నాయి. కారెక్కడో దూరంగా కనిపిస్తోంది. అక్కడివరకూ నడిచి వెళ్లి, ఇంటి వరకూ డ్రైవ్ చేసుకుని వెళ్లి.. నీళ్లు తాగకుండా అంతసేపు ఉండగలనా? ఈ ఆలోచన రావడంతోనే ఉన్న ఓపిక కూడా పోయి, రోడ్డు పక్కన ప్లాట్ఫామ్ మీద కూర్చుండి పోయాను.

కోడలేదో అందని మూడ్ పాడు చేసుకోవడం, పనులన్నీ పక్కన పెట్టి ఇలా ఒక్కడినీ బయటికి రావడం.. ఇదంతా బొత్తిగా తెలివితక్కువగా అనిపిస్తోందిప్పుడు. కానీ, ఏం లాభం. ఇప్పుడు కావాల్సింది తర్కం కాదు, గుక్కెడు నీళ్లు.

నాలుకని పిండి నోరు తడి చేసుకోడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల ఫలితం కనిపించడం లేదు. బట్టతల మీంచి ముఖం మీదకి చెమట ధార పెరిగింది. నా సామ్రాజ్యం లోనే నేను దిక్కులేని చావు చచ్చిపోతానా?  వేల కుటుంబాలకి బతుకుతెరువు చూపించినందుకు నాకు మిగులుతున్నది ఇదా? దేవుడి మీద నాకెప్పుడూ నమ్మకం లేదు కనుక, ఒకవేళ ఇవే నా చివరి క్షణాలైతే నేను తల్చుకోవాల్సింది అమ్మనే.

వేసవి సెలవుల తర్వాత బడి తెరిచినరోజున, ఇడ్లీలమ్మి ఇంటికి రాగానే బడికి వెళ్ళమంది అమ్మ. చెల్లెళ్ళనిద్దరినీ పంపించమని, నా ఆలోచన అమ్మకి చెప్పాను.

"బావున్నాదిగానీ అబ్బయ్యా, నీ సదువు ముక్యం" అందికానీ, నే చదువుకి వెళ్తే సంపాదన తగ్గుతుందని తెలుసు తనకి.

ఆ మర్నాటి నుంచీ నేను ఇడ్లీలు పట్టుకెళ్ళలేదు. మా ఇంట్లోనే ముందు గదిలో హోటల్ మొదలు పెట్టాం. అప్పటికే మా ఇడ్లీలు, ఉల్లిగారెల రుచికి అలవాటు పడి ఉన్నారేమో, ఊళ్ళో వాళ్ళు వచ్చి తిని వెళ్ళేవాళ్ళు. రావడానికి ఇష్టపడని వాళ్ళు, పొట్లాలు తెప్పించుకునే వాళ్ళు. వంట, ప్లేట్లు కడగడం అమ్మ చూసేది, నేను సప్లై చేసి, డబ్బు పుచ్చుకునేవాణ్ణి.

ఏడాది గడిచేసరికి డబ్బుల వ్యవహారం మొత్తం నాకు అర్ధమయిపోయింది. మరో ఏడాది గడిచాక, "బోజనం కూడా పెడితే ఇంకా డబ్బులమ్మా" అన్నాను.

"ఈ ఊల్లో అన్నం ఎవరు కొంటారు అబ్బయ్యా?" అంది అమ్మ. ఆమాటతో డబ్బు జాగ్రత్త బాగా పెరిగింది నాకు.

మరి రెండేళ్లు గడిచేసరికి టౌన్లో హోటల్ పెట్టగలమని నమ్మకం వచ్చింది అమ్మకీ నాకూను. అప్పటికే రాకపోకలు మొదలెట్టాలని చూస్తున్న బంధువులు, ఏదోరకంగా మా పక్కన చేరేందుకు ప్రయత్నాలు గట్టి చేశారు. అమ్మ సరేనంటే నేనేం చేసేవాడినో తెలీదు కానీ, నాన్న పోయినప్పుడు వాళ్ళేం చేశారో నేనే కాదు, అమ్మ కూడా మర్చిపోలేదు.

ఊళ్ళో కన్నా టౌన్లో ఎక్కువ డబ్బులొస్తాయని అనుకున్నాం కానీ, మేం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ డబ్బులే రావడం మొదలయ్యింది. డబ్బుతో పాటే ఖర్చులు కూడా. ఊళ్ళో ఎప్పుడూ రౌడీ మామూళ్లు, పోలీసు మామూళ్లు ఇవ్వలేదు. కానీ, టౌన్లో అవి ఇవ్వకుండా పని జరగదు.

ఇవేకాక, పనివాళ్ళ రాజకీయాలు... గ్రూపులు కట్టి సరిగ్గా పని చేయకపోవడం, మానేస్తామని బెదిరించడం.. ఇవన్నీ కూడా నాకు వయసుకు మించి పెద్దరికం తెచ్చేశాయి. అమ్మ సంగతి సరేసరి. చెల్లెళ్ళిద్దరికీ హైస్కూలు చదువు అవుతూనే సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసేశాక, హోటల్ని పెద్దది చేయడం మీద దృష్టి పెట్టాను.

"పెద్దయ్యాక సదువుతానన్నావు అబ్బయ్యా" అమ్మ గుర్తు చేసింది. పేరు చివర ఓ డిగ్రీ ఉండడం ఎంత అవసరమో నాకూ అప్పుడప్పుడే తెలుస్తూ ఉండడంతో ఇక ఆలస్యం చేయలేదు. దిగిన తర్వాతే తెలిసింది తెలిసింది, చదువు కూడా ఓ దాహమేనని.

'దాహం' అన్న మాట తలచుకోగానే నీళ్ల చప్పుడు వినిపించినట్టుగా భ్రమ కలిగింది. ఇప్పుడు, ఇక్కడకి నీళ్ళెందుకు వస్తాయి? నాకు భ్రమలు కూడా మొదలవుతున్నాయా.. ఇందులోనుంచి బయటపడడం ఎలా? ప్లాట్ఫామ్ ని రెండు చేతుల్తో నొక్కి పట్టుకుని అరికాళ్లని రోడ్డుకి ఆనించి ఒంట్లోకి శక్తి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుండగా నీళ్ల చప్పుడు మరింత దగ్గరగా వినిపించింది.

పరికించి చూస్తే కొంచం దూరంగా ఓ ఆడమనిషి, పైపుతో మొక్కలకి నీళ్లు పెడుతోంది. ఆమె నావైపు చూసింది. నీళ్లు కావాలన్నట్టుగా సైగ చేసి, వాలిపోకుండా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆమె పైపుతో సహా పరుగున వచ్చింది "అయ్యో.. ఇయ్యి తాగే నీలు కాదు.." అంటూ. పర్లేదన్నట్టుగా సైగ చేసి, దోసిలి పట్టాను.

ఒక్కో గుక్కా నీళ్లు లోపలికి వెళ్తూ ఉంటే పోయిన శక్తంతా తిరిగి సమకూరుతున్నట్టుగా ఉంది. చివరి దోసిలి నీళ్లు ముఖాన జల్లుకుని, చొక్కా చేత్తో తుడుచుకునేసరికి ఇప్పుడు నేనెవరో ఏమిటో పూర్తిగా గుర్తొచ్చింది. అప్పుడు చూశానామెని. నడివయసు మనిషి. మెళ్ళో తాడుకి మా కంపెనీ ఐడెంటిటీ కార్డు వేలాడుతోంది. గార్డెన్ వర్కర్. పైపు మొక్కల్లో పెట్టి ఆమె కూడా నా వైపే చూస్తోంది.

"పనోడివా, బయిటోడివా అయ్యా? నీ కార్టేది? కార్టు లేకుండా ఎవలూ రాటానికి లేదని తెల్దా ఏటీ.. పెద్ద రాచ్చసుడు సూత్తే సంపి పాతరేసేత్తాడు..." నా ఆకారం చూసి, నన్ను 'పెద్ద రాక్షసుడు' గా గుర్తుపట్టకపోవడం లో ఆశ్చర్యం లేదు. ఏమీ చెప్పకుండా ప్రశ్నార్థకంగా చూశాను.

"కోట్లు సంపాదిచ్చేడు.. ఏం లాబం.. పిల్లికి బిచ్చం పెట్టడు. ఇన్ని మొక్కలున్నాయిగదా.. ఒక్కటైనా పూలు, పల్లు ఇచ్చేదున్నాదా? పనోలు తాగటాకని ఒక్క మంచి నీల కులాయి ఏయించగలిగేడా?" నాకెందుకో ఆమె మీద కోపం రావడం లేదు. "ఆయమ్మ శాలా మంచిదంట. దేవుడూ, బక్తీ ఉన్నాడంట.. ఆ పూజలే కాస్తన్నాయి రాచ్చసుణ్ణి..." వినడానికి తనలాంటి మనిషి దొరికాడు చాలన్నట్టు ఆమె చెప్పుకుపోతోంది.

అవును, ఆమె చాలా మంచిది. నాకు డిగ్రీ చేతికి రావడంతోనే సంబంధాలు చూడడం మొదలు పెట్టింది అమ్మ. కులంలో పెద్ద వాళ్ళు పిల్లనిస్తామంటూ ముందుకొచ్చారు. అమ్మకి పెద్దింటి సంబంధం కలుపుకోవడం ఇష్టం లేదు. అందగత్తె అయిఉండాలి, మంచీ చెడ్డా తెలిసి ఉండాలి, ఓ మాటన్నా పడేలా ఉండాలి.. ఇలా ఆవిడ లెక్కలు ఆవిడకున్నాయి.

నిజం చెప్పాలంటే చెల్లెళ్ళ పెళ్లిళ్ల కన్నా నాకు సంబంధం చూడ్డానికే ఎక్కువ కష్టపడింది. వచ్చినామె నాకన్నివిధాలా సరిజోడీ అన్నది కళ్లారా చూసి నిర్ధారించుకుని, నడివయసులోనే లోకం విడిచి వెళ్ళిపోయింది అమ్మ. డిగ్రీ ఇచ్చిన తెలివితేటలతో నేను కేవలం హోటల్ వ్యాపారానికే పరిమితం అయిపోవాల్సిన అవసరం లేదని తెలుసుకున్నాను.

ఇద్దరు కొడుకులు పుట్టే వరకూ ఆమె ఇంటిపట్టునే ఉండిపోయింది. ఆ తర్వాత, వ్యాపారంలో నాకు సహాయానికి వచ్చింది. అప్పటినుంచీ నా వ్యాపారం మునుపటికన్నా చాలా వేగంగా విస్తరించడం మొదలుపెట్టింది. నా ఎదుగుదల సహించలేని వాళ్ళు ఆమెని గురించి ఏవేవో మాట్లాడ్డం మొదలుపెట్టారు, అన్నీ నా వెనుకే. వాటిని నేను పట్టించుకోదల్చుకోలేదు.

వ్యాపారంతో పాటు ఇంటినీ చక్కదిద్దిందామె. ఇద్దరు కొడుకులనీ క్రమశిక్షణలో పెట్టడమే కాదు, బయటి నుంచి వచ్చిన కోడళ్ళకి కూడా మా క్రమశిక్షణ అలవాటు చేసింది. మనవలు బయల్దేరాక ఆమె దృష్టి ఉన్నట్టుండి దేవుడివైపు తిరిగింది. గుళ్ళు, గోపురాలు చుట్టడం మొదలు పెట్టింది. ఆమె నన్ను రమ్మనలేదు, నేనామెని వద్దనలేదు.

మా సర్కిల్లో అందరికీ పూజాపునస్కారాల విషయంలో ముఖ్య సలహాదారు ఆమే. అంతే కాదు, ఎవరింట్లో పెళ్లి జరిగినా నూతన వధూవరులని మొదటగా ఆశీర్వదించవలసిన దంపతులం మేమే. ఆమె మంచిదనడంలోనూ, అందరూ ఆమెని మంచిదనుకోడంలోనూ ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఎటొచ్చీ, ఆమె మంచితనం మా సర్కిల్ ని దాటుకుని ఈమెవరకూ రావడమే కొంచం ఆశ్చర్యంగా ఉంది.

"ఆయమ్మి దేవతంట.. ఏం లాబం.. రాచ్చసుడి పాలబడ్డాది. ఇంతకీ అయ్యా, పన్లో చేరతాకొచ్చేవా? మీవోల్లని సూత్తాకొచ్చేవా?" నాకు డిసిప్లిన్ గుర్తొచ్చింది. పని మాని ఆమె నాతో కబుర్లు చెప్పడం కోపం తెప్పించింది. అయితే అది ఒక్క క్షణమే. ఆమెతో మాట కలపాలనిపించింది. "ఇంతమందికి పనిచ్చినోడు రాచ్చసుడు ఎందుకయ్యాడో?" అన్నాను, వీలైనంతవరకూ ఆమెనే అనుకరిస్తూ.

"ఓరయ్యా.. సూత్తాకి ఎర్రిబాగులోల్లాగున్నావు. ఎట్టాగ బతుకుతున్నావో ఏటో. ఉజ్జోగం సరే, సుకవెక్కడున్నాది? ఇయ్యాలున్నా పని రేపుంటాదో లేదో తెల్దు. వొచ్చిన జీతంలో సూపరైజర్లకి మామూల్లిచ్చుకోవాలి.. ఇవలేదనుకో ఏదో వొంకెట్టి బయిటికి తోలేత్తారు.. లోపల మనమాటినేవోడెవడు?" ..ఇది నాకు కొత్తవిషయం.

"ఈ సంగతి పక్కనెట్టు.. అంత సంపాదిత్తన్నాడు గదా? ఎవరి కట్టం.. మనందరిదీని. మనకేటన్నా అయితే సూత్తారా సెప్పు? సెరుగ్గడల్లా లోనకొత్తాం.. పుప్పిలాగా బయటికెలతాం.. బయిటేమో పేరుగొప్ప.. ఇక్కడసూత్తే ఇల్లాగ.. ఎల్లలేం.. ఉండలేం.. దీపంపురుగుల బతుకు" చివరిమాటకి ఉలిక్కిపడ్డాను ఓ క్షణం. మూడోకొడుకులందరూ వరసగా గుర్తొచ్చారు.

"ఇదుగో.. ఇంక బయిల్దేరు.. ఎవురన్నా సూసేరంటే ఎదవ గొడవ. పని మానేసి కబుర్లెట్టేనని నా జీతం కోసీగల్రు. జాగర్తగ ఎల్లొచ్చెయ్యి. లోపలున్నంచేపూ కార్టు మెల్లో యేసుకోవాలి.. మర్సిపోకు.." నాకెందుకో ఆమెతో మరికొంచం సేపు మాట్లాడాలనిపించింది.

"పెద్ద రాచ్చసుడు నీకెదురు పడ్డాడనుకో, ఏం చెబుతావు?" సాధ్యమైనంత నవ్వులాటగా అడిగాను. నన్నోసారి ఎగాదిగా చూసి, విసురుగా అందుకుంది..

"ఏం సెబుతానా.. సంపాదిచ్చింది సాలోరయ్యా.. నలుగురికి సాయం సెయ్యిటం నేర్సుకో అంజెబుతాను.. సాలా?" అంటూనే పైపు తీసుకుని చరచరా నడిచింది.

ఆమె నాలుగడుగులు వేసిందో లేదో, రౌండ్స్ కి వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్ నన్నక్కడ చూసి బిగుసుకుపోయాడు. గభాల్న శాల్యూట్ చేసి గౌరవ సూచకంగా ఒక్కడుగు వెనక్కి వేసి నిలబడ్డాడు. సరిగ్గా అప్పుడే, గార్డెన్ వర్కర్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, పరుగుపరుగున ముందుకు వెళ్ళిపోయింది.

తాళాలందుకున్న సెక్యూరిటీ ఆఫీసర్ క్షణాల్లో కారు తెచ్చి నా ముందు పెట్టి, వెనుక డోర్ తెరిచి వినయంగా నిలబడ్డాడు. సీటుకి జారబడి విశ్రాంతిగా కూర్చున్నాను. ఉదయం నుంచీ జరిగిన సంఘటనలన్నీ వరుసగా గుర్తు రావడంతో కణతలు నొక్కుకుని, తల విదిలించాను. కారుకన్నా వేగంగా ఆలోచనలు సాగుతున్నాయి. చూస్తుండగానే సాయంకాలమైంది. కారు నా బంగళా ముందు ఆగింది.

రాత్రి ఎప్పటిలాగే డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ కి కలుసుకున్నాం కుటుంబ సభ్యులం అందరం. నీళ్లు తాగుతుంటే ఒక్కసారిగా పొలమారింది నాకు. డిన్నర్ అవుతూనే, కాసేపు మాట్లాడతానన్నాను. ఎవరూ జవాబు చెప్పలేదు.

"నేను వ్యాపార బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను. మొత్తం మీరే చూసుకోండి. అవసరమైతే మీ అమ్మ సలహాలు తీసుకోండి" కొడుకులిద్దరివేపూ చూస్తూ చెప్పాను. చిన్నాడి మొహం రంగు మారింది ఒక్క క్షణం. వాడు కోడలి వైపు చూడడం, ఆమె చూపు తిప్పుకోవడం నా దృష్టిని దాటిపోలేదు.

"రేపటినుంచీ నేను కంపెనీ వ్యవహారాలకి సమయం తగ్గించేస్తాను. వీలైనంత త్వరలోనే, ఇందులో నుంచి పూర్తిగా బయట పడతాను.." ఎవ్వరూ మాట్లాడలేదు, చిన్నాడు తప్ప.

"ఎందుకు నాన్నగారూ? ఉన్నట్టుండి...?" మాట పూర్తిచేయలేదు వాడు.

"నేను సర్వీస్ యాక్టివిటీస్ మీద దృష్టి పెడతాను," అంటూండగానే, నా భార్యతో సహా అందరూ ఆశ్చర్యంగా చూశారు.

"అవును, ఇన్నాళ్లూ మనం అటువైపు ఎందుకు చూడలేదో అర్ధం కావడం లేదు. ఏదన్నా యాక్టివిటీ చేసి, జాగ్రత్తగా డాక్యుమెంట్ చేస్తే చాలు.. డబ్బిచేందుకు ఫండింగ్ ఏజెన్సీలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.. మనలాంటి వాళ్ళం ఉండితీరాల్సిన రంగం అది.. పేరుకి పేరు, డబ్బుకి డబ్బు.." చెబుతూ, మంచినీళ్ల గ్లాసు అందుకున్నాను.

(అయిపోయింది)

బుధవారం, మార్చి 22, 2017

దాహం -1

మిట్ట మధ్యాహ్నానికీ, సాయంత్రానికీ మధ్య సమయం. పనివాళ్ళు, డ్రైవరు పిలుపుకి అందుబాటులో ఉన్నారు. మిగిలిన అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఎవరినీ పిలవాలనిపించలేదు. నేరుగా కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను. కారు గేటు దాటుతుంటే, సెక్యూరిటీ గార్డు వంగి సలాం చేశాడు. ఎక్కడికి డ్రైవ్ చేయాలో నాకు తెలీదు.. కానీ, కాసేపు ఒంటరిగా గడపాలి.

నా సమయం ఎంత విలువైనదో, ఒక్కో నిమిషం ఖరీదూ ఎన్ని వేల రూపాయలకి సమానమో నాకు తెలియంది కాదు. సమయం విలువ గుర్తుకురాగానే, ఇన్నేళ్ల జీవితంలో నేను ఒక్కో మెట్టూ ఎదుగుతూ నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని చుట్టి రావాలనిపించింది.

ఎవరా చక్రవర్తి? ఇలాంటి కోరికే కలిగి గుర్రం మీద బయల్దేరాడట. ఎప్పుడో అరవయ్యేళ్ళ క్రితం అమ్మ చెప్పిన కథ. ఏనాటి అమ్మ.. ఏనాటి ఊరు.. తల్చుకోవడం ఇష్టం లేక, ఆ ఆలోచనలు వెనక్కి నెట్టేస్తూ వచ్చాను ఇన్నాళ్లూ.. అంతమాత్రాన అవన్నీ మర్చిపోయానని కాదు. అసలు, బాల్యాన్ని మర్చిపోవడం అన్నది సాధ్యమయ్యే పనేనా? 

నాన్న ఉన్నన్నాళ్ళూ రోజులు సంతోషంగానే గడిచాయి. తిండికీ, బట్టకీ లోటుండేది కాదు. బాగా గారం చేసి ఆలస్యంగా బళ్ళో వేశాడు నన్ను. నాతో పాటు చెల్లెళ్ళిద్దరినీ బడికి పంపించేది అమ్మ. ఐదో తరగతిలో ఉండగా ఒకరోజున క్లాసు మధ్యలో నన్ను పిలిచి, చెల్లెళ్లని తీసుకుని ఇంటికి వెళ్ళిపోమన్నారు మేష్టారు. ఎందుకో అర్ధం కాలేదు.

పుస్తకాలతో వెళ్లేసరికి ఇంటి గుమ్మంలో నాన్న శవం.. ఏడుస్తూన్న అమ్మ. మమ్మల్ని చూసి అమ్మ ఏడుపు ఇంకా పెరిగింది. చెల్లెళ్ళిద్దరూ అమ్మని చూస్తూనే గొల్లుమన్నారు. నాకెందుకో ఏడుపు రాలేదు. చూస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు ఏం చెప్తే అది చేశాను.. ఏమేం చేశానో నాకు గుర్తే లేదు.

దినకార్యం అవ్వడంతోనే బంధువులంతా ఎక్కడివాళ్ళు అక్కడ సద్దుకున్నారు. నాన్న చేసిన అప్పులకి ఉన్న పొలాన్ని చెల్లు వేయగా, ఉండడానికి ఇల్లు మిగిలింది. వేసవి సెలవులిచ్చే వరకూ బళ్లోకి వెళ్ళొచ్చాం నేనూ, చెళ్ళెళ్ళూ. వేసవిలోనే ఆకలి ఎలా ఉంటుందో మొదటిసారి తెలిసింది మాకు.

ఆ వేసవి జ్ఞాపకం రాగానే ఏసీ కార్లో కూడా నెత్తిన ఎండ చురుక్కు మంటున్నట్టూ, కాళ్ళు బొబ్బలెక్కి మండుతున్నట్టూ అనిపించేస్తోంది. అద్దాల్లోంచి బయటికి చూస్తే క్రమశిక్షణగా నిలబడ్డ పచ్చని చెట్లు, ఎత్తైన భవనాలు. నిత్యం కోట్లాది రూపాయల లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆ భవనాల్లోనే నడుస్తూ ఉంటాయి. ఆ చెట్లు, భవనాల్లాగే నా సంస్థల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతో ఉంటారు. ఉండితీరాలి. అలాంటి వాళ్ళకే నా దగ్గర చోటు. 

వ్యాపారాలు విస్తరించడం మొదలు పెట్టిన కొత్తలో ఉద్యోగుల్నే ఒకరి మీద ఒకరిని గూఢచారులుగా నియమించేవాడిని. ఎక్కడ ఎవరు తోక జాడించబోతున్నారన్నా ముందుగానే నాకు తెలిసిపోయేది. రానురానూ నా ప్రమేయం లేకుండానే ఉద్యోగుల మధ్య పరస్పర శత్రుత్వం అన్నది వర్క్ కల్చర్ లో భాగంగా మారిపోయింది. ఫోన్ ట్యాపింగులు, క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు లాంటివన్నీ పనిని మరింత సులభం చేశాయి.

డ్రైవ్ చేస్తూ నా హోటల్ వరకూ వచ్చేశాను. మిగిలిన ఎస్టేట్ కన్నా కొంచం ప్రత్యేకంగా ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్. నా మనసులో కూడా ఈ హోటల్ ది ప్రత్యేకమైన స్థానమే. హోటల్ని చూస్తూనే ఆలోచనలు మళ్ళీ గతంలోకి పరుగులు తీస్తున్నాయి.

నాన్న పోయిన తర్వాత వచ్చిన ఆ వేసవి, ఎండలతో పాటు ఆకలి మంటల్నీ పట్టుకొచ్చింది మాకోసం. ఇంట్లో ఉన్న డబ్బు ఖర్చు పెట్టించి, శాస్త్ర ప్రకారం దినకార్యాలు చేయించిన బంధువులెవరూ ఆ తర్వాత మేమెలా ఉన్నామో అని తొంగి చూడలేదు. మమ్మల్ని చూడ్డానికి రాని వాళ్ళ ఇంటి గడప తొక్కి, సాయం అడగడం అమ్మకి ఇష్టం లేకపోయింది.

"ఆకలేస్తన్నాదా అబ్బయ్యా?" వీధిలో మడత మంచం మీద పడుకుని దొర్లుతుంటే, ఆవేళ రాత్రి నా కాళ్ళ దగ్గర కింద కూర్చుని అమ్మ అడిగిన మాట బాగా జ్ఞాపకం. నన్నెప్పుడూ ముద్దుపేరుతోనే పిలిచేది అమ్మ.

"ఏం సేద్దారయ్యా.. మీ నాయిన సూత్తే మనల్ని నడిమద్దెన ఇడిసిపెట్టేసేడు. సుట్టపోల్లెవరూ తొంగిసూట్టం లేదు.. అయినా ఒకల్లెంతకని సూత్తార్లే.." తనలో తను మాట్లాడుకుంటున్నట్టుగానే ఉంది.

"పొద్దుంలెగ్గానే నీకో పంజెబుతాను, సేత్తావా?" ..ఎందుకూ, ఏమిటీ అని అడక్కుండానే నేను సరే అన్నందుకు సంబరపడి ఇంట్లోకి వెళ్ళిపోయింది.

మర్నాడు పొద్దున్న లేచేసరికి వంటపొయ్యి ముందు ఉంది అమ్మ. పొయ్యి మీద పెద్ద గిన్నెలో ఇడ్లీలు ఉడుకుతున్నాయి. చెల్లెళ్ళిద్దరూ పొయ్యి ముందు కూర్చుని వంటవ్వడం కోసం ఎదురు చూస్తున్నారు. చిన్న సిల్వర్ కేను తోమి బోర్లించి ఉంది. ఆ పక్కనే, ఎండు తామరాకుల బొత్తి.

ఇడ్లీ వాయి పొయ్యి దిగడంతోనే, చెల్లెళ్ళిద్దరికీ చెరి రెండూ పెట్టి, "నువ్వూ తిందువు రా" అంది. నాకు తినాలనిపించలేదు. "ఇప్పుడు కాదు" అన్నాను ముక్తసరిగా. మిగిలిన ఇడ్లీలు, కేన్లో జాగ్రత్తగా సర్ది, చిన్న గిన్నెలో చట్నీ వేసి కదలకుండా ఇడ్లీల మధ్యలో పెట్టింది. కేనూ, ఆకుల కట్ట చేతిలో పెడుతూ, ఇడ్లీలెలా అమ్మాలో చెప్పింది. అమ్మకి మాత్రం పూర్తిగా తెలుసా ఏంటి?

"సిన్నోడివని బేరాలాడతారు, అరువెట్టమంటారు.. బేరాలు, అరువులు అయి రెండూ మాత్రం కుదరదని సెప్పెయ్యి. డబ్బు సేతిలో ఎడితేనే సరుకు.."

బేరం ఆడే అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అరువుకి అవకాశం ఉండకూడదు. ఈ రెండే నా వ్యాపార రహస్యాలు, ఇవాళ్టికి కూడా. అయితే, ఈ సూత్రాలు నేను అమ్మే చోట మాత్రమే. అదే నేను కొనాల్సి వస్తే ఎంత చిన్న వస్తువైనా గీసి గీసి బేరమాడతాను. డబ్బులున్నా సరే తర్వాత ఇస్తానని చెబుతాను. ఇంత పెద్ద కస్టమర్ ని వదులుకోవడం ఇష్టం లేక సరే అంటారు అవతలి వాళ్ళు.

రానురానూ అవతలివాళ్ళూ తెలివి మీరుతున్నారని నాకొడుకులిద్దరూ అప్పుడప్పుడూ నాకు చెబుతూ ఉంటారు, అది కూడా నా మూడ్ ని బాగా గమనించి. అయితే నా మూడో కొడుకు మాత్రం నేనేది చేస్తే అదే ముమ్మాటికీ సరైనది అంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే "రేపు సూర్యుడు పడమరన ఉదయిస్తాడు" అని నేనంటే, తెల్లారి సూర్యోదయం కోసం పడమటి దిక్కున వెతుకుతాడు.

నిజానికి నాకిద్దరే కొడుకులు. ఈ మూడోకొడుకు అనే వాడు నా ఒకానొక వ్యాపార రహస్యం. నమ్మకంగా, కష్టపడి పనిచేసే ఉద్యోగస్తుడికి నా మూడోకొడుకు హోదా వస్తుంది. అదేమీ మామూలు విషయం కాదు. మొత్తం ఉద్యోగుల మీద పెత్తనం, వ్యవహారాలు అన్నింటిలోనూ సంప్రదింపు.. ఓ మామూలు ఉద్యోగి కల్లో కూడా ఊహించనివెన్నో అతనికి  అనుభవానికి వస్తాయి. దీంతో రోజులో ఇరవై నాలుగుగంటలూ అతనికి ఉద్యోగం తప్ప మరో ధ్యాస ఉండదు. నామాట జవదాటే ప్రశ్నే ఉండదు. అతని శక్తి, ఆసక్తి సన్నగిల్లినా, అతని మీద నా నమ్మకానికి బీటపడినా, మూడోకొడుకు స్థానంలో మరో ఉద్యోగి వచ్చేస్తాడు.

ఈ మూడోకొడుకు అనేది ఒక అశాశ్వితమైన పదవి అని తెలిసీ, దానికోసం విపరీతంగా పోటీ పడుతూ ఉంటారు నా ఉద్యోగులు. కనీసం ఒక్క రోజన్నా నా మూడో కొడుగ్గా ఉంటే చాలనుకునే వాళ్ళు ఉన్నారనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. మూడోకొడుకు స్థానం నుంచి నెట్టివేయబడిన వాళ్ళ వల్ల నాకేదైనా సమస్య వస్తుందేమో అని నా భార్యా బిడ్డలకి ఏమూలో చిన్న భయం. కానీ, వెళ్లిపోయిన వాళ్ళెవరికీ అంత శక్తి లేదని నాకు బాగా తెలుసు.

తిరిగి వెళ్ళడానికి ముందు కాసేపు నడవాలనిపించి కారుని పార్క్ చేశాను. కారు తాళం తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు. డబ్బుతో సహా ఏదీ దగ్గరుంచుకునే అలవాటు లేదు. మొబైల్ ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. ఇంకా పూర్తిగా సాయంత్రం అవ్వకపోవడం వల్ల కొంచం వేడిగానే ఉంది వాతావరణం.

వేడి నాకు కొత్త కాదు.. తలమీద వేడి వేడి ఇడ్డెన్ల కేను, కాళ్ళ కింద ఎండ వేడి.. నోట మాట పెగిలే పరిస్థితి లేకపోయినా ఓపిక తెచ్చుకుని "ఇడ్లీలండీ.. ఇడ్లీలూ..." అంటూ కేక పెట్టుకుంటూ తిరిగిన మొదటి రోజున కొన్న వాళ్ళ కన్నా నావైపు వింతగా చూసిన వాళ్ళే ఎక్కువ. ఓపక్క "పాపం" అని జాలి పడుతూనే, మరోపక్క బేరాలాడ్డం, డబ్బులు రేపు తీసుకోమనడం చూశాక, అమ్మెందుకలా చెప్పిందో బాగా అర్ధమయ్యింది.

ఓ ఇంట్లో పెద్దావిడ, పిల్లల్ని ఊరుకోబెట్టడం కోసమేమో "అవి చద్ది ఇడ్డెన్లర్రా.. మీకు నే వేడిగా చేసిపెడతాగా.." అనడం వినిపించింది. అది మొదలు నా కేక మారింది.. "వేడేడి ఇడ్లీలండీ..." అన్న పిలుపు వింటూనే, నిజంగా వేడివో కాదో చూద్దామని పిలిచే వాళ్ళు కొందరు. బళ్ళో నాతో చదువుకున్న స్నేహితుల ఇళ్లలో ఇడ్లీలు అమ్మడానికి కూడా నేనేమీ సిగ్గు పడలేదు.

ఇంటికి తిరిగొచ్చేసరికి నాలుగు ఇడ్లీలు మిగిలాయి. అమ్మా నేనూ చెరో రెండూ తిన్నాం. ఆ ఇడ్లీల రుచి ఇవాళ్టికీ గుర్తుంది నాకు. వారం గడిచేసరికి నాకు సులువుగా ఇడ్లీలమ్మడం ఎలాగో తెలిసిపోయింది. ఏ ఇళ్లలో కొంటారో, ఎవరు కొనరో పసిగట్టగలిగాను. రెండు వారాలు గడిచేసరికి, మధ్యలో ఇంటికి వెళ్లి ఇంకో వాయి ఇడ్లీలు సర్దుకుని వెళ్లాల్సి వచ్చింది.

నెల్లాళ్ళవుతూనే మధ్యాహ్నం పూట ఉల్లిగారెలేసి ఇవ్వడం మొదలుపెట్టింది అమ్మ. క్షవరం చేయించుకోకపోవడంతో కేను పెట్టుకోడానికి, గాడుపు కొట్టకుండా చెవులు కప్పుకోడానికి అనువుగా మారింది నా జుట్టు. ఇడ్లీలు అమ్మేటప్పుడు పర్లేదు కానీ, గారెలు మోసుకు వెళ్లేప్పుడు కాళ్ళు కాలిపోయేవి. ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో నాన్న తోలు చెప్పులు కనిపించాయి.

రెండు రోజుల పాటు ఓ ప్లేటు ఇడ్లీ, ఓ ప్లేటు గారెలు కుట్టుకూలిగా ఊరికే ఇచ్చే ఒప్పందం మీద ఆ చెప్పుల్ని నా సైజుకి మార్పించుకున్నాను. ఆవేళ రాత్రి అమ్మ  "ఇంక మనకి పర్లేదబ్బయ్యా.." అంది ధైర్యంగా.

ఆరోజుల్లోనే ఊళ్ళో వాళ్ళు నా వెనుక అమ్మ గురించి ఏవో మాట్లాడుకునే వాళ్ళు. నాకర్ధమయ్యేది కాదు. ఆ మాటలకి అర్ధం తెలిసేనాటికి మేమా ఊరు విడిచిపెట్టేశాం.

ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ రోడ్డు మీద నడుస్తున్నాను. అయితే, ఈ రోడ్డు నేను వేయించుకున్నది. నా కాళ్ళకి ఇంట్లో వేసుకునే మామూలు చెప్పులున్నాయి. చుట్టూ పచ్చని చెట్లున్నాయి. ఒంటిమీద షరాయి, మల్లుచొక్కా హాయిగానే ఉన్నాయి. తలమీద ఏ బరువూ లేదు. అయినా, ఉండాల్సినంత హాయి లేదీ నడకలో.

అవును, అప్పుడు నావయసు పదేళ్లు, ఇప్పుడు డెబ్బై ఏళ్ళు. బాధ్యతలు బదలాయించి, విశ్రాంతి తీసుకోవాల్సిన వయసా ఇది? అసలు విశ్రాంతి అనే మాటకి అర్ధం ఉందా? ఇంట్లో ఉదయం విన్న మాట మరోసారి గుర్తొచ్చింది. బోర్డు మీటింగ్ ఉంది ఇవాళ. కొడుకులు, కోడళ్ళు కూడా బోర్డులో ఉన్నారు. చిన్న కొడుకు, కోడల్ని తొందర పెడుతున్నాడు మీటింగ్ కి టైం అయిపోతోందని.

"అక్కడికెళ్లి మనం చేసేదేముంది? ఆయన చెప్పినవాటికి తలూపి రావడమే కదా?" ఆ మాటలు నా చెవిన పడిన విషయం వాళ్ళిద్దరికీ తెలీదు. ఇంకెవరికీ నేను చెప్పలేదు.

పైన ఎండకో, కోడలి మాటలు గుర్తొచ్చినందుకో గొంతు తడారినట్టుగా ఉంది. దాహం కదూ ఇది? ఇప్పుడు నాకిక్కడ నీళ్లు దొరుకుతాయా?

 (ఇంకా ఉంది)

శుక్రవారం, మార్చి 17, 2017

ఆడలేక ....

మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడో కొత్త పల్లవి అందుకున్నాయి. వాటి ఓటమికి కారణం ఓటర్లు కాదు, ఈవీఎంలు గా పిలవబడే ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషిన్లు అని. ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు బ్యాలట్ ద్వారా కాక ఈవీఎంల ద్వారానే జరిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రెండు రాష్ట్రాల్లో స్పష్టమైన మెజీరిటీ సాధించి, మరో రెండు రాష్ట్రాల్లో అక్కడి రాజకీయ పరిణామాలని తనకి అనుకూలంగా మలుచుకునీ, ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తోంది. ఓటమి పొందిన పార్టీలు, ఆయా నాయకుల అనుయాయులు ఇప్పుడు బీజీపీ గెలుపుని ఈవీఎంలకి ఆపాదిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈవీఎంలని ట్యాపరింగ్ చేయడం ద్వారా వోట్లని తనకి అనుకూలంగా మార్చేసుకుని ఎన్నికల్లో గెలిచేసిందన్నది ప్రధాన అభియోగం.

భారతీయ ఎన్నికల వ్యవస్థలోకి ఈవీయంలు అడుగుపెట్టి సరిగ్గా ముప్ఫయి ఐదు సంవత్సరాలు. పూర్తిగా దేశీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈవీఎంలని తయారు చేస్తున్న భారతదేశం, ప్రస్తుతం ఈ మిషిన్లని పొరుగునే ఉన్న చిన్న దేశాలకి ఎగుమతి చేస్తోంది కూడా. కేరళలో 1982 లో జరిగిన ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా మొదటి సారి ఎంపిక చేసిన వోటింగ్ కేంద్రాల్లో ఈవీఎంల వినియోగం అమలయ్యింది. అదిమొదలు విడతలు విడతలుగా ఈవీఎంలని పెంచుకుంటూ వచ్చి 2014 పార్లమెంట్ ఎన్నికల నాటికి దేశం మొత్తంలో ఎన్నికల ప్రక్రియని ఈవీఎంల ద్వారా జరిపారు. మునుపు ఉన్న బ్యాలట్ పేపర్ పద్ధతితో పోల్చినప్పుడు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణ సులభం, సమయం, నిర్వహణ వ్యయంతో పాటు టన్నుల కొద్దీ కాగితాన్నీ పొదుపు చేస్తుంది.

ఈవీఎంల వాడకం మొదలయ్యే నాటికి దేశంలో అక్షరాస్యత శాతం కేవలం నలభై శాతం. అలాగే గ్రామాల విద్యుదీకరణ లాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడే ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీఎంలో భారతదేశానికి సరిపడవన్నది అప్పట్లో వినిపించిన ప్రధాన విమర్శ. రాను రాను అక్షరాస్యతా శాతం, గ్రామీణ ప్రాంతాలకి రోడ్లు, విద్యుత్ సరఫరా లాంటి కనీస సౌకర్యాలు మెరుగు పడడం ఒకపక్క, ఈవీఎం డిజైన్లలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చి, కేవలం బ్యాటరీ ఆధారంగా పనిచేసే డిజైన్లు విజవంతంగా పనిచేయడం మరో వంక జరగడం, వీటన్నింటిని మించి గత శతాబ్దపు తొంభయ్యో దశకం నుంచీ ఎన్నికల సంస్కరణల మీద దృష్టి పెట్టిన భారత ఎన్నికల సంఘం ఈవీఎంల విషయంలో పట్టుదలగా ఉండడం వల్లా ఎన్నికల నిర్వహణలో సమూలమైన మార్పు చోటుచేసుకుంది.

రాజకీయ పార్టీలకీ, వోటర్లకీ ఈవీఎంల పనితీరు మీద నమ్మకం కలిగించడానికి ఎన్నికల సంఘం విశేషమైన ప్రయత్నం చేసింది. ఈవీఎంల వినియోగం విస్తృతమయ్యాక, ఒకప్పుడు ఏ నిరక్షరాస్యులు ఈవీఎంలని వినియోగించలేరని రాజకీయ పార్టీలు వాదించాయో, అదే నిరక్షరాస్యులు బ్యాలట్ కన్నా మెరుగ్గా ఈవీఎంల ద్వారా తమ వోటుని నమోదు చేసుకోవడంతో నిరక్షరాస్యత అన్నది వాదనకి నిలవలేదు. ఏ లక్ష్యాల్ని సాధించడం కోసం ఈవీఎం ల వినియోగం మొదలయ్యిందో, అవి నెరవేరడం ఆరంభమయ్యింది. పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేయడం, బ్యాలట్ బాక్సుల్లో సిరా పోయడం, బాక్సుల్ని ఎత్తుకుపోవడం లాంటి దృశ్యాలన్నీ ఎన్నికల రంగం నుంచి క్రమంగా కనుమరుగవుతూ వస్తున్నాయి. మరోపక్క కౌంటింగ్ ప్రక్రియ బాగా వేగవంతమయ్యి, తొలి రెండు మూడు గంటల్లోనే ఫలితాలు వెల్లడవుటున్నాయి.

ఇదంతా నాణేనికి ఒకవైపు. ఇక రెండో వైపున విమర్శల పర్వం. అది ఎప్పటిలాగే కొనసాగుతోంది. ఒకప్పుడు ఎన్నికల్లో అధికార పక్షం ఓడిపోతే 'ప్రతిపక్షాల కుట్ర' అనీ, ప్రతిపక్షం ఓటమి పాలైతే 'అధికార పక్షం అధికార దుర్వినియోగానికి పాల్పడింది' అనీ విమర్శలు వినిపించేవి. ఇప్పుడా విమర్శలు ఈవీఎంల వైపు మళ్ళాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రతిపక్షాలు ఈవీఎం ల పని తీరు మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. "ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశానికి పరిచయం చేసింది మేమే" అని బోర విరుచుకునే నాయకులు కూడా ఈవీఎం ల పనితీరుని అనుమానించేందుకు వెనకడుగు వేయకపోవడం విశేషం. అధికార పక్షం తన అధికారాన్ని ఉపయోగించి ఈవీఎంలలో నమోదైన వోట్లని తారుమారు చేసిందన్న విమర్శలో పస ఎంత?

వోటింగ్ పూర్తైన వెంటనే ఈవీఎంలకు సీలు వేసిన బూత్ స్థాయి అధికారులు వాటిని జిల్లా స్థాయి అధికారులకి అప్పగిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్ధులందరి సమక్షంలో సీల్ పర్యవేక్షణ ముగిసిన అనంతరం, ఈవీఎంలని గోడౌన్ లో భద్రపరుస్తారు. ఈ గోడౌన్ దగ్గర గట్టి భద్రత ఉంటుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఏ క్షణంలో అయినా గోడౌన్లని తనిఖీ చేయవచ్చు. ఇక, కౌంటింగ్ సమయంలో కూడా అందరు అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో అధికారులు ఈవీఎంల సీలు విప్పి ఫలితం ప్రకటిస్తారు. సీలు విషయంలో అభ్యర్ధికి ఏ సందేహం ఉన్నా వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు.

ఇంతటి భద్రతా వలయంలో ఉండే ఈవీఎంలలో ఉన్న ఓట్లని రాత్రికి రాత్రి తారుమారు చేయడం అన్నది సాధ్యమయ్యే పనేనా? ఒక్కో బూత్ కి ఒక్కో ఈవీఎం చొప్పున చూసుకున్నా, మొత్తం ఎన్ని ఈవీఎంలలో ఓట్లు మారిస్తే ఫలితం మారుతుంది? ఈ మొత్తం మార్పుకి ఎంత సమయం పడుతుంది? అంతసేపు పోటీలో ఉన్న అభ్యర్థులు, వాళ్ళ ప్రతినిధులు, గోడౌన్ల మీద నిఘా పెట్టకుండా ఊరుకుంటారా? ఈ మొత్తం ట్యాపరింగ్ కి ఎలాంటి టెక్నాలజీ కావాలి? ఎందరు టెక్నీషియన్లు కావాలి? ఇలాంటిదేదో జరుగుతూ ఉంటే బ్రేకింగ్ న్యూస్ కోసం ఆవురావురనే మీడియా చూస్తూ ఊరుకుంటుందా? ఈ ప్రశ్నల్లో ఏ కొన్నింటికి జవాబులు దొరికినా, ఓడిన వారు ఈవీఎంల మీద చేస్తున్న విమర్శలని గురించి ఆలోచించవచ్చు. లేనిపక్షంలో ఓటమి తాలూకు బాధలో ఏదో మాట్లాడుతున్నారు లెమ్మని వదిలేయవచ్చు.

సోమవారం, మార్చి 13, 2017

జీడిపళ్ళ పులుసు

ఆదివారం పూటా బజార్లో తిరుగుతుంటే ముక్కుకి సోకిన గతజన్మ స్మృతి లాంటి ఒకానొక వాసన దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లింది. అదేమిటో అర్ధం కావడానికి కొన్ని క్షణాలు పట్టింది. అయ్యాక నాకే తెలియకుండా వెతుకులాట ఆరంభించాయి నా కళ్ళు. రోడ్డుకి ఓ పక్కన సైకిల్ నిలబెట్టి, ఆ సైకిల్ కి కట్టిన మూడు బుట్టల్లోనుంచీ పళ్ళని ఎంచి చూపిస్తూ నాబోటి వాళ్ళని ఆకర్షిస్తున్నాడో ఆసామీ. ఆ బుట్టలో ఉన్నవి 'జీడిపళ్ళు' గా పిలుచుకునే జీడిమామిడి పళ్ళు. వీటినే ముంతమామిడి పళ్ళు అని కూడా అంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. బేరమాడకుండా ఓ బుజ్జి బేగ్గుడు పళ్ళు తీసుకుని, మిగిలిన పనులు పూర్తి చేసుకుని ఇంటికొచ్చా.

తాళం తీసుకుని ఇంట్లోకొచ్చి చేసిన మొదటి పని సదరు పళ్లతో చేయదగ్గ వంటకాల్ని ఇంటర్నెట్లో వెతకడం. ఆశ్చర్యంగా, వంటకాలేమీ కనిపించలేదు. చిన్నప్పుడు తిన్న చారూ, పులుసూ గుర్తొచ్చాయి. నాలుక ఆ రుచుల్ని గుర్తు చేసుకున్నంత చురుగ్గా, మెదడు వండే విధానాన్ని గుర్తు చేసుకోలేకపోతోంది. అవునుమరి, బొత్తిగా వంటింటి వైపు చూడని రోజులు కదా అవి. ఏవిటి సాధనం అని ఆలోచిస్తూ ఉండగా 'ఫోన్ ఇన్' ఆప్షన్ గుర్తొచ్చింది. "పులుసు పెట్టుకోవచ్చు.. మీకెటూ సాంబార్ చేయడం వచ్చు కదా.. కొంచం అటూ ఇటూ గా అదే పధ్ధతి" అంటూ మొదలై, పళ్ళని ముక్కలుగా ఎలా కోయాలి మొదలు పులుసుకి ఏ పిండి పెట్టాలి వరకూ వివరాలు వచ్చేశాయి.

చూసి నేర్చుకున్నదైనా, చదివినదైనా, విన్నదైనా సరే ఎంతోకొంత మార్పు చేయకపోతే నాకు తోచదు. దినుసులో, పాళ్లో మార్చి ప్రయత్నం చేసి చూడడం వల్ల నష్టం లేదుకదా అనుకుంటాను.. ఇలాంటి సందర్భాల్లో ఎటూ తినేది నేనొక్కణ్ణే కాబట్టి. సాంబార్ చేసే గిన్నెలో సగానికి నీళ్లు పోసి, స్టవ్ మీద వేడిచేస్తూ, మరోపక్క ట్యాప్ కింద పళ్ళని కడగడం మొదలు పెట్టాను. సహజంగానే కొంచం జిడ్డుగా ఉంటాయి కదా. లిక్విడ్ సోప్ వేయాలన్న కోరికని బలవంతంగా అణచుకుని, కడిగిన పళ్ళని చాపింగ్ బోర్డు కి మార్చా. నీళ్లు పొంగు రావడంతో చిటికెడు పసుపు వేసి, పళ్ళని పెద్ద పెద్ద ముక్కలుగా కోసి నీళ్ళలోకి జారవిడిచా. పులుసు, సాంబారుకి ముక్కలేవైనా పెద్దగా ఉంటేనే బావుంటాయి. పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి పడేసి, చిన్న కప్పు నీళ్లలో చింతపండు నానబెట్టా.ఫోన్లో ఖర్చు వెచ్చాల మొదలు వేసవిలో పెరగబోయే కరెంటు బిల్లు వరకూ రకరకాల కబుర్లు అవుతున్నాయి.. రెండో స్టవ్ వెలిగించి, బాండీ పెట్టి, నూనె వేడవ్వగానే మిరియాలు, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించి, స్టవ్ ఆపేశాను. కప్పులో చింతపండు నానడంతో రసం తీసి ఉడుకుతున్న ముక్కల్లో పోసి, ఓ బెల్లంముక్క, చారెడు ఉప్పూ కూడా జారవిడిచా. సాంబార్ గిన్నెలో పొంగు ఆగింది. బాండీలో వేగి చల్లారిన పోపుని మిక్సీ జార్లోకి మార్చి, మెత్తగా పొడి కొట్టేసరికి పులుసు మళ్ళీ పొంగడం మొదలయ్యింది. మిక్సీ లో పొడిని పులుసులోకి చేర్చి కలయతిప్పాను. అటు పక్క ఫోన్ ఎందుకో మ్యూట్ లోకి వెళ్ళింది. ఓపిగ్గా వేచి ఉండాలన్నది అనుభవం నేర్పిన పాఠం.

పులుసు మరుగుతున్న వాసన.. మళ్ళీ నాస్టాల్జియా.. జీడిపండు ముక్కలతో సమస్య ఏమిటంటే, ఇవి ఉడికాయో లేదో ఓ పట్టాన తెలీదు. చూడ్డానికి మరీ రబ్బరు ముక్కల్లా ఉంటాయి కానీ, ఉప్పూ, పులుసుతో పూర్తిగా ఉడికాక రుచి అద్భుతం అంతే.. గిన్నెలో కోలాహలం మొదలవ్వడంతో తర్వాతి ఘట్టం గుర్తొచ్చింది. ఫోన్ అన్ మ్యూట్ అయ్యింది. పెద్దగా కష్ట పడకుండానే వరిపిండి డబ్బాని వెతికి పట్టుకుని, రెండు స్పూన్ల పిండి ఓ కప్పులోకి తీసుకుని, నీళ్లు పోసి కలుపుతూ పల్చని గంజిలా తయారు చేసి, ఆ మిశ్రమాన్ని సాంబారుగిన్నెలో కలిపేశాను. మళ్ళీ పొంగు చల్లారింది. కాస్త రుచి చూసి, కొంచం ఉప్పు చేర్చి, ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే పోపు గుర్తొచ్చింది.

తక్కువ మంటలో స్టవ్ వెలిగించి పులుసు గరిటె వేడిచేసి, సగానికి నూనె పోసి, అది వేడెక్కుతూ ఉండగానే ఇంగువ, మెంతులు, ఆవాలు వేసి, అవి మాడిపోకుండా జాగ్రత్త పడుతూ వేగిన మరుక్షణం "ధప్పళం తెర్లుతుంటే క్షీరసాగర మధనంలా కోలాహలంగా ఉండవలె - పోపు పడితే తొలకరిలా ఉరిమి రాచ్చిప్పలో ఉప్పెన రావలె" అన్న బుచ్చిలక్ష్మిని జ్ఞాపకం చేసుకుంటూ సాంబారు గిన్నెలో ఉప్పెనని సృష్టించేసి, స్టవ్ ఆపేశాను. కాల్ అవ్వడంతోనే, చవులూరించే జీడిపళ్ళ పులుసు స్పెషల్ డిష్ గా సండే స్పెషల్ లంచ్ పూర్తి చేసేశాను. పూర్వాశ్రమంలో ఎప్పుడో మద్రాసు స్నేహితులు చేసిపెట్టిన మావిడిపళ్ళ పులుసుని కూడా ఓసారి ప్రయత్నించాలనిపించింది, పులుసన్నం తినగానే..

శనివారం, మార్చి 11, 2017

మధ్యంతర తీర్పు

కేంద్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతూ ఉండగా, ఐదు రాష్ట్రాల శాసన సభలకి జరిగిన ఎన్నికల్లో ఏనుగు కుంభస్థలంగా చెప్పబడే రాష్ట్రంతో పాటు మరో రాష్ట్రంలో భారీ మెజారిటీని సాధించి, మరో రెండు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ పోటీ ఇవ్వడం అన్నది అధికారంలో ఉన్న పార్టీకి ఘనంగా చెప్పుకోదగ్గ విషయమే. ఏ ప్రభుత్వానికైనా ఐదేళ్ల పదవీ కాలంలో మొదటి సంవత్సరం హనీమూన్ పీరియడ్. ఆ యేటి తప్పొప్పులు పెద్దగా లెక్కలోకి రావు. అటుపై మరో ఏణ్ణర్ధం గడిచేసరికి ప్రజలకి మోజు తీరి, చిన్నగా వ్యతిరేకేకత ఆరంభమవుతుంది. రాజకీయ విశ్లేషకులు దీనినే 'యాంటీ ఇంక్యుమ్బెన్సీ' అని చెబుతూ ఉంటారు. ఇది మెజారిటీ పార్టీల విషయం.

కానీ, భారతీయ జనతా పార్టీ విషయం వేరు. స్వతంత్ర వీరుల వారసుల పార్టీగా రాజకీయ యవనికపై ఆవిష్కృతమైన కాంగ్రెస్ తర్వాత, అతిపెద్ద జాతీయ పార్టీగా అవతరించిన బీజేపీ కి 2014 పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చినా, మొదటి ఏడాదిలోనే అసహనపు సెగ తగిలింది. దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్న మేధావులు సైతం, బీజేపీ తీరు నచ్చక ఆ అవార్డులని తిరిగి ఇచ్చేయడంతో మొదలుపెడితే అసహనాల పరంపర కొనసాగుతూనే వస్తోంది. భారీ మెజారిటీ ఇచ్చిన మత్తులో అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేసిన పొరపాట్లు కొన్నైతే, ఓ వర్గం మీడియా చేసిన అతి తాలూకు ఫలితం మరికొంత..

మొత్తంమీద చూసినప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేక పవనాలు వీస్తున్నాయేమో అన్న నమ్మకం సాధారణ ప్రజల్లో కలుగుతున్న సమయంలో ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ప్రకటన వచ్చింది. ఇదే సమయంలో కేంద్రం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు, తదనంతర గందరగోళాల నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం అన్న ప్రచారం ఊపందుకుంది. 'రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశప్రజల తీర్పుకి నమూనా' గా చెప్పబడే ఉత్తరప్రదేశ్ శాసన సభని కైవసం చేసుకోవడంతో పాటు, ఉత్తరాఖండ్ లోనూ బీజేపీ జెండా ఎగరేసింది. వరుస పరాజయాలతో కునారిల్లిన కాంగ్రెస్ కి పంజాబ్ శాసనసభ ఊరటనిచ్చింది. ఇక, గోవా, మణిపూర్ లలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం కనబడుతున్నా 'ఇతరుల' సంఖ్య కూడా చెప్పుకోదగ్గదిగా ఉండడం వల్ల రాజకీయం మలుపులు తిరిగే అవకాశం ఉంది.

ఈ ఎన్నికల ఫలితానికి అర్ధం పెద్దనోట్ల రద్దుతో సహా కేంద్రం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఓటర్లు ఆమోదించి  హారతి పట్టేశారనా? నావరకు, ఓటర్ల ప్రాధాన్యత ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీలకి మారుతున్నట్టుగా అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న కాలంలో రాష్ట్ర పాలనని కేంద్రం తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడం, రాష్ట్ర నాయకులు సైతం కేంద్రానికి సాగిలపడడంతో  చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకున్నాయి. ఇది ఎంతవరకూ వెళ్లిందంటే, ప్రాంతీయ పార్టీల కూటములు దశాబ్దాల పాటు కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపాయి. కేంద్రంలో ఏకపార్టీ పాలన అన్నది కాంగ్రెస్ తర్వాత, మళ్ళీ 2014 లో బీజేపీ ద్వారానే జరిగింది. ఈ రెండు జాతీయ పార్టీలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకి పోటీ ఇస్తున్నాయి.

సగం పదవీ కాలం పూర్తయ్యాక 'రిఫరెండం' లాంటి ఎన్నికలని ఎదుర్కోవాల్సి రావడం ఏపార్టీకైనా ఇబ్బందికరమే. కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు స్థానిక సంస్థలకి ఎన్నికలు జరపకుండా ఏదో ఒక సాకుతో వాయిదా వేస్తూ పోవడానికి కారణం కూడా ఈ 'రిఫరెండం' భయమే. ఎన్నికల్లో ఓడితే జనం అధికార పార్టీని వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంటుంది. మరి, గెలిస్తే? ఇప్పటికే పార్లమెంట్ లో మరో పార్టీ సాయం అవసరం లేని పూర్తి మెజారిటీ అనుభవిస్తున్న బీజేపీ, ఉత్తర ప్రదేశ్ ని, ఉత్తరాఖండ్ శాసనసభల విజయాలతో రానున్న రెండేళ్లలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? అప్పుడప్పుడూ ప్రభుత్వం మీద అసంతృప్తిని ప్రకటిస్తున్న ఆరెస్సెస్, సంఘ్ పరివార్ లాంటి సంస్థలు ఈ విజయాన్ని ఏవిధంగా స్వీకరిస్తాయి? బీజేపీలో వ్యక్తిపూజ (మోడీ) పరాకాష్టకి చేరుకోనుందా? ఎన్నికల ఫలితాలు దేశప్రజల ముందు ఉంచిన ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకి జవాబులే, బీజేపీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు.

గురువారం, మార్చి 09, 2017

ఘాజీ

రెండు గంటల నిడివి ఉన్న సినిమా. తొంభై శాతం సన్నివేశాలు జలాంతర్గామిలోనే. పాటలు, ఫైట్లు, కామెడీ లాంటి సగటు తెలుగు సినిమా ఫ్రేమ్ వర్క్ ని బద్దలు కొట్టుకుని బయటికి వచ్చికూడా, అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణనీ పొందుతోంది. ముప్ఫయ్ రెండేళ్ల సంకల్ప్ రెడ్డి అనే యువకుడు ఐదేళ్ల పాటు కలగని, రేయింబవళ్ళు శ్రమించి పరిశోధన చేసి తయారు చేసుకున్న స్క్రిప్ట్.. మొదట చిన్న బడ్జెట్ యూట్యూబ్ సినిమాగా నిర్మాణం ఆరంభమైనప్పటికీ, యువ కథానాయకుడు రానా దగ్గుబాటి దృష్టిలో పడడడంతో భారీ బడ్జెట్, బహుభాషా చిత్రంగా మారి తెలుగు, తమిళ హిందీ భాషల్లో దేశంలోనూ, విదేశాల్లోనూ కూడా మంచి వసూళ్లు రాబడుతున్న సినిమా 'ఘాజీ.'

మొదటి వారంలో హౌస్ ఫుల్ బోర్డులు, ఆ తర్వాత నా వ్యక్తిగత పనులూ కారణంగా ఈ సినిమా చూడడం బాగా ఆలస్యమైంది. రొటీన్ ని కొద్దికొద్దిగా బ్రేక్ చేసే సినిమాలు అప్పుడప్పుడూ వస్తూనే ఉంటాయి కానీ, బాక్సాఫీసు సూత్రాలుగా చెప్పబడుతూ వస్తున్నవాటిని అన్నింటినీ మొత్తంగా పక్కన పెట్టి కేవలం స్క్రిప్ట్ ని మాత్రమే నమ్ముకుని తీసేవి బహు తక్కువ. అదిగో, ఆ అరుదైన కేటగిరీ సినిమానే ఇది. భారత-పాకిస్తాన్ యుద్ధం (1971) నేపథ్యంలో, బంగాళాఖాతంలో ఈ రెండు దేశాల జలాంతర్గాములు తలపడినప్పుడు - మరీ ముఖ్యంగా పాకిస్తాన్ జలాంతర్గామి 'ఘాజీ' అన్ని విధాలుగానూ శక్తివంతంగానూ, భారత్ కి చెందిన 'ఐఎస్ 21' అన్ని విధాలుగానూ బలహీనంగానూ ఉన్న సమయంలో జరిగిన పోరు ఎలాంటిదన్నదే ఈ సినిమా.

భారత జలాల్లో కల్లోలం సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందన్న వేగు అందగానే, అప్రమత్తమైన నావికాదళం 'ఐఎస్-21' ని సముద్రంలోకి పంపుతుంది. కెప్టెన్ విజయ్ సింగ్ (కేకే మీనన్) ఆవేశపరుడన్న విషయం బాగా తెలిసిన అధికారులు (ఓంపురి, నాజర్) దళంలో యువ అధికారి అర్జున్ వర్మ (రానా దగ్గుబాటి) కి కూడా ముఖ్యమైన నిర్ణయాలలో భాగస్వామ్యం వహించాల్సిందిగా ఆదేశిస్తారు. జలాంతర్గామి కంట్రోల్ మొత్తం దేవరాజ్ (అతుల్ కులకర్ణి) అనే అధికారి ఆధీనంలో ఉంటుంది. జలాంతర్గామి తీరం విడవడంతోనే విజయ్ సింగ్ స్వతంత్రంగా వ్యవహరించడం మొదలు పెడతాడు. పాక్ నౌక తారసపడిన ఎట్టిపరిస్థితుల్లోనూ ముందస్తు ఆదేశాలు లేకుండా ఫైరింగ్ జరపొద్దని, ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, "మనం వెళ్తున్నది యుద్ధానికే" అని ప్రకటిస్తాడు.


విజయ్ సింగ్ విపరీత ప్రవర్తన కారణంగా సిబ్బంది మొత్తం ఇబ్బందులు పడుతున్నప్పటికీ, క్రమశిక్షణ కారణంగా వారెవ్వరూ పెదవి విప్పరు. ఒక్క అర్జున్ మాత్రం కొంచం తరచుగా విజయ్ తో విభేదిస్తూ ఉంటాడు. వీళ్ళ ప్రయాణం సాగుతూ ఉండగానే, విజయ్ కారణంగా చిన్న ప్రమాదం జరిగి, జలాంతర్గామికి కొంత నష్టం జరగడం, దగ్గరలోనే ఉన్న మర్చంట్ నౌక ని పాకిస్తాన్ జలాంతర్గామి పేల్చేయడంతో ప్రమాదంలో ఉన్న కాందిశీకులని (తాప్సి, చిన్నపాప) అర్జున్ రక్షించి 'ఐఎస్-21' లో ఆశ్రయం ఇవ్వడం, శత్రు నౌకని పేల్చేయాల్సిందే అని విజయ్ ఆదేశించడంతో కథ పాకాన పడుతుంది. అటుపై ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొన్న 'ఐఎస్-21' బృందం, అర్జున్ నాయకత్వంలో వాటిని ఎలా అధిగమించింది? శత్రు నౌకని ఎలా నిలువరించింది అన్నది ముగింపు.

ఈ సినిమాకి తొలిహీరో స్క్రిప్ట్, రెండో హీరో దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఒకే ఒక్క సెట్ లో, ఎక్కడా విసుగు కలగని విధంగా సినిమా తీయడమే కాదు, రెండో సగానికి వచ్చేసరికి ప్రేక్షకుల్ని కూడా జలాంతర్గామి ప్రయాణికుల్ని చేసేశాడు దర్శకుడు. నావికాదళ సిబ్బందికి విధి నిర్వహణగా అనిపించేవన్నీ, సామాన్యుల దృష్టికి ఎలా కనిపిస్తాయి అన్నది తాప్సి పాత్ర ద్వారా చూపించాడు. నిజానికి తాప్సికి ఉన్న డైలాగులు అతి తక్కువ.. ఈ కారణంగానే అభినయానికి బాగా అవకాశం దొరికింది. తనను తాను డాక్టర్ గా పరిచయం చేసుకున్న ఈ కాందిశీకురాలు, ముగింపుకి ముందు అర్జున్ కి వైద్యం అవసరమైనప్పుడు చూస్తూ వెనుకనే నిలబడిపోయింది తప్ప విధి నిర్వహణ ఎందుకు చెయ్యలేదన్నది ప్రశ్నగా మిగిలిపోయింది.

సాంకేతిక విభాగాలన్నీ యధాశక్తి కృషి చేసి చక్కని సినిమాని ఇచ్చాయి. నటీనటులెవరికీ వంక పెట్టడానికి లేదు. అర్జున్ తో పాటు కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులకి కూడా కోపం వచ్చేసేలా ఉన్న విజయ్ ప్రవర్తనకి కారణాన్ని ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ లో చెప్పి ఆ పాత్ర పట్ల అభిప్రాయాలని ఇట్టే మార్చేశాడు దర్శకుడు. క్లైమాక్స్ ని మరొక్క ఐదు నిమిషాలు పొడిగించి ఉంటే బాగుండేది అని తప్ప, ఇంకేరకమైన ఫిర్యాదులూ లేవీ సినిమా మీద. నెమ్మదిగానే అయినా, తెలుగు సినిమా ఎదుగుతోంది అని చెప్పుకోడానికి అవకాశం ఇఛ్చిన 'ఘాజీ' టీమ్ మొత్తానికి ధన్యవాదాలు చెప్పాల్సిందే..

బుధవారం, మార్చి 08, 2017

కొందరు నాయికలు

తెలుగు సాహిత్యంలో ఇప్పుడు స్త్రీవాదం అంటే అయితే పేరాలకొద్దీ రుతుక్రమ వర్ణన, శానిటరీ నాప్కిన్లు వినియోగించే విధానం... కాకుంటే భర్త కన్నుకప్పి మేనల్లుడితోనో, మేనేజరుతోనో సంబంధం పెట్టుకోవడం.. తప్పితే పురాణ పాత్రల పేర్లని మాత్రమే తీసుకుని నచ్చినట్టుగా ఉపన్యాసాలు ఇప్పించడం.. కొత్తగా చదవడం మొదలు పెట్టినవాళ్ళకి ''ఇంతేనా ఫెమినిజం అంటే?" అని భావన కలిగించేలా ఉంటున్నాయి మెజారిటీ రచనలు. స్త్రీల లైంగికత ఇతివృత్తంగా రచనలు రాకూడదని కాదు, కానీ బూతు రచయితలని మించి రచయిత్రులే స్త్రీ అంగాంగ వర్ణన చేయడం, అదేదో చాలా గొప్ప సాహసోపేతమైన రచనగా భావించి ప్రచారం చేసుకుంటూ ఉండడమే బాధ కలిగిస్తున్న విషయం.

తెలుగు సాహిత్యంలో స్త్రీ లైంగికతని గురించి చర్చ ఇవాల్టిది కాదు. వందేళ్ళకి పూర్వమే మొదలయ్యింది.. ఇంకా కొనసాగుతూనే ఉంది. భర్తతో సుఖం లేక, అమీరుతో లేచిపోయిన 'మైదానం' నాయిక రాజేశ్వరి, తెలుగు సాహిత్యంలో మహిళల లైంగికతను గురించి విస్తృతంగా చర్చకు పెట్టిన మొదటి నాయిక. చలం సృష్టించిన రాజేశ్వరి గానుగెద్దు సంసారంలో సుఖం లేదని గ్రహించింది. తొలిచూపులోనే అమీరుపై మోహం కలగడం, అతడూ ఆమెని మోహించడంతో వాళ్లిద్దరూ పచ్చని పచ్చికలు, జలపాతాలూ ఉన్న మైదానంలోకి స్వేచ్ఛగా ప్రయాణం కట్టారు. అక్కడ ఆకలి దప్పుల ప్రసక్తి లేకుండా, శృంగారమే జీవితంగా కాలం గడిపారు.

కొన్నాళ్ళు గడిచేసరికి అమీరుకి మరో స్త్రీపై మనసయింది. అతడి కోసం ఆ స్త్రీని బతిమాలి ఒప్పించింది రాజేశ్వరి.. ఇది ఆమె ప్రేమ ప్రకటన. అంతే కాదు, రాజేశ్వరి సైతం అమీర్ బంధువుల కుర్రాడు మీరా పై మనసు పడింది. తదనంతర పరిణామాలు అమీర్ హత్యకి గురవ్వడానికీ, ఆ నేరం తనమీద వేసుకుని ఆమె జైలుకి వెళ్ళడానికీ దారితీశాయి. లేచిపోయిన రాజేశ్వరి ఏం సాధించింది? అని ప్రశ్నించుకుంటే, ఆమె కోరుకున్న శృంగార జీవితాన్ని తృప్తిగా అనుభవించింది అన్న సమాధానం దొరుకుతుంది. 'అంతకు మించి ఇంకేం చేయగలదు' అన్న ప్రశ్నకి జవాబిస్తుంది రత్నావళి, విశ్వనాథ సత్యనారాయణ 'చెలియలికట్ట' నవలా నాయిక. రాజేశ్వరికి అమీరుపైన కలిగిన మోహం లాంటిదే, రత్నావళి కి తన మరిది రంగారావు మీద కలిగింది. దానికామె ప్రేమ అని పేరు పెట్టుకుంది.

పదిహేనేళ్ల అమాయకపు గృహిణిగా గడప దాటిన రత్నావళి, కేవలం శృంగారం మాత్రమే జీవితం అనుకోలేదు. శృంగారంతో పాటుగా ఇంకా చాలా విషయాలున్నాయని గ్రహించింది. ముఖ్యంగా విద్య ఆవశ్యకత తెలిసొచ్చిందామెకి. చదువుకుని, ఉద్యోగంలో చేరి స్త్రీ సాధికారికతకి ఉదాహరణగా నిలిచింది. ఇందుకు రంగారావు సహాయమూ చాలానే ఉంది. అంతే కాదు, గడపదాటిన రత్నావళి, రంగారావు మినహా మరో పురుషుడిని దగ్గరకి చేరనివ్వలేదు. అలా చేరనిచ్చి ఉంటే ఆమె చదువుని, ఉద్యోగాన్ని సాధించడం జరిగి ఉండేదా అన్న ప్రశ్న వస్తుంది. రాజేశ్వరి కథ జైల్లో ముగిస్తే, చెలియలికట్ట దాటిన రత్నావళి కథ సముద్రగర్భంలో ముగుస్తుంది. బహుశా, చలం సంప్రదాయ వాదులని సంతృప్తి పరచడానికీ, స్వయంగా సంప్రదాయ వాది అయిన విశ్వనాథ గడప దాటే స్త్రీని గురించి తన అభిప్రాయం వెల్లడించడానికి ఈ ముగింపులు ఇచ్చి ఉండొచ్చు.

ఒకటి రెండు దశాబ్దాలు గడిచేసరికి, గడప దాటనవసరం లేకుండానే లైంగిక అవసరాలు లేదా వాంఛలని తీర్చుకునే మార్గాలు తొక్కిన నాయికలు తారస పడతారు. కుటుంబం అనే భద్ర చట్రంలో ఉంటూనే, సంతానం నిమిత్తం తన బావ దయానిధితో కూడుతుంది అమృతం. బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' నవలలో ప్రత్యేకంగా కనిపించే ఈ స్త్రీపాత్ర, దయానిధితో సంబంధాన్ని కేవలం ఒక్క రాత్రికే పరిమితం చేసుకుంది. ఆమె భర్తకి మరో స్త్రీతో సంబంధం ఉందని రూఢిగా తెలుసు కాబట్టి, వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకోడానికి సంతానం అవసరం కాబట్టీ అమృతం ఆ మార్గం తొక్కినట్టు అనిపిస్తుంది. నిజానికి, ఆమె తల్చుకుంటే ఆ సంబంధాన్ని కొనసాగించేదే.. కానీ, కుటుంబం అనే చట్రం నుంచి బయటికి రాడానికి ఇష్టపడలేదు అమృతం.

తొలితరం ఉద్యోగినులకు ప్రతినిధిగా చెప్పగలిగే పాత్ర ఇందిర. బాధ్యతలేని సోమరి తండ్రిని ఉద్యోగం చేసి పోషిస్తూనే, తనకంటూ ఓ తోడునీ, భద్ర జీవితాన్నీ వెతుక్కోవలసిన అవసరం కలుగుతుంది ఇందిరకి. డాక్టర్ పి. శ్రీదేవి నవల 'కాలాతీత వ్యక్తులు' లో ప్రధాన పాత్ర అయిన ఇందిరకి లోకం మీద కక్ష. సంఘం తాలూకు విలువల మీద పెద్దగా గౌరవం లేదు. అలా అని సంఘాన్ని ఎదిరించే ఆలోచనా లేదు. తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలనే తాపత్రయంలో, తన ఇంటి పై వాటాలో అద్దెకి ఉండే మెడికో ప్రకాశంతో సంబంధం పెట్టుకుంటుంది ఇందిర. ఆమె వరకూ, ఈ సంబంధం అతన్ని పూర్తిగా లొంగదీసుకోవడం కోసమే తప్ప అతనిమీద ప్రేమతోనో, మోహంతోనో కాదు. ప్రకాశం చేజారిపోయినప్పుడు, బాధపడుతూ కూర్చోకుండా మరొక వ్యక్తిని వెతుక్కునే ప్రయత్నం మొదలుపెడుతుంది ఇందిర.

మోహంతోనో, ప్రేమతోనో కాక కుటుంబ అవసరాలు గడిపే నిమిత్తం పరాయి మగవాళ్ళతో శృంగార సంబంధాలు నెరిపిన స్త్రీ పాత్రలూ మనకి కనిపిస్తాయి. చాసో కథ 'లేడీ కరుణాకరం' నాయిక శారద ఇందుకు ఓ ఉదాహరణ. అత్యాశాపరుడైన తండ్రి ఆమెని వ్యభిచారంలోకి దింపితే, అటు తర్వాత ఆమెని పెళ్లిచేసుకున్న కరుణాకరం తన ఎదుగుదల కోసం ఆమె సంబంధాలని ఆమోదిస్తాడు. నిజానికి, విలువల కన్నా డబ్బుదే పైచేయి అన్న విషయాన్ని ఆచరణలో గ్రహించిన శారద అతన్ని ఒప్పిస్తుంది. అనతికాలంలోనే ఆర్ధికంగా పైపైకెదిగిన ఆ జంట సమాజం దృష్టిలో ఆదర్శ దంపతులు. శారద పరిస్థితుల కన్నా కొంచం భిన్నమైనవి 'శారద' (ఎస్. నటరాజన్) రాసిన 'రక్తస్పర్శ' కథలో నాయిక అనసూయ పరిస్థితులు. కొంత జీవితం చూశాక వితంతువుగా మారడం, తమ్ముడి చదువు కొనసాగించేందుకు మగ దక్షత అవసరం కావడంతో తనకి పనికొచ్చే వాళ్ళని ఎంచుకుని వాళ్ళతో గుట్టుగా సంబంధాలు కొనసాగిస్తుంది.

వీళ్ళందరికీ భిన్నంగా, అననుకూల దాంపత్యంలో కూడా భర్త తోడిదే లోకంగా బతికిన రామసీత కథ 'ఒఖ్ఖ దణ్ణం.' జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి (జరుక్ శాస్త్రి) రాసిన ఈ కథ చదువుతున్నంత సేపూ, "రామసీత ఇంకా ఎందుకతన్ని భరించడం.. తనదారి తాను చూసుకోవచ్చు కదా" అనిపించేస్తూ ఉంటుంది. సహనానికి మారుపేరుగా ఉన్న రామసీత కూడా భర్తకి దూరంగా జరిగేందుకు సిద్ధపడడం ఈ కథకి ముగింపు. ముందుగా చెప్పినట్టుగా, ఈ నవలలు, కథలు రాసిన రచయిత (త్రు) లు స్త్రీ లైంగికతని భిన్న కోణాల్లో చర్చకి పెట్టారు తప్ప పాఠకుల్లో ఉద్రేకం పెంచే విధంగా అంగాంగ వర్ణనల్ని ఇరికించే ప్రయత్నం చేయలేదు. మరోసంబంధంలోకి వెళ్ళడానికి పూర్వం, వెళ్లిన తర్వాత స్త్రీకి ఎదుర్కొన్న పరిస్థితుల్ని తమదైన దృష్టికోణంగా వాస్తవికంగా చిత్రించారు తప్ప, ఆ సంబంధాలని మాత్రమే వర్ణించి ఊరుకోలేదు. నేటితరం ఫెమినిస్టు రచయితలు ఈ విషయాన్ని గుర్తిస్తే బావుంటుందేమో..

సోమవారం, మార్చి 06, 2017

కృష్ణాతీరం - తేజోమూర్తులు - క్షేత్రయ్య

మల్లాది రామకృష్ణ శాస్త్రి రాసిన రెండు నవలలు 'కృష్ణాతీరం' 'తేజోమూర్తులు,' అసంపూర్ణ నవల 'క్షేత్రయ్య' కలిపి సంకలనంగా విడుదల చేసింది విశాలాంధ్ర ప్రచురణ సంస్థ. నిజానికి, మూడూ అసంపూర్ణ నవలలు అనిపించాయి చదవడం పూర్తిచేశాక. కథని ఫలాని చోట ఆరంభించాలి, ఫలానీ విధంగా ముగించాలి లాంటి పట్టింపులేవీ మల్లాది వారికి ఉన్నట్టు కనిపించవు. ఫలితం, మొదటి రెండు నవలలూ హఠాత్తుగా మొదలై, అంతే హఠాత్తుగా ముగిసినట్టుగా అనిపిస్తాయి. 'క్షేత్రయ్య' కి అయితే సరిగ్గా కథ పాకాన పడుతున్న తరుణంలో రచయిత కలం ఆగిపోయింది, మరి కొనసాగలేదు.

'కృష్ణాతీరం' నవల అవనిగడ్డ గ్రామంలో అన్నప్ప అనే వైదిక బ్రాహ్మణుడి కథ. వృత్తి రీత్యా పౌరాణికుడైన అన్నప్ప ప్రవృత్తి సంసారాలని మరమ్మతు చేయడం. సొంత లాభం బొత్తిగా చూసుకోని వాడేమీ కాదు కానీ, పొరుగువారి మేలు కోరుతూ ఉంటాడు. ఒక్కగానొక్క కూతుర్ని ఊళ్ళో ఉన్న సంపన్న గృహస్థు రామావధాన్లు ఇంటి కోడల్ని చేయాలన్న కోరిక కలుగుతుంది. అనుకోని అవాంతరాల వల్ల ఆ సంబంధం తప్పిపోయి, తిరుపతి సంబంధం చేసుకుని సంతోషంగానే ఉంటుంది కూతురు. ఆ పిల్ల పెళ్లయ్యాక అన్నప్పకి బుచ్చన్న పుడతాడు.

అయితే, అక్కడ రామావధాన్లు ఇంట్లో ఇబ్బందులు మొదలవుతాయి. అన్నప్ప మధ్యవర్తిత్వం చేసి పెళ్లిచేసి రామావధాన్లు కూతురు అలిగి పుట్టింటికి వచ్చేయడం, అవధాన్లు గారి అబ్బాయి వేరే కులం పిల్లని పెళ్ళిచేసుకుని ఇల్లరికం వెళ్లిపోవడంతో బారికరావుడైపోయిన అవధాన్లు కాశీకి ప్రయాణం కట్టేస్తాడు. ఆ ఇంటి ఇల్లాలి బాధ చూడలేక ఆ ఇద్దరు పిల్లల కాపురాలు చక్కదిద్దే పని చంకనెత్తుకుంటాడు అన్నప్ప. అయితే, ఈ కథ అన్నప్ప దగ్గర మొదలవ్వదు. అతని కొడుకు బుచ్చన్న ఆర్ధిక  పరిస్థితి దగ్గర మొదలై అన్నప్ప రోజుల నాటికి వెళ్లి, రామావధాన్లు కూతురు కాపురం చక్కబడబోతుండగా ముగుస్తుంది.

ఈ కథ కాని కథని  కడకంటా ఆసక్తికరంగా చదివించేది కాశీ మజిలీ కథల్ని తలపించే కథనం. ఒక కథ నుంచి మరో కథలోకి, అక్కడి నుంచి ఇంకొక కథలోకి పాఠకులని అనాయాసంగా లాక్కుపోయే కథనం. ఆ కథనంతో  పోటీ పడే జాను తెనుగు భాష.  శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచనల్లో గోదావరి మాండలీకం ఎంత సొగసుగా పలుకుతుందో, అంతే సొగసుగా కృష్ణాతీరపు మాండలీకం వినిపిస్తుంది మల్లాది వారి రచనల్లో. అక్కడక్కడా ఉరుదూ, అరబ్బీ పదాలు లడ్డూలో పటిక పలుకుల్లా తగులుతూ ఉంటాయి తప్ప, మిగిలినదంతా అచ్చమైన తెలుగే.


కథ సంగతి ఇలా ఉండగా, పాత్రలన్నీ బహుమంచివి. కలికానికైనా 'చెడు' అన్నది కనిపించదు. మరి కథ నడవడం ఎలాగ? అన్నప్ప పరిష్కరించేసే పాటి, వడ్లగింజలో బియ్యపుగింజ తరహా సమస్యలు కేవలం కథ కోసం కనిపిస్తాయంతే. 'తేజోమూర్తులు' సైతం నూటికి నూరుపాళ్లూ ఇంతే. ఎటొచ్చీ ఆ కథా స్థలం 'తవిశపూడి' అనే -  ఊహల్లో మాత్రమే ఉంటుందేమో అనిపించేసే - అందమైన పల్లెటూరు. ఆ ఊళ్ళో చెట్టూ చేమా, రాయీ రప్పా  కూడా కథలు వినిపించేస్తాయి. వాటి కథలు వినిపించే హడావిడిలో పడి, నవలా రచయిత నవలానాయకుడి కథని పూర్తి చేయడం మర్చిపోయారేమో అన్న సందేహం కలిగేస్తుంది.

వివాహం విఫలమై ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోబోయిన సీతమ్మని రక్షించి  ఆశ్రయం ఇస్తుంది పూటకూళ్ళ ఇల్లు నడుపుకునే వితంతువు అఖిలాండమ్మ. అక్కడ సీతమ్మకి తారసపడ్డాడు వెంకట్రామయ్య. దేవుడి పటం  ఎదుట పసుపుతాడు కట్టి, ఆమె కడుపున 'కోనయ్య' పడగానే మాయమైపోయాడు. అతనికోసం ఎదురుచూపుల్తోనే జీవితం ముగిసిపోయింది సీతమ్మకి. విజయవాడలో హోటలు వ్యాపారంలో చేయితిరిగిన కోనయ్యకి తండ్రిని చూడాలనిపించి తవిశపూడి కి ప్రయాణం పెట్టుకున్నాడు, అది కూడా ఆ ఊరి వాడు,  తన నేస్తం ముదారు సాహెబ్ తో కలిసి. ప్రయాణం నిండా కథలు.. ఆ ఊళ్ళో అడుగుపెట్టింది మొదలు కథలే కథలు.

తవిశపూడిలో ప్రతి గడపకే కోనయ్య ఆత్మీయుడిగానే కనిపిస్తాడు. అప్పటివరకూ కడుపులో దాచుకున్న కథల్ని అతని చెవినేసి బరువు దింపుకుంటూ ఉంటారు. అలా చెప్పని వాళ్ళ కథలు చెప్పేందుకు ముదారు ఉండనే ఉన్నాడు. ఏ కథకి ఆ కథే ప్రత్యేకం కానీ, ఊరి మొగలో వెలిసిన అమ్మవారు, వెంకట్రామయ్య ఉంచుకున్న సుబ్బాముల కథలు కొంచం ప్రత్యేకం. సీతారామయ్య గారబ్బాయి శ్రీరాములు కథనుంచే 'సీతారామయ్యగారి మనవరాలు' సినిమాకి మూలమైన 'నవ్వినా కన్నీళ్లే' నవల పుట్టిందేమో అన్న సందేహం కూడా కలిగింది. ఈ కథలన్నీ కంచికి చేరి ఇహనో ఇప్పుడో కోనయ్య తండ్రిని కలుస్తాడనుకుంటూ ఉండగా కథయిపోయింది పొమ్మంటారు రచయిత.

అన్నట్టు, ఈ కోనయ్య కథా, అడివి బాపిరాజు గారి 'కోనంగి' నవలానాయకుడు కోనంగేశ్వర రావు కథా దాదాపు ఒక్కలాంటివే. ఇద్దరూ బందరు ప్రాంతవాసులే కూడా. ఇక, 'క్షేత్రయ్య' కి వచ్చేసరికి కథానాయకుడు వరదయ్య బాల్యం గడిచి, యవ్వనంలో ఉండగా మరదలు బాలా రుక్మిణితో సరసం ఆరంభించగానే 'అసంపూర్ణం' అని కనిపించి ప్రాణం ఉసూరు మంటుంది. ఆద్యంతాలు లేకపోతేనేమీ, ఆద్యంతమూ ఆసక్తి సడలకుండా చదివించే నవలలివి. మల్లాదివారి కథలతో పోల్చినప్పుడు సులువుగానే కొరుకుడు పడతాయి కూడా. (పేజీలు 226, వెల రూ. 190, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శుక్రవారం, మార్చి 03, 2017

నాయికలు-రత్నావళి

బతికి చెడిన జమీందారీ కుటుంబంలో పుట్టింది రత్నావళి. ఆ కుటుంబం అంతా విద్యావంతులే. ఆమెకూడా కొద్దిగా చదువుకుంది. డబ్బు కష్టాలకి తోడు, చిన్నప్పుడే తండ్రి చనిపోవడం మరో కష్టం ఆమెకి. బంధువులు ఆమె పెళ్లి బాధ్యతని తీసుకుని, నలభై ఐదేళ్ల సీతారామయ్యకి రెండో భార్యగా పదిహేనేళ్ల రత్నావళిని ప్రతిష్టాపురం పంపి, చేతులు దులుపుకున్నారు. సీతారామయ్య భార్య రత్నమ్మ కూతుర్ని, కొడుకుని కని, కూతురి పెళ్ళిచూసి, అనారోగ్యంతో కన్నుమూసింది. తల్లి మాణిక్యమ్మ, వితంతువై పుట్టింటికి తిరిగొచ్చిన చెల్లెలు సరస్వతి, పట్నంలో చదువుకుంటున్న తమ్ముడు రంగారావు బాధ్యతలు సీతారామయ్యవే. ఆ ఇంట అడుగుపెట్టిన రత్నావళి 'చెలియలికట్ట' ని దాటే పరిస్థితులని వివరంగా కళ్ళకి కట్టారు విశ్వనాథ సత్యనారాయణ.

అన్నగారి కష్టంతో బీఏ పూర్తి చేసి, ఎమ్మే ఎల్లెల్బీ చదువుతున్న రంగారావు అభ్యుదయవాది. వివాహం కారణంగా స్త్రీ స్వేచ్చకి భంగం కలుగుతోందని అతని నమ్మకం. రత్నావళికి సీతారామయ్య ఏమాత్రమూ సరిజోడు కాదని తీర్మానించుకున్న రంగారావు, ఆమెలో తిరుగుబాటు ధోరణిని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుని అభ్యుదయ సాహిత్యం చదివిస్తాడు. పట్నం నుంచి రంగారావు పుస్తకాలు పంపడం, వాటిని రత్నావళి చదువుతూ ఉండడం పట్ల ఆ ఇంట్లో ఎవరూ అభ్యంతర పెట్టరు. సీతారామయ్య వ్యవసాయమూ, కరణీకమూ నిర్వహిస్తూ నిత్యమూ ఎదురయ్యే ఆర్ధిక సమస్యల ఒడిదుడుకుల్లో తలమునకలయ్యే మనిషి.

మాణిక్యమ్మకి రత్నావళి మీద వల్లమాలిన ప్రేమ. కోడలిని కాలు కింద పెట్టనివ్వదు. సరస్వతివి స్వతంత్ర భావాలు. కుటుంబవ్యవస్థని గురించి బలమైన అభిప్రాయాలు ఉన్న స్త్రీ ఆమె. వదినెగారు ఇంటి పనుల్లో భాగం పంచుకోకపోవడం ఎంతమాత్రమూ సహించదు సరస్వతి. రంగారావుతో పుస్తకాల దగ్గర మొదలైన స్నేహం, రత్నావళికి అతనితో పక్క పంచుకోవడం వరకూ వెళ్తుంది. పెద్ద చదువులు చదువుతున్న రంగారావు ఆ సంబంధాన్ని 'స్త్రీ జనోద్ధరణ' గా భావిస్తాడు. పదిహేనేళ్ల రత్నావళి కొత్త రుచిని ఆస్వాదిస్తుంది. ఈ సంబంధాన్ని భరించలేని సీతారామయ్య, తమ్ముడికి ఆస్తిలో భాగం రాసిచ్చి, రత్నావళితో బంధాన్ని తెంపేసుకుని, వాళ్ళిద్దరినీ ఇంటినుంచి బయటికి పంపేస్తాడు.

పెళ్లినాడు సీతారామయ్య బహుమతిగా ఇచ్చిన బంగారు నగలను ఒంటి నిండా ధరించి, రంగారావుతో కలిసి చెన్నపట్నం ప్రయాణమవుతుంది రత్నావళి. తన స్నేహితులంతా అభ్యుదయ భావాలు కలవారనీ, ఆదర్శాలు పాటించే యువకులనీ, వారిలో తనకి నచ్చిన ఒక యువకుడిని రత్నావళి వివాహం చేసుకోవచ్చనీ ప్రతిపాదిస్తాడు రంగారావు. తాను రంగారావుని ప్రేమించినప్పటికీ, అతనికి తనపై ప్రేమలేదని తెలిశాక, అతని ప్రతిపాదనని అంగీకరిస్తుంది రత్నావళి. చేతిలో ఉన్న డబ్బు కరిగిపోతున్న కొద్దీ, అటు పట్నవాసం మీద మోజుతో పాటు ఇటు ఒకరిపై ఒకరికి ఆవరకూ ఉన్న మోజు కూడా కరిగిపోవడం ఆరంభిస్తుంది రత్నావళీ రంగారావులకి. అతడు చెప్పినట్టుగానే, రంగారావు స్నేహితులు ఆ ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. కొందరామెని వాంఛిస్తారు కూడా.. అయితే ఎవరూ వివాహ ప్రతిపాదన చేయరు.

రంగారావు మినహా మరెవరితోనూ శారీరక సంబంధాన్ని ఏర్పరుచుకోదు రత్నావళి. కాలం గడిచేకొద్దీ ఆమె ఆలోచనల్లో మార్పు వస్తుంది. గత వైవాహిక జీవితాన్ని, ప్రస్తుత జీవితాన్నీ పోల్చి చూసుకోవడం ఆరంభిస్తుంది. రంగారావు ఆమె మీద అధికారం చెలాయించినప్పుడల్లా గత, ప్రస్తుత జీవితాలని పోల్చుకుని తర్కించుకుంటూ ఉంటుంది. తన దృష్టిని వివాహం నుంచి, విద్య మీదకి మరల్చుకుని రంగారావు, అతని స్నేహితుల సాయంతో చదువుకుని, అధ్యాపక వృత్తి ఆరంభిస్తుంది. అప్పటికే, చదువు కొనసాగించే మార్గం లేని రంగారావు పత్రికా సంపాదకుడిగా ఉద్యోగంలో చేరతాడు. రత్నావళిని వాఛించి ఆమె తిరస్కారానికి గురైన రంగారావు స్నేహితులు వాళ్ళిద్దరి గురించీ దుష్ప్రచారం ఆరంభిస్తారు.

ఈ దశలో తనని పెళ్లిచేసుకోమని రత్నావళిని కోరతాడు రంగారావు. తానామెని ప్రేమిస్తున్నానని చెబుతాడు. అయితే, ఆ ప్రతిపాదనని తిరస్కరిస్తుంది రత్నావళి. రంగారావు పక్షవాతంతో మంచాన పడడంతో తన భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తుందామెకి. అతనికి బాగయ్యాక, 'తర్వాత ఏమిటి?' అన్న ప్రశ్న ఉదయిస్తుంది. కొంతకాలం సన్యాస జీవితం గడుపుతుంది. సరస్వతి కొడుకు నీలాంబరుడు చదువుకోసం పట్నం రావడం, ఇంటికి రాకపోకలు సాగించడం, అతనిలో సీతారామయ్య పోలికలు ప్రస్ఫుటంగా కనిపించడంతో తప్పు చేశానన్న భావన మరీ మరీ పెరిగిపోతుంది రత్నావళిలో. జీవితం మీద అనురాగాన్ని పూర్తిగా కోల్పోయిన రత్నావళి తన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఏం చేసిందన్నదే 1935 లో తొలిసారి ముద్రితమైన 'చెలియలికట్ట' ముగింపు.

పదిహేనేళ్ల గృహిణిగా పాఠకులకి పరిచయమై, తర్వాతి పదిహేనేళ్ల జీవితం అనేక మలుపులు తిరిగినప్పుడు ఎదుర్కొన్న సంఘర్షణ, తీసుకున్న నిర్ణయాలు.. ఇవన్నీ రత్నావళి పాత్ర మీద ఓ ప్రత్యేకమైన అభిప్రాయాన్ని ఏర్పరుస్తాయి. మొదట వయసుకన్నా తక్కువగా ఆలోచిస్తోందనిపించిన రత్నావళి, ఉన్నట్టుండి వయసుకి మించిన పరిణతిని ప్రదర్శించడం ఆరంభిస్తుంది. ఆమె నిదానం, నేర్పు, జీవితం పట్ల ఉన్న స్పష్టత, చక్కదిద్దుకునేందుకు చేసే ఆలోచనలు, ప్రయత్నాలు.. ఇవన్నీ రత్నావళిని ఓ ప్రత్యేకమైన పాత్రగా నిలుపుతాయి.

గురువారం, మార్చి 02, 2017

జ్ఞానదంతం

"మీకు జ్ఞానదంతం పెరిగింది సర్.. తీసేయాలి," డెంటిస్ట్ మాటలు విని అప్రయత్నంగా నోరు తెరిచాను. పరిచయస్తుడు మరియు సెన్సాఫ్ హ్యూమర్ బాగా ఉన్నవాడు అవడంచేత "కంగారు పడకండి.. జ్ఞానదంతానికి, జ్ఞానానికి సంబంధం లేదు.. ఆ పేరలా వచ్చేసిందంతే.." అని నవ్వేశాడు. చెప్పొద్దూ, నవ్వే డాక్టర్లంటే నాకు భలే ఇష్టం.. మరీ ముఖ్యంగా పేషెంట్లతో నవ్వుతూ మాట్లాడే డాక్టర్లంటే మరీను. "నేనిప్పుడు ఫ్రీనే.. మీకు ఒకే అయితే మొదలుపెట్టేద్దాం.." ఇదేదో బానే ఉంది.. ఆలస్యం అమృతం విషం కాకుండా అనుకున్నా.. అంతలోనే బోల్డన్ని సందేహాలు.. ఇప్పుడు జ్ఞానదంతం ఏమిటి? తీయించుకోకపోతే నష్టం ఏమిటి? మరీ ముఖ్యంగా పోస్ట్-ఆప్ (ఈమాట వినగానే పగలబడి నవ్వారు డాక్టర్) కేర్ మాటేమిటి? ఇలా...

అన్నింటికీ ఓపిగ్గా జవాబులు చెప్పేసి, తన యంత్ర సామాగ్రి రెడీ చేసేసుకుంటూ, మాట్లాడాల్సిన ఫోన్లు ఏమన్నా ఉంటే మాట్లాడేయమని సూచించారు.. నేనేమో, ఎటూ నోరు తెరుస్తున్నా కాబట్టి, పనిలో పనిగా స్కేలింగ్ గా పిలవబడే యంత్ర దంత ధావనం కూడా కానిచ్చేయమని చెప్పేశా.. అల్లప్పుడెప్పుడో చదివిన ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి 'గౌతమీ గాధలు' లో మొదటిసారి కనిపించిందీ యంత్ర దంత ధావనం. చేయించుకున్న వారు సామాన్యులు కాదు, ప్రముఖ హాస్య రచయిత భమిడిపాటి కామేశ్వర రావు. కారాకిళ్ళీతో గారపట్టి ఉండే పళ్ళకి స్కేలింగ్ చేయించుకున్నాక, హనుమచ్చాస్త్రి గారితో ఆ రహస్యం విప్పుతారాయన.

"జ్ఞానదంతాలు మొత్తం నాలుగుంటాయి.. ఇవి ఏవయసులో అయినా పెరగొచ్చు.. పెరిగినప్పుడు తీసేయడం మినహా మరో మార్గం లేదు.. అవి ఉండడం వల్ల పెద్దగా ఉపయోగం కూడా లేదు.. ఒకసారి పెరిగిందంటే అలా బాధిస్తూనే ఉంటుంది" అని చెబుతూ గ్లౌజులు, మాస్కు వగయిరాలు ధరించి నా నోట్లో మళ్ళీ లైటు వేశారు. అలనాడు కృష్ణుడు-యశోద కాబట్టి భూగోళం మరియు ఇంకా బోల్డన్ని గోళాలు కనిపించాయి కానీ, ఈ డాక్టర్ కి నా నోట్లో ఏం కనిపిస్తుంది, కేవిటీస్ తప్ప? అవికూడా కొత్తవేమీ కాదు.. ఏళ్ళతబడి చూస్తున్నవే, పూడుస్తున్నవే..

పళ్ళన్నీ వరసగా చెక్ చేసి, గతంలో తను పూడ్చిన కేవిటీస్ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నందుకు బోల్డంత సంతోష పడుతూ, జ్ఞానదంతాన్ని గురించి నన్ను చీరప్ చేస్తూ, మత్తు ఇంజెక్షన్ రెడీ చెయ్యమని నర్సుకి ఆదేశించారు. ఆ ఇంజెక్షన్ ఎంత బాగుందంటే, చెంపతో మొదలు పెట్టి మొత్తం మొహం అంతా స్పర్శ లేకుండా అయిపోయింది క్షణాల్లో.. యంత్ర దంతధావనం చేస్తూ పళ్ళు మరీ పాడైపోలేదని ఓ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఏమాటకామాట, ఇంత పాజిటివ్ గా మాట్లాడే డాక్టర్లు బహు అరుదు. కాసేపటి తర్వాత పన్ను పీకుట అనే కార్యక్రమం..అది కూడా ఇట్టే అయిపోయిది. అది మొదలు, గంట సేపు నేను నోరు విప్పకూడదు.. కాబట్టి, తర్వాతి నా సంభాషణ పేపరు మీద సాగింది.

గంట తర్వాత రెండు ఐస్క్రీములు తిని తీరాలని ఆదేశించారు డాక్టర్.. "నచ్చావోయ్ దొంగా" అని వీరబొబ్బిలి దొంగాడిని మెచ్చుకున్నట్టు, మెచ్చానోయ్ డాక్టరూ అని మనసులో అనుకున్నా.. ఓ ఐదు రోజులకి మందులు.. వాటి షెడ్యూలు.. తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు ఇవన్నీ వివరంగా చెబుతూ చేతికో ఇంజెక్షన్ ఇచ్చారు.. పాలకోసం నల్లరాయి మొయ్యాలని సామెత.. అలాంటిది ఒకటికి రెండు ఐస్క్రీములు పత్యంలో భాగంగా.. అధికారికంగా.. తినే అవకాశం ఇచ్చిన డాక్టరు ఒకటేమిటి ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా భరించేయొచ్చు. బోల్డన్ని మందులు, మౌత్వాషు చేతిలో పెట్టి, ఆఖరి జాగ్రత్త చెప్పారాయన.

"ఓ ఐదు రోజులపాటు గట్టిగా మాట్లాడకూడదు మీరు.." వినగానే నవ్వొచ్చేసింది.. కాగితం తీసుకుని, రాసి చూపించా.. "పెళ్లయినవాణ్ణి" ..ఈసారి పైకి నవ్వలేదాయన.. "ఇలాంటివి మా ఆవిడ చూస్తే ప్రమాదం" తగ్గుస్వరంతో చెప్పి, కాగితం నావైపు నెట్టేశారు.. ఆవిడా డెంటిస్టే, పక్క కేబిన్లో.. లోకానికి పళ్ళ డాక్టరే అయినా, భార్యకు భర్తే కదా అన్నది, జ్ఞానదంతం తొలగింప బడ్డాక, నాకు కలిగిన తొలిజ్ఞానం...

బుధవారం, మార్చి 01, 2017

ఎందుకొచ్చిన నందులు ...?

ఆ సినిమాలు విడుదలై ఐదేళ్లు గడిచిపోయింది.. కొన్ని జనాదరణ పొందాయి, మరికొన్ని వారం తిరక్కుండా థియేటర్ల నుంచి నిష్క్రమించాయి.. అవీ ఇవీ కూడా టీవీ చానళ్లలో పదేపదే ప్రసారమై, ఇప్పుడా సినిమాలు వస్తుంటే నిరాసక్తంగా ఛానల్ మార్చేసే దశకి చేరుకున్నాయి. ఇప్పుడు ఆ సినిమాలకి పిలిచి అవార్డులు ఇస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2012, 2013 సంవత్సరాలకి 'నంది' అవార్డులు ప్రకటించారు.. త్వరలో.. అంటే సంబంధీకులు అందరికీ వీలు కుదిరినప్పుడు.. వీటిని బహుకరిస్తారు.. ఆతర్వాత మళ్ళీ కమిటీలు వేసి మరో రెండేళ్ళకి.. అటుపై 2016 వంతు వచ్చేసరికి ఎన్నాళ్ళు పడుతుందో?

ఒకప్పుడు 'నంది' అవార్డుల ప్రదానం క్రమం తప్పకుండా ఉగాది పండుగ రోజున జరిగేది. ఒకటి రెండు రోజులు ముందుగా బహుమతి విజేతల వివరాలు ప్రకటించే వాళ్ళు. ఉగాది మర్చి/ఏప్రిల్ నెలల్లో వస్తుంది కాబట్టి, మునుపటి ఆంగ్ల సంవత్సరంలో విడుదలైన సినిమాలకి దరఖాస్తులు కోరడం, స్క్రూటినీ వగయిరాలన్నీ కొత్త సంవత్సరం మొదటి రెండు మూడు నెలల్లో పూర్తి చేసేసి, తెలుగు ఉగాది నాటికి టంచన్ గా బహుమతులు ఇచ్చేసే వాళ్ళు. మర్నాడు పేపర్లో బహుమతి ప్రదానం ఫోటోలు, తర్వాత కొన్ని రోజులపాటు బహుమతి విజేతల ఇంటర్యూలు.. ఇలా సాగేది టీవీ వచ్చే వరకూ. దూరదర్శన్ వచ్చినా, ప్రత్యక్ష ప్రసారం చేసేది కాదు.. ఓ ప్రత్యేక కార్యక్రమంగా ఓ అరగంట పాటు ప్రసారం చేసేది, తర్వాతెప్పుడో.

చూస్తుండగానే ప్రయివేటు చానళ్ళు వచ్చి లైవ్  కవరేజీలు ఇవ్వడం మొదలు పెట్టాయి. అటు తర్వాత నాటకాలకి, టీవీ కార్యక్రమాలకీ కూడా నందులు విస్తరించాయి. ఈ క్రమంలో సినిమా నందుల  షెడ్యూలు  నెమ్మదిగా దెబ్బతినడం మొదలు పెట్టింది. ఉగాది పండుగకి కాక, తర్వాతెప్పుడో ఓ ప్రత్యేక వేడుక జరపడం మొదలు, ఒక్కో సంవత్సరం ఎంట్రీలు పిలవడం ఆలస్యం అవ్వడం వరకూ వచ్చింది. ఇంతలో, అనుకూలం కాని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సినిమా పెద్దలు మూకుమ్మడిగా ఉత్సవాన్ని బహిష్కరించడం ఈ పండుగలో మరోకోణం. కేవలం బహుమతి గ్రహీతలు మాత్రమే హాజరై, మిగిలిన ప్రముఖులెవరూ రాకపోవడం అప్పట్లో ప్రభుత్వ పెద్దలకి కోప కారణం అయిందన్న వార్తలూ వచ్చాయి.


ఈ ఆలస్యాలు వగయిరా కేవలం సినిమా నందులకే పరిమితం కాలేదు.. నాటక, టీవీ నందులకీ విస్తరించాయి. సినిమా, టీవీ నందుల కన్నా నంది నాటకాలకి కష్టం ఎక్కువ. ఎంట్రీలు పిలవడం, జడ్జీల బృందం ఆయా ఊళ్లు తిరిగి నాటకాలు చూసి, ప్రదర్శనకి ఎంపిక చేయడం, వారం పదిరోజుల పాటు ప్రదర్శనలు.. అటుపై బహుమతుల ప్రదానం. నంది బహుమతుల ఎంపిక వెనుక రాజకీయాలని గురించి సినిమా వాళ్ళు దాదాపు గుంభనంగానే ఉంటారు కానీ, నాటక సమాజాల వాళ్ళు ఎప్పటికప్పుడు కుండ బద్దలు కొట్టేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే, ఎక్కువమంది ప్రేక్షకులకి ఆమోదయోగ్యమైన ప్రదర్శనలకు నందులివ్వడం ఒక్క నాటకాల విషయంలోనే జరుగుతోంది, ఇప్పటికీ. 

ఇక, టీవీ నందులు ఏ ప్రాతిపదికన ఇస్తారన్నది ఎవ్వరికీ అర్ధం కానీ విషయం. ఛానల్ కి ఇన్ని అని ఓ అప్రకటిత కోటా ఉంటుందన్న రూమర్ ఒకటి బాగా తిరుగుతూ ఉంటుంది, ఆ నందులోత్సవం జరిగినప్పుడల్లా. అన్ని నందులకీ మూలమైన సినిమా నందులు ఐదేళ్ల క్రితం ఆగిపోయాయి. ప్రత్యేక తెలంగాణా, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలు ఉధృతంగా జరిగిన ఆ రోజుల్లో నందుల గొడవ పట్టలేదెవరికీ. తర్వాత, రాష్ట్ర విభజన, ఎన్నికలు, రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు, ఆస్తుల పంపిణీ.. ఈ గొడవల్లో నంది నాటకాలు జరుగుతూనే ఉన్నప్పటికీ, సినిమా నందులని మాత్రం పక్కన పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం, నందులకి బదులు వారి రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే అవార్డులు ప్రదానం చేస్తామని ప్రకటించగానే, సినిమా నందుల సంగతి చూడడం మొదలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

నాటకాల నందులు కళాకారులకి జీవనభృతి ఇస్తున్నాయి.. సినిమాలు, టీవీలతో పోల్చినప్పుడు నాటక ప్రదర్శనలు.. మరీ ముఖ్యంగా పోటీల్లో ప్రదర్శించే నాటకాలు.. ఇప్పటికీ కొన్ని విలువలకి కట్టుబడి ఉన్నాయి. కాబట్టి, నంది నాటకోత్సవాలు జరగాల్సిందే. కానీ, టీవీ, సినిమా రంగాలకి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నంది బహుమతులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటో ఏమాత్రం అర్ధం కావడం లేదు. ఆయా నటీనటులకు కొత్తగా వచ్చే పేరేదీ ఉండదు.. ప్రభుత్వానికి ఖర్చు మినహా, బహుమతి సొమ్ము విజేతలకు పెద్ద మొత్తమేమీ కాదు. బహుమతుల కారణంగా సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో విలువలు, నాణ్యత పెరుగుతున్నాయా అంటే జవాబు నేతి బీరకాయలో నేతి చందమే.

నిజమే, సినిమాలంటే కేవలం భారీ బడ్జెట్ వి మాత్రమే కాదు.. కానీ, చిన్న సినిమాలకి థియేటర్లు దొరకనట్టే, బహుమతులూ పెద్దగా దొరకవన్నది బహిరంగ రహస్యం. టిక్కెట్ రేట్ల ప్రత్యేక పెంపు, వినోదం పన్ను రాయితీ లాంటి అనేక రూపాల్లో అయినవారి సినిమాలకి ప్రభుత్వం సహాయాలు ఎటూ చేస్తూనే ఉంది. జనం మర్చిపోయిన సినిమాలకి, ఎప్పటికీ అవ్వని సీరియళ్ళకి బహుమతుల పండుగ చేసి పెద్ద ఎత్తున డబ్బు వృధా చేయడం ఇప్పుడు అవసరమా?