మంగళవారం, సెప్టెంబర్ 30, 2014

చట్టం పని చేసింది!

'చట్టం తన పని చేసుకుపోతుంది' ..మన రాజకీయ నాయకులందరికీ బాగా ఇష్టమైన మాట ఇది. మరీ  ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళకి. వాళ్ళ పాలనలో లొసుగుల్ని ప్రశ్నిస్తూ ఎవరన్నా కోర్టుకి వెళ్ళగానే, ముఖ్యమంత్రులూ, మంత్రులూ టీవీ కెమెరాల వైపు చిరునవ్వుతో చూస్తూ చెప్పే మాట ఇది. చట్టం ఏం చేస్తుందన్నది సామాన్య జనం కన్నా వాళ్లకి బాగా తెలుసన్న భరోసా కనిపించేది ఆ నవ్వులో. ఇకపై, వాళ్ళు అంత భరోసాతోనూ ఆ మాట చెప్పగలరా?

జె. జయలలిత.. ఈ పేరు చెప్పగానే ఎన్నో దృశ్యాలు ఒక్కసారిగా కళ్ళముందు మెదులుతాయి. వెండితెర మీద పొట్టి దుస్తులతో ఆడిపాడిన కథా నాయిక మొదలు, ఎంతటి వారినైనా తన చూపుడు వేలితో శాసించే అధినాయిక వరకూ ఎన్ని పాత్రలో. 'జె అంటే జయరాం కాదు జగమొండి, జగడం' అని చమత్కరించే వాళ్ళు ఉన్నారు. అవును, సినిమా  షూటింగ్ ఫ్లోర్ మొదలు, శాసన సభా వేదిక వరకూ ఆమె జగడమాడని స్థలం లేదు. తన మాటకి ఎదురు చెప్పిన వాళ్ళని ఆమె ఏనాడూ క్షమించలేదు. అవమానించిన వాళ్ళమీద అచ్చం సినిమా ఫక్కీలోనే ప్రతీకారం తీర్చుకోకా పోలేదు.

'ఇదీ నాకథ' పేరుతో సినీ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి రాసుకున్న ఆత్మకథ (లిమిటెడ్ ఎడిషన్) లో 'శ్రీకృష్ణ విజయం' సినిమా నిర్మాణ సమయంలో జయలలితతో పడ్డ ఇబ్బందులు ఏకరువు పెట్టారు. రాజకీయాల్లోకి వస్తూనే, మొదట రాజకీయ గురువు ఎమ్జీ రామచంద్రన్ తో తగాదా. అయన మరణానంతరం రాజకీయ వారసత్వం కోసం రామచంద్రన్ భార్య జానకితో గొడవలు. అటుపై పార్టీ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ లెక్కలేనన్ని వివాదాలు. ప్రతిపక్ష నాయిక హోదాలో, ముఖ్యమంత్రి కరుణానిధితో శాసనసభలో తలపడినప్పుడు తనకి జరిగిన అవమానం, "ముఖ్యమంత్రి హోదాలో తప్ప అసెంబ్లీ లో అడుగుపెట్టను" అన్న ప్రతిజ్ఞ చేయించింది జయలలిత చేత.

నిజానికి ముఖ్యమంత్రి హోదాలో జయలలిత చాలా మంచిపనులే చేశారు. బాలికల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోవడం అన్న సత్యాన్ని పసిగట్టి, చర్యలకి ఉపక్రమించిన మొదటి ముఖ్యమంత్రి ఆమె. మహిళల భద్రత ఆమెకి కేవలం ఉపన్యాసానికి పనికొచ్చే పడికట్టు పదం కాదు. ప్రత్యేకంగా మహిళల కోసమమే పోలీస్ స్టేషన్ల మొదలు, మహిళా పోలీసుల కోసం ప్రత్యేక  శిక్షణ కేంద్రాల వరకూ జయలలిత ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎన్నో. నిన్న మొన్నటి 'అమ్మ' కేంటీన్ల విజయం, అంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి  కూడా స్పూర్తినిచ్చింది.


అయితే మాత్రం? జయలలిత అనగానే రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్న పెంపుడు కొడుకు పెళ్లి వేడుక, 'నడిచే నగల దుకాణం' అనే ముద్దుపేరున్న ప్రియసఖి శశికళ, వందలకొద్దీ పాదరక్షలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే నగలూ... ఇవే మొదటగా గుర్తొస్తాయి. మొన్నటికి మొన్న, "కమల్ హాసన్ అంత భారీ బడ్జెట్ తో సినిమా తీయకుండా ఉండాల్సింది" అని నిష్కర్షగా చెప్పిన గతకాలపు సినీ నాయికే గుర్తొస్తుంది. తను చేసిన పనులేవీ దాచాలనుకోలేదు జయలలిత. అందుకే తన సంపదని దాచే ప్రయత్నం చేయలేదు. తనని తనుగా ప్రజలు అంగీకరించాలని భావించి ఉండొచ్చు బహుశా.

జయలలిత మీదున్న అవినీతి ఆరోపణలు చిన్నాచితకవి కాదు. కేసులూ కాసిని కూసినీ కాదు. ఆమె నామినేషన్ తిరస్కరించబడింది 2001 ఎన్నికల్లో. ఆమె పార్టీ ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో, అనుంగు శిష్యుడు పన్నీరు సెల్వాన్ని ముఖ్యమంత్రిగా నియమించి, తను సుప్రీం కోర్టుకి వెళ్లి మరీ అధికారంలోకి వచ్చారు. తాజాగా, పద్దెనిమిదేళ్ళ నాటి 'ఆదాయానికి మించిన ఆస్తుల' కేసులో కర్ణాటక కోర్టు తీర్పు తర్వాత పదవిని కోల్పోయిన జయలలిత, అదే పన్నీరు సెల్వాన్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు.

కన్నడ నాట పుట్టిన జయలలిత, తమిళ ప్రజల ఆదరాన్ని ఎంతగా చూరగొన్నారు అన్నదానికి గత రెండు మూడు రోజులుగా తమిళనాట జరుగుతున్న పరిణామాలే సాక్ష్యం. అభిమానాన్ని కలిగిఉండడంలోనూ, దాన్ని ప్రకటించడం లోనూ తమిళులది ప్రత్యేకమైన ధోరణి. వారి అభిమానం ఉన్నంత మాత్రాన, జయలలిత తప్పులు ఒప్పులైపోవు. తనను తాను 'పురచ్చి తలైవి' గా అభివర్ణించుకునే ఈ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రికి పోరాటం కొత్తకాదు, నిజానికి ఆమె జీవితంలో ఒక భాగం. ఇప్పుడు కూడా ఆమె నిశ్శబ్దంగా తనకు విధించిన శిక్షని అనుభవిస్తుంది అనుకోడం పొరపాటు. అలా చేయడం ఆమె స్వభావం కానేకాదు.

'చట్టం తనపని తను చేసుకుపోతుంది' అని జయలలిత చాలాసార్లే చెప్పారు. ఆలస్యంగానే అయినా, చట్టం తన పని తను చేసింది. దేశంలో కోర్టు తీర్పు కారణంగా పదవి కోల్పోయిన తొలి ముఖ్యమంత్రి జయలలిత. చట్టాన్ని గురించి ఇదే మాటని మన రాజకీయ నాయకులు చాలామందే చెబుతున్నారు. వాళ్ళలో చాలామంది మీద కోర్టు కేసులు పెండింగులో ఉన్నాయి. వాళ్ళందరి విషయంలోనూ కూడా చట్టం తనపని తను చేసుకుపోయే రోజు త్వరలోనే రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా, వ్యవస్థ మీద ఆ వ్యవస్థలో ఉన్న ప్రజలకి నమ్మకం, గౌరవం పెరగడానికైనా ఇలా జరగడం తక్షణావసరం.

శనివారం, సెప్టెంబర్ 27, 2014

నిక్వాణం-2

(మొదటిభాగం తరువాత...)

జనార్దన శాస్త్రి ఇంట్లో ఉండే సమయమే తక్కువ. భోజనం, నిద్ర తప్ప తక్కిన సమయం అంతా జానకిరామరాజు ఇంట్లోనే. అక్కడే సాధన, చర్చలు, అన్నీను. గిటారు, సితారు, గోటు వాద్యాలని వీణ మీదే పలికించేస్తున్నాడు. అటు శాస్త్రీయం, ఇటు లలిత సంగీతం.. వీణపై అతని వేళ్ళు పలికించని గమకం లేదు. జనార్దనం వీణతో జుగల్బందీ చేయడం హిందూస్తానీ సంగీత కళాకారులందరికీ ఓ సరదా. 

కచేరీల ఏర్పాటు అంతా జానకిరామరాజు చేతిమీదుగానే జరుగుతూ వస్తోంది అప్పటివరకూ. క్లబ్బులో పరిచయమైన కొత్త స్నేహితుల ద్వారా కచేరీల ఏర్పాటు గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు నరసింహశాస్త్రి. ఇటు మీనాక్షి కూడా "కచేరీకి ఏమాత్రం ఇస్తారండీ మీ అబ్బాయికి?" అంటూ మహిళామండలి స్నేహితులు అడిగే ప్రశ్నలకి తన దగ్గర జవాబు లేకపోవడం ఇబ్బందిగా ఉంది.

"మన కుర్రాడి కచ్చేరీ మనం కాకుండా ఇంకెవరో ఏర్పాటు చేయడం ఏవిటండీ?" అంది భర్త దగ్గర. మొదటిసారిగా, నరసింహశాస్త్రి ఓ కార్యక్రమ నిర్వాహకుల దగ్గర అడ్వాన్సు పుచ్చుకున్నాడు. పుచ్చుకుని, ఫలానీ రోజున, ఫలానీ చోట కచేరీ చేయాలని చెప్పాడు కొడుక్కి. 

తండ్రి చెప్పిన సంగతి గురువుగారి చెవిన వేశాడు జనార్దనం. జనార్దనానికి అర్ధం కాని విషయం, జానకిరామరాజుకి అర్ధమయ్యింది. వచ్చే నవ్వుని గుబురు మీసాలు కప్పేశాయి. నరసింహశాస్త్రి ద్వారా ఏర్పాటైన కచేరీ విజయవంతంగా ముగిసింది.  కొడుక్కి సంగీతం తప్ప వయసుకి తగ్గ లోకజ్ఞానం బొత్తిగా లేదని బాగా తెలుసు మీనాక్షికి. నెమ్మదిగా చెప్పడం మొదలు పెట్టింది. 

"నాన్నా.. మీ తాతగారు గొప్ప వైణికులు. ఆయన వీణ వాయిస్తుంటే నారదుడే స్వయంగా వచ్చి వింటాడేమో అనిపించేదిట. నీకంతా ఆయన పోలికే వచ్చింది అంటూ ఉంటారు మీ నాన్నగారు.." మొదట్లో ఏమీ లేకపోయినా, రాన్రానూ ఈ మాటలు పనిచేయడం మొదలయ్యాయి జనార్దనం మీద. 

ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్యూలో మొదటిసారిగా "మై గురు.. జానకిరామరాజు" అన్న ప్రస్తావన తేలేదు జనార్దనం. అలా తేలేదన్న విషయం, ఆ ఇంటర్యూ అచ్చులో చూసుకున్నప్పుడు తప్ప అర్ధం కాలేదు అతనికి. ఏమీ జరగనట్టే ఊరుకున్నాడు జానకిరామరాజు.

ఇప్పుడిప్పుడు జనార్దనానికి కచేరీ మధ్యలో వెన్ను నిమరాల్సిన అవసరం రావడం లేదు. శిష్యుడి వెన్ను ముదురుతోన్నందుకు మనస్పూర్తిగా సంతోషించాడాయన. కచేరీలలో జానకిరామరాజు స్థానం వేదిక మీద నుంచి, ముందు వరుస  ప్రేక్షకుల్లోకి మారింది నెమ్మదిగా. చిన్నకొడుకు కూడా 'బాలమేధావి' అవుతాడన్న నరసింహశాస్త్రి ఆశ అడియాసే అయ్యింది. 'జనార్దన శాస్త్రి తమ్ముడు' అనే పేరైతే ఉంది కానీ, అతని ప్రతిభ ప్రేక్షకుల అంచనాలని అందుకొక పోవడంతో అన్నగారి వాద్య బృందంలో ఒకడిగా ఉండిపోయాడు.

నిరంతరం సాధన, కచేరీలతో ఊపిరి సలపకుండా ఉన్న విఖ్యాత వైణికుడు జనార్దన శాస్త్రికి పెళ్లీడు వచ్చింది. సంబంధం స్థిరపరచాలి. నరసింహశాస్త్రికీ, మీనాక్షికీ ఊపిరి సలపడంలేదు. బంధువులు కంటికి  ఆనడం ఎప్పుడో మానేశారు. సమాన స్థాయిలో సంబంధం దొరకడం కష్టం కాబట్టి ఓ మెట్టు దిగక తప్పదనే చెబుతున్నారు అందరికీ. 

"ఆడపిల్లని తక్కువ నుంచి తెచ్చుకోమనే చెబుతోంది శాస్త్రం" అంటూ సన్నాయి నొక్కులు ఆరంభించింది మీనాక్షి.  ఇవేవీ పట్టడం లేదు పెళ్లికొడుక్కి. వీణ ఒక్కటే ప్రపంచంలో అత్యద్భుతమైన విషయం అతనికి. ఎంత సాధన చేసినా తనివి తీరదు. ఇంకా ఏవేవో కొత్తరాగాలు పలికించాలన్న తహతహ రోజు రోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గదు. తన చుట్టూ జరుగున్నవాటితో నిమిత్తం దాదాపుగా లేదతనికి.

ప్రభుత్వంలో ఉన్నతాధికారి ఒకాయన జనార్దనానికి సంబంధాలు చూస్తున్న విషయం తెలుసుకున్నాడు. ముందుగా హంగుదార్లని పంపి తన గురించి చెప్పించాడు. తర్వాత తనే స్వయంగా రంగంలో దిగి, ప్రవర చెప్పుకుని పిల్లనిస్తానన్నాడు. పెద్దగా శ్రమ పడకుండానే ఆయన ఎత్తు ఫలించింది. అధికారి గారి ఏకైక పుత్రిక గాయత్రి ఆ యింటి కోడలయ్యింది. అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్ళికి జానకిరామరాజు వచ్చాడో, లేదో తెలుసుకునే తీరిక ఎవ్వరికీ లేకపోయింది.

పెళ్ళైన మూడో రోజు ఉదయాన్నే చెదిరిన జుట్టు సరిచేసుకుంటూ "నేనేమీ వీణని కాదు తెలుసా.." గోముగా అంది గాయత్రి. సిగ్గుపడిపోయాడు జనార్దనం. పదహార్రోజుల పండుగకన్నా ముందే ప్రభుత్వం  పెద్ద పురస్కారాన్ని ప్రకటించింది జనార్దన శాస్త్రికి. 

"అమ్మాయి అడుగుపెట్టిన వేళ" అని నలుగురూ అంటూ ఉంటే విని  మూతి ముడిచింది మీనాక్షి. అత్తవారింటి పరిస్థితులు ఇట్టే ఆకళింపు చేసుకున్న గాయత్రి, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నెల్లాళ్ళపాటు జనార్దనం  కచేరీలు ఏర్పాటు చేయించి, కూడా తనూ వెళ్ళింది. నరసింహశాస్త్రి, మీనాక్షి ఎంతమాత్రం ఊహించని పరిణామం ఇది.


శాన్ ఫ్రాన్సిస్కో లో కచేరీ అవుతుండగా ఇండియా నుంచి ఫోన్, జానకిరామరాజు కాలం చేశారని. ఇంకా రెండు వారాలున్నాయి కచేరీలు. ఆ వార్త జనార్దనాన్ని చేరకుండా కట్టడి  చేసింది గాయత్రి. వాద్యకళాకారులందరినీ ఒకటికి పదిసార్లు హెచ్చరించింది. మాధవశాస్త్రిని తీసుకురాకుండా మంచిపని చేశాననుకుంది. 

జనార్దనం మితభాషి. అభిమానులం అంటూ ఎవరన్నా వచ్చినా వాళ్ళు చెప్పేది నవ్వుతూ వింటాడు, ఫోటోలు దిగుతాడు తప్ప పెదవి విప్పి పెద్దగా మాట్లాడడు. జానకిరామరాజు విషయం ప్రేక్షకుల ద్వారా జనార్దనానికి తెలిసిపోతుందేమో అన్న భయం లేకపోలేదు గాయత్రికి. అందుకే, అతన్ని క్షణమైనా  విడిచి పెట్టకుండా నీడలా తిరిగింది. అందర్లోనూ కలివిడిగా కలిసిపోతూ, ఇంగ్లీషు గలగలా మాట్లాడేస్తున్న భార్యని చూసుకుని గర్వపడ్డాడు జనార్దనం.

ఇండియాలో అడుగుపెడుతూనే గురువుగారి మరణవార్త చెవిన పడింది జనార్దనానికి. తెలిసిన క్షణం గాయత్రివైపు సూటిగా చూశాడు. ఒక్కసారి భయం కలిగిందామెకి. అయితే, పెదవి విప్పి ఏమీ మాట్లాడలేదు. అతను అడిగినప్పుడు చూద్దాం అనుకుంది. అడగలేదు జనార్దనం. 

ఇంటికి వస్తూనే తను సాధన చేసుకునే గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. వీణా నిక్వాణం నిర్విరామంగా వినిపిస్తూనే ఉంది గదిలోంచి. ఎప్పటికో బయటికి వచ్చిన జనార్దనం ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. జానకిరామరాజు శిష్యులు కొందరు జనార్దనాన్ని కలిసి, గురువు గారి  స్మారకంగా ఏదన్నా సంగీత కార్యక్రమం చేస్తే బావుంటుందన్నారు. "మీరు చెయ్యండి," అనేసి  ఊరుకున్నాడతను. ఆవేళ, సంగీత ప్రపంచంలో జనార్దనాన్ని తిట్టని నోరులేదు. 

భర్త వైఖరి చూసి ధైర్యం చిక్కింది గాయత్రికి. విదేశాల్లో కార్యక్రమాల ఏర్పాటు మీద శ్రద్ధ చూపించడం మొదలుపెట్టింది. కోడలి ధోరణి బొత్తిగా కొరుకుడు పడలేదు నరసింహశాస్త్రికి. కొడుకు చెయ్యి జారిపోతాడేమో అని భయపడుతున్న మీనాక్షికి, కోడలు వట్టి మనిషి కాదన్న కబురు అగ్నికి ఆజ్యంలా జతపడింది.

జనార్దనం తల్లిదండ్రులకీ, భార్యకీ మధ్య మొదలైన యుద్ధం 'వైణిక' పుట్టేనాటికి పతాక స్థాయికి చేరుకుంది. పసిపిల్లని చూసుకున్న సంబరంలో జరుగుతున్న గొడవల్ని మర్చిపోయాడు జనార్దనం. వీణ తర్వాత రోజులో ఎక్కువ సమయం పసిబిడ్డ తోనే గడుపుతున్నాడు. అవును, వీణ తర్వాతే వైణిక. అయితే, అటు తల్లిదండ్రులు ఇటు భార్యా కూడా అతని రోజుల్ని ప్రశాంతంగా గడవనివ్వడం లేదు. 

ఆరునెలల క్రితమే గాయత్రి స్థిరపరిచిన సింగపూర్ టూర్, ట్రావెన్కోర్ సంస్థానంలో తండ్రి ద్వారా ఏర్పాటైన కచేరీ.. రెంటిలో ఏదో ఒకటి వదులుకోక తప్పని  పరిస్థితి ఎదురయ్యింది జనార్దనానికి. చాలా గొడవల తర్వాత సింగపూర్ టూర్ని రద్దు చేసుకున్నాడు. ఏనుగెక్కినంత సంబరపడ్డారు తల్లీతండ్రీ. 

ఒక్కసారిగా భగ్గుమంది గాయత్రి. వైణికని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. బిడ్డ కోసం అతడు రాకతప్పదన్న ధీమా ఆమెది. భార్య తనని అర్ధం చేసుకుంటుంది అనుకున్నాడే తప్ప, అలా చేస్తుందని ఊహించలేదు జనార్దనం. వైణిక లేని ఇంట్లో మొదటిసారిగా తన గురించి తను ఆలోచించుకోవడం మొదలు పెట్టాడు.

చుట్టూ ఉన్నవాళ్ళలో ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? ఎవరిని దగ్గరికి రానివ్వాలి? ఎవరిని దూరం పెట్టాలి? ప్రతి ఒక్కరి మీదా అనుమానమే.. అందరినీ నమ్మేస్తే? ఎవరినీ నమ్మకపోతే?? ఇవన్నీ శేషప్రశ్నలుగా మిగిలిపోయాయి జనార్దనానికి. 

మనసుకి  దగ్గరివాళ్ళంటూ ఎవరున్నారు? ఎవరూ లేరు. తన ఈడు వాళ్ళ కన్నా తను ఎప్పుడూ పెద్దవాడే. పెద్దవాళ్ళ  ముందు ఎప్పటికీ చిన్నవాడే. చుట్టూ మహా శూన్యం.. ఏకాంతం.. పిచ్చెక్కించే ఏకాంతం.. మనశ్శాంతిని ఎక్కడ వెతుక్కోవాలో తెలియక, దొరికిన ప్రతి మార్గాన్నీ ప్రయత్నిస్తున్నాడు జనార్దనం.

రోజులు గడిచేకొద్దీ కచేరీ చేస్తుంటే వీణ తీగెలమీద యాంత్రికంగా వేళ్ళు కదులుతున్నాయే తప్ప మనసు పలకడం లేదు. ఎన్నో ఏళ్లుగా అతన్ని చూస్తున్న పక్క వాద్యగాళ్ళు గమనించారీ విషయాన్ని. ఎలా అతన్ని మామూలు చేయడం? అతనికి కచేరీలు ఉన్నన్నాళ్ళే వాళ్ళకీ వెలుగు. యాంత్రికంగా వీణ మీటడం తన వల్ల కావడం లేదు జనార్దనానికి. 

"కొన్నాళ్ళపాటు కచేరీలకి దూరంగా ఉంటే?" అన్న ఆలోచన వచ్చింది. ఆలోచించగా అదే మంచిది అనిపించింది కూడా. కానీ, తల్లిదండ్రులు ఒప్పుకోరు. అడ్వాన్సుగా బుక్ చేసుకున్న నిర్వాహకులు ఇబ్బంది పడతారు.. ఒకటి కాదు.. ఎన్నో సమస్యలు. "ఇంత చేస్తున్న నాకు మిగులుగున్నది ఏమిటి?" ఉన్నట్టుండి ప్రశ్నించుకున్నాడు.   

ఆవేళ, వీణని ముట్టుకోలేదు జనార్దనం. ఆ గదిని దాటుకుని పడకగదిలోకి వెళ్లి, ఫోటో ఆల్బమ్స్ అన్నీ చుట్టూ పెట్టుకుని కూర్చున్నాడు. తొలి కచేరీతో మొదలు పెట్టి, వరుసగా ఒక్కో సంవత్సరం ఫోటోలూ చూస్తూ నడిచి వచ్చిన దారిని నెమరువేసుకుంటూ ఉంటే ఉన్నట్టుండి గుండెల్లో సన్నగా మొదలైంది వణుకు.. వెన్ను నిమరడానికి గురువుగారు లేకనో ఏమో.. క్షణాల్లో అది పెరిగి పెద్దదయ్యింది.. ఒళ్ళంతా చెమటలు. భార్యా, బిడ్డతో తన ఫోటో.. బిడ్డ ముఖంలో బోసి నవ్వు.. కళ్ళు మసకబారుతున్నాయి.. ఒళ్ళు తిరుగుతోంది.. ఉన్నట్టుండి వాలిపోయాడు.

"అయ్యయ్యో.. ఏకాండీ వీణ తీగె తెగిపోయిందండీ.. వెంటనే బాగు చేయించాలి..." తల్లి గొంతు జనార్దన శాస్త్రికి వినిపించే వీలులేదు. 

(అయిపోయింది)

శుక్రవారం, సెప్టెంబర్ 26, 2014

నిక్వాణం-1

"... కలియుగే ...ప్రధమపాదే ...జంబూద్వీపే ...భరత వర్షే ..." కించపడుతూ పలుకుతున్నాయి నరసింహ శాస్త్రి పెదవులు. మాసిన అంగవస్త్రం, మాసికవేసిన పై వస్త్రం, చేతికి చిన్న గుడ్డ సంచీతో విశాలమైన ఆవరణ వీధివాకిట్లో నిలబడి ఉన్నాడతడు. యాయవారం చెప్పుకోడం అదే ప్రధమం. అలాంటి పరిస్థితి వస్తుందని ఏనాడూ ఊహించలేదు కనీసం. ఇంటి వాళ్ళు వచ్చేవరకూ అక్కడే నిలబడాలో, రారని నిశ్చయించుకుని వెనక్కి తిరగాలో తెలియని సందిగ్ధంలో గొంతు కాస్త పెంచి ఆవేల్టి తిథి, వారం, నక్షత్రం బిగ్గరగా చదివాడు. ఆ ఇంటి ఇల్లాలు పిడికెడు బియ్యం తెచ్చి అతని సంచిలో పోసింది నమ్రతగా.

"వాసుదేవార్పణం" గొణిగాయి అతని పెదవులు. అదిమొదలు మిట్టమధ్యాహ్నం వరకూ పాతిక గుమ్మాలు ఎక్కిదిగితే, ఐదు గుప్పిళ్ళ బియ్యం పడ్డాయి చేతి సంచీలో. కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చేసరికి కొడుకు జనార్దన శాస్త్రి గుమ్మంలో ఎదురుపడ్డాడు.

"నాన్నగాలొచ్చాలేవ్ అమ్మా.." పిల్లవాడు ఆనందంగా పెట్టిన కేక లోపలి ఇంట్లోకి వినిపించింది.

"ఏవన్నా తెచ్చారా? చేతులూపుకుంటూ వచ్చారా?" ధుమధుమలాడుతూ వచ్చిన మీనాక్షి ముఖంలో కాస్త వెలుగొచ్చింది, సంచీ చూడగానే. ఇట్టే లోపలికెళ్ళి మంచినీళ్ళ చెంబుతో తిరిగొచ్చి, "కాళ్ళు కడుక్కు రండి. ఇంత ఊళ్ళో ఆమాత్రం నాలుగ్గింజలు రాలకపోతాయా అని ఎసరు పెట్టేసుంచాను.. ఒక్క క్షణంలో వడ్డించేస్తాను," ఎంతో శాంతంగా చెప్పింది.

లెక్కకి ఐదు గదులున్నా చాలా పాతబడిపోయింది ఇల్లు. మట్టి గోడలు, సున్నం మొహం చూసి ఎన్నో ఏళ్ళయిపోయింది. వర్షాకాలం వచ్చిందంటే చెంబులు, గిన్నెలు అన్నీ నేలమీద పరిచినా ఇంకా ఏదో ఒక మూల వాన పడుతూనే ఉంటుంది. ఉద్యోగం చేసేంత చదువు, వ్యాపారం చేసేంత డబ్బూ లేని నరసింహశాస్త్రి ఎన్నో పనులు ప్రయత్నించి చివరికి యాయవారంలోకి దిగాడు. నలుగురూ చిన్నచూపు చూస్తే చూడనీగాక, కడుపునిండే దారి ముఖ్యం అని సరిపెట్టుకున్నాడు.

"ఇవాళే మొదలు కదా.. రెండ్రోజులుపోతే అందరికీ తెలుస్తుంది. కాసిన్ని బియ్యం వస్తాయి. కాస్త కుదుట పడ్డాక కుర్రాడి చదువు విషయం ఆలోచించాలి. వాడి ఈడు వాళ్ళు ఒక్కక్కరూ బర్లో చేరుతున్నారు," పిల్లాడిని జోకొడుతూ చెప్పింది మీనాక్షి. మౌనంగా ఉండిపోయాడు నరసింహశాస్త్రి.

చమురు దీపం కొండెక్కిన కాసేపటికి "ఆ గెడ్డం చేయించుకోరాదూ రేపు? ఒకటే గుచ్చుకుంటోంది," గుసగుసగా అందామె.

చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కడూ ఇంట్లో కాలక్షేపం చేయడం పెద్ద సమస్య అయిపోయింది జనార్దన శాస్త్రికి. ఎంతసేపని అమ్మ కొంగు పట్టుకుని తిరగడం? పైగా మీనాక్షి ఎప్పుడు దగ్గరికి తీస్తుందో, ఎప్పుడు చిర్రూ కొర్రూమంటుందో ఓ పట్టాన పసిగట్టడం కష్టం. తన కాలక్షేపం తను వెతుక్కునే ప్రయత్నంలో ఉన్న ఆ కుర్రాడిని వీధి గదిలో ఉన్న పాతకాలంనాటి పొడవాటి చెక్క పెట్టె ఆకర్షించింది.

అమ్మా నాన్నా నిద్రపోతున్న ఓ మధ్యాహ్నం వేళ కష్టపడి పెట్టె తెరిస్తే, ఓ పాత శిల్కు గుడ్డ మెత్తగా మెరుస్తూ కనిపించింది. ఆ మెత్తదనాన్ని చేతులకి తాకించి, ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు "ట్రుయ్" మన్న శబ్దం రావడంతో గుండె గుభేలుమంది జనార్దనానికి. నాన్నో, అమ్మో నిద్రలేస్తే ఇంకేమన్నా ఉందా? జాగ్రత్తగా పెట్టె మూసేశాడు కానీ, మనసు అక్కడే ఉండిపోయింది.

అదిమొదలు, ఆ పెట్టె మీద కుతూహలం పెరిగింది. ధైర్యం చేసి, శిల్కు గుడ్డని జాగ్రత్తగా పైకి తీస్తే, అడుగున కనిపించిన వస్తువు ఆశ్చర్యంలో ముంచెత్తింది అతన్ని. పెట్టెలో జాగ్రత్తగా అమర్చిన పొడవాటి వస్తువు పేరేమిటో తెలియదు కానీ, దానికున్న తీగల్ని ముట్టుకుంటే చాలు వింత వింత శబ్దాలు వస్తున్నాయి. ఉదయం ఇంట్లో బయల్దేరిన నాన్న తిరిగి వచ్చేది భోజనానికే. ఆయన బియ్యం తెచ్చేవరకూ అమ్మకి పెరట్లో గోడ పక్కన పక్కింటి వాళ్ళతోనే కాలక్షేపం. ఆ సమయంలో వీధి గదిలోకి వచ్చి, పెట్టి మూత తీసి, శిల్కు గుడ్డ తప్పించి, తీగెలతో ఆడుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది ఆ కుర్రాడికి.

"ఈ ఏడన్నా పిల్లాడిని చదువులో పెట్టాలి. కనీసం మీరు దగ్గర కూచోబెట్టుకుని అక్షరాలన్నా దిద్దించండి," మీనాక్షి మాటకి సమాధానం చెప్పలేదు నరసింహశాస్త్రి, ఎప్పటిలాగే.

"నాకే చదువొస్తేనా? నాలుగు ముక్కలు నేనే చెప్పుకుందును. చీట్లపేక మీదున్న శ్రద్ధ పిల్లాడి చదువుమీద లేదు కదా.." అంటున్నప్పుడు మాత్రం విస్తరి ముందు నుంచి లేచిపోయాడు, ఉత్తరాపోశన పట్టకుండానే.

జనార్దనం వేళ్లకీ, లోహపు తీగెలకీ యిట్టే స్నేహం కుదిరింది. ఏ తీగెని ఎటు మీటితే ఎలాంటి శబ్దం వస్తుందో ఎవరూ చెప్పకుండానే తెలిసిపోతోంది అతనికి. ఆ తీగెలతో ఆటలు నిరంతరాయంగా సాగిపోతున్నాయి. వేళ్ళు నొప్పి పుడుతున్నా తీగెల్ని మాత్రం వదలాలని అనిపించడం లేదతనికి. 

ఆ ఉదయం, నరసింహశాస్త్రిని యాయవారానికి పంపి, మీనాక్షి పెరట్లో కబుర్లలో మునిగి ఉన్నప్పుడు వీధిగుమ్మంలో నుంచి బిగ్గరగా పిలుపు వినిపించింది "ఎవరండీ ఇంట్లో?" అంటూ. అంత క్రితమే ఆట పూర్తి చేసిన జనార్దనం పెరట్లోకి పరిగెత్తాడు. రెండో పిలుపుకి హడావిడిగా వీధిలోకి వచ్చింది మీనాక్షి, ఆ వెనుకే జనార్దనం. వీధిలో ఎవరో బుర్రమీసాల పెద్దమనిషి. ఆజానుబాహువు. గంభీరమైన విగ్రహం. అపరిచితుణ్ణి చూడగానే ఒక్క క్షణం తత్తరపడి, కొంగు భుజం చుట్టూ కప్పుకుంది.

"వారింట్లో లేరండీ.. వచ్చేస్తారు.. కూర్చోండి.. చిన్నా.. చాప తెచ్చి వెయ్యి నాన్నా" పిల్లాడికి పురమాయించింది హడావిడిగా. అవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేడా పెద్దమనిషి. మీనాక్షిని చూస్తూనే చేతులెత్తి నమస్కరించేశాడు.

"ఎంత చక్కని నిక్వాణం తల్లీ! సరస్వతి అంశలో పుట్టినట్టున్నారు," అతనంటూ ఉంటే తెల్లబోవడం మీనాక్షి వంతయ్యింది.

"ఏకాండీ వీణ. శ్రేష్ఠమైన పనస మానుతో.. అదికూడా బొబ్బిలి వారు తయారు చేసింది అయి ఉంటుంది.. కదమ్మా?" అడిగాడు సంబరంగా.అతడేం మాట్లాడుతున్నాడో అక్షరం అర్ధం కాలేదు మీనాక్షికి. పెద్దమనిషికి ఎదురు చెప్పడం మర్యాద అనిపించడం లేదు. మంచినీళ్ళ చెంబు పిల్లాడి చేత అతనికిప్పించి గడప లోపలే నిలబడింది.

"చాలా సేపయి వింటున్నానమ్మా. అభినందించి వెడదామని పిలిచాను.. క్షమించాలి నన్ను," అంత పెద్దమనిషీ ఆడుతున్న మాటలకి అర్ధం ఏమిటో బొత్తిగా బోధ పడక తెల్లబోయి చూస్తోంది మీనాక్షి. ఆమెని రక్షించడం కోసమే అన్నట్టు యాయవారం ముగించుకుని ఇంటికి వచ్చాడు నరసింహ శాస్త్రి. వీధిలో పెద్దమనిషిని అయోమయంగా చూశాడు.

మీనాక్షి నోరు తెరిచేలోగానే ఆ పెద్దమనిషి అందుకున్నాడు "అయ్యా..మమ్మల్ని జానకిరామరాజు అంటారు. సూర్యవంశపు క్షత్రియులం. మీ పెదరాజు గారి బంధువులం. దైవానుగ్రహం వల్ల సంగీతం కొంత వంటబట్టింది. వీధినే వెడుతుంటే అమ్మగారి వీణావాదన వినిపించి ఆగిపోయాను. ఈమాటే చెప్పాలనిపించి ఉండబట్టలేక పిలిచాను. మీరూ కనిపించారు. సంతోషం.." భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు.

జరుగుతున్నది ఏమిటో బొత్తిగా తెలియని జనార్దనం "అమ్మింకా ఎంతసేపట్లో అన్నం పెడుతుందా" అని ఎదురుచూస్తున్నాడు.

నరసింహశాస్త్రి గొంతు పెగుల్చుకున్నాడు "అయ్యా, మీరు పొరబడుతున్నారు. మా ఇంట్లో వీణ ఉన్నమాట నిజవే. మా నాన్నగారు వైణికులు. ఆయన పోవడంతోనే ఆ వీణ వైభోగమూ పోయింది. నా ఇల్లాలు ఏనాడూ ఆ వీణని కనీసం తుడిచిన పాపాన పోలేదు. చెప్పకపోడవేం, ఆవిడకి సంగీతం అంటే ఏమంత ఇష్టం ఉండదు కూడాను.. మరి మీరు..." తర్వాత ఏం మాట్లాడాలో అర్ధం కాక ఊరుకున్నాడు.

ఆశ్చర్య పోవడం జానకిరామరాజు వంతయ్యింది. వీధి గది వైపు వేలెత్తి చూపుతూ "ఈ గది నుంచి వీణా నిక్వాణం నా చెవులతో నేను విన్నాను. ఇక్కడే నిలబడిపోయి మరీ విన్నాను. ఇందులో ఎంతమాత్రం పొరపాటు లేదు," స్థిరంగా చెప్పాడు. ఒక్కుదుటన వీధి గదిలోకి వెళ్ళిన నరసింహశాస్త్రికి పాత సామాన్ల మధ్యలో శుభ్రంగా తుడిచి ఉన్న వీణ పెట్టె కనిపించింది. తన తండ్రి ఆత్మ వచ్చి వీణ సాధన చేసుకుంటోందా అన్న సందేహం రాకపోలేదు.

వీధిలోకి వచ్చి, "మా ఇంట్లో ఉండేది నేను, నా భార్య, కొడుకు. ఆవిడ విషయం మనవిచేశాను కదూ తమకి. ఇక పసివాడికి వీణ అంటే ఏవిటో కూడా తెలియదు," అన్నాడు. జానకిరామరాజుకి పట్టుదల పెరిగింది. "అబ్బాయిని ఒక్కసారి పిలిపిస్తారా?" నమ్రతగా అడిగాడు. నరసింహశాస్త్రికి ఒళ్ళు మండకపోలేదు కానీ, తన తాహతుకి కోపం కూడదని గుర్తొచ్చి జనార్దనాన్ని పిలిచాడు.

"మీ పేరేవిటి బాబూ?" అంటూ పిల్లాడిని నవ్వుతూ పలకరించి, తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు జానకిరామరాజు. యధాలాపంగా అందుకున్నట్టుగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుని వేళ్ళని చూడగానే తన సందేహం నిజమేనని అర్ధమయిపోయింది. తెల్లని వేళ్ళ చివర్లు ఎర్రగా రక్తం చిమ్ముతున్నాయా అన్నట్టున్నాయి.

నరసింహశాస్త్రినీ, మీనాక్షినీ అక్కడే వదిలేసి "నాతో రండి బాబూ" అంటూ జనార్దనాన్ని వీధి గదిలోకి తీసుకెళ్ళి, వీణ పెట్టె మూతని స్వయంగా తెరిచి, తీగెల్ని మీటమన్నట్టుగా సైగ చేశాడు జానకిరామరాజు. గోలీలాడినంత ఉత్సాహంగా వీణ తీగెలమీద విహరించాయి జనార్దనం లేత వేళ్ళు. నోళ్ళు తెరుచుకుని ఉండిపోయారు నరసింహశాస్త్రీ, మీనాక్షీ.

"సాయంత్రం ఓమారు వస్తాను," జనాంతికంగా చెప్పి వెళ్ళిపోయాడు జానకిరామరాజు. పిల్లవాడికి అన్నం తినిపిస్తూ వీణ విషయం మొత్తం రాబట్టింది మీనాక్షి. అప్పటినుంచీ సాయంత్రం అవ్వడం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. బయట పడకపోయినా నరసింహశాస్త్రికీ కుతూహలంగానే ఉంది. ఏ ఆలోచనా లేని వాడు జనార్దనం ఒక్కడే.

సాయంకాలమవుతూనే, పెదరాజు గారిని వెంటబెట్టుకుని మరీ వచ్చాడు జానకిరామరాజు. "ఈ కుర్రవాడికి అపూర్వమైన స్వరజ్ఞానం ఉంది. ఇది దైవదత్తం తప్ప మరొకటి కాదు. ఈ ఊళ్ళో ఉండిపోవాల్సిన వాడు కాదు మీవాడు. బస పట్నానికి మార్చి, జనార్దనాన్ని సంగీతంలో ప్రవేశ పెడితే తిరుగులేని కళాకారుడు అవుతాడు," జానకిరామరాజు మాటల సారాంశం ఇది.

పెదరాజు గారంతటి వాడు తన గుమ్మంలోకి వచ్చినందుకే తబ్బిబ్బు పడిపోయాడు నరసింహశాస్త్రి. కానీ, ఏమాత్రం బయట పడకుండా "ఇక్కడంటే, ఊరి వారి దయవల్ల భుక్తి గడిచిపోతోంది మాకు. పట్నవాసం అంటే ఖర్చులూ అవీ..." నీళ్ళు నమిలాడు.

జవాబు సిద్ధంగానే ఉంది జానకిరామరాజు దగ్గర. నరసింహశాస్త్రికి తగిన పని చూసే వరకూ కుటుంబ పోషణ, పిల్లవాడి శిక్షణ ఖర్చులు తను ఆనందంగా భరిస్తానని భరోసా ఇచ్చాడు. వారం తిరిగేసరికల్లా ఆ కుటుంబం బస పట్నానికి మారింది, వీణతో పాటు మరికొన్ని ముఖ్యమైన సామాన్లతో సహా. ఉత్సాహంగా ఉన్న జనార్దనం నిశ్శబ్దంగా సెలవు తీసుకున్నాడు ఊరినుంచీ, దూరంగా కనిపించే గోదారి నుంచీ.


జానకిరామరాజు సమక్షంలోనే మొదటిసారిగా వీణ పూర్తి రూపాన్ని చూశాడు జనార్దనం. నున్నని కైవారం, అందంగా చెక్కిన లతలు, మెరిసే నగిషీలు, అన్నింటినీ మించి వేళ్ళతో తాకితే చాలు గలగలా పలికే పొడవాటి తీగెలు. తల్లిదండ్రులని, స్నేహితులనీ కూడా వీణ లోనే చూసుకోడానికి ఎంతో కాలం పట్టలేదు జనార్దనానికి. తనకొచ్చిన విద్యని కేవలం కొన్ని నెలల్లోనే జనార్దనం సునాయాసంగా నేర్చేసుకోవడంతో మరో గురువుని వెతకాల్సి వచ్చింది జానకిరామరాజుకి. వీణతో పాటే, చదువుచెప్పే మేష్టర్లని కూడా.

పల్లె జీవితం కన్నా పట్నవాసం హాయిగా ఉంది నరసింహశాస్త్రికీ, మీనాక్షికీ. వచ్చిన వారం రోజులకే చుట్టుపక్కలవాళ్ళతో స్నేహం కలిపేసి పట్నం పోకడల్ని ఔపోసన పట్టే పనిలో పడింది మీనాక్షి. ప్రతినెలా ఒకటో తారీఖు సాయంత్రానికల్లా ఉప్పుతో సహా నెలకి సరిపడే సమస్త సంబారాలూ జానకిరామరాజు ఇంటినుంచి వచ్చేస్తూ ఉండడంతో యాయవారమే కాదు, ఏ పనీ చేయాల్సిన అవసరం కనిపించడం లేదు నరసింహశాస్త్రికి.

ఆ కుటుంబం పట్నంలోనూ, కుర్రాడు పాఠాల్లోనూ కుదురుకున్న కొన్నాళ్ళకి జనార్దనానికి తొలి కచేరీ అవకాశం వచ్చింది. జానకిరామరాజు రప్పించాడు అనడం సబబు, నిజానికి. కచేరీ కోసం జనార్దనానికి కొత్త బట్టలు కొనడం మొదలు, వేదిక మీద ఎలా మసులుకోవాలో ఒకటికి పదిసార్లు చెప్పడం వరకూ, ఆహ్వాన పత్రికలు తయారు చేయించడం మొదలు ప్రముఖులందరినీ స్వయంగా వెళ్లి ఆహ్వానించడం వరకూ జానకిరామరాజు చేయని పనిలేదు.

కొత్తగా దొరికిన చీట్లపేక స్నేహితులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నరసింహశాస్త్రికి జరుగుతున్నవాటిలో చాలా సంగతులు తెలియవు. కచేరీ రోజున ప్రేక్షకుల గేలరీలో మొదటి వరుసలో ఓ చివరికి కూర్చున్నారు నరసింహశాస్త్రి, మీనాక్షి.

"మీరు నా వెనుకే ఉండాలి గురువుగారూ.. నన్ను వదిలేసి ఎక్కడికీ వెళ్ళకండీ" వేదికెక్కే ముందు జానకిరామరాజుకి చెప్పాడు జనార్దనం. 'తంబురా అంతయినా లేని పిల్లాడు వీణ కచేరీ ఇస్తాట్ట' అన్న మాట ఊరంతా పాకిపోవడంతో కిటకిటలాడిపోయింది ఆడిటోరియం. వీణ ముందు కూర్చునే ముందు జానకిరామరాజు పాదాలకి భక్తిగా నమస్కరించాడు జనార్దనం.

ముందు వరుసలలో సంగీత పండితులు, వెనుకంతా సామాన్య జనం. తప్పులు వెతికే పనిలో ఒకరు. తప్పొప్పులతో సంబంధం లేకుండా ఆస్వాదించే వారు మరొకరు. కచేరీ పూర్తయ్యే సమయానికి ఉభయులూ మనస్పూర్తిగా కరతాళ ధ్వనులతో అభినందించారు జనార్దన శాస్త్రిని. మర్నాడు చాలా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి ఆ వార్తని.

అటుపై, ప్రతి కచేరీలోనూ వేదికమీదే తొలిగురువు పాదాలకి భక్తిగా నమస్కరించడం అలవాటుగా చేసుకున్నాడు జనార్దనం. కచేరీ మధ్యలో జనార్దనం ఏమన్నా ఉద్వేగ పడితే, యిట్టే తెలిసిపోతుంది జానకిరామరాజుకి. ఆ క్షణంలో తన ఎడమ చేత్తో అతని వెన్ను నిమిరితే చాలు ఆ కుర్రాడు సాంత్వన పడతాడని బాగా తెలుసాయనకి. ప్రతి కచేరీలోనూ తొలివరుసలో చివరి రెండు సీట్లు మాత్రం నరసింహశాస్త్రి, మీనాక్షిలవే.

నిద్రపోయే సమయం తప్ప మిగిలిన సమయం అంతా దాదాపుగా వీణ ముందే గడుపుతున్నాడు జనార్దన శాస్త్రి. సంగీతం నేర్పే గురువులు సంబర పడిపోతున్నారు, ఆ కుర్రాడి ఉత్సాహం, గ్రహణ శక్తీ చూసి. పాఠాలు చెప్పే మేష్టర్లు మాత్రం ఏమంత ఉత్సాహంగా లేరు. జనార్దనానికి వీణ మీద ఉన్న శ్రద్ధ మిగిలిన పాఠాల మీద లేదు. ఏవి ఎలా ఉన్నా ఇంగ్లీషు మాత్రం తప్పనిసరిగా నేర్పాలన్నది జానకిరామరాజు ఆదేశం.

ఎనిమిదేళ్ళ తర్వాత నీళ్లోసుకున్న మీనాక్షి పండంటి మగ పిల్లాడిని ప్రసవించింది. కొడుక్కి మాధవ శాస్త్రి అని పేరు పెట్టుకున్నాడు నరసింహ శాస్త్రి. అతని ప్రమేయం లేకుండానే ఇల్లూ, వాకిలీ అమిరేయి.

విదేశంలో కచేరీ చేసొచ్చిన బాలమేధావి జనార్దనానికి పౌర సన్మానం ఏర్పాటు చేశారు పట్టణ ప్రముఖులు. జనార్దన శాస్త్రిని, అతని ప్రతిభని గుర్తించి, మెరుగు పెట్టి వెలుగులోకి తెచ్చిన జానకిరామరాజునీ పొగడ్తలతో ముంచెత్తారు. అంతే కాదు, వేదిక మీద జనార్దనంతో పాటు జానకిరామరాజుకీ ఘనంగా సన్మానం చేశారు. మొదటి వరుస చివరి ప్రేక్షకులిద్దరికీ ఒళ్ళు భగ్గున మండింది.

"కన్నవాళ్ళం మనం.. మనగురించి ఎవరికీ తెలీదు. సన్మానాలు మాత్రం ఆయనకీ.. అయినా మనవాడికుండాలి బుద్ధి," భార్య చెవిలో రుసరుసలాడాడాయన. "వాడికి కాస్త మంచీ చెడ్డా తెలియబరచాలి" అందామె, ఒళ్లో చంటి పిల్లాడికి పాలిస్తూ.

(కచేరీలో చిన్న విరామం)

సోమవారం, సెప్టెంబర్ 22, 2014

దక్షిణ కాశీ

ఉన్నట్టుండి మబ్బు పట్టేసింది ఆకాశం. చల్లబడిపోయింది వాతావరణం. రోడ్డుకి రెండు పక్కలా పచ్చని పంటపొలాలు. కొంచం దూరంగా కొబ్బరిచెట్లు. అప్పుడోటీ అప్పుడోటీ కారో, బస్సో కనిపిస్తున్నాయి తప్ప పెద్దగా ట్రాఫిక్ లేదు రోడ్డుమీద. 'ద్రాక్షారామం-20 కిమీ' బోర్డు కనిపించింది. అవును, శ్రీరమణ 'మిథునం' బుచ్చిలక్ష్మికి సమ్మంధం తప్పిపోయిన దాక్షారమే!

దాటి వెడుతున్న ఊరిపేరు గొర్రిపూడి. ఒకప్పుడు మాంచి రుచికరమైన జామిపళ్ళకి ప్రసిద్ధి. 'గొర్రిపూడి గావా' అంటే మదరాసు మార్కెట్లో ఎగబడి కొనేవాళ్ళు వ్యాపారులు. అయితే అదంతా చరిత్ర. ఉన్నట్టుండి ఆ ఊళ్ళో జామిచెట్లకి ఏదో తెగులు సోకడం, ఎక్కడా జామిచెట్టన్నది మచ్చుకైనా కనిపించకపోవడం వర్తమానం. రోడ్డుకి, పొలాలకి మధ్య కాయగూరల తోటలు. అప్పుడే కోసి తెచ్చిన కూరలని రోడ్డుపక్కనే అమ్ముతున్నారు రైతులు. బెండకాయలు, ఆనపకాయలు కొరుక్కు తినేయాలనిపించేలా ఉన్నాయి.

గాలి వేగం పెరిగి, సుళ్ళు తిరుగుతోంది. ఆకులు, అలమలూ గాలితోపాటు చుట్టుతిరుగుతూ ఎగురుతున్నాయి రోడ్డు మీద. వాతావరణంలో వర్షం వాసన తెలుస్తోంది. ఏ క్షణానైనా కుంభవృష్టి మొదలవ్వొచ్చు. వచ్చేసింది దాక్షారం. రోడ్డు పక్కనే పైడా వారి సత్రాన్ని ఆనుకుని విశాలమైన పార్కింగ్. నాలుగంగల్లో భీమేశ్వరాలయం తాలూకు పందిరి మొదలు. పందిట్లో అడుగు పెట్టడంతోనే ఫోన్ మోగింది. ఫోన్ ఆన్సర్ చేస్తూండగానే వర్షం మొదలయ్యింది. గొంతు మాట్లాడుతోంది. మెదడు, మనసు మాత్రం గొంతుతో కాక, కళ్ళతో చెలిమి చేస్తున్నాయి.


అతి విశాలమైన ప్రాంగణం, చుట్టూ పురాతన ప్రాకారం. ఏ పక్క చూసినా ఎత్తైన గోపురాలు. కుడిపక్క దూరంగా సప్తగోదావరం. "ఏదో పనిలో ఉన్నట్టున్నారు.. మళ్ళీ చేస్తాను.." కాల్ కట్టవ్వడం, వర్షం ఆగిపోవడం ఒక్కసారే జరిగాయి. సప్త గోదావరం వైపు అప్రయత్నంగా పడ్డాయి అడుగులు. ఆకుపచ్చగా ఉన్నాయి నీళ్ళు. వెళ్ళడానికి బాగా అరిగిపోయిన రాతిమెట్లు. ఎందరు నడిచిన దారో కదా ఇది! వ్యాసుడి మొదలు శ్రీనాథుడి వరకూ.. ఎందరెందరి కథలో ముడిపడి ఉన్న క్షేత్రం కదూ మరి.


జాగ్రత్తగా మెట్లు దిగి, కాళ్ళు తడుపుకుంటూ ఉండగా ఖాళీ షాంపూ పేకెట్ నా కాళ్ళని దాటి వెళ్ళింది. నాకే ఎందుకు కనిపిస్తాయి ఇలాంటివి? చేతులు కడుక్కుని, కాసిన్ని నీళ్ళు తలమీద జల్లుకుని పైకి వస్తే ఓ పెద్ద రావి చెట్టు. చుట్టూ అనేకానేక నాగప్రతిమలు. దగ్గరలో ధ్వజస్థంభం, పక్కనే పెద్ద నంది విగ్రహం. గుళ్ళోకి వెళ్లేముందు చుట్టూ చూడాలి అనిపించింది. ప్రదక్షిణా పథం మీద నడవడం మొదలుపెట్టాను. అనేకానేక స్థంభాలతో అన్నదాన మండపం. భోజనాల వేళ కాకపోయినా ఆడామగా ఓ ఇరవైమంది ఉన్నారు. కొందరు పెద్దగా అరుస్తున్నారు. చెవిన పడిన వాటిని బట్టి తెలిసిందేమంటే అక్కడేదో కులపంచాయితీ జరుగుతోందని.


దగ్గరలోనే ఓ గోపురం. ఊరికే ఉండక అటు వెళ్లాను. బయటికి దారి ఉంది. ఆ గోపురంలో బాటసారులు కొందరు కూర్చుని ఉన్నారు. అప్పుడే వాన వెలిసిన వాతావరణం కదూ. వాళ్ళలో ఒకతను చుట్ట వెలిగించాడు. ఘాటైన లంకపొగాకు. అతగాడు గుప్పుగుప్పున పొగ వదులుతూ ఉంటే, "కోవిల్లో చుట్ట కాల్చవచ్చునా?" అన్న వెంకటేశం అమాయకపు ప్రశ్నా, "కాలిస్తే కోవిల్లోనే కాల్చాలోయి. దీని పొగ ముందు సాంబ్రాణీ, గుగ్గిలం యేమూల?" అన్న గిరీశం సమాధానమూ గుర్తొచ్చేశాయి.


గుడిలోపలికి అడుగుపెట్టాను. గర్భాలయం చుట్టూ విశాలమైన రెండతస్తుల రాతి మండపం. ఆ మండపంలోనే ఉపాలయాలు. పదమూడు వందల ఏళ్ళనాటి నిర్మాణం! ఎంత శ్రద్ధగా మలిచారు ఒక్కో స్థంభాన్నీ!! ఈ నిర్మాణం నాకు తెలుసునా? నా కళ్ళముందే జరిగిందా?? పురాతన కట్టడం ఏదైనా చిరపరిచితంగానే అనిపించేస్తుంది అదేమిటో. నా మనసు వశం తప్పుతోందా లేక చాళుక్య ప్రభువుల ఆత్మలు అక్కడే సూక్ష్మ రూపంలో తిరుగాడు తున్నాయా? హేతువుకి అందనిదేదో జరుగుతోంది మొత్తానికి.


చల్లటి వాతావరణం, చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోనంతగా కళా కౌశలాన్ని సొంతం చేసుకున్న నిర్మాణం. కదలాలని అనిపించడం లేదు. కానీ, తప్పదు. పెద్దగా జనం లేరు ఆలయంలో. గర్భాలయం రెండు అంతస్తులు. అవును మరి, శివలింగం ఎత్తు సుమారు పద్నాలుగు అడుగులు. ముందుగా పీఠ దర్శనం చేసుకుని, పై అంతస్తుకి వెడితే, అక్కడ మళ్ళీ కళ్ళు చెదిరే చెక్కడం పనితో ఉన్న రాతిస్థంభాలు. ప్రదక్షిణ పూర్తయ్యింది. అయ్యవారు మొబైల్ ఫోన్లో మాట్లాడడం అయ్యింది అప్పుడే.


పళ్ళెంలో దక్షిణ చూసి "గోత్రనామాలు చెప్పండి" అన్నారు హుషారుగా. పాతికేళ్ళు ఉంటాయేమో. జంధ్యప్పోగు, బ్రహ్మచారని చెబుతోంది. పచ్చని మెళ్ళో బంగారు గొలుసు మెరుస్తోంది. "ధర్మపత్నీ సమేతస్య.." పేరు చెప్పమన్నట్టుగా చూశారు. ధర్మపత్ని పేరు చదవడం తప్పనిసరి చేసేసినట్టున్నారు అన్ని గుళ్ళలోనూ. పూజ పూర్తయ్యింది. "అటు నుంచి జాగ్రత్తగా దిగి వెళ్ళండి" సూచన వినిపించింది వెనుకనుంచి.

మళ్ళీ ఓసారి ఆలయం అంతా తిరిగి చూసి, అమ్మవారు మాణిక్యాంబ దగ్గర కూడా సెలవు తీసుకుని బయటికి వచ్చేసరికి తల పగిలిపోతుందా అన్నంత నొప్పి. అప్పటివరకూ కనీస సూచన కూడా లేదు, అదేమిటో. సప్తగోదావరం మీదనుంచి వీస్తున్న చల్లగాలి ఓ పక్కా, రోడ్డు మీద వాహనాల రణగొణ ధ్వని మరోపక్కా. ఫ్లాస్కులో టీ ఓచేత, కాగితం కప్పులు మరో చేతా పట్టుకు తిరుగుతూ కనిపించాడో కుర్రాడు, సంజీవిని తెస్తున్న హనుమంతుడిలా. టీని మించిన దివ్యౌషధం ఏముంది, తలనొప్పిని తగ్గించడానికి? మబ్బులు మూసుకొస్తూ ఉండగా మళ్ళీ ప్రయాణం మొదలయ్యింది.

శుక్రవారం, సెప్టెంబర్ 19, 2014

కొసరు కొమ్మచ్చి

ఇది కొమ్మచ్చుల్లో చివరిది. రమణ వెళ్ళిపోయాక తయారైన 'కొసరు కొమ్మచ్చి' విడుదలైన కొద్ది రోజులకే బాపూ కూడా వెళ్ళిపోయారు. 'రమణా-నేనూ-మా సినిమాలూ' అంటూ ఈ పుస్తకం కోసం బాపూ రాసిన వ్యాసం, బహుశా ఆయన చివరి రచనేమో కూడా. బాపూ వ్యాసంతో పాటు, రమణతో ఐదున్నర దశాబ్దాల వైవాహిక జీవితాన్ని పంచుకున్న శ్రీమతి ముళ్ళపూడి శ్రీదేవి, వాళ్ళిద్దరి పిల్లలు వర ముళ్ళపూడి, అనురాధ ముళ్ళపూడి, ఎమ్బీఎస్ ప్రసాద్, బీవీఎస్ రామారావులు రాసిన వ్యాసాల సంకలనం ఈ 'కొసరు కొమ్మచ్చి.'

పత్రికా, సినీ రచయితా, సినిమా నిర్మాత ముళ్ళపూడి వెంకటరమణ ఆత్మకథ 'కోతి కొమ్మచ్చి' ఓ సంచలనం. ఎందరికో స్పూర్తివంతం కూడా. ఆత్మకథల్లో ఎన్నదగిన ఈ పుస్తకానికి కొనసాగింపుగా వచ్చిన (ఇం)కోతి కొమ్మచ్చి లో మొదట ఉన్న ఒరవడి తగ్గినప్పటికీ పాఠకులకి తృప్తినిచ్చే రచన. ఇక, మూడోభాగం 'ముక్కోతి కొమ్మచ్చి' బాపూ-రమణల వీరభిమానులని మినహా, మిగిలిన పాఠకుల్లో చాలామందిని నిరాశ పరిచింది. రమణ రాయని విషయాలని చెప్పేందుకు మొదలైన ఈ 'కొసరు కొమ్మచ్చి' నిజానికి బాపూ-రమణల వ్యక్తిత్వాలని, వాళ్ళ మధ్యా, వాళ్ళ కుటుంబాల మధ్యా ఉన్న స్నేహాన్నీ కళ్ళకి కట్టినట్టు చూపించే రచన.

బాపూ వ్యాసం, శీర్షికలోనే చెప్పినట్టుగా వాళ్ళ సినిమాల గురించిన విశేషాల సమాహారం. తన పట్టుదల కారణంగా తీసిన 'బంగారు పిచిక' సినిమాని, కొన్ని దశాబ్దాల తర్వాత రమణ పట్టుదల కారణంగా 'పెళ్ళికొడుకు' గా మళ్ళీ తీయాల్సి వచ్చిందని చెప్పారు బాపూ. కలిసి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన సరదా సంగతులు మెరిశాయి ఈ వ్యాసంలో. 'ఏడుపొస్తున్నప్పుడు నవ్విన హీరో' అంటూ శ్రీమతి శ్రీదేవి రాసిన వ్యాసం ఒక భర్తగా, తండ్రిగా, కొడుకుగా, వీటన్నింటికీ మించి బాపూ ఆప్తుడిగా రమణ ఏమిటి అన్నది చెబుతుంది. వృత్తినీ, కుటుంబాన్నీ రమణ బ్యాలన్స్ చేసిన తీరు తెలుస్తుంది పాఠకులకి.


'నాన్నా-నేనూ' అంటూ వరా ముళ్ళపూడి, 'నాన్న మామ మేము అను తోకకొమ్మచ్చి' ముళ్ళపూడి అనూరాధ తండ్రి జ్ఞాపకాల్ని రాసుకున్నారు. మామ అంటే బాపూ. వరా బాపూ దగ్గర సహాయ దర్శకుడు కూడా. అనూరాధ వ్యాసం మళ్ళీ మళ్ళీ చదివించేదిగా ఉంది. తెలుగు సాహిత్యంలోకి ప్రవేశిస్తే ఆమె ఓ మంచి రచయిత్రి అవుతారు అనిపించింది. క్రైసిస్ మేనేజ్మెంట్ ని రమణ ఎంత సమర్ధవంతంగా నిర్వహించారో చెప్పే వ్యాసాలివి. అలాగే, పిల్లల పెంపకం మీద బాపూ రమణల శ్రద్ధ, వాళ్ళ ఇష్టాలని పిల్లల మీద ఏమాత్రం రుద్దకపోవడం, అలాగే పిల్లలకి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు వెనక నిలబడడం లాంటివి తండ్రులుగా వాళ్ళమీద గౌరవాన్ని పెంచుతాయి.

'ఒక అభిమాని ప్రస్థానం' అంటూ ఎమ్బీఎస్ ప్రసాద్ రాసిన వ్యాసంలో బాపూ-రమణల పట్ల భక్తిభావం కనిపిస్తుంది. "ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వంలో సాహిత్యం ఎంత?" అన్న ప్రశ్నకి జవాబు దొరుకుతుందీ వ్యాసంలో. ఎందుకంటే, ఆ సర్వస్వానికి సంపాదకుడు ఈ వ్యాసకర్తే. అనేకానేక మారుపేర్లతో రమణ చేసిన రచనలని సేకరించి, సంపుటాలుగా వెలువరించిన క్రమాన్ని విశదంగా రాశారు ప్రసాద్. దానితో పాటే బాపూ-రమణలతో మొదలైన పరిచయం, అనుబంధంగా మారిన క్రమాన్నీ వివరించారు. ఓ అభిమాని కళ్ళతో రమణని చూడ్డానికి ఉపకరించే వ్యాసం ఇది.

ఇక పుస్తకంలో చివరిదీ, సుదీర్ఘమైనదీ సీతారాముడు అను బీవీఎస్ రామారావు రాసిన 'ఇస్కూలు నుంచి బైస్కోపుల దాకా.. రమణతో ప్రయాణం.' నూట అరవై ఏడు పేజీల ఈ వ్యాసం ప్రత్యేకత ఏమిటంటే, కేవలం ఈ ఒక్క వ్యాసం కోసం ఈ పుస్తకం చదవొచ్చు. రమణతో చిన్ననాటి స్నేహం మొదలు, రమణ చివరి రోజులవరకూ ఓ క్రమంలో రాశారు రామారావు. రమణని గురించి చాలా నిర్మొహమాటంగా రాశారీయన. 'మూగమనసులు' మొదలుకొని, గోదారి ఒడ్డున తీసిన రమణ సినిమాలు అన్నింటి వెనుకా ఈ ఇరిగేషన్ ఇంజినీరుగారి కృషి ఉంది. అనేక కథా చర్చల్లో పాల్గొనడమే కాదు, కొన్ని సినిమాలకి కీలకమైన మలుపులు ఈ 'గోదావరి కథలు' రచయిత సూచించినవే. ('హాసం' ప్రచురణలు, పేజీలు  277, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

గురువారం, సెప్టెంబర్ 18, 2014

బీరకాయ పచ్చడి

రాస్తూ రాస్తూ ఉండగా బ్లాగు రాయడం కాస్త వచ్చినట్టుగా, చేస్తూ చేస్తూ ఉండగా వంట కూడా పర్వాలేదు అనిపిస్తోంది. వంటింట్లో ప్రవేశించే అవకాశం వచ్చినప్పుడల్లా రొటీన్ వంటలు కాకుండా కొంచం కొత్తవి (అనగా నేను ఎప్పుడూ ప్రయత్నం చేయనివి) వీలైనంత షార్ట్ కట్ లో చేసే ప్రయత్నం చేస్తూ ఉండడంతో ఫలితాలు కూడా పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చేసిన తాజా వంటకం బీరకాయ పచ్చడి. చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోయే వంటకం. పైగా అన్నంలోకీ, టిఫిన్లలోకీ కూడా పనికొచ్చేస్తుంది ఉభయతారకంగా.


బీరకాయ పచ్చడిని రెండుమూడు రకాలుగా చేసుకోవచ్చు. పధ్ధతి దాదాపుగా ఒక్కటే, చిన్న చిన్న మార్పులు మినహాయించుకుని. బీరకాయని బట్టి పచ్చడి అన్నమాట. కాయ లేతగా ఉండి, పెచ్చు కూడా పచ్చడికి పనికొస్తుందా లేక పెచ్చు తీసేసి కేవలం కాయతో మాత్రమే పచ్చడి చేసుకోవాలా అన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవలసిన విషయం. బీరకాయతోపాటు టమాటాలు మాత్రమే వేసీ, టమాటాలు, ఉల్లిపాయలు కలిపి వేసీ చేసేసుకోవచ్చు పచ్చడిని.

ముందుగా బాండీలో నూనె పోసి కొంచం వేడెక్కగానే శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేగనిచ్చి మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఈలోగానే బీరకాయలు కడుక్కుని, చేదు చూసుకుని, పెచ్చుతోనో లేకుండానో ముక్కలు కోసి పెట్టేసుకోవాలి. ఖాళీ అయిన బాండీలో బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టాలి. ముక్కల్ని బట్టి రెండో మూడో టమాటాలు తరిగి పెట్టుకుని, బీరకాయ ముక్కలు కొంచం మెత్తబడ్డాక టమాటా ముక్కలు వేసి, పసుపు జల్లి మళ్ళీ మూత పెట్టేయాలి.

కాస్సేపాగి స్టవ్ కట్టేసి, బాండీలో ముక్కల్ని బాగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ లో ఉన్న మిరపకాయలు వగయిరా ఈపాటికి చల్లారి ఉంటాయి కదా. మిక్సీ ఓ తిప్పు తిప్పేస్తే కారం సిద్ధం అయిపోతుంది. చల్లారిన ముక్కలు జార్లో వేసి, తగుమాత్రం ఉప్పు వేసి రెండు తిప్పులు తిప్పేస్తే పచ్చడి దాదాపుగా సిద్ధం అయిపోయినట్టే. దాదాపు ఏవిటీ అంటే, బాండీలో కొంచం నూనె వేసి వేడెక్కుతూ ఉండగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి బాగా వేగనిచ్చి (డీప్ ఫ్రై) పచ్చట్లోకి బదలాయించేస్తే పచ్చడి సిద్ధం!


బీరకాయ చెక్కు తీసేస్తే పచ్చడి ఎర్రగా, గరిటెజారుగా వస్తుంది. దోశల్లోకి బహుచక్కని కాంబినేషన్. అదే చెక్కుతో అయితే కొంచం ముదురు రంగులో గట్టిగా వస్తుంది.అన్నంలోకి కూడా బాగుంటుంది. చెక్కు ఉంచాలనుకున్నా బీరకాయ మీదుండే పొడవు చారల్ని పీలర్తో తీసేయాలి. ఉల్లిపాయ చేర్చాలి అనుకుంటే, బీరకాయ-టమాటా ముక్కలు వేగాక, అప్పుడు బాండీలో కొంచం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించి మిక్సీలో బీర-టమాటా మిశ్రమం రెండో తిప్పు తిప్పేప్పుడు చేర్చుకుంటే సరిపోతుంది. ఉల్లి వేసి చేసిన పచ్చడి టిఫిన్ కన్నా వేడన్నంలోనే ఎక్కువ బాగుంటుంది. ఇవీ బీరకాయ పచ్చడి మేడీజీ కబుర్లు!!

మంగళవారం, సెప్టెంబర్ 16, 2014

గౌతమీ గాథలు

గతకాలపు రచయితలలో మనకిష్టులైన వాళ్ళని కళ్ళారా చూసి, మనసారా మాట్లాడగలిగే అవకాశం ఏమాత్రమూ లేదు. ఆ అవకాశమే ఉంటే అదో అద్భుతం కదూ! వారితో ఆత్మీయంగా మసలిన చేయితిరిగిన రచయిత తన గాథల్లో వారందరి కథలూ చెబుతూ ఉంటే ఎన్ని పేజీలైనా ఇట్టే వినేయగలం.. మళ్ళీ మళ్ళీ చదివేయగలం. అదిగో, అలాంటి కథల సమాహారమే 'గౌతమీ గాథలు,' రచయిత ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. ఇప్పటి నవతరానికి శాస్త్రిగారిని పరిచయం చేయాలంటే, సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తాతగారు అని చెప్పాలి. కొంచం వెనుకవారికి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తండ్రిగారు అని చెబితే చాలు. శ్రీకాంత శర్మ తెలిసినవారందరికీ, హనుమచ్ఛాస్త్రి తప్పక తెలిసే ఉంటారు.

విశాఖ జిల్లా మాడుగులలో 1911 లో జన్మించిన హనుమచ్ఛాస్త్రి, తమ ఊళ్ళో తన పదకొండో ఏట జరిగిన విదేశీ వస్త్ర దహనంలో పాల్గొని, తన ఒంటిమీద ఉన్న చొక్కాని అగ్నికి ఆహుతిచేసి, అటుపై తండ్రిగారి ఆగ్రహానికి గురైన వైనంతో మొదలయ్యే ఈ పుస్తకంలో మొత్తం ముప్ఫై తొమ్మిది గాథలున్నాయి. తన బాల్యంలో కొంతభాగాన్ని విద్యాభ్యాసం నిమిత్తం కోనసీమలోనూ, యవ్వనాన్ని ఉద్యోగ నిమిత్తం రాజమండ్రి, రామచంద్రాపురం లోనూ గడిపిన శాస్త్రిగారు ఆనాటి తన అనుభవాలని 'గౌతమీ గాథలు' పేరిట అక్షరబద్ధం చేశారు. సుతిమెత్తని హాస్యం, లలిత శృంగారం మేళవించిన ఈ గాథల్లో చదివించే గుణం పుష్కలం.

వెనుకటి తరం తెలుగు సాహితీ మహామహులు చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, భమిడిపాటి కామేశ్వర రావు, పిలకా గణపతి శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, అడవి బాపిరాజు, పాలగుమ్మి పద్మరాజు... వీళ్ళందరూ హనుమచ్ఛాస్త్రి గారి స్నేహవర్గం. ఓ చేత్తో తెలుగు సాహితీ వ్యాసంగాన్నీ, మరోచేత్తో ఆయుర్వేద వైద్యాన్నీ నిరుపమానంగా నిర్వహించిన శ్రీపాద వారిని స్మరిస్తూ "తగిన సమయం చూసి వెడితే ప్రాణం పెట్టేవారు. పనిలో ఉంటే ఇంగితం కనిపెట్టి వెళ్లకపోవడం మంచిది. లేకపోతే ఆయన ముఖం ముడుచుకున్న మందారపువ్వులా ఉండేది ఎర్ర ఎర్రగా, నిర్వికారంగా" అంటారు.

ఇక, నాటి సాహితీలోకం యావత్తూ 'బాపిబావ' అని ముద్దుగా పిలుచుకున్న అడవి బాపిరాజు గురించి "బాపిరాజు అందరికీ బావ, అయితే నాకు అన్న. మేమిద్దరం ఒక ఊరి వారి అల్లుళ్ళం," అని చమత్కరించారు. కారా కిళ్ళీతో రంగుమారిన పళ్ళకి, భమిడిపాటి వారు 'యంత్ర దంతధావనం' చేయించుకున్న సరదా వైనంతో పాటు, విమర్శకి ఎలా స్పందించాలో ఆయన పిలకా వారికి ఇచ్చిన సీరియస్ సలహానీ పొందుపరిచారీ గాథల్లో. మార్గాలు వేరైనా, వాటి ప్రభావాన్ని స్నేహం మీద ఏమాత్రం పడనివ్వని కవులూ, రచయితలూ చాలా పేజీలలోనే కనిపిస్తారు.


"కోటిపల్లి కోట ఇంద్రగంటి వారికి కాణాచి. తెలంగాణా మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు తాలూకా ఇంద్రగల్లు నుంచి బతుకుతెరువు వెతుక్కుంటూ కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు గోదావరి తీరానికి వచ్చి అక్కడక్కడ స్థిరపడ్డాయి. అందులో ఈ ఇంద్రగంటి వారొకరు. ఆ ఊరిపేరే వీరి ఇంటి పేరయింది," అంటూ తమ కుటుంబ వృత్తాంతం చెబుతూనే, "విస్సన్న చెప్పిందే వేదం. ఆ విస్సన్నే ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రి గారు. కోటిపల్లి నివాసి.  మహాపండితుడు, గొప్ప ధర్మ శాస్త్రవేత్త. ధర్మ సందేహానికి ఆయన చెప్పిందే వేదం. అదే సామెత అయిపోయింది," అంటూ ఆయన కబుర్లూ చెప్పారు. ఈ విస్సన్న ప్రస్తావన 'కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర' లోనూ కనిపిస్తుంది.

కోనసీమ విద్యాభ్యాసం కబుర్లలో గురుపత్ని ఔదార్యం, గురుపుత్రుడు ప్రాణభిక్ష పెట్టిన సందర్భంతో పాటు, ఆలోచనల్లో పడేసే దక్షిణాది శాస్త్రులు, పొరుగూరి విద్యార్ధులకి ఇంట భోజనం పెట్టే సంప్రదాయం లేని కాట్రేనికోన కాపురస్తులూ కనిపిస్తారు పాఠకులకి. "నిజమైన ఆవకాయ సౌభాగ్యం - గోదావరి జిల్లాలో అందులోనూ - కోనసీమలో చూడాలి. అందరికీ చిన్నా పెద్దా మామిడి తోటలుంటాయి. ప్రతి తోటలోను ఆవకాయ చెట్టని ఒకటి విధిగా ఉంటుంది. వంశ పారంపర్యంగా తాత, ఆయన తాత ఎంచి దాని యోగ్యత నిర్ణయించి చప్పరించి మరీ వేసిన చెట్టది!" లాంటి ముచ్చట్లు కేవలం ఒకసారి మాత్రమే చదివేసి ఊరుకోగలమా?

వంద ఎకరాల సుక్షేత్రమైన భూమిని జాతీయ పాఠశాల కోసం దానమిచ్చిన రామచంద్రపురం వాసి కృత్తివెంటి పేర్రాజు పంతులు దాతృత్వం మొదలు, సాహిత్య సభలకి 'దారులు కాసి డప్పులు బజాయించినా' పాతికమంది అయినా రాని ఆ ఊళ్ళో జనాన్ని రప్పించడం కోసం సాహిత్యాభిమాని డాక్టర్ తోలేటి కనకరాజు గారి 'జనాకర్షక' ప్రయత్నాల వరకూ, "అంతవరకూ గురజాడకి వర్ధంతులు గాని, జయంతులుగాని విజయనగరంలో తలపెట్టిన వారు లేరు. ఆ గౌరవం గౌతమీ తీరానికి దక్కింది ," వంటి చారిత్రక సత్యాల మొదలు, "రెండు గంటలపాటు సభ్యులని ఆనందంలో ఆలోచనలో ముంచెత్తే వక్తలకి వేదిక దిగాక సోడా అడిగే దిక్కేనా ఉండదు," వంటి నిష్టుర సత్యాల వరకూ.. ఎన్నో ఎన్నెన్నో.

'విశ్వేశ్వరుడి రేవు,' 'లంకలో లేడిపిల్ల,' 'జీవిత సత్యాలు' లాంటివి కబుర్లలాగా కాక, కథల్లా అనిపిస్తాయి. ఆ రోజుల్లో స్కూళ్ళు, స్కూలు మేష్టారు ఉద్యోగంలో సాధకబాధకాలు, ఇనస్పెక్షన్లు తత్ సందర్భంగా జరిగే 'ప్రతిభా ప్రదర్శనలు,' వెన్నెల రాత్రులు గోదావరిలో బోటు షికార్లు, రామచంద్రాపురం కాలవలో టీ బోటులో సాహిత్య చర్చలు... ఏ కొన్ని కబుర్లనో ప్రస్తావించి వదిలేయడం ఎంత కష్టం!! ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడే వారంతా మళ్ళీ మళ్ళీ చదువుకునే పుస్తకం ఈ 'గౌతమీ గాథలు.' చదివిన ప్రతిసారీ "మరికాసిన్ని గాథలు రాస్తే ఈయన సొమ్మేం పోయిందో" అనిపించడం ఈ పుస్తకం ప్రత్యేకత! ('తెలుగు ప్రింట్' ప్రచురణ, పేజీలు 157, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

గురువారం, సెప్టెంబర్ 11, 2014

శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్

అనగనగా ఓ రాజేశ్వరి. ఉత్తి రాజేశ్వరి కాదు, శ్రీ రాజరాజేశ్వరి. తల్లిలేని పిల్లవ్వడంతో నానమ్మ వెంకాయమ్మ పెంపకంలో పెరిగి, ఆ చాదస్తం కాస్త వంటపట్టించుకుందన్నది ఆమె  తండ్రి శేషాద్రి ఫిర్యాదు. శేషాద్రికి - సగటు తండ్రుల్లాగే - కూతురంటే తగని ముద్దు. పైగా, ఆ పిల్ల చిన్నప్పుడు మొదలుపెట్టిన చిన్న కాఫీ హోటలు పెరిగి పెద్దదై 'శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్' గా అవతరించింది మదరాసు మహానగరంలో. పెళ్ళీడుకి వచ్చిన రాజేశ్వరికి తగిన వరుణ్ణి చూసి ముడిపెట్టేసి బాధ్యత తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు శేషాద్రి. 

అనగనగా ఓ మత్తయ్యగా పిలవబడే మేథ్యూ. బీయే పాసయ్యాడు. చాలామంది బీయేల్లాగా ఉద్యోగం వెతుక్కుంటూ మదరాసు చేరుకున్నాడు. కాలేజీ రోజుల్లో తనంతటి వాడు మరొకడు లేడని విర్రవీగిన మత్తయ్యకి లోకం పోకడ తెలిసి రాడానికి ఆట్టే రోజులు పట్టలేదు. తన బీయే పక్కన పెట్టేసి, స్నేహితుడు నరసింహ శాస్త్రి మేనేజర్ ఉద్యోగం చేస్తున్న హోటల్లో సర్వర్ గా పనికి కుదిరాడు. ఆ హోటల్ మరేదో కాదు 'శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్!'

రాజేశ్వరి వేషం వేసినమ్మాయి జయప్రద కనుక, మత్తయ్యగా వేసినవాడు కృష్ణ కనుకా (అప్పటికింకా సూపర్ స్టార్ అవ్వలేదు) వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యి, సినిమాకి శుభం పడుతుందని ఊహించడం కష్టమేమీ కాదు కానీ, హోటల్ సర్వర్ - పైగా బోలెడన్ని ఆదర్శాలూ అవీ ఉన్నవాడు - యజమాని కూతుర్ని పెళ్ళాడిన వైనం తెలుసుకోవాలంటే, అక్కడక్కడా కాస్త సాగతీత అనిపించినా మొత్తమ్మీద సరదాగా సాగిపోయే 'శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్' సినిమా చూడాల్సిందే.

ముప్ఫయ్యేనిమిదేళ్ళ క్రితం విజయా సంస్థ నిర్మించిన ఈ సినిమా టైటిల్స్ లో దర్శకుడిగా చక్రపాణి పేరూ, సహకార దర్శకుడిగా బాపూ పేరూ ఉంటాయి కానీ ఏ కొన్ని ఫ్రేములు మాత్రమే చూసిన వాళ్ళకైనా సులువుగా అర్ధమైపోతుంది ఇది బాపూ సినిమా అని. అనేక సినిమాలకి కథ, మాటలు, పాటలు అందించినా అతికొద్ది సినిమాలకి మాత్రమే తన పేరు ప్రకటించుకోగలిగిన 'తెరచాటు రచయిత' పాలగుమ్మి పద్మరాజుకి టైటిల్ కార్డ్ ఉన్న సినిమా ఇది. సంగీతం సమకూర్చిన పెండ్యాల నాగేశ్వర రావు పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఈ సినిమాలోవి కనీసం మూడు పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి మరి.


కథలోకి వచ్చేస్తే, క్రిష్టియన్ అని తెలిస్తే బ్రాహ్మణ హోటల్లో ఉద్యోగం దొరకదు కాబట్టి నరశింహ శాస్త్రి (పద్మనాభం)  సలహా మేరకి ముత్తయ్యగా పేరు మార్చుకుని హోటల్లో చేరి, తన బీయే జ్ఞానం సర్వర్ పనికి సరిపోక శేషాద్రి ఆగ్రహానికి గురయ్యి ఉద్యోగం పోగొట్టేసుకుంటాడు మత్తయ్య. మళ్ళీ శాస్త్రి సలహానే పాటించి, రాజేశ్వరిని మంచి చేసుకుని ఆమె సిఫార్సు సంపాదించడం కోసం శేషాద్రి ఇంటికి బయల్దేరతాడు. అదీ ఎప్పుడూ, రాజేశ్వరి తనకి  రాబోయే వాడిని గురించి కలలుకంటూ 'రాకోయీ అనుకోని అతిథీ' అని రాగయుక్తంగా పాడుకుంటున్నప్పుడు. రాజేశ్వరి కన్నా ముందు వెంకాయమ్మ (జి. వరలక్ష్మి) కి నచ్చేస్తాడు ముత్తయ్య దీక్షితులు.

జయప్రదంతటి కూతురు గోముగా 'నా..న్నా' అని బతిమాలినా ముత్తయ్యని మళ్ళీ హోటల్లో పనికి పెట్టుకోనని కుండ బద్దలు కొట్టేస్తాడు శేషాద్రి ('కళా వాచస్పతి' కొంగర జగ్గయ్య). కావాలంటే అతని దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోమని సలహా ఇస్తాడు కూతురికి. ముత్తయ్యకి ఉద్యోగం దొరికితే అంతే చాలని ఇంగ్లీష్ పాఠానికి ఒప్పేసుకుంటుంది రాజేశ్వరి. చూడముచ్చటైన ఎక్స్ ప్రెషన్లతో కృష్ణ, జయప్రదకి 'సీఏటీ కేట్ పిల్లి.. డీఓజీ డాగ్ కుక్క' అంటూ ఇంగ్లీష్ పాఠం చెప్పడాన్ని సినిమాలో చూడాలే తప్ప, మాటల్లో చెప్పడం కష్టం.

వెంకాయమ్మకి నచ్చేశాడుగా ముత్తయ్య దీక్షితులు.. అవకాశం దొరకబుచ్చుకుని మరీ 'ఏరా అబ్బీ.. నియోగులా? ఆరువేలా? గోత్రం ఏవిటీ?' అంటూ పాపం మత్తయ్యకి ఏమాత్రం అర్ధం కాని ప్రశ్నలతో వేధించేస్తూ ఉంటుంది. ఏవో  తిప్పలు పడుతూ ఉంటాడు - ఇంటిదగ్గర వృద్ధులైన తల్లిదండ్రులు,  పెళ్లికెదిగిన చెల్లెలు వగయిరా బాధ్యతలని జ్ఞాపకం చేసుకుంటూ. పగటిపూట రాజేశ్వరికి పాఠాలు చెబుతూ రాత్రుళ్ళు ఆమె వినేలా 'నా పేరు బికారి.. నా దారి ఎడారి' అని పాడుకుంటూ కాలం గడుపుతున్న ముత్తయ్యకి ఇంటినుంచి ఉత్తరం వస్తుంది, చెల్లెలి పెళ్లి కుదిరిందంటూ.

చెల్లెలికి కాబోయే మావగారైన 'సుగుణమ్మ మొగుడు' (అల్లు రామలింగయ్య) కుండమార్పిడి చేయాల్సిందే అంటాడు. ఆ ప్రకారం, అతని కూతురు రోసీ (రమాప్రభ) ని మత్తయ్యకిచ్చి పెళ్లిచెయ్యాలి. ఈ సంగత్తెలియని రాజేశ్వరి ముత్తయ్యని ప్రేమించేసి 'ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంటా' అని పాడేసుకుంటుంది (మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం, ఈ ఒక్ఖ పాటకీ!). మత్తయ్య రహస్యం రాజేశ్వరికి తెలిసిందా?  నిప్పులు కడిగే వెంకాయమ్మ, శేషాద్రి ఏమన్నారు? శేషాద్రి తనలోనే దాచుకున్న రహస్యం ఏమిటి? ఇత్యాది ప్రశ్నలకి జవాబులిస్తూ ముగుస్తుంది సినిమా.

ఈ సినిమాకి తెరవెనుక బాపూ, తెరమీద జయప్రద.. అంతే. చక్రపాణి సెట్ లో లేనప్పుడు (బాత్రూం కి వెళ్ళినప్పుడు) తనో షాట్ తీస్తే, తిరిగివచ్చి 'ఏం? నేనొచ్చేదాకా ఆగలేవా?' అన్నారని రాసుకున్నారు బాపూ, 'కొసరు కొమ్మచ్చి' లో.  ముందే చెప్పినట్టు, బాపూ మార్క్ ప్రతి సీన్లోనూ కనిపిస్తూనే ఉంటుంది. ఇక, పద్నాలుగేళ్ళ జయప్రదకి కెరీర్ మొదట్లో దొరికిన మంచి సినిమాల్లో ఇదొకటి. అమాయకమైన అమ్మాయి రాజేశ్వరిగా జయప్రద ఎలా ఉంటుందంటే - అన్ మేరీడ్ కుర్రాళ్ళూ, బేచిలర్లూ కూడా ఈ సినిమా చూడకపోవడం మంచిదని ఓ ఉచిత సలహా. జయప్రద తర్వాత చెప్పుకోవాల్సింది వరలక్ష్మి గురించి. అలవోకగా నటించేసింది. మిగిలిన వాళ్ళ గురించి ప్రత్యేకం చెప్పాల్సింది ఏముంది. సెలవు రోజున సరదాగా చూడచ్చీ సినిమాని.

శుక్రవారం, సెప్టెంబర్ 05, 2014

విజయవాడ

కొత్తగా అవతరించిన పాత రాష్ట్రానికి రాజధాని ఖరారయ్యింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే చాలా మంది ఊహించిన నగరమే రాజధాని అయ్యింది. విజయవాడలో సంబరాలు, రాయలసీమలో నిరసనలూ మొదలైపోయాయి. తొట్టతొలి ఆంధ్ర పాలకులని కొందరు చరిత్రకారులు భావించే శాతవాహనుల రాజధాని ప్రాంతం, కొన్ని శతాబ్దాల తర్వాత రాజధానిగా రూపు దిద్దుకుంటోంది మళ్ళీ. అసలు ఏముంది విజయవాడలో?

కొత్త రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది. కృష్ణా నది ఉంది. కనకదుర్గమ్మ ఉంది. రైల్వే జంక్షన్ ఉంది. విమానాశ్రయం ఉంది. వీటన్నినినీ మించి 'విజయవాడ' అనే బ్రాండ్ నేముంది. అవును, విజయవాడ అనగానే చదువులు గుర్తొస్తాయి. సినిమాలు గుర్తొస్తాయి. రాజకీయాలు గుర్తొస్తాయి. రాజకీయాలని నీడలా వెన్నంటి ఉండే రౌడీయిజమూ, కొట్లాటలూ ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. ఇంకా, కారల్ మార్క్స్ రోడ్డూ, అక్కడి పుస్తకాల షాపులూ, ప్రచురణ కర్తలూ గుర్తొచ్చే వీలుంది.

సహజ వనరులన్నీ పుష్కలంగా ఉన్నా, ఎంతోమంది ప్రముఖ పారిశ్రామిక వేత్తలకి పుట్టినిల్లైనా అదేమిటో విజయవాడలో పారిశ్రామికాభివృద్ధి పెద్దగా జరగలేదు. జలవనరుల మొదలు రవాణా సౌకర్యాల వరకూ అన్నీ ఉన్నాయి. మరి లేనిదేమిటి? సమాధానం ఒక్కటే, భూవసతి. భూములున్నాయి, కానీ వాటి ధరలు ఎప్పుడూ ఆకాశంలోనే ఉన్నాయి. పరిశ్రమకి అయ్యే ఖర్చు కన్నా భూమి కొనడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.


రాజధాని నిర్మాణానికి మొదటి సవాలు భూసేకరణే. ప్రయివేటు పారిశ్రామికవేత్తలే కొనలేని భూమిని ప్రభుత్వం కొనగలదా అన్నది మొదటి ప్రశ్న. రాజు తలచుకుంటే భూమికి కొదవ లేని మాట నిజమే కానీ, రైతుల పీకమీద కత్తిపెట్టి రాజధాని నిర్మాణం మొదలు పెట్టడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్న సిద్ధంగా ఉంటుంది. ఏ రకంగా చూసినా, ప్రభుత్వం ఎక్కువ మొత్తాన్ని భూముల కొనుగోలు మీదే వెచ్చించాల్సి వస్తుందన్నది వాస్తవం.

చాలా నగరాల్లాగే విజయవాడ కూడా 'ప్లాన్డ్ సిటీ' కాదు. చాలా రోడ్లకి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. ఇప్పటికే ముఖ్య కూడళ్ళ దగ్గర ట్రాఫిక్ జాములు నిత్యదృశ్యం. ఇక రాజధాని తరలింపు మొదలయ్యాక ఈ సమస్య మరింతగా పెరుగుతుందే తప్ప తగ్గదు. ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయాలు వెతకడం అవసరం. ఒకప్పటితో పోల్చినప్పుడు శాంతిభద్రతలు బాగా మెరుగయ్యాయనే చెప్పాలి. మొదటినుంచీ కూడా విజయవాడలో ఏ నేరం జరిగినా అది పెద్ద సంచలనం అవుతోంది. ఇప్పుడిక పోలీసుల మీద ఒత్తిడి మరింతగా పెరుగుతుంది.

మల్టి ప్లెక్స్ లు, మాల్స్ తో ఇప్పటికే మెట్రో కళ సంతరించుకోవడం మొదలుపెట్టిన విజయవాడ, రాజధాని ప్రకటనతో మరింత వేగంగా పెరుగుతుంది. చుట్టుపక్కల పల్లెలు వచ్చి నగరంలో చేరిపోతాయి. రియల్ ఎస్టేట్ బుడగ ఇప్పటికే పెద్దదవ్వడం ఆరంభించింది. కనీసం ఓ తరంపాటు రాజధాని అనగానే హైదరాబాద్ గుర్తురావడం అత్యంత సహజం. హైదరాబాద్ తో పోలికా అప్రయత్నంగా జరిగేదే. అయితే, విజయవాడకి ఉన్న పరిమితుల దృష్ట్యా 'హైదరాబాద్' అంచనాలని అందుకోడం సాధ్యం కాదు. చిన్న రాష్ట్రానికి చిన్న రాజధాని అవుతుంది విజయవాడ.

(ఫోటో కర్టెసీ: The Hindu)

మంగళవారం, సెప్టెంబర్ 02, 2014

రాలూ-రప్పలూ

"మా ఇంటి పేరు బండి వారో బండారు వారోనట. మా పూర్వులు ఆ రోజులలో మిలిటరీ లో సిపాయిలుగా ఉండేవారు. మూడు నాలుగు తరాలుగా ఆ వంశంలో ఒక్క కొడుకుకు మించి సంతానముండేది కాదుట. మా నాన్నగారి తాతగారు లక్ష్మయ్య. మిలిటరీ నుంచి తిరిగి వచ్చో లేక మిలిటరీకి పోకుండానో తాపీ పనిలో ప్రవేశించారట. దానిట్లో చక్కగా పనిపాట్లు చేసుకుంటూ కొంత పేరు సంపాదించారట. తాపీ లక్ష్మయ్య అన్న వాడుక ఊరిలో కలిగింది. చదువులో వేసినప్పుడు మా నాన్నగారి పేరు తాపీ లక్ష్మయ్య మనుమడు కాబట్టి, తాపీ అప్పన్న అని వ్రాశారు. అది మొదలు మేము తాపీ వారమయ్యాము."

ఆంద్ర దేశంలో ఒక్కో ఇంటి పేరు వెనుకా ఒక్కో కథ ఉంటుంది. తొలితరం సినీ రచయితగానే కాక, 'పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు' 'దేవాలయాలమీద బూతు బొమ్మలెందుకు?' లాంటి విలక్షణ పుస్తకాల ద్వారా నేటితరం పాఠకులకీ సుపరిచితులైన తాపీ ధర్మారావు నాయుడు గారి ఇంటిపేరు వెనుక కథ ఇది. ఒక్క ఇంటి పేరు మాత్రమే కాదు, ఈ 'తాతాజీ' జీవితం నిండా  ఎన్నెన్ని విశేషాలో. వాటన్నింటినీ అక్షరబద్ధం చేస్తూ, తన ఆత్మకథ 'రాలూ-రప్పలూ' రాయడం ఆరంభించిన ధర్మారావు, కేవలం కొద్ది భాగాన్ని మాత్రమే పూర్తి చేయగలిగారు.

బరంపురంలో 1887, సెప్టెంబర్ 19న జన్మించిన ధర్మారావు విద్యాభ్యాసం శ్రీకాకుళం, విజయనగరం, మద్రాసులలో విద్యాభ్యాసం చేశారు. తండ్రిగారు వృత్తిరీత్యా వైద్యులు. అయితేనేం, ఆ కుటుంబలో ఒక్కరు కూడా 'బీయే' లు లేరు. ఎలా అయినా బీయే పూర్తి చేయాలన్నది తాపీ వారి చిన్ననాటి ఆశయం. చిన్నప్పుడు ఆటపాటల మీద ఎక్కువగానూ, చదువు మీద తక్కువగానూ శ్రద్ధ పెట్టిన ధర్మారావు, తన తల్లిదండ్రుల మధ్య జరిగిన సంభాషణ ఒకటి అనుకోకుండా చెవినబడడంతో చదువులో తనని తను నిరూపించుకోవాలన్న దీక్ష బూనారు. అలాగని, ఆటపాటలని ఏమాత్రం దూరం పెట్టలేదు.


అన్నగారు, స్నేహితులతో కలిసి ఇంటిని థియేటర్ గా మార్చేసి నాటకాలు ఆడారు, టిక్కెట్టు పెట్టి మరీ. ఆ నాటకాలకి రచన మొదలు రంగాలంకరణ వరకూ ప్రతిచోటా తన ముద్ర ఉండాల్సిందే. కొన్నాళ్ళ పాటు సర్కస్, గార్డెనింగ్. మరికొన్నాళ్ళ పాటు రాత్రీ పగలూ లెక్కలతో ఆటలు. ముక్కుసూటిదనం, నలుగురిలో తను ప్రత్యేకంగా కనిపించాలనే కాంక్ష తాపీ వారి బాల్యంలో బాగా కనిపిస్తాయి. అవే లక్షణాలు తర్వాతి జీవితమంతా కొనసాగాయి. నలుగురూ అవునన్న దాన్ని కాదనడం కూడా చిన్ననాటి అలవాటే అని సరదాగా చెప్పారు తన ఆత్మకథలో.

ఓపక్క హైస్కూలు చదువు అవుతూ ఉండగానే పదిహేనేళ్ళ వయసులో అన్నపూర్ణతో బాల్య వివాహం. అది కూడా, అస్సలు అనుకోకుండా కుదిరిన సంబంధం. పెళ్లవుతూనే ఎఫ్యే చదువు కోసం పర్లాఖిమిడి ప్రయాణం. అక్కడ అధ్యాపకులు మరెవరో కాదు, గిడుగు రామమూర్తి పంతులు. విద్యార్ధి నాయకత్వం ధర్మారావుదే. అనుకోకుండా జరిగిన ఓ చిన్న సంఘటన వల్ల మొదటిరోజునే తరగతిలో తన పట్ల గిడుగు వారికి కలిగిన వ్యతిరేక భావం, దాన్ని పోగొట్టుకోడానికి తను కృషి చేసిన వైనం ఎంత ఉత్సాహంతో చెప్పారో ఈ పుస్తకంలో. ఎఫ్యే తర్వాత కొంతకాలం ఉద్యోగం, అటుపై మద్రాసులో బీయే చదువుతో ఆగిపోయింది ఆత్మకథ.

పుస్తకం పూర్తి చేయగానే కలిగే భావం ఒక్కటే. మొత్తం ఆత్మకథ రాసి ఉంటే ఓ గొప్ప గ్రంధం అయి ఉండేది అని. ఇప్పుడు కూడా, గొప్పదనానికి లోపం లేదు. కాకపొతే, 'టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్' ని మాత్రమే చూసిన భావన. తాపీ వారి మూర్తి, వ్యక్తిత్వం అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. తన విషయాలు రాసేప్పుడూ, తనవాళ్ళ సంగతులు రాసేప్పుడూ కూడా ఎక్కడా మొహమాటం కనిపించదు. కానీ, చిన్నతనంలో ఆయన చాలా మొహమాటి అట! ఈ మొహమాటం వల్లే, విజయనగరంలోనే ఉంటున్నా గురజాడ అప్పారావుని కలిసి మాట్లాడలేదట ఎప్పుడూ. కేవలం 97 పేజీలు మాత్రమే ఉన్న 'రాలూ-రప్పలూ' మళ్ళీ మళ్ళీ చదివించే పుస్తకం. (విశాలాంధ్ర ప్రచురణ, వెల రూ. 35)